శశికళ/ప్రస్థానము
ప్రస్థానము
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినాను !
ప్రకృతి పధములు నడచి
భావ లోకము గడచి
బహుదేశములు విడిచి
పడినాను అడవిలో
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినాను !
వర్ణాలు తూలికలు
పర్ణాల పాలికలు
వస్తువులు చేబూని
ప్రస్థాన మైనాను.
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినానూ !
కంటకావృత సరణి గండశైలాలలో
ఉస్సురని తూలుతూ ఓహోయని పడిపోతి
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినానూ !
ఎన్నాళ్లు ఎన్నేళ్లు
తెన్ను తెలియని ఒళ్లు
కదలికే లేనట్టి
కఱ్ఱనై పడిఉంటి
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినానూ !
ఒకనాడు శుభవేళ
వికసించె చంద్రికలు
నాపైన వాలినవి
రూపొందె శశికళా
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినానూ !
మసృణ కోమల కరము
ఘుసృణ పరిమళ స్పర్శ
నాకు ప్రాణము నిచ్చె
నాకు మెలకువ వచ్చె
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినానూ !
కన్ను విప్పితి లేస్తి
కౌగిలిని ఒదిగిస్తి
నా లోన చైతన్య
నా శశికళ! అనన్య !
ప్రేమార్థినై వెడలినానూ
శిల్ప
కామార్థినై కదలినానూ !