వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/శివుఁడు గౌరితో సుఖముగా నుండుట


శివుఁడు గౌరితో సుఖముగా నుండుట.

197-ఉ.
వేలుపుఱేఁడు శంకరుఁడు విశ్వవిభుండు గురుండు కొండరా
చూలియుఁ దానుఁ గూడి బహుసుందరలీలల వెండికొండపై
సోలుచు నుండె లోకములు సుస్ధితిఁ బొందె ననేక కాలమున్
లాలితవృత్తితోడ నకలంకగతిన్ గడచెన్ ముదంబునన్.”
198-వ.
అని గౌరీదేవి వివాహోత్సవ క్రమంబు తెలియం జెప్పిన విని వాయుదేవునకు నమ్మహామును లి ట్లనిరి.
199-క.
“ నీలగళుం డను నామము
ఫాలాక్షున కెట్లు వచ్చె భర్గుఁడు కడిమిన్
హాలాహలవిషవహ్నుల
నేలా భక్షించె మాకు నేర్పడఁ జెపుమా.”
200-వ.
అనిన వాయుదేవుం డిట్లనియె.