శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 3
(3)
అల్పజ్ఞానపు భ్రమ
భౌతికశాస్త్రవిషయములు కొంచెము తెలియుటతోడ నే కొందరికి భ్రమ కలుగును. దానిలోను మరికొందరు చేసిన శోధనఫలముగా, గుజిలీఅంగడిలో తక్కువవెలకు ప్రాతసామానులవలె, శ్రమలేకయే సంపాదించిన జ్ఞానము కొందరి కధికబోధ నిచ్చునదిగా నుండును. ఏది చిన్నది, ఏది పెద్దది, ఏది దగ్గరగా నుండును, ఏది దూరము అను నిదానబుద్ధి తగ్గిపోవును. ఏది తమకు తెలియకుండునో యది లేనేలేదని సాధించుకొందురు. మనుష్యుని జ్ఞానమున కందని దంతయు నసత్యమని త్రోసిపుచ్చుటకు జనులు ముందంజ వేయుదురు. శాస్త్రమనియు, ధర్మమనియు, నంతయు, మోసగాండ్రు వ్రాసియుంచినారని చెప్పుదురు; ఇవన్నియు పామరజనులను మోసగించుట కే మూఢులవేత వ్రాయ బడినవనియు సాధింతురు. కాని ప్రకృతిశాస్త్రములను పరిశోధించి ప్రకృత్యవస్థలను చూచి గ్రహించుటకు తమ అయుష్కాల మంతయు తమ శక్తినంతయును ధారపోసిన వారు ఇట్టి యున్మత్తతకు లోను కారు. ప్రకృతిశాస్త్ర పరిశోధకులు పలువురు గొప్ప వినయము గలిగినవారుగా నున్నారు. తాము కనిపెట్టినవి చాల నెక్కువగ నున్నను, కానని దానిలో తాము కాంచినది చాలకొంచమే యని తెలిసికొనుచున్నారు. కాలక్రమమున నింకను పలువిషయ ముల పరిశోధించి, భౌతికశాస్త్రముల నభివృద్ధిచేయవచ్చును గాని, మనుష్యుని జ్ఞానమున కందిన విజ్ఞానమున్నను దానికి మించినదైన విషయముండనేయున్నదని వారు తెలిసికొని యున్నారు. భౌతికశాస్త్రములను బాగుగా శోధించి పరీక్ష చేసినవారు వినయమును విడువలేరు. తాము సంపాదించిన యధికజ్ఞానముచేతనే యధికమగు నడకువతో నున్నారు. విజ్ఞానపరిశోధన కతీతమయిన తత్త్వ మున్నదని యొప్పుకొని యా పరతత్త్వమునం దడకువ కలిగి తలవంచి యున్నారు.
(4)
పరతత్త్వ విచారము
కారణముల కెల్ల కారణమైనిలిచిన మొదటి కారణము, ప్రకృతివిధుల కెల్ల విధియై నిలిచిన పరశక్తి, మనుష్యుని బుద్ధి విచారమునకు లోబడదు. అయినను ఎంతటి విషయమును, ఎంతటి తత్త్వమును నరసి తెలిసికొనవచ్చునని దానికి తోచును. ఈ తలంపు దానిస్వభావములోనే యున్నది. ఇది స్వభావమైనను సత్యము వేరు. మానవుని బుద్ధి నిర్మాణము గొప్పదేయైనను నది దేనియందు భాగమై యున్నదోయా