శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/1వ అధ్యాయము

శ్రీరస్తు.

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావలి

1వ అధ్యాయము.

ఆత్మజ్ఞానము

1. జ్ఞానము ఏకత్వమునకు దారిజూపును; అజ్ఞానము భిన్నత్వమునకు త్రోవజూపును.

2. కుబుసమును, పామునువేఱైనట్లు శరీరమును ఆత్మయును వేఱు.

3. పాదరసము (కళాయి) వేసిన అద్దమునందు మనముఖము ప్రతిబింబించి స్పష్టముగ గోచరించుతీరున , బ్రహ్మచర్యమువలన తనబలమును, పవిత్రతను సంరక్షించుకొనిన, నరుని హృదయమునందు సర్వేశ్వరుని ప్రతిబింబము దివ్యముగ గోచరించును.

4. గురువనియు, శిష్యుడనియు, ఇట్టి సంబంధమును పాటింపజాలని పవిత్రావస్థ విచిత్రమైనది. దేనిని సిద్ధింపజేసికొనిన పిమ్మట గురుశిష్య భేదము నిలువజాలదో అట్టిబ్రహ్మజ్ఞానము విచిత్రమైనది సుమీ !

5. దొంగవాడు చీకటిగదిలో ప్రవేశించి అచ్చటి వస్తువులను తడవి చూచును. బహుశః ఒకబల్లపై చేతినిడును. 'ఇది కాదు ' అని ముందుకుపోవును పిమ్మట ఇంకొక వస్తువు మీద చేయివేయును, అది కుర్చీకావచ్చును. అంతట 'ఇదికాదు' అని దాటిపోవును. ఇట్లొకదానితరువాత రొకటిగా ఆయావస్తువులను విడిచివేయుచు పోయి, తుదకు ధనపు పెట్టెను తాకగల్గును. వెంటనే ఇదిగో! ఇదే! అనుకొనును. అంతట వాని తడవులాట ముగియును. బ్రహ్మము కొఱకగు అన్వేషణము సరిగ యిటులనే జరుగును.

6. నిన్ను నీవు తెలిసికొంటివా, అంతట అహంకారమునకు భిన్నముగనుండు సర్వేశ్వరుని నీవెఱుంగ జాలుదవు. నా ఆత్మయేది? నాఆత్మ అనగా నాచేయియా, నాపాదమా, మాంసకండరమా, రక్తమా, స్నాయువులా, గాఢముగ విచారణ సలుపుము. 'అహం' అనదగిన వస్తువేలేదని నీకు తెలియవచ్చును. ఉల్లిపాయపొఱలను వలిచిన కొలదిని పొఱలు వచ్చుచునేయుండును. తుదకు లోపల గుజ్జేమియు కాన్పింపదు. అదేతీరున 'అహం' అను దానిని పృథక్కరణము చేయుచు పోగాపోగా 'నేను' అని చెప్పదగిన స్థిరపదార్థము ఏదియు కాన్పింపదు. ఇట్లు ;అహం' అనగనేమో పరిశోధన చేయుచుపోగా అట్టిది యేదియులేక సర్వాధార వస్తువు భగవంతుడు మాత్రమే కలడని తెలియవచ్చును. జీవత్వము తొలగునప్పుడు శివత్వము ప్రాప్తించును.

7. కేవల జ్ఞానము అన్నను కేవలభక్తి యన్నన్ను ఒక్కటియే; భేదములేదు.

8. మనలోనున్న మూలాహంకారమును జయించుటెట్లు? పువ్వులోని పిందె పెద్దదయినప్పుడు పూరెబ్బలు వాటి యంతట అవియేరాలిపోవును. అటువలెనే నీలోని శివత్వము వికశించినప్పుడు, నరజీవసామాన్యములగు క్షుద్రభావములు వానియంతట అవియె తొలగిపోవును.

9. శ్రీపరమహంసులవారు తమ హృదయమువంక జూపుచు యిట్లు అనెడివారు; "ఇక్కడ దేవుడున్నాడనువానికి అక్కడను (అనగా బాహ్యప్రపంచమునను) దేవుడున్నట్టే. తనలోపలదేవుని కాంచలేనివానికి వానివెలుపలను దేవుడు కాన్పించడు. తన జీవాత్మయనెడు దేవాలయము నందు దేవుని చూడగలవానికి విశ్వమను దేవాలయము నందును దేవుడు కాన్పించును.

10. నరశరీరము కుండవంటిది; ; మనస్సు, బుద్ధి ఇంద్రియములు, అనునవి దానిలో నిండిననీరు, బియ్యము, ఆలుగడ్డల వంటివి. నీరు, బియ్యుము, ఆలుగడ్డలు గల కుండను పొయ్యిమీద పెట్టినప్పుడు, ఈపదార్ధము లన్నియు వేడెక్కును. ఆ ఉష్ణము యనునది ఆకుండ, నీరు, బియ్యము, ఆలుదుంప అనువానిలో దేనికినిచెందినది కాకపోయినను వానిని తాకినంతనే చేయి కాలునుగదా. అదేవిధముగా మసస్సు, బుద్ధి, ఇంద్రియములు అనునవి తమ తమ పనులు చేయుటకు ఆధారమగునది బ్రహ్మముయొక్క శక్తియే. ఆశక్తితొలగునా ఇవన్నియు పనిచేయుట మానును.

11. పరమాద్వైత జ్ఞానమును జేబులో పెట్టుకొని నీయిష్టము వచ్చినట్లు వర్తింపుము, అప్పుడు నీలోనుండి కీడేమియు వెలువడనే వెలువడదు. 12. ఈ కలియుగములో జ్ఞానయోగము అత్యంత దుర్లభము. ఏలయన? మొట్టమొదట ఈయుగములో మనము అన్నముపై నాధారపడి యున్నాము. (అన్నగత ప్రాణులమై యున్నాము.)

రెండవది: ఈయుగములో నరుని జీవితకాలము జ్ఞానసాధనకు ఎంతమాత్రము చాలదు.

మూడవది; ఈయుగములో మనలనంటుకొనియున్న దేహాత్మబుద్ధిని[1] వదలిచుకొనుట దుస్సాధ్యము.

జ్ఞాని ప్రాపింపవలశిన పర్యవసాన మిట్లుండును. "నేను శరీరమునుకాను. అవ్యయమై నిరామయమై పఱగువిశ్వాత్మను నేను. నేను శరమునుకాను, కావున శరీరబాధలగు ఆకలి, దప్పి, పుట్టువు, చావు, రోగము మున్నగునవి నన్ను బాధింపజాలవు” అను నిశ్చయ జ్ఞానమే పరమ ప్రాప్యము.

దేహబాధలకు లోనైయుండియు నేను జ్ఞానినని చెప్పుకొనునతడు యెట్టివాడనగా, ముండ్లు గ్రుచ్చుకొని చేయి చీరుకొనిపోయి నెత్తురుకారుచుండగా మితిమీరిన బాధ ననుభవింపుచును "చూడుడు! నాచేయి చీరుకొనిపోలేదు శుభ్రముగానున్నది" అని పలుకునాతని వంటివాడు. .

ఇట్టి కబురులు పనికిరావు. అముండ్లన్నియు మొట్టమొదట జ్ఞానాగ్ని చేత భస్మమైపోవలయును సుడీ! 13. స్వభావముచేతను అంతరభేదముచేతను జ్ఞానము భిన్నభిన్నముగ నుండును. సామాన్యప్రజలగు సంసారుల జ్ఞానము ఒకటి. ఇది అంతగా తీక్ష్ణమైనదిగాదు. దీనిని గదిలోపల నుంచబడిన దీపమునకు పోల్చవచ్చును. దీనిప్రకాశము గదిలోపల మాత్రమేయుండును. ఇంతకంటె ప్రకాశవంతమగు భక్తుని జ్ఞానమును వెన్నెలకు పోల్చవచ్చును. దీని వలన గదిలోని వస్తువులును వెలుపలివస్తువులును ప్రకాశింప గలవు. అవతారపురుషుని జ్ఞానమో ఇంకను తీక్ష్ణతరమై, సూర్యరశ్మికి పోల్చదగియుండును. అట్టివాడు యుగ యుగములనుండి పేరుకొనియున్న అజ్ఞానాంధకారమును క్షణములో రూపుమాపుదివ్యజ్ఞానమనెడు కాంతిని ప్రసరింపజేయునట్టి సూర్యభగవానుడే అనవలయును.

14. ఎవనికేని ముల్లు గ్రుచ్చుకొనినప్పుడు, అత డింకొక ముల్లుతెచ్చి, దానితో మొదటిముల్లును పైకితీసి, రెంటిని పాఱవేయును. అటులనే జీవుని నేత్రమును కప్పివేయు లౌకికాజ్ఞానముతోడనే తొలగించవలయును . అట్టి అజ్ఞానమును , జ్ఞానముగూడఅవిద్యామయములే సుడీ! కావున బ్రహ్మజ్ఞాని తాను ద్వైతభావ రహితుడగుటచేత, ఆఅజ్ఞానమును, జ్ఞానమును సయితము త్యజించివేయును.

15. జ్ఞానమును గూర్చిన అత్యుత్తమ భావనయేమి ? - జ్ఞాని యిట్లనును; "భగవంతుడా ! ఈజగత్తున నీవొక్కడవే కర్తవు. నేను నీచేతిలోని స్వల్పఉపకరణమాత్రమను. మఱియు నాదేదియు లేదు. సర్వమును నీయదియే. నేను జీవాత్మ, పరమాత్మాకారమున కెగిరిపోయి సమాధియందు లయముగాంచును.

26. అహంకారము నశించినప్పుడు జీవుడు సమసిపోవును. అంతటసమాధియందు బ్రహ్మసాక్షాత్కారము కలుగును. అప్పుడు బ్రహ్మానుభూతినిపొందునది, బ్రహ్మమే గాని జీవుడుకాదు.

27. ఒక్కటిని తెలిసికొంటివా నీకు అన్నియు తెలిసిపోవును. ఒక్కటికితరువాత సున్నలనుజేర్చినప్పుడు వందలు, వేలుఅనువిలువయేర్పడుచున్నది. కానిఆఒక్కటిని కొట్టివేశితివా ఏమియుమిగులదు. ఆఒక్కటియుండుటచేతనే అనేకమునకు విలువయేర్పడుచున్నది. ఒకటి మొదలు అనంతరము అనేకము. దేవుడుమొదలు, జీవుడు జగత్తు తదనంతరము!

28. నాకేమి కనబడునో తెలియునా? భగవంతుడే సర్వము నైనట్లు కాన్పించును. నరుడుగాని, యితరజంతువులుగాని తలలఊచుచు కాలుచేతులనుఆడించుచునుండు తోలుగప్పినబొమ్మలలాగు కాన్పించును. భగవంతుడే వానిలోపల నుండునది.

29. ఒక్కసారి నాకొక దృశ్యము కానవచ్చినది. ఒకేద్రవ్యము విశ్వరూపమునుధరించి సర్వజీవరాసులతోనిండి కాన్పించినది. మనుష్యులు, పశువులు, తోటలు, రోడ్డులు మున్నగునవి అన్నిటితో కూడియున్న మైనపు భవనమును బోలిచూపట్టినది. అన్నియు మైనముతో నిర్మాణమైనవే, సర్వమును మైనమే !

30. సత్తును గ్రహించవలయుననిన చిత్తును ఆశ్రయింపుము.

31. "లీల" ద్వారమున "నిత్యపదార్థమును" తెలియ బ్రయత్నింపుము.

32. "ప్రపంచము వట్టిబూటకము" అనుట తేలికయే; కాని దాని అర్ధమే మో తెలియునా? కర్పూరమును వెలిగించినప్పుడు యేమియు మిగులుకుండుటవంటిది. కట్టెను గాల్చగా బూడిద మిగులుట వంటిదికూడకాదు. సదసద్విచారము ముగిసిన పిమ్మటనే సమాధి స్థితిలభించును. అప్పుడు నేను నీవు జగత్తు అనువాని గుర్తించుటేయెంతమాత్రమును పొసగదు.

33. భగవంతుడు బాహ్యమున ఎక్కడనో దూరముగ కాన్పించునంతవరకును అజ్ఞానమున్నట్లే. ఆభగవంతుడు లోపల సాక్షాత్కరించినప్పుడు అది సత్యజ్ఞానమగును.

34. ఒక్కడు అర్ధరాత్రముననిద్రలేచి చుట్టత్రాగకోరెను. వానికి దీపముకావలసివచ్చినది. కావున పొరుగుననున్న యింటికిపోయి తలుపుతట్టినాడు. ఒకరు తలుపుతీసి వాని కేమికావలెనని అడిగిరి. "నేను పొగత్రాగవలెను. కొంచెము దీపము నిచ్చెదవా?" అని అతడన్నాడు. అందుకా పొరుగువాడు "అబ్బా! నీకేమి మతిపోయెనా? నీవింత శ్రమపడివచ్చి యిట్టివేళమమ్ము నిద్రలేపితివే! అటుల వెలుగుచు నీచేతిలోనే లాంతరున్నదికదా! అనెను. అటులనే నరునకుకావలసినది వానిలో నుండనేయున్నది. అయినను దానికొఱకై వెతకులాడుచు అతడు ఇందందు తిరుగులాడుచున్నాడు.

35. మలినమనస్సు బ్రహ్మమునుదర్శింపజాలదనుట ---------యము. కాని శుద్ధమనస్సు అనగా నిర్మలబుద్ధి. అనగా బంధరహితాత్మ బ్రహ్మసాక్షాత్కారమును పడయగలదు. వాసనాత్మకబుద్ధి, అనగా పరిమేయమై బంధముగలిగి వికాసరహితమగు మనస్సు ఇంద్రియలోలత గలదిగాన, అనగా కామినీకాంచనవాంఛలచేత యీడ్వబడునదగుటవలన బ్రహ్మమును ఎఱుగజాలదు. ఈమనస్సు సుసాధనచేత పవిత్రమంతమై ఇంద్రియలాలనను బాపుకొనగలదు; ప్రాపంచికవాసనలను, ఈప్సితములను, బంధములను, తొలగించుకొని అఖండాత్మతోడ నైక్యమును పొందవచ్చును. పూర్వపు మహాఋషులు భగవత్సాక్షాత్కారమును పొందినది ఈవిధముననేకదా! అఖండాత్మ స్వరూపియగు భగవంతుని నిష్కలంకమగు మనస్సుతో వారు చూడగలిగిరి. ఆ నిష్కళంకమగు మనస్సునే అఖండాత్మ స్వరూపముగా తెలిసికొనగలిగిరి!

36. ప్రశ్న:- అఖండాత్మ తాను భిన్నభావమునుపొంది, ప్రత్యగాత్మగా భావించుకొను బ్రాంతియెటులజనించినది?

సమాధానము:- కేవలము తర్కముపైని ఆధారపడు అద్వైతవాది "నేనెఱుగను" అని సమాధానముచె ప్పును. అపరోక్షానుభూతివలన లభించుసమాధానమొక్కటే తుదిపర్యవసానము కాగలదు.

"నే నెఱుగుదును" నేనెఱుగను" అనుచున్నంతవఱకును నీవొక పురుషుడవై యున్నటుల భావనచేయుచుందువు. అట్టిదశయం దున్నంతవఱకును, ఈభిన్నత్వమును యదార్ధమనియే నీవు అంగీకరింపవలయునేకాని ఇది భ్రాంతియన తగదు. వ్యక్తిత్వము తొలగిపోయినప్పుడు, సమాధిదశ యందు అఖండబ్రహ్మమును గూర్చినజ్ఞానము నీకు అలవడును.

అప్పుడుమాత్రమే భ్రాంతియా? భ్రాంతికాదా? యధార్థమా? యధార్థముకాదా? అను నిట్టి సమస్యలన్నియు సమసిపోజాలును.

37. ఆత్మ దేనిచేతను అంటబడునదికాదు. కష్టము, సుఖము, పుణ్యము, పాపము అనునవి ఆత్మను అంటజాలవు. కాని దేహమే తాననుకొనువానికి మాత్రము ఇవిఅంటుకొనును. పొగ గోడనే మలినముగావించగలదుగాని అందుండు ఆకాశమును మలినము చేయజాలదు.

38. జ్ఞానముగూర్చియు నిత్యానందముగూర్చియు ధ్యానము సల్పుడు; మీకును ఆనందములభించును; ఆనందము నిజముగా నిత్యమైనది దానిని అజ్ఞానము మూతవేసి కప్పిపుచ్చుచున్నది. ఇంద్రియములబంధము నీశుతగ్గిన కొలదిని, భగవద్భక్తి నీయందు ప్రవర్ధనము గాంచుచుండును. 39. రాధ శ్రీకృష్ణుని సమీపించినకొలదిని, వాని దివ్యదేహమునుండి వెలువడు సౌరభముచేత హెచ్చుగ ఆకర్షింపబడెనీది. ఒకడు భగవంతుని సమీపించినకొలదిని వాని భగవద్భక్తియు హెచ్చుచుండును. నది సముద్రమును సమీపించినకొలదిని దానియందలి ఆటుపోటు హెచ్చు చుండునుగదా!

40. జ్ఞానిహృదయమునప్రవహించుచుండు "ప్రజ్ఞానగంగ" ఒకే దిశగా ప్రవహించుచుండును. వానికి సర్వజగత్తును స్వప్నమైతోచును. అతడు సదా తనఆత్మయందే వసించును. కాని భక్తుని హృదయమందలి "భక్తిగంగ"యో సదా ఒకేదిశగా ప్రవహించునదిగాదు. దీనియందు ఆటుపోటులును కలవు. భక్తుడు ఒకప్పుడు నవ్వును, ఒకప్పుడు ఏడ్చును, ఒకప్పుడు నాట్యముసలుపును. మఱొకప్పుడు సంగీతములు పాడును. భక్తుడు భగవత్సాన్నిధ్యసుఖమును అనుభవింపకోరును. తనప్రియునియందు లగ్నమైపోవ నభిలషింపడు. నీటిలోనిమంచుగడ్డతీరున అతడు భగవంతునిలో బడి యీదులాడుననవచ్చును. ఒక్కొక్కప్పుడు ముణుగును మఱికప్పుడు పైకితేలియాడును.

41. ఆనందము, అనగా ఆంతరంగిక పరిపూర్ణశాంతియే. భగవత్సాక్షాత్కారము కలిగినందుకు తార్కాణమగును. సముద్రమున పైభాగమునమాత్రమే అలలు సంచలనము గావించుచుండును. కాని అడుగుభాగమునందు నీరంతయు నిశ్చలముగ నుండును. 42. ప్రశ్న:-జ్ఞానాజ్ఞానరూపములు రెండును త్యజించినపిమ్మట శేషించునదేమిటి?

సమాధానము:-అప్పుడు శేషించునది వేదములందు నిత్యశుద్ధబోధరూపముగా అభివర్ణింపబడిన అఖండబ్రహ్మము! (అదినిర్వికారము, నిష్కళంకము, శుద్ధచిత్స్వరూపమునై వెలుగును)

43. ప్రశ్న :- నేనెప్పుడు ముక్తుడనగుదును ?

జవాబు:---ఆ "నేను" అనునదిగతమైనప్పుడు.

“నేను” “నాది” అనుట అజ్ఞానము,

“నీవు” “నీది” అనుట సుజ్ఞానము.

44. మనస్సును, బుద్ధియు, మలినములై యున్నంతకాలమును బ్రాహ్మము వానికి చిక్కడు; అవివిమలములైనప్పుడు బ్రహ్మము వానికిసాక్షాత్కరించును. కామలోభములు చేరి మనస్సును మలినముగచేయును. హృద్గతమై అవిద్యరాజ్యము చేయుచుండునంతవఱకును మనస్సును బుద్ధియు శుద్ధమైనవి కాజాలవు. సాధారణముగా మనస్సు బుద్ధియు అనునవి పరస్పరము భిన్నములని చెప్పుటకలదు. కాని వినిర్మల దశయందు ఆరెండును ఒక్కటై చైతన్యమున కలసిపోవుచున్నవి. అప్పుడు చైతన్యరూపబ్రహ్మము చైతన్యమునకు ప్రత్యక్షమై కాన్పించును.

45. బ్రహ్మసాక్షాత్కారములు రెండు విధములు:--

జీవాత్మపరమాత్మలు ఏకమైపోవుట ఒకటి. బ్రహ్మమును వాని సగుణరూపముల ద్వారమునచూచుట రెండవది. మొదటిది జ్ఞానమనియు, రెండవది భక్తియనియు పేర్కొనబడును.

46. వేలకొలది వత్సరములనుండి గాఢాంధకారమయమైయున్నగదిలోనికి తేబడిన దీపము తత్‌క్షణమే దానిని వెలుగుతో నింపువిధమున, జ్ఞానజ్యోతి జీవాత్మకు ప్రకాశము నొసగి యుగాంతరములనుండి దానినావరించియున్న అజ్ఞానమును బాపును.




  1. నేను దేహమునే అనుభావమును.