శృంగారనైషధము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

శృంగారనైషధము

తృతీయాశ్వాసము

శ్రీహర్షసుకవికవితా
వ్యాహారకథాసుధారసాస్వాదసుఖ
శ్రీహర్షోదయ నిత్యస
మాహితమహితాంతరంగ! మామిడిసింగా!

1


నారదపర్వతు లింద్రునికడ కేతెంచుట

వ.

ఆకర్ణింపు మాసమయంబున నిఖిలభువనవృత్తాంతవేదియు నశేషభాషాకుశలుండును సర్వవిజ్ఞాననిధియును సమస్తశాస్త్రప్రవీణుండును సకలపురాణేతిహాససంహితారహస్యవిజ్ఞానవిశారదుండును నగు నారదుండు బాలసఖుం డైనపర్వతుండునుం దానును.

2


ఉ.

పంబినవేడ్కతో భిదురపాణి సురాసురమాళిమాలికా
చుంబితపాదపీఠు బలసూదనుఁ జూడఁగఁ గోరి నాకలో
కంబునకు జనంగ సమకట్టెఁ బితామహుకూర్మిపట్టి హ
స్తాంబురుహాంగుళీనఖశిఖాంకురకోటి విపంచి మీటుచున్.

3

చ.

భువనగురుత్వవైభవము పూనిన నేనియుఁ బూనెగాని పొం
దవు చరియింప నారదున కభ్రపదంబునఁ బర్వతుండు
దివురుట యెట్లు మింటఁ జనుదేరఁగ! యుక్తమ యవ్విధంబునుం
బ్రవితతపక్షపాతగతిభంగి మదిం దలఁపంగ వచ్చినన్.

4


తే.

గగనవీథి విమాన మెక్కకయ చనిరి
యోగవిద్యాబలంబు చేయూఁత గాఁగఁ;
దపము గల్గంగ సాధనాంతరము లేల
సకలకార్యంబులందును సంయములకు?

5


సీ.

అంతరాంతరముల నాకాశచరకోటి
        మోడ్పుఁజేతులు మస్తముల ఘటింపఁ
దనకాంతిచంద్రికాధవళ యయ్యును బేర్మి
        నాదిత్యదీప్తుల నతకరింప
జదలేఱు వీచిహస్తముల నిర్మలవారి
        నంఘ్రుల కర్ఘ్యపాద్యంబు లొసఁగ
నావహసంవహాద్యనిలఘట్టనముల
        శతతంత్రిమూర్ఛనాస్వరము లీన


తే.

గహనసంసారఘోరసాగరము దాఁటి
పరమయోగీశ్వరుఁడు మోక్షపదమువోలె
బహుళతర మైనయాకాశపథము దాఁటి
నాకభువనంబు సొత్తెంచె నారదుండు.

6


వ.

ఇట్లు నారదపర్వతులు నాకలోకంబునకుం జని సర్వగీర్వాణులు గొల్వం బేరోలగం బున్నసుపర్వాధీశ్వరుసన్నిధికి నేతెంచి యాశీర్వాదంబు చేసిరి. యతండును సుముఖోల్లాసంబున సముచితాసనవిన్యాసంబు మొదలయినయుపచారంబు

లాచరించి, యిష్టగోష్ఠీనినోదంబున గొంతప్రొద్దు నడపి ప్రసంగవశంబున.

7


తే.

అనఘ! జగములఁ గల్గువృత్తాంత మెల్లఁ
దెలియఁగా నీకుఁ గరతలామలక నుగుచు
గారణం బేమి నడిమిలోకముననుండి
నరపతులు రారు మునువోలె నాకమునకు?

8


క.

రా రిపు డిచ్చోటికి నసి
ధారామార్గమున ధరణిధవు లెవ్వారున్;
నారద! సృపవంశంబున
వీరకరీరంబు లుద్భవింపవె ధరణిన్!

9


ఉ.

ఏలొకొ మాగృహంబునకు నిప్పుడు రారు మునీంద్ర! భద్రశుం
డాలసమాను లైననరనాథతనూజులు మోముఁదమ్ములన్
వాలికపోటుగంట్లు చెలువంబు గవింపగఁ బేరురంబులం
గ్రాలఁగ లీలమై దివిజకాంతలు వైచినపుష్పమాలికల్.

10


చ.

అతినిశితాసిధార సమరాంగణభూములఁ ద్రెళ్ళి శోణిత
స్రుతిఁ గడుఁజుల్కనై యెగసి సూర్యపథంబున నేఁగుదెంచుచో
గతిఁ గయికొండ్రు లాఘవము గాంతురు మాభువనంబునందుఁ దా
రతిథి సమర్చనాప్రభవ మైనగురుత్వము పార్థివోత్తముల్.

11


క.

అభిముఖులై యేలొకొ నా
సభ కిప్పుడు రారు నృపతిసత్తము లనఘా!
యభిశాప మొనర్పరుగా
త్రిభువనసంస్తుత్య! నాదు దెస నరనాథుల్?

12

చ.

కొలకొలమంచు నుండు సితకోకనదప్రభవప్రసూత! నా
కొలు విది తొంటినాఁ డతిథికోటులసందడి నిప్పు డెంతయుం
బలపల నయ్యె బందుగులు పల్మఱుఁ గైకొని రాకయున్కి నా
కలిమి నిజోదరైకభృతికార్యకదర్యతఁ జిన్నవోయెడున్.

13


చ.

వదలక పూర్వపుణ్యవిభవవ్యయహేతువు లౌట సంపదల్
మదిఁ దలఁపంగ నాపదలు మాన్యసుహృజ్జనబంధుకోటికిన్
హదనున మేలు సేఁత చతురాననసంభవ! శాస్త్రపద్ధతిం
దదుచిత మైనశాంతికవిధానము నిక్క మెఱుంగవచ్చినన్.

14


వ.

కావున నఘమర్షణఋక్కులంబోలు నీవాక్కుల మత్సంశయాఘం బపనయింపు మని సహస్రాక్షుండు నిజచక్షుస్సహస్రంబు తనముఖంబున నిల్పి యూరకున్న నారదుండు పాకశాసనువినయపరిపాకంబునకు మనంబునం బరితోషంబు నొందుచు నిట్లనియె.

15


తే.

అతిథిబాంధవసంభావనాభిలాష
గర్భ మగునీదువాక్యసందర్భమునకు
సంతసం బయ్యె సురరాజ! సాదు సాదు!
సార్వకాలంబు నీవ యిజ్జగము లేలు.

16


వ.

నాకభువనంబునకు రాజలోకంబు భూలోకంబుననుండి రాకుండుటకుం గారణంబు వినుము.

17


నారదుఁ డింద్రునకు దమయంతీస్వయంవరము దెల్పుట

మ.

ఒకరత్నంబు విదర్భదేశమునయం దుద్భూతమై పార్థివ
పకరంబున్ శ్రమియించుచున్నయది సౌభాగ్యప్రభానిత్యల
క్ష్మికి సంకేతనివాసమై మదననిస్త్రింశంబు నా భీమక
న్యక నాఁగా దమయంతి నాఁ గలుగు పర్యాయాభిధానంబులన్.

18

తే.

ప్రతిముహూర్తంబు మదనసౌభాగ్యరేఖ
యౌవనముతోడఁ బెరుఁగు నాయలరుఁబోణి
ధరణియం దొక్కరాజనందనునిమీఁద
నిలిపె నఁట బయల్ వోకుండ నెమ్మనంబు.

19


వ.

పురాకృతసంభవం బైనభాగ్యంబునకుఁ దానకంబైన యమ్మానవేంద్రుం డెవ్వండొకోయని యడుగం దలంచె దేని.

20


తే.

అడుగఁ బూనినమాట యేయెడకు నెక్కె
నంతనుండియు మగిడింపు మమరరాజ!
ప్రశ్నమున కుద్గమనపరిశ్రాంతి వలదు
తెలిసి యుత్తర మీ నాకు వలనులేమి.

21


వ.

నీవు యోగీశ్వరుండవు, నీహృదయంబు పరమాణుదర్శనసమర్థంబు; మనంబులు నణుపరిమాణంబులు; గావున నక్కాంతారత్నంబు మనం బెఱుంగవే? యని యడిగెదేని.

22


చ.

అలయక యోగిబుద్ధి పరమాణువుఁ గాంచినఁ గాంచుఁగాక కే
వలము దదంతరస్థ మగువస్తువు గానఁగ నెట్లు నేర్చు? న
న్నలినదళాయతేక్షణమనఃపరమాణువునందు హ్రీదరీ
నిలయహరీకృతుం డతఁడు నేరఁగవచ్చునె వానిఁ గానఁగాన్!

23


వ.

అన్నీలవేణి కుసుమబాణబాణపరంపరాశరవ్యం బైనతనహృదయంబు విరహపరితాపపాండురంబు లైన యవయవంబులం బ్రకాశించుటం గనుంగొని గురుజనంబు తద్భావపరిజ్ఞానార్థంబు పంచాశత్కోటివిస్తీర్ణం బైనభూమండలంబున స్వయంవరమహోత్సవంబు చాటింపం బంచిన.

24


ఉ.

అంగదఁ దత్స్వయంవరమహామహవైభవహూతికేలికిన్
గ్రంగన ఘంటపైఁ గొడుపు వ్రాలుట యెన్నఁడొ నాఁటనుండియున్

సంగరముం గరంబుగ మనంబున భావన సేయరైరి యా
మంగళకార్యనిష్ఠు లయి మధ్యమలోకమున న్మహీపతుల్.

25


తే.

అఖలమోహిని యైనయయ్యలరుఁబోణి
శైశవము వీడుకొన్నది సందుగాఁగ
ననుదినంబును రాజనందనులమీఁద
వేఁటలాడుచు నున్నాఁడు విషమశరుఁడు.

26


వ.

అది కారణంబుగా రాజలోకం బీలోకంబునకు రాదు, భూమండలంబున భండనంబు లేకుండుటం జేసి నావిలోచనంబు లుపవసించి యున్నయవి, యే నిప్పుడు వీనికి సుఖపారణంబుగా రణక్రీడాడంబరంబు రాక్షసులతో నీకు సంభవించునొకో యనునాస నిచ్చోటికిఁ జనుదెంచితి నని పలికిన.

27


ఉ.

అమ్మఘవంతుఁ డల్ల నగి యంబురుహాననసూతి కిట్లనున్
సమ్మద మొప్పలేదు రణచర్చ దివంబున నాదు నెయ్యపుం
దమ్ముఁడు కైటభాంతకుఁడు దక్షతః బ్రెగ్గడయై సమస్తభా
రమ్ము భరింపగాఁ ద్రిదశరాజ్యము నెమ్మదిఁజేయుచుండుదున్.

28


తే.

సాక్షిమాత్రంబుగాఁ గరస్థలమునందు
నెపుడు వజ్రాయుధంబు వహింతుఁగాని
యతనియాజ్ఞయ చాలు సంయమివరేణ్య!
త్రిదశలోకాధిరాజ్యంబుఁ దిరము సేయ.

29


వ.

అని పలికినం గలహభోజనుండు నిట్టూర్పు నిగిడించి యిట్లనియె.

30

శా.

పాతాళంబున నున్న యప్పుడు గడుం బ్రార్థింతు భూలోకముం
జేతోవీథి ధరిత్రి నున్నపుడు కాంక్షింతున్ సురావాసమున్
దైతేయాంతక! యొక్కచోట నిలుపందాత్పర్య మిబ్భంగి నా
కేతోయంబున లేకపోయెను సమద్వీక్షాభిలాషంబునన్.

31


వ.

నిన్నుం గనుంగొంటి, నారాక కిదియ లాభంబు నన్ను వీడుకొల్పుము, మధ్యమలోకంబునకుం గ్రమ్మఱ బోయెద, దమయంతీస్వయంవరోత్సవావసరంబున మాత్సర్యంబు వుట్టి జెట్టిబిరుదు లగురావపుట్టువులు దమలోనం బ్రతిఘటించి నిల్చి శస్త్రాస్త్రంబులం గదిసి మొత్తులాడిరేనిఁ జిత్తంబునం గుత్తుకబంటిగా సమరసంరంభంబు భుజియింతుంగదా! యని పలికి సముచితప్రకారంబున నముచిసూదనుచేత ననుజ్ఞాతుండై పర్వతుండునుం దానును నరిగెఁ దదనంతరంబ.

32


ఇంద్రాదులు దమయంతీస్వయంవరమునకుం దరలుట

తే.

దేవమునిమాట లమృతంపుఁదేట లగుచు
నధికతర మైనయాహ్లాద మాచరింప
వేడ్కపడె నెమ్మనంబులో విబుధరాజు
భోజకన్యాస్వయంవరంబునకుఁ బోవ.

33


మ.

పవిసంగంబునఁ దాప మొందినశచీప్రాణేశుకెంగేలికిం
జివురుంగైదువుజోదు వైద్య ముపదేశించెన్ రహస్యంబుగా
నవనీహారపయోమిళ న్మలయజస్నానార్ద్రపర్యంతమై
యివతాళించు విదర్భరాజతనయాహృద్యస్తనద్వంద్వమున్.

34


చ.

అప్పుడు.

35

సీ.

రంభవిస్రంభసంరంభంబు దిగనాడె
        మౌనరోషము పూనె మంజుఘోష
దళుకొత్తె మదిఁ దిలోత్తమకు నుత్తలపాటు
        ప్రమ్లోచ ప్రమ్లానభావ మొందె
నూర్వశిసౌభాగ్యగర్వంబు వొరిపోయె
        హరిణి సంతాపాగ్ని కరణి యయ్యె
నంతఁ బానుపుమీఁద వైచె మేను ఘృతాచి
        మేనకసమ్మాన మూన మయ్యె


తే.

నచ్చరలు దక్కుఁగలవార లలసి సొలసి
ప్రాణముక్తియ యుక్తిగా ననుమతించి
రాత్మవల్లభుఁ డింద్రుండ యవనినాథ
తనయ వరియింప ధరకుఁ బోదలఁచు టెఱిఁగి.

36


వ.

ఇట్లు జంభారి విశ్వంభరాభువనంబునకుం బోవ సమకట్టి కట్టాయితం బయ్యె నతనితోడం గూడం బావకపరేతరాజపాశపాణులు పైనంబు లైరి. యప్పుడప్పురందరాది బృందారకచతుష్టయంబు మున్నాప్రోడలగు వేల్పుఁజేడియలచేత దమయంతికిం గానుకలుగా నిగూఢప్రకారంబున మందారకుసుమదామంబులు మొదలుగా దేవలోకంబునం గలవస్తువులు పంపిరి, యనంతరంబ.

37


శా.

ఆదిక్పాలురు దివ్యకాంచనవిమానారూఢులై సమ్మదా
పాదివ్యోమతరంగిణీలహరీకాపర్యంతవాతంబు ప్ర
స్వేదాంభఃపృషతంబులం గముపఁగా శీఘ్రంబ యేతెంచి రా
హ్లాదం బొప్ప వసుంధరాస్థలి కమర్త్యవ్రాతములో గొల్వఁగన్.

38

వ.

ఇట్లు గగనంబు డిగ్గి యమరులు సజలజలధరధ్వానగంభీరంబై దూరంబుననుండి వీతెంచునొక్కమ్రోఁత యాలకించి యిది యేమి ఘోషంబొకో యని యద్దిక్కుఁ గనుంగొనునప్పుడు నిస్వనశ్రుతిసహోపయాతం బైనరథంబునందు.

39


ఇంద్రాదులు నలుం గాంచుట

ఉ.

కాంచిరి నిర్జరేశ్వరు లఖండితరూపవిలాససంపదన్
వంచితపంచబాణుఁ డగువాని సమంచిత సారథీరతం
గాంచనభూధరంబునకు గాదిలి నెచ్చెలి యైనవాని ని
ర్వంచితదానశక్తి సురరత్నముఁ బోలెడువాని నైషధున్.

40


వ.

కాంచి వరుణం డతనితరుణత్వంబునకు నిబిడం బగుజడభూయంబును లులాయధ్వజుం డతనిరూపధేయంబునకుం ధూమలత్వంబును వైశ్వానరుం డతనియైశ్వర్యంబునకుం బరితాపంబును సుత్రాముం డతనికామనీయంబునకుం జూపోపమియును నిక్కంబుగా వహించి.

41


మ.

శ్రుతపూర్వం బగువిశ్వమోహనకళాశోభావిశేషంబు సం
మతి నూహింపఁగఁ జాయవాఱుటయుఁ బ్రేమం బాత్మలో గీలుకో
నితఁడే నైషధుఁ డంచు నొండొరులతో నేకాంత మొయ్యొయ్య నా
శతమన్యుప్రముఖామరుల్ మునుకుచున్ జర్చించి రుత్కంఠతోన్.

42


వ.

ఇట్లు విమర్శించుచుండ.

43


తే.

విమలతరదివ్యగగనయానములమీఁద
ధరణిఁ గొలువున్న యాదిగీశ్వరులఁ జూచి
యద్భుతాక్రాంతచిత్తుఁ డై యధిపసుతుఁడు
చేరఁ జనుదెంచె నంతంతఁ దేరు డిగ్గి.

44

వ.

ఇవ్విధంబున రథంబు డిగ్గి మూర్తం బైనరామణీయకగుణాద్వయవాదంబునుం బోనియమ్మేదినీరమణుండు సుత్రామాదివిబుధరాజచయంబునకు నభివాదనం బాచరించి ప్రాంజలియై పార్శ్వంబున నిలిచి యుండె, నయ్యమృతాశు లతనిం జూచి దమయంతీనిరాశంబు లైనయాశయంబులతోఁ బరస్పరముఖావలోకనంబులు చేసి, రప్పుడు వంచనాకపటనాటకసూత్రధారుం డైనశునాసీరుం డానృపకుమారున కిట్లనియె.

45


ఇంద్రాదులు దమయంతికడకు నలుని దూతఁగా బంపుట

సీ.

అన్న! యెవ్వరివాఁడవయ్య! సేమమే నీకు?
        నైషధుం డనుబుద్ధి నాకుఁ బొడమె
గారాపుఁజెలికాఁడు వీరసేనుఁడు మాకు
        నాతనిరేఖ నీయందుఁ దోచె
నేమికార్యముఁ గోరి యెటు పోవుచున్నాఁడ?
        వెపుడు నీచారిత్ర మేము విందు
మెఱుఁగుదో నీవు మ మ్మిందఱ లెస్సగా?
        నెఱుఁగకుండిన నేమి? యెఱిఁగికొనుము


తే.

దండపాణి యితం డనలుం డతండు
వరుణుఁ డితఁ డేను నిర్జరవల్లభుండ,
బిండితార్థంబు విను మేల పెక్కుమాట?
లర్థులై వచ్చితిమి మము నాదరింపు.

46


వ.

ముహూర్తమాత్రంబున మార్గఖేదం బపనయించి కార్యనివేదనం బొనర్చెద మని పలికి యభిధాకుశలుం డైనయవ్విబుధనాయకుం డూరకుండిన.

47

తే.

అర్థి యనుపేరు చెవిసోకినంతమాత్ర
జాదుకోఁ బులకించె నజ్జనవిభుండు
ప్రావృషేణ్యపయోధరప్రభవ మైన
గాలి ననిచిననీపవృక్షంబువోలె.

48


వ.

ఇట్లు సంతసిల్లి భూవల్లభుం డంతర్గతంబున.

49


క.

త్రిదశులకును దుర్లభమై
మదధీనం బయిన యట్టిమంచిపదార్థం
బది యెట్టిదొక్కొ! వేగమ
యొదవునొకో యడిగినపుడ యుచితంబునకున్.

50


తే.

అడిగినప్పుడ యిత్తు నేఁ బ్రాణమైన
నర్థిమాత్రంబువకు వేడ్క యతిశయిల్ల
నట్టియే నింద్రునంతవాఁ డాసపడిన
నకట! యేమిచ్చి పరితోష మందువాఁడ!

51


క.

ప్రాణంబుకంటె భీమ
క్షోణీపతనూజమీఁదఁ గూర్మి గలదు గీ
ర్వాణాదీశ్వరుఁ డయ్యలి
వేణిన్ మదిఁ గోరె నేని వేగమ యిత్తున్.

52


తే.

ఎద్దియొకొ వీరియభిలాష మెఱుఁగుభంగి?
నడుగకయ మున్న యీవి భాగ్యంబుగాదె?
వైంఛ నెఱిఁగియు నర్థార్థివచనదైన్య
మాత్మ సహియింపఁజాలువాఁ డధమదాత.

53


చ.

[1]కటికతనంబు మాన్చి చటుకాకువిడంబముఁ గూర్చిలజ్జ సం
కటపడఁజేసి యర్థిఁ గడుఁ గాఱియ పెట్టినపాతకంబు న

క్కట తలఁగంగఁ జాలునొకొ కాలవిలంబము నాచరించి పి
మ్మటఁ దదభీప్సితార్థము సమర్పణ సేయు ప్రదాత యెమ్మెయిన్?

54


చ.

కమలము పంకసంకరవిగర్హితమర్మము గాదు నిల్వఁగాఁ
గమలకు నంచు నెంతయును గౌతుక మింపెసలాన నర్థిదోః
కమలము నిర్మలంబు నలిగాఢవివేకులు తద్విహారస
ద్మముగ నొనర్తు రప్రతిమదానకళాకలనాధురీణతన్.

55


ఉ.

దానకళాకలాపసముదంచితసారవివేకసంపదన్
మానితయాచమానజనమానసవృత్త్యభిపూర్తిబుద్ధి యె
వ్వానికి లే దొకింతయును వాఁ డొకరుండు భరంబు ధాత్రికిం
గానలు గావు శైలములు గావు పయోధులు గావు భారముల్.

56


తే.

[2]తలఁప నధమర్ణుఁ డొకఁడు ప్రదానపాత్ర
మిచట నొక్కటి గొని మీఁద నిచ్చు గోటి,
సుకృతసంపదఁ బారలౌకికకుసీద
మాసపడువారి కిదియ బేహార మరయ.

57


వ.

అని ముహూర్తమాత్రంబు చింతించి యానిషధరాజు ప్రసన్నముఖుండై యాబర్హిర్ముఖుల కిట్లనియె.

58


తే.

జన్యజనకంబులకు భేదశంక లేదు
దేహ మన్నజ మిందు సందేహ మెద్ది?
మీర లమృతాశు లమృతంబు మిమ్ముఁ జూడఁ
దృప్తిసంపదనొందె మద్వీక్షణములు.

59


తే.

ఏను చేసినపుణ్యంబు లెట్టివొక్కొ?
ఫలిత మయ్యెను మత్పూర్వపరమతపము

లింతకల్యాణకర మౌనె యీదినంబు!
కౌతుకం బార దర్శింప గంటి మిమ్ము.

60


చ.

నలువు దలిర్ప సర్వసహనవ్రతజన్మము లైనకర్మముల్
ఫలితము లయ్యెఁ గావలయు భాగ్యము పెంపున భూతధాత్రికిన్
లలితము లైనపాదకమలంబుల నర్చన మాచరింపగాఁ
దలఁతురె వేల్పులార! ప్రమదంబున మీ రటు గాక తక్కినన్?

61


వ.

నాయందు మీ రపేక్షించిన ప్రయోజనం బానతిండు, ప్రాణంబైనను ప్రాణాధికంబైనను నవి యెట్టిపదార్థంబైన నిచ్చెద నని నిర్విశంకంబుగాఁ బలికినయుర్వీశ్వరునకు గీర్వాణవల్లభుం డిట్లనియె.

62


ఉ.

ఓమిహికాంశువంశకలశోదధికౌస్తుభరత్న! భూపతి
గ్రామణి యస్మదీయ మగుకాంక్షితమున్ విను భీమపుత్రిపైఁ
గామన సేసి వచ్చితిమి గమ్ము సహాయము మాకు నిక్కపుం
ప్రేమయు భక్తియుం గృపయుఁ బెంపుగఁ జేయుము దూతకృత్యమున్.

63


వ.

భూమండలంబున రాజనందను లెందఱు లేరు? వారివలనం బ్రయోజనం బేమి? దక్కినగ్రహంబులు గ్రహరాజుం బోలనేర్చునే! యగాధగుణాంభోధి వగునీవు సహాయంబుగా మాకు సాధింపరానికార్యంబుం గలదే! యని పలికిన.

64


తే.

బలనిషూదను కపటంపుభాషణములు
విని నృపాలుండు పలికెఁ దద్విధమ కాఁగఁ
గుటిలబుద్ధుల గెలువంగఁ గుటిలమతియ
యర్హమగుఁగాని నీతి గా దార్జవంబు.

65

వ.

అఖిలభూతాంతర్వర్తనంబుల నెఱంగెడుమీకు నెఱుంగంబడనియర్థంబునుం గలదె! యట్టిమీ రివ్విధంబు నానతిచ్చిన నేమి యనంగలదు? ఏ నయ్యంగనం గోరి వరియింపం బోవుచున్నాఁడ, నమ్మచ్చకంటికిం గుంటెనతనం బెట్లు సేయ నేర్తు? విరహవేదనాదోదూయమానమానసుండ నైనయేను మీరహస్యం బెట్లు రక్షింపనోపుదు? మనోరథపరంపరాసుధారసంబునఁ బరవశుండనైనననాకు భావగోపనం బెట్లు సిద్ధించు? వివిధరక్షాధికృతపాలితంబు లైనరాజశుద్ధాంతభవనకక్ష్యాంతరంబు లేప్రకారంబునం బ్రవేశింతుఁ? బెద్దకాలంబుననుండియు నాయందు వినుకలి దద్ధయుం గలిగియున్న యమ్ముద్దియతో మీప్రసంగం బెబ్భంగిఁ జేయుదుఁ? గావున హాస్యకారణంబగునిక్కార్యంబునకు నన్ను భారకుం జేయకుం డని పలికిన.

66


క.

మేలపుమైవడి నగవున
వేలుపులం దోడివారి నీక్షించి మహీ
పాలునితో నిట్లనియెను
బౌలోమీవల్లభుండు ప్రస్ఫుటఫణితిన్.

67


సీ.

ఈమాట లాడకు మిందువంశవతంస!
        యాడి తప్పఁగవచ్చు నయ్య నీకు?
క్షణభంగురం బైనసంసారమునకుఁ గా
        ధర్మంబుఁ గీర్తియుఁ దగునె విడువ?
నన్వయంబున కాది యగుచందురుఁడువోలె
        నకట కళంకి వేలయ్యె దీవు?

చిరకాలమున నుపార్జింపఁబడ్డప్రసిద్ధి
        నేగిఁ బొందఁగ నుపేక్షింపవలదు


తే.

పరుస నైనచింతామణిఁ బసర మైన
కామధేనువు మ్రానైనకల్పకంబు
నడిగి వైఫల్యమును బొంద రర్థిజనులు
మిన్నకయ పోదుమే యేము మిమ్ము నడిగి?

68


చ.

అసదృశదానవైభవమహాగుణధన్యుని నిన్ను దేవతా
విసరము యాచకత్వమున వేఁడఁగ వచ్చుట కారణంబుగాఁ
బ్రసవవికాసమాత్రమునఁ బాండురభావము నొందుఁగాక యా
కసము యశోవిహీన మగుఁ గల్పమహీరుహపంచకంబుచేన్.

69


ఉ.

'అక్షరముల్ పఠించుసమయంబునఁ బాఠము సేయఁ డయ్యెనో?
వీక్షితవర్ణమధ్యమున విస్మృతిఁ బొందెనొ’ యంచు నర్థు లు
త్ప్రేక్ష యొనర్తు రీక్రియ నభీష్టఫలప్రతిపాదనక్రియా
దక్షుని నిన్నుఁగూర్చినయధర్మవికారమున న్నకారమున్.

70


శా.

ఈయర్థంబు ఘటింపవన్న! సృప! నీ కెంతేనిమే లయ్యెడున్
మాయాశీర్వచనంబులుం ద్రిజగతీమధ్యంబున న్నీయశ
శ్ఛాయామండల మిందుకుందకుముదస్వచ్ఛంబు సంధించుసం
ధాయుక్తిన్ సితపీతరోహితహరిద్వర్ణోపసంహారమున్.

71


చ.

వసుమతి వేయుపాదములవానికిఁ బుట్టినచాయపట్టికిన్
విసవిసగాదు కాలొకటి నిత్యము తండ్రి సుతుండు వోలఁగాఁ
బొసఁగదె దీని కుత్తరము వో యిది నీ ప్రకటప్రతాపముం
గసమస దాఁటఁబోయి యతిఖంజత నొందె సహస్రపాదుఁడున్.

72


వ.

అని యప్పుడు.

73

తే.

అధిప! మా కిది పురుషార్థ మనియె వహ్ని
ప్రార్థనము చేకొను మటంచుఁ బలికె జముఁడు
రాజ! యన్యోపకారసంప్రభవ మైన
యశముఁ గైకొనవయ్య నీ వనియెఁ బాశి.

74


నలుండు రాయబారియై దమయంతికడ కేఁగుట

వ.

ఇత్తెఱంగునం జాటుగర్భంబు లైనవేల్పులవాక్యసందర్భంబు లాకర్ణించి వైదర్భీకాముకుం డయ్యును నయ్యాదిగర్భేశ్వరుండు తద్దూత్యభారంబు భరించె. రాజపుంగవునంగీకారం బెఱింగి దేవత లతని కంతఃపురప్రవేశంబున కుచితంబుగాఁ దిరస్కరిణీవిద్య యుపదేశించి పొమ్ము కార్యసిద్ధి యయ్యెడునని వీడుకొల్పిన.

75


ఉ.

ఆపరమోపకారనిధి యప్పుడు వేల్పులరాయబార మ
న్మోపు వహించి యాదివిజముఖ్యుల వీడ్కొని చిత్తవృత్తికిన్
జూపునకున్ శతాంగరయశుద్ధికి లక్ష్యముఁ జేసె భూతధా
త్రీపతి రాజధాని జగతీరమణీమణిహారవల్లరిన్.

76


తే.

విరహభారంబుతోన యుర్వీధవుండు
ప్రబల మగుదేవకార్యభారము భరించె
నౌర్వశిఖితోన జలరాశియంబుపూర
మౌర్వశేయుండు భరియింపఁ డయ్యె నెట్లు?

77


మ.*

బలభిద్వహ్నిపరేతరాజవరుణుల్ పర్యుత్సుకత్వంబు సం
ధిలఁ గూర్చుండిరి యొండొరుం గదిసి యర్థిం దత్ప్రదేశంబున
న్నలనాళీకమృణాళనాళలతికానవ్యప్రణాళీమిళ
ల్లలనాలాపకథాసుధాసుభవలీలాలోలచేతస్కులై.

78

తే.

అమ్మహారథురథము డాయంగ నరిగె
సత్వరమున విదర్భరాజన్యువీడు
సారమగు భాగ్యవంతుమనోరథంబు
కార్యసంసిద్ధివోలె నస్ఖలితలీల.

79


మ.

దమయంతీసుకుమారపాదకమలద్వంద్వార్పణాధన్యకు
ట్టిమహర్మ్యం బగుపట్టణం బపుడు గంటిన్ మంటి నం చెంతయుం
బ్రమదం బందె దిగీశకార్యఘటనాభారంబు చింతించి దీ
ర్ఘము నుష్ణంబునుగా నొనర్చె ధరణీకాంతుండు నిశ్వాసమున్.

80


వ.

ఇట్లు కుండీననగరంబు చేరం జనుదెంచి యప్పురుషప్రకాండుండు వలయునమాత్యులం దగినవారల నొక్కరమ్యప్రదేశంబున సైన్యంబు విడియ నియమించి బృందారకసందేశకార్యంబు నిర్వర్తింపం దలంచి ససారథికంబగురథంబు నచ్చోట నిలిపి యొక్కరుండునుఁ బాదచారంబున నప్పురంబు ప్రవేశించె నప్పుడు.

81


శా.

చూడంజూడఁగ దేవతావరమునం జోద్యంబుగా భూమిభృ
చ్చూడారత్న మదృశ్యుఁ డయ్యె నతఁ డచ్చో నద్భుతం బంద న
వ్వాడం బౌరజనంబు లెల్ల నితఁ డెవ్వాఁడొక్కొ? నేత్రోత్సవం
బై డాయం జనుదెంచె నంతటను మాయంబయ్యె నం చెంతయున్.

82


వ.

ఇ ట్లంతర్హితుండై రాజమార్గంబున నిరర్గళవేగంబునం జని యా రాజకుంజరుండు మదకుంజరఘటాసుందరం బగు రాజమందిరంబు డాసి.

83


సీ.

వంచనమై డాగి వర్తించు టిది యేమి
        ప్రాభవం బని సిగ్గుపాటు నొందు

నాయుధహస్తులై యాయితం బై యున్న
        రక్షివర్గములతీవ్రతకు నవ్వు
నది యెవ్వ రని ప్రతీహారు లెవ్వరి నన్న
        దన్నుఁగాఁ దలఁచి చిత్తమున నొదుగు
నెదురుఁగాఁ జనుదెంచునిందీవరాక్షుల
        కొయ్యనఁ దెరువిచ్చి యోసరిల్లుఁ


తే.

దలఁచి తలఁచి యళీకవైదర్భిఁ గాంచుఁ
గాంచి వేల్పులప్రియవాచికంబు నొడువు
నొడివి తనమాట కచ్చెరుపడుజనంబు
క్రందుసందడిఁ దెలివొందు రాజసుతుఁడు.

84


వ.

ఇవ్విధంబున నేనుంగు మొగసాల గడచి కక్ష్యాంతరంబులు ప్రవేశించి యంతఃపురంబు సొత్తెంచె నప్పుడు.

85


చ.

ప్రిదిలీననీవిఁ గేల సవరించుతలోదరి నోర్తుఁ గాంచి లోఁ
గదిరిన పాపభీతిఁ బడి గన్నులు మోడ్ప నొకళ్లొ కళ్లకై
యెదురుగ వచ్చివచ్చి యొకయిద్దఱు ముద్దియ లొత్తి రవ్విభున్
మదగజరాజకుంభముల మచ్చరికించు కుచద్వయంబులన్.

86


వ.

మఱియు శుద్ధాంతభవనాంతరంబులం జరియించువాఁడు హృదయోత్కంఠాతిరేకంబున.

87


సీ.

సమనుభూతానాదిసర్గపరంపరా
        స్రకృమాకలితసంసర్గముననొ!
లలితకేళీచిత్రఫలకాభివిలిఖిత
        ప్రతిమావిలోకనాభ్యాసముననొ!
యాస్వాదనీయవిహంగపుంగవగవీ
        హైయంగవీనపానాభిరతినొ!

భువనైకమోహనాద్భుతశంబరారాతి
        శాంబరీలీలావిడంబముననొ!


తే.

వివిధసంకల్పకల్పనావేశముననొ!
కన్నెక్రొక్కాఱు మెఱుఁగుదీఁగెయునుబోలె
బొలిచి యప్పుడ యడఁగు పూఁబోణిమూర్తి
నక్కుమారుండు నలుదిక్కులందుఁ గాంచు.

88


ఉ.

సోరణగండ్లమార్గమునఁ జొచ్చినసన్ననిగాలి యొక్కయం
భోరుహపత్రనేత్ర నునుఁబొంకపుఁజన్నులమీఁదిసన్నపుం
జీరచెఱంగు వాయగిలఁ విశ్వధరాతలేశ్వరుం
డోర యొనర్చెఁ బాపభయ మొంది నిజాననచంద్రబింబమున్.

89


తే.*

ఇరులు గెలిచినయంతఃపురేందుముఖుల
కురులు మరుఁ డనువేఁటకాఁ డురులు సేసి
మరులు గొలుపంగ లేఁడయ్యె మనుజవిభుని
సరులు లేనిదృక్ఖంజనశాబకముల.

90


ఉ.

కష్టపుఁబ్రత్యవాయ మిదిగల్గుచు నున్నది మీలనక్రియా
స్పష్టవిలోకనంబుల, నపాంగపుఁజూ పనురాగవిక్రియా
పుష్టికరం, బబాహ్యగృహభూమిఁ బ్రచారముసేయుచోట నా
దృష్టికి మార్గ మొండుగలదే? యని చింత వహించె రా జెదన్.

91


తే.

రాజశుద్ధాంతభామినీరత్నరాజి
దీము గావించి వలరా జధీశు నేసె
నతనితాల్మికి నది పూజ యయ్యె నట్ల
యతనితూపులు పుష్పంబులౌనొ కావొ?

92


ఉ.

చీటికీమాటి కేకపథసీమ మెలంగఁగఁ బాటి గామి శృం
గాటకవీథి కేఁగెఁ బతికాంతలసందడికల్కి యైన న

ప్పాట వసించి యుండుట యుపాయమె చూడగ నాల్గుత్రోవలం
బాటలగంధు లొక్కతఱిం బైకొనివచ్చినఁ జిక్కుఁ జిక్కఁడో?

93


చ.

ఉరవడి నేఁగుచోట నొకయుగ్మలి యొల్లెచెఱంగు మేదినీ
శ్వరునిభుజావిభూషణము వజ్రములం దవులంగఁ బాఱినన్
విరిసెను నీవిబంధ మదివిస్మయ మందఁగఁ దోడి భామినుల్
పరిహసనం బొనర్పఁ బతి పాపభయంబున గంప మొందఁగన్.

94


చ.

ఇరువురు నీలనీరజనిభేక్షణ లించినవేడ్కతోఁ బర
స్పర మెదిరించి కాంచనపుబంతులఁ దచ్చనవాటు లాడఁగా
ధరిణిపుఁ డడ్డమై చనుడుఁ దద్భుజదండముఁ దాకి మిట్టి బి
ట్టురవడిఁ జెంది గ్రమ్మఱిన నుబ్బురపోయిరి భామినీజనుల్.

95


సీ.

చెలువారు క్రొమ్మించునిలువుటద్దములలోఁ
        బ్రతిబింబములు గానఁబడుటకతన
సికతామయం బైనసీమాంతరంబునఁ
        బాదపద్మంబు లేర్పడినకతన
నలవోకయునుఁబోలె నాకస్మికం బైన
        యంగాంగసంస్పర్శ మైనకతన
దిక్పాలు రొసఁగినదివ్యపుష్పంబుల
        బహులంబు లగుసౌరభములకతన


తే.

విరహవిభ్రాంతి నొక్కొక్కవేళలందుఁ
గళవళపువింతభాషలకతన నప్పు
డెవ్వఁడో యొక్కమాయావి యేఁగుదెంచె
నంతిపురమున కని లోఁగి రబ్జముఖులు.

96

వ.

ఇవ్విధంబునం బరస్త్రీపరాఙ్ముఖుండును జగన్మోహనాకారుండును నగు నారాజకుమారుండు శుద్ధాంతకాంతామధ్యంబున నిర్వికారుండై చరించుచు నుపకారికాభవనంబులం గడచి యెడనెడం జంద్రకాంతవేదికావిటంకంబుల విశ్రమించుచుఁ బ్రబోధమోహశబలితం బగుచిత్తంబుతో విరహవేదనాభరంబునం దూఁగాడుచుం బాదచారంబున నతిదూరం బరిగి యభ్రంకషంబును బ్రతోళీరత్నవేదికామధ్యాసీనసిద్ధగంధర్వాంగనాప్రవర్తితసంగీతకంబును దారహారగుంభనవ్యాపారపారంగతశంభళీనికాయంబును బంచశరలేఖలేఖనవియాతదూతికానీతకేతకీగర్భపలాశంబును కమలకల్హారబిసకిసలయప్రధాననానాశిశిరోపచారద్రవ్యసమానసత్వరసంచారికాజనాసారసంకులంబును నగు దమయంతిప్రాసాదంబు డాయం జనియె నచ్చట.

97


ఉ.

లేమ యొకర్తు వేడుక నళీకనళీకరణంబు జాతిగా
బూమియ దాను బన్నుకొని పోకలఁ బోవుచు నుండఁగా మృషా
భీమభవీభవంతి యయి బింబఫలాధరియోర్తు పార్థివ
గ్రామణి చూడ దానిమెడ గ్రక్కున వైచె మధూకదామమున్.

98


తే.

వ్రాసె నొక్కలతాంగి క్రొవ్వాఁడిగోర
వర్ణములు దోడుతో మషీవర్ణములుగఁ
బసిఁడిగేదంగిఱేకునఁ బ్రస్ఫుటముగ
మదనలేఖంబు నర్మమర్మంబు మెఱయ.

99


తే.

చంద్రరజమున నొకపూర్ణచంద్రవదన
చంద్రమండలతిలకంబు సఖికిఁ దీర్చెఁ

జంద్రశాలాశిలాప్రదేశంబునందు
నావహిల్లంగ నపుడు చంద్రానవస్థ.

100


తే.

మహితలావణ్యవార్ధిలో మదనుఁ డెక్కు
కప్పురపుజోగుఁ గంటిమి కంటి మనుచు
నర్మగర్భంబుగా నొక్కనలినవదన
పొగడె సఖిచంటిమీఁదియొప్పులనఖంబు.

101


ఉ.

భావము పల్లవింప నొకపంకజలోచన వ్రాసె నొక్కల
జ్ఞావతి మించుగుబ్బవలిచన్నులపై మకరీకలాపమున్
వావిరిఁ గమ్మనీరు మృగనాభిరసంబున మేళవించి యే
కావళి నాకసింధువున కన్వయలీల ఘటించునట్లుగాన్.

102


క.

సారెయదె పొడువు మని యొక
సారె యొకతె యక్షకేళిసమయంబున ని
చ్ఛారతి నొకతెకుఁ జెప్పిన
సారె కనకపంజరమున సాధ్వస మందెన్.

103


ఉ.*

వీఁడె నలుండు విశ్వపృథివీవలయైకవిభుండు వచ్చుచు
న్నాఁ డని భీమభూమిపతినందన యూరడిలంగఁ బల్కు పూఁ
బోఁడులమాట నేర్చికొని ప్రోది శుకాంగనయట్ల పల్కినన్
ఱేఁడిది నన్ను నేక్రియ నెఱింగెనొకోయనియుండె నాత్మలోన్.

104


తే.

అంబుజానన కొల్వుకూటంబునందుఁ
గనకకలహంసశాబకాకార మైన
విడియపుంబెట్టెఁ జూచి యుర్వీధవుండు
దలఁచెఁ దనకూర్మిదూతఁ జిత్తంబులోన.

105


వ.

ఇట్లు కన్యాంతఃపురంబుఁ బ్రవేశించి దమయంతీ సభాభవనద్వారంబు సేరం జనుదెంచి యొక్క పసిండియరఁగుమీఁదఁ

గూర్చుండె, నప్పు డబ్బాలికారత్నంబు జననీప్రయత్నంబునం దత్సమీపంబున కరుగుటయును స్వయంవరకల్యాణమహోత్సవంబు సంపాదింపంబడుటయు శోభనారంభసంభ్రమంబులవలన నెఱింగినవాఁడు గావున నయ్యంభోరుహాక్షి సమాగమనం బపేక్షించుచుండె నప్పుడు.

106


తే.

అనుఁగుఁదల్లికి వందనం బాచరించి
వరుస నిలువేల్పులకు మ్రొక్కి వలను మిగుల
బ్రాహ్మణులచేత దీవెనల్ వడసి పుణ్య
భామ లిచ్చు హేమాక్షతప్రతతిఁ దాల్చి.

107


ఉ.

తల్లి మనఃప్రసాదసహితంబుగ నిచ్చినపుష్పదామమున్
బల్లవబాటలం బయిన పాణిసరోజమునన్ ధరించి యా
యల్లకతీవ్రసంజ్వరభరాలసకోమలగాత్రవల్లియై
యల్లన నేఁగుదెంచుకమలాననఁ జూచె విభుండు దవ్వులన్.

108


వ.

ఇట్లు వీక్షించి నిషధాధ్యక్షుండు సాక్షాత్కరించిన మదనసామ్రాజ్యలక్ష్మియుం బోని యాధవళాక్షిసమక్షంబు చేరంజనియె నప్పుడు.

109


ఉ.

ఎంతయు డాయ నేఁగియు మహీశుఁ డెఱుంగఁగ నేరఁడయ్యె వి
భ్రాంతివిదర్భరాడ్దుహితృపంక్తులలోన మృగాక్షి నప్పు డ
య్యింతి యెఱుంగదయ్యె దిగధీశచతుష్టయదత్తశాంబరీ
ధ్వాంతనిగూడుఁ డైనవసుధాధవునిన్ నికటస్థలంబునన్.

110


తే.

అతివ విభ్రాంతివీక్షితుం డైననృపతి
కంఠమున వైచెఁ జేతిచెంగలువదండ

యది నిజంబుగ నికటస్థుఁ డయినవిభుని
యఱుత సంలగ్న మయ్యె నత్యద్భుతముగ.

111


తే.

వాసనాదృష్ట యగు కాంత వైచినట్టి
బొందు నిజమయ్యె నన చోద్య మందె రాజు
తాను వైచినకల్హారదామకంబు
మాయ మగుటయుఁ దరుణి విస్మయము నొందె.

112


తే.

ఒక్కచో నుండియును బాసి యున్నభంగి
భ్రాంతి నన్యోన్య మీక్షించి పతియు సతియుఁ
జేరి మిథ్యాపరస్పరాశ్లేషకలన
సత్యపరిరంభఖేలనాసక్తు లైరి.

113


శా.

అంభోజానన భూమిపాలకునిచే నాశ్లిష్ట యయ్యు న్మదిన్
సంభావింప నతం డదృశ్యుఁ డగుటన్ సత్యోపగూహంబుగా
స్తంభావిష్కృతి వైరసేనియును వైదర్భిన్ గ్రహింపంగఁ బ్రా
రంభంబుం దగఁ జేయనించుకయు నేరండయ్యె నీక్షించియున్.

114


చ.

మొదల శరీరసంగమసముద్గతసత్య మతిప్రకాశతన్
బిదప నళీకసంవిదుపబృంహితబాధతఁ బొంది యిద్దఱుం
బదపడి యంతరంగములఁ బ్రత్యయ మొందర యించుకేనియున్
గదిసి యొకళ్ళొకళ్ళ నిఱికౌఁగిటఁ జేర్చియునుం బ్రముగ్ధతన్.

115


ఉ.

ఆరతిబోటికిన్ విభున కప్టు మనంబున విప్రలంభశృం
గార మొకళ్ళొకళ్ళ యిఱికౌఁగిటఁ బుట్టిననిండువేడ్కచే
[3]బోరన నారఁగూరి మదిఁ బొంగె ఘృతం బతిమాత్ర బోసినన్
గూరికి కూర్కి యాక్షణము గొబ్బునమండిన దీపమో యనన్.

116

వ.

ఇవ్విధంబున సంయోగవియోగంబులవలన బోధమోహంబులు వహించుచు నవ్వరారోహహృదయనిర్విశేషం బగుసఖీజనంబు మెత్తమెత్తనఁ దోడ్కొనిపోవ నిజసభాభవనంబునకు నెట్టకేలకుం జనియె. ధరాధీశ్వరుండుసు ధారావాహికజ్ఞానప్రవాహంబునఁ దేలియాడుచు నంత నంతఁ గాంతారత్నంబుఁ గదియ నేతెంచె, నట్లు కొలువుకూటంబుఁ జొచ్చి యబ్బోటి హాటకపీఠం బలంకరించి సఖీపరివారపరివృతయై యక్కన్య తారకాగణపరివృత యగుచంద్రరేఖయుంబోలెఁ బొలుపారె నాసమయంబున.

117


ఉ.

భావముఁ జూడఁగోరి యొకపార్శ్వమునన్ దమయంతిఁ జేరి ధా
త్రీపరుఁ డుండె శాంబరి ధరించియు భీమసుతావినోదసం
భావనకై సఖీజనులు పన్నినయాత్మమనోజ్ఞపుంస్త్వరూ
పావళిలో నిజాకృతి బయల్పడకుండఁగ రత్నవేదికన్.

118


దమయంతికడ కింద్రాదులదూతికలు వచ్చుట

వ.

ఇవ్విధంబున నబ్బాల పేరోలగం బున్నసమయంబునఁ బ్రతీహారిణి యేతెంచి యింద్రాగ్నియమవరుణులు పుత్తెంచినదూతికలు మందిరద్వారంబున నున్నవా రని విన్నపంబు చేసి తదానుమతి వడసి ప్రవేశింపఁజేయుటయు, నాసందేశహారిణులు మందమందగమనంబున నా త్రైలోక్యసుందరిం జేరం జనుదెంచి సముచితసత్కారంబులు వడసి సఖీనిర్దిష్టంబు లగుమణిమయాసనంబులం గూర్చుండి, రాసంచారికాచతుష్టయంబునందు విస్పష్టమధురాలాపయు నర్మోక్తినిపుణయు నింగితాకారచేష్టావివేకవిశారదయునుం బుంవత్ప్రగల్భయు

నగుజంభారిగారాపుశంభళి హస్తాంభోరుహంబులు మోడ్చి యిట్లనియె.

119


సీ.

అవధారు దేవి ! దివ్యకిరీటకోటిసం
        దానితవికచమందారదామ
సందోహమకరందబిందుధారాధౌత
        సందీప్తచరణారవిందుఁ డైన
సంక్రందనుండు నాస్వామి న న్నాయింద్రు
        గారాబుసంచారిఁగా నెఱుంగు
పాలిండ్ల కొత్తుగాఁ బరిరంభణము సేసి
        యడిగె నీ సేమ మయ్యమరవిభుఁడు


తే.

పారిజాతకమాల్యం బుపాయనమున
నముచిచమనుండు పుత్తెంచినాఁడు నీకు
గైకొనుము దీని నని యిచ్చె నాకవనిత
పూర్ణచంద్రనిభాస్య కప్పూవుదండ.

120


వ.

ఇట్లు కనకకదళీపలాశగర్భగతం బై నిర్భరామోదమధురం బగుదివ్యదామం బయ్యాదిగర్భేశ్వరికి సమర్పించి యిట్లనియె.

121


ఉ.

చంచలనేత్ర! దివ్యలిపిసంతతి భూజనముల్ పఠింపలే
రంచును మానెఁగాని నఖరాగ్రముననన్ లిఖియించి నీకుఁ బు
త్తెంచుఁ జుమీ మహేంద్రుఁడు మదీయకరంబున దేవతావనీ
కాంచనకేతకీకుసుమగర్భదళంబునఁ గార్యపద్ధతుల్.

122


తే.

తెఱవ యిన్నాళ్లు నడుగఁ బుత్తేఁడు నిన్ను
నరయ నిది తప్పుగాదె? సంవరణవేళఁ
గట్టు మమరేంద్రుకంఠంబుఁ గప్పురంపు
పలుకు లెడఁబెట్టి కట్టినయలరుదండ.

123

చ.

భువనములందు నెల్లఁనగడుపూజ్యము నాకముననాకభూమిలో
దివిజులు ప్రాభవాధికులు దివ్యకదంబములోఁ బులోమజా
ధవుఁడు వరేణ్యుఁ డానముచిదర్పహరుండు దృఢానురాగుఁడై
యువిద! నిను న్వరింప మది నువ్విళులూరెడు నెట్టిధన్యవో!

124


శా.

ఏలోకంబునకై మహాక్రతుశతం బేకాగ్రతం జేసి నాఁ
డాలోకంబు నలంకరించుటకు ని న్నర్థించె జంభారి నీ
వాలేఖర్షభు నాజ్ఞ సేయఁదగదే యబ్జాక్షి! మైకోలుమై?
నాలస్యంబునఁ బోలె నైన నొకమా ఱల్లార్పు భ్రూవల్లరిన్.

125


సీ.*

నందనోద్యానమందారకచ్ఛాయల
        విశ్రమింపగ నీకు వేడ్క గాదె?
మందాకినీపాండుమహితసైకతములఁ
        గ్రీడ సల్పఁగ, నీకుఁ బ్రియము గాదె?
దుగ్దాబ్ధికన్యక తోడికోడలు గాఁగ
        నొరిమమై నుంట నీ కొప్పు గాదె?
మధుకైటభారాతిమఱఁది రమ్మని పిల్చి
        పనిగొంట నీకుఁ బ్రాభవము గాదె?


తే.

మూఁడుసంధ్యల నీచేత మ్రొక్కు గొందు
రెవ్వ రిటు తొల్లి యా వేల్పులెల్ల నీకు
నర్థి మ్రొక్కంగ నునికి భాగ్యంబు గాదె?
యేలసందేహ? మమరేంద్రు నేలికొనుము.

126


ఉ.

అద్దివిజాధినాయకునియానతి సేయుము చిత్తవృత్తి నొం
డెద్దియునుం దలంపకు మహీనపరాక్రమనీతిశాలి నీ

ముద్దుమఱందికుఱ్ఱ హరి మోసలఁగార్యభరంబు దీర్పఁగా
గద్దియమీఁదనుండి త్రిజగంబులు నేలికొనంగ నొల్లదే?

127


వ.

అనిన విని యక్కన్నియ మిన్నకుండె, నపు డాపేరోలగంబున నున్నబోటికత్తియ ‘లిది యుత్తమకార్యం’ బనువారును ‘నీప్రయోజనంబునకు విచారింపంబని లే’ దనువారును ‘దీనికిం దగినయుత్తరం బంగీకారంబ’ యనువారును నై తమలోన గుజగుజలం బోవుచుండిరి. అనంతరంబ మందస్మితసుందరవదనారవింద యగుభీమనందన హస్తారవిందంబులు మోడ్చి సంక్రందనుం దలంచి వందనం బాచరించి తత్సందేశహారిణిం గనుంగొని యిట్లనియె.

128


తే.

వేదములునాల్గు వేవేలవిధులఁ బొగడ
మనము వొగడెడువారమే యనిమిషేంద్రు?
వేఁడికొనియెదఁ జిగురాకుఁబోణి నిన్ను
హరిగుణస్తుతిసాహసిక్యంబు మాను.

129


సీ.

శ్రుతి నుతింపఁగ నీవు నుతియించెచే యింద్రు
        నతివ యీసాహసిక్యంబు మాను
సకలాత్మసాక్షికి శతమన్యునకు వేఱ
        చెప్పంగవలయునే చిత్తవృత్తి
హరియాజ్ఞ లక్షించి యక్షరోచ్చారపా
        రుష్యభారమున కోరుచునె జిహ్వ
సంక్రందనునిదివ్యసందేశవాక్యంబు
        ధరియింతు మౌళిఁ బూదండఁబోలె


తే.

రాజు నాఁగ నిజాంశసంప్రభవుఁ డైన
జిష్ణునకు నేను బరిచర్య సేయఁగలను

మున్నె నలునకు న న్నిచ్చుకొన్నదాన
నింక నొరునకు నెబ్భంగి నిత్తుఁ జెపుమ!

130


తే.

నలుని వరియింపఁగోరెడునాకు నిప్పు
డింద్రుపలుకు లయుక్తంబు లింపు గావు
కామసుఖములు నిర్వాణకామమతికిఁ
[4]గరము రచియింప కునికి యుక్తంబు గాదె?

131


మ.

ఇల వర్షంబులలోన భారతము భూయిష్ఠంబు నాల్గాశ్రమం
బులలోనన్ గృహమేధియాశ్రమమునుం బోలెం బయోజాక్షి యి
చ్చలఁ గావించెద భర్తృభక్తిగరిమన్ శర్మోర్మి కిమ్మీరని
ర్మలధర్మాగమమర్మనర్మసఖసమ్యక్కర్మకాండంబులన్.

132


ఉ.

శర్మమె కాని యివ్విబుధసద్మమునందుఁ దలంచి చూడఁగా
ధర్మము సేయలే దిచట ధర్మము సేయఁగ నిర్విశంకతన్
శర్మము నొందనుం గలదు శర్మము ధర్మముఁ గాంచుటొప్పునో
శర్మముఁ గాంచుటొప్పునొ? విచారము సేయుము నెమ్మనంబునన్.

133


క.

ఇందుండి యూర్ధ్వగతియును
నందుండి యధోగతియును నవసానమునన్
బొందును సజ్జనుఁ డిందును
నందును గలవాసి చూడుమా డెందమునన్.

134


ఉ.

ఆతత మైనకర్మగతి నాయువు వీడ్కోను నప్పు డాత్మలోఁ
గౌతుక మావహించునది గావున నాకసుఖం బపథ్య మా
పాతసుఖోన్ముఖుం డయినపంచజనుండు భజించు దానిఁ గా
మాతురితాతిరేకమున నార్యుల కింపవుఁ దత్ప్రకారముల్.

134

వ.

అని పలికి యింద్రదూతికావాక్యంబులకు మనసువెట్టినబోటికత్తియలతలం పెఱింగి వారివదనంబుల వీక్షించి యి ట్లనియె.

136


తే.

మీతలం పే నెఱుంగుదు మిన్నకుండుఁ
డంబుజాననలార! యాయాస ముడిగి
యే ననాదిసంచారిణి యైనయాత్మ
హేతుపంక్తికి విధికి నధీనబుద్ధి.

137


క.

నియతి యచేతన మఖిలము
నియతిపరాధీన మిట్టినిజ మెఱిఁగినచో
నియతివశు న్నియమించుట
నియతి గుఱిచి గర్హసేఁత నిష్ఫల మరయన్.

138


క.

లోకంబున నాకీటం
బాకైటభవైరి యెల్లయాత్మలకు నభీ
ష్టాకాంక్ష యొక్కచందమ
యీకీ లెఱుఁగంగవలదె హృదయములోనన్.

139


తే.

కొన్ని జీవులు చిదిపి ఱా ల్గొఱికి బ్రతుకుఁ
గొన్ని నునుసోగవెన్నెల గ్రోలి పొదలు
భిన్నరుచు లైనవారికిఁ బ్రీతి సరియ
తగవు గా దిందులోన నేకతరగర్హ.

140


తే.

అగ్రమార్గజాగ్రన్నిభృతాపదంధు
బంధుసంరక్షణము పాడి బాంధవులకు
నైనకార్యంబు గానికార్యమును దెలిసి
యాడుఁడా యేను మీమాట కడ్డమాడ.

141


వ.

అని సఖుల నెల్ల నివారించి పురుహూతదూతికం గనుంగొని మఱియు నిట్లనియె.

142

ఉ.

స్వర్పతిచిత్తవృత్తి గలుషత్వము నొందునొ యన్భయంబు నా
కేర్పడలేదు విన్ము దివిజేశ్వరదూతిక! సప్తతంతుజా
గార్పణ మాచరించి కర మాదరణంబున నేను రాజకం
దర్పుఁడు నైషధాధిపుఁడు దన్ను నుపాస్తి యొనర్పఁ జాలుటన్.

143


చ.

తనహృదయాధినాయకునిఁ దక్కగఁ దక్కొరు సన్నుతింపగా
వినుట సతీవ్రతంబునకు విగ్రహ, మిట్టిది ధర్మశాస్త్రవా
సన యటు గాన నోదివిజశంభళి! యింకిటఁ బట్టి నీకు మీ
యనిమిషరాజుపాదములయానసుమీ మఱి యేమి వల్కినన్.

144


వ.

అని తెగనాడి యచ్చేడియ సముచితప్రకారంబున బిడౌజసుని దూతికను వీఁడుకొల్పె నగ్నియమవరుణులసంచారికలునుఁ దమతమకు నదియ యుత్తరంబుగాఁ గైకొని యయ్యుత్తమాంగనం దగినతెఱంగున నామంత్రణంబు చేసి చనిరి, యంతర్హితుం డైనధరణీకాంతుం డావృత్తాంతం బంతయు నెఱింగి సంతోషభరితాంతఃకరణుం డై యక్కాంతారత్నంబునుం గనుంగొనియె నప్పుడు.

145


నలుఁడు దమయంతీసౌందర్యమును వర్ణించుట

తే.

ముదిత క్రొమ్మేనికాంతిలో మునిఁగె మొదల
నంత నానందరసవార్ధియందుఁ దేలెఁ
బిదప సమ్మోదబాష్పాంబుబిందుధార
యందు నవగాహనము చేసె నధిపుదృష్టి.

146


తే.

మానవతిమూర్తి యాపాదమస్తకముగఁ
దిపుట వీక్షించి నిషధపృథ్వీకళత్రుఁ
డపుడు బ్రహ్మాద్వయప్రమోదాతిశాయి
మన్మథాద్వైతసుఖవార్ధిమగ్నుఁ డయ్యె.

147

చ.

సుదతిముఖేందుమండలము సొంపున రాగరసాంబురాశి య
భ్యుదయముఁ బొంది యెంతయును నుబ్బున వేల నతిక్రమించుచున్
మదిఁ గడుభీతిఁ బొందినక్రమంబున భూవరుదృష్టి సేరె న
మ్మదగజరాజయానకుచమండలతుంగమహీధ్రశృంగమున్.

148


చ.

మగువముఖేందువం దమృతమధ్యమునన్ మునుగంగఁ బాటియో
మగువకుచద్వయంబునడుమం బడి రాయిడి దందపిల్లియో
మగువగభీరనాభిబిలమార్గముఁ దూఱి పరిభ్రమించియో
సొగపున రాజనందనుని చూపులు నిల్చుఁ దదంతరంబులన్.

149


ఉ.

కాంత మెఱుంగుఁజన్నులకుఁ గ్రమఱిక్రమ్మఱి వచ్చుచుండె నం
గాంతరసన్నివేశములకై యటు లేఁగియు నేఁగ లేక భూ
కాంతునిదృష్టి దిష్క్రమము గైకొనఁబోలు బలే! తదీయప
ర్యంతమునం దలందినకురంగమదంబను చిమ్మచీఁకటిన్.

150


క.

రమణీనితంబచక్ర
భ్రమణంబున జిఱ్ఱఁదిరిగి పడఁబాఱియొ భూ
రమణునిచూపు పరిష్వం
గ మొనర్చెఁ దదూరుకదళికాస్తంభములన్.

151


ఉ.

నేత్రమ నేను జీరయును నేత్రమ చీరకు నాశ్రయింపఁగాఁ
బాత్రత గల్లె నాకు నిటఁ బాత్రత లేదని నామసామ్యవై
చిత్రికతంబునన్ బలిమిఁ జేకొనినట్టులు రాజదృష్టి యా
క్షత్రియకన్యచారుకటిచక్రము నూరుయుగంబు దూకొనెన్.

152


వ.

ఇత్తెఱంగున సఖీపరివారపరివృత యగునక్కాంతం గనుంగొని యంతర్గతంబున.

153

క.

వితతాప్రతిమాకారా
ద్భుతరూపవిలాసవిభవభూషిత యగునీ
రతిబోఁటి తేటపఱచున్
జతురాననహస్తశిల్పచాతుర్యంబున్.

154


తే.

యౌవనాంభోధరోద్భూతహావభావ
వారిధారాభిపూ్రణశృంగారసరసి
యజ్ఞభవసృష్టివిద్యారహస్యభూమి
నిఖిలలావణ్యసీమ యీనీరజాక్షి.

155


తే.

సాటి జంబేటి జంబాలజాలమునకుఁ
బాటి నూత్నహరిద్రావిభంగమునకు
దరము సౌదామినీదామధామమునకుఁ
గరముఁ బొలుపొందు దీనియంగములకాంతి.

156


ఉ.

చంచలనేత్ర మేనినునుఁజాయకు సాటి యొనర్పగాఁ దగుం
గాంచనకేతకీకుసుమగర్భదళంబులు ధూళి బ్రుంగవే
సంచితభీతి నీసరసిజాక్షి తనుద్యుతి కోడి గాదె నే
వించెను వారిదుర్గ మరవిందవరాటకచక్రవాళముల్.

157


తే.

ఇంద్రుఁ డింతికి రక్షగా నిడఁగఁబోలు
నాభరణవజ్రమూర్తి వజ్రాయుధంబు
నతఁడ యంతటఁ బోక బాణాసనంబు
నిఖిలమణిదీప్తి యనుపేర నిలుపఁబోలు.

158


తే.

నెమలిపింఛంబుతోడ నీరమణివేణి
చెలిమి సేయుటఁ బగ గొంటఁ దెలియ నరిది
యందుఁ బువ్వులఁ బూజించినట్టి తెఱఁగు
నర్ధచంద్రప్రహారచిహ్నములకలిమి.

159

తే.

అలకతిమిరాభిదృశ్యఫాలార్ధచంద్ర
మెలఁత యిది కృష్ణపక్షాష్ట మీత్రియామ
దీని ప్రాపుననేల సాధింపకుండు
విషమబాణుండు త్రిజగతీవిజయసిద్ధి.

160


తే.

హరునికోపాగ్నిఁ బొగచూరి మరునిచాప
మసితకేసరపరివేష మైననాఁడు
హృదయమోహనశక్తి నీయందువదన
యంచితభ్రూలతారేఖ కైనయుపమ.

161


తే.

సాయకంబులు మూఁటి ముజ్జగము గెలువఁ
బాలు పెట్టి శేషించిన బాణయుగళి
మదనుఁ డేతద్దృగంభోజపదమునందు
గౌరవం బొప్పఁ బట్టంబు గట్టఁబోలు.

162


తే.

అతివ, ముష్టిప్రతిగ్రహార్హావలగ్న
సందియము లేదు వలరాజుచాపయష్టి
యట్ల గాకున్నఁ గురియంగ నెట్టు నేర్చెఁ
బ్రకృతిశాతకటాక్షనారాచవృష్టి?

163


క.

చలదింద్రనీలగోళా
మలకోమలతారతారమండలములు ప
క్ష్మలములు ప్రాంతశ్వేతం
బులు చపలము లౌర మెఱుఁగుఁబోఁడినయనముల్.

164


మ.

దళదిందీవరశాంతిఁ బంచషదళత్వక్పాటనానంతరో
జ్వలరంభాతరుగర్భసంపుట లసచ్ఛాయాకలాపంబుతోఁ
గలయంగూర్చి చతుర్ముఖుం డోనరిచెం గాఁబోలు నాకర్ణశ
ష్కులికాపాంగకమైన యీచిగురుటాకుంబోఁడి నేత్రద్వయిన్.

165

చ.

కలువలనుం జకోరములఁ గారుమెఱుంగుల గండుమీల వె
న్నెలలను దమ్మిరేకులను నిర్మలమౌక్తికరత్నశుక్తులం
దలఁచి పయోజగర్భుఁడు సుధారసధారలు రెంటిలో విసం
బులుఁ జిలికించి చేసెనొకొ పొల్పెసలారఁగ దీనినేత్రముల్!

166


తే.

శ్రవణపుటకూపవినిపాతసాధ్వసమున
నిగిడి యవ్వలి కటు పోక నిల్చెఁగాక
యధికచపలస్వభావంబు లైనయట్టి
దీనికన్నులు దలచుట్టుఁ దిరిగి రావె?

167


క.

కేదారములో శిశిర
ప్రాదుర్భావమునఁ జచ్చి పడసినయురుపు
ణ్యోదయమున నొకొ యీశా
తోదరికిం గన్ను లగుచు నున్నవి దమ్ముల్.

168


తే.

త్రిభువనవ్యస్తసాయకత్రితయుఁ డైన
మరునితిలపుష్పతూణ మీమగువముక్కు
మానితశ్వాసనవసౌరభానుమేయ
పుష్పమయబాణయుగళాభిపూర్ణ మగుట.

169


సీ.

నిబిడశైశవయౌవనీయసంధ్యావేళ
        యాననచంద్రబింబామృతంబు
లపనామృతాంశుబాలప్రభాజాలంబు
        బంధుజీవలతాంతబాంధవంబు
పరిపక్వబింబికాఫలవిడంబనముద్ర
        విద్రుమద్రుమలతావినియమంబు
మదననారాచకోమలహైంగుళచ్ఛాయ
        యస్మన్మనోనురాగాంకురంబు

తే.

మహితలావణ్యగుణజాయమానబహుళ
మాధురీచిత్రశోభాసమన్వితంబు
ప్రార్థనాకల్పపాదపప్రాజ్యఫలము
తియ్యపూఁదేనియలగ్రోవి దీనిమోవి.

170


ఉ.

భాసురమధ్యరేఖ కిరుపక్కియలందును మోవి కించిదు
చ్ఛ్వాసము నొందియున్న యది చంద్రనిభాస్యకు నే నొకప్డు ని
ద్రాసమయంబులం గలలరాకల నీకలకంఠిఁ గూడి వ
క్త్రాసవ మాని యాని దశనాంకుర మొత్తఁ గదా రసోద్ధతిన్.

171


ఉ.

[5]ఈ గజరాజగామిని మదేతదయోగభరప్రభూతిమూ
ర్భాగతఖేదరాత్రిసమయావధిభూతవిభాతసంధ్య కా
లాగరుచిత్రకాంధతమసాంశసమన్విత జంభవైరికా
ష్ఠాగతరాగకర్త్రి ప్రకటద్విజసేవిత యౌట చిత్రమే!

172


ఉ.

ఈయెలదీఁగఁబోణి కృపయేర్పడఁగాఁ దనలేఁతనవ్వుతో
వేయవ పా లపాంగముల వెంటఁ బ్రసాదము చేసిన న్నిశా
నాయకుఁ డెంతయం బ్రియమునం గయికోఁడొక నాల్గుదిక్కులం
బ్రాయపుచంద్రిక ల్వడసి పాఱఁగ వైచుచు నప్పదార్థమున్.

173


తే.

దాడిమీపక్వఫలబీజతతుల గెలిచి
దంతకురువిందపంక్తి యీతరుణి కమరు
సాంధ్యశీతాంశుమండలస్యందమాన
నవసుధారసబిందుబృందంబువోలె.

174

తే.

మాటి కుద్వేగరాగాదిమార్జనమున
నతివిశుద్ధంబు లయినదంతాంకురములు
విమలముక్తావళీసమానములు దాల్చు
నీసరోజాక్షిముఖపద్మకేసరములు.

175


తే.

వరశిరీషప్రసూనకేసరశిఖాగ్ర
పేలవంబుగ మేసు గల్పించి ధాత
కలితసుకుమారసర్గప్రకర్షుఁ డగుచు
నిలిపె మార్దవ మాయింతిపలుకులందు.

176


ఉ.

పచ్చనివృక్షవాటిక లపండులభిక్ష భుజించి నిచ్చలున్
వచ్చి పఠింపఁబోలుఁ బ్రతివారము గోయిల బ్రహ్మచారి పెం
పచ్చుపడంగ నీసరసిజాక్షిముఖద్విజరాజునొద్ద వా
విచ్చి లసత్ప్రసూనశరవేదరహస్యము లైనపల్కులన్.

177


తే.

దీనికంఠంబునందు వాగ్దేవి యుండి
వీణ మొరయించుచున్నది వీను లలర
నదియ ముఖమున వాగ్భావ మాశ్రయించి
యమృతధారాప్రవాహరూపముగ నిల్చె.

178


తే.

అబ్జగర్భుండు సుషమాసమాప్తియందు
నెత్తి చూడంగఁ బోలు నీయింతివదన
మంగుళీయంత్రణక్రియాభంగి నమరె
జిబుకమునయందు నానిమ్నసీమసంధి.

179


క.

కమలాధిరాజ్యపదవీ
సమధిష్ఠిత మీవధూటి చారుముఖాంభో
జము మఱి యటు కా దన నే
నిమిత్తమున సేవఁ జేయు నేత్రాంబుజముల్.

180

చ.

కమలము తండ్రి యైనయుదకంబుఁ గళానిధి మిత్ర మైనయ
ద్దమును నహర్నిశంబు నుపధావన సేసి వహించెనో సుమీ?
క్రమమున నీవధూమణిముఖప్రతిబింబవిలాససంపదన్
సముచితలీల యాచితకచారువిభూషణరాజికైవడిన్.

181


సీ.

రాహుదంష్ట్రాంకురక్రకచఘాతంబుల
        నొక్కొొకపరి నొప్పి నొందకున్నఁ
బరివేషమిష మైనపాశబంధంబున
        బహువారములు గట్టుపడకయున్నఁ
బ్రతిమాసమును గుహూరాత్రివేళలయందు
        నత్యంతనాశంబు నందకున్న
బలవత్కళంకకజ్జలపంకసంకర
        స్ఫూర్తి మాలిన్యంబుఁ బొరయకున్నఁ


తే.

గాక సరివోలఁ జాలునే కమలవైరి
యనధిగతదోష మైనయీయతివమొగము
మధురబింబాధరోష్ఠంబు మాఱు గాఁగ
నమృతపూరంబు గలిగినయంతమాత్ర?

182


సీ.

సకలశాస్త్రాఘనిష్యందధారాసార
        నవసుధారసవాట్ప్రణాళు లొక్కొ
రతిపంచబాణదైవతయుగ్మపూజనా
        వసరనైవేద్యపూపంబు లొక్కొ
ధన్వరేఖాంచితైతద్భ్రూజ్యకావేణు
        శాఖాశిఖత్వగంశంబు లొక్కొ

[6]బలభేదిముఖచతుర్బర్హిర్ముఖప మన
        స్సారంగబంధపాశంబు లొక్కొ


తే.

యధికదీర్ఘకటాక్షబాణాగ్రకషణ
శాణచక్రప్రసారమసారతరళ
భర్మతాటంకనేపథ్యభాసురములు
దీనివీనులు శ్రీకారమానదములు.

183


తే.

పదియు నెనిమిదివిద్య లీపద్మనయన
శ్రవణముల రెంట నర్ధ మర్ధము గ్రహించె
నంతరుత్కీర్ణగంభీరహారిలేఖ
యది గదా వీనులందుఁ దొమ్మిదవలెక్క?

184


తే.

అవటు శోభితమాణవకాభిరామ
యంచితోర్ధ్వగతాలింగ్యతాతిహృద్య
యద్భుతైకనిదానశోభాస్పదంబు
కంబుబిబ్బోకవతి దీనికంఠలక్ష్మి.

185


క.

కవితాగానప్రియవా
గ్వివరణసీమావిభాగవిధిరేఖలు నా
ధవళాక్షికంఠసీమం
బ్రవిమలరేఖాత్రయంబు ప్రస్ఫుట మయ్యెన్.

186


క.

కాంతాబాహుద్వంద్వా
త్యంతపరాజయసమాశ్రితాంభోదుర్గా
భ్యంతరము లైనబిసముల
కంతర్నిర్వ్యథనకలన మది యెట్లొక్కో?

187

క.

తరుణి యతిలలితపర్వ
స్మరపంచశరీసమానమహనీయనఖాం
కురమృదులాంగుళీవిలస
త్కరపంకజయుగళి దీనిఁ దరమె నుతింపన్?

188


తే.

జలరుహాననదోర్లీల గెలువఁబోలుఁ
గేలిమై నీమృణాళికాకిసలయములఁ
గాక యివి యేల మిన్న కీకరణి మునుఁగు
కీర్తి యనుపేరి బహుళదుష్కీర్తియందు?

189


సీ.

గంధవారణకుంభగౌరవస్ఫురణంబు
        కనకకుంభములకుఁ గల్లెనేని
లికుచకోమలకాంతిలీలావిశేషంబు
        చక్రవాకములందు జరిగెనేని
మాలూరసౌభాగ్యమహిమానుభావంబు
        దాడిమీఫలములఁ దగిలెనేని
నసకలోన్మీలితప్రసవగుచ్ఛచ్ఛాయ
        యజ్ఞకోరకముల కబ్బెనేని


తే.

గాని సరిసేయఁ గారాదు వానిఁ దార
హారనిర్ఝరసలిలధారావధౌత
కాంచనాచలశృంగభాగంబు లగుచు
రాజితము లైనదీనివక్షోజములకు.

190


తే.

నలువ సన్నంబుగా దీనినడుము గీసి
యౌవనమునకు నిచ్చె నాయంశమెల్ల
నది యుపాదానమునఁ గదా యిది సృజించె
నున్నతములైనయేతత్పయోధరముల.

191

చ.

అరయ ననంగరాజ్యవిభవాభ్యుదయంబు ప్రకార మిట్లపో
కర మన దైనయాసుదతికౌను వళిత్రితయంబుచే నిరం
తరమయి యాక్రమింపబడె దానికి దో డొకపొత్తునం బయో
ధరములు రాయుచున్నయవి దర్పవిజృంభణలీల యేర్పడన్.

192


తే.

ప్రబలవక్షోజహేమకుంభములు సూచి
లలితరోమావళీరజ్జులతికఁ జూచి
నాభికూపంబుఁ జూచి నానయనయుగము
తృష్ణ వహియించుచున్నది దీనియందు.

193


తే.

నాభి యుత్పాటితాలాన నవ్యబిలము
రోమవల్లరి శృంఖలాదామకంబు
కామమదవారణమున కీకంబుకంఠి
వలుదచనుదోయి గురువప్రవాస్తుభూమి.

194


తే.

ప్రతిఫలించు ప్రవేణికాభారరచిత
మల్లికలు రాజతాక్షరమాలికలుగ
శంబరారాతివిజయశాసనసువర్ణ
పట్టికయుఁబోలె నొప్పు నిపఁపణఁతివీఁపు.

195


క.

తనజనకుఁడు శౌరి సుద
ర్శనచక్రమునను జయించె జగ మని మరుఁ డీ
వనిత యదర్శనకటితట
ఘనచక్రంబున జయింపఁగాఁ దలఁచెఁ జుమీ.

196


శా.

ఏదే నొక్కమనోహరాంగకముచే నీయిందుబింబాస్య హే
లాదర్పంబునఁ బిప్పలచ్ఛదము గెల్వంగాఁ దలంచెం జుమీ

లేదే నన్యమహీజపత్రములువోలెం గాక యేలా భయ
ప్రాదుర్భావమునం జలించు నది నిర్వాతప్రదేశంబునన్?

197


తే.

చిగురుఁబోణి భ్రూవల్లరిచిత్రరేఖ
యింతినాస తిలోత్తమ యింత నిజము
చెలువయూరుకాండద్వయీసృష్టి రంభ
మానినీమణిమధురోక్తి మంజుఘోష.

198


తే.

ఊరుకాండద్వయమున నీయుత్పలాక్షి
సమదవారణరాజహస్తంబు గెలిచె
నదియ కారణముగఁ గదా యధికలజ్జఁ
బొంది ముడిఁగించునది యాస్యపుష్కరంబు.

199


తే.

వనిత నానారదాహ్లాదివదనకమల
నీలకుంతల కుచశైలశీలిభృగువు
చామ శ్రీమహాభారతసర్గయోగ్య
కారణవ్యాసకలితోరుగౌరమహిమ.

200


చ.

సుదతి మనంబునం దలఁచి చూడఁ జతుర్దశియౌ నరుంధతీ
మదనపురంధ్రిదైత్యరిపుమానవతీనవమాతృకాజన
త్రిదశవరేణ్యభామలకు దివ్యమహామహిమానుభావసం
పద నటు గాక గుల్భపరిపాటి కదృశ్యత సంఘటిల్లునే?

201


సీ.

పల్లవంబులు దీనిపదకాంతిలవములై
        పల్లవశబ్దలాభంబు నొందెఁ
బపడంబుమీఁదికోపముననో యీకాంత
        పాదంబు లత్యంతపాటలములు
శుద్ధపార్ష్ణులు గానఁ జూ దీనియంఘ్రులు
        గరియూథపతియానగరిమ గెలిచెఁ

దోయజభ్రాంతినో యీయింతియడుగుల
        నలువొప్పఁ బాయకున్నయది లక్ష్మి


తే.

తరుణిపదములయది యలక్తకరసంబొ?
కాక త్రైలోక్యభామాభిరామమౌళి
భాగవిన్యాససంలగ్నబహుళనూత్న
చారుసీమంతసీమసిందూరరజమొ?

202


తే.

శిశిరకాలంబునందు నిశ్శేష మైన
జలజసస్యంబు సృజియింపఁదలఁచి బ్రహ్మ
యాచరింపఁడె యీకాంతయాస్యహస్త
పాదసౌభాగ్యములయందుఁ బంచభిక్ష.

203


క.

వినుతయశఃపాదాంగు
ష్ఠనఖాస్యము లనెడిపూర్ణచంద్రచతుష్కం
బును ధరియించుట నొకొ యీ
వనిత చతుష్షష్టికళల వాసన కెక్కెన్.

204


చ.

అని చికురాదియుం బదనఖాంతముగాఁ జిగురాకుఁబోఁడి నె
మ్మనమున సంస్తుతించి యసమానవిలాసకళావినిర్జితా
తనుఁ దను నవ్వధూమణికిఁ దత్సమయంబునఁజూప వేఁడి యొ
య్యన దిగడాఁచె భూపతి దిశాధిపకల్పిత యైనశాంబరిన్.

205


ఆశ్వాసాంతము

ఉ.

భానుసమాన! మానగుణబంధుర ! బంధురమానిదాన! దా
నానుకృతాంబువాహధనదాంబుదవాహనకామధేనుసం
తానకకర్ణ! కర్ణసుఖదాయివచోరచనాధురీణ! రీ
ణానతరాజ! రాజమకుటాంఘ్రిసరోరుహభావితాత్మకా!

206

క.

కమలభవవంశపావన!
విమలాంతఃకరణ! బాహువిక్రమకేళీ
యమళార్జునమదభంజన!
సమరార్జున! నిరభిసంధిసౌజన్యనిధీ!

207


స్రగ్విణి.

తల్లమాంబాసుతా! ధైర్యహేమాచలా!
పల్లవాదిత్యసౌభాగ్యభాగ్యోదయా!
పల్లవోష్ఠీకుచప్రాంతభాగద్వయీ
గల్లపాళీలసత్కామముద్రాంకురా!

208


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. ‘కటికతనంబుఁ బూని' అని పా
  2. ‘తలప నధమర్ణుఁ డొక్కప్రధానమాత్ర, మిచట నొక్కటి గొని' అని వ్రా.ప్ర.
  3. ‘బోరన నాఱియాఱి మఱి పొంగె’ అని పా.
  4. ‘దలఁప రుచియింప వట్టిచందంబు గాఁగ' అని పా.
  5. ఈ పద్యము పూర్వముద్రితపుస్తకములలో లేదు. వ్రాతపుస్తకములో దొరికినది.
  6. ‘బలభేదిముఖచతుర్బర్హిర్ముఖోన్మనః, ప్రతిబంధవాగురాపాశ మొక్కొ’ అని పా.