శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/8వ అధ్యాయము
8వ అధ్యాయము.
మతబోధకులు.
196. ఓమతబోధకుడా! నీకడ అధికారచిహ్నముకలదా? రాజుచేత అధికారమునుపొందిన అల్పసేవకునిమాట సయితము ప్రజలు భయభక్తులతో మన్నింతురు. తన డవాలు బిళ్ళనుచూపి యెట్టిఅల్లరినైనను యతడు మాన్పగలడు. అదేతీరున నీవును మొట్టమొదట భగవదుద్బోధమను అధికారమును సంపాదించుకొనుము. ఈశ్వరాదేశచిహ్నము నీకడలేనంతవఱకును. ఉపన్యాసములందు నీప్రాణమునంతను వ్యయముకావింతువుగాక, సర్వమును వ్యర్ధమేఅగును సుమీ!
197. పుష్పము వికసించి దాని సువాసన గాలిలో ప్రసరించునప్పుడు తేనెటీగ తనంతటతానె వచ్చును. బెల్లమున్నచోటికి చీమలు తమంతటతామెవచ్చిచేరును. ఆతెనెటీగను చీమను యెవరును పిలువనక్కఱలేదు. అటులనే ఒకపురుషుడు పవిత్రవంతుడును పరిపూర్ణుడును అయినప్పుడు వాని జీవితమహిమ యెల్లదిశలను వ్యాపించును. బ్రహ్మదర్శనమునకై వెదకులాడువారెల్ల సహజముగనే వానిచెంత ఆకర్షించ బడుదురు. తనమాటనెవరు విందురాయని దేవులాడుచు యట్టివాడు అక్కడయిక్కడ తిరుగులాడ నక్కఱయుండదు.
198. అనేకులు మంచుగడ్డనుగుఱించి వినియుందురు; కాని చూచియుండరు. అటులనే చాలామంది మతబోధకులు భగవంతుని విభూతులనుగుఱించి పుస్తకములందు చదివియుందురుగాని, తమ జీవితములలో ప్రత్యక్షానుభవమును పొందియుండరు. మఱియు మంచుగడ్డనుచూచినవారిలో అనేకులు దానిని రుచిచూచియుండనితీరున భగవన్మహిమలను లీలగా తెలిసికొనిన వారనేకులు, వానితత్వమును సరిగా గ్రహించియుండరు. మంచును రుచిచూచినవాడే అదెట్టిదైనది చెప్పగలడు. అటులనే ఒకప్పుడు సేవకుడుగను, మఱొకప్పుడు సఖుడుగను, వేఱొకప్పుడు ప్రియుడుగను వివిధములుగా భగవద్విభూతులను వానితోడి సంసర్గముచేత గ్రహించినవాడుమాత్రమే వానినన్నింటిని వర్ణించగలడు.
199. మేడకప్పులపైనపడు వాననీరు, అందు పులితలల ఆకారమున అమర్చబడియున్నగొట్టముల ద్వారమునవచ్చునప్పుడు; పులులచేత క్రక్కబడునటుల కాన్పించినను, సత్యమునకు అది ఆకాశమునుండివచ్చు జలమే. అదేతీరున సాధుజనుల నోటిగుండవెలువడు సద్బోధలు వారిచే పలుకబడు పలుకులుగ కాన్పించినను సత్యమునకు అవి భగవత్సానిధ్యమునుండి వెలువడివచ్చు సూక్తులే సుడీ!
200. ఈనాటిమతబోధకులు అవలంబించు పద్ధతిని గురించి మీఅభిప్రాయమేమి? ఒక్కనికి సరిపోవువంటచేసి నూరుమందిని భోజనమునకు పిలుచుతెరవుననుండును. కొలదిపాటి ఆత్మానుభవముతో మహాధర్మోపదేష్టలుగ నటించుచున్నారు.
201. సత్యమగు ఉపదేశము ఎటులుండును? ఇతరులకు భోదలుచేయుటకంటే, నిరంతర భగవ త్సేవచేసిన చాలును; అదేబోధయైమించును. తనముక్తికై యెవడు సప్రయత్నడగునో ఆతడునిజముగా ఉపదేశికుడే. పలుదిక్కులనుంచి వందలకొలది జనమువచ్చి జీవన్ముక్తునికడ చేరుదురు; వానిఉపదేశమును వినుటకై ఆతురపడుచుందురు. రోజాపువ్వు విప్పుకొనగానే ఆహ్వానములు పిలుపులు ఏమియు లేకుండనే తేనెటీగలు అన్నివైపులనుండియువచ్చి మూగ గలవు.
202. స్మశానవాటియందు మృతకళేబరము నిశ్శబ్దముగను నిశ్చలముగను పడియుండును. రాబందులును, గ్రద్దలును అనేకము తమంతటతామే వచ్చిచేరును. వానిని పిలుచుకొని వచ్చుటకు యెవరును పోనక్కరలేదు.
203. మంటమండునప్పుడు పురుగులు ఎగురుచువచ్చి దానిలోపడిపోవును. అవెక్కడినుండివచ్చునో ఎవరికినితెలియదు. పురుగులను పిలుచుటకై నిప్పు తిరుగులాడదు. మహాత్ములబోధయు యిట్లుజరుగును. వారుపోయి వారిని వీరిని పిలుచుకొనిరారు. వందలకొలదిప్రజలు వారికడకువత్తురు. ఎక్కడినుండియో తెలియదు వారు తమంత తామేవచ్చి ప్రబోధమును కోరుచుందురు.
204. మిఠాయిరాలిన చోటునకు చీమలు తమంతతామె గుమిగూడును. పరమార్ధతత్వమను మిఠాయిగా మీరు మారుడు; భక్తులనుచీమలుతమంతటతామెవత్తురు. భగవంతుని ఆదేశములేకుండ నీవు భోదలుసాగించితివా అవి నిస్సారముగ నుండును; ఎవరునువినరారు. భక్తిద్వారమునగాని, మఱే మార్గమునగాని బ్రహ్మసాక్షాత్కారమునుపొంది, ఈశ్వరాజ్ఞనుసంపాదించుకొనిన పిమ్మట ఎవరైనను ఎక్కడనైనను బోధలు కావింపవచ్చును. ఉపదేశములు చేయవచ్చును. భగవంతుని మహిమను ప్రాపును పొందుటకు అదొక్కటే మార్గము. అటుపిమ్మట మాత్రమే ఎవనికైనను ఉపదేశకుని ధర్మమును చక్కగ నిర్వహించుటకు తగినసమర్ధత చేకూరును.
205. సత్యజ్ఞాన ప్రకాశముచేత విలసితుడగు నతడు మాత్రమే సద్గురువు కాగలడు.
206. ఈప్రపంచమున రెండుతెరగుల మనుజులుందురు:- సిద్ధపురుషులు. వీరు సత్యమును సాధించినవారు. అన్య చింతలను అన్నింటినివిడిచి ఆత్మారాములైమౌనముతో డనుందురు. మఱికొందఱు సత్యసిద్ధినిసాధించి ఆసత్యమును తమతో దాచిపెట్టుకొనిన ఆనందములేనివారై "రండు, రండు" మాతోడచేరి బ్రహ్మానందమును అనుభవింప రండు! అని గొంతెత్తి కోలాహలము చేయుచుందురు.
207. నీటితోనిండినకడవ చప్పుడుచేయదు; అటులనే బ్రహ్మసాక్షాత్కారమునుపడసిన నరుడు అధికముగ మాటలాడడు. అట్లయిన నారదుడు మొదలగువారి విషయమేమి? నారదుడు శుకుడు మున్నగువారు సమాధిదశను పొందినయనంతరము, చాలమెట్లు దిగివచ్చి, దయార్ద్రహృదయులై, ప్రేమ మీర మానవకోటికి బోధసలిపిరి. 208. మున్ముందు భగవంతుని నీహృదయమనుకోవెలయందు ప్రతిష్ఠించుము; మొదటవానిని ప్రత్యక్షము చేసికొనుము. బ్రహ్మసాక్షాత్కారమైన అనంతరము ప్రవచనములు, ఉపన్యాసములు మొదలగువానికి కడంగవచ్చును. అంతవఱకును వలదు. ప్రాపంచికవిషయములకు బద్ధులైయుండియు కొందఱు దేవుడని బ్రహ్మమని ఏమేమొ గొడవగ పలుకుచుందురు. అందువలన ఫలమేముండును? కోవెలలో పూజచేయుటకు దేవుడులేనిదే పూజలకురమ్మని ఊరక శంఖము లూదినట్లుండును.
209. ఒకగ్రామమున పద్మలోచనుడను బాలుడుండెడివాడు. ఆయూరివారందఱును వానిని పద్దయ్య అని పిలిచెడువారు. ఆపల్లెలో పాడుపడినప్రాతగుడిఒకటి యున్నది. దానిలోపల దేవాతావిగ్రహము కూడలేదు. గుడినిండాచెట్లు చేమలు మొలచినవి. అదిగుడ్లగూబలకును, గబ్బిలములకును కాపురమై పోయినది. ఒకనాటిసాయంతనము హఠాత్తుగా ఆపాడుపడినగుడిలోనుండి జేగంటమ్రోతలు, శంఖధ్వనులు వినవచ్చినవి. పురుషులు స్త్రీలు బిడ్డలు పరుగుపరుగున అచ్చోటికి పోయిరి. ఎవరోభక్తుడుదానిలో దేవతావిగ్రహమునుప్రతిష్ఠించినాడు. హారతియివ్వబోవుచున్నాడు అనితలంచి ఉత్సాహముతోనుండిరి. వారందఱును చేతులుజోడించుకొని ఆపవిత్ర ధ్వానములనువినుచు దేవతనుచూచుటకై ఆతురతతో గుడియెదుటనిలుచుండిరి. వారిలోఒకడుసాహసించిలోన ఏమిజరుగుచున్నదో తెలిసికొననెంచితలుపుసందుగాచూచినాడు, ఆగుడి లోపల పద్దయ్యజేగంటవాయించుచు శంఖమునూదుచుండుట చూచి ఆశ్చర్యపడిపోయినాడు. గుడిలోనేలంతయు పెంటలతో అసహ్యముగనున్నది. పూజకుదేవతావిగ్రహమాలేదు. అంతట "ఓపద్దయ్యా! గుడిలో మహాదేవునివిగ్రహమాలేదు. గుడినిశుభ్రముచేసి పెంటతొలగించుపాటి శ్రమ నైననుతీసికొనకపోతివి. ఏకాదశదివాంధములు యందుచేరిదివారాత్రములు కీచులుపెట్టుచుండును. అక్కటా, వ్యర్ధముగాశంఖమునూది యింతఅలజడికావించితివెందులకు?" అనిఅతడు కేకలుపెట్టినాడు.
కావున నీహృదయాంతరాళమున దేవతామూర్తిని ప్రతిష్ఠించకోరితివేని, భగవత్సాక్షాత్కారము కావలయునను కోరిక నీకుకలదేని, ఊరకశంఖారావములుచేసిన ఫలమేమి? మొదట నీహృదయమును శుద్ధముచేయుము. హృదయము నిర్మలమైనతోడనే ఈశ్వరుడు తనంతనేవచ్చి అందునిలుచును. దేవతా విగ్రహమును ఆశుద్ధస్థలమున నిలుపవీలుండదు. అయిదు జ్ఞానేంద్రియములును, అయిదుకర్మేంద్రియములును మనస్సునే పైనిపేర్కొనిన ఏకాదశదివాంధములు.
మొట్టమొదలుగా నీఆత్మలో లోతుగమునిగి, అందుగల రత్నములకైకొనుము. తక్కినవి పిమ్మటచూచుకొనదగును. మహాదేవుని ముందు నీహృదయమున నెలకొల్పుము. ఆపిమ్మట ఉపన్యాసములను, ఉపదేశములనుచేయుటకు నీకు కావలసినంత అవకాశముదొఱకగలదు.
210. భక్తిసాగరమున లోతుగమునుగుటకు ఎవనికినిశాంతముగాని అభిలాషగాని యుండదు. వైరాగ్యమును, వివేక మును సంపాదించుకొనుటకుగాని భక్తిసాధనలచేయుటకుగాని ఎవడును శ్రద్ధవహించడు. జేబులోనిపుస్తకమును ఒకింతచదివినంతటనే ఉపన్యాసములనిచ్చుటకును, ఉపదేశముల చేయుటకును ఎల్లరుపరుగులిడుచుంద్రు. ఎంతవిడ్డూర్యము! యితరులకు బోధచేయుటనగా పనులలోనెల్ల అత్యంతకష్టసాధ్యమగు పని. భగవత్సాక్షాత్కారమునుపొంది వాని ఆదేశమును పడసిన యతడు మాత్రమే బోధలుచేయగలడు.
211. ఆవిరిదీపాలకాంతులు ఆయాస్థలములందువేర్వేఱుగా ప్రకాశించుచుండును. అయినను ఆదీపాల ప్రాణము అనగా ఆవిరి ఒకేగొట్టమునుండివచ్చును. అటులనే ఒక్కసర్వేశ్వరుని వలననే నిరంతరముగా ఆత్మజీవనప్రసారణము యేకసరణిని సాగుచున్ననువేర్వేఱుదీపములవలె, ఆయాదేశకాలములందలి బోధకులు ప్రకాశించుట పొసగును.
212. గొప్పసంపన్నుని ధ్యానాగారమునుండి కొనుగోలు వారికి ధాన్యమునుకొలుచువానివెనుకనుండి తెంపులేకుండ ధాన్యమువచ్చిపడుచునేయుండును. చిల్లరబేరగానిరాశి వేగిరముగ శూన్యమైచనును. అదేతీరున భగవద్భుక్తునిహృదయమునందు సత్సంకల్పములును, సద్బోధలును, భగవంతునిచేతనే సమకూర్చబడుచుండును. అందువలన నూతనములును, జ్ఞానప్రదములును అగుభావములకు కొదువయుండదు. పుస్తకజ్ఞానమునునమ్ముకొనువారుచిన్నబేరగానిబోలువారు. సంకల్పములు భావములు ఎప్పటికప్పుడు వారికి కొఱతపడుచునేయుండును. 213. ఒకదినమున పంచవటిదాపుగా పోవుచుండ కప్పయొకటి భీకరముగా అఱచుచుంట వినవచ్చినది. దానిని పాము పట్టుకొనియుండునని ఊహించితిని. చాలాసేపటికి నేను తిరిగివచ్చునప్పుడును ఆకూతవినబడుచునేయుండెను. పొదలలో గుండ చూచితిని. ఒకబురదపాము కప్పను నోటితోపట్టుకొని యున్నది. దానిని అది మ్రింగనూలేదు; విడచివేయనూలేదు. పాపము ఆకప్పకు బాధనివృత్తికాదు. ఆకప్పవిషముగల నాగుబామునోట పడినయడల ఒకటిరెండు కూతలతో దాని పని ముగించియుండునుగదా యని తలంచితిని. కాని యిప్పుడు పాముయొక్క బాధయు కప్పయొక్క బాధయు సమానమే.
అటులనే జ్ఞానశూన్యుడు అహంకరించి యింకొకని తరింపజేయుటకు బాధ్యతపూనినయెడల యిద్దఱిదుఃఖములకును అంతముండదు. శిష్యుని అహంకారముగాని వానిసంసారబాధలుగాని తుదముట్టవు. అనర్హుని దఱిచేరిన శిష్యుడు ఎన్నడును తరింపజాలడు. కాని సమర్ధుడగు గురువు నాశ్రయించినజీవుని అహంకారము మూడుసార్లు బెకబెకలు పెట్టగానె తుదముట్టును.
214. వైద్యులలో మూడురకాలవారున్నటుల, గురువులలో కూడ మూడురకాలవారు కలరు. ఒకరకపువైద్యులు పిలువగానెవచ్చి రోగినిచూతురు; నాడి పరీక్షింతురు; మందు నిర్ణయించి పుచ్చుకొమ్మందురు. రోగి నిరాకరించెనా వాని గొడవ విడిచివెడలిపోవుదురు. ఇంక ఏలాటిజోక్యమును పెట్టు కొనరు. ఇట్టి వైద్యులు అధములు. ఇటులనే కొందరు మతగురువులు తమబోధలు మన్ననపొంది ఆచరింపబడుచున్నది లేనిది విచారించరు. రెండవరకపువైద్యులు రోగినిమందువేసికొనుమని చెప్పుటతోవిడువరు. రోగినిరాకరించినప్పుడువానితో వాదించి బుజ్జగింతురు. అదేవిధమున ప్రజలను సన్మార్గమున భగవద్భక్తిగలిగి సత్యాన్వేషణపరాయణతో వర్తింపజేయుటకు కొందరుగురువులు సకలకష్టములనుపడుదురు. వీరుకొంచెము పైతరగతిబోధకులు. మూడవతరగతి వైద్యులు, మహోత్తములుందురు. రోగి బుజ్జగింపులకు లొంగనియెడల బలవంతపెట్టుదురు. రోగిరొమ్మున మోకాలుపెట్టి అదిమిపట్టి గొంతులోమందువేసి మ్రింగింతురు కూడను. ఇట్లేకొందరుగురువులు, అవసరముకలిగెనేని; శిష్యులను నిర్బంధించి ధర్మపధమున నడపింతురు. వీరు పరమోత్తములు.
215. సుప్రసిద్ధోపన్యాసకుడు ఒకడు హరిసభయందొకనాడు ఉపన్యసింపదొడగెను. ఉపన్యాసమధ్యమున "భగవంతుడు బొత్తుగ రసహీనుడు. మనస్వాభావమునుండి కొంత మాధుర్యమును వానికి అప్పుగాయిచ్చెదముగాక." అనిచెప్పినాడు. రసము అనగా ప్రేమమొదలగు దివ్యలక్షణములని వానిభావము. వానిపలుకులు ఆలకించినప్పుడు నాకొకబాలుని విషయము జ్ఞప్తికివచ్చినది. అతడుతనమేనమామగారిగోశాలనిండ గుఱ్ఱములున్నవని చెప్పినాడు. గోశాలలు గుఱ్ఱాలకొఱకై కట్టునవికావని కొంచెము తెలివిగలవారికి తెలిసిన విషయమే. ఆపిల్లవానిమాటలు అబద్ధములనియు, వానికి గుఱ్ఱాలవిషయము ఏమియుతెలియదని వారు గ్రహించిరి.
భగవంతుడు రసహీనుడు అనుట వెడగుమాట. ఆ ఉపన్యాసకునికితానుచెప్పెడివాక్కులఅర్ధము బొత్తుగ తెలియదు. అనంతమగుప్రేమ, జ్ఞానము, ఆనందములకు, అఖండనిధియగు పరమేశ్వరునిగూర్చి అతడుయిసుమంతయు తెలిసికొనియున్నవాడుకాడు.
216. ఇంకొకడు మతబోధను వృత్తిగా పెట్టుకొనినవాడుకలడు. ఆతడు బోధలుచేయునప్పుడు, శ్రోతలందు గాఢమగుభక్తిభావములను రేకెత్తునటుల చేయగల్గెడివాడు. కాని యతడుమాత్రము నీచప్రవర్తనగలవాడు. వాని నడవడికనుచూచి నొచ్చుకొని, అంతమందిహృదయములలో భక్తి బీజములనాటుచును, తానుకలుషజీవనమును గడుపుటయేలనని నేనతనిని ప్రశ్నించితిని. అతడుతలవంచుకొని "అయ్యా, చీపురు తానెంత ముఱికితోనున్నను, నేలమీదను, వీధులందును, కల్మషములేకుండశుభ్రపఱచగలదు."అనెను. ఇంకనేనేమియు ప్రతివచనము పలుకలేనైతిని.