శ్రీ సాయిసచ్చరిత్రము /ఏడవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఏడవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ఏడవ అధ్యాయము అద్బుతావతరము; సాయిబాబా వైఖరి; వారి యోగభ్యాసము; వారి సర్వాంతర్యామిత్వము; కుష్ఠుభక్తుని సేవ; ఖాపర్డే కుమారుని ప్లేగు; పండరిపురము పోవుట అద్బుతావరము

సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడను కొన్నచో హిందూమతాచారసంపన్నుడుగ గాన్పించుచుండెను. అయన హిందువా లేక మహమ్మదీయుడా యన్న విషయము ఇదమిద్దముగ యెవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవము జరుపుచుండెను. అదేకాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు ఆనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీపోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచినవారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమినాడు గోపాల్‌కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్‌ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహఱ్ఱం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. నాలుగు దినములవరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకువలె వారి చెవులు కుట్టబడియుండెను. వారు హిందువులన్నచో, నున్‌తీని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును?మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహొత్రమునేల వెలిగించి యుండువారు? అదియేగాక, తిరుగలితో విసరుట శంఖమూదుట, గంటవాయించుట, హొమము చేయుట, భజన, అన్నసంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయమతమునకు అంగీకారముకాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయుచుండెడివారు? వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇదియొకవింతకాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు. వారికి దేనితో సంబంధముగాని, భేదభావముగాని యుండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించుకుండెను. ఫకీరులతో కలసి బాబా మత్స్యమాంసములు భూజించుచుండెను. వారి భోజనపళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు.

శ్రీసాయి యవతారము విశిష్టమైనది యద్భుతమైనది. నా పూర్వసుకృతముచే వారి పాదములచెంత కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్దానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి అత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో కలసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ, వారి నాలుకపై ’ అల్లామాల్లిక్’ యను మాట యెప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాదవివాదములు గాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికి, వారెల్లప్పుడు శాంతముగాను, సంయమముతోను యుండెడివారు. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంతతత్త్వమును బోధించుచుండువారు. అఖరివరకు బాబా యెవరో ఎవరికి తెలియనేలేదు. వారు ప్రభువులను భిక్షకులను నొకె రీతిగా అదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు. బాబా అ రహస్యములను వెలిబుచ్చగనే యందరు అశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ, వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడని యే చెప్పవలెను. వారిని జూచిన వారందరు వారు శిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలనెట్లూ వర్ణించగలను?

సాయిబాబా వైఖరి

శిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ-శంకర, గ్రామదేవత మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటికి రూ.50/-,20/-,15/- ల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడివారు.

బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు అరోగ్యవంతు లగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడ రోగవిముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు శిరిడీకి తండోపతండములుగ రాసాగిరి. బాబా ఎల్లప్పుడు ధునికెదురుగా ధ్యానమగ్నులయి కూర్చొనెడివారు. ఒకొక్కప్పుడు మలమూత్రవిసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానముచేసేవారు; మరొక్కప్పుడు స్నానము లేకుండానే యుండేవారు.

తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషదము లిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగ పని చేయుచుండెడివి. వారు గొప్ప ’హకీం’ (వైద్యుడు) యని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యెఱ్ఱబడెను. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతరభక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగ అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు వైద్యులు పయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడిగింజలను నూరి రెండు మాత్రలుగ జేసి, యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము అ కట్లను విప్పి నీళ్ళను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిననూ సున్నితమైన్ కండ్లు మండనేలేదు. ఆటువంటీ చిత్రములనేకములు గలవు కాని, యందు యిదొకటి మాత్రమే చెప్పడినది.

బాబా యోగాభ్యాసములు

సాయిబాబాకు సకలయోగప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధయోగప్రక్రియలందు బాబా అరితేరినవారు. అందులో రెండు మాత్రమే యిక్కడ వర్ణింపబడినవి.

1. ధౌతి

మసీదుకు చాల దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడురోజులకుకొకసారి బాబా యచ్చటకు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. అ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడల గ్రక్కి, వాటిని నీటితో శుభ్రపరిచి, ప్రక్కనున్న నేరేడు చెట్టుపై అరవేయుట శిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2అడుగుల పొడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు, కాని బాబా చేసిన ధౌతి చాల విశిష్టము, అసాధారణమైనది.

2. ఖండయోగము

బాబా తన శరీరావయవములన్నియు వేరుచేసి మసీదునందు వేర్వెరు స్థలములలో విడిచి పెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసినవానికి అ విషయము గూర్చి కొంచెమైన తెలిసి యుండునని తననే అనుమానించెదరని భయపడి యూరకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా, బాబా యెప్పటివలే హయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూచిన దంతము భ్రాంతియనుకొనెను.

చిరుప్రాయమునుండి బాబా వివిధ యోగప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి యెవ్వరికి అంతుబట్టనిది. రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్ధలు వారి యనుగ్రహమువల్ల స్వస్థత పొందిరి. నిస్వార్ధముగ వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్పకీర్తి వచ్చెను. బాబా తమ సొంతముకొరకు ఏమియు చేయక, యితరల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసికొని అ బాధను తామనుభవించేవారు. అటువంటి సంఘటననొకదానిని యీ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్రహృదయము విదితమగును.

బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము

1910 సంవత్సరము (ఘనత్రయోదశి నాడు, యనగా) దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపయిన తరువాత హఠాత్తుగ కట్టెలకు మారు తనచేతిని ధునిలొ పెట్టి, నిశ్చలముగా యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాదవరావు దేశపాండేయు దీనిని జూచి, వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాదవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను "దేవా! ఇట్లేల చేసితిర"ని బాబా నడిగిరి. (మరేదోలోకములో యుందినట్లుండిన) బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, "ఇక్కడకు చాలదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని, కొలిమినూదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి అమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి అ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకారము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నా కానందము గలుగుచేయుచున్న" దని జవాబిచ్చెను.

కుష్ఠురోగభక్తుని సేవ

బాబా చెయ్యి కాలెనను సంగతి మాదవరావు దేశపాండే ద్వారా తెలిసికొనిన నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయినుండి డాక్టరు పరమానంద్ యని ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్యసామాగ్రితో సహ హుటాహూటిన శిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా యందుల కొప్పకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీశిందే యను కుష్ఠురోగి యేదో అకువేసి కట్టు కట్టెడివాడు. నానా యెంతవేడినను బాబా డాక్టరుకారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడ అనేకసారులు వేడుకొనిరి. "అల్లాయే తన వైద్యుడనీ",’తమకేమాత్రము బాధలేదని’ చెప్పుచూ, యెటులో డాక్టరుచే చికిత్సచేయించుకొనుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తెరువకుండగనే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కాని అతనికి యీ మిషతో బాబా దర్శనభాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టు చుండెను. కొన్నిదినముల తరువాత గాయము మాని పోయెను. అందరు సంతోషించిరి. అప్పుటికిని యింకా ఏమైననొప్పి మిగిలియుండినదాయను సంగతి యెవరికి తెలియదు. ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. మహసిద్దపురుషుడయిన బాబాకిదంతయు నిజానికి అవసరములేనప్పటికీ, తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనము గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజీ తన సేవాకార్యము మొదలిడువాడు. భాగోజీ గతజన్మయందు చేసిన పాపఫలితముగా యీజన్మమున కుష్ఠురోగముచే భాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలె గాన్పించు నప్పటికి, అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి, ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు; బాబా సహవాసమును పూర్తిగా ననుభవించినవాడు.

ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి

బాబా విచిత్రలీలలలో నింకొకదానిని వర్ణించెను. అమరావతి నివాసి యగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి శిరిడీలో కొన్నిదినములుండెను. ఒకనాడు ఖాపర్డే కుమారునికి త్రీవ జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. శిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గద్గదకంఠముతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో దయతో మృదువుగ నిట్లెనెను: " ప్రస్తుతము అకాశము మబ్బుపట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి, అకాశము నిర్మలమగును." అట్లనుచు బాబా కఫ్నీని పై కెత్తి, చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణముగల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచూ, "నా భక్తులకొరకు నే నెట్ల బాధపడెదనో చూడము! వారి కష్టములన్నియు నావే!" ఈ మహద్భుతలీలను జూచిన జనులకు, మహత్ములు తమ భక్తుల బాధలు తామే యెట్లస్వీకరింతురో యను విషయము సృష్టమయ్యెను. మహత్ముల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు అశించక ప్రేమించెదరు. భక్తులను తమ స్వజనులుగ భావించెదరు.

బాబా పండరి ప్రయాణము!

సాయిబాబా తన భక్తులునెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా అతనికిగల భక్తి యను ఫలమానాటికి పండెను. పండరీపురమును భులోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. శిరిడీలో యెవ్వరికి ఉత్తరము వ్రాయక, హుటహూటన పండరికి ప్రయాణమయ్యెను. ముందుగా శిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి, అ తరువాత పండరికి పోవలెననుకొనెను. నానాసాహెబు శిరిడీకి వచ్చు సంగతి యెవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్‌గాం చేరుసరికి శిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పశిందే, కాశీరాములతో మాట్లడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్లనియెను: "మన నలుగురుము కలసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు. కనుక అనందముగా పాడెదము లెండు!" అందరు కలిసి పాడదొడంగిరి. అ పాట యెక్క భావమేమన, "నేను పండరి పోవలెను. నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా, అదియే నా ప్రభువు యొక్క ధామము."

అట్ల బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబు కుటుంబసమేతముగ వచ్చి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి, తనకు పండరీపురము బదలీయైనదనీ, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి యక్కడుండవలసినదనీ వేడుకొనెను. అటుల బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును అశీర్వాదమును అనుజ్ఞను పొంది, నానాసాహెబు సండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు! శ్రీ సాయినాథాయ నమః ఏడవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు

మొదటిరోజు పారాయణము సమాప్తము