శృంగార మల్హణచరిత్ర/తృతీయాశ్వాసము

శ్రీః

శృంగార మల్హణచరిత్ర

తృతీయాశ్వాసము

క.

శ్రీరంగధామమంగళ
కారణకరహాటలాటకర్ణాటకగా
ధారనరనాధకృతస
త్కారగుణౌన్నత్య చుండికాళామాత్యా.


వ.

అవధరింపుము సుశీలుండు మలహణున కిట్లనియె.


సీ.

అవని నవంతికయను పట్టణంబున
                   వెలయ శ్వేతుండను విప్రుఁ డొకఁడు
తలిదండ్రిమాట వీనులఁ జేర్పఁ డెన్నఁడు
                   గురులయానతి యన్నఁబరుస నౌను
బాంధవు లన్నను బరిహాసములు సేయు
                   విద్వాంసు లన్నను వెక్కిరించు

పెద్దలఁ గన్నను బ్రేమముల్ పల్కును
                   మౌనులఁ బొడగన్న మండిపడును
దైవతాంతర మన్నను దప్ప నాఁడు
జపతపంబులు దలఁచినఁ జప్పరించు
క్రతువు లన్నను మాటకె కల్లలాడు
నతిథు లన్నను మండచు నడిచిపడును.


సీ.

దరిబేసు లన్నను దద్దయుఁ గొనియాడు
                   జైనుల గన్నను సంతసిల్లుఁ
గుచ్చితకాండ్రన్న గొండాటములు సేయుఁ
                   బాషండు లన్నను బరిణమించు
మాతంగు లన్నను మఱిచేరరమ్మనుఁ
                   బలుగాకు లన్నను భక్తిసేయు
భాండికు లన్నను బాయఁ డేప్రొద్దును
                   గుండగోళకు లన్నఁ గుస్తరించు
జారచోరులఁ గన్నను సంతసిల్లుఁ
గట్టుపోతులఁ బొడగన్న గౌఁగిలించు
నేభ్యరాసులఁ బొడగన్న నిచ్చగించు
దూషకుల గన్నఁ దెగఁబాసి తొలగఁ డెపుడు.

చ.

వెలితల బుట్టమందు లిడ వేఁదుఱు బెట్టును జూదమాడ ని
చ్చలు చని జూదకట్ట కడసారెకు నొడ్డున కోడిపోరు లే
బలితపుటాటకైనఁ బయిపందెము పెట్టును జాగిలంబులున్
వలలు ఘటించి వేఁట సని వంచన లేక వధించు జీవులన్.


గీ.

కుడువఁ గూర్చుండి యప్పు డాకూటికడను
జందె మొకచేతఁ బట్టుక సంధ్యవార్చుఁ
గాళ్ళుచేతులు నెన్నఁడుఁ గడుగుకొనఁడు
విడుచుఁ గాల్మడి నిలుచుండి నడచినడచి.


సీ.

మరపి సన్న్యాసుల మాచకమ్మలఁ గూర్చి
                   తలవరులకుఁ జెప్పి దండుగోర్చు
తివిరికొత్తములొద్దఁ దీర్థవాసుల నిల్పి
                   పరిహాసములు చేసి బండుసేయు
వెస దిగంబరులకు వీర్యంబు గల్పించి
                   సంతలఁ గదియించు సాధుఁ బోలి

పరచుటిల్లాండ్రను బైకొని బ్రమయించు
                   దనుఁదానె బ్రమయించి ధనము దివియు
మెరసిపో నింటివారల మేలుకొల్పి
తవిలి దొంగలచేతికి దాళ్ళునిచ్చి
రూఢిఁదాతను గొంతిగొట్లాడఁ బెట్టి
నిక్కి తననీడఁ దనుఁదానె వెక్కిరించు.


సీ.

పాంచరాత్రిక మన్నఁ బాడును దిరునామ
                   మరిగూడుకొని యడియఁడ నటంచు
బంతిపబ్బ మటన్న బరువెత్తు బూడిదె
                   పెండెకట్టులు చాలఁ బెట్టుకొనును
కాకొల్లిపర సన్నఁ గదలును నెదురుగాఁ
                   దలవిరఁబోసుకొ దాటుకొనుచు
శివసత్తి దె మ్మన్న గవుదలు మెడనిండఁ
                   బూతచెందిరమును బూసి వెడలు
చెలఁగి రాజులతం తన్న చిమ్మటరుగు
బడుచుగల పాటఁ బాడుచుఁ బాత్రలాడు
బొలుచు షడ్దర్శనంబుల పూతకోక
యనఁగఁ జరియించుచుండె నయ్యవనిసురుఁడు.

సీ.

వలను మీఱఁగఁ జంద్రవంకతోఁ దిరునాము
                   పెట్టి గందపుగీరుబొ ట్టమర్చి
నడుమ విభూతి నిండఁగఁ బూసి యాలోన
                   జుక్కబొట్టును దిరుచూర్ణ మునిచి
చిగురుగోళ్ళను జాఱు సిగ నిక్కఁగా వేసి
                   కదలిపూఱేకులు గానఁ జెరివి
నెఱికదుప్పటి కొంగు నేలజీరఁగఁ గప్పి
                   వెలిదూలగోణాము వేళ్ళవిడిచి
కప్పువెట్టిని మునిపండ్ల కడలు విడెముఁ
జప్పరింపుచు బెదవులు సందుకొల్పి
గిరుకు సంబువు కాళ్ళను నొఱయమెఱయ
నిక్కుచును నీల్గుచును వట్టినీటుతోడ.


సీ.

జంతలఁ గనుఁగొన్న సరసంబు లాడుచుఁ
                   జెడిపెలఁ గనుఁగొన్నఁ జేరఁజనుచు
భాండీరులను గన్నఁ బ్రాణంబుఁ లొసఁగుచు
                   దాసకాండ్రను గన్న నాసపడుచు
దేబెలఁ గనుఁగొన్న వాబల్మిఁ జూపుచు
                   దాసికత్తెల గన్నఁ దారసిలుచు

దాసిజనముఁ గన్నఁ దకపికల్ వెట్టుచు
                   ద్రాగుఁబోతులఁ గన్నఁ దనిసినగుచు
జారులను గన్నఁ జప్పట్లు చఱచుకొనుచు
వేశ్యలను గన్న మోముల వ్రేలఁబడుచు
బందెతలఁ గన్నఁ గదలక యండగొనుచు
వింతయును గన్న దూరంబు వేగజనుచు.


క.

మరగి కడునప్పురంబునఁ
దిరుగుచుఁ బెనులెస్స దేశద్రిమ్మరి యనఁగా
బరికించి యెల్లచోటుల
వెరవారగ వెఱ్ఱివేసి విరిసినపిదపన్.


క.

విటతాటకియను లంజెయు
సటలంబడి సొక్కి సొక్కి సదమదమై తా
నటునిటుఁ బోవక జాలక
చిటిముడిచేఁ గాసులెల్ల చెల్లఁగఁ గొఱకెన్.


క.

శతవర్షంబులు వెళ్ళిన
యతికష్టపుజంతు గాన నదియున్ వానిన్
గతిచెడి నవ్వక పిలువఁగ
బతిచెడి యయ్యింతిపొందుఁ బాయక యతఁడున్.

చ.

మునుకొని పట్టుగొఱ్ఱియల మ్రుచ్చిలి రాత్రులఁ దెచ్చియిచ్చు నొ
య్యనఁ దెరవాటుగొట్టి కలయర్థము దానికిఁ బెట్టుకావటం
గనలుచు రేయునుం బగలుఁ గట్టెలు నీళ్ళును మోచు పారునే
పనులకుఁ దానె పంచఁగల పాటులనుంబడు నెల్లభంగులన్.


చ.

తటతట దంతకాండములు దాఁకగఁ బ్రక్కలు వీపు వంపఁగా
జొటజొట నీళ్ళుముక్కులను జూడ్కులఁ గ్రమ్మఁగఁ గాళ్ళుఁజేతులున్
చుటచుట గోరబోర నెటు చూచినఁ దానగు శీతవేళలన్
దుటదుటఁ బాఱుచున్ బనులు దూకొనిచేయును దాని కెప్పుడున్.


ఉ.

ఎండను భూమి వత్సలయి యెల్లెడ శేషఫణామణిద్యుతుల్

గాండకరప్రభం బెనుపఁ జాలి తృణంబు తరుప్రకాండముల్
మండఁగఁ బొట్టయుం దలయు మాఁడఁగ నిప్పులు చల్లువేసవిన్
కొండల కేఁగి యాకలముఁ గూరలుఁ గాయలు దెచ్చు దానికిన్.


చ.

పిడుగులు వ్రేసి నల్గడల బ్రేలిపడన్ బెనుగాలి రువ్వనన్
సుడివడఁగొట్ట మేఘములు జోరున బాములు వ్రేల గట్టిన
ట్లుడుగక మిన్ను దూటుపడెనో యన బెన్ జడివట్టిమోదఁగా
జడియక వానకాలమున సారెకుఁజేయును దానికిం బనుల్.


క.

తలయొడ లెఱుఁగక యీగతి
వలచి కడుం దిరిగి దాని వలఁబడి దానున్
నిలుకాల నిలువఁదీఱక
మెలఁగంగా నొక్కనాఁడు మెలఁతుక యంతన్.

క.

తలకడక యర్ధరాత్రం
బలరఁగ నయ్యమ్మపూజ కలరులు దేవా
తలఁప వనవుడును దానికిఁ
దలఁకుచుఁ దానున్న నిచట దాఁచితి ననుడున్.


గీ.

పాఱినగరితోఁటపైఁ గావ లున్నట్టి
వారికన్ను మొరిగి బీరమునకు
కోట వెలుగు బ్రోకి గొబ్బున దిగజాఱి
విరులు చాలఁ గోసి వెడలిమగుడి.


క.

తడవాయె ననుచుఁ గామిని
కడుఁ దిట్టునొ మిన్న కేనిఁ గట్టునొ కొడిమల్
వడి నేమి సేతు నిఁక నని
వడి దప్పకయుండె నతఁడు పరుగున రాగన్.


క.

మంకుతనంబున హేయపుఁ
బంకములో నొక్కపూవుఁ బడుటయు దానిన్
శంకించి తివియ నోడుచు
శంకరు కర్పణ మటంచుఁ జనియెను వేగన్.


వ.

చని ముందటం బెట్టిన మండిపడి యింతతడ వుండుట కేమి నిమిత్తంబు, యపవిత్రజన్మంబునం

బుట్టిన నిన్నుఁ బావనుని జేసితి కృతఘ్నుండవై మఱచితే యని యదల్చిన నతండును గజగజ వణంకి యియ్యపరాధంబు సహింపుమని పదంబుల కెరఁగిన శిరంబుఁ దన్ని విదల్చుకొనుచుఁ గోపావేశంబున నుండె నంత వనపాలురు మేలుకాంచి తలవరుల కెఱిఁగించిన.


క.

కొలకొలన పట్టు నేచని
యిలచుట్టుక వాని దాని యిలఱేనికడన్
తలవరుల నిల్పి వారల
దలిరులునుం దెచ్చి చూపఁదగునే యనుచున్.


క.

ఇలఁ దిట్టుకొంచు మోదుచు
నులుకం గదియంగఁ గనలి యుద్యానములో
పలి కెట్లు వీఁడు చొచ్చొ
తలఁ కించుక లేక యనిన ధరణీశుండున్.


గీ.

చంపవలదు వీండ్ర సర్వస్వమును గొని
విడిచి యిప్పురంబు వెడలఁద్రోయుఁ
డనినఁ దలవరులును నట్ల వారలచేతి
విత్తమెల్ల దోఁచి వెడలద్రోఁయ.

క.

అర్థము తను గడియించును
నర్థంబును దాఁ గడించునది యాయన కా
వ్యర్థంపుముండ యూరకె
యర్థమునకుఁ బొగిలిపొగిలి యసువులు తొలఁగెన్.


వ.

అంత నతండును దద్వియోగవేదనం గ్రాఁగి శరీరంబు దొఱంగుటయు యమకింకరులుం బఱదెంచి వానిఁ బట్టుకొనిపోయి జమునిముందటం బెట్టిన బిట్టుమిట్టిపడి యతండును.


గీ.

చిత్రగుప్తులఁ బనిచి యీచెడుగు చేసి
నట్టిదోషంబు లేమేమి యనిన వారు
కవిలె వీక్షించి వానిపైఁ గనలిపడుచు
దేవ వినుమని చెప్పిరి తేటపడగ.


సీ.

పశుహత్య లన్నను బదునేడులక్షలు
                   స్త్రీహత్య లన్ననుఁ జెప్ప నరిది
శిశుహత్య లనిన నెంచెదము మేమనరాదు
                   బ్రహ్మహత్యలు వే లపరిమితములు
నర్బుదంబులు దాటు నటు భ్రూణహత్యలు
                   చౌర్యవర్తనములు సంఖ్య గడుచు

బరదారసత్వముల్ పరికింప మితి లేవు
                   తక్కుదోషంబులు లెక్కలేవు
కడలి తరఁగలైన నుడుగణంబైనను
నిసుకరాసులైన నెంచవచ్చు
వీఁడు చేసినట్టు వివిధపాతకములు
తలఁప బ్రహ్మకైనఁ దరము గాదు.


వ.

అనుటయు దండధరుండు మండిపడి వానిం జూచి నిజకింకరులతో నిట్లనియె.


సీ.

పరసతిపై దృష్టి పఱపినఁ గన్నుల
                   నెఱ్ఱఁగ్రాఁగినయట్టి యినుముఁ బ్రోయు
డితరాంగనలయిండ్ల కేఁగిన పదముల
                   నాటుఁడు క్రొవ్వాడి నారసములు
మొనసి యొండులసొమ్ము మ్రుచ్చిలు చేతులఁ
                   జొనుపుండు సూదులు మనిపి నినిపి
యన్యకాంతలచన్ను లానిన యురమున
                   నెత్తుఁడు కరఁగిన యినుపముద్దఁ
జేరి కొండెంబు నొరులకుఁ జెప్పినట్టి
జిహ్వఁ గత్తుల నింతింత చీఱి విడుఁడు

మించి యన్యాయవిత్త మార్జించినట్టి
కుటిలదేహంబు ఱంపానఁ గోయుఁ డిపుడు.


గీ.

ఇతరకాంతలఁ దనతోడ నిచ్చగించి
యుపరిసరతంబు సలుపంగ నొడ్డుకొన్న
యల్లచోటులఁ గ్రాగిన యట్టి లోహ
పాత్ర నెత్తుఁడు కడుఁగ్రాఁగి భస్మముగను.


ఉ.

పట్టుఁడు కారులం దవుడ పండులు డుల్లఁగవ్రేసి సంపెటన్
గొట్టుఁడు కర్పటం బవియ గ్రుద్దుల ద్రొబ్బుఁడు చిల్లఁగోలలన్
గుట్టుఁడు గొంతుకోల ముకుగోళ్ళను మొత్తుఁడు తప్తలోహముల్
చట్టనఁ జీఱి పొట్ట నిడి చర్మముఁ దీయుఁడు తిత్తి దోఁపుడున్.


వ.

అనుటయు దేవా! యితం డొక్కనాఁ డర్ధత్రంబున వేశ్యకుం బూవులు గొనిపోవునెడ నపాత్రస్థలంబున నొక్కపుష్పంబు పడిన నది తనకుం గొఱగామి శివార్పణంబు చేసెనని

చెప్పిన మహాభుజంగంబునకు బజనిక చూపినట్టుం బలె నమ్మాటకు నుపశమించి యతని నీరాత్రి రంభాసంభోగంబు చేయించి పిదప దండింపుఁడనిన వారలు దండధరునానతిం జని యావృత్తాంతంబంతయు నెఱుంగ రంభ కొప్పంజెప్పిన నారంభయు నతని యభ్యంతరగృహంబునకుం గొనిపోయి.


గీ.

హంసతూలికపాన్పుపై నతని నునిచి
యుచితగోష్ఠుల మెల్లనె హృదయ మెఱిఁగి
యిష్ట మొనరించి యధికసంతుష్టుఁ జేసి
బుద్ధి చెప్పంగఁదొడఁగె నప్పువ్వుఁబోఁడి.


  •                   *         *                      *                      *


క.

ఒకపుష్పము సర్వేశ్వరు
నకు నిడి కాంచితివి నీవు నవ్యసుఖం బి
ట్లకటా శివు నర్చించినఁ
బ్రకటంబుగఁ బడయరాని పదవులు గలవే!


క.

ఈయింద్రుఁ డీకుబేరుం
డీయసురపుఁ డీయగస్త్యుఁ డీపద్మభవుం

డీయురగశాయి మొదలుగఁ
గాయజహరుసేవఁ గాదె ఘనులై రెపుడున్.


క.

అన రంభతోడ వాఁ డి
ట్లను నా కివి యేల యింక నతివా, నీతో
డను గూడు సౌఖ్యమునకును
బ్రణుతింపగ నజహరీంద్రపదవులు సరియే?


వ.

అనుటయు రంభ వానితో నిట్లనియె.


గీ.

ఉఱకె త్రెడ్డు నాకి యుపవాస ముడిగిన
ట్లేల చిన్నపనికి నింత వినఁగ
హరుని నాల్గుజాము లర్చింపు మఖిలసౌ
ఖ్యములు దాన నీకు నబ్బఁగలవు.


  •                   *         *                      *                      *


గీ.

సౌఖ్య మనుభవింప సంతతపుణ్యంబుఁ
బోవు మూలధనము పోయినట్టు
వరుసఁ బుణ్యధనము వర్ధిల్లునట్లుగా
నిత్యసౌఖ్య మంద నేర్చు టురవు.


  •                   *         *                      *                      *


గీ.

మలముఁ దోలు నెమ్ముకలును శ్లేష్మంబును
మొదలుగాఁగనైన ముఱికిడొక్కఁ

జూచి లంజెలెల్లఁ జొక్కుదు రూరక
యిందువలన సౌఖ్య మేమి గలదు.


గీ.

జనకునాన నీదు జనయిత్రి మీఁదాన
ప్రాణసఖునియాన భర్గునాన
గురువులాన శంభుఁ గొలువవే యనవుడు
మూర్ఖుఁ డతఁడు చెవులు మూసికొనియె.


గీ.

అపుడు రంభ సూచి యల్లన నవ్వుచు
నూరకున్నఁ బలికె వారిదాసి
శ్వేతమయ్య, చనవుఁ జేకొను నామీఁది
యాన సేయవయ్య, యక్కమాట.


గీ.

వెఱచి యుల్కిపడుచు విదలించుకొని లేచి
యింతమాత్రమునకు నింత యనినఁ
జెప్పు మేమియైనఁ జేసెద నీమాట
యనిన రంభ పలికె నతనితోడ.


క.

అచలస్థితి బాహ్యాంత
శ్శుచివై యీనాల్గుజాము సోమార్ధధరున్
రుచితోఁ బూజింపుము కృ
ష్ణచతుర్దశి సలుప మేలు జాగరమునకున్.

క.

పరమేశు నాఁటిరాత్రిన్
బరికించినఁ దమకు నిలువ భార మటంచున్
దురితంబులు నిద్రాకృతి
సురమునిముఖ్యులకునైనఁ జూడ్కులఁ గ్రమ్మున్.


వ.

అని చెప్పి రుద్రాక్షభూతిభూషణుం గావించి నిజోద్యానమున నున్న శివలింగంబునకు మ్రొక్కించి గంధపుష్పాక్షతలు, ధూపదీపనైవేద్యంబులు సమర్పించి సర్వేశ్వరున కర్పించుమని యతనికరంబున కొండొండ యందిచ్చుచుం బ్రియంబున.


సీ.

అర్కపుష్పంబుల నభవునిఁ బూజింపఁ
                   బరధనాహరమహాపాప మణఁగు
దూర్వాంకురంబుల శర్వునిఁ బూజింపఁ
                   బరసతీసంగమపాప మణఁగు
తులసీదళంబుల ధూర్జటిఁ బూజింపఁ
                   బరనిందచే నైన పాప మణఁగు
మారేడుదళముల మఱి శివుఁ బూజింప
                   బ్రహ్మహత్యాదికపంక మణఁగు

నష్టగంధంబుల నభవునిఁ బూజింపఁ
                   బరహింసనక్రియాపాప మణఁగు
ధూప మర్పింపఁ గలుషనిర్ధూమకరము
దీప మర్పింప నజ్ఞానతిమిర మణఁగు
నక్షతలఁ బూజ సేయఁ గామ్యార్థ మొదవు
భవుని భావింప సాయుజ్యపదము గలుగు.


క.

వెలిదమ్ములఁ గెందమ్ములఁ
గలువలఁ జెంగల్వవిరులఁ గాంచనములఁ దు
మ్ముల మఱి దుత్తూరంబులఁ
గలయఁగఁ బూజింపు మఖిలకలుషము లణఁగున్.


క.

విమలంబుగ నైవేద్యము
నమరఁగ సర్వేశ్వరునకు నర్పించిన రా
జ్యము గల్గు వీడియమ్మునఁ
నమితంబుగ సౌఖ్య మొదవు ననవరతంబున్.


గీ.

అనఁగ నతఁడు శివుని నట్ల నాలుగుజాలు
నోజ మేలుకాంచి పూజ సేయ
వేగ వచ్చినంత వేవేగ జముభటుల్
వచ్చి రంభ యింటివద్ద నిలిచి.

మత్తకోకిల.

నిన్న నే మిట నప్పగించిన నీచుఁ డెక్కడ నున్నవాఁ
డన్న వారలతోడ రంభయు నల్లవాఁడని చూపినన్
కన్ను విచ్చియుఁ జూడ భీతిలి కంప మొందుచు నేఁగి యా
సన్నవర్తనుఁడైన కాలుని సమ్ముఖంబునఁ జెప్పినన్.


గీ.

జముఁడు మండుచు వానిపైఁ జంప నలిగి
యరుగుదేరంగ శివదూత లతనిఁ బిలువ
వరవిమానంబుఁ గొంచును వచ్చుటయును
జూచి వెఱఁ గంది మదిఁ గుంది చోద్య మంది.


క.

భూతపతియాజ్ఞఁ దప్పిన
నాతత మతఁ డల్గవచ్చు నగు నేమిటి కీ
పాతకున కడ్డ నేటికి
నీతెఱఁ గెఱిఁగింపుఁ డనిన నెంతయు వారల్.

క.

శివరాత్రి నాల్గుజాలును
శివునిం బూజింప నొండె శివనామంబుల్
శివలాంఛనములు దాల్పను
శివుఁ డతఁడేకాక మర్త్యజీవుఁడె చెపుమా.


వ.

అనవుడు నజ్జముండు శివదూతలతో మును మార్కండేయునికై శివునిచేతం బడినపాటులే చాలు మీమహత్త్వంబు నెవ్వ రెఱుంగంజాలుదు రని నమస్కరించి జముండు నిజస్థానంబున కరిగె నంత నాశ్వేతుండును విమానారూఢుండై శివునిసన్నిధికిం జని సాష్టాంగదండప్రణామంబు లాచరించినం జూచి సర్వేశ్వరుం డతనికిఁ బ్రమథపట్టణంబుఁ గట్టెం గావున నుత్తమగుణంబులు గల వారాంగనలం గలసినవారలకు మోక్షంబు సిద్ధింపకుండునే యని సుశీలుండు చెప్పిన విద్యానిధియు నది యట్ల తప్పదని యందఱ నుపచరించి పొండని యనిపిన వారును మలహణుండును జనుదెంచి రంత.


క.

ప్రాచీనవధూలలామ ప్ర
తీచీసతిమీద నగవు దీపింపంగా

వైచిన మణికంకణ మనఁ
బ్రాచుర్యస్ఫురణఁ దరణి పడుమట వ్రాలెన్.


క.

ఇనుఁ డపరజలధి శశి తూ
ర్పునఁ దోఁచిరి గెంపు వదలి పొలుపొంద నభం
బనుదంతికి నిరువంకల
గనకపుఘంటికలు సురలు గట్టిరొ యనఁగన్.


క.

వలిచెంగావులుఁ గపురపు
గుళికలు పరితాప మణఁచుకొఱకై దివిజుల్
మలహణు కొనగూర్చిరొయన
నెలకొనె నీరసముతోడ నింగిం జుక్కల్.


మ.

అట కాంచెన్ ధరణీసురుండు నవసంధ్యావేళ వేలాగ్రప
ర్యటనేందీవరసాంద్రకందళమరందానందధారావళీ
నటదిందిందిరబృందతుందిలసదానందేందిరావందివి
స్ఫుటగానామృతసారసారముఁ గనద్భూసారకాసారమున్.

చ.

(?)వ్రతమున లోన దేఁటి యనుపన్ ముకుళించెడు తమ్మి యొప్పె నా
రతి సఖినిం బరండి వలరాజు రవాజు రధాంగరావముల్
హితమతి నేకతంబ తగ నిందిరనర్తనశాల యానిశా
పతి చెఱఁజిక్కి కూయు పసిబాలికఁ బొంద వధూటియో యనన్.


సీ.

ఇంచుపయ్యెదక్రేవ నించుక గాన్పించు
                   శచిదేవి దాపటికుచ మనంగ
విరహులపై దండు వెడలంగఁ దమకించు
                   వలరాజు కెంపుగోవడ మనంగ
ఘనజగన్మోహనగంధచూర్ణం బిడ
                   రంజిల్లు రత్నకరండ మనఁగ
నమరేంద్రముఖ్యు లొయ్యనఁ గ్రోలనిచ్చినఁ
                   గొమరారు నమృతంపుఁగుంభ మనఁగఁ
గాయసిద్ధికి సిద్ధసంఘంబు లెల్లఁ
గూర్చు సిద్ధరసంబులఘుటిక యనఁగ

నమరు రతిదేవి మెఱుఁగుటద్దమొ యనంగ
నిందుఁ డుదయించె లోచనానందముగను.


వ.

అంతట నామలహణుండును సంధ్యాదికృత్యంబులు దీర్చి పుష్పసుగంధిం దలంచి సుశీలుతోడ నిట్లనియె.


క.

ఉడుగని విరహానలమునఁ
బడి వడిఁ గడునొచ్చి మిగుల బడలినవారిన్
గెడగూర్చుకంటెఁ బుణ్యము
వడిఁ బాపఁ దలంచుకంటెఁ బాపముఁ గలదే.


గీ.

విరులు గంధంబు మిగులను వెట్ట యగును
చెలులమాటలు చెవులకుఁ జేఁదు లగును
ప్రాణపదమైన యంగనఁ బాయుకంటె
మఱియు దుఃఖంబు గలదొ యిమ్మహిఁ దలంప.


ఉ.

మక్కువఁ బుష్పగంధి పురమర్దనుసన్నిధి నాటలాడి తా
నిక్కువ కేఁగుదేరఁగ రతీశ్వరు పట్టపుటేనుఁగో యనన్

జెక్కుల మించుతేజమును సిబ్బెపుగుబ్బలు మందయానముల్
చొక్కపుఁ గాంచికారవము సొంపును నామదిఁ బాయ దెప్పుడున్.


చ.

నిలిచినయట్టిఠావునను నిల్వఁగ సైఁపదు డెంద మెంతయున్
గలచినయట్టు లయ్యెడును గంటికి నిద్దుర రాదు దేహమున్
గొలుపక లేచిన ట్లగుచుఁ గ్రుమ్మరిలంగను సైఁపవచ్చునే
కలదొకొ పుష్పగంధి నిఁకఁ గన్గొనుభాగ్యము నాకు నిమ్మెయిన్.


వ.

అనుటయు సుశీలుండును మలహణునిం జూచి పుష్పగంధి జనయిత్రిహృదయం బరసివచ్చెదఁ జింతింపకుండుమని యతిరభసంబునం జని మదనసేనం గనుంగొని యిట్లనియె.


క.

ధనము గడియింపవచ్చును
విను మెవ్వరికైన మంచివిద్యయుఁ బుణ్యం

బును గీర్తి గలుగుఁ బొందులు
వనితా, ఘటియింపరాదు వసుమతిలోనన్.


క.

మలహణ పుష్పసుగంధులు
వెలయంగాఁ గూడి చదువ వీనుల కింపై
యలవడు పరమానందము
తలఁపఁగ నిపుడేల పాసి తక్కరొ, యనినన్.


క.

నెట్టుకొని వట్టి మాయలఁ
బెట్టకుమీ నీవు మీనుపిల్లల కీఁతల్
పుట్టించి వేయుమాడలు
వెట్టక మరునైనఁ బూట పిల్వఁగ నీయన్.


గీ.

కుడువఁ గట్టలేదు కొండిక తనవంక
వట్టి నింద పడఁగవలసె నుఱక
చదువు దయ్య మెఱుఁగుఁ జాలును బదివేలు
వచ్చె నతనిపొందు వలదు మాకు.


క.

మలహణు సుద్దులు చెప్పకు
తలఁపఁగ వెనుకటివె చాలుఁ దక్కినవేమో
తెలుపుము పురిలో వార్తలు
కలివోసిన నుట్లవంకఁ గనుఁగొనఁ దగునే.

ఉ.

ఎక్కినవానికిం గుఱుచ యేనుఁ గటన్నవిధంబు దా మదిం
బొక్కుచు నల్లనాఁటి మనపుష్పసుగంధి యటంచుఁ జూచెనో
మక్కువ గల్గెనేని వెడమాటలు మాయలు మాని గ్రక్కునన్
రొక్కము వేయుమాడ లిటురో వెలఁ దెమ్మను మొక్కపూటకున్.


వ.

అనుటయును సుశీలుండు పుల్లసిల్లి యేదియు నాడలేక మగుడంజనియె. పుష్పగంధియుఁ జాలమార్గంబునం జూచి పురపురం బొక్కుచున్న నతిమూర్ఖుండైన యవ్వైశ్యుండును.


సీ.

మొగ మెత్తకుండినఁ దగిలి వీడియ మింద
                   యనుచుఁ జేతులు వట్టి యదుముకొనును
జూడ కూరకయున్న సుద్దు లేమందువు
                   చెప్పుమంచును మీఁదఁ జేయి వేయుఁ
బలుక కూరకయున్న బాపులే నీవలెఁ
                   బండుకోరాదని పట్టుఁ జెయ్యిఁ

గదియ కూరకయున్నఁ జదువులు చదువుచు
                   నిది మేలు కాదని యెత్తుకొనును
గన్ను మూసిన పొట్టిరాగాలు సేయు
నదరిపడి మిన్న కేనియు నావులించు
నిదురవోనీఁడు మేల్కని నిలువనీఁడు
వెలికినేఁగిన దానును వెంట నరుగు.


క.

నిలుకాల నిలువనీయక
కలుషాత్ముఁడు బాధ పెట్టఁగా విధి నాత్మన్
బలుమాఱు దూఱుఁ గోమటి
కొల యెక్కడ గలిగెనంచుఁ గుందుచు నాత్మన్.


సీ.

మందులు పెట్టితో మఱగి మాపటినుండి
                   గుండె దీసినదనుఁ గొంతతడవు
పైత్యంబు గానోపు బగబగమనుచునో
                   కొలుపుచున్నది యను కొంతతడవు
తలనొప్పి ఘనమోరి తల యారదో యని
                   కూఁతలు పెట్టును గొంతతడవు
కనుదృష్టి దాఁకఁబోలును నాకు నని యావు
                   లింతలు వెట్టును గొంతతడవు

కడుపులో నంటుసొంటేమొ వడిగ నిపుడు
కుట్టుచున్నది యనుచుండుఁ గొంతతడవు
తివిరి దయ్యంబు పట్టెనో దేహమునకు
గుణముగా దనుచుండును గొంతతడవు.


క.

పుటపాకం బగు వేదన
నెటువలె సైరింపవచ్చు హృదయేశ్వరు కౌఁ
గిట సౌఖ్యజలధిలోపల
నటయంతయుఁ దెలియ నోలలాడక యున్నన్.


క.

బెడిదమగు విరహవేదన
వడివేగగ వీనిచేత బాధయు నయ్యెన్
వడి గోరుచుట్టుమీఁదను
నడరఁగ రోఁకంటిపోటు ననుచందమునన్.


క.

అసియాడెడు నెన్నడుమును
వసివాడిన దేహలతయు వాడిన ఱెప్పల్
దెస లాలకించు వీనులు
కసుగందిన నెమ్మనంబుఁ గదురగ నంతన్.


క.

అలుగుచు నలుగుచు గలఁగుచు
నలికుంతల వానిబాధ నటు వడుచుండెన్

పులిచేత చిక్కువడి మదిఁ
గొలుపక పొరలాడు జింకకొదమయుఁ బోలెన్.


వ.

ఇట్లు పుష్పసుగంధి వేగించుచుండె నంత నక్కడ సుశీలుండును జని మలహణుం గనుంగొని మదనసేన యాడిన కర్ణకఠోరవాక్యంబు లించుకించుక సూచించిన నతండు నిట్టూర్పు నిగుడించి యిట్లనియె.


సీ.

ఏ నేల చదివితి నెలదీగెబోఁడితోఁ
                   గనగూడి చదువెల్లఁ గడమలేక
చదువుదుఁగా కేమి జలజాస్య దా నేల
                   నాతోడునీడయై నడవఁదొడఁగె
నడచుఁగా కేమి నానయనచకోరంబు
                   లిందుబింబాస్యపై నేల వ్రాలె
వ్రాలెఁగా కేమి యావనితకు నాకును
                   హృదయంబు లవి యేక నేక మయ్యె
నయ్యె నయ్యెనుగా కేమి యలమృగాక్షి
కకట, యెలప్రాయ మది యేల యలముకొనియె
నలముకొన్ననుగా కేమి చెలియ నన్నుఁ
బాతకపుదైవ మిట్లేల పాయఁజేసె.

సీ.

కానంగఁ గలదొకో కమలాయతాక్షిని
                   గలలోననైనను గన్నులార
నానంగఁ గలదొకో హంసేంద్రగామిని
                   చనుదోయి యురమునఁ జాదుకొనుచుఁ
గ్రోలంగఁ గలదొకో గురునీలకుంతల
                   యధరామృతము చవు లాత్మఁ దనియ
భావింపఁగలదొకో భామాలలామతో
                   నసమానరతికౌశలానుభవము
వినఁగఁగలదొకొ యొకనాఁడు వీను లలరఁ
దరుణి మునుబోలె శంభుగీతములు పాడ
నిలువఁగలదొకొ యొకనాఁడు నెలఁతఁ గూడి
లీల మెఱయంగ నంగజకేళిఁ దేల.


సీ.

అంగన మధురోక్తు లాలకించినఁగాని
                   వీను లన్యులమాట వినఁగరోయు
వెలఁది విలాసంబు వీక్షింపనే కాని
                   చూడ్కు లన్యంబును జూడరోయుఁ
గలకంఠి తనువల్లిఁ గౌఁగిలింపనె కాని
                   తను వన్యకాంతల దాయరోయు

జలజాక్షి కెమ్మోవి చవి యాననే కాని
                   జిహ్వ యన్యంబు రుచింపరోయుఁ
జిత్త మన్యులఁ గలనైనఁ జేరరోయుఁ
గోర్కు లన్యంబు లెవ్వియుఁ గోరరోయుఁ
దలఁపు లన్యంబు లెవ్వియుఁ దలఁపరోయుఁ
గలదకో సుమగంధిని గలయ నాకు.


క.

వనిత నెడబాయఁజాలక
తనువున నిడుకొన్న శివుఁడు తా సర్వజ్ఞుం
డనయము నొండులతనువులు
తనవలెనే సేయకునికిఁ దగవా తనకున్.


గీ.

వెలఁదికిని నాకుఁ బొందులు వేఱుసేసి
ప్రాణములు వేఱుచేసెను బాపజాతి
బ్రహ్మ యిరువురి తనువులుఁ బ్రాణములును
నేకముగఁ జేయఁడాయె నింకేమి గలదు.


క.

వేడుకఁ బుష్పసుగంధిని
గూడుండేనాళ్ళవలెను గొనకొని యాత్మన్
గూడుకొనె నొక్కలెక్కను
నీడుగ నలతమ్మిచూలి యీదివసంబుల్.

ఉ.

చొక్కపు ముద్దునెమ్మొగము సోగమెఱుంగును నోరచూపులున్
జిక్కని గుబ్బచన్నులును జెల్వగు నీవరరూపవైభవం
బక్కట నామనోంబుజము నంటె సమస్తము డించి యొంటి నీ
వెక్కడనున్నదానవు మృగేక్షణ, పుష్పసుగంధి, చెప్పవే.


గీ.

కన్ను విచ్చినపుడు కాన్పింతు మనసునఁ
గన్నుమూయ నెదుటఁ గదలకుందు
పట్టఁ జిక్కువడవు ప్రాణేశ్వరీ, యింత
యింద్రజాలవిద్య యెఱిఁగి తెట్లు.


సీ.

నీముద్దుమాటలు నిరతంబు విఁనగోరి
                   తవిలి నావీనులు తపము సేయు
నీగుబ్బచన్నులు నెమ్మిఁ గౌఁగిటఁ జేర్పఁ
                   దవిలి నాహృదయంబు తపము సేయుఁ
జక్కని నీమోవిచవి యానఁగాఁగోరి
                   తవిలి నానాలుక తపము సేయు

నీమోహనాకృతి నిరతంబుఁ జూడంగఁ
                   దవిలి నాకన్నులు తపము సేయు
నీవిలాసంబు నాయాత్మ నెలవు కొల్పి
తలఁపు లన్నియు నినుఁ గోరి తపము సేయుఁ
బ్రాణములకును బ్రాణమై పరగు నీవు
యువిద, నినుఁ బాసి యెబ్భంగి నోర్చువాఁడ.


సీ.

అంబుధి దావాగ్నికైన నోర్చును గాని
                   యోర్వలేదు నదీవియోగమునకు
నబ్జారి రాహువుకైన నోర్చును గాని
                   యోర్వఁడు తారావియోగమునకు
హరుఁడు హాలహలాగ్నికైన నోర్చును గాని
                   యోర్వఁడు గౌరీవియోగమునకు
నభ్రంబు పిడుగులకైన నోర్చును గాని
                   యోర్వలేదు తటిద్వియోగమునకు
నతనుఁ డీశ్వరునయనాగ్నికైన నోర్చుఁ
గాని యోర్వఁడు రతివియోగంబునకును
విశ్వభయదోగ్రనిర్వ్యగ్రవిరహవహ్ని
నువిద నినుఁ బాసి యేభంగి నోర్చువాఁడ.

ఉ.

జక్కవ లుక్కుదక్క జలజంబులు స్రుక్కఁ జకోరరాజియ
న్నెక్క వియోగు లుక్క తటినీశుఁడు నిక్క మనోజు పంతముల్
దక్క ముదంబు కెక్కఁ గుముదంబులు చొక్కఁ దమంబు మక్క నా
చుక్కలఱేఁడు వేఁడి మిదె చూపెఁగదే వడిఁ బ్రాణనాయికా!


ఉ.

హాలహలంబు గ్రమ్మఱ నుదగ్రతఁ బుట్టెనొ చండభానుఁ డా
భీలత నన్నిమూర్తులను భీకరభంగిని గాయఁజొచ్చెనో
గాలుని తీవ్రమౌ ప్రళయకాలమహానల మేఁగుదెంచె నో
యోలిమిఁ జంద్రరోచు లిటు లుండునె చూడ్కికిఁ బ్రాణనాయికా!


చ.

ముదిరిన సాంద్రచంద్రికలు మొత్తపుచంచుపుటంబులం దిడిన్

గుదిలిచి చించి చీఱి కడుఁగ్రొవ్విన వెన్నెలగుజ్జు ముక్కునన్
ముదితల కందియిచ్చుచుఁ బ్రమోదము నొందెడు నాచకోరముల్
కదిసిన నీదుకన్నుల వికాసము దోఁచెను బ్రాణనాయికా!


ఉ.

వాలికలై మనోజభవు వాలికలై సరసాలిచారుదృ
క్కేలికలై చకోరముల కేలికలై కమలాలిహల్లకో
న్మాలికలై సుగంధవనమాలికలైన భవన్మనోజ్ఞదృ
గ్జాలిక లీనఁ జేసి మదిజా లిఁక మాన్పుము ప్రాణనాయికా!


ఉ.

ఇక్కిలి దక్కి నిక్కి మెఱుఁగెక్కి మొగెక్కి బిగెక్కి మిక్కిలిన్
గ్రిక్కిరి సొక్కమానమయి గ్రిక్కినఁ బక్కున విచ్చునో యనన్

బిక్కటి లుక్కుమీఱి తగుబింకపు నీచనుదోయి మాటునన్
జిక్కిన నేమొకాని మరుచేఁ బడరాదికఁ బ్రాణనాయికా!


చ.

వెర విఁక నేది నా కకట! వీఁడె మనోభవుఁ డేగుదెంచె వి
స్ఫురదళిశింజినీవికచసూనశిలీకధనుఃపికావళీ
వరకలకంఠకాహళరవస్ఫుటకంపితభూర్భువస్సువ
శ్చరుఁ డగుచున్ బ్రతాపమున సల్పెడి దే మిఁకఁ బ్రాణనాయికా!


ఉ.

ఎక్కడ నేదరింతు నిఁక నేవగఁ బట్టుదుఁ బ్రాణవాయువుల్
చిక్కితి మన్మథాగ్నిఁ గడుఁ జేసెడి దే మిఁకఁ గంబుకంఠి, యో
చక్కనికీరవాణి, జలజాతవిలోచన, పుష్పగంధి యే

చక్కటినున్నదానవు నిజంబుగ నా కెఱుగంగఁ జెప్పవే.


ఉ.

న న్నెడఁబాయఁజాల వొకనాఁటికిఁ గంటికి ఱెప్పకైవడిన్
గ్రన్ననఁ గప్పుకొందు విదె కంతుని బారిని దూరఁజిక్కితిన్
సన్న యెఱింగి మున్న రతిఁజల్లని తీయని ముద్దుకౌఁగి లిం
కెన్నఁడు నాకు నిచ్చెదు మృగేక్షణ, పుష్పసుగంధి, చెప్పవే.


వ.

అని విరహవేదనం బొగిలి పొగిలి మున్ను పుష్పసుగంధియు దానుం గూడియుండెడు నుద్యానవనంబులోపలికి నరిగి యిట్లనియె.


సీ.

హరిణంబ, కానవే హరిణాయతాక్షిని
                   మధుపంబ, కానవే మధుపవేణి
హంసంబ, కానవే హంసేంద్రగామినిఁ
                   బులినంబ, కానవే పులినజఘనఁ
గలకంఠ, కానవే కలకంఠకంఠిని
                   గిసలయ, కానవే కిసలయోష్ఠి

నవలత, కానవే నవలతాతన్వినిఁ
                   గీరంబ, కానవే కీరవాణిఁ
గానవే రంభ, రంభోరుకాండయుగళి
చక్రవాకంబ, కానవే చక్రకుచనుఁ
బుష్పవనవాటి, కానవే పుష్పగంధిఁ
జందురుఁడ, కానవే పూర్ణచంద్రముఖిని.


సీ.

విను సుధాకరుఁడవు విష మేల కురిసెదు
                   చందమా నీ కిది చందమామ
శీతాంశుఁడనుపేరు చెఱిచి నిప్పులు గ్రక్కఁ
                   జందమా నీ కిది చందమామ
కువలయాప్తుఁడ వయ్యుఁ దవిలి పాంథుల నేఁపఁ
                   జందమా నీ కిది చందమామ
శివునకు నవతంసమవు మరుఁ గూడంగఁ
                   జందమా నీ కిది చందమామ
విబుధులను బ్రోచుదాతవు వినుము నీవు
సుద్దములు బద్దములు గావు సుద్దు లెల్ల
నఖిలకళలందుఁ బ్రోడవైనట్టి నీకుఁ
జందమా హింస గావింపఁ జందమామ.

క.

అచ్చిన ప్రియసతిఁ బా సిటు
వెచ్చుచునున్నట్టి నాకు వేఁడిమిఁ జూపన్
వచ్చిన చోటికి వచ్చెదు
నిచ్చో ఫల మేమి నీకు నిందుఁడ యనుచున్.


వ.

అని మలహణుండు దుఃఖావేశంబున;


క.

కలయంగఁ గలుగు భాగ్యము
కలుగుట దుర్లభము చూడఁగల్గిన యేనిన్
గలసినయంతయ లేదా
వెలఁదుక నీమాటలైన విన్నం జాలున్.


వ.

అనుచు మదనోన్మాదంబున మలహణుండు “కామాంధోఽపి నపశ్యతి” యనియెడుం గావునఁ దనప్రియురాలిం దలంచుకొని పుష్పసుగంధియున్న మేడసమీపమునకుఁ జనుదెంచి నిలిచి నాయికమాట లాలకించుచుండె. అంత నప్పొలంతియు మలహణుం దలంచి యంతఃపరితాపంబు వారింప నుపాయంబు లేక యెంతయు.

సీ.

ప్రేమతోఁ బ్రియుఁడు చెప్పినగీతము ల్వాడి
                   యడరి డగ్గుత్తికపడి నిలుచును
సోమార్ధధరుమీఁది చూర్ణికల్ చదువుచు
                   హా ప్రాణనాయక, యని తలంచు
జంత్రంబు చూపుచు జాగులే వల్లభ,
                   నినుఁ బోల నెవ్వరు నెనయ రనునుఁ
దానమానములకుఁ దలయూఁచి మలహణ,
                   యెఱుఁగుదుగా నీవు నించు కనును
సుదతి ప్రాణేశు లోచూడ్కిఁ జూచి పొక్కి
బయలుఁ గౌఁగిట నిఱియించుఁ బరవశమున
నధరసుధఁ గ్రాఁగి పోవంగఁ గలఁగి కలఁగి
యెందు నున్నాఁడవో నన్ను నిచట నొంటి
డించఁదగవౌనె ప్రాణేశ, యంచు వగచు.


సీ.

అతనిసుద్దులు ప్రేమ నందంద తలపెట్టు
                   నతఁడు దిద్దిన చిల్క నడుగు మాట
లతఁడు చెప్పిన కత లర్మిలి వచియించు
                   నతనికైవడిఁ బాట లడరిపాడు
నతఁ డాడు సరసోక్తు లల్లనఁ బచరించు
                   నతనిగుణంబులె యభినుతించు

నతనిఁ గూడాడిన యచ్చోటులే యెంచు
                   నతనిభావమె తనయాత్మ నించు
నతఁడుఁ దానును ముట్టిన యట్టిమతులు
ముట్టి తలయూఁచి తనుఁ దానె తిట్టుకొనుచుఁ
జెలఁగి యాతఁడు దానును గలయు భావ
మంత భావించి శంకరా, యని తలంచు.


సీ.

వెలఁది నిట్టూర్పులు వెలికిఁ బైపడనీక
                   పూబంతిమీఁద నేర్పున వహించు
గ్రుక్కుచుఁ గన్నీళ్ళు కొలుకులఁ గ్రమ్మఁగ
                   నలుసు సోఁకినదని పులిమి తుడుచుఁ
దనువల్లి కాఁకఁ గ్రాఁగినపాన్పు క్రొవ్విరుల్
                   కనుపడనీయక వెనుకఁద్రోయు
వదలని తాపాగ్ని వడచల్లు మరుబెట్ట
                   పొరిఁబొరిఁ ద్రిప్పుఁ గప్పురపుసురటి
ప్రాణవిభు నాత్మ భావించుఁ బలవరించు
వెలికిఁ జను నిండువెన్నెల వేఁడికంత
నులికి లోఁజను నందును నుండలేక
పొగిలి వగఁ బొంది మదిఁ గుంది పుష్పగంధి.

క.

ఇందునిచే నొడ లుడుకన్
గుందును వెలిలోన మాడుకొఱవుల చూఁడన్
యెందు సహింపదు దైవము
ముందఱ నుయి వెనుక బొంద మొగి ననుటయ్యెన్.


క.

ఈవేళ మత్ప్రియుండగు
జీవితపతి మోముఁ జూడఁ జేకుఱెనేనిన్
దైవంబు కరుణ నాపై
నేవిధమునఁ జాలఁ గల్గు టెఱుఁగఁగ వచ్చున్.


గీ.

చంద్రకాంతపుగిండి వాసనజలంబుఁ
గొనుచు వాకిటి కరుదెంచి కువలయాక్షి
వెడఁదకన్నులుఁ బెదవులుఁ దడుపుకొనుచు
నుమ్మలిక నొయ్యఁ బుక్కిలించుమియుటయును.


గీ.

దద్దరముచేత నాచులోఁ దమ్మివిరిని
నున్న యెలతేఁటిపైఁ దేనె యొలికినట్లు
మలహణునిమీఁదఁ బడియె నాజలకణములు
మదనసంతాపవహ్నికి మాటుదోఁప.


వ.

అప్పుడు మలహణుండు శివస్మరణంబు సేసి తనలో నిట్లనియె.

క.

కన్నప పుక్కిటినీటన్
గన్నప కీర్తెల్లఁ బాసెఁ గటకట, నేఁడీ
కన్నియ యధరామృతమును
గ్రన్ననగాఁ గవయుకతన గౌరీశునకున్.


గీ.

అనిన పలుకు చెవుల నాలించి ప్రాణేశుఁ
డౌట యెఱిఁగి యొయ్య నతనిఁ గదిసి
యెట్టు వచ్చి తిచటి కీవేళ యనుచును
ముదము భయము మదిని ముడివడంగ.


గీ.

బిగియఁ గౌఁగిలించి బింబాధరము చవు
లిచ్చి యిచ్చి క్రోలి యిచ్చ వగచి
ప్రాణనాథ, నీకుఁ బాడియె యొక్కఁడ
విట్టు లరుగుదెంచు టెఱిఁగి మఱియు.


సీ.

గ్రక్కునఁ దలవరుల్ గని పట్టుకొనిరేని
                   నరయ నాదోష మెవ్వరికిఁ దగులుఁ
బఱతేర నచ్చటఁ బాముఁ దే లంటిన
                   నాహత్య యెవ్వరి కతిశయిల్లు
మీతల్లిదండ్రు లోమియుఁ బుత్రశోకాగ్నిఁ
                   గన నది యెవ్వరి కొని మునుంగుఁ

గావలివార లొక్కంత యెఱింగిన
                   నాడిక యెవ్వరి కతిశయిల్లు
నడుమ నవకార్యమేమైనఁ బొడమనేని
నట్టి కింకయు నెవ్వరిఁ జుట్టుకొనును
నెఱయ సకలంబుఁ దెలిసిన నిపుణమతివి
యకట పఱచుట ప్రాణేశ, యర్హమగునె?


ఉ.

నీచెల్వంబును నీవిలాసము మఱిన్ నీధైర్యగాంభీర్యముల్
నీచాతుర్యము నీగుణాంకమహిమల్ నీపెంపునుం జూడకే
ప్రాచుర్యంబును బోవనాడితివి యీపాపంబు ప్రాణేశ, నా
కేచందంబునఁ బాసిపోవు నకటా! యెన్నే జన్మంబులన్.


వ.

అని దుఃఖావేశమునఁ బొగులుచు:


క.

కడుఁ గాకలీస్వరంబున
విడువక యొయ్యొయ్యనవల వెక్కుచు నేడ్చెన్

కడవలను గ్రుమ్మరించిన
వడువునఁ గన్నీరు మేన వఱదై వాఱన్.


క.

సూనశరవహ్నిఁ గ్రాఁగుచు
మేనంతయుఁ బలుకఁబాఱి మిగులఁ గృశించెన్
నానోముఫలము లిట్టివి
ప్రాణేశ్వర, నిన్ను నేచఁ బాలయితిఁగదే.


గీ.

కుటిలవర్తనంపుఁగులమున జన్మించి
చెడుగులకును బుద్ధి చెప్పుఁగాని
పుణ్యనిధివి నిన్నుఁ బొందొందుభాగ్యంబు
నాలి దైవమేల నాకు నిచ్చు?


క.

వఱదం బడిపోయెడు సతి
కురవియు న్నొగులుమాన్ప నోపునె తానె
త్తెఱఁగున వీరలచేఁ బడి
యుఱక నినుం బాసి నొగులుచుండఁగవలసెన్.


క.

వ్యాళీవిషదంష్ట్రోగ్ర
జ్వాలల సయిదోడు లగుచు జనియించిన దు
శ్శీలల వేశ్యామాతల
నేలా పుట్టించె నజుఁడు నెఱుఁగఁడు సుమ్మీ!

సీ.

గుల్లాల నూరక కొండగాఁ జేయును
                   నీవన్న నెంతయుఁ జావ నలుగుఁ
బలుగాకులను గన్నఁ బ్రాణంబు లొసఁగును
                   నినుఁ జూచెనేనియుఁ గనలిపడును
హీనుల కెంతయు హిత మాచరించును
                   నీపట్టు కన్నంతఁ ద్రోపు సేయుఁ
జెడుగులఁ గన్నను శిరసావహించును
                   నీవార మన్నను నిలువనీదు
వినుమ యలవోక నీపేరు విన్నమాత్ర
రాఁజుచుండును మోము నిరంతరంబుఁ
జిత్త మలరంగ నీవును జేయునట్టి
భాగ్య మబ్బునె పరమనిర్భాగ్యులకును.


సీ.

కడముట్టఁ దల్లిచేఁ గసికోఁతలే కాని
                   యొకనాఁడు హాయిని నుండలేదు
పొన్నింట్లఁ బడిపంచఁ బొగులంగనే కాని
                   యొకనాఁడు నినుఁ గూడి యుండలేదు
కరకరలును వట్టి కక్కసంబులె కాని
                   యొకనాఁడు నుడుకారి యుండలేదు

యెవ్వరు విందురో యిది యననే కాని
                   యొకనాఁడు నిశ్చింత నుండలేదు
నీవు నాకయి యాహారనిద్ర లుడిగి
యుండుమన్నట్టిచోటనె యుండియుండి
చిక్కి నరమైతి వేమని చెప్పుదాన
నిట్టిదశకును మన కింక నేది తెరువు.


క.

వచ్చెద నే నీవెంటను
నేచ్చోటికినైనఁ గొంచు నేఁగుము లేదా
యిచ్చుట నేమటసేయుము
పచ్చనివిలుకానిబారిఁ బడఁజాలఁ జుమీ.


వ.

అనుటయు మలహణుం డిట్లనియె.


గీ.

వెజ్జు బమ్మరించువిధమున నాకును
బుద్ధి చెప్పి నీవు పొగులఁదగునె
రూఢి వెఱ్ఱి దిరిగె రోఁకలిఁ దలఁ జుట్టు
మనిన చందమయ్యె నంబుజాక్షి!


వ.

అనుటయు నెట్టకేలకు ధైర్యంబుఁ దెచ్చుకొని యరుణోదయంబునఁ ద్రిపురాంతకునిగుడికి నృత్యంబు సలుప నేను వచ్చెద నచ్చట నుండు

మని నీవును నేనును దానికిఁ దగినతెఱంగు చూచుకొందమని మలహణు నంపి తానును గ్రమ్మర వచ్చునెడ నటమున్న యవ్వైశ్యుండును.


గీ.

కౌఁగిలింపలేదు కడువేడ్కఁ గెమ్మోవి
యానలేదు రతికిఁ బూనలేదు
సుదతివలన వట్టిసుద్దులు దుద్దులు
గతులు గితులుఁ జాలుఁగాని యనుచు.


క.

వ్యథఁ దల్పుగడియ పెట్టుకొ
శిథిలాత్ముఁడు దాసితోడఁ జెనకుచునుండెన్
క్షుధ నొందినట్టి పిల్లికి
విధిమూడిన యెల్క లేదె వెదకిన నైనన్.


వ.

ఇట్లున్న యవ్వైశ్యుని గెళవునం జూచి రోయుచుఁ గవాటబంధనంబు సేయించి విలాసినిం గావలిం బెట్టి కృతస్నానయై వివిధభూషణభూషితాంగి యయ్యె నంత.


క.

తారాగణపరివారము
తారాగిరిరాజువెంట దండుకుఁ బనుపన్

చీరికి దరుబోయి నగరు
తోరంబై వేగుఁజుక్క తూర్పునఁ బొడిచెన్.


సీ.

ఇంద్రుఁ డంబుధిఁబైఁడి యిస్ముగొల్మిని వెట్టి
                   కరఁగించు కరువుముఖం బనంగ
నైరావతంబున కలికభాగంబునఁ
                   బెట్టిన జేగురుబొ ట్టనంగ
నెలరాజు నేర్పుతో నిర్మించి మించిన
                   కర మొప్పు పసిఁడిపళ్ళెర మనంగ
.............................................
                   .....................................మనంగ
నుదయగిరిమీఁద నప్సరోయువతు లిడిన
నిద్దమై యొప్పు కుంకుమముద్ద యనఁగఁ
బ్రాగ్వధూమణి సొమ్ముల బరణి యనఁగఁ
దరణి యుదయించె సుప్రభాసరణి మెఱయ.


వ.

అంత మేళంబులవారితోడఁ బుష్పసుగంధి త్రిపురాంతకదేవుని గుడికిఁ జని నృత్యగీతవాద్యంబులు సలిపి పరిజనంబులం బదండని మలహణుం బిలుచుకొని గర్భద్వారంబున నిలిచి యద్దేవునిం జూపి యిట్లనియె.

సీ.

ముక్కంటి భక్తుల ముంగిటిపెన్నిధి
                   చిత్తజవైరి సంజీవికరణి
పురదైత్యలోకసంహరుఁడు సిద్ధరసంబు
                   బాలచంద్రధరుండు పరుసవేది
శ్రీపార్వతీశుండు చింతామణిశ్రేణి
                   కుండలికటకుండు కొంగుపసిఁడి
రుద్రుండు దక్కినరోహణశైలంబు
                   ఖండేందుమౌళి బంగారుకొండ
యసమనేత్రుండు నింకని యమృతజలధి
కాలకంఠుండు చేరువ కల్పశాఖి
విశ్వనాథుండు మనపాలి వేల్పుటావు
తలఁపు మిప్పుడు కామితార్థములు గల్గు.


క.

శతధృతిశతమఖముఖ్యుల
కతిదుర్లభుఁ డెన్న చూడ ననవరతంబున్
మతిఁ దలఁపఁగ సద్భక్తుల
కతిసులభుఁడు దేవదేవుఁ డభవుఁడు జగతిన్.


క.

ఇల బాణమయూరాదుల
కలరెన్ గోర్కులు కవిత్వమందునె కాదా

వలనగు గవితాత్త్వము
వలనంబడయంగరాని వస్తువు గలదే.


క.

పరిమళములలోఁ గస్తురి
తరువులలోఁ జందనంబు దైవంబులలోఁ
బరమేశుఁడు విద్యలలో
నరయంగాఁ గవిత యెక్కుడగునని రార్యుల్.


క.

మాటలె ధనములమూటలు
మాటలె భువనైకముఖ్యమంత్రౌషధముల్
మాటలె ముక్తికి నెలవులు
మాటల నొనఁగూర్చి చెప్ప మతమదియైనన్.


సీ.

ప్రకటింప మేకపెండ్రుక లింగమని కొల్వ
                   గోర్కు లీయఁడె కాటకోటనికిని
బ్రమదంబుతోడఁ గుంచము లింగమని కొల్వ
                   (?)గోష్టియవానికి గోర్కు లీడె
లీలమై సతిచన్ను లింగమంచు భజింప
                   నొడయనంబికి నీఁడె యడుగు కోర్కి
తమకంబునను సైకతము లింగమని కొల్వ
                   నిచ్చఁగోరిక లీఁడె యింద్రజునకు

నిముసమాత్రంబు శివునిపై నిలుపు దృష్టి
తలఁపు లితరంబులందునుఁ దగులనీకు
మించుదళుకొత్తఁ గ్రొత్తయై మెఱుఁగుఁ గవిత
చెప్పి సర్వేశు సన్నిధి సేయు మనిన.


క.

తరుణీ, నామన సెంతయు
నరయఁగ నీమీఁదఁ దగిలి యన్యంబులపై
నరనిముసమైన నిల్వదు
వెఱవెయ్యది యనినఁ బలికె వెలఁదుక మఱియున్.


క.

చనుఁగవ వీపున నానుక
నినుఁ బాయక కౌఁగిలించి నే నుండెద నీ
వెనుకను నిశ్చలమతివై
కొనియాడుము శంభుఁ గోర్కి కొనసాగంగాన్.


చ.

అటువలె నుంటివేని జలజానన, యేనును నాదిభోగిరా
ట్కటకు నుమాకళత్రు శితికంధరు సన్నుతి చేసి నీదు ముం
దట నట మెచ్చు చేకొనియెదన్ విను నావుడు నింతి యట్ల కౌఁ

గిటఁ గదియించె భక్తిఁ బలికించె శివున్ నుతియించె నాతఁడున్.


చ.

తరుణికచంబు క్రొవ్విరులతావికిఁ జొక్కిన తేఁటి యట్ల శం
కరుఁ డిలఁ దేఁటియో యనుచుఁ గామిని దెల్పుట కంధి క(?)
ర్బురనిభకంధరాయ సురపూజితపాదపయోరుహాయ భా
స్కరశశిలోచనాయ పురసంహరణాయ నమోనమో యనన్.


సీ.

జడముడి దొలఁకాడు జాహ్నవీనదితోడ
                   మే సగమున నున్న మెలఁతతోడ
ప్రక్కలఁ బ్రణుతించు ప్రమథవర్గముతోడ
                   జయవెట్టు దేవతాసమితితోడ
బొగడెడు బ్రహ్మలపునుకపేరులతోడ
                   నటన మిన్నందిన నందితోడ
గాలిచే నల్లనఁ గదలుసొమ్ములతోడఁ
                   బులితోలుపట్టు దువ్వలువతోడఁ

బొలుపు మిగిలిన వలపు విభూతితోడ
మహిమ దళుకొత్తు రుద్రాక్షమణులతోడఁ
గ్రమ్మునౌదల చంద్రఖండమ్ముతోడ
నమరి సర్వేశ్వరుండు ప్రత్యక్షమయ్యె.


క.

మెచ్చితి మలహణ, కోరిక
లిచ్చెద నేమైన నడుగు మిహపరములలో
నిచ్చకు వచ్చిన విప్పుడు
నచ్చిన నెచ్చెలివి నీవు నా కెన్నంగన్.


వ.

అనుటయుఁ బునఃబునః బ్రణామంబు లాచరించి యిట్లనియె.


సీ.

పూజింతుఁ బుంగవపుంగవకేతను
                   నర్చింతు మారుతాహారహారు
వర్ణింతు నాత్మీయవామాంగవామాంగు
                   భజియింతు నిర్జితబాణబాణు
వినుతింతు శరశుభ్రవిగ్రహవిగ్రహు
                   భావింతు శతకోటిభానుభాను
నుతియింతుఁ బదపద్మనతజంభభంజను
                   మది సంస్మరింపుదు మారమారు

నంతకాంతకు నేప్రొద్దు నాశ్రయింతుఁ
గరము వేడ్క నుపాసింతు శరధిశరధి
లీల సేవింతు హరినీలనీలకంఠు
నెలమి నినుఁగొల్తు భువనత్రయీశు నీశు.


క.

భేశ వృషభేశ కాశా
కాశధునీసుప్రకాశగౌరాంగునకున్
కేశవనుతునకు నంబర
కేశునకును శరణు నీకు గిరిజాధీశా!


క.

పాటలపాటలమకుటని
శాటునకున్ గలుషజలధిజంఝాటునకున్
శాటీకృతమదకరటిని
శాటననవచర్మునకును శరణము నీకున్.


క.

ఖండశశిఖండమౌళికి
నండజకేతనమదాండజాండావళికిన్(?)
కుండలిపరివృతవిలస
త్కుండలికిని శరణు నిఖిలగురునకు నీకున్.


క.

ఈపుష్పగంధిఁ గూడుక
యేప్రొద్దును ప్రమథవరుల వీక్షింపుచు నీ

శ్రీపాదపంకజంబుల
నేపారఁగఁ గొల్చుభాగ్య మీవే నాకున్.


వ.

అనుటయు నద్దేవదేవుం డతనిం గారవించి యభీష్టంబు లొసంగి తజ్జనకజనయిత్రులకుఁ బుష్పగంధి జననికిఁ గేలికీరంబునకుఁ గైవల్యం బొసంగి యేతచ్చరిత్రంబు విన్నవారలకు భోగమోక్షేష్టార్థంబులు గలుగంజేయుచుఁ బార్వతీసమేతుండైఁ బరమేశ్వరుండు ప్రమథగణంబులు గొలువ రజతాచలంబున కేఁగి వినోదించుచునుండె నంత:


క.

ఈమలహణచారిత్రముఁ
బ్రేమంబున వ్రాయఁ జదువఁ బేర్కొన మనుజుల్
కామితసుపుత్రపౌత్ర
శ్రీమహితైశ్వర్యములను జెలఁగుదు రర్థిన్.


ఉ.

మందరధీర ధీరకవిమానితనిర్మలకీర్తిమల్లికా
సుందరకంద, కందళితశుద్ధమనఃకృతపార్వతీశదై

నందినపూజస్తవ జనస్తవనీయదయాకులాశయా
స్పందితదివ్యముఖ్యగుణబంధుర బంధురమావిధాయకా.


క.

రామామాత్యకుమారక
సోమాంబాగర్భసింధుసురుచిరసోమా
రామాజనమానసలతి
కామాధవ విస్సమాంబికాప్రాణేశా!


మాలినీ.

శరధినిభగభీరా శత్రుగర్వాపహారా
నిరుపమగుణహారా నీతిమార్గప్రచారా
పరిజనపరిచారా బంధురక్షావిహారా
సురగిరివరధీరా సోమమాంబాకుమారా.


గద్యము.

ఇది శ్రీమత్సకలసుకవిమిత్ర సోమయామాత్యపుత్త్ర సరసకవితాధుర్య యెఱ్ఱయనార్యప్రణీతం బైన మలహణచరిత్రం బను మహాప్రబంధంబునందుఁ సర్వంబును దృతీయాశ్వాసము.

ఇతర ప్రతులు

మార్చు
 

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.