శశికళ/ఒఖ్ఖణ్ణి
< శశికళ
ఒఖ్ఖణ్ణి
మరచి పోవబోకె బాల
మరచి పోవకే !
అరచి అరచి పిలువలేను
తరచి తరచి వెదకలేను
పరచి ఎగురు కాంక్షలలో
పడి చెదురును నా గుండెలు - మరచి పోవకే !
హోరుమనే వారి రాసి
మారుమోగెను నా పాటలు
విరిగిపడే తరగలలో
నురుగులలో పరుగులలో - మరచి పోవకే !
ఒఖ్ఖణ్ణే ! యిసుక బయలు
ఒఖ్ఖణ్ణవ్ ! నీరు దెసలు
కదలి పోవు దూరాలూ
చెదరిపోవు మేఘాలూ - మరచి పోవకే !
అదుముకొన్న నీ తలపులు
చిదిమిరాల్చు హృదయ సుమము
ఏరలేను రేకలన్ని
ఏరలేను పుప్పొడినీ !
మరచి పోవకే బాల
మరచి పోవ బోవకే !