శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/4వ అధ్యాయము

4వ అధ్యాయము.

భగవదవతారములు.

127. మహాసముద్రమునందు అలలెటువంటివో, బ్రహ్మమునందు (శ్రీరామకృష్ణాది) అవతారములు అటువంటివి.

128. సచ్చిదానందమహావృక్షమున, రాములు, కృష్ణులు, బుద్ధులు, క్రీస్తులు, మున్నగువార లనేకులు గుత్తులుగుత్తులుగా వ్రేలాడుచుందురు. వీనిలోనుండి అప్పుడప్పుడు ఒకరో ఇద్దరో ఈలోకమునకు దిగివచ్చి మహాపరివర్తనములను విప్లవములను నడుపుచుందురు.

129. భగవాన్‌రామచంద్రుడు ఈలోకమున అవతరించినప్పుడు ఏడుగురుఋషులుమాత్రమే వానిని భగవదవతారమని తెలియగలిగిరి. అటులనే భగవంతుడీలోకమున అవతరించునప్పుడు ఏకొలదిమందిమాత్రమో వానిదివ్యత్వమును గ్రహింపగల్గుదురు.

130. దీపముతనచుట్టునుండువస్తువులను, ప్రకాశింపజేయుచుండగా ఎల్లప్పుడును ఆదీపముక్రిందమాత్రము నీడయుండనే యుండును. అట్లే ప్రవక్తలకు అత్యంతసమీపవాసులై మెలగువారు వారినిపాటింపరు. దూరమునున్నవారే ఆమహాత్ముల ప్రకాశమును అద్భుతమహిమను ఆకర్షించి ఆశ్చర్యపడుచుందురు.

131. వెలుపలికికాన్పించుకోఱలు, లోపలనుండుదంతములు అని ఏనుగుపండ్లు రెండురకములుగానుండును. ఆతీరుననే శ్రీకృ ష్ణాదిఅవతారపురుషులస్వరూపములు ద్వివిధములుగానుండును. అందఱికిని తెలియవచ్చు సామాన్యమానవులనుబోలుబాహ్య ప్రకాశరూపము ఒకటి. సర్వకర్మాతీతమై, ఆంతరంగిక పరమశాంతితోడనొప్పు ఆత్మరూపము మఱొకటియుండును.

132. అవతారమనునది ఎల్లెడలను ఒక్కటియే; భేదములేదు. జీవసాగరమునందు ఏకోనారాయణుడు ఒకతావున కృష్ణరూపమున పైకితేలి కాన్పించును. మఱలముణిగి వేఱొక తావున క్రీస్తురూపమున తేలిప్రత్యక్షమగును.

133. సాధారణఋతువులయందు నూతులలోనినీరు చాల లోతుననుండి కష్టముమీదగాని చిక్కదు. వానకాలమునందు దేశమంతయు వఱదలుపాఱునప్పుడు ఎక్కడపట్టిన అక్కడ నీరులభించును. అటులనే సాధారణముగ భగవంతుఁడు, జపతపవ్రతములను ఎన్నిటినోచేసినగాని, ప్రత్యక్షము కాడు. కాని, అవతారమనెడివఱద భూలోకమునునిండినప్పుడు భగవంతుడు ఎల్లెడలదర్శనీయుడగును.

134. "ఈశరీరమును తాల్చుటలో నేనుగావించిన త్యాగమును, నేనుభరించు లోకభారమును ఎవరు తెలియజాలుదురు?" అని భగవాన్‌శ్రీరామకృష్ణపరమహంసులవారు పలికిరి. భగవంతుడు భౌతికశరీరమును తాల్చునప్పుడు ఎంతటిత్యాగము చేసియుండునో ఎవనికిని గ్రాహ్యముకాదు.

135. ఒకస్థలముచుట్టును చాలఎత్తగుగోడయున్నది. వెలుపలివారికి అదెటువంటితావోతెలియదు. ఒకతడవ నలుగురు మనుష్యులు నిచ్చనవేసికొని గోడనెక్కిలోపలనేమియుండునో తెలుసుకొనకోరిరి. మొదటివాడు గోడపైకిచేరగానే "ఆహా! ఆహాహా!!" అనుచునవ్వి, లోనికిదుమికినాడు. రెండవవాడును పైకెక్కగానే పకపకనవ్వి లోపలికిదుమికినాడు. మూడవవాడుసయితము అటులనేచేసినాడు. చివరవాడగు నాల్గవమనుష్యుడు గోడపైకియెక్కినప్పుడు వానికందు రకరకములగు మధురపలములతోనిండిన మనోహరములగు పండ్లచెట్ల తోపులు కానవచ్చినవి.

తక్షణమే లోనికిదుమికి వానిని ఆరగించి ఆనందానుభవమునుపొందుటకు గాఢమగుకోర్కెపుట్టినది. కాని అతడా కౌతుకమును చిక్కబట్టి నిచ్చెనమీదుగాక్రిందికి దిగివచ్చి, తాగాంచినవనసౌభాగ్యమును అందలివృత్తాంతములను అభివర్ణించి యితరులకు భోధింపసాగెను. ఈగోడచే మూయగట్టబడిన తోటవంటివాడు బ్రహ్మము. వానిని పొడగాంచినవారెల్ల పరవశముపొంది, వానిలో లీనమగుతమకముతో తటాలున ఆబ్రహ్మమునందు దుముకుదురు. మహాసిద్ధులును, మౌనివర్యులును, అటువంటివారు. కొందఱు బ్రహ్మమును ప్రత్యక్షముచేసుకొనియు తమ అపరోక్షాను భూతిని ఇతరులకుపంచియిచ్చు కుతూహలముకలవారగుదురు. నిర్వాణసుఖమునుపొందు తమఅవకాశమును త్యాగముచేతురు. సంసారసాగరమునబడి కొట్టుకొనుచుగతికానకయున్న మానవజాతికి పరమపదవింగూర్చిన బోధలుచేసి దారిజూపుకొరకై యీప్రపంచమున అవతారములు దాల్చుదురు. అట్టిమహాభారమును వహించువారే జగదుద్ధారకులగు మహానుభావులు.

136. అవతారమనగా నరరూపముదాల్చివచ్చిన భగవంతునిసందేశహరుడు! మహాచక్రవర్తియొక్క రాజప్రతినిధివంటివాడు. దూరమున ఏరాష్ట్రమునందైనను అల్లరులు జరుగునెడల చక్రవర్తి తనప్రతినిధిని పంపును. అధేవిధమున, ప్రపంచమున ఏభాగమునందైనను ధర్మహానిజరుగునెడల అధర్మమును ఉద్ధరించి పెంపొందజేయుటకై తనఅవతారమును భగవంతుడుపంపును.

137. కుప్పలుగపడియున్న మన్నును, చెత్తను, తొలగించి, యుగములకొలదిగవాడుకలేక పూడికపడియున్న ప్రాతనూతినిబయలుపఱుచు పురాణవస్తుశోధకునితో సిద్ధపురుషుని పోల్పదగును. అవతారమో పూర్వమెన్నడును నీరుదొఱకి యుండనితావున క్రొత్తగా బావినిత్రవ్వునుమహాశిల్పివంటివాడు; సిద్ధపురుషుడు మోక్షజలమునకు దాపుననున్న వారికి మాత్రమే మోక్షమునొసగజాలును; అవతారమో ఎవని హృదయము బొత్తుగ భక్తిజలమన్నమాటలేక యెడారివలె ఎండబారియున్నదో అటువంటివానికిని మోక్షజలమును ప్రసాదింపగలడు.

138. పెద్దపొగయోడ నీటిపైని కడువేగముతోపోవుచు చిన్నచిన్న నావలను, పడవలను, అనేకమును తనతోడతీసుకొని పోగలదు. ఆతీరుననే అవతారపురుషుడు వచ్చునప్పుడు అతఁడు వేలకొలదిప్రజలను మాయాసముద్రమును తాను దాటించి మోక్షాశయమున సులభముగజేర్చగల్గును.

139. సముద్రముపొంగినప్పుడు ఆనీరు నదులను ప్రవాహములను పూరించి దాపునగలప్రదేశములనెల్ల జలమయముచేసివైచును; వాననీరో మామూలుకాలువలంబడి మాత్రము ప్రవహించును. అవతారమువచ్చునప్పుడు వానికృపకు పాత్రులైనవారెల్లరును ముక్తినిపొందుదురు. సిద్ధులు ఎంతయోకష్టపడి తపములు, జపములుజేయువారికి మాత్రమే త్రోవజూపి రక్షింపగల్గుదురు.

140. పెద్దమ్రానొకటి ప్రవాహమున బోవునప్పుడు అది ఎన్నివందలపక్షులనో తనపైమోసికొనిపోగల్గును. అది మునుగదు. రెల్లుపుల్లయో ఒక్కకాకియెక్కినచాలును, మునిగిపోవును. అటులనే అవతారపురుషుడువచ్చినప్పుడు వానిని ఆశ్రయించి అనేకులు ముక్తికాంచగలరు. సిద్ధపురుషుని ఆశ్రయించి కొలదిమందిమాత్రమే ఎంతెంతయోకష్టపడినమీదట తరింతురు.

141. రైలుయింజనుతానువేగముగబోయిగమ్యస్థానమును చేరుటేగాక సరకుబండ్లనెన్నింటినో తనతోడలాగికొని పోగల్గుచున్నది. అటువంటి ఇంజనునుబోలువారు అవతారపురుషులు. పాపభారముచే క్రుంగియున్న అనేకులను తోడ్కొనిపోయి భగవత్సాన్నిధ్యమునచేర్చగల్గుదురు;

142. మహాత్ములు తమవారిచేత మన్ననలను పడయజాలకుండుటకు కారణమేమిటి? గారడీవానిబందుగులు వాని చిత్రములజూచుటకై చుట్టునుమూగరు; ఇతరులన్ననో నోరులుతెరచుకొని వానిచిత్రములను విడ్డూర్యముతో చూచుచుందురు కాదా!!

143. బూరుగప్రత్తిచెట్టు విత్తనాలు దానిక్రిందపడవు. అవి చాలాదూరము గాలిలోకొట్టుకొనిపోయి యెక్కడనో నాటుకొనును. అటులనే మహాత్మునిబోధలు వానిస్వస్థానమునగాక చాలాదూరమున ప్రకాశించును. దూరపువారు వానిని గౌరవింతురు.

144. అవతారపురుషునకు చిక్కుదోచు సమస్యలేదు. మహాదుర్జ్ఞేయమును క్లిష్టమునగు జీవితసమస్యలు సయితము ప్రపంచములోని సర్వసామాన్యవిషయములంత సులభముగ వానికి తోచును. తేట తెల్లముగనుండు అతనిబోధలు పసిపిల్లలకును సులభగ్రాహ్యములుగనుండును. యుగయుగాంతములనుండి పేరుకొనియున్న అజ్ఞానాంధకారమునైనను తృటిలో పాఱద్రోలు దివ్యతేజముతో ప్రపూర్ణుడైన సూర్యుడే అతఁడు.

145. చంద్రార్కజ్యోతియననగు విచిత్రమిక్రకాంతి ఒక్కొకప్పుడు ప్రత్యక్షమగును. భక్తిచిహ్నములు, జ్ఞానచిహ్నములు, ఉభయములును ప్రస్ఫుటముగగల చైతన్యదేవునివంటి అవతారములు అట్టివి. ఒకేసారిగా సూర్యుడు, చంద్రుడును ఏకమై ఆకసమున చూపట్టినట్టులుండును. ప్రకృతిలోయిట్టి సంఘటము అత్యంతము అపూర్వమగునటులభక్తిజ్ఞానములు రెండునుగూడి ఒక్కపురుషునందు మూర్తీభవించుటమిగుల నరుదు.

146. సీతారాములు, రాధాకృష్ణులు అనువారి కథలు కేవలము నీతిని బోధించుటకై కల్పనచేసిన కధలనియు, వారుచారిత్రకపురుషులుకారనియు, అంతరార్ధగూఢార్ధములను నేర్పుటకే పురాణేతిహాసములు యేర్పడినవనియు తలంపకుడు. మీరును నేనునుయెట్లో అట్లేవారును నరశరీరధారులే. వారుదివ్యాంశసంభూతులుగాన చారిత్రకముగను, నైతికముగనుగూడ వారిచరిత్రలు ఉపకరింపగలవు. మహాసాగరమున అలలెటువంటివో, బ్రహ్మమునఅవతారములటువంటివేసుడీ!

147. ఉత్సవాదులలో కాల్చుచిచ్చుబుడ్లలో పూలచిచ్చుబుడ్డియనునది యుండును. దానికినిప్పుఅంటించినప్పుడు కొంతవఱకు ఒకవిధమైన పువ్వులను, మఱికొంతవఱకు యింకొక తీరుపువ్వులను, ఆపిమ్మట వేరొకరకపుపువ్వులను యెగురచిమ్మును. దానిగర్భమున అనంతభేదములుగల పూలరాసులున్నవాయనునట్లు తోచును. అట్లేఅవతారములుండును. మఱియు యింకనొకరీతి చిచ్చుబుడ్డికలదు. అదికాల్చినప్పుడు కొంచెముకాలి తుస్సుననెగిరిపోవును. ఈతీరునసామాన్యజీవులుచిరకాలము జపతప ధ్యానసాధనలసలిపి సమాధిని ప్రవేశించిమరలిరారు.

148. అవతారములతోగూడి జననముగాంచువారు నిత్య ముక్త జీవులైగాని, లేకతుదిజన్మను పొందినవారుగగాని యుందురు. 149. భగవంతుఁడు పరిపూర్ణుడనుట నిజము. మఱియు ఆయన సర్వశక్తివంతుడునైయున్నాడు. ఆయన తనదివ్యమహిమను కరుణరూపమున స్థూలశరీరముదాల్చి ఈశ్వరావతారముగ మనకడకు దిగివచ్చునటుల శాసింపగలడు. అంతట యాఈశ్వరావతారమునుండి కరుణవెల్లువలైప్రవహించి మనల నావరించును. ఈవిషయమును మాటలతో సంపూర్ణముగ వివరించి స్పష్టపఱచుట సాధ్యముకానిపని. ఆధ్యాత్మదృష్టితో చూచి అనుభవింపదగిన యధార్ధమిది! దీనినిగూర్చి సంశయ నివారణ కావలయుననువారు భగవంతుని చూడవలసినదే. నాదృశ్యములచేత ఈఅంశమును లీలగామాత్రమే సూచన చేయగలము. ఒకడు ఆవుయొక్క కొమ్మునో, పాదములనో తోకనోలేకపొదుగునో తాకునుఅనిఅనుకొనుడు. అటులచేయుట యాఆవునే తాకుటయందుముగదా? మనుష్యులమగు మనకు పాలుస్రవించు పొదుగు ఆవునందు ప్రధానముగతోచవచ్చును. కావున ఈశ్వరకృపయనుక్షీరము భగవదవతారమునుండి మనకు లభించును అనెదము.

150. భగవంతునిగూర్చి పూర్ణముగ ఎవడు యెఱుంగజాలును? వానిని సంపూర్ణముగ తెలిసికొనుట మనకుశక్యము కాదు. అటులతెలిసికొను నిర్భంధమునులేదు. వానినిచూచిన చాలును. ఆతడుమాత్రమే సత్యముఅను అనుభవజ్ఞానమును పొందినజాలును.

151. ఒకడు శ్రీగంగానదికివచ్చి దాని నీటిని తాకుననుకొనుడు. అతడు "నేను గోముఖినుండి గంగాసాగరమువఱకును గల (ఉత్పత్తిస్థానమునుండి సముద్రమున గలియు తావువఱకును అని అర్ధము.) పావన గంగానదిని దర్శించి స్పర్శించితిని" అని చెప్పునుగదా?

152. నీవు భగవంతునికొఱకై వెదుకచూచెదవా? అటులైనచో వానిని నరునియందు వెదకుము! భగవంతుని దివ్యస్వరూపము తక్కినవస్తువులందుకన్న నరునియందు హెచ్చుగ మనకు ప్రకటనమగుచుండును. ఏనరుని హృదయమున భగవత్ప్రేమ నిండి వెల్లువయై ప్రవహించుచుండునో, ఎవడు భవంతునందు వసింపుచు, చరింపుచు, ఉనికిగాంచుచుండునో, ఎవడు భగవద్భక్తితో స్రొక్కిపోవుచుండునో అటువంటివానికొఱకై ఎల్లెడల వెదకుము. అట్టిమనుజునందు భగవంతుడు నీకు ప్రత్యక్షముకాగలడు.

153. ఆతడు అవ్యయుడు, మఱియు యతడే లీలారూపుడును. ఈలీల నాల్గురకములుగనుండును:- ఈశ్వరలీల, దేవలీల, జగల్లీల, నరలీల.[1]

నరలీలయందు భగవదవతారము సంఘటిలగలదు. ఈనరలీల స్వభావము నీకు తెలియునా? పెద్దమేడమీదినుండి యొకతూముగుండ కడువేగమున నీరు ప్రవహించుటను దానికి పోల్చవచ్చును. ఆకాలువగుండా అల సచ్చిదానందబ్రహ్మము యొక్క మహాశక్తియే ప్రవహించుచు ప్రకటన మగుచున్నదనవచ్చును. ఎల్లఱును అవతారముల గుర్తింపజాలరు. భరద్వాజప్రముఖులు ఏడ్గురుమహాఋషులుమాత్రమే శ్రీరాముని అవతారముగా గ్రహింపగల్గిరి. నారాయణుడు నరునికి స్వచ్ఛమగు జ్ఞానమును భక్తిని నేర్పుటకొఱకై మానవరూపమును ధరించి అవతరించును.




  1. భగవద్భావన నాలుగుతెఱగులు:- ఒకటి ఈశ్వరభావన; అనగా ఈ జగమునకు అధినాధుడు. రెండవది దేవతలరూపము; వీరు జగధీశ్వరుని ప్రతినిధులుగనుండి జగద్వ్యాపారముల నడుపుదురు. మూడవరూపము జగత్తే. నాలుగవది నరరూపము.