వావిలాల సోమయాజులు సాహిత్యం-2
వావిలాల సోమయాజులు
సాహిత్యం-2
నాటకాలు
ఎమెస్కో
NAATAKAALU
వావిలాల సోమయాజులు సాహిత్యం - 2
నాటకాలు
సంపాదకులు: డా. డి. చంద్రశేఖర రెడ్డి
ముద్రణ: మార్చి, 2018
మూల్యం: రూ.500/-
ISBN: 978-93-86763-67-9
ముఖచిత్రం: స్టార్ మీడియా సర్వీసెస్, హైదరాబాద్
టైటిల్ డిజైన్: జి. పురుషోత్ కుమార్
ప్రింటర్స్ : రైతునేస్తం ప్రెస్, హైదరాబాదు.
ప్రచురణ
ఎమెస్కో బుక్స్
1-2-7, బానూకాలనీ,
గగనమహల్ రోడ్, దోమలగూడ,
హైదరాబాద్ - 500029, తెలంగాణ.
e-mail : emescobooks@yahoo.com,
www.emescobooks.com
బ్రాంచ్ ఆఫీసు
ఎమెస్కో బుక్స్
33-22-2, చంద్రం బిల్డింగ్స్
సి.ఆర్. రోడ్, చుట్టుగుంట
విజయవాడ-520004, ఆంధ్రప్రదేశ్.
ఫోన్ : 0866-2436643
e-mail : emescovja@gmail.com ముందుమాట
శ్రీ వావిలాల సోమయాజులు (19. 1. 1918 - 9. 1.1 992) గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. తండ్రి సింగరావధానులుగారు, తల్లి మాణిక్యాంబ గారు. నరసరావుపేట, గుంటూరులో వారి విద్యాభ్యాసం జరిగింది. భార్య కైకమ్మగారు.
సోమయాజులుగారు 1940 - 46 మధ్య గుంటూరులోని శ్రీ శారదానికేతన ప్రాచ్య కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఆ తర్వాత 1976లో పదవీవిరమణ పొందేవరకు గుంటూరు హిందూ కళాశాలలో ఆంధ్రభాషోపన్యాసకులుగా పనిచేశారు.
సోమయాజులుగారి జీవితం పూర్తిగా సాహిత్య రచనకు, సాహిత్య ప్రచారానికే అంకితమై పోయింది. తనకు ఇరవయ్యేళ్లు నిండీ నిండకముందే సాహిత్య సంస్థలలో సభ్యుడిగా సాహిత్య సేవ ప్రారంభించారు. 1939 నుండి సాహితీ సమితి సభ్యులు. ఈ సమితికి సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా వ్యవహరించారు. నవ్యసాహిత్య పరిషత్తుకు సహాయ కార్యదర్శి. 'ప్రతిభ' పత్రికకు రచనలను ఎంపిక చేసే నిర్ణాయక సంఘంలో సభ్యుడు. 1963-73 మధ్య ఒక దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు.
సోమయాజులుగారు సంస్కృతాంధ్రాంగ్లాలలోను, హిందీలోను గొప్ప పండితులు. ఈ నాలుగు భాషల్లోనూ ఏ భాష నుండి మరే భాషలోనికయినా అనువాదం చేయగలిగిన సమర్థత కలిగినవారు. వచనాన్నే కాదు పద్యాన్ని పద్యరూపంలోనే అనువదించడంలో సిద్దహస్తులు. ఆయన సహజంగానే కవి కావడంవల్ల అనువాదంలోనూ మూలకావ్యం లోని కవిత్వాంశను సంపూర్ణంగా ప్రదర్శించగలిగిన కవితా హృదయాన్ని సొంతం చేసుకున్నారు. సోమయాజులుగారి సాహిత్య సృజనా జీవితం బహువిపులమైంది. ఇరవై ఏళ్ల వయస్సులోనే ప్రారంభమైన వారి సాహిత్య సేవ జీవితాంతం కొనసాగింది. ఇంత బహుళంగా రచనలు చేసిన వారి సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఇన్ని ప్రక్రియలలో రచనలు చేసినవారు మరీ అరుదు. ఆయన కవిత్వం రాశారు. అందులో పద్యరచనలూ ఉన్నాయి, గేయ రచనలూ ఉన్నాయి. అతిసాధారణ వచనాన్ని కూడా అటు పద్యంలోనూ, ఇటు గేయంలోనూ ఇమిడ్చి మనోహరంగా రచింపగలిగిన శక్తి వారిది. నాటకాలు రాశారు, నాటికలు రాశారు. పద్య నాటికలు రాశారు, గేయనాటికలు రాశారు, సంగీత రూపకాలు రచించారు. శ్రవ్య నాటికలు రాశారు. నవలలు రాశారు. ఆంగ్లం నుండి నాటకాలూ, నవలలూ అనువదించారు. వీటిలో షేక్స్పియర్ నాటకానువాదాలు తెలుగులో వావిలాల వారివే బహుజనాదరణ పొందాయి. హిందీ నుండి మహాకవి జయశంకర ప్రసాద్ కావ్యాలు 'కామాయని', 'ఆంసూ' లను అతిమధురంగా పద్యకావ్య రూపంలో అనువదించారు.
ప్రౌఢ కవి అయిఉండీ పిల్లలకోసం సరళవచనంలో నవలలూ, దేశనాయకుల, దేశభక్తుల, చారిత్రక వ్యక్తుల, కవుల జీవిత గాథలూ రచించారు.
ఆయన పద్యరచన ఎంత విపులమో గద్యరచనకూడా అంతే విపులం. కథలు, జీవితగాథలు, నాటకాలు, నవలలను పక్కన బెడితే ఆయన సృష్టించిన వ్యాస సాహిత్యం అపారం. పరిశోధనాత్మక వ్యాసాలెన్నో రచించిన సోమయాజులుగారు సృజనాత్మక వ్యాసాలూ విస్తృతంగా రాశారు. ఆయన ఎంపిక చేసుకున్న విషయాలే మనల్ని విస్మయ పరుస్తాయి. డజనుకు పైగా వ్యాసాలు వివాహం పైనే అంటే ఆయనకు ప్రజల సాంఘిక జీవనం మీద, ఆచార వ్యవహారాల మీద ఉన్న పట్టును, అవగాహనను మనం అర్థం చేసుకోవచ్చు, మూడుపదుల వయస్సులో ఆయన వాత్స్యాయన కామసూత్రాలపై సాతవాహన సంచికలో రాసిన బృహద్వ్యాసం నేటికీ పరిశోధన వ్యాసానికి ఉదాహరణ ప్రాయంగా నిలుస్తుంది. ఆయన ఏమి రాసినా అది ప్రామాణికమే. తాను చెప్పే ప్రతి విషయానికీ ఆయన ఆధారం చూపుతారు. సోమయాజులు గారి రచనలకు మరోపార్శ్వం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా భారతీయ దార్శనికతా ప్రియుడైన ఆయన బహాయీ సాహిత్యాన్ని అనువదించారు. క్రైస్తవ రచనలను అనువదించారు.
సోమయాజులుగారు ఇంగ్లీషులో కూడా కొన్ని వ్యాసాలు రచించారు.
సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్య బంధు, మధురకవి, కవి భూషణ, కుమార ధూర్జటి, పద్యవిద్యాధర వంటి అనేక బిరుదాలతో ఆంధ్ర సాహిత్యలోకం వావిలాల సోమయాజులు గారిని సమ్మానించింది. ఈ బిరుదులు ఆయన రచయితగా ఒకవైపు, సాహిత్య సేవకుడుగా మరోవైపు చేసిన కృషికి అద్దం పడతాయి.
ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులుగారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితాముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ సంపుటులలో ఇది రెండవది.
నాటకం సమాహారకళ. సాహిత్యం, సంగీతం, నృత్యం ఈ మూడింటి సమ్మేళనమిది. వాస్తవానికి ఈ దృశ్యకావ్య ప్రక్రియకు శిల్ప చిత్రకళలతోనూ సంబంధం ఉంది. ఆ విధంగా లలితకళా సమాహారం అది. అందువల్లే ‘కావ్యషు నాటకం రమ్యం' అనే సూక్తి ఏర్పడింది. శ్రవ్యకావ్యరచన కంటే దృశ్యకావ్య రచనకు కావలసిన సామర్థ్యాలెక్కువ. సోమయాజులుగారు చేయి తిరిగిన నాటక కర్త. విశ్వవిఖ్యాత నాటక కర్త షేక్స్పియర్ నాటకాలను అనువదించడమేకాకు స్వయంగా అనేక నాటక రచనలు చేశారు. వీటిలో మూడు వసంతసేన, నాయకురాలు, డాక్టరు చైతన్యం బృహన్నాటికలు. ఆయన దృశ్యాలుగా విభజించుకొని చేసిన ఈ రూపకాలను నాటికా విభాగంలోకి చేర్చవచ్చు. 'వసంతసేన' మూలం భాసుడి దరిద్ర చారుదత్తం, శూద్రకుడి మృచ్ఛకటికం. 'నాయకురాలు’ చారిత్రక నాటిక. 'డాక్టరు చైతన్యం' సాంఘిక నాటిక. చారిత్రిక, సాంఘికేతి వృత్తాలు రెండూ సోమయాజులు గారికిష్టమైనవే. దేశభక్తి వంటి విలువలను, నైతిక సందేశాలను అందిస్తాయి వీరి నాటికలు. ఈ సంపుటంలో ఈ మూడు పెద్దనాటికలతో పాటు మరో పదమూడు చిన్న నాటికలు చోటుచేసుకున్నాయి.
ఈ సంపుటంలోనే సోమయాజులుగారి ఎనిమిది గేయ నాటికలు కూడా ఉన్నాయి. గేయాన్ని దృశ్యరూపక ప్రక్రియకు ఆయన చక్కగా మలిచారు.
జయదేవ మహాకవి రచించిన 'పీయూషలహరి' గోష్ఠీ రూపకాన్ని సోమయాజులు గారు అనువదించారు. భావ, శబ్ద సౌందర్య సంపన్నమైన జయదేవుని రచన సామాన్యకవులకు లొంగేది కాదు. సోమయాజులు గారు మూల కావ్య సౌందర్యాన్ని అనువాదంలోనూ నిక్షేపిస్తూ తమ కవితా ప్రతిభను చాటుకున్నారు. మూలంతో పోల్చుకోవడానికీ, అనువాదంతో పాటు మూలాన్నీ ఆస్వాదించడానికీ మూలకృతిని కూడా దీనితో పొందుపరచడం వారి సహృదయానికి నిదర్శనం.
డి. చంద్రశేఖర రెడ్డి
విషయసూచిక
9 |
101 |
213 |
303 |
511 |
563 |
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.