శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/9వ అధ్యాయము

9వ అధ్యాయము.

మతము - పుస్తక జ్ఞానము.

217. భగవద్భక్తి, పుస్తకములను చదువుటవలన లభించునా? పంచాంగములో ఒకానొకదినమున యిరువదిదుక్కుల వాన కురియునని వ్రాయబడియున్నది. ఆపంచాంగమును మెలివేశి పిండుటవలన ఒక్కచుక్క అయినను రాదు గదా! అటులనే సద్వాక్యములు అనేకములు శాస్త్రగ్రంధములందు కలవు. వానినిచదువుటవలన ఎవరునుసద్ధర్ములుగాకాజాలరు. ఆపుస్తుకమున వర్ణింపబడిన ధర్మములను అనుచరించినగాని ఎవరికిని భగవద్భక్తి అలవడదు.

218. గీత - గీత - గీత - గీత - గీత - అని వేవేగముగ గీత అను శబ్దమును ఉచ్చరింపుము. అట్లుఉచ్ఛరింపబడిన శబ్దము కొంతసేపటికి త్యాగి - త్యాగి అని మారును. అనగా విడిచివేసినవాడు, విరాగి అని అర్ధమగును; గీతయొక్కబోధయంతయు ఒక్కమాటలోయున్నది. "త్యాగముచేయుడు; ఓజనులారా! సకలమును త్యాగముచేసి, మీహృదయములను భగవంతునిపైని హత్నించుడు." ఇదియే గీతాసారము;

219. ఒకడు ఓదేవా! ఓదేవా! అల్లాహో! అల్లాహో అని అఱచుచుండునంతకాలమును, వానికి భగవంతుని దర్శనము కాలేదనుట నిశ్చయము; ఈశ్వరుని దర్శించినవాడు మౌనమువహించి శాంతముగ నుండును. 220. ఇరువురుమిత్రులు ఒకతోటలోనికి పోయిరి. లౌకిక జ్ఞానవంతుడగు మిత్రుడు తక్షణమే అందున్న మామిడిచెట్లను లెక్కవేయుటకు మొదలుపెట్టెను. చెట్టునకు ఎన్నెన్ని కాయలుండునో, తోటమొత్తముమీద ఆదాయము ఎంతరాగలదో గణితమువేయసాగెను. వానిమిత్రుడు తోటకాపరికడకు పోయి వానితో స్నేహముచేసికొని నెమ్మదిగ ఒక్క చెట్టును సమీపించివాడు. ఆకాపరి అనుజ్ఞతో పండ్లనుకోసి తినగలిగి నన్ని తిన్నాడు. ఈయిరువురిలో బుద్ధిశాలి ఎవడు? మామిడిపండ్లుతిను! నీఆకలితీరును. చెట్లను ఆకులను లెక్కించి గణితములు వేయుటవలన లాభము ఏముండును? వ్యర్థాడంబరము చేయు పండితుడు ఈ సృష్టియొక్క కారణమును మూలమును తెలిసికొను ప్రయత్నములో వృధాగా మునిగియుండును. జ్ఞానముచే నమ్రుడగునతడు సృష్టికర్తతోడినెయ్యమునుసాధించి, వానిప్రసాదమున లభించు బ్రహ్మానందమును అనుభవించగల్గును.

221. శాస్త్రములుచదివినంతమాత్రమున భగవల్లీలలను వివరించబూనుట, కాశీనగరపు పటమును, మాత్రము చూచి కాశీనగర విశేషములను అభివర్ణించి చెప్పబూనుటవంటిదే.

222. "స రి గ మ ప ధ ని" అని ఊరక నోటితోఅనుట తేలికయే. ఆస్వరములనువీణెమీద పలికించుటకడుదుస్తరము. అటులనే ధర్మమునుగురించి మాటలాడుట తేలికయే; వానిని జీవితమున ఆచరించుట దుర్లభము.

223. తేనెటీగ పూరెబ్బలలోనికిచొఱక అందలి తేనెను రుచిచూడనంతవఱకును, అదిపూవునుచుట్టిచుట్టి యెగుఱుచు ఝంకారముచేయుచుండును. అది పూవులోపలదూఱి తేనెను త్రాగునప్పడు చప్పుడుచేయదు. ఎంతవఱకునరుడు శాస్త్ర విధులను, నియమములనుగురించి వివాదములుసాగించుచుండునో అంతవఱకును వానికి సత్యమగుభక్తి అలవడదు. వానికి దానిరుచి తెలిసినతోడనే అతడు వాచలతలేక శాంతిని వహించును.

224. సంతకు దూరముగానున్నప్పుడు పెద్దగోలగా శబ్దము వినవచ్చును. సంతలోప్రవేశించగానే ఆశబ్దము వినరాదు. అచ్చటజరుగుచుండు బేరసారములు తెలియవచ్చును. అటులనే భగవంతునికి దూరముగానున్నవానిని వ్యర్ధపు వాగ్వాదములు ముంచివేయును. ఆతడు భగవంతునిదగ్గఱకు చేరినంతనేయుక్తులు, ప్రయుక్తులు, వాగ్వాదములు అన్నియు పోయి విస్పష్టముగా కండ్లకుగట్టినటుల భగవల్లీలలు తెలిసిపోవును.

225. క్రాగుచున్న నేతిలో పచ్చిగారెను పడవేయగానే పెద్దధ్వనిపుట్టును. అది పచనమైనకొలదిని ధ్వనితగ్గును. బాగుగపచనమైనప్పుడు పొంగులు సమయును. మనుజుడు అల్పజ్ఞానిగనున్నంత కాలము ప్రసంగములు చేయుచు ఉపన్యాసములిచ్చుచుండును. బ్రహ్మజ్ఞానసిద్ధి అలవడగానె వ్యర్ధపు ఆడంబరములను పూర్తిగవిడచివేయును.

226. ఎవడు ఆత్మబోధములేక మంచి మాటకారియై బాగుగ బోధలుచేయగలడో వానింగూర్చి మీఅభిప్రాయ మేమి? ఆతడు తనదాపునదాచిన యితరుల ఆస్తిని దుర్వ్య యముచేయువానిపోలును. ఆతడుపలుకు పలుకులు వానివి గాక యెరువుతెచ్చుకొనినవిగాన తనకు నష్టములేదని యెంతగానైనను యితరులకు సలహాలను విరివిగా చెప్పగలవాడై యుండును.

227. చిలుక చాలకాలము "రాధాకృష్ణ! రాధాకృష్ణా!" అనుచుండును. కాని దానిని పిల్లిపట్టునప్పుడు కెక కెకలాడును. అప్పుడు దానికి నైజమగువాక్కు బయలుపడును. లోకవ్యవహారదక్షులు లౌకికఫలములను పడయుటకై కొంత హరినామస్మరణచేయుట, క్రతువులు దానధర్మములు సాగించుట కలదు, కానిఏయిక్కట్టులో, బాధలో, దుఃఖమో, దారిద్ర్యమో, మరణమో, వాటిలగానె హరినామస్మరణ మఱతురు; నిష్ఠలన్నియు మూలబడిపోవును.

228. గంజాయి, గంజాయి అని వేయిమారులు అఱచినను నిషాయెక్కదు. గంజాయినితెచ్చి, నీళ్ళలోనూరి, రసము తీసి, తేర్చి త్రాగుము. వెంటనే నిషాకలిగి పడిపోదువు. అటులనే "హరా! హరా!" యని అఱచుటవలన లాభములేదు. శ్రద్ధతో భక్తిసాధనలను కావించినగాని ఈశ్వరదర్శనము కాజాలదు.

229. పామరజనులు ధర్మవాక్కులతో సంచులు నింపి వేతురు. కాని అందు ఒక్కగింజంతయైనను ఆచరణయుండదు. సుజ్ఞానియో వానియావజ్జీవము ధర్మాచరణమే అయినను వానికడ వాచాలతయుండదు. 230. ప్రజ్ఞానమయి అగు నాజననికడనుండి ఒక్కకిరణ పనారణము చాలును, మహాపండితాగ్రేసరుని అయినను పడగొట్టివానపాములీల శుష్కీభూతుని చేసివేయగలదు.

231. దేనిసహాయమున మనము బ్రహ్మమును తెలియుదుమో, అదియే పరావిద్య. తక్కినదంతయు - కేవలశాస్త్రములు, తత్వసిద్ధాంతములు, తర్కము, వ్యాకరణము మున్నగువానిరాశియంతయు - మనస్సునభారమై పేరుకొని కలవరమునకు కారణమగును. గ్రంధములన్నియు గ్రంధులవంటివి. (చిక్కులముడులు). పరావిద్యకు దారిచూపినప్పుడే వానివలన ఫలముండగలదు.

232. మనపండితమ్మన్యులు ప్రగల్భములు పలుకుదురు. బ్రహ్మమని, బ్రహ్మయని, అవ్యక్తమని, జ్ఞానయోగమని, వేదాంతమని, విశ్వోత్పత్తియని ఏమేమో వచింతురు. తాము ఉచ్చరించువాని అపరోక్షజ్ఞానమును పడసినవారు పూజ్యము. వారుఎండబాఱి, గట్టిపడి నిష్ప్రయోజకులై యుందురు.

233. చైతన్యదేవుడు దక్షిణదేశమున తీర్ధములు సేవించు చుండ, భగవద్గీతనుచదువు ఒకపండితునికి ఎదురుగానిలుచుండి కన్నీరుకార్చుచున్న భక్తుని ఒకనిని కనిపెట్టెను. ఈభక్తునికి ఓనమాలైననురావు. గీతలోనివాక్యములు వానికి అర్ధమగుటలేదు. అతడు కండ్లనీరుకార్చుటచూచి ఎందుచేత అని ప్రశ్నింపగా ఆతడు యిట్లుచెప్పినాడు.

"నేనుఆగీతలోనిఒక్కమాటనైన తెలియజాలను. నిజము. కాని కురుక్షేత్రయుద్ధరంగమున, రధముపైని, అర్ఝునునికి ముందు కూర్చుండి, యీగీత అనబడు ఉత్తమభావములను బోధించుచుండిన యాశ్రీకృష్ణభగవానుని సుందరరూపము నాకండ్లకు అగపడుచున్నది. అందువలన భక్తి ఆనందమువెల్లివిరియ నాకన్నులు బాష్పపూరితములగుచున్నవి."

ఈభక్తుడు ఓనమాలనైనను నేర్వనివాడైనప్పటికిని మహాజ్ఞానియే. ఏమందురా, వానికి నిర్మల దైవభక్తికలదు; భగవత్సాక్షాత్కారమును పొందగలిగినాడు!

234. దివ్యజ్ఞానము, తన పాండిత్యమును గురించిగాని తన ఐశ్వర్యమును గురించిగాని గర్వపడునరునకు సాధ్యముకాదు. అటువంటువానితో "ఒకచోట సాధువొక డున్నాడు. చూచి వచ్చెదము వత్తువా?" అని, అనిచూడుము. ఆతడుసాకులుపన్ని రాజాల ననును. సాధువును చూడబోవుట తనవంటిఘనునకు తగదని ఆతడు భావించును. "అజ్ఞానమువలన గర్వము పుట్టును సుమీ."!

235. పుస్తకములు చదివినగాని జ్ఞానము లభింపదని అనేకులు తలంతురు. శాస్త్రములను చదువుటకన్న వినుటమేలు; బ్రహ్మదర్శనమో ఉత్తమోత్తమము. గ్రంధములను ఊరక చదువుటకంటె గురువునోట బ్రహ్మజ్ఞానముంగూర్చివినుటవలన అది మనస్సున గట్టిగా నాటుకొనును; మఱియు దర్శనము వలన ఆరూఢభావము కుదరగలదు. కాశీనగరమును గురించి పుస్తకములలో చదువుటకంటె ఆనగరమును స్వయముగ చూచినవానినోట దానింగూర్చి వినుటలెస్స. ఆకాశీనితన కండ్లతోనే చూచుట పరమోత్తమము. 236. బ్రహ్మమును ప్రత్యక్షసత్యముగా నాకండ్లార నేను చూచుచున్నాను. నేనింకవాదించుట ఎందులకు ? ఆ అవ్యయ బ్రహ్మమే మనచుట్టును గోచరించు వస్తుజాలముగమారుట నేను స్వయముగ చూచుచున్నాను. ఆయనయే ప్రత్యగాత్మగను, వికారప్రపంచముగనుకూడ గోచరించుచున్నాడు. ఈసత్యమును చూచుటకు తనలో ఆత్మప్రబోధము కలుగవలసి యున్నది. ఆబ్రహ్మమును ఏకైకసత్పదార్థముగ చూడగల్గు వఱకును, మనము తర్కించుచుండవలయును. ఇదికాదు; ఇదికాదు; "నేతి, నేతి" అనుచు వివేకించుచుండవలయును. "బ్రహ్మమే యీసర్వమును అయ్యెనని నిస్సందేహముగా నేను గ్రహించితిని" అని పలుకుటమాత్రము చాలదు; నిజమే. కేవలము వచించుటచాలదు. దైవానుగ్రహమువలన ఆత్మప్రబోధము కావలయును. ఆత్మప్రబోధము వెనువెంట సమాధిదశ ప్రాప్తించగలదు. ఈదశలో మనకు శరీరమనునది యున్నదనుటే మఱతుము. కామినీకాంచనములతో గూడిన ప్రాపంచికవిషయములందు అనురాగమేరూపుమాయును. లోకవ్యవహారములనుగూర్చి వినవలసివచ్చినచో మిగుల వెగటుతోచును. భగవంతునిగూర్చిన విషయములను మాత్రమేవినుటకు ఆసక్తి యుండును. అంతరాత్మ ప్రబోధము కలిగినపిమ్మట విశ్వాత్మను దర్శించుటే పైమెట్టు. ఆత్మయే ఆత్మదర్శనముచేయ జాలును సుమీ?

237. సమారాధనకై అతిధులు, అభ్యాగతులు అనేకులు చేరినప్పుడు వారుచేయుకోలాహలము పెద్దగవినవచ్చును. కాని ఆగందఱగోళము వారుభోజనము ప్రారంభించువరకే. వడ్డన అయి, ఆపోశన పట్టునప్పటికే ముప్పాతికశబ్దము అణగిపోవును. ఇంకక్షీరాన్నమువచ్చును - వడ్డనసాగినకొలదినిధ్వని తగ్గిపోవుచుండును. మజ్జిగ దగ్గఱకువచ్చుసరికి త్రేణువులుతప్ప ఏమియు వినరాదు. భోజనములు ముగియగానే యికవారు చేయునది నిద్రపోవుటే!

నీవు భగవంతుని దాపునకుచేరినకొలదిని ప్రశ్నించుట, తర్కించుట, హితవు తప్పును. వానిని సమీపించి, ప్రత్యక్షముగ చూచునప్పుడు ఏగోలయు ఉండదు. వివాదములన్నియు తుదముట్టును. అది నిద్రకుసమయము; అనగా సమాధి యందు ప్రాప్తించు ఆనందమును యనుభవించుటకు సమయమువచ్చినట్లు. ఆదశయందు భగవంతుని దివ్యదర్శనానందమున మునిగిపోవుదుము.

238. పుస్తకములు - అనగా ధర్మశాస్త్రములు - అన్నియు భగవంతునిచేరు మార్గమును చూపును. ఒక్కసారి దాఱితెలిసికొనినపిమ్మట ఆపుస్తకములతో పనియేముండును? ఆపిమ్మట ఏకాంతముగా భగవధ్యానముచేయుచు ఆధ్యాత్మ నాధనముచేయు తరుణము ఏర్పడును.

239. తనబందువునకు యేవోకొన్ని వస్తువులు పంపుమని ఒకనికి తన యింటికడనుండి ఉత్తరము వచ్చినది. ఆతడు వస్తువులు తెప్పించబోవుచుండగా, ఉత్తరములో ఏయేవస్తువులు కావలెనని వ్రాయబడెనో తెలిసికొన గోరెను. ఉత్తరముకొఱకు చూడగా అది కనుబడలేదు. దానికై చాల వెదకినాడు. తుదకు అదికాన్పింప వానికి ఆనందముకలిగినది. ఆతడు దానిని ఆతురముతో చదువ అందిట్లున్నది:-

"అయిదుశేర్ల మిఠాయి, వందనారింజపండ్లు, ఎనిమిది ఉత్తరీయములు పంపుడు." ఉత్తరములోని విషయములు తెలియగానే, అతడుదానిని ఆవలపడవేసినాడు. కావలసిన వస్తువులనుకొన నారంభించినాడు.

ఎంతవరకు అటువంటి ఉత్తరముయొక్క అవసరముండును? దానిలోనివిషయములను తెలిసికొనువఱకే గదా! విషయములు తెలిసినతోడనే, దానిలోకోరబడిన వస్తువులను సంపాదించుటే అప్పుడుచేయవలసినపని.

ఇటులనే శాస్త్రములు మనము భగవంతునిచేరుమార్గమును తెలుపును. అనగా బ్రహ్మసాక్షాత్కారమును సాధించు ఉపాయమును బోధించును. మార్గముతెలిసినపిమ్మట చేయవలసినపని, గమ్యమును చేరుటకుసాధనమే. ఆదర్శమును ప్రాపించుటే.

240. ఊరక పుస్తకములను చదువుటవలని ఫలమేమున్నది? పండితులకు చాలశాస్త్రవాక్యములు శ్లోకములును తెలియవచ్చును. అయినను వానిని పదేపదే పారాయణచేయుటవలన లాభమేమి? ఆశాస్త్రములలో చెప్పబడినదానిని ఆత్మానుభవమునకు తెచ్చుకొనవలయును. ప్రపంచవ్యవహార లంపటమున చిక్కియున్నంతకాలమును, కామినీకాంచనములను మోహలోభములతో చూచుచుండునంతకాలమును, ఈపారాయణములు మోక్షము నీయజాలవు. 241. ప్రజలు దోషములనియు, మూఢాచారములనియు పలుకుచు తమపాండిత్యమునుగురించి గర్వపడుచుందురు. కాని సత్యమగుభక్తుడు తనకుసదాభగవంతుడే చేయూతను యిచ్చు చుంటను తెలిసికొనును. తాను చాలకాలముత్రోవతప్పి నడచుచుంటినే అను చింతవానిని బాధించదు. వానికేమేమి అవసరమో భగవంతునికేతెలియును. భగవంతుడే భక్తుని వాంఛితార్ధమునుతీర్చును.

242. అబ్బీ! మామిడిపండ్లుతినరా, అందుము. తోటలో యెన్నివందలమామిడిచెట్లున్నవో, వానికి యెన్ని వేలకొమ్మలుండునో, అందెన్నిలక్షలఆకులున్నవో యనుచు గణితములు వేసిన యేమిలాభము? నీవిక్కడికి మామిడిపండ్లుతినవచ్చితివి; పండ్లుతిను, వెడలిపో! సాధనలుచేసి బ్రహ్మమును సాధించు కొఱకై నీవీలోకమున మనుషుడవైపుట్టితివి. భక్తిని ఆర్జించుట నీయుత్తమాదర్శము. అనవసరములగు వాగ్వాదములతో నీకుపనియేమి? వేదాంతచర్చలు, నీజీవితమును మార్చి వేయగల్గునా? నాలుగుగుక్కలసారాయితో నీకుకైపుఎక్కుచుండగా, సారాఅంగడివాని దాపున ఎన్నిపీపాలసారా ఉన్నదో విచారించుట నీకేమిలాభము? ఈమాత్రము తెలియదా?

243. ఒకనాడు, కేశవచంద్రసేనుడు దక్షిణేశ్వరాలయమునయున్న శ్రీరామకృష్ణ పరమహంసుల వారికడకువచ్చి "పండితులు పెట్టెడుశాస్త్రగ్రంధములనుచదివియు, పరమ పామరులుగ యుండుటకు కారణమేమి?" అనిప్రశ్న వేసిరి. శ్రీరామకృష్ణులవా రిట్లనిరి:- "గ్రద్దలు గరుడపక్షులు ఆకాశమున ఎంతయెత్తునకో యెగురునుగదా. కాని వానికండ్లు ముఱికిగుంటలలో క్రుళ్లుచుపడియుండు మృతకళేబరములను వెదకుటయందే పూనికవహించియుండును. అదే తీరున ఎంతగాశాస్త్రపఠనముచేసినవారైనను, పండితమ్మన్యుల మనస్సులు కామినీకాంచనములను లౌకికవిషయములందు తగులువడియుండుటచేత వారికి బ్రహ్మజ్ఞానము లభించదు."

244. వట్టికడవలోనీరునింపునప్పుడు బుడుబుడమనుధ్వని చేయును. కాని అది నిండినప్పుడు చప్పుడేవినరాదు. అటులనే బ్రహ్మసాక్షాత్కారమును పొందనిమనుజుడు బ్రహ్మమును గురించిన వాగ్వాదములతో అట్టహాసములు చేయుచుండును. కాని బ్రహ్మావలోకనముచేసినవాడో, నిశ్శబ్దముగ బ్రహ్మానందము ననుభవించును.