శ్రీ సాయిసచ్చరిత్రము /తోమ్మిదవ అధ్యాయము
←ఎనిమిదవ అధ్యాయము | 'శ్రీ సాయిసచ్చరిత్రము' (తోమ్మిదవ అధ్యాయము ) | పదవ అధ్యాయము→ |
శ్రీ సాయిసచ్చరిత్రము తోమ్మిదవ అధ్యాయము బాబా వద్ద సెలవు పుచ్చుకొనున్నప్పుడు వారి యాజ్ఞను పాలించవలెను - వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడచిన ఫలితము; కొన్ని ఉదాహరణములు; భిక్ష దాని యావశ్యకత. భక్తుల యనుభవములు శిరిడీ యాత్ర యొక్క లక్షణములు
శిరిడీ సందర్శనములోని యొక ప్రత్యేక విశేషమేమన, బాబా యనుమతి లేనిదే యెవరు శిరిడీ విడువ లేకుండిరి. బాబా యనుమతిలేక యేవరైనను శిరిడీ విడిచి వెళ్ళినచో, వారి ఊహించని కష్టములు కొనితెచ్చుకున్నవారగుచుండిరి. బాబా యెవరినైనను బయలుదేరుడని శలవిచ్చిన తరువాత, ఇక శిరిడీలో నుండరాదు. శలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగనో లేక నూచనప్రాయముగనో కొన్ని సలహలు నిచ్చుచుండెడివారు. బాబా అదేశానుసారము నడచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి యదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను.
తాత్యాకోతే పాటిల్
తాత్యాకోతేపాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్‌గాంవ్‌లో జరుగు సంతకు బయలదేరెను. హడావిడిగా మసీదుకు వచ్చి, బాబాకు నమస్కరించి కోపర్‍గాంవ్ సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో, "తొందర పడవద్దు! కొంచెమాగుము, సంత సంగతి యటుండనివ్వు! ఊరు విడిచి అసలు బయటకెక్కడికిని పోవలదు" అని అనెను. సంతకు వెళ్ళవలెననెడి తాత్యా యాతురతను జూచి, కనీసము షామా(మాదవరావు దేశపాండే) నయిన వెంట దీసికొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్కచేయక తాత్యా హుటహుటిన టాంగానెక్కి కోపర్‌గాంవ్ బయలదేరెను. టాంగాకు కట్టిన రెండు గుఱ్ఱములలో నికటి మూడువందలరూపాయల ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. శిరిడీ వదలి సావుల్‌విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్తసాగెను. కొంతదూరము పోయిన పిమ్మట కాలు మడతబడి యది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు. గాని, తల్లి వలే ప్రేమతో బాబా చెప్పిన సలహ జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు గూడా, ఇటులనే బాబా యాజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామమునకు ప్రయాణమై, దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను.
ఐరోపాదేశస్తుని ఉదంతము
బొంబాయి నుండి ఐరోపాదేశస్తుడొకడు యేదో ఉద్దేశముతో బాబా దర్శనార్దము శిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబు చాందోర్కరు వద్దనుంచి తనను గూర్చిన యొక పరిచయ పత్రమును కూడ తెచ్చెను. అతనికొరకు ఒక ప్రత్యేక గూడారమువేసి, అందులో సౌకర్యము బస యేర్పాటుచేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి, వారి చేతిని ముద్దిడవలెనను కోరికతో అతడు మూడుసారులు మసీదులో ప్రవేశింప యత్నించెను. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందగా మశీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిరి. అతడు తనకు జరిగిన మరియాద అసంతుష్టిపడి వెంటనే శిరిడీ విడువవలెనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడ బాబా అదేశమును పాటించుమని సలహ ఇచ్చిరి. అ సలహలను ఖాతరుచేయక అతడూ టాంగానెక్కి శిరిడీ నుండి బయలుదేరెను. మొదట గుఱ్ఱములు బాగుగనే పరిగెత్తినవి. సావుల్‌విహిర్ దాటిన కొద్దిసేపటికి యొక సైకిలు అతని టాంగా కెదురువచ్చెను. దానిని జూచి గుఱ్ఱములు బెదిరినవి. టాంగా తలక్రిందలయ్యెను. అ పెద్దమనిషి క్రిందపడి, రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసికొనుటకై కోపర్‌గాంవ్‌లో అసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేకసంఘటనల మూలమున బాబా యాజ్ఞను దిక్కరించువారు. ప్రమాదముల పాలగుదురనియు, బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జునులు గ్రహించిరి.
భిక్షయొక్క యావశ్యకత
బాబాయే భగవంతుడయినచో వారు భిక్షాటముచే జీవితమంతయు గడుపనేల? యను సందియము చాలా మందికి కలుగవచ్చును. దీనికి, (1) భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? (2) పంచసూనములు, వానిని పోగొట్టుకొను మార్గమేది? యను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును.
సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయందాపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘషించుచున్నవి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికొని తినలేరు. వారికి భోజనము పెట్టు భధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు వావప్రస్థుడు కూడ కారు; వారస్ఖలితబ్రహ్మచారులు. బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు.
పంచసూనములు, వానిని తప్పించుకొను మార్గమును అలోచింతయి. భోజనపదార్థములు తయారు చేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక చేయవలెను. అవి యేవన : 1) దంచుట లేక రుబ్బుట, 2) విసరుట 3) పాత్రలు తోముట 4) ఇల్లు ఉడ్చుట 5) పోయ్యి యంటించుట. ఈ అయిదు పనులు చేయునప్పుడనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము ననుభవించవలెను. ఈ పాపపరిహరమునకు మన శాస్త్రములు అరు మార్గములు ప్రబోధించుచున్నవి. 1)బ్రహ్మయజ్ఞము, 2)వేదాధ్యయనము , 3) పితృయజ్ఞము, 4) దేవయజ్ఞము, 5)భూతయజ్ఞము, 6) అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞముల నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్షసాధనమునకు అత్మ సాక్షాత్కారమునకు యివి తోడ్పడును. బాబా యింటింటికి వెళ్ళి భిక్ష యడుగుటలో, అ గృహస్తులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే యింత గొప్ప ప్రభోధమును పొందిన శిరిడీ ప్రజలెంతటి ధన్యులు!
భక్తుల యనుభవములు
శ్రీకృష్ణుడు భగవద్గీత(9అ. 26శ్లో) యందు," శ్రద్దాభక్తులతో ఎవ్వరేని పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని యర్పించినచో దానిని నేను గ్రహించెదను" అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి యింకా సంతోషముదాయకమగు విషయమేమన, తమ భక్తుడేదైన తమకు సమర్పించవలెననుకొని, యే కారణముచేతైనను అ సంగతి మరచినచో, అట్టివానికి బాబా అ విషయము జ్ఞాపకము చేసి, అ నివేదనను గ్రహించి యాశీర్వదించువారు. అట్టి యుదాహరణలు కొన్ని యీ క్రింద చెప్పబోవుచున్నాను.
తర్ఖడ్ కుటుంబము
రామచంద్ర అత్మారమ్ వురుఫ్ బాబాసాహెబు తర్ఖడ్ యొకానొక్కప్పుడు ప్రార్ధనసమాజస్థుడైనను, తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడ బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లీ కొడుకులు శిరిడీ పోవుట సంతోషదాయకమైనను, కొడుకు మాత్రము దానికి మనఃస్పూర్తగా ఇష్టపడలేదు. కారణమేమన తన తండ్రి ప్రార్ధన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబాయొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కాని, బాబాపూజను తాను నియమానుసారము సక్రమముగా చేసెదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలదేరెను. శుకృవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి శిరిడీకి వచ్చిరి.
అమరుసటి దినము శనివారమునాడూ తండ్రీయగు తర్ఖడు పెందలకడనే నిద్రలేచి, స్నానముచేసి, పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగనమస్కారము చేసి, యేదో లాంఛనమువలె కాక, తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్దగా తనచే చేయింపవలసినదని ప్రార్ధించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవెద్యముగ కలకండను అర్పించెను. భోజనసమయమందు దానిని పంచిపెట్టెను.
ఆనాటి సాయంత్రము, ఆ మరుసటిదినము, అనగా ఆదివారము నాడు, పూజ యంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడ చక్కగా గడిచెను. అత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసియుండలేదు. పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారమునాడు పూజనెప్పటివలె సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నమింటికి వచ్చి భొజనమునకు కూర్చునప్పుడు అక్కడ ప్రసాదము లేకుండట గమనించెను. నౌఖరును అడుగగా అనాడు నైవెద్యమిచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే భోజనముకు కూర్చున్న అత్మారామ్ పెంటనే లేచి, బాబా పటమునకు సాష్టాంగనమస్కారము చేసి, బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు అ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటిని శిరిడీలో నున్న తన కొడుకునకు వ్రాసి, బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను.
అదే సమయమందు శిరిడీలో, మధ్యాహ్నహరతి ప్రారంభించుటకు ముందు, అత్మారాముని భార్యతో బాబా యిట్లనెను: "తల్లీ! ఏమయిన తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలోని మీ యింటకి పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఏలాగునునో లోపల ప్రవేశించితిని. కాని అక్కడ తినుట కేమిలేకపోవుటచే తిరిగి వచ్చితిని" అనెను.
బాబా మాటలు అమెకేమియు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో నేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి, యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడును. అందులకు బాబా పూజను అక్కడనే చేయుమనీ, యింటికి పోనవసరములేదని చెప్పెను. వెంటనే కొడుకు శిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగ తండ్రికి ఉత్తరము వ్రాసి, బాబాపూజను అశ్రద్దచేయవద్దని వేడుకొనెను. ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది అశ్చర్యకరము కదా!
అత్మారాముని భార్య
ఇక అత్మారాముని భార్య విషయము. ఒకసారి అమె మూడు పదార్దములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి: 1) వంకాయ పెరుగుపచ్చడి, 2) వంకాయ వేపుడు కూర, 3) పేడా. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము.
బాంద్రా నివాసియగు రఘవీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో శిరిడీకి బయలుదేరుచుండెను. అత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భర్య చేతికిచ్చి యొకవంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. శిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసికొని వెళ్ళెను. బాబాకా పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దాని నందరికి పంచిపెట్టెను. వెంటనే, తనకు వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్టమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు గనుక యామె కేమియు తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట యనునది అమెకు సమస్య యాయెను. వంకాయపచ్చడి తెచ్చినదెవరని కనుగొనుగా పురందరుని భార్యయని తెలియటచే వంకాయవేపుడు గూడ అమెయే చేసి పెట్టవలెనని అమెకు కబురంపిరి. అప్పుడందరికి వంకాయ వేపుడను బాబా యెందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు యందరాశ్చర్యపడిరి.
1915 డిసెంబరులో గోవింద బలారాంమాన్‌కర్ యనువాడు శిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలెననుకొనెను. ప్రయాణమునకు పూర్వము అత్మారాముని వద్దకు వచ్చెను. అత్మారాం భార్య బాబా కొరకేమైన పంపవలెనుకొని ఇల్లంతయు వెదకెను. కాని యొక్క పేడా తప్ప యేమియు గాన్పించలేదు. అ పేడా కూడా యప్పటికే బాబాకు నైవేద్యముగ సమర్పింపబడియుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై యుండెను. కాని బాబా యందున్న భక్తి ప్రేమలచే అమె యా పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు శిరిడీ చేరెను; బాబాను దర్శించెను. కాని, పేడా తీసికొని వెళ్ళుట మరచెను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శమునకై వెళ్ళినప్పుడు కూడ అతడు పేడా తీసికొనిపోవుట మరిచెను. అప్పుడు బాబా యోపిక పట్టక తనకొర కేమి తెచ్చినావని యడిగెను. ఏమియు తీసికొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, " నీవు యింటివద్ద బయలు దేరునప్పుడు అత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వాలేదా?" యని యడిగెను. కుఱ్ఱవాడదియంతయు జ్ఞప్తికి దెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరుగెత్తి పేడాను దెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగెను. ఇవ్విధముగా అత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. "నా భక్తులు నన్నెట్లు భావింతురో, నేను వారి నావిధముగానే అనుగ్రహింతును" అను గీతవాక్యము (4-11) నిరూపించెను.
బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?
ఒకాప్పుడు అత్మరామ్ తర్ఖడ్ భార్య నొక ఇంటియందు దిగెను. మధ్యహ్న భోజనము తయారయ్యెను. అందరికి వడ్డించిరి. అకలితో నున్న కుక్క యొకటి వచ్చి మొఱుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్యలేచి యొక రొట్టెముక్కను విసరెను. అ కుక్క ఎంతో మక్కువగా అరొట్టెముక్కను తినెను. అనాడు సాయంకాలము అమె మసీదుకు పోగా బాబా అమెతో నిట్లనెను, "తల్లీ ! నాకు కడుపునిండ గోంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను. నాయందిట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము." ఇదంతయు అమెకేమియు బొధపడ లేదు. కావున అమె యిట్ల జవాబిచ్చెను. "బాబా! నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై అధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను." అందులకు బాబా యిట్ల జవాబిచ్చెను. "నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన యా రోట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు యే కుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివొ అదియు నేను ఒక్కటియే, అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, అవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే సకల జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి యంతయు వేరు యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము." ఈ యమృతాతుల్యమగు మాటలు యామె హృదయము నెంతయో కదలించినవి. అమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. అమె యానందమునకు అంతు లేకుండెను.
నీతి
’జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము’ అనునది యీ యధ్యయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగున్నవి యన్నియు భగవంతుని ప్రతిజీవియందు చూడమని ప్రభోదించుచున్నవి. ఈ యధ్యాయము చివర చెప్పిన యుదాహరణమువలనను, ఇతర అనేక భక్తుల అనుభవములవలనను, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రభోదములను, తమ అచరణరూపముగ చూపి, యనుభవపూర్వకముగా నిర్దారణచేసి యున్నరనియు సృష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్త్వమును అనుభవపూర్వకముగ ప్రబోదించిన సమర్ధ సద్గురుడే శ్రీ సాయిబాబా. శ్రీ సాయినాథాయ నమః తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము
సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు