వీరభద్ర విజయము/దక్షుఁడు దివిజులఁ బిలుచుట


దక్షుఁడు దివిజులఁ బిలుచుట

మార్చు

96-క.
హరి తపనరాజ కమలజ
హరి శిఖి యమ దనుజ వరుణ వాయు కుబేరే
శ్వర కిన్నర మునివర సుర
గరు డోరగ సిద్ధ సాధ్య ఖచరులఁ బిలిచెన్.
97-క.
పిలిచిన సౌరభములతో
నలరుచుఁ జనుదెంచి వార లప్పుడు దమకున్
వలనగు ఠావుల నుండిరి
కలకలమై వివిధ నిగమ ఘనరవ మొదవన్.
98-క.
అల్లుండ్రఁ గూఁతు లందఱఁ
బొల్లమితిం బిలిచితెచ్చి పూజనలిడుచున్
కల్లతనంబున దక్షుఁడు
చెల్లింపఁ దొడంగెఁ గ్రతువు శివరహితముగన్.
99-క.
అంతట నారదముని దా
నంతయుఁ గని నవ్వి దేవతారాఢ్యుఁడు దా
నెంతయు నిచ్చట లేఁ డని
సంతసమునఁ జనియె రజతశైలముకడకున్.