శృంగార మల్హణచరిత్ర/ప్రథమాశ్వాసము

శ్రీః

శృంగార మల్హణచరిత్ర

ప్రథమాశ్వాసము

శ్రీలలితంబు సానునయశీతగుణంబును జారుపాదరే
ఖాలసనంబుఁ జన్నుఁగవ గట్టితనంబు నితంబశోభయున్
బోలును గౌరి తండ్రి బడిఁ బుట్టినదంచు హసించు శంభుఁ డే
వేళను జుండి కాళునకు వేడుక నీవుతఁ గామితార్థముల్.


ఉ.

శ్రీరమణీమనోహరుఁ డశేషసురస్తవనీయమూర్తి శృం
గారరసాధినాయకుఁడు కామినులం బదియాఱువేల ని

చ్ఛారతి నేలుకృష్ణుఁ డనిశంబు సుఖాఢ్యునిఁ జేయుఁ గామినీ
మారునిఁ జుండిరామయకుమారునిఁ గాళనమంత్రిశేఖరున్.


ఉ.

“అంబుజసూతి, నీవు భువనావలిఁ బ్రోడవు నాదు వీణ భా
వంబున నాలపించు”మని వాణి హసం బొనరింపఁ బోలు ని
త్యంబును సామగానముల నభ్యసనం బొనరించుధాత నె
య్యంబునఁ జుండికాళనఁ జిరాయురుపేతునిఁ జేయుఁ గావుతన్.


ఉ.

నిండి మహామునీశ్వరులు నిర్జరకోటులుఁ జూచుచుండఁగాఁ
దుండమునందు నందుకొని తోరపుఁ బండులుఁ బిండివంటలున్
దండిగఁదించు మించి తలిదండ్రులకున్ బ్రమదంబుఁ జేయు వే

దండముఖుండు చుండిపురధామునిఁ గాళన ధన్యుఁ జేయుతన్.


సీ.

దంతకాంతినితాంతధాళధళ్యములైన
                   ధౌతవస్త్రములు ముత్యాలయిండ్లు
కలశాబ్ధిఁ బుట్టి పుష్కరమునఁ జూపట్టు
                   మొలకచుక్కలఱేఁడు మొగలిఱేకు
వేదశాస్త్రపురాణవిద్యల కొరగల్లు
                   వలచేతఁ బొలుపారు కలికిచిలుక
యతులితరత్నకీలితభాసురంబైన
                   బంగారుకిన్నెర పలుకుఁదోడు


గీ.

ప్రణవవర్ణంబు దానుండు భద్రపీఠి
గాఁగ నింపారు నజురాణి కమలపాణి
వాణి కృపసేయు నెపుడు వాగ్వైభవంబు
నెలమితోఁ జుండికాళమంత్రీశ్వరునకు.


సీ.

కలశాంబురాశిలోపలఁ బుట్టి యేదేవి
                   వాసుదేవుని రాణివాసమయ్యె
వనజాక్షు మెప్పించి వక్షస్స్థలంబున
                   నేదేవి నెలకొని మోదమందె

లోకమాత యనంగ లోకత్రయంబునఁ
                   జెలఁగి యేదేవి ప్రసిద్ధయయ్యె
నఖిలసంపదలు నింద్రాదుల కేదేవి
                   కడకంటిచూపునఁ గలుగుచుండు
వికసితాంభోజ మేదేవి వీడుపట్టు
యట్టి శ్రీదేవి కరుణఁ జేపట్టి యొసఁగు
భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములు
నెల్లపుడుఁ జుండికాళమంత్రీశ్వరునకు.


మ.

తెలియంగా నట నీదుమస్తకమునందేకాదు భావింప నీ
నిలువెల్లన్ నటలంచు నాత్మవిభు నెంతే నేర్పుతో నవ్వు నె
చ్చెలి కంతంతకుఁ గన్ను సన్నఁ బ్రమదశ్రీ నించు గౌరీవధూ
తిలకం బీవుతఁ జుండికాళునకుఁ బ్రీతిన్ భాగ్యసౌభాగ్యముల్.


ఉ.

శంభుజటాటవీతటవిశంకటసింధుతలప్రఘుంఘుమా

రంభవిజృంభితధ్వనిధురంధరభూరితరప్రబంధవా
గ్గుంభుల నాత్మలోఁ దలఁతుఁ గూర్మిని మల్హణకాళిదాసులన్
దంభమయూరమాఘవరదండిముఖాదిమసత్కవీంద్రులన్.


చ.

వినుతు లొనర్తు నాంధ్రసుకవిప్రభు నన్నయభట్టుఁ దిక్కయ
జ్వను శివదేవు భాస్కరుని జక్కన నాచనసోము సర్వదే
వుని భవదూరు వేము నలపోతనఁ బిల్లలమఱ్ఱి వీరభ
ద్రుని శరభాంకు వీరకవి ధూర్జటిఁ గేతన భట్టబాణునిన్.


క.

వెండియు నాదృతమతినై
నిండుమనంబునను దలఁతు నిఖిలధరిత్రీ
మండలవిశ్రుతకవితా
ఖండయశోనిధులఁ బేరుగల సత్కవులన్.

క.

చెలరేగి యంతకంతకుఁ
జలమున వాఁదడవఁ గుకవి సత్కవి యగునే
యిలలోన నెంత బలిసినఁ
జెలఁగి వరాహంబు గంధసింధర మగునే?


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును సత్కవికీర్తనంబును గుకవినిరసనంబునుం జేసి నవరసభావబంధురంబుగా నొక్కప్రబంధంబు రచియింపం దలంచియున్నసమయంబున.


సీ.

ఏమంత్రినునుఁజూడ్కి ధీమదాశ్రితదైన్య
                   తామిస్రమునకు నైందవకరాళి
యేమంత్రియాజ్ఞప్తి సామంతసీమంతి
                   నుల కొప్పువిరుల కగ్గలపుగాలి
యేమంత్రివితరణం బినసూనుఖేచర
                   ప్రకటదానప్రౌఢిఁ బరిఢవించు
నేమంత్రికీర్తి శైలేంద్రకన్యాధీశు
                   కంఠహాలాహలాంకంబు గప్పు
నతఁడు నేపాళకురునిషధాంగవంగ
గౌళగాంధారమగధకొంకణవిదేహ

నృప మహాస్థానకవివర్ణనీయగుణుఁడు
చుండిరామయకాళుఁ డఖండయశుఁడు.


సీ.

కనకాంబరముల శృంగారించి మించిన
                   మహనీయనవరత్నమంటపమున
ఘనసారచందనకమనీయవాసన
                   లఖిలదిక్కులయందు నలమికొనఁగఁ
గవిగురుశేషవాక్కాంతాధిపులఁ బోలు
                   సత్కవీశ్వరులు పార్శ్వములఁ జెలఁగఁ
దుంబురునారదాదుల గెల్వఁజాలినఁ
                   గాయకు లగ్రభాగముల మెఱయఁ
కనకనవనవమాణిక్యఘటితభూష
ణావళులకాంతి సభికుల నావహింపఁ
గొలువు కొలువయి సాహిత్యగోష్ఠిఁ దగిలి
సన్నుతోదారుఁ డావేళ నన్నుఁ జూచి.


క.

“శివభక్తినిధివి మంత్రివి
కవితాభిజ్ఞుఁడవు నిత్యకారుణ్యమహో
త్సవుఁడవు కౌండిన్యకులో
ద్భవుఁడవుఁ గడుఁ గూర్చినట్టి బంధుఁడ వనఘా!

ఉ.

పాటిగలట్టి మేటి యెడపాటిపురాధిప, యెఱ్ఱనార్య, నీ
సాటిగఁ జెప్పినట్టి కృతి సాటువయై విలసిల్లుఁగా కిటన్
జాటుచు హీనమానవుల చాటునమాటున వ్యర్థకూటకా
ర్భాటకథల్ వినంగ నగుబాటగుఁ గాక రుచింపనేర్చునే?


క.

మలహరుభక్తులలోపలఁ
బొలుపుగ నుతికెక్కి జగతిఁ బూజ్యుండగు నా
మలహణుకథ నాపేరిటఁ
జెలువుగ నంకితముచేసి చెప్పఁగవలయున్.


చ.

అనుచుఁ బసిండికోరఁ బ్రియమారఁగఁ గప్రపువీడియంబు గాం
చనమణిగంధసారఘనసారవిభూషణవస్త్రసంపదన్
దనిపిన నాత్మలోపల ముదంబు వహించుచు నాప్రధానచం

ద్రునకును భక్తితోడఁ గృతి నూత్నగతిన్ సృజియింపఁ బూనితిన్.


ఉ.

ఇట్టిమహాప్రధానపరమేశ్వరమూర్తివి గాన నీవు చే
పట్టితి మేలు చుండిపురపాలక, కాళనమంత్రిచంద్ర, మున్
గట్టిగఁ గృష్ణరాయజనకాంతున కీయక దాఁచినట్టి యా
రట్టడియైన యెఱ్ఱకవిరాజిత మల్హణకావ్యకన్యకన్.


ఉ.

ఇమ్మహిఁ గల్గుమంత్రుల ననేకులఁ జూచితి మేము వారు మో
దమ్మున నిచ్చినట్టి ధనధాన్యయుతంబగు దొడ్డయీవియున్
సమ్మతితోడ నీవొసఁగు సారపుఁ గప్రపువీడియంబు తు
ల్యమ్మగుఁ జుండిపాలన దయాకర, కాళన మంత్రిశేఖరా!

ఉ.

ధన్యతఁ జుండికాళన, యుదారయశోం౽గన నిన్నెకాని నే
నన్య మెఱుంగనంచుఁ గలశాంబుధిఁ దానముఁ జేసి రాజమూ
ర్ధన్యులముందటన్ దగఁ బ్రతాపశిఖిం ధరియించి భోగిరా
జన్యుశిరంబుఁ బట్టి జలశాయిపదంబులు ముట్టి మేల్గనున్.


సీ.

తనసముద్ధతకీర్తి దశదిశావిశ్రాంత
                   దంతిదంతములతోఁ ద్రస్తరింపఁ
దనమనోహరమూర్తి తరుణతాహంకార
                   మానినీజనముల మరులు గొల్పఁ
దనదానవిస్ఫూర్తి ధనరాజసంతాన
                   చింతామణిశ్రేణి సిగ్గుపఱుపఁ
దనవాగ్విలాసంబు దందశూకాధీశ
                   దేవేంద్రగురువుల నేవగింపఁ
బరగు సురసరిదురుతరబహుతరంగ
నివహఘుమఘుమరవసమనినదసుకవి
ఫణితవరగుణమణిగణాభరణశాలి
చుండిరామయకాళఁ డఖండయశుఁడు.

ఉ.

చెంపలగంధమున్ మెఱుఁగుఁజెక్కుల నొత్తిన మన్మథాంకపుం
గెంపులు వీటికావిహితకృత్రిమరాగము కంటియెమ్మెలున్
మంపుగొనంగఁ గ్రుమ్మఱు కుమంత్రులఁ జూచిన రోఁతమాను ని
ష్కంపనుఁ జుండిరామవిభు కాళనఁ జూచిన యర్థికోటికిన్.


సీ.

సంపూర్ణచంద్రుఁ డీసరసుఁడు కాళన
                   వివరింప రోహిణి విస్సమాంబ
కందర్పుఁ డయ్యె నీకాళనామాత్యుండు
                   విశ్రుతరతిదేవి విస్సమాంబ
గంగాకలాపుఁ డీకాళనామాత్యుండు
                   వినుతపార్వతిదేవి విస్సమాంబ
కలశాంబురాశి యీకాళనామాత్యుండు
                   విమలభాగీరథి విస్సమాంబ
యవని ననుకూలదాంపత్య మగునటంచు
నఖిలజనములు వినుతింప నతులమహిమ

మంత్రిరామయ కాళనామాత్యచంద్రుఁ
డనఘ విస్సాంబ నుద్వాహమయ్యె నెలమి.


సీ.

పరకాంతఁ జూడఁడు పైత్రోవఁ జూచెనా
                   వర్ణించు మఱి కానివావిగాను
తఱచు మాటాడఁడు తగుచోట నాడెనా
                   యబ్రహ్మపదము శిలాక్షరంబు
తర మెఱుంగక యీఁడు తగమెచ్చి యిచ్చెనా
                   చాలు నర్థికి జన్మజన్మములకు
మన సీక నిల్పఁడు మది నిచ్చి నిల్పెనా
                   యది విభీషణుపట్ట మచ్యుతంబు
రక్ష రాష్ట్రమునకును శ్రీరామరక్ష
యాజ్ఞ సుగ్రీవునాజ్ఞగా నడఁచె రిపులఁ
బుణ్యవంతుండు సద్గుణభూషణుండు
చుండిరామయకాళఁ డఖండయశుఁడు.

షష్ఠ్యంతములు

క.

ఈదృశగుణజలరాశికి
శ్రీదేవీవరతనూజ శృంగారునకున్

భూదానభార్గవునకును
మాదేవీవరవిభూతిమహిమాఢ్యునకున్.


క.

బంధురవిక్రమశాలికి
సింధుగభీరునకు శేముషీధిషణునకున్
బంధుప్రియునకు నీతియు
గంధరునకు శంభుశక్తికలితాత్మునకున్.


క.

యోధాగ్రేసరునకు నుత
రాధేయసమానదానరసికాగ్రణకిన్
భూధరరిపువిభవునకు న
సాధారణధైర్యశౌర్యసద్గుణమణికిన్.


క.

అద్రీంద్రధైర్యునకు స్వా
మిద్రోహరగండనవసమీరబలునకున్
రుద్రాక్షభూతిభూషణ
ముద్రాంకునకున్ బ్రధానమూర్ధన్యునకున్.


క.

దుస్సంగదూరునకును న
భస్సింధుసమానకీర్తిభరితాంకునకున్
నిస్సీమభూప్రదాతకు
విస్సాంబాధవున కఖిలవిద్యానిధికిన్.

క.

శ్రీమంతున కఖిలకళా
ధామునకును గీర్తినిధికి ధర్మాత్మునకున్
సోమాంబాతనయునకు మ
హామహునకుఁ జుండికాళయామాత్యుకున్.


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన మల్హణచరితం బను మహాప్రబంధమునకుఁ గథాక్రమం బెట్టిదనిన:


సీ.

కువలయకమలాభినవమనోజ్ఞం బయ్యుఁ
                   బంకజీవనపరిప్లవము గాక
ఘనసారపున్నాగకమనీయ మయ్యును
                   కితవదుష్కనకసంయుతము గాక
సాధుదానప్రౌఢియూధపం బయ్యును
                   విశ్రుతఖరసమన్వితము గాక
రాజితోత్తమజాతిరత్నాంకితం బయ్యు
                   శృంగారకూటదూషితము గాక
వరసరోవరచయమును వనచయమును
నృపచయంబును దివ్యమంటపచయంబు
నెలమిఁ దనుబోలె ననఁ బొగడ్తలు వహించె
భువనసారంబు కల్యాణపురవరంబు.

గీ.

కలితకైవల్యకల్యాణకటక మనఁగఁ
గామితార్థైకకల్యాణకటక మనఁగఁ
గమలసదనాంఘ్రికల్యాణకటక మనఁగ
ఘనతగాంచెను కల్యాణకటక మపుడు.


చ.

గములుగఁ బద్మరాగములఁ గమ్రమరీచులు చౌకళింపఁగా
గమలవనంబు లెన్నఁడు వికాసము గుందవు వజ్రమౌక్తికా
సమరుచిచంద్రికన్ గుముదషండములున్ గసుగందకుండు నాఁ
గొమరగు దివ్యరత్నమయగోపురవైభవ మెన్న నేటికిన్?


క.

కురువిందవజ్రమయగో
పురదీప్తులవలనఁ బ్రొద్దు పోకల్ రాకల్
పరికింప నరిది యయ్యును
సరసిజకైరవవికాససంపదఁ దెలియున్.


క.

తలయెత్తి చూచినప్పుడు
తలవంచినయపుడుఁ దెలియు దైవతఫణిలో

కులవార్త లనఁగ వినుతికి
నలవియె పురికోటపొడవు నగడితలోఁతున్.


క.

దైవతమూర్తులు తేజో
వైవస్వతజనకు లేకవదనబ్రహ్మల్
పావనచారిత్రులు పుం
భావసరస్వతులు పురముబ్రాహ్మణు లెల్లన్.


క.

వారణవారణసత్త్వులు
శారద శారదవిలాస సమధికకీర్తుల్
మారుత మారుతవేగులు
మారనిభుల్ పురమురాకుమారకు లెల్లన్.


క.

జలనిధి రోహణశైలము
మలయాద్రిన్ గనకశిఖరి మఱపించిరి యు
జ్జ్వలరత్నచందనశ్రీ
నలరెడు భువనైకవశ్యు లప్పురివైశ్యుల్.


క.

బలభద్రులు శాత్రవనృప
దళదళనోన్నిద్రు లమితదానమరుద్ద్రుల్
లలనాభద్రులు కలఁగని
యలఘుసముద్రులు సముద్రశూద్రకు లెల్లన్.

క.

సటలాడింతురు సింహముఁ
బెటబెట బెబ్బులులపండ్లు పెఱుకుదురు మదో
త్కటదంతిఁ గూలఁద్రోతురు
పటుసమదోద్భటులు వీరభటు లవ్వీటన్.


క.

పిటపిట నడఁగెడు నడుములు,
సడిఁగౌఁగిలిఁగొనని గుబ్బచన్నులు, చేరల్
గడచు తెలిగన్ను లప్పురి
పడఁతులకుం గాక కలదె పడఁతుల కెందున్.


క.

గళదండతుండగండ
స్థలదృఙ్మదకాండ భద్రదంతులు చెలఁగున్
బలువిడి సెలయూటలతో
నలరెడు నలకొండ లనఁగ నప్పురిలోనన్.


క.

వరజవసంపద నప్పురి
తురగంబులఁ బోలలేని తుందుడుకున నీ
ధర నడువనోడి యప్పుడు
నరుగు నభంబున వితేజులై రవితేజుల్.


క.

మోపులు గైకొని యమృతపుఁ
దీపుల కెడఁబడిన తరఁగతెఱఁ గంభోధుల్

ఱేపులు మాపులు నప్పురి
వాపుల చలిగాడ్పులాని వాపుల వదలున్.


వ.

మఱియు నప్పురంబు సత్యలోకంబునుంబోలెఁ జతురాననాధిష్ఠితంబై, వైకుంఠపురంబునుబోలె బురుషోత్తమావాసంబై, కైలాసంబునుంబోలె సర్వజ్ఞాభిరామంబై, యమరావతియునుంబోలెఁ మఘవద్విజితంబై, యలకాపురంబునుంబోలె ధనదవిలసితంబై, నక్షత్రగ్రహమండలంబునుంబోలెఁ గళానిధిశోభితంబై, వియన్నదియునుంబోలె లక్ష్మీసముదయంబై, మాతంగవిరహితంబయ్యు మదమాతంగయుక్తంబై, భోగిదూరంబయ్యు ననేకభోగిభూషితంబై, యశ్రుపాతంబు పురాణపఠనశ్రవణవేళయంద, చేలచలనంబు ధ్వజంబులయంద, పరవశత్వంబు రతిసమయంబులయంద, దీర్ఘనిశ్శ్వాసంబు సారయోగులయంద, నన్యోన్యసంఘర్షణంబు యువతీస్తనంబులయంద, పాణిగ్రహణంబు వివాహంబులయందకాని తనయందుఁ బొనరవనంజాలి చక్కదనంబుకుఁ

జక్కటియు, మగతనంబులకు మగఁటిమియు, సంపదల కింపును, యశంబునకు వశంబును, సౌఖ్యంబులకు సౌఖ్యంబును, విద్యలకు నాద్యంబును, విశ్వాసంబున కాదికారణంబును నగు నప్పురవరంబున:-


సీ.

యజ్ఞదత్తుండను నవనీసురోత్తముం
                   డఖిలవేదంబుల నభ్యసించి
నవరసజ్ఞాతయై నవకళానిపుణుఁడై
                   సకలదేశంబులు సంచరించి
ధనరత్నవస్త్రవాహనతతు లొనగూర్చి
                   భాగ్యసౌభాగ్యవైభవము లెసఁగ
వనజలోచనఁ బుణ్యవతియను సాధ్విని
                   బరిణయంబై నిజబంధుజనము
నాప్తవర్గంబు ముదమంది యభినుతింప
నతిథిపూజలు సేయుచు నాగమోక్త
క్రతువు లొనరించి పెద్దల కరుణ గాంచి
నిండువేడుక దళుకొత్త నుండి యతఁడు.


క.

నరకాంబుధిఁ బడి మునిఁగెడు
పురుషునకుం దెప్పగాదె పుత్త్రకుఁ డిలఁ “బు

న్నరకాత్త్రాయతి” యనియెడు
పరమశ్రుతి దలఁపనైతి భావములోనన్.


క.

సంతానము నిహపరమును
సంతానము పుణ్యలోకసాధన మరయన్
సంతానము నిలహేతువు
సంతానము లేనివాని జన్మంబేలా?


క.

సుతుఁ డుదయించినమాత్రనె
పితరుల దుర్గతులు దొలఁగుఁ బెరుగుచు మరి యా
సుతుఁ డెంత చల్లనుండినఁ
బితరుల కతితృప్తిసేయుఁ బృథుతరలీలన్.


క.

పితరులసుగతికి మూలము
సుతుడఁ ‘యపుత్రస్యనాస్తిసుగతి’ యనంగా
లతికామూలన్యాయము
పితరులకును సుతున కండ్రు పేర్కొని మౌనుల్.


సీ.

వరరత్నధనధాన్యవస్త్రసమృద్ధైక
                   సీమలు గలిగిన నేమిఫలము?
మణిహేమమయకుడ్యమంటపకమనీయ
                   ధామముల్ గలిగిన నేమిఫలము?

శ్యాలకజామాతృసఖిమిత్రబాంధవ
                   స్తోమంబు గలిగిన నేమిఫలము?
చామరాందోళికాఛత్రసైంధవరథ
                   సామజంబులు గల్గ నేమిఫలము?
ఘోరసంసారసాగరసారనిబిడ
మధ్య నిర్మగ్నులైనట్టి మానవులకు
నకట దరిఁ జేర్పఁ దెప్ప యైనట్టిసుతుఁడు
గలుగకుండిన నెంతటిఘనునకైన.


మ.

అని యూహించుచు నమ్మహీసురుఁడు చింతాయతవృత్తి న్నతా
ననుఁడై పుణ్యవతీవధూతిలకముం దానున్ నిజాంతర్గృహం
బునఁ గమ్మాయకభోజ్యవస్తువితతుల్ భుంజింపగానీక యి
చ్చనజస్రంబును వత్సకాంక్షలను బశ్చాత్తాపసంయుక్తుఁడై.


మ.

ఉపవాసంబులు సత్యధర్మమహితోద్యోగాదికృత్యంబులున్

జపముల్ విప్రకుటుంబభోజనముల్ శాంతుల్ పయస్సత్రముల్
తపముల్ దైవతపూజనక్రియలు తీర్థస్నానముల్ దానముల్
విపరీతప్రతిబంధమోక్షణవిధుల్ వేమాఱుఁ గావించుచున్.


సీ.

బహువిధస్తోత్రముల్ పఠియింపఁ బఠియింపఁ
                   బొలుపరి నోరెల్లఁ బొరటవోయె
మొగివేల్పులకుఁ జాఁగి మ్రొక్కంగ మ్రొక్కంగ
                   బొప్పక నొసలెల్లఁ బొగసుగట్టె
ధరఁబ్రదక్షిణములు దిరుగంగఁ దిరుగంగ
                   నెల్లవెంటలను గా ళ్ళీచవోయె
విధులకై ధనములు వెచ్చింపవెచ్చింపఁ
                   జెలువేది జేయెల్ల జెరటయయ్యెఁ
బూని యుపవాసములచేతఁ బొగిలిపొగిలి
కోలుకొనలేక యొడలెల్లఁ గ్రుస్సిడస్సి
చాలు నన్నింట డెందము చల్లనయ్యె
నింట నేమిటఁ దోడెసఁ గెట్టుమనుదు?

గీ.

సురభిపొదుగున దుగ్ధముల్ దొరకుఁగాక
తవిలి యున్నె యజాగళస్తనము లొడియ
నీశ్వరేశ్వరుకృపఁ గోర్కు లెసఁగు గాక
యితరకృత్యంబులం దెల్ల నేల కలుగు?


వ.

అని తనవృత్తాంతం బాధర్మపత్ని కెఱుంగఁజెప్పి తా నొక్కరుండ పురంబు వెలువడి వచ్చి వచ్చి యఖిలజనానందమయి యవసరంబుల నుత్ఫుల్లమల్లికావకుళకేతకీకుటజపాటలీపున్నాగపరిమళామోదపరిహృతపరిశ్రమపథికజనానుమోదంబును, విచ్ఛిన్నస్వచ్ఛగుళుచ్ఛనిష్ఠూత్యమరందబిందుధారానందితతుందిలనటదిందిందిరమాలికాసందోహక్రియాఝంకారంబును, ఉన్మదశుకశారికాకేకికలవరకలకంఠకోమలతరంగితమేదురనాదమాధురీధురీణతామానంబును, బిసగ్రసనకౌతుకకలహంససంకులక్రేంకారగుంభితవిచరత్కిన్నరమిథునమధురగానంబును, సహకారకదళీపనసఖర్జూరద్రాక్షనారికేళబిల్వజంబీరమాతులుంగఫలసమిత్కుశాయాతమునికుమారనిరంతరం

బును నగు వనాంతరంబున నొక్క వటవిటపిచ్ఛాయం దపం బున్న కపింజలమహాముని యాశ్రమంబుఁ జేరంజని.


సీ.

తుండముల్ నిమురు భేరుండముల్ శరభంబుఁ
                   బాము భేకములకు బాముఁగడపు
నాగముల్ హరుల పన్నాగముల్ గనిమెచ్చు
                   ముంగి రమ్మను ఫణి ముంగిటికిని
పులిపాలఁ ద్రావించు బులిపాల మృగిపిల్ల
                   పిల్లితో నెలుక దంపిల్లియాడు
తోడేలునకు మేఁత తోడేలు చెంబోతు
                   పులుగువెట్టును డేగ పులుగునకును
కారుపోతులఁ గని యాడు కారుహయము
కొండగాఁ జూచుఁ గీశంబు కొండగొఱియ
పికముపన్నదు కాకంబు పికముతోడ
జాతివైరంబు లుడిగి తజ్జాతి నిట్టు
లెనసి కూడుండు ప్రాణు లమ్ముని యునికిని.


వ.

ఇట్లున్న యమ్మునితపోమహిమకు నిచ్చమెచ్చుచుఁ జేరంజని సాష్టాంగదండప్రణామంబు లాచరించినం జూచి

యమ్మౌనీంద్రుం డతనిరాక మనంబున నెఱింగి నీమనోరథంబు సఫలంబయ్యెడు నిక్కడఁ దపం బాచరింపుమని యనుజ్ఞ యిచ్చిన నయ్యజ్ఞదత్తుండును దదుపదిష్టమార్గంబునఁ దపస్సాధనంబు లొనగూర్చుకొని యందంబున నపరనందీశ్వరుహృదయారవిందంబునఁ బొందుపఱిచి ఫలాహారపర్ణాహారపవనాహారపరిహృతాహారుండై పరమతపోనిష్ఠ వాటించుచున్నసమయంబున నప్పరమేశ్వరుండు ప్రసన్నుండైనం బ్రణమిల్లి యిట్లనియె.


సీ.

“కరిముఖజనకాయ కనకాద్రిచాపాయ
                   మరుసంహరాయ నమశ్శివాయ
కుండలికటకాయ గోరాజవాహాయ
                   మాధవాస్త్రాయ నమశ్శివాయ
శైలజాధీశాయ సనకాదివంద్యాయ
                   మధుపాంతకాయ నమశ్శివాయ
సోమార్కనేత్రాయ సురనదీజూటాయ
                   మంత్రభూషాయ నమశ్శివాయ

భక్తపరతంత్రహృదయాయ భవహరాయ
మాతృకావేష్టితాయ నమశ్శివాయ
సకలలోకాధినాథాయ శాశ్వతాయ
తే నమోస్తు మహాదేవ దేవ” యనిన.


మత్తకోకిలము.

“భూసురోత్తమ, యాత్మ మెచ్చితి పుత్త్రు నీ కిదె యిచ్చితిన్
వాసవాదులు సన్నుతించెడువాని మత్ప్రియభక్తునిన్
రాసికెక్కుకులైకభూషణు రమ్యకీర్తివిరాజితున్
ధీసమున్నతు సత్కళానిధి దివ్యతేజు గుణాకరున్.”


వ.

అని సర్వేశ్వరుండు సంతానలబ్ధికై యొక్కసంతానఫలంబు దయచేసినఁ బుచ్చుకొని కపింజలమహామునియనుమతంబునఁ బురంబున కరుగుదెంచి తనధర్మపత్నియైన పుణ్యవతికి నొసంగె నంతఁ గ్రమక్రమంబున.

సీ.

పసిఁడిపుత్తడికిని బల్వంపుమరువుగా
                   నిలిపినగతి మేను పలుకఁబాఱె
కస్తూరి లాంఛనగా నిడ్డ యమృతంపుఁ
                   గుంభద్వయంబనఁ గుచము లమరె
లలి దంపతులమోహలతికాంకురంబన
                   గరువపు నూగారు గాననయ్యె
తనయాభివృద్ధిచేతను లేమి యంతయు
                   బెడఁబాసెననఁగ నెన్నడుము వడఁకె
సుషమసంతానసౌఖ్యాబ్ధిఁ జొక్కి యాత్మ
నన్యముల రోయుగతి మది నరుచి వొడమెఁ
దనయ లావణ్యరసపూర్తితైల మనఁగ
నంగనకు గర్భసంపద యందమయ్యె.


క.

నవమాసంబులు నిండిన
యువతీమణి పుత్త్రుఁ గాంచె నురుతరతేజున్
భవకరుణామృతసాగర
భవవిగతకళంకకుముదబంధుఁ డనంగన్.


క.

‘ఏలికవలెఁ జూడఁగవలె
బాలకు నైదేండ్లు, బంటువలెఁ బెంచుచుఁ దా

నేలగవలెఁ బదియేఁడులు
వాలఁగ నటమీఁద సఖునివలెఁ జూడఁదగున్.’


వ.

అని యజ్ఞదత్తుండు పుత్త్రకునకు నుదయాదికృత్యంబులు గావించి విద్యానిధియను బ్రాహ్మణునొద్దఁ జదువంబెట్టిన నతండు.


సీ.

అంగయుక్తంబుగా నామ్నాయములు రెండు
                   బల్లిపాఠంబుగాఁ బరిచయించె
బ్రహ్మాండశైవాదిబహుపురాణంబులు
                   కరతలామలకంబుగా నెఱింగె
భాట్టవైశేషికప్రముఖశాస్త్రంబులు
                   నవగతంబులుగాఁగ నభ్యసించె
శుకులవ్యాసాదిదేశికుల తత్త్వార్థముల్
                   శోధించె నామూలచూడముగను
వాదవహ్నిజలస్తంభనాదు లరసె
నంజనాకర్షణక్రియ లలవిఁ గనియె
సరససంగీతసాహిత్యసరణిఁ దెలిసె
నఖిలవిద్యావిశారదుం డయ్యె నంత.

క.

అన్నగరము వేశ్యలలో
నెన్నంగా నొక్కబోటి యిల నన్నింటన్
మిన్నక సడిసన్నది యది
చెన్నలరుచునుండు మదనసేన యనంగన్.


క.

ఆయక్క యెన్నినోములు
పాయక కడునోచి కన్న బాలిక కంతుం
డేయక దాఁచిన మోహన
సాయకమనఁ బుష్పగంధి సన్నుతి గాంచెన్.


క.

మొలకచనుమొనలు చెలువపుఁ
గళికలు చరణాధరోష్ఠకరతలములు కెం
దలిరులు కురు లలికులముగఁ
గలమోహనలతిక పుష్పగంధి యనంగన్.


క.

నిలుకలు మన్మథునమ్ముల
ములుకులు విటజనులధైర్యమూలంబులకున్
................... విరహుల
కళికలు ధరఁ బుష్పగంధికన్నులతళుకుల్.


క.

కులమును గుణమును రూపును
గలిగినబాలికకు విద్య గలిగినయేనిన్

తలపఁగఁ బసిఁడికి వాసన
కలిమియుఁ జెఱకునకుఁ బండుఁ గలుగుటగాదే?


వ.

మదనసేన విద్యానిధియను నాచార్యునొద్దఁ దనముద్దుపట్టిం జదువంబెట్టిన నయ్యాచార్యుండును;


సీ.

బాలిక కక్షరాభ్యాసంబు గావించి
                   వర్ణక్రమంబుల వరుసఁ దెలిపి
బహువిధస్తోత్రముల్ పాఠంబు గావించి
                   వివిధకావ్యంబుల వినికిఁ జెప్పి
శబ్దప్రపంచంబుజాడ యెఱింగించి
                   సంధిసమాసాదిసరణిఁ జూపి
నాటకాలంకారనైపుణి సూచించి
                   చిత్రాశుకవితాప్రసిద్ధి గరపి
యఖిలశాస్త్రపురాణేతిహాసమహిమఁ
బ్రోడఁగాఁ జేయుటయు నంతఁ బుష్పగంధి
మలహణుఁడుఁ దానుఁ గూడి సమ్మద మెలర్పఁ
జింతనలు సేయుచుంద్రు నిశ్చింతతోడ.

క.

సరికిని బేసికిఁ జదువుచు
నిరువురుఁ గవగూడి తిరుగనేర్చిరి విద్యా
వరనీతి నాఁడు నాఁటికి
సరసైకజనానురాగసమ్మదలీలన్.


చ.

పలుకయుఁ బుస్తకంబులును బట్టుకొ యింటికిఁ బుష్పగంధి రా
మలహణుతల్లిదండ్రులును మచ్చిక రెట్టిగఁ గన్య వానితోఁ
జెలిమికి వచ్చె నంచు దయసేయుచు వారివచోనిగుంభనల్
పలుమరు నింపుతోఁ జెవులపండువుగా వినుచుందు రెంతయున్.


క.

మలహణునిం దమయింటికిఁ
బిలుచుకొ కొనిపోయి రత్నపీఠిక మీఁదన్
నిలిపి తగఁబుష్పగంధియు
నలరఁగ సద్భక్తిఁ జేయ ననుమోదించున్.


క.

ఆలోనఁ బుష్పగంధిని
జాలకుఁడను నటునియొద్ద సామున కిడినన్

మేలైన నాట్యవిద్యయు
బాలిక తగనేర్చి రాజపాత్రం బయ్యెన్.


సీ.

మొగవరి కట్టడమొనవుకోలాటంబు
                   చొక్కంపుమురువులు చిక్కణీలు
దరవుబారబడుబేసి బహుళరూపు
                   బంధురగీతప్రబంధవితతి
వరుసపద్యదేశిబంగాళంబుకంచి
                   కొరుతికట్టడబిందుకొటియకాఁడు
పరశరాముఁడు వీరభద్రుండు కల్యాణి
                   చౌ............ మెకతాళి శబ్దమాది
దేశిశుద్ధాంగములయందుఁ దీగెబోఁడి
పటుతరంబుగ నిజపాదకటకయుగళి
కఖిలపాత్రమ్ములును బొమ్మ లగుచు వ్రేలఁ
బూన్కి వహియింపఁ బొగడొందెఁ బుష్పగంధి.


గీ.

సకియ రేపును మాపును సాముసేయు
పగలు రేయును జదువుపై బాళి నుండు
వెలయు సంగీతసాహిత్యవిద్యలందుఁ
గమలలోచన నిస్సీమగా నెఱింగె.

సీ.

స్వరమండలంబును జంత్రంబు నొకవేళ
                   నింపుమీఱంగ వాయించుచుంద్రు
కిన్నర, వీణెయుఁ గేలిమై నొకవేళ
                   ముట్టిచూతురు జగన్మోహనముగ
సొంపుగా దండెలు శ్రుతిఁగూర్చి యొకవేళ
                   పదములుఁ జిందులుఁ బాడుకొంద్రు
గీతప్రబంధముల్ కేళిఁ జిక్కిణి పంతు
                   లనుకొందురొకవేళ మనము లలర
నార్యహత్తంబులును జూర్ణికావళియును
మక్కు వలరంగ రాణింతు రొక్కవేళ
మంజరులు ద్విపదలును సమంజసముగఁ
జదువుకొనుచుందు రొకవేళ సరసలీల.


వ.

ఇట్లు మలహణపుష్పగంధులు బాల్యస్నేహంబునం గూడి చరియింప నెలప్రాయంబు దోతెంచిన.


చ.

ఒసపరిలాగు బాగు సుగుణోన్నతి రూపు విలాసరేఖయున్
రసికతపెంపు విద్య చతురత్వముఁ గాంతియు దివ్యతేజమున్

బిసరుహసూతి యాతనికిఁ బేర్కొని మక్కువ నిచ్చెఁగాక నాఁ
బొసఁగునె మల్హణుండు నృపపూజితుఁడై నవయౌవనంబునన్.


సీ.

రమణిచన్నులు చేసి రాలినరజముతోఁ
                   గమలసంభవుఁడు జక్కవలఁ జేసెఁ
జెలువక్రుమ్ముడి చేసి చిందినకప్పున
                   మెఱసి విధాత తుమ్మెదలఁ జేసె
మగువకన్నులు చేసి మిగిలినతళుకుల
                   నలువ క్రొమ్మెఱుఁగుఁ దీగలను జేసె
సతినెమ్మొగముఁ జేసి జారిననునుకాంతిఁ
                   బరమేష్ఠి నిండుచందురునిఁ జేసె
పడఁతి తనువల్లిఁ జేసి త్రోవడినతావిఁ
గనకగర్భుండు పుష్పవాసనలఁ జేసెఁ
గాన లేకున్న నీసొంపు గలుగు టెట్లు?
కమలగంధులలోఁ బుష్పగంధి దనరె.


సీ.

పటుమోహనస్ఫూర్తి పాలిండ్లు పాలిండ్లు
                   నుడురాజవైభవ మోము మోము

పంకజంబులతుదిపదములు పదములు
                   కొదమతేటులకును గురులు కురులు
పసగల కపురంపుఁబలుకులు పలుకులు
                   ముద్దుకెంజిగురాకుమోవి మోవి
సొగసు వెన్నెలసొంపునగవులు నగవులు
                   హరిమధ్యమనఁగేళికౌను కౌను
మారుతూలికరీతిఁ జెన్నారు నారు
కంబువునకంటె మహిమ వెగ్గలము గలము
వజ్రములకును లేదు పల్వరుస వరుస
యనఁగ నుతికెక్కె రామ లోకాభిరామ.


వ.

ఇట్లు మల్హణపుష్పగంధులు నవయౌవనారంభంబున.


సీ.

శారదచంద్రుండు చంద్రికయునుబోలె
                   లలి నొక్కకృత్తికై చెలఁగి చెలఁగి
ప్రసవబాణుండును రతిదేవియునుబోలె
                   భేద మించుకలేక బెరసి బెరసి
యమరచందనము విద్రుమవల్లియునుబోలె
                   నన్యోన్యవైఖరి నడరి యడరి

వరవసంతుండును వనలక్ష్మియునుబోలె
                   భావంబు లేకమై పరగి పరగి
తోడునీడయుఁబోలెను దొరసి దొరసి
తనువు బ్రాణంబుఁబోలెను దనరి తనరి
లీలఁ గలనైన బెడబాయఁజాల రెందు
మలహణుఁడుఁ బుష్పగంధియు మరగి యెపుడు.


సీ.

విద్యలు గని చొక్కువేడుకఁ గొన్నాళ్ళు
                   కొనియాడు వేడుకఁ గొన్నినాళ్ళు
ఇహముఁ బరంబని యెంచును గొన్నాళ్ళు
                   కూటువమేలనుఁ గొన్నినాళ్ళు
ఇద్దఱివయసులు నీడను గొన్నాళ్ళు
                   సన్నలుచూచును గొన్నినాళ్ళు
వెడలుచో మూతులు విరుచును గొన్నాళ్ళు
                   కూళపాఱుండనుఁ గొన్నినాళ్ళు
భూసురండగు మలహణుఁ బుష్పగంధిఁ
గూడనిచ్చుట గాదనుఁ గొన్నినాళ్ళు
మహితమాయాకళాధాన మదనసేన
...............................................

వ.

అంత నప్పురంబునంగల విటవిదూషకప్రేష్యనాగరికాదులు మలహణపుష్పగంధులయన్యోన్యానురాగంబులు దలంచి యిట్లని వితర్కించిరి తమలోన.


క.

కూడం జదివినకతమునఁ
జేడియ కితనికిని గోర్కి చేకూరె నింక
నోడ న్గట్టిన దూలముఁ
జాడ సుమీ చిత్తగతులు చర్చింపంగన్.


క.

చిన్నప్పటిప్రేమంబును
గన్నెఱికపువిటునిమీఁదికాంక్షయు మనుజుల్
గన్నప్పటి చనుప్రేమయు
నెన్నఁగ మదిఁ బాయకుండు నింతుల కెందున్.


చ.

చెదరనియట్టికోరికలు జెందిలినొందనియట్టి వేడ్కయున్
వదలని యట్టికాంక్షలును వన్నె దొరంగని యట్టిసొంపులున్
గొదవడనట్టి బాగులును గొండికప్రాయమునందె కల్గి యా

మదవతిఁ బాయఁ డెన్నఁడును మల్హణుఁ డెంతటిభాగ్యవంతుఁడో?


సీ.

కోర్కిమై దీనితోఁ గూడియుండగలేని
                   నరుఁడు దా నరుఁడె వానరుఁడు గాక
యేప్రొద్దు దీనితో నెనసియుండనిమేను
                   మేనౌనె మఱి దారుమేను గాక
వెస దీనిపలుకులు వినలేనిచెవులు దాఁ
                   జెవులె రాటనములచెవులు గాక
సరసంబుగా దీనియురముపైఁ జేర్పని
                   కరము దాఁ గరమె కక్కరము గాక
దీనియధరామృతముచవు లానలేని
జిహ్వ జిహ్వయె శూర్పంపు జిహ్వ గాక
దీని గూడనిదినములు దినము లౌనె
గణనకును దుర్దినంబులు గాక యనుచు.


సీ.

చిత్రోపధానవిచిత్రవితానాదు
                   లలవోకఁ గానుక లంపువారు
చీనిచీనాంబరశ్రేణు లూరకయని
                   యర్పించి మీవార మనెడువారు

ఘనసారచందనకస్తూరికాదులు
                   పొరిఁబోరిఁ గొనియిచ్చి పోవువారు
ఘనవజ్రతాటంగకాంచీకలాపంబు
                   లింద, కొమ్మని వేఁడ్క నిచ్చువారు
మధురఫలములుఁ బుష్పముల్ మక్కు వలర
నూరకైనను గొనివచ్చి యొసఁగువారు
నైరి యప్పుష్పగంధివాహ్యాళిఁ జేసి
యఖిలజనములు మనముల హర్ష మొదవ.


సీ.

ముద్దియలావణ్యమునకు సంతోషించి
                   మెచ్చుచుఁ గ్రుక్కిళ్ళు మ్రింగువారు
కనుకని చేఁ జిక్కి మనసు దీయఁగలేక
                   దినమును వెనువెంటఁ దిరుగువారు
పనుపు నెపంబున బాలఁ జేరఁగవచ్చి
                   వావిరి నరుసుకొ పోవువారు
శృంగారపద్యముల్ చెప్పించి తముదార
                   సారెసారెకు వినఁ జదువువారు
దూరమున నుండియైనను జేరవచ్చి
సొమ్ములును వన్నెసవురులు చూపువారు

పొలఁతిఁ దలపోసి యటమీఁదఁ బొగులువారు
నగుచునుండిరి మానవు లప్పురమున.


వ.

అంత నమ్మదనసేన పరిజనంబులతోడ మలహణు నివేదించి యిట్లనియె.


సీ.

మొండితొత్తులమారి లండుబకంకంబు
                   ఱంకెత సారంబు పెంకె గడుసు
పడుచు టక్కులదొంగ బడుగిడు ననుగంటి
                   బైసికొక్కెర బొంత పచ్చిలంజె
కక్కరంబుల గాచి కసుమాల మిబ్బంది
                   వీచి వాపేభ్యంబు వేరుపురుగు
ముక్కన్నుసబ్బండు ముక్కిడి తాటకి
                   ద్రిమ్మరి చాడియు దేశకూళ
వుల్లెదాల్పరి మతిగొట్టు ముల్లెవిడుపు
దాటదీపరి ఖోదుదిదాట్లగుళ్ళ
దుక్కిపిట్ట పిసాసంబు దోమ తిండి
యితనిఁ బేర్కొని పలుమాట లెన్ననేల.


చ.

ఎక్కడి బాపనయ్య, యితఁ డిక్కడ వచ్చుచునున్నవాఁడు దా

నిక్కమె సాధుఁబోలి తననెయ్యముఁ దియ్యము చాలుఁజాలు నీ
చక్కటిఁ జేరనీయకుఁడు జాడఁ జలింపగ నీతఁ డెంతయున్
వెక్కసమైన చేఁత లివి విన్నను నామదిఁ గోప మయ్యెడున్.


వ.

అనుటయు నమ్మాటలు మలహణపుష్పగంధులు విని తమలో నిట్లనిరి.


క.

పురజనము లాడువార్తలు
పరిజనములు పోవుపోక బాంధవసఖసో
దరజననీవీక్షణములు
దరమిడి గుండియలవేఁడి తాఁకై యంతన్.


ఉ.

ఎవ్వరిఁ గీడుపల్కితిమొ యెవ్వరిఁ జూడఁగ నాడినారమో
యెవ్వరి దూఱుచేసితిమొ యెవ్వరిమేలు సహింపమైతిమో
యెవ్వరి కెగ్గొనర్చితిమొ యెవ్వరి నెవ్వరిఁ బాపినారమో

యివ్విధి వట్టిరట్టు పడ నెట్టుగఁ జేసె విధాత యక్కటా!


క.

నొడిమలకుఁ గలవి లేనివి
గొడిమలు గట్టుచును జనులు కుడువనినోళ్ళన్
గుడుపుచుఁ బోయెద రూరకె
ముడుగడలును జెరువు మూయ మూఁకుడు గలదే?


చ.

అనుజులుఁ దల్లిదండ్రులు నిజాప్తులుఁ బౌరులు బంధుకోటులున్
బనివడి యేనిమిత్తమునఁ బల్కెద రిందఱుఁ గూడి వేడ్క నె
మ్మమునఁ గల్గి సిగ్గువడి మానితి మింతియ కాక కల్గినన్
మనముల రట్టుచేసి యిఁక మాన్పఁగఁ గర్తలె యెన్నిభంగులన్.


వ.

అని యిరువురు నన్యోన్యురాగసుఖంబులం దనరుచుండి రంత నప్పురంబున.


మ.

కరుణాంభోధిసమాన మానవిలసత్కల్యాణ కల్యాణభూ
ధరధైర్యాస్పదచిత్త చిత్తవసంతస్వాంతభూరికృపా

కరసౌందర్యవిశేష శేషకటకాకల్పాంఘ్రి పద్మార్చనా
పరమప్రీత్యభిరామ రామయతపఃప్రాగల్భ్యలబ్ధోదయా!


క.

డిండరహార సురవే
దండసుధాకుందబృందధావళ్యయుతా
ఖండతరకీర్తి వైభవ
చుండిస్థలకరణచంద్ర శుభగుణసాంద్రా!


మాలిని.

సరసగుణసముద్రా సంతతౌదార్యముద్రా
గిరిశచరణభక్తా కీర్తికాంతానురక్తా
తరణిసదృశతేజా ధన్యవాగ్జాలభోజా
దురితచయవిదూరా ధూర్తశిక్షావిహారా!


గద్యము.

ఇది శ్రీమత్సకలసుకవిమిత్ర, సోమయామాత్య
పుత్ర, సరసకవితాధుర్య, యెడపాటి యెఱ్ఱ
నార్య ప్రణీతంబైన మల్ఙణచరిత్రంబను
మహాప్రబంధంబునందుఁ ప్రథమాశ్వాసము.

ఇతర ప్రతులు

మార్చు
 

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.