శృంగారనైషధము/పంచమాశ్వాసము

శ్రీరస్తు

శృంగారనైషధము

పంచమాశ్వాసము

శ్రీపాదాంభోరుహసం
స్థాపితమణిమకుటకటకఝళఝళనినదా
టోపవికంపితవిమత
క్ష్మాపాలకులాంతరంగ! మామిడిసింగా!

1


వ.

ఆకర్ణింపుము.

2


తే.

అట్లు సాక్షాత్కరించిన యఖిలజనని
భారతీదేవిఁ జూచి భూపాలకుండు
నమ్మహాస్థానమున నున్నయఖిలజనులు
చేతులెత్తి ప్రణామముల్ చేసిరర్థి.

3


వ.

అప్పుడు భోజరాజు తత్కాలవేద్యంబులగు శకునస్వరాదులయానుకూల్యం బెఱింగి నిజతనూజ నమ్మహాదేవికి నప్పగించువాఁడై యంతఃపురపరిచారికాజనంబుల నియోగించిన.

4

దమయంతి స్వయంవరాస్థానమున కేతెంచుట

సీ.

అఖిలదిగ్దేశరాజాకర్షణక్రియా
        మహనీయతరసిద్ధమంత్రవిద్య
యాకారరేఖాసమభ్యుత్థితానన్య
        సాధారణాశ్చర్యజలధివేల
నేపథ్యహీరప్రభాపూరనిర్మల
        వారిబింబితనిజస్వచ్ఛకాంతి
సంకల్పభవదూతసదృశకర్ణాకల్ప
        కల్హారసౌరభాగతమదాలి


తే.

బహువిరోధిమణిప్రభాపల్లవాగ్ర
మల్లసంగ్రామఖురళికామండలాయ
మాననానాపరిష్కారమహితగాత్రి
మనుజపతిపుత్త్రి యాస్థానమునకు వచ్చె.

5


తే.

అతివపీతాపదారుణాసితమణి
దీప్తికల్పితదేహోపదేహ యగుచు
సారగోరోచనాగంధసారఘుసృణ
మృగమదాలేపపునరుక్తి మేలుకొలిపె.

6


సీ.

కర్పూరకస్తూరికాప్రవాహంబులు
        ప్రవహింప లోచనప్రాంగణములఁ
గించిద్దిగంబరీకృతరదద్యుతిపెంపు
        పలుకుబోటికి నైన బ్రాఁతి గాఁగ
భూషామణివ్యాజమున నంగకంబుల
        జనులచూపులు వినిశ్చలత నిలువ

మహనీయలావణ్యమధువు నెమ్మనముల
        నాకంఠముగఁ గ్రోల నవనిభుజులు


తే.

నలుఁ బ్రసూనచాపంబున గెలువలేని
యంగభవునకు శక్రబాణాసనంబు
బహువిభూషణరత్నశోభామిషమునఁ
దాను గల్పించుచంద మందంబు నొంద.

7


మహాస్రగ్ధర.

చతురత్వం బొప్పఁగా నప్సరస లుభయపార్శ్వంబుల బాడుచున్ రాఁ
జతురంతస్వైరయానస్థ యయి తరుణి యాస్థానముం జొచ్చి వచ్చెన్
శతపత్త్రాక్షీకరాబ్జోచ్చలితధవళరుక్చామరాళీమరాళీ
కృతలీలాలాస్యకేళీకిసలయితకలాఖేలనం బొప్పు మీఱన్.

8


రాజులు దమయంతిసౌందర్యమున కచ్చెరు వందుట

సీ.

దవ్వుదవ్వులఁ గన్ను తనివి పోవఁగఁ జూచి
        పరమాద్భుతం బాత్మఁ బాదుకొల్పి
సకలాంగకంబులు జాదుకోఁ బులకించి
        చే యొకించుక యెత్తి చిట్ట మిడిచి
కదియ నాసాశిఖాగ్రమునఁ దర్జని మోపి
        మూర్ధంబు గంపితంబుగ నొనర్చి
కడఱెప్ప లొరయంగఁ గనుఁదమ్ము లరమోడ్చి
        బొమదోయి యొక్కింతపొడవు సేసి

తే.

లలనసౌందర్యరేఖావిలాసమునకు
నిచ్చ మెచ్చనిరా జొక్కఁడేని నరిది
యమ్మహాస్థానమున నున్న యఖిలవార్ధి
వలయితాశేషమేదినీశ్వరులయందు.

9


వ.

ఇట్లు రాజులు పరమాశ్చర్యంబు నొందుచు నంతర్గతంబున.

10


తే.

తరుణివదనంబు సాక్షాత్సుధాకరుండు
లలి నభంబు శశాంకుండు లాక్షణికుఁడు;
ముఖ్య మగుకామచాపంబు ముదితబొమలు
పువ్వు గుణమాత్రవృత్తి సద్బుద్ధి దలఁప.

11


చ.

మడవక ముష్టియోగ్య మగుమధ్యముతో నెలవంక యైన య
ప్పడఁతుక భ్రూలతాధనువు పట్టి మనోభవుఁ డింత నుండియున్
విడుచున కాని మానఁ డిది నిక్కము షట్పదపీటజుష్టమై
యుడుగక కమ్మధూళినుసి యొల్కుచు నున్నపురాణచాపమున్.

12


తే.

మగువ తాటంకయుగ్మంబు మన్మథునకు
లక్ష్యయుగ్మంబు గాబోలు లలిఁ దలంపఁ
గడఁగి సవ్యాపసవ్యమార్గణము లేయ
నైనరంధ్రంబు గాదె తదంతరంబ?

13


క.

రతిపంచబాణజాయా
పతికేళీసౌధశిఖరిపర్యంతసమం
చితకాంచనకలశము లీ
శతపత్త్రదళాయతాక్షి చారుస్తనముల్.

14


క.

ఈసుదతి శిరీషకుసుమ
కేసరసుకుమార దీనిఁ గృతమతి నెమ్మైఁ

జేసె నొకో నలువ కుశా
ధ్యాసకఠోరంబు లైనహస్తాగ్రములన్!

15


క.

చనుఁగవ ఘనమో జఘనము
ఘనమో యని నడిమిచక్కిఁ గమిచి విధి గరం
బునఁ దూచె దీనిఁ గాకి
ట్లనువుపడునె వళులపేర నంగుళిరేఖల్?

16


సరస్వతి దమయంతికి వరణీయుల వర్ణించుట

వ.

అని ప్రస్తుతించుచుండ ఘంటాపథంబున నేగుదెంచి యమ్మచ్చెకంటి తండ్రిపంపునఁ జతురంతయానంబు డిగ్గి భారతీదేవికిం బ్రణామంబు సేసిన.

17


క.

ఆశాస్యము లైనయనే
కాశీర్వాదంబు లొసంగి యఖిలేశ్వరి లో
కైకకుటుంబిని శారద
యీశశిబింబాస్యమౌళి నక్షత లిడియెన్.

18


వ.

ఇట్లు దీవించి చతురంతయానం బెక్క ననుజ్ఞ ప్రసాదించి.

19


తే.

అవనిపతికన్యచతురంతయానమునకు
దక్షిణపుదిక్కునం దుండి దయ దలిర్పఁ
బలికె సనకాదియోగీంద్రభావ్యమాన
చరణపంకజ యైనయాసరసిజాక్షి.

20


దేవతలు

ఉ.

తొయ్యలి! వీరె వేలుపులు తూర్పున ముప్పదిమూఁడుకోటు లీ
యయ్యల వేఱువేఱ గొనియాడఁగఁ బట్టుసహస్రవర్షముల్
నెయ్య మెలర్ప నిందొకరిన్ వరియింప దలంచితేని యా

దయ్యమునెత్తికోలు తుది దాఁకుట గాదె సరోజలోచనా!

21


క.

సంతానవాటికలునుం
జింతామణి వేదికలును సిద్ధరసధునీ
సంతానంబులు వీరికి
గాంతా! విశ్రాంతికౌతుకస్థానంబుల్.

22


క.

అనిమిషత నిన్నుఁ జూడఁగ
నినుమడి యగు నెట్టు లొకని కీ వేల్పులలో
విను మమృతాస్వాదనమును
నినుమడి యగుఁ గాక యధర మీ వొసఁగంగన్.

23


వ.

అనిన విని యబ్బాల కేలుదోయి మొగిడ్చి ఫాలంబునం గీలు గొలిపి వేలుపులకు వందనం బాచరించె, నప్పుడు శిబికాధరస్థు లగుపురుషులు సమాసన్ననాయకముఖవిషాదానుమేయం బగుదమయంతిమనోవిరాగం బెఱిఁగి ప్రావృషేణ్య పయోవాహంబులు రాజహంసావలిం బల్వలాంతరంబులవలనం బాపి మానససరోవరంబునుంబోలె మాంజిష్ఠమంజిమవిగాహిపదోష్ఠలక్ష్మి యగునయ్యంగన భుజంగపుంగవు గదియం గొనివచ్చిరి. కంజభవుభామయు నప్పద్మదళాక్షికిం బన్నగాధ్యక్షునిం జూపి యి ట్లనియె.

24


వాసుకి

క.

పరిరంభలగ్నగిరిజా
సురుచిరకుచఘుసృణపట్టసూత్రాంకముతోఁ
దరలాక్షి! వీడు చంద్రా
భరణునఱుత బ్రహ్మసూత్రపదవి భజించెన్.

25

తే.

పాణికంకణమై యోగపట్ట మయ్యు
గంధగజయాన కోటీరబంధ మయ్యు
వింటికిని నారియై పెక్కువిధములందు
భూతభర్త భజించు నీభుజగవిభుఁడు.

26


తే.

హరజటాజూటచంద్రరేఖామృతంబు
సబల! నీదగుదంతచ్ఛదామృతంబు
సమముగా రెండు జిహ్వలఁ జవులు సూచి
నేర్చుఁబో వీఁడు చవివాసి నిశ్చయింప.

27


ఉ.

భావజకేళివైభవముపట్టున నీచిగురాకుమోవి యా
శీవిషనాయకుం డితఁడు సేవ యొనర్చు టనర్థకారి గా
దోవనజాక్షి! యయ్యమృత మున్నది నీయధరంబులోన నే
లా వెఱవన్ సుధారసమునందు విషంబు పరిస్ఫురించునే?

28


చ.

ఫణఫలకంబు విచ్చి కడుఁ బ్రన్ననిమే నెగయంగఁ జేయుచు
న్మణిమయపీఠమధ్యమున నాల్కలు గ్రోయుచు నున్న వాసుకిన్
ఫణికులసార్వభౌముఁ గని భామిని మైఁ బులకించు భావుకుల్
ప్రణయవికారమో భయముభంగియొ యంచు మదిం దలంపఁగన్.

29


తే.

తమ్ము వరియింప కునికి దీర్ఘమ్మురోఁజు
నహులఁ గ్రేడించి నడచిరి యానధరులు
దీర్ఘనిశ్వాసధారాప్రతీపపవన
వికటహాహానినాదాపశకునశంక.

30


తే.

ప్రకటమందాక్షసంకుచత్ఫణము లైన
యురగములయొడ్డు వాపి యయ్యుత్పలాక్షి

యానధుర్యులు గదియించి రవనిభుజులఁ
గాల మలిఁ దమ్మిఁ బాపి చెంగలువఁబోలె.

31


పుష్కరద్వీపాధిపతి

వ.

అప్పుడు పలుకుబోటి వరాటరాజకన్యకం గనుంకొని.

32


ఉ.

ధీరతఁ బుష్కరాదు లగుదీవుల నన్నిటనుండి వచ్చియు
న్నారిదె శీతభానుదిననాయకవంశజు లైన రాజబృం
దారకు లిమ్మహారథులఁ దప్పక యిందఱిఁ జూడ వమ్మ! శృం
గారరసైకసర్గరసికద్వ్యణుకోదరి! యాదరంబునన్.

33


తే.

తరుణి! నిస్తంద్రపుష్కరదళనిభాక్షి!
పుష్కరద్వీప మేలు నీభూభుజుండు
నిర్మలస్వాదుసలిలాంబునిధివిహార
మతివ! యీతండు నీవును నాచరింపు.

34


క.

భౌమ మగునాకభువనము
భామిని! సావర్తభావభవదద్భుతనా
భీమండల! యీనృపసు
త్రాముఁడు పాలించుదీవి ప్రథితవిభూతిన్!

35


శా.

అందుండున్ హిమవారిశీతలతలన్యగ్రోధవీథిన్ శతా
నందుం డంబుజదివ్యమందిరములోనం గర్ణికాపీఠికన్
సందర్శింపఁగ వచ్చి యున్ననిను నాసర్వేశుఁ డీక్షించి యా
నందంబు న్మది నొందుఁగాక నిజనానాశిల్పవైచిత్రికిన్.

36


క.

ఆవటమహీరుహం బా
దీవికి ఫలపత్త్రచిత్రదీప్తిస్ఫురణన్
భూవల్లభవరనందన
భావింపఁగఁ బించెగొడుగుభంగి భజించున్.

37

వ.

అని పలికి భ్రూవల్లరీవేల్లనవికారంబు చూచి యప్పల్లవాధర యతనినొల్లమి
యెఱింగి యద్దివ్యాంగనాతిలకంబు.

38


తే.

లలన! పొ మ్మవ్వలికి నంచుఁ బలుకుటయును
బుష్కరద్వీపపతియాస్యపుష్కరమునఁ
దదనవాప్తిజఘనపరితాపవహ్ని
చిహ్న మగుకార్ష్ణ్యధూమ మీక్షింపబడియె.

39


శాకద్వీపాధిపతి

క.

రాజాంతరాభిముఖ మా
రాజముఖి విమానవాహరయమునఁ జనుడున్
రాజీవగర్భుగేహిని
భోజకులాభరణ మైన పొలఁతుకతోడన్.

40


వ.

ఒక్కరాజుం జూపి యి ట్లనియె.

41


క.

ఏకాతపవారణముగ
శాకద్వీపాంతరంబు సర్వముఁ బుణ్య
శ్లోకుఁ డితఁడు పాలించు ని
శాకరముఖి! హవ్యుఁడండ్రు, జనపతి నితనిన్.

42


క.

రమణి! రమణీయతనుతా
వమతాతను నతనుకీర్తివైభవు నితనిన్
గమల గమలాక్షుఁబోలెన్
బ్రమదం బారఁగ వరింపు పరికించి తగన్.

43


తే.

వీనిఁ గులశీలశాలి శాలీనతాన
తంబు నాననచంద్రబింబంబు నెత్తి
బాల! వీక్షింపు మేచకోత్పలపలాశ
మాలికలఁ బోలులలితదృగ్జాలకముల.

44

సీ.

అతినిర్జరేశ్వరంబై యనశ్వర మైన
        యైశ్వర్యమున రాజ్య మనుభవింపు
చంచచ్ఛుకచ్ఛదచ్ఛాయాశ్రయం బగు
        శాకవృక్షమునీడఁ జలుపు క్రీడ
పాలమున్నీటిలో ఫణిరాజశయ్యపై
        బవ్వళించిన శార్ఙ్గపాణిఁ గొలువు
పొడుపుగుబ్బలిమీఁదఁ బూర్ణిమారాత్రులం
        దొనరింపు చంద్రాతపోత్సవంబు


తే.

లలఘుసైనికసంఖ్యసంఖ్యాగ్రవిజిత
దానవానీకుఁ డైనయీధరణివిభుని
లలితసౌభాగ్యరేఖాకళావిలాస
శక్తిభర్త్సితమత్స్యలాంఛనునిఁ గూడి.

45


ఉ.

వావిరి దుగ్ధవారిధి యవశ్యము నీవిలసత్కటాక్షవీ
క్షావికటాయితంబు ననిశంబు నొనర్చుచు నుండుఁ గాక వే
లావనవాటికాతరుపలాశతతిప్రతిబింబచుంబినా
నావిధనిర్మలోర్మినటనస్ఫుటచారిమచాపలంబులన్.

46


తే.

అమృతమధురంబు లగుగాడ్పు లాని యాని
బొజ్జఁ బెంచిన పెనుఁబాఁపసెజ్జమీఁదఁ
బద్మలోచన! యీమహిపాలుఁ డేలు
పాలమున్నీటిలో శౌరి పవ్వళించు.

47


తే.

లలితకాశ్మీరభవసమాలంభకర్మ
పాటలం బైనముఖాబ్జంబుతోడ
నొరయుఁగాక భవత్కేళి యోగ్యమైన
పొడుపుగుబ్బలిఁ బొడతెంచి పూర్ణవిధుఁడు.

48

క.

లీలాసంక్రమవేళం
బాలా! నీచరణలాక్ష ప్రథమాద్రిశిలా
జాలములఁ గృతకగైరిక
బాలాతపశంక లనువుపఱుచుంగాతన్.

49


వ.

అని పలికి యప్పుడు గంధవాహులుంబోలె విమానవాహులు లబ్ధగుణప్రసిద్ధియగు నాలలనాలలాము బరిమళలక్ష్మినిం బోలెఁ బ్రదేశాంతరంబునకుం దోడ్తేర నవ్వాఙ్మయదేవత హేమోపమేయతనుకాంతియుం గురువిందసకాంతిదంతియు నగునయ్యింతి కి ట్లనియె.

50


క్రౌంచద్వీపాధిపతి

క.

మహిళాలలామ! బాహా
బహువారనివారితారిపార్థివు నితనిన్
జహదజహల్లజ్జాసం
గ్రహదృగ్జాలములఁ జూడు క్రౌంచాధిపతిన్.

51


తే.

మండలాకారవేష్టనాఖండవితత
పాండుదధిమండపాథోధిమండితంబు
పడఁతి యేతద్భుజాదండపాలితంబు
క్రౌంచ మనుదీవి సుగుణసంఘములనీవి.

52


క.

దర్భదళపూజనంబుల
గర్భజనిక్లేశ ముడుపు కరుణాభరణున్
నిర్భరమతి సేవింపు వి
దర్భాధిపతనయ! యచటఁ దరుణేందుధరున్.

53


తే.

అబల! పాదార్పణానుగ్రహమున నిన్నుఁ
బ్రార్థనము సేయఁగలదు క్రౌంచాచలంబు

పటుతరస్కందబాణసంపాతవివర
కలితనిర్గమకలహంసకలకలముల.

54


క.

ఘటియింపు మచట హాటక
ఘటకోటివతంసకములు గా ధూర్జటికిన్
గుటిలాలక! కలధౌత
స్ఫటికశిలామయము లయిన ప్రాసాదంబుల్.

55


చ.

పొలఁతి! లలి న్మలిమ్లుచులపోలిక నీరతికేళిజన్మని
ర్మలతరఘర్మబిందుమయమౌక్తికమండనముల్ హరించుఁ గా
కలసగతిన్ జలద్దధిరసాంబుధితుంగతరంగమాలికా
పలిపృషతచ్ఛటాచమరవాలకరంబితమారుతౌఘముల్.

56


తే.

జాలపాదవేషంబు వేశంతజాల
లంఘనాభ్యాసభవ మైనలాఘవమున
సాగరంబులు దాటి దిక్సమితిఁ గడచుఁ
గమలలోచన! యారాజువిమలయశము.

57


వ.

అనిన విని యాగంధగజగామిని నిజహృదయానుబంధం బవ్వసుంధరాధిపునియందు సంధింప దయ్యె, నది దైవవశం, బప్పు డంసావతంసశిబికాంశు లగుపురుషు లప్పురుషప్రకాండునిసమీపంబువలన రత్నాకరంబువలనం దుషారమయూఖలేఖలేఖానుజీవి పురుషులుంబోలెఁ గొని చని గిరీశప్రభావుం డగునొకమహానుభావుం గదియించిరి. తత్సమయంబున నఖిలజగదంచితపాదపద్మ యగు నప్పద్మసంభవుగేహిని యవ్వరారోహ కి ట్లనియె.

58

కుశద్వీపాధిపతి

చ.

నవవిదళత్కుశేశయసనాభిశయద్వయ! యివ్వసుంధరా
ధవుఁడు కుశాంకితం బగు ప్రధానపుదీవి కధీశుఁ డీతనికిన్
దివుటఁ బరిగ్రహించి సముదీర్ణవసంతసమాగమంబులం
దువిద! యనుగ్రహింపుము ఘృతోదధితీరవనీవిహారముల్.

59


మ.

పటువాతూలతరంగడోలనచలత్పత్త్రాసిధారాపరి
త్రుటితాంభోధరగర్భనిస్సృతపయస్స్రోతశ్ఛటాసేచన
స్ఫుటసంవర్ధిత మభ్రచుంబిశిఖరాభోగం బతిస్వచ్ఛ మ
చ్చట నీకుం గనుపండు వయ్యెడుఁ గుశస్తంబంబు బింబాధరా!

60


శా.

ఆనందంబునఁ బొందు మిందునిభవక్త్రా! మందరక్షోణిభృ
న్నానాకంచరమందిరాంగణములన్ యాదోధిమాథానుసం
ధానప్రోత్థితసింధురాడ్దుహితృపాదన్యాససంభావనా
పౌనఃపున్యపవిత్రకాంచనశిలాపర్యంతభాగంబులన్.

61


తే.

కనకకేతకదళగోత్రగాత్రయష్టి
వ్యాళతనుఘృష్టికృతవలీవలయ మగుట
మహితసోపానమునుబోని మందరాద్రి
యింపుఁబుట్టించుఁగాత మీయిద్దఱకును.

62


తే.

ప్రకటఫణివేష్టిఘృష్టిమార్గములు డిగ్గి
మలఁకలై పాఱు నిర్ఝరామలజలంబు
పాఁపతరిత్రాఁడు పెనఁగొన్నభావ మొంద
మగువ! నీకింపుఁ బుట్టించు మందరాద్రి.

63


ఉ.

నీవదనంబుచేత రజనీపతి నీచనుదోయిచేత నై
రావణకుంభయుగ్మము సురద్రుమపంచకకోమలప్రవా

ళావళి నీకరాంఘ్రియుగళాధరపల్లవరాగలక్ష్మిచే
భావన సేయుఁ బో మథనపర్వత మింతి? భవత్ప్రసంగతిన్.

64


వ.

అనిన విని యక్కలహంసగమన మీమాంస శిశిరకరావతంసునింబోలె నవ్విపులాంసుని భజియింప నాసింప దయ్యె, నవ్వైదర్భితలం పెఱింగి యాచతుర్భుజునికోడలు గనుసన్న సేయ జన్యజనం బక్కన్య నన్యరాజన్యసమీపంబు నొందించె, నప్పుడు భారతీదేవి దమయంతి కి ట్లనియె.

65


శాల్మలిద్వీపాధిపతి

తే.

చపలలోచన, వైరినిష్కృపకృపాణ
పాణి ప్రత్యరఫాణితప్రతిమవాణి
వీఁ డధీశుండు శాల్మలద్వీపమునకు
లలితమధువార్ధి కాంచీకలాపమునకు.

66


క.

ఆసవజలనిధినాయకు
వాసవసన్నిభు విశుద్ధవంశజు నితనిన్
వాసికి నవతిలసుమనో
నాసికి యెదిరింప వశమె నరనాథులకున్.

67


ఉ.

ఈసున నేకహేలన మహీసురుఁ డొక్కరుఁ డొక్కవార్ధి యా
పోసన మెత్తుచో దిగులు పుట్టి పయోనిధిపంచకంబు నం
త్రాసము నొందునప్డు మొగతప్పని యంబునిధానమెద్ది యం
దాసవపానకేలిఁ గొనియాడు మితండును నీవు నెమ్మదిన్.

68


క.

ఏలాలతాగృహంబుల
బాలా విహరింపు మీనృపాలునితోడన్

హాలారసమయసాగర
వేలావనముల నిదాఘవేలాదినముల్.

69


వ.

శాల్మలిగుల్మవాంఛితం బైనయమ్మహాద్వీపంబునకు దీపంబునుంబోలె నోషధీలతాజ్వాలాకలాపదీపితనభఃక్రోడంబును జూడామిళజ్జలదకజ్జాలంబునకు ద్రోణాచలంబు నీకు విహారస్థానం బగుంగాక సరససారసకోశమృద్వి యీతని నుద్వాహము గమ్ము.

70


ప్లక్షద్వీపాధిపతి

ఉ.

నావుడు లోచనాంతముల నవ్వె విదర్భతనూజ దాన ను
ద్భావిత మయ్యె నానృపతిపై ననురాగము లేమి యఫ్టు వా
గ్దేవి విమానవాహకతతిన్ నడపించెను వేఱ యొక్కపృ
థ్వీవరుఁ డున్నపట్టునకు వేడుక యుల్లమునం దలిర్పఁగన్.

71


వ.

ఇట్లు నడిపించి కాశ్మీరపంకనిభలగ్నజనానురాగుండును శ్రీఖండలేపనైపథ్యమయదిగ్విజయకీర్తిరాజిరాజద్భుజుండు నగునమ్మహీభుజునిం జూపి.

72


క.

వీక్షింపు సరోజేక్షణ!
యిక్షురసాంభోధిజలపరీతం బగునా
ప్లక్షద్వీపంబున క
ధ్యక్షుం డీరాజు చెలి సహస్రాక్షునకున్.

73


ఉ.

పొంపిరివోవుభక్తి నిరుపూఁటలు రాత్రులు శీతభాను ద
ర్శింపక యారగింపఁడు విశిష్టత వీఁడు భుజించుఁ గాక వం
చింపక యింతనుండియును జేడియ నీవదనేందుబింబమున్
సొంపెసలారఁ గాఁ దనకుఁ జూడఁగ నబ్బుట దర్శరాత్రులన్.

74

వ.

ఇక్షురసోదధివేలావనవిహారంబును బ్లక్షశాఖాప్రేంఖోళనక్రీడావినోదంబును విపాశాపులినవేదికాప్రదేశపర్యటనంబును మనంబున కింపు పుట్టింపంగలయవి, యితని పరిగ్రహింపు మనిన నాసరోజాక్షి వైరాగ్యరూక్షంబు లగునీక్షణంబుల నతని వీక్షించె వాణీగుణోదయతృణీకృతపాణివీణానిక్వాణ యగువాణి యన్నీలవేణితలం పెఱింగి యంపస్థలస్థితసమానవిమానదండు లగుపురుషప్రకాండులం బదండు పదం డని నడిపించి జంబూద్వీపభూపాలలోకంబు గదియించి.

75


జంబూద్వీపరాజులు

ఉ.

నేరెటిదీవి యేలుధరణీవరముఖ్యులు వీరె కంటె యు
న్నారు మనోరథంబులు మనంబునఁ బాయక సంచరింపఁగా
నీరజపత్త్రనేత్ర! యొకనిన్ వరియింపుము వీరిలోన దై
త్యారి వరించు నిందిరక్రియన్ బరినందితచిత్తవృత్తివై.

76


క.

సుందరి! జంబూద్వీపము
నందలి భూపాలసముదయంబును గంటే!
పొందొప్ప ధరణి వ్రాలిన
కందర్పచయంబువోలెఁ గడునొప్పారున్.

77


తే.

దీవు లాఱును తనుఁ జుట్టుఁ దిరిగి కొలువ
దీవులకు రాజు నేరెటిదీవి యొప్పు
మేరుకైలాసగిరులు బంగారుగొడుగు
ధవళతరచామరంబునై తనకు నమర.

78


ఉ.

ఓవనితాలలామ! లవణోదధిచక్రపరీత మైన యా
దీవికి రాజజంబువు ప్రదీపితలాంఛన మన్నగంబుశా

ఖావలి వ్రేలియాడెడుమహాఫలముల్ గని వారణంబు లౌఁ
గా పని పందెముల్ సలుపఁ గా గమకింతురు సిద్ధదంపతుల్.

79


వ.

కంబుకంఠి! జగదలంకారం బగుజాంబూనదంబు తనకు జంబాలజాలంబుగా జాంబవద్రవభవంభై సుధామధురాంబుపూరం బగుజంబూసరిత్ప్రవాహంబు జంబూద్వీపంబునందుఁ బ్రవహించు నీద్వీపంబున నంతరాంతరంబుల నెంతయుం బ్రసిద్ధులగు వసుధాకాంతులు ని న్నంతరంబులం గోరి వీరె సభాభ్యంతరంబున నున్నవారు. విమతయౌవతమౌళివతంసతమాలమాలికోన్మీలన్నీలతమఃప్రకరతస్కరభాస్కరు లగువీరియం దొక్కరునియందు నీడెందంబు కందళితానందం బయ్యెనేని వానిఁ జూపు మాభూపాలకుని కులబలాచారశూరతావివేకవైభవంబు లభివర్ణించెద, ననిన నబ్బాల శాలీనతావశంవదయై వదనారవిందంబు వంచి యూరకుండె. నట్లున్నఁ గాంచి విరించిపట్టపుదేవి బుజ్జగించి యాలజ్జావతికి నుజ్జయినీవల్లభుం జూపి యి ట్లనియె.

80


ఉజ్జయినీపతి

తే.

సవిధలీలావనీస్థాయిశంభుమౌళి
చంద్రికాధౌతకలధౌతసౌధజాల
యుజ్జయిని రాజధాని యోయుత్పలాక్షి!
భావసంభవనిభున కీభూవిభునకు.

81


ఉ.

తామరసాక్షి! శంకరుఁడు తత్పురి నాత్మకిరీటచంద్రరే
ఖామృతవృష్టి మన్మథనవాంకురముల్ సృజియించుఁ గామినీ
కాముకభాగసీమముల కందువపట్టుల నిట్టివాఁ డటే!
యేమిటికిన్ దహించె నిటలేక్షణవహ్నిఁ దదీయదేహమున్?

82

తే.

వెలఁది! వీఁ డేలునుజ్జనివీటియందు
వెఱతు రలుగంగ సతు లాత్మవిభులతోడ
బాహ్యవనవీథికాస్థాయిభర్గమౌళి
బాలహరిణాంకకోమలప్రభలయాజ్ఞ.

83


ఉ.

యాచకకోటి యీతనియుదారతపేర్మి సమృద్ధి నొంది యా
జ్ఞాచరణంబు వీడుకొన నాత్మల ముచ్చటఁ బొంది దేవతా
నైచికియున్ సురద్రుమము నైజగుణవ్యసనంబులం బయ
స్సేచనలీలఁ బల్లవభుజిక్రియఁ దీర్చు మిథఃప్రసంగతిన్.

84


శా.

క్షోణీనాథుఁ డితండు దానగుణవిస్ఫూర్తిం బ్రవర్తిల్లఁ గా
మాణిక్యాచల మెట్లు గైకొనియెనో మా కద్భుతంబయ్యెఁ గ
ల్యాణీ! నిర్వ్యయరత్నసంపదుదయోగగ్రత్వమున్ యాచక
శ్రేణీవర్జనదుర్యశోనిబిడితవ్రీడావనమ్రత్వమున్.

85


వ.

దమయంతి! శాంతీదాంత్యాదిగుణసంతానంబులకు విశ్రాంతిధామం బైనయీయవంతిపతియందు నీయంతరంగం బనురాగవంతం బయ్యెనేని శిప్రానదీసలిలకేళియు మహాకాళస్థితవృషభధ్వజభజనంబును విశాలానగరీసౌధసింహాసనాధిరోహణంబును నీకు సంభవింపఁగలయది, యని పలికి పలుకుందొయ్యలి యూరకుండెఁ, గుండినావనిపురందరప్రియనందనయును దూష్ణీంభావంబున నవ్విశ్వంభరాభర్తమీఁదఁ గటాక్షవీక్షణం బావర్తింపదయ్యె నప్పుడు.

86


తే.

మాళవాధీశమకుటాగ్రమణులయందు
భీమనందనరూపంబు బెరసి యునికిఁ
దద్విరక్తి పరీక్షించి తారు దార
యరిగి రవలకుఁ జతురంతయానధరులు.

87

తే.

గోతి గాంగేయపీతవక్షోజకుంభ
యభ్రవాహినియునుబోలె నరుగుదెంచె
రూపధరవర్గసగరపౌత్త్రానువృత్తి
భూవరాంతరమనుమర్త్యభువనమునకు.

88


వ.

అప్పుడు మత్స్యలాంఛనచాపరేఖాజితభ్రూవిలాస యగునారాజుకన్యకతోడ వాగ్దేవి యిట్లనియె.

89


గౌడరాజు

క.

వ్రీడావతి! యీభూపతి
గౌడబిడౌజుండు వీఁడు కమనీయరతి
క్రీడారహస్యకోవిద
చూడామణి ఱెప్పలెత్తి చూడుము వీనిన్.

90


ఉ.

పంకజనేత్ర! వీనిపరిపాండురకీర్తిభరంబుచేఁ గురం
గాంకరుచుల్ దృణీకృతము లైనవి నిక్కువ మట్లు గానినాఁ
డంకము డాసియున్నె యమృతాస్పద మైనతదంతరంబునన్
రంకు వసంకుచత్ప్రణయరక్తిఁ దదంకురచర్వణార్థమై!

91


తే.

కువలయశ్యాముఁ డైనయీయవనివిభుని
యిఱియుకౌఁగిటిలోనుండు హేమగౌరి!
కుసుమబాణాసనునిసేసకొప్పులోనఁ
దవిలి యొప్పారు సంపెంగదండవోలె.

92


చ.

లలన! యితండు సమ్ముఖమిళద్రిపుకుంజరకుంభమౌక్తిక
చ్ఛలమున వైరలక్ష్మివలిచన్నులమీదఁ నిజప్రతాపసం
కలనసముత్థితంబు లగుఘర్మకణంబులఁ బాయ మీటు ని
ర్మలనిజశాతహేతినఖరంబున నాజివిహారభూములన్.

93

తే.

అతివ! యాజానుదీర్ఘబాహాప్రతాప
సమధిగతదిగ్విభాగుఁ డీజనవిభుండు
సప్తతంతుయశఃపటవ్యాప్తనిఖిల
భువనుఁ డీతనిచరిత మద్భుతకరంబు.

94


వ.

అనిన విని యయ్యరవిందాస్య యౌదాస్యసంవిదవలంబితశూన్యముద్రాముద్రితం బైనచూపునం జూచి యాభూపాలునిం బ్రతిషేధించె నాక న్నెఱింగి ద్రుహిణగృహిణి విమానవాహవ్యూహంబునకుం గనుసన్న సేసి వేఱొక్కరునిం జేరం బోవ నియమించి యారాజన్యుం జూపి విదర్భరాజకన్యక కిట్లనియె.

95


మథురాధిపతి

సీ.

తెఱవ! ప్రత్యర్థిపార్థివసార్థపాథోధి
        సమ్మాథమందరక్ష్మాధరంబు
పృథుఁ డనునృపతి యీపృథ్వీశ్వరుం
        డేలు మథుర, నాకము జంభమథనుపగిది
సశ్మశ్రువైన యీయన ముఖాబ్జంబుతో
        నంకగర్భుం డైనయమృతకరుఁడు
సరివోవఁజాలఁడు చారుశాంతిస్ఫూర్తి
        నటు సూడు మితనిబాహార్గళములు


తే.

వైరిధరణీశవంశసంభారమునకు
శాత్రవకళత్రనేత్రాంబుజన్మమునకుఁ
గారణం బైనధూమరేఖయును బోని
ఘనశరాసనగుణకిణాంకము ధరించు.

96

చ.

అలికులవేణి! కాళియమహాహ్రదమన్ కమనీయనాభితో
జలనిధినేమిభామినికిఁ జక్కనిమేచకరోమరాజి నా
నలిఁ బ్రవహించుచున్న యమునానదియందు నితండు నీవునుం
జలుపుదుగాక గ్రీష్మదివసంబులయందుఁ బయోవిహారముల్.

97


క.

గోవర్ధనాద్రితటములఁ
బ్రావృట్కాలముల విపినబర్హిణనటన
ప్రావీణ్యము వీక్షింపుం
డీవును నీతండు వేడ్క లింపెసలారన్!

98


ఉ.

పూవులభూరిసౌరభము వూని భరంపడి యేఁగుదెంచుబృం
దావనసంచరిష్ణుఁడు సదాగతిపాంథుఁడు దప్పి పెంపునన్
ద్రావఁ గలాఁడు బాలునివిధంబునఁ జిత్రకగంధసారపం
కావిల మైననుం గువలయాక్షి! భవద్రతిఘర్మతోయమున్.

99


క.

పాటించి యితని వేఁడిన
చాటుకవీశ్వరులహస్తజలజంబులకున్
హాటకదీనారములు వ
రాటకసంఘాతములు వరాటేంద్రసుతా.

100


తే.

అనిన వినియును వ్రాల్చెఁ బక్ష్మాంచలములు
బాల తద్భావ మెఱిఁగి వాగ్భామ యపుడు
మఱియు నొకమానవేంద్రసమక్షమునకు
నిందుబింబాస్యఁ దోతెంచి యిట్టు లనియె.

101


కాశీరాజు

వ.

మత్తకాశిని! యితండు కాశీరా, జితని రాజధాని ముక్తిక్షేత్రం బగువారణాసి, యితని కులదైవతం బఖిలభువనస్థుం డగు ధూర్జటి, యితని విహారదీర్ఘిక త్రిలోకసంతా

నిర్వాపణి యగు గీర్వాణతటిని, యితనిసత్రశాల విశాలాక్షీకేలిభవనం, బితనిభుజాస్తంభదంభోళి రిపునృపాలబాలానయనాంబువృష్టిధారాసమేధితంబు.

102


చ.

సకియ! యితండు నీవలుఁదచన్నులక్రేవల నొత్తుఁ గాతఁ గింశుకముకుళాభిరామములు సుంకముపట్టు నఖాంకురాంకముల్ ప్రకుపితశాంకరీచరణపంకజకుంకుమపంకసంకర ప్రకటనిరంకశంకరకపర్దశశాంకకళాంకకారముల్.

103


తే.

అతివ! సంగ్రామరంగసంగతవిరోధి
నృపశిరోధిశిరాకాండనివహఖండి
చండభుజదండమండితమండలార
జాగ్రదుగ్రప్రతాపుఁ డీజనవిభుండు.

104


క.

దశశతదృగర్వగర్వ
ప్రశమసహేలాధురీణపటువేగనిరం
కుశసైన్యతురగరింఖా
విశకలితదిగంతధరణి వీఁడు లతాంగీ!

105


వ.

అని వర్ణించుచుండ దమయంతి నిజమహోత్సవాగతానేకలోకశోభావలోకనకుతూహలంబునం బరాకు వహించియుండె, నవ్విధం బక్కాశీరాజునకుం గ్లేశావహంబయ్యె సరస్వతీదేవియు వేఱొక్కనరదేవోత్తముం జూపి యి ట్లనియె.

106


అయోధ్యాధిపతి

తే.

ఈనృపాలుఁ డయోధ్యాపురీశ్వరుండు
పేరు ఋతుపర్ణుఁ డాకర్ణచారునయన!
వీని వరియింపు సముదీర్ణవిధసుపర్ణ
కేతకీగర్భపర్ణాతిపీతవర్ణు.

107

ఉ.

వారివిహారవేళఁ జెలువా! వెలువారెడునీచనుంగవన్
సారపుఁ దారహారములచందముఁ గైకొనుఁ గావుతం జమ
త్కారము క్రొత్తయై మెఱయఁ దత్తటసీమపరిత్రుటత్సదా
సారవసారవోర్మిభవసారవరాంబుపృషత్కదంబముల్.

108


తే.

ఇతని తాత భగీరథుం డతులమహిమ
నవనిఁ బ్రవహింపగాఁ జేసె నభ్రగంగ
నితఁడు త్రైలోక్యమునఁ బ్రవహింపఁజేసెఁ
గీరభాషిణి! వరధర్మకీర్తిగంగ.

109


చ.

కవివచనంబు లీతనియగాధయశఃకలశాంబురాశిలో
లవములు వోలె డిందు విమలం బగువీనిగుణప్రతానమున్
దివిరి దిగంతసంపుటతతిన్ బుధమండలి లెక్కవ్రాయఁ దా
నవము భజించు వైరినరనాథయశఃఖటికాకలాపముల్.

110


శా.

అంభోజానన! వీని నెట్లు నుతి సేయ న్వచ్చు? నేతత్తనూ
సంభూతం బగురోమసంఘము ముహాసత్త్వాంకురశ్రేణి య
స్తంభాటోపవిజృంభమాణరిపుదోస్స్తంభోరుకుంభీనసా
రంభస్తంభనమంత్ర మీతనికఠోరక్ష్వేళయాలంబునన్.

111


శా.

గంభీరప్రతిపక్షరాడపయశఃకాళిందియున్ వీనిదో
స్స్తంభోద్భూతయశోభ్రగంగయు ననిన్ సంశ్లేషమున్ బొందు నా
సంభేదంబునఁ గ్రుంకి కాంచును మహాక్షత్త్రంబు రంభాపరీ
రంభానందనికేతనందనవిహారప్రౌఢివిస్రంభముల్.

112


శా.

తాదృగ్దీర్ఘవిరించివాసరకరత్వంబుం బ్రతిష్ఠించుచున్
యాదోధిన్ దననీడ బాడబముగా నాకాశసంవ్యాప్యరి
క్ష్మాదార్శనకీర్తితారకములన్ మాయించు నేతత్ప్రతా
పాదిత్యుండు వెలుంగుఁ బద్మముఖి! వాచాగోచరప్రక్రియన్.

113

క.

అన వినియు విననియ ట్ల
జ్జననాథతనూజ యున్నచందముఁ గని య
మ్మనువంశాగ్రణి యవలకుఁ
జన ననుమతిఁ జేసె నలువసతి వాహతతిన్.

114


వ.

ఇ ట్లనుమతించి.

115


పాండ్యరాజు

ఉ.

అక్కడ నొక్కభూపతి ననంగునికంటెను రూపసంపదం
జక్కనివానిఁ జూపి సరసత్వము మై మధురస్వరామృత
న్యక్కృతమత్తకోకిల సనాతని తామరచూలిదేవి యా
క్రక్కసజవ్వనిం గరము గారవ మొప్పఁగఁ జూచి యిట్లనున్.

116


తే.

పాండ్యభూపాలుఁ డీతండు పద్మనయన!
యితని వీక్షింపు నిజకటాక్షేక్షణముల
మానశాలిని! శాలీనతానత మగు
నాననాంభోజ మెత్తుమీ యత్తరమున.

117


ఉ.

ఈసకలావనీతలము నెక్కటిఁ దాన పరిభ్రమించి య
భ్యాసపరంపరాపరత నభ్రమునన్ విహరింపఁగోరియో!
లాసికకీర్తివిభ్రమకలాగరిమ న్నటియించుచుండు నీ
రాసుతువంశరత్నముఁ దిరంబుగఁ జెంది యమందలీలలన్.

118


తే.

ఇతనిరిపురాజరాజి యేఁటేఁటివరుస
నడవు లడవులు దక్పక యరిగి యరిగి
యరుగు బహుకాలశూన్యత నడవు లైన
యాత్మనగరంబులకు యదృచ్ఛానువృత్తి.

119


స్రగ్ధర.

ఆలోకాలోకమేదిన్యమలమలయజోదారవిస్ఫారకీర్తిన్
ఖేలాకూపారపారాఖిలజనవినుతాక్షీణచాపప్రతాపున్

బాలా! వీక్షింపు వీనిం బయుగయుగపత్పాతిభూపాతిభూయ
శ్చూళీరత్నోడుపాళీసులభపరిచయాస్తోకనందనఖేందున్.

120


శా.

భంగాకీర్తిమషీమలీమసతమప్రత్యర్థి పృథ్వీపతి
త్వంగత్తిందుకకాననాంతరములన్ వర్తిల్లు సత్యుల్లస
ద్భంగిన్ వీని ప్రతాపవహ్ని జగదుత్సంగంబునన్ దత్స్ఫులిం
గాంగారంబులు భానుఁడున్ శిఖియు జంభారాతిదంభోళియున్.

121


శా.

ఏణీలోచన! యేతదుగ్రసమరప్రేక్షోపనమ్రామర
శ్రేణీమధ్యచరుండు వైన్యుఁడు గిరిక్షేపార్థమై కైకొనుం
బాణిం జాపము వీనిదంతిబలముల్ పైపై ననిన్ జంగమ
క్షోణీధ్రంబులు వోలె ధాత్రియెడఁ గైకొంచున్ విజృంభింపఁగన్.

122


శా.

ఆదైత్యాంతకువక్షమన్ గృహము శూన్యత్వైకదోషమ్ఫట
సీదన్మర్కటకీటజాతకృతకశ్వేతాతపత్రీభవ
త్తాదృఙ్నిర్మలకౌస్తుభాభరణరత్నస్ఫూర్తిగాఁ బాసి యా
హ్లాదం బొప్ప వసించు శ్రీ యితనిబాహామధ్యసౌధస్థలిన్.

123


మ.

ఘనసిందూరవిముగ్ధమూర్ధము ధృతస్కంధావధిశ్వామికం
బును బాథోధరమార్గగాహియునునై పూబోణి! యీరాజనం
దనుగంధద్విప మాజిలోఁ జరమసంధ్యాకాలముం బోలె న
ర్థి నిరోధించు విరోధిబాహుజభుజాతేజస్సహస్రాంశులన్.

124


క.

కీర్తిధనుఁ డైనయీతని
మార్తుర కని కరుగ నరిది మగువ! బెడంగై

మార్తాండమండలంబున
గర్తమయం బైనత్రోవ గానఁగ వచ్చున్.

125


చ.

ఎదిరిచి సమ్ముఖం బయినయింతటిలోనన యేమిచిత్రమో?
కదనముఖంబునందు విముఖత్వముఁ గైకొను నర్కదీప్తిచే
నదరులు వాఱుచున్ బెడిద మైనయదఃకరవాలధారచే
విదళితమై శిరోధి వడ వీనివిరోధిమహీశుఁ డుద్ధతిన్.

126


వ.

అనియె నప్పుడు సమీపంబున డాసి యున్న యంతఃపురదాసి యౌదాసీస్యగర్భంబైన వైదర్భి తలం పెఱింగి వేఱొక్కదెస చూపి, యక్క! యిటు గనుంగొనుము. సౌధాగ్రంబునందు నటియించు కేతనపటాంచలంబునం జలంబు గొని యొక్కకాకి గాహనమునకై కాకారవంబుతోడం గాలూఁదఁ దలంచి యనువుగాక చీకాకుపడుచున్నయది యనుచు నప్రస్తుతభాషణంబులం బరిహాసంబు పుట్టించిన.

127


తే.

దాచేసినయప్పరిహాసమునకు
హాసపరిపాండురం బైనయక్కొలువున
నానృపాలుముఖమ్లాని గానఁబడియె
నలుపుగానఁగఁ బడుఁ గదా తెలుపులోన.

128


వ.

అప్పుడు.

129


క.

ఆరాజుపట్టు వాసి మ
హారాజికసిద్ధసురసమర్చితచరణాం
భోరుహ భారతి యొక్కమ
హారాజు సమీపమునకు నల్లనఁ జనియెన్.

130

కాళింగుఁడు

వ.

చని మహేంద్రగిరి యేలునన్నరేంద్రునిం జూపి దమయంతి కి ట్లనియె.

131


చ.

నరనుతు నిమ్మహేంద్రగిరినాథు వరింపుము రూపసంపద
న్దొరయు నితండు నీకు, నొకదోసమునుం గల దప్పురంబునన్
గరిమఁ గళింగజంబు లగుగంథగజంబులకుంభరాజితోఁ
గరకరి పుట్టఁగాఁ గలదు కామిని నీవలిచన్నుదోయికిన్.

132


చ.

గజపతి వచ్చెనంచు నొకగంధగజంబుగుఱించి యొక్కఁ డ
క్కగజపడి పల్కిన న్వెఱచి కాననభూమికి వీటిఁ బాఱి దా
రి జడతనిద్రలోఁ గలవరింప నిజోక్తియ నేర్చి కీరము
ల్గజపతి వచ్చె నావిని కలంగుదు రీతని శత్రు లచ్చటన్.

133


తే.

వీనిరిపుకాంత పతిఁ బాసి కానలోనఁ
జెంచుఁబూఁబోఁడులును దానుఁ జెలిమి చేసి
చెప్పుఁ దమదేశవార్తలు చెప్పుచోటఁ
'జల్లనై యుండు మాభూమిచంద్రుఁ' డనుచు.

134


మహాస్రగ్ధర.

రతిఁ గ్రీడాహంసమోహగ్రహిళశిశుభృశప్రార్థితోన్నిద్రదారా
పతియై దుఃఖించు సద్యఃప్రసృమరనిజదృగ్బాష్పధారాగతేందు
ప్రతిబింబప్రాప్తలాభప్రముదితసుతయై రంజిలున్ రాత్రు లేత
త్ప్రతిపక్షక్షోణిపాలప్రమదగిరిదరీప్రాంతకాంతారభూమిన్.

135

ఉ.

యజ్జలదేవతాస్ఫటికహర్మ్యము శేషుఁడు ముజ్జగంబులున్
మజ్జన మాచరించుఁ బలుమాఱును నెందు యదీయవాఃకణం
బజ్జలజారి యట్టివిమలాద్భుతకీర్తిమహాబ్ధిపూర్తమున్
సజ్జనవర్ణనీయము నొనర్చె నితండు వసుంధరాస్థలిన్.

136


శా.

ఆమోదాశ్రుభరంబు వెల్లిగొన నెట్లాలించుఁ గర్ణంబులన్?
రోమాంచంబు వహించు నేకరణి నీరోమాంకురంబైనమైన్?
భూమీచక్రము పూనియెట్లు దల లూఁపుం బన్నగస్వామి యు
ద్గ్రామప్రౌఢిని వీనికీర్తి ఫణభృత్కాంతామణుల్ పాడఁగన్.

137


ఆ.

అనిన నల్ల నవ్వె నబ్జాయతాక్షియు
నది విరక్తియగుట నాత్మ నెఱిఁగి
యానవాహసమితి నవలోకసంజ్ఞ న
వ్వలికి నరుగఁ బనిచెఁ వాగ్వధూటి.

138


వ.

అచ్చోట వేఱొకరాజుం జూపి యారాజవదనకు రాజీవభవునిదేవి యిట్లనియె.

139


నేపాళరాజు

తే.

ఇతఁడు నేపాళభూపాలుఁ డిగురుఁబోణి!
వీని వీక్షింపు కడకంటివీక్షణమునఁ
బడఁతి! యేతమ్రతాపాగ్నిఁ బడియెనేఁ బ
తంగుఁ డంగీకరించుఁ బతంగవృత్తి.

140


తే.

ఉభయపౌలస్త్యవాసైకయోగ్యములును
నుభయసంధ్యాప్రభాలంక్రియోజ్జ్వలములు
నైనదిగ్భాగములయందు వీనికీర్తి
పద్మలోచన! నృత్యంబు పరిఢవించు.

141

మ.

శరధిప్రోద్ధృతి శింజినీఘటన మాశబ్దగ్రహాకృష్టి యం
బరవీథీగతిలక్ష్యభేద మవనిపాతంబు లక్షింప రా
కరివక్షస్స్థలరంధ్రపంక్త్యనుమితం బౌనాజిరంగంబులం
దరవిందానన! వీనిబాణనికరం బత్యద్భుతప్రౌఢిమన్.

142


మహాస్రగ్ధర.

పతితప్రత్యర్థిపృథ్వీపతిముఖకమలోపాశ్రయమ్లానిభృంగ
ప్రతిబింబాంకంబు లేతత్పదనఖవిధుబింబంబు లీరాజు దాల్చున్
బ్రతివీరప్రాణవాతప్రకరనవసుధాపానపీనంబు నత్య
ద్భుతశౌర్యాడంబరంబున్ భుజభుజగయుగంబున్ మహాసంగరోర్విన్.

143


మ.

హరిదంతద్విపదంతకుంతముల కన్వాదేశ మాశీవిషా
భరణోత్తంససుధాంశురేఖకు ననుప్రాసంబు కైలాసభూ
ధరకూటస్ఫటికోపలప్రతతి కథ్యాహార మిమ్మేదినీ
శ్వరదేవేంద్రుని సాంద్రనిర్మలయశోజాలంబు లీలావతీ!

144


సీ.

ఇతనిహేతి శతఘ్ని నెబ్భంగి నెదిరించు
        నరవీరశతము సంగరములందు?
లక్షభేదనకళాదక్షు నీతని నెట్టు
        లహితయోధులలక్ష లాక్రమించు?
నీక్షణజితపద్ము నితని నేక్రమమున
        విమతపద్మము లంగవింపఁ జాలు?

సర్వపరచ్ఛిదాశక్తు నీతని నెవ్వి
        ధంబున రిఫుపరార్ధము జయించుఁ?


తే.

గాన సంఖ్యాపగమము నొక్కటియ దిక్కు
వీనిపగఱకు మాటలు వేయు నేల?
కార్తికీతిథియామినీకాలపూర్ణ
చంద్రమండలసంకాశచారువదన?

145


కామరూపాధిపతి

తే.

అనుచు నిబ్బంగి నొత్తి చెప్పినను వినియు
నుత్తరము లేక యూరకయున్నఁ జూచి
యన్యరాజన్యు గుఱి సేసి యరిగె వాణి
యానధుర్యవజ్రంబుతో నరుగుదేర.

146


వ.

ఇవ్విధంబునం గ్రామరూపాధికుం డైనకామరూపాధిపుం జేరంజని వాగధిదేవత యవ్వనితావతంసంబున కి ట్లనియె.

147


తే.

ఇతఁడు ప్రాగ్జ్యోతిషాధీశుఁ డిందువదన!
వీరచూడావతంసంబు వీనిఁ జూడు
మలసవలితంబు వ్రీడాభరాకులంబుఁ
జంచలము నైననీదునేత్రాంచలమున.

148


శా.

క్రూరాసిత్రుటితావారణఘటాకుంఖాస్థికూటస్థలీ
రారాజన్నవమౌక్తికోత్కరకిరారంభక్రమోజ్జృంభియై
యీరాజన్యుకరంబు పోరులఁ గరం బేపారు సత్కీర్తి బీ
జారోపం బొనరించుభంగి హయరింఖాగ్రక్షతక్షోణులన్.

149


స్రగ్ధర.

రాజీవాక్షి! ప్రహారస్రవదసృగసుహృతాంశువంశాళి నేత

త్తేజోధూమధ్వజంబుల్ దిరిగి తిరిగి రోధించు దుస్సాధలీలన్
రాజావర్తోపలాంశు ప్రతిమ తదుదితప్రాజ్యధూమంబుగా రా
రాజ న్నాసీరవాజివ్రజఖురజరజోరాజి ఘోరాజిభూమిన్.

150


ఉత్కలదేశరాజు

వ.

అనియె నాసమయంబున సమీపవర్తిని యగు తాంబూలకరంకవాహిని దమసహోదరిభావం బెఱింగి భారతీదేవి నుద్దేశించి యోదేవి! యీ వసుధావల్లభునిమీఁద నిప్పల్లవాధరకు నుల్లంబు పల్లవింపదు వచనపరిశ్రమంబు వలదు. వాఁడె యుత్కలదేశాధీశ్వరుం డమ్మహీశ్వరుగుణకలాపంబు లభివర్ణింపు మనుటయు.

151


క.

భారతి రతీశకల్పుని
నారాజకుమారుఁ గదియ నరిగి గభీరో
చారమృదుమధురభాషల
నారమణీమణికి నిట్టు లనియెం బ్రీతిన్.

152


క.

ఇతఁ డుత్కలదేశాధిపుఁ
డతివ! విలోకింపు మితని నానమ్రరిపు
క్షితిపతికిరీటకోటీ
శతమఖమణిమధుపచుంబిచరణాంబుజునిన్.

153


మ.

చెమరించుం దుహినచ్ఛటాచ్ఛలమునన్ శీతాంశుబింబంబు రేఁ
గుముదం బెన్నఁడు నిద్రవో దెపుడు నీకొప్పుం బ్రవేశించుమ

ల్లిమతల్లీనవమాలికాకుసుమముల్ లీలావతీ! వీనిదు
ర్దమదోర్దండయశఃప్రకాండవిభవారంభంబు జృంభించినన్.

154


స్రగ్ధర.

పైపైఁ దుక్ఖారధట్టాప్రఖరఖురఫుటీపాతవిక్షుద్యమాన
క్ష్మాపృష్ఠోత్తిష్ఠదంధంకరణరణరజస్కాండధారాంధకారం
బాపూర్ణం బైనఘోరాహనముఖముల నబ్జాక్షీ! యీరాజుబాహా
టోపం బీక్షింప రాకుండుటకు మఱుఁగుచుండుం దివిన్ దేవపంక్తుల్.

155


మ.

అసమానస్థిరదానవైభవకళాహంకారసింహాసనా
గ్రసమాసీనుఁడు వీడొకండు కలుగంగా నర్థియాచ్ఞారస
వ్యసనాభావబహూభవత్ఫలభరవ్యాజంబున న్నమ్రమై
యెస సంక్రందనశాఖి డెందమునఁ బెం పెక్కించు మందాక్షమున్.

156


మ.

కలుచం గోశబిలంబు వెల్వడి యదఃఖడ్గాహి పైవచ్చుచోఁ
జలనం బించుక లేక యీతనిరిపుక్ష్మాపాలసంఘాత మో
చెల! హస్తాంబురుహాంగుళిమయమహాసిద్ధౌషధీపల్లవాం
చలము ల్మేసి భజించు జాంగలికతన్ సంగ్రామరంగంబులన్.

157


కీకటుఁడు

వ.

అని పలికి పలుకుబోటి వరాటరాజకన్యకం గనుంగొని యప్పు డయ్యింతి యంతరంగంబు నిరంతరస్మరణసరణి ధారావాహికజ్ఞానధారాసమారూఢనిషధపరివృఢం బగుట

నెఱింగియు నెఱుంగనిచందంబున భావించుచు బ్రస్తావోచితప్రకారంబునం జతురంతయానధరులం బదండు పదండని యుత్కలాధీశ్వరుం గడచి యసమసమరవిసృమరచమూమదాంధగంధసింధురఘటావమధుశీకరాసారహారినీహారసమయకంపితారాతిహృదయకమలుండును మదవదరిచూడాకురువిందకందళకిరణసందోహసందీపితచరణారవిందుడును గరళకరాళకరవాలధారానికృత్తగళద్రక్తరిపుసుభటనటారబ్ధనాట్యాద్భుతాలోకహృష్టత్రివిష్టపనివాసుండును నగునొక్కరాసుతుం జూపి దేవి! యితండు కీకటాధీశ్వరుం డిమ్మహీపతిపుంగవు నపాంగరంగస్థలలాస్యలంపటంబు లగుకటాక్షవీక్షణంబుల నిరీక్షింపుము.

158


స్రగ్ధర.

లీలం గట్టించె బెక్కుల్నెలవులఁ జెఱువుల్వీఁడుసాంద్రద్రుమాళీ
వ్యాలీఢోపాంతశాంతవ్యథపథికజనస్వాంతముల్ కీర్తిలక్ష్మీ
మూలాంబుల్ నీలనీలాంబుజదళదళనామోదమేదస్విపాథః
కేలీలోలద్విజాలీకృతమధురకలక్రేంక్రియాసంకులంబుల్.

159


మహాస్రగ్ధర.

మహిళాసీమంతముక్తామణి! యితనియశోమండలీపూర్ణరాకా
తుహినాంశుల్ దాడిమై వత్తురు వడిఁ దనపై దొమ్మిగా నంచుఁ జుమ్మీ

మహిగోళచ్ఛాయమాయామయగణితకళామాత్రలక్ష్యాంగకుండై
గ్రహవీథిన్ దుర్గవీథిం బ్రభచెడి యొదుఁగున్ రాహురాహుత్తుఁ డోటన్.

160


మహాస్రగ్ధర.

తరుణీ! దామోదరీయోదరకుహరదరీస్థాన మీవిశ్వధాత్రీ
శ్వరుకీర్తుల్ ముంచి పాఱం జటులగతి జగజ్జాలముల్ దేలియాడన్
మురజిన్నాభిప్రణాళీముఖమున ధవళాంభోజ మన్ పేరుగాఁ దా
నెరవై తత్పూర మంతర్నిబిడమయి బహిర్నిర్గమంబున్ భజించున్.

161

వ.

అనిన వినియు ననాదరముద్రాముద్రితం బైనహృదయంబుతో నవ్విద్రుమాధర గీకటాధీశ్వరుం గటాక్షింపకుండిన.

162


పంచనళి

ఉ.

వేసట లేక భీమపృథివీపతినందన యాననాంబుజో
ల్లాసవిరక్తిముద్ర పదిలంబుగఁ గల్గొని యాదినాంతసం
ధ్యాసమయాధిదేవత పితామహుపట్టపుదేవి గీకటుం
బాసి చనన్ దలంచె మఱి పంచనలీమణిమంచవీధికిన్.

188


వ.

అప్పుడు సరస్వతీదేవినిర్దేశంబున యాసధుర్యులు రాజసమాజంబువలనం బాపి భోజరాజకన్యను నిషధరాజపంచకం

బునుం గదియించుటఁ బరిమళంబులు నందనోద్యానతరుషండంబులవలనఁ బాపి మధుపమాలికం గల్పపాదపంచకంబునుం గదియించిన చందంబు దోఁచె, ననంతరంబు నలాకృతిధరు లయినయాలోకపాలురం జూపి క్రమంబున.

164


తే.

వాణి యిట్లను నక్కీరవాణి కెలమి
గూఢశబ్దార్థశ్లేషరూఢ మెఱయ
నిష్జరాధీశ్వరులకును నిషధపతికి
వర్ణనావాక్యరచన నన్వయము గలుగ.

165


చ.

అతివ! యపవ్యపాయుని ననల్పవిలోచనపంకజాతుఁ బ్రీ
ణితనిజవీరసేనుని వినిర్జితసర్వమహీభృదావళిన్
హతమదవద్విరోధిబలు నాత్మచమూచరవారణాసన
స్రుతమదగంధయుద్ధ మహిఁ జూడుము వీని మహి న్మహేంద్రునిన్.

166


సీ.

భాస్వరరూపసంపన్నుఁ డుద్ధతిమంతుఁ
        డధికప్రతాపసమన్వితుండు
హేతిసంభూతప్రభూతభూతియుతుండు
        శుచి ధనంజయుఁడు విస్ఫూర్తిశాలి
నానామహాసమిన్మధ్యప్రదీప్తుండు
        సతతంబు విబుధసంతతికి ముఖము
లాలితబాలప్రవాళతామ్రకరుండు
        తనకు శాత్రవసముత్కరము తృణము


తే.

తామరసపత్త్రనేత్ర! యీతం డనలుఁడు
లావు గలవాఁడు లోకపాలకులలోన
బహుతరస్నేహరుచిమహాబలసహాయ
సంపదుద్దాముఁ డెలమి వీక్షింపు మితని.

167

తే.

పరభయంకరపటుగదప్రహరణుండు
దండనిపుణుండు సమవర్తి ధర్మరాజు
మిత్రనందనుఁ డంభోజనేత్ర! చూడు
మితని దక్షణనాయకు నింపు మిగుల.

168


క.

ధవళాక్షి! చూడు మాతని
భువనాధీశ్వరు నపారభూరిగభీర
త్వవిశేషనిధి నదీనునిఁ
బ్రవిమలతరవారి నధికబలసత్త్వాఢ్యున్.

169


వ.

అని యాఖండలు గుఱించియు నగ్ని నుద్దేశించియు నంతకు లక్షించియు నంబుపతింగూర్చియుఁ ద్రిభువనార్చితచరణారవింద యగునరవిందభవుదేవి తదీయమాయారూపంబులకు ననురూపంబుగాఁ బ్రత్యేకంబ యుభయార్థవచనసామర్థ్యంబు లగువర్ణనావాక్యంబులం బ్రబోధించిన విదర్భధాత్రీపతిపుత్త్రి నేత్రశోత్రంబులం జూచియు వినియు నితం డితండని నిర్ణయింపనేరక డెందంబు డోలాందోళనంబు నొంద విధి పజ్జను నిషేధంబుత్రోవనుం బోవనితలంపున నిలింపనిషధరాజులను నలువుర విస్మయస్మేరంబు లగువిలోకనంబుల నవలోకించునది. క్రమంబున భారతినిర్దేశంబున నైసర్గికవిలాసభాసమానుండును ససమానరూపరేఖావిడంబితశంబరారాతియు నగు నిషధభూపతిం జూచె నప్పుడు.

170


క.

శారద మధురాలాపవి
శారద యింద్రాగ్నిశమనసలిలేశనుతి
ద్వారమున నిషధపతిఁ గై
వారం బొనరింపఁ దొడఁగె వాచాప్రౌఢిన్.

171

తే.

నలిననేత్ర! ప్రత్యర్థిదానవశతాహి
తాత్మచేష్టాగరిష్ఠత నరసి చూడ
నితఁడు జీమూతవాహనుం డింత నిక్క
మింపు పొంపిరివోవ వీక్షింపు మితని.

172


వ.

మఱియు నితండు హుతవహుండునుంబోలె బహవిగాఢమఘవదధ్వరాజ్యాభిషేకవికస్వరతేజోవిరాజితుం డీశానమూర్తిభేదంబును దండధరుండుుంబోలే బరప్రాణోత్క్రాంతిదానసమర్థశక్తిసంపన్నుండుసు సంజ్ఞానందకరుండును వరుణుండునుంబోలె ప్రతికూలవాతప్రచారచటులవాహినీసహస్రసంసేవితుండునుం బ్రచేతసుండు, నితనిం గనుంగొను, మిప్పురుషపంచకంబునందు నీకుం గన్నిచ్చకు వచ్చునతని వరియింపు మని పలికి పలుకుందొయ్యలి యూరకుండె, నప్పుడు మాయానిషధరాజకాయచ్ఛాయాంతర్వర్తు లగువిబుధచక్రవర్తుల నలువుర నతిక్రమించి పంచమకోటి యగునలునియందుఁ బురాకృతపరిపాకవాసనావశంబుననో పరమపాతివ్రత్యగుణగౌరవంబుననో జాత్యంతరసంగతిగ్రహణంబుననో యక్కురంగలోచనచూపు నెలవుకొనియె వెండియు.

173


క.

ద్వాపర మపుడు విదర్భ
క్ష్మాపాలతనూజమనసు గలఁగించెఁ గలి
ద్వాపరములు నలదమయం
తీపరిణయమునకు సమ్మతింపనివె కదా!

174


చ.

స్ఫురదవలేపతన్ నిషధభూపతు లేవురు కారణంబుగాఁ
బరువడినొయ్యనొయ్య యుగపత్పరిమోహయమాణబాణుఁడై

మరుఁడు విదర్భరాజసుతమానసముం గలఁగింపఁ బూనుచున్
శరములసంఖ్యకున్ ఫలము సమ్మతిఁ గాంచి నటింపకుండునే?

175


చ.

వెలయఁగఁ బంచనైషధి విభేదము నేర్పఱుపంగ లేక యా
కులత వహించి యిట్టితఱిఁ గూరిమినెచ్చెలి యొద్ద నుండెనేఁ
దెలియఁగఁజూచి చెప్పును గదే యని డెందమునం దలంచె నిం
పలర నరాళకేశి యమరాలయహేమమరాళపుంగవున్.

176


వ.

శంకాలతావితానం బనేకనలావలంబి యగుచుం బ్రబ్బినం గడునిబ్బరం బగువిభ్రమంబున నావిదర్భసుతాసుభ్రూలలామంబు నెమ్మనంబున ని ట్లని వితర్కించు.

177


సీ.

ద్వివిధచంద్రమతి ప్రతీతియో? కాకతి
        స్వచ్ఛపదార్థోపసర్పణంబొ?
యంగుళీముఖపీడితాక్షివిక్రియ యొక్కొ?
        మకరాంకుశాంబరీమహిమ యొక్కొ?
విరహకాలోద్భ్రాంతివిభవానువృత్తియో?
        రూపింప నలువిశ్వరూప మొక్కొ?
గణుతింప వేల్పులకపటనాటక మొక్కొ?
        భారతీపరిహాసభంగి యొక్కొ?


తే.

కాక యీయేవురందు నొక్కరుఁడు నలుఁడొ?
మారుఁ డొక్కడొ? యొకఁడు పురూరవుండొ?
వరుస నున్నయీచక్కనివా రిరువురు
దేవతావైద్యయుగ్మంబొ? తెలియరాదు.

178


తే.

విబుధవరు లేనిఁ బ్రణమిల్లి వేఁడుకొందు
నలుని వా రేల యిత్తురు నాకు నతని

మదనశోషణబాణసంపాతపీత
ఘనకృపాసింధుగహ్వరాకారమతులు?

179


క.

మంచకమధ్యస్థితమ
ద్వంచకపంచకమునందు వరుసమెయిఁ బరీ
క్షించెద నే నొక్కించుక
పంచజనసుపర్వలక్ష్యపంచశ్రేణిన్.

180


వ.

అనుచు నేవురం గలయం గనుంగొని యందు.

181


దమయంతి నలుని దెలిసికొనుట

మ.

ధరణిం బొందనికోమలాంఘ్రికమలద్వంద్వంబులున్ ఘర్మశీ
కరసిక్తంబులు గానిఫాలములు వక్షఃక్షోణులం బత్త్రకే
సరముల్ గందనిపూవుదండలు నిమేషవ్యాఖ్యఁ గైకోనిదృ
క్సరసీజంబులు నల్వురందుఁ గనియెం గాంతాలలామంబొగిన్.

182


వ.

కని యైదవవాఁడు నిషధరా జగుట యెఱింగి దేవతాప్రసాదంబు లేక యేకార్యంబు ఫలింపనేరదు. ప్రదక్షిణప్రక్రమణలవాలవిలేపధూపావరణాంబు నేకంబుల ననేకంబు లగుఫలంబు లీఁజాలుటంజేసి వేల్పులు కల్పద్రుమకాననంబులు సుపర్వులకుం జేయు నమస్య సర్వార్థసిద్ధిసంధానసమస్య విబుధసేవ యఖిలాభీష్టప్రదానసురభి యనుచు సభాజనం బెల్ల విస్మయం బంది కనుంగొనుచుండ దివిజసభాజనంబునకుం బ్రారంభించి వైశద్యహృద్యంబు లగు ప్రస్తుతిప్రసూనస్తబకంబుల నింద్రాదిదేవచతుష్టయంబు సంతుష్టి నొందించి తత్ప్రసాదలబ్దం బైనబుద్ధివిభవంబున నమ్మర్త్యవిలక్షణంబు లగుధరణిక్షోదసంస్పర్శనంబును బ్రస్వేదబిందునిష్యందనంబును గుసుమమాల్యమ్లాని యాదిగాఁ గలచిహ్నంబులను

సందేహంబు వాసి మనంబునకుం జూపునకును సంవాదంబు సమకూఱినం గందర్పమందాక్షంబులకు వశంవదయై చంచలం బగుకటాక్షాంచలం బతనిమూర్తిఁ బాయనుం డాయనుం జాలక యఱ్ఱాడ ననంతరంబ.

183


ఉ.

భావములోనికీలు పరిపాటిఁ బరిస్ఫుటతన్ విలాసమున్
బ్రోవఁగ వేడ్కతో నిషధభూపతికై యెడయాడుదృష్టి ల
జ్ఞావతి యెట్టకేల కొకచందమున న్మగిడించి చేర్చె వా
గ్దేవిముఖేందుబింబమునఁ దియ్యము నెయ్యమునుం దలిర్పఁగన్.

184


వ.

భారతీదేవియు నయ్యంగనయింగితం బెఱింగి తదీయహస్తంబు నిజహస్తంబునం గీలుకొలిపి యుల్లంబు పల్లవింప నిలింపనిషధరాజులం గనుంగొని కనుంగొనల నలంతి నవ్వొలయ ని ట్లను:— నింద్రాగ్నియమవరుణులు కరుణాతరంగితంబు లగునంతరంగంబులతో నీయంతి ననుగ్రహింపవలయు.

185


ఉ.

ఎట్టు వరించు సాధ్వి మిము నిందఱ? దేవచతుష్టయంబునం
దెట్టొకనిం దగంగ వరియించి తదన్యుల ధిక్కరించి వే
ర్వెట్టఁగ నేర్చుఁ? గావున వరించి కృతార్థతఁ బొందుఁగాక మీ
యట్టిమహానుభావు భవదంశసముద్భవు నైషధాధిపున్.

186


వ.

అనిన విని లోకపాలచతుష్టయంబు కమలవిష్టరభామినీనిర్దేశంబును నిషధదేశాధీశచిత్తశుపరీక్షణంబునుం దమయంతిపరమపాతివ్రత్యగుణగౌరవంబునుం గారణంబుగా మనంబులం బ్రసాదంబు వహించి నలాకారమాయాకంచుకంబులు దిగఁద్రోచి భీమోద్భవానృపతిసాత్త్వికభావావలోకనాపేక్ష బోలెఁ జక్షుస్సహస్రంబులో సహస్రాక్షుండును గామాంధ

కారగర్వనిర్వాపణదీపికాచక్రవాళంబునుం బోనికీలాజాలంబుతోఁ గీలియును సద్యోనిర్వాణమదనాగ్ని ధూమంబుఁ బోనిధూమ్రదేహచ్ఛాయామండలంబుతో దండధరుండును నిరాశం బైనయాశాపాశంబునుం బోనిపాశంబుతోడ బాశపాణియు నిజరూపంబులు గైకొని, రప్పుడు కందర్పదర్పాపహారపారీణం బైనవీరసేనతనయుమనోహరాకారంబు మాని వైమానికులు దమనిక్కంపురూపులు చేపట్టుట సామ్రాజ్యంబు విడిచి భిక్షాటనంబు పాటించినవిధంబును యౌవనంబుఁ బరిత్యజించి వార్ధకం బంగీకరించినభంగియుం దోఁచెఁ బేరోలగం బున్న భూపాలపాలవర్గంబు గనుంగొనుచుండ రూపాంతరపరిగ్రహం బొనర్చి యింద్రాదు లింద్రజాలవిద్యావిదులచందంబు నొందిరి యనంతరంబ.

187


తే.

క్షీరనీరవిభేదంబు చేసినట్టి
హంసియును బోలె హంసవాహనునిదేవి
లీల దిక్పాలనిషధభూపాలవరుల
భేద మేర్పడఁజేసి సంప్రీతి యెసఁగ.

188


వ.

దమయంతి కిట్లనియె.

189


తే.

వీరే యాఖండలాదులు విబుధవరులు
వాఁడె నిషధాధినాథుండు వనజవదన!
భక్తి సొంపార వీరికి బ్రణతి సేయు
మింపు పెంపారఁగా వరియింపు మితని.

190


వ.

అని యోంకారభద్రపీఠికాశాలంకారం బగుపంకజాసనునిరాణి నియోగింపం గంకణఝణఝణత్కారం బంకురింప నాశశాంకవదన వేల్పులకుం గేలుదోయి యెత్తి నమస్కరించె.

191

ఆశ్వాసాంతము

శా.

సౌందర్యాపరమత్స్యలాంఛన! కళాసర్వజ్ఞ! యర్థార్థిమా
కందారామవసంత! సంతతమహాకారుణ్యపాథోనిధీ
మందారద్రుమమంజరీమధుఝరీమాధుర్యమాధుర్యవా
క్సందర్భాస్వదమానమానసకవిగ్రామా! బుధగ్రామణీ!

192


క.

వీరావతార! రక్షణ
నారాయణరూప! రాయ నారాయణ! కం
ఠీరవవిక్రమ! వితరణ
పారాయణ! యుభయవంశపావనచరితా!

193


మాలిని.

అవనగుణవిహారా! యంగనాచిత్తచోరా!
భువనభరితకీర్తీ! పుణ్యకల్యాణమూర్తీ!
కవికువలయచంద్రా! గౌరవశ్రీమహేంద్రా!
యవితథపటుకోపా! యప్రతీపప్రతాపా!

194


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతంబైన శృంగారనైషధకావ్యంబునందుఁ బంచమాశ్వాసము.