వాసిష్ఠరామాయణము/తృతీయాశ్వాసము
వాసిష్ఠరామాయణము
తృతీయాశ్వాసము
క. శ్రీకర శ్రీముఖకమలది
వాకర యదువృష్టిభోజవంశామృతర
త్నాకరపూర్ణసుధాకర
నారాహితదళనచాప నరమృగరూపా.1
స్థితిప్రకరణము
వ. దేవా సకలతత్త్వార్థవివేకి యగువాల్మీకి భరద్వాజున కి ట్లనియె.
అ ట్లుత్పత్తిప్రకరణంబు విని రామచంద్రుండు వసిష్టమహామునిం గనుం
గొని కరకమలంబులు ముకుళించి యి ట్లనియె.2
క. మునినాథ నీ ప్రసాదం
బున సర్వజగంబు చిత్తమునఁ బుట్టుట నా
మనసు విడుచుటయ ముక్తియు
నని తెలియఁగ వింటి నతికృతార్థుఁడ నైతిన్.3
వ. అనిన విని వసిష్ఠుండు రఘునందనున కి ట్లనియె. ఈ జగత్ప్రచయంబు
మనంబునం జనియించి యంద యుండు; నంద చిత్తంబు పరమాత్మ
యగు. ఈయర్థంబున స్థితిప్రకరణంబు సెప్పంబడు. నందు శుక్ర దామ
భీమ దాశూర కచగాథలను నుపాఖ్యానపంచకంబు గలిగియుండు;
నందు సంసారంబు పరమాత్మయం దున్న చందంబున శుక్రుచిత్తం
బునం గానంబడు; తత్కథ వినుపింతు నాకర్ణింపుము.4
శుక్రోపాఖ్యానము
సీ. చిత్రవర్ణంబులుఁ జిత్రకుండును లేక
మింటఁ జిత్తరు వొంది మించినట్లు,
పటుశిలాస్థలమున బహురేఖ లున్నట్లు
కల నిద్ర వోవక కాంచినట్లు,
సాక్షిభూతంబును స్వచ్ఛంబు నిత్యంబు
నై వెలింగెడు పరమాత్మయందు
ప్రతిబింబ మై జగత్ప్రచయంబు వెలుఁగొందు
నద్దంబులో నీడ యలగునట్లు,
గీ. కార్యకారణ మిద యని కాన రాదు
వేఱ యొండొక రూపంబు వెదకి రేని
యట్టి బ్రహ్మైకమూర్తి జిదాత్ముఁ బరము
నాత్మలో నిల్పి శాంతుఁడ వగు కుమార.5
తరువోజ. విను రామ భృగుఁ డను విప్రసత్తముఁడు,
వెలయు మందరశైలవిపినంబునందు
ననుపమయోగసమాధి మైఁ బూని
నయుతాబ్దములు నిల్వ నమ్మహామౌని
తనయుడు శుక్రుఁ డుదాత్తమానసుఁడు
తనతండ్రికడ నుండఁ, దగ నొకనాఁడు
ఘనమార్గమున సురకాంత విశ్వాచి
కర మొప్ప మెఱుఁగుఁదీఁగయుఁబోలెఁ జనఁగ.6
క. తల యెత్తి యాతలోదరి
కలికికనుంగవయు నీలకచమును వలిచ
న్నులుఁ దెలిమొగముఁ గనుంగొని
వలరా జస్త్రములఁ జిత్తవాసనఁ గలఁపన్.7
క. ఆనాతిఁ గవయువేడుక
మానుషతను వుజ్జగించి మది దివ్యాంగం
బూని గగనమున కెగసెను
దానివిమానంబుఁ గూడ తరలాత్మకుఁ డై.8
వ. ఇవ్విధంబునం జని శుక్రుం డక్కాంతామణితోడి కామసౌఖ్యంబులు
పెద్దకాలం బనుభవించి మఱియు ననేకజన్మాంతరసుఖముల నలజడిఁ
బకుచుండె. నిక్కడ నమ్మహానుభావుశరీరంబు తజ్జనకుని తపోమహ
త్త్వంబునం జేసి వ్యాఘ్రకీటకాదిక్షుద్రజంతువులు డగ్గఱ రా వెఱచి
యుండ నతిశుష్కంబై యుండె. నంత దివ్యవర్షసహస్రంబులకు
నాభృగుమహాముని సమాధి దెలిసి యున్మీలితనయనుం డై నలుది
క్కులుం జూచి తనయొద్దను పడియున్న పుత్త్రకళేబరంబుఁ గాంచి
శోకక్రోధంబులు మనంబును బెనంగొన ని ట్లనియె.9
గీ. అడవిఁ దప మాచరించుపుణ్యాత్ము విప్రు
నాత్మవిదు మత్తనూభవు నదటు లేక
నిగిడి చంపినశమనుని నీఱు సేయు
వాఁడ నీప్రొద్దు మత్కోపవహ్ని ననుడు.10
వ. భయసంభ్రమాయత్తచిత్తుఁ డై తత్క్షణంబ.11
క. ఘనమహిషకంఠఘంటా
స్వనమును భటహుంకృతులును జటులత మెఱయన్
మునిశార్దూలునిపాలికిఁ
జని వినయావనతుఁ డగుచు శమనుఁడు పలికెన్.12
గీ. అకట పెద్దకాల మబ్భంగిఁ జేసిన
తపము వీటిఁబోవఁ దామసమున
నేల యలిగి కన్ను లెఱ్ఱసేసెదు నిన్ను
నేమి సేసినాఁడ నిద్ధచరిత.13
క. పాపంబు లేదు నాపై
కోపం బుపసంహరింపు క్రూరాత్ముఁడవై
శాపించితేని నిన్నును
శాపింపఁగ నేర్తు నేను శాసకుఁడఁ జుమీ.14
చ. విను మునినాథ, తొల్లి పదివేవురు విష్ణుల లక్ష రుద్రులన్
వనజభవాండకోటుల నవారణ మ్రింగినవాఁడ; నాకు నీ
యనిమిషనాయకుల్ తృణకణాభులు; వారల నెన్న నేల? పం
పున మిముబోఁటివిప్రు లొకభోజనమాత్రమె నాకుఁ జూడఁగన్.15
క. ఇంతతపం బొనరించియు
శాంతస్వాంతుఁడవు గావు సమచిత్తుఁడ వై
చింతింపుము; నీయభిమత
మంతయు నెఱిఁగింతు; క్రోధ మడఁపు మునీంద్రా.16
వ. అది యె ట్లనినఁ జిత్తంబు పురుషుండును, తత్కృతంబ బుద్ధియుఁ,
దద్విలాసం బహంకారం బై యభిమతకృత్యంబు లొనరించుచుండు.
నట్లు గావున, చిత్తశాంతియ సర్వశాంతి యని సెప్పిన కృతాంతు
వాక్యంబుల కుపశమితక్రోధుం డై భృంగు డి ట్లనియె.17
క. రా వయ్య భూతకోటికి
నీ వెఱుఁగక జీవ మెడలి నిగుడదు, శుక్రుం
డేవిధమున మృతుఁ డయ్యెను?
నావిధ మంతయును జెప్పు మమలవిచారా.18
వ. అనిన విని యముం డి ట్లనియె.19
సీ. అనఘాత్మ మీరు చిదాత్మసమాధి మై
నుండంగ నతఁడు మీయొద్దనుండి
పరిచర్య సేయంగఁ బణఁతి విశ్వాచి నా
నమరకామిని దివి నరుగఁ జూచి,
తమకించి నిజశరీరము డించి వరదివ్య
దేహుఁ డై దానితో దివికి నరిగి,
కామలీలలఁ బెద్దకాలంబు భోగించి,
యంతట భోగజరాత్ముఁ డగుచు
గీ. శోణపురమున నొక్కభూసురునికూర్మి
తనయుఁడై పుట్టి, వెండి యత్తనువు విడిచి
కోసలక్షోణిపాలుఁ డై కొంతకాల
మవని బాలించి, మఱి దండ కాటవులను.20
వ. మృగవ్యాధుం డై జనియించి, మఱి భాగీరథీతీరంబున రాజహంస
యై జననం బంది విహరించి, పౌండ్రదేశంబున నినవంశజాతుం డై
నేలఁ బాలించి, మఱియు సాళ్వదేశంబున సౌరమంత్రోపదేశకుం డై
యుదయించి, మఱి యలకాపురంబున విద్యాధరుండై కొంతకాలంబు
చరియించి, వెండియు నొక్కమునికుమారుం డై సరస్వతీతీరంబునఁ
దపంబు జేసి తద్దేహంబు విడిచి, సౌవీరదేశంబున నొక్కసామంతుండై
కొంతదేశం బేలి, యంత త్రిగర్తదేశంబున శైవారాధ్యుండై శిష్యుల
బోధించు చుండి, కడచని మఱియును.21
గీ. విను కిరాతదేశమున నొక్కచో వంశ
గుల్మ మై జనియించి, కోరి మఱియు
శ్వానజాంగలమున జనియించి, హరిణ మై
వెడలి, యొకలతానివేశ మందు.22
క. పెనుఁబా మై తిరుగుచుఁ ద
త్తను వెడలి తమాలవనలతాజాలమునన్
వనకుక్కుట మై పుట్టెను,
మునినాయక నీసుతుండు మోహాంధతచేన్.23
ఉత్సాహ. మఱియుఁ బెక్కుయోనులందు మహితచిత్రగతులఁ బెం
పఱి జనించి దుఃఖభాజి యై చరించి, వెండియున్
వఱలు విప్రవరునియింట వాసుదేవుఁ డనఁగ, దా
నెఱుక గలిగి పుట్టె వేల్పుటేటితీరభూమినిన్.24
వ. జటావల్కలధరుండును రుద్రాక్షమాలాలంకృతుండును నింద్రియ
వర్జితుండును నత్యంతనియతాచారుండును నై యెనుఁబది నూ రేం
డ్లును గోలెఁ దపంబు సేయుచున్నవాఁడు నీకుమారుం జూడవలయు
నేని చూపెద, నీవు సుజ్ఞానదృష్టి నీక్షించి దివ్యదేహంబు గైకొని
రమ్మనుటయు, భృగుం డట్ల సేయ, నయ్యిద్దఱును దపఃకృశుం డగు
శుక్రుకడకుం జని, యతనికి జ్ఞానోపదేశంబు సేసిన, శుక్రుండు నున్మీలి
తవదనుం డై, తనవృత్తాంతంబంతయుం దెలిపి, తండ్రిం గని నమస్క
రించి, యి ట్లనియె.25
క. మాయాభ్రమ చిత్తం బిటు
సేయ విజృంభించె వృద్ధసేవ దొఱంగెన్
వే యోనుల జనియించితిఁ;
బాయక పెక్కేండ్లు దుఃఖపడితిని దండ్రీ.26
గీ. ఎఱుఁగవలసిన వెల్ల నే నెఱుఁగఁ గంటిఁ,
జూడవలసినయర్థంబు చూడఁ గంటి,
భ్రాంతి యంతయు దీరి విశ్రాంతి గంటి,
నొనర చిన్మాత్రమునకంటె నొండు లేదు.27
వ. అయ్యా మత్పూర్వశరీరంబు మందరతటంబున నున్నయది, చూడ
వేడుక యయ్యెడు, బోదమె! యని పలుకుటయు, నాక్షణంబ.28
ఉ. కాలుఁడు శుక్రుఁడున్ భృగుఁడుఁ గ్రమ్మఱ మందరశైలభూమికిన్
వాలినవేడ్క వచ్చి, చెద పట్టినభార్గవుడొక్కఁ గాంచి, ర
క్కాలువరంబుచే నతఁడు గ్రక్కున నందు వసించి, చేయునుం
గాలుఁ గదల్చి లేచి మదిఁ గౌతుక మందుచునుండె, రాఘవా.29
క. మానుగ సంసారస్థితి
మానసమున నొదవు టెఱుఁగుమార్గం బీయా
ఖ్యానంబున నెఱింగించితి,
మానసనిగ్రహమ శాంతి మనుకులతిలకా.30
వ. అని యిట్లు శుక్రోపాఖ్యానం బెఱింగించి, వసిష్ఠుండు రామచంద్రున
కి ట్లనియె. వినుము వివేకంబును జిత్తశాంతి వొడము; తత్క్షణంబ సం
సారం బణంగిపోవు; వివేకహీనునకు సంసారవృద్ధి యగుచుండు.
నీ యర్థంబును దామాద్యుపాఖ్యానంబునం దేటపఱుతు; నాకర్ణిం
పుము.31
సీ. కృతవిచారుం డగునతనిచేతోవృత్తి
మననవర్జితమునఁ బొనుఁగువోవ,
నొకకొంతపరిణత నొంద సంసారవా
సన యెలుకలు దిన్నచామలట్ల,
రాగహీనత మనోగ్రంథిఁ ద్రెంపఁగ నీళ్ల
కలక నిండుపు రాచి తెలుచుభంగి,
విజ్ఞానవశమున వెలయుస్వభావంబు
నిత్యప్రసన్న మై నెగడుచుండు,
గీ. నట్టియోగికి బ్రహ్మరుద్రాదిసురులు
కృపకు, దగుపాత్రు లై యుండ్రు కేవలంబు
కన్ను లూరక చిక్కులు గాంచుపగిదిఁ,
జిత్తరతి లేక కార్యంబు సేయుచుండు.32
గీ. ఎఱుక గలుగుయోగి యెట్లు భోగించిన
దురిత మెడలి భోగతుష్టి యెసఁగు,
చోరుఁ డౌట యెఱిఁగి పోరామి సేసిన
ప్రియునియిల్లు తస్కరింపనట్లు.33
వ. ఎ ట్లనినఁ బథికుండు మార్గగ్రామంబులు సూచుచుం జనుభంగి,
గృహస్థితుం డుదాసీనభావంబున భోగంబు లల్పమాత్రంబు భోగిం
చినను దూష్యత లేక యుండు. ఏ యుపాయంబున నైనం జిత్తంబు
నింద్రియంబుల జయించి సంసారపారావారోత్తరణంబు సేయు; మట్లు
సేయ వైతేని, దామవాక్యలకటన్యాయంబునం బోలె దుఃఖంబు ప్రా
ప్తించు నత్తెఱం గాకర్ణింపుమని వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె.34
దామవాక్యలకటోపాఖ్యానము
సీ. శంబరనామరాక్షసుఁ డొక్కఁడును దొల్లి
యమరసైన్యము గెల్వ నాత్మఁ గోరి,
తలపెట్టుకొన్నంతఁ దనయోధు లందఱు
భయ మంది నల్లడఁ బాఱ, వాఁడు
కోపించి, తనమాయఁ గోరి దామవ్యాల
కటనామభటుల నక్కజము గాఁగ
సృజియింప, వారును విజయాశ దేహాభి
మానంబు నెడలి యమర్త్యబలము
గీ. సమయఁ జూచిన దివిజులు సంచలించి
చెదరి నలుదిక్కులను బాఱి చేష్ట లెడలి
సంభ్రమంబునఁ బఱచి యాజలజభవుని
వెనుకఁ జొచ్చిన వారి కి ట్లనియె ధాత.35
ఉ. అక్కట మీకు నింతభయ మందఁగ నేటికి వారి నోర్చు లా
గొక్కటి సెప్పెదన్ వినుడు; యుద్ధమునం దలపాటు సేసి, మీ
రక్కడ నక్కడన్ విఱిగినట్లు తొలంగుచుఁ బోరుచుండఁగా
నక్కడ వారియాత్మల నహంకరణంబు జనించి యంతటన్.36
క. ఆ దామవ్యాలకటుల్
మోఁదంబడి జీవితాశ మునియోగంబుల్
భేదిలి మీ కగపడుదురు
వేదనఁ టెనువలలఁబడినవిహగములగతిన్.37
గీ. ఎట్టి ధీరులకును నెట్టన సంసార
తృష్ణ వొడమి తొంటితెలివి నణఁప,
నిగళబద్ధ మైనమృగరాజుభంగి యై
చిక్కుపడి నశించు నక్కజముగ.38
వ. అని యుపదేశం బిచ్చి పరమేష్ఠి యంతర్ధానంబు నొందె. దివిజగణం
బులు నిజనివాసంబున దామాదులతో సమరంబు సేసి యోహరిసా
హరిం బెనఁగి విచ్చుచుం బొదువుచుండి, రంత నారాక్షసులు జయా
హంకారచిత్తు లై దేహసుఖధనవాన లగ్గలించి మరణభయం
బున ముందఱఁ గాననేరక యింధనక్షీణం బగుననలంబును బోలె
సత్త్వంబులు పొనుంగువడి దివిజులకు నోడి కనికని పఱచి రని సెప్పిన
విని కౌసల్యానందనుం డి ట్లనియె.39
క. దామవ్యాలకటాసురు
లేమెయిఁ బరమాత్మువలన నెటు పుట్టి రొకో?
నామది సంశయ మయ్యెడు
ధీమన్నుత నాకు నాన తీవే యనుడున్.40
సీ. అమ్మహామౌని యి ట్లనియెను – రాఘవ,
తనరుదామాదులజనన మరయఁ
బరమాత్మవిప్రతిభాతిమాత్రము గాని
సత్యమ్ము గాదు; సంశయ మ దేల?
నిగిడి వా రన నేల, నీవును నోలి న
ద్భావంబు లన్నియుఁ బరఁగ నెఱిఁగి,
ప్రకృతివికృతులను బాసి సమ్మదమునఁ
బరమాత్మ నాత్మను బదిలపఱిచి,
గీ. సత్త్వసంవేదనంబును శాశ్వతంబు
నిత్యబోధాత్మరూపంబు నిర్మలంబు
నస్తమును నుదయము లేనియట్టివెలుఁగుఁ
బొంది చిన్మూర్తి వై సుఖింపుము కుమార.41
వ. అని వసిష్టుండు దోమాద్యుపాఖ్యానంబు సెప్పి, యింక దేహాహంకా
రరాహిత్యంబు పురుషార్ధం బగుట యెఱుంగంబడు భీమాద్యుపాఖ్యా
నంబు సెస్పెద విను మని యి ట్లనియె.42
గీ. ఎఱుకపడకున్న నహమర్థ మెద్ది యేని
మలినరూపంబు దోఁచి దంభకము నొందు
నెఱుకపడియున్న నహమర్థ మెద్ది యేని
యదియ పరమాత్మ నభము తా నై వెలుంగు.43
వ. ఆ యహంకారంబు జగత్త్రయంబునందు మూఁడు విధంబులై యుం
డు. నందుఁ ద్యాజ్యం బొక్కటియు, ముఖ్యంబులు రెండునుం గలిగి
యుండు వినుము.44
గీ. అతుల మమలంబు విశ్వ మచ్యుతముఁ బరము
నైన పరమాత్మరూపంబు నేనె కాని
యన్య మొక్కటి లేదని యాత్మఁ దలఁచు
నదియ యుత్తమాహంకృతి యనఁగఁ బరఁగు.45
గీ. ఆరయ నన్నిట వ్యతిరిక్త మై వెలుంగు
తాన యాలాపశతకల్పితంబు నగుచు
నెసఁగు పరమాణురూపంబు నేనె యనెడు
నా యహంకార మది ద్వితీయంబు శుభము.46
వ. ఇది మోక్షకారణంబును బంధనిరసంబు నై జీవన్ముక్తి యొనర్చు
మఱియును.47
క. కరచరణాద్యవయవముల
కిరవై చరియించుదేహ మిది నీమదిలోఁ
దిరముగ నిలుపునహంకృతి
యరయఁ దృతీయాఖ్య మధమ మగు దాశరథీ.48
వ. ఈ యహంకారత్రయంబును విడిచినయతండు పరమనిర్వాణపదంబు
నొందు. నహంకారరహితు లై భీమాదులు పరమపదప్రాప్తు లగుట
విస్పష్టంబుగాఁ జెప్పెద నాకర్ణింపుము.49
సీ. మును శంబరుం డనుదనుజుండు తనమాయ
నిర్మింపబడు రజనీచరేంద్రు
లతిమూర్ఖు లైనదామాదులు సురలచే
హతు లైనఁ జింతిలి యతఁడు మఱియు;
దైవసేనల నోర్చుతలఁపున నధ్యాత్మ
శాస్త్రవివేకుల సత్త్వధనుల
గతమత్సరుల నహంకారదూరుల వేద
వేదాంతవేత్తల విమలమతుల
గీ. భీమబాహాఖ్యదృఢు లను పేర్లవారిఁ
బొలుచుతనమాయ నబ్ధిబుద్బుదములట్ల
నెన్నఁ బెక్కండ్ర సృజియింప; నెసఁగ వారు
నతిజరామృతివర్జితు లై కణఁగిరి.50
వ. ప్రాప్తార్థకాములును, వర్తమానానువర్తులును, సర్వసములు, నగు న
ద్దానవుల చేత నిర్జరసైనికులు చచ్చియు, నొచ్చియు, వెఱచియు, పలా
యనపరాయణులై, జ్ఞానవాసన విషయానుభవంబున నశియించిన
ట్లణంగిరి. అట్లు గావున.51
గీ. పరఁగ దుర్వాసనలఁ గట్టుపడ్డమనసు
జ్ఞానవాసనచేఁ గ్రాఁగి శాంతి నొందు;
సమ్యగాలోకచిత్తవాసనల చిత్త
మణఁగు రఘురామ విను దీప మణఁగునట్లు.52
వ. అని యిట్లు భీమాద్యుపాఖ్యానంబున జగత్స్థితిమాయికత్వంబు సెప్పి,
యింక దాశూరోపాఖ్యానంబున నీయర్థంబు విశదంబుగాఁ జెప్పుదు
ననిన, రామచంద్రుండు విశ్వాతీతం బైనచిదాత్మయందు విశ్వం బెట్లుం
డె! నివ్విధంబు తేటపడ నెఱింగింపవే యనిన, నమ్మునీశ్వరుం డి ట్లనియె.53
క. విను రాఘవ నిర్మలచి
ద్ఘన మాత్మునియందుఁ దాన కలిగి ప్రపంచం
బనుపేర విజృంభించును
ఘనమృగతృష్ణికలు నీళ్లగతిఁ దోఁచు క్రియన్.54
గీ. పరఁగఁ దనయాత్మ మదవశభ్రాంతిఁ జెంది
యన్యుఁడును బోలెఁ దోఁచినయట్టిభంగి
మానసంబున నజ్ఞానమహిమఁ జేసి
యాతఁడు నతఁడు గా కుండు నలఘుచరిత.55
గీ. ఒనర దీపంబునను వెలుఁ గున్నయట్లు,
పువ్వు గలుగంగఁ దావియుఁ బొలుచునట్లు,
సూర్యుఁ డుండంగఁ బగ లగుచున్నయట్లు,
చిత్తు గలుగంగ జగములు చెలఁగుచుండు.56
వ అనిన విని రామచంద్రుం డమ్మునిచంద్రున కి ట్లనియె.57
క. క్షీరోదధిలహరీగం
భీరము లై శీతలములు ప్రియములు నగు మీ
సారోక్తులచే నామది
యారయ సుజ్ఞానజనక మయ్యె మునీంద్రా.58
గీ. గడియగడియకు వెలుఁగుఁ చీఁకటియు నగుచుఁ
జలియు నెండయు మాటికి సంచరించు
వర్షకాలాభ్రములఁ బర్వువాసరంబు
సరణి యగుచుండు నామది సంయమీంద్ర.59
వ. అనంతంబు, నప్రమేయంబు, సర్వంబు, ననస్తమితసారం, బగుపరమా
త్మకు, సృష్టివిలయం బను నీకలంకునకుం గారణం బేమి? యని యడి
గిన వసిష్ఠుం డి ట్లనియె.60
సీ. అనఘ యథార్థవాక్యార్థంబు లయ్యుఁ బూ
ర్వాపరం బగు నిరూపార్థములకు,
నేవిరోధము లేక యెసఁగుమదుక్తులఁ
గలబలాబలములు తెలివిపడఁగ
సుజ్ఞానదృష్టి మైఁ జూచి యెఱింగెద
రుత్తమవిద్యను నొగి నవిద్య
నణఁపంగ సర్వదోషాపహారిణి యగు
విద్య సంప్రాప్త మై వెలుఁగుచుండు,
సీ. నస్త్రమస్త్రంబుచే శాంత మైన భంగి,
విషముచేతన విషమును విఱిగినట్లు,
శత్రుచేతన శత్రుండు సమయుపోల్కి,
మనసుచేతన మనసును మడియుచుండు.61
గీ. విను మవిద్య యెట్లు జనియించెనో? యను
తలఁపు లెల్ల మాని, తత్త్వనియతిఁ
జెంది, దీని నెట్లు చెఱుతునో యనువిచా
రంబు నిలుపు మాత్మ, రామచంద్ర.62
వ. అది నశించునప్పుడు, తజ్జననాదివికారంబు నెఱుంగ నగు. ననిన విని
రఘునందనుండు — జీవుండు మనోరూపంబు దాల్చి యవ్విరించిపంద
బెట్లు వొందు? నానతిం డని యడిగిన, నతనికిఁ బరమార్థవిదుం
డగు వసిష్ఠుడి ట్లనియె.63
క. విను బ్రహ్మంబును దనువొం
దినమార్గం బెల్ల నీకుఁ దెలుపఁగ, నందుం
దనరు జగత్తుల యునికియు
వినఁబడు, దెలియంగ వినుము, విమలవిచారా.64
వ. ఎ ట్లనిన దేశకాలవస్తుపరిచ్ఛేదరాహిత్యం బగునాత్మతత్త్వంబు బ్ర
హ్మశరీరం బనంబడు. అది వాసనావశంబున జీవుం డగు. నజ్జీవునివ
లన సంశయాత్మకం బగుమనంబు పుట్టు. దచ్ఛక్తినియతి నిర్మలం
బై శబ్దోన్ముఖం బగునాకాశంబు సంభవించు. దానివలన శబ్దస్ప
ర్శోన్ముఖం బైనయనిలంబు జనియించు. నీరెంటిసంఘర్షణంబున శబ్ద
స్పర్శరూపగుణోపేతం బగుననలంబు పుట్టు. దానివలన శబ్దస్పర్శ
రూపరసయుక్తంబగు జలం బుద్భవించు. దానివలన శబ్దస్పర్శరూప
రసగంధసమేతం బగు భూమి యుదయించు. నివ్విధంబున బంచభూత
తన్మాత్రాచేష్టితం బైనజగత్తు మనోరూపం బై యుండు; నందు.65
గీ. అనలకణముభంగి నాకాశమున, నహం
కారబుద్ధి బీజ మైనతనువు
పొలుచు, దానిపేరె పుర్యష్టకవిభూతి,
హృదయపద్మభృంగ మదియె, రామ.66
వ. అందు మనోభావవేగంబున బిల్వఫలంబులుం బోలెఁ బాకం బయి
స్థూలరూపం బగు. నదియ కరువును బోసినపసిఁడి ప్రతిమయుం బోలె,
నిర్మలం బగు నాకాశంబునం దశద్రూపంబుల వెలుంగు. దాని
కూర్ధ్వంబు శిరంబు, నుదరంబు మధ్యంబును, బార్శ్వంబులు
హస్తంబులును, బాదంబులు క్రిందు, నై కాలవశంబున శరీరం బై,
బుద్ధిసత్త్వబలోత్సాహవిజ్ఞానైశ్వర్యాదిగుణంబులు గలిగి, లోక
పితామహుండైన బ్రహ్మ యుద్భవిల్లె. బరమాత్మ యైనయతనికి జనన
మరణంబు లెందునుం బొందవు. మిథ్యాభావనలం గల వని సెప్పం
బడు; నట్లుగావునఁ దృష్ణాభుజంగకంచుకం బగుసంసారాడంబరంబు
విడువుము.67
క. విను మజ్ఞానాంశము లగు
ధనదారసుతాదులందుఁ దనికెడు దుఃఖం
బును సుఖమును, నిక్కంబై
చను నెద్ది సుఖంబు తలఁప జనవరతిలకా.68
గీ. మూర్ఖు లగువారితలఁపుల మోహ మొదవి
యేమివస్తుల భోగింప నిశ్చయింతు
రాత్మవిదు లైనవారల కరసి చూడ
నవియ వైరాగ్యహేతువు లై జనించు.69
క. చే తప్పి చనిన కార్యము
లాతతమతి విడువు, నీకు నబ్బినసుఖముల్
ప్రీతిన్ గైకొను సంవి
చ్చాతుర్యుఁడ వగుము రామ సంసారమునన్.70
గీ. శూన్య మగుట గాంచి శోకింప రెన్నఁడు,
నమరవనఫలాదు లబ్బె నేనిఁ
జిత్తమునను వాంఛ సేయ రుత్తము లగు
వారు, సూర్యునట్ల వసుమతీశ.71
వ. అనిన విని రఘూత్తముం డి ట్లనియె.72
క. ఈసృష్టియొక్క విధమే
భాసురముగ నెట్లు పెక్కుభంగుల నగునో
యీ సందు తెలియఁజెప్పుము
భూసురవరతిలక చిత్తమున కిం పెసఁగన్.73
వ. అనిన వసిష్ఠుం డి ట్లనియె.74
చ. ఒకమఱి రుద్రనిర్మితము, నొక్కొకవేళ విరించినిర్మితం,
బొకయెడ విష్ణునిర్మితము, నొక్కొకచో మునికల్పితంబు, నౌ
నొకకడ శూన్య మై యణఁగు, నొక్కొకపట్టును దాన కల్గు, సృ
ష్టికి నిది యిట్లె పుట్టు నని సెప్పుఁగరా దినవంశవల్లభా.75
వ. మఱియు నొక్కయెడ భూమి యంతయుం దరులతాకీర్ణంబగు. నొ
క్కచోట జనసాంద్రం బై యుండు. నొక్కకాలంబునఁ బర్వతాక్రాం
తం బై యుండు. నందొక్కవిరించిజననం బెఱింగించితి. నింతి.య కాని
సృష్టి కిది నిశ్చయం బన రాదు. ఈ యర్థంబున జగన్మాయాస్వ
రూపంబు తేటపడం జెప్పెద; నాకర్ణింపుము.76
ఉ. భూరిగుణాఢ్యుఁ డొక్కమునిపుంగవుకూర్మితనూభవుండు దా
శూరుఁడు వేదపారగుఁడు సువ్రతుఁ; డాతని తల్లిదండ్రులున్
ఘోరవనంబులోన మృతిఁ గూలిన బెగ్గిలి యేడ్చుచుండఁగా
ధీరతఁ దోఁప వచ్చి వనదేవత పల్కె దయాసమేత యై.77
ఉ. ఇచ్చటఁ గాన నొక్కఁడవ యేటకి నేడ్చెద? వన్న, యేడ్వఁగాఁ
జచ్చినవారు వచ్చెదరె, చావును బుట్టును సృష్టి కింతకున్
వచ్చినజాలు గాక, మనవారికె వచ్చెనె? దేహ కోటికిం
జచ్చు టనశ్య, మెందును విచారము సేయకు, దేహధర్మముల్.78
క. ఉదయంచుచు విహరించుచుఁ
బదపడి నస్తమితిఁ బొందుభానునిభంగిన్
విదితము జీవుల కెల్లను
నిది సహజము వీరి కడల నేటికిఁ బుత్త్రా.79
వ. ధీరోదాత్తుండ వై తెలిసి నిలువు మని బోధించిన నవ్విప్రకుమా
రుండు దుఃఖం బుడిగి; తల్లిదండ్రులకుఁ బరలోకక్రియ లాచరించి,
తపంబు సేయ నుద్యుక్తుం డై.80
క. శ్రద్ధాజడమతి నెందును
శుద్ధం బగుభూమి లేమి సూచి, యది కడున్
శుద్ధం బని వృక్షముతుది
సిద్ధాసననిష్టఁ దపము సేయుచు నుండెన్.81
సీ. ఆతనితపమున కగ్ని ప్రత్యక్ష మై
వరము లిచ్చుటయును వాడు మఱియుఁ
దనరు నావృక్షాగ్రమున నుండి యజ్ఞార్థ
పరత మై మఱి దివస్పతిగుఱించి
దశహాయనంబులు తప మాచరించుచు
మానసంబున వస్తుమహిమఁ గూర్చి
నాకుల రప్పించి నరహయగోమేధ
యాగంబు లెన్నఁ బె క్కాచరించెఁ;
గీ. బరఁగ బహుదక్షిణల విప్రవరులఁ దనిపి
కాలవశమున నాతనికర్మఫలము
చిత్తనైర్మల్య మొందింపఁ జెన్ను మీఱ
జ్ఞానరూపము దనయంత గానఁబడియె.82
వ. ఇవ్విధంబున దాశూరుండు నిర్మలజ్ఞానసమేతుం డై యుండునంత.83
చ. స్థిరమతి నొక్కనాఁడు వనదేవత యమ్మునినాథుపాలికిన్
బరువడి నేగుదెంచి ప్రణిపత్తి యొనర్చుచు సంయమీంద్ర చె
చ్చెర నొకపుత్త్రు నాకు దయ సేయుము; సేయక యున్న నీపదాం
బురుహములొద్ద నే ననలమున్ వెసఁ జొచ్చెద నన్న నవ్వుచున్.84
వ. దాశూరుండు దనచేతికమలం బద్దేవికి సమర్పించి 'మాసమాత్రంబున
విమలలోచనుండును శాంతుండును నగుతనయుం గాంచెదు, పొమ్ము;
నన్ను నిర్బంధించి యడిగితివి గావున నీతనూజుం డజ్ఞాని యగు.' నని
పలుకుటయు, నద్దేవతయుం బ్రసన్నముఖారవిందయై, 'యట్లేని నీకుం
బరిచర్య సేయుచుండెడు, నీప్రసాదంబున నుద్భవించినకుమారుండు
పరమజ్ఞానసమర్థుండుగా దయజేయు' మనిన నల్ల కాక యనివీడ్కో
ల్పుటయు, నద్దేవత చనియె నంత.85
క. నెలనాళులు నిండగ న
ప్పొలతికి నుదయించె సుతుఁడు పుణ్యాత్ముఁడు ని
ర్మలతేజోనిధి కడుఁ బెం
పొలయఁగ నవలతకుఁ బుష్ప ముదయించుగతిన్.86
వ. ఇ ట్లుదయించుటయు నద్దేవి యక్కుమారు నెత్తుకొని చనుదెంచి
యమ్మునిపుంగవుని పాదకమలంబులు సోఁక బాలునిఁ బెట్టి తానును
వినయావనతవదనారవింద యై 'మునీంద్రా, నీప్రసాదంబున నుద
యించినయిక్కుమారునకు జ్ఞానోపదేశంబు సేయుం డ'ని ప్రార్ధిం
చిన నమ్మునిప్రవరుండు౼87
క. వేదములును శాస్త్రములును
వేదార్థంబులుఁ బురాణవిద్యలుఁ గథలున్
మోదమునఁ జెప్పి యొకనాఁ
డాదరమునఁ బుత్త్రుఁ జూచి యమ్ముని పలికెన్.88
గీ. ఓకుమార నీకు నొకకథఁ జెప్పెద
సర్వతత్త్వశాస్త్రసమ్మతంబు
నఖలలోకసేవ్య మైనయర్థం బిది
వినుము చిత్తగించి యనఘచరిత.89
సీ. స్వాంతుండు నా నొక్కసౌందర్యవంతుండు
భుజవీర్యవిఖ్యాతుఁ డజితబలుఁడు
శ్రీమంతుఁ డుత్తమస్థితి యతిశూరుండు
రాజశిరోమణి రాజఋషభుఁ
డారూఢకులజాతుఁ డసమానచారిత్రుఁ
డతిసూక్ష్మబుద్ధి గర్వాతిరూఢుఁ
డతిసాహసుఁడు గలఁ; డతఁడు సేయఁగ సుఖ
దుఃఖకారణము లై తోఁప పనులు
గీ. తలఁచి చూడంగ జలనిధితరఁగలట్టు
లెన్న గోచర మై యుండ నెసఁగు; నతఁడు
విహరణక్షమలీలల విశద మైన
యట్టి దేహత్రయము దాల్చి యలరుచుండు.90
వ. తచ్చరిత్రంబు జగంబులం దా నాక్రమించి యుత్తమమధ్యమాధమం
బులై యుండు. నతం డాకాశంబునఁ జరించుపక్షియుంబోలె నంద
సంచరించుచుండె. ననిన విని పుత్త్తుం డి ట్లనీయె.91
సీ. అయ్య, స్వాంతనాముఁ డతఁ డెవ్వ? డెబ్భంగిఁ
దనువు లెన్ని దాల్చి వినుతి కెక్కె?
నెచట నుండు? నాతఁ డేలీల విహరించెఁ?
జెప్పు మనిన, నతఁడు చెప్పఁ దొణఁగె.92
క. విను పుత్త్ర, తెలియఁ జెప్పెద,
ఘన మగుసంసారచక్రకలనం బిది; త
జ్జననము సవస్తువిస్తర
మును నగుకథ యగుట చిత్తమునఁ గనుఁగొనుమీ.93
సీ. పరమవియద్వీథిఁ బ్రభవించునట్టి సం
కల్పంబు స్వాంతవిఖ్యాతి నొందుఁ;
దాన జనించుచుఁ దాన లీనతనొందు
నతఁడు యఖిలంబు నని యెఱుంగు;
హరిహరబ్రహ్మాదు లందఱు నాతని
యవయవరూపు లై యలరుచుంద్రు;
ఘనజగత్త్రయము నాతనిపట్టణం బగు;
వానితలంపున వనజభవుఁడు
గీ. నిలఁ జతుర్దశభువనంబు లేలెఁ దాన;
పవనము లెల్లను నుద్యానవనము లతని;
కరయ మందరమేరుహిమాద్రు లెలమి
కేళశిఖరుల నా నెందుఁ గీర్తి కెక్కు.94
వ. శీతోష్ణరుదు లయిన సోమసూర్యులు దీపంబులు, నుత్తుంగతరంగంబులు
గల గంగాదినదులు ముక్తాహారంబులు, లవణేక్షుదధిక్షీరాదులు సలి
లంబులును ముక్తామణులు విద్రుమాంకురంబులును బాడబంబును జ
లంబునుం గల సప్తార్ణవంబులు కేళిదీర్ఘిక లై యొప్పారు. జగ
ద్విహారంబునన్ గృతార్థంబు లగు శరీరగృహంబుల సంకల్పమహా
మహీపాలుం డధమోత్తమమధ్యమంబు లగు తమోరజస్సత్త్వగు
ణంబు లనుదేహత్రయంబులో విహరించు. నవి యెట్టి వనిన.95
క. అరయఁ దమోరూపంబునఁ
బరఁగినసంకల్పలీల ప్రాకృతచేష్టా
పరతయు దీనత్వము నై
తరమిడి క్రిమికీటకాదితనువులు దాల్చున్.96
గీ. సత్త్వరూప మైన సంకల్ప మది యాత్మ
బోధరమ్యనిత్యబుద్ధిఁ దగిలి
కేవలంబ యాత్మభావంబు దాన యై
యవనిరాజ్య మేలినట్టు లుండు.97
గీ. సకలసంసారభోగవాసనలఁ దగిలి
పుత్త్ర దారాదిమిత్త్రులమైత్త్రి నెగడి
జననమరణాదిసుఖదుఃఖసమితి మునుఁగు
ఘనరజోరూపసంకల్ప మనఘచరిత.98
క. ఈ సంకల్పత్రయమును
నోసరిలం జేసి చిత్త మొక్కింతయ కాఁ
జేసి పరమాత్మఁగూర్చిన
యాసంళకల్పమునఁ బొందు మమలవిచారా.99
వ. సకలవిషయనిరససం బగుమనంబున మనోనియమనంబుఁ జేసి, బాహ్యా
భ్యంతరాదిసంకల్పత్రయంబు నాశం బొనరింపు. మనిన దాశూరునకు
బుత్త్రుం డి ట్లనియె.100
క. జనకా, యీసంకల్పం
బెనయఁగ నేవెంటఁ బుట్టె? నెబ్భంగి వివ
ర్ధన మొందు? నెట్టు లయ మగు?
వినిపింపుము దీనివిధము విస్పష్టముగన్.101
క. అనవుడు దాశూరుం డి
ట్లనియె. - ననంతస్వరూప మగునాత్మునకున్
ఘనసంసారోన్ముఖతయ
విను సంకల్పంబు నాఁగ వెలయుఁ గుమారా.102
వ. ఎట్లనిన, లవమాత్రంబగుపరమాత్మయ జగత్స్వరూపం బగు. మేఘంబు
నుంబోలె సాంద్రం బై చిత్తం బగునది ప్రపంచభావన నాత్మవ్యతిరి
క్తంబయి తోఁచు. బీజం బంకురం బయినట్లు, సంకల్పంబు ప్రపంచం
బగు. నీసంకల్పంబు తాన జనియించి, తాన వర్ధిల్లి, తాన యణంగు
చుండు. దీన సుఖంబు లేదు. దుఃఖం బాపాదించుచుండు. నట్లు
గావున సంకల్పభావన లుడిగి శుభంబు నొందుము.103
గీ. అనఘ, సంకల్పనాశన మయ్యెనేని,
యత్నములు మీఁదఁ బొడమక యణఁగి పోవు,
భావనాభావములు లేక పరఁగు నేని,
యదియ సంకల్పనాశన మగుఁ గుమార.104
గీ. కడఁగి సంకల్పమును నసంకల్పములును
మనము చేతన; మనమును దునిమి వైచి,
యాత్మనిష్ఠుఁడ వై యుండు, మట్లు సేయ,
దుష్కరము నీకు మఱి లేదు దోషదూర.105
వ. అని మునీంద్రుం డక్కుమారు బోధించె నని చెప్పి వసిష్ఠుండు మఱి
యు ని ట్లనియె.106
క. ఈ దాశూరాఖ్యానము
వేదాంతసమాన మాత్మవిద్యామృతమున్;
మోదమున నీకుఁ జెప్పితి
నాదరమున; నిది జగద్విహారము రామా.107
వ. అని దాశూరోపాఖ్యానంబు సెప్పి యింక నీస్థితిప్రకరణతాత్పర్యంబం
తయు నుపదేశంబునం జెప్పంబడు తత్ప్రకారం బెఱింగించెద, సావ
ధానుండవై విను మని వసిష్ఠుం డి ట్లనియె.108
క. తుది మొదలు లేక కాలం
బిద మిత్థ మనంగరాక యిందుల నూ
ఱేం డ్లిది యంత యింతకష్టపు
బ్రతుకులయం దేమి యాస్థ పరమవివేకా.109
క. భావశ్రీమయగర్విత
మై వెలసినయంతరాత్మ నడఁచినధీరుం
డేవెంటను విహరించునొ
యావెరవున సంచరింపు మర్కకులేశా.110
గీ. ఇచ్ఛ లేకయ రత్నంబు లెట్లు వెలుగు,
ఘటపటాదులు నెబ్భంగిఁ గానిపించు,
నట్ల యణుమాత్ర మగుపరమాత్మునందు
జగము లన్నియుఁ దనలోన సంచరించు.111
గీ. కణఁగి యాత్మయందుఁ గర్తృత్వమును నక
ర్తృత్వమును వెలింగి తోఁచుచుండు.
నాస లేక సేయు నటు గాన కర్త గాఁ
డెనయఁ గర్తల చెంత నునికిఁ జేసి.112
గీ. కార్యములు సేయునెడల దాఁ గాని వాఁడ
యైనభావన గట్టిగా నాత్మ నిలిపి,
సేయవలసినకార్యంబు సేయు, మన్ని
పనులయెడను నిర్లేపతఁ బరఁగు మెందు.113
గీ. అట్లు గాక యున్న నఖిలంబునకు నేన
కర్త ననుతలంపు గలిగియుండు;
సకలకార్యములును సమతమైఁ జేసిన,
యవియ యుత్తమంబు నని యెఱుంగు.114
వ, రాగద్వేషంబుల మోదఖేదంబులం దొఱంగి సంకల్పక్షయంబు సేయ
సమతయ చిక్కియుండు. కాదేవి సర్వకర్తవ్యంబును నకర్తృత్వం
బున విడిచి మనోలయంబు సేసి యెవ్వండు సుఖయించు నట్టివాఁడ
వై సుఖియింపుము.115
క. విను దేహాహంకారము
సునిశిత మగుచున్న కాలసూత్రపదవి దా
పనపథ మవీచివాగుర
ఘనమగునసిపత్త్రవనముఁ గాఁ దలఁపు మదిన్.116
ఉ. కర్తకు నేను నీతఁడును గా మని యైనఁ దలంపు, మింతకున్
గర్తను నేను వేఱొకఁడు గాఁ డని యైనఁ దలంపు, మెవ్వఁడో
కర్త మ ఱేను నెవ్వఁడనొ కార్యమునం దని యైన, నుత్తముల్
వర్తిలుశిష్టమార్గమున వర్తిలి, సౌఖ్యము నొందు రాఘవా.117
క. వాసనలఁ దగులు బంధము,
వాసన లుడుగుటయ మోక్షపద, మని మదిలో
వాసనలు దొఱఁగి మఱి మో
క్షాసక్తియు విడువు మీఁద నర్కకులేశా.118
వ. ఆందు మనోవాసనలు విడిచి నిర్మలంబు లగుగుణమైత్ర్యాదివాసన
లం గీలింపుము. తద్వర్తనంబుం దెలిసి యవియునుం బరిత్యజించి,
శాంతి వహించి చిన్మాత్రవాసనల సుఖించి, మనోబుద్ధిసమన్వితం బైన
తద్వాసనాపరిత్యాగంబు చేసి, సుస్థిరసమాధానంబున నెద్ది తెలిసిన
దదియునుం బరిత్యజించి, మనోవృత్తిం జేసి సర్వదృశ్యంబును విడుచున
ప్పు డెద్ది శేషించె, నదియ మోక్షం బనంబడు. నట్టిపుణ్యాతునకు సుజ్ఞా
నకర్మంబులు సేసిననుం జేయకుండినను విరోధంబు లేదు. మఱియును.119
క. పాయక నిర్వాసన ని
శ్శ్రేయోధికుఁ డైనయతనిచిత్తమునకు నా
ధేయంబును మఱి యందును
హేయంబును ననఁగఁ గలదె యినవంశనిధీ!120
గీ. యుక్తి సంచరింప నోపిన సంసార
మయము గోష్పదాభ మయి యణంగు;
యుక్తి లేక తిరుగునుద్వృత్తునకు మహా
ర్ణవముభంగి నతనిఁ దివిరి ముంచు.121
వ. ఈయర్థంబున ముదితాత్ములగుపూర్వజులచేత వినంబడు పావనంబు
లగుకచగాథలు గల వత్తెఱంగు తేటపడ నాకర్ణింపుము. బృహస్ప
తినందనుం డగుకచుం డాత్మసమాధిం దెలిసి యొక్కనాఁ డేకాంతం
బున నుండి గద్గదకంఠుం డగుచు మధురంబుగా ని ట్లనియె.122
కచుని గాథ
సీ. ఏమి సేయుదు? నింక నెక్కడ బోదు? నే
నేమి చేపట్టుదు? నేమి విడుతుఁ?
బ్రళయకాలాంబుధిభంగి విశ్వంబున
బ్రహ్మంబు నిబిడమై పరఁగుచుండు.
వెలుపల లోపల వెలయ దిక్కులయందుఁ
గ్రిందను మీఁదను సందులందు,
నిక్కడ నక్కడ నెల్లచోటుల నైన
నాత్మ లేకున్నచో టరయ లేదు:
గీ. ఒనర నే నెల్లచోటుల నున్నవాఁడ;
నన్నియును నిండి నాయందు నున్న వెపుడు,
నిఖిలజగములు చిన్మయం బై వెలుంగు
నాత్మలోపల; నే నేమి యభిలషింతు?123
వ. అని నిరంతరానందపరిపూర్ణమానసుం డై యుండె నని కచగాథ
ప్రసంగం బెఱింగించి వసిష్టండు మఱియు ని ట్లనియె.124
క. ఎవ్వరు సత్త్వగుణంబున
నివ్వటిలుదు! రట్టియోగనిత్యులు సుఖు లై
యెవ్వేళ నైన వాడరు
మవ్వం బగుకనకమయకమలముంబోలెన్.125
గీ. కోరవలసినవస్తువు కోరికొనరు,
కడు రమింతురు సిద్ధమార్గములయందుఁ,
జంద్రబింబంబులోపలిశైత్య మట్ల
గుణము లెడఁబాయ రాపదగూడినపుడు.126
గీ. ఈ రహస్యోపదేశము నిట్లు నీకు
నెఱుఁగఁ జెప్పితి మున్ను నాయెఱిఁగినంత;
శాంతచిత్తుఁడ వై వెలిచింత లుడిగి
నిత్యసుఖి వై చరింపుము నృపవరేణ్య.127
వ. అని యిట్లు స్థితిప్రకరణకథాప్రసంగంబు వసిష్ఠుండు రామచంద్రున
కెఱింగించె; ననిన విని భరద్వాజమునీంద్రుండు వాల్మీకి కి ట్లనియె.128
గీ. అమృతరససమాన మగుభవద్వాక్యంబు
లర్థి వినఁగ మరి గృతార్థ మయ్యె;
ననఘ, యవ్వసిష్ఠుఁ డటమీఁద రఘుపతి
కేమి సెప్పె, దాని నెఱుఁగవలయు.128
వ. అని యడుగుటయు.129
అంబురుహమాలావృత్తము. శ్రీరమణీముఖపద్మదివాకర శిష్టమానసమందిరా
భూరిదయాకర పూరితషడ్గుణ భూషణా రిపుశోషణా
వారిజసంభవపూజిత సోమదివాకరానలలోచనా
వారదగీతచరిత్ర యహోబలనాయకా శుభదాయకా.130
క. ఆద్వైతవాదమహిత భ
రద్వాజ వసిష్ట భృగు పరాశర శుక కృ
ష్ణద్వైపాయనముని ముఖ
విద్వన్నుతనిత్యచరణ విశ్వాభరణా.131
మాలిని. కువలయదళభాసా కుందమందారహాసా
భువనభరణదక్షా పుండరీకాయతాక్షా
ధవళవిపులకీర్తీ ధర్మరాగానువర్తీ
వివిధమతివిహారీ విశ్వలోకోపకారీ.132
గద్య
ఇది శ్రీనృసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బైనవాసిష్ఠరామాయణంబు
నందు స్థితిప్రకరణం బన్నది
తృతీయాశ్వాసము