వాసిష్ఠరామాయణము/చతుర్థాశ్వాసము

వాసిష్ఠరామాయణము

చతుర్థాశ్వాసము

క. శ్రీ గౌరీసంతతనుత
     సాగరతనయాకుచాగ్రసన్మణిహారా
     నాగేంద్రశయన ఘనది
     ఙ్నాగేంద్రపరీతకీర్తి నరమృగమూర్తీ!.1

ఉపశమనప్రకరణము

.

వ. దేవా, సకలతత్త్వార్థవివేకి యగువాల్మీకి భరద్వాజున కి ట్లనియె.
     నట్లు స్థిత్యుత్పత్తిప్రకరణంబు సెప్పి వసిష్ణుండు రామచంద్రుం గనుం
     గొని యిట్లు వక్కాణించె. రాఘవతిలకా! జగదుత్పత్తిస్థితిలయకా
     రణంబు మనం బని సెప్పంబడు. తత్ప్రశమనోపసిద్ధిదం బగునుపశమ
     నప్రకరణంబు సెప్పెద. నందు, జనళ, పుణ్యపావన, బలి, ప్రహ్లాద,
     గాధి, ఉద్దాలక, సురఘు, భాసవిలాస, వీతహవ్య, ఆకాశగత్యభా
     వంబు లనం బరఁగినట్టి జీవన్ముక్తివర్ణితం బైన యితిహాసదశకంబు
     గలదు. అందు ప్రథమం బగుజనకోపాఖ్యానంబు తేటపడ నెఱింగించెద
     నాకర్ణింపుము.2

జనకోపాఖ్యానము

క. మునినుతచారిత్రుఁడు దు
     ర్జనదూరుఁడు మిథిల యేలు జనపతి జనకుం
     డనునతఁడు రాజ్యసుఖములు
     మనముఁ దగిలి యాత్మసుఖము మఱచి తిరుగఁగాన్.3

ఉ. అంతఁ బ్రవేశ మయ్యె మదనాధిపరాజ్యరమావిభూషణా
     నంతము భూరిసౌరభలతాంతము కోకిలచంచరీకసా
     మంతము పూర్ణచంద్రరుచిమంతము పాంథవిలాసినీమనో
     ధ్వాంతము దంపతిస్వదనవంతము నాఁగ వసంత మున్నతిన్.4
వ. ఇట్టి వసంతసమయంబు సకలజీవస్వాంతసంతోషణశ్రాంతంబై ప్రవ
     ర్తిల్లుచున్న సమయంబున.5
గీ. ఉల్ల మురియాడ మధువేళ నొక్కనాఁడు
     వనమునకు నేఁగి, తనుఁ గొల్చి వచ్చుజనుల
     నునిచి, యొక్కండ చని, యందు నొకతమాల
     కుంజమున నాడుమాటలు కోరి వినియె.6
క. విని డాయఁ బోవునప్పుడు
     తనువు లదృశ్యంబు లగుచుఁ దనరెడుసిద్ధుల్
     వినుతచరితార్థగీతలు
     పనుపడఁ దమలోన నిట్లు పలికిరి రామా.7
వ. అందుఁ బ్రథమసిద్ధుండు.8
గీ. చూడఁ బడుచున్నవస్తువుఁ జూచి దాని
     యోగమున నాత్మతత్త్వసముత్థమైన
     జ్ఞాననిశ్చయనిశ్చలానంద మెద్ది
     యది యుపాసింతు మనమున ననుదినంబు.9
క. పూని యభీష్టపదార్థము
     గానంబడునపుడు చిత్తకలితం బగున
     య్యానంద మెద్ది యది బ్ర
     హ్మానందం బని భజింతు ననవరతంబున్.10
వ. అనిన విని రెండవసిద్ధుండు.11
గీ. ద్రష్టృదర్శన దృశ్య సంతతిఁ దదీయ

     వాసనాయుక్తముగ నెడఁబాసి ప్రథమ
     దర్శనాభాస మైనయాత్మస్వరూప
     మెల్లకాలంబు నే భజియింతుఁ దగిలి.12
క. ఏవెలుఁగు తాన వెలుఁగఁగ
     నావెలుఁగునఁ గానిపించు నఖిలము వెలుఁ గై,
     తా వెలసి మొదల వెలిఁగెడు
     నా వెలుఁ గగునాత్మ నే నుపాసింతుఁ దగన్.13
వ. అనిన తృతీయసిద్ధుండు.14
గీ. కలదు లే దను రెండుపక్షములనడుమఁ
     జెంది సర్వంబుఁ బొడగానఁ జేయుచున్న
     యట్టి నిత్యస్వరూపంబు నాత్మయందు
     నిలిపి సద్భక్తి సతతంబు దలఁతు నేను.15
క. ఆకారము గల దనియు నీ
     రాకారం బనియు శూన్య మను జనమతముల్
     సోఁకక సంవిద్రూపు ని
     రాకారము నైనయాత్మ ననుసంధింతున్.16
వ. అనినఁ జతుర్థసిద్ధుం డి ట్లనియె.17
మత్తకోకిల. ఆజగత్పతి చిత్తగేహమునందుఁ గాపుర ముండగాఁ
     బూజసేయక యొండువేల్పులఁ బూని కొల్వఁగఁ బోవుటల్!
     రాజసంబునఁ జేతికౌస్తుభ రత్న మొల్లక బేల వై
     గాజుఁబూసలు విల్వ సేయఁగఁ గాంక్షసేసెద రే మనన్.18
క. అని సిద్ధవరులు పలికిన
     యనుపమగీతార్థగీత లన్నియుఁ దనలోఁ
     గనిఖేద మినుమడింపఁగ

     ననఘాత్ముఁడు జనకుఁ డిట్టు లని చింతించెన్.19
సీ. కటకట! యత్యంతకష్టతరంబులు
                    లోలంబు లైనయాలోకదశల,
     ఱాలపైఁ బొరలె డిఱాతిచందంబున
                    ననిశంబు బొరలుచు, నవధి లేని
     కాలంబునం దొక్కకళ యైన లేని యీ
                    బ్రతుకునకై పొక్కి పడెడునాకు
     నీరాజ్య మన నెంత? యింత యేమిటి? కిది
                    పాసియుఁ బాయక భ్రమలఁ బెట్టు
గీ. నిట్ట సంసారతరుమూల మీ మనంబు
     ఇదియ సంకల్ప మనఁబడు నిట్టిమనముఁ
     ద్రుంచి యీపాదపంబు నెండించువాడ,
     నేల మూఢునిగతి నాకు నిందుఁ దగుల?20
క. తెలిసితిఁ దెలిసితి; నిఁక నా
     తలఁపులు చేకూఱెఁ; బ్రజ్ఞఁ దరలించెడు నీ
     ఖలు నాత్మచోరుఁ జిత్తము
     బలిమి నిరోధించి త్రుంచి భ్రాంతి నణంతున్.21
క. దేవత లగునీసిద్ధులు
     వావిరిఁ దలపోయుసాధువాదంబుల ని
     ష్టావాప్తి యయ్యె; నానం
     దావృత మగునాత్మపదము నందెదఁ బ్రీతిన్.22
క. ఇది యే, నిది నాయది, యని
     మదిఁ బొడమెడు నహమికామముత్వము లుడిగెన్,
     హృదయరిపుఁ డణఁగె, శాంతియు
     విదితం బై తోఁచె, నోవివేకమ జేజే.23

గీ. అని విచారించి పరమసమాధి నొంది
     శాంతనిశ్చలచిత్తుఁడై జనకవిభుఁడు
     చిత్రరూపంబుకైవడి చేష్ట లుడిగి
     ధారుణీనాథ కొంతసే పూరకుండె.24
వ. ఇవ్విధంబున నుండి కొంతప్రొద్దునకుం దెలిసి యవ్వనంబు వెలువడి
     నిజపరిజనంబులం గూడుకొని.25
క. తనపురికి నరిగి జనకుఁడు
     పనుపడఁ గర్తవ్య మైనపనులు నిరీహం
     బునఁ జేయుచుండె నిచ్చలు
     దిననాథుఁడు దినము గడపు తెఱఁగున నధిపా.26

పుణ్యపావనోపాఖ్యాన్యము

.

వ. అని చెప్పి వసిష్ఠుండు వెండియు ని ట్లనియె - ఆకాశఫలపాకంబునం
     బోలె జనకజ్ఞానంబు వర్ణింపంబడియె. నట్లు గావున యోగసిద్ధి క్ర
     మాభ్యాసంబున సిద్ధించు నని మోక్షశాస్త్రంబుల వినంబడు. నీకథా
     కర్ణనంబునం జేసి యాత్మజ్ఞానంబు ప్రకాశించి చిత్తశాంతి యొన
     ర్చుఁ నట్టిపుణ్యపావనోపాఖ్యానంబు గల; దందు మొదలం బ్రశాంత
     స్వాంతుఁ డయ్యును జీవన్ముక్తుం డై వర్తించుట సెప్పంబడు. నాక
     ర్ణింపుము.27
సీ. అన విని రాముఁ డిట్లను మహాభాగ! నీ
                    మితవాక్య మతులగంభీర మరయ,
     విను మహంకారంబు విడు మని సెప్పితి
                    నీయహంకృతి మాన్ప నెట్లు వచ్చు?
     నిఖిలదేహంబులు నిశ్శేష మై పోక
                    యది యేకతమ మాన్ప నలవి యగునె?
     కూఁకటివేళ్లకుఁ గొడవంటఁ గోయక

                    భూమీరుహం బెండిపోక యున్నె?
గీ. యనిన నమ్ముని౼వాసన లణఁపవలయు;
     నవి యణంపంగ రెం డుపాయములు గలవు,
     ధేయ మన నేయ మన; నీవి దేటపఱుతు
     చిత్తగింపుము; రామ రాజీవనయన.28
వ. అవి యెయ్యవి యంటేని.29
మ. ఇవి నాప్రాణము, లీపదార్థములు నా కేప్రొద్దు ప్రాణంబు, నా
     కవి యెందున్ వెలి గావు, వీని విడి నే నెట్లుందు? నంచుండు నీ
     యవిచారం బెడలించి, ద్రవ్యములయం దాసక్తి చాలించి, కృ
     త్యవిధుల్ శీతలభాతిఁ జేయుటయ ధేయత్యాగ మౌ రాఘవా.30
గీ. సర్వమును నేన యనుబుద్ధి సర్వ మైన
     వాసనాక్షయ మొనరించు వరుసఁ; దాన
     మనముతోడనె దేహసంబంధ మెడలు;
     నదియ చూవె నేయత్యాగ మమలహృదయ.31
క. తనర నహంకృతి యనువా
     సనవలనఁ దొఱంగి మిగుల శాంతాత్మకుఁ డై
     మను నాధేయత్యాగిని
     విను జీవన్ముక్తుఁ డండ్రు విమలవివేకా.32
క. కర్మములను వాసనలను
     నిర్మూలము గాఁగ విడిచి నిఖిలము దానౌ
     ధర్మము నేయత్యాగం;
     బర్మిలి నాతండె ముక్తుఁ డర్కకులేశా.33
క. ధేయత్యాగవిలాసత
     నాయత మగుపూర్ణదృష్టి నంతయు నీవై
     పాయక జీవన్ముక్తుఁడ

     వై యిల విహరించుచుండు మనిశము రామా.34
క. వెలిఁ గృత్రిమసంరంభం
     బలవడఁ గర్తయును నీవ యై చిత్తములో
     పల సరభసకర్తృత్వం
     బులు దొఱఁగి చరింపు లోకమున రఘురామా.35
గీ. ఇతఁడు నాకు మిత్త్రుఁ డితఁ డమిత్త్రుం డగు
     నని తలంచువార లల్పమతులు
     తగ నుదారచిత్తు లగువారి కెందును
     వసుధ యెల్ల బంధువర్గ మరయ.36
తరల. వివిధజన్మశతావృతం బయి విభ్రమం బగుసృష్టిఁ దాఁ
     బ్రవిరళంబుగ వీరు బంధు లబంధు లీ రని చూడఁగా
     నవిరళభ్రమ గాని తాఁ బరమార్థ మెందును గాదు; త్రై
     భువనమున్ నెఱి బంధురం బగుబుద్ధి బంధువు గా దిలన్.37
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె.38
సీ. తనరు నీయర్థంబునను బుణ్యపావన
                    చరితంబు చెప్ప నచ్చెరువు వినుము,
     దీర్ఘతముం డనుదివ్యమునీంద్రుని
                    తనయులు పుణ్యపావనులు నాఁగ
     గల రిద్ద. ఱందు నగ్రజుఁడు బ్రహ్మజ్ఞాని
                    పుణ్యుండు. తమతండ్రి పుణ్యలోక
     గతుఁడైన విప్రసమ్మతితోడ నతనికి
                    బారలౌకికములు భక్తిఁ జేసి,
గీ. యనుజుఁ బొడగాన కెంతయు నడవి వెదకఁ
     బోవునప్పుడు కానలోఁ బొగలిపొగిలి

     తండ్రిఁ బేర్కొని వనరుచు ధరణిఁ బొరలు
     చున్న తమ్మునిఁ బొడగాంచి యుమ్మలించి.39
క. తూలుచుఁ డగ్గఱి కౌఁగిటఁ
     గీలించుచుఁ గంటినీరు గీటి యతనిపై
     ధూళి వెసఁ దుడిచి నెమ్మొగ
     మాలోకించుచును బుణ్యుఁ డనుజుని కనియెన్.40
ఉ. ఏమిటి కిందు నొక్కఁడవ యేడ్చెద వక్కట! నేను గల్గ నీ
     కేమి భయంబు? నీజనకుఁ డెందును బ్రాజ్ఞుఁడు, దివ్య మైన తే
     జోమయసిద్ధిఁ గాంచె; విను శోకముఁ జెప్పఁగ నేల! మున్ను నీ
     కీమహి తల్లిదండ్రు లీటు లెందఱు చావరు? లెమ్ము తమ్ముఁడా.41
వ. అది యెట్లంబేటేని; యత్యంతమోహవిస్తీర్ణంబును, శుభాశుభ తరంగి
     తంబును, నైన వాసనామరుమరీచికాజలాశయం బనంతం బై ప్రవ
     ర్తిల్లు, నందు పుత్త్ర మిత్ర్ర కళత్ర శత్రు లన నుదయించి స్నేహ
     మోహ ద్వేష దోష దశామయం బై స్వసంజ్ఞామాత్రం బగు నీప్ర
     పంచంబున శత్రుభావంబున శత్రుండును,మిత్త్రభావంబున మిత్త్రుండు
     నై విషామృతభావారూఢి నుండు, నేకత్వంబున సర్వపరిపూర్ణం బగు
     నాత్మ కితండు హితుం డితం డహితుం డను నివి కల్పనాకృతు. లిట్లు
     గావున.42
గీ. పలలరక్తాస్థిమయదేహపంజరమున
     నకట నే నేల యున్నాఁడ! నని తలంపు.
     మేలు నీ వను నిద్ది యజ్ఞానబుద్ధి
     గాని, పరమార్థమున వేఱు గలుగ దెందు.43
క. అని బోధించినఁ దెలియక
     తనజనకుని తలఁచితలఁచి తలపోయుచు హా
     యని యేడ్చుచున్న పావనుఁ

     గనుఁగొని పుణ్యుండు తత్త్వగతి నిట్లనియెన్.44
క. ఈతండ్రికి నడలినగతి
     నాతతముగఁ దొంటిభవములందులఁ గల యా
     తాతలకుఁ బుత్త్రమిత్త్ర
     వ్రాతములకుఁ జుట్టములకు వగపం దగదే.45
వ. అది యెట్లం టేని.46
సీ. అనఘాత్మ విను మొక్కయద్రిశృంగంబున
                    సింహమ వై జనించితివి మున్ను,
     మఱి దశార్ణక్షితి మర్కటం బై పుట్టి
                    తగఁ దుషారంబున ధరణిపతికిఁ
     బట్టివై యుదయించి, పౌండ్రదేశంబున
                    కాకమై యుదయమై, క్రమముతోడ
     హైహయంబున మదహస్తి వై జనియించి,
                    గార్దభం బైతి త్రిగర్తభూమి,
గీ. సురఘుసుతుఁ డన సాల్వభూవరుఁడ వైతి;
     సరభసంబునఁ బక్షి వై సంచరించి,
     తేమి సెప్పుదు నీబాము లెన్నఁ బెక్కు;
     లందు నేబంధులకు నేడ్చె దనుజవర్య?47
క. జననీజనకులు పురుషున
     కనంతముగఁ బొలిసి పోదు. రది యేటిదియో!
     ననతరుపత్త్రము లెట్ల
     ట్లని యెఱుఁగుము. దీని కేల యడలెదు వత్సా?48
గీ. కలదు లే దను రెండుపక్షములనడుమ
     జరయు మరణంబు లేక నిశ్చలత వెలుఁగు
     నట్టిపరమాత్మతత్త్వ మవ్యగ్రబుద్ధిఁ

     దలపు; మూఢుఁడ వై పోకు తమ్ముకుఱ్ఱ.49
మ. అకలంకాత్ముఁడ వై నిరామయుఁడ వై యానందచిత్తుండ వై
     సకలవ్యాపకతత్త్వబోధనిధి వై సమ్యగ్విధిన్ నీ మనో
     వికచాబ్జంబున నిన్ను నీవ యెపుడున్ వీక్షించుచున్ సంభ్రమో
     త్సుకభావంబులఁ బాసి నిత్యమును సంతుష్టుండ వై యుండుమీ.50
వ. అని యనేకప్రకారంబుల బోధించిన యగ్రజువాక్యంబులు విని పావ
     నుండు సర్వదుఃఖరహితుండును, సర్వసంగవిముక్తుండుసు, జీవన్ముక్తుం
     డు నై ప్రవర్లిల్లె నని పుణ్యపావనోపాఖ్యానంబు సెప్పి, వసిష్ఠుండు
     రామచంద్రున కి ట్లనియె. ఒక్కొక్కయెడలఁ బుణ్యాతిశయంబునం జేసి
     వైషయికసుఖము వైరాగ్యకారణం బగుట వర్ణింపంబడు. నీయర్థం
     బున బల్యుపాఖ్యానంబొక్కటి సెప్పెద; నాకర్ణింపుము.51

బల్యుపాఖ్యానము

క. అనుపమపుణ్యుఁడు వైరో
     చనుఁ డనుదనుజేంద్రవరుఁడు సకలావనియున్
     ఘనుఁ డై పదికోటుల హా
     యనములు పాలించి సౌఖ్య మందుచు నుండెన్.52
సీ. వసుధపైఁ గలమహావస్తుసమూహంబు
                    లన్నియుఁ గ్రమయుక్తి ననుభవించి,
     భోగేచ్ఛఁ దనిసి తా బుద్ధిలోఁ జింతించె
                    నొకనాఁడు మేడపై నుండి యతఁడు;
     'మూఁడులోకముల కద్భుతకారణంబును
                    నఖిలభోగాఢ్యంబు నైనరాజ్య
     మతిమోహమధురంబు నస్థిరంబును నిది.
                    యేటికి నీభోగ మేల నాకు?
గీ. ననుభవించుపదార్థమే యనుభవించి,

     పొంది విడిచిన కాంతనే పొంది విడిచి,
     దినదినంబులు భ్రాంతుఁ డై తిరుగుచుండు
     ప్రాజ్ఞుఁ డైనను మఱి సిగ్గుపడఁడు కంటె.53
క. రేలుఁ బగుళ్లును విడివడి
     యోలిన చనుదెంచుచుండు; నుడుగుట లే; దీ
     కాలము చర్వితచర్వణ;
     మాలోకింపంగ సుఖము లల్పము లెందున్.54
వ. అని విచారించి తల్లి తన బాల్యంబునం దనతండ్రి యగువిరోచ
     నుండు తన కుపదేశించిన వాక్యంబులు నాఁడు తలంచుకొని యతండు
     శాంతస్వాంతుం డై యుండె. నవి యెయ్యవి యంటేని.55
సీ. బలి యొక్కనాఁ డతిభ క్తితోఁ దనతండ్రి
                    పాలికి నేతెంచి ప్రణతుఁ డగుచుఁ,
     'బుణ్యాత్మ! సుఖదుఃఖములకు దూరం బగు
                    నద్దేశ మెద్దిటి నా కానతిమ్ము;
     ఎచ్చోట విద్యయు నీషణత్రయమును
                    జడిసి పోఁజేయు, విశ్రాంతి యొసఁగు?'
     నని వేడుటయుఁ, దండ్రి తనయున కిట్లను,
                    వినవయ్య నందన, వితత మైన
గీ. వరచిదాకాశకోశకోటరము పొల్చు;
     నందు బ్రహ్మాండకోట్లు వ క్కణఁగి యుండు,
     నచట నేలయు నింగియు నంబునిధులుఁ
     దరులు గిరులును నదులుఁ దీర్థములు లేవు.56
ఉ. అందు విశాలతేజుఁడు నృపాఖ్యుఁడు సర్వసముండు సంతతా
     నందుఁడు సర్వసాక్షి యనఁ జాలిన యవ్విభుఁ డేలుచుండఁగా
     నెందు నియుక్తుఁ డై యతని కేపను లైనను బెంపఁ ద్రుంప న

     స్పందబలాఢ్యుఁ డైన యనుసంధుఁడు మంత్రి గలండు పుత్త్రకా.57
వ. అనిన విని బలీంద్రుం డయ్యాధివ్యాధిరహితం బగునద్దేశం బెయ్యది?
     యది యెవ్విధంబునఁ బ్రాపించు? నది యెవ్వరిచేతం బొందంబడియె?
     సకలజగజ్జేత వగునీ కజయ్యుం డగునరపాలుం డెవ్వం? డతనిమంత్రి
     యెట్టివాఁ? డానతిమ్మని యడిగిన, విరోచనుం డిట్లనియె.58
సీ. అనఘాత్మ యొకదేశ మంటి నింతియ కాని
                    యవ్యయం బగుమోక్ష మదియ సువ్వె;
     షడ్గుణపూర్ణుండు సర్వాత్మకుఁడు నగు
                    నారాజు నాఁ బరమాత్మ సుమ్ము;
     అతని కతిప్రాజ్ఞుఁ డగుమంత్రి చిత్తంబ,
               యింద్రియార్థములఁ బాలించు నెపుడు;
     పరఁగ ననాస్థయుఁ బరమంబు నగుయుక్తిఁ
               గాని నాతని నోర్వఁ గడిఁది యెందు;
గీ. నిదియ యధికయుక్తి; యీయుపాయమునను
     మహిత మైనచిత్తమత్తగజము
     నణఁచినట్టి పుణ్య లందుదు రేప్రొద్దు
     నట్టి మోక్షపదము నచలహృదయ.59
వ. ఎట్లనిన నప్రాజ్ఞుండును, నల్పప్రాజ్ఞుండును, ప్రాజ్ఞుండును, నన ము
     వ్వురు గల; రందు నప్రాజ్ఞునకుఁ జిత్తంబున భోగానుభవంబు రెండుపా
     ళ్లును, శాస్త్రచింత యొక్కపాలునుం, గలిగియుండు. నల్పప్రాజ్ఞునకు
     భోగానుభవం బొక్కపాలును, శాస్త్రచింత రెండుపాళ్లును, గలిగి
     యుండు, ప్రాజ్ఞునకు చిత్తంబు భోగానుభవరహితం బై వైరాగ్యధ్యా
     నగురుపూజలం బరిపూర్ణం బై యుండు.60
క. విను మల్ప విగర్హణమున
     ధనము నుపార్జింపు; దానఁ దగుసాధుల మ

     న్ననఁ గూర్పు; వారి సంగతి
     ఘనవిషయము లణఁగఁ దత్త్వగతిలాభ మగున్.61
వ. అని యివ్విధంబునఁ దమతండ్రి యుపదేశించిన వాక్యంబులకు సంతు
     ష్టాంతరంగుం డై యచ్చేరువ నున్న శుక్రుం గని వినయావనతుండై
     బలి యి ట్లనియె.62
క. ఏ నెవ్వఁడ? నీ వెవ్వఁడ?
     వీనిఖిలము నెంతమాత్ర? మెట్టిది? యేరూ
     పే నిది? యెయ్యది గల? దిం
     దానతి యిం డనిన, శుక్రుఁ డతనికి ననియెన్.63
క. పెక్కు లిఁక నేల? మాకును
     గ్రక్కున దివి కరుగవలయు రక్షోదిప? నీ
     కొక్కటి తెలియఁగఁ జెప్పెదఁ,
     జక్కన విను సర్వశాస్త్రసారం బెల్లన్.64
గీ.. కణఁగి యెల్లచోటఁ గలది చిద్రూపంబు.
     అదియ నీవు నేను నఖిలములును.
     ఇదియ నిశ్చితార్థ. మిది దప్ప మఱి లేదు
     సర్వశాస్త్రసారసంగ్రహంబు.65
క. ఈయర్థము నిశ్చయముగ
     జేయక వేఱొక్కమతము సేయుట యెల్లన్
     వే యేల బూది వేల్చిన
     నేయినిఁ బోలియును మీఁద నిష్ఫల మందున్.66
గీ. అరయఁ జిత్తేచ్ఛయుత మగునదియు బంధ,
     మది విసర్జించి నిల్చిన నదియ ముక్తి,
     నియతిఁ జిత్తును జైతన్యకళ యనంగ
     సర్వసిద్ధాంతసంగ్రహసార మిదియ.67

క. ఈవిధము నిశ్చయం బగు
     భావారూఢప్రబోధపరిణతబుద్ధిన్
     నీవ నినుఁ జూచుకొంచును
     భూవినుత యనంతపదముఁ బొందుము ప్రీతిన్.68
వ. అని చెప్పి శుక్రుడు దివంబునకుం జనియె. బలియును నీజగత్త్రిత
     యంబును జిన్మయంబకా మనంబునం దలంచి దృశ్యదర్శనవిము
     క్తుండును, కేవలజ్ఞానమయుండును, నూర్జితుండును, నిరాభాసుం
     డును, సకలజగద్ద్రష్టయు, పరమేశ్వరుండును, నగు నాత్మ నే నని చై
     త్యనిర్ముక్తచిద్రూపుండును, సర్వపూరకంబును, సర్వంబును, శమితస
     కలసంవేద్యంబును, సంవిన్మాత్రంబును, నగు తత్త్వంబు దానయై
     మఱియును.69
సీ. ఇది తలంచుచును గోవిదుఁ డగుబలి ప్రణ
                    వంబునం దర్ధమాత్రంబులోని
     యర్థంబు మనమున ననవరతధ్యాన
                    కలితుఁడై కర్మసంకల్ప మెడలి,
     జితచైత్యనిర్మలచేతనుఁ డై మది
                    దలఁచెడువాఁడును, దలఁపుఁ, దలఁపఁ
     బడియెడునదియును, నెడబాసి యంత
                    శాంతనిర్మలమానసంబుతోడ,
గీ. బరఁగు నిర్వాతదీపంబుభంగి నతఁడు
     పరము నగుచున్న నిర్వాణపదము నొందె.
     నని వసిష్ఠుండు బలియుపాఖ్యాన మిట్లు
     మనము దళుకొత్త రామచంద్రునకుఁ జెప్పె.70
క. ఈయాఖ్యానాకర్ణన
     మాయుః శ్రీ కీర్తు లిచ్చు నఘనిరసనమున్

     జేయు, జగజ్జాలంబుల
     మాయిక మణఁగించి, మోక్షమార్గము దెలుపున్.71
వ. అని చెప్పి వసిష్ఠుండు రామచంద్రుం గనుంగొని యిట్టి తత్త్వజ్ఞానం
     బు పరమేశ్వరానుగ్రహంబున కాని సంభవింప, దీయర్థంబున ప్రహ్లా
     దోపాఖ్యానంబు గల దవ్విధంబు తేటపడ నెఱింగించెద.72

ప్రహ్లాదోపాఖ్యానము

సీ. వినుము ప్రహ్లాదుండు విష్ణు నారాధించి
                    బ్రహ్మవిజ్ఞానవిశ్రాంత మైన
     పరమవిచారంబు వరముగా నియతాత్ముఁ
                    డగునాకు హరియిచ్చె నాత్మబోధ,
     యది యెట్టిచందమొ మొదల నేనెవ్వఁడ?
                    నీసృష్టివిభ్రమ మెట్టి? దరయ
     నెక్కడి కేగెద? నేమాట లాడెద?
                    నెద్ది యంగీకార్య? మెద్ది కృత్య?
గీ. మరయ బ్రహ్మంబు, పర్వతతరువనంబు
     లతిజడంబును నైన యీయఖిలజగము
     నాత్మరూపంబుగాదు, నాకన్య మిదియు,
     నేను నీ సృష్టి గాకుని కిది నిజంబు.73
క. జడమును పవనస్ఫురణము
     గడు నసదుద్భవము నల్పకాలము నన తాఁ
     బొడవణఁగెడునదియును నగు
     నొడలును నేఁ గాన, యెట్లొకో తలపోయన్.74
సీ. కర్ణరంధ్రాంతరకలితక్షణంబున
                    జడము శూన్యము నైన శబ్దగుణము,
     అస్థిరత్వగ్గ్రాహ్య మతిభంగురము చిత్ప్ర

               సాదలబ్దార్థ మీ స్పర్శగుణము,
     అతిలోలతనుమాత్ర మతితుచ్ఛ మస్థిర
                    ద్రవ్యనిష్ఠంబు నీ రసనగుణము,
     దృష్టిదృష్టాంతమై ద్రష్టకేవలుఁ డైన
                    రూపులే కణఁగు నీ రూపగుణము,
గీ. ఇవ్విధంబున నశ్వరకృతము నైన
     ఘ్రాణమునఁ దోఁచు జులుకని గంధగుణము;
     నరయ నివి యెవ్వియును గానిపరమతత్త్వ
     శుద్ధబుద్ధాత్ముఁ డగుపురుషుండ నేను.75
వ. మఱియు మరణరహితుండును, నిర్మోహుండును, నిర్మలమానసుండును,
     నిర్వికల్పచిదాభాసుండును, బంచేంద్రియభ్రమరహితుండును, విగత
     కలాకలనుండును, శుద్ధచైతన్యస్వరూపుండును, వీతచేతశ్చిన్మాత్రుం
     డును, సకలప్రకాశుండును, నిర్మలసన్మయుండును, బహిరంతర్వ్యా
     పియు, నైన యద్దేవుండు తలంపంబడి వెలుంగు. నట్టితత్త్వంబు నే
     నతనిచేత సూర్యాతపం బై ప్రకాశించునదియును, ప్రకాశింపజేయు
     నదియును, దానయై జగంబుల వెలుంగుచుండు.76
క. మానుగ నింద్రియవృత్తులు
     దీనన వెలుగొందుచుండుఁ, దేజముతోడన్
     లీన మయి ప్రజ్వరిల్లఁగఁ
     గానంబడుచున్న యగ్నికణములువోలెన్.77
గీ. వివిధభావాంతరస్థుఁడై విగతచైత్య
     చిన్మయుండును పరిపూర్ణచేతనుండు
     నవ్యయాచ్ఛిన్నుఁ డగుచున్న యట్టియాత్మ
     నేన యగు; నాకు మ్రొక్కెద మానసమున.78
గీ. నిఖలలోకప్రకాశమాణిక్య మైన

     దేవ, చిరకాలమునకు సిద్ధించి యుదితుఁ
     డై వెలింగెడు నిత్య యనంత నీవ
     యేన యగునాకు మ్రొక్కెద మానసమున.79
మ. అని చింతించుచు శత్రుసూదనుఁడు ప్రహ్లాదుండు దా నిర్విక
     ల్పనిరాలంబసమాధి నిల్చె మది లౌల్యం బింతయున్ లేక వ్రా
     సినరూపంబునుబోలె నేక మగుదృష్టిన్ పంచసాహస్రహా
     యనముల్ నిర్మలనిష్ఠతోఁ బరమయోగానందనిర్మగ్నుఁ డై.80
క. ఆయెడఁ బాతాళం బ
     న్యాయమును నరాజకంబు నై ప్రజ మాత్స
     ర్యాయమున లోభమోహ
     ప్రాయమున నశించుటయుఁ గృపాతత్పరుఁ డై.81
ఉ. కంబుగదాసిచక్రఘనకాంతులు బాహు లలంకరింప, వ
     క్షంబున శ్రీతనుద్యుతులు కౌస్తుభదీప్తుల బ్రోదిసేయఁగా,
     నంబుజపత్త్రసన్నిభకటాక్షరుచు ల్వొలయంగ వచ్చెఁ బీ
     తాంబరుఁ డంగకాన్తివిజితాంబరుఁ డా దితిపౌత్త్రుపాలికిన్.82
వ. ఇవ్విధంబున సకలజగజ్జాలపాలనశీలుం డగు నీలవర్ణుండు ప్రత్యక్షం
     బై— 'మహాప్రబుద్ధుండ వై మమ్ము నీక్షింపు' మనుచు దిగ్వలయం
     బద్రువఁ బాంచజన్యంబు పూరించిన.83
క. ఆ నినద మల్లనల్లన
     వీనులు సోకిన, సమాధి వీడ్కొని జలద
     ధ్వానమున నలరు శిఖిగతి
     నానందము నొంది సూచె హరి నరగంటన్.84
వ. ఇట్లు ప్రత్యక్షం బైనయప్పుండరీకాక్షు నిరీక్షించి పునఃపునఃప్రణా
     మంబు సేయుచున్న రాక్షసేశ్వరునకు నప్పరమేశ్వరుం డి ట్లనియె.85
సీ. పుణ్యాత్మ నీరూపమును రాజ్యలక్ష్మియుఁ

                    దలఁపు; మూఱక యేల తను వలంప?
     గతనేయధేయసంకల్పుండ వగునీకు
                    నిలఁ గల్మి లేము ల వెంత దలఁప?
     నీవు జీవన్ముక్తి నియతి నీతనువుతో
                    నవని యాకల్పాంత మనుభవింపు,
     మిను లొక్కపెట్ట పన్నిద్దఱుఁ బొడమరు,
                    విరళమై కొండలు విరిసి పోవు.
గీ. జగము లన్నియు నొక్కట సమయ వకట,
     యనఘ తను వేల యొల్ల? వి ట్లైన నీకు
     విషయసుఖదుఃఖవాసన విడుచునట్టి
     వరము నిచ్చితి గృప నీకు వత్స లెమ్ము.86
క. ఏ దీనుండను నే సుఖి
     నే దుఃఖిని మూఢబుద్ధి నే నని మది ను
     న్మానించునట్టివానికి
     నాదర మగుచున్న మరణ మది లెస్స యగున్.87
క. ఆశాపాశనిబద్ధుం
     డై శమము దొఱంగి చిత్త మటు నిటు దివియం
     గాసిఁబడునతని కెందును
     నాశము గద మేలు విన వనా పుణ్యాత్మా.88
ఉ. ఆరయ సర్వభూతసముఁ డై పరిబోధమయాత్ముఁ డై యహం
     కారవిశారభావనలఁ గ్రాఁగక యుల్లము చల్ల నై తమో
     దూరుఁడు రాగదోషరహితుండును నై భువనప్రవృత్తికిన్
     వారక సాక్షివోలె మనువానికి జీవిత మొప్పు నెప్పుడున్.89
వ. అట్లు గావున.90
క. దనుజాధీశ్వర నీ వీ

     తను వలఁపకు; వేగ లెమ్ము; తగ నీసింహా
     సన మెక్కు; రాజ్యలక్ష్మికి
     ఘనయశ నినుఁ బట్ట మేను గట్టదఁ బ్రీతిన్.91
వ. అని పలికి యతని నిఖలరాజ్యాభిషిక్తుం జేసి యాకల్పాంతస్థిరసౌఖ్యం
     బనుభవింపు; మని పుండరీకాక్షుం డంతర్ధానంబు నొందె ననిన
     విని రఘుకుంజరుం డమ్మునికుంజురున కి ట్లనియె.92
గీ. అనఘ యత్యంతపరిణామ మైనయట్టి
     యమ్మహాయోగివరునిచిత్తమ్ము దలఁప
     బాహ్యకల్పిత మైన యప్పాంచజన్య
     నినదమునఁ జేసి యెట్లు మేల్కనియెఁ జెపుమ.93
సీ. అనిన వసిష్ఠుఁ డిట్లను భ్రష్టబీజంబు
                    కరణి జన్మాంకురకారి గాక
     శుద్ధవాసన వొల్చుఁ జుమ్ము జీవన్ముక్తు
                    లగువారిహృదయంబులందు నెపుడు;
     నదియుఁ బావనియును నధికయు శుద్ధస
                    త్త్వానుసారియును నధ్యాత్మవతియు
     నిత్యప్రబుద్ధయు నియతయు సై సహ
                    స్రాబ్దాంతముల నైన నలరుచుండుఁ.
గీ. గణఁగి యవ్వాసనయు మేనఁ గలిగియుండుఁ,
     దాన యొకచోటఁ బొడసూపి యైన వారి
     దివ్యవిజ్ఞానమహిమ వర్ధిలఁగఁ జేయు
     రఘుకులోత్పలవనచంద్ర రామచంద్ర.94
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె.95
క. ఘనపుణ్యుఁ డైన ప్రహ్లా
     దునిశుభచరితంబు భక్తితోడ ముదితు లై.

     వినునట్టి పుణ్యమతులకు
     మునుకొని దుఃఖములు డిందు మోక్షము చెందున్.96
వ. అని యిట్లు ప్రహ్లాదోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు మఱియు
     ని ట్లనియె.97

గాధ్యుపాఖ్యానము

క. విను రాఘవ సంసారం
     బనుపేరిటిమాయ కెందు నవసానము లే;
     దెనయఁగఁ దన చేతోజయ
     మునఁ గా కేమిటను బొలిసి పో దెన్నటికిన్.98
వ. అట్లు గావున జగంబుల మాయావైచిత్రిఁ దెలుపు మంటి. మున్ను
     లవణువృత్తాంతంబు సెప్పినట్లు, గాధి యనువిప్రువర్తనం బెఱింగించె
     ద. దత్పరబుద్ధి వై యాకర్ణింపుము.99
ఉ. పావనమూర్తి గాధి యనుబాడబుఁ డొక్కఁడు విష్ణుఁగూర్చి గో
     దావరినీటిలోకుల నుదగ్రతపం బొనరింప, నవ్విభుం
     'డేవర మైన నీకు దయ నిచ్చెదఁ, గొంకక వేఁడు వత్స' నా;
     నా వనుధామరుం డనియె; నంజలి యౌదలఁ జేర్చి మ్రొక్కుచున్.100
వ. 'దేవా, భవదీయ మాయ నిరీక్షింప నపేక్షించుచున్నవాఁడ. నీవరము
     ప్రసాదింపు;' మనిన, నట్ల కాక యని యప్పరమేశ్వరుం డంతర్ధానంబు
     నొందె. నంతఁ గొన్నిదినంబులను నొక్కనాఁ డమ్మహీసురవరుండు.101
సీ. స్నానంబు సేయుచు జలమధ్యమున గ్రుంకి
                    యఘమర్షణము సేయునపుడు చిత్త
     విస్మృతి వొడమిన, విప్రుండు వెగ డొంది
                    తగ నీటిలోఁ దన తనువు విడిచి,
     హూణదేశంబున నొకయూరఁ జండాల
                    భామకుఁ బుట్టి యపత్యసమితిఁ

     గని, యాలుబిడ్డలు కాలగోచరు లైన,
                    విమలాత్ముఁ డై యిల్లు విడిచి, కీర
గీ. పురమునకు నేఁగ, నాప్రోలి ధరణివిభుఁడు
     మరణ మొందిన, నా రాజుమంత్రు లొక్క
     కరి నలంకార మొనరించి పురమునడుమ
     విడుచుటయు, నది యంగళ్లు వెదకి వెదకి.102
క. గుండుకొని సూచుమానిసి
     తండము తలగంగఁ ద్రోచి తత్కరి వెస నా
     చండాలుఁ దెచ్చి భూజన
     మండలి కభిషిక్తుఁ జేసె మంత్రులు సూడన్.103
ఉ. మాలఁడు వీడుఁ నా నెఱుకమాలినమంత్రులు తత్పురంపుభూ
     పాలుసిరాజ్యసంపదకుఁ బట్టముగట్టిన, నాతఁడున్ నృప
     శ్రీల రమించె, హేమమయచిత్రితహర్మ్యములం బ్రియాకటా
     క్షాలసమందహాససురతామృతపానమదాంధబుద్ధి యై.104
వ. ఇవ్విధంబున నెనిమిది యేండ్లు రాజ్యసుఖంబు లనుభవించుచుండ;
     నంత నొక్కనాఁ డాతనిబంధు వగుచండాలుఁడు హూణమండలంబున
     నుండి చనుదెంచి యతనిచుట్టఱికంబుఁ దెలుప, నందఱు నెఱింగి, 'యక
     టా! యీ చండాలసహవాసదోషంబునం బెద్ద కాలం బుండితి,
     మింక నేమి సేయుద!' మని నివేదించి తత్పాపనిర్వాపణంబు సేయం
     దలంచి మంత్రిపురోహితసామంతదండనాథసహితంబుగా ననలంబుం
     బ్రవేశించిన.105
క. వారలు దనకతమున నతి
     దారుణ మగునగ్నిశిఖల దగ్ధం బగుడున్
     వారి నెడఁబాసి దుగఖము
     కూరిన సొద సొచ్చె వెగడు గుడిచిన మదితోన్.106

వ. అంత.107
క. అదిరిపడి సూచి తొల్లిటి
     యుదకములోఁ దీర్థ మాడుచుండినవాఁ డై
     మది 'నాలుగుగడియలలో
     నిది యేదరి వచ్చెనొక్కొ, యిట నా' కనుచున్.108
గీ. అంత నావిప్రుఁ డుదకంబునందు వెడలి;౼
     యకట విభ్రాంతిచిత్తంబులందుఁ దవిలి
     యెల్లదేహుల భ్రమియించి యెందుఁ దిరుగుఁ
     బులి యుదగ్రత నడవుల మెలఁగునట్ల –109
వ. అని చిత్తమోహంబుం తిరస్కరించుచు, నిజాశ్రమంబునకు వచ్చి, తన
     మనంబున మెఱమెఱపడుచుండునంత. నొక్కనాఁడు కీరదేశంబుననుం
     డి యొక్క భూసురుం డతిథి యై చనుదెంచిన గాధి యతనింబూజించి
     యవ్విప్రువలనఁ గీరదేశవాసు లగుమనుష్య లొక్కుచండాలు సహ
     వాసదోషంబున కై సహకుటుంబులై యనలంబుం బ్రవేశించి రనిన
     విని, యంతయుఁ దనకృత్యంబ కా వగచి.110
ఉ. అచ్చటు చూడ వేడ్కపడి యాముని మార్గమునందు దేశముల్
     చెచ్చెరఁ బెక్కు దాఁటి చని చెన్నైసలారెడు హూణభూమిలో
     మచ్చిగఁ దాఁ జరించు పెనుమాలనిపల్లెయు నాలుబిడ్డలున్
     జచ్చినయిల్లుఁ గాంచి మది సంచలియింపఁగఁ గీరభూమికిన్.111
క. చని తన యేలినపురమును
     గనకాలయములను దనకుఁగా మంత్రులు గ
     జ్జములు సొద సొచ్చు నెడలును
     గనుగొని విధిసేఁత కడలి కళవళపడుచున్.112
క. తన యంతరంగమున నా
     వనజోదరుఁ డిచ్చినట్టివరమున నా కా

     తనిమాయ గానఁబడియెను.
     విన నచ్చెరు వనుచు నచటు వెలుపడి యంతన్.113
క. అలసినసింగముభంగిని
     దలరుచుఁ జని యొక్కశైలతటమునఁ దా ని
     శ్చలవృత్తిఁ దపము సేసెను
     దలఁపున హరి నిల్పి యధికతత్పరబుద్ధిన్.114
వ. ఇ ట్లత్యంతనిష్ఠాపరుండై తపంబు సేయుచుండఁ బెద్దకాలంబునకును.115
ఉ. శ్రీకరరత్నకుండలమరీచులబెళ్కులు చెక్కులొత్త, శో
     భాకరకౌస్తుభద్యుతి నుదంచిత మై వనమాల గ్రాల, ల
     క్ష్మీకరగంధసారరుచిచిహ్నితవక్షుఁడు చక్రి వచ్చె నా
     ళీకవిలోకనాంశులు దలిర్పఁగ గాధిమునీంద్రుపాలికిన్.116
వ. ఇట్లు ప్రత్యక్షం బై నకమలాక్షు నిరీక్షించి పునఃపువఃప్రణామంబులు
     సేసి నిటలతటఘటితాంజలి యై యి ట్లనియె.117
మత్తకోకిల. 'దేవ, దేవరమాయ నాకు నుదీర్ణ మై మదిఁ దోచె; ని
     ట్లే విచిత్రమొ చిత్తవిభ్రమ మీముహూర్తయుగంబునం
     దే విధంబునఁ బుట్టెనో చన నింతయున్ విశదింపవే.'
     నావుడున్ విని గాధి కంబుజనాభుఁ డి ట్లను సత్కృపన్.117
సీ. అనఘాత్మ భూమ్యాదు లరయఁ జిత్తమునంద
                    కాని యెన్నఁడు వెలిఁ గావు వినుము.
     మది విభ్రమస్వప్నమయముగా సర్వంబు
                    ననుభవింపఁగఁ జాలి తఖిలములను.
     ఇన్నియుఁ గల్పించు నీచిత్తమునకుఁ జం
                    డాలత్వ మనఁగ నేడది తలంప?
     శ్వపచత్వమునఁ దోఁచు విపరీత మె ట్ల య్యె

                    నతిథిఁ గాంచుటయును నట్ల యయ్యె.
గీ. హూణమున మాలవాఁడ వై యున్నయట్టు
     లచటివర్తనమును గంటి; వచటు వాసి
     కీరపురి లీల లన్ని గన్నారఁ గంటి;
     నదియుఁ బ్రతిభాసమాత్రమ యని యెఱుంగు.119
ఉ. ఈయెడ నీకుఁ దోచుగతి నీప్రతిభాసము హూణకీరదే
     శీయుల కెల్లఁ గానఁబడి చిత్తములన్ భ్రమపుట్టె; నిప్పు డి
     ట్లాయె ననంగ రాదు; విను మన్నియు నిక్కడఁ దోఁచు గాకతా
     ళీయము లొక్కచోఁ బ్రతిఫలించును బల్వురి కొక్కచందమై.120
వ. అది యెట్లంటేని; హూణదేశంబునఁ గటంజకుం డనుచండాలుండు త
     త్ప్రదేశంబున విహరించి తద్దుఃఖంబు లనుభవించెఁ. బదంపడి కీరదేశం
     బునకు రా జై యబ్భంగి ననలంబు సొచ్చె. నప్పుడు నీచిత్తంపు స్వసం
     బంధంబునం జేసి నీ కాకటంజభావంబు దోచె నింతియ యట్లు
     గావున.121
క. ఇతఁ డే నితఁ డే గా నని
     మతి దలఁచినయతఁడు భ్రాంతిమగ్నుం డగుఁ దా;
     ధృతి నేన యఖిలమును నను
     నతఁ డెందును భ్రాంతిఁ బొరయఁ డమలవిచారా.122
క. అర్థిఁ బరార్థవిభాగా
     నర్థము తత్త్వజ్ఞుఁ డెందు నందఁడు దానన్
     అర్థవ్యయమోహము ల
     త్యర్థము చొరనీడు మనముఁ దజ్జ్ఞుం డెందున్.123
గీ. నీకుఁ బరిపూర్ణబోధంబు లేక యునికిఁ
     జిత్తవిభ్రాంతి నణఁగంగ మొత్తలేవు.
     మాయ యనుచక్రమునకు నెమ్మనము నాభి;

     యది యణంచినఁ దద్భ్రమ లంద వెందు.124
క. అది గాన లేచి యీగతిఁ
     బదిలం బై తప మొనర్పు. పదియేండ్లకు నీ
     కుదయించు దివ్యబోధం
     బది. యని కరుణించి విష్ణుఁ డరిగె నిజేచ్ఛన్.125
వ. అనంతరంబ యమ్మునికుంజరుండు వివేకజనితం బైన పరమవై రాగ్యం
     బు నొంది దయాయత్తచిత్తుండును నిరస్తాఖిలసంకల్పుండు నై యొక్క
     శిలాగ్రంబున నుగ్రతపంబు దశవత్సరంబు లొనరించి యాత్మజ్ఞానంబు
     నొందె. నని గాధివృత్తాంతం బతివ్యక్తంబుగా నెఱింగించి వసిష్ఠుం
     డి ట్లనియె.126
క. మాధవసేవారతుఁ డగు
     గాధిమునీశ్వరుని పుణ్యకథ విన నాధి
     వ్యాధులు పొందక చిత్తస
     మాధానము గలిగి మోక్ష మరచేతి దగున్.127
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె. పరమం బగుయోగాభ్యాసంబునఁ గా
     ని చంచలం బగుహృదయంబు కుదురుపడదు. ఈయర్థంబున నుద్దా
     లకోపాఖ్యానంబు వర్ణింపంబడు. నాకర్ణింపుము.128
క. మును చిత్తాక్రమణం బను
     వినుతౌషధమునన గాక విను సంసారం
     బను దుష్టరోగ మణఁపఁగ
     నను వగునే యెట్టిభంగి నైనను రామా.129
క. క్రిందటి మీఁదటి కాలము
     లం దగులక వర్తమానలవమున బాహ్యం
     బొందిన బుద్ధిం గైకొని
     చెందిన చిత్తంబు దా నచిత్తత నొందున్.130

గీ. వలయు సంకల్పభోగవిసర్జనంబు;
     ఎల్లకాలంబు దానన యుల్ల మణఁగఁ
     జేయు; మంతట భావన స్థితి భజింప
     నోపు; శక్తియు నీ కబ్బు నురుగుణాఢ్య.131
సీ. తాఁ గానివస్తువు తన్నుఁగా గల్పించు
                    పుత్త్రదారాదుల మైత్త్రిచేత,
     నహమకా మమతల ననిశంబు గల్పించు
                    నిదియ నాయది యను నీహచేతఁ,
     గణఁగి యాధివ్యాధిగతుల హేయాహేయ
                    మతులఁ దద్వస్తుసంతతులచేత,
     లలనామణీద్రవ్యలాభలోభములచే,
                    నాపద సుఖవిషయములచేతఁ,
గీ. దెగనియాశాపయఃపానతృష్ణచేత,
     నమిత మగుచున్న భోగభోగములచేతఁ,
     బ్రకటితాష్టావధానచోరకులచేతఁ,
     జిత్త మంతంత నభివృద్ధిఁ జెందుచుండు.132
వ. అట్లు గావున నట్టిచిత్తంబు పెంపు విచారింప నుద్దాలకుండునుం బోలె
     నంతర్విచారదృష్టి నిన్ను నీవ కనుంగొని సుఖింపు. మనిన రామచం
     ద్రుండు ప్రాంజలియై— మునీంద్రా, ఉద్దాలకుం డెట్టివిధంబున నాత్మా
     వలోకనంబు చేసి చిత్తంబుఁ గెలిచి పరమసిద్ధికిం జనియె? నవ్విధం బా
     నతిం డని యడిగిన నమ్ముని పురాణపురుషున కి ట్లనియె.133

ఉద్దాలకోపాఖ్యానము

సీ. ఉద్దాలకుం డనునొకమహాముని గంధ
                    మాదనంబునఁ దపోమహిమ నిల్చి,
     మతిశూన్యతను డించి యతివివేకంబునఁ

                    తనలోన ని ట్లని తలఁపఁ జొచ్చెఁ;
     బూని యంతటికి ప్రధాన మై ప్రాప్య మై
                    యెద్ది వెలుంగు? నే నెచట నుండి
     యీదుఃఖ మణగింతు? నెప్పు డీతలఁపుఁన
                    బాసి పరబ్రహ్మపదము నొంది
గీ. మేరుశృంగంబుపైఁ బొల్చు మేఘమట్లు
     చిత్తవిశ్రాంతి నెన్నండు చెందఁగలుగు?
     ననుచు సంకల్పములఁ ద్రుంచి హరి గుఱించి
     నిశ్చలధ్యానతత్పరనియతి నొందె.134
క. ఈ తెఱఁగు తపము చేయఁగ
     నాతనిచిత్తంబు నిలువ కగచరగతితో
     వే తిరుగఁ జొచ్చె, నాత్మ
     ప్రీతి నెసఁగునిష్ఠ గడచి బిసబిసపోవన్.135
గీ. ఇట్లు దిరిగెడు చిత్తంబు నెట్టకేనిఁ
     బట్టి బంధించుటయును, లోపలన తిరిగి
     జడిసి యాంతరవిషయనుచయముఁ గూడి
     వెడలి దివి కేఁగె; నురియాడుపులుగువోలె.136
వ. ఇవ్విధంబున బిరుసుదనంబునం బఱచిపఱచి.137
చ. అరుదుగ నొక్కవేళ నుదయార్కనిభద్యుతిఁ గానిపించు; జె
     చ్చెర నొకచో వియత్తలము చెన్నగు; నొక్కకనాఁడు శూన్యమౌ
     నిరవుగఁ దోఁచు నొక్కమఱి; యీగతి నిల్వక చిత్త మేఁపఁగాఁ
     బరమసమాధి నే తెలిసి బాడబుఁ డచ్చటు వాసి వ్రేల్మిడిన్.138
వ. అమ్మహాగిరివిపినంబులఁ బరిభ్రమించుచు నొక్కనాఁ డొక్కయేకాం
     తప్రదేశంబున నుపవిష్టుం డై నిర్వికల్పసమాధి నుండి తనమనంబున
     నిట్లని వితర్కించె.139

క. ధీమంతు లైనవారలు
     కామింపరు మీఁద దుఃఖకారణ మగు న
     ట్లీమాయాసంపదలం
     దేమి సుఖము గలదు మూర్ఖహృదయమ నీకున్!140
క. శాంతరస మనురసాయన
     సంతోషము దొఱఁగి విషయసక్తుఁ డగుట దా
     సంతానవనము విడిచి దు
     రంతపుమరుభూమి దిరుగ నరుగుట గాదే?141
క. పాతాళంబునఁ గ్రుంకుము
     భూతలముననుండి మింటఁ బొందుము మనసా;
     యేతెరువున నిర్వృతి లే
     దాతతశమనామృతంబు నానక నీకున్.142
ఉ. అక్కట కల్మిలేము లనునట్టి తలంపులఁ జిక్కి నిచ్చలుం
     బొక్కెదు గాని శాంతరసమున్ వినఁ గ్రోలఁగఁ నొల్ల వెన్నఁడున్;
     దక్కక యింద్రియాదులకు దాసుఁడ వై పఱవంగ నెందు నీ
     కెక్కడ నేమి వచ్చె; నిటు లేటికి నేఁచెదు నన్నుఁ జిత్తమా!143
గీ. శ్రోత్రభావ మొంది సొలయక శబ్దంబు
     నాలకించి యంతకంత కుబ్బి
     వేఁట కానినాదు విన నాసచేసి లో
     బడినమృగమువోలెఁ జెడకు మనస.144
గీ. చర్మభావ మొంది సంస్పర్శసుఖముల
     కాసఁ జేసి నీవు ననుదినంబు
     గజము వేడ్కఁ దగిలి గజము లోఁబడుభంగిఁ
     గట్టువడకు మోరకంపుమనస.145
క. ఓలిని రసనాభోగపు

     జాలం బడి చవులఁ దగిలి చచ్చెదు సుమ్మీ,
     గాలం బెరచవి మ్రింగిన
     మీ లుడిగి యణగినట్లు మిన్నక మనసా.146
గీ. నేత్రవృత్తిఁ దగిలి నెలఁతలు మొదలైన
     దృశ్యసుఖము మరగి తిరిగి తిరిగి
     మంటలోన నుఱికి మడిసిపోయినయట్టి
     మిడుతవోలె గాలి చెడకు మనస.147
క. నాసావృత్తులఁ బడుచు దు
     రాసం దనువనజకోటరములోపల నీ
     వాసల సుడివడకుము కమ
     లాసక్తినిఁ జిక్కినట్టియళిగతి మనసా.148
క. హరిణ కరి ఝష శలభ మధు
     కరములు నొక్కొకటఁ గ్రాఁగెఁ, గడు నింద్రియముల్
     పరువడి నన్నియు నిన్నుం
     బొరి నడవఁగ నెట్లు సుఖముఁ బొందెదు మనసా.149
క. చిత్తమ వాసన లన్నియు
     నత్తిన బంధంబుకొఱకు నగు; నేగతి నీ
     వత్తెఱఁగు విడిచి శాంతము
     పొ త్తయిన ననంతజయము పొందెదు సుమ్మీ.150
గీ. నీవు చెప్పి నట్ల నిత్యంబు సేయుచు
     నేల బేల నైతి నివ్విధమునఁ!
     దగువిచారవంతు లగుమహాత్ములయెడ
     నీవు లేక యునికి నిజము మనస.151
క. భూరిపరమాత్మతత్త్వము
     కారణ మగు నీకు; నందుఁ గలసితివేనిన్

     వారణకుక్షిగతం బగు
     మారెడుబండ్లట్ల రూపుమాసెదు మనసా.152
క. ఆపాదమస్తకం బై
     చూపట్టిన తనువునందు శోధింపఁగ నిం
     దేపట్టున నేకాకిగ
     నేపురుషుఁడు నిలుచు నిందు నే నని మనసా.153
వ. అది యెట్లం లేని, యీప్రపంచం బంతయు సకలదిగ్భరితంబును సంవేద్య
     రహితంబును సర్వసంపూర్ణంబును నగు సంవిద్రూపంబుగాఁ దలం
     చెద. నది యింతంత యనుపరిమాణంబును నామపరికల్పనంబును నేక
     త్వంబు నన్యత్వంబు జడత్వంబు మహత్త్వంబు నేఱుపడక వేదనాఖ్యం
     బై స్వసంవేద్యంబును నైననాయందు నీయునికి దుఃఖకారణం బని
     వివేకజం బైనపరమజ్ఞానంబునం జేసి నిన్నుం దునిమెద. నదియునుం
     గాక.154
సీ. ఇది మాంస, మిది రక్త, మిది యస్థి, నిశ్వాస
                    మిదియు, నే ననుచుండు నెవ్వఁ డిందుఁ;
     బలరక్తకీకసస్పందముల్ వేర్వేఱ
                    యివియు నే ననుచుండు నెవ్వఁ డిందు;
     యిది జిహ్వ, యిది నాస, యివి కర్ణముల్, దృక్కు
                    లివియ నే ననుచుండు నెవ్వఁ డిందు;
     నివి యెవ్వియును గాక యింతయు నేక మై
                    యేన యుండుదు నొం డొకింత గలుగ;
గీ. దిది యసన్మయదృష్టి; యొం డెల్లఁ గాదు;
     ఏఁచె నజ్ఞానధూర్తు నన్నింతకాల;
     మాత్మచోరుని వీనిఁ బుణ్యమునఁ గంటి;
     నింత పరమార్థహాని ఖండింతు నేను.

155

వ. అదియునుం గాక, నేత్రాదీంద్రియంబులు వాసనారహితంబు లయిన
     బాహ్యార్థంబులం బ్రవర్తింప; వ ట్లగుట వాసన యకారణం బన
     రాదు, గావున మూర్ఖంబు లగువీని విడిచి యంతర్భావనం జెందు
     నంత నేదుఃఖంబులం బొరయక సుఖించెదు మనంబ.156
గీ. ఇట్టలంబుగఁ దముఁ దామె చుట్టుకొనుచుఁ
     బొత్తినూ లొనరించెడి పురువులట్ల
     వ్యర్థ మగుతృష్ణచేత దుర్వ్యథలఁ బొంది
     చెడితి రేమందు నింద్రియశిశువులార.157
క. నిండినయింద్రియధనముల
     భండారము నీవు; వానిఁ బట్టి యసత్తై
     యుండి నిను నీవ తెలిసి య
     ఖండామలబోధవీథిఁ గైకొను మనసా.158
వ. అని యనేకప్రకారంబుల నాలోకించి యమ్మునీంద్రుండు.159
సీ. పద్మాసనస్థుఁ డై పరమచిత్సుఖనిద్రఁ
                    గన్నార మోడ్చి, యోంకారరవము
     ఘాతితలాంగలఘంటికాఖండనా
                    దముభంగి బ్రహ్మరంధ్రమున మ్రోయఁ,
     గోరి ప్రాణాయామకుశలుఁ డై రేచక
                    మునఁ బ్రాణనిష్క్రాంతిఁ దనరి మేను
     కుంభసంభవనిపీతాంబోధిగతిఁ దోఁప,
                    హృదయపూరిత మైనచదలఁ బొల్చు
గీ. ప్రాణములఁ బేర్చి హృదయాగ్నిఁ బ్రబలఁ జేసి
     కాయ మేర్పించి, మరి కుంభకంబు నొంది
     క్రింద మీఁదను వెలి లోను సందు లేక
     పరఁగ నిస్తంద్రితము లైనభంగి నంత.160

వ. తత్ప్రాణంబులు పూరకక్రమంబున భజియించి చేతనామృతమధ్యగ
     తంబు లై తదాకాశంబునం గళాకాష్ఠారూపపరిపూర్ణుం డై వెలుం
     గుచున్న సుధాకరబింబంబునం బొంది హిమస్పర్శసుందరం బగుశీత
     కళత్వంబు దాల్చిన రసాయనసుధాధారాసారంబునం దోఁగి సంపన్నం
     బు లయ్యె నంత.161
ఉ. ఆ యతి తొల్లి దగ్ధమగునంగముఁ దద్రసధారఁ జల్లగాఁ
     జేయుచుఁ జంద్రబింబరుచిఁ జెన్నెసలారఁగఁ జూడఁ జూడ నా
     రాయణరూప మయ్యెఁ గనకాంబరశార్ఙ్గగదాసిశంఖచ
     క్రాయుధహారకుండలసితాంబుజనేత్రకిరీటచిహ్నుఁ డై.162
వ. అంత రసాయనమయంబు లగునతనిప్రాణంబులం దచ్ఛరీరంబు పూ
     రించి తదంతఃకుండలి నిండించె నయ్యవసరంబున.163
సీ. ఆవిష్ణురూపసంయమి నిర్వికల్పస
                    మాధి కుద్యోగించి; యంతరంగ
     మునఁ దోఁచు ప్రతిభాసముల మనంబునఁ జేసి
                    యసిధార నురు లెట్టు లట్లు త్రుంచె,
     నా వికల్పము లెల్ల నణఁగిన హృదయాంబ
                    రంబున నర్కచంద్రములఁ గప్ప
     కజ్జలపంకంబుగాఁ బర్వుచీఁకటి
                    సడలించి మీఁదితేజంబు గాంచి
గీ. కొలను సొచ్చిన యేనికకొదమ భంగి
     నదియుఁ దునుమాడ, తేజోమయాంధకార
     మోహనిద్రలు దొఱఁగి యిమ్ముల వెలుంగు
     నట్టివిశ్రాంతిదశ నొందె నతనిమనము.164
వ. ఇట్లు విశ్రమించి తద్ధ్యానానుసంధానంబున నాత్మసంవిత్పరిస్పందం
     బునం జేసి కనకంబు మంజీరం బైనయట్లు విశ్వరూపం బగుచిన్మయ

     త్వంబు దాల్చి యతని చిత్తంబు చైత్యంబు పరిత్యజించి చిత్తత్వంబు
     విడిచి శుద్ధచిన్మాత్రప్రభావంబు నొందె. మఱియును.165
గీ. అతఁడు బోధానురక్తుఁ డై యఖిలమునను
     వాసనావర్జితమును విశ్వంభరమును
     వితతమును నిశ్చలంబు నై వెలుఁగుచున్న
     యా చిదాకాశరూపి దా నయ్యె ననఘ.166
వ. ఇవ్విధంబున దృశ్యదర్శనవర్జితంబు నుత్తమాహ్లాదంబును నై
     యమృతార్ణనంబునుంబోలె నొప్పు పరమానందంబునం బొందె
     మఱియును.167
క. ఆమేనివలన వెలువడి
     యేమియు ననరాని యొక్కయిరవున సత్తా
     సామాన్యాత్మత నానం
     దామృతసాగరము దాన యై వెలుఁగొందెన్.168
గీ. పరఁగ నిర్వాతదీపంబుభంగి నిలిచి
     చిత్రరూపంబు కైవడి చేష్ట లెడలి
     సద్ద్విజోత్తముఁ డానందసరసియందు
     నొప్పు చిన్మయహంస యై యుండె ననఘ.169
సీ. అంతటఁ జిరకాల మచ్చోటనుండి, తా
                    నాకాశచరు లగునమరసిద్ధ
     వరుల చిత్రం బైన వరసిద్ధకాలంబు
                    గని, యింద్రదూతలు తనదుయోగ
     విఘ్నకారులు నన విని యన్నిటిని బాసి,
                    పరఁగ జీవన్ముక్తపదవి నొంది,
     యిచ్ఛావిహారుఁడై యిరవైనవనముల
                    దాపసాశ్రయములఁ దత్త్వనిష్ఠ

గీ. నుండి యొక్కొకఠావున నొక్కదినము
     నొక్కచోటను నెలయును నొక్కచోట
     నొక్కయేఁడును నొకచోఁ బెక్కుహాయ
     నములుఁ జరియించుచుండుఁ దన్మయత నొంది.170
వ. చిత్తత్త్వఘనాభ్యాసంబున నమ్మహాచిత్తంబు చిత్సామాన్య చిత్సుఖా
     నుభవంబునం జేసి సత్తాసామాన్యంబునం బొందె ననవుండు రామ
     చంద్రుం డమ్మునిచంద్రున కి ట్లనియె.171
గీ. ఆత్మవిజ్ఞానవిద్యాదినార్కరూప
     సకలసంశయతృణజాలపక్తజిహ్వ
     సంతతాజ్ఞానతాపసుధాంశుబింబ
     యీశసత్తాసమానత యెట్టి దయ్యె.172
వ. అనిన విని వసిష్ఠుం డి ట్లనియె. తనకంటె నితరం బెద్దియు లే దను
     భావనచేత చిత్తం బెప్పుడు సంక్షీణం బగు నప్పుడు చిత్సామాన్య
     స్వరూపంబునకు సత్తాసామాన్యత కలుగును.173
క. నెట్టన భయహరణం బగు
     నట్టిపదం బొంది యంత నమ్ముని యిరవై
     నట్టి జగద్గృహమున నే
     పట్టున విహరించుచుండె భానుకులేశా.174
ఉ. అంతటఁ గొంతకాలమున కమ్మునిముఖ్యుఁడు యోగనిశ్చల
     స్వాంతసమాధి నొంది ఘనశాంతి వహించి యథేచ్చ మై శరీ
     రాంతమునం దొఱంగి నిరుపాధికనిర్మలచిత్ప్రకాశుఁ డై
     యంతము లేనియట్టి పరమాత్మపదంబున నొందె రాఘవా.175
వ. అని చెప్పి.176
క. పాలితపుణ్యుం డగును
     ద్దాలకమునిచరిత వినిన ధన్యుల కాయుః

     శ్రీ లొదవుఁ, జిత్తవృత్తుల
     జాలి యణఁగు, మోక్షపదము సమకూరుఁ మదిన్.177
వ. అని యి ట్లుద్దాలకోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగించి వసిష్ఠుం
     డు రామచంద్రుం గనుంగొని,౼యిక పరమసమాధికి నుత్తమావస్థ
     యగునట్టిచిత్తవిశ్రాంతి యెద్ది యదియ జీవన్ముక్తాశయం బగు నని వర్ణిం
     పంబడు. నీయర్థంబున సురఘూపాఖ్యానంబు సెప్పెద నాకర్ణింపు
     మని యి ట్లనియె.178
క. విను నీవ తెలిసి యీక్రమ
     మున విహరించుచు నతీతమును బరమును భా
     వనమును నగుతత్పదమున
     ననిశము విశ్రాంతిఁ బొందు మంబుజనయనా.179
వ. అనిన విని రామచంద్రుండు కృత్తాంజలి యై యి ట్లనియె౼మునీం
     ద్రా, త్రికాలవేది వగుని న్నొకటి యడిగెద. నొక్కండు సంసారవ్యా
     పారయుక్తుం డయ్యును సమాధినిష్ఠుండై నిరంతరవిశ్రాంతి గని సుఖిం
     చుచుండు. నొక్కం డేకాంతశీలుం డై పరమసమాధినియతి నుండు.
     నీయిరువురయందు నెవ్వండు ముఖ్యుం డాన తిమ్మని యడిగిన వసిష్ఠుం
     డి ట్లనియె.180
గీ. అఖిలగుణములు నాత్మ కా వని తలంచి
     యంతరంగంబు చల్ల నౌ నది సమాధి,
     దృశ్యములు లీన మౌ నను తెలివి గలిగి
     ధ్యాని యైనను వ్యవహారి యైన నేమి.181
వ. ఇట్లు నిరుపాధికచేతశ్శీతలత్వంబు కలుగుటం జేసి వీర లిరువురు సము.
     లట్టిశీతలత్వంబు మనోవృత్తిం జలింపం దొణంగెనేని యోగసమాధికి
     నుపక్రమంబు సేయవలయు. నున్మత్తంబు లగుచిత్తతాండవంబుల నా
     త్మసమాధానంబు లే కునికిం జేసి.182

క. అంతర్వాసన లన్నియు
     శాంతం బగు. నట్టిసర్వసమునకు వెలిఁ ద
     ఆ్స్వాంతం బేగతి నున్న న
     నంతం బగుచిత్స్వరూప మగు రఘురామా.183
గీ. ఒనర సందేహరహితుఁ డైయుండి. చిత్ప్ర
     బుద్ధమానసుఁ డైయున్న పుణ్యపురుషుఁ
     డడవి నుండిన సంసారి యైన నేమి
     ఱెంరెండుగతులును సమము లై యుండు ననఘ.184
వ. ఇబ్భంగి వాసన గలచిత్తం బెద్ది చేసినను జేయనియదియ. దూరంబున
     మనం బుడిగినయతం డేమియు నెఱుంగని యట్లు.185
గీ. అల్పవాసన గలచి త్త మలమి యెద్ది
     సేసినను జేయకున్నట్ల చెంద దెందుఁ;
     గడఁగి కలలోన నూతిలోఁ బడినవాని
     యంగముల కించుకేనియు హాని యగునె!186
క. మనమున నెద్దియుఁ జేయక
     యునికి సమాధాన; మదియ యుత్తమమును బా
     వనమును శుభమును కేవల
     మును బరము నివృత్తి యనఁగఁ బొల్చును రామా.187
క. చిత్తము శీతల మగున
     య్యుత్తమునకుఁ జల్ల నగుచు నుండు జగంబుల్‌
     చిత్తము శీతత నందని
     యత్తబిసికి నైన ననల మగు జగ మెల్లన్.188

సురఘూపాఖ్యానము

వ. ఇ ట్లంతశ్శీతలత్వంబు సురఘుఁ డనురాజునందుఁ బరిస్ఫుటం బగు.
     విను మతండు నిగ్రహానుగ్రహక్ర్రమంబున రాజ్యతంత్రంబంతయు నిర్వ

     ర్తించుచు సుఖదుఖంబులఁ జిత్తంబు పరిభూతం బగుటయు నొక్క
     నాఁ డి ట్లని వితర్కించె.189
ఉ. అక్కఱలున్ సుఖంబులును నార్తియు నా కెటు లట్లు భూజనం
     బక్కట దుఃఖ మొందఁ జలయంత్రము నువ్వులఁ బీడసేయున
     ట్లక్కటికంబు మాలి ప్రజ నాఱడి నొంవుదు; నొంప నైతి నా
     త్రిక్కకణంగి పోదురు సరిత్తుల నూళులు వోవు కైవడిన్.190
వ. అని డోలాయమానమానసుం డై యున్నయమ్మనుజవరేణ్యుకడకు
     మాండవ్యుం డనుమునిముఖ్యుం డరుగుదెంచిన నతనిం బూజించి
     సురఘుండు తనచిత్తసంశయం బంతయు నెఱింగించిన విని యత్తపో
     ధనుం డి ట్లనియె.191
సీ. తన యుపాయప్రయత్నమునను నీహార
                    లవభంగి మనము పేలవత విడుచుఁ
     దన విచారంబునం దగ మనోంతర్మల
                    మణుమాత్రమును లేక యణఁగిపోవు
     నెవ్వడ నే? నిది యెద్ది? యేగతి నిట్టి
                    మరణజన్మము? లని మనములోనఁ
     దలపోసి చూడుము చాన నిర్మమతయుఁ
                    జిత్తశాంతియు నెందుఁ జెందు నీకు.
గీ. ననుచు బోధించి యమ్ముని యరిగె. నంత
     నతఁఁడుఁ దనలోన౼హస్తపాదాదిసహిత
     మైనయీకాయ మేటికి? నంతరంగ
     మున విచారింపవలయుఁ గా కని౼తలంచి.192
వ. మాంసాస్థిమయంబులు నచేతనంబులు నగుశరీరంబులు జడంబులు
     నసత్యరూపంబు లగుబుద్థీంద్రియంబులు, నేఁ గాను; కర్మరహితుం
     డఁ గావునఁ గర్మేంద్రియంబులు నాయవి గా. వట్టి శరీరాదివ్యతిరిక్తం

     బును వికల్పరహితంబును శుద్ధంబును విశిష్టంబును నగుచిదాకారం
     బేన యై యుండెద. నె ట్లనిన.193
గీ. వనరుహాసనరుద్రేంద్రవరుణపవను
     లాది యగుచున్నసర్వభూతాత్మలందుఁ
     బెక్కుమౌక్తికములలోన నొక్కసూత్ర
     మున్నగతి నుండు షాడ్గుణ్యయుక్తి నాత్మ.194
క. అని తెలిసి సురఘుఁ డవనిం
     బనుపడ నేలుచును యోగపదవి వహించెన్
     జనపతి విశ్వామిత్త్రుం
     డొనరఁగ బ్రహ్మణ్యపదవి నొందినభంగి౯.195
వ. ఇవ్విధంబున దయాకరుండును నిర్దయుండును గుటుంబియు నకుటుం
     బియు బోధయు నబోధయు నర్థియు ననర్థియు నిర్ద్వంద్వుఁడు
     నై యనాసక్తి రాజ్యపరిపాలనంబు సేయుభున్నయమ్మహీపాలునికడ
     కుఁ బరమమిత్త్రుండును దపఃఫలితతత్త్వజ్ఞానియు నగుపరిఘుఁ డనురా
     జరుగుదెంచి యతనిచేతఁ బూజితుం డై యి ట్లనియె.196
మ. ఘనతత్త్వజ్ఞుఁడ నీవ నీకు శుభమే? కర్తవ్యకృత్యంబు లె
     ల్లను సంథింపుదె? బోధదృష్టి దనరన్ లాఁతు ల్శమం బందెనే?
     కని యెప్పాటను రమ్యభోగనదిఁ గ్రుంకం బాఱకున్నాఁడవే?
     వినుతానందసమాధిశాంతసరణిన్ వీక్షింతువే భూవరా?197
వ. అనిన సురఘుండు పరిఘున కి ట్లనియె.198
సీ. అనఘ యనాదరంబునఁ గ్రియ ల్సేయుచు
                    నంతస్పమాాధికి నై పెనంగు
     నిత్యప్రబుద్ధుండు నిఖిలకర్మంబుల
                    నొనరించు నసమానయోగరతుల
     బద్ధాసనుం డైనబ్రహ్మయోగియు నవి

                    శ్ర్రాంతాత్ముఁ డగునేని శమము లేదు
     ఆశాతృణావలంబగుతత్త్వబోధంబు
                    పరమసమాధి నాఁబడు మహాత్మ
గీ. నిత్యతృప్తి సమాహితనిశ్చయార్థ
     దర్శనియు నైనప్రజ్ఞయ దగుసమాధి
     దశ యహంకార లోభనిర్ద్వంద్వ యగుచు
     శీతగరిభాతి నగుమతిస్థితి సమాధి.199
వ. అని యివ్విధంబున నంతశ్శీతలయు జీవన్ముక్తియు నను శబ్దంబులకుఁ
     గలయర్థంబు లుపన్యుసించి సురఘుండు నిత్యముక్తుం డై పెద్దకా
     లంబు రాజ్యంబు చేసి విదేహముక్తుం డయ్యె నని చెప్పి వసిష్ఠుండు.200
క. సురఘూపాఖ్యానము విను
     పురుషులు దురితముల నణఁచి పుణ్యాత్మకు లై
     పరమజ్ఞానముఁ బొందుదు
     రరుదుగ నిది చిత్తగింపు మర్కకులేశా.201
వ. అని సురఘూపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లని
     యె విశ్రాంతిరాహిత్యంపుఁబ్రయాసంబులు బహుప్రకారంబు లని
     చెప్పంబడు. నీయర్థంబునకు భాసవిలాససంవాదంబు గల దె ట్లనిన --
     చేతనానుసంధాతయు నంతర్ముఖుండును నఛ్యాత్మమయుండు నై నిరం
     తరంబు నెవ్వండు దుఃఖంబులం బొరయక సుఖించుచుండుఁ, గర్ణ
     ధారునివలనం గలం బెట్లు దరివొందు నట్లా మహానుభావసంపన్నుని
     చేత సంసారార్ణవం బుత్తరించునుపాయంబు గానంబడుఁ గాని, దు
     స్తరంబగునిది; యొండుపాయంబునం గా. దది గావున.202

భాసవిలాసోపాఖ్యానము

క. ఈ సంసారసముద్రము
     భాసురముగ దాఁటు తెఱఁగు ప్రవ్యక్త మగున్,

     భాసవిలాసులు తమలోఁ
     జేసిన సంవాద మెఱుఁగఁ జెప్పెద వినుమీ.203
వ. ఎ ట్లనిన, వా రన్నదమ్ము లిద్దఱు గల రందు భాసునకు విలాసుం
     డొక్కనాఁ డేకాంతంబున ని ట్లనియె.204
గీ. ఎఱుఁగవలసినయర్థంబు నెఱిఁగి కంటె?
     పరమబోధంబు గానంగఁ బడియె నయ్య?
     బుద్ధి నే పీడయును లేక పొలుచుచున్నె?
     యన్న, కుశలంబె నీకు నిరంతరంబు?205
క. అన విని భాసుం డి ట్లను;
     నిను నాభాగ్యమునఁ గంటి నిర్మలహృదయా,
     ఘనసంసారస్థుల మై
     యెనసిన మా కెందుఁ గుశల మెక్కడి దన్నా.206
వ. అనిన విలాసుం డి ట్లనియె.207
సీ. ఎఱుఁగంగ నగునర్థ మెందాఁకఁ దోఁపింప
                    దందాఁకఁ జిత్తంబు డిందుపడదు.
     సంసార మెందాఁక సన్న మై యణఁగదు
                    చిత్తసంభవములై చెలఁగుచున్న
     యాశాలతలు మొద లంటంగ నన్నియు
                    గొడవంటఁ గోసిన ట్లణఁగి పోవు
     ఎందాఁక సమతయుఁ జెందదు పరమాత్మ
                    బోధ యావంతయుఁ బొడమ దెందు.
గీ. నెట్లు కుశలంబు గలుగ దిం కెన్ని గతులఁ
     బ్రకటసంసార మనువిషూచికకు మందు
     పరమ మగుచున్న యాత్మలాభంబు దక్క
     నేమియును సౌఖ్య మీ నోప దేమి యందు?208

చ. మనుజుఁడు పేర్చి దుఃఖసుఖమధ్యమునం బడి తీవ్రవేదనం
     బనుపడి తా జరామరణభంగము లొందును, జీర్ణపర్ణముల్‌
     ఘనగిరిసానుపాతవికలంబున జర్జరితంబు లైన య;
     ట్లనుపమపుణ్య యి ట్లరుగ నారయ నెమ్మదిఁ గానఁ డెవ్వఁడున్.209
వ. అని యనేకప్రకారంబుల బోధించినయగ్రజువాక్యంబులు విని, భా
     సుండు పరమజ్ఞానసంపన్నుందును జీవన్ముక్తుండు నై సుఖం బుండె.
     నని భాసవిలాసోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రుం
     గనుంగొని౼యింక సంగవర్జనంబునను వాయునిరోధంబునను
     సమాధ్యభ్యాసపాటవంబునను జిత్తవిశ్ర్రాంతి సిద్ధించు. నీయర్థంబున
     వీతహవ్యోపాఖ్యానంబు సెప్పంబడు; నాకర్ణింపు మని యి ట్లనియె.210
గీ. ఎందు నభిలాష సేయని డెందమునను
     గోరి సంసారమున నున్నఁ గొఱఁత లేదు.
     ఉగ్రతప మాచరించుచు నున్న నైన
     సక్తచిత్తంబె బంధసంశ్రయము దలఁప.211
వ. అని మఱియు నా నృపశ్రేష్ఠునకు వసిష్ఠుం డి ట్లనియె౼212
గీ. దేహ మిది, దేహి నే నను తెలివి దొఱఁగి,
     తనువు నే ననునట్టి తాత్పర్య మొదవు
     నట్టి సంగంబు బంధార్థ మనఁగ నొప్పు,
     రఘుకులాంబుధిచంద్ర శ్రీరామచంద్ర.213
క. శారీరజ సుఖదుఃఖము
     లారూఢి ననంతతత్త్వ మగునాత్మునియం
     దారోపించిన సంగమ
     మారయ బంధంబుకొఱకు నగు రఘురామా.214
చ. అకుటిల మైనయట్టి పరమాత్మమహత్త్వము సర్వదిక్కులం
     బ్రకటితదేహసాఖ్యములఁ బాయక పొందును; నేను గా ని దే

     నొకఁడన, రెండు లేవు సుఖ మొందిన నూఱకయున్న లెస్స; యం
     చొకగతి నుండుసజ్జనుఁడె యుక్తికి మిం చగు రాఘవేశ్వరా.215
వ. ఎ ట్లనిన వంధ్యయు నవంధ్యయునన సంసక్తి రెండువిధంబులై యుండు.
     నందు వంధ్య కేవలసంసారం బొదవించి నిష్ఫలిత యై ప్రవర్తిల్లు.
     మఱియి నవంధ్య ముక్తిప్రదాయిని యగు. నందు.216
సీ. ఆత్మతత్త్వజ్ఞాన మందక దేహాది
                    వస్తుజ యై త్రిప్పు వంధ్యశక్తి
     యరయంగఁ గాలసూత్రాసిపత్త్రాదినా
                    రకములు నంతఃపురములు దలఁపఁ,
     సత్సంగు లగువారు తగునారకాగ్నికి
                    నీరసేంధనము లై నిగుడువారు.
     మఱియు నవంధ్య యాత్మజ్ఞాన సత్య వి
                    వేకజ సంసారవిగత యండ్రు.
గీ. అట్టిశక్తిని శంఖభచక్రాబ్జహస్తుఁ
     డిచ్చ వే పొంది జగమున నేలుచుండు
     సకలసిద్ధులు లోకపాలకులు మునులు
     నుండుదురు దానివశమున నురుగుణాఢ్య.217
గీ. బర్హిపింఛాగ్రతరళంబుభంగి విరియు
     మేరుతుల్యంబు లోను నై మెఱయుచున్న
     యమ్మహాత్ములు శుద్ధబుద్ధాంతరంగు
     లట్టిశక్తిని విహరింతు రనుదినంబు.218
క. విను భవపాశచ్యుతుఁ డై
     మునుకొని దేహాభిమానములఁ దొఱఁగిన యా
     ఘనుఁ డురుచిద్రసమున న
     ల్లనఁ గరఁగును జలములోనిలవణము భంగిన్.219

గీ. జడము నజడంబు నైన దృక్సరణినడుమఁ
     దలఁపఁ బరమర్థ మై యెద్ది వెలుఁగు నదియ
     బహువిధజ్ఞానబోధకోపనిషదర్థ
     విదులచేఁ జెప్పఁబడెడి వివేకనిలయ.220
వ. దృశ్యదర్శనాసంబంధం బై యనుభూతం బై పారమార్థికం బైన
     సుఖం బెద్ది యదియ బ్రహ్మం బనంబడుఁ. గాని ముక్తి యన నాకా
     శంబునను భూతలంబునను బాతాళంబునను లేదు. నిఖలాశాపరిక్ష
     యం బైన మోక్షం బగు నందు;౼221
గీ. అన్యపురుషానురక్త యౌనతివ యింటి
     పనులు వేడుకఁ జేసినభంగి ధీరుఁ
     డఖిలక్రియలను వెలిఁ జల్పి యంతరంగ
     మునం జిదానందసౌఖ్యంబు ననుభవించు.222
చ. దినమణి చల్ల నైన, హిమదీధితి తీవ్రత నెండ గాసినన్
     అనలుండు వేర్చి క్రిందుశిఖ లై ప్రసరించిన, నాత్మసక్తు లే
     యనువున నైన విస్మరణఁ జెందక యుందురు గాని, యెట్టి చొ
     ప్పును గని విస్మయంబు మదిఁ బొందరు రాఘవచంద్ర యెప్పుడున్.223
వ. అనిన విని రాఘవేశ్వరుండు వసిష్ఠున కి ట్లనియె.224
క. ఏమిటఁ జరించు చిత్తం?
     బేమిటఁ జలనం బణంగు? నీ రోగము నే
     నేమందున నణఁగింపుదు?
     ధీమన్నుత యవ్విధంబు దెలియఁగఁ జెపుమా. 225
క. అనిన వసిష్టుం డి ట్లను,
     విను కల వందులకు రెండు వెరవులు యోగం
     బును సుజ్ఞాన మనంగాఁ
     బనుపడ నివి తెలియ వినుము భానుకులేశా.226

వ. అందు యోగంబునఁ జిత్తనిరోధంబును, సుజ్ఞానంబున సమ్యగవలోక
     నంబును నగు; నట్లు గావున.227
గీ. ప్రాణములచేతఁ జిత్తంబు భ్రాంతి నొందు,
     నవి నిరోధింప నదియును నణఁగు నండ్రు,
     చిత్తసంచలనంబు నివృత్త మైన
     యంత సంసారశాంతియు నగుఁ గుమార.228
క. పూరకము మొదలుగాఁగల
     మారుతధారణల, యోగమతి, నేకాంతో
     దార ధ్యాన సమాధిని,
     నారయఁ బ్రాణములచలన మడఁగును రామా.229
క. సంతతము ప్రాణకరణ
     ప్రాంతాశబ్దార్థతత్త్వభావన నగు నే
     కాంతజ్ఞానసుషుప్తి న
     నంతం బగుచిత్తచలన మడఁగుఁ గుమారా.230
గీ. యత్నమునఁ జేసి తాలుమూలాంత మైన
     ఘాటికాకోటరము జిహ్వఁ గదియఁ జేసి,
     ప్రాణములఁ బేర్చి యూర్ధ్వరంధ్రమున మెలుపఁ
     బ్రాణచలననిరోధ మౌ భానువంశ.231

వీతహవ్యోపాఖ్యానము

వ. ఇట్టు లనేకసంకల్పవికారితంబు లై వివిధాచార్యమతంబుల ప్రాణ
     చలననిరోధంబు బహుప్రకారంబులు చెవ్చంబడు. పరమవైరాగ్యా
     పరిచ్భిన్నంబైన యభ్యాాసంబు దృఢత్వంబు నొందఁ, దద్వాసనాను
     కూల్యంబునఁ బ్రాణాయామంబు సఫలం బగు. నిది యోగాభ్యాసం
     బింక విజ్ఞానస్వరూపం బెఱింగించెద; నాకర్ణింపుము.232
గీ. జనన కల్ప వికల్ప సంక్షయము గాఁగ

     నెనయ నవిశిష్ట మగుపద మద్ది, యదియ
     యఖిలవేదాంతవాక్కుల కందరాని
     సర్వసంపూర్ణ మైనసుజ్ఞాన మధిప.233
వ. అట్లు గావున సర్వంబును బ్రహ్మం బగునెఱుకయ పదార్థదర్శిత్వం
     బగు. నిట్టి యోగజ్ఞానవివరణంబులకు నిదర్శనం బొక్కటి సెప్పెద.
     సావధానుండ వై వినుము.234
చ. ఘనుఁడు శ్రుతి స్మృతి ప్రహిత కర్మపటిష్ఠుఁడుఁ వీతహవ్యుఁ డ
     న్మునివరుఁ డెల్లకర్మముల మున్కొని పాసి విరక్తచిత్తుఁ డై
     వనమున నేకతంబ గరువం బగుయోగసమాధినిష్ఠమైఁ
     జని వెలి సర్వమున్ మఱచి శాంతమనోగతి నుండె రాఘవా.235
వ. ఇట్లు బాహ్యాభ్యంతరంబు లగు నింద్రియార్థంబు లుపసంహరించి
     నిర్మలం బగునంతరంగంబున నిట్లని వితర్కించె.236
క. కటకట ప్రత్యాహారం
     బిటు సేసిన నైనఁ జలన మొందుచుఁ గడు సం
     కటపడుచున్నది చిత్తము,
     పటువిచలిత మైనజీర్ణపర్ణము భంగిన్.237
గీ. సర్వసాక్షియు నజుఁడును సముఁడు నైన
     చిన్మయాత్ముండు జగములు సేయుచుండు,
     నకట యింద్రియగణము నిరర్ధకంబ
     యా కలంకముఁ బొందెడి ననుదినంబు.238
మత్తకోకిల. పాములం గని డాయనోడెడు పాంథుకైవడి, మాలలన్
     వేముఱుం గని డాయరోసిస విప్రు చాడ్పున, నింద్రియ
     స్తోమవృత్తికి నెల్లప్రొద్దును దూర మై వెలుఁగొందు వీ
     తామయంబును చిన్మయంబును నైన యా పరమాత్మ దాన్.239

వ. సకలదుఃఖదము, సకలవిషయోన్ముఖము, నగు మనంబును విజ్ఞా
     నాదిచ్యుతికలనారహితుం డగుజీవునందును, జడం బగుదేహంబునం
     దును, నాత్మస్వరూపంబు వేద్యనిర్ముక్తం బై శుద్ధసంవిత్సారం బై
     యుండుం గాని, యితరంబు గాదు.240
క. అని నిశ్చయించి యపుడ
     మ్ముని యాసలు వీడి చిత్తమును బలవంతం
     బున నిల్బి యింద్రియంబుల
     పనుల నణఁచి చిరసమాధిపదమున నుండెన్.241
సీ. అబ్భంగి నుండంగ నతనిప్రాణంబులు
                    క్రమయుక్తిలోననె శమముం నొందె;
     నబ్జకోరకభాతి నరగంటిచూడ్కులు
                    కొమ రొంద నాసికాగ్రమున నిగుడ,
     మేనియుగ్గులు మాన్చి మెదలక చిత్రరూ
                    పముభంగిఁ బర్వతభాతి నుండె
     నట్లుండి వింధ్యగుహాంతరంబున ముహూ
                    ర్తముభంగి వర్షశతత్రయంబు
గీ. నిర్వికల్పసమాధిమై నిలిచియుండఁ,
     గాయ మతనిది ధరణిపంకమున మునిఁగి,
     యున్న చో టేర్పఱుప రాక యుర్విఁ గలిసి
     యుండె, నే మందు నమ్మునియుగ్రతపము!242
వ. ఇవ్విధంబున మున్నూఱేండ్లకుఁ బరమసమాధివలన మేల్కని పూర్వ
     నిష్ఠితం బై యనేకజన్మసంచితం బగుకర్మఫలంబు తపఃఫలంబుపోలెఁ
     దోఁచుటయు, నతండు మనోరాజ్యంబున సర్వంబు ననుభవించుచుండె.
     నది యె ట్లనిన, జనులకు జాగ్రత్స్వప్నమనోరాజ్యంబు లనం గర్మఫ
     లానుభవావస్థలు మూఁడువిధంబు లై యుండు. నందుఁ దెలివి

     గలిగి బాహ్యకర్మంబుల సంసారంబు సేయుచు, సుఖదుఃఖంబు లనుభ
     వించుట జాగ్రదవస్థ యగు. బాహ్యేంద్రియంబులు నిద్రనిగృహీతం
     బై యుండ నంతర్విషయంబు దగిలి చిత్తంబు రమించు చునికి స్వప్నా
     వస్థ యగు. తెలిసి యుండియు బాహ్యంబు మఱచి పురోభూతంబులు
     గానివస్తువులం దగిలి సుఖంచు చునికి మనోరాజ్యం బనంబడుసుషు
     ప్తి యగు. నట్లు గావున.243
ఉ. అమ్ముని హృద్గతంబున నుమాధిపుఁ డేలెడివెండికొండప్రాం
     తమ్మువనంబునం దొకకదంబమహీజమునీడ నుండి స
     ర్వమ్ము పరిత్యజించి శతవత్సరముల్ దప మాచరించి తా
     నిమ్ముల దేవలోకసుఖ మెంతయు వేడుక పుట్టి నెమ్మదిన్.244
గీ. రమణ నూఱేండ్లు విద్యాధరత్వ మొంది,
     యెనయ నూఱేండ్లు కాలుఁ డై, యింద్రలీల
     నమరభోగంబు నొక్కమా టనుభవించి,
     వెండి శివుకడ బ్రమథుఁ డై యుండె ననఘ.245
వ. ఇవ్విధంబునఁ బ్రతిభాసవశంబున ననేకజన్మాంతరసుఖంబు లనుభవించి
     పూర్వజన్మంబులం దలంచుకొని తొల్లి దోషరహితంబు లై నష్టంబు
     లగుశరీరంబులు పెక్కులు పొడగని వీతహవ్యాభిదానం బగునీశరీరం
     బెందునుం జెడదు గదే యని సంతసించి.246
మ. అనపాయస్థితిపంకమగ్న మగు మే న ట్లోర్చుకో నోప ?
     యన పుర్యష్టకగాత్రుఁ డై యనిలుఁ డై యాదిత్యునిం జొచ్చె; న
     య్యినుఁ డాత్మన్ గని పింగళుం డనుభటున్ వీక్షించి వే పంప, వాఁ
     డనివార్యంబున దెచ్చి నచ్చటికిఁ దా నమ్మౌనిదివ్యాంగమున్.247
వ. ఇట్లు దెచ్చినం గనుంగొని.248
శా. ఆవిప్రుండు నిజాంగపంజరగతుం డై సంగనిర్ముక్తుఁ డై
     జీవన్ముక్తిపదంబు నొంది సుఖి యై చిన్మాత్రుఁ డై యెల్లెడన్

     దా వర్తించుచు నిష్టలీల నయుతాబ్జంబుల్‌ వినోదించి స
     ద్భావం బైన విదేహముక్తిపదమున్ బ్రాపింప నుద్యుక్తుఁ డై.249
వ. ఒక్కయేకాంతప్రదేశంబున సుఖాసీనుం డై యంతరంగంబున విత
     ర్కించుచు ని ట్లనియె.250
క. రాగద్వేషములారా,
     యీగతిదుఃఖములు గుడిచి యెంతయు మాతో
     వేగించితి రిర వగునెడ
     భోగింపుఁడు తమ్ములార పొం డలుగకుఁడీ.251
క. పంచేంద్రియంబులారా,
     వంచన నాయొద్ద నుండవలవదు మీ రొ
     క్కించుక తడవు నిలిచినఁ బ్ర
     పంచభ్రమ గదియుఁ బొందుపట్లకుఁ జనుఁడా.252
క. పంచేంద్రియవర్గమ నా
     పంచినగతిఁ దిరిగి నన్ను బహువిధముల మ
     న్నించితికిరి వలయునెడకు ను
     దంచితగతిఁ బొండు మీకు దండము సుండీ.253
గీ. ఇట్టి పరమవదము నెట్టన మఱపించి
     త్రిప్పిత్రిప్రి తెచ్చితెచ్చి చూపి
     నన్ను మోసపుచ్చుచున్న యీయైహిక
     సుఖమ నీకు మ్రొక్కు సుమ్ము పొమ్ము.254
క. ఘనదుఃఖమ నీచేతం
     బనుపడఁ బరితాప మొంది పరమాత్మినిఁ గ
     న్గొనగంటి ముక్తిమార్గం
     బును జూచితిఁ గాన నీకు మ్రొక్కెదఁ జుమ్మీ.255
గీ. ఇతఁడు నన్ను విడువ నేకాకి నై యెట్లు

     సంచరింతు ననుచు సంశయింప
     కిచ్చ వచ్చునెడకు నేఁగి వర్తింపు నా
     తల్లి తృష్ణ నీకు దండ మవ్వ.256
వ. అని యి ట్లంతఃకరణగుణంబులను వీడ్కొలిపి ప్రశాంతుం డై యల్ల
     నల్లన ప్రణవోచ్చారణంబు సేయుచు సంకల్పవికల్పంబులు త్రైలో
     క్యసంభవంబులు సూక్ష్మస్థూలతరంబులు నగుబాహ్యాభ్యంతరభావం
     బులం బరిత్యజించి యమ్మునివరుండు.257
సీ. అంతటఁ బ్రాణాంత మగుదీర్ఘనిశ్వాస
                    తంతువుతోఁ గూడి తగుహృషీక
     తన్మాత్రముల నెల్లఁ దరలిచి, యట మీఁదఁ
                    దామసపటలంబు నామ మణఁచి,
     తగిలి ప్రాజ్ఞుని కావ లగుచు నందంబున
                    నొదవు తేజము దాఁటి యదియుఁ ద్రుంచి,
     తమము తేజము లేక తగుశూన్యమై తోఁప,
                    నందును దగులక యల్ప మైన
గీ. మనము చేతన మన మనుతృణముఁ దునిమి,
     యప్పు డటఁ బుట్టుశిశువు బోధాంకురంబు
     మాడ్కి నిర్మల మైనచిన్మయపదంబు
     గని నిమేషచతుర్థభాగమునఁ బొందె.258
మ. అనిలుం డచ్చలనంబుఁ బాయుగతిఁ జైత్యం బెల్ల వర్జించి, చ
     య్యన సత్తైకవినిశ్చితంబు నగుపశ్యంతీపదం బొంది, య
     ల్లన మేరుస్థిత మై సుషుప్తిపద మాలంబించి, సుస్థైర్యుఁ డై
     మునినాథాగ్రణి యంత తుర్యపదముం బొందెన్, సదానందుఁ డై.259
వ. ఇవ్విధంబున నిరానందుండును, సానందుండును, స్వచ్ఛుండును, నచిన్మ
     యుండును, చిన్మయుండును, నై నేతి నేతి వాక్యంబుల నుపనిషత్తు

     లుపన్యసించు నవాఙ్మానసగోచరం బైనపరతత్త్వంబు తానై వెలింగె.
     నది యెట్టి దనిన.260
సీ. శూన్యవాదులు కడు శూన్యతత్త్వం బన,
                    బ్రహ్మవేత్తలు పరబ్రహ్మ మనఁగ,
     విజ్ఞానవంతులు విజ్ఞాన మది యనఁ,
                    బొరి సాంఖ్య్థయోగులు పురుషఁ డనఁగ,
     నెసఁగుయోగీశవరు లితఁ డీశ్వరుం డన,
                    శివమతాచార్యులు శివుఁ డనంగఁ,
     కాలతత్త్వజ్ఞులు కాలరూపం బన,
                    నాత్మార్థవిదులు చిదాత్మ యనఁగ,
గీ. దాదృశాత్ములు తాదాత్మ్యతత్త్వ మనఁగ,
     మాధ్యమికు లెల్ల నిది యాదిమధ్య మనఁగ,
     రమణ సమచిత్తు లెల్ల సర్వంబ నాఁగ,
     నఖిలసిద్ధాంతసమ్మత మగుచు మఱియు.261
వ. సర్వహృదయానురాగంబును, సర్వతత్త్వంబును, సర్వంబును, నై
     నిర్వాతదీపంబునుంబోలె మానసంబు లేక, వెలుంగుల కెల్ల మొదలి
     వెలుంగై, యాత్మానుభవైకమానంబు, నేకత్వంబును, ననేకత్వంబు
     ను, సాంజనంబును, నిరంజనంబును, సమంబును, నజంబును, నాద్యం
     బును, సకళంబును నిష్కళంబును, నగునిరాలంబసంవిత్స్వరూపం
     బు దాన యై వెలింగె. నంత.262
క. అప్పరమసంయమీంద్రుఁడు
     ముప్పదివేలేండ్లు యోగమును గని చని తా
     నొప్పాఱు చిత్తలయమునఁ
     దప్పక తద్బ్రహ్మపదము తా నై వెలిఁగెన్.263
వ. అని వసిష్ఠమునీంద్రుండు.264

గీ. వీతహవ్యుమహిమ విను ధన్యమతులకు
     నఘము లణఁగు శుభము లగ్గలించుఁ,
     జిత్తశాంతి వొడము, చిన్మయానందసౌ
     ఖ్యంబు చెందు, నెపుడుఁ గమలనయన.265
వ. అని యిట్లు వీతహవ్యోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగించి,
     యింకఁ జిత్తోపశమనప్రాప్తి పరిస్ఫుటం బగుటకు నాకాశగత్యభావో
     పాఖ్యానంబు చెప్పెదు నాకర్ణింపు మనిన విని రఘువుంగవుండు
     మునిశార్దూలున కి ట్లనియె.266
క. మునివర జీవన్ముక్తులు
     ననఘులు నాత్మార్థవిదులు నగువారలకున్,
     విను మంబరగత్యాదుల
     ఘనసిద్ధులమహిమ లేల కాన్పింపవొకో.267
సీ. అనిన వసిష్టుఁ డి ట్లను నభోగమనాది
                    కములైన సిద్ధులు గావు ముక్తి
     ద్రవ్యమంత్రక్రియాతత్కాలశక్తుల
                    నవిముక్తుఁడును బొందు నట్టిసిద్ధు,
     లాత్మజ్ఞునకు నవి యప్ర్రయోజకము, ల
                    య్యాత్మజ్ఞుఁ డెపుడును నాత్మవిదుఁడు,
     ఆతండు తనయాత్మయంద సుఖించుచు
                    నుండుఁ గాని యవిద్య నొందఁ డెందు,
గీ. నార్యు లివి యెల్ల మాయామయంబు లండ్రు,
     ఈజగద్భావములయందు నెల్ల నాడు
     విగతమాయాప్రపంచులు విగతమతులు
     ముక్తులును నైనపుణ్యలు మునుఁగ రెందు.268
వ. ఆత్మజ్ఞానవిదుం డయ్యు నెవ్వఁడే నిట్టి సిద్ధిజాలంబు బొందఁ గోరు

     నతండు తత్సాధనంబు లైన ద్రవ్యంబుల నయ్యైసిద్ధులం బొందు. ద్రవ్య
     మంత్రక్రియాకాలశక్తులు సిద్ధిప్రదం బగు, నైనను బరమపదప్రా
     ప్తికి నంతరాయంబులు గాని యుపాయంబులు గావు. అట్లు గావున.269
గీ. సమత నిచ్ఛాసమూహంబు శాంతిఁ జేసి
     యాత్మలాభంబు నొందినయట్టి యోగి
     కకట తుచ్ఛపుసిద్ధులయందు నేల
     తిరుగఁబడుచుండు, చిత్తంబు తెలివి విడిచి?270
క. అనిన విని రాముఁ డిట్లను
     మునివల్లభ పెద్దకాలములు యోగీంద్రుల్‌,
     తనువులు నిల్పి చరింపుదు
     రనిశము నత్తెఱఁగుఁ దెలియ నానతి యీవే.271
వ. అనినఁ బరమసంయమి యి ట్లనియె.272
క. విను మనిలస్పందనమునఁ
     దనువును జలనంబు నొందుఁ, దద్గతి శాంతం
     బును బొందఁ జలనరహితతఁ,
     దనువును సుస్థిరత నొందుఁ, దపనకులేశా.273
వ. అట్లు గాన వాయుధారణానియతు లైనపరమయోగీంద్రులు నిత్యు
     లగుదురు. ఎట్టిదేహంబున మనఃపవనంబులు బాహ్యాభ్య్ధంతరచల
     నంబు లుడిగి యుండు నద్దేహంబు ధాతుక్షీణత లేక చిరకాలం
     బుండు. ననిన విని రామచంద్రుం డి ట్లనియె.274
క. అనఘ వివేకాభ్యుదయం
     బునఁ జిత్తము లయముఁ బొందుపుణ్యాత్ములకున్
     ఘనమైత్ర్యాదిగుణావళి
     యెనయఁగ నె ట్లుద్భవించు నెఱిగింపు తగన్.275
సీ. అనిన నమ్మునిపతి యనుఁ జిత్తనాశం బ

                    రూపంబు మఱియు సరూప మనఁగ
     రెండువిధంబు లై యుండు, జీవన్ముక్తి
                    యదీయ సరూప మౌ, నటు వి దేహ
     ముక్తి యరూపకంబును నగు, సుఖదుఃఖ
                    ములచేత బద్ధ మై కలఁగుమనసు
     సంసారనామవృక్షమునకుఁ బ్రోది యౌ,
                    నిది చిత్తవిభ్రాంతి యెఱిఁగికొనుము.
గీ. దీని సంక్షయ మెఱిఁగింతుఁ దెలియ వినుము,
     కొండ గాడ్పునఁ గదలక యుండినట్టి
     భంగి సుఖదుఃఖములచేత భంగపడక
     యుండునది చిత్తలయ మండ్రు యోగివరులు.276
క. జ్ఞానస్వరూప మగు న
     మ్మానసమె యమాససంబు! మది మఱవక తా
     ధ్యానంబు నిశ్చయించిన
     మానస మది సాత్త్వికంబు మనుకులతిలకా.277
గీ. పరఁగు రాజస తామస భావనాశ
     మగుడుఁ జిత్తంబు సన్న మై నిగిడి, సత్త్వ
     గుణము చిక్కంగ మైత్ర్యాదిగుణము లొదవు
     నని యెఱుంగుము మనమున నంబుజాక్ష.278
క. ఇదియ సరూపమనోలయ
     మిది జీవన్ముక్తునందు నెసఁగు, సరూపా
     స్పదహృదయనాశనం బది
     విదేహముక్తునకు నమరు, విమలచరిత్రా.279
వ. ఇట్లు రజస్తమోగుణంబుల నిరసనంబున విశ్లేషించినయదియ సకల
     సద్గుణసారంబును సాత్త్వికవిశేషంబు నగు జీవన్ముక్తి విదేహముక్తి

     యందుఁ దన్మనంబు లీనం బగు. నట్లు గావున.280
క. అనిలస్పందనవాసన
     లనిశము ప్రేరేప నింద్రియజ్ఞానము గొ
     బ్బున నబ్బకుండె నేనియు,
     ననఘా తద్బ్రహ్మ మీవ యగుదువు సుమ్మీ.281
వ. వేద్యవేదనోల్బణత్త్వంబు చిత్తంబు. అదియ యనర్థమూలం బగు.
     దన్నిరసనంబునన గాదె మహాయోగీంద్రులు ప్రాణసంరోధనంబు
     సేయుచుందు. రది యెట్లంటేని.282
క. మానుగఁ బ్రాణాయామ
     ధ్యానమునను యుక్తికల్పితపుయోగములన్,
     బూనఁగ ననిలనిరోధం
     బై నిలువఁగఁ జిత్తశాంతి యగు రఘురామా.283
సీ. వినుము వృత్తిజ్ఞానవిభవప్రభూత మై
                    యనుభూతి వాసనలను జయించు
     పరమచిత్తోత్పత్తిపద మెఱిఁగించెదఁ;
                    గడిఁదివాసనలచే విడువఁబడిన
     పూర్వాపరవిచారముల జనించుపదార్థ
                    రక్తి వాసన యండ్రు, రాజవృషభ,
     యది యతివ్యగ్ర మై యాత్మలో నూనంగ
                    నఖిలసద్వృత్తులు నడఁగి పోవు,
గీ. నట్టివాసన దగిలినయట్టి పురుషుఁ
     డేది గనుగొన్నఁ దన కది యెల్ల మంచి
     దనుచు మోహించు; వాసనాభ్యాసవృత్తి
     జననమరణాదికారణ మనఁగఁ బరఁగు.284
క. ఇమ్ముల హేయోపాదే

     య మ్మగుజాగరవిలాస మణుమాత్రము చి
     త్తమ్మునఁ దోఁపక యున్నపు
     డమ్మానస మింకఁ బుట్ట దని యెఱుఁగు మదిన్.285
వ. వాసనారాహిత్యం బగునంతన పరమశమప్రదంబై మనోలయం బగు.
     నది యె ట్లనిన.286
మ. అనిలస్పందనవాసనల్ పొడమ న ట్లన్యోన్య మేతద్ద్వయం
     బును బీజాంకురముల్ మనంబునకు నై పొల్పొందు; నీమూఁటికిన్
     విను బీజంబు ప్రపంచ; మట్లగుట సంవేద్యంబు వర్జింపు; మం
     తన నిర్మూలితవృక్షమట్ల యడఁగున్ దత్సర్వమున్ రాఘవా.287
గీ. వినుము సంవేద్యమునకు సంవిత్తు బీజ,
     మివియు నొండొంటి నెడబాసి యెందు లేవు,
     నూనెతోఁ బాసి నువ్వులు లేనియట్ల
     యని యెఱుంగుము, మనమున నినకులేశ.288
క. వారని విషయజ్ఞాన మ
     పారభవోదారదుఃఖపరకారణ మౌఁ;
     గోరిక గూరని విషయ
     స్ఫారజ్ఞానంబు సౌఖ్యపదహేతు వగున్.289

ఆకాశగత్యభావోపాఖ్యానము

వ. అనిన విని రామచంద్రుం డయ్యా, జాడ్యరహితుండును, నిర్విషయ
     జ్ఞానియు, నగు నతం డెట్టివాఁ డతనికి తజ్జడభావం బెట్లు నిర్వర్తించుఁ
     జెప్పవే యని యడిగిన, నప్పరమసంయమి యి ట్లనియె.290
క. సర్వావస్థలయందును
     నిర్వాణమనస్కుఁ డైననిత్యుఁడు జడుఁడున్
     నిర్విషయజ్ఞానియు నగు
     నుర్వీశ్వర, కార్యకోటియుతుఁ డై యున్నన్.291

ఉ. వాలినసర్వధర్మముల వాసన లన్నియుఁ గ్రాఁగి పోవఁగా,
     బాలునిభంగి మూకు క్రియఁ బాటిలి చిత్సుఖపారవశ్యుఁ డై
     క్రాలుట యెప్పు డప్పు డవికారత నాతత మై యజాడ్య మై
     యోలిన రాకపోక లవి యుండని తత్పద మొందు రాఘవా.292
క. ఎసఁగిన సంవి త్తికి బ్ర
     హ్మసదృశ సమభిజ్ఞ యెద్ది యది యుదయించున్,
     వసుధేశ్వర, విను తేజో
     విసరమునఁ బ్రకాశమహిమ వెలుఁ గొందుగతిన్.293
సీ. విను మనీషాంతరవిషయ మై సన్మాత్ర
                    మై యనాదరణ మై యధికరూప
     మై యేకరూప మైనదియ సత్తాస్థితి
                    యగు; నట్లు కల్పితావిగళితంబు
     నాద్యంబు మఱియు ననాద్యంబు; సామాన్య
                    సద్భావమునకు బీజంబు లేదు;
     గాన సంవిత్తియు గలుగంగ నందులఁ
                    బొందిన మఱి రాక పోక లేదు,
గీ. సకలహేత్వర్థమునకును సార మిదియ,
     హేతు వెన్నఁడు దానికి నెన్న లేదు;
     సారముల కెల్ల మొద లగుసార మిదియ,
     యింతకంటెను మఱి సార మెందు లేదు.294
వ. అట్లు గావునఁ బురుషప్రయత్నంపుబలిమిని సకలవాసనాపరిక్షయం
     బు సేసి తత్త్వజ్ఞుండ వై యక్షయాత్మకం బగునట్టిపదం బొక్కనిమే
     షమాత్రంబునం బొందునదియ యుత్తమంబు.295
మ. తతచిత్తక్షయ వాసనాహరణ తత్త్వజ్ఞానముల్ నాఁగ నీ
     త్రితయంబున్ గడుదుష్కరంబు లగుట ధీయుక్తి మైఁ బౌరుష

     స్థితిభోగేచ్ఛ దొరంగి యత్నమునఁ బ్రీతిన్ వీని సేవించి సం
     తతసౌఖ్యోదయ మైనచిన్మయమహాతత్త్వంబునం బొందుమా.296
క. ఈ మూఁడు నభ్యసింపని
     యా మూఢుఁడు జన్మశతసహస్రంబులకున్,
     భూమీశ్వర, యచ్యుతపర
     మామృతపద మెవ్విధమున నందఁడు సుమ్మీ.297
క. క్రమకాలంబున నీ త్రిత
     యము నబ్బిన ముక్తిఫలద మగు; నొక టొకటే
     సమకొన సంకల్పితమం
     త్రములుగ నత్యుచ్చసిద్ధిదము లగుఁ దలఁపన్.298
గీ. అనఘ యీమూఁడు గూడ నభ్యస్త మైనఁ
     గలుషతర మగుమానసగ్రంధు లెల్ల
     దొడవు దెగ దాన నూలును దునియునట్ల
     తివిరి నిశ్శంక నన్నియుఁ ద్రెస్సిపోవు.299
క. చన భావనావిరతి సం
     గనివర్తనములను దనదుకాయ మసత్యం
     బని తెలిసిన, వాసనలను
     మునుకొని యది యణఁప జిత్తమును నణఁగుఁ జుమీ.300
సీ. సకలార్థవితతకి సంగంబు హేతువు,
                    సంగంబు నిలయంబు సంసృతికిని,
     సంగంబు మూల మాశాలతావలికిని,
                    సంగంబె యాపద్దశలకు నెలవు,
     సంగవర్జనమె మోక్షము, సంగవిరతిని
                    జన్మనాశం బగు జనవరేణ్య,
     కలిమిలేములు రెండు కడు దుఃఖ మొనరించు

                    మలినవాసన సంగమం బెసంగ,
గీ. నింక సన్మునిరక్తుల కిట్లు వితత
     జన్మభేదము హర్షవిషాదగతియు
     సడల వర్తిల్లు శుధ్ధవాసన యెసంగ,
     ననుచుఁ గొనియాడుదురు మును లనఘచరిత.301
వ. ఆ జీవన్ముక్తులు, మూర్ఖచిత్తులు దీనమతులు నగుదురేని పునర్జన్మ
     మొందుదురు అట్లు గావున.302
చ. మును సుఖదుఃఖజాలమున మోదము భేదము లేక, యాశకుం
     జన వొకయింత యీక, ఘససంపద లాపద లొందినట్టిచో
     ట్లను సమబుద్ధి నొంది, యొకటన్ దగు లొందక, ప్రాప్తవస్తువుల్
     గొని సుఖయించె దేని ధృతి గూడి యసంగుఁడ వౌదు రాఘవా.303
వ. అని ఆకాశగత్యభావోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు.304
క. ఉపశమనప్రకరణమున
     నపరిమితం బైనచిత్త మణఁగువిధము నా
     త్మపరిస్ఫుటవిజ్ఞానము
     నుపదేశించితి నెఱుంగు ముత్తమచరితా.305
వ. అని యి ట్లుపశమనప్రకరణంబు వసిష్ణుండు రామచంద్రున కెఱింగిం
     చుటయు సవిస్తరముగా విని భరద్వాజుండు సంతుష్టాంతరంగుం డై
     యటమీఁద నేమి సెప్పె నానతి మ్మని యడిగిన.306
మత్తకోకిల. వేదవేద్యపదాంబుజద్వయ, విశ్వరక్షణదక్షకా,
     యాదిశత్రునిరస్తనిత్యదయారసామృతనేత్ర, ప్ర
     హ్లాదనారదపుండరీకశుకాదిభాగవతోత్తమా
     హ్లాదకారణ, దివ్యనామ, భవాబ్ధిశోషణబాడబా.307

క. సంసారభయనివారణ,
     కంసాసురమల్లముఖ్యఘనదానవవి
     ధ్వంసభుజసార, దివిజో
     త్తంసమణిశ్రీపరీతతతపదకమలా.308
మాలిని. కమలభవవధూటీ కాశీకర్పూరవాటీ
     హిమకరహిమశైలాహీంద్రసత్కీర్తిలోలా
     దమితవిమలవీరా దైత్యవక్షోవిదారా
     విమలకమలనేత్రా వీరలక్ష్మీకళత్రా.309

గద్య.
ఇది శ్రీనృసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర, సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బైనవాసిష్ఠరామాయణంబునందు
ఉపశమనప్రకరణం బన్నది
చతుర్థాశ్వాసము