శృంగార మల్హణచరిత్ర/ద్వితీయాశ్వాసము

శ్రీః

శృంగార మల్హణచరిత్ర

ద్వితీయాశ్వాసము

క.

శ్రీమహితవేద్యవాటిపు
రామందిర భవ్యరూపరేఖాస్పద సౌ
త్రామసమ వియ్యమాంబా
కామిత సాంగత్య చుండికాళామాత్యా.


వ.

అవధరింపుము.


క.

ధనపాలుండను వైశ్యుని
తనయుఁడు ధనదత్తుఁ డపుడు తనచెలికానిన్
బనిచెను బుష్పసుగంధికి
నొనరఁగఁ గన్నెరికమునకు నొడఁబరపింపన్.


క.

నిలువెం డర్థం బడిగినఁ
గలఁగక యొడఁబడుము నాకుఁ గలవాఁడవయో

చెలికాఁడ, మెచ్చు నీకున్
గలదని నను మదనసేనకడకును నతఁడున్.


గీ.

ఏఁగి పుష్పగంధి యిందీవరేక్షణ
చదువ నాడఁ బాడఁ జతుర యనఁగ
దగిలి చూడఁ బంపె ధనదత్తుఁ డనవుడు
మొరటు మాటలకును ముదముఁ బొంది.


సీ.

అతి సన్మానించి యర్ధాసనమునకుఁ
                   జేరంగ దీసి పైఁజేయి వైచి
కర్పూరతాంబూలగంధపుష్పాదులు
                   నయమార నిచ్చి లేనగవెలర్పఁ
దనముద్దుపట్టిముందటఁ బెట్టి యిబ్బాల
                   తగునయ్య, ధనపాలతనయునికిని
నతనికిఁగాక యీయరవిందలోచన
                   యితరమానవులకు నేల నబ్బు
ననిన నిల్వెఁడర్థ మడిగిన నొడఁబడు
మనుచు నంపె నన్ను నతివ, యిపుడు
యడుగు మేమియర్థ? మతనికి నిమ్మేలు
వార్త వేగఁ జెప్పవలయు ననిన.

క.

రాజా, రాజులు బ్రాఁతే
రాజులు ధనపాలసుతుఁడు రాగుందు...వె
రాజు మగఁడైన నేలా
గాజుంగడియంబు కడమగలదే యెందున్?


క.

చతురుఁడు ధనదత్తుఁడు గడు
నతఁ డొసఁగెడు విడెమె చాలు నన్యము లేలా?
బ్రతికితి భాగ్యము సేసితి
నతివేగమె పొమ్ము తెమ్ము నల్లునిగారిన్.


వ.

అని మదనసేన యతని ధనదత్తుకడ కనిపి తనముద్దుకూఁతుం దొడలపై నిడుకొని బుజ్జగించి బుద్ధిగా నిట్లనియె.


క.

వయసు గలనాఁడె యర్థము
నయమున నార్జింపవలయు నానాభంగిన్
వయ సుడుగ నుడుగు గడనయు
వయసే ధనమూల మండ్రు వారాంగనకున్.


క.

ఊరక పిలిచే మన్నను
రా రెవ్వరు తలకు నరులు రాఁ జూచి రయో
యారయ నెంతటివారికి
గారవ మది దీనికంటెఁ గష్టము గలదే.

క.

కోఁతల గీతల వెల్లల
రోఁతలకును మూల మగుచు రూపఱి మిగులన్
బ్రాఁతి చెడు ముదిసె నేనియు
లేఁ తప్పుడె లంజెయున్కి లెస్సై యుండున్.


క.

తల నెరసిన ముదివిటులును
గులహీనులుఁ గుండగోళకులును గురూపుల్
కలిమి గలవార లైనను
వెలయాండ్రను నెపుడుఁ బ్రోచు వేల్పులు గారే.


క.

బొజ్జలు పెరిఁగిన సెట్లు
నొజ్జల్లును దడిక ద్రోపు లొంటరికాండ్రున్
లజ్జ యెఱుంగని విటులును
సజ్జకముగ వారసతులజన్మఫలంబుల్.


క.

చక్కనివారలు జారులు
కక్కసమగువారు వన్నెకాండ్రున్ రసికుల్
చొక్క మగు రాకుమారులు
మిక్కిలి వెలయాండ్రపాలిమృత్యువు లరయన్.


క.

రొక్కము ధన మీగలిగిన
మిక్కిలియుఁ గురూపియైన మెచ్చఁగవలయున్

తెక్కలియై ధన మీయని
యక్కాంతునినైనఁ గదియ నర్హంబగునే.


క.

డెందం బేరికి నీయక
యందఱిఁ దనయాత్మలోన నడపుచు నయనా
నందంబుగ మెఱయఁగవలె
నందంబున వారకాంత లద్దము భంగిన్.


చ.

బలపము లేఁతనవ్వు, నునుఁబయ్యెద సన్నపుఁగావిచీర, మిం
చులు గొను జల్లజంపునునుఁజూడ్కియె కన్నపుఁగత్తి, మోవి తీ
పలవడఁ జొక్కుచున్ దగ విటావలిడెందముఁ గన్నపెట్టి యిం
పుల ధనమెల్లఁ దోఁచు(దీసి)కొని పోవలెఁ గామిని గండిదొంగయై.


క.

మగవానిచిత్త మంతయు
నిగురొత్తఁగఁ జేసి వేఁటయిఱ్ఱియపోలెన్
దగిలింపక తాఁదగిలిన
మగు వెంతయు సొంపు చెడి యమాన్యత నొందున్.

క.

వలచుట కష్టము వనితల్
వలచుట పురుషునికిఁ గాక వారాంగనకున్
వలపు దగ దెన్నిభంగుల
వలచినయెడ విఱుగనేర్పువలెఁ దరుణులకున్.


క.

గరగరికలేనిపట్టులఁ
బరికింపుచుఁ గల్లకీడు భావించుచు మై
నెరసులు వెదకుచునుండెడి
పురుషునిపైఁ గూర్మి వీటిఁ బోవదె సతికిన్.


సీ.

పురుషుని నెచటికిఁ బోవంగనీయక
                   వింతచేఁతల గురివేయవలయు
నవనవసురతతాండవసౌఖ్యవార్ధిలో
                   ముంచి యింపులఁ బొదలించవలయుఁ
గలసినయప్పుడు వలచినయట్లుండి
                   యెనసి వేడుకఁ జిత్త మెఱుఁగవలయు
మందుమంత్రంబులు మాయలు ప్రతివన్ని
                   తెగువమై నవలీలఁ దిరుగవలయుఁ
గలసినప్పుడు చనవిచ్చి కలయవలయు
పాయునప్పుడు నిచ్చయు సేయవలయు

నయముఁ బ్రియమును దప్పక నడవవలయు
నమ్మికలు గాఁగఁ దగవులు నడపవలయు.


వ.

అని యిట్లు మదనసేన తనకూఁతునకు బుద్ధి చెప్పుచునుండె నంత వసంతాగమం బేతెంచిన.


ఉ.

వచ్చె వసంతుఁ డంచుఁ బ్రియవార్త యొకింత యెఱుంగఁజెప్పినన్
మెచ్చి సమీరచారునకు మెప్పుగ నవ్వనదేవతాంగనల్
మచ్చికఁగట్టువర్గము సమర్పణచేసిరొ యంచు భూజనం
బచ్చెరువందఁగాఁ దరులయాకులు డుల్లెఁ గ్రమక్రమంబునన్.


చ.

లలితలతావగూహనములం బులకించినరీతిగప్పులున్
బలియుచుఁ బల్లవించె నటఁ బల్లవముల్ తళుకొత్తి యొప్పుమై
నలి సమనస్స్థితుల్ గనియె నాసుమనస్స్థితిఁ జెంది యంతఁగో

ర్కులు ఫలియించె నాఁగను దరుప్రకరంబు ఫలించె నెంతయున్.


సీ.

సాలరసాలరసాలసాలంబులు
                   కోలకంకోలతక్కోలములును
చాంపేయచాంపేయచాంపేయనికరంబు
                   కేసరకేసరకేసరములు
మరువకమరువకమరువకానీకంబు
                   పాటలపాటలపాటలాలి
కురవకకురవకకురవకానీకంబు
                   కాంచనకాంచనకాంచనములు
చందనద్రుమచందనచందనములు
దారుదారుకసద్భద్రదారుసమితి
మాలతీకృతమాలతమాలవితతి
తాలహింతాలతాలలతాలతైక
వనము లింపారె భువనపావనము లగుచు.


చ.

అలికలకంఠగానము శుకారవగుంభికతాళమానమున్
కలరవహంసకేకిరవకాహళమర్దళతుండికాధ్వనుల్

చెలఁగఁగ గాడ్పునర్తనము చేయఁగఁ బుప్పొడిరంగవల్లికల్
వొలిచిన నాట్యశాలలనఁ బొల్పగుఁ బూఁబొదరిండ్లు సొంపునన్.


వ.

తదవసరంబున.


క.

దండిగ మన్మథునగరికి
దండగు లొడఁబరుపులంజెతల్లులె దొరలై
మెండుగ విఱుగఁగ వచ్చెను
బండుగదుర్విటులు బండుబండుగ నంతన్.


సీ.

అల్లువారలఁ దమయాఁడుబిడ్డల నొగిఁ
                   బుట్టినిండ్లకును గొంపోవువారు
తైలాజ్యగుడదుగ్ధతండులానీకంబు
                   నాశ్రితులిండ్లకు నంపువారు
హితభృత్యసఖబంధుసుతదారలను గూడి
                   యభ్యంగములు దీర్చి యలరువారు
దానధర్మపరోపకారనుబుద్ధిఁ
దవిలి భూసురసంసేవఁ దనరువారు

వరదుకూలవిభూషణావలి ధరించి
మెండుకొని వీధులందును మెలఁగువారు.


సీ.

వెచ్చాన కేమైన విస నియ్యఁబడియెడు
                   నని పుల్లదీగెల కలుగువిటులు
తొడవులు దొడఁగట్ట నెడలేక బెదరక
                   యెరువుసొమ్ములు వెట్టి తిరుగువిటులు
వెడలఁ ద్రోపులుపడి వెస నేమియును లేక
                   చొరఁజోరవిద్యకుఁ జొచ్చువిటులు
నభిమతార్థము లిచ్చి యన్యోన్యలీలల
                   నువిదలఁ బెడఁబాయకుండువిటులు
మాడలని చూపి బ్రమయించి మతముఁ బన్ని
సుదతులకు రిత్తమాటలు చూపువిటులు
గణన కెక్కిన తత్పురాంగణమునందు
మెలఁగుచుండంగఁ గడువింతచెలువు దోఁచె.


వ.

అంత నటయున్న మొరటుండును మదనసేన వీడ్కొని సంభ్రమంబున.


క.

చని వేగమె ధనదత్తునిఁ
గనుఁగొనుటయుఁ జూచి యతఁడు కాయయొ పండో?

యన మొరటుం డనియెను దాఁ
బనివినగా యౌనె యెపుడుఁ బండే కాదే.


వ.

అనినఁ గౌఁగిలించి మెచ్చుమ్రింగుమీ యని యొక గొంటుపోక విడియం బతనికిం బెట్టి యిట్లనియె.


గీ.

అత్త యేమి యనిం నాపడు చేమనె
నీవు నేమి యంటి నిక్కువముగఁ
బౌరు లేమి యనిరి పరికింప వారింటి
చేటు లేమి యనిరి చెప్పు మనిన.


క.

ధనదత్తుఁ డనినమాత్రనె
విని సంతస మందె నత్త వేడుక పడుచున్
గనుమూసియుండె సిగ్గునఁ
జనులకు బరిజనుల కాత్మసమ్మత మయ్యెన్.


క.

విను మేమిటి కాలస్యము
నినుఁ దెమ్మనె మదనసేన నేఁటిముహూర్తం
బునఁ బుష్పగంధి నిన్నును
నెనయఁగ సమకూర్ప మంచి దెంతయు ననుచున్.

క.

మున్నాదిసరకుజడ్డలు
గొన్నన్ లాభించుఁ బిదపఁ గొనఁ జేకురునే
యెన్నంగ నదియు నిటు లే
యెన్నైనను గలయ నిచ్చు టింతయు లెస్సన్.


వ.

అని యిట్లుండ వెనుక నన్ను దూరం బని లేదు మదనసేనప్రభావంబు సూచించెద నాకర్ణింపుము.


క.

ఆతెఱవ యాగ్రహించిన
భూతంబులు నొచ్చుఁ జిచ్చు పొలయఁగ వెఱచున్
జేతనసంభవమాయా
కౌతుకవిద్యావిభేదకారిణి యగుచున్.


సీ.

నేలకు నింగికి నెఱయఁదాపలు వెట్టు
                   చెలరేఁగి రోఁకటఁ జిగురుఁగోయుఁ
గడు బట్టతలలు మోఁకాళ్ళును ముడివేయుఁ
                   గొసరక వడగండ్ల గుళ్ళుగట్టుఁ
బూన్కిమై నంగళ్ళఁ బులిజున్ను లమ్మించు
                   నయమునఁ జట్రాత నారఁదీయు

నొండొండఁ గొండలు గుండుగాఁ దాఁకించు
                   వదలక నడురేయిఁ బగలు సేయు
రూడి మెఱయంగ నిసుమునఁ ద్రాడుఁ బేను
లెక్కసేయక చుక్కల లెక్కపెట్టు
గాలిఁ నొడిఁగట్టుమంచుఁ గుంచాలఁ గొలుచు
మదనమాయాకళాధాన మదనసేన.


సీ.

వెడవెడ వలపులు వెదచల్లి దొరలచే
                   నడియాలములు దీసి కడకుఁ దొలఁగు
ననుపువారలఁ బట్టి పెనుబులుపై బట్టి
                   ధట్టించి నగరెక్కి ధనముఁ దివియు
పెంపుడుగున్నల పెద్దశృంగారించి
                   వింతవారలఁ గని వెఱ్ఱిగొలుపు
ధనికులకడ కేఁగి తనసొమ్ము వారొద్ద
                   బోయనం చేమైనఁ బుణికికొనును
గోరి తనకును లోనైనవారినెల్ల
బనికిఁ బాటకు బంట్లకాబల్లిగట్టి
గ్రొత్తవారలఁ గనుఁగొన్న నెత్తుసేయు
మాటలనె తీయు ధనమెల్ల మదనసేన.

వ.

అని మొరటుండు చెప్పిన మాటకు నవ్వి ధనదత్తుండు తనతెఱంగు వినుమని యిట్లనియె.


సీ.

దైవాలకును రిత్తదండాలు గిండాలు
                   గాని యెన్నఁడు నొకకాసు నీయఁ
గవిగాకులు వచ్చి గణుతించి వేఁడిన
                   వదలిపోవుటెకాని పైక మియ్యఁ
జుట్టాలకును వట్టిసుద్దులు దుద్దులు
                   గాని యెన్నఁడును డగ్గరఁగనీయఁ
బైత్రోవ వచ్చిన పరదేసి యొరదేసి
                   మోసపుచ్చుటె కాని గాస మీయఁ
బట్టుకొని బందికాండ్రను బాధపెట్టఁ
బెంచులే చూప నొకబలువీసమైన
బ్రహ్మరాక్షసిశాకిని బ్రతిదినంబుఁ
కూఁతలే కాని ముద్దెఁడుకూడు వెట్ట.


సీ.

మునుపు దొంగలకుఁ బోయిన గొడ్డులే కాని
                   తగిలి బాపలకు గోదాన మీయ
కొఱమాలి ముఱిగిన కూష్మాండములె కాని
                   దాక్షిణ్య మొదవంగ దాన మీయ

పెనుదొఱ్ఱపెసలు ముక్కినబియ్యమే కాని
                   యంగళ్ళ నమ్మింతు ననువు లెఱిఁగి
వడ్డికాసులు గూర్చి వడ్డి కవియె యిచ్చి
                   పొరుగిండ్లవంక నేప్రొద్దుఁ బోదు
యీఁగకై బలి యెన్నఁడు నీయకుందు
పాముకై బలిపెట్టను బ్రతిభతోడఁ
గదిసి యెంగిలిచేతను గాకి నేయ
నెరయ నాజాడ నెవ్వరు నెఱుఁగరోయి!


క.

విను మాటలె పచరింతును
ధన మప్పుగ నిత్తుఁ బిదపఁ దగులందీతున్
ధనదత్తుగానిసేఁతలు
వినరా యెవ్వారు నీకు వింతయె మొరటా!


వ.

అని నీవు పోయివచ్చినప్రయోజనంబులకుఁ బో రానిపక్షంబైనఁ జూచుకొందమని నిజనివాసంబునకుం జని యప్పడఁతిం దలంచి నిలుకాల నిలువ సహింపక డోలాయమానమానసుండై యప్పుడు.


గీ.

బేరసారంబుమీఁదటి ప్రేమ లుడిగి
సెట్టిసానివిలాస మీక్షింప రోసి

సత్రసాలయ్యె ముద్దాడఁ సైఁచఁడయ్యె
వనితమీఁదటి హాళి నవ్వైశ్యవరుఁడు.


గీ.

కాసు విడిచినఁ బ్రాణ మాకసముఁబట్టు
ముదితఁ జూడక ప్రాణంబు మున్నె పోవు
దెగువ నీ రెంటికిని నేది తెరువు చెపుమ
పాపి! లంజరికంబు! నీబంటుఁ గావు.


సీ.

చక్కిలంబులు గొన్ని చవిచూచు నందంద
                   మెల్లనె యనుపగుగ్గిళ్లు నమలు
చల్లగావలెనని చలిమిడి భక్షించు
                   నొకపాటుగాఁగఁ బానకముఁ ద్రాగు
నయనపోలయ్యకు నంజలి ఘటించు
                   దులసితీర్థమునఁ గన్నులు దొలంచు
తల గోడతోడుతఁ దాఁకించుకొనఁబోవు
                   పాపిదైవమ, యని పండ్లు గొఱుకు
నడచిపడుఁ బొత్తికడు పంతఁ బొడిచికొనును
మూల్గు నిద్రయు నాహారమును ద్యజించి
యున్నచో నుండ సైఁపక యొఱలియొఱలి
మొరట, పోదము రమ్మను ముదితకడకు.

వ.

ఇట్లు ధనదత్తుండు మనోవ్యధ సైరింపలేక తన నిజసఖుండైన మొరటుం బిలిచి యిట్లనియె.


క.

పోకున్న మనసు నిల్వద
యీకుండిన లంజె పిలువ దేలా గిఁకఁ దా
నాకుంగలచెలికాఁడవు
చేకూరఁగ వేగ బుద్ధి సెప్పు మటన్నన్.


క.

మానినిఁ గలయక యింతట
మానిన ననుమానమౌను బ్రాణముఁ దనువున్
బ్రాణము గలిగిన సకలముఁ
దానూరక గలుగుననిన ధనదత్తుండున్.


ఉ.

పుట్టెఁడు నేయి నూనె పదిపుట్లు సడించిన సన్నబియ్యమున్
బెట్టెఁడు పట్టుచీరలును బిందెఁడుమాడలు చాలఁ గ్రొవ్విరుల్
నొట్టునఁ బట్టుగొఱ్ఱియలు నూఱును నేఁబదిసూకరంబులున్
బట్టియమంచముల్ పదియుఁ బంపెను లంజియవారి యింటికిన్.

వ.

అంపిన నమ్మదనసేన కన్నుదనిసి తగినచుట్టంబులుం దానును దనయిలవేలుపులకుం బెట్టుకొని విభూషణభూషితయై పుష్పసుగంధి నలంకరించుకొని యప్పుడు.


క.

తొలువినికి నభవుముందట
నలికుంతల పుష్పగంధి యాడెడుననుచున్
గలయంగఁ బురములోపలఁ
బొలఁతుక చాటించె దిశలు భోరునఁ గలఁగన్.


క.

చాటించినఁ బైపైఁబడి
మేటీమేటీలు దొరలు మెలఁతలు విటులున్
కోటానుకోట్లు వచ్చిరి
వీటంగలరసికులెల్ల వేడుకఁజూడన్.


సీ.

వావికామధురికాపావకాహళముఖ
                   తుండికాశంఖాదితూర్యవిదులు
డమరుగఝిల్లికాఢక్కుళీమర్దళ
                   ఝల్లరీఝంకారచతురమతులు
చిత్రవీణావిపంచీమత్తకోకిల
                   లావైనకిన్నరలాక్షణికులు

ఘంటికాజయఘంటికాకమ్రఘనతాళ
                   సప్తపద్యాదిప్రస్తారచణులు
సకలవాచాభినయకళాప్రకటనటులు
గాయకులు నంగనలు నాదిగాఁగఁ గలుగు
మేళములవారిఁ గూడి సమేళ మెసఁగ
శంభునగరికి వేంచేసె సంభ్రమమున.


చ.

ఉరమున రత్నకంచుకము నొప్పులపెండెము వజ్రమౌక్తికా
భరణములుం ధరించి చెలిపైఁ గరపల్లవ మల్లఁజేర్చి యా
నిరుపమరంగమధ్యమున నిల్చెను వేడుకఁ బుష్పగంధి తొ
ల్కరిమెఱుపుంబలె న్జనులకన్నులకు న్మిఱుమిట్లు గొల్పుచున్.


వ.

అప్పుడు మల్హణుండు చనుదెంచి యప్పుష్పగంధి నాట్యంబు చూచుచుండె నవ్వైశ్యుండు నొక్కయెడం గనుంగొనుచుండె; నయ్యవసరంబున.

సీ.

శ్రుతులకు నింపుగా శ్రుతికదంబము చేసి
                   లీలనారావముల్ మేళవించి
మంద్రమధ్యమతారమానంబు లడరంగ
                   గమకించి నిఖిలఠాయములు ముట్టి
షాడవౌడవశుద్ధసంకీర్ణములు చూపి
                   వివిధరాగంబులు వేళ నెఱపి
యాహతప్రత్యాహతాదులు సమకొల్పి
                   స్థానమానంబులు సరణి నిల్పి
తాళ మడరంగ నర్థంబు దప్పకుండ
నొప్పి రంజిల్ల రసములు నుప్పతిల్ల
వరుస లేర్పడ నన్నింట వన్నెగలుగఁ
జతురగతులను బాడంగ శంభు నెదుర.


వ.

నిలిచి పుష్పాంజలు లిచ్చి ముఖచాతుర్యంబులు నటించి మలహణుతోటి కూటమియె జన్మసహస్రంబులకుఁ గలుగజేయుమని యంతర్గతంబునం దలంచి మ్రొక్కుచు.


ఉ.

ఇందుధరుండు మెచ్చఁ దరళేక్షణ పుష్పసుగంధి సల్పె వే

డ్కం దగునృత్యముల్ మురజకాహళమర్దళడిండిమధ్వనుల్
గ్రందుగ నెల్లవారలకుఁ గౌతుకమీనఁ బదాంబుజద్వయం
బందెలు గల్లుగల్లన విటావలిగుండెలు జల్లుజల్లనన్.


సీ.

చారణబాగడచర్చరీబహురూప
                   దండలాసాదికభాండికములు
కందుకకోలాటకానాట్యతాసఖ
                   ప్రేరణకుండలిప్రేక్షణములు
సూతముల్ పుహుఁడకశుద్ధపద్ధతి చిత్ర
                   పద్ధతి ఘనదేశపద్ధతులును
కైలాటలంబకకరణైకతాళికో
                   లాసాదిగీతహల్లీసకములు
నాదిగా గల్గు నృత్యనృత్యైకముఖ్య
నాట్యవిధములు సూచించి నయమెలర్ప
జనులకెల్లను లోచనోత్సవము గాఁగ
నాడె నాయిందుముఖి కొనియాడె జగము.

వ.

ఇట్లు పుష్పసుగంధి నృత్యంబు సల్పుటయు నద్దేవదేవుస్థానికులు దొరలు పౌరలు కనకాంబరాదు లపరిమితంబుగాఁ గట్టనిచ్చిన మేళంబులవారుం దానును నందుకొనుచు నుత్సాహంబున మదనసేన నిజనివాసంబున కరిగినఁ దక్కినవారలు యధేచ్ఛం జనిరి. మలహణుం డప్పుష్పగంధిహృదయంబుఁ దెలియం దలంచి యద్దేవదేవుని యుద్యానవనప్రాంతంబునఁ బథంబుఁ గాచుకొని కనుమఱుఁగున నుండె నప్పుష్పసుగంధి మలహణుం జూచువేడ్క భానుమతియనుచెలియుం దానును నొక్కవటవిటపిప్రదేశంబున నిలిచి నిట్టూర్పు నిగుడించుచుఁ దమకులంబు నిందించుచు దుఃఖావేశంబున నిట్లనియె.


క.

ఎఱుకలు మాలిన యేభ్యపు
మొఱకులు గడునొసఁగుదానములు నతికష్టుల్
పఱిచిన పాటులఁ బడిపడి
నరమగువేశ్యలకు వేఱునరకము గలదే.

క.

డొల్లంబొట్టయు వంకర
కాళ్ళును బెనుగౌలుఁబెలుచఁగలధనదత్తుం
జెల్లంబో కని యెవ్వరు
నుల్లంబున నోకిలించకుందురె చెపుమా.


క.

నే నెక్కడ తా నెక్కడ
నానోముఫలంబుగాక నాకుం దనకున్
మానుగఁ బొందిక లీడా
ప్రాణసఖీ, యింతకంటెఁ బాపము గలదే.


ఉ.

వేయును నేల నామనసు వేడుక మల్హణుమీఁదఁ గాని యో
తోయజగంధి, యన్యునెడఁ దూకొని రోయుచునుండు నందన
చ్ఛాయలఁ గల్పకప్రసవసౌరభ మానుచుఁ జొక్కి మక్కువం
బాయనితేఁటి హేయమగు ప్రబ్బలిపూవుల కాససేయునే.


క.

తొలిఁదొలిఁ గోమటిముఱికిం
గలిసిన నరకాబ్ధిఁ గూలఁగలుగుట కాదే

చెలియా, పిలుచుకరమ్మా
మలహణుముఖమైనఁ జూతు మనసారంగన్.


వ.

అనుటయుఁ దత్ప్రాంతంబుననున్న మలహణుండు చిఱునవ్వు నవ్వుచు నరుగుదెంచి నిల్చినంజూచి పుష్పగంధి యతనిదుప్పటిచెఱంగుఁ గరంబునం జుట్టి పట్టుకొని యిట్లనియె.


క.

ఇందడవు నెందు నుండితి
విందుముఖుల్ రాఁగఁ జూడ నేఁగితివో నే
నిందరసి నిన్నుఁ గానక
కుందఁగ మది నీవు డాఁగికొనఁదగవగునే?


వ.

అనిన నమ్మలహణుం డిట్లనియె.


ఉ.

ఓ చపలాక్షి, యోయబల, యోయలికుంతల, నీకుఁగానె నేఁ
గాచుకయున్నవాఁడ నిదె కౌఁగిటిలో నను గారవించవే
పూచినమావిమోకకడఁ బొంచుక మర్మము లంట నేయుచున్

యేచిన పంచసాయకుని యిమ్ము దొఱంగదు కంటె దూరగన్.


సీ.

కలకంఠకంఠి, నీ కన్నులు చాలవే
                   యవలీల భువనత్రయంబు గెలువ
పద్మాయతాక్షి, నీపలుకులు చాలవే
                   సరసులహృదయంబుఁ జల్లఁజేయ
కాంతాలలామ, నీకన్నులు చాలవే
                   దేవేంద్రభోగంబు ధిక్కరింప
కిసలయపాణి, నీకెమ్మోవి చాలదే
                   నయమునఁ బ్రాణదానంబు సేయ
నాతి, నీపొందు చాలదే నాకు నిపుడు
నంచితానందసౌఖ్యంబు లందఁజేయ
నితరకృత్యంబు లెవ్వియు నేల నాకు
నిన్నుఁ జూచుట చాలదె నెలఁత, యనిన.


క.

రమ్మా మలహణ, తగునా
యిమ్ముల నను నెరవుచేసి యిట్లాడంగా
నెమ్మనమును బ్రాణంబును
నిమ్ముగ నీసొమ్ముఁ జేయు టెఱిఁగియు మఱియున్.

ఉ.

ఎవ్వరు చూతురో యనక యెవ్వరు తల్లికి విన్నవింతురో
యెవ్వరు తప్పనాడుదురొ యీపనికంచుఁ దలంక కెంతయున్
మవ్వమెలర్పఁ గౌఁగిటను మల్హణునిం గదియించి యాత్మలో
నెవ్వగమాన మోవిచవి యిచ్చుచుఁ బుష్పసుగంధి యర్మిలిన్.


చ.

చెలి నెడగాఁగ నిల్వుమని చేరువనున్న లతాగృహంబులో
పలికిని గొంచుఁబోయి తనప్రాణవిభున్ వనదేవతాంగనల్
సలలితమంగళాక్షతలు చల్లుచు దీవన లిచ్చుభంగి మౌ
ళులఁ బడుపుష్పకేసరములున్ బికరావము లింపొనర్పగన్.


క.

గొజ్జగిపూఁబొదరింటను
సజ్జకమగు విరులసెజ్జ సంతసమొదవన్

లజ్జావతి ప్రాణేశ్వరు
హృజ్జనితవినోదకేళి కెంతయుఁ దార్చెన్.


చ.

కరమణికంకణక్వణము కంఠరవంబులు కాంచికాసము
త్కరమణికింకిణిధ్వని పదద్వయనూపురరావ మింపగా
సురతనవీనతాండవముఁ జూచిఁ మరుండనునొజ్జ వ్రేయు పెన్
దరువన వేణివీపునను దార్కొనె నాట్యపుబొమ్మయో యనన్.


గీ.

యువతిసురతవేళ నొప్పె జన్నులకును
మోమునకును నడుమ మురియుసరులు
చంద్రచంద్రవాకసమరంబు వారింప
నడ్డగించు తారకాళి యనఁగ.


చ.

అనువుల నైనదప్పు లధరామృతపూరముచేత నార్చుచున్
గినుకలు నింపులుం బెరుఁగఁ గ్రిందటమీఁదటలై యధేచ్ఛలన్

దనియక యింతియుం బతియుఁ దర్పకకేళి సుఖించి రర్మిలి
నెనుబదినార్గుబంధముల నించుకయించుకఁవేడ్కఁ జూపుచున్.


సీ.

అంగుష్ఠ మఱకాలు నధరమండయుఁబిక్క
                   చిఱుదొడయును గటి చెలఁగునాభి
చనుముక్కు వక్షంబు నునుగళంబును జెక్కు
                   నెమ్మోవి కనురెప్ప నెరులు శిరము
శుక్లపక్షంబున సొరిదిమై నెక్కించి
                   బహుళపక్షంబునఁ బరగ దించి
పెనఁచి పట్టియు నెత్తి చెనకి రాఁ జికిలించి
                   కదిమియు నలమియుఁ గరఁచి నొక్కి
త్రిప్పి యాని మోవి తీసియు వేసియు
ననఁగఁ బరగుచున్న యతిరహస్య
మదనతంత్రవిధుల మానినిఁ జొక్కించి
మలహణుండు చొక్కె మక్కువలర.


గీ.

గండభేరుండపక్షిసంగతి దలిర్ప
నిఱియఁ బెనఁకువ సం దొకయింత లేక

మేను లొక్కటియై మోము కానరాఁగ
నలసి నిద్రించి రింతియు నవ్విభుండు.


ఉ.

పల్లవపాణికిం బతికి భావజకేళిప్రరిశ్రమంబులోఁ
జల్లగఁ జల్లగాడ్పు వెదచల్లఁదొడంగె రసాలవల్లరీ
తల్లజకేతకీక్రముకతామరసాంబుపటీరపాటలీ
హల్లకమల్లికావకుళహాళిసగంధసుగంధవాసనల్.


చ.

ఇరువురు నిద్ర మేలుకొని యించుక సేదలుదేఱి వెండియున్
సురతవినోదకౌతుకము చూడ్కులఁగ్రమ్మగఁ జుంబనాదులన్
బరిపరిరంభణంబుల నవారణఁ దీరనియట్టి కాంక్షలున్
పరిపరిలాగులున్ గలయఁ బైకొని వేడుకఁగూడియున్నెడన్.

క.

వెలినుండి యవ్విలాసిని
తలఁకుచుఁ బఱతెంచి యింతతడ విటునిలువన్
మలహణ, తగునా యనుటయు
వెలఁదుకయును దాను నచట వీడ్కొనియంతన్.


క.

అడుగిడుచు మగుడిచూచుచు
నడు గామడగాఁగనలసి యటఁ దొట్రిలుచున్
వడి, నీళ్ళ కెదురు నడిచిన
వడువున నెడఁబాసి చనిరి వనితయుఁ బతియున్.


వ.

ఇట్టు లిరువురు నిజనివాసంబులకుం జని తమ కలయుతెఱం గేరికిఁ దెలివిపడకుండునట్లుగా మజ్జనభోజనంబులు దీర్చి యెప్పటియట్ల యుండి రంత.


ఉ.

గందపుబొట్టు వీడియముఁ గచ్చలపాగయుఁ గావిదుప్పటిన్
సందులఁ బూసలున్ జెవులచాటున నీలపుదంటపోగులున్
గందినయట్టి వెండిమొలకట్టును నీలపుటుంగరంబులున్

బొందవు కిఱ్ఱుచెప్పులునుఁ బొల్పెసఁగన్ ధనదత్తుఁ డెంతయున్.


క.

కోమటిజాణలు కొందఱు
వేమాఱును బాడుకొనుచు వెనువెంటను రాఁ
బ్రేమమున నరిగెఁ బిల్లల
తో ముదిపందియునుబోలె దుస్సహలీలన్.


ఉ.

వచ్చినకూర్మియల్లునికి వంచనలేక నివాళు లిచ్చి లో
నచ్చెరువున్ ముదంబుఁ దొలుకాడఁగ గొజ్జఁగినీట బాదముల్
మచ్చిక దూతిక ల్గడుగ మన్ననదోపఁగ మేల్మిపీఠముల్
మెచ్చఁగనుంచి యందఱసమేళముతోఁ బ్రియమారఁ జూచుచున్.


గీ.

కప్పురపువీడియంబును గైరవళ్ళు
పరిమళంబులు గంధపుష్పములు నొసఁగి
వదన మించుకయెత్తి యమ్మదనసేన
పలికె ధనదత్తుతోడ నుత్కలిక యెసఁగ.

క.

ఏకోర్కులు మదిఁ గోరితి
మాకోర్కులె కన్నుదనియ నంపితి వకటా
నీకున్ బ్రతి యిఁక నేఁడీ
మాకున్ దె........................................


ఉ.

ఇచ్చితిఁ బుష్పగంధిఁ దరళేక్షణఁ జక్కని పుష్పకోమలిన్
బచ్చనివిల్తుకేళి నిఁకఁ బాయకకూడి సుఖింతుగాక పెం
పచ్చుపడంగఁ బౌరజను లందఱు నచ్చెరువందఁ గోరికల్
పెచ్చుగ నెచ్చరింప మదిఁ బేర్చి యఖండితవైభవోన్నతిన్.


సీ.

పగడంపుఁగంబాల పచ్చటోవరియును
                   నపరంజికాళంజి యలరుఁ బాన్పు
బంగారుసకినెల పట్టెమంచంబును
                   వజ్రాల నునుజాలవల్లికయును
కుంకుమతలగడ గొజ్జంగిపూఁదెఱల్
                   తరమైన చంద్రకాంతంపుగిండి

చౌసీతిరతముల నవరని మేల్కట్లు
                   దీపించు మాణిక్యదీపకళిక
పొసఁగఁ గస్తూరివేది కప్పురపుసురటి
నిలువుటద్దంబు రత్నంపుటెత్తుపలక(నెత్తపలుక)
తళుకు దంతపుబాగాలు(బావలు) కలికిచిలుక
గలిగి యొప్పారుచవికలోపలికి నపుడు.


క.

అల్లుం గూఁతుం బదఁడని
యల్లనఁ దత్పరిజనంబు నంపుచుఁ బలికెన్
మెల్లనఁ జల్లనిమాటల
నుల్లము రంజిల్లఁ గరుణయును వట్రిల్లన్.


క.

రసికులరు మీర లన్నిట
పసినిసు విది యెఱుఁగఁజెప్పి పనిగొనుఁ డేమే
విసువక తుమ్మెద యరవిరి
కసుగందయుండ రసముఁ గైకొనుభంగిన్.


వ.

............యతనిం జవికలోపలికిం బొమ్మని విలాసిని భానుమతి మొదలైన చెలికత్తియలం గూర్చి పుష్పగంధినుండుమని మదనసేన యభ్యంతరగృహంబునకుం జనియె నంత.

క.

పెనుగంబంబున కేనుం
గును దార్చినరీతి ఱాయి గుడిమీఁదికి నొ
య్యన నడుపు భంగి సకియలు
వనితామణి.............వైశ్యునికడకున్.


క.

చని వాని పట్టెమంచము
కునుసం గూర్చుండి లోనఁ గుందుచుఁ జెలులం
బనులనెపంబున నొయ్యనఁ
గనుసన్నలఁ జీరుకొనుచుఁ గనలుచు నంతన్.


ఉ.

చూచెను వాని నయ్యబల చూపుల వాకొలుపం బిశాచమున్
జూచినయట్లు మర్కటముఁ జూచినపోలిక గొల్లకేతనిన్
జూచిన .............ముఁ జూచినకైవడి దుర్నిమిత్తముల్
చూచినలీల హేయమును జూచినమాడ్కిని జూచి రోయుచున్.


చ.

కటకట! పార్వతీరమణ, కంతుమదాపహ, భక్తలోల, నీ

కిటు తగునయ్య, నాదు హృదయేశ్వరు మల్హణు భావ మిమ్మిది
స్ఫుటగతిఁ దొంటిజన్మమునఁ బూజయొనర్పక యుంటినో సుమీ,
.............................బడద్రోచితి నన్ దయలేనివాఁడవై.


క.

కలుషాత్ముల నతికష్టులఁ
గలవారలఁ జేసి రూపగాంభీర్యదయా
కలితులఁ బేదలఁ జేసెడి
పలుమరువుగఁ బెట్ట నీకుఁ బాడియె రుద్రా!


క.

ధనదత్తుఁ డగుట వానికి
నను నమ్మును మదనసేన నయనిధికి మహా
ఘనకీర్తికి మలహణునకు
ధనమీయక పెద్దసేయఁ దరమె మహేశా.


క.

........................లూరక
సునిశితముగ నతని నింత చూచితి వయ్యో,
ధనదత్తుపాటి చేయఁడె
మనసిజహర, మల్హణుండు మది నీ కెన్నన్.


క.

పగఁబాయమిఁ దగుతాలిమి
మగవారును నాఁడువారు మము నెన్నంగా
నగుబాటుగఁ బెడఁబాపితి
దగవా పగవారిఁగూడ దైవమ, నీకున్.


క.

...................................
వనితామణి విరహవహ్ని వారింపను నే
యనువును లేకయ్యెడ శం
భుని పదపద్మములఁ బ్రొద్దువుచ్చుచునుండెన్.


క.

అట్టియెడన్ ధనదత్తుఁడు
చిట్టకముల నబలమీఁదఁ జేసాఁచి మదిన్
బట్టుఁగఁ దలఁచినఁ బట్టీ
కిట్టౌటనొ యిట్లుపట్ట నేటికి ననుచున్.


వ.

ఉన్నయెడ నమ్మల్హణుండు తనసఖుండగు సుశీలుండును దాను నప్పుడు తననిజాచార్యుండైన విద్యానిధికడ కేఁగి నమస్కరించిన నయ్యాచార్యుండు నతనిం గనుంగొని యిట్లనియె.


క.

ఇది యేమి నేఁడు మల్హణ
వదనాబ్జము సొంపుదక్కి వసివాడి కడున్

విన్నవోవుచు
వెదవడియున్నాఁడ వింతయేటికి ననినన్.


క.

తలిదండ్రులు నిను నేమేఁ
బలికిరొ పురజనులు ............ యెడన్
గలిగెనొ నీరసమేనియు
నలపుష్పసుగంధి సేమమైయున్నదియో?


క.

కనుఁగొనము మూఁడునాలుగు
దినమునుండియును జదువఁదీఱదొ వేఱే
పని యేమేనుఁ గలిగెనొ
వనిత న్నినుఁగూడి చదువవల దన్నదియో?


క.

గుణవంతుఁడ వన్నింటను
గణనకు నెక్కితివి రూపకలితుఁడవు సుధీ
మణివి ...................భూ
షణుఁడవు మద్భక్తినిధివి చనునే యనినన్.


క.

ఏనేరము నెవ్వరియెడఁ
గానము గురునాధ, నీదు కారుణ్యముచే
నీ నిఖిలము ననుకూలమె
యానెలఁతుకయందుఁ గాన మపకృతి యెందున్.

వ.

అని మలహణుండు సుశీలుమొగంబుఁ జూచిన నతం డిట్లనియె.


చ.

మలహణపుష్పగంధులు క్రమంబునఁ గూడి చరింప భూజనుల్
కలయవి లేనివిం బలుకఁగా విని యందఱఁ జాల దూఱి యా
వెలఁదుకతల్లి యల్గి యిలు వెళ్ళఁగనీయక యొక్క వైశ్యునిన్
గలిగినవానిఁ గూడుకొని కన్నెఱికంబున కుంచె నచ్చెలిన్.


క.

అది కారణముగ మలహణు
హృదయము విహ్వలతఁ జెంది యిట్లయ్యె ననన్
మదిఁ గంది పల్కె నాయన
ముదితలుగా రోటు దుఃఖమూలము లనుచున్.


సీ.

పణ్యాంగనారతిఁ బాకుండుటఁ జేసి
                   మధుపానగోష్ఠికి మనసుపెట్టు
మధుపానసుఖముచే మరగి మాంసమునకై
                   వేఁటపైఁ జిత్తంబు విడియఁజేయు

వేఁటపైఁ జిత్తంబు విడియ ధూర్తులతోడ
                   నర్థాశ జూదంబు లాడఁజొచ్చు
ననిశంబు జూదంబు లాడుచుఁ దనయిచ్చఁ
                   దోడ్తోన చేయును దుర్వ్యయంబు
దుర్వ్యయుం డయి పరుసంబు దొనరఁ బలుకు
పలికి యంతటఁ బరదండనలకుఁ జొచ్చు
గాన వ్యసనంబునకు నాదికారణంబు
తలఁచి చూడంగ వారకాంతారతంబు.


  •                        *                       *                       *                       *


క.

నడవగవలెఁ దగునడవడిఁ
దడయక సంసారియైనఁ; దా నటు గాఁడేఁ
బడిసెట్లనె కూడగవలెఁ
గడగానక వేశ్యలిండ్లఁ గడతేరుటకున్.


  •                        *                       *                       *                       *


క.

సురపతియును జందురుఁడును
బరకాంతలఁ గోరి కాదె పనిచెడి దోషా
కరులై యపకీర్తులఁ బడి
వరుసలు చెడి రందు రెల్లవారలు నవ్వన్.

చ.

అరయఁగ మానహాని ధనహాని సమంచితకీర్తిహానియున్
బరమవివేకహానియును బాంధవహానియుఁ బ్రాణహానియున్
సురుచిరపుణ్యహనియును జొప్పడునెప్పుడుఁ దప్పకుండఁగా
బరసతిగోరువారలకుఁ బల్మఱు నెంతటివారి కేనియున్.


క.

పరనారీసంగమసుఖ
మరనిముసము పరధనాపహరణమున నిజో
దరపూర్తి గొన్నిదినములు
నరునకుఁ గల్పోపభోగనరకము దీనన్.


క.

తొత్తులఁ దగిలినవారికి
నెత్తుచెడున్ శ్రీలు చెంద వేకాలంబున్
హత్తదు మోక్షము మఱి వి
చ్ఛిత్తులగున్ మంత్రతంత్రసిద్ధులు మిగులన్.


చ.

మునివరుఁడైన ఱేపకడ ముండమొకం బొకయింత చూచినన్

మునుఁగును బాతకంబులను ముట్టినమాత్రన పోవుఁ బుణ్యముల్
పనివడి దానియూర్పుపయిఁ బాఱిన నాయువణంగు దానికా
ల్గనఁగ నొకింత దాఁకినను గాంచును జెట్ట సురేంద్రుఁ డేనియున్.


క.

ఎన్నివ్రతంబులు సల్పిన
నెన్నియుపాసంబు లున్న నిలఁ దీర్థంబుల్
యెన్నేనాడినఁ గానీ
కన్నను దోషంబు విధవఁ గలలో నైనన్.


క.

తోషింప నిజకుటుంబముఁ
బోషించుచు నతిథిపూజఁ బూన్చుచు గరుణా
న్వేషుండగు పుణ్యంబున
కీషన్మాత్రంబు సరియె యెన్నేఁగ్రతువుల్.


క.

కులసతి శిశువులుఁ దానున్
దలమొలకును లేక నలిగి దైన్యపడంగాఁ
దలఁపకయుండినదోషము
కులకోటుల నరకమునను గొని మునిఁగించున్.

క.

తావలవకున్న సౌఖ్యం
బేవలనను లేదు వలచెనే దుఃఖంబౌ
కావున నన్యస్త్రీరతి
యీవసుమతిఁ గూడదందు రెఱిఁగినజాణల్.


గీ.

పగట నుపవాసదినమునఁ బర్వతిథుల
సంధ్యలను గాదు రతిసల్ప సజ్జనులకుఁ
బాయు నాయువు పగఱచే భంగమొందుఁ
దలఁగు సంపద దుష్టసంతతి జనించు.


క.

అతిసురతము రోగప్రద
మతిమోహము సకలహాని యగు నీరెండున్
కతిపయదినముల నరునికి
నతికష్టముఁ జేయునందు రాయుర్వేదుల్.


వ.

అనుసమయంబున భద్రదత్తకూచిమారపాంచాలాదులు, విటవిదూషకప్రేష్యనాగరకాదులుఁ జనుదెంచినఁ గూర్చుండుమని విద్యానిధి పాంచాలునిం జూచి మదనతంత్రంబులు మీ రెఱుంగనివి లేవు; స్త్రీపురుషులకు జాతిలక్షణం

బును, దదీయానుకూలనిర్ణయంబులును నెఱింగింపుమనిన నతం డిట్లనియె.


సీ.

మొదలఁ గళాస్థానములు దుష్టతిథులును
                   జాతిభేదంబులు సత్త్వములును
ద్రవనిర్ణయంబులు బంధవిశేషచాతురి
                   దతియుఁగాలము వయోధర్మములును
నెఱతనంబులును యోనిప్రమాణంబులు
                   వలపు లొల్లములును గలయు తెఱఁగు
నింపులు ననురాగహేతువుల్ పరిరంభ
                   ణము లుత్తమాధమనాయకులును
మదనపంచాంగమును యంత్రమంత్రతంత్ర
విధులు వశ్యౌషధక్రియల్ వెరవు లెఱిఁగి
కలిసిరేనియుఁ గూరిమి నిలుచు టరిది
వారిజాక్షుల గెల్వ నెవ్వరికి వశము?


వ.

అయినను నే నెఱింగినతెఱంగున విన్నవించెద నాకర్ణింపుము.


సీ.

తనువుమార్దవమును మనసుచాంచల్యంబు
                   తనివిదీఱమియుఁ జిత్తినికి నమరు

ఘనకుచద్వయంబు కఠినాంగకములును
                   దృఢమగురతియు హస్తినికి నమరు
యిఱిగుబ్బచన్నులు నిఱుపేదకౌనును
                   గినుకయు నరయ శంఖినికిఁ దొరయు
సరసంపుఁజేతలు చతురసంభాషణల్
                   మృదువర్తనములు పద్మినికిఁ మెఱయు
మధువువాసనయును గరిమదముకంపు
నింపుగంధంబు వికచపద్మంపుఁదావి
వలచు వలరసమలరు పల్వరుసతోడ
నండ్రు కామకళావేదు లఖిలవంద్య!


సీ.

కన్నులు ద్రిప్పుచు వన్నెలు పచరించు
                   రూపుఁ జూపుచును భద్రుండు దిరుగు
నెదిరియిం పెఱుఁగక యీవి యెంతేనిచ్చి
                   తనయిచ్చ నెపుడు దత్తకుఁడు దిరుగు
మందుమంత్రంబులు మాయలు పచరించి
                   ఖండించి కూచిమారుండు తిరుగు
మనసులు గరఁగించి మర్మజ్ఞుఁడై రతిఁ
                   దేలించు సతులఁ బాంచాలుఁ డెపుడు

భద్రకుఁడు సూవె చిత్తినిప్రాణవిభుఁడు
హస్తినికి దత్తకుఁడు మనోహరుఁడు మిగులఁ
కూచిమారుండు శంఖిని కూర్చుప్రియుఁడుఁ
జాలఁ బద్మిని మెచ్చుఁ బాంచాలుఁ డెపుడు.


క.

లోలల భద్రకువిధమున
బాలలఁ బాంచాలురీతిఁ బ్రౌఢల నెల్లన్
జాలఁగ దత్తకుగతి జవ
రాలిందగఁ గూచిమారరమణుఁడు గవయున్.


సీ.

పరకాంత గూడని పతి యనుకూలుండు
                   తరుణికి మొఱఁగునేఁ బొరి శఠుండు
దక్షిణుం డాత్మ నందఱి సరిగాఁజూచు
                   నపరాధి యయ్యుఁ గీడాడు ధృష్టు
విటుఁడు వేశ్యలయిండ్లు వెదకిక్రుమ్మఱుచుండు
                   మతసేవకుఁడు పీఠమర్దకుండు
నాగరకుఁడు పరస్త్రీగమనాపేక్షి
                   యలవిదూషకుఁ డపహాస్యకారి
అరయ సారిక పతి కెనయైన బోటి
చతురభాషలఁ జతురిక చాలప్రోడ

సతులఁ బతులను గూర్ప సంచారనిపుణ
తిరుగు నే పనులకును దూతిక ధరిత్రి.


సీ.

బాలయయ్యును గళాప్రౌఢి చూపువిదగ్ధ
                   యొకపాటియెఱుకమై నుండు మధ్య
యౌవనంబున నుండి యతిమూఢ యగుముగ్ధ
                   పరుషంబు లాడెడు పడఁతి పరుష
యంటైన గరఁగెడు నంగనామణి శ్లథ
                   ఘనయనుసతి యతికఠినగాత్రి
యలిగి కీడ్పడకుండునట్టికోమలి ధీర
                   పతిభక్తి గలిగిన సతి స్వకీయ
జార పరకీయ యనియెడు చపలనేత్రి
విత్తమంతయు లోఁగొని వెడలఁద్రోయు
................................................
వారకాంతాలలామసాధారణాఖ్య.


సీ.

ఆచారధీసుగుణాన్విత మునిసత్వ
                   నలి నిద్దురయె కోరు నాగసత్వ
భూతసత్వయు నెందుఁ బొందదు సంతుష్టి
                   జడమలినాంగి పిశాచసత్వ
గంధర్వసత్వ చక్కనిది పాడఁగ నేర్చుఁ
                   దలఁక దేపనులకు దైత్యసత్వ

శృంగారవతి కోమలాంగి కిన్నరసత్వ
                   యధిపుఁ బోషించును యక్షసత్వ
జడతతో నుండు సతి విప్రజాతి దరయ
నధికరాజస నృపజాతి యగులతాంగి
విసుగు గను వైశ్యజాతి సాధ్వీలలామ
చతురయగు నన్నిటను శూద్రజాతిలలన.


సీ.

స్వాధీనపతిక నిజాధీశు వశునిగా
                   మెలుపంగ నేర్చిన మీననయన
వాసకసజ్జిక వరునిరాకకు మేను
                   నిల్లు శృంగారించు నిందువదన
పరకాంతఁ గలసిన పతిచిహ్నములు జూచి
                   వగచు ఖండితయను వనజగంధి
రమణుండు వేళకు రాకున్నఁ బొగిలెడు
                   నది విరహోత్కంఠయను లతాంగి
యొరలుఁ బ్రోషిత ధవుఁ డెడయున్న పతికి
నలరుఁ గలహంతరిత నాధు నలిగి త్రోచి
వేగుఁ బతి నిచ్చఁగానక విప్రలబ్ధ
మఱవ కభిసారికాఖ్య గ్రుమ్మరును నిచ్చ.


  • *  * * *

క.

ఏటికి మందులు మాయలు
నేటికి ద్రవ్యంబు జాతు లింతులమనసుల్
నాటుకొన విభుఁడు చల్లని
మాటలఁ గరఁగించి కలయు మత మదియైనన్.


క.

మన సెఱిఁగి బాహ్యరతులను
బెనుపుచుఁ జోఁకోర్చి యింపు బెరయఁగ నెపుడున్
దనసుఖము దలఁపకుండెడు
మనుజునిఁ బాయంగఁగలరె మగువలు జగతిన్.


సీ.

మృదుమార్గమునఁ గాదె కొదలేక గాడ్పులు
                   చొరరానిచోటులఁ జొచ్చి విడుచు
మృదుమార్గమునఁ గాదె నదనదీజలములు
                   కొండలఁ దెగఁబాఱి క్రుంగఁజేయు
మృదుమార్గమునఁ గాదె యద నెఱింగి మిళింద
                   మలరులతేనియ లపహరించు
మృదుమార్గమునఁ గాదె యది చంద్రచంద్రిక
                   మేలైనపటికంపుఱాఁలు గరఁచుఁ
గాన మృదురీతి మెలఁగెడు మానవుండు
యంగనాచిత్తవృత్తుల లొంగఁగొనును

నఖిలకార్యంబులును వానిహస్తగతము
లెన్ని చూచిన సంశయ మింత లేదు.


వ.

అని పాంచాలుండు పలికినఁ గూచిమారుం డిట్లనియె.


క.

ఒడ లలయించుక యూరక
బడలంగా నేమి తమకుఁ బ్రాభవ మయ్యెన్
గెడగూడి సతులమాయలు
నుడుగక లోఁబడఁగఁ జేయు టుచితము దలపన్.


క.

తిలకంబు వాలు మందును
దలముడి బాసటము బోలు తప్పులు నేర్పుల్
గలమావటీని విధమున
జెలఁగక మఱి వారసతులఁ జెనకఁగ వశమే.


సీ.

అడవులఁ జరియించు హరిణశాబకములు
                   మరపినఁ దిరుగవే నరులవెంట
నెట్టనవాకట్టి పెట్టెలఁ బెట్టిన
                   నుండవే ఘోరవిషోరగములు
వెరవున నొయ్యనఁ గఱపినపలుకులు
                   పలుకవే పక్షులు ప్రతిభతోడ

యంత్రక్రియాయుక్తి నందంద జనుల కు
                   జ్జ్వలతప్తలోహముల్ చల్లగావె
తా రెఱుంగకున్నఁ దగవౌనె మందులు
మంత్రములును సురతమాయ లౌట
వనితలకును లేవె వశ్యౌషధక్రియల్
విటులు వలెనటంచు వెదకిరేని.


వ.

ఆమాటలకు భద్రకుం డిట్లనియె.


క.

సుడిగొనెడు నోటిముఱికియు
నుడుగక బలుగౌలు వలచునొడలుంగల యా
బడుగును గనుఁగొని నంతనె
పొడకట్టక వెఱచిపోవు భూతములైనన్.


క.

గరగరనై యెల్లప్పుడుఁ
బరిమళముల ప్రోఁకయగుచుఁ బైవంచనతో
నరవిరి బాగునఁ దిరిగెడు
బురుషులఁ బాయంగఁగలరె పొలఁతులు జగతిన్.


క.

తలవలువలు పులుమాయక
యెలమిమెయి న్నాఁడునాఁటి కిగురొత్తంగా

మెలగెఁడు పురుషునిఁ జూచిన
నిలుచుక యాదృష్టి యెట్టినెలఁతుక కైనన్.


గీ.

చివ్వగుణము విడిచి చిలుకెఱ్ఱతరితీపు
గానిపించుగాలగాని రీతి
తెరవతలఁపు మచ్చ మెఱిఁగి యల్లనఁ దీయ
నేరకున్న యతఁడు నీరసుండు.


వ.

కావునఁ గూరిమిసతులకు నలంకారంబు మూలంబని భద్రుండు పల్కుటయు దత్తకుం డిట్లనియె.


గీ.

రమణి దనయిచ్చ గలయు టెంతయునులెస్స
దాన సౌఖ్యంబుఁ దలఁచుట గాని త్రోవ
చెఱకు నలినలిగాఁగను గొఱికి రసము
క్రోలుజాడల వెలయింపఁ గోర్కు లలరు.


క.

వదనమున నమృతరసమును
హృదయంబున విషము నునిచె నింతులకు నజుం
డదిగాదె యధర మానుచు
హృదయము తాడన మొనర్తు రెఱిఁగినజాణల్.

క.

ఉల్లివలెఁ బెక్కుపొరలై
నల్లివలెన్ నిద్రఁ జెఱిచి నమ్మిన దాఁకన్
బిల్లివలెఁ గాళ్ళఁ బెనఁగుచు
వెల్లివలెన్ గడవఁబాఱు వేశ్య ధరిత్రిన్.


గీ.

రణములో దేజినెక్కడు రౌతుఁబోలి
యతివ మరుపోరఁ బెల్లార్చి యంటవ్రేసి
కలయనేర్చిన గోర్కులు గలయుఁదాక
యూరకేలబ్బు మదనసాయుజ్యపదవి.


క.

కూరిమి దన మదిఁ గలిగిన
నేరము లెంచంగవలదు నెలఁతలవలనన్
తోరవు దిరిసెననూనెన్
సారపు దేనియలు తేలు చవిగొనునెడలన్.


క.

ధన మీయగవలయుఁ దొలిఁ దొలి
జన వీయఁగవలయుఁబిదప సరసులు ధరలో
ధనమును జనవును వెలిగా
వనితల లోఁగొనఁగ వశమె వనజజుకైనన్.


క.

లోభాత్ము నొల్ల రతివలు
లోభాత్మునిఁ జేరరెందు లోకులు ధరలో

లోభాత్ముఁ డుడుగు ధర్మము
లోభం బపకీర్తి నరుని రోఁబడఁ జేయున్.


క.

ఆకులవ్రాఁతలు నమ్మక
కోకలు రూకలును వెలిగఁ గూర్తు రటంచున్
గీకలకు వచ్చువిటుగని
కూకులువ(న)త్తులును గోవె గొంతుల మననుల్.


వ.

అని దత్తకుండు పలికిన విటుం డిట్లనియె.


క.

కులసతి సంతానార్థము
నిల దాసీసంగమంబు హీనము పరకాం
తలు హానియనుచుఁ గాదే
వెలయాండ్ర సృజించె నజుఁడు విశ్వములోనన్.


క.

వెఱ పుడిగి యిచ్చవచ్చిన
తెఱఁగునఁ గలయంగఁవచ్చు ధృతి వారస్త్రీ
చెఱకు నడు మనిన నందున్
గొఱఁతయె యది యనుభవించు గుణగణ్యులకున్.


క.

దివిజులకును రంభాదులు
భువిజనులకు వారసతులు భోగాస్పద లీ

యువిదలఁ గూడెడిభాగ్యము
లవిరళపుణ్యులకుఁగాక యబ్బునె తెలియన్.


చ.

క్రతువుల చేసి యాగమనికాయము లభ్యసనం బొనర్చి సు
వ్రతులగు భూసురోత్తము లవారితనిర్జరకామినీకుచో
న్నతపరిరంభసౌఖ్యముల నాసల నీనెడి వారకామినీ
రతిఁ ద్యజియించువారలు తిరస్కృతు లెన్నఁగ ముజ్జగంబులన్.


క.

కలయికము లెఱిగి విటులం
గలయుచు ధనమాన మిగుల గలుఁగక ఘనులన్
ఖలులన్ సరిగాఁ జూడక
మెలఁగెడు వారాంగనలను మెచ్చఁగవలయున్.


క.

అని విటుఁ డాడిన మాటకుఁ
గనలుచు నాగరకుఁ డనియె గటకట నేఁడీ
వినరానిమాట నీచే
వినవలసెన్ వీనులందు వీఱిఁడి భంగిన్.

క.

వాసి చెడు దాసివలనన్
గాసును వీసంబు వేశ్యకతమునఁ బోవున్
దోసంబు విధవ పరసతి
యే సుఖకారిణి యటంచు నింద్రుం డనఁడా.


క.

మగనికి వెఱవక యింటికిఁ
దగఁ దానె కర్త యగుచుఁ దత్పరవృత్తిన్
వగ గలదై వెలిఁ దిరిగెడు
మగువం గెడగూడువాఁడు మదనుఁడు గాఁడే.


క.

విను వింతలైన సౌఖ్యము
లను బొందుచు నెపుడు వేడ్కలను దనియుచుఁ దా
ననువరియై పను లెడపుచుఁ
గని తిరిగిన నేమి బ్రాతి కామ్యార్థంబుల్.


వ.

అనిన విదూషకుం డిట్లనియె.


గీ.

తొత్తువలనఁ బోవు దొరతనం బంతయు
వేశ్యవలన నర్థవితతి యణఁగుఁ
బరవధూటివలనఁ బ్రాణంబుపై వచ్చు
విధవఁ బొంద మేలు విరహులకును.


  •                        *                       *                       *                       *

గీ.

అనిన నడ్డగించి యౌనొ విదూషక,
తగును మెచ్చ నీకుఁ దగినవారి
దొరవు చాలుఁజాలు దొలఁగుమంచు నదల్చు
కొనుచు పీఠమర్దకుండు పలికె.


క.

వాసికిని వేశ్య బొందిన
గాసులు చేదిగును సుగతి గలుగకపోవున్
మీసాలమీఁది తేనియ
దాసియకా కితరజనులఁ దలఁపఁగనేలా.


క.

వీడియ మడుగదు గుద్దుల
కోడదు గాఢంపురతుల కులుకదు కలలోఁ
జూడదు గరగరికలు మఱి
యీడా దాసికిని జగతి నేకామినులున్.


క.

కాసులు దెమ్మని యడుగదు
చేసన్నల వచ్చు రతికిఁ జేరగ నెపుడున్
మూసినముత్తెముఁ బోలెడి
దాసి నుదాసీన మాడఁదగ దెవ్వరికిన్.


వ.

అని పీఠమర్దకుండు పలికినపలుకులకు సుశీలుం డిట్లనియె.

క.

శ్వేతాదులు కైవల్యం
బాతతమదిఁ గనిరి వేశ్యలందునె కాదా
జాతియు నీతియుఁ గలిగిన
యాతెఱవలపొందువలన హానియు గలదే.


వ.

అనిన విని మల్హణుం డక్కథ యెఱింగింపు మనిన.


మ.

సరసౌదార్యవినిర్జితామరగవీసంతానచింతామణీ
వరపాథోధిశశాంక శాంకరపదద్వంద్వార్చానాసంతతా
ధరసంవర్ధితగోత్ర గోత్రరిపుసాధారణ్యసంపూర్ణభా
సురభోగాస్పదశోభ శోభనామహాచుండిస్థలగ్రామణీ.


క.

జంభాహితవరకుంభవి
జృంభితదోర్దండసత్త్వసింధుగభీరా
శంభుపదపద్మలీలా
బంభరసోమాంబికాతపఃఫలరూపా!

మాలిని.

విమతజనవిఫాలా వేదమార్గానుకూలా
శమితసకలదోషా సాధురక్షావిభూషా
హిమకరసమరూపా యిద్ధబాహుప్రతాపా
నముచితమథనభోగా నవ్యపద్మానురాగా.


గద్యము.

ఇది శ్రీమత్సకలసుకవిమిత్ర సోమయామాత్యపుత్త్ర సరసకవితాధుర్య యెఱ్ఱయనామధేయప్రణీతంబైన మల్హణచరిత్రం బను మహాప్రబంధంబునందుఁ ద్వితీయాశ్వాసము సంపూర్ణము.

ఇతర ప్రతులు

మార్చు
 

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.