శశికళ/నిత్య యౌవన
< శశికళ
నిత్య యౌవన
నాలోన నీవూ నిత్య యౌవనవూ
ఏనుమాత్రం దేవి ఏళ్ల జీర్ణింతునే ?
నాలోన నీవూ నిత్య యౌవనవూ !
పాపలలొ పాపనై పాడెదను ఆడెదను
అందాల పడుచుతో గంధాలు ప్రసరింతు,
నాలోన నీవూ నిత్య యౌవనవూ !
పూలమాలలు తాల్చి మేలమాడుదు నిన్ను
కాలాన్ని కట్టేసి కాలకిందను రాతు
నాలోన నీవూ నిత్య యౌవనవూ !
శక్తి కృంగని బుద్ధి రక్తి పొంగిన వృద్ధి
నీపాట శ్రుతికలిపి నీతొ నృత్యముసేతు
నాలోన నీవూ నిత్య యౌవనవూ
ఏనుమాత్రం దేవి ఏళ్ల జీర్ణింతునే !