శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/10వ అధ్యాయము

10వ అధ్యాయము.

సాధకులలో వేర్వేఱు తరగతులు.

245. పేలాలు వేయించునప్పుడు వేపుడుమూకుడునుండి యెగిరివిచ్చుకొని బయటపడుగింజలు శ్రేష్ఠమైనవి. వాటికి ఏలాటిమచ్చయుండదు. బాగుగవేగి మూకుడులో నిలుచు పేలాలలో ప్రతిదానికిని కాలినమచ్చ కొంచెమైనను ఉండును. ఆలాగుననే సిద్ధభక్తులలో సంసారమును పూర్తిగవదలి వెలుపలబడినవారు శ్రేష్ఠులు, నిష్కంళంకులుగనుందురు. సంసారములలోనె నిలిచియుండు భక్తులలో పూర్ణసిద్ధులుసయితము వర్తనలో ఏదోలోపముగలిగి మచ్చబడియేయుందురు.

246. పారమార్ధికసాధకులలో రెండుతెఱగులవారు కాన్పించుచున్నారు; ఒకరకమువారు మర్కటకిశోరమును బోలువారు (క్రోతిపిల్లలవంటివారు). రెండవరకమువారు మార్జాల కిశోరమువంటివారు (పిల్లిపిల్లలబోలువారు). క్రోతిపిల్లచిత్రముగా తానె తల్లినిగట్టిగపట్టుకొనును; పిల్లికూన తనను తల్లిఎక్కడ నుంచిన అక్కడనేయుండి నిస్సాహాయమై దీనత్వముతో కూయుచుండును. క్రోతిపిల్ల తల్లిపట్టును తానువిడిచెనా క్రింద పడిహానిచెందును. అది తనబలమునే నమ్ముకొనియుండవలసినది. పిల్లిపిల్లను దానితల్లియే ఒకచోటునుండి మఱొకచోటునకు తీసికొనిపోవును. గాన దానికేఅపాయమునురాదు. అటులనే జ్ఞానయోగమునో, నిష్కామకర్మమునో నమ్ముకొను సాధకుడు తరించుటకు, తనప్రయత్నముమీదనే ఆధారపడి యుండవలయును. కాని భక్తమార్గావలంబుడో భగవంతుడే సర్వమును నిర్వహించునని యెఱుంగును; కావున పూర్ణవిశ్వాసముతో స్వామికృపపై ఆధారపడియుండును; మొదటివాడు క్రోతిపిల్లవంటివాడు; రెండవయతడు పిల్లికూనబోలువాడు.

247. ప్రొద్దుపొడుపువేళ చిలికినవెన్న శ్రేష్ఠము. సూర్యుడు ఉదయించినపిమ్మట చిలికినది అంతమంచిదికాదు. శ్రీరమకృష్ణపరమహంసులవారు తనభక్తులలోనిచిన్నవారితో యిట్లనుచుండెడి వారు; "మీరు ప్రాతఃకాలమున చిలికిన వెన్నవంటివారు." సాంసారులగు శిష్యవరులో, ప్రొద్దెక్కినపిమ్మట చిలికినవెన్నను బోలుదురు."

248. 'హోమ' అను పక్షులను గురించిన కధకలదు. అవి ఆకాశమున అత్యున్నతప్రదేశమున నివాసముచేయునట. ఆప్రదేశములందు వానికి అత్యంతప్రీతిగావున, అవెన్నడును క్రిందికిదిగి భూమిపైకిరావు. తమగ్రుడ్లనుసహా అవి ఆకశముననేపెట్టును. భూమి ఆకర్షణచేత అవిక్రిందపడునప్పుడు, గాలియొక్క రాపిడికి పొదుగబడి మార్గమధ్యముననే అవిపిల్లలగును. ఆపక్షికూనలు త్వరలో తాముపడిపోవుచుండినటుల గ్రహించి, వెంటనే నైజస్వభావముచే ప్రేరేపింపబడి, పైకి తమనివాసములకై ఎగిరిపోవునట. శుకదేవుడు, నారదుడు, ఏసుక్రీస్తు, శంకరాచార్యులు యింకనిటువంటి పురుషనరులు యీపక్షులవంటివారు. పసితనమునందు సయితము అట్టివారు లోకవిషయములయెడ రాగములేనివారై, బ్రహ్మజ్ఞాన దివ్య తేజములచే ఆకర్షింపబడి యున్నతపధముల నంటిపోవుదురు.