శశికళ/దేశిక
దేశిక
నాకు శిష్యవు దేవి నీవూ
ప్రణయ మూర్తీ
నాకు దేశికవే ! దేవి నీవూ !
కావ్యములు కవిత్వమన
కవియన రహశ్యాలు
కళని గూడార్థాలు
తెలుపుమని వేడితివి
నాకు శిష్యవు దేవి నీవూ !
ప్రణయ మూర్తీ !
నాకు దేశికవే ! దేవి నీవూ !
భాషయన భావమన
వాగర్ధ పరమగతి
వ్యంగ్యము అలంకారములు
అతి శబల వృత్తులన
రసమన రసానంద
రమ్య జీవిత పరమ
స్థితియన తెలుపుమని
చతురమతి కోరితివి
నాకు శిష్యవు దేవి నీవూ !
ప్రణయ మూర్తీ !
నాకు దేశికవే ! దేవి నీవూ !
విమల గాంధర్వమే
కమనీయములు శ్రుతులు
సప్త స్వరోద్భవము
దీప్త మేళస్తితి
మూర్ఛనలు రాగాలు
ప్రస్థార గమకాలు
విస్థారిత స్థాయి
గాంధర్వ కావ్యాది
సౌందర్య రూపమని
దేవి నీరూపమే
భావాత్మయై వెలిగె
నాకు శిష్యవు దేవి నీవూ !
ప్రణయ మూర్తీ !
నాకు దేశికవే ! దేవి నీవూ !