శశికళ/త్రప
< శశికళ
త్రప
బాలవే నీ వెపుడు
గోలవే బేలవే !
పరమ సౌందర్యాలు
పడతి నీ కన్ను లే
కన్నులలొ దాగెనే
కమ్మన్ని సిగ్గోటి
బాలవేనీవెపుడు గోలవే బేలవే !
ఉదయ సంధ్యల ఎరుపు
పెదిమెలలొ తేనెలే !
తేనెలో ఒదిగింది
తీయ తీయని సిగ్గు !
బాలవే నీవెపుడు గోలవే బేలవే !
తంత్రి స్పందించుతూ
తల వాల్చి పాడుతూ
నను ముంచు నీపాట నవ్యమయ్యే సిగ్గు !
బాలవే నీవెపుడు గోలవే బేలవే !
నీలి కనురెప్పలో మేలమాడే సిగ్గు
అందాల నీపెదవి అలమిపోయే సిగ్గు
దివ్య గాంధర్వాన నవ్యమయ్యే సిగ్గు
సిగ్గులను మాలగాచేర్తువే నాగళము !
బాలవే నీవెపుడు బేలవే గోలవే !