వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/పార్వతిని రజతశైలంబునకుఁ బంపుట
పార్వతిని రజతశైలంబునకుఁ బంపుట.
189-సీ.
“ కనుసన్న లాలించి కడు నప్రమత్తవై
దేవేశుమనుసు రాఁ దిరుగుమమ్మ
పంపకయట మున్న భర్త చిత్తములోని
పను లెల్ల నాయితపఱపు మమ్ము
యటవారు నిటవారు నయ్యెడుగడయును
విభుఁడుగాఁ జూచి సేవింపుమమ్మ
యెన్నెన్నిభంగుల నే రూపముల యందుఁ
గరళకంధరు కెడ గాకుమమ్మ
ఆ.
యాశ్రయించువారి నమ్మ రక్షించుమీ
యలర నత్తమామ గలిగిరేని
యప్పగిఁపవచ్చు నతనికి నెవ్వరు
చెలువ! లేరుగానఁ జెప్ప వలసె.”
190-వ.
అని యమ్మహీధరుండు.
191-సీ.
“ కన్నియ! నీ రాజు గంధంబు బూయఁడు
మదనాంగ! భస్మంబు మాకు లేదు;
శృంగారి! నీ భర్త జీరలు గట్టఁడు
యిభదైత్యుతోలు మా యింట లేదు;
పొలఁతి! నీ నాథుండు పువ్వులు ముడువఁడు;
యింకొక్క క్రొన్నెల యింట లేదు;
లేమ! నీ భ ర్త పళ్లెరమునఁ గుడువడు;
విధికపాలమ్ము మా వెంట లేదు;
ఆ.
గాన మనువుగడప గరళకంధరునకు
ధనము గొఱఁత యైనఁ దగిన యట్టి
యుచిత ధనము లొసఁగకున్నచోఁ గన్నియ
జగము మెచ్చు గాదు తగవు గాదు.”
192-వ.
అని మహాదేవి నొడం బఱచి.
193-సీ.
సన్నంబులుగఁ బెక్కు వన్నెలచీరెలు
భూరి నానా హేమభూషణములు
మత్తగజంబులు నుత్తమాశ్వంబులు
నాతపత్రంబులు నందలములు
పురములు చామరంబులు పుష్పకంబులు
కొలఁకులు వనములు గోగణములు
భాసిల్లు ధనమును దాసీజనంబులు
మణిపీఠములు దివ్వమందిరములు
ఆ.
పరఁగ పర్వతములు బహుపుణ్యభూములు
వలయునట్టి వివిధ వస్తువులును
గరుణతోడ నపుడు గౌరీకుమారికి
నరణమిచ్చి యనిపె నచలవిభుఁడు.
194-వ.
తత్సమయంబున.
195-శా.
శ్రీకంఠుండు సదాశివుండు నియతిన్ శృంగారలోలుండు గౌ
రీకాంతాసహితంబు సమ్మదము పేర్మిం బోవ వేంచేనె సు
శ్రీకైలాసగిరీంద్ర పర్వతముకున్ శ్రీకామినీనాథ వా
ణీకాంతాధిప ముఖ్యు లెల్లఁ గొలువన్ నిత్యోత్సవప్రీతితోన్.
196-క.
వరదుఁడు శంభుం డల్లుఁడు
కరమర్ధిం జేసినట్టి గౌరవమునకున్
గిరిరాజు ప్రీతుఁ డయ్యెను
పరువడి దేవతలు జనిరి పరిణామముతోన్.