శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/2వ అధ్యాయము

భగవంతుడు.

2వ అధ్యాయము.

47. భగవంతుడు నరులందఱియందున్నాడు. కాని నరులందఱును భగవంతునిలో లేరు. అందువలననే వారుదుఃఖముల పాలగుచున్నారు.

48. రాత్రికాలమున ఆకాశమునందు నక్షత్రములు అనేకములు నాకుకాన్పించుచున్నవి. సూర్యోదయమైనపిమ్మట అవికానవచ్చుటలేదు. ఆకారణము చేతనీవు పగటివేళ ఆకాశమున చుక్కలులేవనవచ్చునా! ఓనరుడా! నీవుఅజ్ఞానవశమున నున్నకాలమున నీకుభగవంతుడు కానరానికారణముచేత భగవంతుడు లేడనబోకుము.

49. చంద్రుడు ప్రతిబాలకునకును "మామ" అయినవిధమున భగవంతుడు సర్వమానవకోటికిని "గురువు" అగు చున్నాడు.

50. గంటవాయించుసమయమునవినవచ్చు గణగణధ్వనులు, ప్రత్యేక ప్రత్యేకరూపములుగలవానివలె వేర్వేఱైతోచవచ్చును; కాని వాయించుటనాపినప్పుడు ఆభిన్నధ్వని మాత్రమే కొంతసేపు వినవచ్చి క్రమక్రమముగా సమసిపోవును. ఈధ్వని నిరాకరమైయొప్పును. గంటయొక్క యీధ్వనులవలనే భగవంతుడు సాకారుడును, నిరాకారుడునె వెలయగలడు. 51. బ్రహ్మముయొక్క స్వభావము ఎట్టిది? - బ్రహ్మముగుణరహితుఁడు. చలనరహితుఁడు, తానుకదలడు, కదల్పబడడు మేరుపర్వతమునుబోలి స్థిరముగనుండును.

52. సూర్యబింబము భూమికన్న అనేకరెట్లుపెద్దది. కాని అతి దూరమున వుండుటచేత చిన్నసిబ్బెయంతగా గోచరించును. అటులనే భగవంతుడు గణనాతీతుడైపరగును. కానివానినుండి బహుదూరముననున్నమనము వానినిజమ హిమను గ్రహింపజాలకున్నాము.

53. రెల్లుతోడను, నాచుతోడను, కప్పబడియున్నగుంటలో ఆటలాడుచేపలు మనకుకానరానట్లు మాయచేతకప్పబడి యున్నమానవహృదయమునవర్తించుభగవంతుడు మనకు గోచరింపకున్నాడు.

54. భగవంతుడు నిరాకారుడు; కాని వానికిఆకారమునుకలదు. మఱియుభగవంతుడు సాకారనిరాకారరూపములరెండింటికిని అతీతుడునుఅగును. వానిపూర్ణరూపము వానికేయెఱుక.

55. భగవంతుడు నిరామయుడు. అఖండబ్రహ్మమును జగజ్జనకుడునుకూడ అతడే. నిర్మలసచ్చిదానందమూర్తి యగు అఖండబ్రహ్మము, పారమును, తీరమునులేని మహాసముద్రములీల దుర్గ్రాహ్యమైయొప్పును. మనముఅందులోపడి కొట్టుకొని మునిగిపోవలసినదే, గాని మనముభగవంతుని సాకారలీలారూపభావమున జొచ్చునెడల, సముద్రమున మునుగుతరిని తీరమునకుకొట్టుకొనివచ్చు మనుజునివడువున, సులభముగా శాంతినిపడయగలుదుము. 56. మంచుగడ్డఘనీభూతమైననీరే. అటులభగవంతుని సాకార దృశ్యరూపము భౌతికాకృతినిదాల్చిన అనంతనిరాకార బ్రహ్మమే, అదిఘనీభవించిన సచ్చిదానందరసమే అనవచ్చును. మంచుగడ్డనీటిలోని అంతర్భాగమై, నీటిలోనే నిలిచి, తుదకానీటిలోనె కరిగిపోవును. అటులనే సాకారదై వతమునిర్గుణబ్రహ్మమునందొక అంశమే. ఆనిర్గుణ బ్రహ్మమునందే పుట్టును. అందేవర్తించును; తుదకందేలయమై అంతర్థానమగును.

57. బ్రహ్మసాగరమునుండి వీచువాయువు ఏహృదయముపై వీచునో అదెల్ల పరివర్తనమును పొందును. సనక సనాతన ప్రముఖమునివరులు ఆవాయువుసోకి ముగ్ధులైరి; భగవద్భక్తి పరవశుడగుటకు నారదుడాదివ్యసముద్రపు జాడనుదూరమునుండి చూచియుండవలెను. అటుల పరవశుడగుటచేత తననుదామఱచి, నిరంతరము శ్రీహరి గీతముల పాడుచు ఉన్మాదుడై జగమెల్లక్రుమ్మరుచున్నాడు. పుట్టువుతోడనే మునిప్రకాండుడైపఱిగిన శుకదేవుడు ఆజలధిని తనహస్తముతో ముమ్మారుమాత్రమేతాకినాడు. అంతటినుండియే పసిపాపవలె ఆనందమగ్నుడై దొరలాడు చున్నాడు. జగద్గురు ప్రకాండుడగు మహాదేవుడు మూడు చేరలు జలముంద్రావినంతనే పరమానందమున చ్రొక్కి స్థాణువై కదలమెదలలేకున్నాడు. ఇక ఈమహాసాగరము యొక్కలోతు కొలుచుటకుగాని, దానిమహిమను గణితము వేయుటకుగాని ఎవరికి సాధ్యపడగలదు ? 58. దూరమునుండిచూచుచో సముద్రజలము వినీలమై కాన్పించును. కాని ఒక్కింతనీటిని చేతిలోనికితీసుకొని చూచితిమా, ఏరంగునులేక స్వచ్ఛముగనుండును. అటులనే దూరమునుండి చూచువారికి శ్రీకృష్ణభగవానుడు నల్లనివాడై చూపట్టును; కాని అతడట్టివాడుకాడు. అతడు నికులుడు, ఏవర్ణములేనివాడు, నిరామయుడు సుడీ!

59. భగవానుడిట్లనును:- కాటువేయుపామును నేనే; విషమును తొలగించు మాంత్రికుడను నేనే; శిక్షలవిధించు దండనాధికారిని నేనే; ఆదండనలనెఱపి బాధించుకింకరుడను నేనే;"

60. బ్రహ్మస్వరూపభావన యెట్లుండును? అది మాటలచే వివరింపశక్యముకానిది. ఎన్నడు సముద్రమునుచూచియుండనివానికి దానిని అభివర్ణించిచెప్పుమని ఎవనినైన అడిగినచో "అదా! విశాలమగునీటిప్రదేశము; నీటిమయమగు పెద్దతావు! అదెటుచూచినను నీరే! అనుచుమాత్రమే వచింపజాలును."

61. మానవులు నోటితో పల్మరుపఠించుటచేతను, వారినోటినుండి వెలువడుచుండుటచేతను, వేదములను, తంత్ర శాస్త్రములును, పురాణములును, ఇంక ప్రపంచములోని మతగ్రంధములన్నియు ఉచ్చిష్టములేయైపోయినవి. కాని బ్రహ్మముమాత్రము అటులయెంగిలిపడలేదు. ఏలన ఇంతవరకేనరుడును తనవాక్కుచేత వానినివర్ణింపజాలడయ్యె. 62. నాటకశాలయందు ఒకడే వేర్వేరువేషములను తాల్చుచుండుతీరున, ఈవిశ్వములో భగవంతుడు భిన్నభిన్న స్వరూపములను తాల్చును. మఱియు ఒకేవేషమును అనేకులు వేయువడువున అనేకజంతువులు నరాకృతిని గూడధరింపవచ్చును. అవన్నియు నరులరూపమున కాన్పించుచున్నను, కొన్ని చీల్చిచెండాడు తోడేళ్లు; కొన్ని భయంకరములగు భల్లూకములు; మఱికొన్ని జిత్తులమారి నక్కలు; ఇంకను కొన్నివిషసర్పములు అయివుంటున్నవి.

63. అలజగజ్జననిని మనమందఱము చూడలేకుండుటేల? ఆమె తెఱచాటునుండి వ్యవహారమునంతనునడుపు గొప్పయింటి యిల్లాలువంటిది. అందఱిని తానుచూచుచుండును, గాని ఎవరును ఆమెనుచూడవీలులేదు. భక్తులగు ఆమె కొమరులుమాత్రము "మాయ" యను ఆ తెఱనుదాటిపోయి ఆమెదర్శనముచేయవచ్చును.

64. పోలీసువాడు తనదొంగలాంతరువెలుతురు ఎవరిమీద పడనిచ్చిన వారినెల్లచూడగలడు; కాని అతడావెలుగును తనపైకిత్రిప్పుకొన నంతవఱకును వానినిఎవరునుచూడజాలరు. అటులనే భగవంతుడందఱిని చూచుచునేయుండును, కాని తనంతటతాను ప్రత్యక్షమగునంతవరకును ఎవరును భగవంతుని చూడజాలరు.

65. ప్రతివస్తువును నారాయణుడేయని భగవానుడు సెలవిచ్చెడివాడు, నరుడు నారాయణుడే, పశువునారాయణుడే, ఋషినారాయణుడే, పాతకియునారాయణుడే, ఇంతేల కలవెల్ల నారాయణస్వరూపమే, ఒక్క నారాయణుడే అనేకవేషములతో లీలలు సలుపుచుండును. సమస్తపదార్థములును వానిభిన్నభిన్నస్వరూపములే, వాని దివ్యమహిమను ప్రకటించునవియే.

66. భగవంతుడు ఈస్థూలశరీరమున ఎట్లువసించును? చిమ్మురు గొట్టములోని (Syringe) పుడకవలె అతడీ శరీరమున నుండును కాని అతడీశరీరమునకు అంటుకొనియుండడు.

67. ఒక్కెడ భగవానుడిట్లు వచించినాడు:- దండలోని పూవులు నాకక్కఱలేదు; ఆపూవులుగ్రుచ్చినదారము నాకు కావలెను. ఈజగత్తులో వస్తుజాలమేదియు నాకక్కఱలేదు; ఈవిశ్వమునంతను బంతిగకూర్చి పట్టినదారమన దగు ఆసూత్రాత్మ నాకుచిక్కినచాలును.

68. వానిపేరు చిన్మయుడు, వానినివాసముచిత్తు, ఆతడుప్రభువు విశ్వజ్ఞమూర్తి.

69. గురూపదేశములచేత ప్రబోధముగాంచినవాడై శ్రీరామచంద్రుడు ప్రపంచమును త్యజింపనెంచెను. తండ్రియగు దశరధమహారాజు వశిష్టునిబంపి వానికి సద్బోధకావింపుడనెను. శ్రీరామునివైరాగ్యము ఆవేశించియున్నదని వశిష్టుడు గ్రహించి "ఓరామా! ముందు నాతోడవాదింపుము; ఆపిమ్మట ప్రపంచమును త్యాగముచేయుము. ప్రపంచము బ్రహ్మమునకు భిన్నముగ వేఱైయున్నదా? చెప్పుము, అటులైనచో నీవు దానిని నిశ్శంకముగా విడిచివేయవచ్చును" అనిపలికెను. శ్రీరామచంద్రుడంతట ఆవాక్కులఅర్ధమునుగూర్చితలపోసినవాడై, ఒక్కబ్రహ్మమే జీవుడుగాను జగత్తుగాను, ప్రత్యక్షమగుచుండెనని గ్రహించినాడు. ఆబ్రహ్మమునందేగదా సర్వమునకునుఉనికి! కావున శ్రీరాముడు మిన్నకుండవలసివచ్చెను.

70. సరియైన వివేకము రెండుతెరగులనుండును:- మొదటిది పృధక్కరణరూపము. రెండవది సమీకరణరూపము. మొదటిది మనసు దృశ్యజగమునుండి బ్రహ్మముకడకు నడపును. రెండవదానిని అనుసరించితిమా, అఖండ పరబ్రహ్మమే విశ్వముగా గోచరించుటను తెలియుదుము.

71. దేవుడే దొంగవానినిపోయి దొంగతనము చేయుమని ప్రేరేపించును, మఱియు ఆదొంగను పట్టుకొనుమని గృహస్థుని హెచ్చరించునదియు ఆతడే. ఆతడే సర్వమునకును కర్త! (ఏరూపముదాల్చు శక్తికైనను మూలము ఈశ్వర చైతన్యమే)

72. సాధకుడు తనభక్తిసాధనయందొకదశలో భగవంతుని సాకారునిగ భావనచేసి సంతసించును! మఱియు వేఱొక దశయందు వానిని నిరాకారునిగజూచి తృప్తుడగును.

73. కొన్నిసమయములందు నేనువస్త్రముల ధరించియుండి, మఱికొన్నివేళలందు దిగంబరుడనుగా నుండుతీరున బ్రహ్మము ఒక్కొక్కప్పుడు సగుణుడుగను, ఒక్కొక్కప్పుడు నిర్గుణుడుగనుకాన్పించును. సగుణబ్రహ్మమనగా శక్తితో కూడియున్నబ్రహ్మము. వానినప్పుడు "ఈశ్వరుడు" అందురు. 74. సాకారుడగుబ్రహ్మము మనకండ్లకు గోచరముకాగలడు. ఇంతేల వానినితాకగలము; మనప్రియమిత్రునితోడఎట్లో అట్లేముఖాముఖినివానితో ముచ్చటించవచ్చును.

75. పండుయొక్కగుజ్జు, పీచు, టెంక, అన్నియుఒకేవృక్షబీజమునుండికలుగునటుల, చేతనమును, జడమును, ఆధ్యాత్మకమును, భౌతికమును అగుసృష్టిసర్వమును ఒకేబ్రహ్మము నుండి ఉద్భవమగుచున్నది.

76. గురువుశిష్యునికి బోధలుచేయుసందర్భమున రెండువ్రేళ్లను ఎత్తిచూపెను. బ్రహ్మము మాయ అను ద్వంద్వభావమును ఆతఁడు అట్లుసూచించెను. తరువాత ఒకవ్రేలినిముడిచివేసి, మాయ తొలగిపోయినప్పుడు ఈవిశ్వమేమియు మిగులక ఒక్క అఖండబ్రహ్మమేయుండునని భోదసలిపెను.

77. ఒకడు కల్పవృక్షముక్రిందకూర్చుండి, తానురాజగుగాక! అనికోరుకొనెను. - తక్షణమే అతడురాజైనాడు. ఉత్తరక్షణమున నాకొకమనోహరిణియగు సుందరాంగి భార్య అగుగాక అని సంకల్పించెను. ఆహా! అట్టియువతివాని చెంత ప్రత్యక్షమైనది! ఇంకను అతడాచెట్టుయొక్క మహిమను శోధించబూని ఒకపులివచ్చినన్ను మ్రింగుగాకయని అనుకొనెను. అయ్యో! ఆఘడియయందే అతడొక పెద్దపులికోరలఁజిక్కి యుండెను. భగవంతుడే ఆకల్పవృక్షము. ఆయనసమ్ముఖమునఎవరేని "ఓదేవా! నాకేమియులేదు కదా!" అనుకొనినయడల నిజముగావానికి అన్నియుకొఱ వడును; కాని “స్వామీ! నీవునాకు సర్వమునుఅనుగ్రహించియున్నావు" అని ఎవడనునో వానికిఏకొఱతయునుండదు.

78. భగవంతునిలో తన్మయతనుపొందుపట్ల మితిమీరునేమో యని అనుభయముండదు. మాణిక్యముయొక్క కాంతులు వెలుగునొసగి హాయినికూర్చునేగాని దహించవుసుడీ!

79. భగవానుడు ఒకానొకనితో యిటులనెను! "సరే! నీవీజీవితమున శ్రేష్టమైనభాగమునంతను సంసారమునందువ్యయముచేసి, తుదకుభగవంతుని వెదకికొనుచువచ్చినావు; భగవంతునే ముందుగ సాక్షాత్కారముచేసికొని, సంసారమున నీవు ప్రవేశించియుండినయెడల, ఆహా! ఎట్టిశాంతి ఎట్టిఆనందము నీకులభించియుండునోగదా!

80. పూరీజగన్నాధాలయములోనికి ఒకబైరాగివెళ్లినాడు. భగవంతుడు సాకారుడా, నిరాకారుడా అనివానికి సందేహముతోచినది.

అచ్చటి దేవతావిగ్రహమును చూచుపట్ల ఆవిషయమును పరీక్షింపనెంచెను. విగ్రహముకొఱకై తడవిచూచుచు తనచేతికఱ్ఱను ఎడమవైపునుండి కుడివైపునకు నడపెను. కొంతసేపు వానికేమియు కాన్పించలేదు. వాని కఱ్ఱకును ఏమియు తాకలేదు. కావున భగవంతునికి ఆకారములేదని వాడునిర్ణయించెను. ఆతడాచేతికఱ్ఱను కుడివైపునుండి యెడమవైపునకు త్రిప్పబోగా అది విగ్రహమునకుతాకినది! కాబట్టి ఆబైరాగి భగవంతుడుసాకారుడును నిరాకారుడునుకూడనై యున్నాడని నిశ్చయింపగలిగెను. 81. మనకుభగవత్సాక్షాత్కారము అయినగాని మనముయీ అంశమునంతను అనుభవమునకు దెచ్చుకొనజాలము. తనయందు భక్తినుంచువారికొఱకై భగవంతుఁడు పలురీతులుగను, భిన్నభిన్నముగను, ఆకారములనుతాల్చి ప్రత్యక్షమగుచుండును.

బట్టలకుఅద్దకమువేయుటలో ఒకవిచిత్రపద్ధతిని అవలంబించిన రంగులపనివాడుండెను. అద్దకముకొఱకై వానిదాపునకుఎవరైనవచ్చినతోడనే, "నీబట్టకేమిరంగువేయుట నీకిష్టము?" అనిఅడిగేవాడు. ఆ వచ్చినవాడు "ఎరుపు" అనునెడల, అతడాగుడ్డను తనతొట్టెలోముంచియెత్తి "ఇదిగోనీబట్టకు ఎర్రరంగువేసితిని" అనెడివాడు. ఇంకొకడు, తనగుడ్డకు పసుపురంగునుకోరును. ఆపనివాడు దానినిగూడ అదేతొట్టిలోముంచును. దానినివెలుపలికి తీయగా అది పసుపురంగుతోనుండెడిది. అదేతీరున ఇంకొకడు వేఱురంగునుకోరుకొనునెడలను, నీలము, ఊదా, పచ్చన, మున్నగురంగులకును అదేతొట్టెను ఉపయోగించెడివాడు.

ఇదంతయుకనిపెట్టి చూచుచున్నవాడొకడు "మిత్రమా నాకేరంగునందును అభిమానములేదు. నీకు దేనియందాదరమో విచారింపకోరెదను. నీయిష్టము ననుసరించి నాబట్టకు రంగువేయించుకొందును. నీకై యేరంగువేసికొందువో ఆరంగే నాకుకావలయును." అనెను. ఇటులనే భగవంతుడు సాకారుడైగాని, నిరాకారుడైగాని భక్తుని అవసరమునుబట్టి దర్శనము నిచ్చుచుండును. అటులప్రత్యక్షమైనదర్శనము సాపేక్షిక ధర్మముననుసరించి సత్యమగును; అనగా వేర్వేఱు దశలలోను, వేర్వేఱు క్షేత్రములలోను ఉండుజనుల అనుకూలతనుబట్టి పఱగును. తానేరంగువేసికొనునో ఆదివ్యచిత్రకారునకే తెలియవలెను. ప్రకటితమగు స్వరూపములుగాని, నిరాకారత గాని వానిని బాధింపజాలవుసుడీ!

82. ఈవిశ్వలీల యెవనిదో అతడునిత్యుడు. మఱియు నిత్యుడై వెలయునతడెవ్వడో వానిదే యీలీలయును! ఈలీల ననువర్తించియే ఆనిత్యుని నీవు కనుగొనవలయును. మఱియు ఆనిత్యుని ఆధారముతోడనే నీవు ఈలీలను దరిచేరగలవు. కాన ఈలీల మిథ్యకాదు. దృశ్యక్షేత్రమున గోచరించు నిత్యుని ప్రదర్శనమేయిది:-

83. (ఇంద్రియములతోగూడిగాని, వానినిదాటిన జ్ఞప్తితోగూడిగాని భావక్షేత్రమందు) నీవొకపురుషుడవై యున్నంతకాలము, నీవునిరామయమని వచించునది సాపేక్షికరూపమేయగును, నీవు నిత్యమనునది , లీలను సూచించుచునే యుండును, నీవుకేవల ద్రవ్యమనునది గుణముల స్ఫురింపజేయుచునే యుండును, నీవునిర్గుణమనునది సగుణమును అపేక్షించుచునేయుండును, నీవు ఏకమనునది అనేకత్వమును స్మరణకు తెచ్చుచునేయుండును, తప్పదు.

84. నీవు ద్వైతభావముతో నున్నంతకాలమును, వెన్నను, మజ్జిగను అంగీకరింపవలసినవాడవేఅగుదువు. సాకారబ్రహ్మ మును విశ్వమునుగూడ అంగీకరింపవలసినదే. ఉపమానమును వివరించిచెప్పునెడల మొదటపాలవంటిది సమాధియందు అపరోక్షానుభూతిచే తెలియబడు బ్రహ్మము; వెన్నవంటిది సగుణనిర్గుణబ్రహ్మము; మజ్జిగవంటిది ఇరువదినాలుగు తత్వములతో గూడిన జగత్తుఅగును.

85. యధార్ధము విచారించుచో బ్రహ్మమునకును శక్తికినిగల వ్యత్యాసము భేదములేనివ్యత్యాసము! బ్రహ్మమును శక్తియు ఒక్కటే; ఆభేధము ! అగ్నియు దహనశక్తియు ఏకమైనట్లేఉండును, పాలును పాలతెల్లదనమును ఒక్కటే అయినవిధమున బ్రహ్మమును శక్తియు అభేదమే. మణియు మణియొక్క కాంతియు ఏకమైనవడువున బ్రహ్మమును శక్తియు అభిన్నము - వానిలో ఒకటినివిడిచి రెండవదానిని ఊహాచేయుటయే పొసగదు. వానిని భిన్నముగ భావన చేయనేలేము.

86. భిన్నభిన్నములగు వృత్తి కేంద్రములందు ఐక్యతగాక బిన్నతయే ధర్మముగాన శక్తి భిన్నరూపములదాల్చి ప్రకటిత మగుచుండును. బ్రహ్మము సకలభూతములందును అంతర్యామియైయున్నాడు. చిన్నచీమయందును కలడు. భిన్నత్వమంతయు ప్రకాశమునందుమాత్రమే కలదు.

87. అనేకమై గోచరించు ఏకైకవ్యక్తినాజగజ్జననియే. ఆమె అనంతశక్తిమంతురాలు కావున, కాయికములు, మానసికములు, నైతికములు, పారమార్థికములు అగు నానావిధ శక్తులుగల జీవజగత్తులుగా ఆమెగోచరింపగలదు. వేదాం తులు బ్రహ్మమని వ్యవహరించునది ఆ నాదివ్యజవనియే, వేఱుగాదు. నిర్గుణబ్రహ్మముయొక్క సగుణభావమూర్తియే ఆమె.

88. నాదివ్యమాత ఏకమును అనేకమును అనియు, ఏకానేకమునకు అతీతమును అనియు ఏఱుంగుదురుగాక!.

89. వృత్తిరహితబ్రహ్మమును, వృత్తిసహితశక్తియు యధార్ధమునకొక్కటే, సచ్చిదానందరూపుడగు బ్రహ్మమేసర్వధారిణియు, సర్వజ్ఞయు, సర్వమంగళరూపిణియు అగుజగజ్జనని! స్వయంప్రకాశియగుమణియు దానిప్రకాశమును ఒక్కటియేగదా! ఏలనన! ప్రకాశమునువిడిచి మణిగాని, మణినివిడిచిదాని ప్రకాశమునుగాని నీవుభావనచేయనేలేవు.

90. ఎచ్చటసృష్టిస్థితిలయములను కర్మయుండునో అచ్చటశక్తి అనగాచిచ్ఛక్తియుండును. చంచలించుచున్నను,నిశ్చలముగనున్నను, నీరునీరేగదా! ఆఏకైకసచ్చిదానందబ్రహ్మమే, విశ్వసృష్టిస్థితిలయములగావించు నిత్యచిచ్ఛక్తి. ఎట్లనగా ఈప్రధాని[1] ఒకప్పుడు కదలకకూర్చుండును. ఒకప్పుడు అర్చనలుచేయుచుండును. ఇంకొకప్పుడు పనిమీదరాజప్రతినిధిని చూడబోవును. ఇన్ని సందర్భములందును యుండునది ఆఒక్కప్రధానియే; ఆసందర్భములన్నియు అతడు ధరించు వేర్వేఱుఉపాధులనవచ్చును. 91. బ్రహ్మము శుభాశుభములచే లిప్తుడుగాడు. అతడు లాంతరునందలి దీపమువంటివాడు: ఆలాంతరుదీపముతో నీవుభగవద్గీతను చదువుకొనవచ్చును. దానివెలుగుసాయముననే దుష్టబుద్ధినె నీవొకకపటపుపత్రమును సృష్టిచేయవచ్చును.

మఱియు బ్రహ్మము పామువంటివాడు. పామునకు కోఱలందువిషమున్న నేమి? ఆపామునకు దానివలన హానిలేదు. ఆవిషముదానినిచంపదు. దానికాటునుపడసెనేని యితరజంతువులకు మాత్రమే అదిప్రాణాంతకమగును. అదేతీరున జగత్తున మనకుగోచరించు దుఃఖము, పాపము, ఇట్టికీడేదైనను మననుమాత్రమే బాధించును. బ్రహ్మము వీనియన్నిటికిని అతీతముగానుండును.

జగమునందలి యీమేలు, కీడు, బ్రహ్మమునకు అట్టివిగ నుండజాలవు. మానవులు శుభాశుభములను కొనుభావములను బ్రహ్మమున కనువర్తింపజేసి వానియోగ్యతను గణనచేయదగదు.

92. పరమాత్మను సృష్టిస్థితిలయకర్మములులేని నిష్క్రియునిగా భావనచేసినప్పుడు బ్రహ్మము లేక పురుషుడు అని పేర్కొందును. వానినే సృష్టిస్థితిలయకర్మల జేయుచు కర్మతంత్రుడై యున్నటుల భావనచేయునప్పుడు శక్తి, మాయ, ప్రకృతి అని పేర్కొందును.

93. నాలో "అహం" అనునది ఉన్నంతవరకును, జీవజగత్తులవంటి తనప్రభావరూపజాలము ద్వారమున ప్రత్యక్షమగుచు సగుణబ్రహ్మముకూడ నాయెదుటనుండును సుడీ! 94. సమాధియందు పరిపూర్ణమును సాక్షాత్కారముచేసికొనినవారికిసయితము, ఇంద్రియ జ్ఞానక్షేత్రమునకు దిగివచ్చునప్పుడు సగుణబ్రహ్మమును గుర్తింపగలంత"అహం"కారము మిగిలియుండును. సప్తస్వరములలో "ని"అను స్వరమునందే సదా కంఠధ్వనిని నిలుపుట దుస్సాధ్యము కాదా? కావున సగుణమె గతమును అవసరమే.

95. "నావాదమే సరియైనది, విమర్శనకు నిలుచునది. సుస్థిరమైనది. సగుణదైవతమును విశ్వసించువారు పొఱబడువారు" అని అద్వైతి అనతగదు. బ్రహ్మముయొక్క సగుణరూపముల సత్యత ఎంతమాత్రమును తీసిపోవునది కాదు. ఈదేహముకన్నను మనస్సుకన్నను ఈదృశ్యప్రపంచకముకన్నను ఆసగుణరూపములు ఏన్నియోరెట్లు సత్యములే సుడీ!

96. బ్రహ్మమునిరాకారుడని భావనచేయుటమంచిదే. కాని ఆభావనమాత్రమే సమంజసమనియు, తదితరమంతయు దోషభూయిష్టమనియుమాత్రము తలంపబోకుము. బ్రహ్మమును ఆకారములతో గూడినవానిగభావించి ధ్యానముచేయుటయు, తుల్యముగసమంజసమే. అయినను నీవు భగవంతునిచూచి అపరోక్షానుభూతి పడయువఱకును నీవిశిష్టభావననే నిలుపుకొనియుండుము. ఆపిమ్మట సర్వమును తెలిసిపోవును.

97. అవ్యయనిర్గుణబ్రహ్మము సమాధియందుమాత్రమే గోచరించును. అప్పుడు అంతయు మౌనముదాల్చియుండును. జీవజగ ద్భ్రాంతులగూర్చియు, భ్రాంతిరాహిత్యముంగూర్చియు, జ్ఞానాజ్ఞానములగూర్చియు ప్రసంగములన్నియు, శూన్యములగును. కేవలసత్తామాత్రము నిలుచును. మఱేమియు నుండదు. ఉప్పుబొమ్మ సముద్రమున ఐక్యతనుపొందిన పిమ్మట ఇంకేమితెలుపును? బ్రహ్మజ్ఞానమనగాయిట్టిది!

98. సమాధిస్థితినుండి ఇంద్రియక్షేత్రమునకు దిగివచ్చినవానికి తనదివ్యచక్షువునుమాత్రము, నిలుపుకొనగలంత అహంకారము, వెడల్పులేని సన్ననిరేఖామాత్రముగ మిగులును. ఈదివ్యచక్షువు వానిని జీవజగత్తులను, ఈసమస్తరూపములుగ వ్యక్తమౌ ఎకైకసదార్ధమగు తనను చూచుకొన శక్తునిజేయును. జడసమాధియందు అనగా నిర్వికల్ప సమాధియందు నిరాకారనిర్గుణబ్రహ్మమును, మఱియు చేతనసమాధియందు అనగా సవికల్పసమాధియందు సాకార సగుణబ్రహ్మమును సాక్షాత్కారము చేసికొనినవానికి ఈభవ్యదర్శనము లభ్యముకాగలదు. నీవ్యక్తిత్వముతో గూడిన అహంకారముగలిగి నీవొకపురుషుడవైయున్నంతకాలమును, భగవంతుని ఒకపురుషునిగాతప్ప వేఱుగ నీవు భావన చేయజాలవు; ఊహింపజాలవు; సాక్షాత్కారము పడయజాలవు. అంతవరకును నిర్గుణబ్రహ్మము నీకు-భాహ్యాంతరంగములందు - మూర్తివంతుడై సగుణరూపమున ప్రత్యక్షముకాక తీరదు. ఈసగుణరూపములు సత్యతయందు కొఱవడినవికావు. ఈశరీరముకంటెను, మనస్సు కంటెను, బాహ్యజగముకంటెను అనంతాంశములుగా యధార్థములు.

99. సాకారబ్రహ్మదర్శనము తఱచుగా పారమార్ధికరూపమున నుండును. వినిర్మలనరహృదయమునకు మాత్రమే గోచరించును. అనగా ఈరూపములు ఈశ్వరుడు ప్రసాదించు భగవతీతనువునకు సంబంధించిన జ్ఞానేంద్రియములకు మాత్రమే గోచరించును. కావున సిద్ధపురుషుడు మాత్రమే వీనిని చూడగలుగును.

100. నీవు అద్వైతమునుగూర్చిమాట్లాడిన తోడ్తోడనే, ద్వైతమును ప్రతిపాదించినవాడవగుచున్నావు. అఖండమును గూర్చి ప్రస్తాపించునప్పుడు ఖండమును అంగీకరించినవాడవే అగుచున్నావు. సమాధియందు నీవు పరిపూర్ణమును దర్శించువఱకునునీవు "పరిపూర్ణము" అనునదివ్యర్ధవాక్కు కాకపోయినను సాపేక్షికరూపమైనను అగును. దానిని ఉన్నదున్నట్లు నీవువర్ణింపలేవు. అటుల వర్ణనచేయు ప్రయత్నమునందే నీవ్యక్తిసంబంధమగు రంగునొకదానిని, దానియందు లేనిదానిని, దానికంటించినవాడవగుచున్నావు.

101 బ్రహ్మము జ్ఞానాజ్ఞానములకును, శుభాశుభములకును, ధర్మాధర్మములకును, ఇంతేల ద్వంద్వములన్నింటికిని అతీతముగనుండును.

102. ముందు భగవత్సాక్షాత్కారము, పిమ్మట వానిసృష్టిజ్ఞానము! వాల్మీకికి రామమంత్రము నేర్పునప్పుడు దానిని తలక్రిందుచేసి 'మరామరా" అని నేర్పవలసివచ్చెను. "మ" అనగా ఈశ్వరుడు;"ర" అనగాజగత్తు అనిఅర్ధము, ముందు భగవంతుడు; పిమ్మట జగత్తు!

103. నిర్గుణబ్రహ్మమును సగుణబ్రహ్మమును ఒక్కటే, బేదము లేదు. ఒకదానియందలి విశ్వాసము కుదిరిన, రెండవదాని యందలి విశ్వాసము కుదిరినట్లే. కాల్చుశక్తిని కాదని నిప్పునుగూర్చి ఊహింపజాలము. నిప్పును స్మరింపకుండ కాల్చుశక్తిని భావనచేయజాలము. ఇట్లే సూర్యునివిడిచి వానికిరణములను, వానికిరణములనువిడిచి సూర్యునిభావన చేయజాలము. పాలను విడిచి పాలతెల్లదనమును, పాల తెల్లదనమునువిడిచిపాలను ఊహచేయజాలము. అదేవిధముగా సగుణుడగుభగవంతుని భావనలేకుండ నిర్గుణబ్రహ్మమునుగాని, నిర్గుణముయొక్క సంపర్కములేకుండ సగుణబ్రహ్మమునుగాని భావనచేయుట అసంభవము.

104. ఇది సంవృత వివృతధర్మము. పరబ్రహ్మము దిశకు మరలి పోదువా వానిలో నీవ్యక్తిత్వము లయమగును. ఇది సమాధి! ఆపిమ్మట ఈభావమునుండిమరలి, నీవెచ్చట నుండి బయలుదేరితివో, అచ్చటికి వచ్చితివా, నీవును ఈ జగత్తుగూడ ఆ పరబ్రహ్మమునుండియే వివృతమైవచ్చినట్లును, ఈశ్వరుడు, జీవుడు, జగత్తుఅభేదమేఅనియు, అందువలన వీనిలో దేనినిసాక్షాత్కారముచేసికొనినను తక్కిన రెంటిని దర్శించినట్లేఅనియు తెలియవచ్చును.

105. అనంతజలరాశి యున్నట్లూహచేయుము. పైననీరు, క్రిందనీరు, అన్నిదిశలందును నీరే వున్నదనుకొనుము. కొన్ని స్థలములందు శీతలముచేత నీరుగడ్డకట్టి మరల వేడికి కఱగి నీరగును. బ్రహ్మమే యీఅనంతజలరాశి. మంచుగడ్డగా గట్టిపడినభాగములు ఆ బ్రహ్మముయొక్క పారమార్ధికసాకార రూపములు. భక్తునిఅనురక్తి శ్రద్ధ ఆత్మార్పణము అనునవియే శీతలము. మఱియు "నేను, నేను" అనుచుండెడు అహంకారము రూపుమాసిపోవు నిర్వికల్పసమాధిని చేకూర్చుజ్ఞానవిచారమే ఉష్ణము.

106. భక్తునకు భగవంతుడు అనేకరూపములతో ప్రత్యక్షమగును కాని, సమాధియందు బ్రహ్మజ్ఞానాగ్రముంజేరువానికి నిరాకారమై, నిరంజనమై, ఆతడు తిరిగినిర్గుణబ్రహ్మముగ సిద్ధమగును. భక్తిజ్ఞానముల కిటుల సామరస్యము అమరుచున్నది.

107. నిప్పునకు ప్రత్యేకరూపములేదు; జ్వలించుచున్న బొగ్గులందు అది వివిధరూపముల తాల్చుచున్నది. అప్పుడునిరాకారమగుఅగ్ని సాకారిఅగుచున్నది. అటులనే నిరాకారబ్రహ్మము ప్రత్యేక రూపములను వహించుచుండును.



  1. (కలకత్తాలో నేపాలప్రభుత్వమువారి ప్రతినిధిగానుండిన విశ్వనాధోపాధ్యయులవారిని పరమహంసులవారు ప్రధాని అనెడివారు.)