వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/భ్రమరాన్వేషణము

భ్రమరాన్వేషణము


"శివ, శివా! యనమేలు తుమ్మెదా!
శివయన్న వినమేలు తుమ్మెదా!!
శ్రీకంఠుఁ డనుపూవు తుమ్మెదా!
మూఁడులోకమ్ము లయ్యెనే తుమ్మెదా!
ఆఱు రేకులపూవు తుమ్మెదా!
యది మీఱునే వాసనల తుమ్మెదా!
వేఱు సేయక నీవు తుమ్మెదా! శివుఁ
జేరి భజియింపవే తుమ్మెదా!!
అష్టదళముల మీఁద తుమ్మెదా! నీ
వంటి చరియింపవే తుమ్మెదా!!
సాకారమైయుండు తుమ్మెదా! పర
మైకాంతమునఁ జూడు తుమ్మెదా!!”


భిక్షుకుని కోమలకంఠము నుండి విడివడి సమీరసమీరిత మగుచు నీ భ్రమర గీతి శ్రుతిపుటములఁ బ్రవేశించి నా స్నిగ్ధచిత్తమును ద్విరేఫాన్వేషణకుఁ బురికొల్పినది.

అది యుజ్జ్వల కావ్యోపవనవాటి. సాకూతమధుర కోమలవిలాసినీకలకంఠ కూజితప్రాయము. [1]శివతపోభంగ సమయము. హుతాశనునకుఁ డోడ్పడు మని వాయువు నెవరు ప్రేరేపింపవలయును? మన్మథునకు మాధవుఁడు సర్వ ప్రావీణ్యము మెఱసి తోడ్పడుచున్నాఁడు. మహాకవి కాళిదాసు వాసంత విలాసశ్రీ వహించియున్న పరమేశ్వరాశ్రమమునందు మదనుని రతిద్వితీయునిగఁ బ్రవేశపెట్టి యొక పొదరింట నుపవిష్ణుఁడై సమస్తమును రసనిషణ్ణచిత్తముతోఁ దిలకించుచున్నాఁడు. స్థాణ్వాశ్రమమున మదనాగమానంతరము చరాచరమైన సమస్త ప్రకృతియు నుజ్జ్వల రసప్రపూర్ణమై యొప్పుచున్నది. మిథునము లుత్కృష్ట ప్రేమరసావేశము గలవై యొప్పు దృశ్యములు భ్రమరాన్వేషణకై పర్యటించు నా కంటఁబడినవి.

అట గండుతేఁటి పూవనెడు నొంటికోరలో ముందుగ నెచ్చెలికిం ద్రాగనిచ్చి

యది త్రావమిగిలిన పుష్పరసము నానందరసోత్కరుఁడై త్రావుచున్నాఁడు. నా దృష్టి

యా రమణీయ దర్శనముపై నిల్చినది. కొంతకాలమైన పిమ్మట బుద్ధి యా రసిక దాంపత్యమున కత్యామోదము నొందినదయ్యు నిది రసాభాసము కదా యను శంక నొందినది. అప్రయత్నముగ నా యభిప్రాయము నా నోఁటినుండి బయటపడినంత టనుండియో 'రసాభాసమును రసమే' యగు నను నొక కమనీయకంఠము విన్పించినది.

'అది యెచట నుండి?' యని యొక వంకకుఁ జూతునుగదా యట లతా గృహద్వారమున వామప్రకోష్టార్పిత హేమవ్రేతుఁడై ముఖార్పితైకాంగుళి సంజ్ఞచే ‘నల్లరి జేయకుఁ’ డని గణముల శాసించు నందీశ్వరుఁడు నా కంటఁబడినాడు. మఱుక్షణమున వనమంతయు నతని యనుశాసనమున నిష్కంపవృక్షము, నిభృత ద్విరేఫము, మూకాండజము, శాంతమృగ ప్రచారము నైనది. మున్ను పొడకట్టిన ద్వి రేఫప్రియుఁడు ప్రియావియోగము నొంది యొంటిగ నొక యామ్రశాఖికపై నిలచియున్నాఁడు. ఇట షట్పదాన్వేషణ మిఁక సాఁగ దను బుద్ధితో సాఁగిపోవుచుండఁ బర్యంకబంధ స్థిర పూర్వకాయము, ఋజ్వాయత సన్నమితో భయాంసము, ప్రఫుల్ల రాజీవభ్రమకృ దుత్తాపాదద్వయ సన్నివేశము నగు పరమేశ్వరరూపము గోచరించినది. నా చూపు ప్రాణాపానాది మరుత్పంచకమును నిరోధించిన మహేశ్వరుని భుజంగమోన్నద్ధ జటాకలాపముపై నిల్చి కర్ణావసక్త ద్విగుణాక్ష సూత్రమును గని కంఠప్రభాసంగ విశేషనీల కృష్ణాజినముపైఁ బర్వినది. వృష్టిసంరంభము లేని యంబువాహము వలెఁ, దరంగ రహితమైన నీరాధారము వలెఁ నివాతనిష్కంపప్రదీపము వలెఁ, బరమశివుఁ డటనుండఁ గని యిట భ్రమరములకై వెదకుట 'వెఱ్ఱియన్వేషణ' మని నిశ్చయించి తిరోగముఁడ నగుచున్నాను.

అందుకు వ్యతిరిక్తముగ నా హిమగిరి రాజపుత్రి నిత్యకైంకర్యమునకై సమ్మోహనరూపమున సదాశివుని సన్నిధానమునకు వచ్చుచున్నది. సుగంధ నిశ్శ్వాస వివృద్ధతృష్ణుఁడై యొక సారంగాధీశ్వరుఁడు గిరిసుతాబింబాధరాసన్న సీమఁ జరింపనామె ప్రతిక్షణ సంభ్రమలోలదృష్టితో విలోకించుచు లీలారవిందమున నివారించు దృశ్యమును జూచియు నిట నింక భ్రమరాన్వేషణము పొసంగు టెట్లనుకొంటిని. ఆ మాట వూకుటీరమున నున్న కవికులగురువు చెవిఁబడెనేమో! 'అలక కేఁగుము, [2]అట పాదపములు నిత్య పుష్పములు, నున్మత్తభ్రమర ముఖరములు' నని

సెలవిచ్చినాఁడు.



సీ. [3]"గగన స్రవంతిలోఁ గల సువర్ణాబ్జంబు
             లందు మే లేర్చి తా నపహరించి,
     మానసంబు శఠాత్ముమానసంబునుబోలె
             నిస్సారసత్త్వంబు నెఱయఁ జేసి
     బిందుసరమ్ములోఁ గుందనపుం దమ్మి
             పేరులేకుండంగఁ బెల్లగించి
     సౌగంధికాఖ్యకాసారంబు జలమాత్ర
             శేషమై దీనతఁ జెందఁ జేసి”

వజ్రనాభుని వంటి రక్కసులే కేళాకూళులఁ బోషించి రసికజన రాజేంద్రు లనిపించుకొనినారు. అట్టి యెడ నార్యధర్మాభినిష్ఠ గల [4]

శ్రీహర్ష చక్రవర్తి వనపాలన దక్షుఁడై యుంట తప్పదను నాశతో నతని సాహిత్యోద్యానమునఁ బ్రవేశించితిని. అప్పు డందొక పద్మాకరమున భ్రమరయువకుఁ డొక్కఁడు కమలమును జేరి మరందపాన మొనర్చుచుండ హిమానీవర్షము కురిసినది. అతఁడు మంచుదెబ్బ తగిలి పడిపోయినాడు. అంతకుమున్నే వారి పరిచయ మొనర్చుకొని ప్రక్క నిలచియున్న నాతో నా కవిచక్రవర్తి యా కరుణదృశ్యమును జూపి 'వామే విధానహి ఫలం త్యభివాంఛితాని' (దైవము ప్రతికూలముగా నుండఁగా గోర్కెలు ఫలింపవు కదా!) యనినారు

పిమ్మటఁ గొంత కాలమునకు [5]బిల్హణభట్టు విక్రమాంక వనమునఁ బ్రవేశించితిని. అప్పు డట నొక పెనుగాలి పుష్పలోకప్రళయమై యొప్పినది. పుష్పధూళి చెలరేఁగి కన్నులఁ గప్పుటచే రెప్ప లల్లార్చుచు నాకాశపథమున కెగయుచున్న యళిసంతానములు బహుళ పౌరందరచాపవిభ్రాంతులఁ గల్పించి యనతికాలములోఁ గారుచీఁకట్ల గగనవీథిఁ గప్పినవి.

ఇఁక సంస్కృతసాహిత్యవనీవీథుల షట్పదాన్వేషణ మొనర్ప బుద్ధి వోకుండుటచే నాంధ్రసాహిత్య పుష్పకాననములఁ బ్రవేశించితిని. ఆదిలో నది 'సంహితాభ్యాసి' వనము. ఛందోముఖరితమై యొప్పు నిందుఁ గేవలము శుకానువాదములు తప్ప విన్పింపనేమో యను సందేహము కలిగినది. కాని యదృష్టవశమున నాదియందే నన్నయ 'కమ్మని లతాంతమ్ములకు మ్మొనయు మధుప సంతానముల' మధురఝాంకరణములు విన్పించినవి.

తదుపరి నే ప్రవేశించినది తిక్కనార్యుని 'రామాయణ వనము'. తొలుదొల్తఁ

బ్రభువగు శ్రీరామచంద్రమూర్తికి [6]వనపాలిక మత్తమధుపములకుఁ దప్పి



మధుభరితంబై క్రొత్తావిఁ గ్రమ్ము నరవిరి గుత్తి నొకదానిని వినయ వికుంచిత తనువై యర్పించుచు నొప్పినది. అనతికాలమునకుఁ దీఁగెయుయ్యలల నెక్కి తూఁగియాడుచుఁ గూడిపాడెడి మత్తాళిబాలికలను గని యొండొరులకుఁ జూపించుచు నలరులఁ గోయుచోట మధుపాళి మ్రోఁతకు ముగ్ధ లుల్కినం గలకల నవ్వుచున్న వారివిహార ప్రియుఁడగు రామచంద్రుఁడు' కన్పించెను. మఱియొక చోట

ఉ. [7]తుమ్మెద పిండు మెండుకొని త్రొక్కిన రేకుల సందు సందులం
    గ్రమ్మి చలత్తరంగ శిఖరంబులఁ దూలెడి తమ్మి పుప్పొడుల్
    కొమ్ముడులూడఁ గ్రమ్ము పొది లోపల నొక్కొకచోటఁ గెంపుచం
    దమ్మునఁ జెన్నుచేసె వనితల్ కమలాకర కేళి సల్ఫగన్.”

ప్రబంధ పరమేశ్వరుని యారామవీథిఁ బ్రవేశించి చూడ నట [8]జైత్రారూఢిఁ జిగురుం గెంజెడ లొప్పఁ బుష్పరజముల్ సెల్వార నున్బూది పూఁతగ లేదేఁటులు చుట్టుకోలు జపసూత్రశ్రీలుగాఁ గోకిల ప్రగుణాత్తాధ్యయనంబుతో శాంభవంబగు దీక్షావిధి నొంది యొప్పుచున్నది. మఱియొక దిక్కున వాగర్ధ ప్రణయమూర్తులైన యుమామహేశ్వరులు కేళీవిలాసములఁ దేలియాడుచున్నారు. పరమేశ్వరీ లీలారవిందము నందలి భ్రమరబాలుఁడు మన్మథమథనుని మానసవీథిని జీరనిద్ర నొందుచున్న చిత్తజాగ్నిని మేల్కొల్పుచున్నాఁడు. ఇది యనంగ విజయము అమ్మవారి కైంకర్యసమయ మని ముందున కేఁగ నిచ్చగింపక యందుండి యన్యవనములకుఁ బయనమైతిని.

'ఉల్లల దలకాజలకణ పల్లవిత కదంబముకుళ పరిమళ లహరీ హల్లోహల మదబంభర మల్లధ్వను లెసఁగ మరుదంకురములు నన్నాహ్వానించుచున్నవి. 'ఆవాత పరంపరా పరిమళ వ్యాపార లీల న్జనాన్విత మిచ్చోటని చేరఁబోయి’ యట నొక్కచో నిల్చి 'ఈ రమ్యవృక్షవాటిక లెవ్వరివి చెప్పుమా!' యని ప్రశ్నించుకొంటిని. 'నభో వాహినీలహరీ శీతలగంధవాహ పరిఖేలన్మంజరీ సౌరభగ్రహణేందిందిర తుందిలమ్ము లివి మత్కాం తార సంతానముల్' అనునొక కామినీకలస్వనము విన్పించినది. చకితుఁడ నగుచుండ మఱుక్షణమున నొక చంచల్లతావిగ్రహ, శతపత్త్రేక్షణ, చంచరీక చికుర, చంద్రాస్య, చక్రస్తని, నతనాభి, నవల నా యెదుట నిల్చినది. జ్ఞప్తి కెలయించుకొని 'ఓహో! నీవు మా యాంధ్ర కవితా పితామహుని యమృత దుహితవు నమరనర్తకివి, యా వరూధినివి కావా?' యని ప్రశ్నించి యేమో సంభాషింప నూహించు చున్నంతలోనే యటకుఁ 'జెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్' అనుకొనుచుఁ

బోవుచున్న తరుణాగ్నిహోత్రి ప్రవరుఁడు స్వాహావధూవల్లభుని యింటికిఁ జేర్పుమని


ప్రార్థించుట విన్పించింది. మున్ను వరూధిని ప్రవరునితో నన్న 'వనిత తనంతఁ దా వలచివచ్చినఁ జుల్కనగాదె యేరికిన్' అన్న సాకూతాభిభాషణము వినఁబడియెనేమో!

చ. [9]"తరుణి ననన్య కాంత నతి దారుణపుష్ప శిలీముఖవ్యథా
      భరవివశాంగి సంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై
      యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ
      స్ఫురణ వహించెనో యన నభోమణి తాల్చెఁ గషాయదీధితిన్.”

కంపించి మఱల నే వరూథినికైనఁ గన్పింపక బయటఁ బడితిని.

అది 'గగనధునీ శీకరముల' చెమ్మ, నంది తిమ్మయ్య పారిజాతోద్యానము. ప్రవేశింపనొక షట్పదకుమారుఁ 'డే వియోగశాలినీ హృదయ రేఖగ’ నో కన్పట్టుచు నా వలె నొక వెఱ్ఱియన్వేషణ మొనర్చుచుఁ గన్పించినాఁడు. అతని యవ్యక్త కంఠధ్వని యందామె సొగసు రేకుల విప్పి యమృత నటనఁ గానుపింపఁబోదు; [10]నా కుగాదులు లేవు నా కుషస్సులు లేవు' మొదలగు ననేక విరహవిధుర భావములు పొడకట్టుచున్నవి. 'పాపము! ఈ మధువ్రతుని బాధ యేమిటి? వాడిపోయిన సుమసౌరభమ్ము కొఱకుఁ గను మొఱంగిన ప్రతిహిమకణమ్ము కొఱకు బ్రతుకు బ్రతుకెల్ల నెదియొ యొక బాష్ప గీతిక వలె' నున్నదే!

ఈ రీతి భావించుచుండ నట నొక గిరిపొంతఁ జక్కగఁ దీర్చి దిద్దిన పూఁదేనియ యేటికాలువ దరిఁ జెంగల్వ పుప్పొళ్లు నించిన సాంద్రోపల వేదిపై నధివసించి యీషత్కషాయ సౌరభమై స్వర్గమునుండి తన సత్య కొనితెచ్చి యిచ్చిన పారిజాత కుసుమ సౌరభ మాఘ్రాణించుచు తిమ్మన్న మహాకవి యా సత్యాదేవికి నూతన ప్రహేళికల నేఱ్పుచున్నాఁడు. వినమ్రభావముతో వారి దరిఁ జేరిఁ మహానుభావా! ఈ బంభరకుమారుని బాధ యే?” మని మున్ను నేఁ జూచినవానిఁ జూపించుచుఁ బృచ్ఛ యొనర్చితిని.

మ. [11]“ఒక భృంగంబు పరాళినీమదనతంత్రోన్మాదిఁ బ్రాణేశ్వరిన్
    మకరందాసవమత్త మజ్జగృహసీమం బెట్టి తాఁబోయి సం
    జకడ న్వచ్చి తదానమన్ముకుళ మే జాడం జొరంరాక యా
    మికుఁడో నాఁ దిరుగున్ - గొలంకు రమకు న్మేలెంత హీనంబొకో!"

యని తిమ్మనవారు సమాధానము చెప్పి తుదకర్థాంతరము నుంచినారు. భ్రమరకుల

విచిత్ర చేష్టలను గూర్చి మఱి యొక విశేషాంశమును గూడ వినిపించినారు.


సత్యభామమ్మవారు పారిజాతాపహరణ సందర్భమున స్వర్గమునందలి మందాకిని యందు జలక్రీడ లొనరించుచుండ -

మ. [12]ఎల దేఁటుల్ దమ వాలుఁ గన్గవలపై నిందీవరభ్రాంతిచే
     మెలఁగన్ జేరలఁ గప్పుకో నలవిగామిం జీదరం జెంది యి
     చ్చలఁ గాంక్షించిరి నిర్నిమేష జలజాస్యల్ మానుషత్వంబు న
     య్యళిభీతి న్ముకుళీకృతాక్షి యగు సత్యాకాంత నీక్షించుచున్.”

[13]ప్రతివర్ష వసంతోదయ కుతుకాగత సుకవినికర గుంఫిత కావ్యస్మృతిరోమాంచ విశంకిత చతురాంతఃపుర వధూప్రసాధన రసికుఁ' డగు శ్రీరాయలవారు గావ్యోప వనవిహార మొనర్చుచు 'వాణీకుంభవక్షోజ నాట్యాయత్తంబగు భీమతంత్రిపయి బాహాటించు' నాముక్తమాల్యద వాసనలకుఁ దానె చొక్కుచుఁ నున్నవేళ 'నప్పాజీ’ యనుమతితో వారినిఁ గలసికొంటిని.

అప్పుడు వారు విలిబుత్తూరు వీధులలో జరించుచు నొక నాఁడు గర్గానిన విచిత్ర చిత్రమును గూర్చి తాము చెప్పికొనిన :

ఉ. [14]"వేవిన మేడపై వలభి వేణికఁ జంట వహించి విప్పగాఁ
    బూవులు గోట మీటుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కామి శం
    కావహమౌ కృతాభ్యసన లౌటను దంతపు మెట్లవెంబడి
    న్జేవడి వీణ మీటుటలు జిక్కెడలించుటలు న్సరింబడన్.”

యను కావ్యమును సాభిలాషముగఁ జదివికొనుచు నానందించుచున్నారు. అప్పుడట కొక వేత్రపాణి వచ్చి చిన్నా దేవమ్మగారి రాక నెఱింగించినాఁడు. నేను వారి యుత్ప్రేక్షకు హృదయమొగ్గి యనుజ్ఞఁగైకొని ప్రాసాదమునుండి బయల్వెడలితిని.

భ్రమరాన్వేషణమును జీవితాదర్శములలో నొక్కటిగఁ బెట్టుకొనిన నేనొకనాఁటి బ్రాహ్మీముహూర్తమున నేకాంతముగ నొక రమణీయ మార్గమునఁ బయనించుచుండ నన్నిరువురు పాంథులు వచ్చి కలిసికొనిరి. వారి సంభాషణమున నిరువురును మహాకవు లైనట్లు నా కవగతమైనది.

'సఖ్యం సాప్తపదీన' మని పెద్ద లనినారు గదా! అనతికాలములో వారికిని నాకును గాఢమైత్రి యొదవినది. అందొకరు పింగళివారు; రెండవవ్యక్తి భట్టుమూర్తి. కుశలప్రశ్నాదికము ముగిసిన పిమ్మటఁ గైమోడ్చి కుతూహలముతో వారిని 'స్వామీ!

తమ కావ్యవనవాటికల మా భ్రమరము లెట్లున్న' వని ప్రశ్నించితిని.


భట్టుమూర్తి కళాదుఁడు. పోగరపనితనము మెఱయు నేమేమో ప్రవచించి గిరికాదేవి యందచందముల వర్ణించి యపుడు :

శా. 88[15]"నానాసూన వితాన వాసనల నానందించు సారంగ మే
    లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కాకం దపంబంది యో
    షానాసాకృతిఁ బూని సర్వసుమన స్సౌరభ్యసంవాసియై
    పూనెం బ్రేక్షణమాలికామధుకరీ పుంజంబు నిర్వంకలన్.”

అని చెప్పినాఁడు. వెంటనే పింగళివా రందుకొని "ఒహో! బాగున్నది. 89[16]శ్రీహర్షులవారి పద్మము తపస్సుచేసి దమయంతీ పాదరూప మైనదని మీ గంధ ఫలి గిరికానాసిక యైనట్లున్న' దని సాభిప్రాయముగఁ బలికినారు.


దృష్టి నాపై నిల్పి పింగళివారు మా కావ్యవనమున మఱియొక వైచిత్రి పొడకట్టినది. 90[17]నిజాన్వయశత్రువుఁ జంపక ప్రసూనంబుఁ గరంబు గెల్చుట మనంబునఁ బెట్టి మా ప్రభావతీదేవి నాసికాపార్శ్వయుగ్మంబున నిత్యసేవకతఁ గ్రాలెడు నీక్షణతారకాఖ్య రోలంబకదంపతుల్ పెనువళావళి నెంతయు సంభ్రమంబునన్' అని సెలవిచ్చినారు.

భట్టుమూర్తి, పింగళివారి సెలవు గైకొని నాపై నొక మందస్మితమును బాఱవైచి ప్రక్కదారినఁ బయనించిరి. పిమ్మట సూరనార్యునితోఁ గలసి నే 'నపూర్వలక్షణలక్షి తమైన' కళాపూర్ణోదయోద్యానమునకు వెడలితిని. అట మధురలాలసను నెచ్చెలి పిండుతో సరససల్లాపములఁ బ్రొద్దుపుచ్చు చుండఁ గని వారి చమత్కృతుల జిత్తమునకు బరిపుష్టిఁ జేకూర్చుకొంటిని. వారికి జలక్రీడకు సమయమైనది. సరసిలోఁ బ్రవేశించినారు. “తత్కారణవీచికాచలితకంజముల న్మధులోలభృంగముల్ వారక సారెకు న్నెగసి వ్రాలుచు నొప్పెఁ దదంబు దేవతల్ నేఱుపుతోడ నాఁడు హరినీలఁపు టచ్చనగండ్ల కైవడిన్.” అంతటితో నే నట నుండుటకు వీలుగా లేదు.

అది యొక విచిత్రవనము. అట మన మల్లెలు మొల్లలు, కుందక కురవకములు, క్రముకపున్నాగములు కనుపింప లేదు. అతి వినూతనముగ నున్నది. 'నవ మి త్యవద్యమ్' ప్రవేశించి పర్యటన మారంభించితిని. మరందలుబ్ధ షట్పదపాళి సేకరించిన యొక మధుకోశముపై నా దృష్టిపడి యట్టె నిరవధికానందమున నిల్చిపోయినది. నన్నుఁ గని యట దూరముగ ధ్యానోపవిష్టుఁడై యున్న యొకజిజ్ఞాసువు91[18]నిమీలిత నేత్రముగలఁ బొడకట్టితినేమో! 'ఎవరది స్వామీ! తదేకదృష్టితోఁ దా మా మధుకోశము

నట్లు పరీక్షించుచున్నా' రని ప్రశ్నించినాఁడు.


“మహాత్మా! నాకు మధుకరము లన్న మహాభిమానము. మనసు గొని బహువనములఁ బర్యటించి వాని జీవిత విశేషముల సేకరించుకొనుచున్నాఁడ”నని వినయపూర్వకముగఁ బల్కితిని. అంత నా మహాత్ముఁడు 'నాయనా! రమ్ము. నేనును నీవలెనే బంభరాభిమానమును జేకొని పరమప్రీతితోఁ బుష్పవనములఁదిరిగి తిరిగి షట్పద జీవితచరిత్ర నాఁకళించుకొన యత్నించితి" నని యాదరాభిమానములతో నన్నాహ్వానించినాఁడు. భక్తి తాత్పర్యములతో నే నా యనుభవజ్ఞుని వేడుకొని నంత నతఁడు భ్రమరజీవితచరిత్ర నిట్లు సంగ్రహస్వరూపమున నిరూపించినాఁడు.

"ప్రతిమధుకోశము నొక భ్రమరమహాసామ్రాజ్యము, ఇవి మాతృస్వామిక రాజ్యములు. దీనిని బాలించునది మహారాజ్ఞి. అన్యభ్రమరము లామె కొల్వున్న వేళల 'జయ! మధు కోశోద్ధత్రీ! జయ! ఉన్మదమధుగణహంత్రీ!! జయ! అళిలోక సృష్టి' యని నిత్యకైవారము లొనర్చుచుందురు. పురుషజాతి పుష్పంధయముల కీ రాజ్యమునఁ బ్రాభవము శూన్యము, నిత్యము నవి సుషుప్త్యవస్థ ననుభవించుచుండును. రాజ్ఞి, గర్భవతి యగుట తప్ప వానివలన భ్రమర రాజ్యమునకుఁ గలుగు ప్రయోజన మెద్దియును లేదు. మిగిలినవారందఱుఁ జక్రవర్తినీ పరివారము. వారు స్త్రీలు కారు, పురుషులును కారు...

"భ్రమర రాజ్యమును బాలించు రాజ్ఞి మరణింపఁ దక్షణమే మధుకోశము నుండి యువరాజ్ఞి యొకతె మంగళ మధురఝుంకారముతో బయల్వెడలును.

'అసూర్యం పశ్య' యు 'ననాఘ్రాత పుష్పము' నగు నా నూతన రాజ్ఞ యౌవన సౌందర్యములఁ గనినంతనే యింతకు మున్ను నిద్రాళువులై యున్న పోఁతుటీఁగల ముఖములం దపూర్వోజ్జ్వల వికాసవిలాసములు గోచరించును. రాజ్ఞి మేఘమండల యాత్ర నారంభింప నవియన్నియుఁ దమలోఁ దాము తుముల యుద్ధము లొనర్చుచు నామెను వెంబడించును. ఈ కలహము లందుఁ జిక్కు కొనుచున్న భ్రమరయువకులు బాహుపరిధిలోనికి వచ్చినట్లే వచ్చి రాజ్ఞి తప్పించుకొని పోవుచుండును. రాజ్ఞి యొనర్చుకొను నీ వరపరీక్షయందుఁ దుదకొక భ్రమర యువకుఁడే బ్రతికి బయటఁబడగలడు.

“అతఁడు రాజ్ఞతోఁ గొంతకాలము మేఘమండలమున విహరించిన పిమ్మట రాణి గర్భమును ధరించును. తుద కంబుద మండలమునుండి రాజ్ఞి పతి మృతశరీరముతోఁ దిరిగి వచ్చును. మఱల నామెఁ ప్రజల యందుబాటులోనికి

వచ్చినపుడు వారును బరివారమును బొందు నానందమునకు మేర లేదు.


“మున్ముందామెకు ముకుపుటమ్ములఁ బుష్పాసవ మొఁసగి సేదఁదీర్చెదరు. భర్త కళేబరమును శరీరము నుండి తొలగించి యామెచే మంగళస్నానముఁ జేయింతురు. అటు పిమ్మట రాజ్ఞి వారందఱతోఁ “బునఃసృష్టి నారంభించి మఱియొక మధుకోశ రాష్ట్రమును నేఁ బరిపాలింతు" నని ప్రకటించును. మఱుక్షణము నుండి పరివారము నిమేషమైనఁ గాలహరణ మొనర్పక వనములెల్లఁ దిరిగివచ్చి మధూచ్ఛిష్టముతో నొక కోశమును నిర్మింతురు. రాజ్ఞి యందుఁ దన కక్ష్యను జేరియండముల నిడుచుఁ జంచరీకసృష్టికిఁ బూనుకొని నాల్గుశరత్తులు జీవించి పాలించును.”

భ్రమర జీవిత మీ రీతిగ నా జిజ్ఞాసువు విన్పింపఁ జెవియొగ్గి వింటిని. కాని నా బుద్ధి యీ కథనము నందలి సత్యాసత్యములఁ గూర్చి యోజింపలేదు. నా మానసమున ననంత భావబంభరములు తిరిగియాడ నారంభించినవి.

అవి : 'పూలకడుపునఁ దేనియఁబోసె నెవఁడొ దానిఁ తీయు నేర్పు తుమ్మెదలకు లభిం. ఇందుకుఁ గారణము పుష్ప కోమలులకు భ్రమర యువకులపైఁ గల ప్రణయమేనా? భ్రమర కులప్రణయము లోకమున 'షట్పదప్రణయ' మని పరిహాసపాత్ర మగుచున్నది. 'నెమ్మదికి రావె యీ తుమ్మెదకు నో వూవ! అమ్ముకోఁబోకె నీ నెమ్మనము నో పూవ!' యని వనపురంధ్రీమణు లెంతగఁ జెప్పినను బాటింపక :

చ. 92[19]"ఇది యొక కన్నెపూవు హృదయేశ! మధూదయవేళ నేరికి
     న్ముదము దలిర్పఁగా మనసు మ్రుచ్చిల నీయఁగ లేదు మున్ను నీ
     కొదమతనమ్ముపై ననుఁగు కూరిమిపై నభిమాన ముంచి కో
     విదమధులిట్ప్రభూ! యనుభవింపుము దీని రసప్రలోభివై.”

యని ప్రతికుసుమకన్యయును మందాక్రాంత మధురిమ లొలికింప పాప మా మధుకరకుమారు లే మొనర్పఁగలరు? వారికి దక్షిణ నాయకత్వమును తప్పదేమో యనిపించును. ఈ రహస్య మెఱుఁగని లోక మా దోషమును షట్పద కుమారులపై మోపినది.

భ్రమరయువకులు పరార్థతత్పరులు.

ఉ. 93[20]"హ్రస్వతరమ్ము జీవము రహసృష దీర్ఘతరమ్ము నైన యీ
     నశ్వరమైన జీవితమునన్ క్షణమొక్క యుగమ్ము కాఁగ స
     ప్తస్వర మాతృకాయిత భవన్మృదుగాన సుధాప్రవాహ స
     ర్వస్వము నారగించు ప్రబలత్వర నుంటిని నీకునై ప్రియా!”

యని యాక్రోశించు ప్రసవములఁ గాదను టెట్లు పొసఁగును?


ఈ పరార్థత వలననే గదా భ్రమరయువకుఁడు కృష్ణభగవానుని దూతగ నేఁగి వల్లవీసంఫుల్లాబ్జనేత్రల వలన నపూర్వావమానము నొందినది! ఇందులకు సాక్షి మఱియొకరు మఱియొకరు కాదు మన మహాభక్తకవి పోతనామాత్యుఁడు!

మ. 94[21]“భ్రమరా దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
     ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్రాణేశ దామప్రసూ
     నమరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁ గా
     క మము న్నేపుచుఁ బౌరకాంతల శుభాగారంబున న్నిత్యమున్.”

ఇవి కదా వారన్న మాటలు! పాదముల నంటి దౌత్యమును నెఱపిన నెఱజాణతనము స్నేహార్ద్రత భ్రమరుని కడఁగాక యే దూతయం దున్నవి?

నలుఁ డేమొనర్చినాడు? దమయంతికడకుఁ ద్రిదశేశుల దూతగ నేఁగి 'యెన్ని చెప్పిన నామె యన్నింటి కన్ని చెప్పి' కన్నీరు పెట్టునంతకు 'దివిజోపకారసంస్తం భితవిప్రలంబ వేదనాభరుండై' సంభాషించుట మెచ్చుకొనఁ దగినదే! కాని యా విదర్భ రాజపుత్రి ‘యప్రతివిధానంబైన ప్రియావాప్తి విఘాతంబున... వేడియశ్రుల నిగుడంగ వెక్కి వెక్కి యేడ్వఁ (ధీరోదాత్తుఁడైన తాను) దన్నును, దన వచ్చిన కార్యంబును దన్నుఁ బుత్తెంచిన వేల్పులను మఱచి యవస్థావశంబున నుచితానుచిత వివేకంబులు దప్ప భావనానిరూఢంబులైన ప్రియావికల్పంబులు వికల్పించుచు:

కం. 95[22]"ఏమిటి కేడ్చెద వానన
     తామరసం బెత్తి చూడు తరుణీ! నన్నున్
     గోమలకటాక్షవీక్షా
     దామకముల వీరసేనతనయుని నలునిన్.”

అని బయటఁబడిపోవచ్చునా? ఎంత విస్పష్టముగఁ బలికినాఁడు! మఱియొక నలుఁ డెవ్వరైన నుండవచ్చు నేమో! 'వీరసేన తనయుఁ' డఁట! కేవలము 'గోత్రస్థాలిత్యము'తో నూరకొనిన నదియుఁ గొంత మేలై యుండెడిది.

     "కాంత యశ్రుబిందుచ్యుతి కైతవమునఁ
      దివిరి బిందుచ్యుతక కేళిఁ దవిలె దీవు;
      సారెసారెకు నాదు సంసారమును స
      సారముగఁ జేయుచు మసారతారనయన!”



అని యతఁడు పల్కిన పల్కు నూహింప నెన్ని విశేషములు ద్యోతకము లగుచున్నవి! 'ఉన్మాదులు సంఘటింపగ సమర్థులె యెందును రాయబారముల్' అని తుద కతఁడెంత విలపించిన బ్రయోజన మేమున్నది?

దౌత్యమునకే కాదు, మైత్రికిని మధుకరకుమారునిది పెట్టిన పేరు. మిత్రులను దన పారిపార్శ్వకులలోఁ జేర్చుకొని తాను రిక్కల మధ్య వెలుఁగు రేవెలుఁగు వలె సంచరించుట యతని యభిమతము కాదు. అతని హితులు గ్రహములు గాని యుషగ్రహములు కారు. 'భయయోగమున నైనఁ' దనతో మైత్రియొనర్చు వారిఁ దనంత వారిఁ జేయుట యతనికిఁ బరిపాటి. దీనిఁ గమనించియే కదా విజ్ఞులు 'భ్రమరకీటన్యాయ' మును లోక విఖ్యాత మొనర్చినది!.

భ్రమర ముదాత్తప్రకృతి; ఉన్నతసృష్టి. కాకున్న శంకరపూజ్యపాదులు 96[23]కవుల సందర్భ స్తబక మకరందైక రసిక కర్ణయుగళమును విడువక నవరసాస్వాద తరళ కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభములఁ జూచి భవదళికనయన మసూయాసంసర్గముచే నించుక యెఱ్ఱవారిన' దని యా సౌందర్యలహరిని వర్ణించునా! "ఓ భగవతీ! దీనుల కనిశ మాశాసుసదృశశ్రీదాత్రియును, నమందవికిరన్మందార స్తబకసుభగమును నగు నీ చరణమందుఁ గరచరణములచే నేను షట్పదము నగుదును గాక!!' యని తానంబికాపాద మకరందలోలుప భ్రమరము గానాకాంక్షించునా!

మేఘమండలమున యాన మొనర్చు 'భ్రమరకుల రాజ్ఞి'ని గనినవేళ నెన్నెన్ని మనోజ్ఞ భావము లుత్పన్నము లగుచున్నవి? 97[24]శాంకరీ! పల్కు మీ ఝంకార మేమిటో, మంత్రమా? గీతమా? మఱి మాయయా? లీలయో, నాట్యమో లేక భ్రామరీ తెల్పు మీ భ్రమర విభ్రమ మేమొ! సాధకుని యాత్మలో జ్ఞానదీపము వోలెఁ గనుపించి మాయమై కనుపింతునే! తెలియలేమే మేము! ప్రణయమో, ప్రభవమో, లాస్యమో, తాండవమొ మముఁ దేల్చవే తల్లి!” ఈ రీతిఁ బొడము నూహ లనంతములు కదా!

సృష్టిస్వరూపుఁ డైన పరమాత్మ పరముగఁ 'బ్రళయావసానమునఁ బ్రహ్మాండ మవియఁగాఁ బ్రభవించు నాత్మభవుఁ డీ రీతిన్. చీఁకటుల సృష్టించి లోకముల శ్రీమించు నాత్మభవుఁ డీరీతిన్' మొదలైన యూహ లెన్నెన్నియో సాధకునకుఁ దోఁచును. భ్రమరశిల్పమున జగత్స్రష్ట యింతటి భావగోపన మెందుల కొనర్చినాఁ డను ప్రశ్న యుదయింప నించుక తర్కింప సమస్త సృష్టియు నరసికుల కైనది కాదని యభివ్యక్త మగును. 'రసోవై సః', 'నేహ నానాస్తి కించన్'.

  1. శివతపోభంగ సమయము - ఇటనుండి 42వ పుట 1వ పంక్తి వరకు మహాకవి కాళిదాసు కుమారసంభవమునందలి 3 సర్గలోని శ్లోకములు విరివిగ గ్రహించితిని
  2. అట పాదపములు - మేఘసందే. సర్గ 2, శ్లో 3
  3. 76. గగనస్రవంతిలో ప్రభా. ప్రద్యుమ్నము అ. 2
  4. 77. శ్రీహర్షచక్రవర్తి - నాగానందాది నాటకకర్త - ఇట నున్న భావమునకు మూలము ప్రియదర్శికలోని “సంజాతసాంద్ర మకరందరసాం క్రమేణ పాతుం గతశ్చ కళికాం కమలస్య భృంగః దగ్ధా నిపత్య సహసైన హిమేన చైషా వామే విధౌ నహి ఫలం త్యభివాంచితాని ॥"
  5. 78. బిల్హణభట్టు (క్రీ.శ. శతాబ్ది) కర్ణ సుందరీ, విక్రమాంక దేవచరిత్రాది గ్రంథకర్త
  6. 79. వనపాలక మత్త - నిర్వ. ఉత్త. రామా. ఆ. 8, ప. 25
  7. 80. తుమ్మెదపిండు - పూర్వోదాహృతము ఆ. 8, ప. 52
  8. 81. చైత్రారూఢిం - ప్రబంధ పరమేశ్వరుని హరివంశము ఉత్తరభాగం ఆ. 7 ప. 68
  9. 82. తరుణి ననన్యకాంత - మనుచరిత్ర ఆ. 3
  10. 83. “నాకుగాదులు” - శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి - కృష్ణపక్షము
  11. 84. ఒక భృంగంబు పారిజా ఆ. 2, ప. 33
  12. 85. ఎలదేఁటుల్ పారిజా ఆ. 4. ప. 14
  13. 86.ప్రతివర్ష వసంతోదయ - పారిజా ఆ 1 ప 130
  14. 87. వేవిన మేడపై - ఆముక్త. ఆ. 1, ప. 62
  15. 88.నానాసూన వితాన - వసు. ఆ. 2, ప. 47
  16. 89.శ్రీహర్షుని నైషధమున పద్మము తపమొనర్చి దమయంతీపాదరూపము నొందినది. ఈ భావమునే గ్రహించి భట్టుమూర్తి యీ రచన కావించి యుండునని విజ్ఞుల యూహ
  17. 90. నిజాన్వయ శత్రువు ప్రభావతి ఆ. 2, ప. 70 తత్కారణవీచికా కళాపూర్ణోదయము ఆ. 6
  18. 91. జిజ్ఞాసువు - మారిస్ మేటర్ లింక్, భ్రమరజీవితమును గూర్చి ప్రత్యేక గ్రంథరచన మొనర్చినాడు
  19. 92. ఇది యొక కన్నెపూవు - మదీయము
  20. 93. హ్రస్వతరమ్ము - శ్రీ పాటిబండ మాధవశర్మ "మధువ్రత” నుండి
  21. 94. భ్రమరా దుర్జనమిత్ర - పోతనకృత భాగవతము - దశమస్కంధము - పూర్వ
    భాగము
  22. 95. (పుట 69) ఏమిటి కేడ్చెద - నైషధము ఆ. 4, ప. 89
        కాంతయు బిందుచ్యుతి - పూర్వోదాహృతము ఆ. 4, ప. 90
  23. 96. “కవుల సందర్భ - ఓ భగవతీ" - ఆచార్య శంకరుని సౌందర్యలహరిలోని క్రింది శ్లోకములు మూలములు :

    "కవీనాం సందర్భస్తబక మకరందైకరసికః
    కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం |
    అమునంతా దృష్ట్వా తవనవరసాస్వాద తరళే
    అసూయా సంసర్గా దలికనయనం కించి దరుణమ్ ||"
    "దదానే దీనేభ్యఃశ్రియ మనిశ మాశా సుసదృశీ
    మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి !
    తవాన్ని న్మందారస్తబక సుభగే యాతు చరణే
    నిమజ్జన్మజీవః కరసుచరణైష్షట్చరణతామ్ ॥

  24. 97. "శాంకరీపల్కుమీ, ప్రళయావసానమున" - శ్రీ నోరి నరసింహశాస్త్రి "తేనెతెట్టె" నుండి