వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/నిద్రావైచిత్రి

నిద్రావైచిత్రి



అది యాముక్తమాల్యద పాఠము. నాకు వెళ్ళి నిదుర వచ్చుచున్నది. సర్వావయవము లనెడి సంకెలలనుండి జారుచు నే నెటకుఁ బోవుచున్నాఁడనో నాకె యెఱుక లేకుండెను. 98[1]శ్రీకుప్పయాచార్యులవారు పాఠమునాపి కుదురైన గొంతుకతో 'నిద్రాదేవత నిన్నుఁ బూనెఁ గదరా నిర్భాగ్యదామోదరా!' అను పద్యపాదమును ఘనజటవైచి చదువుచుండ మిత్రుడు నన్నుఁ దట్టి మేల్కొల్పినాఁడు. మఱియొక సహాధ్యాయి నేఁ దెప్పరిలి స్వస్థితికి వచ్చునంతలో నాచార్యులవారిని "ఆర్యా! నిద్రకును నొక దేవత యున్నదా?” యని వినయముతోఁ బ్రశ్నించినాఁడు. ఆ దొడ్డపండితుఁడు "ఔను. జ్యేష్ఠాదేవి అలక్ష్మి... జగదేక మాతకు జ్యేష్ఠభగిని" యని సమాధానము చెప్పినారు. నిదుర మబ్బులు నన్నుఁ బూర్తిగ విడిపోయినవి.

సహపాఠి మఱల నాచార్యులవారిని జ్యేష్ఠాదేవి రూపాదికమును గూర్చి ప్రశ్నింప వారు 'అలక్ష్మీం స్వం కురూపాసి కుత్సిత స్థానవాసినీ... అలక్ష్మీం కృష్ణవర్ణాం, ద్విభుజాం కృష్ణ వస్త్రవరిధానం లౌహాభరణ భూషితాం శర్కరా చందన చర్చితాం గృహసమ్మార్జనీహస్తాం, గర్దభారూఢాం, కలహ ప్రియాం' అని యేమేమో పఠించుచు నాపై దృష్టి నిల్పుచు మందస్మిత మొనర్చినారు.

"ఏమీ దామోదరా! తామీలోకమునకుఁ దిరిగి వచ్చినట్లేనా?” అను వారి ప్రశ్న కవనత శిరస్కుఁడనుగాక ప్రౌఢముగ బ్రతిస్మిత మొనర్చి 'ఇట దామోదర శబ్దాచిత్య మేమియో సెలవిం’ డని వారిని వేడుకొంటిని. వారొక చిరునవ్వుతో నా చిలిపితనమును గమనించి ‘ఉదరే దామ యస్యేతి దామోదరః' యశోద మృద్భక్షణ మొనర్చిన బాలకృష్ణుని నడుమున బలుపుతోఁ గట్టినది కనుక దామోదరుఁడైనాఁడు. మన్నుఁ దీనినట్లు నిద్రనోవు మిమ్ము నిద్రాదేవత పాశబద్ధులఁ గావించుటచే మీరును దామోదరులే!” అని సెలవిచ్చినారు. ఆ నాఁడు భారతీయులు నిద్రకు నొక దేవతను సృష్టించుకొని నారని నాకుఁ దెలిసినది.

ప్రాచీన కాలమున బాబిలోనియను జాతివారు నిద్రపట్టకున్న 'లోహర్' అను

నిద్రాదేవతను బూజింతు రనియు, నేఁటి 99[2]ఫిన్నిష్' జాతివారికి 'ఉని' యను నిద్రా


దేవత 'ఉంటామో' యను స్వప్నదేవతలుండియున్నారని మఱికొంత కాలమునకుఁ జదివి నేర్చుకొంటిని. నిజము! సమస్తశక్తులును దేవతలు కదా! నిద్ర యొక శక్తి! ఒక దేవత!!

నిద్ర సృష్టియందొక విచిత్రమైన సృష్టి. 'అది దుప్పటి వంటిది. దానిఁగప్పుకొన నవసరము లేని వ్యక్తి యెవఁడు? నిద్రయన్నాతురున కాహారము, తృష్ణాతురునకు దాహము, శీతోష్ణబాధితుల కది యుష్ణము, శీతము; మిత్రరహితులకు మిత్రము, నిలయవిహీనులకు నీడము, మనోబాధితులకు మహనీయాంజనము. ఇన్ని సుగుణములు గల్గియు నిది మృత్యువును బోలి యుండుట యొక్కటియే యిందలి దోష' మని యొక జిజ్ఞాసు వభిప్రాయ మిచ్చినాఁడు.

చంపుట తప్ప మృత్యువొనర్చు సర్వకృత్యములఁ గావించుటకు నిద్ర సమర్థమైనది. మృత్యువుతో నిద్ర కున్న సహజ బాంధవ్యమును గుర్తించిన యొక భావుకుఁడు 'నిద్ర యొక జాతి మృత్యువు; నిరయము దాని జన్మభూమి; అయ్యు నరకము దీనిని దఱిమి వేసినది స్వర్గము చేరనీయలేదు' అని పలికినాఁడు. దీనిని బట్టి నిద్రకు నివాసభూమి 'త్రిశంకు స్వర్గ' మన్నమాట!

నిద్రామృత్యువుల కొక ధర్మసామ్యమున్నది. ఇవి రెండు నావహించి నపు డాత్మకు స్వాతంత్య్రము లభించును. రెంటియందును శరీరి విముక్తుఁడగును. ఈ కారణముననే పెద్దలు నిద్రామృత్యువులఁ గూర్చిన నిండు విజ్ఞానము కలవాఁడు పరమ వివేకియని పలికినారు.

‘మన జన్మమే యొక నిద్ర; ఒక విస్మృతి' జన్మయను నిద్రలో నాత్మ నిజదేశమును వదలి సుదూరము వచ్చుచున్నాఁ'డని యాంగ్ల తాత్విక మహాకవి వర్డ్సువర్తు ప్రవచించినాఁడు. ఇట్లు వచ్చిన ప్రాణి విజ్ఞానియును గాఁడు; అజ్ఞానియును గాఁడు. సర్వకాలములందతనికిఁ తన నిజస్వరూపమును గుర్తించుటకుఁ దగు నవకాశము లున్నవి. అన నతనికిఁ బ్రత్యభిజ్ఞావకాశమున్న దన్నమాట!

'నిద్ర తంద్ర భయము క్రోధ మాలస్యము దీర్ఘసూత్రతల వలన లక్ష్మి సంప్రాప్తింప' దని యార్యోక్తి. దీనినిబట్టి దురదృష్ట హేతువులలో నిద్ర యొకటగు చున్నది. అంత మాత్రమున నిద్ర దరిద్ర హేతువని నిర్ణయింప వీలుకాదు; పనికిరాదని పరిహరింపఁ బొసఁగదు. నిద్ర ప్రాణాధారమనియు నది లేకున్న నారోగ్య వినాశన

మగుననియు 100[3]నార్యక్షేమేశ్వరుని యభిప్రాయము. "నిద్ర మనోమాలిన్యమును క్షాళన



మొనర్చును; అవయవములు కౌజ్వల్యము సేకూర్చును, శరీర దోషములను రూపుమాపును. ధాతువులను సుస్థితిలో నిల్పును. యోగ గమ్యమైన యానందమును బ్రసాదించును” అని యీ విద్వద్వరేణ్యుని సూక్తి.

నిద్రాశబ్దార్థమే యీ యర్థమును నిరూపించుచున్నది. 'నియతం ద్రాన్తి ఇంద్రియా ణ్యత్రేతినిద్రా' ఇంద్రియములు నియతముగ దీనియం దంతరితములై యుండుటచే నిద్ర నిద్రయైనది. దీని కొక రీతిగఁ బర్యాయపదము లైన స్వప్న సంవేశనములకును నర్థమిదియే.

శ్రీనాథ మహాకవి 101[4] కంటికి నిద్ర వచ్చునె.... జిహ్వకు న్వంటక మిచ్చగించునే... శాత్రవుఁడొకఁడు తనంతటి వాఁడు కల్గినన్" అని స్వర్ణ నగౌద్ధత్యమును సహింపఁజాలని వింధ్య పర్వతముచేఁ బలికించినాఁడు. ఈర్ష్య నిద్రాభంగకారణము. అంతియ కాదు. 101బి [5]'అలుక యెత్తిన వానికి, నర్థచింతకునకు, నాతురునకుఁ గామ గోచరాత్మకునకును వచ్చునే? ఎన్నఁబడి జనులెఱింగిన యిన్నాలుఁగు తెఱఁగులందు నెయ్యది. యైన న్గను మొగుడ నీదటె నా కిన్నియుఁ గలుగంగ నిద్ర యేటికి వచ్చున్' అని కవిబ్రహ్మ తిక్కన సోమయాజి సౌప్తికవధోద్యోగ పూర్వరంగమున వికలమానసుఁడైయున్న యశ్వత్థామచేఁ బలికించినాఁడు. - నిద్రాభావమున కివి కొన్ని కారణములు. కోపి పగ సాధించుకోర్కెతో నిద్రం జెందఁడు. శత్రు నిరాసక్రియా మార్గాన్వేషణమున మనసు లగ్నమై యుండుట వలనను నిద్ర కలుగక పోవచ్చును. అర్థచింతకుని యాలోచనాతత్పరత నిద్రాశూన్యునిఁ గావించుచున్నది. ఆతురునకుఁ గామగోచరునకు శరీర స్వ్యావస్థా భేదాదులవలన నిద్రరాదు.

నిద్ర కలుగక పోవుటకుఁగల కారణములు స్వాస్థ్య, శారీరక, మానసికము లని త్రివిధములుగ వైద్యశాస్త్రజ్ఞులు నిర్ణయించినారు. శరీరమునందు 'బ్రొమైన్' అను పదార్థము తక్కువగుటవలన నిద్రకు భంగము కలుగుననియు నది ప్రత్యేకముగ నొక వ్యాధి కాదనియు, నొక వ్యాధికి బాహ్యచిహ్నమనియు జోన్ డక్ వంటి విజ్ఞుల యభిప్రాయము. 'నిద్ర మన కెందులకుఁ గల్గుట లేదను నాలోచనతో నిద్రాసమయమును బోఁగొట్టుకొని పిమ్మట రేయెల్లయు జాగరణ మొనర్చువారు నేఁటి ప్రపంచమునఁ బెక్కు రున్నా రని యిటీవల నొక శాస్త్రజ్ఞుఁడు పత్రికాముఖమునఁ

బ్రకటించినాఁడు.


దీర్ఘ నిద్రఁగలవానిఁ జూచి కుంభకర్ణుఁ డను బిరుదమును బ్రసాదించుట పరిపాటి. కుంభకర్ణుఁడు లంక కంపించు నంతటి కోలాహల మొనర్చినఁ గాని మేల్కొనెడివాఁడు కాఁడఁట! పురాణ స్త్రీ లోకమున నూర్మిళాదేవి నిద్రలో నుత్తమశ్రేణి గడించుకొనినది. పౌరాణిక వ్యక్తుల మాట దూరముగ నుంచి చారిత్రక కాలమునకు వత్తము. సుప్రసిద్ధుఁడగు గ్రీకు చరిత్రకారుఁడు 102[6]హెరడోటస్ తా నారుమాసములు నిద్ర మేల్కొని యారుమాసములు నిదురించు జాతులఁ జూచినట్లు రచనలలోఁ బేర్కొనినాఁడు. ఇది సత్యమో! మఱి యసత్యమో!!

కొలఁది కాలము క్రిందట 'అన్నా స్వాన్ పోవెల్' అను అమెరికా దేశస్థురాలు భర్త మరణవార్త వినిన వెను వెంటనే నిద్రావస్థ నొంది, ముప్పది యొక్క సంవత్సరములు గడచిన తఱువాత మేల్కొనినట్లు వార్తాపత్రికలఁ బ్రకటితమైనది. ఇది యభూతకల్పన మనుటకు వీలులేదు. ఇట్టి విచిత్రములు సకృత్తుగనైనఁ గొన్ని బ్రపంచమున జరుగుచునేయున్నవి.

జంతుకోటికి దీర్ఘనిద్ర యొక విశేషగుణము. వానికది సహజావబోధము. ‘ఆకులపాటు’ ప్రారంభము కాఁగా నాస్ట్రేలియాలోని ఒప్పోజం, డింగో, యాంటీటరు వంటి జంతువులు, కొన్ని సర్పజాతులు, క్రిమికీటకములు దీర్ఘనిద్రకు సిద్ధపడుచుండును. ప్రతి సంవత్సరము నిది తప్పదు. ఎవరో ప్రబోధించి నట్లాపని కాయా ప్రాణికోటులు పూనుకొనును. ఈ దీర్ఘనిద్ర యందొక వైచిత్రి యున్నది. ప్రాణుల యవయవములన్నియు నొకమారుగ నిద్రావస్థ నొందవు. ఒక క్రమము ననుసరించి యొక్కొక్క యవయవమే నిద్ర నొందును. కొన్ని యవయవములు నిద్రించుచున్నప్పుడు మేల్కొనిన నన్యావయవములు మత్తుపదార్థమును జేకూర్చుకొనుచుఁ గొంతకాలము బహుభారముతో జీవయాత్ర సాగించుచుఁ గన్పించును. ఈ స్థితిలో వాని శరీరోష్ణత యర్థమగును.

దీర్ఘ నిద్ర నొందుచున్న దివాంధమును నీట ముంచినను, జుంచును జావ మోదినను మేల్కొనవఁట! 'మొంబా' జాతి సర్పము జాగ్రదావస్థలో నతి భయంకరమైనది. 'లాన్సుకోలమ్' అను శాస్త్రజ్ఞుఁ డది దీర్ఘనిద్రయం దున్నప్పుడు మేల్కొల్ప "నన్ను నిద్రింప" నిమ్మని బతిమాలుకొనినట్లుగఁ బ్రవర్తించినదఁట! ఎలుఁగుబంట్లు కొన్ని ప్రదేశములం దిట్టి దీర్ఘనిద్రావస్థలోనే ప్రసవించి మేల్కొనిన పిమ్మట రెండు మూఁడు నెలల వయస్సుగల బిడ్డలతో నాడుకొనును. ఈజిప్టుదేశమునందలి నత్త లైదారేండ్లు

నిదురించు చుండునఁట! అందముగనున్న యొక నత్తగుల్లను దెచ్చి బ్రిటిష్ వస్తు



ప్రదర్శనాలయమునఁ బ్రదర్శింప నయిదు సంవత్సరములు గడచిన పిమ్మట నందలి నత్త మేల్కొని నడువసాగి యధికారులు నాశ్చర్యచకితుల నొనర్చిన ట్లా మ్యూజియము చరిత్ర వలనఁ దెలియుచున్నది.

ఈ రీతిగఁ గ్రిమికీటకములు జంతువులు నిద్రవోవుటకుఁ గారణ మాయా కాలముల వాని కాహారములైయుండు క్రిమికీటకములు నిద్రించుటయే. శీతకాలపు బాధను దొలగించుకొనుటకుఁ దనసంతానమగు వీనికిఁ దల్లియగు ప్రకృతి దీర్ఘనిద్రను బ్రసాదించినది. ఆకాశ వీథుల నెగసి యుష్ణమును బడయఁగల పక్షులు, తేనియను సేకరించుకొని రెక్కలాడించుచుఁ బట్టునకు 'వెట్టతనము గల్పింపఁగల తేనెటీఁగలు నిట్టి దీర్ఘనిద్ర నొందవు.

మానవ జీవితచరిత్రయందు నిద్రకు సంబంధించిన విచిత్రాంశములు కొన్ని కన్పించుచున్నవి. జగజ్జేత అలెగ్జాండరు పర్షియా చక్రవర్తి డెరయస్ మీఁదఁ బ్రచండయుద్ధమును బ్రకటించునాఁడు సుదీర్ఘమగు నిద్ర నొందినాఁడఁట! ఒకానొక యత్యవసరమైన రాచకార్యమునకై యతనిని మేల్కొల్ప సేనా నాయకుఁడగు 'పర్నీనియస్' ఎంతయో యత్నించి విఫలమైనట్లు గ్రీసు దేశచరిత్రల వలన వ్యక్తమగుచున్నది.

ఆత్మహత్యఁ జేసికొన నిశ్చయించుకొనిననాఁడు 103[7]కేటో చక్రవర్తికి దీర్ఘనిద్ర పట్టినదట

సెక్టస్ పాపేను జయింప వలసిన సమయము. సముద్ర యుద్ధ మతి తీవ్రతరముగ సాగుచున్నది. తాను నాయకత్వము వహింపవలయును. లేకున్న సమస్తమును దారుమారై తీవ్రతమ ప్రమాదము సంభవించును. అట్టిస్థితిలో 104[8]‘అగస్టస్ సీజరు' మృత్యువుతోఁ దుల్యమైన నిద్ర నొందినాఁడు. ధైర్యమొనర్చి తానే సర్వసేనాధిపత్యమును స్వీకరించి, శత్రువుల హతమార్చి విజయముతోఁ దిరిగి వచ్చిన మహాసేనాని ‘ఎగ్రిపా’, బహుకాలము విజయవార్తను దెల్పుటకై యీ సీజరు మేల్కొను నంతవఱకు వేఁచియుండవలసి వచ్చినది.

దీర్ఘ నిద్రయం దుండియే కొందఱితరులు జాగ్రదవస్థలోఁ జేయఁగల కార్యకలాపములను నిర్వర్తింపఁ గలరు. జేన్ రైడర్ - అను పదునైదేండ్ల కన్యక నిద్రావస్థలో నెన్నియో గ్రంథములఁ జదివినది. ఆమెకు జాగ్రదవస్థయందును నందలి

విశేషము లన్నియు జ్ఞప్తియుండుట విశేషము. ఆమె నిదురింప నారంభింప నదే

పనిగ నిద్రించునఁట! ఆమెను బరిశీలింప బంధువులు ముసాచ్యుసెట్సులోని ఓల్డెన్ వైద్య శాస్త్రజ్ఞున కొప్పజెప్పిరి. అతఁడు బహువిధ పరిశోధనలు జరిపి 'యిదమిత్థ మని నిర్ణయింప లేకున్నాను. నా మతి చెడుచున్న' దని నివేదించినాఁడు. అమెరికా దేశమునందలి యొక సుప్రసిద్ధ రచయిత నిద్రాసమయముననే నిజరచనల 'టైపు’ జేసెడివాఁడు. జాగ్రదవస్థనొందిన పిమ్మట నవి తన రచనలేనా యను ననుమానమతనికిఁ గలుగుచుండెడి దఁట! 'ఇట్టి దీర్ఘ నిద్రావస్థలందుఁ దాను బూర్వము భావించిన రూపకము లందలి పాత్రలు కన్పించి సంభాషణమును సాగింపఁ దన రచనలు సాగుచున్నవని చెప్పు కవి యున్నాఁడని' స్వాన్సు విశ్వవిద్యాలయ తత్త్వశాస్త్రో పాధ్యాయుఁడు 'హీత్' ఒక విశిష్టోపన్యాసమునఁ బేర్కొనినాఁడు. నిదురించుచుఁ గొన్ని గృహకృత్యములొనర్చుట ప్రపంచమునందన్ని దేశములందును సర్వసామాన్యమైన నిద్రావైచిత్య్రము!

నిద్రాసమయ పరిమితిని గూర్చి లోకమున భిన్నాభిప్రాయములున్నవి. నెపోలియను చక్రవర్తి 'పురుషుల కారు గంటలు, స్త్రీల కేడుగంటలు, బుద్ధిహీనుల కెనిమిదిగంటలు నిద్ర చాలు' నని పల్కినటులఁ దెలియుచున్నది. కాని యా చక్రవర్తి 105[9]వాటర్లూ యుద్ధానంతరము హెలీనాద్వీపమున దినమునకుఁ తొమ్మిది గంటలు దీర్ఘనిద్ర ననుభవించినట్లు జీవిత చరిత్ర చెప్పుచున్నది.106[10]బిస్మార్కు, హంబోల్టు, చర్చిలు వంటి ప్రసిద్ధ రాజకీయ వేత్తలు నాల్గుగంటల కంటే నిద్రవోనివారు కన్పించుచున్నారు. 'నలుబది యెనిమిది గంటలు తీక్ష్ణమైన కృషి యొనర్చిన పిమ్మట నెనిమిది గంటల నిద్ర చాలు' నని శాస్త్రజ్ఞుఁడు ఎడిసన్ మహాశయుఁ డభిప్రాయపడినాఁడు.

'ప్రాణికోటికి నిద్ర యత్యవసరము కా' దని నిరూపింపఁగల ననెడు స్థిరనిశ్చయముతో హార్వర్డు పరిశోధనాలయమునఁ బ్రవేశించిన యొక యువకుఁడు రెండు వందల ముప్పది యొక్క గంటలు మేల్కొనిన తరువాత నిఁక దానిని గొనసాగింప లేక బాధపడి యట్టె విరమించినాడు. మిగిలిన జీవితమున నతఁ డున్మత్తుఁడైనాఁడు.

నిద్రాకాలనిర్ణయము దేశకాలవయోనుకూలము లని నిశ్చయింప వచ్చును. పసిపిల్లలకుఁ బదియు నారు గంటలు నిద్ర యత్యవసరము. మహాకవి కాళిదాసు 'పద్మినీజాతి స్త్రీ జాము కాలము కంటే మించి నిద్రింప' దని పలికియున్నాఁడు. అల్పకాలనిద్ర నారోగ్య శాస్త్రవేత్త లంగీకరింపరు. నిద్రాసమయము నెనిమిది గంటలనుండి యారుగంటలకుఁ దగ్గించుకొనుటచే 'కలొరిక్' శక్తిని బాతికపాళ్ళు

విస్తారముగ నుపయోగింపవలసి యుండునని వారి నిర్ణయము. నిద్ర నీ రీతిఁ


దగ్గించుకొనుట వలనఁ జర్మవ్యాధులు, శరీర దౌర్బల్యము, మనోమాంద్యము కలుగునని వారందురు.

పరిశోధింపఁ దగిన యంశములలో నిద్ర నతి ప్రముఖమైన దానినిగ శాస్త్రజ్ఞులు పరిగణించినారు. వారు కడుశ్రద్ధతోఁ బరిశోధనలు సాగించుచున్నారు. నిద్రను గూర్చిన యే యొక యంశమునైన 'నిది నిర్ణయ' మని చెప్ప వీలుకల్గక పోవుటచేఁ జమత్కారగర్భితముగ నొక శాస్త్రజ్ఞుఁడు "నిద్రనుగూర్చిన మా పరిశోధనల సారాంశము రాత్రి శయనించుట, యుదయము మేల్కొనుట" యని యభిప్రాయ మిచ్చినాఁడు.

107[11]నెబ్రాస్కా విశ్వవిద్యాలయమునందలి వైద్యకళాశాలలో, జహార్ అను నాచార్యుఁడు నిద్రను గూర్చి దీర్ఘ పరిశోధన లొనర్చి కొన్ని విశేషాంశములఁ బ్రకటించి యున్నాఁడు. ఆధునిక ప్రపంచమున నిద్ర పట్టనివారు విశేషముగ నున్నారు. వారు రెండు తెగలవారు. శాంతియుతమైన నిద్ర కావలయునని కోరుకొనుచు నిద్రాసమయమును దప్పించుకొని పిమ్మట బాధపడువారు మొదటి తెగవారు. వ్యాధిగ్రస్తులు రెండవ తెగవారు. వయసు మరలినవారికి నిద్రపట్టక పోవుటకుఁ గారణము చిన్నతనమున వారిని తల్లిదండ్రులు బలవంతముగ నిద్రపుచ్చుటయే యని యొక యభిప్రాయము. నిద్ర కొఱకను నుద్దేశముతో మనస్సును గాని, శరీరమును గాని శిక్షింపయత్నించుట మంచిది కాదు.

"జంతువులు త్వరితముగ మృతినొందుటకుఁ గ్రమమైన నిద్ర లేకుండుటయే గారణము. కళాశాల విద్యార్థులు ముప్పది యెనిమిది మారులు, మధ్యమ వయస్సు గలవా రేబది మూఁడు మాఱులు నిద్రలోఁ గదిలెదరు" - ఇవి జహార్ అను శాస్త్రజ్ఞుని పరిశోధనమువలనఁ దేలిన కొన్ని యంశములు.

"శయ్యమీఁదఁ జేరి సున్నితముగ సుఖనిద్ర నొందుటకంటె నదృష్టవంతులకు వేడొక శుభలక్షణము లే' దాని యొక తాత్వికుఁడనినాఁడు. అలసిపోయిన యవయవములు కష్టపడుట కిచ్చగింప నపుడు క్రమముగా విశ్రాంతినొందు యత్న మారంభించును. తొలుదొల్త ఘ్రాణశక్తి, తరువాత రసన, పిమ్మట క్రమముగ స్పర్శజ్ఞానము, శబ్దగ్రహణశక్తి తప్పిన పిమ్మట మనస్సు వ్యవహరించుట మానివైచును. జోషువా రోసెట్ అను విజ్ఞాని "నిద్రారంభదశలో నిత్య జీవితము నందలి కొన్ని విశేషాంశములు జ్ఞప్తికి వచ్చుట, పిమ్మటఁ గొన్ని మధురములైన కోర్కెలు జన్మించుట, యటుతరువాత సుఖాభిలాషలు కలుగుట, భ్రమలు కొన్ని పుట్టి తదుపరి నిదురమంపు, స్వప్నావస్థ యేర్పడు' నని నిరూపించినాఁడు.


అందఱకును నిద్ర కలుగు కాలము సమము కాదంట! కళాశాల విద్యార్థులకిరువది యెనిమిది నిమిషములు, నడివయసున నున్నవారి కిరువదియైదు నిమిషములు కాలము కావలయు నఁట! స్త్రీలకుఁ బదునైదు నిమిషముల కాలము చాలునఁట!

నిద్రలోఁ గదలి నంత మాత్రమునఁ గలఁత నిదుర కాఁజాలదు. పసిబిడ్డ వలె నిద్ర నోవుట పరమప్రయోజనకారి. 'మొద్దువలె నిద్రించినవాఁ డెద్దు వలెఁ బనియొనర్చు' నను సామెత యున్నది.

ఏకాదశి సంపూర్ణ జాగరము వ్రతవిధానములందును శాసింపఁ బడినది. దశమి యేకభుక్తము; ద్వాదశి పూర్ణ భోజనము. 'దివానిద్ర యోగభంజక' మని 108[12]యోగకుండ ల్యుపనిషత్తు పలుకుచున్నది. పూర్వరాత్రి నిద్ర సౌందర్యసంవర్ధక మని పాశ్చాత్యులలో నొక ప్రథ యున్నది.

పూర్వము టర్కీ దేశములలోని అంకారా విశ్వవిద్యాలయ విద్యార్థిలోకము పగటి నిద్దురను గూర్చి కొన్ని పరిశోధనలు సాగించినది. వారి పరిశోధనల ఫలితాంశములు రాత్రి నిద్ర మానవునకుఁ బనికిరాదనియు, దీర్ఘ నిద్ర నిష్ప్రయోజనకరమైనదనియును, ప్రతి వ్యక్తియును బగ లొకమాఱు మూఁడు గంటలు మఱల నొకమాఱు రెండుగంటలు నిద్రించుట కలవాటు పడిన, మిగిలిన కాలమంతయు శ్రమ యనుకొనకుండఁ బనిఁ జేయవచ్చునని సిద్ధాంతీకరించినారు. వారి పరిశోధనలవలన రాత్రి పదియును రెండు గంటలు నిదురించు వారి మించి పైరీతిగ నిదురింప నలవాటు పడినవారు పని చేయవచ్చుననియు, వారలకే విశేష విశ్రాంతి చేకూరునట్లును వెల్లడియైనది. పరీక్షాఫలితములందును పగటి నిద్ర నొందువారే ప్రథమగణ్యు లైనారట. వీరి పరిశోధనలయందలి సత్యాసత్యము లెట్లున్నను వీరి మార్గము వైద్యశాస్త్రమునకు, సామాన్య ప్రకృతికి విరుద్ధమగుటచే నీ విద్యార్థులకు 'ఉలూక' ములను నామము కొంతకాలము ప్రపంచమున విశేషప్రాచుర్యము వహించినది.

“నిద్ర సుఖ మెఱుఁగదు, ఆఁకలి రుచి నెఱుఁగదు" ఈ సామెత యాంధ్రభూమి నతి ప్రసిద్ధ మైనది. అయినను సుఖనిద్రకును సుందరమగు శయ్యకును సన్నిహితమగు సంబంధమున్నది. శయ్యప్రాముఖ్యమును గుర్తించిన నెపోలియను చక్రవర్తి 'జగత్తు నందలి సమస్త సింహాసనము లిచ్చినఁ బ్రతిగ నా శయ్యను విడువలే' నని పలికినాఁడు. మానవుఁడు శయ్యయందు బెరుగుచున్నాఁడు శయ్యయందు మరణించు చున్నాఁడు. దేశకాల పాత్రముల ననుసరించి శయ్యావిభేదము లెట్లు మార్పునొందినను శయ్య తప్పదు. అర్జునుని గౌరవానురాగములఁ జూఱఁగొనిన భీష్ములవారి కుత్క్రాంతి వేళ నుజ్జ్వలమగు నంపశయ్య పర్యంకమైనది. మఱియొక మహారాజునకుఁ బట్టజశయ్య శయనీయమై యెప్పియుండును. జగత్కారణుఁడు వటపత్రశాయి శేష తల్పశాయి. ప్రాచీన భారతీయ చక్రవర్తులలో సౌవర్ణ పట్టజ కీటజాండజశయ్యల నిర్మించుకొని యనుభవించినటులఁ దెలియుచున్నది. శయనసంవేశనము ప్రాచీన శృంగార చతుష్షష్టిలో నొకటైనను 'నాగరకవృత్తము' వలన నభివ్యక్త మగుచున్నది. మాగధ, వైతాళిక, సౌఖశాయనికాది భృత్యుల వనలఁ గల పరమ ప్రయోజనము నర్థ శాస్త్రాభిజ్ఞు లెఱిఁగి యుండుటచే, రాజ ప్రాసాదములందు వారి యావశ్యకతను నిరూపించి యున్నారు.

నిద్రకును గొన్నినియమములున్నవి. 'భుక్త్వాశతపదం గచ్ఛేత్, నామపార్శ్వేన సంవిశేత్' అని 109[13]సుశ్రుతము. దక్షిణపుఁ దలాపి యొకధర్మము. నిద్రారంభవేళ నది మృత్యుతుల్య మగుటచే అగస్త్య కపిలాస్తీకాది పుణ్యపురుష స్మరణము, ప్రహ్లాద నారద పరాశర పుండరీకాది చిరంజీవుల పరిగణనము లావశ్యకములని యార్యుల నమ్మకము. ఆంజనేయ దండకమును బఠించుచుఁ గాక నిదురింప నిచ్చగింపని ప్రాచీన మర్యాదను బాటించు నాంధ్రులు నేఁటికిని గన్పించు చున్నారు. పాశ్చాత్య దేశములందు నిట్టి యాచారము లేకపోలేదు. థామస్ బ్రౌన్ "భగవత్రార్థనము లేక నేనెన్నఁడును నిదురింప”నని పలికినాఁడు. వామనస్తుతి పరత్వమున నిదురలేఁచుట యే నాఁటి యాచారమో యేమో! 'ఇంతింతై వటుఁడింతయై మఱియుఁదా నింతై' తుదకుఁ ద్రిజగముల నిండిన త్రివిక్రముఁడు వామనుఁడు, ఆయనను స్తుతించుటవలన నా రీతి వృద్ధినొందు కోర్కె యీ స్తోత్ర పాఠకులందును ద్యోతకమగుచున్నది.

పొడగరితనమునకు, నిద్రకును సన్నిహిత సంబంధ మున్నదని శాస్త్రజ్ఞు లంగీకరించినారు. ఆర్థరు రేనాల్డు అనునొక పరిశోధకాగ్రేసరుఁడు “నూరు దినములు నిద్రపోకుండునట్లుగ నిల్పుటచే విద్యార్థుల రయంగుళము తగ్గిపోవుట తటస్థించిన” దని చెప్పినాఁడు. నీల్ జహార్ అను శాస్త్రజ్ఞుఁడు "నిద్రాసమయమున మస్తిష్కము తగ్గుటయును, శరీరము వృద్ధి నొందుటయు జరుగు" నని తన పరిశోధన ఫలితమును వెల్లడించినాఁడు.

కళాకారులను నిద్రాసౌందర్య మాకర్షించినది. సాహిత్యోపాసకులు తమ కావ్యముల "స్వప్న సుందరులఁ" జిత్రించినారు. 110[14]అవంతి సుందరి యందగ్రగణ్య. విఖ్యాతరచయితల యమూల్యకల్పనా విన్యాసములకు నిద్రావస్థ యుపోద్బలక మైనది.

పురాణ కవులకుఁ గృతిపతులైన దేవతా మూర్తులు నిద్రాసమయములందుఁ గన్పించి


కృతివర్ణించినారు. ఇందుల కాంధ్ర సాహిత్య ప్రపంచమున హరిహరనాథుఁ డక్కవిబ్రహ్మ తిక్కన సోమయాజికి దర్శనభాగ్య మొసఁగుట ప్రబల తార్కాణము. 'జోల లాలి' ఇత్యాది నిద్రా సాహిత్యము ప్రతి దేశమున నొక సాహిత్య శాఖయై విలసిల్లుటఁ గన నిద్రకు నిత్య జీవితమున నెట్టి ప్రాముఖ్యమున్నదియు వెల్లడియగుచున్నది. ఈ ప్రాముఖ్యమును గుర్తించియే యొక మాఱు వర్డ్సువర్తు మహాకవి నిద్రాదేవి కటాక్షము తొలఁగినపుడొక కావ్యమిట్లు చెప్పినాఁడు.

111[15]"ఒకదాని వెనుక నొకటి ప్రశాంతముగ గమించునవిగణమును, ఝంకార మొనర్చు తుమ్మెదలను, గ్రిందికిఁ దుముకు వాహినులను, మందమందవాయువు లను, సముద్రమును, మృదులమగు సస్య క్షేత్రములను, నీరపటలములను, స్వచ్ఛమగు నాకాశము నొకదాని వెనుక నొకదానినిఁ గ్రమముగ నూహించితిని. అయినను నిద్రావిహీనుఁడనై నిలువవలసి వచ్చినది. నా పుష్పోద్యానవన తరువులపై నిల్చి కూయు పులుఁగుల కలధ్వనులు కోకిలా కరుణార్ద్రగీతములను వినవలసివచ్చినది. ఈ రీతిగ నిన్నటి దినమును మఱియు రెండు దినములు గడిచినవి. కాని నేను నీపై నే మార్గమున నైన విజయము నొందజాలక పోయినాఁడను. దేవీ! ఈ రాత్రియు నన్నిట్లె వాడిపోనీయకుము. నీవు లేని యుదయకాల సౌభాగ్య మేమున్నది? దినమునకును దినమునకును మధ్య దివ్యమగు నో యంతరమా! నూతన భావములకు నానందకరముగ నారోగ్యమునకుఁ దల్లివగు నో ప్రియమాతా!! రమ్ము!"

వైతాళికుల సాహిత్య మంతయు నొకచోఁ జేర్చిన యందుఁ గొన్ని విశేషములు లుండకపోవు. భారతగాయకలోకము ప్రాభాతిక రమణీయ రాగఫణితుల, నందు ముఖ్యముగ దేశాక్షి భూపాల మలయమారుతాది రాగములు, నిష్టదైవతముల నీ నాఁడును మేల్కొల్పుట యాచారముగనే యున్నది.

ప్రపంచ శిల్పులు యోగనిద్రాముద్రితులైన మూర్తుల శిల్పించినారు. 112[16]ధ్యానీబుద్ధ' 'ప్రజ్ఞాపారమిత' ప్రతిమాశిల్పము లిందు జగద్విఖ్యాత కృతులు. పాశ్చాత్య ప్రపంచమున లీచ్ ఫీల్డు కెథడ్రలులోని నిద్రాదంపతుల శిల్పఫలకము నిద్రాశిల్పమునకు నిస్తులమైన నిదర్శనము.

నిద్ర తాత్త్వికుల దృష్టి నాకర్షించింది. భారతీయ ద్రష్టలు దీనిని స్వప్నయోని, స్వప్నజన్మభూమిగ దర్శించినారు, నిద్రాసమయమున ప్రత్యగాత్మ బుద్ధ్యంతఃకరణతో నుండునఁట! 'ఓ జననీ! నిద్రా! నీవు మా యొద్దనుండి తొలగిపొమ్ము. అశ్వినీదేవతలు

నిన్నతి జాగరూకతతోఁ బరిశీలించుచున్నారు. వారి కంటఁ బడక నీవెట్లు


రాఁగలిగితివి?' మొదలగు నర్థములు గల సూక్తము లథర్వ వేదమున నకాలమునందు విచ్చేసిన నిద్రాదేవి నుద్దేశించి కన్పించుచున్నవి. ఆ శ్రుతి యందే నిద్ర దేవపత్నుల గర్భాండమనియును, గలలు దేవతలనియును చెప్పఁ బడియున్నది.

నిద్రాతత్త్వమును గూర్చి ప్రవచింపవలసినదని గార్గ్య సౌరాయణి, మహర్షి పిప్పలాదు నీ భరతభువియం దెన్ని సహస్ర వర్షములకుఁ బూర్వమో యిట్లర్థించినాఁడు.

"భగవంతుఁడా! పురుషుని యందు నిద్రవోవునవి యెయ్యవి? మేల్కొనున నెయ్యవి? ఇందు స్వప్నావస్థను బొందు దేవత (ఇంద్రియము) యెవ్వఁడు? నిద్రా సుఖమెవ్వరిది? దేనిపై నియ్యవి సంప్రతిష్ఠితములైయున్నవి?”

ఈ ప్రశ్న పరంపరకుఁ బిప్పలాద మహర్షి యొసఁగిన సమాధానమునందు భారతీయ నిద్రావిజ్ఞానము నిరూపితమై యున్నది.

113[17]"సంధ్యాసమయ సూర్యుని కిరణము లే రీతి యతని తేజోమండలమును జేరుకొనుచున్నవో యటులనే సర్వేంద్రియములును నిద్రాసమయమున మనస్సుతో నేకీభవించుచున్నవి. అందువలన నింద్రియ వ్యాపారముండదు. ఈ కారణముననే పురుషుఁడు నిద్రించుచున్నాఁడని చెప్పెదరు. ఆ మనస్సు తేజసాభిభూతమైనపుడు సుఖానుభూతి నొందును.”

“యయేష సుప్తేషు జాగ్రత కామమ్ కామమ్ పురుషో నిర్మిమానః దదేవ శుక్రమ్ దద్బ్రహ్మ” ఈ కఠోపనిషద్వాక్యము వలన 'నిద్రితుని యందు మేల్కొనునది బ్రహ్మ' యని భారతీయ తాత్త్వికుల నిశ్చయమైనట్లు వ్యక్తమగుచున్నది.

సృష్టికి నిద్ర యత్యవసరము. జగత్కారణుఁడగు విష్ణువు నిద్రాముద్రితుఁడై శరదారంభమున మేల్కొని పునఃసృష్టి నారంభించును. ఆ మహామహుని జాగ్రదవస్థారంభ వేళాసౌందర్యముఁగనిన మహాకవి యాంధ్ర నిద్రాసాహిత్యమున నిరుపమాన రత్నమగు నీ పద్యములో దానినిట్లు వర్ణించినాఁడు.

సీ. 114[18]"అభినవో న్మేషచిహ్నంబైన తొలిచూపు
          కౌస్తుభాలోక రేఖలకు నలగఁ
    సాంగభంగంబైన యావులింతకు వేల్పు
          లంగుళీస్ఫోటంబు నాచరింప
    సౌఖశాయనికులై సంవర్తభృగ్వాది
          మునులు హస్తాంభోజములు మొగుడ్ప


    ధృతచేతనంబులై దివ్యాయుధంబులు
             జయ జయ ధ్వనులతో సంస్తుతింపఁ

తే. గలువ రేకులు వోని పెంజిలువరేని
   యరఁటి కుబుసంబు పొరలు మై నంటియుండ
   నిదుర మేల్కాంచి కూర్చుండు నుదధి నడుమ
   విష్ణుఁ డఖిలేశ్వరుఁడు శరద్వేళయందు.”

నిదురమేల్కొను వేళ నీరాజన మెత్తుట భారతదేశమున రాజప్రాసాదముల
యందలి బ్రాచీనాచారము. తాననుభవించిన యీ యాచారము స్మృతికి వచ్చిన
115[19]శ్రీరాయల కిట్టి దర్శనము కల్గినది.

ఆ.వె. "సాంధ్యరాగలహరి సామి రంజితములై
       తిరిగి మింట నిదురఁ దెలసి నట్లె
       యిందిరాధిపతికి నెత్తు కర్పూర నీ
       రాజనంబు లన శరద్ధనములు.”

  1. 98.శ్రీ కుప్పయాచార్యులవారు - పూర్వము ఆంధ్ర క్రైస్తవ కళాశాలా సంస్కృతాంధ్ర భాషా పండితులు,
  2. 99. ఫిన్నిష్ జాతి - యూరప్ నందలి ఫిన్లాండు దేశవాసులు
  3. 100. ఆర్యక్షేమేశ్వరుఁడు (క్రీ.శ. 10వ శతాబ్ది ప్రాంతము) నిద్ర మనోమాలిన్యము -

    "చిత్తం ప్రసాదయతీ లాఘవ మాదధాతి
    ప్రత్యంగ ముజ్జ్వలయతి ప్రతిభావిశేషమ్ |
    దోషా నుదస్యతి కరోతి చ ధాతుసామ్యం
    ఆనంమర్పయతీ యోగవిశేష గమ్యం ॥

  4. 101. కంటికి నిద్ర - కాశీఖండము ఆ. 1, ప. 108
  5. 101A. అలుక యెత్తినవానికి - భారతము సౌప్తికపర్వము ఆ.1
  6. 102. హెరడోటస్ (క్రీ.పూ. 484 - 424) గ్రీకు చరిత్రకారుఁడు. ఆసియా మైనరులోని కపడోసియాలో జన్మము. గ్రీకులకును పారశీకులకును జరిగిన యుద్ధమును తొమ్మిది సంపుటముల చరిత్రగ అయోనిక్ మాండలిక భాషయందు వ్రాసినాఁడు. ఇతని చరిత్ర ప్రాచీన చరిత్రకొక యుత్తమ సాధనము
  7. 103. కేటో - (క్రీ.పూ. 183 ప్రాంతము) రోమను రాజనీతిజ్ఞుఁడు, సేనానాయకుఁడు, రచయిత, వ్యవసాయముపై 'డిరెరెస్టికా' యను గ్రంథమును వ్రాసినవాఁడు.
  8. 104. అగస్టస్ సీజరు రోమక సామ్రాజ్య చక్రవర్తి. ఎగ్రిపా - క్రీ.పూ. 63 - జూలియస్ సీజరు వధానంతరము వచ్చిన యుద్ధములఁ బైకివచ్చిన సేనాని
  9. 105. వాటర్లూ యుద్ధము - (వాటర్లూ బ్రూసెల్సుకు 11 మైళ్ళదూరమున నున్న నగరము) బ్రిటిష్వారికి ఫ్రెంచివారికి 18 జూన్ 1815న యుద్ధము ప్రారంభమైనది. తుదకు నెపోలియన్ లొంగిపోవుటతో 15 జులై 1815లో నంత మొందినది. నెపోలియన్ హెలీనాద్వీపమున ఖైదీయైనాఁడు. నెపోలియన్ - (క్రీ.శ. 1769 - 1821) ఫ్రెంచి చక్రవర్తి. సామాన్య సేనాధికారి పదవినుండి చక్రవర్తియైనాఁడు. The greatest adventurer in the world.
  10. 106. బిస్మార్కు - క్రీ.శ. 1879లో నైరోపాయందు మహత్తర వ్యక్తి. బెర్లిన్ కాంగ్రెస్ అధ్యక్షుడు 'Man of Blood and Iron' రెమిని జెన్సెస్ - ఇతని యుత్తమరచన. హంబోర్డు (క్రీ.శ. 1769-1855) యువకుఁడుగ దేశయాత్రలు చేసి తుదకు ఖనన శాస్త్రప్రవీణుఁడై బహుదేశముల నా శాస్త్రమునకు వృద్ధి కల్పించినవాఁడు. తన యాత్రల చరిత్ర ముప్పది యుద్ధంథములుగ రచించినాడు. చర్చిలు (క్రీ.శ. 30 నవంబరు 1874) క్రీ.శ. 1900లో బ్రిటిష్ పార్లమెంటున బ్రవేశించి నేఁటివరకు నవిచ్ఛిన్నముగ సభ్యుఁడైన యాంగ్ల రాజకీయవేత్త, నేఁటి యాంగ్లేయ ప్రధానమంత్రి
  11. 107. నెబ్రాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రములలో నొకటి. లింకన్ దీని ముఖ్య నగరము
  12. 108. యోగకుండల్యుపనిషత్తు - కృష్ణయజుర్వేదీయము లైన ముప్పది రెండు ఉపనిషత్తులలో నిది యొకటి
  13. 109. సుశ్రుతము - సుశ్రుతాచార్య రచితమైన వైద్యశాస్త్రము
  14. 110. అవంతి సుందరి - దండి దశ కుమారచరిత్రమున నొకపాత్ర
  15. 111. ఒక దాని వెనుక నొకటి - ఆంగ్లమహాకవి వర్డు వర్తు (క్రీ.శ. 1770-1850) సుప్రసిద్ధ ప్రకృతికవి. క్రీ.శ. 1806లో నిద్రను గూర్చి మూఁడు కావ్యములఁ జెప్పినాఁడు. ఇది యందొక దాని కనువాదము
  16. 112.ధ్యానీబుద్ధ - జ్ఞానము నుపదేశించు బుద్ధమూర్తికి బేరు ప్రజ్ఞాపారమిత జగత్ప్రసిద్ధి నొంది నేఁడు జావాయందున్న యొకానొక బుద్ధమూర్తి
  17. 113.సంధ్యా సమయ సూర్యు "యాథాగార్గ్య - మరీచయో౽ర్క న్యాస్తం - ఇత్యాది” ప్రశ్నోపనిషద్వాక్యములు మూలము
  18. 114. అభినవోన్మేష చిహ్నంబైన - కాశీఖండము ఆ. 3, ప. 22
  19. 115. రాయలు క్రీ.శ. 1509-30ల మధ్య విజయనగర సమ్రాట్టు, ఆముక్తమాల్యద
    కర్త. సాంధ్యరాగలహరి - ఆముక్తమా. ఆ. 4, ప. 139.