వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/మలయానిలుడు


మలయానిలుఁడు


సీ. [1]లలనాజనాపాంగవలనావసదనంగ
           తులనాభికాభంగదోఃప్రసంగ
    మలయానిలవిలోలదళసాసవరసాల
           ఫలసాదరశుకాలపనవిశాల
    మలినీగరుదనీకమలినీకృతధునీ క
           మలినీసుఖిత కోకకులవధూ క
    మతికాంతసలతాంతలతికాంతరనితాంత
           రతికాంతరణతాంతసుతనుకాంత

తే. మకృతకామోదకురవకావికలవకుల
    ముకులసకలవనాంతప్రమోదచలిత
    కలితకలకంఠకుల కంఠకాకలీవి
    భాసురము వొల్చు మధుమాసవాసరములు”

ఋతుచక్రభ్రమణమునఁ గిమ్మిరితకాంతులతో ననుగమించుచున్న చైత్రమాస
వాసరముల నొకమహాకవి యాంధ్రప్రబంధవనీవీథులకు సంగీత కళారహస్యనిధియై
యాహ్వానించినాఁడు. విచ్చేసి యయ్యవి మనోహారులై తమ సమ్మోహన శక్తితో
సమస్తచరాచరప్రకృతిని బులకింపఁ జేయుచు స్తుతిపాత్రము లగుచున్నవి.

'కాలః కరోతు కార్యాణి' యను ప్రాచీనార్యోక్తిపైఁ బరమాదరము గలవాఁడు.

సీ. [2]కించిదుషఃపూర్వకించిదతఃపర
            ప్రాలేయబిందుసంపాతవశత
    మధ్యాహ్నవేళాక్రమప్రాప్తతీక్ష్ణతా
            కలితాతపోగ్రసంక్రాంతివశత
    సాయంసమాగతస్వచ్ఛచంద్రాతప
            కుల్యాప్రసారణాకూతవశత

    మధురనిశార్ధభాగధునీవిధాప్రియా
        హేలామనోజసాహిత్యవశత

తే. శిశిరహేమంతశుచిశరత్సేవ్యమానుఁ
    డై మహారాజవైభవోద్దామమూర్తి
    కూడి ఋతురాట్సభానలకూబరుండు
    మాధవుఁడు వచ్చె సుమసుకుమారమూర్తి.”

చిలుకలతేరు నెక్కి జైత్రయాత్రకు బయల్వెడలు వేళ సేనాసమేతముగ వనవీథులఁ బయనింప [3]'ప్రత్యగ్రసాలాగ్రహర్మ్య విటంకంబులు ప్రాఁకి వల్లివనజాస్యల్ సల్లిరుత్ఫుల్ల పల్లవహస్తంబుల భావిభావుక ఫలోల్లాసంబుతోఁ గొవ్విరుల్.'

ఉత్కంఠాపనోదితకలకంఠకంఠములతో వనలక్ష్మి 'నందనవనసుందరి నీ న్నందగాని రానిచ్చెనె?' యని సాకూతముగఁ బ్రశ్నించినది. ఆమె 'శోభా నవతరుణిమ నాశుష్క జీవతరువుల కిఁక, ఋతునేతా! వసంతా!!" యను ప్రమోదోన్మత్తమధుర గానమున మంజులముగ్ధనృత్య మొనర్చి యతని కాతిథ్య మిచ్చినది.

'మన సఖుఁడు, గురుఁడు దైవ' మీ మాధవస్వామియని మనసారనమ్మి మనోవాక్కాయకర్మల నాజ్ఞానువర్తియై మెలఁగు మలయమారుతుఁడు వసంతుని అభ్యుదయపరంపరాభివృద్ధి నర్థించుచు నానందాబ్ధి నోలాడుచు బహురూపముల ధరించి పొంపిళ్లు వోవుచున్నాడు. ఇతఁడు వనప్రియ కడకు వసంతాగమన వార్తఁ గొనిపోయి నపుడామె ముఖసమీరముతో గౌరవపురస్సరముగ నెదురురా 'నిలువెల్లఁ బొంగిపోయి యొడలెల్లఁ గాళ్లుగ వడిబారు నదియై' సకలచారీకరణాంగ హారచతురనృత్య మొనర్చినాఁడు. ఇది గమనించిన మన ప్రబంధపరమేశ్వరుఁడు :

చ. [4]ఇదె చనుదెంచెఁ జైత్రమని యెల్లవనంబులకుం బ్రమోదముల్
    బొదలఁగ మేలివార్తఁ గొని బోరన వచ్చిన దాడికాఁ డనన్
    మృదువనదేవతాముఖసమీర మెదుర్కొన నుల్లసిల్లె నిం
    పొదవఁగ దక్షిణానిల మనూనమనోహరఖేలనంబునన్.”

అని వర్ణించినాఁడు.

వసంతుఁ డతని యనుంగునెచ్చెలి యగుట నతఁడు వచ్చునపు డెదురేఁగి

సుగంధసేకరణ మిచ్చి మిత్రునికెత్తని కీర్తిధ్వజమై మలయానిలుఁ డొప్పినాఁడు.



పుష్టివర్ధనమైన యీ నెత్తావిసంపుటి యొకనాఁటిదా! ఒక చోటిదా!! దీని సంపాదించువేళ:

సీ. "కేళీసరోవీథి నాళీక వా టీషు
            ధూళీఝరీరాజి తేలి తేలి
    చోళీమహాభోగచూళీనవప్రసూ
            నాళీ సుగంధంబు లాని యాని
     లోలీభవత్పుష్పధూళీచరద్భృంగ
           పాళీనిరోధాప్తిఁ దాళి తాళి
     తాళీవనీనారి కేళీరసాలకం
           కేళీహితచ్ఛాయఁ గెరలి కెరలి

తే.గీ. మెలఁగు నామని మణిధరావలయనిలయ
     కనకనందనచందనాకలితలలిత
     వలితలవలీనికుంజాబ్జవదనమదన
     కదనఘర్మాప(హుం డయ్యె) గంధవహుఁడు.”

వసంతప్రాదుర్భావమున మలయానిలుఁడు సమస్త ప్రపంచమునఁ దానెయై ప్రవర్తించి యాకర్షించినాఁడు. [5]ఒనర హిమావకుంఠనము లూడ్చి తెమల్చిన పత్రభంగముల్ సన నసియాడుచు న్మొగుడి చెక్కుల పల్లవపాణిఁ గప్పు నూతనలతి కాలతాంగుల నుదారగతి న్జలివాపినాఁడు. వారికి నెయ్యంపుఁ బెనఁకువ నేర్పినాఁడు. నితాంతనూతనలతాంగా శ్లేషముల్ నిశ్చలలీల న్మధుపాంగనా సమితి కలరఁజేసినాఁడు. సంధించు తామ్రాక్షియౌ కలకంఠిని నేర్పు మెఱయఁ బలికించినాఁడు. లోక మతని భుజంగగ్రామధామైక సంకలనాభ్యాస విలాసపాటవునిగఁ గీర్తించినది. కొమ్మల డాసి పండుటాకుల మిషతో నిచోళావకుంఠనముఁ దొలగించు చిలిపితనమును గూర్చి లోకము పరిపరి విధములఁ జెప్పుకొనినది.

ఈ గంధవహుఁ డెవ్వఁడు? ఏ కడవాఁడు? ఈతని రాకకుఁ గారణ మెయ్యది? భావుకుల నీ ప్రశ్నలు కలఁతపెట్టినవి, అతని వంశాభిజాత్యములు గుర్తించినవా రతఁడు పుట్టుపూర్వోత్తరములు, మట్టుమర్యాదలు లేనివాఁడు కాఁడని నిర్ణయించి యతని

చరిత్రనిట్లు సంక్షేపముగఁ బ్రవచించినారు.



సీ. [6]“దక్షిణాశావధూతనయుఁ డై వనలక్ష్మి
           పెంపునఁ బొదరిండ్ల బెరిగి పెరిగి,
     తేఁటిజోటుల జోలపాటలఁ బాటిల్లి
           తీఁగయుయ్యాలలఁ దూఁగి తూఁగి
     కమలాకరంబులఁ గమ్మ పూఁదేనెల
           నానుచుఁ జల్ల పోరాడి యాడి
     కమలధూళీపాళికాకేళికలఁ బొల్చి
           మందమందవిహార మొంది యొంది

తే. యాగమస్థితి యెఱిఁగి బాల్యంబుతఱిని
    మల్లుల బెనంగి పాంథుల మర్మ మెఱిఁగి
    సాముఁ జేయుచు మాధవస్వామి యాజ్ఞ
    కంతుజోడై మెలంగు లేగాడ్పుకుఱ్ఱ.”

ఇందువలన మలయానిలుఁ డుదాత్తమైన జన్మకలవాఁడగుటయే కాక యుత్తమసంస్కారముల నొందిన యుదాత్త చరిత్రుఁడని యభివ్యక్తమగుచున్నది.

[7]గండాభోగప్రతిఫలితతాటంకయుగళముచేఁ జతుశ్చక్రమై యొప్పు సౌందర్య లహరీముఖరథమును బూన్చికొని యర్కేందుచక్రమగు నతనిరథమెక్కి ప్రమథపతి వచ్చిన నెవఁ డళుకు బెళుకు లేక ప్రతిఘటించుచున్నాఁడో యట్టి మన్మథుఁడు తన కాప్తమిత్రుఁ డను గర్వము గంధవహునికి లేకపోలేదు.

ఒకనాఁడు మలయానిలుఁడు 'మహిళామండలమంజుల భ్రమరకామర్దుండును, శ్యామాముహుర్ముహురున్మీలితపత్త్ర భేదనిపుణుండును, పద్మినీకంకణ గ్రహణాపాదియు నై సగంధ విటపప్రాప్తితో విజృంభించియుండ' నతని మన భట్టుమూర్తి దర్శించినాఁడు, మఱియొక ప్రబంధకవి విచ్చలవిడిగా నతఁడు విఱ్ఱవీగి సంచరించుచు 'మల్లికాసు మగళన్మకరందహేరాళ ధారాజలంబులఁ దడిసి తడిసి, సరసిజకైరవ సంతానసంక్రాంత వీచికావళుల మీఁద విడిసి విడిసి, ప్రత్యగ్రప్రసవ సంపూరిత చూతమంజరులపై సుడిసి, సుడిసి, తతవియోగశ్రాంత తరుణీ జనస్వాంత జనిత భేదములలో జడిసి జడిసి, బహుళకోరక కుసుమసంభరిత మంజుపట విహరణ ముదిత బంభర వితాన మధుర తరగీతికాసంస్తూయమానుఁ డగుచు' విశ్వవిఖ్యాతి గడించుకొను

మనోహరదృశ్యములఁ గన్నులారఁగని ముదితాంతఃకరణుఁ డైనాఁడు.


వసంతవేళ మ్రాను పట్టుచున్నది; తలిరులు పుట్టుచున్నవి. ఈ విషమస్థితికిఁ గారణము 'రవి గాననిచోఁ గాంచు కవికి' గోచరించినది.

ఉ. “చిలువసుధారసాధరల చెల్వపుఁ బుక్కిటి తావిఁ దీయనై
    వలపులయందుఁ దత్ప్రియుల వక్త్రవిషజ్వలనోష్మ నెఱ్ఱనై
    వెలువడి తద్గుణద్వితయ వేధ సుమీ యన మ్రానుపట్టుటల్
    దలిరులు బుట్టుటల్ కనఁగఁ దార్కొనెఁ జందనశైలవాయువుల్.”

అని యొక కవిశ్రేష్ఠుఁడు తాఁగనిన సత్యమును బ్రకటించి సృష్టి నిర్మోకమును దొలఁగించి యొక రహస్యమును వెల్లడించినాఁడు.

'ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యని కృష్ణభగవానుఁడు గీతలోఁ బ్రవచించినాఁడు. అతఁడేమిహికాఁ జలధుల మునిఁగిపోవు వన భువనము నుద్ధరింప మలయానిలుఁడై యవతరించినాఁడు. లేకున్న మిహికా జలధు లేమగుచున్నట్లను ప్రశ్నకుఁ దగిన సమాధానము రామి, విజ్ఞులిట్లు నిర్ణయించిరి. రాయలవారు ‘భువనవిజయము’న ‘నిండుపేరోలగంబుండి యొకపరి యష్టదిగ్గజముల నీ విషయమై పృచ్ఛయొనర్చిరి. సంతృప్తికరమగు సమాధానము రాకపోవుటచే నారాజకవి శిఖామణి యధ్యక్షపీఠము నుండి తామే యిట్లు ఛిన్న సంశయముగ సెలవిచ్చిరి.

కం. [8]"మలయకటకోటజస్థిత
      కలశీసుతసేవ నిట్లు కనెనొ తదాశా
      నిలుఁ డనఁగ నలసవృత్తిన
      మెలఁగుచు నాపోశనించె మిహికాజలధిన్.”

సకల జనానుమోదకరణదక్షుఁ డగు మలయానిలుని యవతారము లెన్నియైనఁ గలవు. అతఁడు 'చంచరీకంబురీతి వికచారవిందదీర్షికల వినోదించును; పర్జన్యుభాతి కుసుమితనవ లతావిసరంబులఁ గదలించి వలిదేనియలు సోనఁ దలము గొల్పును; ప్రణయవేళల సురటియై రంజిల్లును.

అప్పుడప్పుడు మలయానిలబాలుఁడు 'బొండుమల్లెల పరాగము రేఁచి నిబిడంబు సేసె వెన్నెలరసంబు, తుమ్మెదలకు నోగిరమ్ములౌ నలరుల కమ్మ తేనియ లెల్లఁ గ్రుమ్మరించె, కీరవారంబుల కారివేరంబుగా ఫలజాలముల నేల పాలు సేసె, దొరల నంటిన జాఱు తరుల నంటి పెనంగు నల లతకూనలఁ దొలంగఁద్రోసె, వనిఁ దమ

యిచ్ఛవర్తిలు ఖగములపై, బరాగములు సల్లె.'


వీనిని బాల్యచేష్టలుగఁ బరిగణించుటకు బదులుగఁ బెద్దలు కొందఱు జాడ్యచిహ్నములుగ లెక్కించిరి. వసంతభిషగ్వరుఁడున్నాఁడు కదా యని కొంద ఱూహించిరి. మఱికొందఱు 'మహానుభావులు' -

చ. “తెగిన మనోభవు న్దిరుగఁ దెచ్చి కుజంబుల కెల్లఁ బ్రాయమున్మ
     నుగడ నిచ్చి యన్యభృత మండలి మూఁగతనమ్ము వుచ్చి ము
     జ్జగముల వార్తకెక్కినవ సంతభిషగ్వరుఁ డాప్తుఁ డయ్యునున్
     దగు గతి మాన్పలేఁడ మఱి దక్షిణవాయువునందు జాడ్యమున్?"

అని నిశ్చయించి తీరినారు. ఇవి జాడ్యలక్షణములా? కావు. మారమాధవ కైంకర్యమునకై మలయానిలుఁడొనర్చు నున్మత్త కృత్యములు. వారు ప్రభువులై ప్రవర్తించి ప్రఖ్యాతి నొందఁ గలిగెడిది యాతఁ డిట్టియున్మాదకృత్యము లొనర్చిననాఁడే కదా! 'కారయితుః కర్తృత్వమ్.' ఇందలి దోషము లన్నియు నా మన్మథమాధవులనే!

విరహిణుల దృష్టిలో నితఁడు 'కాలాంతఃపురకామినీకుచ తటీకస్తూరికాసౌరభశ్రీ లుంటాకము; చందనాచలతటీ శ్రీఖండ సంవేష్టిత వ్యాళస్ఫారఫణాకఠోర విషనిశ్వాసాగ్ని పాణింధమము.’ ఇతనియందు శైత్యమున్నదా యనుశంక వొడమి యొక వియోగిని యన్వేషించినది. అంతకాశాసమాయాతత్వము, రౌద్రమూర్తిత్వవార్తలు, దహనసారథ్యతత్పరత, శ్రీఖండవిషధరోచ్ఛిష్టతలు నరసి, విచారించి, భావించి, ‘మలయపవన! నీ యందుఁ జలువగల దనునట్టి సంశయము తగదు. చండాలవాటిలో బ్రాహ్మణగృహముకై వెదకుట భ్రాంతి కదా!' యని యామె నిశ్చయించినది. వియోగాగ్నిని భరింపఁజాలక 'తలఁప జగత్రాణుఁడవై వెలసిన నీవిట్లు నన్ను వేఁచుట తగునే? చింతింప నిల వెలుగు చేను మేసిన నెద్ది కాఁ' పని యామె మలయానిలునితో మొఱపెట్టుకొనినది. అతని నుద్దేశించి :

ఉ. "దక్షిణగంధవాహ! నిను దన్మలయద్రుమరూఢగూఢపా
     దృక్షణనింత కంతయు నపాయము పొందదె పొందకుండఁగా
     నిక్షుశరాసనుండు విరహిశ్వసితోపచయక్రియ న్విము
     క్తక్షయుఁ జేసెఁ గావలయుఁ గాక తదుష్టత నుష్టమెక్కఁగన్.”

అని యుపాలంభించినది.

ఇంత కంటె జాణ యగు నొక విరహిణి మలయానిలుని రాకనే యరికట్ట

నుద్దేశించి, యతని లోకయాత్రకు భంగకరమగు ననియైన నూహింపక


మ.[9] "అది కాదే చెలి! నీవు కేరళమహా హార్యంబుపై నున్న యా
    మదిరోన్మత్త పుళిందనాయకులతో మాటాడి చంపింపవే
    కదనుల్ ద్రొక్కుచు వాని వాహనములై కాల్ద్రువ్వు నేణీమదో
    న్మదసంఘంబులఁ జూత మింక నెటు దు ర్మార్గుండు రానేర్చునో!”

యని యూహించినది. పిమ్మటఁ బర్యాలోచనమున 'నీయవి వెఱ్ఱియూహలు కదే! శబరపల్లవుల న్స్మరకేళిలోలురం జేయుచు నీగంధవహుఁడు చెల్వుఁడై మెలఁగుఁ గదా! అట్టివానికి వారెట్లపకార మొనర్పఁగల' రని దైన్యము వహించినది.

విరహిణీలోక మేమనుకొన్న నేమి? అతని నేమన్న నేమి? వారు సన్మార్గుఁ డనినను దుర్మార్గుఁ డనినను మలయానిలుఁడు మనసునఁ బెట్టుకొనుట లేదు. చైత్రభూమీకళత్రచామర చాలనము వలనను, బటుఘర్మజలకణ పశ్యతోహరవృత్తి వలనను వారికి వలపు మెలపుల బ్రసాదించుచునే యున్నాఁడు.

'కామీ స్వతాం పశ్యతి'. తాము దుష్టులు. మలయానిలుని మంచి యెఱుఁగక విరహు లతనిపై నెన్ని నీలాపనిందలుఁ గల్పించినారు! అతని పరోపకారపరత నణుమాత్రమైన వారంగీకరింప నిచ్చగించుట లేదు.

గంధవహుని ప్రత్యుపకారబుద్ధినిఁ గూర్చి శుభ్రజ్యోత్స్నికలలో నెచ్చెలులఁ గూడి శుక్తిమతీనదీతీరమున 'గూఢమణు' లను దాఁగిలిమూఁతల నాడు గిరిక చెప్పఁగలదు. ఆమె దాఁగు కొనినవేళ శరీరపరిమళమును గ్రహించినవాఁ డగుటచేఁ ప్రతిక్రియగఁ గన్నులఁ గపురంపు దుమారమును జల్లి చెలికత్తియల కన్నులకుఁ గనఁబడకుండున ట్లితఁడు మేలొనర్చినాఁడు. దూతకృత్యమునఁ బ్రథమగణ్యుఁ డనిపించుకొనిన వాయునందనుని లక్షణములు గల మలయానిలు నొకమాఱు దర్శించి భట్టుమూర్తి యతని పరోపకారపారీణతను :


చ. [10]"అనిలకుమారకుండు మరుదధ్వనిరోధి పలాశిమండలీ
     ఘనవనరాశిలోఁ బుడమి కానుపు పద్మిని చిక్కి స్రుక్కఁగా
     నినకరముద్రఁ జూపి వెలయించి తదంబుజ రాగపాళిఁ గై
     కొనుచుఁ బ్రవాళతేజమునఁ గూరిచెఁ గంటె పలాశవీథులన్.”

అని యుగ్గడించినాఁడు. అనాఘ్రాతపుష్పమగు గిరికా శరీర పరిమళముల గ్రహించుట గౌరవసూచకమే కాని యన్యము కాదు. లేకున్న స్త్రైణపరీమళముల ముల్లోకపాంథుఁడై

యతఁ డెన్ని మారు లనుభవింపలేదు! అంతియకా దనేక పర్యాయములతఁడు :


‘అమరాంగనాతుంగ
సంగతోన్నతవక్ష
ఘనసారకాశ్మీర
చర్చాసుగంధముల సొలసి,

             వెఱ్ఱి నైనాను నేను - ఇఁక
             విశ్వచాలన చేయలేను

ఖేచరీముఖసక
ర్పూరతాంబూలాది
వాసనానిఃశ్వాస
పవనచాలనలకున్ భ్రమిసి,

             వెఱ్ఱి నైనాను నేను ఇఁక
             విశ్వచాలన చేయలేను”

అని జగత్ప్రణుఁడై సదాగతి యగుట బాధపడిఁనాడు. కొన్ని సమయముల నెత్తావులు మునిఁగి యున్మత్తనృత్య మొనర్చు నాతనిఁగని పెద్దలు వినయవిధేయత లితనికి లేవని పలుకవచ్చును. ఇది పొరబాటు. అతని యణఁకువను గూర్చియు, వృద్ధగౌరవాభిజ్ఞతను గూర్చియు మన మహాకవి కాళిదాసు నడుగుఁడు, కులపతియగు వసిష్టాశ్రమమున కేఁగుచున్న సుదక్షిణాదిలీపుల మలయానిలుఁడు సేవించిన రీతి నా మహానుభావుఁడు తిలకించి యిట్లు కలకాలము వినఁ బల్కినాడు :

     'సేవ్యమానౌ సుఖస్పర్శైః
      సాలనిర్యాస గంధిభిః
      పుష్పరేణూత్కిరై ర్వాతై
      రాధూత వనరాజిభిః'

(చల్లనైనవియు, సాలతరు రసపరిమళమిళితము లైనవియు, కుసుమరజస్సుల రాల్చునట్టివియు సుఖస్పర్శగలవియు నగు తెమ్మెరలచే సేవింపఁబడువారై వారు తరలిపోయిరి.)

  1. లలనాజనాపాంగ - వసుచరిత్ర ఆ. 1. ప. 121
  2. కించి దుషః పూర్వ - శ్రీ విశ్వనాథ ఋతుసంహారము - పుట 2
  3. ప్రత్యగ్ర సాలాగ్ర - వసు చరి. ఆ. 1, ప. 132
  4. ప్రబంధ పరమేశ్వరుఁడు - ఎఱ్ఱన నృసింహపురాణము ఆ. 2 ప. 60
  5. ఒనర హిమావకుంఠనము - వసుచరి. ఆ. 1, ప. 127
  6. దక్షిణాశావధూ - ప్రాచీన కవిప్రోక్తము
  7. గండాభోగ ప్రతిఫలిత - ఆచార్య శంకరుని సౌందర్య లహరిలోని యీ శ్లోకము మూలము:

    “స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం
    చతుశ్చక్రం మన్యే తవముఖ మిదం మన్మథరథమ్ |
    యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
    మహావీరోమారః ప్రమథపతయే సజ్జితవతే ॥”

  8. మలయ కటకో - ఆముక్త ఆ. 5
  9. అదికాదే చెలి - మదీయము
  10. అనిలకుమారకుండు - వసుచరిత్ర ఆ. 3, ప. 139