వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/నాచీ

నాచీ

(జనశృతి సమాహృతే ఆధారం - ఆచారాలు ఆనాటివే - దేశం త్రిలింగం - కాలము 15వ శతాబ్ది)

(జ్యోతిర్విద్‌గృహ ప్రాంగణము - దైవజ్ఞుడు ఏలేశ్వరుడు)

దైవజ్ఞుడు : ఉపాధ్యాయా! ఈ విషయంలో దైవజ్ఞులకు ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. అంతా ఫల నిర్ణయంలో ఏకీభవించారు. ఈ హోరా శాస్త్రాన్ని బట్టి కించిత్తయినా మనకు అనుకూలించేటట్లు లేదు. స్త్రీ జాతకంలో ప్రత్యేకానుభవం వున్న మైథిలి శంభునాథుడు కూడా అదే ఫలం చెప్పాడు. ఇంకా ఏ ఇతరమైనా అనుకోవచ్చు. కానీ - మాంగల్య స్థానంలో శని. అంతే కాకుండా పాపాధిపత్యంతో పాపార్ధళ పట్టిన శుభదృష్టి (భిన్నముఖము).... సర్వజ్ఞులు తమ రెరుగని దేమున్నది? కన్యకు వివాహాన్ని కట్టిపెట్టి శివాజీవిగా ఉంచితే బాగుంటుందేమోనని నా...

ఏలేశ్వరుడు : స్వామీ! అంతేనా?... అన్యోపాయం లేదంటారా? (గద్గదస్వరము) భాగ్య కోశాధిపత్యము నుండి పంచమకోణస్థితి వున్న గురుదృష్టి అష్టమాని కున్నదిగా?.... మరి చాలదూ?...

దైవజ్ఞుడు : ఏమిలాభం ఆ గురుడు అస్తంగతుడైనాడు.

ఏలేశ్వరుడు : (దుఃఖము) నా ఆశలడుగంటాయి. నా పాపం పండింది.... నలుగురిలో నగుబాట్లు కావలసివచ్చింది. నా బ్రతుకు... జైముని ఆస్థాన పురోహితుణ్ణి ఆవహించాయి పంచ మహా పాతకాలు. కన్యాత్వం వచ్చిన కన్యకు వివాహం చేద్దామా అంటే ఒకవైపు శాస్త్రరీత్యా వైధవ్యం కనిపిస్తుంటే ఎలా చేస్తాను. చేతులెట్లా ఆడుతాయి. చేయకుండా ఉందామా అంటే శాస్త్ర విరుద్ధంగా వెలి... (తేర్చుకొని... చింతామగ్నత).... వివాహం జరిగి తీరవలసినదే. స్వామీ! మార్గేతరం ఏమీ లేదు కదూ?

దైవజ్ఞుడు : (ముఖదైన్యం) ఉపాధ్యాయా! కాని ఇటువంటి సందర్భంలో ముందుగా లోహ ప్రతిమకిచ్చి వివాహం శాస్త్రోక్తంగా చేసి ఆ ప్రతిమను నాశనం చేసి తరువాత వరుని కిచ్చి కల్యాణం చేస్తే దోష పరిష్కార మౌతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. పూర్వం అది ఆచారంగా కూడా ఉన్నట్లు జనశృతి.

ఏలేశ్వరుడు : అది పునర్భూవివాహం కాదా? స్వామీ! శుద్ధ శ్రోత్రియ వంశంలో పుట్టిన నేను అట్టి ప్రతిమా వివాహానంతర పునఃకల్యాణము చేస్తే ఏలేశ్వరుడు పునర్భూ వివాహానికి అంగీకరించడు తన కూతురికి చేసిన పెళ్ళి పునర్భూవివాహం క్రిందికే వస్తుంది. ప్రతిమ కేవల ప్రత్యామ్నాయం అని తాము గూడా పునర్భూ వివాహాలు చేస్తే ఆ మతధ్వంసక పాతకం నన్ను చుట్టుకుంటుంది. అపకీర్తి! వద్దు! వద్దు! భావికుల ధ్వంసానికి మార్గదర్శకుణ్ణి కమ్మంటారా? శివ! శివ! శివ శివా.... జన్మ జన్మాలకూ వద్దు!

(తలమీద చేతులు పెట్టుకొని కూర్చుంటాడు)

దైవజ్ఞుడు : స్వస్థ చిత్తులై తామింకా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. సర్వజ్ఞులు తక్కిన శాస్త్రా లేమంటున్నాయో తరచండి... మీరేది నిర్ణయించుకున్నా నా సాయ శక్తులా కార్యసానుకూలానికి ప్రయత్నిస్తాను. ఇంకా... (ఎవరో వచ్చే వానిని చూచి ఆగుతాడు)

ఆనీకస్తుడు : (వంగి ఇరువురకు నమస్కరించి) శ్రీ శ్రీ జైముని మహారాజులుంగారు తమ ఆస్థాన దైవజ్ఞయ్యను యుద్ధముహూర్త నిశ్చయం చేయటానికి కొని రావలసినదని అగత్యాన్ని బట్టి తమ అనీకస్తుని ఆజ్ఞాపించారు.

దైవజ్ఞుడు : (ఆనీకస్తునితో) బోయీలను ఆందోళిక సిద్ధపరుపమను. వారు ప్రక్క అరుగు మీద ఉంటారు... (ఏలేశ్వరునితో) చింతా మగ్నులైన లాభమేమి? కానున్న దానికి కర్తలెవరు?.... “శ్రీరవయేనమః”

(ప్రవేశము బోయీలు - అందలముతో వచ్చి నమస్కరిస్తారు)

బోయీ : స్వామీ! సిద్ధము.

దైవజ్ఞుడు : (ఏలేశ్వరునితో) ఉపాధ్యాయా! రాజాజ్ఞ తడవుండరాదు. అనుజ్ఞ? పోయి వచ్చెదను.

(అని ఆందోళికా ఆసీనుడై పోతాడు)

ఏలేశ్వరుడు : (దైవజ్ఞుని చావడిలోనే వుండి) పునర్భూవివాహాన్ని లోకంలో ప్రచారం

చేయటంగాని, కన్యా వైధవ్యం చూడటం గాని తప్ప మార్గేతరం లేదుగామాలి. కష్టకాలం వచ్చింది... విధికృతం బలీయం... (కొంచెంసేపు ఆలోచించి) ఇంకా అన్ని శాస్త్రాలు పరిశీలిస్తే... పరిశీలించి నా మట్టుకు ఒక శాస్త్రం ఇలా చెపుతుంటే మనసు కెక్కడి శాంతి. (కొంత సేపాగి) శాస్త్ర పరిశీలనం ఇంకా యెందుకు, శాస్త్రాలలో వున్న ప్రతిముక్క మీద నాకు వెర్రి నమ్మకం ఎందుకు?... అయినా చూస్తాను... ఎలా వస్తుందో వైధవ్యం... తారాబల, చంద్రబలాలన్నీ విచారించి, నిధుల చేత సుముహూర్తం నిశ్చయం చేయిస్తాను. కావలసి వచ్చునంటే నేనే నవగ్రహజపం చేస్తాను. ఇంకా వూరుకుంటే నాచీకి ఎనిమిదేళ్లు దాటుతాయి. తరువాత వచ్చే అపవాదానికి అనుకుంటే లాభం వుండదు. మానవుడు పూర్వం చేసినదానికి ఇప్పుడు ప్రతిగా చేస్తే విధి మాత్రం ఏం చేస్తుంది.

(అని లేచి నెమ్మదిగా ఇంటి మార్గం పట్టుతూ వుంటాడు) రాజవీథిని శైవ భిక్షకుడు ఒకడు,


జంగమయ్యా! గరుడ
జంగమయ్యా! శివ!
దేహధారణ నున్న
దివ్య లింగమయా!
నిఖిల లోకాధీశ
నిర్మల జోతిస్సు
నింగిలో వెలిగేను
నేలపై వెలిగేను జంగమయా

కలుష బుద్ధీ! నీవు
కనుమూయ జూడకో
ఆంతరంగిక యత్న
మాజ్యోతి కనలేదె? జంగమయా


అని పాడే భిక్షుక గీతం వినీ విననట్లుగా పోతాడు


(తెర)

(ఏలేశ్వరుడు - కృష్ణపంతు - 'భాగీరథీ' స్నానం చేసి నెత్తిమీద నీళ్ళ కడవలు పెట్టుకొని

వస్తుంటారు.) ఏలేశ్వరుడు,


అక్షయ! త్రిభువనాధ్యక్ష! సర్వజ్ఞ!
దేవ! మహాదేవ! దేవతారాధ్య!
భావజ సంహార! భక్తమందార!
భక్తవత్సల! ఈశ! భర్గ! దేవేశ!
భక్త జనాధార! భవ్య సాకార!


అనే శివస్తుతి చేస్తూ రాజవీథిలో నడుస్తూ వుంటాడు. కృష్ణపంతు, నాచీ తోడి బాలికలతో ప్రాతఃకాలం ఆడు కుంటుంటే ఇంటికి దగ్గిరగా వున్న శివాలయంలో చూచి)

కృష్ణపంతు : మహాత్మా! ఆ ఆటలో తన్మయత్వం చూచారూ? రూపం తాల్చి చిరు చెమట ముఖం మీద నాట్యం చేస్తూ ఉన్నది. ముంగురులు పవిత్ర గోదావరీ మృత్తిక శ్రమ వారితో కలిస్తే లేపనం వల్ల అతుక్కుపోయాయి. (కొంతదూరం నడచి) అదుగో! ఇంటిదారి పడుతూ ఉన్నది. ఆటగొల్లు వచ్చినట్లున్నది. అందులో అమ్మాయికి ఆవంత కూడా ఆనందం కనిపించకపోవటం అనేకమార్లు చూచాను. బిక్కమొగంలో దుఃఖమూర్తి ఆవేదన పడుతూ వుంటుంది. లోక ప్రవృత్తి కించిత్తేని తెలుసుకోలేని ఆ పసితనంలో...

(ఇంతవరకూ తలవంచుకొని చెప్పుతూ వున్న మాటలు గురువుగారి ముఖం చూస్తూ చెప్పబోతాడు. ఆయన ముఖంలో స్నిగ్ధత, కనుకొనలలో దాగులాడే దుఃఖాశ్రు కణాలు చూచి)

ముఖం వివర్ణమైన దేమి? ఆ అశ్రుకణాలకు కారణం ఏమి?

ఏలేశ్వరుడు : తండ్రీ! ఏమీ లేదు. అమ్మాయి ఆటలో మైమరుపునకు హృదయం కరిగి ఆనందాశ్రువులు కనుకొలకులనావరించాయి. అంతే.

కృష్ణపంతు : లేదు, లేదు మహాత్మా! ఏదో కలిగిన బాధను కప్పి పుచ్చుతూ ఉన్నారు. చెప్పరాని దైనందునా?

ఏలేశ్వరుడు : నీకు చెప్పరాని దేమున్నది తండ్రీ!... చెప్పేటందుకు ఏమీ లేదు కూడాను. నాకు 'జైముని' రాజాస్థాన పౌరోహిత్యము లేనప్పుడు నా ఏకైక పుత్రిని పెంచటానికి దంపతులము పడ్డ అవస్థలన్నీ అప్రయత్నంగా కళ్ళకు కట్టాయి. అందువల్లనే ముఖం వివర్ణమైంది. కృష్ణపంతు : మహాత్మా! (అమ్మాయిని చూపించి) పురాదుర్దశ జ్ఞప్తికి తెచ్చినందుకు క్షమించాలి.

ఏలేశ్వరుడు : వెర్రి తండ్రీ! నీ తప్పేమున్నది క్షమించటానికి? కన్నతల్లి నా కళ్ళముందుంటే నీ కన్న నాకే ముందు కన్పించింది. నీవు చూడలేదు గాని నీవు చెప్పకముందే ఆ యశ్రువులు వచ్చాయి. నీ మనస్సు ఇంత లేత దేమి నాయనా! (కొంత సేపాగి నడుస్తూనే) ఇంతవరకూ నీకు నేనెప్పుడూ చెప్పని సంగతి ఒకటి చెప్పాలనుకున్నాను. ఆ విషయంలో నీ సలహా కావలసి వచ్చింది.

కృష్ణపంతు : నేనా... సలహా ఆఁ! స్వామీ! ఏమి ఈ విపరీత వాంఛ. కానీ మీ ఆజ్ఞ ఉల్లంఘింపను. ఏదో కించిత్తుగా నా చిఱుత బుద్ధికి తోచినట్లుగా...

ఏలేశ్వరుడు : ఏమీ లేదు, నాచీ వివాహ విషయం

కృష్ణపంతు : అర్భకుణ్ణి నేనా జీవిత సమస్యల్లో సలహా యిచ్చేది?

ఏలేశ్వరుడు : సమస్య ఏముంది? వరుని విషయమే... ఎటువంటి వాని కివ్వమంటావు?

కృష్ణపంతు : దానికి ఆలోచన ఏమున్నది? తమ గౌరవ సంప్రదాయాలకు అనుకూలునికి - సాంగంగా వేదాధ్యయనం చేసినవానికి మీరు ప్రత్యేకంగా ఆదరించే సాహిత్య ప్రియునికి - రూపవంతుడైన యుక్త వయస్కునికి - అంతకన్నా అనుభవజ్ఞులు మహాత్ములకు నే చెప్పేదేముంది?

ఏలేశ్వరుడు : నా శిష్యకోటిలో నేను నిన్నే ప్రేమించాను. సకల విద్యావిదుణ్ణి చేశాను.

కృష్ణపంతు : సర్వదా కృతజ్ఞుడను.

ఏలేశ్వరుడు : ఆచారవంతుడివి బాగాను.

కృష్ణపంతు : తమ శిష్యులకు కించిదాచారమా!

ఏలేశ్వరుడు : యశః సంప్రదాయాలకు రెంటికీ సరిపోయావు. యుక్తవయస్కుడవు. నీకంటేనా ఇంత పాండిత్యముతో! రూపంలో వంకేమిటి?

(అభిప్రాయంకోసం కొంతసేపు ఆగుతాడు)

కృష్ణపంతు : (తలవంచుకొని సమాధానమీయడు) ఏలేశ్వరుడు : మీ మాతా పితరులకు అభియోగం పంపిస్తాను. కృతార్థుని చేయమంటాను.

కృష్ణపంతు : (మాటాడడు. తన ముఖంలో చిందులాడే సిగ్గు - ఆనందం - కనిపించకుండా చేతులో వున్న కమండలం చెంపకు ఆనిస్తాడు. పులకాంకురాలవల్ల గురువుగారు కనిపెడతారు అంతాను... మాట్లాడకుండా వీథిలో కొంత దూరం నడిచాక ఏలేశ్వరోపాధ్యాయుని గృహము వస్తుంది. ఇద్దరూ నీళ్ళ బిందెలతో ఇంట్లోకి పోతారు.)

(తెర)

(నాచీ తండ్రికి అగ్ని కార్యానికి కావలసిన ఉపకరణాలు అమరుస్తూ వుంటుంది. కృష్ణపంతు ముంగిట్లో అరుగుమీద కూర్చుంటాడు)

తల్లి : (ఇంట్లోనుంచి) అమ్మాయీ! కృష్ణపంతుకు సంధ్యా వందనానికి పంచ పాత్ర ఉద్ధరణ యివ్వమ్మా బయట వున్నాడు.

నాచీ : ఇస్తున్నానమ్మా ముందు నాన్నగారికి ఇచ్చి.

ఏలేశ్వరుడు : (నవ్వుతూ) ఇంకా సిగ్గు బిడియం నేర్పకుండా అతనికి కావలసినవన్నీ తీసుకుపోయి యివ్వమంటావు. పెళ్ళి అయిన తర్వాత ఇస్తుందిలే!

తల్లి : ఏమంటారు?... నిశ్చయించుకున్నారా ఏమిటి?

ఏలేశ్వరుడు : (సగర్వంగా) అవును.

తల్లి : సంతోషము.

నాచీ : (తలవంచుకొని స్తంభం ఆనుకొని నిలవబడుతుంది)

కృష్ణపంతు : (మనస్సులో) అడగకుండానే తండ్రిగారికి అన్నీ అమరుస్తూ ఉన్నది. నాకు కూడా ముందు అట్లాగే అమరిస్తే నేనెంతగానో ఆనందిస్తాను. హవిస్సులు పరమ పవిత్రాలౌతాయి. అమరాగ్ని హోత్రులు ఆనందిస్తారు. నాకు మాత్రం అంతకంటే కావలసిన దేముంది? కల్యాణి యింట్లో అన్ని పనులూ చక్క బెడుతూ ఉంటే అమ్మా నాన్నా పొంగిపోతారు. నే చేసుకున్న పురాపుణ్యం వల్ల గురువుగారు అనుగ్రహించారు...

నాచీ : (తండ్రి జపం చేసుకోవటం తల్లి గోదావరికి మంచినీళ్ళకు పోవటం చూచి దొడ్డి తలుపు వేసి బయట ముంగిట్లో వున్న పంతు దగ్గిరకు వచ్చి నిలుచుంటుంది)

కృష్ణపంతు : (మాట్లాడించడు) నాచీ : (సిగ్గాపుకొని) పంతూ! నీ కేమన్నా కావాలా యేమిటి? రోజుటి మాదిరిగా పిలిచి అడగటం లేదు.

కృష్ణపంతు : రోజూ ఏమని పిలిచేవాణ్ణి.

నాచీ : చెల్లీ! అని. రాత్రి నాన్నగారు నీకు 'గీత గోవిందం' పాఠం చెపుతూ వుంటే నేనే రాధికనై పోయి గేయం వ్రాశాను.

కృష్ణపంతు : చెల్లీ! ఏదీ ఆ గేయం.

నాచీ : నేను రాధికనై పోయానంటే! కృష్ణ! నీవు చెల్లీ అంటే మనసెలా వుంటుంది? చదవమంటావా?

కృష్ణపంతు : చదువు.

నాచీ : (గొంతుక సవరించుకొని)


నా వలపు పూవీథి
నవనళినివై నీవు
నటనాలు సల్పరా
నందగోపాలకా!
మెరుగు తీగలు పూయు
మిసిమి పూదామమును
అంతరాంతరములో
అంబు ముత్యములతో
కూర్చి నీ మెడవేసి
కులుకుచున్ బాడెదన్ ॥నా వలపు॥


(అని చక్రభ్రమణము)

కృష్ణపంతు : (సంతోషం లేనట్లు నటిస్తాడు నాచీ చూస్తే)

నాచీ : నీకిష్టం లేనట్లుంది, ఆపివేయమంటావా?

కృష్ణపంతు : (మాట్లాడడు)

నాచీ : (ధైర్యంగా) ముందేదో నీకూ నాకూ బాంధవ్యం కలపాలని అమ్మా నాన్నా నిన్ననే అనుకుంటే విన్నాను. నీకు కూడా తెలిసిందిగామాలి. అందుకోసమనా ఏమిటి మాట్లాడటం లేదు? కృష్ణపంతు : (చిరునవ్వు) మాట్లాడటానికేముంది?

నాచీ : నీకు చెప్పారా మరి నాన్నగారు?

కృష్ణపంతు : (తెలియనట్లు నటిస్తూ) దేని విషయం? ఏమిటి?

నాచీ : ఏమీ ఎరగవు గామాలి. అబ్బో! తెలియనట్లు నాచేత చెప్పించాలనే ఆ అభిలాషెందుకూ?

కృష్ణపంతు : నిజంగా నాకేమీ తెలియదు. నీవు మాట్లాడేది నాకేమీ అర్థం కావటం లేదు.

నాచీ : నిజంగా తెలియదు?

కృష్ణపంతు : తెలిస్తే నీ దగ్గర దాచి పెడతానా?

నాచీ : ఏమీ నామీద నీకంత?

కృష్ణపంతు : ప్రేమ!

నాచీ : మరి నీ చదువై వెళ్ళిపోతున్నావుగా నీవు! అప్పుడు నీవెక్క డుంటావో? నేనెక్కడుంటానో ఎలా ప్రేమిస్తావు నన్ను?

కృష్ణపంతు : నీవున్న వూరికే వచ్చిపోతుంటాను. నిన్ను తరుచుగా కలుసు కుంటాను. ఆవిధంగానే నా ప్రేమ వెల్లడించుకుంటాను (కాసేపాగి) నాచీ! చెప్పవు నాన్నగారు నీతో చెప్పలేదా అన్న సంగతి?

నాచీ : నీకు తెలియక పోతుందా. నాచేత చెప్పించాలని గాని.

కృష్ణపంతు : మళ్ళీ అదేమాట. పోనియ్యిలే చెప్పక పోతే మానె.

నాచీ : నీతో చెప్పకుండా ఎలా ఉంటాను? ముందు నీవెలావుంటావో అని చూచాను?

(చెప్పబోతుంది - మరింత సిగ్గు నెమ్మదిగా) నీకు... నన్నిచ్చి...

(ఇంతలో దొడ్డివాకలి చప్పుడు)

అమ్మ వచ్చింది. తలుపు తీయాలి. మళ్ళా వస్తా.

(అంటూ లోపలికి పోయింది)

(తెర)

(కళ్యాణపంతు, ఏలేశ్వరుడు ఇంటి చావట్లో కూర్చుంటారు వాళ్ళ ఇద్దరి భార్యలు

లోపల గుమ్మంలో కూర్చుంటారు)

ఏలేశ్వరుడు : బావగారూ! ఇవాళ ఇంకో గణకుని దగ్గరనుంచి వివాహ మహోత్సవ పత్రిక వచ్చింది. సర్వవిధాలా రేపటి ముహూర్తమే మంచిదన్నారు. మనం పాణిగ్రహణ మహోత్సవ ప్రయత్నాలల్లో ఉండాలి. మీ ప్రయత్నాలల్లో మీరు ఉండండి.

కళ్యాణపంతు : అన్నిటికీ మీరే వున్నారు.

కల్యాణపంతు భార్య : పెళ్ళికొడుకు వారికి ఆడపనికి వొదినగారే వున్నారు.

ఏలేశ్వరుడు భార్య : మహానందము

ఏలేశ్వరుడు : ఊళ్ళో పెద్దలందరికీ రాత్రే చెప్పాను. రాజుగారికి అంతకు పూర్వమే విన్నవించాను. నజరానా డంకా, బాకాలు పంపిస్తానన్నారు. మహారాణిగారు స్వయంగా వచ్చి వధూవరులకు కట్నాలు చదివిస్తుందట.

కళ్యాణపంతు : శుభముహూర్త నిర్ణయానికి ఘటికాయంత్రం సంగతేమి ఆలోచించారు?

ఏలేశ్వరుడు : బోయీలు కులాలుణ్ణి పిలుచుకోవచ్చి యంత్రనిర్మాణం చేయిస్తామన్నారు.

కళ్యాణపంతు : యాజ్ఞీకుడో మరి?

ఏలేశ్వరుడు : అమ్మాయి పుట్టినప్పటినుంచీ రేవణశర్మ వివాహానికి యాజ్జీకం నాదంటు న్నాడు. అతడే చేయిస్తాడు. (కాసేపాగి) సమిధలకు నిన్ననే చెప్పి పంపించాను. వచ్చాయటగానీ చెట్టెక్కినవాడు కాలు విరిగిపడ్డాడట పాపం.

కళ్యాణపంతు : ఎవరో వస్తున్నారు.

ఏలేశ్వరుడు : మా బావమరది. మీ కోడలు మేనమామ. పంపిన మనిషి వెంటవుండి తీసుకో వస్తున్నాడు.

బావమరది : (కాళ్లు కడుక్కోని) బావగారికి బాబుగారికి నమస్కారం. చాలా సంతోషం ఐంది. అమ్మాయికి మంచి సంబంధం నిశ్చ యించారు.

ఏలేశ్వరుడు : నాయనా శర్మ! ఇంట్లోకి కావలసిన వన్నీ అమర్చవోయి. బావగారూ నేనూ ఇప్పుడే వస్తాము (అంటూ లేచిపోబోతుంటే) కులాలుడు : (వచ్చి నమస్కారం చేసి) చెప్పారండి బాబు చెయ్యాల్సిన పని. అదెంతసేపు. రేపు ప్రొద్దున్నే చేసినా చెయ్యవచ్చు. అనుగ్రహం ఉంచాలి.

(అని ప్రక్కకు తొలిగి నిలవబడతాడు)

ఏలేశ్వరుడు : సరేలే. బావగారు! మనము వెళ్ళి వద్దాం ఆ పనికి.

(ఏలేశ్వరుడు, కృష్ణపంతు నిష్క్రమణ)

(తెర)

(ఆడపిల్ల వారింట్లో)

(తెల్లవారింది. పెళ్ళి పందిట్లో ముగ్గులు వేసి వుంచారు. ఏలేశ్వరుడు జపం చేస్తూ అరుగుమీద కూర్చున్నాడు. రేవణశర్మ మాంగల్యానికి పసుపు పట్టిస్తూ వివాహానికి కావలసిన వస్తువులు పందిట్లోకి తెచ్చుకుంటాడు)

రేవణశర్మ : (కులాలుని చూచి) అరే! యంత్రం నిర్మించావా?

కులాలుడు : (నీటి తొట్టిలో ఒక క్రొత్త కుండకు సున్నం వ్రాసి దాని అడుగున బెజ్జము చేసి నీరు నెమ్మదిగా కుంభంలోనికి వచ్చి అనుకున్న కాలానికి కుండ మునిగిపోయేటట్లుగా పూర్వం నిర్మించిన యంత్రాన్ని చూపిస్తూ) అదిగో! చాలాసేపైంది బాబూ నిర్మించి. కానీ ఎన్నో కుండలు వృధాగా పగిలి పోయాయి. (చివర మాట పని తొందరలో రేవణశర్మ వినిపించుకోడు)

రేవణశర్మ : (ఎటో చూస్తూ) ఐదున్నర ఘడియలకు నిండేటట్లుగా చేశావా?

కులాలుడు : అవును స్వామీ!

రేవణ శర్మ : (ఇంట్లోకి హడావిడిగా పోయి) అమ్మాయికి మంగళస్నానం చేయించారా? కానియ్యండి త్వరగా. (బయటకు వచ్చి భజంత్రీలతో) కానియ్యండిరా మంగళవాద్యం, ఉ! అనండి.

(ధ్వనిగా మంగళవాద్యాలు)

(ఏలేశ్వరునితో) బాబూ! లేవండి మధుపర్కాలు తీసికొని రాండి, పోదాం వరపూజ కోసం (ఏలేశ్వరుని భార్య పందిట్లోకి వస్తే) అమ్మా! పసుపు, కుంకుమ, గంధం, అగరు వత్తులూ మరచిపోవద్దు. తొందర చెయ్యండి. (ఎందుకో రేవణ శర్మ చేతిలో మంగళసూత్రం క్రింద పడుతుంది) ఏలేశ్వరుడు : (చూచి) అమంగళం

(అంతా వరపూజకు పోతారు)

నాచీ : (యంత్రం చూడటానికి పోతుంది. ఆమెకు తెలియకుండానే మురిడీలో ముత్యం ఒకటి జారి యంత్ర కుంభంలో పడి నీరు నెమ్మదిగా వస్తూ వుంటుంది. కాలవ్యవధి గమనించరు. ఆ మంగళవాద్య ధ్వని, ఆదుర్దాలలో)

రేవణశర్మ : (వరుణ్ణి పెళ్ళి పందిట్లోకి తీసుకొని వచ్చి కూర్చోపెట్టి మహాసంకల్పం మొదలెట్టుతాడు. ఏలేశ్వరుడు యంత్రం మీదనే కళ్ళు పెట్టుకొని సుముహూర్తానికోసం వేచి వున్నాడు. కానీ అందులో ముత్యం అడ్డుకొని నీళ్లు రాకుండా చేస్తూ వున్నదన్న విషయం తెలుసుకోలేకపోయాడు)

యంత్ర పరిపూర్తికి ఎంతకాలం పడుతుంది?

ఏలేశ్వరుడు : బహుశః ఒక ఘడియకాలం.

రేవణ శర్మ : ఇంకా ఇక్కడ కొంత ఆలస్యం వుంది. సరిగా సుముహూర్తా నికే మాంగల్యం కట్టిస్తాను.

(కృష్ణపంతుతో) నాయనా “స్వాహా” అన్నప్పుడు ఇంధనం వ్రేల్చు... నీకు తెలిసిందే గదా!

(మంగళ వాద్యాలు)

రేవణ శర్మ : అయ్యా! ఇంకా ఎంతాలస్యం ఉంటుంది?

ఏలేశ్వరుడు : అరఘడియ కాలం.

రేవణశర్మ : అయితే వధువును తీసుకొని రండి గంపలో (నాచీని గంపలో తెచ్చి మధ్య తెర అడ్డం వుంచుతారు) కొంతసేపు అయిన తరువాత బెల్లం జీలకర్ర అదిమి ఒకరి నెత్తిన యింకొకరి చేత పెట్టిస్తాడు.

అబ్బాయీ! కృష్ణపంతు! ఈ మాంగళ్యము పట్టుకొని నాచీ మెడలో కట్టు.

(కృష్ణపంతు ఆవిధంగా చేస్తాడు)

ఏలేశ్వరుడు : సుముహూర్తానికే వివాహం జరిగింది. కృష్ణపంతు : (లేచి తల్లి దండ్రులకు అత్తమామలకు నమస్కారం చేసి వచ్చి పెళ్లి పీటలమీద కూర్చొని కొంతసేపుండి)

అబ్బా! అబ్బా! బాధ! అమ్మా! (అని కేక వేస్తాడు)

(సభ నిశ్శబ్దం అవుతుంది)

కళ్యాణపంతు, భార్య : నాయనా! ఏమిరా ఇది! చెప్పు నాయనా (అని దీనంగా అడుగుతారు)

కృష్ణపంతు : (మాట్లాడడు - క్రిందకు ఒరగబోతాడు)

ఏలేశ్వరుడు, కల్యాణపంతు : (ఇద్దరు వచ్చి పట్టుకుంటారు. ఇద్దరి భార్యలు కాళ్ళ దగ్గిర నిలవ బడతారు ఏడుస్తూ)

రేవణ శర్మ : నిశ్శబ్దంగా వుండండమ్మా. ఏడ్వకండి. ఏమీ లేదు. ఆలస్యం అవటం వల్ల శోషపోయాడు. కొంచెం పాలిప్పించండి.

కృష్ణపంతు : (లోపలినుంచీ వచ్చిన పాలు త్రాగి తెప్పరిల్లి) కాలం సమీపించింది... మాతా పితృ గురు ఋణాలు తీర్చుకోలేక పోయాను. ఇంకో జన్మలోనైనా ప్రయత్నం చేస్తాను. ఈ జన్మకు నా తుది నమస్కారాలు ఇవిగో (అని నమస్కరిస్తాడు. కళ్ళు త్రిప్పుతూ) నాచీ!... నిన్ను... నిన్ను... అన్యాయం చేస్తున్నాను... కానీ ప్రేమించాను... జ్ఞాపకం ఉంచుకో... శివాజీవివిగా... ఉంటే సంతోషిస్తుంది... నా ఆత్మ.... అని ఏలేశ్వర కళ్యాణపంతుల చేతులల్లో కట్టెలాగా ఐపోతాడు... పెళ్ళి పందిట్లో గగ్గోలుగా ఏడ్పు... వినలేక ఏలేశ్వరుడు బయటికి వస్తాడు. బయట... పూర్వం భిక్షుకగీతం పాడినవాడు మళ్ళా.


జంగమయ్యా గురుడ!
జంగమయ్యా! శివ!
దేహధారణ నున్న
దివ్య లింగమయా!

పుణ్యము పాపము
పూచిన పూవుల
వాసన వదలదు
వదలదు జన్మల. ॥జంగమయా॥


ముఖమున వ్రాసిన
ముందుగతిగా మాన్ప
తరమౌనె శివునకు
తా వ్రాసి యున్నను ॥జంగమయా॥

నిజప్రజ్ఞపై మనసు
నీకేలరా జీవ!
నీ పప్పు లుడకవుర ॥జంగమయా॥


అనేగీతం పాడుకుంటా ఏడుస్తూ వున్న పెళ్ళి పందిట్లోకి వస్తాడు. ఏలేశ్వరుడు వాని తత్త్వానికి మనస్సులో నమస్క రిస్తాడు)

(తెర)

- నవ్య సాహిత్య పరిషత్తు, గుంటూరు

(ఎ.సి. కాలేజ్, గుంటూరు 1939)

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.