శ్రీ దేవీ భాగవతము/ప్రథమస్కంధము

శ్రీరస్తు

శారదాంబాయై నమ:

శ్రీ దేవీ భాగవతము

కృత్యాది దేవతా స్మరణాదికము

-: కృతిపతి దేవతా స్మరణము :-

శా. శ్రీ గౌరీనయనాబ్జ కజ్జలమునన్ జిల్మారు నోష్ఠంబు గం
    గాగోత్రస్తనిమోవిపానకమునన్ క్షాలించి తద్దత్తరే
    ఖాగోపార్థము భూతిలిప్తతనుఁడై కన్పట్టుదాక్షిణ్యవి
    ద్యాగంభీరు మదిం దలంచెద సదా, యల్లూరి సోమేశ్వరున్.


——♦♦ గౌరీ ప్రార్థనము ♦♦——


సీ. నల్లమబ్బులచాయ • లల్లారు తలకట్టు | సన్నజాబిలి రేఖ • సరస కొరియ
    లలిత నితంబలీ లాకలాపంబుల | పై పయిం గురువింద పఙ్క్తి మెఱయ
    పాదాగ్రములజొత్తు పట్టెల నందంద | నఖరకాంతులు తందనాలు సలుప
    చందనాగరు సువాసన లీను తరులలోఁ | జిలుగారు పొగసోగ చెలువు గులుక

తే. భూరిమహిమ మహాదేవ భోగ్యమగుచు | దనరు కూటమ్ములు కృతార్థతను వహింప
    దండ్రిపోలిక నౌన్నత్య దశను బూను | కలికి గౌరమ్మ మాపాలఁ • గలుగు మమ్మ ||


——♦♦ శ్రీకృష్ణ ప్రార్థనము ♦♦——


చ. పొలుపగు నల్లకానుగుల • పుంతను యామునభూమి రాత్రులన్
    జెలువములీను గొండెసిగ • జెర్వినబర్హము గుల్కఁ గస్తురిన్
    జిలికిన గీరునామ మిడి • చీకటితప్పుల కొప్పురీతితో,
    జెలగి ప్రజాంగనాసుఖము • చెందిన కృష్ణుడు మమ్ము నేలుతన్ ||


——♦♦ మహా లక్ష్మీ ప్రార్ధనము ♦♦——


సీ. ఏమానినీరత్న • మెడవాయ దీనుని | ఱొమ్మునందును వీక్షణమ్మునంచు
   ఏసతీతిలకంబు • భాసిల్లె సహజయై | నాగంబునకు నిర్జరాగమునకు
   ఏవధూమణి జగద్దితయయ్యె దేవమ | తల్లియైయును గన్న తల్లియయ్యు
   ఏస్త్రీలలామం బ మృతవార్థి కుదయించె | శ్రీలతో శృంగార లీలతోడ

తే.గీ. ఏవిలాసిని సాపత్న్య మెన్నబడియె | ధాత్రిచేతను నీలాసుగాత్రిచేత
      నట్టి యఖిలాండకోటి వేధోండమాత ! కలిమిదేవత మాయింట • నిలుచుఁగాత |


———♦ బ్రహ్మ స్తవము ♦———


చ. కడుపును గద్దెయున్ సిరికిఁ • గోపురమై సిరి మాతృభావమున్
      బడయఁగ వాక్సతీమణి దివాణము మోమయి వాక్కు భార్యగా
      నడరఁగ లోకనాథ చతురాస్య మహాంకములంది దేవతా
      వళులకుఁ బెద్దగాఁ గులుకు • బ్రహ్మ చిరాయువు మా కొసంగుతన్ II


———♦ సరస్వతీ స్తవము ♦———


సీ. అనయంబుఁ దలవాకిలి నివాసముగ నిల్చి | యేవెలఁది వరసాహిత్య మెనసె
     సతతంబు గణవృత్తి • సామాన్యమై యొప్పి | యేకొమ్మ సత్యమం • దిఱవుకొనియె.
     నిరత సురాగ తాళరసప్రచారయై | యేచాన విద్యాసమేతయయ్యె
     నిత్యంబు వస్త్రభారత్యాగవిముఖయై | యేలలన పదార్థ • మూలయయ్యె

తే.గీ. సర్వదా నిఖిలవర్ణ సంసక్తయగుచు;
      సేపడంతుక శుద్ధవర్ణేద్ధయయ్య
      నట్టి యద్భుతచరిత య • య్యజునిగరిత |
      పలుకు దేవత నానోట , నిలుచుఁగాత ||


———♦ విఘ్నేశ్వర స్తుతి ♦———


చ. అలవడు నెద్దు సింగమును, నంచయు నేనుఁగు మేక దున్న రా
     చిలుకయు నెమ్మి వాహన విశేషము లౌటొకవింతగా దటం
     చెలుకహుమాయి వీపుపయి • నెక్కి సికారులు సేయునట్టి యం
     కిళులనబాబు నాదుకృతికిం దొలగించుత నంతరాయముల్ ॥


———♦ శ్రీవీరాంజనేయ స్తవము ♦———



సీ. పాథోధి సంసార • పాథోధితోఁగూడ | దరియించె నే వనే చరవరుండు
     రామాఖ్య లోకాభిరామాఖ్యతోఁ గూడ | గ్రహియించె నేమహా కవివరుండు
     రాగోద్యమము వీత రాగోద్యమముతోఁడ | నలరించె నేమహా ఫలభుజుండు
     అరివర్గవధ మదాద్యరివర్గవధతోఁడ | నొనరించె నేమహా • వినయశాలి

తే.గీ. నట్టి మహనీయు నక్షశిక్షాభిధేయు | సర్వదాజేయు విబుధవిచారణీయు
      భూరితత్వామరుద్రుమ • మూలనిలయు | నిత్యశుభకాయు వీరాంజనేయుఁ గొలుతు ||


———♦ ఇష్టకామేశ్వరీ స్తవము ♦———


చ. జలమును వేడి శంభునినిశాతశరంబున నుర్వినుండి వె
     ల్వడఁ గని దోయిలించి పదిలంబుగఁ దాఁ బదిమార్లు గ్రోల న

    
    గ్గడియన గౌరికిం గనులఁ • గల్గిన చల్లనితల్లి దేవతా
    తిలకము కామసుందరి సతీమణి మాయిలువేల్పు గొల్చెదన్ ||


———♦ వ్యా స మ హ ర్షి స్త వ ము ♦———



భ. ప్రణుతకళాప్రవీణుఁ దను భాసిత పావనభూతిరేణు ని
    ర్గుణపరతత్వబోధరసరూఢివిచక్షణుఁ గృష్ణచర్మధా
    రణుఁ గరుడాధురీణు గుణరత్న విభూషణు శత్రువర్గశి
    క్షణు భజియించెదన్ శ్రుతివిచారపరాయణు బాదరాయణున్.


———♦ కృ తి క ర్తృ జ న నీ జ న క స్మరణము♦———


ఉ. ఉల్లము రంజిలంగ దయ • లుట్టి పడంగ సమస్తభంగులన్
    బిల్లదనంబునందు ననుఁ • బెంచి కడున్ సుతవత్సలత్వమున్
    దెల్లముసేయు కామమ సతీమణిఁ గన్నయమంత్రిమౌళి నా
    తల్లిని తండ్రినిన్ హృదయ తామరసంబున నిల్పి కొల్చెదన్.


———♦కృ తి క ర్తృ కు మా రి కా స్మ ర ణ ము♦———


సీ. తనతొమ్మిదవయేట • ననుపమానప్రజ్ఞ | నింపుగా వీణ వాయింప నేర్చె
    తన పదియవయేట • సునిశితంబగు బుద్ది | దాకొల్పె నేకసంతగ్రహణము
    తన చతుర్దశశరత్తున ముద్దుముద్దుగా | నల్లిబిల్లిగఁ బద్య • మల్లనేర్చె
    తనదు పదార్వ వత్సరమున నగ్నజి | జ్ఞావివాహప్రబంధంబు సెప్పె

తే. తనదు పందొమ్మిదవవర్షముననె మర్త్య | భావమునుమాని శాశ్వత • బ్రహ్మలోక
    సిద్ధిగనే శారదాంబ నా • చిన్ని కూతు | ననుదినంబును మఱువక• యాత్మనుంతు.


———♦కృ తి క ర్తృ బం ధు స్మ ర ణ ము♦———


సీ. ఏవానితోఁ గూడి • యిసుక పై గురులఘు | ప్రస్తారపఙ్క్తులు • వ్రాసినాఁడ
    ఏవాని బిడ్డగా• నెంచి మాతలిదండ్రు | లంచిత ప్రేమ బోషించుకొనిరి
    ఏవాడు సాత్రాజి • తీవిలాసము సేయు | చున్న దోడయ్యె నా • పిన్ననాఁడు
    ఏవాడు ననుఁబిల్చి • యిదిచూడుముని గీత | గోవిందమును దెలుం•గున రచించె

తే. నతని సుమతుని నా మేనయత్తసుతుని | ఉప్పలూరిమహాన్వవా• యోత్థితుని మ
    హితుని సంతతపఠితసం • హితుని భీర | హితుని గనకాఖ్య కవిలోక హితుని దలతు


———♦పూ ర్వ క వి మ హి మా భి వ ర్ణ న ము♦———


సీ. పెనుపుట్టలోనుండి • జననమందిన నేమి | కోరి బిద్దెయటంచు • గొణగనేమి
    కుష్ఠరోగముతోడఁ • గూరుచుండిననేమి | మిండకాఁడని దూరు • లుండనేమి

      బేరాల పెద్దని • పేరుజెందిన నేమి | మినపగారెలు పెక్కు • మ్రింగనేమి
      భామామణుల కాట • పాటఁ జెప్పిననేమి | యలర గోవర్ధనుం • డైననేమి

తే.గీ. కానఁబడనేమి తిక్కనా • గంగలోన | ముణుగగా నేమి విసువక • పొలము దున్ని
     బ్రతుకఁగా నేమి జ్ఞానప్ర• భావలలిత | కలితకవిత బుధస్తోత్ర • కారణంబు.


———♦ ఆ ధు ని క క వి స్మ ర ణ ము ♦———


ఉ. ఇప్పటి పండితో త్తముల • నెందఱి నే గణియింపనేర్తు నీ
     చెప్పిన గ్రంథమంత మఱి • చెప్పినఁ జాలదు తద్గుణావళుల్
     కుప్పలు నానమస్కృతులు కోటులు వారి కొనర్చి యీకృతిన్
     దప్పులు గల్గునేని కని • తద్దయు ప్రేమ క్షమింపగోరెదఁన్

ఉ. ఈశ్వరభక్తి యుక్తుని క్షితీశ్వరమాన్యుఁ బరోపకారితా
     శాశ్వతకీ ర్తిఁ గామముఖ • శత్రువిజేత వివేకవర్ధనా
     ర్ధశ్వసనోపయోగమతి • రాయబహద్దరుకందుకూరి వీ
     రేశ్వరు మంత్రిపుంగవుఁ గవీంద్రు మదిం గొనియాడఁ జెల్లదే.


———♦ కు క వి వం ద న ము ♦———


సీ. అక్షరంబులరూపు • లవి మార్చెబోయంచు | పలువిధంబులఁ జాటి • పలుకుచుంద్రు
     రాయంచు నిక బండి • రాయంచు మ ఱుభయ | రాయంచు జగడాలు • సేయుచుంద్రు,
     సాధుత్వసంస్కార • సరణిఁ బ్రత్యేక మ | తావలంబులము మే • మనుచునుంద్రు
     శబ్దరత్నాకర • స్థములైన పదములే | పదములంచును సారె • పలుకుచుంద్రు

తే.గీ. వళులఁ బ్రాసంబులను గట్టి వార మేమ | యప్పకవి యొప్పఁడని చాల • జెప్పుకొంద్రు
      అర్థసందర్భము లెఱుంగ • కాడికొండ్రు | నలుసుగెలకు కవులకు దం•డంబులిడెద.

వ. అని యిట్లు శిష్టాచారసంప్రదాయానుసారినై నిరంతరక్షేమార్థినై యిష్టదేవతావందనం
     బాచరించి మఱియు


కృతి ప్రభావము



———♦ శ్రీ దేవీ స్తవము. ♦———


శా. శ్రీ దామోదరబాలు దుగ్ధనిధివీచీడోలికం జారుశో
    భాదీవ్యద్వటపత్రచిత్రపటమున్ • బైవైచి పండింపఁ దా
    బాదాబ్జంబు కరాబ్జమం దిడి ముఖాబ్జన్యస్తముం జేయ జో
    జో దూదూ యని చిచ్చిఁగొట్టెడి జగ • త్స్తోమాంబ సేవించెదన్.

చ. తన సగబాలు మే నయిన • దారను గిందును మీదు ప్రక్కలం
    దును మునువాకిటన్ వెనుక • దొడ్డిని లోపల బైల వెండియై
    పొనరు గృహంబు నెన్మిదగు • ధూతులు శ్రీదు ధనాధినాథు మే
    లనుఁగుఁ గపర్ది కిచ్చిన మ•హాంబకు నంజలిఁజేసి మ్రొక్కెదన్.

ఉ. పాలును నీరు వేరుపఱు • పంగల గుఱ్ఱము ధర్మపద్ధతిన్
    దాళిన నోరు మాట జవ • దాటనియాలును మేల్మిబొజ్జ ల
    క్ష్మీలలితాంగి యాడుకొను • మేడ సుఖాసన మై తలిర్పవా
    టీలలనేశు సత్యమున • నిల్పినతల్లి ప్రసన్న యయ్యెడున్.

ఉ. విశ్వమునెల్లఁ గ్రుమ్మరుచు • వేసట దప్పిగనంగఁ గాంచి యు
    క్షాశ్వుఁడు సాయకంబిడి ర•యంబున దీసిన నీరు గ్రోలి య
    య్యీశ్వరిగొన్న రూపముల • నీక్షణసంభవమైన యిష్టకా
    మేశ్వరి భక్తలోకముల • నేలు గృపామయమైన దృష్టితోన్.


———♦ సో మే శ్వ ర చ రి త ము ♦———


సీ. శాలివాహనశక • సంవత్సరంబులు | పదునాఱునూర్ల యెన్పదియు రెండు
    నగుపట్టి విక్రమ • హాయనంబునను వై | శాఘమాసంబున • జరుగు నొక్క
    నాడు దానుకులాక్కిరాడమాత్యుడు గృహ | నిర్మాణమునకయి • నిండు వేడ్క
    గోడపునాదికి • గోయి వెట్టింపంగ | నందులో మిలమిల • మనుచు మెఱుఁగు

తే.గీ. సూపెడి చతుర్దశాంగుళ • శోభమాన | నీలశిల యొండు గన్పట్ట • మేలటంచు
      గొని నిజాంగన సుబ్బమ్మ • కును నొసంగ | ఱుబ్బుఁ గల్లిది మంచిదం • చుబ్బిపొగడె.

క. దానిం గైకొని యచ్చటి | మానినులకుఁజూపి రాయి మంచి దటంచుఁన్
   దా నెత్తలేక సేవకుఁ | డైనట్టి తలారి వీరఁ • డను గొల్లనితోన్.

క. ఓరి వీరా నీ విపు | డీ రాయిం గొంచునేగి యింటికి వెనుకన్
   దారికడ గూటిలోపలఁ | జేరుపుమన వాఁ డు నట్లు • సేయుదు ననుచున్.

క. చనుచున్ నడుమను నుచ్చిళు | లను గ్రక్కుచుఁ బడినఁ గాంచి • లలనామణి గ్ర
   క్కునఁ బైత్యమూర్ఛ యనుకొని | చనుదెంచి వచించె నితర • జనములతోడన్.

ఉ. అంతట వాడు లేచి సివ • మాడుచు దేవుఁడనంచుఁ బల్మరున్
    గంతులు వైవ నందఱును • గన్గొని కారణ మారయంగ రా
    కింతులు రాయి నొక్కమొగి • నెత్తగ లేవకయున్న మాటికిన్
    గొంతుకలెత్తి స్వామి యిది • గో యిఁకలెమ్మనినంత లేచినన్.

క. దానిం గొని దేవార్చన | బోనేసరముకడ నుంచి • పోయిరి మఱునా
   డా నలినముఖికి సుబ్బమ | కూనెం దేహంబు దెలియ • కొకచోఁ బడియెన్.

ఆ.వె. స్వామిస్వామియనుచు • వేమారు | లుచ్చరించుటయకాని యొండు చొప్పెఱుఁగమిఁ
   జూచి భర్త యేమి • చోద్య మ్మటంచును | కరము వగచి యొక్క • కర్ణమరసి.

ఆ.వె. నీవు సామవేని • నీవేడనుంటివో | కన్నులకును నెదుటఁ గానఁబడిన
   సత్యమనుచు నమ్మి • సద్భక్తిఁ గొల్చెద | మనిన నట్లుకాక • యనుచు నవ్వి.

క. స్వామీ యేమీ పలుకవు | నామీదం గరుణలేదె నమ్మితి ననుచున్
   వామాక్షి పలుకగా శిల | గోమున నట్టింటి కపుడ • గొనగొన నడచెన్.

క. అది గని యచ్చటివారలు | మది నచ్చెరువంది యోయి మంత్రివరేణ్యా
   యిది దలపఁగ శివలింగము | వదలకుము ప్రతిష్ఠఁ జేయ • వలయుంజుమ్మీ.

ఉ. నావుఁడు నక్కిరాట్సచివనాథుఁడు తమ్మునిఁ గన్నయాఖ్యునిం
   గేవల రాజ్యకార్యపరు గీర్తిమయుం గని లింగసంప్రతి
   ష్ఠావిధి కియ్యగొల్పి విలసన్మతిఁ గమ్దనశోభనాద్రియన్
   భూవరు వేడి మాన్యమును బొంది ప్రతిష్ఠ యొనర్చె లింగమున్.

క. అల్లూరుపురవరంబున | నుల్లసితనివాసుడగుచు నున్న శివునకున్
   జెల్లు నుమదేవి యగు టని | యుల్లమునం దలచి యిడిరి • సోమేశాఖ్యన్.

వ. నా బాల్యంబున నాకు నానావిధ సౌఖ్యంబులకును వినోదంబులకు నాటపట్టై
   నన్నలరించిన యల్లూరగ్రహారంబు నభివర్ణించెద.

సీ. భాగ్యప్రకర్షంబు • భారతవర్షంబు | కలిమి తొయ్యలివీడు • తెలుఁగునాఁడు
    దస్తుముల్లెలదారు • ముస్తఫాన్సరుకారు | కోటీశ్వరులతల్లి కొండపల్లి
    సఫలకాండంబు కృష్ణానదీఖండంబు | కొలుచుకొట్టము విన్న • కోటసీమ
    ప్రాజ్యంబు కమదన • వారి సామ్రాజ్యంబు | క్షమ నెల్ల చేబడల్ • చారుమహలు

తే.గీ. దానధర్మముగలవారు దాసువారు | చేరిపాలింతు రల్లూరు • సిరికొఠారు
    అది నివాసంబునకు యోగ్య • మని తలంచె | సంగతసుకీర్తి సోమేశ • లింగమూర్తి.

సీ. గుంటయొడ్డున నొంటి • గూర్చుండి మాయూరి | కలుములు గన్నమ్మ • యలుగులమ్మ
    నిట్టత్రాడులలోన • నిలచి యెల్లరి క్షేమ | మరయుచుండెడియమ్మ యలుగులమ్మ
    తా శిలారూపంబు దాల్చి మరాటీహ | యా మెఱింగినయమ్మ • యలుగులమ్మ
    ఎండ వానలకోర్చి • యెల్లప్డు బయలులో | నణఁగియుండినయమ్మ • యలుగులమ్మ

తే.గీ. ఆలమందలఁగాపాడు • నలుగులమ్మ | చిలిపిరోగాలఁ దొలగించు నలుగులమ్మ
      గ్రామదేవతగా నొప్పు • కనకరాశి | పగిది నలరారు నల్లూరు • పల్లెటూరు.

సీ. ఎలయెండ చెట్ల సందులనుండి గోడల | దవిలి తా నిలువుటద్దములుగాఁగ
      గొనగొనజను నింద్రగోపసంఘాతంబు | పందిళ్ళలోఁ జిన్ని • పగడములుగ
      చూరుపట్టియలఁ బిచ్చుక దంపతులచాలు | చెక్కి తీర్చినయట్టి • చిత్రములుగ
      దూలాలగూళ్లసందులనుండి వెడలి మ్రో | గెడితుమ్మెదల మ్రోత గీతములుగ

తే.గీ. కెరలి వాకిళ్ల తూనీగ • తెరలు మూగి | నెర బుటేదారుగెంబట్టు • పొరపసందు
      సన్నయుల్లడగాగ నాషాఢలక్ష్మి | పగిదిఁ దనరారు నల్లూరు • పల్లెటూరు ||

సీ. ప్రాఁతగొంగడి వీపు • పై గప్పి బుజమున | గొంకి కర్రను మ్రోచి • కొంకినడచు
      నుచ్చుఁబ్రాతలపింజ • గ్రుచ్చి మున్మొలగట్టి | మఱ్ఱాకు పొత్తివే • మారు మడచు
      కదలిపారెడి గొఱ్ఱె • గమి చేలఁబడకుండ | తాసెతాసేయంచు దగిలి నఱచు
      తోడేలు బొడఁగాాంచి • జాడనే చేయెత్తి | నిక్కి ట్రూహాయని • కుక్కఁబిలచు

తే.గీ. ఆలు తలనిడికొని వచ్చు • నట్టి యటిక | నున్నచల్లయుఁ దమిదకూ • డుప్పు గల్లు
      మెల్లఁగా మ్రింగు గొల్లని • బెంచుతల్లి | పగిది దనరారు నల్లూరు • పల్లెటూరు

సీ. ఇసుకబావిఁ బనంటు లిడి ముంచుచును వంగ | తోటలకును నీళ్లుఁ దోడువారు
      చిలగడంబులమళ్ళఁ • జేతులతో నిండు | బుడ్లతో దొణదొణ • బోయువారు
      నిమ్మ నారింజ దా • నిమ్మచెట్ల కుదుళ్ల | నుం బేడపెంటల • నునుచువారు
      ఆకుకూరలఁ గల్పు లేకుండఁ దివిచి కాఁ | డలఁ బచ్చపురువుల దులుపువారు

తే.గీ. పెద్దబెండలమోళ్ళను • బీకు వారు | కాకరలకును బందిళ్ళు • కట్టువారు
      మార్గశీర్ష మహాలక్ష్మి • మందిరంబు | పగిది నలరారు నల్లూరు పల్లెటూరు.

సీ. చెలగి కళ్ళముల గింజలు మేసి ప్రాఁజింత | తొరడుల గుబగుబల్ • నెఱపు గువ్వ
      కట్టానఁ జని గంటె • కంకి నోటనుబెట్టి | వినువీధిఁ గిలకిల • యనెడు చిలుక
      చెంగావి పెనురావి • చివురునిండుగ మెక్కి | కూకూయనెడి మద • కోకిలంబు
      పొదలలో మెదలు లేఁ బురువుల సాపడి | చెట్టెక్కి గుమ్మను • జెముడుకాకి

తే.గీ. కదసి వరిచేలలో గూళ్ళు • గట్టి పెలుచ | బలిసి నటనంబుగా వించు • బరతపిట్ట
      గలిగి జనులకు శ్రవణసౌఖ్యప్రదంబు | పగిది దనరారు నల్లూరు • పల్లెటూరు ||

సీ. పొదలపైనీలాలు బోలు పరింగపం | డ్లకు జేయిసొన్పు బిడ్డలునుగల్గి
      పొలములో గొంతెత్తి • పొలిపొలియో యంచు | వరికుప్పనూర్చుపాలెరులుగల్గి

      
      అరువుబేరముల గుజ్జరినేసి సన్నంబు | ముతకంచు నొదుగు మాలెతలుగల్గి
      కోడిపందెములకై • గుమిగూడి గొల్లున | సడిజేయు చిల్లర • జనముగల్లి

తే.గీ. దేశవాళితుపాకితో • దెబ్బలోనఁ | బిట్టలను గొట్టు ముతరాచ • పిండు గల్గి
      శిశిరఋతునామ్నయైన లక్ష్మికిని దొడవు | పగిది నలరారు నల్లూరు • పల్లెటూరు.

వ. మరియు విసువక కసవులు మెసపు నాలమందలయందుండి యెదగొన్న సెలపెయ్యల కదసి కొమ్ముల గంగడోళ్లు నాకి నాకి ముట్టె లాకసంబుల కెత్తి మూచూచు నాబోతుల ఱంకెల కులికి పఱువులిడు లేఁగదూడలంబట్టఁ గమకించి వెనువెంట నంటి చను గొల్లపిల్లకాయల గవ్వల మొలనూళ్ళ నందందఁ దగిల్చిన యిత్తడి చిరుమువ్వల ఱవళి కదరిపడి గంతులిడు తరపులకాళ్ళనుండి వెడలి జుమ్మను జోరీగ దేరీగ చిట్టీగతండంబులును

ఈగతండంబులు మేనులంట రెండుచేతుల నిరుబరుల గోకికొనుచు గొంగళ్లు వెదకుచు వరిగడ్డి నిప్పుతొంటల పొగమఱుఁగునకుం జేరి మఱ్ఱాకు చుట్టిన పొగచుట్టల నగ్గియంటించి నోళ్ళనిడి తగుమాత్ర మెగబీల్చి దిగవిడచుచుండ నెత్తినిడి తెచ్చిన చలిది కుండలదించి యుప్పుగండ్లగలుప వంగి మైజారు చెఱగులు వ్రేలాడ నూసులాడు గొల్లపూఁబోడుల సరసంబులాడు పెద్దగొల్లల తోంట్ల వెనుక తోకలాడించు కొనుచు నొడళ్లువిరచుచు గాళ్లుసాచి నిక్కు వేపి జాగిలంబులుసు

వేపిజాగిలంబులు మోరలెత్తి మొఱగిన విని భయభ్రాంతంబులై పఱచుచు వెనువెన్కసూచుచుఁ దోకలు మడచి పులుగుపొదలం దూరి పండి కొనియున్న కుందేలు నక్క తోడేలు కొరణాసి మున్నగు జంతుసముదాయంబుల వేటాడ గమకించి పరవదోలి పలలుచ్చులు పన్ని చుట్టు తిరిగి కూకలు వేయుచు జప్పుళ్లు జేయుచుం దిరుగు వేటకాండ్రంగాంచి తావులు వెడలి ఱెక్కలార్చుచు నోరలోరల జెట్టు చేమలపట్టులం జూచుకొను పావురము కాకి గద్ద గువ్వ ఏండ్రింత పాలజుమ్మ చిలుకలు మొదలగు పులుగు మొత్తంబులును

చిలుకలు మున్నగు పులుగుమొత్తంబులు చవచవ నెగసివచ్చి కంకికొక్కొండుగా వ్రాలి గింజలు ముక్కులంబొడిచి తిత్తులునింపి యత్యాశావశంబున దంటుపైఁ గూర్చుండి సజ్జకంకి యూచి మొదలంట గొఱుకుచు జాగుసేయుచు నిటునటు మెడద్రిప్పి సూచుచుండ జేనినడిమి మంచెమీదనుండి కలకలంబు విని చెట్టేలుత్రాడు పలువురు విసరియిడ్డ ఠాప్పను బెనుమ్రోత నులుకంజేసి మంటియుండల వడిసెల నిడి త్రిప్పి యేయు కాపులును

కాపులు తమ ప్రాతరుపాహారార్థంబు లేతకంకుల కరయుచుఁ గ్రిక్కిరిసి గింజబరువున నొరగియున్న దంటుల నిటునటు పాయంద్రోయుచుం దారివెట్టి చనుచో బుసబుస లాడుచు మెల్లమెల్లనంబ్రాకు బెంజేరుగున్నలకు బెదరి కేకలువైవఁ జేలదాపు పుంతవెంటం బోవుచు మంచెకుం గట్టిన యంచెదుడ్ల విరగలాగి పలుదెబ్బలం జావంగొట్టి చేలగట్ల కీడ్చిన యుపకారంబునకుం బ్రత్యుపకారంబుగా నిచ్చిన కంకులం గొని నలిపి వడిగట్టి యిండ్లకుంజను బాటసారుల నయ్యా! యేమి తెచ్చితివని యొడిబట్టి విడలాగు పసిబిడ్డలును

పసిబిడ్డ లేపుమీరి గుంపులుఁగూడి మెట్ట పుట్ట చెట్టు చేమ లనక చిఱుగోచులు వ్రేలాడ సన్నపాటి యూటికఱ్ఱలం జిఱుతబిళ్ళలం జేతులంబూని యాటలాడ జొచ్చి యలసి నడిప్రొద్దుల కిసుకబొందలకుం జేరి డిగ్గి జలకంబులాడి మేనులు సూర్యాతపవశంబులు చేసియు విడువని మంటిచారికలు వీపుల గాన్పింప నిండ్లకు జేరిన బండ్లు గొఱకుచు వెఱపించి కొట్టంబోపు తల్లుల కడ్డపై వంగివంగి కఱ్ఱబట్టుకొనుచు చిన్నబిడ్డల కేమి తెలియు నూరుకొమ్మని వెడవెడ ముసలి మాటలఁ గోడండ్ర జంకించు ముసలమ్మలును

ముసలమ్మల యొద్దంజేరి నీతు లుపన్యసించుచు కావడిపెట్టెలం గాజుకుప్పెల నించిన కాలువ నీరు గంగోదకంబని నమ్మించి నెత్తింజల్లి బొమ్మలపటంబు విప్పి యేలపాటలు పాడుచు యెలుంగెత్తి యర్థంబులు సెప్పుచు మగనిప్రక్క రామహరే యను పల్లవి ననుసంధించుచుఁ బైటకొంగునం గట్టి వీపులం దగిలించుకొనిన పసిబిడ్డనుం జూసి ముద్దీయడుగ కాశికావిళ్ళ ముద్దరాండ్రకుం జేటలెత్తి కాపెతలు చాటుగా దివిచి యిచ్చు చోడె కొఱ్ఱ చామ సజ్జ వరిధాన్యంబులును

వరిధాన్యంబుల నూర్చి రాసిచేసి కొల్పించి సంచులం బోసి కుట్టి ఎద్దు దున్న వీపునం గత్తళంబులు పన్నిగంతవైచి శెలగడంబులు బిగించి యెత్తి కదాడంపు దుడ్లం బుజాలనిడి పెరికాటంబుసేసి యిండ్లకుం గొంపోపు నెడ పునాస వ్యవధి గడచిపోయినదని కాపుల నడ్డగించి కలహంబులు వెట్టుకొను పెట్టుబడి కోమటులును

కోమటియింటికిం బనుపు కొమ్ముల్లిపాయ మెఱపకాయ చింతపండుప్పుగల్లనుచు వచ్చి ధాన్యంబులు దెచ్చి క్రుమ్మరింప వెల్లకాయ పొల్లు గుల్లయని చెఱగి చెఱగి సోలంబోసి చూడు తలగీతయని కాని దుగ్గాని వి లువకట్టు గట్టువాయి కోమటికొమ్ములతో బలు గతులఁ బోరాటములు సేయు కాపు గొల్ల గవల ఈడిగ మాల జవరాండ్ర దొలంగు తొలంగుమని బోకరించి గొణిగికొనుచు దారింబోవు జలాహరణవతులగు స్మార్త వితంతువులు గుడ్డ గుల్ల చిళ్ళ పెల్ల పెంకులం ద్రొక్కి వానిం దిట్టితిట్టి పునస్నాన ప్రయత్నంబులు సేసి నూతి కేగి తోడు భాండశతంబునకుం బట్టు కాలంబువలన మధ్యాహ్నంబు దాటినంగని వంటలు కాలేదని కోపించి యుఱికి చీవాట్లుపెట్టు గృహమేధులును

గృహమేధులు తమతమ ముంజాపడుల నీనకఱ్ఱబద్దలు చీరుచు మామిడి జీడిమామిడి మఱ్ఱి జువ్వి రావి మొదలగు వృక్షంబుల పర్ణంబులం దెచ్చి భోజనభాజనంబులుగాఁ గుట్టుచుండ మడిసంచులు వీపుల వ్రేల బుడిచెంబులమూతుల కంగవస్త్రంబులు గట్టి మొలల బిగించి తల నొక ప్రాతశాలువ జుట్టి యొంటి పొరయట్టచెప్పులం దొడిగి దర్భాసనంబులు వీపుల కడ్డంబుగా జొప్పడ నేతెంచి పరదేశులమని మహావినయంబుఁ దోపం జెప్పి యల్లనొకచో గూర్చుండి యాశీర్వచనవసనం దొడగుకొనినం జూచి మాయింట భోజనంబు సేకూరదని యెన్ని విధంబులం జెప్పిన వినక నానాప్రకారంబులం బ్రార్థింప నెట్టకేని యంగీకరించిన తోడవఁదమ కత్తెసరని మెల్లమెల్లగా జారవిడిచి చెప్పి స్నానంబు సేసి మడికట్టుకొని సంధ్యావందనాదికృత్యంబులు నిర్వర్తించి దేవతార్చన చేసి ప్రొయిమీదనున్న తప్పెల దింపుకొని పచ్చడి మజ్జిగలతో గడుపునిండ సాపడి యెద్దే నరుగుమీదం బండికొని గుఱవెట్టు పాంథవైదికశిఖామణులునుంగల్గి యత్యంతసౌఖ్యాస్పదంబయి నా బాల్యదశ ననేక వినోదంబు లనుభవించిన పల్లెటూరగు అల్లూరగ్రహారంబు స్మరింపక నామనం బన్యంబు గ్రహింపనేరదది యెట్లనిన.

శా . శ్రీలం జెన్నగు నాలమందలును దత్క్షీరంబులున్ వెన్నలున్
     జాలన్ మీగడలున్ భుజించి పరమైశ్వర్యంబు వేఱొక్క టీ
     భూలోకంబున గాన కెప్డును మహాభూతప్రభావంబులన్
     లోలోనం గడు మెచ్చి రంజిలితి నల్లూ రగ్రహారంబునన్.

ఉ . పచ్చలఁ బోలు వర్ణముల • పై పయి నిండుగ గాచి గొల్గుపం
     డ్లొచ్చెములేక చిట్టడవి • నొక్కమొగిన్ బగడాలు నిండుగా
     గ్రుచ్చినయట్ల తోప నదిగోయని యెచ్చటలేని సంతసం
     బచ్చుపడంగఁ గోసిన సుఖాతిశయంబు గణింప శక్యమే.

మ. అహహా నామది నేటికి స్మఱపు రాదాయావు లా లేగ లా
    మహిషీవ్రాతము సజ్జచేల నడుమన్ • మంచెల్ దదారోహణ
    స్పృహలున్ గూయనుచున్ గడున్ వడిసెలన్ • జేయార్చి యేయన్ క్రియా
    మహిమం జిల్కలు లేచి కూయుచు నభోమార్గంబునం బాఱుటల్.

ఉ. వేసగి నెండతాకునకు • వేసర నీయక లేగదూడలన్
    బీసగి డొంకలం దిడిన వేళ గనుంగొని పోయి యాత్మ ను
    ల్లాసముమీర నందుఁ బదిలంబుగ మేపగ లేతపచ్చికన్
    గోసిన నాటి తుష్టికిని • గోటిధనంబు సమంబె యారయన్.

ఉ. బాడవచెల్క యొడ్డులను • బట్టిన పచ్చికపట్లఁ బూరి బి
    య్యాలకుబోవు గొల్లజవ• రాం డ్రొడి విండఁగఁ గోసికోసి తా
    రోడక త్రోవఁ బోవుతఱి • నూరిదొరన్ సగబాలు వెట్టుడం
    చాడిన నట్లు సేయఁ గొనినట్టి వినోదము విస్మరింతునే.

ఉ. ప్రొద్దుటిపూట చిట్టడవి • పుంతల నెయ్యురఁగూడి కుమ్మరన్
    గ్రద్దరిసుద్దులుం జిలిపి • గంతులు గొంతుక యెత్తి యెద్దియో
    పద్దెము బాడుచున్ నగుటఁ • బాపటపాకులు నూటికఱ్ఱలున్
    బొద్దిచివుళ్ళనుం దునుము • పోడిమి నేడును వీడ దాత్మలోన్.

ఉ. పచ్చికపట్ల మంచుబడి • ప్రాతరనేహము నందుఁ బచ్చలన్
    గ్రుచ్చిన పేటముత్తెములు • కూర్చినరీతి వహించ నెంతయున్
    మచ్చిక సాలెపుర్వు లిది • మాదని నిక్కుచు జిల్గువల్వలన్
    హెచ్చుగ నచ్చటం బఱచి• రే యని యెంచగనొప్పు చోటులన్
    రచ్చలు సేసితిన్ సుఖత •రంబుగఁ బిన్నలగూడి వేడుకన్.

చ. బలమును నింటిలో జరుగు •బాటును దల్లియుఁ దండ్రియుం దయా
    కలితమనీష బెంచుటయు • గమ్మని నీరును గూరలాకులున్
    గలమ సమృద్ధియుం జెరువు • కానయుఁ దాడియుఁ బంటయుం గడుం
    గలిగిన పల్లెటూరు నగు • కాపురమే సుఖమంచు నెంచెదన్.

చ. తలఁచెదఁ జెట్టు లెక్కిన వి • ధానము కొమ్మచు లాగినట్టి విం
    తలు గిజిగాని గూళ్లొడిసి • తన్నఁగ నెత్తున వ్రేల నూగు గొ
    మ్మలకును గాళ్లుసాచిన క్ర • మంబును మొగ్గలజగ్గు పిల్లలం
    బిలుచుక గ్రక్కునం జిఱుత • బిళ్ళల నాడిన యెల్ల వేడుకల్.

చ. పొలమున కేగి నాటు •పువుబోడులు గొంతుక లెత్తి తుమ్మెదా
    కలకల నవ్వుతా యనుచుఁ • గామమ పుట్టగఁ గర్వు వచ్చె నం
    చలరగ బాడఁగా వినుచు • నయ్యెడ నయ్యెడ నేతికల్వ పూ
    పులఁ జిరుమంగ నా చిఱుత • పూటలు మూటలు నిష్కకోటికిన్.

ఉ. చక్కని పెద్దచెర్వుదరి• చాయలఁ బట్టిన నాచుపట్ల బెం
    పెక్కుచుఁ జిత్రకంబళము • పేర్మి వహింపఁగ నెఱ్ఱగల్వ పూ
    లక్కడ నక్కడం బొదలు • సందము గన్గొని యీడువారితోఁ

    
    గ్రక్కున బందెముల్ వయిచి • కాడలఁదున్మిన నోటి సంతసం
    బెక్కడనేనియుం గలుగు • నే యిక నెన్నిటికేని ధారుణిన్ ॥

ఉ. మేకలమందలన్ బసుల • మేపుచు గొల్లలఁగూడి నల్ల రే
    గాకుల చిక్కముల్ పొసఁగ • హత్తుచు వీపులకున్ దగిల్చి ని
    ర్వ్యాకులులై మెడల్ దిగువ • వాంచి చనం గని మెల్లమెల్లగా
    వాకు బిగించి వీపునకుఁ • బ్రాకిన కోడిగ మప్పు డెంత సౌ
    ఖ్యాకర మయ్యేనో తెలియు • నా మఱియొక్కరి కీ ధరాస్థలిన్॥

చ. అనుదిన మొక్కరీతిఁ దగు • నా దిరిసెంబుల పూలతావు లా
    యనుభవమెల్ల మావశమ • యంచును జల్లని నీటిబొంద లే
    మని కొనియాడ వేసఁగి న • హా మునుమాపునఁ జల్లగాలికిన్
    దనువిడి సైకతస్థలుల • దద్దయు నాటలఁబుచ్చు ప్రొద్దులన్॥

చ. తొలకరి వానలం జలము•తోఁ దగనిండిన గుంటపట్ల గ
    ప్పలు గరుటత్కటత్కురక • పట్కరటన్ కరటత్వనాగ న
    వ్వల గడుగుంయిగుంయిగుయి • బంగుయిగుంయని యీలకోడులున్
    బలువిడిఁ గూయ నద్బుతము • వాటిల వింటిని గంటి సౌఖ్యమున్॥

చ. పిడుగులు పెళ్లునన్ మొఱయ • భీతిలి భీతిలి యుర్ములుర్మగా
    బడబడమ్రోత కిట్టునటు • బాఱి మెఱుంగులు తళ్కుతళ్కుమం
    చదరిన గన్నులార్చి కర•కావళి నచ్చెరుపాటుతోడ జే
    తులనిడి వానకుం దడిసి • తొల్కరి నాటలఁబ్రొద్దు బుచ్చితిన్॥

చ. సరస వసంతమందును ని • శాముఖవేళలఁ జల్లగాలికిన్
    బరువుగఁ బూయు నయ్యడవి•మల్లెలవాసన నాసికాపుటాం
    తరములఁ జొచ్చి డెందమున • దద్దకు సౌఖ్యముఁగూర్చ వెన్నెలన్
    బరవులవైచి పండుకొను • భావము నేఁ దలపోయకుందునే.
 
చ. సొలయక మెట్టలం దిసుక•చోటులఁ బిచ్చుకగూళ్ళుగట్టి పాం
    సులత వహించివచ్చి యొక•చో దిగుబావిని జల్క మాడి మే
    నుల తడియార్చి పెద్దలకు• నుం దెలియంబడునంచు మెల్లగా
    నిలుసొరబోవు నా కపట•వృత్తిని నేఁ దలపోయకుందునే.

వ. అట్టి యల్లూరను పల్లె గ్రామంబున

తే.గీ. పూరియింటనే పలువర్ష•ములు వసించి | యారికన్నమె కొన్ని నా•ళ్ళారగించి
   యుప్పుపఱ్ఱల పన్నుండి యోర్చియోర్చి | సోమలింగఁడు మాయూరె • సుఖదమనియె.

క. మతిరహితులు కొందరు శ•త్రుతం బూనినకతన సోమ•రుద్రుఁడు మాకున్
   బ్రతిభటుడై పోరియు స•త్కృతుల నెఁఱిఁగి తాన యోడి • గెలిపించె మమున్॥

చ. గెలిచిన వెన్క సోమునకు • గీమునకుం దలపెట్టి కొన్నినా
    ళులకును శాలివాహనుని• లో బడియేడయి యెన్న నొప్పు వం
    దలపయి దొంబదారు సని•నం దగు శ్రీముఖయందు నోడుబి
    ళ్ళలగుడిఁ కట్టె నా జనకుఁడై • తగు కన్నయమంత్రి భక్తితోన్ ॥

తే.గీ. ఓడుబిళ్ళల గుడిలోన • నుండిపేర్మి | ధ్వజములేకయ తండులో•దనము మెక్కి,
    యుత్సవాదుల కోరిక • యొక్కరీతి | సోమలింగఁడు మాయూరె • సుఖద మనియె॥

ఉ. అంతటఁ గొన్నినాళ్లకు వ్య•యాబ్దమునందును రాధమాసమం
    దెంతయు భక్తి మజ్జనకు • నిష్టము గాంచి ధ్వజంబు నిల్పి య
    త్యంత విలాసవైఖరుల • నాదిమహోత్సవ మాచరించి ని
    శ్చింతఁ దదాది వర్తిలఁగఁ • జేయుచునుంటిని శక్తిచొప్పునన్॥

తే.గీ. వరిపసాదంబు కాల్వనీ • ర్ధ్వజము మంగళోత్సవంబులు కలిగితా •నురువిమాన
   గోపురంబులు లేకున్నఁ• గొఱత యనక | సోమలింగఁడు మాయూరె • సుఖదమనియె॥

చ. ఉడుగక యెండవానలకు • నోర్చి కటాకటి కర్వు లెన్నియో
    వెడలఁగ నెట్టి మా కలిమి • వెంబడి తానును గష్టసౌఖ్యముల్
    కుడుచుచు మమ్ముఁ బ్రేమఁ గనుఁ•గొంచు నుమామణిఁ గూడి పల్లెలోఁ
    బడి వసియించు సోమపద•భవ్యుడు లింగఁడు మమ్ము బ్రోవుతన్॥

చ. వయసు పదేండ్లు సంస్కృతము• వంకఁ గనుంగొనలేదు తెల్గులో
    నయినను బెక్కు శబ్దముల•యర్థములన్ గ్రహియింపలేదు నే
    జయజయ సోమలింగ యని • చక్కని కీర్తిన యల్లినాఁడ ని
    ర్భయముగ సోమలింగని కృ•పామహిమంబు గణింప శక్యమే॥

చ. పడియును రెండువర్షముల • ప్రాయమునందున్న దెల్గుపద్యముల్
    వదలక కొన్నికొన్ని చెలు•వంబుగఁ గూర్చితి సోమలింగస
    త్పదమును నిల్పి యట్టి కవి•తారసధన్యుని నన్నుఁ జేయు నా
    సదమలచిత్తపంజరని•శాంతుఁడు నిత్యుఁడు సోమలింగఁడే ॥

చ. తిరుపతి వేంకటేశ్వరుఁడు• దేవశిఖామణి నాకుమం గళా
    గురుఁడగునంచు స్వప్నమునఁ • గోరి వచించినయట్టి శైవభూ
    సురవరు జెప్పనౌ నిఖిల • సూరిజనస్తవనీయుఁడై కృపా
    కరుఁడగు సోమలింగఁడని • కాక మఱొండు దలంప నేర్తునే॥

క . పరశివు నుపదేశము శ్రీ • వరువిద్యాగురుత రెండు • బడసితి నాకుం
    గొరత యొకించుకఁ గలదే | మఱియుం గామేశ్వరమ్మ • మా యిలువేల్పే॥


———♦కృ తి క ర్తృ వం శ వ ర్ణ న ము♦———
    సో మే శ్వ ర స్తు తి


శా. శ్రీరంజిల్లు జటాకలాపపదవీ• ఛిద్రంబులందుండి గం
    గారమ్యాంబువు జారినం దడిసి దు•ర్గా దేవి మోమెత్తి యొ
    ప్పారం గారణ మారయన్ ఖచరభ•క్తానీకదత్తాభిషే
    కారంభం బను వేల్పు గొల్చెద సదా • యల్లూరిసోమేశ్వరున్॥

మ. నెరి నెందుం జదు వభ్యసింపకయ పం•డ్రెండేండ్ల యీడప్డు న
    చ్చెరువుం బొంది బుధాళి ముక్కుపయి వ్రే•ల్చేర్వంగ సాత్రాజితీ
    విరహాఖ్యంబగు యక్షగానమును గా•వింపించె నాచే మనో
    హరలీలన్ భజియింతు నట్టిగురు నే • నల్లూరి సోమశ్వరున్

మ. పొలమం దొక్కటఁజేరి బాలకుల గుం•పుల్ కోతికొమ్మచ్చులా
    టలఁ జిక్కం గని యేనునుం గలసి యా•డం జింతకొ మ్మెక్కువే
    ళల స్వామీ ననుఁ బ్రోవరా యనుచు దా•ళంబొప్పఁ బాడించి న
    న్నలరంజేసిన దేవుఁ గొల్తు మదిలో • నల్లూరి సోమేశ్వరున్॥


———♦ శ్రీ వేం క టే శ్వ ర స్తు తి ♦———


చ. గురునొకనిం భజింప మదిఁ • గోరి తదేకపరత్వ మూని ని
    ద్దురఁ గొన స్వప్నమందు నిశిఁ • దూర్ణధియౌ నివటూరి పట్టిసే
    శ్వరుఁడను శైవుఁ డెవ్వనిని • సమ్మతి మద్గురుఁ జేసె నాతనిన్
    దిరుమల వేంకటేశ్వరుని • దేవశిఖామణిఁ గొల్తు నిత్యమున్॥

———♦ ప్రకృతి పురుష ప్రభృతి గోత్రఋషిపర్యంత కృతికర్తృవంశానుక్రమము ♦———
  
సీ. సచ్చిదానందవి•స్ఫోరముక్తాశుక్తి | వేదవేదాంతార్థ•విత్ప్రసక్తి
    భాసుర బ్రహ్మాండ • భాండసంపద్భుక్తి | విహితకృపాతృప్త • విబుధభక్తి

     
      స్థావరజంగమా•త్మకవస్తుగుణయుక్తి | త్రైగుణ్య విషయవిస్తారసూక్తి
      శబ్దాదితన్మాత్ర • సాకల్యసువ్యక్తి ! లీలాగతానంత• కాలభక్తి

తే.గీ. జ్ఞానదీపాంకుర ప్రధా•వాసుర క్తి | ఫలిత నిజపాద సేవక • భవవిముక్తి
      పరమ పురుషోపకంఠవి•భ్రాజమాన | హాసమాయామయాసక్తి • ఆదిశక్తి ||

తే.గీ. ఆ పరమపురుషుసన్నిధి • నాదిశక్తి | నుదయమైరి రజస్తమో•యుక్తి దనర
     బ్రహ్మదేవుఁడు పార్వతీ•ప్రాణవిభుఁడు | సత్త్వగుణమున నుదయించె• శార్ఙ్గపాణి॥

తే.గీ. బ్రహ్మమానసపుత్రులై • పరగి రార్వు రందును మరీచి యనువాని• యందుఁ బొడమె
      గశ్యపుడు వానికి నిఁబుట్టె • గమలబంధుఁ|డఖిల లోకైక భాసకుం •డగుచుఁ దొల్లి॥

చ. విరతి యొకింత లేక విను•వీధిని రేయుఁ బవళ్లు భాసిలన్
      భరమన కోర్పుఁగల్గి తన • భానుసహస్రముచే జగత్ప్రభా
      కరణము సేయునట్టి యుప•కారి రుజాపరిహారి వేదమం
      దిరు హరిఁ గర్మసాక్షి రవి • దివ్యహిరణ్మయమూర్తిఁ గొల్చెదన్ ॥

క. దినమణికి సంజ్ఞయందున్ | జనియించెను సకలధర్మ•శాస్త్ర నిపుణుఁడై
      మనుజునిగా మానవుగా | జనుఁ జేసినయట్టి మనువు • జగములు పొగడన్॥

క. ఠేవ వివస్వంతుని కొడు | కై వైవస్వత సమాఖ్య • నందె నతం డీ
     వైవస్వతమన్వంతర | భావమునకుఁ గారణ ప్ర•భావుఁడు సుమ్మీ

క. పైవస్వతమనువు కొమరుఁ | డై వెస నిక్ష్వాకుఁ డుదయ • మయ్యె వికుక్షి
    క్ష్మావరుఁ డతనికిఁ గలిగెను | జూవె కకుత్థ్సుండు వాని • సూనుడు వెలసెన్॥
మ. కలితాశీర్యదవార్య శౌర్యదవశుక్రప్రక్రమావక్రని
    స్తులజిహ్వాపటలిస్ఫుటోన్నటనస•ద్యోభీతశత్రుక్షమా
    తలరాడ్వీరకురంగరక్షణకలా • దౌరంధరీపూర్ణకీ
    ర్తిలతాసాంద్రుఁడుసూ కకుత్థ్సుఁడను ధా•త్రీపాలచంద్రుం డిలన్॥

క . మును సురలు వేడ రణమున | కును జని యెద్దయిన దేవ • కుంజరుని కకు
    త్తున నెక్కి, యసురకోటులఁ | దునుమాడఁ కకుత్థ్సుఁడని జను ల్బిల్చి రొగిన్॥

తే.గీ. ఆ కకుత్థ్సునకును గొడు • కగు సుయోధ|నుండు, ధృతరాష్ట్రభూమి పా•లుండు తనరు
    పెద్దకొడుకున కీ పేరె • పెట్టెజుండు | వాని కొమరుండు నళినాప్త •వంశపృథుఁడు॥

క. వైన్యుఁడగు పృథుమహీపతి | యన్యుఁడునుం డట్టి భాస్వదన్వయపృథురా
    డ్మాన్యునకు విశ్వరంధి వ | దావ్యగుణోపేతుఁ డతఁ డు•దయమై మించెన్॥

క. ఆవిశ్వరంధి కుదితుం|డై వసుధం గీర్తిఁ గాంచె • నార్ద్రకుఁడు సమ
   స్తావనిఁ జంద్రాభిఖ్యన్ | బ్రోవ సమర్థుఁడయి సుగుణ పుంజము నెఱపెన్॥

తే.గీ. ఆర్ద్రకునిబిడ్డ యువనాశ్వుఁ • డతని కొమరుడయ్యె నుశవశ్తి వంశకుం • డతనిపుత్రుఁ
   డాయన సుతుండు బృహదశ్వుఁ • డఖిలసుతుఁడు వాఁడు లోకై కవిఖ్యాతి• వడసెమిగుల॥

క. బృహదశ్వుసూనుడై యి | మ్మహిని కువలయాశ్వనామ • మనుజపతి మహా
   మహిముఁడు గలిగెన్ బలియుఁడు | బహుపోషకు డార్తిలోక•బంధుఁడుసూవే॥

తే.గీ. కువలయాశ్వ మహీపాలు • కొమరుడైన ఆ దుందుమారుండు దుర్దమదోర్బలుండు
   దుందువును కొట్టి యా పేరు • సెందె నతని కొండిక దృఢాశ్వభూపసంజ్ఞుండుసువ్వె॥

క. ఆ దృఢతురగునిబిడ్డ ప్రమోదుండనఁబరగె నతని • ముద్దు కొమరుఁడై
   మేదిని హర్యశ్వుండనఁగా దగు నరపాలకుండు • ఖ్యాతి వహించెన్॥

క. ఆ హర్యశ్వుడు గనియెన్ | సాహస ధైర్యాది సుగుణశాలి నికుంభున్
   బాహుబలశాలి యాతం | డా హరిదశ్వుని సుధామ•యాత్ముని గనియెన్॥

క. హరిదశ్వసుతుడు విశ్వంభరలోఁ గీర్తింపబడియె • బహువిధముల దు
   ర్బరబాహుబలము కలియన్ | హరిహరభక్తుండు సంహతాశ్వుం డనుచున్॥

తే.గీ. అట్టి సంహతాశ్వు • నాత్మజుండై మించె | మహి రణాశ్వుఁ డనెడి మనుజనేత
   చెలఁగి యాతనకిఁ బ్ర• సేనజిత్తను బిడ్డ యుదయమందె నాతఁడుర్వి నేలె॥

తే.గీ. ఆయనకుఁ గలిగెను యువనాశ్వుఁ డనెడి భూమపాలుండు వాఁడు వి•స్ఫురిత కాముఁ
   డగుచు బెండ్లాడె సింహమ • ధ్యాశతంబు | నొక్కతై నను గనదాయె • నొక్కబిడ్డ॥

చ. సుతులకు నోమనైతి నని •స్రుక్కి ఋషిప్రకరంబు వేడగా
    నతితరనిష్ఠ నింద్రయజ• నాఖ్య సవం బొనరింపు మన్న స
    మ్మతి నది సేయఁబూని యభి•మంత్రిత కుండగతాంబు వంగనా
    శతమున కం చెఱుంగక ని•శాసమయంబున గ్రోలె డప్పిచేన్॥

ఉ. క్రోలిన యంతనే యుదర•కుండిక దొడ్డయి యున్నఁ గాంచి తా
    జాలముమాని యాంగిరుఁడు చయ్యన గర్భము వ్రచ్చినం గళా
    మూలుఁడు బాలుఁడొక్కరుఁడు • పుట్టుట నచ్చటివారలెల్ల హా
    హాలపితంబులం జలిపి • రంతట నింద్రుడు వచ్చే వేడుకన్॥

ప. యువనాశ్వుం బునరుజ్జీవితుం జేసి యమృతసిక్తాంగుళిం బాలున కందించినం గాంచి,

క. కిం ధాస్యతి యని జను లన | మాం ధాస్యతి యనుచుఁ బలికె • మఘవుఁడు దానన్
   మాంధాత యనెడి పేరు వసుంధరఁ గొండికకుఁ గల్గె • సువ్యక్తముగాన్ ||

సీ. కడుపును భేదించి • పుడమికి విచ్చేసి యెవ్వాఁడు కీర్తివ•హించినాడు
    కుడిపినంతనె వేలుఁ • గుడిచి యింద్రుని మెచ్చి యేవాఁడు సుధఁ బట్టి • త్రావినాడు
    యెడలేక యొకనాడె • కడగి సప్త ద్వీప మెవ్వాడు తా ముట్ట•డించినాఁడు
    కడుప్రీతిఁ గొనియాడఁ •బడి చక్రవర్తియై యేవాఁడు ధరనెల్ల • నేలినాఁడు

తే.గీ. క్రతుసహస్రంబు నెవ్వాఁడు • గడపినాఁడు | కోరి మూడవు నెవ్వాడు• గొలిచినాఁడు
    పూని యెవ్వఁడు దీనులఁ బ్రోచినాఁడు | అతఁడు మాంధాతసూయువ•నాశ్వసుతుఁడు ||

క. ఆ మాంధాతకు మువ్వురు | భూమీశులు కొడుకు లందుఁ • బురుకుత్సుడు సూ
    వే మొదటివాడు రఘుకుల | మీ మహిమోన్నతునివంశ • మే వేయేలా |

క. అందుఁ దృతీయుండగు ముచి | కుందుఁ డపుత్రకుడు నిగమ కోవిదుఁ డితనిన్
   నందతనూజుఁడు ముక్తిం | బొందించెన్ ద్వాపరమున • భూరికృపాప్తిన్

ఉ. మధ్యముఁ డంబరీషుఁ డతి•మానుషచర్యుఁడు ద్వాదశీవ్రతా
    సాధ్యముని ప్రయుక్త పటు•శక్తి నిరాసకుఁ డచ్యుతాశ్రయుం
    డధ్యయనాది కర్మరతుఁ•డాత్త సుదర్శనదర్శనుం డపాం
    నిధ్యుపమానమానగణ•నీయుఁడు మించె ధరాతలంబునన్ ||

క. హరికృపచేఁ దేజోజిత | హరిదశ్యున కంబరీష యమివర్యునకున్
    వరపుత్రుఁడుఁ గలిగె నతని | హరి మే త్యయ మని హరీతుఁ • డనిరి మునీశుల్॥

సీ. పుట్టినాఁ డెవ్వఁడు • భూతంబు లలరంగ మాంధాతకును ముని• మనుమఁడగుచు
    పుట్టినాఁ డెవ్వఁడు • బహువిధాచార నిర్ణయబోధి ధర్మశాస్త్రంబు చేత
    కొట్టినాఁ డెవ్వఁడు • కూలంకషంబుగా కామాదిశత్రు వర్గంబు నడఁగ
    పెట్టినాఁ డెవ్వాఁడు • బృందారక శ్రేణి కిష్టహవ్యమ్ము బహ్విష్టులందు

తే.గీ. అతఁడు సుజ్ఞాని భక్తి మార్గా•నుసార | సుక్రియాతృప్తమాజాని • సూరివర్గ
    సన్నుత తపస్తనుని • సాధులోగ | గీతగుణరత్న ఖాని హ•రీతమౌని॥

ఉ. అంగిరసాంబరీషయువనాశ్వ ఋషిత్రయితో హరీతసం
    జ్ఞం గడు వర్ణితంబయి పొ• సంగిన గోత్రము వానిదేకదా
    మంగళమ స్తటం చఖిల•మాన్యుఁడు వాఁడు మముం దయాళుఁడై
    సంగతసర్వశోభన వి•శాలురఁ జేయుత నెల్లకాలమున్॥

వ. అని యిట్లు గోత్రపతివంశానుక్రమంబు దెలిపి తదీయ గోత్రోద్భవులై మహా యశంబు
    వహించిన యుత్తమ పురుషులఁ గొందఱం గొనియాడెద.

శ్రీహరిత గోత్ర సంభూతులగు


-: శ్రీ భాష్యకార రామానుజుల చరిత్రము :-



ఉ. అమ్మలయమ్మ యిందిర ద♦య న్నరకోటికి ముక్తి గల్గు మా
    ర్గమ్మును దెల్పువాడొక్కడు ♦ గల్గఁడె యీ కలిలోన నంచుఁ జి
    త్తమ్మున జింత సేయఁ గని♦ తామరసాంబకుఁ డాత్మశయ్యయై
    సమ్మతిఁ గొల్చు శేషుని వె♦సం గని యిట్లని పల్కె జెచ్చెరన్ |

క. ఆసూరి కేశవయ్యకు | భాసిలుఁ గాంతమ్మ యనెడి ♦ భార్యామణి దా
   నాసూరి సోమయాజియు | ధీసహిత మృగాక్షి సోమి♦దెమ్మయును జుమీ ||

క. ఆతఁడు యజుశ్శాఖీయుఁడు | వితతాపస్తంభసూత్ర ♦ విశ్రుతుఁడుండున్
   హితమతి లౌకిక వైదిక | రతుఁడై తుండీరమండ♦లగ భూతపురిన్ ||

క. నీవు సని యతని కొమరుఁడ | వై విద్యావిశదమూర్తి ♦ వై వేవేగన్
   శ్రీవైష్ణవ సిద్ధాంతముఁ | గావింపు మనంగ నతఁడు ♦ గ్రక్కున ధరకున్ ॥

క. చనుదెంచి భూతపురిలో | వనజాక్షుని యాజ్ఞ కొలది ♦ వర్తించెడి ధీ
   ఖని కేశవు మందిరమున | వనజాక్షికిఁ గాంతిమతికి ♦ వరసుతుఁ డగుచున్ ॥

క. తొమ్మిదివందలముప్పది | తొమ్మిది శకశరతు లరుగఁ ♦ దొడిఁ బింగళ చై
   త్రమ్మాది భృగగుపంచమి | నిమ్మహి నార్ద్రర్షమున జ♦ నించె గురుఁడు దాన్॥

క. శుభవేళం జనియించుట | శుభ చిహ్నుం డగుట సూచి ♦ క్షోణీసురవ
   ల్లభు లాతని లక్ష్మణస | న్నిభుఁడంచును లక్ష్మణాఖ్య ♦ నేర్పున నిడినన్॥

తే.గీ.కశ్యపునియందు నాది యు♦ గంబులోన | కశ్యపాన్వయజుం డగు ♦ ఘనహరీతు
   నన్వయంబునఁ గేశవు ♦ నందుఁ గలియు | గంబున జనించితి నటంచుఁ ♦ గడు ముదమున॥

సీ. మును వేయినోళ్ళతో ♦ డను జదివిన శ్రుతి | ప్రచయంబు నొకనోటఁ ♦ బఠన సేసె
    మును కశ్యపబ్రహ్మ ♦ చనువునఁ బెరిగిన | వాఁడు గేశవుప్రేమ ♦ వాసిమించె
    మును బ్రేమఁ గద్రువ ♦ చనుబా ల్గుడిచి నేడు | కాంతమ్మ చనుబాలఁ ♦ గడుపు నించె
    మును రమాపతి దేహ♦ మును శయ్యయై మ్రోచి 1 హరికృప నిపుడు శ్రే♦ యంబుగాంచె

తే.గీ. భూమి దాల్చిన వేలు పీ♦ భూమిమీద | జనుల భవపాశమును ద్రెంపఁ ♦ బాలుపడియె
     లక్ష్మణుండయి కొన్ని నా♦ ళ్మన్న వేల్పు | తుదియుగంబున లక్ష్మణ♦ పదము వడసె॥

తే.గీ. శేషభుజగేంద్రు నంశంబు సెలగఁబుట్టి లక్ష్మణాభిఖ్య వహియించు • రాముననుజుఁ
      బోలువాఁడైన కతమున♦భూమిజనులు | సొరిది బిచ్చిరి రామానుజుండు ననుచు ||

క. శ్రీవైష్ణవసిద్దాంతము | కేవల మీతండు మిగుల కీర్తికి దెచ్చెన్
      వేవేలు సెప్ప నేటికి | నీ వసుమతి నంతవార • లెవ్వరు సెపుమా ||

క. యతిరా జనియు విభూతి | ద్వితయాధిపుడనియు నుభయ వేదాంత సుని
      ష్ఠితుఁడనియు ననంత శ్రీ | యుతుఁ డనియును బిల్చి రతని • యోగనిరూఢిన్ ॥

ఆ.వె. చిత్తశుద్ధిపరులు • శ్రీమతేరామాను | జాయనమ యటంచు శాంతవృత్తి
      జెలఁగి యాహిమాద్రి • సేతు పర్యంతంబు | మ్రొక్కు లిచ్చు గురుని • మ్రొక్కదగదె ॥

శ్రీహరిత గోత్ర సంభూత


-: శ్రీవత్సాంక చరిత్రము :-



క. శ్రీరామానుజ గురువరుఁ | జేరి మహార్థములు విvgచు • శ్రీవత్సాంకుం
   డారూఢి నొక్క బాపఁడు | శ్రీరంగపురంబున న్వ • సించె ముదమునన్॥

శా. శ్రీవత్సాంక పదారవిందభజసం శ్రేయస్సమారబ్ధ సు
    శ్రీవత్సాయురుపేతుఁడై పరమతాజేయ ప్రభావాఢ్యుడై
    శ్రీవత్పోపమవాగ్ధురీణుఁ డగుచున్ జెల్వొందుచున్నట్టి యా
    శ్రీవత్సాంకుఁడు వైష్ణవోత్తముఁడు హారీతుండు సామాన్యుఁడే॥

ఆ.వె. పర్ణశాలయందు భార్యతో వసియించి యొక్కనా డతండు • మిక్కుట మగు
    గాలివానఁ దడిసి యాలోగి లురలిన | తిండిలేక బయల • నుండవలసె॥

ఆ.వె. అప్పు డతనిభార్య యాదిలక్ష్మ్యంబిక | కంపితాంగి యయ్యెఁ • గొంప విడిచి
    రంగనాధు మందిరంబున నా రేయి నారగింపుగంట • నాలకించి॥

క. తినిరో దాసజనంబులు | తినలేదో యనక నీవు•తినుచున్నావా
   యనుకొని యూరక యుండఁగ | మనమునఁ గరుణించి రంగ మందిరుఁ డంతన్ ॥
క. మానిసిపలుకుల భక్త వితానంబున కనియె నీ పదార్దము నెల్లన్
   బూని యరిగి శ్రీవత్సున | కీనగు నన వల్లె యనుచు నేగిరి వేగన్॥

క. చని శ్రీవత్సున కిచ్చినఁ | గని కారణ మరయలేక • కాంత నడుగఁ దా
   ననుకొంటి రంగనాధుఁడు | తిను దాసుల కిడక యని మదిన్ బ్రాణేశా॥

క. అనవుఁడు నోసీ దీనిం | దిను మీవే యనిన మీరు • దినిన వెనుక నేఁ
   దినియెద నన మూచూచియుఁ | దిను మిఁక నని యతఁడు పలికె ధృతిమంతుండై॥

తే.గీ. అంగనారత్న మా బువ్వ యారగింప | గర్భవతియయ్యె దైవసందర్భ మెనపి
      యంత నిర్వురు బాలకు • లమిత తేజు | లూర్జితోదారలాంఛను • లుదయమైరి॥

శ్రీహరితగోత్ర సంభూత


-: శ్రీ రం గ ప రా శ ర భ ట్టా ర కు లు :-



ఉ. పుట్టిన బిడ్డలన్ విడచి పోయిరి తల్లియుఁ దండ్రియుం దయా
      భ్రాట్టగు రంగఁడే మనుచు • బాలుర నంచును లక్ష్మణార్యుఁ డా
      చిట్టితనంపు పట్టులను • జేరి ముదంబునఁ గొంచుపోయి చే
      పట్టి సుఖంబుగాఁ బెనిచె బాలును నుగ్గును బెట్టి నేర్పునన్॥

తే.గీ. పరగఁ బ్రథమునకుసు బరాశరసమాఖ్య | వెట్టెను ద్వితీయు శ్రీరాము పేరఁ బిలిచె
      వార లిరుపురు వేదాంత • వార్తికముల | సేసి రచ్యుత సేవావి శిష్టు లగుచు॥

ఆ.వె. లక్ష్మి స్తన్యమిచ్చె • రామానుజుఁడు గురుం | డాయె మహిమ నెన్న • నలవి యగునె
      శ్రీపరాశరుండు శ్రీ రామభట్టును మనుజమాత్రు లన సమంజసంబె॥

తే.గీ. అతితర ప్రౌఢి విష్ణు సహస్రనామ | భాష్య మొనరించి రిరువురు భక్త మకుట
      రత్నములుగా శ్రీవత్స లక్ష్మిపుత్ర | రత్నములు వారిఁ గీర్తింప రాదె పెలుచ॥

తే.గీ. రంగమందిరమునను బరాశరునకుఁ | బ్రేమ రామానుజుఁడు గురు • పీఠమొసగె
      నతని వంశంబునందు జాతాదికములు | రమణఁ బాటించు శ్రీరంగ రాజు నేడు॥

తే.గీ. కంచివరదుఁడు శ్రీవత్సు • నంచితమగు | సుతికి మెచ్చి తదీయ గోత్రు లగువారు
      ముక్తులని వరమిచ్చె న య్యుక్తిఁ జేసి | యహహ రామానుజుఁడు ముక్తుఁ డగుచు నవియె॥

తే.గీ. గోత్రమున కెల్ల ముక్తిని గూర్చినాఁడు | పరమగురులైన పుత్రులఁ • బడసినాడు
      కంచివరదుని చాల • స్తుతించినాఁడు | ధరణి శ్రీవత్సుఁ బోలిన • నరుఁడు గలఁడె॥

శ్రీహరి గోత్ర సంభూత


-: శ్రీ రా మ చం ద్ర సూ రి ప్ర భా వ ము :-



ఉ. ధారుణి నొక్క బ్రాహ్మణుఁడు దారగుణ ప్రచయుండు గౌతమీ
     తీర నివాస పండితుఁడు దివ్యవరాఢ్యుఁడు దా గలండు శ్రీ
     వీరసమాఖ్యుఁ డాతనికి వేదమయుండగు పుత్రుఁడొక్కఁ డా
     భారతి సత్కృపం గలిగె భాసుర రామపదాభిధేయుఁడై॥

క. శ్రీరామచంద్ర నామము | తో రంజిలి కాశి కేగి • దుర్మతశిక్షా
     కారణుఁడై గంగానది | తీరంబున భార్యతోడ • ధృతి నివసించెన్॥

సీ. జయపురాధిపుఁడైన జయసింహ భూపతి కుష్ఠరోగముచేతఁ గుందుచుండె
     నెట్లు నివర్తించు • నీరోగమని చింతఁ గుడిచె నౌషధములు • కోటి పేరు
     వెల్లంకులకు సొమ్ము • వెచ్చించె లక్షలు పాప మెట్టిదియొకో • పాయదయ్యె
     వ్యాధి యొక్కంతయు • వైద్యులు పలువురు చనిరి దీనికి మందుఁ • గన మటంచు

తే.గీ. నంత నొకనాడు డెందాన వంత మిగిలి | నిదుర పోవంగఁ గలలోన , నిరుపమాన
     పురుషుఁ డొక్కండు గాన్పించి • నరవరేణ్య | యశ్వమేధంబు నొనరింపు • మని వచించెఁ

ఉ. అంతట మేలుకాంచి యచలాధిపుఁ డాత్మపురోధఁ గాంచి స్వ
     ప్నాంతరుదంత మెల్ల విన • నాడిన వల్లె యటంచు నాతఁ డ
     శ్రాంతత యత్నముం జలుప • బ్రాహ్మణసంఘమువారు కొంద రీ
     చింత పొసంగునే కలి నిషిద్ధమటంచు వచించి రెంతయున్ II

క. దానన్ భగ్నమనోరధుఁ | డై నరపతి కుందుచుండ • నా రేయి గలన్
     ధీనిపుణుఁడైన తొల్లిటి | మానవుఁడే నచ్చి పలికె • మధుమధురముగాన్॥

క. ఎంతయు సర్వం పాప్మా | నంతరతి యటంచు నే జనశ్రేష్ఠుఁడు ధీ
     మంతుఁడు వచించు గంగా , ప్రాంతంబున వాని గనుము . వారాణసిలోన్॥

క. అనవుఁడు విని మేల్కని య , జ్జనపతి కాశికిని వేగఁ జని యున్మత్తుం
     డునుబోలె గంగకడఁ దా | నను బాప్మానం తరతి యటంచు నిరతమున్॥

ఆ.వె. ఇట్లు కొన్ని దినము • లేగంగ నాగంగ | లోన ముణిగి లేచి • మేను దుడుచు
      నొక్క ద్విజకులేంద్రుఁ • డెక్కటి తరతి పదంబు శ్రుతులఁ జొచ్చి • దాయవచ్చి॥

క. వింతగ సర్వం పాప్మా నంతరతి శ్రుతిని జదువ • నరనాధుఁడు దా
     నెంతయు సంతస మొదవ ని | జాంతికమున విప్రు జూచి , యతిభక్తి మెయిన్॥

క. జయసింహుండను రాజను | జయపురనాధుండ నశ్వ • సవనము నాచే
     దయతోఁ జేయింపంగల | భయరహితుఁడు గలఁడె యంచుఁ • బ్రార్థింపంగన్॥

చ . పలువురు విప్రు లొక్కమొగి , వాచ వివాద వినోదులై కడున్
     గలి హరిమేధముం దలపఁ - గాదనిరే నిది సేయకున్నఁ బే
     శల తనుభావముం బడయఁ జాలను • నాకును స్వప్నమం దన
     ర్గళమతి నొక్క భూసురుఁడు • గన్పడి చెప్పె నుపాయ మర్మిలిన్॥

తే.గీ. అతవి వచనంబుకతన నే • నరుగుదెంచి ! యున్నవాఁడ ననంగ నా యుర్వీసురుఁడు
     కరుణ వీక్షించి యోధరా వరవరేణ్య, తురగమేధంబు సేయింతు • వెరవకు మి క "



క. అని భయము దీర్చి గంగను | మనమున ప్రార్థించి సవన . మార్గమ్ము క్రియా
   ఫణితియుఁ గల గ్రంథమ్మును | గొని జయపురమునకు రాజ కుంజరుతోడన్ |

క. చనుదెంచి విప్రసంఘం | బును వాదమునందు గెల్చి • మునివాక్యంబున్
   వివిచి నిజౌద్భిజ్జత్వ | మ్మనుకూల మ్మనుచుఁ దెలిపి • యతినిపుణుండై |

ఆ.వె. పొట్టఁ బగుల జీరఁ - బుట్టినవాడు మాం ధాత కాన వాఁడు • ధరణిలోన
   నుద్భవమును బట్టి ఆ యుద్భిజ్జుఁడన నొప్పె వినుము ధరణినాథ • విన్నవింతు

ఆ.వె. అతని కులమువాలి • నౌద్భిజ్జు లందురు | హరిత గోత్రజాతు లట్టివారె
   యెరుగుమయ్య నే హరీత గోత్రుండను | గలిని వాజిమేధ • కారయితను ||

-: బ్రహ్మోత్తర ఖండము వ్యాసోక్తి :-



శ్లో॥ ఔద్భిజో భవితా కశ్చిత్ , సేనానీ కాశ్యపో ద్విజః
    సోశ్వమేథం కలియుగే పునః ప్రత్యాహరిష్యతి.

వ. అను వచనంబు సదివి రాజు నొప్పించి యశ్వమేధం బతనిచే నిర్విఘ్నంబుగాఁ బరి
    సమాప్తి నొందింప నా భూపాలునకుం గుష్ఠరోగంబు నిపర్తించె మరియు ||

మ. జయసింహుంబొనరించె నెవ్వని ఘన • వ్యాపారపారీణతన్
    బ్రియవాక్పాటవసిద్ది నట్టి గురునిన్ . శ్రీరామచంద్రాఖ్యునిన్
    జయ హారీతసగోత్రునిఁన్ దలచెదన్ • సర్వప్రమేయంబులన్ ||

క. ఢిల్లీ ప్రభువగు నగ్బరు నల్లుఁడు జయసింహరాణ్మహారాజు సుధీ
   వల్లభుఁడు సుధారసముక్ | సల్లాపుఁడు వాఁడు లోక • సామాన్యుండే ||

తే.గీ. రామచంద్రుని వంశ్యులు • రాణివారు | కలఁడు వైశాఖపురి నేడు • కమ్రకీర్తి
   శాలి యగునట్టి దైవజ్ఞ సార్వభౌమ | చిహ్నమును బడసిన నర సింహయజ్వ ||

                   

శ్రీ హరీతగోత్ర సంభూత


-:కమలాకర భట్టార్య ప్రభావము:-



తే.గీ. ఎల్లధర్మంబు లా సేతు • హిమనగ ప్ర | సిద్ధమైనట్టి నిర్ణయ సింధు వనెడి
    శాస్త్రసంగ్రహంబున దెల్పె • సకల ధీర హారమణియగు నక్కమ లాకరుండు ||

తే.గీ. కూద్రకమలాకరం బను • సుప్రసిద్ధ గ్రంథ మొక్కండు శాస్త్ర సంగ్రహము సేసి
    యఖిలజనమాన్యుఁ డయ్యె విద్యావిలాస హారమణియగు నక్కమలాకరుండు ||

తే.గీ. రెండువందల వర్షముల్ - నిండె నేటి ! కతని విద్యావినోదంబు • లవనియందు
భూపతివ్రాతములచేతఁ • బూజ్యమాన | మగుచు వర్తిల్లిన దినంబు • లవనియందు

శ్రీ హరీతగోత్ర సంభూత


-: కురుగంటి వేంకటరామగొని ప్రభావము. :-



సీ. శాలివాహనశక , సంవత్సరంబులు | పదియేడువందల , పైన నొక్క
    వర్షంబునను గోన వారిపాలెమున నెల్లూరు సీమసు సదాచార వృత్తి
    చణుఁడు రామస్వామి శాస్త్రి, యజుర్వేది | సుమహితాపస్తంబ సూత్రయుతుఁడు
    కలఁడు శాయమసాధ్వి • లలితాంగీ తను గొల్వ | నన్న దానవరత్వ మమర నకవితని

తే.గీ. కొమరుఁడై పుట్టె దొంటి గౌతముఁడు తక్క | శాస్త్రకుత్సితహేతుపక్ష ప్రమాద
    రాజిఁ దొలఁగింప వేంకట రామశాస్త్రి | వినుత దుర్హేతువాదవిభేద శస్త్రి |

తే.గీ. అతఁడు హారీతకులజాతుఁ - డసుగమాఢ్య • మైన క్రోడంబు రచియించి • యధిక కీర్తి
    బడసె దిగ్విజయముఁ గాంచెఁ • బరులు సాటి రారు కురుగంటి వేంకట రామమణికి ||

తే.గీ. కాశి గద్వాల పునహానగర జయపుర | నాగపుర కాళీఘట్ట తం - జాపుర మిధి
    లాపురానంతశయన కొల్లాపుర మహి | శూర పురములఁ గురుగంటి సూరి గెలిచె ||

క. అనుగమ భట్టాచార్యుం : డని కొందరు తర్క, సింహ మని కొందరునుం
   గని యపరగౌతముండని : యును గొందరు పిల్చి రతని • నుర్వీస్థలిపై |

క. పడుచుఁదనముననె తనయున్ విడచెను దాఁ బ్రొద్దువాక • వీటను బాలున్
   విడిదిగను గైకలూరుం బడసెను దా నంద యుండె • బహువర్షంబుల్.

క. కొల్లేటి యొడ్డునం గల | ఝల్లీలోఁ గైకలూరు • చక్కని యూ ర్మా
    యల్లూరికి గ్రోశతయి | సుల్లసిలుం బ్రొద్దువాక • యొక క్రోసు సుడీ ||

కృతికర్త నిజవంశ వర్ణనము.


-: శ్రీ మదాది వరాహస్తుతి. :-



శా. శ్రీవాల్లభ్యము కొల్లపెట్టెడి నుర స్సీమం బ్రవేశించి యం
    చా విశ్వంభర చిన్న బోవు నని తుల్య ప్రేమ సూపన్ వరా
    హావిర్భావము పూని దంష్ట్రశిఖ నొయ్యం దాల్చి యున్నట్టి య
    ద్దేవుం డీవుత భోగభాగ్యశుభసిద్ది న్మాకు నశ్రాంతమున్

-: గురుపరంపరాస్తుతి:-


శ్లో. రఘునాధప్రధానా ద్యామ్ , గంగ రాణ్మంత్రి మధ్యమాం
    కన్నయామాత్య పర్యంతామ్ | వందే గురుపరంపరామ్ ||

వ . అని గురువందనము చేసి,

-:శ్రీ రఘునాథ రావు ప్రభావము:-


శా. శ్రీశ్రీశ్రీ రఘునాథ భూమివిబుధా గ్రేవర్తి సత్కీర్తియై
    శ్రీశ్రీశ్రీపునహాపురీ వికటభూ రిక్ష్మా మహారాష్ట్ర సు
    శ్రీశ్రీశ్రీయగు ధారువాడనగరీ - జేగీయమానస్థితిన్
    శ్రీశ్రీశ్రీయయి గోలకొండకును విచ్చేసెన్ రణోద్యోగియై ||

ఉ. వచ్చి తురుష్కభూమిపర • వర్గము నుగ్గొనరించి సేనలన్
    జెచ్చరఁ గొంచుపోపుతరి • సేహి సుసాహెబుఁ డొంటిఁ బట్టి తాఁ
    దెచ్చెనుఁ గార కంతటను • దేవిఁ దలంచి విముక్తుఁడయ్యు వాఁ
    డెచ్చటి కేగెనో యెఱుఁగ • రేరు వనస్థితి మెచ్చి యుండుఁ బో ||

చ. అకుబరు చక్రవర్తి యెపుఁ • డాతనికిన్ జయపూరు సీమ యే
    లిక జయసింహుఁ డల్లుడు లలిన్ హయమేధము రామచంద్రయా
    జకుఁ డతిమానుషుం డవని జానినిఁ దా నొనరింపఁజేసె మా
    నక యపు డస్మదీయ రఘునాథుఁడు వచ్చెను గోలకొండకున్

-:హ రి దా స్ గం గా జీ ప్ర భా వ ము.:-


ఉ. ఉండెను గోలకొండను ద దుజ్వలమైన యశంబుతోడఁ బు
    త్రుం డొకరుం డుదారగుణ రూఢిమెయిన్ హరిదాసవృత్తి న
    క్కొండిక గంగజీ యనుచుఁ • గూరిమి నెల్లరు బిల్చి రా మహా
    మండలమందె భూసుర కుమారికఁ బెండిలియాడె నాతఁడున్ ||

-:దా సు ర ఘు నా య క ప్ర భా వ ము.:-


చ. నయమతియై యతండు రఘు నాయకుఁ గాంచెను నాడు వాని య
    న్వయమును దాసువారనుచు . వాడిరి నాటికిఁ జక్రవర్తి ని
    శ్చయముగ షాజహానుఁడు లసద్గుణశాలి యతండు భీతి త
    క్కియ చని కాంచె నబ్బుడుత కీసులతో బుడుతండు బందరున్

చ. బలియుఁడు గోలకొండకు న బాబట యొక్కరుఁ డల్లి ఖాను డు
    జ్వలమతిశాలి వానికడ • కొయ్యనఁ బంపిరి బుడ్తకీసువా
    రలు పనిచెప్పి యయ్యువక రత్నము నచ్చటఁ గార్యధుర్యతా
    లలితత నొక్క భూమిసుర రాజకుమారికఁ బెండ్లియై వెసన్ ||

-: దాసు గం గ రా జ మం త్రి ప్ర భా వ ము:-


ఉ. ఆ రఘునాయకుండు పునరాగమనం బొనరించె వేడుకన్
    దూరుపువార్జి తీరమునఁ • దోరపు బందరువీటికిన్ మహో
    దారుని బుద్ధిసారు నిగత శ్రుతిపారకుమారుఁ బాండితీ
    శూరుని గంగరాట్సచివ సూరునిఁ గాంచెను దత్పరంబునన్ ||

ఉ. రెండవ గంగరా జతడరివ్రజజేతృత నూజవీటికిన్
    దండపతిప్రమేయపరతం జని యా నృపవర్యుచేత మా
    న్యుండయి తాన కోరెనట • యూరట నాత్మనివాసయోగ్య మొ
    క్కండట పత్ర పుష్పతృణకాష్ఠజలాన్విత మాశ యల్పమే ||

క. పంటంగోరడు బహుజనులుంటం దలఁపండు పొదల నూసడములు గో
    రంటలు బాపట పచ్చిక | కుంటలనుం గంగరాజు • కోరిన యూరే ||

-: అట్లూరు గ్రామోత్పత్తి :-



తే.గీ. గురజగ్రామము దరి నొక్క కొంపయైన లేని యడవి నొసంగె భూ జాని యపుడు
   పదియు రెండగు టంకముల్ పన్నుగట్టి | యూరికరణాలగుచు మీర లుండుఁ డనుచు

-:దాసు సుం ద ర రా మ మం త్రి ప్ర భా వ ము:-



తే.గీ. అల్లిఖానుఁడు గోల్కొండ • కధిపు డగుట | పేరు బెట్టిరి దాని కల్లూరటంచు
    గంగరాజున కాత్మజుల్ • కలరు మువురు | మధ్యముండు సుందరరామ మంత్రి యయ్యె||

ఆ.వె. నూజవీటిలోని రాజిచ్చె మాన్యంబు , వెదురుపావులూర • ముద మెలర్ప
    దాని నిపుడు బంధు ధర్మంబు పేరిమి | శంకరాన్వయులు పొసంగ విండ్రు ||

తే.గీ ఆల్లి నగరంబు ఖానుకొల్లపుడు పుట్టె నని తలంచెద రల్లూరి • కనతిదూర
   మందు పశ్చిమభాగోర్వి • నతిశయిల్లుచుండు వరుసను నయ్యూళ్లు రెండు నేడు "

క. సుందరరాముని కొడు కతి | సుందరుడని యెంచి సకల శోభనగుణముల్
   గందుమని యిడిరి బుధు లా నందంబున గంగరాజు • నామము వేడ్కన్ ||

తే.గీ. గ్రామమున కల్లి పేరని • కడమఖాను | పేరు పుత్రున కిడనెంచి • పేర్మి మీర
      కన్నయ యటంచు ముద్దుకై • కొన్ని కొన్ని | కాలములఁ బిల్చె నెరజాణ • గంగరాజు

ఆ.వే. అతఁడె సూవె గంగ-యామాత్యుఁడై తొల్లి | యారువేలవారి • ననఁగిపెనఁగె
      నాటనుండి తూర్పు • నాటను మేటి నియోగు లంచుఁ గీర్తి • నొంది రెలమి ||

--: ఆ ర్వే ల వా రి ప్ర భా వ ము :--


సీ. ముక్కంటి రాజున్యు • మూర్థాభిషిక్తుఁగా వెలయించువా రారు వేలవారు
      వృషభాధిరూఢులై , వేలూరుసని కీర్తి వెలయించువా రారు.వేలవారు
      రాజమాన్యాది • విభ్రాజమానాంకముల్ వెలయించు వా రారు వేలవారు
      వంశంబులకుఁ బ్రభు వ్యవహృతి వృత్తిగా వెలయించువా రారు• వేలవారు

తే.గీ.పేరుఁబడసినవారారు. వేలవారు | పేదలను బ్రోచువా రారు వేలవారు
     మేలుఁ జేసెడివా రారు • వేలవారు , కేలుసాచనివా రారు వేలవారు

వ. మఱియు నా గంగరాజు

సీ. సంతతాచ్యుత భక్తి .చింతావిశేషాంతరంగస్థ యతిరాజు • గంగరాజు
    భువనైకమోహనాద్భుత లక్షణాశేష శృంగారరతిరాజు • గంగరాజు
    వివిధ లౌక్యప్రభ వ్యవహారనాటక రంగస్థనటరాజు • గంగరాజు
    ఇంగిత జ్ఞాన సాహిత్యసంతోషిత వంగాంగ శకరాజు • గంగరాజు
తే.గీ. మానితాఖండ లక్ష్మీని ధానదాన | లింగసుగుణాంగరాజు మా . గంగరాజు
    సంగతాల్లూరి గంగోత్త మాంగ సోమ లింగరాజౌర శ్రీదాసు•గంగరాజు ||

తే.గీ. ఆంగ్లేయుల ధాటికి • నాఁగలేక | యుద్ధత పరాసు సైన్యంబు . లోడె నెపుడు
    బుస్సి హైదరాబాదుకుఁ . బోయె నెపుడు | అప్పుడే గంగరాజు సద్యశముఁ గాంచె ||

తే.గీ. గంగరాజు సలాబతు జంగురాజు | వంగి రాఁజూచి జయఘంట . టాంగనంగ
    నాంగ్ల రాజులు బందరు నందు నిలచు ! మంగళారంభమున నిల్వుఁ - టంగిఁ దొడఁగె॥

వ . అతడు

ఉ. శంకరభక్తులై పరమ • సాధువులై కడుకీర్తి దేశపాం
    డ్యాంకము బూనినట్టి సచి వాగ్రణు లుండిరి సూజివీటి రా
    జాంకితు రాజ్యమందు ఘను లద్భుతచర్యులు ముస్తబాదలో
    శంకరవారు వారి కులసంభవఁ జిన్నమ నాడెఁ బెండిలిన్ ||

ఉ. చిన్నమ పాలవెల్లిగను • చిన్నమ నేఁ గొనియాడ నేర్తునే
    చిన్నమ మేల్గొనమ్ములకుఁ • చిన్నమయేనియు నీసు లేదు రో
    చి న్నమనమ్ము హొన్ను గను • జిన్నమరాళము యాస బూను ల
    చ్చి న్నమ యంచనున్ నెనరు . చిన్నములుం దరహాస వైఖరుల్ ||

క. ఆగంగని చిన్నమ్మకు | యోగాంచితు లమితధీ ప్ర యోగాద్భుతు లు
    ద్యోగాశ్రితరాగాయత భోగత్యాగాయతనులు • పుట్టిరి కొమరుల్.

-: అ క్కి రా జు ప్ర భా వ ము. :-



ఆ.వె. అందుబ్రథము పుత్రుఁ - డక్కి రా జనువాడు సంతతాన్న దాన • చతురబుద్ధి
    బహు పురాణ వేత్త • విహిత పంచాయత! నార్చనుండు పొగడ • నలవి యగునె.

సీ. కమదన శోభనాద్రిమహీశు నిజపీఠి నెక్కు నొక్కొక్కనా డక్కిరాజు
    న్యాయహీనుల దండనము లెంచి కలముతో నొక్కు నొక్కొక్కనా • డక్కిరాజు
    భక్తిఁదపోయు క్తి • బాహ్యమర్మ మడంగ ద్రొక్కు నొక్కొక్కనా • డక్కిరాజు
    కామితార్థము లిచ్చు • సోమేశు గుడికేగి మ్రొక్కు నొక్కొక్కనా • డక్కిరాజు.

తే.గీ. పెక్కుమనుజులఁబ్రోచినాఁ • డక్కిరాజు | మిక్కిలి దయారసంబువాఁ , డక్కిరాజు
    నిక్కమగు లక్కిమికి నిక్క • యక్కి రాజు చక్కదనముల చుక్క మా యక్కిరాజు ||

తే.గీ. పాపటాకులు గుట్టుక • పగలు రెండు జాల గోపాయఘంటిక • నాలకించి
    లేచి శివపూజలను జేసి • లేత గురుగు | కూర వరిబువ్వ భూసుర కోటి మెక్కె

తే.గీ. అక్కిరాజింటఁ జేరల • నాజ్యధార లోడ బోసేసి భూసురు • లొక్క నీతి
    వాసమును జేసి రల్లూర • వనకుటీర ! పంజరమ్ములఁ జిల్కల • పగిది నిలచి.
 
ఉ. ఆతని యన్నదానమున • నాజ్యము మెండట భూరిభూసుర
     వ్రాతము తిన్న వెన్కఁ బరి వార జనంబులు నాజ్యసిక్తధా
     త్రీతలమృత్తు నీళ్ళ నిడి • తీసినఁ బేరిన నెయ్యిఁ గొంచు న
     త్యాతత జీవనార్థపరు • లమ్మిరటే యిక నేమి దెల్పుదున్ ||

తే.గీ. దయఁగలిగె రాజునకును బెద్ద సెల పండె | నక్కిరాణ్మంత్రి దాతయై • యలరె సుబ్బ
     మాంబ వండెను వడ్డించె • సవనిసురులు | బ్రేపుమని త్రేన్పి రిందేమి వింతగలదు ||

క. ఆయన హయాములోనే | మయూరను సోమలింగ, మందిర మొదవెన్
    బాయని మాన్యము పుట్టెన్ | హాయిగ నూ రగ్రహార • మాయెను మాకున్ ||

తే.గీ. అక్కిరాణ్మంత్రి భార్య సుబ్బమ్మ పరమ | సాధ్వి యతితరపతిభ క్తి • సహిత విహిత
    శాంకరీవ్రతనిరుపమాచారమహిత , పాపరహిత యుదారకృపాసమేత ||

-: దాసు ర ఘు నా య క ప్ర భా వ ము :-


తే.గీ. ఆతని తమ్ముఁడు రఘునాయ, కాభిధుండు | కన్నయాభిఖ్యయును దోడు గాఁ జెలంగ
    మంత్రి శేఖరుఁడయ్యెఁ గమదన శోభనాద్రినృపునకు గురజు పు•రాధీపునకు ||

పి. అల్లూరు సీతస వల్లీ పురద్వయీ నాయకుం డా రఘు • నాయకుండు
    కూరాడ గుడ్లవల్లేరాది పురమాన్య నాయకుం డా రఘు • నాయకుండు
    కమదనాన్వయ శోభన మహీపసభ మంత్రి నాయకుం డా రఘు నాయకుండు
    ఝల్లీ ప్రముఖ చార్ మ హళ్ళ జమీ దండనాయుకుం డా రఘు • నాయకుండు

తే.గీ. వందిత వినాయకుఁడు రఘు నాయకుండు , నమ్రశుభదాయకుఁడు రఘు నాయకుండు
    నయకృతివిధాయకుడు రఘునాయకుండు | నపకుసుమసాయకుఁడు రఘు నాయకుండు

సీ. తన వ్రాలుతో మాన్య ధారుణీఖండంబు లిచ్చినా డది తొలి • మెచ్చినాఁడు
    తన కీర్తి దశదిశా ధామంబులు వెల్లఁ బెట్టినాఁ డది రాజు • బట్టినాఁడు
    తన శౌర్యమును దుష్ట తండంబులను దూలఁ ద్రోచినాఁ డది ప్రొద్దు సూచినాఁడు
    తన గుణంబులఁ బ్రజాతతిచేఁ బొగడ్తల మంచినాఁ డది స్రష్ట గాంచినాఁడు

తే.గీ.దాసు రఘునాయకుని చరిత్రములు చిత్ర చిత్రములు పండిత స్తుతి పాత్రములు ప
     విత్రములు నఘవల్లీల విత్రములు విలిఖిత బహుపత్రములెవండు - లెక్కపెట్టు

సీ. అతడుగాక మఱెవ్వఁ • డన్యాయవర్తియౌ • తాళూరి జోగనఁ దరిమినాఁడు
    అతఁడుగాక మరెవ్వఁ . డవ్వాడపల్లి మాన్యంబిచ్చి భట్టుల • నంపినాఁడు
    అతఁడుగాక మరెవ్వఁ - డాకమదన శోభనాద్రీంద్రుఁ దోడుగా . నరసినాఁడు
    అతఁడు గాక మఱెవ్వఁ డల్లూరి సోమేశదత్తప్రసాదంబుఁ • దాల్చినాఁడు

తే.గీీ.దాసు రఘునాయకునివంటి • ధైర్యశాలి , దాసు రఘునాయకునివంటి • ధార్మికుండు.
     దాసు రఘనాయకుని వంటి • తజ్ఞమౌళి ! దాసు రఘునాయకునివంటి • దాత లేడు ||

తే.గీ. ఆసఁ గోరంగ సూరి మిరాసి విన్నకోటవారి కొసంగి శ్రీ పాటవమున
    అగ్రహారాధిపపదంబు నందినట్టి| అక్కిరాణ్మంత్రి సోదరుం డల్పుఁడగునె ||

ఉ. ఆయన భార్య యచ్చమ భళా యనఁ బేరువహించి మించెఁ గా
    త్యాయనిఁబోలి ఫుల్లజల జాయతనం బురడించి కల్వరా
    నాయనమై తలిర్చు ముని నాయకు నంగననా నరుంధతీ
    స్త్రీయనఁబొల్చి యంతటి పతివ్రత పుట్టదు పుట్టఁబో దిలన్


-: బ్రహ్మయమంత్రి ప్రభావము :-


క. ఇల నక్కిరాజ రఘునాధులకుం దమ్ముండు మంత్రి ధూర్వహఁడు హిమా
   చలమహిమాచల ధైర్య మ్ముల కలుముల మొలక నాకు • ముత్తాత సుమీ. ||

సీ. అతఁడగ్రజ ప్రమోదానుకూలుడె గాక యతఁ డగ్రజ ప్రమోదాసుకూలు
   డతఁడె మాధవభక్తి యుత మనీషుఁడెగాక యతఁడు మాధవభక్తియుతమనీషు
   డతఁడు సన్మాన్యగోత్రానుభూతియగాక యతడు సన్మాన్యగోత్రానుభూతి
   యతఁడు రుచిరమహస్తనిధానుడె గాక యతడు రుచిరుమహస్తతినిధాను

తే.గీ. డెన్న గాదు తరంబు వేయేండ్లకైన | బరమలావణ్యసహితంబు • భాసురంబు
   గంగరాట్చిన్నమాంబికా గర్భశుక్తి | గనిన బ్రహ్మయ్య మంత్రి • ముక్తా ఫలంబు ||

సీ. తానకా వివిధసా ధన మనోరథక సంతానంబులకునుసంతానమయ్యె
    తానకా బహుభూత తతికి మహాశేష | భోగంబులను శేషభోగమయ్యె
    తానకా భూనాధ దత్త నానామాన్య |గోత్రులందును మాన్య గోత్రుఁడయ్యె
    తానకా వ్యవహార తంత్రాషడక్షీణ | మంత్రంబులకు మూల మంత్రమయ్యె

తే.గీ. దానకా సాంగసాగితాధ్యయన నిరత పేది కధ్యయననిరత • వేది యయ్యె
    నతని గీర్తింప నాబోంట్ల • కలపి యగునె | దాసుకుల బ్రహ్మమంత్రి స దాసుకులుఁడు ||

ఉ. ఆలు ప్రసిద్ధురాలు శుభురాలు యశోధనురా లరుంధతిం
    బోలు పతిప్రతాతిలక • పూజితురాలును గృష్ణమంత్రియన్
    బాలు సుధావిశాలు గను • బాలెతరాలును సుబ్బమాంబ యే
    రా లగు ముంగమాంబ జవరాలు వరాలు సరాలుగా విడిన్ ||

ఉ. మంగమ భర్తృభక్తిగరి మం గమలాలయ బంధకోటి బ్రే
    మం గమనించుబుద్ధి మహిమం గమలాసనురాణి తెల్గునీ
    మం గమలాక్షులెల్ల పొడమం గమనం బిడు మేల్గొనాలు క్ర
    మ్మంగ మరంద ముక్తి జిదు మం గమనీయ శుభ ప్రసంగసూ ||

ఉ. భారతి మంగమాంబ యల • బ్రహ్మయ బ్రహ్మయ దాసువంశ వి
    స్తారులు వాని యంశములె , సారవచోమహింబుఁ గల్గుటల్
    చారుహిరణ్యగర్భపద సంగతిఁ గాంచుట రాజసంబునన్
    జేరిన సత్యవర్తనము సేయుట సాక్ష్యముఁగాక యుండునే. ||

-:కృ ష్ణ య మం త్రి ప్ర భా వ ము:-


క. మంగమకును బ్రహ్మయకు నభంగుర బలశాలి పంచబాణుఁడు తనకే
   యంగజుఁ డనఁదగు శ్రీవర | శృంగారయుతాంగుడైన కృష్ణుడు పుట్టెన్ ||

సీ. వంశజాతుని జంప • వచ్చిన యేడ్వురు దొంగల నొకచేతఁ . దోలినాఁడు
    యెద్దులఁ గొనిపోవు . నిద్దరి గంబళమ్మునఁ బట్టి వీపున • మ్రోచినాఁడు
    భువనైక మోహన మూర్తి వాటిలి యేక పత్నీవ్రతంబునఁ • బ్రబలినాడు
    కలము కాకితముపై • నిలిపి ముక్తాఫల వ్రాతంబునా డౌళ్లు • వ్రాసినాఁడు

తే.గీ. కన్నబిడ్డలవలె నూరి • కాపురముల | వారి యందరి క్షేమంబుఁ • గోరినాడు
    నవ్వుటాలకునైన యెన్నండు బద్దు | మాటలాడఁడు కృష్ణయ్య మంత్రివరుఁడు ||

తే.గీ. మంత్రిమార్తాండుఁ డతఁడు సన్మార్గవర్తి | మహితధాముఁ డఖిలలోకమాన్యమూర్తి
      కూర్మిఁ బెండ్లాడె నొకముద్దుగుమ్మ తనకుఁ |జాయగానుండు వెంకమ్మఁ • జారువదన ||

చ. అడవికులంబునం దుదయ మై నికటాశ్రిత చందనంబుగా
    నొడయనికిం బ్రియం బెసగ • నోపిక వేంకమ భూమిఁబుట్టు వం
    గడముల నెల్ల మొల్లముగ • గంధయుతంబులు సేసె నౌర యే
    యెడ నెటువంటి భూజనుల • నీమెను బ్రస్తుతిసేయఁ జెల్లదే ||

చ. అలఘు సుభద్రపాణి విభ • వాతిశయంబునఁబట్టి సత్క్రియల్
    సలిపినవాఁడు దాసుకుల జాతుఁడు శ్రీవిజయుండు భవ్యమం
    జుల గుణశాలియైన తను జుం భువిఁ గన్నయనాఁ బ్రసిద్ధిచే
    నిల నలరించు వాఁ డతడు • కృష్ణుడు కృష్ణుఁడు గృష్ణుఁడే సుమీ ||

ఉ. మల్లయమంత్రి యాతని సుమంగళి వేంకమనామ్నీ తండ్రియుం
    దల్లియుఁగాఁగ వేంకమ ని తంబిని కృష్ణయమంత్రి భార్యయై
    యల్లన గొన్నురున్ విడచి • యల్లురువీటను బాడిపంటలన్
    గొల్లలుగా భుజించెనట • గొల్లలు కాపులు కొల్వుకాండ్రుగాన్ ||

-: అ స్మ జ్జ న కు ల గు క న్న య మం త్రీం ద్రు ప్ర భా వ ము :-


క. ఆయన గర్భమునందుఁ బ్రభాయుతులగు ముపురు సుతులు - ప్రభవించిరి వా
   రాయతబుద్ధులు మధ్యముఁడై యొప్పెను గన్నయాఖ్యుఁ • డన్వయమణిగాన్ ||

ఉ. కన్నయ కీర్తిచే బుధుని . గన్నయ సంపదచేఁ గుమారునిం
    గన్నయ ధర్మయుక్తి శిబి కన్న యశస్వి గభీరతన్ సిరిం

   
    గన్నయ సత్కృపాప్తి మరుఁ • గన్నయ ధైర్యముచేతఁ బార్వతిన్
    గన్నయ సాటి సెప్పఁగ ని.క స్నయళాలులు లేరు ధారుణి ||

సీ. సతతాన్నదాన సు•వ్రతమున బద్ధకంకణహస్తుడై కీర్తి • గాంచి మించె
    అవనీశు వశమైన • యగ్రహారముఁ దెచ్చె లౌకిక ప్రజ్ఞ నల్గడల నెఱపె
    జీర్ణ పర్ణాలయ స్థితి మాని సోమేశ లింగని సద్ధామసంగుఁ జేసె
    లలిత నానావిధ ఫలరమ్య తరులతో నాటించె మేలైన • తోట యొకటి

తే.గీ. అతఁడు సామాన్యుఁడే మామ • కాన్వయాబ్ది | కల్పభూజుం డనల్పసం కల్పుఁ డమిత
    తేజుడుద్గీత కీర్తి నం.దిత బుధుండు | కన్నయామాత్య వంశసంక్రందనుండు ||

ఉ. ఆ కరుణాళుఁడుం బరిణయంబునఁ • గైకొనె గూరవాడ వం
     శాకర రామచంద్ర వసుధాసురు కూరిమిపట్టి యయ్యు న
     స్తోకపతివ్రతామహీమ తోడ నరుంధతి నుద్దిసేయఁగాఁ
     దూకము మించు కామమ వధూమణి సంచితపుణ్యకారిణిన్ ||

మా తృ దే వ తా స్తు తి



-:కా మ మ్మ ప్ర భా వ ము.:-



సీ. కలిమి కుబ్బదు భర్త • చెలిము కుబ్బునకాని యడియాస కలికానకైన లేదు
    మేను నమ్మదు భగవాను నమ్మునకాని గర్వంబు కలలోనఁ • గానరాదు
    ఖ్యాతిఁ గోరదు మంచి నీతిఁగోరునకాని వెదకిచూచిన దంభ వృత్తిలేదు
    సొమ్ము మెచ్చ దుపకా రమ్ము మెచ్చునకాని యెద నీసుఁగొనుట యొ క్కింతలేదు

తే.గీ. పరమ మంగళగుణముల • పాలవెల్లి | యాశ్రితావళిపరితాప • మడఁచు నెల్లి
    నళిననేత్రాజనమతల్లి • నాకుఁదల్లి | కామమాంబాభిధానయౌ • కల్పవల్లి ||

సి. పేదసాదల నెంచి , పెట్టెఁబో యన్నంబు చాలఁగా విరిగిన వ్రేలు గట్ట
    చుట్టాలఁ బక్కాలఁ - జూచెఁబో దయతోడ పదుగురిలో భళా భళ యనంగ
    చాకిరేకులఁ బ్రేమ • సారెఁబో నిరతంబు పేరు సెప్పుక దివ్వె • బెట్టి మ్రొక్క
    పిన్న పెద్దలఁ గని పెట్టెఁబో పంశాభివృద్ధిర స్తనుచు దీ•వెన లొసంగ

తే.గీ. సద్గుణ ప్రచయాలంబ • చారుకీ ర్తి | కాంతజితచంద్రమోబింబ • కలుషకుధర
    పక్షకృంతనశంబ సంద్రక్షణా విలంబ మాయంబ శ్రీకామ మాంబఁదలఁతు ||

సీ. ఏయమ్మ రాఁజూచి , యెలమితో దామెనల్ లాగికొంచొగి నావు లేగ లరచు
    ఏయమ్మ తనకాళ్ళ • నిడిన మట్టెల మ్రోత విని పాకిరులు క్రియా విధులనుండ్రు

    ఏయమ్మ దరహాస • మెనయగా నీక్షింప నమ్మలక్కల మన్వు • లాచరింత్రు
    ఏయమ్మ కనుసన్న చాయఁ గోడలు మన్మ,రాండ్రును బ్రాల్మాల • రన్ని పనుల

తే.గీ. పాల్పెరుగుమీగడల బువ్వఁ • గల్పిపెట్టి | పెంచె నేయమ్మ నన్ను నా పిల్లవాండ్ర
    పిల్లవాండ్రకుఁ బుట్టిన • పిన్న వాండ్ర | నట్టి మాయమ్మ కామమ్మ • నాత్మఁదలఁతు||

సీ. కన్నయ్య పండింపఁ • గామమ్మ వండింప లేచిన విస్తళ్లు • లెక్కలేదు
    కన్నయ్య తెప్పింపఁ • గామమ్మ యిప్పింప గొలచిన ధాస్యంబు • విలువలేదు
    కన్నయ్య నిలిపింప • గామమ్మ గొలిపింప వేల్పుగొల్పుల కొక్క • వేళలేదు
    కన్నయ్య వ్రాయింప • గామమ్మ చేయింప నుపకారములకు మా రొడ్డులేదు

తే.గీ. నన్నునుం బోలె నాదు మే • నత్తకొడుకులైన కనకయ్య కృష్ణయ్య • నరసిప్రోచి
    పెంచి పెద్దల గావించి • పెండ్లిచేసి నట్టి నాతల్లిదండ్రుల • నాత్మఁదలతు ||

సీ. ఒకవేళ తగునీతు • లుదయింప బోధించు నాటువాండ్రకు దన యంతదాన
    ఒకవేళ భారతాదిక మహాగ్రంథముల్ చదివించి విను ధర్మ సమితి దెలియ
    ఒకవేళ పెన్మిటి యొద్దకేగి కుటుంబ కార్యమంత్రముల జక్కట్లుదీర్చు
    ఒకవేళ తన మన్మలును మన్మరాండ్రకుఁ గతలు సెప్పుచు మచ్చి• కలను దనుపు

తే.గీ. ఒక్కవేళను నను బిల్చి • యెక్కువైన | చిక్కు విడద్రొక్క బుద్ధులు • చెప్పిపంపు
    నొక్కవేళను వేల్పుల • ప్రక్కమ్రొక్కు | నట్టి కామేశ్వరమ్మ మా యమ్మఁ దలతు ||

క. ఆయన మానాయన యీ మాయామధ్యామతల్లి • మాతల్లి శుభ
   శ్రీయుతుని నన్ను గాంచిరి | పాయని నా పూర్వపుణ్య ఫలమునఁగాదే ||

క. వారల పదపద్మములకుఁ | జేరి నమస్కృతు లొనర్చి సేవించి సుధీ
   స్ఫారుల కరుణను గైకొని | నే రచియింపఁ దొడగితి నీ గృతిచయంబున్ ||

క. నను రాముఁడనుచు లోకము | జనులందరుఁ బిలువ నిందు • సమ్మతి సోమే
   శునకు గృతియిచ్చి చెప్పెద | ఘనమగు శ్రీభాగవతము - కడఁగి తెలుగునన్ ||

మ. అమృతానందనిధాన మాశ్రితబుధ . వ్యాపారసంస్తూయమా
    నముశ్రీదేవ్యుదయాభిరామము కలా నాధానుమోదాత్మకం
    బు మణిద్వీపసువర్ణవృత్తగణమున్ • భూయోమహాభంగర
    మ్యము శ్రీభాగవతాభిధేయమగు దుగ్ధాంభోధి నోలాడెదన్ ||

వ. మరియు మున్ను నా పిన్నతనంబునుండి పండ్రెండవయేట పింగళవత్సరంబున సోమలింగ
    శతకంబును 1, పదునాల్గవయేట సిద్ధార్థివత్సరంబున సాత్రాజితీ విలాసంబును 2, పదు

నారవయేట దుర్మతిసంవత్సరంబున కృష్ణార్జునసంగరంబును 3 , ఇరుబదవయేటఁ గ్రోధస

సంవత్సరంబున గొల్లపల్లి రఘునాథశతకంబును 4 , ఇరువదియొకయేట నక్షయయందు పంచనృసింహక్షేత్ర మాహాత్మ్యంబును 5 , ఇరుబది రెండవయేట ప్రభవసంవత్సరంబున సారసంగ్రహ గణితంబును 6, రచియించితిఁ బిమ్మట ముప్పది వత్సరంబులు రాజ విద్యావ్యాసంగంబు గలిగి మండల న్యాయవాదినై వ్యవహారభారంబునంజేసి కృతికల్ప నంబున కవకాశంబు సాలకయుంటి నట్లుండియు నొకప్పుడు లక్షణావిలాసంబును 7 , ధాతృవత్సరాంతమున రచియించితిం బిదప స్వభానుసంవత్సరం దాదిగా దుర్ముఖివత్స రాంతంబు వట్టు అభినవగద్య ప్రబంధంబును 8 , అభినవకౌముదియు,9. వైశ్యధర్మ దీపికయు 10, శ్రాద్ధసంశయవిచ్చేదియు 11 , ప్రాయశ్చిత్త నిర్ణయంబును 12 , సంస్కృతంబునం గామాక్షి శతకంబును 13, ఆచారనిరుక్తియు 14 , దురాచారపిశాచ భంజనియు 15, చక్కట్లదండయు16 , తెలుగునాడును 17 , తర్కకౌముదియు 18, విగ్రహారాధన తారావళియు 19 , దీనితో చేరిన మనోలక్ష్మీవిలాస నాటికయు 20 , సూర్యశతకంబును 21, నౌకాయానంబును 22, చిలుకలకొలికి శతకంబును 23, , ముద్దులగుమ్మ శతకంబును24 , సీతాకల్యాణ నాటకంబును 25 , నమస్కారవిధి దీపికయు 26 , రచియించితి నంత గొన్ని దినంబులు వ్యవహారంబునుండి విశ్రాంతి గైకొని హేవిళంబి మొదలు శాకుంతల నాటకమును 27 , రత్నావళి నాటికయు 28 , ముద్రారాక్షస నాటకంటును 29 , మహావీరచరిత్ర నాటకంబును 30, మాలతీమూధవీయ ప్రకరణంబును 31 , ఉత్తరరామచరిత్ర నాటికయు 32, మంజరీ మధుకరీయ నాటికయు 33 , కురంగ గౌరీ శంకర నాటికయు 34 , నను పుస్తకంబులు రచించితి నిట్లు ముప్పదినాల్గు ప్రత్యేక గ్రంథములు సేసి కారణాంతరవశంబున దైవ ప్రేరితుండ నై శ్రీదేవీభాగవతంబు దెలిఁగింపఁ బూని

-:షష్ఠ్యంతములు :-

క. వృషసాదికి విషఖాదికి | సుషమాపాదికిని భాను•సుతమదసర్వం
   కషవిచ్చేదికి విద్యా విషయ వినోదికి శిరః ప్రభృతసురనదికిన్

క. సద్యోగమహోద్యోగల , సద్యోగయమాద్యఖండ • సంపన్మునిరా
   డ్విద్యాగతముద్యోగప | దద్యోతికపర్దఘృణికి • దైవాగ్రణికిన్ ||

క. స్థిరయశునకుఁ గరుణారస | పరవశునకు గిరీశునకునుఁ • బరమేశునకున్
   గిరిజా ప్రాణేశున కం|బర కేశునకున్ వినతసుపర్వేశునకున్ ||

క. లీలామితశీలునకుఁ గ | పాలాయతమాలునకును • బ్రప్రోషితది
   క్పాలున కతివేలసుగుణ | జాలున కల్లూరినగర • జనపాలునకున్ ||
 
క. సంధిత పరిపంధివిధా | నాంధకనీచాంధక ప్రహరణోద్ధతికిన్
   గంధాచల వింధ్యాచల • మంధాచల ధృతికి ననుమానద్యుతికిన్ ||

క. తరుణారుణఘృణికిన్ శశ | ధరమణికిన్ సురమణికిని • ధరజాగిరిజా
   సురమణి కురగరమణభా | సురపాణికి నాశ్రితసుఖ కరణసరణికిన్ ||

క. భవ్యతరనిజభుజాశక్తి వ్యాపితభరిత మరుద ధిప ముఖ్యునకున్
   శ్రావ్యపరిషేవ్యదీవ్య | న్నవ్యాభిఖ్యునకు సోమ•నాథాఖ్యునకున్ ||

క. సన్నుత దాసుకులోద్భవ | కన్నయమంత్య్రగ్రహార • ఘనపురమధ్య
   ప్రోన్నతభవనునకును సం|చ్ఛన్నగజేంద్రాజినోల్ల • సద్వసనునకున్ ||

   అంకితంబుగా నేఁ జేయంబూనిన శ్రీ భాగవత మహాపురాణంబునకుం
                          గథాప్రారంభము.

శ్రీ దేవీ భాగవతము

ప్రథమ స్కంధము

శ్లో|| సర్వ చైతన్య రూపాన్తాం మాద్యాం విద్యాఇ్చ ధీమహీ
     బుద్ధిం యానః ప్రచోదయాత్ ||

క. శ్రీద శ్రీద సముజ్జ్వల | పాద మహోత్పల మరందపాన మనీషా |
   మేదుర నతజనపుణ్య | చ్ఛేదిత కిలికలుషపాశ శ్రీ సోమేశా ||

వ. అవధరింపుము. నిఖిలపురాణ సమాధ్యాన విఖ్యాతుం డగు సూతుం గాంచి విజ్ఞాన విలసిత
    సదమలచిత్తముకురఫలదుండగు శౌనకుం డిట్లనియె |

సీ. సూత మహాభాగ సుగుణ శుద్ధచరిత్ర భూతదయాపర పురుషవర్య
   ధన్యుండ వాగమ తత్వైకవేదివి నిష్కిల్బిషుండవు నిర్మలుండవు
   వ్యాసునిచేఁ జెప్పుఁ బడిన యష్టాదశ సత్పురాణంబులు చదివినాడ
   వవి పంచలక్షణాధ్యంచితంబులుఁగావె యభ్యసించితి వీవు వ్యాసు వలన

గీ. మేము పూర్వభవంబుల నోమనట్టి | నోముల ఫలంబుగాఁగ దీనులము మము
   సుకృతులనుఁజేయ దివ్యవిరుద్ధపాప | రహిత మీ క్షేత్రమునకు నీరాక యొప్పె ||

క. ఓ పుణ్యచరిత సంసృతి | తాపరహిత బ్రహ్మసమ్మితమగు పురాణం
   బోపికఁ దెల్పవె విన ని | చ్చాపరతం జిక్కె మౌనిసంఘం బిచటన్ ||

తే.గీ. యమికులోత్తమ శ్రోత్రేంద్రియములుఁగల్గి సత్పురాణార్థములు వినఁజాలకుండ్రు
   నరులఁ గొందఱు బుద్దిహీనతన కాదె | వారు విధిచేత పంచింపఁ బడినవారు

తే.గీ. షడ్రసంబులచే జిహ్వ సాధుజనుల | పచనములచేతఁ జెవి సుఖవశతఁ టొనరు
   శ్రవణరహిత సర్పము పోలు శబ్దయుక్తి ! | జేరి వినరాని మనుజుల చెవులు చెవులె.

ఉ. నైైమిశ కాననాంతరమునం గలిభీతిఁ దపించు సంయమి
    స్తోమము తావకీయ మృదుసూక్తి సుధారసధార లాన నెం
    తే మతిపూనె నిజ్జగతి నెడ్డెలు దుర్వ్యసనాత్ములై దిన
   గ్రామముఁ బుత్తు రార్యులు దిరంబుగ నుందురు శాస్త్రచింతనన్ ॥

చ. జగమున శాస్త్రము ల్పహుల జల్పిత వాద విచిత్ర వైఖరుల్
    తగ నవి పెక్కు లందు ఘన దైవపరంబులు సాత్వికంబు లె
    న్నగను గ్రియాపరంబులు కనంబడు రాజసవృత్తి మై నిజ
    మ్ముగ నిరు హేతువాదపదము ల్చనుఁ దామస నామకంబులై.7

తే.గి. బహువిధ పురాణములు నట్ల మహిఁబొసంగు | మూడుగుణముల వృత్తుల మువ్వితముల
    గుణమణిగణాఢ్య పంచ లక్షణము లలర | వాని నన్నిఁటిఁ దెలిపితి వరుస మాకు8

ఉ. ఐదవ వేద మంచు శుభమంచు మహాద్భుత మంచు ముక్తి సం
    పాదక మంచు దుర్మదము మాస్యము కామద మంచుఁ గీర్తితం
    బై దురితాళి వో నడఁచు నట్టిది భాగవతంబు దాని న
    త్యాదరత న్విన న్వలఁతు మందఱ మిచ్చట దానిఁ దెల్పవే. 9

చ. అమృతము గ్రోలి తృప్తులయి రా సుర లట్లన తావకీయ వా
    క్యములను విన్నవారలకు నాదర మెంతయు నాలకించినన్
    దెమలద కావున న్వినిన దివ్యపురాణము లెన్ని యైననున్
    సుమహితమైన భాగవత సూక్తి కి వీనులు వేగిరించెడిన్. 10

తే.గీ. అమృతమును గ్రోల యజ్ఞంబు లాచరించి | శాంతిఁగన రెందు నేజాడ స్వర్గఫలము
    పున రథఃపాత హేతువు పురుషులకును | కాన సంసార దుఃఖంబుఁ గడపలేరు. 11

తే.గీ. లీలఁ ద్రిగుణాత్మకాభీల కాలచక్ర | వంచితులు ముక్తులగుటకు సంచితార్థ
     భవ్యవిజ్ఞానదంబైన భాగవతము | సర్వరస సంయుతం బొండె సాధసంబు.12

-: శ్రీ దేవీభాగవత స్కంధ సంఖ్యాది కథనము :-



క. అనవుడు సూతుండను నే , ననుపమ ధన్యాత్ముఁడను మహాభాగ్యుఁడ నో
      మునులార పేదవిశ్రుత | మనఘంబును నగు పురాణ మడిగితి రీరల్.13

తే.గీ. అఖిల వేదార్థ సమ్మతం బాగమోత్త | మము రహస్యంబు నై నట్టి భాగవతము
      చెప్పెద వినుండు సంయమి శ్రేష్ఠులార ! భగవతీ నామమునఁ బేరు వడసె నిద్ది. 14

మ. భగవత్యైనమ యంచుఁ బల్కి మిగులం భక్తిం దదీయేడ్యపా
     ద్యుగముం గొల్చి మనోహరంబు శుభదం బుల్లాసదం బార్య చి
     త్తగ మభ్యోద్భవముఖ్య సేవితము నుద్యద్యోగి ముక్తిప్రదం
     బగు నీ భాగవతంబుఁ దెల్పెద వినుం డత్యంత మోదాత్ములై. 15

తే గీ. విద్య సర్వజ్ఞ సచ్ఛక్తి యాద్య హృద్య, దుష్టదుర్జ్ఞేయ మునిపూజ్య దోషరహిత
     భవవినాశిని నిఖిల సంపత్ప్రదాత్రి | దేవి ప్రత్యక్షమై మంచి తెలివినిచ్చు. 16

తే.గీ. సదసదాత్మకమైన యీ జగము నెల్ల నోలిఁ బుట్టించి రక్షించి యుక్కడంచి
    తన త్రిగుణశ క్తిఁ గల్పవేళను నొకర్తు | నిలచు లోకై కమాతను నే స్మరింతు.17

తే.గీ. అజుఁడు జగ మెల్ల సృజియించు ననుచు వేద | వేత్తలు పురాణకథల గొంతెత్తి చెప్పి
    వార లా బ్రహ్మ శ్రీమహావాసుదేవు | నాభిజుం డని రస్వతంత్రతయ కాదె ?18

శా. వైకుంఠుం డహిశయ్యఁ గూర్కుతరి దేవజ్యేష్ఠుఁడుం బుట్టె ని
    చ్ఛాకేళిం దదుదారనాభి సఖిల వ్యావృత్తి నాధార శో
    భాకల్పుండు సహస్రమౌళియ కదా ప్రాల్మాల కుద్బోధ వి
    ద్యాకుం డాహరి కమ్మురారి భగవ ద్వాచ్యుండు దా నెట్లగున్. 19

తే.గీ. సలిలములు రసరూపముల్ జగతియెల్ల | నిండి యేకార్ణవంబయి యుండు నాడు
    జలధికినిఁ బాత్రరూపక శక్తి యగుచు ! సకల భూతంబులనుఁ గన్న జనని గొల్తు. 20

చ. ఉరువెఱ యోగనిద్ర హరి యుండఁగ సారసమందు నున్న యం
    బురుహభవుండు భక్తి మెయిఁ బూజ యొనర్చిన దేవి నా కొగిన్
    శరణ మటంచు నమ్మి యనిశంబును నిర్గుణముక్తి ధాత్రి బం
    ధురగుణ విశ్వమాతఁ దలఁతున్ వినుపింతుఁ బురాణ మర్మిలిన్. 21

మ. మునివర్యు ల్వినుఁ డీర లాదరమున్ మున్నూటపద్దెన్మిదై
    చను నధ్యాయములున్ గణింప దినరాట్సంఖ్యాకమౌ స్కంధముల్
    పొనరన్ శ్లోకములున్ బదెన్మిదగు వేలున్ సంస్కృతం బందునున్
    దనరన్ వ్యాసుఁడు సెప్పె భాగవతమున్ దాక్షిణ్య సంయుక్తుఁడై. 22

గీ. మొదటి స్కంధంబునను నిరుఁబదియు, రెంటబదియు రెండును, నూటముప్పదియు నాలు
    గింట నిరుబదియైదు నైదింట నెన్న | ముప్పదైదును నాఱింట ముప్పదొకటి. 23

తే.గీ. నలుబదేడింట నిరుఁబది నాలు గెనిమి | దింట, నేఁబదియగు తొమ్మిదింట, బదింటఁ
    బదియుమూడగు నిక నిరుఁబదియునాల్గు ! పదునొకొండింట, బదునాల్గు బదియు రెంట. 24

వ. ఇవ్విధంబున నిమ్మహాభాగవతఁబున స్కంధాధ్యాయ శ్లోకసంఖ్యలు పరిగణింపంబడు.
    మఱియు సర్గంబునుఁ బ్రతిసర్గంబును మన్వంతరంబులును, వంశంబులును, పంశాను
    చరితంబులును నను నైదు లక్షణంబులు కలదియై మహాపురాణంబునాఁ బ్రసిద్ధి
    గనుచుండు నదియుం గాక. 25

చ. నిరవధిక ప్రపూర్ణ గణనీయము నిర్గుణ నిత్యయున్ వికా
    రరహిత యోగగమ్య శివరమ్య మహోత్తమయుం దురీయ యై
    వఱలెడి శక్తి సాత్త్వికత, భార్గవి రాజసతన్ ద్రిలోక సృ
    ట్చరరుహనేత్ర తామసత శాంకరియంచుఁ బ్రసిద్ధయై తగున్. 26

క. ఆ మువ్వురు శక్తుల కా | మై మేనుల లక్షణంబు లాఖ్యాతములై
   భూమిన్ మించెను సృష్టికి | నై మానిత సర్గశాస్త్రహారుల చేతన్ | 27

క. ఆమీఁదట విష్ణుండు పితామహుఁడును భూతపతియుఁ దగఁ బొడముటయే
   వేమఱు సృష్టి స్థితి లయ సామగ్రికి నై యొగిఁ బ్రతి సర్గం బయ్యెన్|28

తే.గీ. అమృతకర భానుసంభవులైన యట్టి క్షత్రియుల వంశములు స్తుతి సలుపు టెల్ల
   నల హిరణ్యకశి ప్వాది కులము లెన్నఁబడుట వంశం బటందు రెప్పుడును బుధులు ||29

క. స్వాయంభువ ప్రభృతి మను | నాయక వంశప్రకీర్తనంబును గాల
   వ్యాయామము లెెన్నుటయును | న్యాయత మన్వంతరంబు లందురు పెద్దల్ |30

క. మనువంశంబులఁ జెప్పుట | యనయము వంశానుకీర్తనాఖ్యం బయ్యెన్
   వినుఁ డిట్లు పంచలక్షణ | మనబడియెఁ బురాణపఙ్తి యార్యులచేతన్ ||31

క. వర భారతేతిహాసము | పరఁగంగ సపాదలక్ష పద్యాన్వితమున్
   విరచించె వ్యాససంయమి | ధరఁ బంచమ వేద సమ్మతం బది నుండీ ||32

వ. అనిన నాలించి హర్షోత్కర్ష మానసుండై శౌనకుం డిట్లనియె.33

తే.గీ. ఆ పురాణోత్తమము లెవ్వి యవ్వి యెంత | సంఖ్యకలయవి తెలుపవే సంయమీంద్ర
    యయ్యది సవిస్తరంబుగ నాలకింపు | శ్రవణములు గోరు రోమహర్షణతనూజ |34

క. కలికాలభీతులము మే మలఘుస్థితి నిందు నైమిిశారణ్యమునన్
   మెలఁగుదుము బ్రహ్మయానతి | దలఁపడి నిరవధిక సౌఖ్య తంత్రజ్ఞులమై ||35

క. మాకిచ్చె గృపామయుఁడై  : లోకేశుఁడు చక్రమొకటి లోలత నిదియే
   మీకుం బావన భూమిన్ | వీఁకఁ దెలుపఁగలదు దీని వెంటం జనుఁడీ || 36

క. ఇది సంశీర్ణం బగు నే | పదమున నది పావనంబు పట్టదు కలి యా
   పదమున నుండుండీ కలి | తుదదనుకన్ సత్య యుగము తోఁచెడి నంతన్ ||37

క. అని పద్మజుండు సెప్పిన | విని మే మందఱము దాని వెంటం జనఁగా
   ననుపమ చక్రం బందఱు , కనుచుండఁగ శీర్ణ మయ్యెఁగద యిచ్చోటన్ ||38

తే.గీ. కాననే యిది నైమిశ కాననాఖ్యఁ బడసె బరమ పవిత్రమై పరఁగె నిందుఁ
   గలి ప్రవేశింపఁ డెపుడును గాన నేను నందఱు తపస్వులను గూడి యింద యుందు ||39

ఆ.వె. కృతయుగంబు దనుక నేజాడ నేనియుఁ గాల మపనయింప గలుగు మాకు
   వేడు కలరగా బురోడాశముఖముల | సవనములు పొసఁగు పశువులు లేక|| 40

క. మాపుణ్యంబుననేకద | ప్రాపించితి నీవు ధన్యభావం బొదవన్
   మాపాలఁ గలిగి తెలుపవె | తాపసపరః బ్రహ్మ సమ్మిత పురాణంబున్ || 41

క. కోరికఁ దీరిక సుంటిమి | చేరిక వినఁ దలఁతు మేకచిత్తులమగుచున్
   లేరిక నీవలె వక్తలు | భూరికథాసార చారు పుణ్యవిచారా. 42

తే.గీ. నీవు దీర్ఘాయుఁడవుకమ్ము నిర్మలుఁడవు | తాపవర్జితుడపు కృపా తత్పరుఁడవు
   పరమపుణ్యంబయిన యట్టి భాగవతముఁ జెప్పవే మాకు సూత విశుద్ధచరిత. 43

క. ధర్మార్థకామముల విధి మర్మంబులు దెలిపి జ్ఞానమార్గంబును నీ
   కర్మిలిఁ జెప్పెను శమ దమ | నర్ముఁ డగుచు మోక్షసరణి వ్యాసుడు ప్రీతిన్. 44

తే.గీ. భగవతీనామమునఁ బొల్చు భాగవతము | నాట్యముంబలెఁ జి త్రంబు నవ్యభవ్య
   దివ్యగుణగణలలితంబు దీర్ఘ కామ కందమై యొప్పు నది మాకుఁ గరుణఁ దెలుపు. 45

-: పురాణసంఖ్యాది వివరణము :-



వ. అని పల్కిన శౌనకుల గాంచి తత్రస్థుల - నెల్ల ఋషులును వినునట్లు సూతుం
    డిట్లనియె. 46

చ. కడఁగి పురాణ వైఖరుల కట్టడుల న్మునివర్యులార! సొం
    పడరఁగఁ దెల్పెదన్ వినుఁడు వ్యాసుడు తొల్లి వచించినట్టు లే
    ర్పడఁగను మద్వికంబు మఱి బ్రత్రికభద్వయకూస్వనాపముల్
    తొడిఁ బ్రథమాచ్చునింకవ చతుష్టయలింగము లౌఁ బురాణముల్ ॥47

సీ. పదునాల్గు తొమ్మిది పదునాలుగున్నర పదియునెన్మిది పది పదియు రెండు
    నూఱునుఁ బదునెన్మి దారూఢిఁ బదియేడు నెనుఁబదొక్కటియును, నిరుఁబదైదు,
    నేఁబదైదు, పదాఱు, నిఁకఁ బది , ర్వదినాలుగాఱువందలు, నిర్వ దవల మూడు,
    నిరువదినాలుగు, నిఁకఁ బదొకండును నేకోనవింశతి, యివియ వేలు

గీ. మాత్స్య మార్కండక భవిష్య భాగవతక | బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త కూర్మ
    స్కాంద నారద పద్మాగ్ని సత్పురాణ | చారు వామన వాయు వైష్ణవ వరాహ
    లింగ గారుడములు క్రమ లీల బొసఁగి || 48

వ. ఇవి పదునెన్మిదియు మహాపురాణంబు అనఁబడు నింక, 49

సీ. క్రమత సనత్కుమారము నారసింహము నారదీయము శివ నామకంబు
     లలిత దౌర్వాస కపిల మానవౌశన సవరుణ కాళికా సాంబ నంది
     సౌరంబులును బరాశరము నాదిత్యంబు వరమహేశ్వర భాగవత వశిష్ఠ
     సంజ్ఞికంబులు వీని సద్బుదు లుపపురాణము లని పల్కుదు రమలధిషణ

తే.గీ. నివియుఁ బదునెన్మిదియ సుఁడీ, యిన్నిఁ జెప్పి భారతాఖ్యాన మతులందు, పావవంబు
      డా రచించెను వ్యాసుండు తత్వవేది యేమి సెప్పుదు నతని కృపామహిమము. 50

 
తే.గీ. ప్రకటితంబుగ మన్వంతరముల నెల్ల ద్వాపర ద్వాపరంబున ధర్మవేది
    యైన వ్యాసుండు దాఁ బురాణాగమములఁ | జెలఁగుచు యథావిధిగ జేర్చిఁ చెప్పుచుండు. 51

క. ప్రతి ద్వాపరమున విష్ణుం డతులమతి న్వ్యాసరూపుఁడై పుణ్యములౌ
    శ్రుతులం బహు విధములఁ దా | న తికించు న్లోకమునకు నతిహిత మొదవన్ ||52

క. కలియుగమున నల్పాయువు | గలవారలు నల్పమతులుగద మనుజు లటం
    చలపడి పురాణసంహిత | లలరించు న్మేలెఱింగి యమిపతి కరుణన్ || 53

తే.గీ. పడతులకు శూద్రులకు ద్విజ బంధువులకు , వేదములు దూరములు కాన వెలయు వారి
    క్షేమమునకుఁ బురాణము ల్చెప్ప బడియె | వ్యాసమునిచేతఁ గరుణామయూత్ముచేత ||54

తే.గీ. సప్తమంబైన యీ వివస్వత్తనూజ | మనువు కాలంబునం దిర్వదెనిమిదవది
    ద్వాపరము ప్రాప్తమాయెనో తపసులార ! యుర్వి సత్యవతీసూనుఁ డుదితుడాయె ||55

ఉ. నాకు గురుండు ధర్మకలసంబు లెఱుంగు మహామహుండు లో
    కైక హితుండు వ్యాసుఁ డిపు డారయ ద్వాపరసంఖ్యవాఁడు మున్
    శ్రీకరు లిర్వదేడుగురు చెల్లిరి ముప్పది కొండు తక్కువౌ
    ప్రాకటసంఖ్యవాఁ డగుచు ద్రౌణి యిఁకం బొడమున్ ధరాస్థలిన్.56

ఉ. నావుఁడు మౌను లో మునిజనప్రవరా! మును ద్వాపరంబులన్
    వావిలి సత్పురాణముల వక్తలుగా నలరారి భూమి ను
    ద్భావము పొందినట్టిరగు వ్యాసులఁ జెప్పు మటన్న సూతుఁడో
    పావనులార | మీ చెవుల పండువుగా వినుఁడంచు నిట్లనున్ ||57

సీ. మొదటి ద్వాపరఘుది మొనసి స్వయంభువు సరవి రెండవది ప్రజాపతియును
    మూఁడవ దుశసుండు మొగి నాల్గవది బృహస్పతి యైదవది యెన్న సవిత యాఱ
    వది మృత్యు వేడవయది మఘవుం డెన్మిదవది వసిష్టుండు తనరఁ దొమ్మి
    దవది సారస్వతుం డవలను బదియవయది త్రిధాముఁడు మరి పదునొకొండ

తే.గీ. వదియ త్రివృషుండు పండ్రెండవది తలంప | బొరి భరద్వాజుఁడునుఁ బదిమూఁడవయది
    యంతరిక్షుండు పదునాల్గువదియు ధర్ముఁడంతఁ బది నేనవదియుఁ ద్రయ్యారుణియును
    నియతిఁ బదునాఱవది ధనంజయుండు నైరి.58

సీ. పదునేడవది ముదం బొదవ మేధాతిధి పదియునెన్మిదవది ప్రతియుఁ బదియు
   తొమ్మిదవది యత్రి తొడి నిర్వదవయది గౌతముఁ డిర్వడొక్కండవయది
   యుత్తముం డిర్వదియును రెండవది వేనుఁ డిర్వదిమూడ్వది యెసఁగ సోముఁ
   డిర్వదినాల్వది తృణబిందుఁ డిర్వదియైదవయది భార్గవాఖ్యుఁ డొప్పు

తే.గీ. నిర్వదాఱవయది శక్తి యిరువదేడ్వ, దెన్నఁదా జాతుకర్ణుండు నిర్వదెన్మి
      దవది నేటిది ద్వైపాయనాఖ్యుఁడగుచు . వ్యాసమూర్తులు వెలసె నిర్వ్యాజ మహిమ || 59

క. తాపసులారా | కృష్ణ ద్వైపాయనుఁ డఖిలవేది వ్యాసుండు దయా
   కూపారుం డస్మద్గురుఁ | డేపారన్ భాగవతము నేర్పడఁ జెప్పెన్ ||60

క. భాగవత మఘవినాశము | భాగవతము ధర్మదంబు పరమార్థదమున్
   భాగవతము కామద మీ | భాగవతము మోక్షదంబు భక్తియుతులకున్ ॥61

క. భాగవతం బెన్నఁగ స ర్వాగమసారము ముముక్షుపరసాధనమున్
   భాగవతము విజ్ఞాన | ప్రాగల్భ్యముఁ గలుగఁజేయు బరమౌషధమున్ || 62

చతురవృత్తము.
   పరమశుభం బని భాగవతముఁ దా | సరణినిఁ బుట్టిన యాత్మసుతునకున్
   గరుణ శుకర్షికిఁ గొమరహిత ధీ వరునకుఁ జెప్పెను వ్యాసముని దగన్. 63

క. వ్యాసుండు సెప్పుచుండగ | నా సరసన వింటి నే యథార్థముగా న
   భ్యాసవశంబున సకలము | భాసితముగ బుద్ధినిలుపఁ బడియెం జుమ్మీ ||64

తే.గీ. అయ్యయోనిజుఁ డైన శుకాఖ్యుడడుగ | పరమగుహ్యపురాణంబు భాగవతము
   సెప్పె వ్యాసుండు, దాని విశేషబుద్ధిఁ | దప్పక గ్రహించితిమి మేము తపసులార 65

నవగీతి.
    శ్రీమద్భాగవతం బను కల్పక వృక్షముఁ జేరి శుకుండు సదా
    కామక్రోధముఖాన్విత సంసృతి కలధిజలంబుల దాఁటుటకున్
    బ్రేమన్ సర్వరసాలయ మంచు వినెన్ జెవులారఁగ వేడ్కగలా
    రై మీ రిద్ది వినం గలికాలభయం బొక యింతయు నంట దిలన్ ||66

తే.గీ. అఘములొనరించి వేదధర్మాచరణము | మానియున్నట్టివాఁడైన మహినొకండు
    వ్యాజముననొండె వినెనేని భాగవతము | నైహికాముష్మికఫలంబు నందునండ్రు ||67

తే.గీ. హరిహరాదుల కందరా కఖిలలోక | మాతయై గుణమెఱుఁగక మహిమగాంచు
    విద్య సచ్ఛక్తి భగవతి హృద్య నిత్య | భాగ్య యగు దేవి దీ మహాభాగవతము. 68

క. ఏవాఁడు భాగవతమున్ భావగతము సేయు వాఁడు పరమోత్తముడై
    శ్రీ విద్యావిలసితుఁ డై | యావలను బునర్భవంబు నందఁడు సుండీ ||69

క. ఏవాఁడు భాగవతమున్ | భావగతము సేయఁ డట్టి పామరుఁడు విధి
    వ్యావంచితుండు నమ్మడు | కేవల పశు వట్టివాఁడు కీర్త్యుం డగునే || 70


శు కో త్ప త్తి



వ. అనిన సూతుని వచనంబుల కలరి శౌనకాది మహర్షు లిట్లని యడుగం దొడంగిరి. 71


ఉ. వ్యాసుని భార్య యెద్ది శుకుఁ డాతని కెట్లుదయించె సంహితా
     భ్యాస మయోనిజుం డయిన యాతఁడు సేసిన రీతి యెద్ది ని
     స్త్రాసుఁడు వాని కె ట్లరణిజత్వము వచ్చెను శంకఁ దీర్పవే
     భాసుర ధీసమేత | నిరపాయ గుణాన్విత సూత! ప్రీతితోన్ 72

వ, అనిన సూతుం డిట్లనియె.73

ఉ. మేటి సరస్వతీ నది సమీపమునందుఁ బరాశరాత్మజుం
    డాటకుఁ జొచ్చు పిచ్చుకల యందపుజోటిని వాని చెంగటన్
    గూటను గ్రొత్తగా ముదురు గ్రుడ్డున వెల్వడి కెంపు ముక్కు మేల్
    పాటిలు వన్నె మేనుగల పక్షి కిశోరము పింఛముం గనెన్. 74

క. ఆ పక్షి ద్వంద్వం బొగి | నా పిల్లకు మాటి మాటి కాహారంబున్
    మేపుచు మేనను మే నిడి | పై పైఁ బొదువంగఁ గాంచి పరమ ప్రీతిన్ 75

క. ఎంతయుఁ జిత్రము తిర్య గ్జంతువులకుఁ గూడ నెనరు కలదుగదా య
    త్యంతము మనుజుల కుండుట , వింతయె సేవాఫలంబు వేఁడుట కతనన్. 76

క. తనరు వివాహము సుఖసాధన మగుచును రమ్యమైన దార ముఖంబున్
    గనుటవలన ముసలితనంబునఁ బరిచర్య లొనరింపఁ బొసగుట వలనన్. 77

ఆ.వె. పుణ్యవంతుఁడైన పుత్రుఁడు గల్గెనా | ధనము సంగ్రహించి తర్పితాత్ము
    లనుగఁ జేయగలఁడు జననిని జనకుని గాచి యున్నఁ ప్రేత కార్య మొసఁగు. 78

క. ఆలాగునఁ గాకుండిస | నేల గయాశ్రాద్ధమైన నిడక తొలంగున్
    నీలోత్సర్గం బైనను | బాలకుఁ డిడకున్నె చటక భాగ్యం బలఁ తే. 79

క. జగ దుపకారు లపుత్త్ర స్య గతిర్నాస్తి యని పలికి రాగమ పఙ్త్కిన్
    దగఁ ద్రిదశాలయ మబ్బునె | మగసంతతి లేక యున్న మనుజునకు భువిన్.80

క. సుఖములలో నుత్తమ మగు సుఖ మెన్నఁగఁ గన్న కొడుకు శుభ దేహము ను
    న్ముఖుఁడై కౌఁగిటఁ జేర్చుట నఖిలస్థితి పూని లాలనము సేయుటయున్. 81

తే.గీ. కన్న కొడుకుకంటెఁ గలదె వేఱొక్కటి | కొడుకు పాపములను గొట్టువాఁడు
    పాపహాని మనకుఁ బ్రత్యక్షమా యను మానమా ? యటంచు మానరాదు.82

క. స్మృతిశబ్ద మాప్త వాక్యము | క్షితినిఁ బ్రమాణంబుఁగాదె శ్రేయంబులకున్
    సుతుఁ డే గతి మృతివేళను సుతహీనుఁడు మానసమున శోకములఁ గనడే.83

చ. అమిత ధనంబు గల్గిన మహత్తర మందిర మున్న నాయకో
   ద్యమము వహించువాఁడు కలఁడా యుసురేగిన వెన్క నంత్యమౌ

    సమయమునందు విస్తృత విషాదము తక్క మఱొండు గందుమే
    క్షమ సుతు కన్న నెక్కుఁ డగు సాధన మెద్ది సుఖోపలబ్ధికిన్. 84

వ. అని. 85

క. ఏపంవిధ నానాచిం తావేగ మనస్కుఁ డగుచు వ్యాసుం డపు డెం
   తే వెచ్చ నూర్చి యయ్యో ! యే వెఱవని యెట్టకేల కిట్లని తలఁచెన్.86

క. నా వాంఛిత మీఁ జాలిన , యే వేలుపుల గోల్తు హరినొ యీశునొ విధినో
   యా విఘ్నపతినొ పహ్నినొ| దేవపతి స్కంద వరుణ దిననాధులనో || 87

ఆ.వె. అనుచుఁ దపము సేయ నమరాద్రికిం బోయి | దాని పంచనుండఁ దనకుఁ దాన
    వీణ కేల గాడ్పు వీవంగ మ్రోఁగఁగా | నారదుండు వచ్చె చారులీల ||88

ఉ. వచ్చిన బ్రహ్మపుత్రుఁ గని వ్యాసుడు నర్ఘ్యము పాద్య మిచ్చి తా
    మచ్చిక నర్హ పీఠము సమర్చి శుభంబును బ్రశ్నచేసి యే
    యొచ్చెము లేక యుండఁ గని యొద్దిక నారదమౌని వ్యాసుతో
    నిచ్చట నీవు చింతిలఁగ నేము కతం బెఱిఁగింపు మా యనెన్ ||89

ఉ. నావిని వ్యాసుఁ డిట్లనియె నారదమౌనివరేణ్య ! నేను చిం
    తావశత న్నెగుల్కొనఁ గతంబు సుతు ల్గతు లండ్రు నాకు లే
    దా విధి నేను వేఁడఁదగు దైవమ దెద్ధియొ పుత్త్ర లబ్ది కం
    చో విమలాత్మ పుత్త్రు నిడ నోపిన దైవముఁ దెల్పి ప్రోవవే || 90

తే.గీ. నీవు సర్వజ్ఞుఁడవు కృపా నిధివి జగము మే లరయుచుందు వేవేళ మేటి వెల్ల
    మునులకును గోరకయ వచ్చి ముందునిల్చి, యడిగితివి కారణంబు నా గొడవ కనఘ 91

వ. అని చెప్పి సూతుండు మఱియు నిట్లనియె. 92

క. అని యిట్లు వ్యాసుఁ డడిగిన | విని నారదుఁ డనియె వ్యాస వికృతి నిరాసన్
    విను నేను జెప్పెదను నీ | కనువగు మార్గంబు పుత్త్రకావాప్తికినై. 93

తే.గీ. మున్ను నాతండ్రి పరమేష్ఠి మురవిరోధి | దేవదేవుని శ్రీనాధు దివ్యచరితుఁ
    గనక చేలుఁ జతుర్భుజుఁ గౌస్తుభధరు | ధ్యానగతుఁ గాంచి యరుదంది యడిగె నిట్లు.94

తే.గీ. భువనరక్షక దేవేశ భూతభవ్య భవదధీశ్వర వైకుంఠభవన శౌరి
    యేమి కారణమునఁ దపం బిట్టు లాచ | రించుచును ధ్యానమున నుంటి వెఱుఁగఁ దెలుపు.95

శా. ఎంతే వింతకదా జగంబులకు నీ వీశుండ వాచ్యుండ వ
    త్యంత ధ్యానగతుండ వైతివి భవ న్నాభిం దగం బుట్టి య
    శ్రాంతంబున్ జగమున్ సృజించెదను నే స్వామీ! భపత్సేవ్యకా
    క్రాంతి గన్న మహానుభావుఁ డొకఁ డింకం గల్గునే తెల్పుమా || 96

ఉ. నీవ సమస్త లోకముల నేతపు కర్తవు హర్త వౌదు నీ
    సేవ యొనర్చి నే జగము సృష్టి యొనర్తు హరుండు ద్రుంచు నా
    జ్ఞావిధి సూర్యుఁడుం దిరుఁగు గాడుపు వీచును వహ్ని మండు నం
    భోవహపఙ్త్కియు గురియు భూరి గుణోదయ సాధుసంశ్రయా. 97

క. నీకుసు ధ్యేయము కలదా | కాకున్నఁ దపంబు సేయఁ గారణ మేమీ
   యో కరుణామయ తెలుపవె యేకడఁ బెద్దలకుఁ గలవె యిల గోప్యంబుల్. 98

క. అనిన విని విష్ణుఁ డజునకు • ననియె న్వినుమంచు నోయి యమరజ్యేష్ఠా
   నను నీ వడిగిన యర్థము : వినఁ దగినద కాదె సర్వ విధముల నెన్నన్. 99

తే.గీ. ఈవు సృజియింతు రక్షింతు నేను హరుఁడు | సంహరించును జగమెల్ల శక్తి యొకటి
   గల్గి యున్నందుననె సుమ్ము కాకయున్న | నలతుల మశక్తులము దీనిఁ దెలిసికొమ్ము.100

తే.గీ. సర్గ మీవు రజోగుణశక్తివలన | యుక్తి నేఁ బ్రోచు టది సత్త్వశక్తివలన
   సంహరణ మీశ్వరుఁడు దమ శ్శక్తి వలన | సలుపుదుము మన యేలిక శక్తి గాదె. 101

తే.గీ. శేషుఁ డాధారమై యుండఁ జెలఁగి యేను నస్వతంత్రుండనై నిద్ర నంది యుండ
   గాలవశమున మేల్కాంచి కడఁగి తపము | సలుపుచును విహరింతు శ్రీలలనఁగూడి. 102

గీ. కొన్ని యెడలను దానవకోటితోడ | సమర మొనరింతు దేహంబుఁ గుములఁజేసి
   సకలలోక భయంకర ప్రకటలీల | నిల పయోమయమై నప్పుడెల్ల రెరుఁగ || 103

తే.గీ. కర్ణ మలజులయిన మధు కైటకులను | నసురవర్యుల నెదిరించి యైదువేల
   హాయనమ్ములు బాహుజన్యమ్ముఁ జేసి , దేవికృప వారిఁ ద్రుంచుట యీవెఱుఁగవె. 104

తే.గీ. కాన నద్దేవియే సర్వ కారణ మని | శక్తిరూపిణి యని సుఖశాలిని యని
   యీవు నెఱుఁగుదు వట్లయ్యు నింక నింక | నడుఁగ నేటికి సుధ్యేయ మదియ నాకు.105

క. ఇచ్ఛాయోగంబుననే నచ్చజలధి మీనరూప మందితి మఱియున్
   గచ్ఛపమ నైతిని వరాహచ్ఛాయుఁడ నృహరి వడుగ నైతిం గంటే. 106

ఉ. ఇంపులు సొంపులుం గులుకు నిందిర పొం దెడఁబాసి యెంతయున్
    దెంపున నీచ జంతువుల దేహఘులం ధరియించి శయ్యయున్
    గొంపయుఁ గాన కెవ్వఁ డరుగున్ సమరంబులకున్ స్వతంత్రతన్
    బెంపు వహించు నేనియును వే యిక నేటికి నీ వెరుంగవే. 107

చ. నలినజ! పూర్వకాలమున నా తల కార్ముక విస్ఫురద్గుణ
    స్ఖలనముచేత వీఁడి చనగా హయశీర్షము నీవ తెచ్చి నే
    ర్పలరఁగ శిల్పివర్యు పని నచ్చుగఁ గూర్చిన నే హయాననో
    జ్జ్వలతఁ బ్రకీర్తితుండనయి పాటిలు టీవ యెఱుంగుదే కదా. 108

క. నే నాత్మపరుఁడనైనది , కానిది నీవే యెఱుంగఁ గలవు కదా నీ
   మానసమున శక్తి స్వాధీనుఁడ గావుననే యట్టి దేవిం దలతున్. 109

వ. ఇట్లు హరి విరించికిం దెల్పెనని చెప్పి యమ్మహర్షిశేఖరుం డగు వ్యాసునితో నారదుండు
మఱియు నిట్లనియె.110

తే.గీ. అట్టుల జనార్దనుఁడు కమలాసనునకుఁ , జెప్పిన విధంబు పరమేష్టి చెప్పె నాకుఁ
   గానఁ గల్యాణ పురుషార్థకాంక్ష దనర ! నీవు భగవతి గొల్చిన బ్రోవఁగలదు. 111

-: హయగ్రీవావతారము. :-


వ. అవి మరియు శౌనకాదులకు సూతుం డిట్లనియె. 112

క. ఈ పగిదిం గలహాశనుఁ | డేపారఁగ వ్యాసునకును నెఱింగించినఁ దా
   నోపికతో వ్యాసుఁడు దే వీ పాదము లాశ్రయింప వెడలెం గిరికిన్ 113

వ. అనిన విని శాసకాదులు విస్మయంబుతో రోమహర్షణి కిట్లనిరి. 114

చ. సకల జగత్ప్రభుత్వ విలసన్మహిమాతిశయప్రవర్ణ్య రూ
    పకలితుఁ డాదికారణుఁడు ప్రాపకుఁ డింద్రముఖామరాళికిన్
    బ్రకటితుఁ డంచు వేదములు ప్రస్తుతిఁ జేసెడి దైత్యవైరికిన్
    బెకలెను మస్తకం బనిన విస్మయ మయ్యె సుధీవతంసమా || 115

తే.గీ. మౌనిపవర సందియము దీర్పు మాకు నేఁడు | నిది జగద్విస్మయమునకు 'హేతు వయ్యె
    హరి హయగ్రీవుఁ డగుటకు నతని శిరము | పోవుటయ కారణంబంటి వీవు సూత. 116

క. అన విని సూతుం డనియెన్ | వినుఁ డో మునులార యిది సవిస్తరముగ మీ
    రెనయ నవహితుల రగుచున్ ఘనుఁ డగు హరిహయగళుండు గావుటకతమున్. 117

4. నళినదళాక్షుఁ డాద్యుఁడు సనాతనుఁడైన రమావిభుండు ని
    శ్చలత నొకప్డు దారుణదశన్ రణమున్ బదివేల యేండ్లు దా
    సలిపిన వేసటన్ సమవిశాలభువిం గమలాసన స్థితిన్
    వెలయుచు భూమిపై నిలుపు వింటిని సజ్యము నఱ్త దాలిచెన్.118

ఉ. తాలిచినట్టి వింటికొనఁ దా బరు వంతయు నిల్పి కూర్కినం
     జాలఁగదైపయోగమున స్వాసము మిక్కిలియై యటుండు న
     క్కాలము నందు వాసవముఖ త్రిదివౌకసు లంబు జాతభూ
     శూలులఁ గూడి యాగమును జొప్పడఁ జేయఁగ బూని వేడుకన్. 119

క. నారాయణునిఁ గనుంగొను | కోరిక వైకుంఠ మేగి గోవిందుఁ గనన్
    నేరక దివ్యజ్ఞాన వి శారదులై చనిరి విష్ణు సన్నిధికి వెసన్ 120


ఆ.వె. యోగనిద్ర నున్న భోగిశాయిని జూచి, విష్ణు నిదుర కడలి వింతనొంది
     యచట నిలచి విధియు హరుఁడును మున్ను గా నమరులకును శక్రుఁ డనియె నిట్లు. 121

ఉ. ఏమి యొనర్చువార మిపు డీ హరి నిద్దుర సూడ నద్భుతం
     బౌ మన మిప్డు దానికిని భంగము సేయు విధంబు సెప్పుడీ
     నా మదనారి యిట్లను మనంబునఁ దాఁ బరికించి యో సుర
     గ్రామపతీ హఠాత్తుగ సుఖంబగు నిద్ర నడంచు టొప్పునే. 122

వ. అనిన నంత.123

ఉ. జన్నము తప్ప దిప్డు సురసత్తములార వినుం డనింద్యమౌ
    పన్నుఁగడన్ వచింతు నని పద్మజుఁడే నిపు డొక్క వమ్రి ను
    త్పన్నము చేసి పంపినఁ బదంపడి యుద్ధి శరాసనాగ్రమున్
    దిన్న నడంగు నప్డు హరి నిద్రఁ దొలుగు సవంబు సేకుఱున్. 124

తే.గీ. అనుచు వైళంబ పరికించి యజుడు వమ్రి | నొక్క దానిని సృజియించి యోసి వమ్రి
    హరి శరాసాగ్రమును దిని యతని నిదుర | నడవు మని యానతిచ్చిన నాలకించి. 125

తే.గీ. నిద్దురకు భంగ మే నెట్లు నేర్తుఁ జేయ | నాదినారాయణుఁడు సూడ నఖిల గురుపు
    కార్యమూ చూడఁ బాతిత్య కారణంబు | నన్నుఁ బంపుట కూడునా నలినగర్బ. 126

తే.గీ. నిద్రకును భంగ మొనరించు నీతి రహితు నకుఁ గథాచ్చేద పాతకం బొకటి దంప
    తీప్రణయభేదనం బొండు దివిర్ మాతృ , శిశు విభేదన మొక్కండు చెందకున్నె. 127

తే.గీ. ఒక్కనాటి తిండి యొక తిండిగాదుసుం డెల్లకాలమునకు నెద్ధియేని
    దిండి దొరికెనేనిఁ దెగబారి చేసెద, ననిన వమ్రి గాంచి యజుఁడు పలికె. 128

తే.గీ. హోమకర్మలందు నొనరంగఁ బ్రక్కల | బడిన హవిసు నీకు భాగ మిత్తు
    వేగ నేగి నీవు వింటికొప్పునుఁ దిని | హరిని మేలుకొల్పు మనిన వమ్రి. 129

క. వనజభవు నానతిం గొని | చని యంత శరాసకోటిఁ జప్పగ భక్షిం
    చినఁ దెగియె నారి పశ్చిమ మున నుత్తరకోటి యపుడు భోరన నూడెన్. 130

సీ. పటపట బ్రహ్మాండ భాండంబు క్షోభిల్లె గడగడ సాచల క్షమ వడంకె
    గళగళ నంభోధి జలము లెల్లఁ గలంగె ఱివ్వుఱివ్వున గాలి ఱేఁగి వీఁచె
    తటతటఁ బర్వతస్థల సానువులు రాలె జలజలని మహోల్క లిలఁ దొరంగె
    మలమల దెస లెల్ల మాడి ఘోరము లయ్యె మకమక సూర్యుండు మాసి క్రుంకె

తే.గీ.ఢమ్ము ఢమ్మను భయద శబ్దమ్ము పుట్టి | కుండలంబులతోడ వైకుంఠు శిరము
     హేల నుప్పరమునకుఁ బెల్లెగసి యెందె | వడియె వడిసెలలో ఱాయి పగిది నపుడు. 131

ఉ. అంతట నంధకార విలయం బగుడున్ సుర లెల్ల విస్మిత
    స్వాంతత నుత్తమాంగరహితాచ్యుతుఁ జూచి విషాద మెచ్చఁగా
    నెంతయు బాష్పము ల్దొఱఁగ నేడ్చిరి బావని హా రమేశ హా
    కాంత యనంతసంతతసుఖప్రద కేశవ యంచు నొక్కటన్. 132

క. ఏ దేవు మాయయో యిది | యీ దివ్యశరీరమునకు నిది యొప్పిదమే
   యో దేవదేవ నీకునుఁ బై | దైవము కలదె యిట్టి పాట్లకుఁ దగుదే. 133

తే.గీ. ఇది తలంపఁగ రాక్షస కృతము గాదు యక్ష కృతమును గాదు దైత్యవర కృతము
   గాదు దేవతలము మేమె కారణంబు ! కాన నెవ్వరి దూషింపఁగలము మేము.134

తే.గీ. ఏము పరతంత్రులము మాకు నెవ్వ డింక | శరణ మయ్యెడు నయ్యయో శిరము లేని
   కమలదళ నేత్రుఁ జూడంగఁ గలమె యిపుడు | కలఁగి వలవల వలపోయఁగలము గాక. 135

తే.గీ. మాయ కీశ్వరుఁడైన యీ మాధవునిఁ గబంధమాత్రునిఁ జేసిన మాయ యెదియొ
   కాదు సాత్త్విక రాజసి కాదు కాదు ! తామసి యిదేమి చిత్రమో తలఁపరాదు.136

క. అని విలపించెడి దేవతలనుఁ గని పరమేష్టి యూరడం బలుకుచు శాం
   తిలఁ జేసి మహామహులై యలరెడు మీ రిట్లు శోక మందఁగ నేలా. 137

క. శోకించుటచే ఫల మే లా కలుఁగు నిరర్థక ప్రలాపము వంకన్
   బోక గతమునకు నేడ్వక | పై కార్యము సూచువాఁ డుపాయజ్ఞుఁ డిలన్. 138
 
క. దైవమును బురుషకారము , నే వెరవున రెండె కావె యిందును బురుష
   వ్యావృత్తి మానకుండిన నా వెనుకం దైవమే ఫలావాప్తి యిడున్. 139

వ. అనిన నింద్రుండు. 140

తే.గీ. దైవమే యెక్కుఁడగు నెందుఁ దలఁచి చూడఁ | బురుషకారంబునకు ఫలస్ఫూర్తి లేదు
    నిర్జరులు సూచుచుండంగ నిఖిలలోక | పాలకుండగు హరికె యిప్పాటువచ్చె.141

వ. అనినం బితామహుండు.142

క. కాలప్రాప్తం బగు నది , వాలాయం భనుభవింప వలసినదేకా
    మేలైనను గీడైనను, వీలౌనే యతిక్రమింప వెస దైవికమున్.143

క. సందియము లేదు దేహికి | నెందు సుఖము దుఃఖము భుజియింపక పోవన్
    సందు గలదె నాకును మునుఁ | గందర్పహరుండు శరము ఖండించె జుఁడీ.144

ఉ. శాపవశంబునన్ ద్రిపురశాసను లింగము డుల్లె నట్టులే
    శ్రీపతి మూర్థముం దెగె శచీపతి కయ్యె సహస్రయోని తా
    ప్రాపణదుఃఖముం దిగువుబాటును స్వర్గము నుండి మానస
    వ్యాపిసరోజవాసమును హా యిక నేరికి లేవు దుఃఖముల్. 145


ఉ. కాన విషాదమున్ దొఱఁగి కార్యము నారయుఁ డింకమీద వి
    ద్యానిధు లీరు సర్వజగదంబ సనాతని మూలకంద వి
    జ్ఞానవిశాల దేవి పరశక్తి సమస్త చరాచరంబులన్
    దాను భరించు నట్లగుట ధ్యానము సేయుఁడు భక్తియుక్తులై. 146

వ. అని చెప్పి సూతుం డో మహర్షులారా పద్మసంభవుండు పూర్వోక్తవిధంబునం దేవ
     తల నూఱడించి తన యెదుట నిజశరీరంబులతో నిలువంబడియున్న నిగమంబులం
     గని యిట్లనియె. 147

మ. స్తుతిఁజేయుం డికఁ గార్యసాధనిని సంతుష్టాత్మభక్తవ్రజన్
    సతి గూఢాంగి సనాతనిన్ సుగుణ సచ్ఛక్తి న్మహామాయ నం
    చతిభక్తిన్ వచియింపఁగా విని శ్రుతివ్యాహారముల్ సుందరా
    కృతు లై దేవిని సర్వలోకజననిం గీర్తించె సంప్రీతిమై. 148

దండకము. దేవీ సమస్త ప్రపంచాత్మ వస్తు ప్రశస్తత్వ విస్తారిణీ | నిస్తులానన్త ధీస్తుత్యుదార
    ప్రకార ప్రచార ప్రభాకార సంచార సంశోభినీ ! నిర్గుణా ! దుర్గమానర్గళా ! స్వర్గదా !
    వర్గదాత్రీ ! జగజ్జాల కర్త్రీ ! నమ జ్జీవభర్త్రీ , ద్విషజ్జాతిహర్త్రీ , కనన్, శ్రీవి నీవే
    యికన్ ధీవి నీవే క్షమా శాంతి కాంత్యాదులు న్నీవె మేధా ధృతుల్ నీవె యుద్గీ
    థమం దర్ధ మాత్రంబు నీవే నిజం బెస్న గాయత్రియు న్నీవె కీర్తి స్పృహాదుల్ జయా
    దుల్ మహామాయవు న్నీవె యా సత్తునుం జిత్తు నానందము న్నీవె కా వాక్స్మృతి
    హ్రీవరేణ్యాది రూపంబులం బొంచి పాపంబులం జెండి కారుణ్యమూర్తిత్వముం గల్గి
    బ్రహ్మాచ్యుతేశేంద్ర వాగ్వహ్ని భాస్వద్దిగీశాదులం దుండి శక్తి స్వరూపంబునన్ - సర్వ
    కార్యంబులం జేయు తల్లీ! సృజింపంగ బ్రహ్మన్ భరింపంగ విష్ణున్ హరింపంగ
    శంభున్ బొసంగించి తీ వెవ్వఁడైనం భవత్పాదపద్మంబులం గొల్చినన్ వాని నిస్సార
    సంసారశోకాబ్దికి న్నావవై తేల్చి తీరంబునం జేర్తు వీవేకదా నిన్ను గీర్తింప
    నెవ్వాఁడు నేర్చు న్నమస్తే నమస్తే యటంచుం భవత్పాదపద్మంబులం గొల్తు శ్రీ - శ్రీ.149

ఉత్సాహ. నీదు రూప మెవ్వఁ డెఱుఁగు నిత్యసత్య రూపిణీ
    నీదు సంజ్ఞ లెవఁడు సెప్ప నేర్చు నోర్చు నెన్నఁగన్
    నీదు గుణము దెలియువాఁడు నేడు నాడు లేడుగా
    నీదు మహిమఁ గంటి మేము నెమ్మి నమ్మి కొల్చుచున్. 150

క. దేవతలలోన భగవతి | యేవాఁ డనియు భవన్మహిమఁ గొనియాడన్
    ద్రోవ యెఱుంగునె నీవే | దేవి వనుచుఁ దలఁచెదము గదే మా తల్లీ. 151


ఉ. కోరిక లేక లోకములకుం భవకారణ మైతి వీ వహో
    చేరి భవ చ్చరిత్ర మతి చిత్రము దేవి యెఱుంగ శక్యమా
    యేరికినేని మా మనము లెంతయు నెవ్వగఁ జిక్కి పొక్కడిన్
    నేరము మేము నీ వయిన నేరపు నీ గుణము ల్గణింపఁగన్.152

చ. భగవతి నీ వెఱుంగవొ క్షపాచరవైరి శిరంబుపాటు ము
    జ్జగములఁ బ్రోచుఁ దల్లి వని సారెకు నీ పదము ల్బజించువాఁ
    డగణిత పుణ్యుఁ డప్శయనుఁ డయ్యెయొ చేసిన పాప మేమొకో
    తగునె యుపేక్ష నిర్జర వితానముపై నిటు లక్కజంబుగన్.153

చ. హరి తలఁ దూలఁ జేయుట మహత్తరమైన విషాద హేతువై
    పొరలితి మీవు నాటితివి భూజము దానిన నీకరంబులన్
    బరువడి ద్రుంప నింతవలెనా సరికాని సురాళిచేతనౌ
    దురితమువల్ల నా యతని దోర్గత గర్వమువల్లనా సతీ. 154

ఉ. దానవు లెవ్వరేని రణ దారుణ భూముల నోడి నీ పద
    ధ్యానము సేసిరో సకల ధాత్రి మురారి శిరంబుఁ దూల్చి యెం
    తేని వినోదముం గనెనొ యిందిర మీదనుఁ గోపగించితో
    మా నుడు లాలకించి యిఁక మానుమి కోపము మమ్ముఁ బ్రోవుమీ. 155

ఉ. ఓ పరమేశ్వరీ మము నయో బహులార్తి సముద్రమగ్నులన్
    బాపుల నీచులం పావని ప్రోవవె మా జనార్దనున్
    లేపవె యేడ నేఁ గలదొ లేదో యెఱుంగము త చ్ఛిరంబు వి
    ద్యాపర యీవ త క్కొక యుపాయము మాకిక వేఱ యున్నదే. 156

క. అమృతము జీవనమునకున్ | విమలోపాయ మయినట్లు విశ్వజనని లో
   కము బ్రదుకఁజేయఁగ నుపాయము వీవకదా నిరంతరానందమయీ. 157

వ. అని బహువిధంబులగు దీనాలాపంబులతోఁ బరమేష్టి మున్నగు బృందారక బృందంబుల
   యనుమతి నిగమంబు లత్యంత భక్తిం గొనియాడె నని చెప్పి సూతుడు మఱియు. 158

క. అని యిట్టులు గొనియాడిన విని దేవి ప్రసన్న యగుచు విబుధులతోడన్
   మినుద్రోవనుండి ముద్దగు, మినుకులతో నిట్టు లనియె మేలగు ననుచున్. 159

తే.గీ. వెరవు దెల్పేద సురలార వెరవకుండు | వేదములు నన్ను మిక్కిలి వేడి వేడి
   యలసి సొలసె మదీయాత్మ కలఘుతృష్టి | గలిఁగె సందియ మేమి మీ కాంక్షదీర్తున్.160

క. వేదములు ననుఁ బొగడిన ! యీ దివ్యస్తోత్ర మెవ్వఁడేనియు మిగులన్
   మోదమునఁ జదువ విన నత్యాదరమున వాని కోర్కె లన్నియు నిత్తున్. 161

క. నారాయణు మస్తము దెగి | దూరంబునఁ బడియె నొక్క దోషమువలనన్
   గారణము లేక కార్యం | బేరీతినయేని దొసఁగ దెందుం జూడన్. 162

క. తనయొద్ద నున్న లక్ష్మిం | గని పరిహాసంబు చేసెఁ గమళాక్షుఁడు శ్రీ
   వనిత యది సూచి తనలో | ననుమానించెన్ సపత్ని యబ్బె నటంచున్.163

ఆ.వె. ఇన్నాళ్ళనుండి యేను సుందరీనయి | యిపు డరూపనైతినే తలంప
   సవతి యొకతె యితనిఁ దవిలియుండుంగదా ! నన్నుఁజూచి నేడు నవ్వనాయె.164

ఆ.వె. అనుచుఁ గోపగించి యపుడు తామసియైన | శక్తిదాల్చి యంబుశాయిఁ జూచి
   తన సుఖంబునైన దలచక స్త్రీజన | సహజబుద్ధి నిచ్చె శాప మొకటి. 165

క. నా శిరముఁ జూచి నవ్వితి, వోశౌరీ నీదు మస్త మూడిపడుంగా
   కీశుండవైన నేమనె | లేశంబును శమగుణంబు లే దింతి కహా. 166

ఆ.వె. సవతిఁ గనుటకంటె సవతితోఁ బెన్మిటి గలసియుండునప్పుడు గనుటకంటె
   సవతితోడఁ బోరు సల్పుచుండుటకంటె | విధవ యగుట సరిగ వెలఁది దలచు.167

క. అనృతము సాహసమును వం చన మూర్ఖత్వంబును గరుణాహీనత్వం
   బ నశౌచం దితిలోభత | చను నెందును భామినులకు సహజగుణములై. 168

వ. అది యెట్లుండె నేమి. 169

క. మునుపటివలె దశరూపధరుని మస్తకయుతు నొనర్తు రూఢిగ నే డా
   తని శిరము లవణ జలధిన్ మునిఁగెను వేరొక్క కార్యమున్ వినుఁ డింకన్. 170

క. నా చెప్పెడి చొప్పుననె మ | హాచతురతతోడ మీర లందరు నన సం
   కోచము లేదిఁక వేరొక | ప్రాచుర్యం బొదపు మంచి ఫలము లభించున్.171

ఆ.వె. మున్ను బాహుబల సమున్నతుం డగు హయఃగ్రీవుఁడగుచు దొడ్డ కీర్తి నెసగు
   దానవేంద్రు డధిక దారుణవృత్తితోఁ జెలగి ఘోరతపముఁ జేయఁ దొడఁగె.172

క. వెలయఁగ నేకాక్షరమై, యల మాయాబీజకలితమై ఘనఫలమై
   యలరారెడి నా మంత్రము ! నలవడి జపియించి భోగ మశనము మానెన్. 173
 
క. నా తామసశ క్తిని సం | జాత మహాభక్తియుక్తి సర్వాలంకా
   రాతతమూ ర్తిని వేయేం డ్లాతంకములేక తపమునందుఁ దలంచెన్. 174

ఉ. దానికిఁ బ్రీతచిత్తయయి తామసమూర్తివహించి వచ్చి పం
    చాననవాహనంబున సుఖాసనమై దనుజేంద్ర తెల్పు మె
    ద్దానిని గోరె దీ వనినఁ దా విని యా హయవక్త్రు డ ర్మిలిన్
    బూని ప్రదక్షిణంబుగను బోయి ప్రణామముచేసి యిట్లనున్. 175

ఉ. దేవి జొహారు లోకముల దిద్దిన తల్లి జొహారు భక్తసం
    భావన నైపుణీకలితపాద జొహారు సమస్తదుష్టవి
    ద్రావణ ఘోరఘోర సమరక్రమధీర జోహారు సంతత
    శ్రీవిభవప్రదానవరసిద్ది జొహారు జొహారు నీ కగున్. 176

ఉ. ఈవు ధరాజలానలసమీరణకర్త్రి గంధమున్ రసం
    బావల రూపశక్తియును నంటుట మ్రోగుట మూరుకొంటయున్
    నీవ తలంపగా రసన నీ వట చక్షువు నీవ త్వక్కునున్
    నీవకదమ్మ శ్రోత్రమును నీవ క్రియేంద్రియపాళి నీవకా. 177

వ. అనిన విని మహేశ్వరి యగు శ్రీ దేవి యిట్లనియె.178

ఆ.వె. ఓరి దనుజ నీదు కోరిక దెలుపుమా యిచ్చ నీదు భక్తి మెచ్చనాయెఁ
    జేరి మేటి తపము చేసితి వీవు నే నిత్తు వరము సంశయింపవలదు. 179

వ. అనిన విని భగవతిం గాంచి హయగ్రీవుండు భక్తియుక్తుండై యిట్లనియె.180

తే.గీ. తల్లి నేఁ గోరు కోరిక తప్పక విను | చావు లేనట్టి బ్రతుకు నా కీయవలయు
   నప్పు డమరుఁడనై యోగి నై యజేయమహిమతో నీ జగంబున మసగలాఁడ. 181

వ. నావుఁడు విని నవ్వి యమ్మహాదేవి యతని కిట్లనియె. 182

క. పుట్టిన జంతువులెల్లన్ | గిట్టుట సిద్ధంబ యనెడి కీ లెరుగవొకో
   యిట్టుల నుండఁగ వేఱొక టెట్టుల సమకూరు దానవేశ్వర నీకున్. 183

క. ఇది నిశ్చయం బటంచున్ | మదిఁ దెలసి మఱొక్కవరము మమ్మడుగఁదగున్
   బదపడి నే నీ కిచ్చెద | నది యని భగవతి వచింప నాతం డనియెన్.184

తే.గీ. ఎప్పుడేని హయగ్రీవుఁ డెవ్వడేనిఁ గలిగెనేనియు వానిచేఁగాక నాకు
   మృత్యు వనునది లేనట్టి మేటివరము తల్లి దయచేసి రక్షింపఁదగు నటన్న. 185
 
వ. జగదంబ యతని కిట్లనియె. 186

ఉ. నీవు గృహంబు పేరి యవనిం దిరిపాలనఁ జేసికొమ్ము సం
    భావిత సౌఖ్యసంపదలపట్టయి నీకును మృత్యు వా హయ

    గ్రీవుఁడ కాక వేఱొకటి గీల్పడ దెన్నఁ డటంచుఁ దెల్పి య
    ద్దేవి యదృశ్య యయ్యె మదిఁ దృప్తి నతండును నేగె నింటికిన్. 187

ఉ. వాఁడు వరంబు పేర్మిఁ గడు వర్ధిలు గర్వము పూని యజ్ఞముల్
    పాడొనరించి మౌనులను బాధలఁ బెట్టుచునుండ వానికిన్
    సూడొకరుండు ముజ్జగము చోటుల లే డది గాన వానికిన్
    బీడ యొనర్ప మీకిపుడు ప్రీతియుకా యిఁక వేయు నేటికిన్. 188

ఆ.వె. హయముశిరము దెచ్చి యతికింపుమనుఁడు మాధవుని ముండెమునకుఁ ద్వష్టతోడ
      నంత విష్ణుఁడే హయగ్రీవుడై యేగి | యా సురారి నోర్చు నద్ధి మేలు. 189

వ. అని మరియు సూతుండు. 190

క. అని యిట్లు దేవి పలికిన | విని సుర లెల్ల రును దృప్తివిస్తరులై త్వ
   ష్టనుఁ జూచి పల్కి రిట్లవి | యనఘా నీవేగి హయము నాస్యముఁ దెమ్మీ. 191

తే.గీ. తెచ్చి యదికింపు మచ్యుతు దేహమునకు | ననిన నాతండు నట్లచేసిన మురారి
   హయగళుండయి దనుజుని హతునిఁజేసె | దాన దేవత లెల్ల సంత సముపడిరి.192

క. ఈకథఁ జదివిన వినినన్ | లోకజనని తా నొసంగు లోకాతీత
   ప్రాకట వైభవమేధా , శ్రీకాంతి చిరాయువులను సేమం బొదవన్. 193

-: మ ధు కై ట భో త్ప త్తి :-



క. అని చెప్పిన సూతమహా మునితోడను శౌనకాదిమును లందఱు ని
   ట్లని మునిమూర్థన్యా | యనఘా మా సంశయంబు లడగింపఁగదే. 194

చ. జగ మేకార్ణవమై తలిర్చునెడ భాస్వద్రూపుఁడై విష్ణుఁ డే
    పగిదిం బంచసహస్రహాయనము లబ్రాశిన్ రణప్రాజ్ఞతన్
    దగి యోర్చెన్ మధుకైటభాసురుల దుర్దాంత ప్రతాపాఢ్యులన్
    నగభేది ప్రముఖామర ప్రకర నానాదుఃఖసంపాదులన్. 195
 
మ. పరమాశ్చర్యకరంబ యిచ్చరిత మొప్పం జెప్పవే సూత యీ
    పరమౌనివ్రజ మెల్లఁ జేరి వినఁగా వాంఛించుచున్నారు దు
    స్తర నానార్థవిదుండవై సఖుడవై దైవప్రసాదంబునన్
    దరి కేతెంచితి వీవు నీ చెలిమిచేతల గల్గు నిష్టార్థముల్. 196

క. వెస మూర్ఖుని సహవాసము | విసమే సజ్జనుల చెలిమి వెలయంగ సుధా
   రసమే యిది దెలియనిచో , పసరమకా నరుండు వేయిపలుకు లికేలా. 197

క. ఘనుల కథలు విన నొల్లవి | జనుడు పశుప్రాయు డనఁగ సందియమేలా
   చనుఁ బశువై నను వరగా యనగీతులఁ జొక్కు సర్పమైనను ధరణిన్ 198

క. ఐదింద్రియములలోపల | నాదిమములు కనులు చెవులు నవి రెండేకా
   మోదమున రూపదర్శన | నాదశ్రవణముల నిచ్చు నానాగతులన్. 199

క. శ్రవణం బనునది త్రివిధం | బవు సత్త్వరజస్తమోగుణాయత్తంబై
   భువి దీనిఁ దెలిసి మానవుఁ | డవిరళమతి యగుచు వినఁగ నను సత్కథలన్.200

క. నిగమాగమాది సాత్విక , మగు సాహిత్యాది యెందు నగును రజోజం
   బగు నన్యుల దోషంబులు | ప్రగణించుట గలహవార్త రహఁ దామసమున్. 201
 
తే.గీ. ధరణి నుత్తమ మధ్య మాధమములగుచు, మూడు విధముల సాత్వికంబును బొసంగు
   మోక్షమును నాకమును భోగమును గ్రమంబు గా నొసంగును దీని మార్గంబు నుండు.202

క. రాజసమునుఁ ద్రివిధం బగు నోజం బూర్వోక్తవిధము లొంది తదీయా
   వ్యాజశ్రవణ మనన్ స్వీ | యాజారాన్యాప్రసంగ మందురు పెద్దల్. 203

క. తామసమును ద్రివిధంబగు | భూమిన్ బూర్వోక్తరీతిఁ బుణ్యరహితు ను
   ద్దామవధ పగతుతో సం | గ్రామంబును నిర్ణిమిత్త కలహము వరుసన్. 204
 
ఉ. కావున మౌనివర్య శుభకారణమైన పురాణసంహితా
    గ్రామము వీనులం జొనుపఁగావలెఁ బాపము నెట్టఁగావలెన్
    ధీమహిమంబు వర్ధిలఁగ దేలవలెన్ సుఖలీల మమ్ము స
    ద్భావమునన్ దలంచుచు సుధారసధారలు చిల్కఁ దెల్పవే. 205

ఉ. నాపుఁడు సూతుఁ డమ్ము నిజనంబులతో నను ధన్యు లీర లెం
    తే విన నిచ్ఛయింత్రు వచియింపఁ దలంచెద నేను ధన్యుఁడన్
    శ్రీవరుఁ డేకసాగరవిశిష్టము లోకము నొందనప్డు ని
    ద్రావశతన్ భుజంగములరాయని పై శయనించి యుండగన్.206

వ. నారాయణుని శ్రవణమలంబునుండి మధుకైటభు లుద్భవిల్లిరి. 207

ఉ. పుట్టి క్రమక్రమంబునఁ బ్రపూర్ణతఁ జెంది మహాబ్ధి లోపలన్
    దిట్ట తనంబునం బటుగతిన్ విహరించుచు నాటలాడుచున్
    కట్టిడి రక్కసు ల్వెస నొకానొకనాఁడు మనంబులందుఁ దా
    రిట్టులు చింతకుం దొడఁగి లిరిద్దఱు నొద్దిక నొక్క తావునన్. 208

క. ఆధారము లేకిల నొక | యాధేయము నిలువఁజాల దది నిక్కంబౌ
    బోధపరుల చిత్తములకు | నాధారాధేయభావ మది చూపట్టున్. 209

క. ఎవ్వఁడు సృజించె మనలన్  ! నెవ్వగఁ బుట్టితిమి మన మహీనప్రౌఢిన్
   నివ్వటిలె నెట్టు లీ జల | మెవ్వతె మన తల్లి, తండ్రి యెవ్వం డరయన్.210

తే.గీ. ఇట్లు తలపోసి నిశ్చయం బెఱుఁగలేక యుండ మధుఁజూచి కైటభుం డోరి మధుఁడ
   మనల మీ సర్వతోముఖమథ్యమందు నునికికిం గారణము శక్తి యని తలంతు. 211

తే.గీ. ఆ మహాశక్తి యాధార మంబురాశి | కనుచు మనలను సృజియించి నట్టి దేవి
   యదియ యనుచుఁ దలంతు నే నంతకంటే | వేఱొకటి లేదు నమ్ము మీ విధము నిజము. 212

క. ఈ లీలఁ జెప్పుచుండఁగ | నాలోన విచిత్ర మహిమ నాకాశమునన్
   మేలైన శబ్ద మొక్కటి | యాలింపఁగ నయ్యె శ్రావ్యమై సుకరంబై.213

తే.గీ. ఆ మనోహర వాగ్బీజ మతి మనోహ రంబు నభ్యాస మొనరించి ప్రవిమలమతి
   నుండఁ గనవచ్చె మెఱుపొక్క టుప్పరమువ దానిఁ గని యెంచి రపుడు మంత్రం బటంచు. 214

క. ఆ మంత్రంబుం గేకొని , భీమతపము సేయ మొదలుపెట్టి రచలము
   ద్రామహితు లగుచు నిరశను, లై మించి సమాహితాత్ముడై దృఢలీలన్.215

క. వేయేం డిట్లు తపంబును | జేయఁగ గని శక్తి తృప్తిఁ జెందె గగనవా
   ణీయుక్తి నిట్టు లనియెన్ | బాయని ప్రేమాతిశయము బాటిల నంతన్. 216

ఉ. దానవులార మీవరము తప్ప కొసంగెద నంచు నింగిపై
    మానక వాక్య మొండు విని మా మరణంబులు స్వేచ్ఛఁ గల్గఁగా
    దీనజనార్తినిర్దళని దేవి ప్రసాదము సేయు మన్న మీ
    పూనిక యట్ల యౌత నిఁక పొండని దేవి వచింప వారలున్. 217

మ. వరము ల్గొంచు సురారు లత్యధికగర్వప్రేరిశోతౌద్ధత్య ని
    ష్ఠురులై యంబుచరాళితోఁ గలసి బిట్టుం గ్రీడలం బ్రోడలై
    దొరలై యొప్పుచు నొక్కవేళను సుధాంధోజ్యేష్ఠుఁ బద్మాసనాం
    తరవర్తిం గని మోదమంది పటుయుద్ధప్రక్రియాకాములై. 218

క . మాతోడను యుద్ధమునకు | రాతప్పితినేని విడుము రాజీవంబున్
    పోతీరదు నీ కిఁక నిది ! కాతరుఁడవ యేని నీవి కా వీ స్థలముల్.219

తే.గీ. వారి ధీరోక్తులకుఁ గడు వగచి బ్రహ్మ, యేమిచేయుదు నిలక నా కేమిదిక్కు
    ఎవ్వరిని వేడుకొందు నే నెందుఁజొత్తు, ననుచుఁ జింతాసముద్రంబునందు మునిగె.220

వ. మఱియుం బద్మజుండు దనలో నిట్లని వితర్కింపం దొడంగె. నేడు వీరి బలంబులు
    సూడ సత్యధికంబులై యున్నయవి. వీరి నే నెట్లు శాంతులం జేయఁగల ? సామ దాన

దండోపాయంబులలో దండం బజ్ఞాతబలులయెడ నవిధేయంబు. స్తుతియుఁ బొసంగ దేల
యన నాయందు వీరు దుర్బలత్వంబు పెట్టుదురు, దాన భేదంబులకుం దఱికాదు. కావున.

-: బ్ర హ్మ కృ త వి ష్ణు యో గ ని ద్రా స్తు తి :-



ఉ. వెన్నుని శేషశాయిని వివేకఘనాశ్రయునిం జతుర్భుజున్
    సన్నుతి సేసి మేల్కొలిపి సాగిలి మ్రొక్కెద భక్తి యుక్తి మై
    న న్నతఁ డేలఁగాఁగలఁడు నాదు విచారము దీర్పఁగాఁగలం
    డెన్నఁగ నింతకంటెఁ గలదే మఱియొక్కటి యంచు వేడుకన్. 222

వ . అని.223


సీ. ముక్తపదగ్రస్తము :
    భణనీయగుణపాలి పాలితభూచక్ర చక్రగదాభుజా చారుదండ
    దండసాధనతాత తాతప్రియకుమార మారసుందర గరుత్మత్తురంగ
    రంగదర్ణవరాజ రాజన్మహాలయ లయకాలకీలికీలాప్రతాప
    తాపససంతాన తానవార్తివిఫాల ఫాలబాలసుధాగభస్తి బింబ

తే.గీ. బిందితులితాధరా ధరాలంబమిత్ర | మిత్రమండలగతగాత్ర గాత్రధీన
    ధీనమచ్ఛ్రీసుఖనిదాన దానవారి | వారిజాసనకారణ కారణాత్మ. 224

చ. నిరోష్ఠ్యము.
    నళినదళాక్ష దీనజననాయక నీరదగాత్ర శంఖ స
    ద్గళ నరసింహ దైత్యగణదారణ నారదనాదసాదరా
    గళగరళార్చితా సకలకాంతశరీర ధరాధరాతిని
    శ్చలనయ నిత్య సత్యకృత సాధన శార్ఙ్గహృషీకనాయకా. 225

ఉ. ఈ దనుజేంద్రు లిద్దఱు మహేశ మదోద్ధతులై ననుం గడున్
    బాధలు పెట్టఁబూనిరి కృపామయ మచ్ఛరణంబ వీవకా
    దే దురితాత్ములం దునిమి తేకువ న న్బ్రతికింపవే యిఁకన్ .
    సాదరవృత్తి నంచు నిటు లాతఁడు శ్రీహరి నెంతవేడినన్. 226

తే.గీ. యోగనిద్రాగతుండయి యున్నకతన | శౌరి మేల్కొనకున్న న జ్జలజభవుఁడు
    శక్తితోఁ గూడి నిద్రావశతన యుండె ! నేమిసేయుదు మేల్కొల్పు టెట్టు లితని.227

ఉ. ఎక్కడఁ బోవుదున్ మఱియు నెవ్వరు నన్ను భరించువార లే
    దిక్కొ యఖర్వగర్వ నిరతిం దనుజేంద్రులు చుట్టుముట్టిరే
    స్రుక్కితి నంచుఁ దా నరసి చూచి మనంబునఁ గొంతవట్టు నా
    కొక్క యుపాయ మిత్తఱి నహో ! పొడకట్టె నటంచు నెంచుచున్. 228

-:శ క్తి స్వ రూ ప క థ న ము:-

ఉ. దేవి యొకర్తు నాభయము దీర్చఁగలద్ది తదీయశక్తినే
      కా వినఁ డింత నిద్రబడి కాతరు మన్వుల నచ్యుతుం డటం
      చావిధి సర్వలోకము లయంబగు శక్తిని యోగనిద్ర న
      ధ్దీవరషోషిణిం బ్రకృతి దివ్యగుణన్ బొగడె న్మనంబునన్. 229

క. దేవీ నీవ జగత్సద్భావమునకుఁ గారణమవు పరమేశ్వరివే
      నీ వేదంబులవలనన్ | నీ విశ్వాతీతశక్తినిం గనుఁగొంటిన్. 230

ఆ.వె. నీవ యోగనిద్ర నిల్పితివి విష్ణు | నంతవాని కింత లైన నితరు
      లెంతవారు నీకు నిసుమంతవారకా , కెఱుఁగఁగలమె నీ యహీన లీల. 231

క. ప్రకృతి యని పురుషుఁడని నీ కకలంకాలిఖ్య లిచ్చి యా సాంఖ్యులు ని
      త్యకలాసుమహిత చైత | న్యకలారహిత మగు వస్తు వండ్రు కడంకన్. 232

ఆ.వె. నటనఁజేయు దీవు నానాగుణంబులు గలిగి నీచరిత్రములు గణింప
      నెవ్వఁడోపు సంధ్య వీ వంచుఁ దపసులు | నిన్నుఁ గొల్చుచుండ్రు నిత్యభక్తి. 233

క. నీవు మతివి నీవు ధృతివి | నీపు రుచివి నీవు శుచివి నీవె శ్రద్ధా
      భావంబ వీవ కీర్తివి | నీ వఖిలము సర్వలోకనేత్రివి తల్లీ. 234

క. ప్రత్యక్షము త్వత్కార్యము సత్యము వేదములకైన శక్యంబే నిన్
      స్తుత్యాదుల మెప్పింపఁగ | సత్యాదరణైకబుద్ధి నరయుము తల్లీ. 235

క. సగుణవు నిర్గుణ వతిగుణ | వగణితనిగమాగమాంచితాధారవు నీ
      ధగధగిత సుప్రభావళి | జగముఁ బ్రకాశింపఁజేయు జననివి దేవీ.236

క. నీకంటెను వేఱెవ్వరు , నాకును శ్రీకాంతునకుఁ బినాకధరునకున్
      మా కౌమారీ వాణుల | కేకాకృతి వీవకావె యెపుడు నిజముగన్.237

క. అన్నాది సకలకోశా భిన్నా మాయామయీ గభీర శ్రీ సం
      పన్నా పోషితపరమా!పన్నా నన్నాదరింపఁబాడి యపర్ణా. 238

క. కలఁడే విష్ణునికంటెన్ | బలవంతుం డైనవాఁడు బంధుర నిద్రా
      కలితుం జేసితివమ్మా | యలఁతు తరు లెంతవార లహహా తలపన్. 239

క. నను లోకము సృజియింపన్ | వనజాక్షుని బెంపఁ గృత్తివాసు నడంపన్
      బను లిడి చేయింతువు నీ | వనఘ మహారాజయోగహారిణి వమ్మా. 240

క. జననీ పాపులఁ ద్రుంతువు | వినయపరులఁ బ్రోతు వఖిలవేదినివి కదా
    నిను మాన నా విపత్తిం | దునుమాడుము దుర్జనులకు దుర్గమ వమ్మా.241

క. ననుఁ గన్నతల్లి వని నే | చనువున మఱిమఱియు నిన్ను సంస్తుతిఁ జేయన్
    వినవమ్మా విడువక సజ్జనకల్పక చారువల్లి జగముల తల్లీ. 242

ఉ. నాటక సూత్రధారిణి వనాఁ దగు ముజ్జగమందు నీవ యే
    నాఁటను దృశ్యమానవు సనాతని వీశ్వరి వాదిమూర్తి వి
    చ్ఛాటనశీల వార్తుల భయంబులఁ దీర్చెడి పట్టున న్మణీ
    పేటివి భక్తకోటికి కృపీటభూములు సీర తేజముల్.243

ఉ. ఓ పరమేశ్వరీ విను మహో మొఱ యింతట లెమ్ము లెమ్ము నీ
    రూపము సూపు మమ్మ సితరోచిమరీచిక లీను నీ ముఖం
    బోపికఁ జూచి మ్రొక్కెద నయోన్నతి విష్ణుని వీడుమమ్మ నా
    యాపదఁ బాపుమమ్మ నిరతాయతచిత్రవిచిత్రవర్తినీ.244

క. అని యిట్లు బ్రహ్మ వేడిన | విని మాయాశక్తి హరిని విడిచి మఱొక ప్ర
    క్కను నిల్చిన నక్కారణ | మున హరిఁ గని యబ్జసూతి ముదితుం డయ్యెన్.245

వ. అనిన విని పరమశాంతపావనులగు మునులు పరమశాంతస్వభావసమేతు సూతుం గాంచి
    యిట్లనిరి.246

ఉ. అక్కజమయ్యె మాకు నహహా యిది విన్న మహానుభావ నీ
    వక్కణముల్ సదా విబుధవర్ణితముల్ విధి విష్ణు రుద్రులన్
    బెక్కుపురాణము ల్తెలుపు నిత్యులు నాద్యులు నంచు వారలే
    తక్క మఱొం డజాండముల దైవము లేదని నిక్కువంబుగన్.247

చ. అజుఁడు సృజించు మాధవు డనారతమున్ బ్రతికించు శంకరుం
    డు జగముఁ దూల్చు మువ్వురుఁ గడు న్నుతిఁ గాంత్రు త్రిమూర్తు లంచు స
    త్త్వజయు రజోజయున్ మఱియుఁ దామసి నాఁ జను శక్తులొందుటన్
    ప్రజలకు వేఱ యెవ్వఁ డిఁక బంధుఁడు లోకమునందుఁ జూడఁగన్.248

ఉ. వారలలో మురారి నిరవద్యతఁ దాఁ బురుషోత్తమాఖ్యచే
    మీఱి మహాప్రసిద్ధుఁ డగు మేటి జగత్పతి సర్వ కర్మలం
    గారకుఁ డంతవాని నిఁకఁ గాంతుమె? నిస్తులతేజుఁ డాతఁ డ
    య్యారె! తథావిధుండె యిటు లాయెనుఁ జిక్కెను యోగనిద్రకున్. 249

క. ఇది మాకు సవిస్తరముగ | విదితం బొనరింపుమయ్య విజ్ఞాననిధీ
    యది యే శక్తియొ మొదటికి | మొదలైనది విష్ణువునకు మూలమె చెపుమా.250


చ. నిఖిలముఁ బ్రోచువాఁడు గణనీయుఁడు సర్వగతుండు వేత్త చి
    త్సుఖపరుఁ డీశ్వరుం డమితసుందరుఁ డున్నత తేజుఁ డిందిరా
    సఖుఁడు నిరీహుఁ డుత్తముఁడు సౌమ్యుడు శాంతుఁడు యోగనిద్రచే
    నఖిలమునం దపస్మృతి బయల్పడ నజ్ఞతఁ గాంచే నయ్యయో. 251

క. తప్పక సందియ మను ముడి | విప్పి యధార్థంబు చెప్పి వేవేగ మముం
    దెప్పరమగు సంతసమున | దొప్పలఁ దోగించువారు దొరకుదురె యొరుల్.252

చ. సనకసనందన ప్రముఖసంయములుం గపిలుండు నారదుం
    డనుపమ బుద్ధిశాలులు మహామహులైనను మూలశక్తి స
    త్తును గన లేరు వేదములు తప్పక పల్కుచునుండు విష్ణుఁడే
    ఘనుఁడు శివుండె గొప్ప విధిగణ్యుఁ డటంచు ననేక భంగులన్.253
 
వ. మఱియు. 254

ఉ. కొందరు కేశవున్ బరమకోవిదుఁ డంచు సనాతనుం డటం
    చందురు, గొంద రీశ్వరుఁ డటందురు శక్తిసమన్వితుం డని
    ష్పందుఁడు భూతనాథుఁ డని పల్కుదు రింద్రుఁడు నాథుఁ డంచు నిం
    కం దిననాథుఁ డంచుఁ గణకం జ్వలనుం డని యండ్రు గొందరున్. 255

ఆ.వె. ఎంద రెన్నిగతుల నేమి చెప్పిన నేమి కార్యకారణములఁ గాంచు చోట
    సత్ప్రమాణములను సాధింపఁ గావలెఁ | గాక వే రొకండు గాదుఫక్కి. 256

క. మానక ప్రత్యక్షము నను మానము శబ్దంబు నను ప్రమాణంబులు మూఁ
   డౌ ననిరి కొంద ఱని రుప మానంబును ననుపలబ్ధి మఱి కల వనుచున్. 257

ఆ.వే. ఆగమంబు బుద్ధి యవల సద్యుక్తియుఁ | గార్యకారణ ప్రకారములకు
   ననుభవంబుమీఁద నల్ల దృష్టాంతంబు | రహిని గర్పి రా పురాణవిదులు. 258

క. పండితులు సెప్పుచుందురు | దండి పురాణముల యందుఁ దా నెవ్వేళన్
   నిండె జగంబుల నన్నిట , మెండుగ శక్తిస్వరూపమే యొం డనుచున్.259

ఆ.వె. విధికి సృజనశక్తి విష్ణుదేవునకును | పాలనైకశక్తి శూలి కెన్న
   హరణశక్తి పంకజాప్తునకుం బ్రభాశక్తి శిఖికి జ్వలనశక్తి కలవు.260

ఆ.వె. ఎల్లయెడల శక్తియే కనవచ్చెడి | శక్తి లేని యుత్త స్థలము లేదు
   సర్వగతము శక్తి శక్తి లేనప్పుడు | వస్తు వేడఁగలదు వసుధయందు.261

క. సర్వము శక్తి మయంబగు | సర్వజనులు శక్తి లేక శత్రుజయ శ్రీ
   నిర్వాహకు లెట్లగుదురు | సర్వోన్నత పదవి నందు శక్తియ కాదే.262


క. హరిహర విధి రవి శిఖి యమ | వరుణ కుబేరాదులైన వాసవుఁడైనన్
   గురుఁడైనం బరుఁడైనన్ | నిరుపమశక్తి ప్రయుక్తి నెరసిరి ఘనులై. 263

క. తగుశక్తి రెండు విధముల | సగుణయు నిర్గుణయు ననఁగ సగుణాభిధ రా
   గిగణము గొల్చును నిర్గుణ , నగణిత వైరాగ్యమార్గు లర్చింతు రొగిన్. 264

ఆ.వె. మును లెరుంగ లేరు మూలశక్తి నికెట్లు | మూఢజనులు నిత్యమూర్తి నెఱుఁగ
   నేర్తు రదియుఁ గాక నిజ మిక్కలిం గల వార లల్పబుద్దు లైరి కారె.265

క. శక్తిమయము జగ మంతము | శక్తి జగన్మయము వేఱ సందియు మేలా
   శక్తిమయము గానిది ని శ్శక్తిక మణుమాత్రమైన జగమున గలదే. 266

క. కావున నెవ్వం డేనియు | సేవింపం దగును శక్తి సమధికలీలా
   వ్యావృత్తి విశ్వమంతయు | దేవియ పాలించు భగవతీనామమునన్. 267

క. అని వ్యాసునివలనను నే | వినియుంటిని వ్యాసుడిద్ది నారదు చే
   త నతఁడు పితామహునిచే | వినియెన్ ద్రుహిణుండు వినియె విష్ణునిచేతన్. 268

6. నరు లెవ్వ రిందునకు వే | ఱరయంగారాదుసుండి యనుభవవేద్యం
   బరుదార శక్తికంటెను బరు లాద్యులు సేవ్యు లెన్నఁ బడరు బుధులచేన్. 269

వ. అని మఱియు.270

చ. కరు మరుదార శ్రీవిభునికాయము లోపలి యోగనిద్ర వేఁ
    బెరసి మరుత్పథస్థ యయి పేర్మి నటుండగ వాసుదేవుఁడ
    చ్చెరువుగ మాటిమాటికిఁ జేతులు సాచుచు నావులింపుచున్
    వెరపు మెయిన్ బురస్థ్సుఁడయి వేఁడు ప్రజాపతిఁ గాంచి యిట్లనున్.271

చ. తతతపముం ద్యజించితిఁ గతం బది యే మిటు రాకకుం భయ
    స్థితి నిటు లున్కిఁ గారణముఁ దెల్పుము నాఁ బరమేష్ఠి యార్తివి
    స్తృతుఁడయి పల్కెనో సుజనసేవ్య భవచ్ఛ్రప కల్మషోత్థులై
    దితిజులు మీఱి రుద్దతులు దీప్తభుజు ల్మధుకైటభాభిధుల్. 272

-:మ ధు కై ట భ యు ద్ధ ము:-



క. వారిరువురు ననుఁ దమితోఁ | బోరునకును ర మ్మటంచు బోరనఁ బైకిన్
   జేరుచుఁ జంపెద మనుచున్ , ఘోరాకారములఁ జుట్టుకొనిరి మురారీ. 273
క. అక్షీణకృపామయుఁడపు | రక్షించుము నన్నుఁ బ్రీతి బ్రతుకు గలిగినన్
   భక్షింతు బలుసాకున్ | రక్షోభయ ముడిగి ద్రుమపరంపరనేనిన్.274


క. నావుఁడు నారాయణుఁ డను | నో వేధ కరంబు భీతి నొందకు మింకన్
    వేవేగ రిపులఁ ద్రుంచెద నీ విచ్చట నిలచి చూడు మీదిగో యనఁగన్. 275

తే.గీ. ఆ ప్రబలులై న సోకు దయ్యాల ఱేండ్లు | వనజభవు నప్డ కనుఁగొని యనధికరణ
    నీరములనుండి పల్కిరి నీవు వీని | మఱుగు జొచ్చితె పద్మజ మాకు నోడి. 276

తే.గీ. ఇతఁడెసూడంగ నుక్కార్తు మిచటనిన్ను | పోరు మాతోడఁ గాదేని పాఱుమెందె
    దాసదాసుండఁ జేసితిఁ దప్పటంచుఁ | బలుక విని దానవారాతి యలుక పొడమి.277

ఉ. గండ్రలు మీరు రండు కడకన్ సమరంబును వేఁడిరేని యే
    వాండ్రిటు లన్నదే నెఱుఁగ నీతని సృష్టి విధాత మీకుఁ బె
    క్కం డ్రిఁక నేల నే నొకఁడఁ గాటె వధింతు నిమేష మోర్వుఁడీ
    తీండ్రిల నేరిఁ గండలను దీసెద గెద్దలనోట వేసెదన్. 278

వ. అనుఁడు.279

క. అధికరణరహితమహితో దధిలోఁదిరుగాడుచును మదప్రేరితు లై
    విధిఁ గన్న మేటిదొరతో | మధుకైటభు లెదిరిపోర మససిడి రంతన్.280
  
క. మధుఁ డెదిరించిన వానిన్ | మధియింపగఁ గైటభుండు మార్కొన వానిన్
    మధియింపగ మఱలవడిన్ | మధుఁడు గవియు నిటుల వారు మఱిమఱి పోరన్.281
 
క. మల్లరణ మొక్కరీతిన్ | గల్లోలిని మీద నుండి గమలాక్షుఁడు సం
    ఫుల్ల బలస్ఫూర్తి మెయిన్ బెల్లుగ దానవులతోడ బిట్టొనరించెన్.282

ఆ.వె. ఐదువేల దీర్ఘహాయనంబులు మహోగ్రత రణంబు సేసి కరము సొక్కె
    మురవిరోధి బీరమున నుదగ్రోగ్రులై | దనుజు లొప్పి రవ్విధాతసూడ.283

తే.గీ. అపుడు నారాయణుండు దా నచ్చరుపడి | యీసురారులు శ్రమనొంద రేను మిగుల
    నలసటను బడినొచ్చితి నహహ దీని కారణంబేమొ యనుచు విచార మెనసి.284

ఆ.వె. నిలువబడిన జూచి తులువ లా యిరువురు | గర్వఫణితి ననిరి కమలనేత్ర
    పోర నలసినాఁడ వూరక చనుము దాసోహ మనుచు నెత్తి నంజలి యిడి. 285

క. కాదేని యుద్ధమున మా | మీదికి రా మగతనమున మీఱితె తగవే
    నీదు మద మడఁచి నలినజు | మోది కదన విజయలక్ష్మి ముట్టెదము హరీ.286

వ. అనిన. 287

క. విని సామ మూని విష్ణుం | డనియెన్ దానవులతోడ నతిభీతి మెయిన్
    ఘనుఁ డైన విష్ణు దేవునకును గల్గెఁగదా ప్రతాపకుంఠన మహహా.288


చ. అలసటఁ జెందియున్నెడ భయాతురుడౌ నపు డస్త్రశస్త్రసం
    కలితుఁడు గానిచోఁ బడెడికాలమునం బుడుతండు దంటతో
    గలనకుఁ జొచ్చినం గదనకర్మ విధిజ్ఞులు శత్రు నేయఁగా
    దలకొన రంచుఁ జెప్పెడి సనాతన ధర్మము మీ రెఱుంగరే. 289

క. మీరిద్దఱు సోదరులరు , కారే సంపూర్ణబలు లిఁక న్నే నొకడన్
    మీఱి కడుశక్తియుక్తిం | బోరితిగా యైదువేల పూర్ణసమ లొగిన్. 290

ఆ.వె. నడుమ నడుమ మీరు నాతోడఁ బోరుచు , నలతఁ దీర్చుకొంటి రట్ల నేను
    నలఁతఁ దీర్చుకొనిన యాదట మీ తోడ | బవరమునకు జొత్తు నవితధముగ.291

ఆ.వె. అంతదనుక నిలుఁడ టం చచ్యుతుఁడు సెప్ప , విని మహాసురులు వివేకులగుచు
    గొంతదూరమున నొకింతసేపు వసింతు | మనుచు నేగఁ గాంచి యసురవైరి.292

క. మెళకువ నిట్లని తనలోఁ | దలపోసెన్ సమర మిది వృథాసుమ్ము మహా
   బలు లీయిద్దరు దేవిన్ | గొలిచి వరము లంది రెట్లు కూల్చెద వీరిన్. 293

క. కాకున్న వీరు పైఁబడి | రాకుందురె యుద్ధమునకు రణవిజితుఁడనై
   పోకుండ మార్గ మెయ్యది | నాకు న్నేడనుచుఁ జింతనం బడి తుదకున్.294

క. ఇదియంతయుఁ జూచుచుఁ దాఁ | జడలన్ వర్తించు పరమశక్తిం గనులన్
   ముదమొదవఁ జూచి యంజలిఁ | గడియించే న్శిరమునందు గడుభక్తి మెయిన్.295

ఉ. మ్రొక్కి మురారి యద్దనుజమూర్ఖవిఖండనలోలతం గడున్
    గ్రుక్కలు మ్రింగుచున్ స్తవనకోవిదుడై స్తుతియించె నో సుధా
    భుక్కృతదాస్యసంతత విభూతి జగజ్జనరక్షణైక సి
    మ్యక్కృతి హేతువాంఛిత మయప్రకృతీ సుకృతీడితాకృతీ.296

ఉ. దేవి నమోస్తుతే యనుచు ధీరజన ప్రణుతాం భజేహ మా
    ద్యే వరదే వరే యనుచు దేహి ముద మ్మమ తే వదంతు పం
    దే విబుధార్చితే యనుచు దివ్యశరీరిణి రక్షరక్ష వి
    ద్యావతి యంచు విష్ణుఁడు వియద్గత శక్తికి మ్రొక్కె భక్తితోన్. 297

శా. నీ రూపంబు నెఱుంగఁజాలముకదా నీ నిర్గుణత్వంబునం
    దారూఢిన్ సగుణత్వమంచు భవదీయప్రక్రియాశక్తి నె
    వ్వా రూహింతురు దేవి నీదగు ప్రభావం బెన్న రా దమ్ము త
    ల్లీ రాజన్మణిమేఖలాకనకవల్లీ చారువీచీవలీ.298

చ. తెలిసెను నీ మహత్వము మదిం బరికింపఁగ నిన్ను మించి వే
    ల్పు లికను లేరు లేరనుచు భూరితరంబగు యోగనిద్రచే


   మెళకుఁవ మాలియుండ విధి మిక్కిలి మక్కువ నెంతలేపినన్
   దెలియక మేలుకొంటి భవరీయ కృపం గని యెట్టకేలకున్.299

క. ఇది యెల్ల నీ ప్రభావమె కద యీ దనుజద్వయంబు కమలజుమీఁదన్
   గదనమున కేగ నాతఁడు | మది ననుఁ బ్రార్థించె నేను మార్కొంటిఁ గదా. 300

ఉ. పంచసహస్రవర్షము లభంగురసంగర మాచరించి నేఁ
    గొంచక శ్రాంతిఁ దీర్చుకొనఁ గోరెన రక్కసు లుక్కుమీరి నన్
    గొంచెపు మాటలాడుచును గొట్టుచు దిట్టుచు నున్నవారు నీ
    యంచిత మైన సద్వరము నందికదా జననీ మహేశ్వరీ. 301

శా. ఈ వేళన్ గడు స్రుక్కి మ్రొక్కితిని దేవీ నన్ను రక్షింపవే
    వేవేగం గడుపార ముజ్జగము నీవే కంటి విచ్ఛారతిన్
    నీవే తప్ప నిఁ కెవ్వరమ్మ జననీ నిక్కంబు మా బోంట్లకున్
    రావే యీశ్వరి లోకసుందరి సపర్యాకార్యకృత్ఖేచరీ.302

చ. అన విని నవ్వి దేవి వినయాసతుఁదైన మురారిఁజూచి యో
    వనజదళాక్ష నీ విపుడు వారల పైఁ జను మాజి సేయగాఁ
    జెనకుచు మోహితాత్ములను జేసెద దైత్యుల నింతలోన నేఁ
    బనుపడి త్రుంపఁగాపలయుఁ బాపులపంచన నెట్టులేనియున్. 303

క. నా మాయవలన దనుజులు | వ్యామోహితు లగుచు నుందు రప్పుడ నీవుం
    బై మార్గమునం గెలుపుము | కామజనక పొమ్ముపొమ్ము కడువేగమునన్.304

వ. ఇట్లు 305
 
క. భగవతి దయారసాన్విత | యగుచుఁ బలికినట్టి పలుకు లాలించి దృఢం
    బుగ దైర్యముఁ గైకొని యా | జెగజెట్టులఁ గవిసె శారి సాహసవృత్తిన్.306

క. ఇటుల దమమీద గవిసిన , మొటమొటలాడుచును దనుజముఖ్యులు రారా
    వటపత్రశాయి మాపై | నెటు బోకుము పోకు ముండుమెదురఁ దిరుడవై.307

క. శ్రీపర జయాపజయములు | దైవాధీనములు నిజము దా బలి గెలుచున్
    వావిరి దుర్బలుఁడైనం | జేవ చెడుఁ బరాభవమున సిద్ధమకాదే.308

ఆ.వె. తెలియ హర్షశోకములు నిల్వ వొకరీతి | ముందు నీవ దనుజముఖ్యులకును
    హంత వైతి విప్పు డట్టివాఁడవు కావె | యీవ యోడితివి కదే రిపులకు.309

క. అని బాహుయుద్ధమునకున్ దసుజులు దొరకున్నఁ జూచి తామరసాక్షుం
    డనవద్య విభామహిమన్ | గన నొప్పుచు సాహసమునఁ గదనోన్ముఖుడై.310

క. పిడిగ్రుద్దులఁ బొడచుచు సిరి యొడయఁడు మార్కొనిన నుద్ధతోద్యోగమునన్
   గడుపడి నెడనెడ సుడిఁబడఁ, బొడచిన యెడలేని కడఁకఁ బురుషోత్తమునిన్.311

క. పోటుదగిలి గోవిందుఁడు | దీటుగఁ బాటించుఁ బూర్వదేవులఁ గని ఝం
   ఝాటంబు దూలి వెల్లం, బాటొదవన్ దేవి వదనపద్మముఁ గాంచెన్. 312

క. వెన్నుని ఖిన్నువి నత్యా పన్నునిఁ గని దేవి కృపను బకపక నగి గ
   ర్వోన్నతు లగు దనుజుల పైఁ దిన్నఁగఁ గను లెఱ్ఱఁజేసి తిరమైనమతిన్. 313

ఉ. పాపులవంచనన్ మునుపఁ బాడియటంచుఁ దలంచి మోహినీ
    రూపముఁ దాల్చె నచ్చుత నిరూఢి జగజ్జన మోహనైక వి
    ద్యాపరతంత్ర యై లలిత యై నవయౌవన దర్శనీయ యై
    రూపవతీవతంస మయి రుద్రవిరోధికరాగ్ర ఖడ్గమై.314

క. ముఖము ఖము మెఱపు నిందుని | నఖము నఖము కౌను మిగుల సన్నము చెలికిన్
    నఖ మెన ఖగసంతతికిన్ | సుఖర ముఖర శుకరవములు సుందరి పలుకుల్. 315

క. బంగారము రుచిరాంగము | శృంగారము కృతకచేష్ట సీమంతినికిన్
    బొంగార ముద్దుమోవి సుధం గార ముందంబు మీఱఁ దా వలపించెన్. 316
 
క. నిందాస్పదుఁ డనుచుఁ జవితి | చందురునిం దూరు నిటలసౌందర్యము నే
    మందము మందము. పంకజ | మందము పదయుగళి కెనయె యా సుందరికిన్.317

క. అలలేవళు లా దృష్టుల | నలలేళ్లే గెలువఁజాల నక్షులు నగుఁ గ
    ల్వల లేమెఱుంగలను గని | మలలే కుచములు విలాసమహిమాన్వితకున్.318

వ. ఇట్లు జగన్మోహినియై తమ ప్రక్క నిలువంబడియున్న పడతింగాంచి తదీయ కుటిల
    దృక్పాతంబు లమృతధారా నేకంబు లగుచుం గడుంబొంగి యా రక్కను లిటు నటుఁ
    దిరుగుచు మిగుల మోహితులై యున్నతఱి వంచన కిదియె సమయంబని సురరిపులం
    గాంచి హరి యిట్లనియె.319

క. మీ వీర్యశక్తి మెచ్చితిఁ | జేవమెయిన్నన్నెదిర్చి చేసితిరి దుర
    మ్మే వరముం గోరెదరో  ! మీ వాంఛిత మిత్తు మేలు మే లడుగుఁ డిఁకన్.320

తే.గీ. దానవులు దాని విని యోరి దైత్యమథన | నీవు వరమిచ్చువాడవు నేఁడు మేము
    యాచకులమో భళీ తగు నౌర నీవె | కోరుము వరంబు చే సమకూర్తు మనిన.321

తే.గీ. దాని విని వెన్నుఁడలరి యట్లే నొనర్తు | తప్పఁగూడదు దేవవిధ్వంసులార
     మోహినీ దేవి సాక్షిగా ముఖ్యమైన యొక్క వర మిండు మిమ్ము నే నుక్కడంప.322

వ. అనినం దనుజులు విని. 323

క. అయ్యో యే మందము మన | దయ్యముఁ దనుఁ గట్టఁ ద్రాఁడుఁ దానిచ్చుటకై
   యియ్యకొనినట్టి చందం | బయ్యెన్ మన మింక నేమి యనఁగల మనుచున్. 324

వ. దానవులు డోలాయమానమానసు లై యివ్విధంబునం గొండొకపడి చింతించి హరిం గని.325

క. లోకైకవీర ముందుగ | మాకును వర మిత్తు ననుచుఁ బల్కితివికదా
   శ్రీకాంత సత్యవాదివి | మా కోరిన వరము నిమ్ము మాన్యమనీషన్.326

ఆ.వె. జలము లేని యొక్క స్థలమున మమ్ములఁ | బొలియజేయు మనినఁ బురుషసింహుఁ
   డైన యచ్యుతుం డనూనప్రభాచక్ర | మైన చక్రము హృదయమునఁ దలఁచి.327

శా. ఓ రక్షోవిభులార రం డిఁకను మిమ్ముక్కార్తు నక్షీణ దు
   ర్వారప్రౌఢిమనంచు నూరుల నరూపారోపరివ్యాప్తి మైఁ
   బారంజూచి జలంబు లే దిచట నొప్పం బోరఁగా వచ్చు నాన్
   వారు న్మేనులు పెంప నూరువు లతివ్యాప్తంబులం జేయుచున్.328
 
క. తన యూరువులం దిడికొని , దనుజేంద్రుల తలలు డుల్లి తటుకునఁ దూలన్
   వనజాక్షుండు చక్రముచే | దునిమెను సుర లొంది రది కనుంగొని వేడ్కన్.329

తే.గీ. వారి మేదస్సుచే నిండె వారిరాశి | యదియ భువి యయ్యె మేదిని యనుచు భూమి
   కభిదగల్గిన కారణం బదియ నుండు | కావుననె మృత్తికను దినఁ గాదటండ్రు. 330

క. నను నడిగిన యది దెలిపితి | మునులారా సర్వలోకములకున్ ఘనపూ
   జనభాజన శక్తియకా | యనుమానము లేదు సత్య మది సత్యమగున్. 331

ప. అనిన విని.332

-: వ్యా స కృ త త ప శ్చ ర్య :-


ఆ.వె. ఋషులు సూతమౌని నీక్షించి పల్కిరి! యనఘ మున్ను మాకు నమరఁజెప్పి
    యుంటి వ్యాసముని మహోత్తమంబగు భాగ వతముఁ జేసె శుకుడు పాడె ననుచు.333

క. వ్యాసుఁడు తప మేలాగునఁ | జేసెను శుకుడెట్లు పుట్టెఁ జెప్పవె మాకున్
    గాసంత విడువ కత్యు ల్లాసంబునఁ వ్యాస వాగ్విలాసము మీటన్. 334

ఉ. నావుఁడు సూతుఁ డెంతయు మనంబున బొంగి మునీంద్రులార మీ
    కే వినుతున్ శుకప్రభప మిప్డు సవిస్తరభంగిఁ దొల్లి య
    ద్దేవగిరీంద్ర శృంగముస దివ్య తపః స్థితి నేకమాతృకా
    దేవి వచస్సుబీజము నుదీర్ణత వ్యాసుఁడు దా జపించినన్.335


ఆ.వె. నారదోక్తరీతి నమ్మి జపించేఁ బుత్రార్థి యగుచు నూరు హాయనములు
      శివునిఁ గూడియున్న సీమంతినిం గూర్చి | సాధ్విఁగూర్చి పరమశక్తిఁగూర్చి. 336

ఆ.వె. తిండి మాని పైడి కొండకూటమ్మున | నుండి చేసెఁ దపము దండిమౌని
      నిండి భూతసమ్మితుండైన కొండిక | పండుఁగాకయంచుఁ బరమనిష్ఠ.337

సీ. గంధర్వగీతికా కలనంబు లెచ్చోట నెచ్చోటఁ గిన్నరీ హితకథాళి
      దేవర్షి కృత తపస్తేజంబు లెచ్చోట నెచ్చోటఁ ద్రిదశుల రచ్చపట్టు
      లాదిత్య వసు మరు దశ్విను లెచ్చోట నెచ్చోట మందార వృక్షసమితి
      పదియార్వవన్నియ బంగార మెచ్చోట నెచ్చోట రతనాల విచ్చురాళ్లు

తే.గీ. నచ్చరల నాట్య మొచ్చోట నమృతర సము | పాన మెచ్చోట సచ్చోటఁ బరమనియతి
      దనర బహుహాయనములు దుర్దాంత లీల | సత్యవతి బిడ్డ తపము దాసలుపఁ దొడగెఁ 338

ఆ.వె. తపమువలస నద్భుతంబైన తేజంబు | విశ్వమెల్ల నిండె వింత పొసఁగె
      వ్యాసు జడలు వహ్ని వర్ణంబులై ముంచె | బాక శాసనుండు భయముపడియె.339

క. భయవిహ్వలు నింద్రుని గని | నయమున రుద్రుండు నవంచిద్వేషీ
      భయ మేల నీకు నిప్పుడు | నియమంబులు మానుదురె మునిశ్రేష్ఠులిలన్. 340

ఉ. శక్తిని నన్ను నుందలఁచి సత్యవతీసుతుఁ డిప్డు దాఁ దపో
      యుక్తిని మించె గోస మిటు లూనఁగఁ బాడియె నావుఁడున్ సమి
      ద్ధోక్తుల నింద్రుఁడుం బరమయోగిజనార్చిత, పార్వతీప్రియా,
      ముక్తినిదాన, మౌని తపముం బచరించెడి నేల తెల్పుమా. 341

వ. అనిన.342

క. పారాశర్యుఁడు పుత్రుం | గోరి తపము సేయుచుండె ఘోరతరముగా
     నూరేండ్లు నిండె నొక్క కుమారుం దయసేయుదున్ బ్రమాగుణధీరున్.343

ఉ. నావిని యింద్రుఁడున్ దన మనంబున సంతసిలంగ నంత గౌ
     రీవిభుఁ డా మునీంద్రునకుఁ బ్రేమ మెయి స్వర మిచ్చెఁ బుత్త్ర స
     ద్భావము గల్గు లెమ్ము మహితస్థితి నీ కొడు కత్యుదారతే
     జోవిభవంబుచే నలరుఁ జుమ్మిక పొమ్ము మునీంద్ర నావుడున్. 344

చ. అది విని సంతసించి ముని యాశ్రమముం దగఁజేరి పుత్త్రసం
     పద యిఁకఁ గల్గునంచు నెద పూనిక సారణియైన గృహ్యమున్
     గుదురుగఁ దా మథింప దొరకొంచు మదిం దలఁచెన్ మహారణిన్
     వదలని మంథనంబున భవంబు దలిర్పదె హవ్యభోజికిన్. 345


క. అట్టులనె పుట్టరాదా | పట్టి యొకఁడు నాకు నటులు పాటిల్లదొ యీ
      పట్టునఁ బుత్త్రారణి నా | పట్టున లేదాయె నెట్లు భామ నొనర్తున్.346

తే.గీ. రూపుగలదాని బెనిమిటి ప్రాపుదానిఁ | గాపురముఁ జక్కనొత్తంగ నోపుదానిఁ
      బాపపూఁపలఁ గనుదాని బడఁతినోర్తు | గలుగఁజేసినఁ గాలి సంకలియ కాదె. 347

ఆ.వె. జాయ దక్షమైనఁ జక్కని దైనఁ బ | తివ్రతామహిమలఁ దేలియున్న
      మోయరాని పెద్ద బొండకొయ్యయ కాదె | శివుఁడె యువతి వలనఁ జిక్కిచిక్కె.348

క. అట్టి గృహాశ్రమమును నే | నెట్టులఁ గైకొందు ననుచు నెరియుచునుండన్
      నెట్టన ఘృతాచి యను నొక | నట్టువగత్తియ విలోకనంబునఁ దోచెన్.349

చ. గగనమునందు వేలుపుల కన్నియ చిన్నియ యెంతయేని సొం
      పుగఁ గనుపట్టె నందముల మూటయి నేటగు నీటుమీఱు పల్
      వగలకు సూటియైన పెనుబాటయి మాటల తేటలన్ నిజం
      బుగ నమృతంపు టూటయయి పోటయి చూపఱ మానసంబులన్.350

క. ఆ వగలాడిం గనుఁగొన నా | వలఱేఁ డా పరాశరాత్మజు నేయన్
      జేవచెడి యువిదపైఁ, గామావేశం బొదుప నిట్టు లని చింతించెన్. 351

ఉ. ఈ విమలాంగిఁ గొన్న సుతు నిచ్చును గామము దీర్చునంచు నే
      నేవిధి దీనిఁ బొందఁగల నిప్పుడ నా సరివారు నవ్వరా
      భావజుబారిచే వలపు పాలయి వ్యాసుఁడు గూడె నచ్చరన్
      గైవసమైన వర్షశతకవ్రతపుణ్యము ద్రోచెనం చొగిన్.352

క. పోనిండు పాపమైనను, నే నింతి వరింతు ననివ నీ యచ్చర సం
      తానము సుఖదం బగునే | మానుగను గృహస్థ ధర్మ మార్గము బోలెన్.353
 
క. మును నారదుండు నాకున్ | వినిచెను ము న్నూర్వసి యను వెలఁదుకఁ జేప
      ట్టినవాఁడు పురూరవుఁ డను | జనవరుఁడు పరాభవమునఁ జనియె నటంచున్.354
 

-:బుధోత్పత్తి:-



వ. అని పల్కిన సూతుం గాంచి మహామును లిట్లనిరి.355

తే.గీ. క్షితి బురూరవుఁడను ధరాపతి యెవండు | తెలియ నూర్వసియనునట్టి చెలియ యెవతె
       యెట్టు లాబోటి నారాజుపట్టి కలసె | సకలమును దెల్పు రోమహర్షణ తనూజ. 356

చ. అమృతముకంటెఁ దియ్యనగు నయ్య భవన్మృదుసూక్తి మాకు సం
       యమివర యెంత విన్నఁ దని వయ్యెడినే యన సూతుఁ డిట్లనున్


    విమలమనీషులై వినుఁడు వీనులపండుపుగాఁగఁ దొల్లి వి
    భ్రమవతి యా బృహస్పతికి భామిని తార యనంగ నొప్పెడిన్. 357

క. ఆ వనిత మిటారములకు | తా వని తన నేర్పుసూచి తా మెచ్చును వా
    ణీ వనిత మగఁడు కొఱతలు | లేవని తరుణామృతాంశులేఖకుఁ బోలెన్. 358

ఉ. చేరెడు చేరే డా కనులు జిప్పిలి వీనుల నంటు నక్కురుల్
    బారెడు బారెడై వెనుక ప్రక్కను బిక్కలరాయ ద్రేలు సొం
    పారెడుఁ బారెడున్ సుధలపారముగా నధరంబునుండి ము
    ద్దూరెడు దూరెడు న్మొగ మహో తగు పున్నమనాఁటి చందురున్.359

ఉ. కారు మెఱుంగొ బంగరు చొకారమొ వెన్నెల సోగయో సుధా
     ధారయొ కాక పూవిలుఁతు దారయొ నిద్దపుఁ బద్మరాగ శో
     భారమణీయకందళమొ భాసుర దుగ్ధసముద్రవీచియో
     నారుచిరాంగి యొప్పె మదనప్రభన న్నవయౌవనంబునన్.360

మ. మదవైహ్వల్యమునన్ వరాంగి శశిధామంబుం బ్రవేశించి త
     ద్వదనంబుం గని రూపయౌవనకళావర్ణ్యుండు వీఁ డంచు స
     మ్మద మారం దనుఁ గూడు మన్నఁ దమినాతం డియ్య కోల్సేయ న
     మ్మదన ప్రక్రియఁ గొంతకాలము రమింపం జొచ్చి రా యిర్వురున్.361

క. గురుఁ డత్యంత క్రోధ | స్ఫురితుండై తారఁ దేర శుశ్రూషల బా
     లుర బంపినఁ బలుసారులు | మరల మరలఁ దిరిగి తిరిగి మానిరి వారల్.362

క. అందునకుం గడుఁ జింతిలి | బృందారక గురుఁడు దాన యేగెదనని యా
     చందురుని గృహము సేరి య | మందక్రోధమునఁ బలికె మందా యనుచున్. 363

తే.గీ. కర్మ ధర్మ విగర్హితక్రమము పూని | సిగ్గొకింతయు లేక నా శిష్యుఁడ వయి
      నాదు చక్కనిచుక్క నిన్నాళ్ళు నీవ | యతికికొంటివి యెంత సేసితివి చంద్ర.364

క. గురుభార్యనుఁ గవయుట భూసురుఁ జంపుట ధనముగొనుట సురద్రావుట పెం
     పరి యిట్టి వారిఁ గలయుట | యరయంగా నైదునున్ మహాపాతకముల్. 365

క. పెడత్రోవం దొక్కితి వీ | యెడ నిందార్హుఁడవ కావో యీ వోరి శశీ
     విడువుము నా పెండ్లామును | గుడువఁ దగదు తగదు పరమకుత్సితమతివై.366

క. నాచక్కని ముద్దియ నీ | నీ చక్కిని విడువకున్న నేఁ బోవఁ జుమీ
     నీచుఁడవు గురుద్రోహివి | యై చరియించు టిది నీకు నర్హం బగునే. 367


క. రాఁ గలవె సురల యిండ్లకు, పోఁగలవే నన్ను నాలిఁ బొందింప కిఁకన్
    దేఁ గలవే కీర్తి యింటికి( | బైఁ గలవు కలంకములు క్షపాచర నీకున్. 368

చ. అన విని చంద్రుఁ డిట్లనియె నంగిరుబిడ్డను జూచి యో గురూ
    ఘనులుగదా ధరామరులు కాతురు శిష్యులఁ గ్రోధవర్జితుల్
    పనుపడ ధర్మశాస్త్రమును బట్టుక యుందురు కొన్ని నాళ్ళు నీ
    వనిత మదీయ గేహమున వాసము సేయఁ గొఱంత గల్గునే.369

ఆ.వె. ఇచ్చ మీఱ నింతి యింటికిఁ దా వచ్చె | నెలమిఁ గొంతకాల మిచటనుండి
    యిచ్చమీఱ మరల వచ్చు మీ యింటికి , మచ్చెకంటి దానె మాన్యచరిత.370

ఆ.వె. గురువరులను మీరు కొండికలము మేము | మున్న బోధ యిచ్చి యున్న వారు
    దూరు లేదు సరికి జారుచే ననుచును | విప్రునకును వేదవిధుల వలన. 371

క. అన విని గురుండు స్వగృహంబునకుం జని యచటఁ గొన్ని ప్రొద్దులు చింతా
    జనిత తను కాత్మ్యయుతుఁడై | మనియెన్ బ్రియురాలి మీది మమత బలిమిచేన్.372

క. మరలం జందురు నింటికిి, నిరిగి మహోగ్రత యెసంగ నలఁగి నిషిద్ధం
    బరయ ఖలు మందిరంబుం | జోరగా దని బయల నిలచి సురగురు డనియెన్. 373

ఉ. ఓరి దురాత్మ యోరి కలుషోద్యమ యోరి విగర్హితక్రియా
    చారవిచార యోరి విరసా నిలయాంతరసీమ బండె దీ
    ద్వారము దాటి రమ్ము వడిఁ దారను నా ప్రియదార నీక యే
    దారినిఁ బోయె ది మ్మికను దక్కిన నీ పనిఁ జూచుకొమ్మొగినన్. 374

క. నా పాలి ముద్దులాడిని, లే పొమ్మని నాకుఁ బంప లే వేనిము నో
    పాపిష్ఠ నీకు నిప్పుడెె | శాపం బిడఁ దలంచినాఁడఁ జటులోగ్రుఁడనై.375

క. లేరా వైళంబె దురా, చారా నా దారఁ జనకి చలమున నాతోఁ
    బోరా పోరా వార్ధికు మారా నిను దుమ్ముఁ జేసి మట్టాడెదరా. 376

క. ఈలాగున బల్కిన గురు | నాలాపము లాలకించి యారాజు బహి
    శ్శాలికను దాటి వెలువడి | జాలింతయు పలికె సాహస మడరన్. 377

చ. కనుఁగొని నవ్వరే జునులు గౌరవహానియుఁ గాదె కాకి ము
    క్కున నిడు దొండపండువలెఁ గామిని నీ కడ నిల్చె నేనియున్
    విను మిఁక దీని సుందరీ నవీన వయస్కను మాని నిన్నుఁ బో
    లిన ముసలాపె నాననవళీ ముకుళీకృతనేత్ర గూడుమీ.378

క. ఈ వేమీ జేసినను నే | నీ వరపర్ణినిక నీకు నిచ్చుటలే దిం
    దీవిధులు కామతంత్ర క ళావేదు లెఱుంగుదురు చలము మాను మిఁకన్. 379


క. నెల పలుకులు విని యలుకన్ | బలరిపు నిలు గురుఁడు సేర బహుభంగుల న
    బ్బలియుఁడు సపర్య లొనరిచి | లలి నాసన మిచ్చి గురువులార యటంచున్.380

చ. మునుపటియట్లు కాదు మొగముం గడువాడెను గన్నులార్తిలో
    మునిఁగిస యట్టు లున్న యవి మూపును వాంచితి గొంతు బొంగు వో
    యిన దిఁక మాటలం గొణుఁగు నేర్పడె నయ్యయొ చూడ వేమి మ
    మ్మనఘ ముఖంబు నెత్తి కర మంగద నేడ్చెదు నేల గీయుచున్. 381

వ. అవమతిఁజేసె నీకు నెవఁ డాతనిఁ జెప్పుము సర్వదేవతల్
    శివహరు లేను నెప్పుడుసు జేతులు మోడ్చుక నీకు బాసటం
    దివిరి చరింపమే యిటు మదిన్ విలపింపఁగ నేల నీకు నేఁ
    డవిరళశాంతమూర్తివి మహాధీషణుండవు దేవదేశికా. 382

క. అనిన విని దేవ గురుఁడి, ట్లను నో యమరేశ యెంత యని చెప్పుదు నా
    మనమున దుఃఖము విను క్రన్నన జంద్రుఁడు తస్కరించె నా పెండ్లామున్. 383

క. విసికితి వేసారితి నే, నసురాంతక చందమామ నడిగి యడిగి నా
    మిసిమిగల ముద్దుగుమ్మను | వెనఁబంపుము పంపు మనుచు విడువఁ డతండున్.384

తే.గీ. ఏమిచేయుదు నేమందు నెందుఁజొత్తు | నేఁడు నా కీవ దిక్కు నీవే కదా స
    హాయుఁడవు దుఃఖితాత్ముడ నైతి నయయొ | లెమ్ము చంద్రునిశిక్షింప రమ్ము రమ్ము.385

వ. అనిన విని యొక్కిింత దడ వాలోచించి పరమతపఃప్రభావనిస్తరుం గురుం గాంచి
    చంద్రుం డిట్లనియె.386

క. శోకము మానుము మానుము | నాకముఁ బాలించు నే సహాయుఁడు గాఁగా
   నీ కొక్క భయము కలదా | నా కిందుం డెంతవాఁడు నాకాచార్యా. 387

వ. అని యూరడించి.388

ఆ.వె. ఎఱుఁగ జెప్పు నేర్పు లెఱిఁగిన దూత నొక్కరునిఁ బిలచి చంద్రుకడకుఁ బంపెఁ
   బ్రీతిఁ జేసి గురుని నాతిఁ గూడుట మంచి రీతి కా దటంచు నీతిఁ దెలుప. 389

క. విని వాడు పోయి చంద్రునిఁ | గని మఘవుఁడు పుచ్చె నన్ను ఘను నిన్నుఁ గనుం
   గొని యిట్లు చెప్పుమనుచున్ | వినుమా నా చేయునట్టి విన్నపము శశీ. 390
 
ఉ. అంబుజవైరి నీ వెఱుఁగ నట్టివి ధర్మము లెవ్వి నీతిమా
    ర్గంబులు మీవి కా పరమగణ్యుఁడు నీ పిత యత్రిమౌని దో
    షంబులు సేయరాదు ఫలసాధనబుద్దులు మీరు నాదు వా
    క్యంబులు నమ్ముమీ మిగుల హర్షముఁ బూనుమి యింద్రు జూడుమీ.391


చ. జగమున జంతుసంతతికి జాయల కా పురుషార్థహేతువుల్
    తగు భువి దారగోపనము తద్దయు శ్రద్ధవహింపకున్నఁ గీ
    డగు నటు కాన నేరికిని నన్యులభార్యల నంటరా దటం
    చగణితఫక్కి శాస్త్రముల యందుఁ గనంబడు వేయునేటికిన్. 392

క. తన భార్య నొక్కఁ డంటినఁ | దన కేగతిఁ దోచు నట్లితరు భార్యనుఁ దాఁ
    గొనునపు డారయవలయున్ | దన కెట్లో యితరులకును దా నట్లనుచున్.393

క. పై దలులు నీకు నిఁక లే | రే దక్షుని కూఁతు లిరువ దెనమండ్రు కదే
    యీ దేవగురుని భార్యన్ | నీ దాపున నేల నేల నెల నెల లెన్నే. 394

ఉ. కోరితి వేని వేల్పు వెలకోమలు లెందఱు లేరు నీకు శృం
    గారవతుల్ సుధారస వికారములైన వచోరసంబులన్
    గౌరవహాని దోషముల కారణమున్ జననింద యన్య సం
    సారము జోలి వోవుట విచారము సేయుమి తార నంపుమీ. 395

క. మిన్నలు పోయిన దారిన్ | జిన్నలు నడిచెదరు కాన స్మృతిమార్గములన్
    దిన్నఁగఁ జన నౌ నది కా | కున్నను ధర్మక్షయం బగు న్జగ మెల్లన్.396

క. కాపున విడుము బృహస్పతి | దేవేరిని నట్టులైన దేవసమితికిన్
    నీ వలనఁ గలహ మబ్బదు | వేవేగము నాదుపలుకు వినుమా మనుమా.397

క. జాబిల్లి దేవదూత వ | చోబలముం గనియు ఘన రజోగుణయుక్తిన్
    రా బాటయుఁ బో బాటయుఁ | దా బుద్ధిం దలఁపలేక తటపటపడియెన్.398

వ. ఇట్లుకొంతవడి తనలో విచారంబుచేసి యెట్టకేనిం గృతనిశ్చయుండై. 399

ఆ.వె. దేవదూత నీవు దేవనాథునకు నే | నన్న యట్లు చెప్పు మధికధర్మ
    యుతుఁడ వీవు దేవపతివి యిట్టులు చెప్పఁ | బాడి యగునె యింత పాపమున్నె.400

క. మీ రిరువురు గురుశిష్యులు | కారే యొజ్జలను బిల్లకాయలు పోలం
    దీరుపు పడయుదురు కదా | వేఱొం డిఁక నెంచ నేల విబుధశరణ్యా. 401

క. పరులకు నుపదేశంబులు | నెరపెడిచో గొప్పవారు నేర్పరులుగదా
    పరికింపరు తమపనులం | గరమచ్చెరువైన దిదియకాదే జగతిన్. 402

ఆ.వె. ధర్మశాస్త్రకర్త దైవగురుం డంచు | నతని మాట నమ్మ నర్హ మగునె
    తనకుఁ దానె వలచి చనుదెంచిన వెలందిఁ | గొన్న నేమి దోష మున్నదందు.403

క. బలవంతు లైనవారలు | తలఁప సమస్తంబునకును దారె స్వతంత్రుల్
    బలహీనుల కా శాస్త్రము | నిలువదుకాబోలు నహహ నీతు లికేలా. 404


ఆ.వె. గురుని మీఁద వలపు గోరంతయును లేదు | నన్ను ఖిన్నుఁజేసి నాతి చనదు
      దైవనాధు నాజ్ఞఁ దలమ్రోతు నే నెట్టు | లెట్టు వచ్చినాఁడ వట్టె చనుము. 405
 
శా. ఆ మాట ల్విని దేవదూత హరి డాయంబోయి యో దేవ నే
       నా మందాత్ముని మందలించిన నతం డాలింపఁ డాయెన్ భవ
       త్సామర్థ్యం బెఱుగం డటంచుడుఁ బలుకన్ దైత్యారి చక్రేశుఁ
       గ్రామర్షంబున యుద్ధయాత్ర యిఁక నిక్కం బంచు నూహించుచున్.406

తే.గీ. గురుని యెడనున్న పెంపగుఁ గూర్మిచేత జంద్రుయుద్ధంబు చాటించె నింద్రు డపుడు
      ఔర సమయంబు దొరికె నా కనుచు నిక్కి | శుక్రుఁ డిట్లని జాబిల్లి చూచి పలికె. 407

శా. ఓయీ చంద్ర మహేంద్రు డెంత సమరంబో యుక్తమీ పట్టునం
      జేయం జొత్తుము నేను రాక్షసులు నిశ్చింతన్ సహాయక్రియల్
      వేయేలా యొకమాటఁ జెప్పెదను గర్విష్ఠుండు కాడే గురుం
      డీయంబోకుము దార నాయెడను లేదే మంత్రశక్తుల్ కడున్. 408

వ. అనిపలికి భార్గవుం డసురులం బురికొల్పిన.409

తే.గీ. యుద్ధసన్నద్ధులై సుర లుగ్రు లగుచు | నరుగు దేరంగ రక్కసు లురువడించి
     మోహరించిన గదనం బమోఘమహిమ | బెక్కుహాయనములు నిండె నొక్కరీతి. 410

క. దేవాసుర యుద్ధముగని | దేవజ్యేష్ఠుండు హితమతిన్ హంసపయిన్
     దా వేగ రణస్థలికిన్ | వావిరిఁ జనుదెంచి పలికె వనజరిపునితోన్.411

క. విడువుము గురుసతి సేమము | గుడువుము పరసతుల నిట్లు కోరుట తగునా
     కడలి బుడుత కాకున్నసు | జడధిశయనుఁ బిలచి నీకు క్షయ మొనరింతున్.412

వ. అని మఱియు శుక్రుం జూచి యిట్లనియె.413

క. నీ విట్లు సేయఁ దగునే | సావాసమువలన నీకు జడమతి యొదవెన్
     నావిని శుక్రుడు చంద్రునిఁ | బో విడచుట మే లటంచు బుద్ధిందలచెన్.414

ఆ.వె. తలఁచి చంద్రుఁ జూచి దైత్యగురుండు ప్రా | లేయకిరణ గురుని జాయ నతని
     కిచ్చివేయు మనుచు నిపుడ నీజనకుండు | సెప్పఁ బంపె నట్లు సేయుమనిన.415

ఆ.వె. భృగునిమాట లెంత వింతలాయె నటంచు | నాత్మనెంచి సురవరార్యు భార్య
     గర్భవతి నొసంగి కమలారి పంపిన | గురుడు చనియె భార్యఁ గూడి గృహము.416

ఆ.వె. పరులచేత జిక్కి పలునాళ్ళు తన సాగు | బడినిలేని పొలము బాగుసేసి
     పరగ దున్ని విత్తి పండించి యిచ్చిన | బంటకాపుఁ బోలెఁ బాపఁడలరె.417

ఆ.వె. అంత గొంతకాల మరుగంగ నొక శుభ | వాసరమున రమ్య వదనుడైన
     తనయుఁ డుద్భవించెఁ దారకు సురగురు | దార కతడు సారసారిఁ బోలె.418

ఉ. పుట్టిన పుత్రునిం గని ప్రమోదమునం జరిగించె చేతనై
    నట్టులు జాతకర్మ మొదలైనవి దానికి నోర్వ కిందుఁ డా
    పట్టున కంపె నొక్క భటుఁ బట్టిని నా కిడు మంచు గట్టిగాఁ
    బుట్టెను వాఁడు నా కనుచు బొంకులు కా వనుచు న్వచింపగన్.4198

ఉ. దూత వచించు మాట విని దొంగయ తామరగొంగ వింటిరా
    కూతలు నా మొగంబునకుఁ గూన మొగం బెనఁబెట్ట నొప్పెడిన్
    బ్రీతిగ జాతకర్మసముపేతుని జేసితి నేన కాదొకో
    యీ తరి బిడ్డ నియ్య నగరే జను లంచు వచించి పంపినన్.420

ఆ.వె. మరల గ్రతుభుజులకు మాంసాశనులకును | బ్రాప్తమైన పోరు బ్రహ్మ చూచి
    వచ్చి యుద్ధసీమ నచ్చెరువడి యంద | ఱాలకింప నిట్టు లనుచుఁ బలికె. 421

క. తారా! పదనఖనిర్జిత తారా! సురలోకగురుని దారా! యిటకున్
    రారా తెలుపుము గురుఁడా | రేరేడా వీని తండ్రి ఋత మెఱుగుదకా.422

సీ. సందడించుచు గిల్కుటందె వాదోడుగాఁ | దొడిఁబెంపుఁ జిల్క చేదోడుగాగఁ
    జక్కని మోవిపై ముక్కెర కదలఁగా | గుబ్బ కస్తురితావి గుబులుకొనఁగ
    నునుసిగ్గు దలవాంచి కనులఁ బ్రక్కల దిద్ద | ముసిముసినగవు సొంపులుఘటింప
    మణిముద్రికల వ్రేళ్ళు మఱిపైఁట సవరింప | ముసుఁగుసరిగ జడ మొదల ముసర
తే.గీ. గునిసి కౌనాడ గదిగుమ్మమునకు వచ్చి | తలుపు నొకకొంత యోరగా మలచి నిలచి
    తార ముద్దులు గార విధాత కనియె | నితడు నిజముగ నమృతాంశుసుతుఁ డటంచు. 423

ఆ.వె. వన్నెలాడి రాజు వదనంబుఁ గనుగొని | చిన్నతనముచేతఁ జేసె దప్పు
    తప్పు చెలియఁ జెప్పి యొప్పించినంతనే | మగని గలసి సుఖనిమగ్నయయ్యె. 424

వ. అని చెప్పిన సూతుండు మరియు నమ్మహనీయు లగు మునిశ్రేష్ఠుల కిట్లనియె.425

క. ఆ సుతునిం దాఁగొని నిజ | వాసమునకుఁ బోయి యంత వారిజరిపుఁ డు
   ల్లాసమునఁ బొంగి బుధుఁ డను | భాసురనామంబు పెట్టె బలు ప్రేమ మెయిన్.426

క. కమలజుఁడును సురలును దమ | తమ గృహముల కేగిరనుచుఁ దప్పక చెప్పెన్
   విమల బుధోత్పత్తిక్రమ | మమిత మనోహరము కరము నద్భుతము సుమీ.427

ఆ.వే. బుధునకు నిళయందుఁ బుట్టె ధర్మపరుండు యజ్వయగు పురూరవాఖ్య నృపతి
   దానపరత నత్యుదారకీర్తి వహించి | జగము నేలుచుండు సమయమందు.428

క. సుద్యుమ్న నామ భూపతి | ప్రద్యోతనుఁ డగుచు సత్య పరిపాలన సం
   పద్యుక్తిఁ బొనరె నాతఁడు | హృద్యస్థితి సైంధవంబు నెక్కి మృగయకై. 429

క. కొంద ఱమాత్యులు తనతోఁ బొందుగ రా శరశరాసములు పూని మహా
   నందమున నరణ్యంబుల | యం దుఱులును వలలు పన్ని యయ్యై యెడలన్.430

క. రురువులఁ గుందేళ్ళను సూ | కరముల ఖడ్గములఁ బులుల గవయముల మహా
   శరభంబుల మహిషంబుల | నురుతర వన కుక్కుటముల నోలి వధించెన్.431

వ. అంత నొక్కయెడ నమ్మహీపాలుండు.432

సీ. సాల తాల తమాల సాల తక్కోల రసాల తనుచ్ఛాయఁ దాళి తాళి
    కుంద నాగ మధూక చంద నాగరు గంధ కంద నానాగతుల్ కడచి కడచి
    మల్లికా మాలతీ వల్లికాది లతామతల్లికావళులను దాటి దాటి
    శుకరాజి పలుకు హంసకరాజిత పదంబు పికరాజు స్వరము కన్పెట్టి పెట్టి

తే.గీ. తుమ్మెదల రొద పొదలను దూఱి తూఱి | కుసుమవిసరంబు కొనగోళ్ళఁ గోసి కోసి
    తనర సుద్యుమ్నుఁడు కుమారివనమునందు | గుఱ్ఱ మెక్కిచరించె నెక్కుడగు బ్రీతి.433

ఉ. గుఱ్ఱము గోడిగాయె నృపకుంజరుఁ డత్తఱి నాఁడుదాయె రా
    కుఱ్ఱడు దన్నుఁదాను గని కోమలి నైతి నిదేమి చిత్రమో
    వెఱ్ఱితనాన నిట్టి యడివిం దమి దూఱితి నవ్వుఁబాటు నా
    మొఱ్ఱల నాలకించి కతమున్ వినిపించెడివార లేరోకో.434
  
వ. అనిన విని శౌనకాది మహామునులు పరమాశ్చర్యంబు నొంది యో మహానుభావా!
    సుద్యుమ్నుండు కుమారవనంబు బ్రవేశించి నంతటన స్త్రీత్వంబు సంభవించుటకుఁ
    గారణంబు సెప్పి మమ్మనుగ్రహింపవే యనుఁడు సూతుఁ డిట్లనియె. 435

-: సు ద్యు మ్నో పా ఖ్యా న ము. :-



చ. వినుఁడు మునీంద్రులార మును విన్సిగదేవరఁ జూడఁ దాపసుల్
    సనక సనందనాదులు లసద్ద్యుతులం దిశ లెల్లఁ గప్పుచున్
    జని వనినున్న యా శివుని జూడఁ గనుంగొను నప్డు గౌరి, నా
    థుని తొడమీద నగ్నయయి తుందుడుకుల్ పచరింపుచుండఁగన్.436

ఉ. వారినిఁ జూచి సిగ్గుపడి వైళమ యీశ్వరు నంకసీమ న
    గ్గౌరి తొలంగి వస్త్రమును గట్టి వడంకుచు నిల్చిన న్మనో
    జారిని మ్రొక్కి మౌనులు వెసన్ జన నాతఁడు లజ్జఁ గుందుఁ గౌ
    మారినిఁ గాంచి నీకు ననుమానము లేదు సుఖంబు గూర్చెదన్.437

ఉ. చూడుము నేఁడు మున్నుగఁ గృశోదరి యీ వనమందు జొచ్చు నె
    వ్వాఁడయిన న్వెలంది యగు వాడఁగఁజేసె దిఁకేల మోము నీ

     వాఁడన కాదె యంచు; జెలువన్ బలుభంగుల బుజ్జగించె నా
     నాఁడు మొదల్‌ కుమారుని వనంబున కీ మహిమంబు వాటిలెన్. 438

చ. ఎఱిఁగినవారు పోరచటి కెవ్వడయేని యెఱుంగ కేగినన్
     తెఱవతనమ్ము వచ్చు నిఁకఁ దెల్పెడిదే మది కారణంబుగా
     నరపతి భామ యయ్యెను వనంబున జొచ్చుటఁ జేసి మంత్రులున్‌
     దెఱవల యైరి గుఱ్ఱమును దీటుకొనె న్వెస నాఁడుగోడిగై. 439

క. అంతట సుద్యుమ్నుఁడు దాఁ | జింతాక్రాంతుఁ డయి గృహము చేరి తదీయ
     ప్రాంతమునఁ దిరుగ నపుడా | యింతి కళానామధేయ మిడిరి జనంబుల్‌.440

క. తనతోడి వయస్యలతో వనితామణి హావభావ వైఖరు లొప్పన్
     వనమున విహరించుట గని ఘనుఁ డగు బుధుఁ డతివఁ జూచి కళవళ పడియెన్.441

ఉ. చక్కనిచుక్క నన్ను నిది చక్కని చుక్కని మెచ్చి యాడునో
     గ్రక్కున ధిక్కరించుచు నఖంబును బోలఁ డటంచు దూరునో
     మిక్కిలి తండ్రికీర్తి కడు మేలని చెప్పుకొనం దలంప న
     మ్మక్క తదీయవక్త్రరుచి కాతఁడు చాలఁ డటంచు నెంచునో.442

 ఉ. ఈ విమలాంగి కౌనుసిరికే సరి కేసరి యీ నెలంత కె
     మ్మోవి మెఱుంగు కింశుకము పూతను బూతను నేమిచెప్ప నా
     హా వనజాక్షి వేణి రుచి నబ్ధముఁ గా దను నీ వెలంది న
     న్నేవిధినేనిఁ గూర్మియిడి యేలఁగ నేలఁగవచ్చు లోకముల్‌.443

సీ. చెలియ కంఠస్వరశ్రీ లేలఁగాఁగాదె పికసంతతులు పరభృతము లయ్యె
     కలికి నెమ్మేని తళ్కుల కోడియేకాదె సౌదామనీలత చపల యయ్యె
     వెలఁది నెమ్మేని సౌరులఁ గాంచి వలపోసి రాజీవమదియు నీరజమ యయ్యె
     నతివ కన్దోయి సోయగముఁ జింతించుచుఁ కొమరు లీనెడుకల్వ కుముదమయ్యె

తే.గీ. కలికి పదమార్దవంబును గొలిచి కొలిచి । పేర్మిఁ జిగురాకు పల్లవాభిఖ్య జెందె
      దీని మధురాధరామృతాధీనుడ నయి ప్రథిత వైభవమున నేను బుధుఁడ నగుదు.444

వ. ఇ ట్లభంగురానంగపరవశుండై యయ్యంగనావయోవిలాసంబుల నంతరంగంబునఁ
     దలంచి వర్ణించుచు మందార తరు సందోహంబుల చాయల మరందసారణీధోరణుల
     దాపునం ద్రాక్షాలతాకాయమానంబుల నిలచి నిలచియున్నతఱి కన్నియయు నవ్వన్నెకానిం
     గాంచి పంచశరశరాన నిర్గళిత పుష్పబాణ పరంపరలు వెక్కసం బగుడుం దక్కిసలాడి
     నిక్కినిక్కి యొక్క యీరంబు చాటుననుండి యా చక్కదనాల యిక్క తనలో నిట్లని
     వితర్కించె. 445


శా. ఔరా వీఁ డెవఁడో మహోన్నతభుజుం డాజానుబాహుండు శృం
    గారశ్రీ సుకుమారమారుఁడు కటాక్ష భ్రాంత సీమంతినీ
    వారుం డింద్రకుమారుడో మఱి సుధావాసుండొ యేమందు నీ
    ధీరోదాత్తుని గూడకున్నఁ దగునే స్త్రీత్వంబు నా కియ్యెడన్. 446

వ. అని చింతించుచున్న మత్తకాశిని యెదుటికిం జనుదెంచి ధరావరుండు.447

క. మదిరాక్షి నీదు పే రె | య్యది నినుఁ గడుపారఁ గన్న యతఁ డెవ్వడు నీ
   మది నేమి కోరి యిచ్చట | ముదమున విహరించెదొ సమూలము సెపుమా.448

వ. అనిన నజ్జననాథు పలుకులు విని సిగ్గున నవనతవదనయై మనంబున సందడించు మద
   నుండు ప్రేరేప నెట్టకేలకు ధైర్యంబుగొని యో జనవరా యిటు వినుమని నవలా యిట్లనియె.449

క. ఇళ యందురు నన్నీ భూ | వలయంబున మిగిలినట్టి వార్త లికేలా
   కలయం గోరెద నిను నే | వలరాయని పోరు మాన్పు వసుధాధీశా.450

వ. ఇట్లాడిన ముద్దులాడిం గని యత్యాదరంబున గాంధర్వపద్ధతి నవలంబించి మనోభవ
   మనోహరక్రియాకలాపంబుల నలరించిన సద్యోగర్భంబున నయ్యింతి కొక సుందరుండైన నందనుం
   డుదయించి దినదిన ప్రవర్దమానుండై యలరుచుండె నంత.451

క. వనమంద యుండి యొకనాఁ | డనఘుఁ గులాచార్యు గురువు నాత్మఁ దలంపన్
   జనుదెంచి కార్యమడిగిన | ననియె నిళాకన్య యతని కతి హర్షమునన్.452

క. మీ దివ్యజ్ఞాన మహిమ | నాదు విచారంబుఁ దెలియ నాథులకారే
   సాదరత నడిగితిరిగా | కేదని సుద్యుమ్నవిభుఁడ నిళనైతిఁగదా.453

క. అది విని యంత బృహస్పతి | మది నంతయుఁ దెలిసి త్రిపురమర్దనుఁ జర్మ
   చ్ఛదు శంకరు గిరీశుఁ బదింబది దాఁ దలపోయ నతఁడు ప్రత్యక్షగతిన్.454

సీ. విన్నుముట్టిన కెంపు వన్నెకపర్దంపు జడలలో నెలవంక జగ్గులీన
   గౌరీపరీరంభ కరముద్రికలఁ గాలకూటనీలచ్ఛాయ కొమరు మిగుల
   భూతిభూషితకరాంబుజముల మణికట్ల భుజగఫణామణు ల్పొలుపుమీఱ
   శారదాభ్రముఁబోని చరమగాత్రమునంటి పులితోలు దుశ్శాలు చెలువుగులుక

తే.గీ. తనువు వామార్థమున దక్షతనయ దనర | మూడుకన్నులుసొబగు మోమున నెసంగ
   సలలితస్థితి గంగ యౌదలను బొంగ | నంగజారాతి ప్రత్యక్ష మయ్యె నపుడు.455

వ. ఇట్లు ప్రత్యక్షంబై. 456

ఆ.వె. విన్నవింపు వాంఛ విబుధలోకాచార్య | యన్ననతఁడు నలరి యభవ నాదు
   శిష్యుఁ బురుషుఁ జేసి స్త్రీత్వమ్ముఁ దొలఁగింపు మనిన గిరిశుఁ డిట్టు లనియె నపుడు.457

క. తన తొల్లిఁటి శాపము త | ప్పనిదికదా యనుచు నెంచి పలికెన్ మాసం
   బునఁ బురుషుఁడు మఱుమాసం | బునఁ స్త్రీ యగు నితఁడు మేలుబొనఁగూడు ననెన్.458

క. ఆ మాటవలనఁ బురుషుం | డై మించి నరేంద్రుఁ డింటి కరిగి మహా శ్రీ
   ఘనుఁడై మాసము రాజ్యం | బును మాసము హర్మ్యవాసమును గావించెన్.459
  
క. జను లాతని రాచరికం | బునఁ దృప్తులు గాకయున్న భూపాలకుడున్
   దనదు కుమారుని నవ యౌ | వనశాలి న్నిలిపె రాజ్యభరము వహింపన్.460

వ. ఇట్లు పురూరవునకుం బట్టాభిషేకంబు సేసి సుద్యుమ్నుండు దపఃకాంక్ష నరణ్యంబులకుం జని
    నారదువలన నవాక్షరంబైన దేవీమంత్రంబు గ్రహించి నిరంతర ధ్యానపరాయణుండై తపంబు
    సేయుచుండ. 461

సీ. అరచెనా భయదఘోరారావమువ ధరా | దర గుహావళులు బ్రద్దలయి కూల
    తెరచెనా నోరు వార్ధి నదీ గిరులతోడ | భూగోళ మొక చల్దిముద్దగాగ
    ఉరికెనా యమితశౌర్యోదీర్ణపద్దతి | సప్తనీరధు లొక్క చంగుగాఁగ
    ఉరికెనా కకుభాంత కుంభకుంభాంతర | పిశితంబు లొక కోఱఁ బెల్లగిలఁగఁ

తే.గీ. దేజరిల్లెడి సింగంపు తేజి నెక్కి | మధుర మదిరా రసాస్వాద మహిమఁజేసి
    యతిమనోహరలీల మదాలసయయి | యంబ సుగుణకదంబ ప్రత్యక్షమయ్యె.462

వ. ఇట్లు ప్రత్యక్షమైన దేవిం గాంచి సుద్యుమ్నుండు.463

ఉ. దేవి భవత్స్వరూపము నిదే కనుగొంటిని దివ్యసుందరీ
    సేవితపావనాంఘ్రి సరసీరుహము ల్భజియించి మ్రొక్కెదన్
    కావలె నన్న సర్వమును గాచెడి నీ కొక భార మైతినే
    వీవకదమ్మ నావ భవనీరధికిం గరుణారసాంబుధీ.464

ఉ. నిన్ను నుతింప నే మునులు నేర్తురు మర్త్యులిఁకెంత వారు నీ
    మన్నన గాదె దేవతలు మర్త్యులు భూతిసమేతు లౌట నీ
    యున్నతి నీదయోదయము నూర్జితశక్తి యుదారధర్మసం
    పన్నత కన్నతల్లి నిజభక్తసురద్రుమవల్లి సాధ్యమే.465

ఉ. వెన్నుఁడు దమ్మిచూలియును వెన్నెలరాయనికూనతాలుపున్
    బన్నగరాజు నగ్ని రవి పంకజవైరి సురేంద్రుఁ డార్కియున్
    మున్నగు దేవతానికరము ల్గణియింపఁగలేరు నీ ప్రభా
    వోన్నతి నెవ్వ రే యితరు లోపుదురో జగదంబ తెల్పుమా.466

ఉ. ఓ జగదంబ నిన్ను సుగుణోజ్వలుఁ డైన మురారి ఱొమ్మునన్
    దేజరిలంగ దాల్చి నియతిన్ భజయించుఁగదమ్మ నీపదాం


    భోజము నమ్మికాదె జగమున్ బరిపాలనఁజేయు సంతత
    శ్రీజయలబ్ధి నీవకద శ్రీ పురుసాత్వికి వార్యపోషిణీ. 467

ఉ. ఓ సకలేశ్వరీ జలరుహోద్భవుఁ డెంతయు భక్తి వక్త్రమున్
    వాసముగా నొసంగి నిరవద్యగతిన్ నినుఁ గొల్చికాదె సం
    భాసితుఁ డయ్యె సంతతము మానుగ విష్టపసృష్టికర్తయై
    నీసరి యెవ్వరమ్మ రమణీయవిలాసిని రాజసీ సతీ.468

ఉ. ఓ కరుణామయీ వృషహయుండు నిజార్ధశరీరమందు ని
    ర్భీకత నిన్నుఁదాల్చి కడుఁ బ్రీతి మెయిం బరిచర్యసేయఁడే
    నీకు నతండు నీవు నతనిన్ లయకర్త నొనర్చి ప్రోచె ది
    చ్ఛాకృత పద్మజాండ విలసద్గుణ తామసి భూతపాలినీ.469

ఉ. నే నతి నీచుఁడన్ జడుఁడ నింద్యుఁడ నజ్ఞుడ లోకపావనీ
    మానవుఁ డీతం డెంత యని మానక నాపయి జాలిపుట్టి యెం
    తే ననుఁ బ్రోవవచ్చితివి యేమనవచ్చును నన్నుఁ గన్నత
    ల్లీ నతలోకసంభరణలీలవు నద్భుతశీల వెన్నఁగన్.470

క. ఓ శక్తి నీవకావే | యీశాదుల కిట్టి పుంస్త్వ మిచ్చితి వాణీ
    శ్రీ శాంకరీ శచీముఖ | భేశాననలకును స్త్రీత్వ మిచ్చితి తల్లీ.471

తే.గీ. నీవు పురుషుండవుం గావు స్త్రీవి కావు | రూఢి సగుణవుకావు నిర్గుణవుకావు
    సత్స్వరూపిణి వాద్యవు సాధ్వి వెన్న | నట్టి నిను గొనియాడెద నఖిలజనని. 472

తే.గీ. ఇట్లు ప్రార్థించు సుద్యుమ్ను నెడ దయార్ద్ర | హృదయయై దేవి సాయుజ్య మిచ్చి తనదు
    రూపమునఁ జేర్చుకొనె స్ఫురద్రోచు లెసగ | నహహ మునులకు నందరా నట్టి పదవి.473

వ. అని చెప్పి మరియు సూతుం డిట్లనియె. 474

ఉ. అంతఁ బురూరవుండు ప్రభువై గుణసంపద నెల్లవారు న
     త్యంత ముదంబునం బొగడ నార్యులు మెచ్చగ ధర్మశీలుఁ డై
     యెంతయు మంత్రగోపన మహీనతఁ జేయు చుపాయశక్తి కా
     సంతయు జారనీయక రసన్ బరిపాలనఁ జేసె నర్మిలిన్.475

తే.గీ. ఆప్రతిష్టానపురమున నవనిభర్త | యలరి బహుదక్షిణము లైన యజ్ఞములను
     జేసె బహుదానముల నతి చిత్రలీల | నొసర బాలించె నాదరం బెసయ జనుల.476

ఉ. అతని రూపయౌవన గుణాతిశయంబుల నాలకించి వై
     ధాతృకశాపహేతుపున ధారుణి డిగ్గిన యూర్వశీ ద్యుష

    త్కాతరనేత్ర తా వలచి కందువమాటలతోఁ బురూరవున్
    బ్రీతునిఁ జేసి యిట్లనియె మెల్లనఁ జల్లనిదృష్టు లల్లుచున్. 477

తే.గీ. అంగసహితుండవై న యనంగమూర్తి | వగుదు విరిసింగిణియు మకరాంక మిడిన
    ననుచు నవమల్లికాప్రసూనాళిఁగోసి | చేతి కందిచ్చి మకరికల్ చెదర జూపె.478

ఉ. అంతట రాజు న మ్ముగుద నప్పుడ తెప్పునఁ గౌఁగిలించి యా
    కంతుఁ గృతార్థుఁజేయ సమకట్టుచుఁ జేరఁగ రాఁగఁ జూచి యొ
    క్కింత తొలంగి యో మనుజకేసరి కక్కురి తింత యేల నీ
    యంతటివాని కొక్క సమయంబున కీ వొడఁబాటు సేయుమా.479

వ. ఆసమయం బెద్ది యనిన నీ యురణకంబుల రెంటిని నీవు రక్షించుటయు ఘృతము తక్క
    నే నితరాహారంబు కైకొనకుండుటకు మైథునకాలంబునంద కాని యితరవేళల
    వివస్త్రుండ వైన నిన్ను నేను జూడకుండుటయు నను నీ మూడు కట్టుబాటులకు నీ
    వొడంబడుము. ఎన్నఁడు నీ పొరబాటున నీసమయంబు తప్పి చను నాఁడ సన్ని నే
    విడిచి పోఁగలదాన ననిన విని పురూరవుం డందున కియ్యకొని కొంతకాలంబు యథేచ్చన్
    మదనకళాకుశలుండై యూర్వశిం గూడియుండె.480

చ. ఘనుఁడగు పాకశాసనుఁ డొకానొకనాడల యూర్వశిన్ మనం
    బునఁ దలపోసి యయ్యలరుబోడి సుధర్మను లేమ యెప్ప దల
    చని సురగాయకాగ్రణుల కయ్యతివం గొనితేర భూమి కిం
    కనుఁ జనుఁ డందు మున్నురణకంబుల దొంగిలుఁ డంచుఁ బల్కినన్. 481

క. విని పిమ్మట విశ్వావసుఁ | డును మఱికొందఱును జని కడుం జీఁకటివే
    ళను దారురణకముల వే | కొని పాఱిరి రాజు పడఁతిఁ గూడెడి వేళన్.482

క. ఉరణకములు పెల్లఱచిన | రమణీమణి యాలకించి రాజన్యునితో
    నరవర సమయము దప్పితి | వరుగు మురణకములఁ బట్టు మతిరయముననాన్. 483

తే.గీ. జనవిభుం డప్డు తన వివస్త్రత నెఱుంగ | లేక వేగము చనుచుండ నాకవాసు
    లరిది మెఱుపులు మెఱయున ట్లాచరింప | వెలుగులో నగ్నభూపతి న్వెలది కాంచి.484
 
ఉ. చూచి లతాంగి నాకిదియ సూ సమయం బని మించి దిగ్గరన్
    లేచి చనెన్ నృపాగ్రణి కడింది మెయిం దముఁ జేరఁ బ్రక్కనే
    కాచుకయున్న వా రురణకంబులఁ ద్రోచి చనంగ ఁ దెచ్చి ప్రే
    మోచిత వృత్తిఁ జేరియుఁ దలోదరిఁ గానక దుఃఖితాత్ముడై. 485

తే.గీ. దేశ దేశంబులను దిమ్మఁదిరుగ దిరిగి | యెక్కడికిఁ బోతివో యంచు నేడ్చి యేడ్చి
    యడవిలో నున్న మ్రాఁకుల నడిగియడిగి | యెందునుం గాన కాత్మలోఁ గుందికుంది.486

క. తుదకు గురుక్షేత్రంబున | సుదతీమణి దిరుగుచుండఁ జూచి సృపతి స
   మ్మదమున నోసీ యూర్వసి | యిది తగునా నన్ను విడిచి యిటు చనుదేరన్. 487
 
మత్తకోకిల. ఓసియోసి పిసాసి యూర్వసి యండు ముండుము న న్నిటుల్
   బాసి వచ్చితి వేమిచేసితిఁ బాప మెంతటి దానవే
   యాసచే జగమంతయున్ దిరుగాడితిన్ నినుఁ గాంచితిన్
   భాసురాంగి ననుం గృపారసవార్థి దేలిచి యేలవే. 488

వ. అనిన విని యూర్వసి యిట్లనియె.489

ఉ. వెంగలి వైతి వేమి పృథివీవర చంద్రమ! నీ యుదారధీ
    సంగతి గోఁరఁ గూలెనె విచారవిహీనుఁడవై కళింగ వం
    గాంగకురుప్రదేశముల నారట న న్నరయంగ వచ్చితే
    యంగన దొంగ నమ్మఁదగదంచు దలంపుము పొమ్ము వీటికిన్.490

వ . అనవుడు. 491

తే.గీ. అహహ స్వైరిణి స్నేహమిం తాయె ననుచు | నరవరుండేగె నాత్మీయనగరమునకు
     నని శ్రుతు ల్పల్కు నిది సంగ్రహంబుచేసి | చెప్పితినటంచు సూతుఁడు చెప్పె మఱియు. 492

-: శుకోత్పత్తి :-


సీ. మునులార వినుఁ డిట్లు మును వ్యాసుఁ డాఘృతాచినిఁ గూడుట యయుక్త మనుచుఁ గొంత
    వడి చింతపడి తొట్రుపడి క్రిందఁబడి ఱిచ్చపడి లేచి పలుపాట్లు బడఁగమౌని
    యకట శపించునో యని భయభ్రాంతయై ముగుద రాచిల్క రూపునను వెడలి
    పాఱంగఁ జూచి యప్పారాశరి యనంగరంగుఁడై మైఁగ్రొత్త రంగు పుట్ట

తే.గీ. మనసు గుఱ్ఱంబు కళ్లెంబు మఱియు మఱియు | నెంతలాగిన నిలువక గంతులిడిన
    నగ్నికై మంథనము సేయు నరణియందు | నా తపసిరాయనికి శుక్రపాత మయ్యె.493

వ. అనవుడు.494

సీ. భవము దుఃఖైకహేతువటంచుఁ జాటెడి | గతిఁ జిట్టి రొదఁ గావు కావుమనుచు
    కల్ల సంసారంబు నొల్ల నొల్ల నటన్న | కరణిఁ గా ల్సేతులు కదపికొనుచు
    నిరత తపో ధ్యాన నిష్ట నిల్చెద నన్న | మేల్మి మూసిన ఱెప్ప మెఱమికొనుచు
    భూతంబు లూడిగంబులు సేయుఁ దనకన్న | పరుసున నేలపైఁ బొరలికొనుచు

తే.గీ. వ్యాసుఁబోలినవాఁడు పావనుడు దివ్య | మూర్తిగలవాడు చిక్కని మోమువాడు
    భవ్య తేజంబువాఁడు పాపరహితుండు | ముద్దుబాలుం డొకండు సముద్భవించె.495

క. బుడుతం గని ముని యచ్చెరు | పడి యిది యేమనుచుఁ గొంత పరికించి పదం
   పడి గంగాజలములఁ గడు | వడి జలకముఁ దీర్చి పుత్త్రవాత్సల్యమునన్.496
  
తే.గీ. జాతకర్మంబు మొదలుగా జరిపి మౌని | శివుని వరమునఁబుట్టిన చిన్నబిడ్డ
   డంచు గారాముసేయుచు మించెనంత | సురలు దివి పుష్పవర్షముల్ కురిసి రోలి.497

ఉ. నారద తుంబురుల్ మధుర నాదముల న్మృదుగానవైఖరీ
    ధీరతఁ బాడి రచ్చరలు తెత్తెయియంచు నటించి రంతటన్
    జారెను మింటనుండి యజినంబు గమండలు వొక్క దండమున్
    బాఱులరేని కుఱ్ఱనికిఁ బాయని కానుకలై ధరాస్థలిన్. 498

తే.గీ. అరణి మథియింపఁబుట్టిన యమ్మునీంద్ర | బాలునకును శుకీరూప మోలిదాల్చి
    యున్న యూర్వసి యమ్మౌని యునికిఁగానఁ | బడినకతమున శుక నామ మిడిరి ద్విజులు.499

వ. అంత శుకుండు దినదినప్రవర్ధమానుండై యతిలోకచతురతాసంపన్నుం డై యొప్పుడుం
    గని సాత్యవతేయుండు బృహస్పతిచే బ్రహ్మచర్యవ్రతంబు నెరపించి వేదవేదాంగంబు
    లధ్యయనంబు సేయించి నిండువేడుక నొక్కనాఁడు కొండికా యిటు రమ్మని తొడ
    చక్కిం గూర్చుండ నిడి చుబుకంబు పుణికి శిరంబు మూర్కొని నాయనా నీవు సకల వేద
    వేదాంగంబులు సదివితివి గురుదక్షిణ ఇచ్చి సమావర్తనంబుఁ గడిపితివి. యిట మీఁద. 500

ఆ.వె. పట్టి పెక్కునాళ్ళఁ బట్టి పట్టిన నోము | గట్టితనము చేత గట్టుపట్టి
      చెట్టఁ బట్టినట్టిదిట్ట వరమ్మున | బుట్టితివి వరాలపుట్టి వగుచు. 501

క. దేవ పితృదేవ ఋణములు | వేవేగమ తీర్చివేయ వే యజనులన్
   నీ విఁక గార్హస్థ్యము స | ద్భావమునకుఁ దగిన మంచి భార్యంగొనుమీ.502

క. సుతులఁ గనని వారలకున్ | గతులే లేవండ్రు స్వర్గ కాంక్ష హుళిక్కే
   యతులమతిని సతినొక్కతె | నతికించుక యుండు మీ గృహాశ్రమ మందున్.503

వ. ఇవ్విధంబునం బలుకు నతిరక్తుం డగు వ్యాసునకు నతివిరక్తుం డైన శుకుం డిట్లనియె.504

తే.గీ. తండ్రి తత్త్వంబెఱింగి యే దారి నాకు | మంచిదని నీవు తెల్పెదో మాన దాని
    చెప్పు మెయ్యది సౌఖ్యసంసిద్ధిమూల | మెందు దుఃఖంబు సొరకట్ట దింతయేని.505

తే.గీ. అనిన విని వ్యాసుఁ డనుప్రియతనుజ వినుము | శివునివరమునకా నీవు సేకురితివి
    భూపతిని గొల్చి విత్తంబు పొందుపఱచి | యిచ్చెదను సౌఖ్యమునకు నీ కేమిగొదువ.506

వ. అనిన విని సవినయంబుగా మెల్లమెల్లన శుకుం డిట్లనియె.507

ఉ. అయ్య మనుష్యలోకము నిరామయమై సుఖసాధనంబునై
    తియ్యముసేయునే వసట దీరునె ప్రాజ్ఞులు దాని మెత్తురే
    తొయ్యలి నొక్కదాని మెడ దుంగను గట్టుక తద్వశుండ నై
    కయ్యను బడ్డ దున్నవలె కా ల్గదలింపఁగనేర నయ్యయో. 508

ఉ. సంకిలిఁ బడ్డవాని కొకసారి విముక్తి ఘటించుఁగాని బి
    ట్టంకిలి నీషణత్రయమునందుఁ దగుల్కొనినట్టివానికిన్
    శంకరుఁడైన ముక్తి నిడఁజాలఁడు భామలపొందు చెల్లునే
    సంకట మంచుఁ బ్రాజ్ఞు లనిశంబును దానిఁ ద్యజింతు రుర్విపైన్.509

ఆ.వె. ఏ నయోనిజుండ నెట్లుగా యౌనే య | సుఖముఁగోరువాడ సూరివంద్య
    భయముదోఁచు మూత్రమయము విణ్మయమునౌ | నంగసంగ సుఖము నందదగునె.510

ఆ.వె. ఆత్మసుఖము మాని యానందమునుఁ ద్రోచి | జ్ఞానమెల్ల మంటఁగలిపి మాయ
    లోనఁ జిక్కి విడ్విలోలకీటంబనై | యెట్లు బ్రతుకువాఁడ నీ జగమున.511

క. చదివించె నన్ను వేదము | త్రిదశగురుం డతఁడు సూవె స్త్రీలోలుఁడు నా
    కొదవించునె సుజ్ఞానము | వదలక రోగికిని రోగి వైద్యుండాయెన్.512

ఆ.వె. చెప్పి చెప్పి విసికెఁ జెప్పిన దంతయుఁ | బుట్టిపుట్టి మరల పుట్టునట్టి
    చెట్టహింసలకును బట్టైన కర్మముల్ | గట్టిసేయు మనుచుఁగాదె తండ్రి.513

క. ఈ సంసారము నాకే | లా? సారెకు సారె దిరిగినట్లే తిరుగన్
   వేసారుటకే యీ యా | యాసము పడనోప నోపనయ్య మహాత్మా.514

ఉ. వేదము లెల్లనుం జదివి వెంగలియై సురతాశఁ గామినీ
    పాదము లాశ్రయించుఁ గులపాంసుఁడు గణ్యుఁడె పండితుండె యే
    భేదము కుక్కకుం జెవులపిల్లికి బందికి జ్ఞానిగాని యా
    వైదిక పండితాగ్రణికి వై ళమ తెల్పుము సంయమీశ్వరా.515

క. మానవజన్మము దుర్లభ | మైనదనుచు నెఱిఁగి యందు సత్యాదరమున్
    బూనక సంసారి యయిన | మానవునకు ముక్తిగలదె మహిలో నెన్నన్.516

క. మాయాగుణమగు సంసా | రాయాసము లేనివాఁడె యాత్మజుఁడున్ వి
    ద్యాయుతుఁడు శాస్త్రపారగుఁ | డేయెడ నీ బాధ్యు డాతఁ డీశ్వరుఁడుసుమీ.517

క. కంకణము గట్టి వేదము | శంక యొకింతయును లేక చదివి చదివి మీ
    నాంకుని వలఁబడు భూదే | వాంకితులకుఁ గట్టు వడలు టది యెట్టులొకో.518

వ. అనిన విని పరాశరతనూజుండు నిజతనూజున కిట్లనియె.519


క. వనితయుఁగా దిఁక మందిర | మునుగాదు మనంబె బంధమునకున్ మోక్షం
   బునకుం గారణ మిది తెలి | సి నటింపందగునుసూవె చిన్నికుమారా.520

క. న్యాయార్జిత విత్తమ్ము స | హాయత మనుచుండు శ్రుతిచయంబులవలనన్
   దాయని ధర్మము లెఱుగును | ద్రోయఁడు సత్యంబు ముక్తి రోసినయేనిన్.521

ఆ.వె. బ్రహ్మచారియైన వనవాసియైనను | యతికులేంద్రుఁడెన నతిథి యగుచు
   గృహుల నాశ్రయింప కెట్లు జీవింతురు | గృహమె యాశ్రమముల కెల్లఁ బెద్ద.522

తే గీ. శ్రద్ధతో నన్నదానంబు సలుపవలయు | సూనృతము నొక్కయపుడేని మానరాదు
   చేరి ప్రజలకు సుపకృతి సేయవలయు | నవనిలోనను గృహమేధియైనవాడు.523

తే.గీ. ఆలయాశ్రమమునకంటె నధికమైన | యాశ్రమము లేదుసూ వసిష్ఠాదులైన
   జ్ఞానవంతులు దాపసుల్ దాని నాశ్ర | యించి రిది వేదవిదులు మన్నించిరనుచు.524

తే.గీ. శ్రుతిహితంబుగఁ గర్మసంతతియొనర్చు ! జనులకును స్వర్గమోక్షము ల్సాధ్యములగు
    కాంక్షితంబులు సేకూరుఁ గార్హ్యమైన | యాశ్రమంబునఁ గలుగనియట్టి దున్నె.525

తే.గీ. ఆశ్రమమునుండి యాశ్రమం బందవలయు | నని మహాత్ములు దెల్పుదు రదియు గాన
    నగ్ని నర్చింపు మిఁకను యథార్థలీల | సర్వమును నందయున్నది సత్యమరయ. 526

క. గృహియై యాఁదట వనమున | బహులవ్రతశీలుఁ డగుచు వసియించి తుదిన్
    మహితమగు పరివ్రజ్యా | సహితుండగు టొప్పు వేదసమ్మత మిదియే.527

ఆ.వె. భార్య లేనినాడు భరములై యింద్రియ | ములు గలంచు మనసు బలిమిఁజేసి
    వాని గెలుచుకొరకు వసుధపై మనుజుడు | దారసంగ్రహింపఁ దగునటండ్రు.528

సీ. ఘనుడు విశ్వామిత్రు డను రాజఋషి తొల్లి యత్యుగ్రమగు దపం బాచరించి
    మూఁడువే లేండ్లు నిర్మోహుఁడై యింద్రియముల గెల్చి నిష్ఠమై నిలచియుండ
    దేవతానటి మేనకావధూటినిఁ గాంచి తమిఁ జెంది కామతంత్రముల జిక్కి
    తతకీర్తియగు శకుంతల యను నొక యాఁడుబిడ్డను గనియె నీ పృథివి నింక

ఆ.వె. దాశకన్యయైన తాలిని వలచి క్ర | న్నన పరాశరుండు నన్ను గాంచె
    నజుఁడు స్వసుతఁగూడె నది కాన నీవును | బ్రీతిఁ గులజ నొకతెఁ బెండ్లి గొనుము.529

వ. అనిన విని నిసర్గ నిరీహుండైన శుకుం డిట్లనియె.530

 

-: శు క కృ త సం సా ర నిం ద :-


ఉ. పట్టగు వాగురాసదృశ బంధన మెల్లరకుం గృహంబు నే
    గట్టిగ నొల్ల నొల్లను సుఖప్రతిబంధక మింతె కాదు స్వా
    రాట్టయినం ధనాశను దిరంబుగ దుఃఖమ పొందుఁ దృప్తుఁడౌ
    నట్టిడు భిక్షకుండు సుఖ మందును నిస్పృహఁజేసి ధీనిధీ.531


చ. యములు దపంబు సేయుటకు నాత్మ సహింపఁగలేక యింద్రుఁడు
    ద్యమ మొనరించు దద్విధుల కంకిలిసేతకు బ్రహ్మ భారతీ
    ప్రమదనుగూడి ఖేదముల పాలయి నిందలఁ జిక్కె మాధవుం
    డమరవిరోధితండముల యల్జడులం బహువారము ల్పడెన్.532

ఉ. శంకరుఁ డెంతవాఁ డతఁడు శాంకరిగూడి యనేకథా సుఖా
    తంకములం గనండె ధనదాతయు లోలుపుఁడై చెడండె మీ
    నాంకకళాప్రవీణులమటంచు జగంబున గర్వయుక్తులై
    పొంకముమాని ఖిన్నులయిపోరె గృహాశ్రమవాసు లెయ్యెడన్.533
 
క. జననమునఁ బాలకొఱ కే | డ్చును జరలో జావునకును శోకిలు గర్భం
   బున విష్ఠామూత్రములం | దును బడి మానవుడు మిగుల దుఃఖించుఁ జుమీ.534

తే.గీ. అంతకంటెను దుఃఖదం బందుఁ దృష్ణ | యాచనాదుఃఖ మనునది యవని నెన్న
   చావుకంటెను నెక్కుడు శాంతి దాంతి | కలదె సంసారమున నెట్టి ఘనునకైన.535

క. పుడమి ప్రతిగ్రహమును జే | సెడి విప్రులు బుద్ధిబలముచేఁ గాదుసుమీ
   విడిముడి వడయుట గావునఁ | గడునీచము దానికంటెఁ గలదే యెన్నన్.536

క. వేదములన్నియు సాంగము | గా దొడిఁ బఠియించి నీతిఁ గానక స్తుతిపా
   ఠాదుల ఘనులై ధనసం | పాదనకై నీచసేవఁ బాటింపరొకో.537

క. ఏకాకియైనవానికి | శోకం బది యెంతగలదు చూడంగను దా
   నాకులయినఁ గాయలయిన | నాఁకటివడి మ్రింగి బ్రతుకు నధికంబేలా.538

క. ఆలుం బుత్త్రులు పౌత్త్రులు | నోలిఁ గుటుంబంబుగాఁగ నుదరంబులు సం
   బాళింప నెంతదుఃఖము | లోలోనం బొగులు నింటిలో సుఖమున్నే.539

తే.గీ. నాయనా కర్మమార్గంబు నాకు వలదు|వలదు పెండ్లాము నాకేల వలదు పెండ్లి
   యోగశాస్త్రంబు జ్ఞానప్రయోగకరము | కర్మనాశక మది నాకు గావలయును.540

తే.గీ. పెండ్లివలదయ్య పెండ్లాము పెద్దజెలగ | యొడలినెత్తురు మెత్తగా నొత్తిపీల్చు
   మగువ వగలనుఁదగిలి కామమునఁ జిక్కి | యెడ్డెలగుమానపు లెఱుంగ రెరుక తెరవు.541

క. కూటమిచే వీర్యము వగ | మాటలచే సర్వధనము మానిని లాగున్
   పాటింప రిద్ది మూర్ఖులు | చేటే వగలాడితోడి స్నేహము తండ్రీ.542

ఆ.వె. నిద్రసెడుటకొఱకె నెలతను గూడుట | మూర్ఖజనుడు కుందు ముదిమిదనుక
   బ్రహ్మదేవుఁ డతని పాలింటి పెనుముల్లె | యెంతదుఃఖ మిందు నేది సుఖము.543

వ. ఇట్లు పలికిన శుకుని పలుకులు విని సాత్యవతేయుం డత్యంతచింతాక్రాంతుండై
యేమియుం దోపక.544


తే.గీ. అయ్యయో యేమి సేయుదు నాత్మపొగులు | నయ్యవారినిఁజేయబో నాయెఁ గోరి
    కర్మధర్మంబులను గోరి కన్న కొడుకు | కర్మవశమున బైరాగి కాఁదలంచె.545

వ. అప్పుడు వ్యాసుండు 546

తే.గీ. గడగడవడంకెఁ గడు తనుగ్లాని వొడమె | చూపుమ్రాన్పడె గొంతెండె స్రుక్కెమోము
   మాట బొంగురువోయె నమ్మౌనివర్యుఁ | డావురనియేడ్చె గన్నీళ్లు బావినిండె.547

తే.గీ. దాని కచ్చెరుపడి మునికూన యాత్మ | లోనఁ దలపోసె నౌర యీ మౌని కింక
   మోహపాశంబు విడదాయె మూర్ఖునట్లు | చింతనొందెడి నేమందు వింతయనుచు.548

వ. ఒక్కింత దడవు విచారించి సకరుణంబులగు వచనంబుల శుకుండు దండ్రిం జూచి.549

క. వేదాంతకర్తయు నిఖిల | వేదియు వేదసము డితఁడు వెంగలియై సా
   రోదారజ్ఞానము చెడి | ఖేదించెడి నహహ మాయ గెంటవశంబే.550

ఉ. ఎంతటి మాయయో యెరుగ నెంతటి దుఃఖము దీనిగెల్వ ధీ
    మంతులు పండితోత్తములు మాన్యులు నేరరు వ్యాసుఁ డీతఁ డా
    వంతయు ధైర్యమూనకయ వంతలపాలయి యున్నవాఁడు వి
    శ్రాంతిఁ గనండు భారతము సర్వపురాణములున్ రచించియున్. 551
 
ఆ. బ్రహ్మ విష్ణు హరుల బహుభంగులను మోహ | పాశములను గట్టెఁ బరమశక్తి
    యితరులైనవారి నేటికి స్మరియింప | నట్టి దేవిఁ ద్రిజగదంబఁ గొలుతు.552

తే.గీ. మాయలోఁ జిక్కి సొక్కని మనుజుఁ డెవఁడు | విష్ణు నంశంబున జనించి విశ్వవిదితు
   డైన వ్యాసుండె మునిఁగె మోహార్ణవమున | పుట్టిమునిగిన బిట్టేడ్చు సెట్టిఁబోలె.553

క. ఇతడెవ్వఁడు నేనెవ్వఁడ | మతిభ్రాంతియెకాక నిత్యమా యీ దేహం
   బతుకఁబడెఁ బంచభూత | ప్రతతిం గణియింప దుఃఖభాజన మిదియే.554

ఉ. దేవికి మ్రొక్కి యో జననీ దివ్యమహేశ్వరి నన్ను సత్కృపన్
    బ్రోవుమటంచుఁ బల్కి తనముందట నేడ్చుచుఁ గూరుచున్న చిం
    తావశు వ్యాసమౌనిఁ గని తాత సమస్తము నీ వెఱుంగవే
    యీవిధిఁ గుంద నేమిటికి నెక్కడి మోహము నీకుఁ బాల్పడెన్.555

ఆ.వె. పూర్వజన్మమందుఁ బుత్రుండనా నీకు | భావిజన్మ మెట్ లుపోవునొక్కొ
    నేఁడు నన్నుఁ బుత్త్రునింగా దలంచుట | యెంతవింత దీని కేమి సెప్ప.556

ఆ.వె. దుఃఖ మేల తండ్రి తుడిచెదఁ గన్నీళ్లు | మాను మాను మింత మమత తగదు
    జగము మాయగాని సత్యంబుకాదుసూ | మాయ నమ్మగాదు మానవులకు.557


ఆ.వె. తిండి యబ్బెనేనిఁ దీఱు నాఁకలి యెందు | నీరుగల్గఁ దీఱు నీరుపట్టు
    కొడుకుఁ బిల్చి ముద్దుఁగొని చెక్కిలిని దువ్వి | చేరియున్నమాత్రఁ దీరునొక్కొ.559

ఉ. వాసనచేత ముక్కు సుఖవాసనఁ గైకొను మంచి గీతిచే
    భాసిలు వీను చల్లనగు వాయువుచేఁ దనియున్ శరీర ము
    ల్లాసము నొందుఁ దియ్యని ఫలంబుల నాలుక కన్ను లొందు ని
    చ్ఛాసమవాప్తి రూపమున సౌఖ్యము పుత్రునివల్లఁ గల్గెనే.560

క. విలువఁగొని యజీగర్తుం | డెలమి హరిశ్చంద్రమానవేశున కీఁడే
    తలఁపునఁ గరుణ యొకింతయుఁ | గలుగక దా యజ్ఞపశువుగాఁ దనకొమరున్.561

క. మనమున నిహపరసుఖతన్ | దనరితి వేనియును నీవు ధన మార్జింపన్
    బనిబూనుము వెతమానుము | తనయుఁడ నావలన నేమి ధన్యత గలుగున్.562

ఆ.వె. జన్మరహితమైన సాధనంబును జెప్పి | గర్పనరకభయముఁ గడపఁజేసి
    జ్ఞానమిచ్చి మాయ కట్టిన ముడి విప్పి ! తండ్రి నన్నుఁ బ్రోవఁదలఁపుమయ్య.563

మానిని. జానుగ మానవజన్మ మసాధ్యము సంయమినాయక యెందుఁ గనన్
    భూనుతమై తగు భూసురజన్మముఁ బొందుట దుర్లభ మందును న
    న్మానితవంశ సమంచితవృత్తిని మర్త్యభవంబ దశక్యమగున్
    గాన మహోత్తమ కార్యము జ్ఞానము గట్టిగఁ జెప్పుము జ్ఞాననిధీ.564

వ. బహువిధంబులం బరమహంసాశ్రమంబుం గొనియాడు తనయుని శాంతరస సమావేశ కలిత
    సుఖంబైన ముఖంబు జూచి తలయూచి వ్యాసుం డిట్లనియె.565

క. ఓ ముద్దుల తనయుండా | నీ మాటలు బ్రహ్మమార్గనిష్ఠల కోటల్
    కామమును జెరుగు చేటలు | మోము నెదుటి ముక్తిధనము మూటలుగావే.566

వ. అయినను.567

సీ. వినుము బాలక నేను విస్తరించి రచించి ప్రకటించయున్నట్టి భాగవతము
     అది నాతివిస్తీర్ణ మది బ్రహ్మసమ్మతంబును సమస్త పురాణ భూషణంబు
     అది జ్ఞానదము శ్రావ్య మత్యంత శుభదంబు పఠింయింపు మద్దానిఁ పరమనిష్ఠ
     పాలపాపనిరూపుఁ చాటింప వటపత్రశయునుఁడైన సరోజనయనుఁడాత్మ

తే.గీ. నెట్టు లే బాలభావంబు నెనసి యిచట | నేవిధంబునఁ బుట్టితి నేది ద్రవ్య
     మెఱుఁగనని చింతిలం జూచి పరమశక్తి | సర్వ మే నితరములేదు సత్యమిద్ది.568

వ. అనిన 569

క. పలుకు విని విష్ణుదేవుఁడు | పలికినవా రెవ్వరంచు బహుభంగులఁ దాఁ
    దలఁచి తలఁచి వలపోయఁగ | నెలఁతవలెన్ దేవి యెదుట నిలిచెన్ గరుణన్.570


ఆ.వె. ముద్దుమోముతోడ మురిపెంపు నగలతో | వన్నెచీరెఁగట్టి కన్నులార్చి
    నగలనిండఁదాల్చి మగువలతో మహా | లక్ష్మి చిఱుతనగవు లగ్గుసూపి.571

వ. ఇట్లు తనయెదుట మహాలక్ష్మిరూపంబున విభ్రమంబులు సూపుచు నిలచియున్న
    దేవిం గాంచి యవ్వటపత్రశాయియగు నారాయణబాలకుం డచ్చరువడి యవ్వరవర్ణిని కనుంగులై
    తోడఁ జనుదెంచిన శ్రద్ధను, మేధను, రతినీ, భూతిని, బుద్ధిని, మతినిఁ, గీర్తిని, స్మృతిని, ధృతిని,
    స్వధను, స్వాహను, క్షుధను, నిద్రను, దయను, తుష్టిని, పుష్టిని, క్షమను, లజ్జను, జృంభను,
    తంత్రను, సాయుధల సాభరణల ముక్తామాలికావిరాజితలం గనుఁగొని యీ యేకార్ణవంబున నిట్టివా
    రెట్లు లుద్భవిల్లిరో నిరాధారులై యెట్లు నిలచిరో యని విస్మయావిష్టహృదయుండై.572

క. ఏ నెట్టుల వటపత్రశ | యానుఁడనై యుంటి నిచట నతివలు వీరల్
    రా నై రెట్టులో తెలియదు | నేనూరక యుందుఁగాక నీటఁ దిరుఁడనై.573

వ. అని మఱియు వ్యాసుండు.574

-: దే వీ భా గ వ తో త్ప త్తి :-



ఆ.వె. అట్టి విష్ణుఁజూచి యా మహాలక్ష్మి దా | నిట్టులనియె మిగులఁ గృపఁదలంచి
    వెఱ్ఱితన మిదేల మఱ్ఱాకు పై నున్న | కుఱ్ఱ జగము జీవగఱ్ఱ దేవి. 575

క. ఆ శక్తి ప్రభావంబున | లేశంబును నన్నెఱుంగలేవైతి జగ
    న్నాశముల మరల మరల మ | హేశుఁడ వై బహుభవంబు లెత్తుటకతనన్.576

తే.గీ. శక్తి నిర్గుణ లేదందు సందియంబు | మనము సగుణుల మాశక్తి తనదు సత్త్వ
    గుణముచే నన్నుఁ బుట్టించెఁ గూర్మి బ్రహ్మ | బుట్టు నీపొక్కిటను జగంబులు సృజింప.577

తే.గీ. అతఁడు రాజసుఁ డతని క్రోధాగ్నివలన | బొమలనడుమను బుట్టు నప్పురహరుండు
    తామసినిగూడి లోకప్రతాన మడఁచుఁ | గాన నేవచ్చితిని నిన్నుఁ గలియుటకును.578

తే.గీ. సమ్మదమ్మున నిమ్ము నీ ఱొమ్మునాకు | నిమ్ముసేసుక యుందు నీ సొమ్మయగుచు
    కమ్మవిలుకానికిని జననమ్ముగలుగు | నమ్ము నామాట లివియు నిక్కమ్ములనుచు.579

వ. అనిన విని ముదితాంతరంగుండై గరుడతురంగుండు.580

తే.గీ. వింటి శ్లోకార్థమొక్కటి విస్ఫుటముగ | నోవరారోహ యెవ్వరి యుక్తియొక్కొ
   యారహస్యంబు పరమాద్భుతావహంబు | తెలియఁజెప్పుము నాకు సందియముదీఱ.581

చ. అది విని లక్ష్మి యిట్లనుఁ బ్రియంబుగ మోమున మొల్కనవ్వు సొం
    పొదవఁగ నోచతుర్భుజ మదుక్తియ యయ్యది వేఱుగాదు మో

    క్షద మగునట్టి భాగవతసారము దానిని విస్మరింపఁ గూ
    డదు మది రక్షణీయము స్ఫుటంబగు వేదమువంటి దయ్యదే.582
 
ఉ. నావిని వాసుదేవుఁడు సనాతని నమ్మహనీయలక్ష్మి ని
    చ్ఛావశుఁ డై యురంబున నజస్రము నిల్వ వరించి మంత్రముల్
    భావనఁ బూనియున్నఁ గ్రమభంగి నొకప్పుడు శౌరిపొక్కిటన్
    భూవిదితుండు పద్మజుడు పుట్టి సురారుల కాత్మ జంకుచున్.583
 
తే.గీ. హరిని ప్రార్థింప తపము దా నాచరించి | మధుని కైటభుఁ దునుమాడి మాధవుండు
    నాత్మ జపియింపఁదొడగె శ్లోకార్థమపుడు | వనజభవుఁ డది జూచి యిట్లనియె హరికి.584

క. నారాయణ నీకంటెను | వేఱుగ నింకొకడు గలఁడె విశ్వంబున నె
    వ్వారిని జపియించెద వీ | వారూఢ దయారసుండవై తెలుపు మిఁకన్.585

వ. అనిన విని హరి యప్పద్మసూతి కిట్లనియె.586

క. కృతికారణ లక్షణసం | గతి నతిమాత్ర మతిశక్తి గలదది మన కు
    న్నత మన మామెకుఁ దలపఁగ | నతులము సుతులము హిత ప్రణతులముసుమ్మీ.587

శా. ఆసర్వేశ్వరి లోకమాతయుఁ ద్రయీవ్యాహారనిర్మాత్రి వి
    ద్యాసంశోభిని ముక్తిహేతువు నిరస్తత్రస్తదోషాళి స
    న్నీ సర్వంసహ నేలుమంచు నిటఁ గల్పించెన్ విరించీ! దయన్
    జేసెన్ మంత్రము నాకు నిచ్చె నిది నే సేవింపఁగా జెల్లదే.588

వ. అని మధుసూదనుండు పల్కినవిధంబు సెప్పి వ్యాసుఁడు పదంపడి యిట్లనియె.589

క. ఆమంత్రమె భాగవతము | ప్రేమను నే ద్వాపరాది బెరిగించితి ము
    న్నా మురమర్దను డజునకుఁ | గామిత మలరంగ జెప్పె గరుణాయుతుడై.590

క. కమలజుడు నారదునకున్ | గ్రమముగ దా బలికె నంతఁ గలహభుజుడు నా
    కమితముదంబున దెల్పెన్ | రమణన్ శ్రీభాగవతపురాణోత్తమమున్.591

ఉ. ఓయి కుమార! భాగవత మూర్జితపుణ్యము పంచలక్షణం
    బాయతనిష్ఠమై జదువుమయ్య సమంచితరీతి జ్ఞానసం
    ధాయక మింతకంటెఁ గలదా పదునెన్మిదివేల శ్లోకముల్
    నీ యురుబుద్ది కిద్ది పఠనీయముకాదె తలంచిచూచినన్.592

సీ. అజ్ఞానమునడంచు నాయువు నెగడించు బ్రజ్ఞానమును బెంచు భాగవతము
    పుత్త్రపౌత్రులనిచ్చు భూతి వర్ధిలఁజేయు బహశుభంబుల దెచ్చు భాగవతము
    శాంతిదాంతులొసంగు సౌఖ్యదంబై మించు పాపంబుల నడంచు భాగవతము
    తేజంబు గల్లించు దివ్యకీర్తి ఘటించు ప్రతిభను గావించు భాగవతము

తే.గీ. పతితపావనచరిత మీ భాగవతము | పరమవైదికమార్గ మీ భాగవతము
     పాశములనెల్ల ఖండించు భాగవతము | పఠనచే మోక్షమునొసంగు భాగవతము.593

తే.గీ. సాటి శిష్యుండు లోమహర్షణసుతుండు | వీఁడు నీవునుఁ జదువుండు కూడి మిగుల
     వేడుకలరంగ నే జెప్పు విధము దెలిసి | పంచలక్షణమైన యీ భాగవతము. 594

వ. అని చెప్పి సూతుండు శౌనకాది మహామునులకు మఱియు నిట్లనియె.595

క. నేనును శుకుడును మహితా | నూననియమముల వహించి యొప్పుగ నమిత
     జ్ఞానదమగు భాగవతము | పూని పఠించితిమి సర్వమును మునులారా!596

ఆ.వె. చదివి చదివి శుకుడు సంగవాంఛ నడంచి | కర్మధర్మములను గలయబోక
    బ్రహ్మకొడుకుఁబోలె బాహ్యాంతరమ్ముల | మఱచి వ్యాసు నాశ్రమమున నుండె.597

క. తినఁ డెక్కువ యుపవాసం | బును జేయం డింద్రియముల మోసమెఱగి యి
    చ్ఛను బోనీఁ డాత్మజ్ఞత | ఘనుడై గణనీయ యోగికరణిం దిరుగున్. 598

వ. ఇట్లత్యంత చింతాభరంబునం దిరుగు శుకునింగాంచి వ్యాసుం డిట్లనియె.599

మత్తకోకిల. ఇంతచింత మనంబునందు వహింపనేటికి బాలకా
     సంతసంబుననుండి జ్ఞానవిచారమేటికిఁ జేయ వీ
     వంతఁ గుందెద వెప్డు సూచిన వల్దు వల్దు ఋణవ్యధా
     వంతు రీతిని నిన్నుఁ జూచినవారు జాలిని దూలగన్.600

తే.గీ. నేను చెప్పిన మాటల నీకు శాంతి | గలుగదేనియు మిధిలా నగరమునందు
     జనకరాజర్షి గలఁడు వే చనుము పుత్త్ర | ధర్మపరుఁ డాతఁ డెఱిగించుఁ తత్త్వమెల్ల.601

ఉ. ఆ జనకుండు యోగరతుఁ డద్భుతతత్త్వవివేకశాలి యే
    యోజఁ దలంచినం బ్రతికియుండియు ముక్తుఁడు నీకుఁ దెల్పు న
    వ్యాజకృపామతి సకలవర్ణవిభాగము లాశ్రమస్థితుల్
    వేఁ జనుమంచుఁ బల్క, విని విస్మయమంది శుకుండు దాననున్.602

తే.గీ. తండ్రి వింతాయె నాకు నింతయును విన్న | జనకరాజర్షి రాజ్యంబు సల్పుచుండె
    జ్ఞానియై ముక్తుఁడై యుండగలఁడె వాని | మహిమ మరయంగ నాకును మనసుపుట్టు.603

క. తినినది తిననిది యెట్లగు | వినినది విననిదగుటెట్లు వేడుకతోడన్
   గనినది కననిది యెట్లగు | ననినది నననిదియు నెట్టులగు నా తండ్రీ.604

క. తల్లి యనియుఁ గొడుకనియును | బిల్లయనియుఁ దమ్ములనియుఁ బెండ్లామనియున్
   జెల్లెలనియుఁ గులటయనియు | జెల్లునె భేదములు జ్ఞానశీలుర కెందున్. 605

క. వగరనియుఁ గారమనియును | దగమధురంబనియుఁ దీక్ష్ణ తాగం బనియున్
   మిగులంగాఁ జేదనియును | వగనుప్పనియును దెలియక వర్తిల వశమే.606

క. ఇది చల్లని దిది వేఁడిది | యిది మంచిది యిదియుఁ జెడ్డ దిది కూడదటం
   చద నెఱుఁగక సంసారము | కుదురుగ నెట్టంగఁ గలడె కోవిదుఁడగుచున్.607

తే.గీ. వీఁడు మిత్రుండు వీఁడు నా ద్వేషి వీనిఁ | బ్రోవఁదగు వీని శిక్షింపఁ బోలు ననెడి
   మది యొకింతయు లేక యెమ్మాడ్కి నతఁడు | రాజ్య మొనరించునొక్కొ యబ్రంబు కాదె.608

తే.గీ. సర్వసమదర్శనుండగు జాడయెట్లు | వీఁడు చోరుండు వీడు పవిత్రమౌని
   యనుచుఁ బరికింప కెట్లు పాలన మొనర్చు | ముక్తుఁ డగుటకు సంసారి శక్తుడగునె.609

వ. అని శుకుండు మిథిలాప్రయాణంబు సేసెనని చెప్పి సూతుండు శౌనకాదుల కిట్లనియె.610

తే.గీ. అని వచించి శుకుండను వ్యాసమౌని | యంఘ్రులకును నమస్కార మాచరించి
    కేలు మోడిచి గురుభక్తి గీలుకొనఁగ | నిట్టులని పల్కె సంతసం బుట్టిపడఁగ.611

-: శుకుండు మిథిలాగమనంబు సేయుట :-


చ. జనకమహర్షి యేలుబడి చాలఁ బ్రసిద్ధి వహించి మించి మేల్
    గను మిథిలా పురంబునకుఁ గ్రచ్చఱ నేగెద నీ యనుజ్ఞ గై
    కొని యది చిత్రమయ్యె జనకుండును దండము లేక భూతలం
    బు నెటులు బ్రోచునో నయము పోవదె దండము లేక యుండినన్.612
  
ఆ.వె. ధర్మకారణంబు దండంబ యనుచు మ | న్వాదులైన ధర్మవేదు లనిరి
    జనకుఁ డెట్టి మహిమఁ గొని చేయునో భూమి | పాలనంబు తెలియఁజాలఁ దండ్రి.613

క. తనుఁ గన్న తల్లి గొడ్రా | లనినట్లే యున్న దిది మహాద్భుత మయ్యెన్
    గనఁ దలతు జనక భూజా | నిని ననుఁ బంపుము మునీంద్ర నియమాతంద్రా.614

ఉ. నావిని వ్యాసమౌని కులనాథుఁడు బిడ్డనుఁ గౌగలించి నే
    దీవన లిత్తు నీకనుచు దివ్యవచోవిభవంబునం జిరం
    జీవ సుఖీభవ ప్రశమ చింతన హే శుక యంచుఁ బల్కుచున్
    నీ విఁకఁ బొమ్ము పోయెదవు నీవు సరే యొక బాస గోరెదన్.615

క. ఆబాస యేది యనినన్ | బాబూ నీ వచటనుండి పరభూములకున్
    బోఁబోకుము మరలం గా | రాబమున మదాశ్రమము సొరన్ వలయుఁజుమీ.616

ఆ.వె. చిన్న బిడ్డ నీదు చిన్నారి నెమ్మోము | కన్నులారఁ జూచు కొన్నఁజాలు
    నిన్నుఁ జూడకున్న నిల్చునే ప్రాణముల్ | తన్నుకొనవె మిన్ను మన్నుఁగనక.617

ఆ.వె. నన్నుఁ ద్వద్వియోగ ఖిన్నుఁజూడుము నాకు | వన్నెవాసిఁ దెచ్చు వాఁడవైన
     నెన్నటికిని భేద మొన్నంగఁబోకు నా | యన్న వేదపఠన మున్నదికద.618

క. అని పలికిన తండ్రికి వం | దనమును గావించి మఱి ప్రదక్షిణముగఁ దాఁ
     జని చనియెన్ విలువిడిచిన | సునిసితబాణంబు వోలె శుకుఁడు మిథిలకున్.619

చ. చని చని మౌనిబిడ్డ తరుజాలవిశాలవనప్రదేశముల్
     కనికని తప్యమానముని గమ్య గుహావళి విశ్రమస్థితుల్
     గొనికొని యాజకప్రతతి క్రుమ్మఱుచోటుల వేదనాదముల్
     వినివిని యచ్చటచ్చటను వింతమతంబులవారి నవ్వుచున్.620

తే.గీ. ఆ మహామతి వర్షద్వయమున మేరు | నవల హాయనమునకు హిమాచలంబు
     దాటి మిథిలాపురంబు మధ్యంబు సేర | నచటఁ గావలియున్న వాండ్రడ్డగించి.621

వ. ద్వారపాలకు లెదుర్కొని నీవెవ్వండవు నీ వేల వచ్చితివి? 622

క. అను పల్కును విని శుకుఁ | డత్యనఘుఁడు నగరంబుద్వార మవ్వలదరి నే
     మనక మఱుమాట సెప్పక | పనిఁ గొని తనలోన తాన పకపక నగియెన్.623

వ. అది కని ప్రతీహారుండు.624

తే.గీ. మూఁగవా మాటలాడవు మునికిశోర | యూరకే రారు మీవంటి వారలెందు
    నరపతి యనుజ్ఞ లేనిదీ నగరుసొరఁగఁ | జాల రఙ్ఞాత కులధర్మ శీలురనఘ.625

తే.గీ. భాసమానముఖప్రభా పటలికేక | వెట్టు బ్రాహ్మణుఁడవు వేద విత్తముఁడవు
    నీవనుచుఁ గులకార్యంబు లేవిధములొ |తెలుపుమీ శంకలేదు యథేచ్చఁజనుమి.626

వ. అనిన.627

తే.గీ. ఓయి ప్రతిహార! నీ మాట యొకటెచాలు | వాకిటనె సమకూఱె నే వచ్చినపని
   యేమని వచించెదో విను మీ విదేహ | పత్తనము సొచ్చుటది దుర్లభంబ యంటి.628

వ. అని శుకుండు తనలో 629

శా. ఆహా యెంతటి వెఱ్ఱినైతి సురశైలాయామముం గొల్చి శీ
    తాహార్యంబును దాటి కాల్నడ విదేహద్వారముం జేరితిన్
    మోహావేశము తండ్రిమాటవలనన్ ముంచెంగదా నన్ను వి
    ర్ద్రోహస్వాంతతనుండనైతి నెవనిం దూషింతు నాకర్మమే.630

చ. ధనమును గోరి లోకమునఁ దాఁ దిరుగుం బురుషుండు నాకు లే
    దనయము నట్టి యాశ నది యట్లయినం భ్రమ మావహించి యిం
    దున కరుదేరనయ్యెఁ గడు దూరమునుండియు మేరువేడ యీ
    జనకుని మేడ యేడ ఫల సంగతి యేమి హుళిక్కి యింతయున్.631

క. ప్రారబ్ధమైనకర్మం | బేరికి శుభమేని నశుభమేని కుడువకే
    తీఱునె పౌరుష మది యే | దారి నడచు నరుఁడు నట్టి దారిన పోవున్.632

తే.గీ. పుణ్యమా పురుషార్థమా భూరితీర్థ | వాసమా యేలవచ్చితి మోసమాయె
    మీఁదుమిక్కిలి నృపతియై మిథిలనేలు | స్వామిదర్శనమే నా కసాధ్యమాయె.633

వ. అని శుకుండు మాటలాడకయున్నం గాంచి ప్రతీహారుం డతఁ డతిమాత్రజ్ఞానశీలుండని యెఱింగి
    సామవచనంబుల నిట్లనియె.634

క. నీ పని గల్గినచోటికి | బాపరహితశాంతచిత్త పావనమూర్తీ
    పోపొమ్మిఁక నాపై మది | గోపింపకు మయ్య కరుణ గోరెదనయ్యా.635

వ. అనుఁడు శుకుండు 636

మ. నిను దూషింపఁగ నేమిచేసితి వయో నింద్యంబు రాజాజ్ఞఁ గై
    కొని వర్తింపఁగ భృత్యధర్మమకదా కూర్మి న్ననుం గాంచి తీ
    వును నిచ్చోట నృపాజ్ఞజేసి యతఁడున్ బూజ్యుండగున్ నేను చే
    సినదే దోషము లాఁతివారిగృహముల్ సేరంగ నింద్యంబకా.637

వ. అనుడుం బ్రతీహారుండు.638

క. పొనరెడి సుఖమును దుఃఖము | నన నెవ్వి సుఖంబుకొఱకునై నరుఁ డేయే
    పను లొనరింపంగావలె | ననఘా! హితుఁ డెవ్వఁ డింక నహితుం డెవడో.639

వ. అనిన విని యత్యహర్షసమేతుండై శుకమహర్షి యిట్లనియె.640

సీ. సర్వలోకములందు జనులెల్ల రెండు వితాలవారని యాత్మఁ దలపవలయు
    నందుఁ గొందఱు రాగు లన్యులును విరాగులై యుందు రెప్పుడు నందు రాగి
    మూర్ఖచతురభేదముల ద్రివిధుండగు చతురుండు ద్వివిధుండు శాస్త్రమతుల
    విను విరాగియును ద్రివిధుఁడు జ్ఞాతాజ్ఞాత మధ్యమభేద విమర్శనమున

తే.గీ. నుతిజచాతుర్యమదిరెండు మార్గములగు | యుక్తము నయుక్తమునునన నుర్వియందు
    దీనిఁ దెలియుము నిశ్చలజ్ఞానమహిమఁ | జెప్పితిని నీకు నాకు దోచిన విధమున.641

వ. అనినం బ్రతీహారుం డయ్యా మీరు సెప్పిన యది నాకు బుద్దిగోచరంబు కాకున్న యది
    వివరించి విశదీకరింపవే నావుఁడు విని శుకుండు మఱియు నిట్లనియె.642

క. రాగమనఁగ సంసారపు | భోగమునం దిచ్ఛ దానిఁ బొందిన నరునిన్
   గ్రాగించు దుఃఖ సంతతి | సాగరమునఁ బడినవాని చందంబ యగున్.643

ఆ.వె. ధనము గలుగకున్న దారిద్య్రదుఃఖంబు ! ధనము గలిగెనేని దాచవగపు
   దారలేకయున్న దర్పక దుఃఖంబు | దారగలిగియున్నఁ దనుపనేడ్పు.644


తే.గీ. రాగులందునుఁ జతురుండు దాగునొందు | మూర్ఖుఁడగు మానవుండెప్డు మోహమందు
    సుఖము దోపించు మిత్రుండు సుఖమునకును | విఘ్న మొనరించు శత్రుండు వినుము దీని.645

వ. విరక్తునకు సుఖం బేకాంత సేవనంబును, ఆత్మాను చింతనంబును, వేదాంత విచారంబును
    నని యందురు సంసార కథనాదికంబు విరక్తులపాలిటి దుఃఖంబయగు జ్ఞానులగువారికి శత్రువు
    లనేకులు వారెవ్వరనిన.646

క. కామము క్రోధము లోభం | బామోహము మొదలుగాగ నరులగుదురు వా
    రే మెయి నర్హులకారే | భూమిసుఖముఁ గోరునట్టి మునివర్యులకున్.647

తే.గీ. అనినవిని శుకుజ్ఞానిగా నాత్మఁదఁలచి | విడిచె నా కక్ష్యనుండి వివేక ఘనుని
    బిదప నభ్యంతరము సేరి సదమలాయ | తోన్నతంబైన నగరంబు నొప్పుసూచి.648

సీ. నానాజనప్రీణ నానాదరణహీన నానాద జనవితానంబుసూచి
   భోగాతురాశ్రయా భోగాలయలసన్న భోగామి సౌధాగ్రములను జూచి
   ఆశాపిశాచమా యాశాలి దృష్టసర్వాశావిశేష రథ్యలను జూచి
   వారాంగనాజన వారాంగగణనాను వారాంగి మదనభావములు సూచి

తే.గీ. చనిచని శుకుండు లోపలి సదనమునకుఁ | జేరియచ్చటి ప్రతిహారుచే నివారి
   తుండగుచు మోక్ష చింతతో నుండే నొడలు | మఱచి స్థాణువువలె నొక్క మాట లేక.649

క. అంతట జనకమహీశ్వరు |మంతిరి దావచ్చి మంచి మాటలనో ధీ
   మంతుఁడ రమ్మని పలికిన | సంతసమున శుకుఁడు రాజసదనము సొచ్చెన్.650

వ. ఆ దివ్యతపోనిధికి నమ్మంత్రిచంద్రుండు రాజసదన సమీప నిష్కుటంబుంజూపి యతిథి సత్కారంబు
   లొనరించి రాజదర్శనంబునకై కొంపోపుచుండ.651
 
సీ. వాలారుచూపుల వగలువడ్డికిఁబాధ శుకముఖంబులు చెక్కులకు నమర్చి
   కదలు వాతెఱకెంపు కాంతి గంతులు వైవ షడ్జాదికముగాఁగ స్వరముఁ బాడి
   గిలుకు బందియ గజ్జె యులివువాదోడుగా ధ్రువముఖంబులను బల్లవులమర్చి
   యడుగుఁదమ్ము సొంపుఁ బెడఁగులలొడలునిండ మెల్లమెల్లన జతుల్ మేళగించి

తే.గీ. పసదనంబుల శృంగార రసములొలుక | సరిగకుచ్చెళ్లు మీఁగాళ్ళ నరిదికొనఁగ
   భావరాగాధిగతతాళ ఫక్కినెఱిఁగి | వెలవెలందులు నటనముల్ సలిపిరచట.652

చ. శుకబుుషి సేవసల్పుమనసుల్కల యవ్వెలయాండ్రఁ గాంచి వే
   డుక నృపమంత్రి మౌనికిఁ గడున్ బ్రమదంబు ఘటింపుఁ డంచు వా
   రికి సెలవిచ్చి తాఁ జనియెఁ బ్రీతి మెయిన్ సుదతు ల్స్మరార్తలై
   తకథెయి యంచు నాడిరి విచారితకాముక హృత్కవాటలై.653

సీ. మదనార్తలము మేము మన్నించుమని పల్క తనలోనను శివోహ మనుచుఁ బలుకు
    నీగుణంబులు మమ్ము నిలువనీవనిపల్క నిర్గుణోహమ్మని నియతిఁ బలుకుఁ
    ద్వద్ధీర మా సహవాస మబ్రమటన్న విని యద్వితీయోహ మనుచుఁ బలుకు
    నీఠీవి మైఁజూచి యెట్లు తాళెదమన్న బ్రహ్మాహమస్మియన్ పలుకుఁ బలుకు.

తే.గీ. నెడ్డెమనఁ దెడ్డెమనినట్టు లివ్వితాన | దారువోయినదారిని వారు దాను
    బోవుమార్గంబునను దాను బోవఁదొడగె | వికటముగవ్యాసుమువికుమారకుఁడు శుకుఁడు.654

మ. మహితజ్ఞానమయుండు వ్యాసుకొడు కాత్మారాముఁ డీతండు ని
    ర్వహణం బింతయుఁ గల్గునే మదనదేవప్రక్రియాకృష్టికౌ
    నహహా యంచును విస్మయంపడుచు వా రాంభోజనేత్రల్ చనన్
    విహితాంఘ్రిద్వయ శౌచుఁడై కుశలు పాణింబూని వార్చెన్ వెసన్.655

వ. శుకుండు.656

తే.గీ. ధ్యాన మొకజాము గావించి తపసిబిడ్డ | రెండు జాములు నిదురలో నుండి పిదప
    జాము జపియించి తెలవారు జాలలేచి | కాల్యములు దీర్చికొని నిర్వీకారలీల.657

వ. సమాహితచిత్తుండై యుండ.658

తే.గీ. శుకునిరాకను జనకరాజు విని మిగుల | శుచిగలిగి మంత్రులంగూడి శుభకరునిఁ బు
    రోహితుని ముందు నిడుకొని రూఢి నెదురు | వచ్చి తోడ్కొని చని పీఠమిచ్చి పిదప.659

తే.గీ. కుశలమడిగి పయస్విని గోవునిచ్చి | చక్కఁగూర్చుండఁజేసిన నెక్కుడైన
    ప్రీతి జనకుని క్షేమంబు పేర్మినడిగి | యున్న శుకుఁ జూచి పలికె రాజోత్తముండు.660

ఆ.వె. ఓ మహానుభావ యోమునికులచంద్ర | నిస్పృహండవనుచు నినుఁ దలంతు
    నన్నుఁ జూడనేల నావీడు సొరనేల | కార్యమేమి నీకుఁ గలదు చెపుమ.661

-: శుకజనకసంవాదము :-


వ. అని విని జనకధరాజానికి మునిబాలకుం డిట్లనియె.662

క. మాతండ్రి నాకుఁ జెప్పిన | నీతులు నేనన్నవిధము నీ కెఁఱిగింతున్
   జేతోముదమున వినుమీ | యేతీరునమందు నేను గృతకృత్యుఁడనై.663

ఆ.వె. అన్ని యాశ్రమంబులందు గృహస్థాశ్ర | మంబు మంచిదది సమంచితంబు
   బిడియమేల బిడ్డ పెండ్లాడు పెండ్లాడు | తడయవలదటంచు నుడివె దండ్రి.664

ఆ.వె. నాకు వలదు పెండ్లి నాయనా పెండ్లాము | మెడకు గట్టునట్టి పెద్దబొండ
   కొట్టి కొట్ట నేల కాలి సంకిలి నాకు | ననుచుఁ బలుకఁ దండ్రి యనియె నిట్లు.665

చ. చనుము విదేహు నొద్దకు విచారపరుం డఖిలైకవేది యా
    జనవరుఁ డాత్మబోధమునఁ జాలిన వాఁడు నిరర్గళ స్థితిన్
    మనుచు భువిన్ సజీవుఁడయి మానిత ముక్తినిఁ గన్నవాఁడు నీ
    కనుపమ వృత్తిఁ జూపునతఁ డానతి యిచ్చిన త్రోవఁ బోఁదగున్.666

క. అనిన విని విస్మితుఁడనై | చనుదెంచిన వాఁడ నిటకు జననాయక నా
    కును దెల్పు మోక్షమార్గం | బనినన్ జనకుండు శుకున కనియెన్ బ్రీతిన్.667

సీ. విను మునిబాలక విప్రుండు మోక్షార్థి యగునేని బ్రహ్మచర్యాశ్రమమ్ము
    నందుండి వేదవేదాంతము ల్పఠియించి గురుదక్షిణ నొసంగి పరమనిష్ఠ
    నమరి నమావర్తనము చేసుకొని పెండ్లియాడి చక్కని భార్యఁ గూడి న్యాయ
    వృత్తిని బ్రతుకుచు వీతిహోత్రుని మెప్పు సలిపి దయా సత్య శౌచములను
తే.గీ. విడక పుత్త్రులఁ బౌత్త్రుల బడసి పిదప | కాననం బాశ్రయించి నిష్కాముఁడగుచు
    వెనుకఁ దనయాత్మయం దగ్నులను వహించి | పుణ్యసన్యాసి భావంబు పూనవలయు.668

క. వైరాగ్యము లేకుండిన | వారలు సన్యాసులమని వర్తించినచోఁ
    బేరునకె గాక మోక్ష వి | చారమునకుఁ గాదు సుమ్ము సంయమిచంద్రా.669

తే.గీ. వేదములయందుఁ జెప్పిన విధులఁబట్టి | నలుఁబదెన్మిది సంస్కారములు గదయ్య
    యందు నలుబది యొప్పు గృహస్థునకును | నెందుజూచిన సన్యాసి కెనిమిదయ్యె.670

తే.గీ. శమదమాదులయవిసుమ్ము జగమునందు | నాశ్రమము నుండి యాశ్రమం బందవలయు
    దీనిఁ దెలసిన మోక్షంబు మానకబ్బు | సంయమికుమార యొండు విచార మేల.671

వ. అనిన విని యొక్కింత తడవు తనలో విచారించి పరమవైరాగ్యశీలుండైన మునిబాలుండు
    జనక భూపాలున కిట్లనియె.672

తే.గీ. హృదయసీమను వైరాగ్య మిమిడినపుడు | జ్ఞానమనునది చక్కగా గలిగినపుడు
    శమదమాదులు క్రమలీల జరుగునపుడు | పృథివిలోఁ దప్పదో పెండ్లి పెద్దగొండ్లి.673

వ. అనిన జనకుండిట్లనియె. ఓ మునికుమారా! ఇంద్రియంబులు బలిష్ఠంబులు, వాని లోఁబరచుకొనుట
    కష్టసాధ్యంబు. అపక్వంబులై యవి యనేక వికారంబులు సేయుచుండు నవి యెట్టివియన
    భోజనేచ్ఛయు, సుఖేచ్ఛయు, బుత్రేచ్ఛ మొదలగునవియు యని యెఱుంగుము. అవి యతికిం
    గలిగెనేని యెట్లు సమకూరు? సమకూరుకున్న గాంక్షాశాంతి యెట్లు? కావున నింద్రియేచ్చా
    శమనంబునకుంగాఁ గ్రమక్రమంబుగ నాశ్రమంబునుండి యాశ్రమంబున కెక్కవలయు నెట్లనిన,
    పిపీలికావృక్షశాఖారోహణన్యాయంబు నవలంబింపందగు లేకున్న శ్రాంతి వాటిల్లు, మనుజుని
    మనంబు దొంగగొడ్డు వంటిది. సులభంబుగ వశంబుగాదు. క్రమాభ్యాసంబున వశంబుఁజేసికొనుట
    పరమోపాయంబు.



   నరుఁడు గృహస్థుండై యుండియు శాంతుండై నిస్పృహుండై శీతోష్ణంబుల నేకరీతి సహించుచు
   నిజకర్మోపాత్తలాభంబునకుఁ దృప్తుండగుచు నాశాపిశాచంబుపాలుగాక మెలఁగెనేని వాఁడె
   జీవన్ముక్తుండగు నిందున కేన యుదాహరణభూతుండ. మరియు విను మో బ్రాహ్మణకుమారోత్తమా
   సుఖదుఃఖంబులకుం గారణంబైనది. మనంబకదా. మనంబు నడంపంగలుగు వాడె ముక్తుం
   డింతియె గాక.
674

క. సందేహమేల యోముని | నందన బంధనము మోక్షణంబునుఁ జూడన్
   డెందము వలనన కలుగున్ | డెందము వడియడగ నలజడింబడ డెందున్.675

క. మనసే సుఖముల జేయుఁన్ | మనసే దుఃఖములఁ జేయు మనుజులకెల్లన్
   మనసే బంధము సుమ్మీ | మనసే మోక్షంబునకును మార్గము తలఁపన్.676

ఆ.వె. వీఁడు శత్రుఁడంచు వీఁడు మిత్రుండంచు | దలచు టెల్ల మనసు వలనగాదె
   ద్వైతబుద్ధి భిన్నధర్మంబు చూపు న | ద్వైతబుద్ధి భేద వార్తఁగనదు.677

సీ. ఆత్మజ్ఞ యేకమేవాద్వితీయంబ్రహ్మ యను తత్త్వమెరిగి నే ననుసరింతు
   సంసారమున భేద సంఖ్య లేర్పడఁ జూచునంతకాలము బంధ మమరియుండు
   భేదమెచ్చటలేదు లేదు లేదనునాడు బంధవిచ్చేదంబు బడయవచ్చు
   సొరది భేదములేనిచో బంధమునులేదు నెరినెండ లేకున్న నీడయున్నె

తే.గీ. పురుషు డజ్ఞానమును బోవమొత్తెనేని | సహజసుజ్ఞానమున మనశ్శాంతిఁగలిగి
   సకలమును బ్రహ్మమని చూచి చలుడుగాక | పూని సంసారియయ్యును ముక్తిబడయు.678

తే.గీ. వేదవిహితక్రియాదులు వివిధ ధర్మ | వృత్తులకు మానరా దన్యవృత్తిబూన
   రాదు లోకార్థమెందు కీబాధ యనినఁ | బరమపాషండునకు ముక్తిపథముసున్న.679

వ. అనిన విని శుకుం డిట్లనియె.680

తే.గీ. అయ్యయో వేదములు హింసకాదికార | ణములు మోక్షంబు నీసమర్థములె చెపుమ
   కన ననాచారభూయిష్ఠ మనగ నొప్పు | సోమపానంబు దలపవచ్చునె మునీంద్ర.681

తే.గీ. పశువుగోయుట మాంసంబు భక్షణంబు | సేయుట సురను ద్రావుట హేయమైన
   జూదమాడుట గూడునంచును వచించు | నట్టి సౌత్రామణిని నమ్మనర్హమగునె.682

క. మును శశబిందుండనియెడి | జననాథుఁ డనేక యజనశాలి యగుచు ధ
   ర్మనిరతి ననేక దక్షిణ | లను భూసురులకు నొసంగె లలితి విభూతిన్.683

తే.గీ. చర్మములు పేరి పర్వత సమములయ్యె | నమితమేధోదకప్లావనమునఁ జేసి
   యొనరఁ జర్మణ్వతీనది యుదితమయ్యెఁ | బేరువహించె భువి శశబిందు డనఘ.684

తే.గీ. అంతవాఁడును స్వర్గంబు నందునుండె | భూమి నాతనిపేరు విస్పూర్తిగాంచె
      ముక్తి లేదాయె ఫలమేమి భూమహేంద్ర | వేదములు భేదములు నేను వినను వినను. 685

వ. అనిన విని జనకుండు.686

తే.గీ. యజ్ఞములయందు హింస ప్రత్యక్ష మరయ | నది విచారించి చూడ నుపాధియోగ
      మహిమనే నిరుపాధిక మతిఁ బొసంగ | హింసగాదుసుమీ మునిహంసవర్య.687

క. తడిగలకట్టియ లిడినన్ | వెడలుం బొగ యగ్నియందు వివరింపగ న
   త్తడికి కట్టె దివిచిన దిగం | బడు హింసకు రాగమే యుపాధి తలంపన్.688

ఉ. రాగముతోడఁ గర్మ మొనరంగ నొనర్చిన హింసయే యగున్
    రాగములేక చేసినఁ దిరంబుగ నయ్యది హింస గాదు సూ
    త్యాగమటండ్రు భోగమున కందదు ముక్తికి హేతు విద్దియే
    రాగము లేనివాఁడు మహి రాజ్యముఁ జేసిన నేమి తాపసా.689

వ. అనిన విని పరమాశ్చర్యమునొంది సందేహంబు విడక శుకుండు మెల్లమెల్లన నన్నరపాలున
కి ట్లనియె. 690

సీ. భూనాథ నామనంబున సందియముఁ దోచె మాయలో నిస్సృహ మహిమ యెట్లు
    జనపాల తా నెన్ని శాస్త్రము ల్చదివిన మోహంబులో నెట్లు మోక్ష మబ్బు
    క్ష్మాజాని యెట్టి యాగములు గావించిన తమములో నెట్లు జ్ఞానము ఘటించు
    ద్రోహచింతనలకుఁ దొలఁగవలయుఁగదా సదనంబులో నెట్లు శాంతి గలుగు

తే.గీ. ఈషణంబులచేతఁ దా నీడ్వఁబడుచు | బంధములు లేక భూమిపై బ్రతుకు టెట్లు
    కాంక్ష లొగిఁ గయ్యమునకునుఁ గాలుద్రువ్వ | మించి యెదిరించి మనసు జయించు టెట్లు.691

ఉ. దొంగను వీఁడు దొంగయని దూరెడు తాపసుఁ దాపసుం డటం
    చుం గడుఁ గారవించెదవు చూడఁగ నీకును భేదబుద్ధి దా
    చంగులు దాటుచున్నయది సర్వము బ్రహ్మమటంచు నెంచి ము
    క్తిం గనలేనివాఁడవు విదేహుఁడ వెట్లయితో వచింపుమీ.692

తే.గీ. నిద్ర జాగ్రత్తు స్వప్నంబు నీకుఁ గలవు | సుగుణమణిభూషణ తురీయ మగు నవస్థ
    నీకు నేగతిఁ బ్రాపించు నిక్కువముగ | నాకు నెఱిఁగింపుమయ్య యానంద మొదవ.693

చ. కలవు మహాగజంబు లని కాల్బలము ల్గలవంచు గుఱ్ఱముల్
    కల వని తేరులుం గలవు కాంచనముం గల దింతు లెంద రేఁ
    గలరు తనూజవర్గమునుఁ గాంచితి భూమికి స్వామినైతి నం
    చలరెడి నీకు శాంతికలదా యిఁక ముక్తికి హేతువేదొకో. 694

తే.గీ. ధనము లెక్కించుకొను నీకు | జనవరేణ్య యిటికపెల్లను బైడి నొక్కటిగఁ జూచు
      నట్టి సమదర్శనం బెట్టు లబ్బునొక్కొ | వింటి నే నిప్పు డొక గొప్ప వింత కాక.695

వ. అని మఱియు శుకుండు జనకజనవరేణ్యా! నామనం బొక్కింతయు గృహదారాదుల యందుఁ
      బ్రీతియిడదు నిస్పృహుండనై యేకాకినై నిస్సంగుడనై యహంకార మమకార రహితుండనై
      నిర్ద్వంద్వుండనై నిష్క్రతిగ్రహుండనై ప్రవర్తింప నిచ్ఛయింతు నని పలికి వెండియు.696

క. బైరాగిననుచుఁ ఱిత్తవి | కారంబులఁ బడని నాకుఁ గడుసుందరియౌ
      నారీరత్నంబేటికి | నూరేటికి విత్తమేటి కుర్వీనాథా.697

శా. నానారాగసమాకులంబయిన చింతావార్థిలో మున్గి భా
      షానైపుణ్యము నాదయంచు సకలాశాపాలనై కాశతో
      మానక్రోధమదాదులం గలసి యిమ్మాడ్కిన్ విదేహుండ నం
      చీ నీ దంభము కానవచ్చె నిజమా యీ వింతలం గంటిమా.698

క. పగతురు దండెత్తిరనుచు | బొగిలెడు విత్తంబులేదు బొక్కసమున నం
      చుఁ గడుం జింతించెదు నీ | కగునే నిశ్చింతతావహము భూనాథా.699

ఆ.వె. జగ మసత్యమనుచు సర్వదా తెలిసియు | బెట్టనోము లెల్ల పట్టి నోమ
      తిండి మాని యడవిఁ దిరిగి వైఖానసుల్ | గడవలేరు మోహజడధి జనక.700

క. భూతలనాథ భవత్కుల | జాతులను విదేహులండ్రు జను లది ఘృతకో
      శాతకి వంటిది సుమ్మని | నీతి దెలియవలయుఁగాక నిక్కముకలదే.701

సీ. విద్యాధరాభిఖ్య వెలయడే మూర్ఖుండు పేర లక్ష్మీశుండు పేదగాదె
      యల దివాకరుఁడు జన్మాంధుండు లేడొక్కొ నీ వంశమున దొంటి నృపతు లెల్ల
      మహిని విదేహనామము గలవారంచు వినుచుంటిఁ గాక సద్వృత్తి వలన
      బేరుఁ గాంచినవారు కారుసుమా నీవు మది భ్రాంతిపడనేల మనుజనాథ

తే.గి. మున్ను మీవంశకర్తయైయున్న నిమిమ | హీశ్వరుఁడు యజ్ఞమును జేయ నెదదలంచి
      యా వశిష్టు నిమంత్రణం బాచరింప | నతఁడు సురపతిచే నిమంత్రితుఁడనైతి.702

వ. అని పలికి తానును దేవేంద్రుని మఖంబు పూర్ణంబైన పిమ్మట నీ యజ్ఞంబునకు వచ్చెద
     నంతవట్టు మెల్లమెల్లన యజ్ఞార్థసంభారంబులు సంబాళించు కొనుచుండుమని చనిన నా
     రాజశేఖరుం డింకొక్కరు నిమంత్రణంబు సేసికొని యాగంబు జేసినం గోపించి యవ్వసిష్ఠుండు నీ
     శరీరంబు పడిపోవుంగాక యని శపించిన నిమి కోపించి యవ్వసిష్ఠునకు నట్టిదయగు శాపంబొసంగె
     నదికారణంబున నాటంగోలె నిమికుల సంభవులకు విదేహు లను పేరు వచ్చెనని వింటి.703

క. మనుజేంద్ర విదేహుండగు | జనవరు డాచార్యు నెట్లు శపియించునొకో
   కనగన నిదియు వినోదం | బని నే డెందమున దలతు నహహా వింతల్.704

వ. అనిన విని జనకుం డిట్లనియె.705

ఉ. సత్యము సెప్పితీపు విరసంబని నేఁ దలపోయ నిందులో
    వ్యత్యయ మింతలే దిదియమైనను నావచనంబు తాపసా
    పత్యమ పథ్యమంచు నిరపాయత నెంచిన నీకు క్షేమమౌ
    కృత్యము లిట్టివంచుఁ బరికింపకు చిత్తము గట్టి చేసినన్.706

ఆ. కన్నతండ్రి పొందు కడఁద్రోచి యడవుల | కేగువాడనంచు నెంచితీవు
    చింతసేయుమయ్య చిత్తంబునను దండ్రి | పొందు మేలొ పులుల పొందు మేలొ.707

సీ. దినదిన గండముల్ దెయ్యాలతో పోరు నిశ్చింతత పొసంగు నీకు నెట్లు
    కడుపులో మంట యాకలి యెక్కుడగుటంబ నిశ్చింతత పొసంగు నీకు నెట్లు
    కంటినొప్పొకవంత కాలిముల్లొకవంత నిశ్చింతత పొసంగు నీకు నెట్లు
    చేతికఱ్ఱకుఁ జింత చెర వేడ నను చింత నిశ్చింతత పొసంగు నీకు నెట్లు

తే.గీ. చింతలకు నేమి నారాజ్యచింతవలెనె | కలవుచింతలు నీకును గాననమున
    నొగి వికల్పోపహతుడవై యుందు నడవి | నిర్వికల్పుడవైయుందు నేఁ బురమున.708

తే.గీ. కడగి నిదురింపనగు నాకుఁ గనులనిండ | గరిమ బోసేయనగు నాకుఁ గడుపునిండ
    బద్ధుడ నటంచు నెన్నడు బుద్ధిగనక | హాయిగా గృహమున బ్రొద్దు లపనయింతు.709

తే.గీ. నీవు దుఃఖనిబద్ధుండ నేనటంచు | శంకితస్వాంతుఁడవు కాక సౌఖ్యరసము
    ననుభవించుము నా మాట వినుము మనుము | ముక్తి మార్గంబు మనకిదే మునికుమార.710

క. అని జనకుడు పలుకగ విని | మునిబిడ్డం డతనిమాట మ్రోచి మహాప్రీ
    తిని వ్యాసాశ్రమమునకుం | జనిన నతడు గౌగిలించి సంతసపడియెన్. 711

క. ఆ యాశ్రమమున శుకుండు ని | రాయాసంబున జరించె నధ్యయనపరుం
    డై యాగమతతత్వైక | లాయుతుడై శమదమాది లక్షణములతోన్.712

క. పితృదేవతలకుమారిక | మతిమతి జీవతిని గాంతిమతి బెండ్లాడెన్
    సుతులు నలుగు రొక కూతురు | వితతగుణోపేతు లుద్భవిలి రాబిడకున్.713

వ. క్రమంబుగా గృష్ణుండును. గౌరప్రభుండును, భూరియు, దేవశ్రుతుండును ననువారు పుత్త్రులు, కీర్తి
    యనునది కూతురు. ఇందు నందనిన్ విభ్రాజపుత్రుండగు నణుహున కిచ్చి వివాహంబు సేసిన
    దానియం దనుహుణునకు బ్రహ్మదత్తుండను కొడుకు పుట్టె నతండు బ్రహ్మజ్ఞుండై రాజర్షియై
    పృథివీపాలనంబు సేసె నంత గొంత కాలంబునకు శుకుండు.714

క. నారదు నుపదేశంబున | ధీరమ్యుం డతఁడు జ్ఞాన దీప్తిం గని సం
    సారంబు విడిచి ముక్తివి | చారంబున రజతగిరికి జయ్యన నేగెన్.715

ఉత్సాహ. వెండికొండ శిఖరమందు విడిసి ధ్యాననిష్ఠమై
    నుండి సిద్దిఁ బడసి పడియె బండజారినట్లుగా
    నిండు వెలుఁగు మీర నింగి నిలచి వేఱొ కర్కుఁ డీ
    తం డనంగ మిగులఁ జెలగె దైవభక్తి యుక్తుఁడై.716

చ. సుతవిరహాకులుండగుచు శోకమునం గడు దీనుడై యెదన్
    ధృతిచెడి వ్యాసుఁ డోరి కులదీపక యేర యొహో కుమార నా
    బ్రతివచనంబు భూతములె పల్కును రాజతశైలకూట మం
    దతిమధురంబుగాఁగ మును లందఱు నచ్చెరు వంది చూడఁగన్.717

వ. అని యిట్లు విలపింప.718

ఉ. అంతట శూలి పుత్త్రవిరహానల బాధితు వ్యాసుఁజూచి ధీ
    మంతుఁడు నీ కుమారుఁడు సమంచితయోగవిదుండు సుమ్ము బ
    ల్వంతలఁ గుందనేటికి భవప్రభవానల దూరుఁడయ్యె దు
    ర్దాంతత నుత్తమోత్తమపథమ్మున నుండె నటంచుఁ బల్కినన్.719

తే.గీ. దుఃఖమెటులఁ దీరునో తోఁపదిపుడు కనులు దనియవు పుత్త్రలాలనమునందు
    ననిన వ్యాసునిఁగనుఁగొని యభవుఁడు నగి ప్రక్క శుకునీడఁ గనుఁగొంచు బ్రతుకు మనిన.720

ఆ.వె. తనదు ప్రక్కఁదోఁచు దనయుని నీడను మిగుల వెలుఁగు గలిగి మెఱయు వానిఁ
    జూచి సంతసింప శూలధరుఁడు తన వగపుదీర్చి చనిన వ్యాసుఁ డరిగె.721

వ. అని సూతుండు పరమానందసమేతుండై వచియించిన యుదంతంబంతయు విని విస్మితులై
    శౌనకాది మహర్షు లిట్లనిరి.722

మాలిని. శుకుఁడు పరమసిద్దిన్ జొప్పడన్ నిత్యచింతా
    వికలమయిన చిత్తోద్వృత్తి వ్యాసుండు దానె
    ట్లకట బ్రతుకఁ గల్గెన్ హా యతం డేమిసేసెన్
    సకలమును వచింపన్ జాలు దీ వంచుఁ బల్కన్.723

వ. సూతుండు విని తదనంతరంబ వ్యాసువృత్తాంతంబు 'సెప్పెద వినుండు. వ్యాసునొద్ద వేద
   వేదాంగంబు లధ్యయనంబు సేయుచున్న శిష్యులు అసితుండును, దేవలుండును,
   వైశంపాయనుండును, జైమినియు, సుమన్తుండును విద్యాతపోనిధులై వ్యాసు ననుజ్ఞవడసి
   యంతకమున్న దేశాంతరగతులై యుంటంబట్టి చింతాక్రాంతచిత్తుండై తానును
   దేశాటనోన్ముఖుండై.724

క. దాశసుతామాణిక్యం | దాశావృతకీర్తి సజ్జనామోదక వి
   ద్యాశీల సత్యవతిఁ గను | నాశన్ బర్వతము విడచి వ్యాసుఁడు నడచెన్.725

-: ధృ త రా ష్ట్రా ద్యు త్ప త్తి :-


ఆ.వె. జన్మభూమి సౌఖ్య సంపద యెట్టిదో | పుట్టి పెరిగి కొన్ని ప్రొద్దులున్న
   యట్టి ప్రేమ వ్యాసుఁ డరిగెఁ దా దీవికిఁ | గలదె జన్మభూమి కంటె సుఖము.726

వ. వ్యాసుం డిట్లు జన్మద్వీపంబు ప్రవేశించి యచ్చటి నిషాదులం గాంచి యిట్లనియె. 727

అ.వె. దాశులార నన్ను దయ నెత్తుకొని ముద్దు | లాడి బువ్వఁ బెట్టి యాడనేర్పి
    బూదివెట్టి నిదురఁ బుచ్చి మచ్చికఁ గన్న | యమ్మ యేది చూపుడనిన వారు.728

తే.గీ. కన్య నీ తల్లి నొక భూమికాంతునకును | ముదమునం బెండ్లిచేసిరి సదమలాత్మ
    యని చనిరి దాశరాజు దా వ్యాసురాక | విని ఎదుర్కొని యర్చించి వినయఫణితి.729

క. నాజన్మ సఫలమాయెను | నాజీవిత మిపుడు పావనం బాయెఁ గులం
    బోజఁ బవిత్రం బాయెను | ధీజితబ్బందారకార్య దీపితవర్యా.730

తే.గీ. దేవతల కబ్బునే నీదు దివ్యదర్శ | నంబు మునినాథ నీ రాక నాకు మేలు
    నీవు గోరినయది యెద్ది నెమ్మిఁ దెలుపు | నాది కాదీ సమస్తంబు నీది సుమ్ము.731

వ. అనిన విని సంతసించి సాత్యవతేయుం డచ్చటనుండి సరస్వతీతీరంబున నాశ్రమం
   బేర్పఱచుకొని తపంబు సేయుచుండె.732

ఉ. శాంతనునందు సాధ్వియగు సత్యవతీసతి కుద్భవిల్లి ర
    త్యంతకలాసమేతులగు నట్టి సుతుల్ పటుధైర్యశాలులై
    సంతత ధర్మకర్ములయి శాంతియు గల్గి నిర్మల
    స్వాంతత వ్యాసమౌని కనుజన్ములునాఁ దగు నిర్వు రుర్వరన్.733

తే.గీ. చెలఁగి చిత్రాంగదుండు విచిత్రవీర్యు | డనుచు లోక ప్రసిద్ధులై రదియుఁ గాక
    గంగయం దొక్కపుత్రునిఁ గాంచె నృపుఁడు | భీష్ముఁ డాతఁడు శత్రువిభేదిగాడె.734

ఉ. అంతటఁ గొంతకాలమున కా మనుజేశ్వరుఁడైన శంతనుం
    డంతము నొందె భీష్ముఁడు మహామతిఁ బ్రేతవిధుల్వొనర్చె న
    త్యంత ముదంబునన్ మహిసురావళికిం బహుదానముల్ దయా
    వంతుఁ డటంచు వారలు స్తవంబులు సేయ నొనర్చె భక్తితోన్.735

క. చిత్రాంగదభూపతి రా | జ్యత్రాణమునందు నిలిపి యతఁడును బూజా
    పాత్రుఁడయి యూరకుండెన్ | చిత్రము దేవవ్రత ప్రసిద్ధి వహించెన్.736

శా. ఆ చిత్రాంగదుఁ డాత్తవీర్యమదుఁడై యత్యంతమై యొప్పు బా
    హాచాతుర్యము సూపె నాదట నొక ప్డారాజు సైన్యోద్దత
    ప్రాచుర్యంబున వేటకేగి యచటం బల్బంగులన్ శాతనా
    రాచక్రీడల వ్యాఘ్ర భల్లుక కిటి గ్రామంబులన్ గూల్పఁగన్.737

సీ. అదియు జిత్రాంగదుం డనియెడి గంధర్వుఁ | డొక్కడు సూచి తాఁ గ్రక్కున నృపు
    నెదిరించి పోరాడె నెలమిని మూఁడువ | త్సరము లాబవరాన జచ్చెరాజు
    భీష్ముఁ డావార్తను విని వాని యౌర్ధ్వదై | హికములు కావించి ప్రకటనీతి
    దొల్లింటివలెనుండి దొరతనం బొనరింప | నుర్వి విచిత్రవీర్యునకు నిచ్చె
    నదివిని సంతోషమందె సత్యవతీ స | తీమణి తన సుతుండె మహీశుఁ

తే.గీ. డాయెనంచును వ్యాసుండు హర్షమందె | భ్రాత రాజాయెనంచు నభ్రాంతవృత్తి
    జెలగి భీష్ముండు దలచె విచిత్రవీర్యు | నకు వివాహంబుసేయుట న్యాయమనుచు.738

వ. ఆ సమయంబున739

తే.గీ. కలరుమువ్వురు కూతులు కాశినేలు | రాజున కతండుచాటించె రాజముఖులు
    పూని తారు స్వయంపరంబున వరింతు | రంచు రది విని రాజన్యులరిగిరందు.740

క. దేవవ్రతుఁడును గాశికి | దా వేగం జని నృపాలతండంబుల వి
   ద్రాణముసేసి కన్యల | భావజు బాణముల రథముపై నిడికొనియెన్.741

ఉ. ఇంటికిఁదెచ్చి లోన విడియించి సమస్తము గూర్చి యిచ్చియా
    దంట స్వమాతలం గనిన దారిని వారిని గాంచె నౌర యే
    వెంట గనుంగొనగలము వీనిని బోలినవాని నంచు నే
    యింటను విన్న విందుము మహింగల పల్లెలఁ బత్తనంబులన్.742

ఆ.వె. తల్లి సత్యవతికి ధరణీసురలకును | విన్నవించె నతఁడు గన్నియలను
    బిన్నతమ్మునకు విచిత్రవీర్యునకును | గూర్పఁ దలచినాడ గూర్మిననుచు. 743

వ. శుభముహూర్తంబడిగి వివాహయత్నంబు సేయించి కన్నియలం దోడ్కొని వచ్చియున్న
    సమయంబున.744

సీ. తల రాగిడీబిళ్ళ తళుకు క్రేవలఁ గ్రమ్మ వింతగా శిరము నొక్కింతవాంచి
    రవల దుద్దులు మిఠారములు చేక్కులదాట నెడనెడ నొక్కింత మెడగదల్చి
    చిరునవ్వు వెన్నెలల్ సెలవులెక్కుచు గ్రాల ననవంటివాతెర నమలినమలి
    ముద్రికామణిఘృణుల్ మురిసి చిందులుద్రొక్క వెసవ్రేళ్ళఁ బైటకొంగు సవరించి

తే.గీ. దేవనది ముద్దుబిడ్డని క్రేవనించి | సిగ్గునం గన్నులరమోడ్చి చీరెదుడిచి
    యాచి తలయూచి యొక్కొక్క యక్షరముగ | మాటలాడెఁ బ్రథమకన్య తేటమీరి.745

ఉ. చెప్పెద నొక్కమాట వలఁ జిక్కినదాన ని కెందుఁబోవుదున్
    ముప్పిరిగొన్న ప్రేమమున మున్నె వరించితి మాససంబునన్
    దప్పక సాళ్వభూవిభుని దైవము నీచెయిఁ జిక్కఁజేసె నే
    నిప్పుడు చేయగాఁదగిన దెద్దియొ చెప్పుము బ్రహ్మవిద్వరా. 746

వ. అని పల్కిన యక్కన్యారత్నంబు వచనంబులు విని గాంగేయుఁడు వృద్ధబ్రాహ్మణుల
   యానతిం బడసి తల్లికిం జెప్పి మంత్రులతో నాలోచించి ధర్మంబు విచారించి, యో
   కన్యకామణీ! నీవు నీయిష్టునియం దిదివరక మనంబు నిల్పియుంటివి నిన్ను మేము
   పరిగ్రహించుట ధర్మంబుగాదు కావున నీ యిష్టంబు వచ్చినయట్ల చనుమనిన నది యట్ల
   చేసి సాళ్వుం జేరి యిట్లనియె.747

చ. సరసవరేణ్య పుణ్యమతి సాళ్వనృపాలక నిన్ను నే స్వయం
    వరమున నుల్లమందిడితి వాంఛ మెలర్పఁగ నంచుఁ దెల్పినన్
    బరమనయజ్ఞుడై పలికెఁ బావనచర్యుఁడు భీష్ముఁ డోధరా
    వరసుత పొమ్ము నీమనసు వచ్చినచోటికి నంచుఁ బల్కినన్.748
 
వ. ఇటకు వచ్చితి మఱియు.749

ఆ.వె. నెమ్మనమ్మునందు నిన్ను నే వలచితి | తగిన ధర్మపత్ని నగుదు నీకు
    నన్ను నీవు నట్ల కన్నువైచి వరించి | యున్నవాఁడవైతి విన్నియేల.750

వ. అనిన విని సాళ్వుండు.751

మ. నీను నేనెట్లు గ్రహింతు నిత్తఱి నయో నిన్నప్డు భీష్ముండు గై
    కొనియెన్ నేనును జూచితిన్ రథముపైఁ గూర్చుండఁగాఁజేసె నో
    వనితా యెంగిలిదాన నీ విపుడు కావా పోవె నీవెఱ్ఱి నే
    నినుఁ బెండ్లాడఁ దలంపు లేదు మదిలో నీ కేటికిం జింతిలన్.752

వ. అనవుఁడు.753

తే.గీ. అయ్యయో యెంత విలపింపనయ్యె నాకు | నేమి సేయుదు ననుచు నయ్యింతి మఱల
    భీష్ముకడఁ జేరి యో ధర్మవిద్వరేణ్య | వినుము నా యంగలారుపు విన్నవింతు.754

చ. సుజనవరేణ్య యేను జని చూచితి సాళ్వునిఁ గాముబారిచే
    గిజగిజలైతి వేఁడికొని కేలు మొగిడ్చిత గుస్తరించతిన్
    నిజమును జెప్పితిన్ వినక నిన్నితరుండు గ్రహించెఁ బొమ్ము భూ
    ప్రజలు హసింతు రట్టి నినుఁ బత్నిఁగఁగొన్న ననుండుఁ గ్రమ్మఱన్.755

క. వచ్చితి నీవే గతి యని | యచ్చుగ నన్నిపుడ పెండ్లియాడుము కలదే
    మచ్చిక యటు గాకున్నను | జచ్చెద నీయెదుట నిపుడు సాధుచరిత్రా.756

వ. అనిన విని భీష్ముం డిట్లనియె.757

క. ఇతరునిపైఁ జిత్తంబిడి | బ్రతిమాలిన యాఁడుదాని పాణిం బట్టన్
   మతిమంతు లిచ్చయింపరు | సత మిది నీ తండ్రికడకు జనుమీ వేగన్.758

క. నావుఁడు భీష్ముని పలుకులు | దా విని వనమునకుఁ జేరి తప మొనరించెన్
   బావనతీర్థమునన్ విజ | నావని నొకచోట నాకు లశనముగాఁగన్.759

వ. అది యట్లుండ మిగిలిన యంబాలికయు నంబికయును నను నిరువురు కన్యలును విచిత్రవీర్యునిభార్యలై పరమపతివ్రతామహిమంబు తమదకా రూపలావణ్యవిభ్రమంబుల నసదృశలై భర్తకుఁ
బరిచరించుచుండఁ గొన్ని వర్షంబులకు రాజయక్ష్మామయపీడితుండై భూపతి పంచత్వంబు నొందె
నంతట అత్యంతదుఃఖితయై సత్యవతి ప్రేతకృత్యంబులు నిర్వర్తింపంజేసి వెండియు నేకాంతమున గాంగేయుంబిల్చి యిట్లనియె.760

ఆ.వె. ఓయి భీష్మ మ్రోయు ముర్వీభారము నీవు | నట్ల యనుజభార్య లందుఁబ్రేమ
   సుతులఁ బడసి వంశ మతిశయిల్లఁగజేసి | ఘనయయాతికులము గావుమనిన.761

క. తల్లీ నీవెఱుఁగుద కా | తెల్లముగా మున్నె నా ప్రతిజ్ఞను రాజ్యం
   బొల్లను సతి నొల్లననుచు | జెల్లింపకయున్న నది నిషిద్ధముకాదే.762

క. అనిన విని సత్యవతి దా | మనమునఁ జింతించె నయయొ మహనీయకులం
   బున కిద తుదకాబోలున్ | మునుకొని యిందున కుపాయమును గన మనుచున్.763

క. అది జూచి భీష్ముఁ డెంతయు | మదిలో దలపోసి తల్లి మానుము దుఃఖం
   బొదవింపుము క్షేత్రజసుతు | విదితుని స్మృతిచే విచిత్రవీర్యుని కనినన్.764

క. కులవంతుండగు ద్విజునిం | బిలిపించి విచిత్రవీర్యు పెండ్లామునకున్
   గలిగింపుము సాంగత్యము | కలుగు సుతుఁడు శాస్త్ర మొప్పుఁ గాచుగులంబున్.765

తే.గీ. ఇట్లు పౌత్త్రుండు పుట్టిన యేని వాని | కిచ్చి వేయుము రాజ్యంబు నేను వాని
   శాసనంబునఁ బాలింతు సకలభూమి | సౌఖ్య మింపొందు నీకు నిశ్చయమటన్న.766

క. తన కానీనతనూజున్ | ఘను వ్యాసుఁ దలంచె వేడ్క గామిని యంతన్
   జనుదెంచి యతఁడు మ్రొక్కుచుఁ | గనులయెదుట నిలువఁబడినఁ గనుఁగొని ప్రేమన్.767

ఉ. ఓయి కుమార శంతనుని యుత్తమవంశము నిల్పఁ గోరి ని
    న్నీయదనం దలంచితిని నీవును వేడ్క విచిత్రవీర్యు ప
    ద్మాయతనేత్రఁగూడి యొక యాత్మజు నొందుము క్షేత్రజుండుగా
    నాయెద సంతసిల్లు ననినన్ విని సమ్మతమంచుఁ బల్కుచున్.768

వ. వ్యాసుండు ఋతుకాలంబునకు నిరీక్షించి యథాశాస్త్రంబుగా నంబాలికం గూడిన నామె

గర్భవతియై జాత్యంధుండగు నొక్కసుతుం గాంచె నందునకుఁ జింతిల్లి సత్యవతి వ్యాసుంగాంచి యంబికం గలయం గోరిన నతండట్లు సేయఁ బాండురోగపీడితుండగు నొక పుత్త్రుండు వుట్టె నది సూచి మిక్కుటంబగు వనటం గుంది సత్యవతి మరల నంబికం గూడుమని వ్యాసుతోఁ జెప్పిన నతం డొడంబడి శయనాగారంబున నెంత నిరీక్షించినఁ దా రాక ప్రేష్యం బంపిన దానితో వ్యాసుండు సంగమింప నది గర్భవతియై సుపుత్రుం గాంచె.769

క. అంబిక కొమరుఁడు దాఁ బిలు | వంబడె ధృతరాష్ట్రుఁడనుచు నంబాలిక పా
   లంబడినవాఁడు పాండుఁ డ |నంబడె నితరుండు విదురనామము గాంచెన్.770

వ. ఇది ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జన్మక్రమంబని చెప్పిన విని శౌనకాది మహామునులు సంతసించి.771

-: స్కం ధాం త కృ తి ప తి సం బో ధ న ము :-

శా . దీర్ఘగ్రంథకృదుత్తమోత్తమకథా దివ్యాంశసారత్రయా
     నిర్ఘోషాంచితభూమిదేవ పరిష న్నిత్యాభిషేకోత్సవాం
     తర్ఘర్మేతర వారిపూర పరిపూర్ణప్రాంత పద్మాకరా
     నర్ఘార్చావిధపూతభక్తి వినరా, యల్లూరి సోమేశ్వరా.772

స్రగ్విణీవృత్తము. శ్రీకరా, భీకరారిప్రణాశంకరా | స్తోకరాజన్మహాతోక, రాధావరానేక
      రాజీవపూజైకవిస్తార, స | ల్లోకమందార, యల్లూరిసోమేశ్వరా.

గద్య. ఇది శ్రీమదిష్ట కామేశ్వరీపాదారవింద మకరందతుందిలమానసేందిందిర, దాసు వంశ పయఃపారావారరాకాసుధాకర, కామాంబాకన్నయమంత్రీంద్రకుమార, పవిత్ర హరిత గోత్రాలంకార కృష్ణామండల మండనాయ మానాల్లూరగ్రహార పూర్వార్జిత ధరావిరాజమాన, శ్రీవీరప్రతాప కోర్కొండహంవీర రామచంద్ర భూమీశ్వరదత్త గోదావరీమండలస్థిత, సీతారామపురార్థభాగ పరిపాలనాధీన, పూర్వోక్తోభయమండల న్యాయసభావాదక నియోగభారవ్యవహార, శ్రీ వేంకటేశ్వర వరప్రసాదసంభూతకవిత్వ విద్యావిశేష బాల్యాదిరచిత త్రింశత్ప్రత్యేకగ్రంథ మతిసార, విబుధ జనకరుణాసంపాదితోభయభాషా పరిచిత ప్రచారనిత్య, శ్రీరామామాత్య ప్రణీతంబగు శ్రీ దేవీభాగవతం బను మహాపురాణంబునం బ్రథమస్కంధము.

ప్రథమస్కంధము సంపూర్ణము.