వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/స్తోత్రపాఠము

స్తోత్రపాఠము

స్తోత్రపాఠము నొక విజ్ఞాని వన్యమృగముతోఁ బోల్చినాఁడు. నిత్య పరిచయము కలిగినపుడు డెంతటి క్రూరసత్వమైనను దాని క్రౌర్యమును గోల్పోయి కనుపించును. సహజ క్రౌర్యముగల జంతువుల నలవాటు చేసికొనుట యందును నేర్పు గోచరించును. మహర్షుల యాశ్రమ వీథులందు సహజ శత్రుత్వము గల వన సత్త్వములు పరస్పర సఖ్యముతో సంచరించుట కా మహనీయుల యనంత ప్రతిభావిశేషమే కారణము. మహాకవు లెపుడు ఋష్యాశ్రమముల దర్శించినను “గండూయనము సేయు కరటి శుండాదండ పుష్కరమ్మున సింహపోతకమ్ము" ఇత్యాది మనోజ్ఞ ప్రకృతి చిత్రణములు వారికిఁ బొడకట్టుట లీ కారణముననే.

స్తోత్రపాఠము శ్రోతకుఁ బ్రప్రథమమున నెట్టి మహాభయంకర మృగముగ గోచరించినను గాలక్రమమున దానితోఁ బరిచయము వృద్ధియగు కొలఁదిని నొకవిధమగు ప్రేమాభిమానములు వెల్లివిరియుట తటస్థించును. అవి యభూత కల్పనలుగఁ గాక సుసత్యస్వరూపములై నిరూపితము లగుచుండును.

స్తుతి పాఠముల విన నలవడిన శ్రవస్సులు సత్యములైన సప్రియ వాక్యముల వినలేవు. ఇట్టియెడ సత్యవ్రతులకు స్థానము లేకపోవుటయే కాక యట్టి సత్యము లసత్యములనియు నిరూపితము లగును. అందువలనే "అప్రియస్యచ పథ్యస్య శ్రోతా వక్తాచ దుర్లభా” అను నార్యోక్తి జన్మించినది. సత్యము! 'పదుగురాడు మాట పాటియై ధరఁ జెల్లు నొక్కఁడాడు మాట యెక్క దెందు.'

‘ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకఁ దిరుగువాఁడు ధన్యుఁ' డని యొక సుమతి సెలవిచ్చినాఁడు. లోకమున జనసామాన్యము సర్వసాధారణముగ నీ నీతి మార్గమునే యనుసరించు చున్నది. ఆ కారణము వలననే లోకము విశేషముగ స్తుతిపాఠమునకుఁ జెవి యొగ్గుట సంభవించుచున్నది.

అయిన నొక యంశము సుసత్యము. స్తోత్రపాఠమొనర్పఁ బూనుకొనిన ప్రతివ్యక్తికిని దీని తత్త్వము తెలియుననుకొనుట భ్రమ. స్తోత్రపాఠమొక కళ!

అసామాన్యమైన కళ!! ఉక్తివిశేషోద్భూత మగు కళ!!


కళకు వస్తువుకంటే విన్యాసవైభవము ప్రధానము. ఇందందెవేసిన చేతులు కావలయునన్న వారికిఁ బ్రతిభావ్యుత్పన్నతలు రెండును గుణములై యొప్పవల యును. అందుచే స్తోత్రపాఠకునకైనఁ బ్రతిభయు వ్యుత్పన్నతయు నత్యావశ్యకములైన గుణములని చెప్పుట యవసరము.

కళాకారుఁడు నిజసామర్థ్యమును వ్యక్తీకరించుటకుఁ బ్రతి వస్తువును స్వీకరింపఁడు. తాను స్తుతింపఁదలచిన వ్యక్తి యుత్తమ లక్షణములం దభిమానముఁ గొనిన వస్తువును గ్రహించి తన్మూలమున నిజదర్శనములకు బ్రతిబింబమును రూపించును. స్తోత్ర పాఠకుఁడు నిటులనే తా స్తుతింపఁదలఁచిన వ్యక్తి యందలి సమస్త గుణముల గ్రహింపఁడు. అతనిలోపములపై బుద్ధిని బ్రసరింపనీయఁడు.

ఉత్తమ స్తోత్ర పాఠకుఁడు మానవ స్వభావానుభావమున ఘటికుఁడు, మానవ హృదయ సాగరములఁ బ్రవేశించి యతఁడందు దాఁగియున్న పులిముత్తియములఁ బైకిగొనిరాఁగల చతురుఁడు. ఎంతటి సహనశీలము గల వ్యక్తియైనను దన లోపముల విననిచ్చగింపఁడని యతఁ డెఱుఁగును. ఎట్టి యధమునకైనను నెట్టి నిర్భాగ్య దామోదరునకైనను 'నీ వింద్రుఁడవు, చంద్రుడ" వని పొగడించుకొన వలయునను కోర్కె జితించిన పురాణవ్యాధివలెఁ బట్టి బాధించుచుండునని యతఁ డెరుఁగును. తగిన సమయమున 116[1]షోడశోపచారము లొనర్చి యా వ్యాధి నాహ్వానించి భక్తి శ్రద్ధలతోఁ బ్రజ్ఞావంతుఁడైన స్తుతి పాఠకుఁడు తగిన చికిత్స యొనర్చిగాని మఱి యూఱుకొనఁడు.

స్తోత్రపాఠక కళాతత్త్వ మెఱిఁగిన కళోపాసి నెవరిని బ్రశ్నించిన “నాత్మస్తుతిని వినుటకంటె మానవునకు మించిన తృప్తి మఱియొకటి లేదని సిద్ధాంతీకరించి పలుకును.

ప్రయోజనరహితమైన దానిని బ్రపంచ మెన్నఁడు నాదరింపదు. స్తుతిపాఠము బహుయుగములనుండి లోకగౌరవమును బొందుచున్నది. అందుచే దీనివలన నొకకొంతగఁ బ్రయోజనమున్నట్లభివ్యక్తమగుచున్నది. ఇతర ప్రయోజనముల మాట యెట్లున్నను స్తుతిపాఠమును బడసిన వారి కీర్తి లోకమున వ్యాపించుచున్నది. స్తుతియం దించుకశక్తి యున్న చిరస్థాయియునగుచున్నది. నిత్యమగు నిట్టి కీర్తి లభింపవలయు నన్న స్తోత్ర పాఠ మక్షరరూపమును బొంద వలయును.

కీర్తి కాములందఱును సప్తసంతానముల మూలమున వారి కీర్తిని లోకమున

సుప్రతిష్ఠిత మొనర్చుకొనఁ జూతురు. సప్తసంతానము లందును సాహిత్యము


ప్రశస్తమైనది. శాశ్వతమైనది. జంగమ రూపమున సాహిత్యము కృతిభర్తకీర్తిని బహుముఖముల వ్యాపింపఁ జేయుటయే కాక సురుచిర సుస్థితిని జేకూర్చును. ఈ కారణము వలననే కీర్తి కాములకు సాహిత్యకు లాత్మబంధువు లగుచుందురు. 117[2]సాహిత్యకు లందు వ్యాకరణజ్ఞుని బితరుని వలెను, తార్కికుని భ్రాతవలెను, వేదజ్ఞుని చండాలుని వలెను జూచుచుఁ గవిత యలంకరణజ్ఞుఁడగుటచేఁ గవిని వరించినది. కవికి వాఙ్మయకళా వైదగ్ధ్యము వెన్నతోఁ బెట్టిన విద్య.

పూర్వ రాజన్యులలోఁ గొంద రీ రహస్యము నెఱింగిన వారగుటచే నుచితజ్ఞులై విశేషముగఁ గవి సంగ్రహణ మొనర్చిరి. ఎంతటి శ్రమకైన నోర్చి కవుల సంగ్ర హించుటకు మూలకారణము స్తోత్రపాఠాభిమానమే యని మా మతము, కవులు వారి పోషకునికిఁ బుష్టిగల కీర్తి శరీరమును గల్పించి యుగ యుగముల ఖ్యాతిఁ గల్గించినారు.

సమర్ధత గల చక్రవర్తుల కిట్టి యపూర్వ ప్రాభవమును జేకూర్చుట సహజమును సమంజసమును నైయున్నది. అయ్యుఁగొందఱు కవులు తాము 'సత్యరథములకుఁ గట్టిన యశ్వము'లను శ్రుతిప్రమాణముల మఱచి, తమ పోషకులకుఁ గేవలకీర్తి కాయ నిర్మాతలై వారి తుచ్ఛ శృంగారాభిమానమునకుఁ దోహదకారులగుచు తమ యనంత వాగ్వైచిత్రములతో లోకమును మభ్య పెట్టుచు వచ్చినారు. దీనిని గమనించి యుత్తమ ద్రష్ట లొకానొక కాలమున 'కావ్యాలాపాంశ్చ వర్జయే'త్తని యనుశాసింపవలసివచ్చినది.

ఉత్తమశ్రేణికిఁ జెందిన కొందఱు మహాకవులు తాము స్తోత్రపాఠమొనర్చుట కంగీకరింపక మడిదున్నుకొని బ్రతుకఁదలఁచిరి; చారుచరిత్ర, ధర్మచరిత్ర లేని రాజశబ్దవాచ్యులపై నేహ్యభావమును బ్రకటించిరి. అట్టివారిలోఁ బ్రముఖుఁడగు నొక కవీంద్రుఁ డొక సందర్భమున రాజదర్శన మొనర్చి తిరస్కృతుఁడైనపుడు 118[3]'బండిగురివింద పూల పేరులతోఁ దృప్తినందు కిరాతకాంతలకు స్వర్ణ కారునితోఁ బనిలేనట్లు సాధుచరిత్ర లేని రాజులకుఁ గవులతోఁ బని యేమున్నదని ప్రాగల్భ్యము మెఱయఁ బలికివచ్చినాఁడు.

కొందఱు ముష్టికవులు 'ముష్టికి నష్టి' లేదని నమ్మి యపాత్రుల కడకైన నేఁగి యాశుకవితఁజెప్పి యింతయో యంతయో పుచ్చుకొనకపోలేదు. కవి ప్రాశస్త్యమును గుర్తింపలేని వారు వీరిని వందిమాగధ వైతాళికాది గణమునఁ బరిగణించుట పరిపాటియైనది. ఇట్టి భట్టుకవులలో నుద్దండులును గొందఱున్నారు. అల్పదేశ పాలకుడైనను దానొక త్రిలోకాధిపతి నను భావముతోఁ బ్రియఁగూడి రాజ్యమేలు

నొక యేకాక్షి ప్రభువును దర్శించి శుష్కప్రియముల శూన్యహస్తములని


గ్రహించువాఁడగుటచే 'అన్నాతిఁ గూడ హరుఁడవు, అన్నాతిం గూడకున్న నసుర గురుండౌ, దన్నా! తిరుమలరాయా!, కన్నొక్కటి లేదుగాని కంతుఁడవయ్యా!' యని యొకడు స్తోత్రపాఠమును విసిరినాఁడు. అంతటితో నా రాజు తబ్బిబ్బై బహుళ పారితోషికమును దుశ్శాలువల నిచ్చి పంపించినాఁడు.

స్తోత్రపాఠకుఁడు కొన్ని వేళలందు స్తుతించెడివారి యుత్కర్షను నిరూపించుటకుఁ దన్నల్పునిగ జీత్రించుకొనును. 119[4]చౌడప్ప వంటి వాచాప్రాగల్భ్యముగల భట్టుకవి తంజావూరు రఘునాథ రాయలవారి యొద్ద 'నేరుతు నని మాటాడఁగ, వారిజభవు నంత వాని వశమా తంజా, వూరి రఘునాథ రాయలుగా, రెఱుఁగఁగఁ గుందవరపుకవి చౌడప్పా!' యని తన్నుద్దేశించి చెప్పుకొనినాఁడు.

అంతవాడినైన 'నేనే నిన్ను స్తుతించుచున్నాను నీవెంత వాఁడవో చూచుకొ'మ్మనట్లు కొన్ని సందర్భముల స్తోత్రపాఠకులు తమ యాధిక్యమును వర్ణించుటయు సహజము. ఇట్టివారు స్తోత్రపాఠ కులపతులు.

'ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా విదితంబైన మహిన్మహాంధ్ర కవితా విద్యాబలప్రౌఢ నీకెదు రేరీ?” యని సామాన్యస్తోత్ర పాఠకులు తమ్ముఁగూర్చి చెప్పికొనుట పరిపాటి. ఒక సామాన్యమైన సామంతుని పట్టుకొని మహాకవి తిక్కనవలె 120[5]'ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడఁగు... నెవ్వాని గుణలత లేడు వారాశుల కడపటి కొండపైఁ గలయఁ బ్రాకు' - ఇత్యాది స్తోత్రపాఠ పరంపరలఁ గురిపించుటయును లోక సహజము. ఈ యసత్యస్తుతులు ప్రాఁత కాలపునాఁటి వని పరిహసింప వీలులేదు; ఈ శతాబ్ది యందును వినిపించుచున్నవి.

అట్టి స్థితిలో గీర్తికాములైన పూర్వరాజన్యులు కొంద రప్రశస్తము లయ్యు నగ్నములైన యసత్యములు కాని యిట్టిస్తుతులకు మురిసి యే సంక్రాంతి పుణ్యకాలముననో పెద్దల పుణ్యమునకని పేరు పెట్టి 121[6]సర్వబాధా పరిహారముగ దేవమాతృకలు పండు కేదార ఖండముల స్తుతి పాఠకులకు దానమిచ్చిరని యీ నాఁడు మనము బాధపడుట యెందులకు?

స్తుతి పాఠకులు పరస్తుతి పరాయణులు కాని పరదూషకులు కాదు. అయినను పరవంచులు. వీరివలన వినువారు చెడిపోవుట నిస్సంశయము. వీరు లోకమున

స్తుతిగీతా ప్రియత్వమును బెంపొందితురు. వీరి స్తోత్రములకుఁ దగినవార


భావము నిగూఢముగనో, యీషత్సృష్టముగనొ వినువారియందుఁ బొడకట్టును. లేకున్న వీరిస్తుతుల వినుటయెట్లు? ఇది యహంకృతి యైనను నాత్మవిశ్వాసమైనను దీనికి మూలకారకులు స్తుతిపాఠకులు. వ్యక్తిద్రోహులైన వీరు రాజద్రోహులు! రాష్ట్రద్రోహులు! జాతిద్రోహులు! ప్రపంచ ద్రోహులు! విశ్వ ద్రోహులు!!! 122[7] అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ' సంఘమునందొకరైన వేరుపురుఁగులగు వీరిని పట్టి శిక్ష చెప్పించుట 'సంఘనీతి’.

స్తోత్రపాఠము చేయువారి, నది విని నిజమని భ్రమించువారి నిరువురఁ జెడగొట్టు శక్తి దానియందున్న' దాని యొక తాత్త్విక మహాశయుని సుసత్య ప్రవచనము. వస్తుతః స్తుతి పరాయణత్వము లేకున్న నది గల్పించి పోషించును. ఆత్మవిశ్వాస మణుమాత్రమైన లేక నణగారిపోవు వారి కది మహాంజనమై వర్తిల్లుటయును సత్యమగుటచేఁ బండితాగ్రగణ్యుఁడు జాన్సను 'పొగడ్త పొందుటయును నొకరీతి శ్రేయస్కరమని ప్రవచించినాఁడు. 'లోక మీ రీతిగ నన్నుఁ గూర్చి భావించుచున్నది కాఁబోలు. నేనీ ప్రథకుఁదగిన శక్తిసామర్థ్యములు సంపాదించెదను గాక' యని నిశ్చయించుకొని కొందఱు తమలో నిద్రించుచున్న శక్తిని మేల్కొల్పుటకు శతవిధ యత్నము లొనర్ప స్తోత్రపాఠము సాయపడవచ్చు నన్నమాట!

ఆత్మబంధువుల మధ్య స్తుతిపాఠములు వినిపించిన లోకము సహింపదు. అందెంతటి సత్యమున్నను బ్రయోజనము లేదు. ఇట్టిస్తుతులకు మూలకారణముల వెదకుట దాని లక్షణము. కుమారుఁడు తండ్రి నే ప్రతిభావిశేషమునకో హృదయపూర్వకముగ నమ్మి స్తుతించిన స్వార్జితమైన సంపదను దండ్రి యన్యాక్రాంత మొనర్చునేమోయను భీతి యిందులకుఁ గారణమని లోకము శంకించును. పితరులే పుత్రునిఁ బొగడిన నివి మేనకోడలిని వివాహమాడఁజేయ బన్నుచున్న వాగురు లని యతని మది నిశ్చయించును.

అల్లుఁడు మామలమధ్య పరస్పరోత్కర్ష కనుపించిన గొడుకులతోఁ బాటు పాలుపంచఁడను భయమునో, కుమార్తె కురూపియగుట నల్లుఁడు పరిత్యజించు నను భయమునో కల్పించి 123[8] ఓడిపస్ కాంప్లెక్సు'ను దలఁ దన్నఁగల యొక 'శ్వశ్రుజామాతా 'కాంప్లెక్సు'ను సృష్టించుటకు వెనుదీయని మానసిక శాస్త్రవేత్తలు మానవలోకమున నుండకపోరు.

భార్యాభర్తల మధ్య స్తుతిపాఠ మంతకంటే నతి ప్రమాదకరమైనది. 'అన్యోన్యము

ప్రేమించుకొనినవారు పొగడుకొనరు. సామాన్యస్త్రీ భర్తను పొగడవలసిన యగత్యము


లేదనునవి యన్య దేశీయ జిజ్ఞాసువులు చెప్పిన సూక్తి విశేషములు. ఇట్టి యభిప్రాయముల నాధారముగఁ గొని మిథ్యాభిమాన ప్రకటన మనియో, శీలసంబంధ మగు భీతియనియో సిద్ధాంతీకరింప వచ్చును.

సామితేయులు కొందఱు కొన్ని సందర్భముల సభావేదికలఁ నన్యోన్య గుణకీర్తన మొనర్చుకొనినచో వారిని యజ్ఞాహ్వానితులైన దేవతలవలె నింద్రుఁడగ్ని, నగ్ని వరుణుని, వరుణుడు ధర్ముని, ధర్ముఁడు వాయువును హవిర్భాగములఁ గైకొన స్తుతిపాఠము లొనర్చుకొనుచుఁ బరస్పర మాహ్వానించుకొను రీతిగఁ బ్రవర్తించు నొక స్తుతి పాఠక గణముగఁ బరిగణింపని వ్యక్తులు, సమాజములు లోకమున నరుదు కాదు. అట్టి యవసరముల స్తుతి తప్పదు జన మనుకొనుటయుఁ దప్పదు.

కొందఱాత్మ బంధువుల కంటెను, కొందఱు సామితేయుల కంటెను, బ్రేయసీ ప్రియులలో స్తోత్ర పాఠములు విశేషముగ విన్పించును. 'తావలచినది రంభ తామునిఁగినది గంగ.' కవి, 124[9]ఉన్మత్తుడు, ప్రియుఁడు నేకకోటిలోని వారని మహాకవి షేక్స్పియరు పలుకనే పలికినాఁడు. ఇట్టి స్థితిలో వారి స్తోత్రపాఠము లెట్లుండునో యూహించుట కష్టముకాదు. ప్రియాప్రియుల మధ్య నడచు స్తోత్రపాఠములకు మధ్య 'బ్రణయంపు మేలిముసుఁ’ గొకటి కన్పించును. ప్రేమికుఁడు ప్రియనుగూర్చి 125[10]నీవు గంధర్వలోక మధుర సుషమా సుధాగాన మంజురేఖ' వనినను, బ్రియురాలు ప్రియునిగూర్చి నీవు కంతుఁడవో, జయంతుఁడవొ యనినను, 126[11]ప్రియ పాదచిహ్న ములున్న స్థలముల మఱియొకరు ప్రయాగ క్షేత్రములుగ విధురభక్తి భావమున భావించినను వీని నుత్తమ కవితోక్తుల క్రింద మన్నించి వారి యనురాగమును ధర్మేతరమైనను నార్ద్ర హృదయముతో లోకము పరిగణించుచున్నది.

అర్థమునకు స్తుతికి నవినాభావసంబంధము. '....... అతఁడు మహాకులీనుఁ డాతండు కళావిదుండతఁడు ధన్యుఁ డతండు మనోజ్ఞమూర్తి యెవ్వండు భవత్కృ పాకలన వైభవలక్ష్మికిఁ బాత్రుఁడిందిరా!' యని కవి చెప్పనే చెప్పినాఁడు. ఇట్టి ధనవంతునిపై స్తోత్రపాఠపుష్పవృష్టి గురియుటలో సందేహ మేమున్నది? ఇతర విద్యావిశేషములులేని కేవలధనికుఁడు సుతికిమించి స్తుతించెడు స్తోత్రపాఠకునిఁజేరరానీయఁడు. ఇందుకుఁ గారణము స్తోత్రపాఠముపై నభిమానము లేక కాదు; 'అతి సర్వత్ర వర్జయే' తను నార్యోక్తిపై నభిమానమును కాదు. మఱియొక 'కొంటె కోణంగి' స్తోత్రపాఠకుఁడై వచ్చి యిచ్చిన దానితోఁ దృప్తినొందక తన 'బ్రతుకు

బండారము’ను బయటపెట్టు నను భయమిందుకు మూలమని విబుధుల యభ్యూహము.


ధనికుల కడకు స్తోత్రపాఠకులై వెడలు వారీ రహస్యమును మున్నె గుర్తించి తగినరీతి వర్తించి రసవంతముగఁ దప్పించుకొని వత్తురు.

127[12]గడచిన ప్రపంచ మహా యుద్ధమునఁ బ్రథమ నష్టము సత్యమని మహాత్ముఁడు ప్రవచించినాఁడు. అయిన నేమి? ప్రపంచ మే కడ మాఱినది. ఎవరి ప్రచారము వారిది. ప్రచారము లేకున్న బలప్రాభవము లుండవు బ్రతుకుట కష్టము. అసత్యమున కింతటి ప్రాపకమున్న యీ దినములలో మహాత్ముని వంటి కారణజన్ములు మఱల నవతరించి స్తుతిపాఠము జాతి విద్రోహము, దేశ విద్రోహ మని ప్రకటించి యందులకై బ్రచార మొనర్చి యెన్ని వ్యక్తి సత్యాగ్రహములు సాగించినను నీ నాణెమునకుఁ గల చలామణినిఁ జెఱిపి వేయలేరు. ఇది మహత్తర సత్యము. భూతవర్తమానములు దీని చెల్లుబాటు కన్పించుచున్నది. భవిష్యత్తున నొకవేళ రూపాంతరమును బొందినఁ బొందవచ్చును. కాని నశించు ననుకొనుట భ్రమ. దీనిని కేవలము బానిస యుగ చిహ్నముగఁ బరిగణించి భావికాలమున మన ప్రజాగణతంత్ర రాష్ట్రమున సమూలముగ నిది పరిభ్రష్టమగు ననుకొనుచున్న వారు భ్రమప్రమాదమునకు లోనైనారని ఘంటాపథముగఁ బలుకవచ్చును.

లోకమున గొందఱకు స్తోత్రపాఠ మనిన గిట్టదని వినుచుందుము. కుశాగ్ర బుద్ధితో నాలోచింప నిది గగనకుసుమమని యవగతమగుచున్నది. అట్టివారి జీవిత 128[13]' వ్యాసఘట్టము' లెఱిఁగి ముగ్గున కెట్లు దింపవలయునో సిద్ధహస్తులైన 129[14] కారంధమ 'స్తోత్ర పాఠకు' లెఱుఁగుదురు. స్తుతిపాఠ మనిన నాకిష్టము లేదని ప్రకటించు వ్యక్తి భంగ్యంతరముగ నద్దాని నభిలషించుచున్నాఁడన్నమాట! అతగాని దర్శన మొనర్చి జగజెట్టి స్తోత్రపాఠకుఁ 130[15]'డడియఁడై' ద్రావిడ ప్రాణాయామముగ 'మహాప్రభో! 131[16]నభోగాయకులందఱకువలెఁ దమకు స్తోత్రపాఠ మనిన సుతరమును గిట్టదు. దానికిని మీకును ధ్రువముల రెంటికున్నంత దూరము, తాము కేవలము 'స్తోత్రపాఠ వరూథినీప్రవరు'! లని నాతిదీర్ఘ బిరుదమును ప్రసాదించి పని నెగ్గించుకొని మఱి బయటఁబడ గలఁడు. అనిన స్తుతిపాఠ మనిన నేవగింపును బ్రకటించువారికి నేఁటి విధానము సంతృప్తినొసఁగుట లేదన్నమాట! వారు కాంక్షించుచున్నది నవ్యత. అది పొడకట్టిన మఱుక్షణముననే వారు 132[17]'త్రిశరణములఁ జెప్పి తీఱెదరు.

మూర్ఖుఁడు స్వగృహపూజ్యుఁడు కనుక తన్నుఁ దానె పొగడుకొనును. వివేకి సహచరుల స్తుతించును. అంతటివారికి మిత్రుఁడనైన నే నెంతటివాఁడనో గ్రహింపుఁ

డనుట కింతటి కంటె 'శృంగగ్రాహిక' యింకేమి కావలయును? ఒకప్పుడు వేత్తలును


'స్థూలారుంధతీన్యాయము'నఁ దమ్ము గీర్తించుకొని వ్యంగ్యగర్భితముగ నాకు మిత్రులు వారని సహచరులు నితరులకుఁ బరిచయ మొనర్చి వారిపనులు చక్కబెట్టుటయుఁ గలదు.

'ఇరువురు స్తోత్రపాఠకు లొకచోఁజేరిన వాక్పిశాచములు విందొనర్చుకొను నని యొక తాత్త్వికుఁ డనినాఁడు. నిజము. ఇరువురి జిహ్వలు వాక్కులకు వాతరాయణములు. తేనెబూసిన కత్తులు. ఇట్టి రసనలు బాహ్యప్రపంచము పై జైత్రయాత్రలు వెడలుట నిత్యమును మన కనుభూత మగుచున్న యంశము. స్తోత్రపాఠముల నెల్ల నుత్తమోత్తమమైనది వ్యక్తియభి భాషణము. ఔను కాదనక శిష్యభావముతో 133[18]ఋషభములు నిండ వినుటయే. ఈ ధర్మ సూక్ష్మమును గ్రహించిన స్తోత్రపాఠకుఁడు 'స్తుతిప్రియ - 134[19]'క్షేత్రియోవ్యాధి' గ్రస్తమైన యెట్టి నివాతశిలాకంధ హృదయ క్షేత్రములోనైనఁ బ్రవేశించి విజయమును గరతలామలకము గావించుకొనఁ గలఁడు.

వీరు మాటల పెట్టుబడియైన లేక విశేష లాభముల గ్రహించు 'విచిత్రధనిక వాదులు. వీరు పొందు లాభములు 'కంచనాలు' వేసి యెంతటి చారదక్షమైన ప్రభుత్వమును దగిన 135[20]దండుగు' బుచ్చుకొన నేరదు.

'స్తోత్రపాఠ మొక వ్యసనము' అత్యనారోగ్యకరమైన వ్యసనము. మద్యముల వలెఁ గొన్ని యౌషధసంబంధములైన ప్రయోజనములున్నవని కొందఱు వాదించినను నిశిత హృదయ మంగీకరింపని వ్యసనము. మద్యపానమువలెఁ బ్రభుత్వములు నిషేధింపలేని వ్యసనము.

బాల్య యౌవన కౌమారములలో నున్న యెవరైనను స్తోత్రపాఠవ్యసనాయో మయ కలుషశృంఖలములనుండి విడివడలేకున్నారు. బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్న్యా సాశ్రమవాసులలో తురీయులైన దీనిఁ బరిత్యజింపలేకున్నారు. నేఁడు 136[21]పాలమోర్ వంటి ప్రసిద్ద ఖగోళ శాస్త్ర పరిశోధనాలయము నందలి రెండు వందల యంగుళముల వెడల్పు గల 'భూతదర్పణము' లున్న యంత్రముల వలనైన యందుకొని దర్శింప రాని నక్షత్రములఁ 137[22]దురీయయంత్ర, రామయంత్రములఁ గనుఁగొన నేర్చిన మహర్షులైన దీనిపై మనసుగొనినారు. బ్రహ్మజిజ్ఞాసువుల నైననిది పట్టి బాధించినది.

ఇంతకు నిట్టి లోపము దేవతలలోనే యున్నది. స్తోత్రపాఠ ప్రియత్వము లేని

దేవత ముక్కోటి దైవతములం దొక్కరైనఁ గన్పింపరు. త్రయీవేదముల విధ్యుక్తముగ


నాహ్వానించినను సామమంత్రములు శ్రుతిపుటములఁ బడునంతకు దేవతలు యజ్ఞభాగములనైన గ్రహింపఁ బయల్వెడలరఁట! ఇట్టి దేవతల స్తుతించుట కాదిద్రష్టలు పలికిన ప్రపాఠములు చాలక, స్తోత్రహిత బుద్ధులైన కవు లెన్నెన్ని స్తుతులు గల్పించినదియు స్తోత్రరత్నాకరములఁ బరిశీలించిన సువ్యక్తము కాఁగలదు. అయ్యు వీనిఁగని బ్రహ్మ మేకము కాదనుకొనుట యద్వైతు లంగీకరింపనిది. 'ఏక మే వాద్వితీయమ్ బ్రహ్మ' స్తోత్రపాఠ మొక లీల! ఒక చిదంబర రహస్యము!!

  1. 116. షోడశోపచారములు ధ్యానావాహనాదులు
  2. 117. సాహిత్యకులందు - బిల్హణీయములోని "నైవ వ్యాకరణజ్ఞమేవ పితరమ్” ఇందుకు మూలము
  3. 118. బండి గురవింద పూలు బిల్హణుని విక్రమాంక చరిత్రలోని క్రింది శ్లోకము మూలము :

    "కిం చారుచరిత్ర విలాస శూన్యాః
    కుర్వంతి భూపాః కవి సంగ్రహేణ |
    కింజాతు గుంజాఫల భూషణానామ్
    సువర్ణకారేణ వనేచరాణామ్ ||"

  4. 119. చౌడప్ప - సుప్రసిద్ధాంధ్ర తిట్టుకవి
  5. 120. ఎవ్వాని వాకిట - ఇందు తిక్కన ధర్మరాజును వర్ణించినాఁడు - విరాట పర్వము ఆ. 2
  6. 121. సర్వబాధా పరిహారము - ఎట్టి పన్నులు లేనిది
  7. 122. అంగవ్రాతములో - పోతన భాగవతము - (ప్రహ్లాదఘట్టము )
  8. 123. ఓడిపస్ కాంప్లెక్సు - ఓడిపస్ స్పింక్సు రిడిల్ చదివినవాఁడు, పొరపాటున తల్లిని వివాహమాడినవాఁడు ఓడిపస్ కాంప్లెక్స్ అన Relation between parent and child of opposite sexes held by psycho - analysis to cause repressions.
  9. 124.కవి యున్మత్తుఁడు "The poet, the lunatic and the lover are all in imagination compact”.
  10. 125. నీవు గంధర్వలోక - శ్రీ దేవులపల్లి కృష్ణపక్షము
  11. 126. పాదచిహ్నము - శ్రీ శివశంకరశాస్త్రి విరచితము
  12. 127. గడచిన ప్రపంచ మహాయుద్ధమున “The first casuality of war is truth” - Mahatma
  13. 128. వ్యాసఘట్టము - వ్యాసుఁడే మఱలవచ్చి వివరింపవలసిన గ్రంథగ్రంథి.
  14. 129. కారంధమ = కంచు
  15. 130. అడియఁడు = అడియేన్ దాసన్ (నేను నీ సేవకుఁడ) అనువాఁడు
  16. 131. నభోగాయ = భోగరహితుఁడు, తిట్టు.
  17. 132. త్రిశరణములు = బౌద్ధులు చెప్పు “సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి" అనునవి
  18. 133. ఋషభములు = చెవి రంధ్రములు
  19. 134. క్షేత్రియోవ్యాధి = ప్రకృతి సహజమైన వ్యాధి
  20. 135. దండుగు = దోషములకుఁ బ్రభువులు పుచ్చుకొను నపరాధద్రవ్యము
  21. 136. పాలమోర్ = అమెరికాయందలి సుప్రసిద్ధ ఖగోళశాస్త్ర పరిశోధనాలయ ముండుచోటు
  22. 137. తురీయ యంత్రము = ప్రాచీన వేదర్షులు దీనిమూలమున గ్రహవేధల నిర్ణయించిరి. రామయంత్రము = క్రీ.శ. 15వ శతాబ్ది భారతదేశమున ఖగోళ విజ్ఞానమున గ్రహింపనున్న యంత్రము.