శృంగారపంచకము/రసికాభిలాషము

రసికాభిలాషము




గ్రంథకర్త

కవిసార్వభౌముఁడు

శ్రీనాథుఁడు

పీఠిక

పూర్వకవీంద్రులచే రచింపఁబడిన గ్రంథము లింక నెన్ని యెన్ని యెక్కడ నెక్కడ నడఁగియున్నవో యెవరి కెఱుక! ఈ వైశాఖమాసమున మాబంధువులలో నొకరియింటనైన వివాహమునకు సింహాచలపుటడివారమునకుఁ బోయి యుండి యక్కడ నొక శ్రీవైష్ణవ గృహస్థునిం బ్రాఁతతాటియాకుఁల బొత్తములను దిరుగవేయుచుండ నాకు “రసికాభిలాషము” అను నీ చిన్నిపొత్తము లభించింది. కవి యెవరో తెలియక “వీథినాటకము" కూడ దీనితోఁ గలసి యున్నందున శ్రీనాథుఁడాయని యనుమానించి, కవితాశైలియుఁ గల్పనాప్రౌఢిమయు శృంగారరసవిస్తరతయు నాయనుమానమును బలపఱంపఁగాఁ జివరను జూచి, గద్యము లేక పోయినను దుదిపద్యము చక్రబంధమగుటఁబోల్చి, యందు “శృంగారశ్రీనాథ” యను పేరేర్పడుటచే శ్రీనాధుని గ్రంథమేయని సిద్ధాంతము చేసితిని. గ్రంథమంతయు సావకాశముగాఁ జదివిన వెనుక 38, 89, పద్యములవలన మిగిలిన కొంచెము సంశయమును నిర్మూలమైనది. శృంగారమన్న విషప్రాయముగాఁ జూడవలయునని చెప్పు నిప్పటియాంధ్రులకు శృంగారభూయిష్టమకు నీపుస్తకము రుచింపమి విదితమే. కావున దీనిని బ్రచురింపఁగూడదని మొదట నిశ్చయించినను, శ్రీనాథకవి యంతటివాని గ్రంథముల లోకమున వెల్లడిచేయుటకుఁ జేయకపోవుటకు నొకరి యిష్టము కాదని తలఁచి తుదకుఁ బ్రచురింప నిశ్చయించి విశాఖపట్టణమునందలి శ్రీశారదామకుట ముద్రాక్షరశాలాధికారులగు మ. రా.రా. విన్నకోట అప్పలనరసింహ శ్రేష్ఠిగారికి జూప వారు దానిని దామే ప్రచురింపఁ గోరి తీసికొనిరి. దీనిని నవీనకవియే యొకడు రచించి ప్రచురించినచో మిమర్శకు లెట్లు దూషించియుందురో దేవునికే తెలియును!

శ్రీనాథుని వీథినాటకము లోకమునఁ బ్రచురమయ్యు నీరసికాభిలాషము కానందులకుఁ గారణము లేకపోలేదు. ఇందుఁ గవి యుద్దేశించిన నాయిక గొప్పరాజులయింటి దనుట నిశ్చయము. 3వ పద్యమునందలి "యందని మ్రానిపండు" నను మాటయు, 49వ పద్యము నందలి 'భోగినీముదిత' ననుమాటయు దానికి నిదర్శనములు. శ్రీనాథునికి కోరిక తీఱినట్లు కాని తీఱు నను నాసయున్నట్లు కాని యెక్కడను గనఁబడదు. ఈమె యెవతెయో! యెక్కడిదో? కన్య కాదని 21 న పదమునదలి "పరకాంత నిన్ను" ననుమాటయు, జారచింత గలదని 19 వపద్యమునందలి "భుజంగుల పాలౌ", ననుమాటయు దెల్పుచున్నవి. రసికుఁడగు శ్రీనాథుని యభిలాష మేమయ్యనో?

"కవిసార్వభౌముఁ"డని సార్ధకబిరుదము గాంచిన శ్రీనాథుని కవిత్వముఁ గుచ్చి నేనిక్కడ వేఱుగాఁ జర్చింపవలసిన యవసరము లేదు. అయినఁ గవి దీని నెట్టి వయసున వ్రాసినాఁడో యాలోచింపవలసియున్నది. ఈతడు యౌవనదశను స్త్రీలోలుఁడై విచ్చలవిడి దిరిగెనని చెప్పుదురు. ఆకాలముననే వీథినాటకమునందలి పద్యములఁ జెప్పెననియు వాడుక, రసికాభిలాషము కూడ నప్పటిదే అయినచో నది "నూనూఁగు మీసాల నూత్నయౌవనమున" నే విరచింపఁబడియుండును. అయిన నొక్క బాధకమున్నది. 89వ పద్యమునఁ "గవిసార్వభౌముని" పదము వాడఁబడి యున్నది. ఈబిరుదము శృంగారనైషధము వ్రాసిన వెనకనే యీతనికి రాయలయొద్దఁ బాదుకొల్పబడినట్లు విందుము. ఈ పద్యము తరువాతఁ గలుపఁబడినదేమో!

రసికాభిలాషమున శ్రీనాథుడు తెచ్చిన కల్పనలను కొన్నిటిని బూర్వకవులలోఁ గొంద ఱిటీవల నుపయోగించిరి. అందుచేత వారిలోఁ గొందఱియొద్దనైన గ్రంథ ముండెనని తోఁచుచున్నది. ఎందఱు శ్రీనాథుని కల్పనల దొంగలించిరో, యెందఱికిఁ గ్రొత్తగా నాతని యూహలే తట్టినవో చదువరులే నిర్ణయించుటకు వానినిక్కడఁ జూపిం చుచున్నాను.

i కూచిమంచి తిమ్మకవిని నడివీథిలోఁ గౌగలించిన వృద్ధవేశ్య
"చ. చతురులలోన నెంతయును, జాణ వటంచును నేను కౌగలిం
       చితి, నిటుమాఱుమో మిడగఁ జెల్లునె యోరసికావతంస!"

యన్నప్పుడు

" అ
       ద్భుత మగునట్టి బంగరపు, బొంగరపుంగవఁ బోలు నీకుచ
       ద్వితయము ఱొమ్ము నాటి యల, వీఁపున దూసెనటంచుఁ జూచితిన్.”

అన్న ప్రతివచనముయొక్క సమయస్ఫూర్తి నెంతుముగదా! ఇందలి 29వ పద్యముఁ జూడుడు.

ii తాను బ్రక్కను జేరగా మొగముఁ ద్రిప్పి పన్నుండిన వేశ్యగూర్చి రామలింగఁ డన్న
"మ. వరబింబాధరముం బయోధరములు, న్వక్త్రాలకంబు ల్మనో
       హరలోలాక్షులు చూప కవ్వలిమొగం, బైనంత నే మాయె? నీ
       గురుభాస్వజ్జఘనంబుఁ గ్రొమ్ముడియు మాకుంజాలవే? గంగ క
       ద్దరి మే లిద్దరిఁ గీడునుం గలదె?, యుద్యద్రాజబింబాననా!"

అను పద్యమునందలి భావము దీనిలోని 40 వ పద్యములోనివే, ఇందు "సౌందర్యగంగాఝరి", యని చెప్పి యందుల కనుగుణ్యముగా భావమంతయు నడుపుట విశేషము.

iii "సీ. బింబోష్టియని నీవు, పెనఁగ రాకు శుకంబ!
                సాంకవగంధి యీ పంకజాక్షి”

యను రసికజనమనోభిరామమునందలి పద్యము చాలవఱ కిందలి 8వ పద్యమునుబోలును.

iv రంభాద్యప్సరస కాంతలనామములు తారాశశాంకాది ప్రబంధముల శ్లేషింపఁబడుటకుఁ బూర్వమే యిందలి 46 46వ పద్యమున నట్లుపయోగింపఁ బడినవి.

v మనుచరిత్రలోని "మీటినయంత నిచ్చు చనుమట్ట" లను మాటయు విజయవిలాసములోని "మీటిన విచ్చు చనుదోయి" యనుమాటయు గ్రొత్తది కావని యిందలి 6వ పద్యము తెలుపును.

vi. ఆలాగున నే "జగతి నెంతటి యుపకారి శంబరారి" యన్న విజయవిలాస పద్యభాగము దీనిలోని 11వ పద్యమున నున్న "యుపకారియగుంగద శంబరారి!" యను దానిని జూచి వ్రాయఁబడినదా యనిపించును.

నాకు లభించిన ప్రతి మిగులఁ బ్రాఁతదైనందునఁ గొన్ని యెడలఁ జినింగిపోయినది. అట్టిచోటులఁ బోయినమాటలను నేనే పూరించితిని. అట్లు కలుపఁబడిన భాగము లేవో శ్రీనాథవిరచిత భాగము లేవో శైలులవలన దెలియుట సులభముగాన వానిని వేఱువేఱుగా జూపలేదు.

దీని ప్రతి మఱియెవ్వరియొద్దనైన నున్నచో నాకు బంపినయెడల రెండవకూర్పునందైన నిందలి లోపముల సవరింతును.

విశాఖపట్టణము

సెట్టి లక్ష్మీనరసింహము బి. ఎ.

1. ఆగష్టు 1905

రుక్మిణీకల్యాణ నాటకగ్రంథకర్త.

మున్సెస్సేవియన్ కాలేజిలో నుపాధ్యాయుడు.

మనోరమ

ఆగష్టు నెల 1907

రాజమహేంద్రవరము

కృతివిమర్శనము

రసికాభిలాషము — ఇది యొక్కటే యాశ్వాసముగల చిన్నప్రబంధము. ఈపుస్తకము విశాఖట్టణనివాసులు రుక్మిణీకల్యాణనాటకగ్రంథకర్తలు పట్టపరీక్షయందు గృతార్ధులు నగు మ.రా.శ్రీ. సెట్టి లక్ష్మీనరసింహముగారి పీఠికతో విన్నకోట అప్పలనరసయ్య శ్రేష్టిగారి శారదామకుటముద్రాక్షరశాలలో ముద్రితమయి ప్రకటింపబడియె. ఆసెట్టి లక్ష్మీనరసింహముగారు కడచిన వేసంగి సెలవులలో బంధువులయింట వివాహము నిమిత్తము సింహాచలపుటడివారమునకు బోయి యుండగా నక్కడ నొకశ్రీవైష్ణువుని గృహములో నీపుస్తకము వారికి లభించినదట. ఈగ్రంథము శ్రీనాథుని వీథినాటకముతో గలసి యొక్క తాటియాకుల పుస్తకముమీద వ్రాయబడి యుండుట చేతను గ్రంథాంతమున చక్రబంధపద్యమునందు శృంగారశ్రీనాథ యను నామము గనంబడుట చేతను గవిత్వము కల్పనలు రసవంతముగ నుండుట చేతను గద్యము లేకపోయినను శృంగారనైషధము, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము రచియించిన మహాకవి శ్రీనాథుడే దీనిని రచియించెనని యాలక్ష్మీనరసింహముగారు పీఠికలో సిద్ధాంతము చేసిరి. కాని యాసిద్ధాంతము మా కంత యుక్తియుక్తముగ గనబడలేదు.

మే మెన్నిసారులు వారి పీఠికను మూలగ్రంథమును శ్రద్ధతోఁ జదివినను శ్రీనాథుఁ డీగ్రంథమును రచియించియుండఁ డనియు విషయాసక్తుడయి పడుచుతనపు గర్వముచేత నొడ లెరుంగక తిరుగు ధూర్తవిటు డెవండో తనదుష్పాండిత్యము మెరయు నీపద్యముల నల్లియుండవచ్చుననియు మాకుం దోచుచున్నది. ఇట్లు మాకుం దోచుటకు కారణముల గొన్నింటి నీక్రింద నుదాహరించుచున్నారము. గ్రంథాంతమునందు గద్యముగాని గ్రంథారంభమునందు కవివంశాదులు కాని లేవుకదా? అందుచేత మన మూహలు చేసి కవిపేరు కనుగొనవలయు ననుట స్పష్టము. చివర చక్రబంధములో నేర్పడు శృంగార శ్రీనాథ పదములచేత శ్రీనాథుడే గ్రంథకర్తయని మన మూహింపదగదా? అ ట్లూహింప వీలులేదు. శ్రీనాథునకు శృంగారశ్రీనాథుడని యెక్కడను బ్రసిద్ధిలేదు. శృంగారమువారు శృంగారకవివారు తెనుగుదేశమందు వైష్ణవులలోను నద్వైతులలోను ననేకు లున్నారు. వారిలో నెవరయిన శ్రీనాథనామము గలవా డొక డుండవచ్చును. అతడే తనదురభిలాష బద్యరూపకముగా బయటికి వెల్లడించి యుండవచ్చును. అంతియేకాని కమలనాభామాత్యపౌత్రుడు, మారయామాత్య పుత్రుడు నగు మహాకవి శ్రీనాథుఁ డీగ్రంథకర్త కాఁడు. అదిగాక శ్రీనాథుని గ్రంథము లన్నిటినుండి తన లక్షణగ్రంథమునకు లక్ష్యపద్యములను దీసికొనిన యప్పకవి గాని కూచిమంచి తిమ్మనామాత్యుఁడు గాని యడిదము సూరకవి గాని మఱి యితరలాక్షణికు లెవ్వరు గాని యీగ్రంథము పే రయినఁ దలపెట్టకుండుటకుఁ గారణ మేమి? ప్రాచీనమహాకవుల కెవ్వరికిం దెలియని యీగ్రంథము నేఁడు కొత్తగా శ్రీనాథునిదని యొకరు చెప్పినంతమాత్రమున జను లొప్పుకొనవచ్చునా?

ఆకారణముల నటుండనిచ్చి ఇందు వర్ణింపఁబడిన యంశమును విచారింతము. ఒకరసికుడు వివాహితయయి భర్తతోఁ గాపురము చేయుచున్న యొకకులకాంతను మోహించి నఖశిఖపర్యంత మామె సకలావయవముల వర్ణించి ఆమెతో గూడినట్లు స్వప్నములఁ గాంచి యాస్వప్నములఁ దలంచుకొనుచు విరహతాపము నొందుచు నామెచక్కఁదనము దలంచి యూట లూరుచుండుటయే యిందలి కథాంశము. పరకాంత, కన్యయైనఁ గాదు. వేరొకనిభార్యయగు దానిని వలచి, వలచినందులకు సిగ్గుపడక పైపెచ్చు బూతుపద్యముల వ్రాసి శ్రీనాథుఁడు విరహతాపము పొందెనని చెప్పుట పరమభాగవతోత్తముఁడు నైష్ణికుఁడు నగు శ్రీనాథునికీర్తి పాడుచేయుట, శ్రీనాథునకే గాదు, ఈపద్యములు తనవని యెవఁడు చెప్పుకొనునో వాని కప్రతిష్టయే గాని ప్రతిష్ట కాదు. అందుచేతనే కవి గ్రంథమునందు మొదటనైన జివరనైన తనపేరు విస్పష్టముగ వేసికొనుటకు సిగ్గుపడియెను. మఱియుఁ జక్రబంధమునందున్న శ్రంగార శ్రీనాథపదములు కేవల మొకపురుషనామమును దెలియఁజేయవు. శృంగారశ్రీ యనగా శృంగారలక్ష్మి. దానికి నాథుఁడు శృంగారశ్రీనాథుఁడు. గ్రంధము దుర్నీతిభోధక మగుటచేతనో మఱియెందుచేతనో కవి గద్య వేసికొనుట మానినప్పుడు తన పేరు వేరువిధముగాఁ దెలియఁజేసికొనుట కిష్టపడునా? ఇష్టపడకపోవుటచేతనే తా నొకశృంగారనాయకుఁడ ననుమానము మాత్రము సూచించెను. అందుచేత నది యొక మనుష్యుని పేరుగా గ్రహించుటకు వీలులేదు. శ్రీనాథునకుఁ గవిసార్వభౌమ బిరుద మున్న దనియు నాపద మిందుఁ బ్రయోగింపఁబడుటచే నతఁడే దీనిని రచియించెననియుఁ బీఠికలో వ్రాయబడినది. కవిసార్వభౌమ బిరుద మనేకులకు గలఁదు. కూచిమంచి తిమ్మనామాత్యునకు లేదా? ప్రతికవియు నాలుగుపద్యము లల్లినతోడనే తాను కవీశ్వరుఁడ ననియుఁ గవిసార్వభౌముఁడ ననియు బుస్తకములలో బ్రయోగించుకొనుచుండును. కావున కర్తృత్వము శ్రీనాథున కారోపించుట కది యొకకారణము గాదు.

ఇందు పద్యములశైలియుఁ గవిత్వచాతుర్యము నించుక శోధించిచూతము. కల్పన లెక్కడనోగాని తరచుగాఁ బ్రౌఢముగా లేవు. శైలియు శ్రీనాథుని శైలితో నెంతమాత్రముం బోలదు. శ్రీనాథుని గడుసుతనపుపోకడ లిందెక్కడను గానరావు. అదియునుంగాక యీగ్రంథ మాధునికుఁ డెవ్వఁడో రచియించెనని స్పష్టముగ చెప్పుటకు తగిన యుదాహరణములు కొన్ని కానఁబడుచున్నవి. పదునేనవపద్యమునందు "తయారులోనే తగు" నను పదమున్నది. తయారన్నది తురకమాట కాని తెలుఁగుమాట కాదు. ప్రాచీనకవు లెవ్వరును ముఖ్యముగ శ్రీనాథుడు నిట్టిపదముల బ్రయోగించినట్లు లేదు. ఇట్లే నలంబదిమూడవ పద్యమున 'ఖయిదు బాహుపాశములఁ గట్టవే' అని యున్నది. ఇదియును శ్రీనాథాది ప్రాచీనులు ప్రయోగింపని హిందూస్తానీ పదమే. పంతొమ్మిదవపద్యమునందు 'నాకుంగూడ నాభాగ్య మెట్టుల నేనాఁటికి గల్గునో' యని యున్నది. 'నాకుంగూడ' ఇట్టి ప్రయోగము లాధునికుల గ్రంథములలోనే గాని ప్రాచీనుల గ్రంథమునందుఁ గానఁబడవు. ఇందు 'గూడ' యను పదము సముచ్చమార్ధమగు 'ను' వర్ణకమునకు బదులుగ నాధునికులు ప్రయోగించుచున్నారు. ముప్పదినాలుగవపద్యములో 'లజ్జిలినానఁట' యని యున్నది, 'లజ్జిలినాఁడ' నని యుండవయును గాని నాను యుండుట యసాధువు. ఇట్లు శ్రీనాథుడు ప్రయోగింపడు. ఈ పుస్తకము నందలి యేఁబది పద్యములలో నిటిటీ వింకం గొన్ని యున్నవి. గ్రంథవిస్తరణభీతిచేతి నిచట నుదాహరింపక యుంటిమి. పూర్వోదాహృతము లయిన ప్రయోగములంబట్టి చూడ నీగ్రంథ మెవఁడో నవీనుఁడు రచించియుండవచ్చునుఁ గాని శ్రీనాథాదులగు ప్రాచీను లెవ్వరును రచించియుండరనిసయితము తోఁచుమన్నది. సెట్టి లక్ష్మీనరసింహము గారు వ్రాసిన పీఠికలో శృంగార మన్న విషప్రాయముగఁ జూడవలయునని చెప్పు నిప్పటి యాంధ్రులకు శృంగారభూయిష్టమగు నీపుస్తకము రుచింపమి వివేకమే యని యొకచోటను, దీనిని నవీనకవియే యొకఁడు వచియించి ప్రచురించినచో విమర్శకు లెట్లు దూషించియుందురో దేవునికే తెలియునని వేరొకచోటను వ్రాసిరి. ఈనాటి యాంధ్రులలో నెవ్వరు శృంగారమన్న విషప్రాయముగ జూచుటలేదు. శృంగారము పేరు పెట్టి యిచ్చవచ్చిన పచ్చిబూతులు వ్రాసిన వారి కబ్బముల నీనాటివారు విషప్రాయములుగ జూచుచున్నమాట నిశ్చయమే. శృంగారరసమునకు నాగరికులు జదువ సిగ్గువడు మృదువు దప్పిన వాక్యమునకు భేదము తెలిసికొనలేక యీ లక్ష్మీనరసింహముగా రిట్టి వెఱ్ఱివ్రాతలు వ్రాసినందుకు మేము తద్దయు విచారించుచున్నారము. కాళిదాసాదులగు సంస్కృతకవులు కవిత్రయమువారు పింగళి సూరన్న మొదలగు తెలుఁగుకవులు శృంగారరసము వర్ణింపలేదా? ఆశృంగారరసము నీనాటి యాంధ్రు లాదరించుకులేదా? పురుషులయినం జదివి తలవంచుకొనవలసిన బండబూతుగల పద్యము లోని రసము శృంగారరసము గానేరదు. ఇట్టి గ్రంథముల నాదరించుట నాంధ్రభూమిలో విషవృక్షములం బెంచుట, ప్రాచీనులు రచియించి నంతమాత్రమున నిది వంద్యముగాదు. నవీనులు రచించినచో నింద్యముగాదు. బూతు లెప్పుడు నాగరికదూష్యములే యగును. సెట్టి లక్ష్మీనరసింహముగారు తాము పీఠికలో వ్రాసిన యుక్తుల ప్రతిహతము లనుకొని శ్రీనాథుఁడే గ్రంథకర్త యని సిద్ధాంతముచేసి తెనాలిరామకృష్ణుడు, చేమకూర వెంకటకవి, కూచిమంచి తిమ్మకవి, ఆంధ్రకవితాపితామహుడు మొదలగు మహాకవులందరు నేబది పద్యములకంటె నెక్కువలేని యీబూతుల ప్రబంధములోనుండి కొన్ని కల్పనలు దొంగిలించినారని వ్రాయక సాహసించిరి. ఈగ్రంథము మూల నడగద్రొక్కక ప్రకటించిన సాహసమే తాము యీపాహసములు గూడ నే మనవలయునో తెలియకున్నయది. ఆమహాకవు లీగ్రంథమునుండి తొలగించినారనుటకంటే నవీనుఁ డెవ్వడో యీ గ్రంథము రచించి మంచి కల్పనలు తోపమి నీగ్రంథచౌర్యమును జేసి యుండునన్న బాగుండును. గ్రంథము ప్రాతఁదగుటచే గొన్నితావులయందు శిథిలము కాగా సెట్టి లక్ష్మీనరసింహముగా రక్కడక్కడ నాయాభాగములు తాను బూరించితిననియు శైలులంబట్టి భేదములు తెలియును గనుక నట్టి భాగములకు గుర్తులు వ్రాయలేదని పీఠికలో తెల్సియుండిరి. మాబుద్ధికిఁ జూడ గ్రంథమందంతట నొక్కశైలియే కనబడుచున్నది గాని వేర్వేరు శైలులు కనబడుట లేదు. కవిత్వశైలిం దెలుపుట కిం దుదాహరింపవలసిన మృదువయిన పద్యములు లేకుండుటచే మానితిమి.

ప్రతివిమర్శనము

రసికాభిలాషము— శ్రీమనోరమాపత్రిక 1907 సం॥రం ఆగష్టునెల సంచికలో ప్రబంధమును గూర్చి వ్రాయఁబడిన విమర్శనమందు శృంగారనైషధాధుల రచియించిన మహాకవి శ్రీనాథుఁ డీరసికాభిలాషము రచియింపలేదని వాదింపఁబడినది. అందుల కీఁబడిన హేతువు లెంతయుక్తియుక్తములో దిగువ విమర్శింపబడుచున్నవి.

i చివర చక్రబంధములో శృంగారశ్రీనాథనామ మేర్పడుచున్నను మారయామాత్య పుత్రుఁడగు శ్రీనాథునికి శృంగారనాథుఁ డనుప్రసిద్ధి లేదు గనుక నీతఁడు వేకుకవి యట! చక్రబంధములో నారక్షరముల నామమే యిమడ్చవలయునుగాని యంతకంటె నెక్కువగాఁ గాని తక్కువగాఁ గాని వలను పడదనుట బంధకవిత్వము చేయువారికందరుకుఁ దెలిసినవిషయమే కావున శ్రీనాథపదమునకు ముందు మూడక్షరములు చేర్పఁబడవలయును. నైషధమునకు శృంగారనైషధమని పేరు పెట్టియుండుటచే శ్రీనాథునికి శృంగారపదము మిగుల నభిమానమైనదని సృష్టముగదా! అదికాక తాను వ్రాయుచున్నది శృంగారభూయిష్టము తా నొకప్రసిద్ధుఁడగు శృంగారనాయకుఁడు. అందుచేత "శృంగారశ్రీనాథ" మని వాడియుండఁగూడదా? తక్కినకారణముల వలన శృంగారనైషధ గ్రంథకర్తయే రసికాభిలాష గ్రంథకర్త యని తేలచున్నయెడల శృంగారశబ్ద మున్నదన్న హేతువుచేతనే యనుమానించుట కూడునా? శృంగారశ్రీనాథపదమునకు శృంగార శ్రీ నాథుఁడు, శృంగారనాయకు డని యర్థము స్పురించుచున్నదని విమర్శనమందు సెలవీఁబడినది. అట్లు తననామమును శ్లేషించుటయే శ్రీనాథుని యభిప్రాయమేమో అట్లయి యుండువనియే శ్రీనాథప్రణితము మాత్రమే యని కాక ముఖపత్రము మీఁద శృంగారశ్రీనాథప్రణిత మని యచ్చొత్తింపబడినది. అది విమర్శకులు తిలకించిరా? కారణ మేమని యూహించిరి లేక తెనుఁగుదేశము లోని శృంగారమువారు శృంగారకవివారు మొదలగునింటిపేరులవారిని వైష్ణవులయందు నద్వైతులయందు వెదకుచుఁ గూరుచుండినందున వీరికి ముఖపత్రమును జూచుటకు సావకాశము లేకపోయెనా? ప్రౌఢకవి మల్లన్న యన్నపేరు విన్నయెడల వీర్లు ప్రౌఢమువారు ప్రౌఢకవివారు శైవులయందు ద్వైతులయందుఁ దెలుగుదేశమునందుఁ గానవచ్చుచున్నారని వ్రాయుదురేమో!

ii కవిసార్వభౌమ బిరుదము రసికాభిలాషమున బ్రయోగింపబడినను సహితము బ్రయోగింపఁబడినదే. ఈరెండును గలసి యాలోచించినచో నీగ్రంథము శ్రీనాథుని దన్న యూహ మరింతబలము కాదా! ఆసంగతిగూర్చి విమర్శకు లేల సన్నసన్నగా నూరకుండిరి! తమవాదమునకు విరుద్ధముగా నుండువానిని విడుచుటయా విమర్శకలక్షణము! కనిసార్వభౌమబిరుద మనేకులకుఁ గలదట! శ్రీనాథునికిని గూచిమంచి తిమ్మన్నకవికిని గాక యితరుల కెవ్వని కున్నదో విమర్శకులు సెలవిచ్చిన విందము. కవిసార్వభమబిరుదమును శ్రీనాథనామమును గలిసి ప్రయోగింపఁబడుటచే మనము కూచిమంచి తిమ్మనను విడిచి శ్రీనాథునినే తీసికొనవలసివచ్చునుగదా? ప్రతికవియు నాలుగుపద్యము లల్లినతోడనే తాను కవిసార్వభౌముఁడనని పుస్తకములఁ బ్రయోగించుకొనుచుండునట? ఈవిమర్శకులు నాలుగుపద్యములు అల్లియుండిరేమో? కవిసార్వభౌముల మని పుస్తకములఁ బ్రయోగించుకొనిరా! పోనిండు. విమర్శకసార్వభౌముల మనియైనఁ జెప్పికొందురా? వారు గాకపోయిన, నట్లు ప్రయోగించుకొనినవారి పేరులు కొన్ని సెలవిచ్చెదరా! వాగనుశాసన ప్రబంధపరమేశ్వ రాంధ్రకవితాపితామహాది బిరుదములు గూడ నాలాగునే యిటీవల నుపయోగింపఁబడేనా! మరియొకటి. గ్రంథము దుర్నీతిబోధకమగుటచేతనో మరియెందుచేతనో కవి గద్య వేసికొనుట మానినందున మరి యేవిధముగాఁ గూడ దనకర్తృత్వమును దెలియజేయుట కిష్టపడి యుండడని వీరి నిర్ధారణ చేయుచున్నారు. కవి గద్య వేసుకొనుట మానెనని యెవ్వరికఁ దెలియును? ఇప్పుడు లభించిన ప్రతిని వ్రాసికొనినవారు గద్య విడిచిపెట్టియుండవచ్చును. గద్యవేసికొనలేదు పో, రసికాభిలాషము గద్య యవసర మున్నంత పెద్దగ్రంథమా? వీథినాటకమునకుఁ గవి యేగద్య వేసికొనెను. దుర్నీతిబోధక మని మానెనన్నచో, గూచిమంచి జగ్గకవి తనచంద్రరేఖావిలాపము సునీతిబోధక మనియే కాబోలు దానియందుఁ గద్య వేసికొనెను.

iii శ్రీనాథునిగ్రంథము లన్నిటినుండి తమలక్షణగ్రంథములకు లక్ష్యపద్యములఁ దీసికొనిన యప్పకవి మొదలగు లాక్షణికు లీరసికాభిలాషము పేరయినఁ దలపెట్టకుండుటకుఁ గారణ మేమని విమర్శకులు ప్రశ్న వేయుచున్నారు. వీరట పీఠికను మూలమును శ్రద్ధతో నెన్నియోసారులు చదివిరట! అవును. గ్రుడ్డిపాఠము డెబ్బదిపదునొకండుమారులు చదివినను దెలివిలేని విద్యార్థు కది యెట్లు పనికివచ్చును. "శ్రీనాథుని వీథినాటకము లోకమునఁ బ్రచురమయ్యు నీరసికాభిలాషము కానందులకు కారణము లేకపోలేదు. ఇందు గవిఁ యుద్దేసించిన నాయిక గొప్పరాజుల యింటి దనుట నిశ్చయ" మని పీఠికలో స్పష్టముగాఁ దెలుపబడియుండగా, వీరి కుశంక కింక నవకాశ మేది? అది యేల వీరు చూడరైరి! చూచినచో నేల ఖండింపరైరి! వ్రాసినది తిన్నగాఁ జూచి యర్థము చేసికొనగలశక్తి వచ్చినవెనుకనే విమర్శనముల నారంభించుట మంచిదేమో. పోనిండు. కారణము చెప్పబడలేదే యనుకొందము అయినను దమలక్షణగ్రంథముల చెప్పకవ్యాదులు పద్యము నుదాహరింప మానినంతనే పూర్వగ్రంథముల గూర్చి యనుమానము పడుట కూడునా! మరుద్రాజచరిత్ర, పండితారాధ్యచరిత్ర, శాలివాహనసప్తశతి, పల్నాటివీరచరిత్ర యనుగ్రంథములనుండి మాత్రము వా రుదాహరణముల గైకొనిరా? ఆమాత్రముచేత నవి శ్రీనాథునివి కావనుచున్నామా? భోజరాజీయము, విజ్ఞానేశ్వరీయము, మార్కండేయపురాణము, ప్రభోధచంద్రోదయము, కువలయాశ్వచరిత్రము, భానుమతీపరిణయము మొదలగు నెన్నిగ్రంథములనుండి యప్పకవి మొదలగువారు పద్యము లుదాహరించుట మానలేదు? లాక్షణికులు తమ కవసరమైన లక్ష్యముల బూర్వప్రబంధము లన్నింటినుండియు దీసికొనవలయునా?

శైలి శ్రీనాథుని శైలితో నెంతమాత్రమును బోలదట! శ్రీనాథుని యేశైలితో బోలదు? వీథినాటకమందలి శైలితోడనా? శృంగారనైషధమందలి శైలితోడనా, హరవిలాసము నందలి శైలితోడనా? ఒక్కకవియే వేరువేరుప్రాయము లప్పుడు వ్రాసినయెడల గవిత్వమునకు వేరువేరు శైలులు వచ్చును. కవిబ్రహ్మయనుపేరు తనకు వచ్చుటకు దగినట్టుగా భారతభాగము నాంధ్రీకరించిన తిక్కయజ్వ సోమయాజి కాకపూర్వము రచించిన నిర్వచనోత్తరరామాయణమును జూచిన, నది యాతనిదా యనుపించును. కవిరాజమనోరంజనము పిల్లవసుచరిత్ర మని పేరు వడునంత ప్రౌఢముగా రచియించిన కనుపర్తి సుబ్బన్న చిన్నతనమునందు వ్రాసిన యనిరుద్ధచరిత్రమును జూచిన, నది యాతినిదా యనుపించును. చామకూర మంచిపాకమునఁ బడినదని మెప్పుడు గాంచునట్లు విజయవిలాసమును విరచించిన వెంకటకవి యంతకు బూర్వము చేసిన సారంగధరచరిత్ర చూచిన, నది యాతనిదా యనుపించును. ఈసంగతులను మనస్సునం దుంచుకొని యుండినచో విమర్శకులు సైలి పోలదని వ్రాసియుండరు. రసికాభిలాషము శృంగారనైషధాదులవలె సంస్కృతభూయిష్టము కాదు గాని కొంతవరకు వీథినాటకకవిత్వమును బోలుచున్నదనవచ్చును. వీథినాటకము వ్రాసినవయస్సునకును భిన్నమైన ప్రాయమున వ్రాయబడి యుండినచో వీధినాటకసైలికంటెఁ గూడ దీనిశైలి భిన్నమై యుండవచ్చును. శ్రీనాథుని గడుసుఁదనపుఁబోకడ లిందెక్కడ గానరావట! శ్రీనాథుని గడుసుఁదనపుబోకడల కేమిగాని నైషధాదులయందున్న గడుసుఁదనపుఁబోకడలేవో రసికాభిలాషమునందు లేనిచో దృష్టాంశములతోఁ జూపి, తమవాదము హేతువులతో సిద్ధాంతీకరించికొనక వట్టిమాటలమాత్రముచేత గాలక్షేపము చేసిన యీవిమర్శకుల గడుసుఁదనపుఁబోకడనుమాత్ర మెంతైనను మెచ్చవచ్చును. ఆలాగుననే కల్పన లెక్కడోకాని తరుచుగాఁ బ్రౌఢముగా లేవని వీరు మాటమాత్రముచేతనే స్థాపింపజూచుచున్నారు! కాదన్నవాఁడు కరణ మన్నట్లు వ్రాసిన యీవ్రాతలవలనఁ బ్రయోజన మేమి? రసికాభిషలాము శ్రీనాథునిదని హేతువులతోఁ జెప్పినను జను లొప్పుకొనఁగూడదట! కాని యీవిమర్శకు లేమి చెప్పినను, చెప్పినంత మాత్రముననే యొప్పుకొనవలయును గాబోలు. 1, 2, 26, 27, 50 పద్యములు దప్ప రసికాభిలాషమునందు గల్చనలు లేనిపద్యములు వీరు మరియెన్నిసారులు మూలములు చదివియైనను జూపగలరా? వానిలోని కల్పనలు మాత్రమే ప్రౌఢముగా నున్నవని వీరియభిప్రాయమా, తక్కిన వేల కావో కారణసహితముగా వీరు నిరూపించినగదా తిరిగి యేమి చెప్పుటకైన వీలుండును!

5. రసికాభిలాషమునందు శ్రీనాథుడు ప్రయోగించి యుండడని యాధునికప్రయోగము లున్నవట! ఈసంగతి పోల్చుకొనుట కుపయోగించిన కుశాగ్రబుద్ధిని మరికొంత యుపయోగించి వీరు పైసంగతి కూడ గ్రహింపలేకపోవుట చిత్రముగా నున్నది. శిథిలములైన స్థలముల గ్రొత్తగా బూరింపబడినభాగములు కుండలీకరింపవలసిన యవసరము లేకుండ సులభముగా బోల్చుకొనగలుగుట కచ్చోటులనెల్ల వీలైనవరకు నాధునికప్రయోగములే చేయబడియుండగా “మాబుద్ధికి జూడ గ్రంధమందంతట నొక్కసైలియే కనబడుచున్నది. కాని వేర్వేరు సైలులు కనబడుటలే" దని వీరు వ్రాసినది యెంతహాస్యాస్పదముగా నున్నదో చూడుడు. ఆధునికప్రయోగముల జూపగలుగుటచే శ్రీనాథుని గ్రంథము కాదని స్థాపింపఁగలిగితి మని వీరు సంతోషింతురే కాని క్రొత్తగ బూరింపఁబడిన భాగము లున్నవే, యీనవీనప్రయోగము లందలివేమో యను సంశయము కూడ వీరు పొందరైరి. పాపము, తమయుక్తి యప్రతిహత మనుకొనిన వీరియుత్సాహమునకు భంగము కలిగినందులకు విచారింపవలసినదే. "లజ్జిలినాను" అనునది కేవల మసాధు వని వ్రాయుచున్నారు. “ఉన్నాడను" అనుదానికి "ఉన్నాను" అనునది రూపాంతర మయినట్లే, "లజ్జిలినాడను" అనుదానికి "లజ్జిలినాను" అను రూపాంతర మున్నట్లు మతాంతకము గలదు. ఆధునికప్రయోగములు గలవు. కావనినచో మనోరమాపత్రికాధిపతులచే రచింపబడి మనోరమయందు ప్రచురింపబడిన ప్రసన్నయాదవనాటకమున 21వ పుట జూడుడు. అందు “బ్రతికినావు" అనురూపము బ్రయోగింపబడినది. ఇది సాధువైన నసాధువైన బ్రకృతాంశమున కొక్కటియే. శ్రీనాథు డిట్లు ప్రయోగించియుండ డన్నదానితో నిర్వివాదనముగ నేకీభవింపవచ్చును. విమర్శకులు కష్టపడి యుదాహరించిన ప్రయోగములం బట్టి చూడ, నీగ్రంథమునందు గ్రొత్తగా బూరింపబడినభాగములే నవీనుడు రచించినట్లు తోచును కాని గ్రంథమెల్లను శ్రీనాథాదులగు ప్రాచీను లెవ్వరయిన వ్రాసియుందురని తోచవలసిన యవసరము లేదు.

6. శ్రీనాథుడు పరమభాగవతోత్తముడట. నైష్టికుడట ఇట్టి గ్రంథమును వ్రాసివుండడట. యాత్రకొరకు వచ్చెడి సకలజాతుల నాతులను జూచి వర్నించుటకైన నేమి, సింహాచలము వంటి పుణ్యసైలముమీద సంతతమును గూర్చుండిన మహానుభావుడు పరమభాగవతోత్తము డనవలసిందే. నీళ్ళరేవులకు వచ్చెడి మంగలి, చాకలి, తెలికల పడుచులను సయితము వలసిన నేమి, వారిచేత శ్రీకాళీకేశ్వరీచరణములపై నొట్టు వేయించుకొనిన ధన్యాత్ముఁడు నైష్టికు డనవలసినదే. “ఈతడు యౌవనదశయందు శృంగారనాయఁకుడై స్త్రీలోలుఁడై తిరిగె" నని యొకచోటను, "అవసానదశయం దిట్టికష్టముల కెల్లను గారణము యౌవనదశయందుఁ గామవశముచేత స్వేచ్ఛగా విహరించి దేహమును ధనమును బోఁగొట్టుకున్న పాపఫలము తక్క వేఱొక్కటి కానరా” దని మఱియొకచోటను గగపుచరిత్రయందు వ్రాసిన రావుబహద్దరు వీరేశలింగంపంతులువా రీవిమర్శకులపాటి యెఱుఁగరు కాఁబోలు! "విధివిరామము లేక వేశ్యకాంతలఁ నేరాధరసుధారసధారలఁ గ్రోలు"చుండినను గాళహస్తీశ్వరమహత్మ్యగ్రంథకర్తయగు ధూర్జటి మాత్రము పరమభాగవతోత్తముఁడును నైష్టికుఁడును గాఁడా? లేక, "ప్రమత్తునిం జారుఁ డనంగరాదు వెలుచం బరకాంతలఁ గూడినేనియు" నని విమర్శకుల యుద్దేశమా? శ్రీనాథుని జా ప్రసిద్ధి యబద్ధమైనదని విమర్శకు లేమైనఁ కారణములు చూపి పరమభాగవతోత్తముఁడును నైష్టికుడు ననిన బాగుగానుండును. రసికాభిలాషము వ్రాయుసరికి శ్రీనాథుఁడు శృంగారనాయకు డనుట స్పష్టము. శృంగారనాయకుడనని తెలియచేసికొనుటకే తని నామమును శ్లేషించుచు శృంగారశ్రీనాథపదము నుపయోగించియుండును. రసికాభిలాషము శ్రీనాథునిదని చెప్పుటవలని నాతనికీర్తి పాడగునేమో యని విమర్సకులు జడియ నవసరములేదు. వీథినాటక మాతనినిదని చెప్పుటవలనకంటే నిప్పు డెక్కువగా నాతనికీర్తి పాడు కాదు. రసికాభిలాషమున బూతు విస్తారముగా నున్నదని శ్రీనాథు డాగ్రంథము తనదని తెలియఁజేసికొనుటకు సిగ్గుపడెననుట యాలోచనలేని వ్రాత. ఈమాత్రపుశృంగారపద్యముల నతడు తక్కినగ్రంథములలో వ్రాసియేయున్నాడు. వీథినాటకములోనివని యప్పకవి యుదాహరించిన "కుసుమం బద్దిన చీరకొంగు", "కందుకకేళి సల్పెడు ప్రకారమునన్" మున్నగు పద్యములు బూతు లేనివా. అవి కమలనాభామాత్యపౌత్రుడు మారయామాత్యపుత్రుడు నగు మహాకవి శ్రీనాథుడు రచించినవేకదా! ఒక్కశ్రీనాథుడే యన్నమాట యేమి? "శృంగారుడు శ్రీనాథకవి" యని వ్రాసిన శతావధాని తిరుపతి వెంకటేశ్వరకవుల కీమాత్రము తెలిసినది కాదు కాబోలు. వయస్సు ముదిగి తరువాత గ్రంథములలో వ్రాసిన శ్రీగంగనీతులు వ్రుద్ధనారిపాతివ్రత్యమును సూచించునని యెరుగక వీ రిట్టివెర్రివ్రాతలు వ్రాసిరి. కాశీఖండ భీమఖండ గ్రంథకర్త యగుట మాత్రముచేతనే శ్రీనాథుడు సతతమును బరమభాగవతోత్తముడును నైష్టికుడు నయినచో, "భువనైకమోహనోద్ధతసుకుమారవారవనితాజనతాభువతాపహారి సంతతమధురాప్రబంధముల వ్రాసిన సంస్కృతాంధ్రకవులెల్లరు నిప్పటిమనకు బూతుగా దోచు నీమాత్రపుశృంగారమును వాడియేయున్నారు. విమర్శకులు గ్రంథపరిశోధన చాలకయో చదివినది మరచిమో కాళిదాసాదులగు సంస్కృతకపులు కవిత్రయమువారు పింగళి సూరన్న మొదలగు తెలుగువారు శృంగారరసము రసికాభిలాషములో నున్నదానికంటే దక్కువగా వ్రాసిరని చెప్పసాహసించిరి. ఆడుదానినోటిలో సయితము నీగుబ్బల నుబ్బించిన నీయౌనప్రాదుర్భావమునే నిందించుకొనుచున్నమాటలు బెట్టిన కాళిదాసుని శృంగారము వీరికి రుచించినది. పురాణకవులగు కవిత్రయము వారిమాట కేమి గాని ప్రభావతీప్రద్యుమ్నుల సమాగమము మొదలుకొని వారిరత్యాదులను విజృంభించి వర్ణించిన పింగళి సూరన్న శృంగారము వీరికి రుచించింది. స్త్రీవర్ణనము నఖశిఖపర్యంతము నొక్కయవయవమేని విడువకుండ చేసి రతివర్ణనము సయితము మానని తయిన శృంగారప్రబంధకవుల శృంగారమెల్ల వీరికి రుచించినది కానీ యేహెతువుచేతనో పాప మీరసికాభిలషము సంగతి శృంగాన మన్నమాత్రము వీరికివదల కంటగించినది. పేరు పెట్టుట ఎందులకు గాని నవీనులలో సంఘసంస్కర్తలైనవారు సహితము చేసిన శృంగారము రసికాభిలాషములోని దానికంటె దీసిపోటే! దానిని విమర్శకు లెంత యాదరింతురు? పూర్వోదాహృతకవులగ్రంథములు సర్వకళాశాలాధికారులు పరీక్షలకు గూడా నియమించుచున్నారే. విద్యార్థులు తలవంచుకొనియైన జదువనే చదువుచున్నారే. శృంగారభూయిష్టములని తలపక వైజయంతీవిలాస విజయవిలాస ముఖ ప్రబంధముల నాగరిక పత్రికాధిపతులును ముదింపించి ప్రచురించుచున్నారే. ఆవిషమవృక్షముల గూడ నీవిమర్శకు లేల యూడబెఱుకరు. శ్రీనాథునిదన్న హేతువుచేత రశికాభిలాషమును మూలనడగద్రొక్కక ప్రకటించుట యొకసాహసము కాదు కాని, యీవిమర్శకులకు తెలిసియు తెలియని విమర్శనము వ్రాయుట సాహసమే. వెనుక ముందు లాలోచింపక తొందరపడి వ్రాసిన యీవిమర్శనమును చూడగా నిట విమర్శనావేశముచేత నొడలెఱుంగక యున్న ధూర్తవిమర్శకుడెవ్వడో వ్రాసి యుండవచ్చునని తోచుచున్నది. కవిత్వసైలిం దెలుపుట కుదాహరింపవలసిన మృదువయిన పద్యములు రసికాభిలాషమున లేవట? కనక నెన్నియోసారులు చదివినను లాభింపకుండుట కిది నిదర్శనము. లాభించి యుండి యడల 1. 2. 8. 10. 17. 26. 32. 45. వ పద్యము లుదాహరించిన నష్టము లేదని తెలిసికొనకపోయియుండునా? అందు రెండు సైలి తెలుపుట కీదిగువ నుదాహరింపబడుచున్నవి.

ఉ.

మత్పరితాప మంబుజసమంచితవక్త్ర నశోకపల్లవాం
చత్పరిభాసితాంఘ్రిని రసాలసమాధరమల్లికాంగి నీ
లోత్సలనేత్ర నిన్ను గనుచున్న కొలదిని హెచ్చుఁజొచ్చె నో
యుత్పలగంధి! పంచశరుఁ డూమశరంబుల నిగ్గునోకదా!


ఉ.

నీయెలనవ్వు నీకచము నీమెయి చాయయు నారయంగ గం
గాయమునాసరస్వతులు నాహృదయంబున నిశ్చయించితిన్
మాయురే! పుణ్యభూమివి సుమా! నినుఁ జేరినవారి కెల్లనున్
మాయు మనోజతాపములు మానిని! నన్నిఁకఁ జేరఁదీయుమా.

విశాఖపట్టణము

1వ సెప్టెంబరు 1907 సం॥

సెట్టి లక్ష్మీనరసింహము

శ్రీరస్తు

రసికాభిలాషము

క.

శ్రీపుత్రసతీసన్నిభ
రూపవతీ! మదవతీ! మరుఁడు తనపూవుం
దూపులనా? నీవాలుం
జూపులనా? నన్నుఁ గొట్టుచు న్బాధించున్?

1


సీ.

కొదమతుమ్మెదచాలు నదలింపఁగం జాలు
                        కప్పుదోఁ రనరు మేల్గొప్పుతోడ,
వెన్నెలలం జల్లి విలసిల్లు జాబిల్లి
                        గోముతోఁ దనరు నెమ్మోముతోడఁ
బదను వెట్టిన మారుబాణమ్ముల న్మీఱు
                        నేపుతోఁ దనరు వాల్చూపుతోడఁ
దొగరు మెండుగఁ బండు దొండపండున నుండు
                        కావితోఁ దనరు కెమ్మోవితోడ


తే.

సందెవేళను మేడపైఁ జల్లగాలి
కొఱకు విహరించు నిన్ను గన్గొన్న యంత
నీపయినె కడు దృఢముగా నిలిచియుండి
నాకు వశము గాకున్నది నామనమ్ము.

2


ఉ.

సుందరి! పంట నొక్కఁటను జొక్కపుమోవి సుధారసంబు, చే
తం దుడుకారఁ బట్టఁ బలితంపుఁజను ల్వెలియేన్గి కుంభముల్,
సందిటఁబట్టి నిల్పఁగను సన్ననికౌ నల మిన్ను; గాన నీ
‘వందని మ్రానిపండు’వని యాసను మానదు డెంద మయ్యెయో!

3


చ.

పిడికిటఁ బట్ట ని ట్టటులు బిట్టుగ మిట్టి పడంగఁ జొచ్చు నీ

దుడుకుఁజనుంగవం బలెనె తుళ్ళుచు నాహృదయంబు గూడనొ
క్కెడను నడంగకున్నయది; యియ్యెడ గుబ్బల నాదుఱొమ్ము నం
దడఁగఁగఁ బట్టి యుంచు, తగినట్టివె యాయ్యనిజట్టు పట్టఁగన్.

4


సీ.

చెలువ! నీ చక్కనిచెక్కిలి నొక్కి మ
                        క్కువ నేను నొక్కించుకొనుట యెపుడొ?
రమణి! నీ మధురాధరమ్మును గొఱికి మ
                        క్కువ నేను గొఱిగించుకొనుట యెపుడొ?
కొమ్మ! నీ ఱొమ్ము నా ఱొమ్మునం గ్రుమ్మి మ
                        క్కువ నేను గ్రుమ్మించుకొనుట యెపుడొ?
కాంత! దీ నెమ్మను గౌగిటం జేర్చి మ
                        క్కువ నేను జేర్పించుకొనుట యెపుడొ?


ఆ.

తెఱవ, నిన్ను రతులఁ దేలిచి నేను దే
లించుకొనుట యెపుడొ? లేమ, నేను
నీవు ననెడుభేద మే విధంబున లేక
యుండఁ గలుగు టెప్పు డొక్కొ యింక?

5


ఉ.

కాముఁడు మనస్థలిని గల్గిన ధైర్యధనంబు నెల్లనో
కోమలి దొంగిలించి యిఱుకుంజనుకొండలసందు నందుఁ బా
నీ మెయిఁ బాఁతి పెట్టెనుగదే ననుఁ జూచుకొనంగ నీయు మా
సీమను; సంశయస్థలులఁ జేతులఁ గ్రుమ్మెద, గోళ్ళఁ ద్రవ్వెదన్.

6


మ.

“అహహా! నీకచ మంగజాతగుణము, న్హానంబు చంద్రప్రభ
న్మహితాక్షు ల్పవనాశ్వముం గెలిచె,” నన్నన్ నన్ను బాధింపనా
కుహను ల్పూని రిదె గిరీశసమవక్షోజా, తమోవేణీ! యో
యహిరోమావళి! ప్రోవరమ్మ, నినుఁ జుమ్మా నెమ్మది న్నమ్మితిన్.

7


సీ.

నీ కురు ల్నిముర నే నేర్చు నంతకె హేమ
                        నాస! తుమ్మెద నన్ను గాసి పెట్ట,

నీ పల్కుల న్విన నేర్చుదన్కనె సంకు
                        మదగంధి, చిలుకు నన్బెదర జేయు,
నీ గళస్వర మెన్న నేర్చు పర్యంపమె
                        రామ, కోయిల నన్ను రా పొనర్చు,
నీ నెన్నడలఁ జూడ నేర్చుదాకఁనె ఘన
                        వేణి, రాయంచ నన్వెతల ముంచు,


ఆ.

మరునిరాజ్యమునకు గరుణ న న్పట్టాభి
షిక్తుఁ గాఁగ నీవు చేయువఱకె
మరునిబలఁగ మిట్టి మాడ్కిని సన్ను బా
ధించుచుండు నో రతీవిలాస.

8


చ.

మదనుధనుర్గుణంబు మార్గణపాళి పయి న్ధనుస్సుపై
మది నుదయించునాదుపగ మానఁగ నంగజసంగరంబున
న్మదవతి, నీదుకొప్పొడిసి మాటికిఁ బట్టుకొనంగ, నీయొడ
ల్పదిగ నల్కం, నీపెదవిఁ బంటను సారెకు నొక్కఁ గోరితిన్.

9


ఉ.

మత్పరితాపమంబుజసమంచితవక్త్ర, న్నశోకపల్లవాం
చత్పరిభాసితాంఘ్రిని, రసాలసమాధర, మల్లికాంగి, నీ
లోత్పలనేత్ర, నిన్ను గనుచునన కొలందిని హెచ్చఁజొచ్చెఁనో
యుత్పటగంధి, పంచిశరుఁ డూనుశరంబుల నిగ్గునో కదా?

10


చ.

కవు లెటు లన్న నేమి? యుపకారి యగుం గద శంబరారి? ని
న్గవుఁగిట బిగ్గఁ జేర్చుకొనఁగా నుబుకుం కలయట్టి నీదు చ
న్గవ నడిభాగమం దిముడఁ కాఁ గడుఁ గష్ట మటంచు నెంచియే,
తవురఁగఁ దూపులం బఱిపి తద్దయు గ్రుచ్చెడు నాయురస్థలిన్.

11


చ.

విరహపువేఁడిచే మిగులవేదనఁ బొండుచు నున్న వాఁడ, దు
ష్కరము భరింప నీ నగవుఁ గప్పురముం, జనుతమ్మి మొగ్గలుం,
గరకిసలంబు, లూర్పువలిగాలులు, బాహుమృణాళము, ల్నిరం

తరమును మేనఁ జేర్చిన గదా ముగుదా, యుపశాంతి గల్గెడున్.

12


చ.

బిగువును బింకముం దనర బిట్టుగ లోపలఁ గ్రుమ్ములాడు నా
పఁగ మఱియింత త్రుళ్ళిపడుఁ బైకిక భేదము లేనయట్టులే
యగపడు నీదునిబ్బరపుటబ్బురపున్బిగిగుబ్బ లాఁపనే
నగ నగు? “మర్ధనంబె గుణవర్ధన,” మట్టుల చేయనీయుమా.

13


ఱైకముడి న్సడల్చి కడుఱంపిలు నీ బలితంబుఁజన్నుల
న్నా కరమందుఁ బెట్టుమనినం, కరమం దవి పట్ట వందువో?
కోకముడి న్సడల్చి కులుకుంగవునుం గయికొంట కష్ట మే
మో? కమలాక్షి! “సూక్ష్మమున మోక్షము” గల్గినరీతిగా నగున్.

14


మ.

కనకాంగీతిలకంబ, కుంకుమపరాగంబు బయిం బూసికొం
చును మే ల్సాధన చేయు బల్లరిడ్రిముచ్చు ల్గావె నీ నిస్తుభ
స్తనము? ల్చాలఁ దయారులోనె తగు, జేతంజిక్కునే? కంచుకం
బును విప్పంగ నొకప్డు పట్టగల నేమో నే బ్రయత్నించెదన్.

15


శా

కాంతా! మీటినయంత విచ్చునటులే కన్పట్టు న్నీదు చ
న్బంతు ల్బట్టుకొనంగ మిట్టిపడు నన్నా! నాలిమ్రుచ్చు ల్గదా?
యెంతో సిగ్గున జాటుగా బయటలోనే యున్న యట్లుండియు
న్సుంతైనం దము నెవ్వరేని గన బిల్చుం బట్ట రండం చహా!

16


ఉ.

నీ యలనవ్వు, నీ కచము నీ మెయిచాయము నారయంగ గం
గాయమునాసరస్వతులుగా హృదయంబునన్ నిశ్చయించితిన్
మాయొరె! పుణ్యభూమివి సుమా! నిను జేరినవారి కెల్ల ను
న్మాయు మనోజతాపములు; మానిని, నన్నిక జేరదీయుమా!

17


చ.

పొలతిరొ! నీదుమోవిఫలి ము న్వచనాబుకణంబు, లూర్పుగా
లులె నిరతంబు గ్రోలుచును లోపల చెలువంబి చూచుచు
న్బలితపుగుబ్బగుబ్బలులపై దప మే నొనరింతు; గూర్మియ
గ్గలముల నీవిమోక్షమును గల్గగ జేయుమ నాకు నీ వికన్.

18

మ.

కలికీ! పువ్విలుకానిక్రొమ్ములికి, నిక్కం బిద్ది నూగారుచీ
మలు పోగై పయి బెట్టుపుట్ట లగు జుమ్మా నీ కుచమ్ము! ల్భుజ
గులపాలౌ నని చెప్పగా వలెనె? నాకుంగూడ నా భాగ్య మె
ట్టులీ కేనాటికి గల్దునో యెఱుగ కిట్టు ల్వేదనం బొందెదన్.

19


చ.

అటు నిటు జక్రపాలనమునందు నితంబకుచంబు లున్ననుం
గటకట మధ్యనాభిసుడి గల్గుటచే నిఱుపేద యయ్యె నీ
కిటకిట లాడౌను; పరికింపవు కావున బాధ బెట్టెదం
గటిని గుచంబుల న్మఱియు గౌను సుఖింపగ ముష్టి బెట్టెదన్.

20


మ.

పరకాంత నిన్ను బల్మి బట్టుకొనగా భావించుపాపంబు నా
కరము ల్పాపికొనంగ దావకకటిక్ష్మాచక్రమం దెల్లడం
దిరుగ, న్నీదిక్కుచదివ్యశైలమురపై నిక జేర, నీసుస్మితా
మరకల్లోలినిలోన మున్గ గరుణర్గంబు గల్పింపుమా.

21


సీ.

గొప్ప దౌ నీ కప్పుగొప్పుచీకటిని గ
                        రమ్ముల జొప్పినన్ రాజ నౌదు
గమ్మ నౌ నీ ముద్దుగెమ్మోవిసుధను బొం
                        దుట గల్గిన న్విబుధుండ నౌదు
గుల్కు లౌ నీ కుచకుంభముల న్గోళ్ళ
                        నునిచినం బురుషసింహుండ నౌదు
సన్న మౌ నీ కౌనుమిన్నును విడువ కె
                        న్నండును బట్ట ఘనుండ నౌదు


తే.

నింక వేయును నేల? నీ వెపుడు నన్ను
మదనకదనంబున న్మెచ్చి మరునిరాజ్య
మునకు బట్టంబు గట్టెదో పొందు నాదు
జన్మ మపుడె సార్ధకత నిశ్చయము గాగ.

22


చ.

భ్రమగొని మోవిబింబమును బంటను నొక్కశుకుండ, జన్నుకుం

భములను గోళ్ళ నిచ్చెమెయు వ్రచ్చిన గేసరిడింభకుండ, సం
భ్రమమున వేణిసర్పమును బట్టుకొనంగ వినాయకుండనుం
జుమి, యిటు నీదు పొం దొదవుచో నిరతమ్మును బ్రహ్మచారినే.

23


శా.

ఏలా యో బలుసోయగంబులకు దీవీ! జాలముం జెయ? నే
నే లీల న్విరహాబ్ధి నీదుదును? ని న్నేలాగునం జేరుదున్?
జాలిం జూపకయున్న మన్మథశరాసారమ్ముచే మున్గెదం?
దేలింపం గదె గుబ్బకుండలను గుండె న్మోపి న న్నీయెడన్.

24


సీ.

నలుదిక్కులం జీకటులు గ్రమ్మ గబరీభ
                        ర మ్మను హాలాహలమ్ము చెదర
మిగుల బొంకంబుగా బిగిబిగిగుబ్బల
                        న్వెలియేన్గుకుంభము ల్వెలికి దోప
నడ్డంబుగా బాహులను నట్టి వేలుపు
                        మ్రాకులే గొమ్మలు పైకి లేవ
నెల్లెడ న్వెన్నెల ల్చల్లుచు జిఱునగ
                        వనెడు చంద్రప్రభ జనన మొంద


తే.

వరుస నిట్లు నీసౌందర్యవారధి రతి
మథనమును నొనర్చి యధరమధురసుధను
బొందు టెన్నడొ? యో జగన్మోహినీ! భ
వత్కరుణ లేక యది పొంద వశమె నాకు?

25


చ.

కనికర మించు కేనియును గల్గినదానవు కా వటంచు ని
న్ననగలనా? దినంబు లలనా, కల లందున నైన రాత్రులం
గనబడి నన్ను దన్పుదువుగా? పది వే లదె, “లేని మామక
న్ననుగడు గ్రుడ్డిమామ యయి నన్నయ” మన్నది యున్నదే కదా.

26


సీ.

ఎదురొత్తు కులుకు గద్గద మెత్తు పలుకును
                        నలరెడు రతిసమయంపువెరవు

జెలరేగు కురులు నుయ్యెల లూగుసరులును
                        నింపారు పురుషాయితంపుహరువు
నర డిందుచూపు జందర చెందురూపును
                        దనరుచున్న సురతాంతంపుదెఱవు
విడబాఱు ఱైక పెమ్మడి జాఱుకోకయు
                        దగ బాన్పుపైనుండి డిగెడుమురువు


తే.

గలలలోపల బలుమాఱు గాంచి కాంచి
కాంక్షదీఱ ని న్మఱిమఱి కౌగలించి
యంతలో నిద్ర మేల్కాంచి యెంతో వంత
గాంచుచుందు నిన్గాన కోమించు బోణి!

27


చ.

కల నొకమాఱు నీవు ఱవికద్ధరియింపక జిల్గుబయ్యెదం
దొలగగద్రోయ నిక్కుజనుదోయమ ఖచిక్కునగ్రమ్మనాయుర
స్థలి నవిదూఱి చిక్కువడి చచ్చిన రా నట! నూత్నపార్వతీ
శులవలెనట్లెయుందు మట చోద్యముగా మన మెల్లకాలమున్.

28


చ.

ఇక మఱియొక్కమాఱు నిను సే బిగియారగ గౌగలింపగా
బికపిక లాడు నీ చనులు వీపున దూసిన వంట! నేవికా
వికను ‘విచిత్రపున్ద్విజునేనీపున జన్నులు పుట్టె!’ నంచు దా
నికి వెడనవ్వు నవ్వుచును నిద్దుర లేచితి, నంద ఱే మనన్.

29


చ.

మఱియొకమాఱు వెల్లకిల మంచముమీద బరుండి వంట! నే
దొఱగగ నీదుపయ్యెదను ద్రోయగ బుస్సున నూగుటారు పా
ము, రవిక విప్ప వాడిమొన ముక్కులతో జనుజక్కవల్ననుం
గఱవగ వచ్చెనంట! యది కన్గొని భీతిని మేలు కాంచితిన్.

30


చ.

ఎలమి మఱొక్కమాఱు మన మిర్వురముం బసివార మై కలం
బలుమరు నాటలాడు నెడ బాలరొ! నీదు నితంబసైకత
స్థలములమీదికౌ ననెడి సన్ననిపుల్లను నేను గాంచగా

గలుగమి నీదుకోడి యిడగల్గినగ్రుడ్లట చుమ్మి నీచనుల్!

31


ఉ.

“తీయనిమోవితేనె కరుదెంచెడు నా రనుచీమబారు దా
నో యెలనాగ, దూరమున నుండగనే కని వెన్కకు న్వడిం
బోయెను భీతిచేత బలము గల దయ్యెను వేణిసర్ప, ము
ఱ్ఱో!” యని మేలుకొంటిని మఱొక్కతఱి న్వినువారు నవ్వగన్.

32


ఉ.

వేఱొకస్వప్నమందు నిను వేడుక నేను గవుంగలింప, వే
మాఱును నాశరీరమున మారుఁడు నాటిన మోహబీజము
ల్తీఱనిచెమ్మటం దడిసి లేచె గడుం బులకాంకురంబు లై,
నాఱును బోసి యమ్మరుఁడు నాటినవాఁడట వాని గ్రమ్మఱన్.

33


ఉ.

ఇమ్ముగ నవుపాదరస మెల్లెడ నిండిన నీదుచెక్కుట
ద్దమ్ముల నా మొగమ్మె సురతమ్మున నేగని, వేఱె యెవ్వరో
య మ్మెయి నిన్ను ము ద్దిడి రటండును బట్టగ బోవ నీకపో
లమ్ములె చేత జిక్కెనట! లజ్జిలినా నట నీవు నవ్వగన్!

34


“అక్కట! తాము చక్రవిజయంబును బొందిన నంచు నీ చను
ల్నిక్కుచు విఱ్ఱవీగుచును నీల్గుచు నున్నవి, చేత జిక్కిన
న్నొక్కుద” నన్న ‘గోళ్ళ గద నొక్కుదు; వాడుతనంబు గాని నీ
రొక్కబలంబె?’ యంటి వికనొక్కకలం గలహంసగామినీ.

35


ఉ.

ఉపరతి నీవు న న్గలసి యొకకల న్సలుపంగ బూన నా
విపులలు వక్ష మందు గడువేడుకతో వలరాచబిడ్డఁ డె
ల్లప్పుడును ద్రిప్పుబొంగరము లట్టలన్ కనుపట్టె నీదు పొం
కపుజనుదోయి, జాలవలె గన్గొన నయ్యెను నారు మాయురే!

36


శా.

భామారత్నమ! నీ వికొక్కకల బుంభావంబు గావించుచొ
న్నామై నీ జడలోననుండి సుమసంతానంబు రాల న్మ్సర
జ్యోముక్త ప్రసవాశుగంబు లని నే నాకంపనుం బొందగా
బ్రేమ న్నీ చనుడాలులం గరములం బెట్టంగలేదా కలన్?

37

మ.

మగలా గీ డొకస్వప్న మందు నొనరింప న్నేను సొంపార బై
కెగయం జేతుల రెంట నీదుచనుదోయిం గట్టిగా బట్టగా
నగి, గోవర్ధనమందరంబులను శ్రీనాథుండు నే డొక్కసా
రిగమ్రోసెంగమ?, డంచు బల్కితివి సంప్రీతాత్మనై నాతిరో.

38


మ.

చెలియా! యెన్నియొ యింద్రజాలముల నేర్చె న్నీ చనుల్చందనం
బలదంగా హిమవంతు, ల్పసుపు పూయన్మేరువు ల్కుంకుమం
బొలయంగా నుదయంబులు, న్మ్రగమం బొప్పారగా నంజనం
బు!, అటనం, గవిసార్వభౌముఁడవె యౌ బొ మ్మంటి నన్నుం గలన్.

39


మ.

పొలయల్కంగలలోన నీ వనలిమోముం గాగ బన్నుండ, ‘నీ
బలుచన్తిప్పలు మోముదామరయు ద్రిప్పన్శ్రోఱుల న్సైకత
స్థలులం గొప్పనునాచు లేవె మఱి?, నీ సౌందర్యగంగాఝరిం
గలదే యీదరి మే లటన్న?, దని పల్కం గోపము న్మానవా?

40


చ.

పడతిరొ! పూవుముల్కులను బల్మఱు మారుడలంత పెట్టగా
నడలుచు నిన్ను జేర నను నద్దిర! నీ బలితంపుగుబ్బలం
బొడుచుచు బాధ పెట్టుటకు బూనితి, నిద్దియె ముల్లు పుచ్చి కొ
ఱ్ఱడచినచంద!, మన్న నగవా? తగవా కలలోన నేనియున్?

41


చక్కని పెన్గొడ ల్చిగుపుజన్మొగడ ల్మురిపెంపునెన్నడ
ల్క్రక్కున గాంచి, స్వప్నముల గంతునిదంతి నటంచు నెంచి నీ
వుక్కరినాకు నోడ మరు డోడుటయు న్సమకూరు నంచు నో
చక్కెరబొమ్మ! వినృతమసంగరమందు జయింతు వేమఱున్.

42


ఉ.

నీదు శిరోజనీలముల నీ యధరాధరపద్మరాగము,
న్నీదు నఖాళివజ్రముల నేను హరింతు న టన్న గూడ నీ
ల్గా దని కర్కశస్తనశిలామయ మౌ బిగువుంగవుంగిటన్
ఖైదుగ బాహుపాశముల గట్టవె న న్గల లందు సుందరీ?

43


సీ.

ఘనవేణి! నీ కొప్పు గగనంబునం దెల్ల

                        నున్నది నిండ యం దొక్కమాఱు
శశిముఖి! నీమోముచంద్రిక ల్పల్లె న
                        ల్దిక్కులం దంచు వే ఱొక్కమాఱు
నగకుచ! నీ చను ల్జగతీతలము మ్రోయు
                        చున్నవి యంచు నిం కొక్కమాఱు
సుమగాత్రి! నీ మేను ప్రమదావనుల నెల్ల
                        నున్నది యంచు మఱొక్కమాఱు


ఆ.

మఱియు నింక బెక్కుమాఱులు నీ బలు
తళుకుగన్ను లెల్ల కొలకులందు
జెలగుచున్న నంచు జిత్రంబుగా నేడు
గలల యందు గంటి గలువకంటి.

44


సీ.

తొగఱిని గన నీదు నగుమొగం బాదిని
                        గనిపించి కమలము ల్గానిపించు
గమలము ల్గన నీదు కరముల దొలుతను
                        గనిపించి కిసలము ల్గానిపించు
గిసలము ల్గన నీదు కెమ్మోవి మొదటను
                        గనిపించి తేనియ గానిపించు
దేనియ గన నీదు తీయపల్కులు ముందు
                        గనిపించి యమృతంబు గానిపించు


తే.

నమృతము గనంగ నీ మందహాస ముప్రద
మముగ గనిపించి తొగఱేడు మఱల నీ మొ
గమ్ము గనిపించు నీ రీతి గలలలోన
నెటుల జూచిన గనిపింతు వీవె నాకు!

45


సీ.

రంభ గూడినభంగి రాగింతు నీ తొడ
                        లనురక్తి నిమిరిన యట్టు లైన

హేమ గూడినలీర నెంచెగ నీ యొడ
                        లాసక్తి స్పృశియించి నట్టు లైన
దార గూడినరీతి దలతును నీ గోళ్ళ
                        వర్థితో ముద్దిడి నట్టు లైన
హరిణి గూడినమాడ్కి ననుకొందు నీ చూపు
                        లనురాగమున జూచి నట్టు లైన


తే.

స్వప్నములయందు గాన నచ్చలపొరద
టంచు పొందు నేను భావించుచుందు
గానిచో నీకు నప్సరఃకామినులకు
“హస్తిమశకాంతమ్ము” సుమా సుమాంగి.

46


సీ.

కూర్మబంధమున కూడుదునో భామ!
                        సింహవిక్రమమున నాసింతు లేమ!
గదబంధమున రతి గావింతు మదవతి!
                        యేణబంధము మది నెంతు యువతి!
ధనురాఖ్యబంధంబు నొనరింతు మరుదంతి!
                        యర్ధచంద్ర మొనర్తు నందు నింతి!
భ్రమరబంధంబున రమియింతు గరియాన!
                        మాయూరమున నుంతు మనసు చాన!


తే.

కలలలోపల నీదు మీగాళ్ళ గౌను
జన్నుగవను, గన్నుగవను, గన్నుబొమల
నెన్నుదురు, ముంగురుల, బలు పెన్నెఱులను
గాంచి యాబంధముల నీకు గాంక్ష యనుచు.

47


చ.

అబలరొ! కామశాస్త్రపురహస్యము లెల్ల నెఱుంగువారిలో
బ్రబలుడ వంచు నెంచి బహుభంగుల నవ్వలఱేడు కూడ బూ
గుబురుల బూజ సేసె నిదిగో! మఱి నీవును నిస్తులస్తన
స్తబకయుగంబు నా యురము దాకగ దండన వేయుమా మెడన్.

48

నాగపాశబంధము

చ.

అమరగ భోగినీముదిత వై తనుచు న్జడ జూడ దోచు, మా
న్యముగ భుజంగుడన్, మది గనంగ దశం దగినారమే చుమీ!
శ్రమ విడ, నింక నోము నను జానుగఁ జెల్వగునాగపాశబం
ధమున రతుండ నో మహిళ, తాళనె చుమ్మిక నీ భువిం జెలీ.

49

చక్రబంధము

శా.

కన్యా! శృంగిసమానబంధురకుచా! కల్యాణసుశ్రీరమా!
ధన్యా! గానకళాధురంధర! కళాతంత్రాసమానాచరా!
జన్యేరమ్మదజైత్రసుందరకటాక్షా, యిద్దియే ధర్మమా?
మాన్యాత్మా! కడు బాధ గల్గె, నను లే మాటన్నరా జూడుమా.

50

రసికాభిలాషము

సమాప్తము



సెట్టి లక్ష్మీనరసింహ్వ కృత

సరసచాటువులు

తే.

పూర్ణశశిసమమై మోము పొలిచెనేమొ?
కురులపేరి మబ్బులు దగుల్కొనియె నడ్డ;
నాతిమిన్న నాతోడ నిన్న మగలాగు
కుతుకమున సల్ప దాని పైకొన్నయపుడు.