శశికళ/విప్రలంభ
< శశికళ
విప్రలంభ
నను జూసి నవ్వేవు
కను మూసి పోయేవు
నా బాధ నాలోనె
నా గాధ నాకేనె
దేవి నాతో నీకు ఈ విప్రలంభమటె
నీ వియోగము నాకు భావాధికరణమటె.
జాతిబాధకు కృంగి జాతి ముక్తికి పొంగు
జాత్యభ్యుదయ శిల్ప కల్పనాశయ హృదిని.
ప్రజల బ్రతుకులలోన ప్రతిభ ప్రజ్ఞలు నేను
ప్రజల హృదయములలో భక్తి భావము నేను.
దేశోన్నతీ యత్న దీక్షా౽ విజృంభుడను
దేశ సౌందర్యరస దీప్త జీవిని నేను.
కుంచియలు రంగులతొ కొలువచేరితి నిన్ను
శిల్ప పీఠి వసింప చేరరావే దేవి.
నను జూసి నవ్వేవు
కను మూసి పోయేవు
నా బాధ నాలోనె
నా గాధ నాకేనె !