వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/క్షీరాబ్ధిని హాలాహలము బుట్టుట


క్షీరాబ్ధిని హాలాహలము బుట్టుట.

225-ఉ.
జెట్టిమగల్ సుధాంబునిధిఁ జేరి మధింపగ నందుఁ జంద్రుఁడుం
బుట్టకమున్న లక్ష్మియును బుట్టుకమున్న సుధాజలంబునుం
బుట్టకముందటన్ నిఖిలభూతభయంకర మై సురాసురుల్
పట్టిన చేతులున్విడిచి పాఱఁగఁ బుట్టె విషాగ్నికీలముల్.
226-వ.
మఱియును విలయసమయంబున జలధరానేక నిర్ఘాత గంభీర ఘోషణంబులుం బోలె గుభులుగుభు ల్లను నాదంబుల బ్రహ్మాండంబు లన్నియు నదరి బెగడి తిరిగి పరస్పరనినాదంబు చెలంగి చరాచర జంతుజాలంబులు ప్రళయకాలంబు గదిసెనో యని నిలచిన విధంబున డెందంబులు భయంబునం దల్లడిల్లి మూర్ఛల్లి; యొండొంటి పయం బడి తూలంబోవ సకలసాగరవలయితం బగు వసుంధరావలయంబు గ్రుంగి భుజంగపతి పయిం బడ భుజంగపతియును గమఠపతి పయిం బడఁ బ్రళయకాలాగ్నియుం బోలె సకలభూత భయంకరం బై నిటలనయనాగ్నియుం బోలె మహాహుతి సందోహం బై బడబాగ్నియుం బోలె నిష్ఠురంబై ప్రళయకాలభద్ర బడబానలంబులు సంబంధులై కూడి దరించు చందంబున నందంబై యందంద బృందారక బృందంబులు హాహాకారంబులతో మందరవలయితం బగు నాగంబు విడిచి కులశైలగుహాంతరాళంబులఁ బడి పరుగులిడ వెనుతగిలి గిరులును తరులును నదులును సాగరంబులు పురంబులు కాల్చుచుఁ గోలాహలంబు సేయు సమయంబున.
227-ఆ.
కమలలోచనుండు కమలాధినాథుండు
వనధి డాసి యున్నవాఁడు గాన
కాలకూటవహ్ని గదిసి సోఁకిన రక్త
వర్ణుఁ డంత నీలవర్ణుఁ డయ్యె.
228-క.
అంత సురాసురనాథులు
సంతాపము నొంది బ్రహ్మసన్నిధికి భయ
భ్రాంతు లయి పోయి వాణీ
కాంతునిఁ బొడఁగాంచి దీనగతి నవనుతులై.