శృంగారనైషధము/చతుర్థాశ్వాసము

శ్రీరస్తు

శృంగారనైషధము

చతుర్థాశ్వాసము

శ్రీమచ్ఛరణాంభోరుహ
చామీకరకటకఘటితసమదారాతి
స్తోమ? దయారఘురామ! ర
మామందిరలసదపాంగ! మామిడిసింగా!

1


నలుని రాయబారము

వ.

అవధరింపు మివ్విధంబున విబుధమాయాంధకారంబు దూరం బగుటయుం గట్టెదుర నాజగజెట్టి జవనిక వాయందట్టినం బొడసూపుబహురూపుతెఱంగున, జలధరతిరోధానంబు వాసినం బ్రకాశించు నాహిమధామునిపగిది, నవిద్యావరణంబు విరిసినం దోఁచుపరమాత్మునిప్రకారంబున, దోహదపలాలజాలంబు విరిసినం బ్రేక్షణీయం బగుపుండ్రేక్షుకాండంబుభంగిఁ, బరమాద్భుతాస్తనిమేషముద్రుండును నిర్ణిదరోమప్రరోహుండును నిశ్చలాంగుండును వైశాఖస్థానకలితుండును నిర్వికారుండును నై భీముభూపాలపుత్త్రికకు నేత్రవిషయీభావంబు భజియించె, నప్పు డప్పుడమిఱేనిం గనుం

గొని సంభ్రమంబును భయంబును లజ్జయు మనంబునం బెనంగొనంగ నంగనాజనులు సమయసముత్థానఝళఝుళాయమానమణితులాకోటివాచాటీభవత్సభాభవనాళిందంబుగా నందఱుం బ్రత్యుత్థానంబు సేసిరి. ధీరోదాత్త గావున నయ్యాదిగర్భేశ్వరి సమున్నతకనకాసనంబున మున్నున్నయునికిన యుండి యనిర్వచనీయం బైనయానందంబు డెందంబున ననుభవించుచు ‘నెవ్వండ? వెందుండి యేతెంచి, తెట్టు వచ్చితి?’ వని యడుగనుండి మరలఁ జంద్రుండొ! యుపేంద్రుండో! కంతుండో! జయంతుండో! యని సందియం బందుచు మొదల హంసంబు సరసబిసనీపలాశంబుమీఁదఁ జరణనఖాగ్రంబున లిఖియించి చూపినం జూచినచిత్రరూపంబుతో రూపంబు సంవదించుటం జేసి యీతండు నిషధరాజని యెఱింగియు శుద్ధాంతసదనప్రవేశంబు దుర్లభంబు గావున మిగుల విశ్వసింపక నిమేషనిస్స్పృహంబు లైనవిలోచనంబుల సాద్భుతంబును సకౌతుకంబును సానురాగంబునుంగా విలోకించుచు.

2


తే.

అతివ మిథ్యావలోకనాభ్యాసకలన
నిజముగా రాజుఁ జూచియు నెమ్మనమునఁ
దాల్పదయ్యెను శాలీనతాభరంబు
తథ్యమిథ్యావివిక్తి ముగ్ధలకుఁ గలదె?

3


ఉ.

కేవలసాధ్వసంబున సఖీజను లూరక యుండఁగా మనో
భావపిధానయత్నపరిపాటి ననాదరముద్రచేఁ దిరో
భావము నొందఁజేసి ముఖపద్మ మొకంచుక వాల్చి పల్కె నా
నావిధచిత్రవాక్యరచనాచణ భీమతనూజ నేర్పునన్.

4

సీ.

ప్రణతమౌళిమణిప్రభానికాయంబుతోఁ
        బానీయమున నర్ఘ్యపాద్య మీగి
యత్యంతమధురవాక్యప్రపంచములతో
        శర్కరాదులమధుపర్క మీగి
ప్రవిమలం బైనసద్భావవైభవముతోఁ
        బృథులకాంచనరత్నపీఠ మీగి
పరమసేవావిధావిరచితాంజలితోడఁ
        బ్రముదితం బగుమనఃపద్మ మీగి


తే.

యాతిథేయుల కభినవాయాతుఁ డైన
యతిథి తనయింటి కేతెంచునపుడు సేయు
సత్క్రియాచారవిధికలాసరణి యండ్రు
ధర్మశాస్త్రోపనిషదర్థధర్మవిదులు.

5


తే.

అనఘ! యిదె హేమరత్నసింహాసనంబు
ఇచ్చగలదేనిఁ గూర్చుండు మిందు వచ్చి
కాక కార్యాంతరాసక్తికారణముగ
నేఁగఁదలఁచినవాడవో యెచటికైన?

6


తే.

నవశిరీషసుమంబులనవకమునకు
నన్నదమ్ములు వోని నీయడుగుఁదమ్ము
లెంతదూరంబు నడపింప నిచ్చగించె
నొక్కొ నిర్దయ మైననీయుల్ల మిపుడు?

7


సీ.

ఏదేశమున నుండి యెచ్చోటి కేఁగెదు?
        సంకేత మెయ్యది సంజ్ఞ నీకు?
రక్షాధికృతజనవ్రాతపాలిత మైన
        శుద్ధాంత మెబ్భంగిఁ జొచ్చి తిపుడు?

ఫల మేమియొక్కొ యీపటుసాహసమునకు
        మముఁ గృతార్థలఁ జేయుక్రమముదక్క
నాభీలదౌవారికాంధంకరణి యైన
        శక్తి నీ కేవిద్య సంభవించె?


తే.

నైలుఁడవొ! యైలబిలుకూర్మి యాత్మజుఁడవొ!
పంచబాణుండవొ! దేవపతిసుతుఁడవొ!
చంద్రుఁడవొ! యింకఁ బెక్కుభాషణము లేల!
నిజము దప్పక చెప్పుము నిషధపతివొ!

8


క.

ఆరము నీయుదయమునకు
గారణమై యేకులంబు గాంభీత్యమునన్
దారాపతిఁ గన్న పయః
పారావారంబుతోడఁ బ్రతిఘటియించెన్?

9


తే.

మానవుఁడ వైతివేని యిమ్మహి కృతార్థ
విబుధలోకంబ లోకంబు వేల్చ వేని
భువనముల కెల్ల మీఁ దధోభువన మీవు
భుజగరాజాన్వయమునందుఁ బుట్టితేని.

10


ఉ.

వానిఁ బ్రశంససేయఁదగువాఁడు కృతార్థతముండు వానిచే
నీనిఖిలంబు పావన మహీనకృపావిభవం బెలర్ప నె
వ్వానిగృహాంగణంబునకు వచ్చెడిత్రోవరజంబులందు నీ
మానితపాదయుగ్మక మమర్చుఁ బ్రఫుల్లసరోజదామమున్.

11


వ.

గుణాద్భుతం బైనపదార్థంబు వర్ణింపకునికి యసహ్యశల్యం బైనవాగ్జన్మవైఫల్యంబు ధూర్జటిజటాకిరీటాలంకారం బైనశశాంకునిసౌకుమార్యంబును నమృతంబునకు నుత్పత్తిస్థానం బగుపయోనిధానంబు గాంభీర్యంబును విశ్వవిశ్వంభరాం

భోజకర్ణికాయమానం బగుసువర్ణాహార్యంబు ధైర్యంబును విభ్రమభ్రూలతాభంగలీలావిజితసుమనస్సాయకవిలాసరేఖాసారం బై నిర్వికారం బైనయాకారం బెవ్వరియందునుం గలదె! యేము కృతార్థల మైతిమి. మాజన్మంబులు సఫలంబు లయ్యె. మావిలోచనంబులు భాగ్యంబులు సేసె. వీనులు భవదుదంతశ్రవణకుతూహలాధీనంబు లయియున్నయవి. వాగమృతంబు వానికిం బ్రసాదింపు మనుటయు.

12


ఉ.

అంకిలి లేక యప్పు డరుణాధరపల్లవనిర్గతంబు లై
పంకరుహాయతాక్షి నునుఁబల్కులు తేనియ లొల్కుచున్ శ్రవో
లంకృతులై నృపాలుమది లగ్నము లయ్యె వినోదలీల కై
మంకెనపూవుఁజాపమున మన్మథుఁ డేసినతూపులో యనన్.

13


వ.

అనంతరంబ దమయంతీశాసనంబున సఖీజనంబు కనకాసనంబు వెట్టిన.

14


ఆ.

అవ్వరాసనంబునందు నాసీనుఁడై
యర్కుఁ డుదయశిఖరియందుఁ బోలెఁ
గొనియె నిషధరాజు వనజాతముఖులచే
నాతిథేయ మయినయర్ఘ్యపూజ.

15


వ.

ఇట్లు సంభావితుండై యంభోరుహాక్షులు తన్ను వీక్షించుచు సంజాతకౌతుకంబున వింజమా కిడినభంగి నూరకుండ సప్పుణ్యశ్లోకుండు ప్రావృషేణ్యపయోధరధ్వానగంభీరం బైనయెలుంగున దమయంతి నుద్దేశించి.

16


సీ.

ఏను దిక్పతులయాస్థానంబునం దుండి
        యరుగు దెంచితి నీకు నతిథి నగుచుఁ

బ్రాణంబులును బోలె నంతరంగమునందుఁ
        దత్కార్యభరమును దాల్చినాఁడఁ
జరితార్థముగఁ జేయఁ జను నాదుదూత్యంబు
        నాతిథ్యసత్కార మదియ నాకుఁ
గాలయాపన సేయఁ గాదు నిశ్చయముపైఁ
        గర్తవ్య మగునట్టి కార్యమునను


తే.

నుల్ల మిప్పు డేకాగ్రమై యున్నయదియె?
యవసరం బౌనె దేవరహస్యమునకు?
వింతవారలు లేరుగా యింత నంత?
నువిద! మనవారలేకదా యున్నవారు?

17


క.

నాకౌకఃప్రవరులు ని
న్నాకాంక్షించిన ప్రయోజనాంశము దిరమై
యాకర్ణింపుము చెప్పెద
నాకర్ణపుటాయతాక్షి! యవధానమునన్.

18


వ.

పాకశాసన పావక పరేతరాజ పాశపాణులు పుత్తేరఁ బని పూని వచ్చితిఁ, జిత్తగించి యక్కార్యంబు విను, మప్పరమపురుషులు పరిషన్మధ్యంబునం బంకజాసను తనూభవునివలన ద్రిభువనమోహనంబు లైన నీరూపలావణ్యవిలాసవిభ్రమాదిగుణంబులు విని వినుకలి వలవంత నెంతయుఁ జలించి పంచేషు లుంఠితధైర్యవిత్తంబు లగు తమచిత్తంబులం గలవృత్తాంతంబు లంతయుం దెలియం జెప్పి, రిప్పు డయ్యాశాపతు లాశాపాశంబులఁ గట్టువడినారు. వారియందును సంక్రందనుండు.

19

తే.

నందనోద్యానవీథికాంతరములందుఁ
బూర్ణచంద్రాస్య! విహరింపఁ బోవ వెఱుచుఁ
గల్పతరుపల్లవంబులు గమిచి మేసి
కోకిలం బెప్డు గూయునో కొసరి యనుచు.

20


తే.

పరమ మగుకోటి కెక్కె నోపద్మనయన!
నవనవం బైననీజవ్వనంబుతోన
యసమబాణునిచాపంబునందు గుణము
భామ! నీయందు సుత్రాముప్రేమగుణము.

21


ఉ.

ఆరసి చూచి తాపమునయందును రూపమునందుఁ బూర్ణిమా
తారకరాజుగాఁ దలఁచి తన్వి! భవద్విరహాతురుండు జం
భారి నిగుడ్చు భ్రాంతి నుదయావసరంబుల నొద్దనుండి రో
షారుణ మైనలోచనసహస్రము బాలసహస్రభానుపైన్.

22


తే.

మూఁడుకన్నులవేల్పుతో మోహరించి
నేఁడు దేహంబు లేక యున్నాఁడు దాను
వేయికన్నులవేల్పుతో విగ్రహించి
వనిత! యిం కేమి గానున్నవాఁడొ మరుఁడు.

23


చ.*

చిలుకలు వల్కునో చెవులు చిల్లులు వోవఁగ నంచు నెన్నఁడున్
వెలలఁడు నందనోపవనవీథులకై యటు మౌళిభాగని
ర్మలశశిరేఖమీఁదియపరాధమునన్ గజదైత్యశాసనుం
గొలువఁడు పాకశాసనుఁడు గోమలి! నీపయి కూర్మిపెంపునన్.

24


తే.*

స్మరశిలీముఖకుసుమకేసరపరాగ
ధూళిపాళిక చుళుకించెఁ దూర్పుదిక్కు
ఇంతి! వేగన్నులును గానఁ డింద్రుఁ డిపుడు
నీవిలాసంబుపెంపు వర్ణింపఁదరమె.

25

తే.

విరహతాపప్రశాంతికై విబుధపతికి
నార్ద్రపర్యంకవిధికిఁ గా నపచయింప
బరులలేములు వాపంగఁ బాలుపడిన
యమరతరువుల కొదవెఁ బుష్పములలేమి.

26


మ.

విను వైదర్భి! భవద్వియోగదవధూద్వేగంబు వారించుచున్
దినముల్ పుచ్చుచునున్నవాఁడు విబుధాధీశుండు మందాకినీ
కనకాంభోరుహనాళకల్పితనవాకల్పంబులం జారునం
దనమందారతరుప్రవాళమయచింతారత్నతల్పంబులన్.

27


ఉ.

పుష్పధనుర్లతామధుపపుంజగుణక్వణనం బొనర్చి వా
స్తోష్పతికర్ణముల్ మనసిజుండు చెవుడ్పడఁ జేసె నక్కటా!
గీష్పతి యేమి చెప్ప నిటఁ గ్రింద బలారికిఁ గామవిక్రియా
దుష్పథవృత్తికిన్ మనసు దూర్పమికై బహునీతిశాస్త్రముల్.

28


తే.

చెలువ! జంభారియాసకుఁ గొలఁది యేది?
తా సహస్రాక్షుఁడై యుండి దైన్యవృత్తి
నభిలషించుచునున్నవాఁ డాత్మలోనఁ
జంచలం బైననీకటాక్షాంచలంబు.

29


క.

ఏవేల్పు సోమపీథులు
సేవింతురు ముఖ్యతనువు శివునకు నేవే
ల్పేవేల్పు వెలుఁగులకు గని
యావేలుపు నిను వరింప నాకాంక్షించెన్.

30


ఉ.

స్థాణునిలోచనాంచలము దాపుఁగఁ దీవ్ర తరార్చున్ల నిజ
ప్రాణముఁ గొన్ననాఁటిపగ యాత్మఁదలంచియొ నీకటాక్షదృ
క్కోణము ప్రాఫున న్మరుఁడు గోల్కొని పంత మెలర్పఁగాఁ గొనెన్

బాణదశార్ధపాతమునఁ బావకుభూరిమనోభిమానమున్.

31


తే.

ఉవిద! సోమరసం బన్న నోకిలించు
నడిచిపడు నాజ్యహోమమంత్రాహుతులకు
నిచ్చ సేయఁడు మనములో నిధ్మములకుఁ
బావకుండ నేఁడెల్లి నీపై విరాళి.

32


తే.

తరుణి! యాత్మప్రతాపసంతప్తుఁ జేసి
పుష్పనారాచుఁ డగ్నికి బుద్ధి సెప్పె
'నాత్మ వత్సర్వభూతాని' యనెడు నీతి
నన్యతాపంబు శిఖి మానునట్లు గాఁగ.

33


క.

కుసుమాయుధబాణంబులఁ
గసుగంది భవద్వియోగకలుషత నర్చా
వసరంబుల నర్చకు లిడు
కుసుమములకు వెఱచు వహ్ని కువలయనేత్రా!

34


ఉ.

బాలిక! నీవు హేతువుగ భానుకులాభరణంబు దక్షిణం
బేలెడురాజు ధర్మముల కెల్లను గందువ ధర్మరాజు లో
దాలి మనోభవాగ్నిఁ దనతాలిమి నాహుతిగాఁ గ్రమంబునన్
వేలుచుచున్నవాఁ డభినివిష్టసుఖైకఫలాభాకాంక్షియై.

35


క.

చండజ్వరజర్జరమును
బాండురమును నైనమేను బాలిక! తాల్చెన్
దండధరుఁ డిపుడు సుమనః
కాండౌజఃకీర్తిభారకలితుఁడ పోలెన్.

36


క.

బిసరుహలోచన! సంధ్యా
ఘుసృణసమాలంభకర్మకుతుకారంభ

వ్యసనసముజ్జృంభిత యగు
దెస నేలెడురాజు నిను మదిం గామించెన్.

37


క.

మదిరాక్షి! జలధి నశ్వా
వదనోత్థత మైనహవ్యవాహను పోలెన్
హృదయస్థానస్థిత మగు
మదనానల మబ్ధిరాజుమద మణఁగించెన్.

38


తే.

తరుణి! తద్భుజమధ్యమధ్యంబునందు
నవమృణాళకదండఖండంబు మెఱయుఁ
దన్మనోమగ్నమదనాస్త్రతతులచేత
నక్షణంబ శతచ్ఛిద్రమైనభంగి.

39


వ.

ఈచందంబునం ద్రిలోకతిలకులగు నాదిశావల్లభులు భవదాయల్లకభరం బను వెల్లి మునుగంబాఱు నెల్లి నీస్వయంవరమహోత్సవం బని విని తపనసంకాశంబు లైనవిమానంబు లెక్కి యేతదర్థంబున నిజశుద్ధాంతకాంతాజనంబు విరహసంతాపభాజనంబుగా నిశితనిస్త్రింశనీకాశం బగునాకాశంబు డిగ్గి పాదార్పణానుగ్రహంబున మహీమండలంబు గృతార్థంబుగా నిప్పు డిప్పురంబున కనతిదూరంబుననున్నవారు. యదృచ్ఛాగతుం డైననన్నుం గనుంగొని నామనంబున సందేశాక్షరంబులు వ్రాసి జంగమలేఖంబు గావించి నీసకాశంబునకుం బుత్తెంచిరి. కుసుమశరభిల్లశరశల్యవిశల్యౌషధీవల్లి వగునిన్నుం బరిష్వంగంబు సేయను, ననంగలీలాలహరీతుషారం బగునీశరీరంబుసోకున నంతరంగపరితాపం బపనయింపను, నిష్పీతపీతాదర్పంబులగు నీయంగంబు లపాంగంబులకు లేపం బొనర్పను, బ్రసవనారాచశరాసనాతివిభ్రమభ్రూవిలాసం బగునీముఖశ్రీసముల్లా

సంబునకు నుల్లసిల్లను, సుమనగకోదండచండాలసంస్పృష్టిదోషదూషితు లగుతమ్ము నీకటాక్షవిశేషసాంద్రచంద్రాతపాలోకంబుల నభిషేకింపను, భవచ్చరణకమలసేవాహితమహత్త్వంబున మదనాపమృత్యుదేవతవలన నిజప్రాణంబులకుఁ బరిత్రాణంబుఁ గావింపనుం దలంచుచున్నవారు. కుశలప్రశ్నపూర్వకంబుగా నాగీర్వాణులు నీకుం జెప్పుమనినపలుకులు గొన్ని గలవు వాని నాకర్ణింపుము.

40


క.

ఆదిత్యుల మగుమాకును
నీదోర్లతికాయుగంబు నిర్భరసుఖవ
ర్షోదయకారణ మై సం
సాదించుం గాక తరుణి! పరివేషంబుల్.

41


శా.

ఔదాసీన్యము నుజ్జగించి విను వాక్యం బస్మదీయంబు మి
థ్యాదోషం బొకయింత లేమి కఖిలాంతర్యామి త్రైలోక్యమ
ర్యాదాస్థాపకుఁ డంగజుండు గుఱి యీయర్థంబు నిక్కంబు
పాదాంభోజరజఃప్రసాదములు మా ప్రాణంబు లబ్జాననా!

42


శా.

మాదివ్యత్వము నీకు నిత్తు మని సంభావింప సి గ్గయ్యెడిన్
వైదర్భీ! భవదీయరూపవిభవైశ్వర్యంబు మాభూమియం
దేదీ? దీనికిఁ బ్రత్యయం బిదియ పో యే మెల్లనుం గూడి నీ
పాదాంభోజము లాశ్రయించెదము తాత్పర్యంబు సంధిల్లగన్.

43


మహాస్రగ్ధర.

త్వదరాళభ్రూలతాద్వం
        ద్వమున మదనుఁ డోతన్వి ధన్విత్వ మొందెం

ద్వదుదంచన్మందహాసో
        దయము వనిత! కందర్పు జైత్రాస్త్రుఁ జేసెం
ద్వదపాంగాలోకనశ్రీ
        తరుణి! మరుని మత్స్యధ్వజుం గా నొనర్చెం
ద్వదధీనం బెల్ల సాము
        ర్థ్యము రతిపతికిం దామ్రబింబాధరోష్ఠీ!

44


భా.

నీలావణ్యపయోధియందు నలరు న్నేత్రాబ్జముల్ నీమనో
జ్ఞాలాపంబులయందు గర్ణములు నీయాలింగనప్రక్రియా
కేలి న్మేనులు నీముఖాస్వదనసక్తి న్నాలుకల్ మాకు నో
బాలా! స్వప్నసమాగమంబుల నిశాపర్యంతయామంబులన్.

45


వ.

అని బృందారకచతుష్టయంబు నీతోఁ జెప్పు మనెం గావున.

46


క.

సురసార్థవాచిక స్ర
క్పరిపాటీవిశదరసనపత్త్రుఁడ నగు న
న్నరవిందపత్త్రలోచన!
చరితార్థునిఁ జేయు కార్యసాఫల్యమునన్.

47


చ.*

అమరపతి న్వరించెదవొ! హవ్యవహున్ చరణంబు ద్రొక్కెదో!
శమనునిఁ జెట్టపట్టెదవొ! సాగరవల్లభుఁ బెండ్లియాడెదో!
ప్రమదము గౌతుకంబు ననురాగము పెంపును సొంపు మీఱఁగాఁ
గమలదళాక్షి! యొక్కరునిఁ గైకొనుమా యనుమాన మేటికిన్?

48


వ.

అనిన విని యయ్యంబుజాక్షి యక్షిభ్రువవిశేషవిశ్రమంబున ననాదరంబు దెల్పుచు నలవోకగా దిగీశసందేశం బాకర్ణించి యారాజకుమారున కి ట్లనియె.

49

తే.

ప్రశ్న మొక్కటి యొక్కటి ప్రతివచనము
యుక్తి యనుకూల మై యుండ దుభయమునకు
నేను నీవంశనామంబు లెవ్వి యనిన
నెవ్వరినొ ప్రస్తుతించితి వింతతడవు.

50


క.

ఒకచోటఁ బ్రకాశించియు
నొకచోట నిగూఢ యగుచు నొదవించెం గౌ
తుకలక్ష్మి నీసరస్వతి
ప్రకటయు గూఢఁయును నగుసరస్వతి వోలెన్.

51


తే.

అధికతరు లై సఁ గాని దిశాధిపతులు
కౌతుకము నాకు నీవంశకథలయందు
దప్పి గొన్నట్టివారి కాదప్పి దీఱ
సలిలపూరంబు హితవొ! యాజ్యంబు హితవొ!

52


వ.

ఏను జేసినప్రశ్నంబునకు నుత్తరంబు నీమీఁద నప్పై యున్నయది యిప్పుడైన నాఋణంబుఁ దీర్చుకొనుము. భవాదృశం బైననాయకరత్నంబు నేవంశంబు భరించె? నేవర్ణంబులు నీపుణ్యనామంబునకుం బ్రకాశకంబు లైనయవి? యని పరిమితంబుగాఁ బలికి కుండిననరేంద్రనందన యూరకుండుటయు నన్నిషధమండలాధీశ్వరుండు.

53


ఉ.

తామరసా! వంశకథ దవ్వుల నుండఁగ నిమ్ము చెప్పఁగా
దేమిటికన్న నైజ మగుహీనత గల్గినఁ జెప్పు టొచ్చె ము
ధ్ధామత గల్గె నేని నుచితం బయి యుండదు సెప్పికొంట నేఁ
డీమెయిఁ బ్రేష్యభావము వహించి నికృష్టత నేఁగుదెంచుటన్.

54


తే.

ఇంతమాత్రంబు సెప్పెద నెఱిఁగికొనుము
నృపతికన్యవు గడుమాననీయ వగుట

మైత్రి కఱ సేయఁ దగ దేను మసుజవిభుఁడ
రాజవంశకరీరుండ రాజవదన!

55


ఉ.

పే రడుగం దలంచెదవొ? భీమతనూభవ! యావిచారముం
దూరము సేయు మెవ్వరికి దోషము తాఁ దనపేరు సెప్పు టా
చారపరంపరాస్థితికి శాస్త్రము మూలము శాస్త్రచోదితా
చారవివేకహీనుఁ డగు జాల్ముని మెత్తురె పండితోత్తముల్!

56


వ.

అదియునుం గాక.

57


క.

కువలయనేత్ర! సమక్ష
వ్యవహారంబునకు యుష్మదస్మత్పదముల్
శ్రవణశ్రావణయోగ్యము
లవుచుండఁగఁ బేరు సెప్ప నడుగఁగ నేలా?

58


సీ.

అని శారదం బైనవనమయూరము వోలె
        నహితాపకారకుం డతఁడు పలుక
రాజహంసియుఁ బోలె రమణీలలామంబు
        పదములం దనురాగ ముదయ మొంద
సమయోచితంబుగా సారస్య మొప్పాక
        బలికె ని ట్లని మహీపాలుతోడ
నన్వయం బెఱిఁగించి యభిధాన మెఱిఁగింప
        కునికి మ మ్మాదరించినతెఱంగె?


తే.

యనఘ? మము నీవు వంచింప నభిలషించె
దేము నేరమె వంచింప నిపుడు నిన్ను?
బేరు సెప్పిన నీ కనాచార మేని
మాకు నాయంబె నీతోడ మాటలాడ.

59

తే.

అన్యపురుషులతోడ నెయ్యంపుగోష్ఠి
యధిప! మముఁబోటిరాజకన్యకల కగునె?
యది కులాబలాచారసహాసనాస
హాలిసాహసకౌతూహలావసథము.

60


క.

తగవే కులకన్యలకును
మగవారలతోడ రూపమహనీయులతో
మిగులంగఁ దడవు లోపలి
నగళులలో మాటలాడ నయతత్త్వనిధీ.

61


వ.

అనిన విని ప్రతిబంధరచనాచాతుర్యంబును మనంబునం దభినందించుచుఁ బ్రత్యుత్తరంబు వేఱొండు వెదకి పొడగానలేక యాలోకోత్తరచరిత్రుండు విదర్భరాజపుత్త్రిం గనుంగొని నేత్రాంచలంబుల నలంతినవ్వు దొలంకాడ ని ట్లనియె.

62


సీ.

వామాక్షి! మాక్షికస్వాదుపేశల మైన
        పలు కేల యొరులపైఁ బాఱవైవఁ?
జంచద్రసామృతస్నానపేశల మైన
        దృగ్విలాసముఁ జేర్చు దివిజులందు
సఫలంబు సేయు మత్సమధికాయాసంబు
        నేను జెప్పినకార్య మిచ్చగించి
దేవతాపతిభక్తిఁ దిరముగా మది నిల్పి
        ప్రకటకల్యాణవైభవము నొందు


తే.

వెలఁది! నామీఁదఁ గడుఁగృపావిలసనంబు
నాటి చూచినచూపుమన్ననయ చాలు
నాకుఁ గా నుద్ధరింపుము నాకవిభుల
హస్తములు మోడ్చి వేఁడెద నాదరమున.

63

తే.

ఇందుబింబాస్య! నారాక కెదురుచూచు
నయనములు వేయు విరియించి నాకభర్త
యుదిలకొనుచున్నవా రార్తినున్న ముగురుఁ
గాలయాపన సేయఁగాఁ గాదు నీకు.

64


చ.*

హరిహయుఁ డేమి యయ్యె నొకఁడా! మదనానలతాపవేదనన్?
వరుణుఁడు విప్రయోగమున వాడఁడె యింతకు? దండపాణి దా
విరహభరంబున న్మిగుల వేఁగఁడె! నొవ్వఁడె వీతిహోత్రుఁడుం
బరిసరకేళికాననసమాగతమందసమీరణంబులన్.

65


వ.

అనిన విదర్భరాజకన్యక యా రాజకుమారున కి ట్లనియె.

66


తే.

[1]అలఁతినవ్వు ప్రగల్భతాహంకరణము
కాదు కా దంట వాచావిగర్హణంబు
పలుకకుంట తిరస్కారకలనముద్ర
గానఁ బ్రత్యుత్తరం బిచ్చుదాన నీకు.

67


సీ.

అమరాంగనాసంగమాభిశోభితుఁ డైన
        హరి కేల మానుషీపరిచయంబు?
యారకూటకలాప మర్హ మే కలవాని!
        కే నర్హ నే నిర్జరేశ్వరునకు?
కామింతునే యేను వైమానికాధీశు
        హస్తిఁ గామించునే హరిణరమణి?
నఖిలలోకాధీశుఁ డమరేంద్రుఁ డెక్కడ?
        నే నెక్కడ వరాటి నెన్ని చూడ?

తే.

నలపతివ్రతయైన యేఁ దలఁప నొరునిఁ
దివిరి నిందించి యేఁ బ్రస్తుతించి యేని
నలినబిససూత్రమును బురంధ్రులతలంపు
సమము బ్రెయ్యును లవచాపలమున నైన.

68


చ.

అటు దగునే సురేశ్వరునియంతటివాఁ డఖిలాప్సరోంగనా
విటుఁ డొకమర్త్యభామినికి వేడుక సేయుచు నున్నవాఁడు! వి
స్ఫుటబహురత్నభూషణవిభూషితు లయ్యెడురాచవారికిన్
గటకట యారకూటకటకంబు రుచించునొ కాక యొక్కెడన్.

69


మ.

వినుమా నాదుప్రతిజ్ఞ తత్పరత నుర్వీనాథ! యే నైషధేం
ద్రు, నవశ్యంబు వరింతు నాధరణినాథుం డాత్మ న న్నొల్లఁడే
ననుమానింపక యిత్తు నవ్విభునకుం బ్రాణంబు సద్భక్తిమై
ననలోద్బంధనవారిమజ్జనవిధావ్యాపారపారీణతన్.

70


తే.

అనుచుఁ దీక్ష్ణంబుగా భీమతనయ పలుక
నెలుఁగు వినువేడ్కఁ గోయిల నెగిచినట్లు
విబుధరాజప్రసంగంబు విస్తరించి
మఱియుఁ బలికింపఁ దలఁచి యమ్మనుజవిభుఁడు.

71


వ.

వెండియు దమయంతి నుద్దేశించి.

72


క.

నిఱుపేదయింటి కేటికిఁ
బఱతెంచు నిధాన? మట్లు పఱతెంచిన యే
నిఱుపేద యభాగ్యతఁ దలు
పిఱియఁగ నిడు కాక చొరఁగ నిచ్చునె దానిన్.

73


సీ.

ముగ్ధత్వమునఁ జంద్రముఖి పరాఙ్ముఖి వయ్యె
        దేల భాగ్యంబు ని న్నెదురుకొనఁగ?

నమృతాంధసుల నొల్లనను మానవియుఁ గల్గె
        నీలాగుఁ గంటిమే కాలగతుల?
యాగాదిదుర్లభం బైనదేవత్వంబు
        నీ కొల్లఁబా టయ్యె నేఁడు సూడ
రసయోగమున సువర్ణత్వ మొందుట మేలొ?
        యినుము దాఁ దానయై యునికి మేలొ?


తే.

యకటకట! సర్వగీర్వాణమకుటఘటిత
మణిగణ విభాసమానకోమలపదాబ్ద
సురగణాధీశు నొల్లక నరుని నొకని
నభిలషించెడుని న్నేమి యనఁగఁ గలదు?

74


సీ.

రజ్జువల్లరిమీఁదఁ బ్రణయంబు గల దేని
        యంతరిక్షం బేలుహరి వరించు
నగ్ని కాహుతిగాగ నాత్మఁ గోరుదు వేని
        జాతవేదునియదృష్టము ఫలించు
సలిలప్రవేశంబు సమ్మతించెద వేని
        నంబుధీశ్వరుఁడు పుణ్యంబు సేయు
నెబ్బంగిఁ బ్రాణ ముపేక్షించితేనియు
        వైవస్వతుని కబ్బు నాంఛితంబు


తే.

ఘట్టకుటికాప్రభాతంబు క్రమము నంది
దమసహోదరి నీకు నయ్యమరవరుల
నొల్ల ననియును దుదిఁ బొందకుండరాదు
సమ్మతింపుము నామాట చలము మాని.

75


తే.

ఒల్ల ననుమాట కర్థమో యుత్పలాక్షి!
వలతు నను మాటగాదుగా వక్రరీతి?

విధి నిషేధరూపంబు భావించియున్న
విధియయగు వ్యంగ్యవాసనావిలసనమున.

76


వ.

ఇవ్విధం బగునేని.

77


సీ.

వెలఁది! యైరావతద్వీపకుంభకుచకుంభ
        సంభారహరిదధీశ్వరుని వలతొ?
జలజాక్షి! నిఖిలతేజస్వి లోకములకు
        నగ్రగణ్యుం డైనయనలు వలతొ?
తరుణి! లోకాలోకధర్మసంస్థాపన
        ప్రాగల్భ్యనిధి ధర్మరాజు వలతొ?
పల్లవాధర! విధిప్రథమసర్గాధ్యక్షు
        సప్తపాధోనిధిస్వామి వలతొ?


తే.

వైభవం బిచ్చగించి పావనతఁ గోరి
ధర్మశీలత యర్థించి నిర్మలత్వ
మాసపడి వీరినలువురయందు నొకని
వేఁడుమా చూచెదను నీవివేకశక్తి.

78


తే.

అని నృపాలుండు వలుక హస్తాంకసుప్త
కోమలైకకపోలయై యామృగాక్షి
వినియె నొకరీతి నొకభంగి విననిదయ్యె
వలచియును నొల్లకయును దద్వాక్యసరణి.

79


వ.

చింతాక్రాంత యయి యొక్కింతతడవు తలవంచికొని విచారించి పదంపడి నిట్టూర్పు నిగిడించి యాయిందువదన యారాజకందర్పునిం గనుంగొని సవిషాదంబుగా నిట్లనియె.

80


ఉ.

నీచరితంబు చూడ నతినిష్ఠుర మయ్యెడు లోకపాలదు
ర్వాచికసూచికాంకురపరంపరఁ దూర్చెదు మాటిమాటికిన్

నా చెవులందు నీకుఁ దగునా యిటు సేయఁగఁ? దప్పనంటి బా
ధాచరణంబు నైజమ కదా తలపోయఁ గృతాంతదూతకున్.

81


సీ.

ఇదె యెల్లి కల్యాణ మేతెంచుచున్నది
        యీయవాచికవార్త లిపుడు మాను
వర్ణింపు నిషధభూవరుని నోపితి వేని
        నీదోష మఖిలంబు నెడలుఁగాని
యుండు నీ విచ్చోట నూఱట నేఁ డెల్లి
        సురల కిప్డేమి వేగిరము వచ్చె?
నలునిరూపచ్ఛాయ దిలకించె నీ యందు
        హంస సూపినచిత్ర మాత్మఁ దలఁప


తే.

హస్తములు మోడ్చి వేఁడెద ననఘ! నిన్ను
మాను మిటఁబట్టి యే నీకు మాన్య నేని
పాకశాసనముఖ్యదిక్పాలవర్య
పాణిపీడనకార్యసంప్రార్థనంబు.

82


క.

ఈరీతి నాతలోదరి
సారతరసుధార్ద్రసారసప్రసవరసా
సారసరసోక్తిసరణి మ
హారాజకుమారునకు నుపాయన మొసఁగెన్.

83


ఉ.

మైత్రియుఁ బ్రేమయు న్మనసు మచ్చికయు న్మెఱయ న్వరాటరా
ట్పుత్రిక పల్కిన న్నిషధభూపతి దైవతకార్యకల్పనా
సూత్రము దప్ప నీకెలమి సొంపు మదిం దలకొల్పి చిత్రవా
క్చిత్రశిఖండినందనుఁడు చేడియ నల్లనఁ జూచి యిట్లనున్.

84


సీ.

హరి కల్పవృక్షంబుఁ బ్రార్థించి నినుఁ గోరి
        దివికి రావించిన దిక్కు గలదె?

సర్వకామద మైన సప్తతంతువున ని
        న్నగ్ని గైకొనిన నే మనఁగఁ గలదు?
తనయొద్ద నున్న వాతాపితాపనునిచే
        నిను నార్కివరముగాఁ గొనిన నెట్లు?
కాంక్షించి యడిగినఁ గామధేనువు నిన్ను
        ద్యాగంబుగా నీదె యంబుపతికిఁ?


తే.

గాన విను మేను జెప్పినక్రమము లెస్స
యతివ! వరియింపు వేల్పులయందు నొకని
భక్తి దివిజులచిత్తంబు పట్టకున్న
నంతరాయంబు పుట్టుఁ గార్యముల కెల్ల.

85


వ.

అని పలికిన నప్రతివిధానం బైనప్రియావాప్తివిఘాతంబున హృదయంబు గలంగిన.

86


సీ.

ప్రవిమలాక్షినభోనభస్యాంబుదములకు
        నవవృష్టిధారలై యవతరిల్లి
యాకర్ణదీర్ఘ త్రాంభోరుహములకు
        గమనీయనాళభావము భజించి
కలితకజ్జలత ముక్తాహారలతలలో
        హరినీలరత్ననాయకతఁ దాల్చి
లలితవక్షోజకుట్మలచుంబనంబున
        మధుపదంపతులసామ్యంబు వడసి


తే.

వేఁడియశ్రులు నిగుడంగ వెక్కివెక్కి
యేడ్వఁ దొడఁగె లతాంగి పృథ్వీశుమ్రోల
మృదులపరివేదనాక్షరోన్మిశ్రమధుర
కంఠకాకువికారకాకలిక యలర.

87

వ.

ఇట్లు గద్గదికానిరుద్ధకంఠనాళయై యబ్బాల యశ్రుకణంబులు కొనగోళ్ల మీటుచుం దల వాల్చి యేడ్చుచున్నం గనుంగొని దివిజోపకారకార్యప్రయోజనసంస్తంభితం బైన విప్రలంభవేదనాభరం బప్పు డుద్దీపితంబై భరింపం గొలఁది కాక విశ్వంభరావల్లభుండు మనంబున సంక్షోభించి విభ్రాంతుండై తన్నునుం దనవచ్చినకార్యంబునుం దన్ను బుత్తెంచిన వేల్పులను మఱచి యవస్థానవశంబున నుచితానుచితవివేకంబు దప్పుటయు భావనానిరూఢంబు లైనప్రియావిలాపంబులు వికల్పించుచు నిట్లనియె.

88


నలుఁడు దమయంతికిఁ దననామాదుల నెఱిఁగించుట

క.

ఏమిటి కేడ్చెద? వానన
తామరసం బెత్తి చూడు తరుణీ! నన్నుం
గోమలకటాక్షవీక్షా
దామకమున వీరసేనుతనయుని నలునిన్.

89


తే.

కాంత! యశ్రుబిందుచ్యుతికైతవమునఁ
దివిరి బిందుచ్యుతకకేలిఁ దవిలె దీవు
సారెసారెకు సాదుసంసారమును స
సారముగఁ జేయుచు మసారసారనయన!

90


వ.

చెలువ! చెక్కుటద్దంబునం జేయిడి యేల చింతించెద? వేటికిం బల్లవపాటలం బైనయధరంబు బీఁట లెగయ వేడినిట్టూర్పుగాడ్పులు నిగిడించెద? వేకతంబున గద్గదిక నొందెద? వేకారణంబున నశ్రుకణంబు లురుల నేడ్చెద? వీసంతాపంబునకు నేది హేతువు? దప్ప నాడంగదా! యాత్మనిహ్నవం బపరాధం బొక్కొ? శుద్ధాంత

ప్రవేశంబు దోసంబొ? దేవదూత్యంబు ప్రత్యవాయంబొ? చెప్పుము. సేవకులకుం దప్పు గలదే? కలదేనియుం గిరీటమాణిక్యమయూఖపుంజంబులఁ జరణకంజంబుల నివాళించెద, ననుగ్రహింపుము. కృపాదృష్టిదానంబునకు బద్ధముష్టివి గాకుము. వదనంబు వికసించుంగాక. హృదయంబు ప్రసన్నంబు గావలయు. సృక్వభాగంబుల మందహాసలవంబులు గందళించుం గావుత. భ్రూలతాంచలంబులు లీలాచంచలంబు లయ్యెడు, నపాంగప్రాంగణంబులం దరంగితంబు లగుకలికిచూపులు నాపయిం బొలయింపుము. బాష్పధారానృష్టివ్యపాయంబున దరహసితచంద్రికాలోకంబు ప్రకాశింపందగు మధురవచోమృతంబు చెవులకుం జవి జూపు, మాలింగనం బపేక్షించెదఁ, జుంబనంబు దయసేయుము. కుచంబులకుం బరిచర్య సేయనిమ్ము. నఖాంకురనవశశాంకరేఖాభ్యుదయంబు పయోధరోత్సేధశిఖరికూటంబున ఘటియింపంజేయ ననుమతింపు మని మన్మథోన్మాదంబునం బలికి యారాజమన్మథుండు.

91


తే.

కొంతదడ వివ్విధంబున భ్రాంతిఁ బొంది
యంత సంప్రాప్తసంస్కారుఁ డగుచు నాతఁ
డమరకార్యంబు విచ్ఛిన్న మగుటఁ దలఁచి
యంతరంగంబులోన నిట్లనుచు నుండె.

92


దూత్యము నెఱవేరమికి నలుఁడు చింతిల్లుట

క.

ఏమి యని తలఁతురొకొ సు
త్రామప్రముఖు లగుసుర లెదన్ నిఖిలాంత

ర్యాములు దమకార్యం బే
నీమెయి విభ్రాంతిఁ బొంది యిటు చెఱుచుటకున్?

93


క.

పేరు ప్రమాదవశంబునఁ
బేరుకొనుట కల్ల యయ్యె బృందారక కా
ర్యారంభోదయమున కది
యారూఢం బైనవిఘ్నమై ఫలియించెన్.

94


ఉ.

ఆదిఁ బరోపకారపరులై చరియించినయట్టి యాంజనే
యాదులఁ బోల నైతి నిపు డక్కట దైవతకార్యసిద్ధివి
చ్ఛేదము నొందె నేమి యని చెప్పుదు నింక నమర్త్యపంక్తి? కు
న్మాదులు సంఘటింపఁగ సమర్థులె యెందు సురాయబారముల్?

95


తే.

వగవ నేటికి? నే మన వచ్చు నిపుడు?
చేతనాహానిఁ గార్యంబు చిన్నవోయెఁ
జేతనాహాని దైవంబుచేత వచ్చె
దైవగతి దాఁటవచ్చునే దేవతలకు?

96


తే.*

అని విచారించుచుండె నయ్యవనినాథుఁ
డంతకును మున్న నలునిఁగా నతని నెఱిఁగి
యెదురుగద్దియ డిగ్గి పృథ్వీశతనయ
యవనికాంతరమున నోలమాసగొనియె.

97


క.

ఆనందబాష్పధారల
వానకుఁ బులకములయుద్భవమునకుఁ దగ న
మ్మానిని గదంబలతికకుఁ
దా నెచ్చెలి వోలె నుండెఁ దదవసరమునన్.

98

దమయంతిమాఱుగాఁ జెలియ నలునితో ముచ్చటించుట

వ.

ఇత్తెఱంగున నమ్మెఱుంగుఁబోణి తెరమఱుంగున నుండియు లజ్జావశంబునఁ బలుక నేరక సమయోచితంబు లగుభాషణబులు చెలికత్తియకుం గఱపి పుత్తేఱ నబ్బోటి నిషధరాజుం జేరి యి ట్లనియె.

99


తే.

అర్థిసాధారణమునకు నభయ మిత్తు
వజ్రపాతంబు ఘోరమై వచ్చినపుడు
నతనుపూఁదూపులకు భయం బందియున్న
నాకు నభయంబుఁ గృప నేయ నీకు బరువె?

100


ఆ.

ఆత్మకాండకారుఁ డగువసంతునకు నె
య్యంపుఁజుట్ట మైనయంగభవుని
నిండుమనిఁ దలంపు చండాలజాతిగా
వానికై యభీతిదాన మొసఁగు.

101


మ.

అనుచున్ సారఘసారసాగణికి నెయ్యంపుంజెలిం బోని తి
య్యనివాక్యంబున బోటి భీమసుతమాఱై యేర్పడం బల్కినన్
మన మాహ్లాదముఁ బొందుచుండగను భూనాథుండు గంభీరతన్
వినఁడయ్యెన్ సురరాజకార్యఘటనావిఘ్నంబు వాటిల్లుటన్.

102


వ.

చెలికత్తెయుం గ్రమ్మఱి దమయంతీసమీపంబునకు వచ్చె నప్పుడు.

103


నలదమయంతులు చింతిల్లుట

ఉ.

'నిక్కపుదూత గానిధరణీపతిముందట నేమి యంటినో
పెక్కులు మాట? లే' ననుచు భీమతనూభవ నెమ్మనంబునన్
స్రుక్కుచు నుండె నైషధుఁడునుం గడుజింత వహించె విన్ననై

‘యక్కట! దేవకార్య మిటు లాఱడిపోవునె’ యంచు నాత్మలోన్.

104


నలదమయంతులకడకు హంస వచ్చుట

ఉ.

ఆసమయంబునం గనకహంసము హంసపథంబు డిగ్గి యు
ద్భాసితకాంతి నల్దెసలఁ బర్వఁగ నచ్చటి కేగుదెంచెఁ జిం
తాసముపేతులై విగతధైర్యత నివ్వెఱఁగందియున్న యా
రాసుతు రాజకన్య ననురాగ మెలర్పఁగ నుద్ధరింపఁగన్.

105


వ.

ఏఁగు దెంచి పూర్వపరిచయంబున నుర్వీకాంతునిచేతను దమయంతిచేతను సంతోషసంభ్రమసహితంబుగా నుపలాలనంబు వడసి యమ్మరాళంబు నలుని కి ట్లనియె.

106


హంస సాంత్వనవాక్యములఁ బలుకుట

శా.

నీయంతఃకరణంబు నిర్మలము వర్ణింపంగ శక్యంబె నీ
భూయస్త్వంబు? జగత్ప్రసిద్ధములు నీపుణ్యప్రభావంబు లే
లా యీలాగునఁ జింత నొందెదవు? కార్యావాప్తి యౌఁగాదటే!
యాయింద్రాదులు నీనిజం బెఱుఁగరే యబ్జారివంశాగ్రణీ?

107


వ.

అని వైదర్భిం గనుంగొని.

108


తే.

అమ్మ! దమయంతి ! యంతరంగమ్ములోన
మాను సందియ మీతండు మగఁడు నీకు
నాఁడె దా నానతిచ్చినవాఁడు బ్రహ్మ
తద్వచనమున కన్యథాత్వంబు గలదె?

109


వ.

అని యయ్యిద్దఱ నుద్దేశించి దంపతులకు మేలు గావలయు, నుత్తరకర్మం బవిఘ్నం బగుం గాక, నాకును సరసిజాసను

ప్రసాదంబున సకలభూతాంతర్వర్తనంబులు దెలివి పడియుండు, నిప్పుడు చింతాభరంబులం గలంగిన మీయంతరంగంబులవిషాదం బపనయింప వచ్చితిఁ బోయివచ్చెద నని సముచితప్రకారంబున నయ్యిరువురిచేత సుజ్ఞాతుండై పతంగపుంగవుం డరిగెఁ దదనంతరంబ.

110


క.

కనకమరాళం బీక్రియ
ననుకంపను బుద్ధి సెప్పి యరిగినవెనుకన్
మనమునఁ జింతాభరములు
జనపతికి విలాసవతికిఁ జయ్యనఁ బాసెన్.

111


నలుని మనశ్శుద్ధి

వ.

అప్పుడు నృపాలుండు హేమమరాళసాంత్వనాలాపబలంబున నెట్టకేలకు మనంబునం జేవ దెచ్చుకొని దిక్పాలురం దలంచి నమస్కరించి యిట్లనియె.

112


ఉ.

భావములో నదంభ యగుభక్తికి సంతస మందుఁ డొండెనొం
డే విధియింపుఁ డిప్పుడ కడిందిగ దండము దప్పుగల్గె నే
నీవిరహానలంబునకు నిం కిట నేమియు నోర్వ లేఁ జుడీ
దేవతలార! మన్మథునితీవ్రశరంబులు గాఁడి పాఱఁగన్.

113


వ.

అనంతరంబ తిరస్కరిణీతిరోహితయై యుండి యక్కుండినేంద్రనందన రాజనందనున కిట్లనియె.

114


ఉ.

ఓరజనీకరాన్వయపయోధినిశాకర! యేఁ బతివ్రతన్
గూరిమీ మీఱ నొక్కరునిఁ గోరి వరింపఁగ నున్న వారి కె
వ్వారికి సిగ్గుగాఁ దలఁప వచ్చునె? నిన్ను వరింతు నెల్లి బృం
దారకులు న్నృపాలురును దక్కినవారును జూచుచుండఁగన్.

112

తే.

ఎల్లలోకధర్మంబులు నెఱిఁగియుండి
యేల సేయుదు రమరేంద్రు లీరసంబు?
నాది వారికి వందనం బాచరించి
తదనుమతి నిన్ను వరియింతుఁ దథ్య మిదియ.

116


నలునిమనశ్శుద్ధికి దేవతలు సంతోషించుట

మ.

అను చన్యోన్యము పెద్దయేనిఁ దడ వేకాంతంబున న్వారు వో
యినపోక ల్విను చంతరిక్షుగతులై యింతంతటం గానరా
క నిగూఢాకృతి నుస్న దేపతలు దత్కాలంబునన్ రాజనం
దను సంతర్హితుఁ జేసి చేరి రతఁడుం దారు న్నిజస్థానమున్.

117


తే.

నలునిదూతత్వ మిబ్బంగిఁ దెలియఁ జూచి
తన్మనశ్శుద్ధి నొంది రాత్మల ముదంబుఁ
దమ్ము నక్కాంత వరియింపఁ దలఁపు లేమి
ఖేద మందుచు నుండి రింద్రాదిసురులు.

118


స్వయంవరాగతవర్ణనము

వ.

అనంతరంబ కామరూపం బగునాసుత్రామాదిచతుష్టయం బుపాయాంతరంబున దమయంతి వరియింపం దలంచి వంచనానైపుణ్యంబున నలరూపంబులు ధరించి స్వయంవరకాలంబు ప్రతీక్షించుచుండిరి. నిషధరాజును భోజరాజాధికారపురుషనిర్దిష్టంబైన రమ్యస్థలంబున సపరివారుండై బృందారకానుమతి వడసి వసియించె. నయ్యవసరంబున.

119


మ.

చతురంగధ్వజినీసమేతు లగుచున్ శస్త్రవిద్యానిధుల్
రతిరాజప్రతిమానమూర్తులు శరద్రాకేందుబింబాననుల్
చతురంభోధిపరితవిశ్వనసుధాచక్రంబునం గల్గురా
సుతు లెల్లం జనుదెంచి రవ్విభవముం జూడంగ నొక్కుమ్మడిన్.

120

తే.

రాజవంశజుఁ డైయుండి రానివాఁడు
కామబాణంబులకు గుఱిగానివాఁడు
సప్తసాగరమధ్యభూచక్రమునను
నృషకుమారుండు లేఁడు పన్నిదమునకును.

121


క.

కొందఱు తరుణి వరింపం
గొందఱు బలిమిని హరింపఁ గొందఱు సూడన్
గొందఱు భూషింపను నృస
నందను లేతెంచి రుబ్బున న్మహమునకున్.

122


తే.

తిలలు పైనెత్తి చల్లిన దిగువఁబడని
యంతసందడి పెంద్రోవలందుఁ గలిగె
నఖలదేశంబులం దుండి యవనిపతులు
వైభవాలోకమునకును వచ్చుచుండ.

123


క.

తఱ చగుపెనుసందడిలో
నిటుకటమునఁ బడ్డనృపతి యీవగ్రహముం
దొఱఁగుట యభీప్సితార్థం
బఱచేతికి వచ్చినట్ల యని వెత కుడుచున్.

124


తే.

వెనుక ముందటిసమ్మర్దమునఁ గరంబు
దందసిలి మధ్యమున నున్నధరణివిభుఁడు
యంత్రసిద్ధార్థభావంబు నలమికొనియుఁ
దను నసిద్ధార్థుఁగా నాత్మఁ దలఁచుచుండు.

125


ఉ.

కోటిభుజంగపుంగవులు గొల్వఁగ వందిజనంబు ముందటం
జాటువు లుగడింప ఫణిసంభృతరత్నదిశావిభాసియై
వీటిజనంబు లెల్లఁ దను విస్మయ మొంది కనుంగొనంగఁ గ
ర్కోటకుఁ డేఁగుదెంచె మదఘూర్ణితపాటలనేత్రపద్ముఁడై.

126

మ.

ప్రమథాధీశభుజాంతరస్థలఘనప్రాలంబహారం బద
భ్రమనోజ్ఞాకృతి వచ్చె వాసుకి ఫణాపర్యంతమాణిక్యమం
జుమయూఖాంకురపుంజమంజులనభస్కుండై భుజంగాంగనా
సముదాయం బిరువంకఁ బాడఁగ యశస్సంగీతగాథావళుల్.

127


వ.

ఇంద్రాగ్నియమవరుణు లేతెంచిరి. తక్కినదిక్పాలురు రారైరి. యది యెట్టి దనిన.

128


సీ.

రాజునొజ్జలమంత్రరక్షాబలంబున
        రాఁబొందు గా దయ్యె రాక్షసునకు
దమయంతితోడ నేత్రస్పర్ధకతమున
        నిజవాహనము రామి నిలిచె గాలి
తనరూపు కైలాసదర్పణంబునఁ జూచి
        వ్రీడఁ గుబేరుఁ డిల్వెడలఁ డయ్యె
నర్ధనారీశ్వరుం డగుట నీశానుండు
        సామేనియంకిలిఁ జాఁగకుండెఁ


తే.

దాను వహియించుధాత్రి కెవ్వానిఁ బెట్టి
వచ్చునటుగాన శేషుండు వచ్చు టుడిగె
ముదిసి ముప్పునఁ బెండ్లికై మొగమువేల్పు
దగవు గాదని రాఁడయ్యెఁ దాత వేల్పు.

129


తే.

ఇట్లు త్రైలోక్యవాసులు నేఁగుదెంచి
రమ్మహోత్సవమునకు నయ్యవసరమునఁ
బ్రసవసాయకనారాచపక్షజాల
మహితవాతూలతూలాయమాను లగుచు.

130


వ.

అప్పుడు కనకమయరమ్యహర్మ్యనివేశంబులం గ్రథకైశికాధీశ్వరుండు విడియింప నభినవాభ్యాగతు లగుమూఁడులోకం

బులరాజులును విడిసిరి, యారాజసమాజంబు గుండిననగరంబునందుఁ బుండరీకాక్షుజఠరంబునందు భువనత్రయంబు గుంభసంభవుహస్తాంభోరుహంబునందు నంభోధిచతుష్టయంబును బంచాక్షరంబునందుఁ బరమేశ్వరుండునుం బోలె నసంబాధంబై యుండె. నానావిచిత్రచిత్రంబు లగుపురభవనభిత్తిభాగంబులతోడి ప్రతిస్పర్ధం బోలె నాకాశభాగంబు మూర్థాభిషిక్తమకుటరత్నప్రభాభారంబులచేతఁ గిమ్మీరితం బయ్యె, నమహోత్సవాడంబరం బవలోకింప నంబరంబునఁ బీతాంబరత్ర్యంబకులు దేవతాకదంబంబును గొలువఁ గొల్వుండిరి. కందళితహృదయారవిందం బైనసనకసనందనాదియోగీంద్రబృందంబును మందపాలబకదాల్భ్యరైధ్యకభరద్వాజగౌతమప్రభృతిమహర్షిసందోహంబును దగిననెలవుల నుండి విలోకించుచుండె. సముత్తుంగమంగళమృదుమృదంగనినాదభంగీతరంగితసంగంబై విబుధవారాంగనాజనంబు నభోరంగంబునఁ బ్రవర్తించె. వెండియు.

131


చ.

మగువలు భూమిపాలురకు మాటికిమాటికి వైచుకుంచెల
న్నెగసినమారుతౌఘములు నిర్భరసౌరభసంప్రదాయ మిం
పుగ నధివాసధూపములఁ బ్రోది యొనర్చుచు నిచ్చె నర్చనల్
గగనమున న్మహోత్సవముఁ గన్గొన వచ్చి దేవపంక్తికిన్.

132


తే.

అల్లనల్లన వీచె మంచాంతరములఁ
జంచదవనీంద్రచయచంద్రచందనామ
లేపవైపథ్యకుసుమమాలాపరాగ
గంధవహ మైన చల్లనిగంధవహము.

133

సీ.

పైపై మహాశ్చర్యపర్యుత్సుకంబు లై
        తమమీఁద నృపులనేత్రములు వ్రాల
నలినాప్తుసన్నిధి నక్షత్రములువోలె
        రాజులు దనమ్రోలఁ బ్రభలఁ దొఱఁగ
నఖలలోకమనోజ్ఞయై యొప్పుతనమూర్తి
        చిత్తసంభవు నైన సిగ్గుపఱుపఁ
దనప్రాభవము దేవతాకోటి నైనను
        బాణిపద్ముమలు మోడ్పంగఁ జేయ


తే.

వలపు మిగులఁ బరంపరావరణయోగ్య
రమ్యశృంగారకలితుఁ డై రాజవీథి
నల్ల నేతెంచి యొక్కసింహాసనంబు
నధివసించెను నలుఁడు మంచాగ్రభూమి.

134


తే.

కదిసి పరిపాటి మణిమంచకములమీఁద
రాకుమారకులై యున్న నాకవిభులు
నలునియమకంబు లై యున్కిఁ దెలియఁ జూచి
తారు నవ్వేళ నలరూపధారు లైరి.

135


ఉ.

ఈసకలంబునం గలమహీపతివర్గము నున్న నుండనీ
యాసభ యొప్పె నప్డు నిషధాధిపుచేతఁ జతుర్దిగీశిచే
వాసవలోకదివ్యవనవాటికి సర్వనగాఢ్య యయ్యు ను
ద్భాసితలక్ష్మి నొందున కదా యలకల్పకపంచకంబుచేన్.

136


వ.

ఇవ్విధంబున సుమేరుభూధరకూటసన్నిభంబు లగుహాటకమంచకంబులమీఁదఁ గర్కోటక వాసుకి ప్రభృతు లగుపాతాళభువనవాసులును మేధాతిథిప్రధాను లగువసుధాలోకవాస్తవ్యులును పాకశాసనపరేతరాజముఖ్యు లగు

త్రివిష్టపనిలయులును సుఖోపవిష్టులై యుండుటఁ గనుంగొని సంతుష్టాంతరంగుండై భీమభూపతి తనడెందంబులోన నీయున్నయందఱు బృందారకసంకీర్తనీయచరిత్రులు వీరికులశీలనృత్తవిభవంబు లెఱింగి వర్ణించి దమయంతికిం జూపి చెప్పం త్రైలోక్యజనని నిత్యప్రగల్భవాచాలభగవతి భారతీదేవిదక్కం దక్కినవారు నేర రని విచారించి యమ్మహాదేవి నిట్లని ప్రస్తుతించె.

137


భీమరాజు సరస్వతీదేవిం బ్రార్థించుట

దండకము.

జయజయ జనయిత్రి! కల్యాణసంధాత్రి! గాన్ధర్వవిద్యాకళాకణ్ఠనాళం, త్రివేదీవళీం సారసాహిత్యసౌహిత్యనిర్వర్తితప్రోల్లసద్దృక్తరఙ్గా, మనేకాభిచారక్రియాహోమధూమావళీమేచాకాథర్వణామ్నాయరోమావళిం; కల్పశిక్షాక్షరాకల్పసాక్షాచ్చరిత్రాం నిరుక్తప్రియోక్తిం, భుజద్వంద్వతా మశ్ను వానేనసంశోభితాంఛన్దసా జాతివృత్తప్రభేదప్రభిన్నేన, విద్యామయీం త్వాం భజే. భగవతి! గుణదీర్ఘభావోద్భవాం సంతతిం సందధానం మహాశబ్దనిష్పాదవాక్యక్రియాశాస్త్రకాజ్చీకలాపం కటీమణ్డలే బిభ్రతీం, జ్యోతిషాహారదణ్డేన తారోదయస్ఫూర్తి విద్యోతమానేన విభ్రాజితా మాత్మ పక్షానురాగాన్వితాభ్యా ముభాభ్యాం పూర్వోత్తరాభ్యాం మహాదర్శనాభ్యాం ప్రతిష్ఠాపితోష్ఠప్రవాళాం, పరబ్రహ్మకర్మార్థభేదా ద్విధాయ ద్విధా స్వం శరీరం ప్రతిష్ఠాం పరాం ప్రాప్తయా చారుమీమాంసయా మాంసలేనోరుయుగ్మేన సమ్యక్పరాచ్ఛాదనంలాలయన్తీం, ముహుఃపత్త్రదానే గుణాన్వీత పూగాసకృత్ఖణ్డనప్రౌఢి మాఢౌకమా

నేన దన్తాత్మనా తర్కతన్త్రేణ కామవ్యభిఖ్యాంముఖే ఖ్యాపయన్తీం, ధ్రువం దేవి! వన్దేతమాం త్వామహమ్. ద్రుహిణగృహిణి! మత్స్యపదాదిసంలక్షితం పాణిపద్మం త్వదీయం పురాణం, శిరస్తావకం నిర్మలం ధర్మశాస్త్రం, దలాభ్యాం భ్రువావోం క్రియామన్త్ర రాజస్య, తద్బిన్దునాచిత్రకం ఫాలభాగేతదర్ధేన్దునా తే విరిఞ్చిర్విపఞ్చీకలక్వాణనాకోణచాపం ప్రణిన్యే స్వయమ్. భవతు మమ సదా శుభం భారతి! త్వత్ప్రసాదాదసాధారణాతృత్కృపాధారభూతం ప్రభూతమ్. నమస్సోమసిద్ధాన్తకాన్తాననాయై, నమశ్శూన్య వాదాత్మ మధ్యాన్వితాయై! సువిజ్ఞానసామస్త్యహృత్పఙ్కజాయై, నమస్తే౽స్తు సాకారతాసిద్ధిభూమ్నే, నమస్తే౽స్తు కైవల్యకల్యాణసీమ్నే, నమస్సర్వగీర్వాణచూడామణిశ్రేణిశోణ ప్రభాజాలబాలాతపన్మేరపాదామ్బుజాయై, నమస్తే శరణ్యే, నమస్తే వరేణ్యే, నమశ్శర్మదాయై, నమశ్శాశ్వతాయై, నమో విశ్రుతాయై, నమశ్శారదాయై, నమస్తే నమస్తే నమః.

138


వ.

అని ప్రస్తుతించిన.

139


సరస్వతీసాక్షాత్కారము

మ.

జగతీనాథుని ముందట న్నిలిచె సాక్షాత్కారముం బొంది యా
జగదేకస్తవనీయ శారద శరచ్చంద్రాతపాలోకము
న్నగవుం దేటయు దివ్యదేహరుచియున్ సమ్మేళనం బొంది చె
ల్వగుచుండన్ గరుణాపరాయణత నయ్యాస్థానమధ్యంబునన్.

140


ఆశ్వాసాంతము

శా.

లాటీచిత్తసరోమరాళ! కుకురీలావణ్యలోలాత్మ! క
ర్ణాటీనృత్త్యకళావిలోకనసమారంభప్రియంభావుకా!

భోటీనేత్రచకోరచంద్ర! మగధీపుష్పాస్త్ర! చోళీకుచా
ఘాటస్థాపితమన్మథాంక! కుహళీగాఢాంకపాళిప్రియా!

141


క.

మందారమంజరీమక
రందసుధామాధురీధురాధుర్యవచ
స్సందర్భరూపరేఖా
కందర్పా! పాండ్యరాజగజపంచాస్యా!

142


మాలిని.

హరిచరణసరోజధ్యాననిష్ఠాగరిష్ఠా!
ధరణిభరదిధీర్షాధఃకృతాహార్యవర్యా!
తరుణకమలనేత్రా! తల్లమాంబాసుపుత్త్రా!
విరహితమదశంకా! వీరనారాయణాంకా!

143


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బయినశృంగారనైషధకావ్యంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. 'కలికి నవ్వు ప్రగల్భతాకారణంబు' అని పా.