శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/3వ అధ్యాయము

3వ అధ్యాయము.

మాయ.

108. ప్రాకుచున్నపామునకును కదలకపరుండియున్న పామునకునుగల పోలిక "మాయ"కును "బ్రహ్మము"నకును, కలదు. క్రియాపరమైయున్న శక్తివంటిదిమాయ; అవ్యక్తమై యున్నశక్తి బ్రహ్మము.

109. మహాసాగరజలము ఒకప్పుడు నిశ్చలముగనుండి మరొకప్పుడు తరంగకల్లోలమైయుండుతీరున "బ్రహ్మమును" "మాయ"యు బరగుదురు. శాంతియుతసముద్రమే "బ్రహ్మము" సంచలనయుతసముద్రము "మాయ".

110. అగ్నికిని దహనగుణమునకును ఎట్టిపోలికగలదో అట్టి పోలికయే బ్రహ్మమునకును శక్తికిని కలదు.

111. మేఘములులేని నిర్మలమగు ఆకాశమున ఆకస్మికముగా మబ్బొకటి కాన్పించి దృజ్మండలమున చీకట్లుక్రమ్మవచ్చును. హఠాత్తుగా వాయువువీచి దానిని తఱిమివేయవచ్చును. ఇట్లే "మాయ" అది ఆకస్మికముగ తలజూపి, ప్రశాంతచిత్తము నాక్రమించి దృశ్యప్రపంచమును కల్పనచేయును, ఈశ్వరుని ఉశ్వాసముచేత మరల హఠాత్తుగా చెదఱిపోవును.

112. బ్రహ్మసాక్షాత్కారమును చేకూర్చునది మాయయే. మాయలేనిది ఎవరు బ్రహ్మసాక్షాత్కారమును పడయ గలరు? శక్తినిదర్శింపకుండ, అనగా వ్యక్తమగు భగవత్సామర్థ్యమును గమనింపకుండ భగవంతుని గుర్తింపజాలము.

113. ఎవరేని కనుపెట్టినంతనే దొంగపారిపోవుతీరున, విశ్వభ్రాంతి రూపమాయను నీవు కనిపెట్టిన తోడ్తోడనే అది పారిపోవును.

114. ఒక పుణ్యపురుషుడు త్రికోణాకృతిగల అద్దపుముక్కను గాంచి రేయింబవళ్ళు చిరునవ్వు నవ్వుచుండెడివాడు. కారణమేమనగా, దానిద్వారమున ఎరుపు, పసుపు, నీలము మొదలగువేర్వేఱురంగులు వానికి కాన్పించెడివి. ఈరంగులు వట్టిబూటకములని గ్రహించుటచేత అతడీ దృశ్యప్రపంచము సయితము అటులనే బూటకమని గ్రహించి నవ్వుకొనెడివాడు.

115. హరియనుబాలుడు సింగపుతలనుపెట్టుకొనినప్పుడు భయంకరముగ కాన్పించుటనిజము. అతడు తనచెల్లెలు ఆటలాడుకొనుచున్నతావునకుపోయి, దద్దఱిలిపోవునటుల బొబ్బపెట్టును. వానిచెల్లెలుఅదఱిపడి భీతిల్లి ఆభీభత్సాకారునిబారినుండి తప్పించుకొని బయటపడుటకై కెవ్వునకేకవేయును. కాని హరి తనముసుగును తొలగించివేయగానే, భయకంపితయైయున్న వానిచెల్లెలు తనప్రియసోదరునితక్షణముగుర్తుపట్టి, వానిచెంతకుపరుగిడిపోయి "ఒహో! నాఅనుంగుసోదరుడే!" అనును. ఇట్లేబ్రహ్మము అజ్ఞానరూపమాయయొక్క ముసుగునువేసికొనగా భ్రాంతిచెంది భీతిలిపోయి నానాచేష్టలకు గడంగు లౌకికజనముగతియు ఉన్నది. కాని ఆబ్రహ్మముయొక్క ముఖమును కప్పిపుచ్చు మాయారూపముఖము తొలగింపబడినప్పుడు, నరులకుఅతడుభీకరుడై కరుణాశూన్యుడై బాధించు అధికారిగాకాన్పించడు; అత్యంతప్రియుడగు అంతరాత్మయైపఱగును సుమీ!!

116. ఒకసారి వినిర్మలనీలాకాశమున హఠాత్తుగా మబ్బులావరింప, ఉత్తరక్షణముననే పెనుగాలివచ్చి వానిని చెదఱగొట్టుటగాంచి ఒకపరమహంస ఆనందపరవశుడై నాట్యముచేయుచు, ఇటులపలుక సాగెను. "మాయయుఇట్టిదే! మాయ మొదటలేనిదే! అది వినిర్మలబ్రహ్మవాతావరణమున ఆకస్మికముగ గోచరించి, యీజగత్తునంతను సృష్టిచేయుచున్నది! అంతలో ఆబ్రహ్మముయొక్క నిశ్వాసముచేతనేచెదఱగొట్టివేయ బడుచున్నది!!"

117. భగవంతుడు సర్వవ్యాపి అగునెడల మనకేలకాన్పించడు? పాచినాచుదట్టముగా కప్పియున్నకోనేటిగట్టున నిలిచి చూచితివేని దానిలో నీవు నీరులేదందువు. నీవానీరునుచూడ గోరుదువేని నీటిపైనుండి నాచును తొలగించవలయును. అటులనే మాయపొఱలుగప్పినకండ్లతో నీవు భగవంతుని చూడలేక విలపించుచున్నావు. నీవాభగవంతుని దర్శింపకోరు నెడల నీకండ్లపైనుండి ఆమాయయొక్కపొఱలను తొలగించుకొనుము.

118. మేఘము సూర్యుని కప్పివేయునటుల మాయ బ్రహ్మమును కప్పివేయును. ఆమబ్బువిచ్చి పోయినప్పుడు సూర్యుడు కాననగును; మాయ విడిపోయినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమగును. 119. రాజహంసము నీటితోకలిసియున్నపాలనుండి, నీటిని విడదీసి, ఆపాలనుమాత్రమే గ్రహించును; ఇతరపక్షులు అటులచేయజాలవు. ఈశ్వరుడు మాయతోకూడియున్నాడు. సామాన్యనరులు మాయనుండి వేఱుపఱచి ఈశ్వరునిగుర్తింపజాలరు. పరమహంసమాత్రము మాయను విసర్జించి శుద్ధబ్రహ్మమును గ్రహింపజాలును.

120. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వనములబడిపోవుచుండిరి. శ్రీరాముడుముందు నడచుచుండెను. సీతమధ్యను లక్ష్మణుడు చివఱనుఉండిరి. సదా శ్రీరామునితనకండ్లయెదుట నుంచుకొని చూచుచుండవలయునని లక్ష్మణునికిఅభిలాష. సీతనడుమనుండుటచేత లక్ష్మణుడు రామునిచక్కగ చూడలేకుండెను. అప్పుడతడుకొంచెము ప్రక్కకుతొలగుమని సీతను ప్రార్థించినాడు. ఆమె అటులతొలగగానే లక్ష్ముణునికోర్కె ఫలించి శ్రీరాముని కన్నులార చూడగలిగెను. ఈవిశ్వములో బ్రహ్మము మాయ జీవుడు అటులవర్తింపుచున్నారు. మాయాభ్రాంతి తొలగనంతవఱకును జీవుడు ఈశ్వరుని చూడజాలడు; నరునకు నారాయణునిదర్శనముకాదు.

121. పాముకోఱలందలి విషము పామునకు హానికరము కాదు; అది వేఱొకని కఱచునెడల ఆవిషము వానినిచంపును. అటులనే ఈశ్వరునియందలి మాయ వానికి అపాయకరము కాదు; మఱియు ఆమాయ విశ్వమునంతను భ్రాంతిపాలుచేయుచున్నది!

122. పిల్లి తనకూనలను పండ్లతోపట్టుకొనినప్పుడు ఆకూనలకు అపాయముండదు. ఆపిల్లిచుంచునుపట్టుకొనినప్పుడు చుంచు చచ్చునుగదా! అదేవిధముగా మాయభక్తునిచంపదు; కాని యితరులను ధ్వంసముచేయును సుడి!

123. శివుడును, శక్తియు, అనగా విజ్ఞానమును ప్రవృత్తియు సృష్టిజరుగుటకు అవసరములు. పొడిమట్టితో కుమ్మరి కుండలు చేయజాలడు; నీరును అవసరము. అటులనే శక్తియొక్క తోడ్పాటులేనిది శివుడు సృష్టిని జరుపజాలడు.

124. పరావిద్యము, పరమానందప్రాప్తియు, ఈమొదలగు విషయములు మనకు సాధ్యములగుట మాయవలననే; అటులకానిచో ఈవిషయములను సయితము ఎవరుఅనుభవింపగోరు కొనగల్గుదురు? మాయనుండిమాత్రమే ద్వైతభావమును అన్యాపేక్షతయు ఉత్పన్నము కాగల్గును. మాయనుదాటినచో భోగము భోగి అనుభావములకే అవకాశము లేకపోవును.

125. మాయనుచూడ నపేక్షించి, ఒకదినమున నేనొక దృశ్యమును గాంచితిని. ఒక చిన్నబిందువు వికసించి యొక బాలికగా నేర్పడినది. ఆబాలిక పెరిగి స్త్రీయై ఒక బిడ్డను గన్నది. మఱియు ఆబిడ్డను కనినతోడనే ఆమె దానిని పట్టుకొని మ్రింగివేశినది. ఈతీరున ఆమె చాలమంది బిడ్డలను కని వారిని మ్రింగివేసినది. అంతట ఆమె మాయయే యని నేను గ్రహించితిని.

126. మాయఅనగానేమి? తఱుచుగా పారమార్ధికసాధనకు అడ్డమువచ్చుచుండు కామమే మాయ!