వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/చంద్రవదన
చంద్రవదన
లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణమహోత్సవ కోలాహలము. ఆలయ ఘంటికలు,
వాద్యాలు, వైవాహిక చిత్రాలు కలగలుపుగా వినిపిస్తూ ఉంటవి. “ఒసేవ్! సుబ్బక్క!
ముహూర్తాలు పెట్టుకున్నాము. - అడుగో ఆ లావుపాటి ఆయన ప్రక్కన కూర్చున్నాడే
అతడే మా అల్లుడు”, “ఏమే లక్ష్మమ్మ కోడల్ని ఇంట్లోనుంచి వెళ్ళగొట్టిందట. ఇదేం
పొయ్యేకాలమే”, “ఇక్కడ కూడా ఇంటి సారేనట్రా" "ఇస్, అబ్బ, కళ్యాణం చూడడానికి
వచ్చారా - కబుర్లు చెప్పుకోవటానికి వచ్చారా” - పసిపిల్ల ఏడుపు “ఎందుకమ్మా
పిల్లవాణ్ణి అలా ఏడిపిస్తావు, వాడికి కాసిని పాలిచ్చి సముదాయించరాదూ”, “అయ్యా,
ఆచార్లగారూ... ఒక విసనకర్ర ఇలా అందుకోండి" "అబ్బాయీ! పానకం తాగారా”
"శ్రీ లక్ష్మీనృసింహ చరణం శరణం ప్రపద్యే” “ఇవిగో తలంబ్రాలు వచ్చేశాయి. కట్నాలతో
నాయుడుగారి కుమార్తె చంద్రవదన వచ్చింది” “ఓయ్ భజంత్రీలూ! మేళాలు కానివ్వండి"
- మేళాలు కొంత సాగిన తర్వాత
సూర్యారావునాయుడు : నింపాదిగా - మోహియార్! మా చంద్రవదన ఎలా వుంది?
మోహి : ఇన్నాళ్ళనుంచి నీవు ఈమెను గురించి చెప్పినదంతా కవిత్వమనుకున్నాను, సూర్యం. అబ్బ, ఎంత చక్కని చుక్క, ఏ పుణ్యాత్ముడికో నిత్యం అమృతాన్ని అందించడానికి స్వర్గంలోనుంచి దిగివచ్చిన అప్సరసలా ఉంది.
సూర్య : ఆమెను గురించి బహిరంగంగా ప్రశంసించడం బహుప్రమాదం. మనచుట్టూ ఉన్న యువతలోకం అణుమాత్రం సహించదు. అందులో ఆమె మేనత్త కుమారుడు మాధవనాయుడు మహ దొడ్డవాడు.
మోహి : సూర్యం, మా పర్షియాలో బయలుదేరింది నా హృదయానికి నచ్చిన వైచిత్ర్యం తాజ్మహల్. కాని ఆ సౌందర్యం యీమె అందం ముందు యెందుకూ కొరగాదు.
సూర్య : బిగ్గరగా మాట్లాడకు. మారువేషంలో ఉన్నావని మరిచిపోకు. కన్నుతో చూచి మనస్సులో ఆనందించు. మోహి : సూర్యం, మహోజ్వల కాలసర్పంలా మనస్సులు దోచుకుంటూ ఉన్న ఆ జడలో మల్లెపూదండ చంద్రవంక వలె ఈ కళ్యాణమండపంలో చిరువన్నెలను చిలకరించటం లేదూ?
సూర్య : నింపాదిగా మాట్లాడమంటే ఏమిటా ఉత్సాహం. నమ్మి, నిన్ను యిక్కడికి తీసుకురావటం నాదే తప్పు. నీవు ముసల్మానువని మరిచిపోయి నట్లున్నావు.
మోహి: అయితే మాకు అందాన్ని చూచి ఆనందించే అధికారం లేదంటావా? నేను సుందరమైన ఏ వస్తువును చూచినా ఎందుకో చలించిపోతాను.
సూర్య: నీకు అధికారం వుంది. నీవు ఇంతకంటె వేయిరెట్లు చలించిపో. కానీ ఇది స్థలమూ కాదు, సమయం అంతకంటే కాదు.
మోహి: సౌందర్యోపాసనకు స్థలమూ, సమయమూ యేమిటోయ్ సూర్యం?
సూర్య: అన్యమతస్థులకు ఈ ఆలయంలో ప్రవేశించటానికి హక్కులేదు. అలా ప్రవేశించిన వాళ్ళను శిక్షించడానికి ధర్మకర్తలకు నవాబులు అన్ని హక్కులూ ఇచ్చారు. అయినా ఇది కళ్యాణ సమయం.
మోహి: సూర్యం, నన్ను వృధాగా భయపెట్టకు. ఆ జగదేకసుందరి ఒక్కమాటు సంపూర్ణంగా తన ముఖచంద్రుణ్ణి యీ వంకకు త్రిప్పితే ఆనందామృతపానం చేసి నాయీ కన్నులు ధన్యమౌతాయి.
సూర్య: ఒరే అబ్బీ! ఇవాళ నీవేదో వెర్రి పని చేస్తావు. మర్యాదగా మనం ఇంటికి వెళ్ళుతామని నాకు నమ్మకం కలగడం లేదు.
మోహి: నీవేమీ భయపడకు. సభ్యత తెలియకుండా ప్రవర్తిస్తానని అనుకోకు.
సూర్య: అయితే నామాట విను. ఆమె మీదే కళ్ళు గుచ్చి చూడకు. అంతా గమనిస్తారు.
మోహి: ఈ ఆవరణలో నాకు ఆమె తప్ప మరెవ్వరూ కనిపించటంలేదు. ఆమె చుట్టూ ఉన్నదంతా ఆమె సౌందర్య కాంతి.
సూర్య: ఊఁ లే. ఇక్కడ ఇక నీవు క్షణకాలం ఉండతగవు లే.
మోహి: సూర్యం నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. త్వరపెట్టకు. అదిగో ఆమె ఇటువైపే చూస్తున్నది. ముఖం చంద్రబింబమా? కాదు, దానికి చలవేగాని మాధుర్యమెక్కడుంది? నీలి నీలాంబరాల మిలమిలలతో ఆ నేత్రాలు రెండూ రెండు మధుకలశాలు. సూర్యం నీ గుండె తియ్యబడడం లేదూ...?
సూర్య: (కఠినంగా) మోహియార్, అలా వెర్రిగా చూడకు. ప్రక్కవారు యేమనుకుంటారు. నాకు భయమేస్తున్నది.
మోహి: అలాగా. నాకేమీ భయంలేదు. సూర్యం, ఆమె నన్నే చూస్తున్నది. కన్నులతో పలకరిస్తున్నది. మందహాసంతో నన్ను గౌరవిస్తున్నది. నేనూ నేత్రాలతో పలకరిస్తాను. మందహాసంతో గౌరవిస్తాను.
సూర్య: మోహియార్! తొందరపడు లే. నీవు బయలపడిపోయినావు. అడుగో ధర్మకర్త నీమీదనే దృష్టి నిల్పి యిటే వస్తున్నాడు. లే వెళ్ళిపోదాం.
మోహి: నాకేం భయంలేదు. సూర్యం అదుగో చంద్రవదన రోజా పుష్పాన్ని హృదయానికి హత్తుకొని వాసనలూది స్వీకరించనున్నట్లు అందిస్తున్నది. అందుకుంటున్నట్లు శిరస్సు వంచి సంజ్ఞ చేస్తాను.
సూర్య: నీకు మతిపోయింది. నీ ఖర్మం - నే వెళ్ళిపోతున్నా.
మోహి: (దీనంగా) వెళ్ళిపోకు సూర్యం. నేను శిరస్సు వంచి గుర్తు చేసిన తరువాత ఆమె కంటివెంట వచ్చిన ఆ ఆనందబాష్పాలు గమనించు.
సూర్య: గ్రంథం కొంత సాగించావుగా. ఇకలే. లేకపోతే నేనిక ఆగను. వెళ్ళిపోతాను.
మోహి: మరొకమాట. ఆమె దర్శనం చేయిస్తానని వాగ్దానం చెయ్యి. బయలుదేరి వస్తాను.
సూర్య: అలాగే తప్పకుండా.
మోహి: సూర్యం ఆమె జాలికన్నులతో నావైపే యెలా చూస్తున్నదో చూడు. నీవు దయలేనివాడివి... పద.
సూర్య: నీవు వట్టి వెర్రివాడివి. ఆమె ఇంతకుపూర్వం యెంతోమంది యువకులను యిలాగే చూచింది. ఎంతోమంది మోసపోయి పండువంటి బ్రతుకులను భంగం చేసుకున్నారు.
-సీతమ్మ పెళ్ళికూతురాయెనే, రామయ్య పెండ్లి
కొడుకాయెనే అన్న వాక్యం వినిపిస్తూటుంది.
రెండవ రంగము
(చంద్రవదన క్రింది పాట పాడుకుంటూ ఉంటుంది)
నవ వసంత మధుపా!
అధిపా, హృదయాధిప!!
ఎలదోటకు రాణి యిది
లేబ్రాయపు సుమకన్నియ
కృప వీడిన నావై నీ
కృప కల్గునో లేదో, ఓ... నవ వసంత...
ఎద తీవియ కదలించిన
పదమల్లెను విననొల్లనా
యుగ యుగాల కిది నీదే
వగపో మది వలపో... నవ వసంత...
మాలతి: మదన మహాసామ్రాజ్యానికి పట్టమహిషివైపోయినట్లు అప్పుడే యేమిటమ్మా
యిలా పట్టరాని ఆనందం...
చంద్ర: (అమితానందంతో) మాలతీ! అప్పుడే వచ్చేశావు. వెళ్ళినపని ఏమైంది? కాయా పండా... ?
మాలతి: కాయా కాదు - పండూ కాదు. పండుకాయ.
చంద్ర: అంటే...
మాలతి: ఆయనగారిని దగ్గరికి పోయి నా రెండు కళ్ళూ పెట్టుకొని చూతునుగదా వట్టి కుబేరుడు... ఒళ్ళంతా గట్టి.
చంద్ర: (కోపంతో) మాలతీ! పరిహాసాలు కట్టిపెట్టు.
మాలతి: అయితే సత్యమే చెపుతాను. ఇన్నివిధాల పేరుమోసిన రాజకుమారుల నందరినీ కాలదన్ని అమ్మా మహ అందగాడని ఓ వినాయకుడికి నీ హృదయమిచ్చుకున్నావు.
చంద్ర: అయితే అందమంటే యేమిటో నీకు తెలియదు. అంతటి అందగాణ్ణి నా జీవితంలో చూడలేదు. మాలతి: అంతటి అనాకారివాణ్ణి నేనూ చూడలేదు. పోనీ అందమేమి కొరుక్కుతినేదా అని మాట్లాడించి చూస్తే అయ్యగారు వట్టి వెర్రిబాగులవాడు.
చంద్ర: నీవడిగిన కొంటె ప్రశ్నలకు సమాధానం చెప్పలేదేమో. తెలివిగలవాళ్ళందరూ నీబోటి వాచాలురతో అలాగే ప్రవర్తిస్తారు.
మాలతి: పోనీ వట్టి వాజమ్మలుగాని అధిక ప్రసంగం చెయ్యరని అనుకుందామంటే, చంద్రవదన అని నీ పేరు చెబితే వినీ విననట్లు ప్రవర్తిస్తే...
చంద్ర: నీవు అబద్దం చెపుతున్నావు. నీ అభిప్రాయమేమిటి?
మాలతి: ఏమీలేదు. అందచందాలూ ఆటపాటల్లో అన్నిట్లో నీకు తగ్గ వరుడు మన మాధవనాయుడు గారేనని నా అభిప్రాయం.
చంద్ర: మాలతీ, మరొక మాటు అతని పేరెత్తితే నేను సహించను.
మాలతి: నిద్రలో కూడా నీ పేరే స్మరిస్తుంటాడు గనక అతణ్ణి పెళ్ళాడితే సుఖిస్తావనీ, నీవు సుఖిస్తే చూసి ఆనందిద్దామని చెప్పాను గాని నాకెందుకు వచ్చింది. ఇంతకూ 'తామునిగినది గంగ'
చంద్ర: పోనీలే. ఇంతకూ వారెవరో కనుక్కున్నావా?
మాలతి: మీ పేరేమని ప్రశ్నించాను. అది నీకు చెప్పేది కాదు. నేనూ ఒక రాజవంశంలో జన్మించానని చెప్పాడు.
చంద్ర: రాజవంశంలో జన్మించకపోతే యిలా క్షాత్ర తేజం దుస్సాధ్యము. మరి, మన ప్రాంతంవారేనా?
మాలతి: మనస్సు ఇచ్చుకొన్న తరువాత మన ప్రాంతంవారైతేనేం? మరొక ప్రాంతం వారైతేనేం. మళ్ళీ రాబట్టుకోగలుగుతామా...?
చంద్ర: అందుకు నేనేమీ చింతపడడం లేదు. ముందు చింతపడను కూడాను.
మాలతి: అయినా, నీవంటి ఉత్తమ క్షత్రియ కాంత కుసుమ కోమల హృదయాన్ని ఒక అజ్ఞాతమైన తావున పారేయటం క్షేమం కాదు.
చంద్ర: మాలతీ! నీ విపరీత సంభాషణతో నా మనస్సు కలతపెట్టకు. జాలివహించు. సమస్తవిధాలా సాయపడు. మాలతి: జాలిగలదాన్ని కాబట్టి, ఒప్పుకొని మనస్సుకు ఎలాగో నచ్చజెప్పి మీ ఇద్దరికీ యేకాంత సన్నివేశాన్ని ఏర్పాటు చేసి వచ్చాను.
చంద్ర: నిజమేనా? మాలతీ... ఎప్పుడు? ఎక్కడ?
మాలతి: వెర్రిదానా! నీ ఆనందం నా ఆనందం కాదూ? ఏమనుకుంటావో అని నిన్ను పరీక్షించాను గాని సత్యం చెపుతున్నాను - మీ యిద్దరికీ వివాహం జరిగితే రతీ - మన్మథుల్లా ఉంటారు. - మీ సన్నివేశం సాయంకాలానికి మన ఉపవన సౌధంలో.
చంద్ర: మాలతీ, మంచి ప్రదేశాన్ని నిర్దేశించావు.
మాలతి: రాత్రి అంతా వారు యిక్కడనే వుంటారు. చంద్రుని కళలన్ని రాత్రికి మా చంద్రవదన మనోజ్ఞ సౌందర్యం ముందు చెల్లిపోవాలి.
చంద్ర: నీ మేలు జన్మజన్మలా మరచిపోలేను.
మాలతి: నాన్నగారు ఊర్లోకి ఏ క్షణానైనా రావచ్చు. ఏమరివుంటే యెంతటి ప్రమాదమైనా సంభవించవచ్చు.
చంద్ర: అన్నిటికీ నీవు వున్నావు.
మాలతి: (ముద్దుగా) అవును పాపం. లేను మరి, అనుభవించటానికి నీవు - అటూ యిటూ దెబ్బలు తినటానికి నేనూ.
మూడవ రంగము
(రంగనాయుడు ఏకాంతముగా లక్ష్మీ నృసింహస్తోత్రములో నుంచి క్రింది శ్లోకాన్ని పఠిస్తుంటాడు)
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుకశౌనక హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్
పెద్దియజ్వ: రంగనాయుడుగారేనా అది?
రంగ: ఎవరు? ఓహో పెద్దియజ్వగారా? దయచేయండి. ఆ ఆసన మలంకరించండి. ఆఁ, నృసింహస్వామివారి కళ్యాణోత్సవాలు సలక్షణంగా సాగిపోయినట్లేనా..? పెద్దియజ్వ: అబ్బబ్బ! ఎంతమాట సెలవిచ్చారు? అన్ని ఏర్పాట్లు తాము చేయించిన తరువాత ఇక లోపం జరగటమే...? అయితే తలంబ్రాల సమయంలో తాము లేకపోవటం మాబోటివాళ్ళందరికీ గొప్ప లోటనిపించింది.
రంగ: సంభావన సమయంలో గల్లంతు లేకుండా నడిపించారా?
పెద్దియజ్వ: మన మాటకు అడుగుదాటి వెళ్ళేవాడు ఇంతవరకూ పుట్టలేదు. ఇక పుట్టబోడు.
రంగ: ఉత్సవకాలానికి ఉండలేకపోవడం వల్ల నేనూ ఎంతో బాధపడ్డాను. ఇలా జరగటం ఇదే ప్రధమ పర్యాయం.
పెద్ది: తమ మీద పడ్డ కార్యభారం అటువంటిదనుకుంటాను. సౌభాగ్యవతి తమ కుమార్తె చంద్రవదనమ్మగారు తాము కూర్చుండే స్థానంలో కూర్చొని సమస్తమూ నడిపిస్తుంటే అదో నూతన శోభ కలిగింది.
రంగ: అన్ని నడవళ్ళూ సక్రమంగా జరిగించమని, ఏ లోపం జరుగరాదని యెన్నోరీతుల చెప్పి వెళ్లాను.
పెద్దియజ్వ: తమ ప్రభుతకు తగ్గ కుమార్తె అనిపించింది. ఎన్నడూ రాని రాజకుమారులందరూ వచ్చి వేదికల నలంకరించటం మరీ ముచ్చట వేసింది.
రంగ: వాళ్ళంతా మా చంద్రవదన మనస్సుకోసం వచ్చి ఉంటారు.
పెద్దియజ్వ: తప్పేముంది. వాళ్ళల్లోనే యెవరో ఒకరికి ఇచ్చి వివాహం చేయక తమకు మాత్రం తప్పేదేముంది? యుక్తవయస్సు వచ్చిందికూడాను.
రంగ: పెద్దియజ్వగారూ! మా చంద్రవదన వివాహం మాకో తీరని సమస్యైనది.
పెద్ది: ఆశ్చర్యంగా ఉంది. 'అమ్మాయి కురూపి అనా, అడిగినంత కట్నం ఇవ్వలేరనా' సమస్య కావటానికి...
రంగ: నా కుమార్తె కురూపిణిగా పుడితే యెంతో సంతోషించేవాణ్ణి. అందరూ అమ్మాయిని 'మాకివ్వమని మాకివ్వమని' అడుగుతున్నారు. అందులో మాధవుడి గోల మరీ అన్యాయంగా ఉంది.
పెద్ది: తమ అక్క వెల్లాయమ్మగారి కుమారుడు కదూ. మంచివాడు, సంబంధం కలుపుకున్నట్లౌతుంది. రంగ: నిజమే. కాని వాడంటే మా చంద్రవదనకి గిట్టదు.
పెద్ది: అయితే మరి అన్నివిధాలా మనకు సరిసాటైనవాడి కింకోడికిచ్చి వివాహం చేయించండి.
రంగ: ఒకరికిస్తే మరొకరికి కోపం. అందుకనే కురూపిగా పుట్టినా బాగుండేదన్నాను. ఇది సౌందర్యదోషం.
పెద్ది: అపూర్వ సౌందర్యం కల దమయంతి మొదలైన కూతుర్లను కన్న తండ్రులందరూ ఈ సమస్య ఎదుర్కొన్నారు. మీరూ వారివలెనే స్వయంవరం ఏర్పాటు చేయించండి. 'వరపరీక్ష'లో నెగ్గిన వాడికి కన్యనిచ్చి కల్యాణం చెయ్యండి.
రంగ: తమ సలహాకెంతో కృతజ్ఞుణ్ణి. అలా చేస్తేగాని నేను కోపతాపాల్లోనుంచి బయట పడేటట్లు లేదు.
(లోపలనుంచి మామయ్యా మామయ్యా అని వినిపిస్తుంది)
రంగ: అడుగో మాధవుడు యేదో కొంప ముంచుకొని పోయే పనిపెట్టుకొని వస్తున్నాడు. మరి సెలవా...?
పెద్ది: సెలవు. తమకు తీరుబడి ఉన్నప్పుడు పునర్దర్శనం చేస్తాను.
రంగ: మాధవా, యేమిటా హడావుడి?
మాధవ: హడావుడి యేమిటి? కొంప మునిగిపోతుంటే. ఇది మనకెంత అప్రతిష్ట. తరువాత నీవు చంద్రవదనను నన్ను పెళ్ళి చేసుకోమన్నా నేను అంగీకరించను. నేను కనిపెడుతూనే ఉన్నా.
రంగ: అసలు సంగతేమిటి?
మాధవ: మొన్న కల్యాణోత్సవాలనాటినుంచీ ఒకటే వెర్రివేషాలు. ఎవరూ తన్ను గమనించ లేదనుకుంది కామోసు. ఇంద్రుడిలా వేయి కళ్ళతో కనిపెడుతూనే ఉన్నా.
రంగ: ఎవర్నిరా...?
మాధవ: ఎవరేమిటి...? మన ముద్దుల కుమార్తెను.. చంద్రవదనను.
రంగ: ఏం చేసింది...? మాధవ: ఎవరో దేశంలోకి క్రొత్తగా వచ్చిన ఒక రాజకుమారుణ్ణి చూసి వెర్రి వెర్రి వేషాలు వేసింది.
రంగ: పాపం. నిన్ను పలకరించనైనా లేదు కామాలి. అదా నీ కోపం... అంతేనా?
మాధవ: ఎప్పుడూ నీకు నేనంటే వేళాకోళమే మామయ్యా! నిజం చెపుతున్నాను. ఇవాళ రాత్రంతా అతగాడు మన ఉపవనంలో వున్న సౌధంలోని చంద్రవదనతో విహరించటానికి యేర్పాటు...
రంగ: (కోపంతో) ఛీ. అబద్ధాలాడకు. నేను నమ్మను.
మాధవ: నామీద ఒట్టు మామయ్యా. ఉదయం ఊరుబయట ఉద్యానవనంలో వున్న అతని దగ్గరికి వచ్చి మాలతి మాట్లాడి వెళ్ళుతుంటే చాటుగా వుండి నేను విన్నాను.
రంగ: ఇది అబద్ధమైతే...
మాధవ: నీవు నాకు చంద్రవదన నిచ్చి పెళ్ళి చేయవద్దు.
నాల్గవ రంగము
(ఉరుములు... పిడుగులు... వర్షధ్వని వినిపిస్తుంది)
చంద్ర: తల్లీ! పరమేశ్వరీ! నామీద నీకు దయలేదా? మహేశ్వరుని కోసం నీవు పడ్డ మహార్తిని మరిచిపోయావా? నన్ను కనికరించు. మా మధు సమాగమానికి తోడ్పడు. నీకివే నా జోహారు. మాలతీ... మాలతీ...
మాలతి: అరుగోనమ్మా! వచ్చారు
చంద్ర: (ఉద్వేగంతో) వచ్చారా??
మాలతి: వెర్రిదానా. నీకోసం వస్తారుటమ్మా! నీ హృదయం ఎలా తహతహ పడ్డదో, నీబోటి త్రిలోకసుందరితో పరిచయం చేసుకోను ఆయన హృదయం మాత్రం అలా ఆరాటపడదూ..? వెంట స్నేహితుడు సూర్యనాయుడుగారు కూడా వున్నారు. వారితో నేను వినోద కథలు చెప్పి, కాలక్షేపం చేస్తాను. రాజకుమారులవారిని లోపలికి పంపిస్తాను.
చంద్ర: చతురురాలవు. అన్నీ నీ ఇష్టం వచ్చినట్లు నడిపించు. నాన్నగారు ఇంకా గ్రామంలోకి రాలేదుగా...? మాలతి: రానట్లే తెలిసింది. మరి సెలవు.
చంద్ర: మీకు శ్రమ ఇచ్చాను. క్షమించాలి. కష్టం లేకుండా త్రోవను కనుక్కోగలిగారను కుంటాను.
మోహి: ప్రతిక్షణము మిత్రుడు నన్ను వారిస్తూనే ఉన్నాడు. అన్నీ అపశకునాలని. ప్రియా! చంద్రా!! నీ సమాగమ భావనావేశం నన్ను లాక్కోవచ్చింది.
చంద్ర: ఈ ఉరుములు పిడుగులు అపశకునాలుగా భావిస్తున్నారు. లేదు. ఇవి శుభశకునాలు. లేకపోతే మనమిక్కడ ఇంత స్వేచ్ఛగా సంభాషించ డానికి అవకాశం ఉండేదికాదు. నేను పరమేశ్వరిని ప్రార్థించాను. ఆమె మన పునస్సమాగమానికి యీ ప్రకృతి నేపథ్యాన్ని కల్పించింది.
మోహి: కల్యాణమండపంలో ఆనాడు ముందుగా వెళ్ళిపోయినానని కోపం వచ్చిందా...? మిత్రుడు భయపడి నన్ను వెళ్ళిపోదామని బలవంతపెట్టాడు.
చంద్ర: సిగ్గు విడిచి ఇలా పిలిపించుకున్నాని మీ మనస్సులో ఏమైనా నన్ను గురించి న్యూనతగా భావించడం లేదుగదా?
మోహి: లేదు. నీ సాహసానికి హృదయంలో ఎంతో మెచ్చుకున్నాను. మాలతి రాకకు క్రితంనాడు నీ రూపాన్ని దూరంనుంచి చూచి కన్నులరమోడ్చి నీ సౌందర్యమూర్తిని ఆరాధించాను.
చంద్ర: ప్రథమ వీక్షణం నాడే నాకు మీమీద ప్రణయం జనియించింది. మీ మనోహరమూర్తినే మనస్సులో నిల్పుకొని పూజిస్తున్నాను.
మోహి: చంద్రా! ఇలా దగ్గరికి రా. యేమిటా సిగ్గు? ఇంత సాహసించింది ఇందుకేనా...?
చంద్ర: నన్ను మీరు మనసారా ప్రేమిస్తున్నారా?
మోహి : నా బ్రతుకెంత సత్యమో నీమీద ప్రేమ అంత సత్యం. అయితే మరొక విషయంలో నేను నిన్ను ఈ రాజవేషంతో మోసగించాను.,
చంద్ర: మీరు రాజకుమారులు కాకపోయినా నాకు ఇష్టమే.
మోహి : నేను రాజవంశంలోనే జన్మించాను. కానీ నా జన్మదేశం పర్షియా. ఈ పవిత్ర భారతం మాత్రం కాదు. రత్న వర్తకుడిగా యిక్కడికి వచ్చి నీవనే యీ రత్నాన్ని హృదయమిచ్చి కొనుక్కున్నాను చంద్రా! అన్యమతస్థుడనీ, విదేశీయుడనీ తెలిసి కూడా ఈ మోహియార్‌ను ప్రేమిస్తున్నావా?
చంద్ర: మోహియార్! నా ప్రేమ నిష్కళంకమైనది. మిమ్మల్ని ప్రేమించిన తరువాత మీ దేశాన్ని గురించి తెలుసుకున్నాను గాని మీ దేశాన్ని గురించి తెలుసుకున్న తరువాత మిమ్మల్ని ప్రేమించలేదు. నా ప్రేమ అచంచలమైంది. మానవ నిర్మితాలైన అవధులు కొన్ని అడ్డుపెట్టలేవు.
మోహి: చంద్రా!
చంద్ర: మోహియార్!
మోహి: ఏదీ ఒక్కమారు ఈ కౌగిలిలో ఒదిగిపో
(లోపలనుంచి మాలతి గొంతు)
మరల మరల నోహో ఈ
మధువసంత మరుదెంచునె
యోవ్వన సుఖ మనుభవింప
కేల జేలయ్యెదరు... మరల మరల నోహో...
సూర్య: పూలతావి తరగినదా
పూలబ్రతుకె అణిగినదా
నాకమైన యీ లోకమె
నరకముగా మారునొహో... మరల .... మరల...
మోహి: మరి నేను వెళ్ళిరానా...? మిత్రుడు బయట వేచి ఉంటాడు.
(తలుపు చప్పుడు... చంద్రా...! చంద్రా)
రంగనాయుడు: ఛీ! కులట! ఏమిటిది..? నిష్కళంకమైన మన వంశానికి యిది యెంతటి
అపకీర్తి! ఇన్నాళ్ళమట్టీ నంగనాచివని నమ్మి మోసపోయినాను.
చంద్ర: కోపగించకండి నాన్నా. నా పవిత్ర హృదయాన్ని యీతనికి అర్పించుకున్నాను. యితడే నా భర్త.
రంగ: (చేదుగా) అర్పించుకున్నావు. అర్పించుకోవు. అంతా నీ యిష్టమే. ఈ ప్రేమబంధాన్ని త్రెంచేసుకో. నన్ను అపకీర్తి పాలు చేయకు.
చంద్ర: నేను మోహియార్‌ను తప్ప మరొకణ్ణి ప్రేమించలేను. రంగ: (వెగటుగా) లేవు. చూస్తానుగా ఎలా ప్రేమించలేవో? వరపరీక్ష యేర్పాటు చేశాను. అందులో నెగ్గినవాణ్ణి వివాహమాడటానికి సిద్ధపడు.
చంద్ర: నా వివాహం ఇదివరకే అయిపోయింది. నాన్నా నన్ను కనికరించండి. మీరు దయామూర్తులు. నాన్నా! మాట్లాడరేం.
రంగ: చంద్రా! నీ కన్నీళ్ళతో నన్ను లొంగదీయవద్దు. వరపరీక్ష తప్పక జరిగి తీరవలసిందే. యువక రాజలోకానికి వాగ్దానం చేశాను. లేకపోతే నాకెంత అప్రతిష్ట. తల ఎత్తుకొని తిరగలేను.
చంద్ర: వెళ్ళిపోతున్నారా నాన్నా! నన్ను కనికరించలేరా...?
మోహి : చంద్రా.... దుఃఖించకు. నీ కన్నీరు చూడలేను. ఆ వరపరీక్షలో నేనూ పాల్గొంటాను. మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం.
చంద్ర: మోహియార్ నీ వీరగుణం నన్ను ముగ్ధురాలిని చేస్తున్నది. పరమేశ్వరిని నా పతికి విజయం చేకూర్చమని ప్రార్థిస్తాను.
మోహి: పరీక్షా సమయంలో స్మృతి చిహ్నంగా నాకేదైనా...
చంద్ర: ఇదిగో... ఈ అంగుళీయకాన్ని కరాగ్రాన ధరించు.
మోహి: నీ సుందర హస్తంతోటే దాన్ని అలంకరించు.
చంద్ర: మోహియార్.
మోహి: (ప్రేమపూర్వకంగా) చంద్రా!
ఐదవ రంగం
(దూరం నుంచి మల్లయుద్ధ దోహదంగా ఢక్కా నినాదాలు వినిపిస్తవి)
పెద్దియజ్వ: నాయుడుగారూ! తాము వరపరీక్షలో అతి కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేయించారు. ఎంతెంత ప్రజ్ఞ కలవాళ్ళూ ఎందులోనో ఒకదానిలో ఓడిపోతున్నారు.
రంగ: లేకపోతే, మా కుమార్తెను వివాహమాడడమంటే అంత చులకనంటారా. అదీకాక ఎంత కష్టపడి భార్యను సంపాదించుకుంటే తరువాత ఆమె మీద అంత అనురాగాన్ని ప్రకటిస్తాడు. పెద్దియజ్వ: గొప్పగా సెలవిచ్చారు. నిన్నా, మొన్నా ప్రదర్శనాలల్లో ఓడిపోయినవాళ్ళు కూడా చాలా ప్రజ్ఞావంతులు.
(దూరం నుంచీ హర్షధ్వనులు, హాహాకారాలు)
రంగ: ఈ ఉదయం నుంచి మల్లయుద్ధం అతి తీవ్రంగా సాగుతున్నట్లుంది.
పెద్దియజ్వ: ఇక మిగిలిపోయినవారు ఇద్దరే. హోరాహోరీగా పోరాడుతున్నారు. వీళ్ళ పోరాటం భీమ బకాసురుల యుద్ధాన్ని తలపిస్తూ ఉంది.
రంగ: ఈ ఇద్దరిలో ఒకడు మా మాధవనాయుడు.
పెద్దియజ్వ: రెండవవాడు ఎవరో ఒక అజ్ఞాత యువకుడటగా! మూడు దినాలనుంచీ ప్రదర్శనల్లో పాల్గొంటున్నాడని వింటున్నాము. మరి అతడు ఏ కులంవాడో?
రంగ: ఏ కులంవాడైతేనేం..? నా కుమార్తె వివాహ సమయంలో కేవలం క్షాత్రగుణాన్నే ప్రధానంగా పెట్టుకున్నాను.
పెద్ది: తామే అలా సెలవిస్తే ఇక దేశంలో వర్ణాశ్రమాచారాల గతేమిటి..?
రంగ: కాలం మారిపోతున్నది. ఇక వర్ణాలు, గుణ ప్రధానాలుగా ఉండాలి గాని, జాతి ప్రధానాలుగా ఉండడం క్షేమకరం కాదు.
రంగ: ఆ 'మాధవనాయునికి జై' - హర్షధ్వనులు
చంద్ర: మాలతీ! మోహియార్‌కు గట్టిదెబ్బ తగిలినట్లుంది.
మాలతి: లేదమ్మా! అలా నటించడం కూడా మల్లయుద్ధంలో ఒక ఎత్తు. అదిగో చూడు తిప్పుకొని ఎంత వేగంతో మళ్ళా మాధవనాయనిమీద పడుతున్నాడో...
చంద్ర: పరమేశ్వరి కృప యెలా వుందో. మోహియార్ విజయం పొందితే నాన్నగారు నన్ను అతనికే ఇచ్చి వివాహం చెయ్యటానికి అంగీకరించారు.
మాలతి: ఆఁ... అయ్యో, అన్యాయం. కొట్టరానిచోట దెబ్బ కొట్టాడు మాధవనాయుడుగారు.
చంద్ర: దుష్టుడు. వట్టి ఈర్యాపరుడు. మాలతి: మోసం! అన్యాయం!! మళ్ళా త్రిప్పుకుంటుంటే మరోదెబ్బ!! ప్రభూ! ఇది అన్యాయం, అక్రమం... అమ్మాయిగారూ గమనిస్తున్నారా! మోహియార్‌గారు మెలికలు తిరిగిపోతూ నోటరక్తం క్రక్కుతూ...
చంద్ర: రక్తమా! ఎంత అపశ్రుతి! అయ్యో నేలమీద పడిపోతున్నాడు. ఎంత ఘోరం, ఎంత అన్యాయం, నాన్నా... నాన్నా...
మాలతి: అయ్యో, అయ్యో... మళ్ళీ మర్మమైన ఆయువుపట్టులో మరొక దెబ్బ కొట్టాడు.
చంద్ర: నాన్నా! నాన్నా!
రంగ: చంద్రా!
మాలతి: ప్రభూ! అన్యాయం మోహియార్ మరణిస్తున్నాడు.
('అబ్బా బాధ' మూలుగు... హాహాకారాలు)
రంగ: చంద్రా! ఈ వెర్రిచూపులేమిటి తల్లీ! అయ్యో! రక్తస్రావము. ఆత్మహత్య చేసుకున్నావా...?
మాలతి: అమ్మో చంద్రవదన... నీ భర్త తెప్పరిల్లి మళ్ళీ శత్రువు మీద పోరాడుతున్నాడు.
చంద్ర: లేదు. మోహియార్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నేనూ నీతో వస్తున్నా.
రంగ: చంద్రా! నేను నీ తండ్రిని కాను నీ పాలిటి యముణ్ణి. అకారణంగా ఈ వరపరీక్ష కల్పించి నీ భర్తను హతమార్చాను. నన్ను క్షమించు.
చంద్ర: నాన్నా! మా పవిత్రప్రేమ లోకానికి అర్థం కాలేదు. కాకపోవడం తప్పులేదు. లోకానికి ప్రేమలేదు. వర్ణమున్నది. ఆచారాలున్నవి. అంతే లోకాన్ని అనుసరించి మోహియార్‌ను వివాహమాడిన నేను అన్యమతస్థురాలిని. నా భర్తతో సహగమనం చేశాను. మా ఇద్దరికి కలిసి ఒక గోరీ కట్టించండి. ఇదే నా తుది కోర్కె. అబ్బా... బాధ... నాన్నా! మాలతీ...
రంగ: పట్టరాని దుఃఖంతో చంద్రా! తల్లీ! నన్ను ఒంటరివాణ్ణి చేసి యీ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నావా? క్రూరుణ్ణి... చేతులార నిన్ను చంపుకున్నాను., మరణశయ్య మీద వున్న నీ తల్లికి నిన్ను సర్వవిధాలా సంతోష పెడతానని వాగ్దానం చేశాను. లోకానికి వెరిచాను. పోనీ దేశంలో నుంచి మీ ఇద్దరినీ పంపించివేస్తే ఏ అరణ్యాలలోనైనా సుఖించేవారు. పెద్దియజ్వ: ధైర్యం కోలుపోకండి. చింతించి ప్రయోజనమేముంది? ఇది మన సాంఘికాచారాల దుష్ఫలితం. ఇంతటి అపూర్వ ప్రేమ మును కన్నదీ కాదు- విన్నదీ కాదు. అమ్మాయిని, ఆ మోహియార్ శవం దగ్గరికి చేర్చి, నృసింహస్వామి ఆలయం ముందు గోరీ కట్టించి ఏటా ఉత్సవాలు చేయించి ఋణం తీర్చుకుందాం.
(ఆలిండియా రేడియో)
ఎ.ఐ.ఆర్. విజయవాడ 15-7-1953
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.