వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/క్షీరసాగరమథనము


క్షీరసాగరమథనము

219-శా.
అంభోజప్రభవాండముల్ దిరిగి పాదై క్రుంగి ఘూర్ణిల్లఁ బ్రా
రంభం బొప్పఁగ మందరాద్రి నెఱెవారన్ వీఁక మై నెత్తి య
య్యంభోజాక్షుఁడు పట్టి వైచె చలితం బై కుంభనాదంబుతో
నంభోరాశియు భూమియున్నడల నయ్యంభోధి నుజ్జృంభుఁ డై.
220-వ.
ఇవ్విధంబున ననంత సుందరం బగు మహార్ణవ మధ్యంబున మందరగిరి కవ్వం బై తిరుగ నియమించి ధరణీధరము నడుగు వలయంబునకుఁ గమఠపతిఁ గుదురుగా నియమించి వాసుకి మహానాగంబును దరువం జేరుఁ గావించి పంచబాణజనకుండు సురాసురుల నవలోకించి యిట్లనియె.
221-చ.
పలువురు గూడి మీర లతి బాహుబలాఢ్యుల మంచు నెప్పుడున్
మలయుచుఁ బోరుచుండుదురు మందరశైలముఁ ద్రిప్పి మీ భుజా
బలములు నేఁడు చూపుఁ డని పంచిన వాసుకిఁ జేరి దానవుల్
తలయును దోఁక నిర్జరులు దద్దయు నుగ్రతఁ బట్టి రత్తఱిన్.
222-వ.
ఇవ్విధంబున.
223-మ.
ఉరగేంద్రుండు విషంబుఁ గ్రక్క భరమై యొండొండ ఘూర్ణిల్లుచున్
ధరణీచక్రము దిర్దిరం దిరుగ భూతవ్రాతముల్ భీతిలన్
బొరి నంభోనిధి గుబ్బుగుబ్బు రనుచున్ బోర్కల్గ దేవాసురుల్
కరశౌర్యోన్నతిఁ బేర్పి దర్చిరి సుధాకల్లోలినీ వల్లభున్.
224-వ.
మఱియు, నిలింప దనుజ సముదయంబులు తమతమ బాహు బలంబులు మెచ్చక మత్సరంబునఁ బెన్నుద్దులై నింగిముట్ట నార్చుచు హుంకారంబున బింకంబులం బలుకుచు ననంత పరాక్రము లై తనర్చు నియమంబునఁ దరువ మందరాచలంబు దిర్దిరం దిరుగుడుపడి యమ్మహార్ణవంబు జలంబు లన్నియు దిగంతంబులఁ జెదరి భూతలంబులం బగులఁ జేయంజాలిన ఘుమఘుమా రావంబులతో వెలినురుఁగు లెగయ మహాద్భుతంబున నాలోల కల్లోలంబై నిఖిల జలచర సందోహంబుతో వలయాకారంబుఁ గొని తిరుగుపడిన నయ్యవసరంబున; నఖిలభువనక్షోభం బైనఁ జరాచర జంతు జాలంబులు దొరలుచుండె నవ్విధంబున.