కళా పరిమళము


నేను : నన్నెటే ప్రేమింతు ఓరాణి
           నన్నెటే పాలింతు ఓ దేవీ !

ఆమె : నిన్నెరా ప్రేమింతు
           వెన్నెలల బాలరా

నేను : నీ అంద మెక్కడే
           నా అంద మెక్కడే
           దివ్యపధములనుండి దిగివచ్చు మూర్తి వే
           భూమిపై తిరిగేటి పోటు మానిసినేను !

ఆమె : భూమి నందముసేయు పుణ్యమూర్తివి నీవు
           ఆకాశ యాత్రలో అంతు దొరకని నేను
           నీహృదయ మందముర
           నీసొగసు నీవెరా !

నేను : అర్ధచంద్రుడు నుదురు అమృతరసమే పెదవి
           ఆకాశగంగ నీ అంగ విన్యాసాలు
           నీవు సొబగుల రాణివే దేవి
           నేను కర్కశ మూర్తినే చెలీ !

ఆమె : నీవదన ముషసురా నీచూపు కాంతిరా
           నీపెదవిలో పాట నృత్యాలు సలుపురా
           అందమే నీదిరా
           సుందరిని నేనురా !

నేను : నీమూర్తి పూజింప
           ఈ మనుజు లెందరో
           అందరిలొ ఒఖ్ఖణ్ణి
           ఆశ నాకేలనే !

ఆమె : బ్రతుకు సర్వస్వమ్ము
           పరమ నైవేద్యమౌ
           నీపూజె పూజెరా
           నీవు నేనేనురా
           నీకు నేనై వెలసి
           నాకు నీవై పొలసి
           ఇరువురము బ్రతుకులో
           కెరలింతు మందదాలు !

నేను : ఇరువురము లోకాన
ఆమె : పరిమళింతుము కళల
           ఇరువురము ప్రేమికుల
           మిరువురము శిల్పులము.