గంగాధర


నీలి ఆకాశాలు కన్నులు
నీలి ఆకాశాల చుట్టిన
            ఆశలే నీ కంటి కాటుక - ప్రేయసీ !

ఆ, దివ్యపధముల వెలుగు కాంతులె
అంబురుహ నేత్రాంచలములను
            కూడుకొన్నది నిర్మలాంబువు
            లతి పవిత్రము లుగ్దతమ్ములు.

లోక బాధలు లోక దుఃఖము
చీకటై ప్రజ డాయు మూర్ఖత
            శోక భావోద్దీపనములై - కలతనింపెనటే !

ఆర్తి పొంగెను
అలముకొనె కన్నీరు వాహిని
            అలలుగా ఆవర్తములుగా
            అవధులన్నీ ముంచివేసెను.

వ్యోమ కేశుడ జడల విప్పితి
శ్యామ కైశ్యము దెసల పర్వెను
            దుఃఖ జాహ్నవి కౌగిలిస్తూ
            తోయముల తనలోన ధరాతలకు
            జూటమై శశి శోభితాలంకృతుల నెలనై
            పొలితునో దేవీ !