వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/చివరి రోజులు

చివరి రోజులు


ఔరంగజేబు: ఈ రోజు ఉదయం నుండీ కిటికీలోంచి మసీదువైపు చూస్తున్నాను. చంద్రరేఖ ఏదో పెనుగాలికి కంపించినట్లు ఊరికే ఊగిపోతూ కనిపిస్తున్నది. అఖండ హిందూస్థాన్‌ను సాధించి, ఆ తరువాత దాన్ని దార్ ఉల్ - అస్లాంగా తీర్చిదిద్దుదా మనుకున్నా. నా దివ్యాదర్శనానికి అల్లా అంగీకారం ఉన్నట్లు కనిపించడం లేదు. ఇబ్రహీం! సున్నీరాజ్యాలను, బీజాపూర్, గోల్కొండలను సర్వనాశనం చెయ్యటంతో సాలీనా పదకొండు కోట్ల రూపాయిలు ఖజానా హెచ్చింది. కానీ నా ప్రశాంతి చచ్చింది.

ఇబ్ర: కాసేపు విశ్రమించండి. ఖుదావంద్ ఇంతలో అజ్జం బహదూర్ వస్తాడు. అన్నీ ఆలోచించుకోవచ్చు...

ఔరంగ: ఎలా విశ్రమించను? మొగలాయీ సామ్రాజ్యం నా కళ్ళ ఎదుటనే ఛిన్నా భిన్నమయ్యేట్లు కనిపిస్తున్నది.

(సైన్య ఘోషలు దగ్గరకు వస్తున్నట్లు వినిపిస్తుంది)

ఇబ్రహీం: అదుగో సైన్యాలతో అజ్జం, షహజాదా ఖుదావంద్! తమను చూచి పోవటానికి వస్తున్నట్లున్నాడు.

ఔరంగ: చూచిపోవటానికో చుట్టుముట్టటానికో... వీడు ద్రోహో దొరో ఇంతవరకూ అర్థం కాలేదు. అక్బర్ తిరుగుబాటు చేసి అలా అడవులపాలై పోయినాడు. అజ్జం షూజాతో కలిసి సువ్వరైపోయినాడు. కాంబక్ష్ కందినీలతో కాలక్షేపం చేస్తున్నాడు. దేశం అజ్జం కాంబక్ష్‌లకు పంచియిస్తే ఇంతటితోనైనా అంతఃకలహం మానేస్తారేమోనని ఆశ...

ఇబ్ర: ఆయీయే జనాబ్. అజ్జం బహదూర్, ముబారక్ ముబారక్...

అజ్జం: ముబారక్ ఖుదావంద్. ముబారక్ జహాపనా. ముబారక్ అబ్బాజాన్...

ఔరంగ: అబ్బాజాన్ అజ్జం అల్‌బేనాఁ ఆవ్... ఈ పక్కమీద కూర్చో నీ గొంతెంత మీఠాగాఉంది బేటా... నా తబాయత్ - ఆరోగ్యము - ఏమీ బాగాలేదు. శరీరం ఎలా శుష్కించిపోయిందో చూడు... ఏదీ నీ చల్లని చేత్తో ఈ గుండెను ఒక్కమారు స్పృశించు... అచ్ఛా...

(సంతోషాన్ని నటిస్తూ -హాయ్ఁ హాయ్... అల్లా హాఫీజ్)

అజ్జల: లడాయి ఆపించి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అబ్బాజాన్.

ఔరంగ: ఔను... బేటాఁ నీ హృదయం నాకు తెలుసు. ఇవాళోరేపో వస్తావని ఇప్పుడే ఇబ్రహీంతో అంటున్నాను. ఎంత శ్రమపడి వచ్చావు. అలిసిపోయినావు. శ్రమ తీర్చుకో కాంబక్ష్ నీకు ఎదురు వచ్చాడా... రాలేదూ... వద్దన్నానులే.

అజ్జం: రానివ్వకపోయినారా అబ్బాజాన్ కలిసి వచ్చేవాళ్ళము.

ఔరంగ: కాస్త తొందరపాటువాడని భయపడ్డాను. ఏమైతేనేం మీరిద్దరూ అన్నదమ్ములు. ఈ విశాల సామ్రాజ్యం మీ ఇద్దరిదీ. ఈ ప్రమాద స్థితిలో మీ ఇద్దరు అన్నదమ్ములూ ఏకం కాకపోతే మొగలాయీలకు దేశంలో నిలవనీడ ఉండదు.

అజ్జం: (అనుమానిస్తూనే) జీహాఁ అబ్బాజాన్.

ఔరంగ: కాంబక్ష్‌తో మాట్లాడాను. మీ అంతఃకలహాలు నాకు నచ్చటం లేదు. కావలసినంత ఫౌజు ఉంది, ఖజానా ఉంది, నమ్మక్ హరాములు కాని సమర్థులైన సరదారులు, మున్సబ్‌దారులు ఉన్నారు. అలంఘీరులు కండి! మీ కోసం కాకపోతే ఢిల్లీ దర్వాజా దాటి ఇంత వృద్ధాప్యంలో ఈ వ్యాధితో ఈ తంటాలు పడవలసిన స్థితి నాకేముంది. అవసరమైతే అన్నదమ్ములు పాలుపంచుకొని ఒకరు ఢిల్లీనుంచీ మరొకరు ధియోగర్ నుంచీ పాలించండి.

అజ్జం: (అదిరిపడ్డట్టు) ఏమిటి అబ్బాజాన్?

ఔరంగ: కాంబక్ష్‌తో మాట్లాడు.

అజ్జం: మాట్లాడే వచ్చాను అబ్బాజాన్.

ఔరంగ: అయితే నా అభిప్రాయం అతడు నీకు చెప్పాడన్నమాట.

అజ్జం: (ఆలోచనా పూర్వకంగా) ఔను!

ఔరంగ: ఆ ఖురాన్‌మీద నీ కైజారు ఉంచు... ఆలోచించకు... అచ్ఛా దేవాఁ బోత్.... ఉఁ కాంబక్ష్ మేరా భాయీ... దార్ ఉల్ ఇస్లాం... మేరా ఇరాదా... అజ్జం: (తండ్రి చెప్పిన మాటలను ఒక్కొక్కదానిని వెంటనే పాఠం చెప్పుకుంటున్నట్లు) అంటాడు. అందులో ఆత్మశుద్ధి అంతగా కనిపించదు. ఖురాను నుంచి ఔరంగజేబు క్రిందిరీతిగా పఠిస్తాడు.

ఔరంగ: హాయ్ అల్లా..

రంగం - 2

(రెండు సైన్యాలు యుద్ధం చేస్తూన్న కోలాహలం)

ఔరంగ: (విసుగు మీద కల్గిన కోపంతో) గులాం రే గులాం... ఎవ్వరూ లేరు. ఆరె అల్లా అరె అల్లా ఔరంగజేబ్. ఢిల్లీ పాదుషా. అలంఘీర్ దేఖో నీ దుస్థితి ఎలా వచ్చిందో చూడు... హఁ హఁ హఁ (పెద్ద గొంతుతో) గులాం... ఏమిటి... సితార్ కీ ఆవాజ్ సంగీతము ముప్ఫై నాలుగేళ్ళనుంచీ నా చెవిన బడలేదు. సంగీతం వినరాదని శాసించాను.

జెహరా: ముబారక్, ఖుదావంద్ ముబారక్ సంగీతం వినిపించాను క్షమించండి అబ్బాజాన్...

ఔరంగ: నీవెవరు?

జెహరా: జెహరా... మీకు ఉపచారం చెయ్యమని షాజాదా పంపించారు.

ఔరంగ: ఎవరు? అజ్జం.

జెహరా: ఉఁ...

ఔరంగ: సిగ్గుపడతావేం... కాంబక్ష... అతనికీ నీకూ ఏమి సంబంధం?

జెహరా: ఇదిగో ఈ ఉత్తరం చిత్తగించండి జహాపనా...

ఔరంగ: "అబ్బాజాన్ మీరు నాతో చెప్పిన విషయాలను అన్నతో మాట్లాడాను. అందుకు అంగీకరించినట్లు లేదు. మిమ్మల్నీ నన్నూ ఖైదీలను చేసే సూచనలు కనబడడం వల్ల అతనితో లడాయికి దిగుతున్నాను. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అందుకు ప్రయత్నించకండి. మీ సేవకోసం నా ప్రియను, జెహరాను పంపిస్తున్నాను... షాజాదా కాంబక్ష్... "హాయ్ ఖుదా హాయ్ ఖుదా...” జెహరా: ఎందుకలా బాధపడతారు, జహాపనా. ఈ పూలను చూడండి. ఇది అనార్, అంతా ప్రేమ మయం. నా వలెనే బయటపడిపోతుంది. ఇది అన్వర్ కంటే ప్రేమను గుప్తంగా దాచిపెడుతుంది. ఇది రోజా - దీనికి రెండు లక్షణాలూ ఉన్నవి. ఒక్కమాటు దీన్నీ వాసనను చూడండి. మీ బాధ పటాపంచలైపోతుంది.

(సైన్య కోలాహలం భయంకరంగా తారసిల్లుతున్నట్లు వినిపిస్తుంది)

ఔరంగ: జెహరా చేయి పట్టుకొని ఒక మారు నన్ను విటంకం దగ్గరకు దీసుకుపో. వీలైతే వాళ్ళ యుద్ధం ఆపుతాను.

జెహరా: అయితే మీ ప్రియపుత్రుడు కాదిబక్ష్ పాదుషా కావటం మీకు ఇష్టం లేదూ?

ఔరంగ: హాయ్ పర్వర్థిగార్... హాయ్ పర్వర్థిగార్...

జెహరా: సంగీతం, పూలూ తప్ప ప్రపంచంలో మీ బాధను పోగొట్టేదేమీ లేవు జహాపనా... రంగులతో, వాసనలతో, చూపులతో, నవ్వుతో, పూలు ఎన్ని రహస్యాలు చెపుతాయని? ఖుదావంద్. పూలంటే ఇష్టంలేనివాళ్ళకు ప్రేమ హృదయం లేదన్నాడు - మామీకవి.

ఔరంగ: (సంభాషణ ఆపమన్నట్లుగా) జెహరా నీవు వెళ్ళిపో... నన్ను ఏకాంతంగా ఉండనీ...

జెహరా: ఎందుకు సర్కార్ ఏమేమో ఆలోచించి బాధపడటానికా? సితార మోగిస్తూ చిన్న పాట పాడుతాను


చేతి చెఱను పడినానని
చింతపడకె ఓ పూవా
ప్రియుడెవరో పలుకుము నే
పిలని యతని విడియెదనీ... చింతపడకె...

జాలువార నాడకెద విడి
జడులమనుచు కన్నీరా?
వలపుతీర త్రావుకై
వరుని కొఱకు కన్నీరా? చింతపడకె...


ఔరంగ: (సకరుణంగా) జెహరా... ఇక ఆపు. ఈ పాట నా పూర్వ చరిత్రను స్మృతికి తెస్తున్నది. అయ్యో నేనెంత దుష్టుణ్ణి. ద్రోహిని? తంత్రజ్ఞుణ్ణి, హంతకుణ్ణి, మతోద్రేకిని, మతోన్మాదిని. అన్నలను, తమ్ముళ్ళను, అక్కచెల్లెళ్ళను, తండ్రినీ నా పొట్టన పెట్టుకున్నాను. ఖుదావంద్ షహన్ షా షాజహాన్... అబ్బాజాన్ నీవు చాలా గొప్పవాడివి... భాయీ దారా నీ వెంటపడి వేటకుక్కలా తరిమాను...

(ఫ్లాష్‌బాక్) షాజహాన్ అస్వస్థతతో ఆయాసంతో మాట్లాడుతాడు. జెహనారా దీనంగా ఓదార్పు మాటలు పలుకుతుంది

షాజహాన్: జెహనారా దారా సంగతులేమైనా తెలిసినవా?

జెహ: లేదు అబ్బాజాన్... అతణ్ణి గురించి అట్టే ఆలోచిస్తూ ఉండకండి, ఆయాసం ఎక్కువౌతుంది.

షాజహాన్: (ఆయాసంతో) బేటా దారా ఎంత పొరబడ్డావు... నా మాట విన్నావుకావు. సముర్థర్ సమరాంగణానికి నన్ను వెళ్ళనిచ్చావు కావు. సులేమాన్ వచ్చేదాకా సుస్తి చెయ్యమంటే సైన్యాలల్లో నీతిపోతుందని భయం పడ్డావు... నిన్ను నరరూపరాక్షసి ఏ నట్టడవుల్లో వెన్నాడుతున్నాడో... ఎంత దుస్థితి చేతులారా తెచ్చుకున్నావు. మాకు తెచ్చిపెట్టావు... హాయిఖుదా... హాయిఖుదా.

జహ: అబ్బాజాన్ అట్టే మాటాడకండి దాహం వేస్తుంది. మంచినీటి కూజా ఇంకా రాలేదు.

షాజహాన్: మన ఇద్దరికీ రెండు రోజులకు ఒక చిన్న కూజా మంచినీళ్ళా... మన మేం అపచారం చేశామని? ఖైదీని చేసి కష్టపెడుతున్నాడు? కత్తిని కానుకగా పంపించి అలంఘీరువు కమ్మని ఆశీర్వదించాను... జెహన్ వెర్రితల్లి రోషనారాలా నీవు వీడికి లొంగిపోయి సుఖపడమ్మా. అల్లా కరుణ వచ్చేదాకా ఇలాగే అలమటించి చనిపోతాను.

జెహనారా: (దుఃఖిస్తూ) అబ్బాజాన్ అలా ఆజ్ఞాపించకండి. నేను బులి బుచ్చి కాలాడలేను. ఆ నరకంలోనికి వెళ్ళమని నాతో చెప్పకండి అబ్బాజాన్. అల్లా కృపవల్ల అన్న దారా విజయంతో తిరిగి వస్తాడు.

షాజహాన్: విజయం. అల్లా కృప. అల్లా ఉంటే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే చూచి ఊరకుంటాడా జెహన్ మన కూజా ఇంకా రాలేదు.

ఔరంగ: (వికటంగా నవ్వుతూ వ్యంగ్యగర్భితంగా మాట్లాడుతాడు) హఁ హఁ హఁ అల్లాలేడూ? అల్లా లేనివాళ్ళకు కూడా ఎందుకు ఇదుగో వెంటబడి పట్టించుకోవచ్చాను. ఇబ్రహీం దాన్ని నేలమీద బ్రద్దలు కొట్టివేయ్. (చప్పుడు) హఁ హఁ హఁ హఁ షాజహాన్ ఢిల్లీ కా పాదుషా. షాహన్‌షా, ఖుదావంద్ ముబారక్ ముబారక్... జెహన్... రోషనారాకీ బహిన్... కాఫిన్ దారా ఖైదీ అయిపోయినాడు. కాపిర్లతో స్నేహం చేసిన వీడికి కళ్ళు పీకించ పోతున్నా.. (జహనారా భయంతో కేక పెడుతుంది). షాజహాన్... అల్లా హపీజ్ కాదు కాదు శిరచ్ఛేదన శిక్ష విధించాను. మరిచిపోతాను. జహనారా...

షాజహాన్: బేటా ఔరంగజేబు ఢిల్లీ పాదుషాలైనందుకు నిన్నొక చిన్న కోరిక కోరుతున్నాను. ఆ విషాద వార్త వినలేను నన్ను నీ కైజారుతో పొడిచి చంపెయ్.

ఔరంగ: జీ నహీఁ పాదుషా దారాకా అబ్బాజాన్ తాము తమ కుమారుణ్ణి ఢిల్లీ ప్రజలు ఎలా స్వాగతమిస్తున్నారో చూచి సంతోషించకుండానే మరణిస్తారా? నేను ఒప్పుకోను. అల్లా అంగీకరించడు (దూరం నుంచీ దారాను ఎగతాళి చేస్తూ వస్తూ ఉన్న జనసమూహం కోలాహలం) సుల్తానా బెహన్ అదుగో నీ భాయీ దారా అఖండ స్వాగతంతో వస్తున్నాడు. ఇబ్రహీం పాదుషావారిని విటంకం దగ్గిరకు నడిపించుకురా...

ఇబ్రహీం: రండి సర్కార్... (దారాను ఎగతాళి చేస్తూ ఉన్న కోలాహలం దగ్గరికి వచ్చేస్తుంది)

ఔరంగ: హఁ హఁ హఁ చాలా కాఫిర్ దారా, మేరా దుష్మన్ ఇస్లాంకా దుష్మన్.

షాజహాన్: బేటా ఔరంగజేబ్ ఇది అక్రమం అన్యాయం, మొగలాయీ వంశానికి తీరని కళంకం... నీవు చేస్తున్న ఈ పాపానికి నిన్నెప్పుడూ అల్లా క్షమించడు.

ఔరంగ: హఁ హఁ హఁ రాజ్యాన్ని ఈ కాఫిర్‌కు కట్టబెట్టదలచిన మిమ్మల్ని క్షమిస్తాను. రే ఇబ్రహీం నీవు త్వరగా వెళ్ళు. దారా శిరస్సును ఖండించి బాలుడు గోరీ దగ్గిరకు చేర్చమని చెప్పు... ఇదుగో ఈ గుర్తు చూపించు... (జహనారా ఏడ్పు వినిపిస్తుంది. షాజహాన్ హఫీజ్ అల్లా అంటాడు.

ఇబ్రహీం ఉండు వెళ్ళకు. అతని శిరచ్ఛేదనా నేను సింహాసనం ఎక్కటం ఒక్కమారు జరగాలి... సమస్త ప్రయత్నాలూ సాగించమని వజీరుతో చెప్పు... ఉఁ...

ఇబ్ర: జీ మాలిక్. అబ్బాజాన్ షాజహాన్ నీ పుత్రులందరిలో మిగిలినవాణ్ణి నేనే. ఢిల్లీ సింహాసనమెక్కుతున్నాను... దీవించండి.

షాజ: హఁ హఁ హఁ పాగల్ బేటా ఔరంగజేబ్ మతాన్ని వృద్ధి చేయటానికి... ఇది మార్గం కాదు. రక్తంతో తడిసి ఎక్కుతూ ఉన్న ఈ సింహాసనం నీ రక్తాన్ని బలి కోరుతుంది. నీ ఆశయం సిద్ధించకపోగా ఆత్మశాంతిని పోగొడుతుంది. నేను అనుభవిస్తూ

వున్న ఇటువంటి ఘట్టమే తిరిగి నీ జీవితచరిత్రలో సంభవిస్తుంది.

(ప్రస్తుతం)

ఔరంగ: (ఏడుస్తూ) అబ్బాజాన్ అనే మాటలన్నీ ఇప్పుడర్థమైనవి. ద్రోహిని, దుష్టుణ్ణి, మూర్ఖుణ్ణి క్షమించండి. ఏ లోకాల్లో ఉన్నారో క్షమించండి. బహిన్ జెహనారా బలి బుచ్చకాల, రోషనారా మాటలు విని నిన్నూ బాధపెట్టాను. రక్తసంబంధమైనా ఎరగని రాక్షసుణ్ణి. (ఎక్కిళ్ళుపెడుతూ ఏడుస్తాడు) ఇన్ని హత్యలకు కారకుడైన ఈ హంతకుణ్ణి అల్లా నన్నెలా క్షమిస్తావు? క్షమిస్తే నీమీద ఏం నమ్మకం ఉంటుంది? అబ్బా నాది ఎంత రాతిగుండె... ఎన్ని దారుణ హత్యలు చేశాను. చేయించాను. (మళ్ళీ ఏడుస్తాడు).

జెహరా: పితాజీ నీకు ఏడ్వడం చేతగాదు.

ఔరంగ: (కొంచెం ఆర్ద్రంగా) ఎందువల్ల బేటా...

జెహరా: జనానికి నవ్వటం తెలుసు. నవ్వగలవాళ్ళు ఏడ్వగలరు... నీకు నవ్వటం చేతగాదు, అందువల్ల సరిగా ఏడవలేవు. అందుకని నిన్ను అందరూ జిందాపీర్ అంటారు. నవ్వాలంటే పూలువాసన చూడాలి. మంచి మధురమైన సంగీతం వినాలి. మీకు పూలంటే గిట్టదు, నేను సంగీతం పాడుతుంటే విని సహించలేరు., కోపపడతారు. నేను మీ దగ్గర ఉండలేను. అబ్బాజాన్ ఎక్కడికైనా వెళ్ళిపోతాను.

ఔరంగ: (ఆర్ద్రంగా) బేటా వెళ్ళిపోకు... ఇప్పుడు నేను నవ్వగలను. ఏడ్వగలను. నీవు వెళ్ళిపోతే నేను బ్రతుకలేను. వృద్ధుడైన ఈ అబ్బాజాన్ మీద నీకు కనికరం లేదూ? ఏదీ ఒక మంచి పాట పాడు... ఆ రోజా ఇలా తే బేటా... (వాసన చూచిన ధ్వని) అబ్బ జెహరా... ఎంత కమ్మని వాసన... కానీ నా పాట కానీ...

జెహరా: నరహంతల హృదయాలను


సురభిళమ్ము లొనరించే
సుమజగమ్ము కనవోయీ
అమలగీతి వినవోయీ ...
పంకిలమున జనియించిన
పద్మాలను కనవోయీ
పాపములను కొన్న జగతి
భవ్యుడవై మనవోయీ


ఔరంగ: బహుత్ ఖూబ్... బహుత్ ఆరామ్ ఆరామ్ హి ఆరామ్ హై...

ఎ.ఐ.ఆర్. విజయవాడ 15-7-1952

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.