శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 4
కానని దానిలో తాము కాంచినది చాలకొంచమే యని తెలిసికొనుచున్నారు. కాలక్రమమున నింకను పలువిషయ ముల పరిశోధించి, భౌతికశాస్త్రముల నభివృద్ధిచేయవచ్చును గాని, మనుష్యుని జ్ఞానమున కందిన విజ్ఞానమున్నను దానికి మించినదైన విషయముండనేయున్నదని వారు తెలిసికొని యున్నారు. భౌతికశాస్త్రములను బాగుగా శోధించి పరీక్ష చేసినవారు వినయమును విడువలేరు. తాము సంపాదించిన యధికజ్ఞానముచేతనే యధికమగు నడకువతో నున్నారు. విజ్ఞానపరిశోధన కతీతమయిన తత్త్వ మున్నదని యొప్పుకొని యా పరతత్త్వమునం దడకువ కలిగి తలవంచి యున్నారు.
(4)
పరతత్త్వ విచారము
కారణముల కెల్ల కారణమైనిలిచిన మొదటి కారణము, ప్రకృతివిధుల కెల్ల విధియై నిలిచిన పరశక్తి, మనుష్యుని బుద్ధి విచారమునకు లోబడదు. అయినను ఎంతటి విషయమును, ఎంతటి తత్త్వమును నరసి తెలిసికొనవచ్చునని దానికి తోచును. ఈ తలంపు దానిస్వభావములోనే యున్నది. ఇది స్వభావమైనను సత్యము వేరు. మానవుని బుద్ధి నిర్మాణము గొప్పదేయైనను నది దేనియందు భాగమై యున్నదోయా సంపూర్ణతత్త్వమును తనలో నడగింప సాధ్యముకాదు. ఎంత యడగింపనెంచినను, అది లోపల నిముడదు. ఒక రాతిపై నిలిచియున్నవాడు తాను దానిపై నిలిచియుండియే దానిని ఎత్తి వేయచాలడు. మహాబలవంతు డైనను నేది తాను నిలుచు కొనుటకాధారముగ నున్నదో దానిని తీసివేయ సాధ్యము కాదుగదా? దానిని విడిచి క్రిందికి దిగినవాడు దానిని తీయ జాలును. బండినిలాగు గుఱ్ఱమును బండిలో నెక్కించిన నది బండిని లాగకలదా? మనుష్యునిబుద్ధి పరతత్త్వమును విడిచి, ప్రత్యేకముగా నిలుచు స్వభావము కలది కాదు. కావున, నాపరతత్త్వమునే వేరుచేసి తాను ముందుకు పోజూలడు;. అనగా, దానిని తన జ్ఞానముయొక్క హద్దులో నిముడ్చ చాలడు. కడుపులోని జీర్ణకోశమెట్టి యాహారమునై నను జీర్ణము చేయగలదు. కాని, తన్నుదానే జీర్ణించుకొను స్వభా వము దానికి లేదు. ఒకసోలను తీసికొందము. దానిలో నెంత పట్టునో అంతయే యది గ్రహింపగలదు. ఒకు పామున కెంతటి ఘోరమైన యాకలివేసినను తనతోకనే తాను తిని వేయచాలదు. ఆవిధముగనే యంతటికిని కారణమైన పర తత్త్వము మానవుని బుద్ధియందడగి యుండదు.