వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/ఏ.క.తా.ర

ఏ.క.తా.ర


కోప్పడకమ్మా! కోప్పడకు, నీవు తప్ప నాకు కలిగే అనుమానాలను తీర్చేవాళ్లు ఎవరమ్మా! నాన్న చూతామా అంటే అంత చదువుకున్నా ఆ మార్వాడీ దగ్గర గుమాస్తా. నిమిషం తీరిక లేదు. ఉదయం పోతే సాయంత్రం గాని ఇంటికి రారు. వచ్చిన తర్వాత బడలిక. ఎప్పుడు చూచినా ఏదో కష్ట సముద్రంలో ఈదుతున్నట్లు ఉంటారు. ఇక మాట్లాడించటానికి నాకు ఏమి మనస్కరిస్తుంది? అవకాశమూ ఉండదు. బళ్లో చదువుకుంటున్నామన్నమాటేగాని మా అనుమానాలను తీర్చే గురువులు కారు వాళ్లు. ఎందుకూ పనికిరాని విషయాలు ఎన్ని చెప్పినా ఫరవాలేదు. మేము ఏవన్నా ప్రశ్నలు వేస్తే అప్రస్తుతమనీ, అధిక ప్రశంసనీ, ఇప్పుడు కాదనీ చేతగాక గర్వితనం వల్లా తప్పించుకొంటూ ఉంటారు.

తల్లి : తప్పు! మేష్టర్లను నిందించకూడదు.

కొడుకు : (గడుసుగా) ఇక మాకు చెప్పేదెవరమ్మా మరి! మా భావాలను, జిజ్ఞాసను చంపుకోవలసిందేనా? మేమూ 'డూడూ వెంకన్నలము' ఐతే చూతామనేనా మీ అందరి అభిలాష... పోనీలే నీకేదైనా పని ఉంటే చూచుకో.

తల్లి : (కంటికి నీరు తిరిగి ఒక చుక్క బుగ్గమీద పడి చిందుతుంది) అంతలో ఆవేశము. అంతలో నైరాశ్యము. చెప్పుమరి ఏం కావాలో?

కొడుకు : నిమిషాల మీద అయ్యే జవాబులుండే ప్రశ్నలా! అన్నిటికీ సమాధానాలు చెప్పేంత వీలుంటే అడుగుతా! కాకపోతే మరొక తడవ అడుగుతాలే... (తదేక దృష్టి)

తల్లి : (ప్రేమార్ద్ర దృక్కులతో) పని కాలేదన్న విసుగులో ఏదో అన్నాను. దానికింత చింతామగ్నత ఎందుకు? తండ్రీ! నీ అనుమానాలను తీర్చకుండా నేను చేసే పనిమాత్రం ఏమి పాడైంది. నే చదువుకున్న చదువెందుకు! చట్టుబండలకా! మీ నాన్న వచ్చేటప్పటికి ఆ రెండు ఇళ్లూ చిమ్మి రెండు కప్పుల కాఫీ కాచలేక పోతానా!

కొడుకు : అమ్మా! అయితే అడగమంటావా? తల్లి : కానియ్యి నాయనా! నీ ఎదురుగా కూర్చొనే జవాబులు చెపుతాను - నాకు తెలిసినంతమటుకు.

కొడుకు : అందరికీ ఒకటే రకం ఇళ్లు లేకుండా ఒకళ్లకు బంగళాలు, ఒకళ్లకు పెంకుటిళ్లు, మన ఇంట్లో పనిచేసే రామి మొదలైనవాళ్లకు పూరిళ్లూ ఉన్నాయే దానికి కారణం ఏమిటమ్మా!

తల్లి : (నవ్వుతూ) చాలా చిన్న సమాధానము. డబ్బు బాగా ఉంటే బంగళాలు, కొంచెం తక్కువగా ఉంటే పెంకుటిళ్లు, అసలే లేకపోతే పూరిళ్లు.

కొడుకు : (మూతి బిగించి) నవ్వులాట కాదమ్మా. నా మనస్సు ఎంతో ఆందోళనగా ఉంది. వాళ్లకున్న డబ్బు వీళ్ళకు ఎందుకు లేదు?

తల్లి : ఎందుకు లేదు, అంటే - లేదు కాబట్టే.

కొడుకు : ఏమిటే అమ్మా ఆ పెడ సమాధానాలు!

తల్లి : అల్లాంటి ప్రశ్నలు వేస్తే మరి ఏం జవాబు చెప్పేదిరా?

కొడుకు : పుడుతూనే వాళ్లు ఏ లోకంలో నుంచైనా, తెచ్చుకున్నారా మరి!

తల్లి : లేదు. కాని వాళ్ల పూర్వులు సంపాదించి ఇచ్చిపోయినారు...

కొడుకు : వాళ్లకు మటుకూ ఇక్కడిదేగా డబ్బు సంపాదించటానికి. న్యాయాన్యాయాల భయము, పాపభీతి లేకుండా సంపాదిస్తే మటుకు వాళ్లదౌతుందా! తోడి మానవులు నీచాతి నీచంగా ఉంటే వాళ్ల హృదయం ఎలా సహిస్తుంది. అమ్మా! వాళ్ళకు హృదయం అనేది లేదేమో!

తల్లి : డబ్బు దగ్గిర నువ్వన్నవన్నీ అవసరం లేదు. దేవుడనేవాడు ఉంటే అతడు గూడా వాళ్లకే సహాయం చేస్తాడట.

కొడుకు : అమ్మా! దేవుడంటే జ్ఞాపకం వచ్చింది. నిన్న ఎవరో బ్రాహ్మడు వచ్చి కార్తిక సమారాధన చేయబోతున్నాము చందా వేయాలన్నాడు నాన్నను. ఆ డబ్బంతా పోగుచేసి మనబోటి బీదవాళ్ళకు ఎవరికన్నా ఇస్తారా ఏమే!

తల్లి : పిచ్చి నాయనా! నువ్వు చాల చిన్నవాడవు. నీకింకా ఏమి తెలియ దోయి. ఆ బ్రాహ్మలదేవుడు బీదలకు ఇవ్వమనేవాడు కాదు. వాళ్ల కడుపుకు తినమనేవాడు. కొడుకు : అమ్మా! నాకు తెలియక అడుగుతాను. బ్రాహ్మలదేవుడనీ, కోమట్ల దేవుడనీ, శూద్రుల దేవుడనీ, ఇంకోళ్ల దేవుడనీ దేవుళ్లు ఇంతమంది ఉంటారా ఏమిటే! (ఆశ్చర్యంతో) దేముడు ఒక్కడే గదమ్మా!

తల్లి : మనదేశంలో దేముళ్ళకేమి కొదవ నాయనా! కనపడ్డ చెట్టూ పుట్టా, రాయీరప్పా, గోడగొబ్బే అన్నీ దేవుళ్లే! దేముడు కాని వస్తువేమిటి? కానీ, సాటి మానవుణ్ణి వీటి అన్నిటికన్నా కనాకష్టంగా చూస్తారు. 'దేవుళ్లు ఇంత మందా'! అన్నావు? అసలు ఒకడున్నాడా ఏమిటి? ఆ విషయాన్ని గురించి పెద్దపెద్దవాళ్లకే అనుమానం. నిజంగా ఉంటే మనబోటి పేదవాళ్లకు ఎంతో మందికి ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే చేతగాని దద్దమ్మలాగా గుడ్లుమిటకరించి చూస్తూ కూచుంటాడా ఏమిటి!

కొడుకు : (మరింత ఆశ్చర్యంగా చూస్తూ)

అయితే దేముడే లేడంటావా అమ్మా?

తల్లి : ఉన్నాడేమో నీవే ఆలోచించు.

కొడుకు : అలా అయితే మరి మనం ఈ బ్రాహ్మళ్లకు సంతర్పణలకనీ, సమారాధనలకనీ, చందాలు ఇవ్వటం దేనికి, ఆ డబ్బు బీదవాళ్లకు ఉపయోగించకపోతే?

తల్లి : మనం కడుపుకు తిన్నా తినకపోయినా దేవుళ్ల పేరా, దయ్యాల పేరా జీవించే ఆ పుణ్యపురుషులకు ఈ మొక్కుబళ్లన్నీ చెల్లిస్తూ వాళ్లను పోషించాల్సిందే. లేకపోతే మనకు పాషండులనీ, చార్వాకులనీ, నాస్తికులనీ పేర్లు పెడతారు. వాళ్లకు దేముడిమీద నిజంగా గాఢమైన నమ్మకం ఉన్నా లేకపోయినా నమ్మకం లేదన్నవాళ్లను నలిపివేసి అష్టకష్టాలు పెట్టటానికి వాళ్లంతా ఒకటే అవుతారు. బీదలకు ఉద్యోగాలు దొరకవు. చాకిరీ చేసుకొని బతకడానికి కూడా చొరవ ఇవ్వకపోవటం వల్ల కూలినాలీలు దొరకవు. చిల్లిగవ్వ చేతిలో ఆడదు. ఎందుకైనా...

కొడుకు : ఉండు! అయితే ధనికులు ఎక్కువమంది ఉంటారా? బీద సాదలు ఎక్కువమంది ఉంటారా?

తల్లి : ధనికులు చాలా తక్కువ మంది. నూటికి ఏ నలుగురో ఐదుగురో ఉంటారు.

కొడుకు : అఁహ. వాళ్ళతో యుద్ధం చేసి ఓడించి ఆ డబ్బంతా బీదవాళ్లు సమంగా పంచుకుండేటట్టు ఎందుకు చేయగూడదు!

తల్లి : అది అంత సులభసాధ్యం కాదు. వాళ్లకు పోలీసుల దన్ను చాలా ఉంటుంది. కొడుకు : పోలీసులు కూడా బీదవాళ్లే కదా, వాళ్లను కూడా ధనికులు బాధ పెడుతుంటారే మరి వాళ్లకు డబ్బుగలవాళ్లంటే ఎందుకు కోపముండదో!

తల్లి : వాళ్ల సంగతి మనం మాట్లాడకూడదు. ఎవరన్నా వింటే కొంప మీదికి వస్తుంది.

కొడుకు : పోనీవే. పేదవాళ్లంతా ఒకటై ధనికులకు ఏ పనీ చేయమని అంటే వాళ్లు ఏం చేస్తారో!

తల్లి : అటువంటివాటిని 'సమ్మె'లంటారు. అవి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ పూట కూటికి లేనివాళ్లు గదూ వీళ్లు. ఇందులో కొంతమందికి మరింత డబ్బాశ పెట్టి మిగిలిన వాళ్లలో నుంచీ చీలదీస్తారు. అంతలో వీళ్ల సంఘబలం తగ్గిపోతుంది. చదువుకున్నవాళ్లు పోయి మంచి ఏదైనా చెప్పబోతే తాగి తందనాలు వేసేవీళ్లు మంచి చెడ్డలు అర్థం చేసుకోలేరు. ముందు రూపాయి వస్తుందిరా అని మనం చెప్పినా ఆ నిమిషాన 'కంటికి కల్లుకు - కావలసిన పావలా' కనిపిస్తే ధనికులకు దాసోహం చేస్తారు.

కొడుకు : అమ్మా! వాళ్లు ఉత్త అమాయకులు ఏ అన్నెం పున్నెం ఎరుగరు చదువు శూన్యం.... నా మనస్సుకు వాళ్లకేదైనా సహాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉందమ్మా! మొదట్లో ఏం జెయ్యమంటావు నన్ను?

తల్లి : ఏమిటి చేసేది! నీ మొహం, ఆ ఆలోచన మానేసి నిద్దరపో కాసేపు. ఇంతలో నాన్న వచ్చే వేళౌతుంది. లేచి కాఫీ తాగి మాట్లాడుదువు గాని తీరికగా. నేనింకా కుంపటి రాజెయ్యాలి.

కొడుకు : నిద్దర!... నిద్దరే!! పట్టదు. ఎలా పడుతుంది!? ధనవంతుల మోటార్లు అరిగిపోతాయని పేదవాళ్ల చెవులు పిండి వసూలు చేసిన డబ్బుతో వాళ్లు తినటానికి లేకుండా మలమల మాడిపోతున్నా తారురోడ్లు వేయిస్తారటగా?

తల్లి : కన్నా! ఎవరు చెప్పారురా నీకిదంతా?

కొడుకు : ఎవరైతేనేం గాని అమ్మా! నా కన్నా అందంగా లేడు. తెలివి తేటలూ లేవు ఆ కోమటివాళ్ల అబ్బాయి మహాగర్వి, టాకు-టీకుగా కారులో బడికి వచ్చి ఇంటికి పోతుంటే కడుపులో ఏమిటో మంటగా ఉంటుంది. ఇకముందు వాణ్ణి చూచి అసహ్యించుకొంటాను. ఎగతాళి చేస్తాను!! ఏడిపిస్తాను!! రాయి తీసుకొని వెనకగుండా వాడి కారు అద్దాలు పగలగొడతాను!! అద్దం పెంకులు గుచ్చుకొని తల చిల్లిపడి రక్తం కారుతుంది. అంతటితో సరిపోతుంది. వాడి రిమ్మ అణుగుతుంది... మర్నాటినుంచీ బళ్లోకి నాతోపాటే నడిచి వస్తాడు. అప్పుడు అంతా వాణ్ణి చూసి నవ్వుతారు. ఆఁ వాడికి మూడిందిలే! అంతపనీ జరిగి తీరుతుంది.

తల్లి : (ఆశ్చర్యాన్ని కప్పి పుచ్చుతూ ఉన్న ఆదుర్దాతో) ఆదిమటుకు చెయ్యవద్దు. నన్నూ నాన్ననూ చంపుకున్నట్లు.

(ప్రేమార్థ కంఠంతో)

బుజ్జీ! అలసిపోయావు. మళ్ళీ జ్వరం వస్తుందేమో! ఇక మాట్లాడకు. కాస్త నిద్దరపో నాయనా! నేను ఇంట్లో పని చూచుకోటానికి పోతున్నా. సరేనా తండ్రీ!

కొడుకు : (బలహీనత వల్ల శరీరం అలిసిపోయిందీ నెమ్మదిగా) అలాగే. (కుర్చీలోకి నెమ్మదిగా మేను వాలుస్తూ ఒరిగి నిద్ర పోతాడు. తల్లి కొంచెం సేపు చూచి నిద్ర పట్టిందని ఇంట్లోకి పని చూసుకోనుపోతుంది)

ద్వితీయ రంగము

(సమయము ఆ రోజే మధ్యాహ్నం 3 గంటలు. కొడుకు నిద్ర లేస్తాడు. కనిపెట్టుకుని కూర్చున్న తల్లి ఒక చేతిలో కాఫీ కప్పు రెండో చేతిలో సాసరు పట్టుకొని నిలవబడి ఉంటుంది. తల్లి చేతిలో కాఫీ కప్పు సాసరు పుచ్చుకొని, సాసరులో కొంత కాఫీ పోసుకుని తాగుతూ)...

కొడుకు : అమ్మా! నాన్న రెండున్నరకు వచ్చి నాతో కొంతసేపు మాట్లాడతానన్నారే! వచ్చారా?

తల్లి : వచ్చారుగాని కాఫీ తాగి వెంటనే వెళ్ళిపోయినారు.

కొడుకు : (కాఫీ త్రాగటం ఆపి) నాన్నకు నాతో మాట్లాడటమంటే విసుగు కామాలి. కంటికి కనపడకుండా తప్పించుకుని తిరుగుతుంటారు.

తల్లి : కాదు! నాయినా, కాదు. వారికి నీతో మాట్లాడటమంటే ఎంతో సరదా! ప్రక్క ఇంట్లో భూషణంగారు మీ అబ్బాయి చాలా తెలివిగల వాడండీ అని అంటే ఆయనకు ఎక్కడలేనీ ఆనందమూ కూడా. కానీ బహు కష్టజీవి. ఒకసారి అనుభవం అవటం వల్ల ఉద్యోగం విషయంలో బహుజాగ్రత్తగా ఉంటారు. మన మార్వాడీ ఎవరో రైతుకు డబ్బు అప్పు పెట్టి ఆస్తి తాకట్టు పెట్టించుకుని అతడు ఇవ్వలేకపోతే దావా వేసి రాబట్టుకుంటున్నాడట! ఆ ఆస్థిని ఇవాళ కోర్టులో వేలం వేస్తారట. అక్కడ ఉండకపోతే కొంప మునిగి పోతుందని ఆ కప్పు కాఫీ తాగి ఉరుకులు పరుగులు పెడుతూ పరుగెత్తారు కోర్టుకు. నీతో మాట్లాడుతానన్న సంగతి కూడా జ్ఞాపకం ఉంది. టైములేదని అన్నారు. వాడు అలసి నిద్దర పోతున్నాడులెండి. లేపటం ఎందుకు అని నేను కూడా అంటే ఒక ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయారు.

కొడుకు : (కాఫీ కప్పు, సాసరు తన కుర్చీకి దగ్గరగా క్రింద పెట్టి)

ఉద్యోగ విషయంలో పూర్వం నాన్న ఏదో అనుభవించారన్నావు అదేమిటమ్మా!

తల్లి : (దీర్ఘ నిశ్వాసము) నీవు పుట్టేటప్పటికి మీ నాన్న తాలూకా ఆఫీసులో హెడ్ గుమస్తాగా ఉండేవారు. నెలకు నూరు రూపాయల జీతం. అప్పుడు మన సంసారం సంగతి చాలా బాగా ఉండేది. ఏ లోటూ లేదు. నిన్ను ఎత్తుకొని ఆడించటానికి బజారునుంచీ కావలసిన సరుకులు తెచ్చి పెట్టటానికి ఇద్దరు దాసీవాళ్లు, ఇంట్లో వంటపనికి ఒక మనిషి ఉన్నారు.

కొడుకు : (ఆత్రుతతో) తరువాత ఏమి జరిగిందేమిటి?

తల్లి : (వినపడదు) నేను ఎప్పుడూ పుస్తకాలూ, పత్రికలూ చదువుకుంటూ కాలం వెళ్లబుచ్చేదాన్ని. నాన్న పేటంచు జరీపంచలు, ఖండువాలు, సిల్కు చొక్కా కోటు తప్ప కట్టేవారు కారు ఆ రోజుల్లో. ఇప్పుడు కష్టాలకు కాగి శరీరం నల్లబడి పోయింది కాని అప్పుడు వంగ పండు చాయగా ఉండేది. అంతేనా ఎంతో మంది మనకు...

కొడుకు : అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవు. చివరికేం జరిగింది.

తల్లి : వినుమరి. అన్నిటికీ తొందరేమిరా! అప్పుడు గాంధీ మహాత్ముని ప్రభ బాగా సాగుతూ ఉంది. స్వాతంత్ర్య పోరాటం కోసం ఉద్యోగస్తులందరినీ ఉద్యోగాలకు రాజీనామాలిచ్చి ఉద్యమంలో దిగవలసిందని ఉద్బోధించాడు. వేలకు వేలమంది ఉద్యోగం ఒదులుకొని మొన్న నీకు మీ నాన్న చెప్పారే, ఆ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వాళ్ళల్లో నాన్న కూడా ఒకరు. తరువాత జైలుకు కూడా పోవలసి వచ్చింది.

కొడుకు : సంతోషంగా పోయినారనుకుంటానమ్మా! చాలా మంచిపని చేశారన్నమాట. స్వతంత్రత కోసం పోరాడటానికి చేశారాపని. అందులో నష్టం ఏమిటి? తల్లి : చేసిన పని మంచిదే. కానీ తరువాత - తరువాతే ఇంట్లో జరిగే స్థితి కనిపించలేదు. అందుకోసమనే ఈ మార్వాడీ కొలువులో ఇరవై రూపాయలకు గుమాస్తాగా చేరవలసి వచ్చింది. గాడిద చాకిరి చేస్తూ ఆ నీచునికి ప్రతినిమిషమూ 'చిత్తము-చిత్తము' అనవలసి వచ్చింది. ఇంకో ఉద్యోగం ఏదీ దొరకక పోవటం వల్ల. (కన్నులవెంట అశ్రువులు కారుస్తూ)

కోమల హృదయం మొదట్లో మొదట్లో ఎంతో బాధపడ్డది... ఏం చేస్తాము

కొడుకు : అయితే అమ్మా! నాన్న ఇప్పుడు ఆ మార్వాడీ దగ్గర ఉద్యోగం ఎందుకు మానుకోగూడదు?

తల్లి : సంసారం ఎట్లా వెళ్లుతుంది. తండ్రీ! నీవు ఉత్త అమాయకుడివిరా!... మనకు పూర్వార్జితమైన ఆస్తి సెంటు భూమి కూడా లేదు.

కొడుకు : (కొంచెము సేపు ఆగి) మనకు వచ్చిన కష్టాలకంతా దయా దాక్షిణ్యం లేని ఆ ధనికుల ఇళ్లల్లో డబ్బు మూలుగుతూ ఉండట మేనా?... అమ్మా మనకు పాలించే రాజు ఆ డబ్బంతా మనకు ఎందుకు పంచి పెట్టించ కూడదు

తల్లి : (నెమ్మదిగా) ఆయన కూడా మనను దోపిడి చేసేవాడే! నిజంగా సుకుమార హృదయం కలవాడైతే సాటిమానవులను పరిపాలించ టానికి ఒప్పుకుంటాడా! రాజ్య పరిత్యాగం చేస్తాడు. ప్రభువంటే గొప్ప బందిపోటు దొంగ. బెదిరించి పన్నులు వసూలు చేస్తాడు.

కొడుకు : ధనికుల మీద తిరుగుబాటు చేస్తే బాగుంటుంది. చచ్చిపోయినా వీరస్వర్గం కదూ... డబ్బుగలవాళ్ల కూతురైనా స్వరాజ్యం ఎంతో మంచి పిల్లమ్మా! రోజూ బళ్లో నుంచి నడవలేక నడవలేక వస్తూ ఉంటే డ్రైవరు చేత మధ్యలో కారాపించి నన్ను ఎక్కమని బతిమిలాడేది చాలామాట్లు. నేను, కారంటే నాకు పరమ అసహ్యం, నడిచే వస్తాను, వంటికెంతో కులాసాగా ఉంటుందంటే నావైపు దీనంగా చూస్తూ ఉండేది. ఇంతలో వాళ్ల కారు డ్రైవరు కారు తోలుకుపోయేవాడు. ఎంతో మంచిదమ్మా! స్వరాజ్యం. (తల్లి ముఖవిన్యాసాలు పరీక్షిస్తూ) నేనంటే ఆ అమ్మాయికి అమితప్రేమ ఎందుకోననుకున్నాను!...

తల్లి : (నవ్వుతూ) ఏం చేసిందేమిటి? కొడుకు : ఒకనాడు మాకు డ్రిల్ పిరియడ్ వచ్చింది. మేష్టరుగారు చెట్టుకింద ఎవరికి తోచింది వాళ్లను ఆడుకోమన్నారు. నన్నెవరూ పిలవకపోతే దిక్కులు చూస్తూ ఉన్నాను. 'స్వరాజ్యం' నా దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని ఆడుకొందాం రమ్మని పిలిచింది. పిల్లలందరూ ఒకళ్ల వెనకాల ఒకళ్లు మా దగ్గరికి చేరటం మొదలు పెట్టారు. అప్పుడు స్వరాజ్యం మేము ఇద్దరమే ఆడుకుంటాము. మీరు పోండి, అల్లరి చేస్తే మేష్టరుగారితో చెప్పి కొట్టిస్తానని భయపెట్టి వాళ్లను వెళ్లగొట్టింది. చివరకు ఆ రోజున ఇంటికి వచ్చేటప్పుడు నన్ను కారులో ఎక్కమని ఎంతో బతిమలాడితే ఎక్కాను. దిగబోయే ముందు (దృష్టి ఇంకో వైపు మార్చి)

సుకుమార్.... నిన్నే.... పెళ్ళి.... చేసుకోవాలని... ఉంది అన్నది.

తల్లి : (నవ్వుతూ) అంటే నువ్వేమన్నావు?

కొడుకు : సరేనన్నాను.

తల్లి : పిచ్చినాయనా! ఎంత అమాయకుడివిరా! వాళ్లు ధనికులు. మనం పేదవాళ్లం. మనకిస్తారుటరా పిల్లను వాళ్లు.

కొడుకు : వాళ్లిచ్చేదేమిటి! స్వరాజ్యం నన్ను తప్ప ఇంకొకణ్ణి పెళ్ళి చేసుకోనని పట్టుపడితే వాళ్లేం చేస్తారేం!

తల్లి : (ముద్దుగా) ఏడిచావులే. వాళ్లెవరైనా మన ప్రసంగం వింటే తిడతారు.

కొడుకు : (కోపంతో) మనం ఏమి తప్పిదం చేశామని!

తల్లి : పోనియ్యరా! ఆ ప్రశంస. అదెందుకు ఇప్పుడు.

కొడుకు : ఆ మాటలు ఎందుకో మనస్సులో మెదిలితే చెప్పాను అంతేనమ్మా... నేను. తెలుసుకో...

(క్లారినట్, బ్యాండ్ వినిపిస్తుంది తల్లి కొడుకు వీథి గుమ్మంలో నిలవబడి చూస్తుంటారు. త్రివర్ణ వస్త్రఖండాలతో కుట్టిన కాంగ్రెసు జండా పట్టుకున్న నాయక ప్రముఖుడు..


జయ - జయ - జయ ప్రియభారత జనయిత్రీ - దివ్యధాత్రి!
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల!
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ!
కవిగాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!


అందరూ మళ్లీ అదే అంటూ రోడ్డుమీద పోతూ ఉంటారు) తల్లి : ఇవాళ మైదానంలో ఏదో మీటింగ్ ఉన్నట్లున్నది. వీళ్లంతా అక్కడికే పోతున్నారు. పూర్వం నేను ఇటువంటి ఉత్సవాలల్లో పాల్గొనేదాన్నే.

కొడుకు : అమ్మా! ఇప్పుడు మనం ఎందుకు పోగూడదు వినటానికి.

తల్లి : అప్పటి ఉద్రేకం కష్టాలవల్ల తగ్గిపోయింది అంతే! (కొంతసేపటికి ఎర్రటి జండా మీద తెల్లగుడ్డ పీలకలతో కొడవలి సుత్తివేసి ఉన్నదానిని పదియేండ్ల కుర్రవాడు పట్టుకొని నడుస్తుంటాడు. ముందు సామ్యవాద ప్రముఖుడు.


ఓ దివ్య కార్మికా!
ఓ భవ్య కర్షకా!
సామ్యవాదమే
సముచిత మార్గము
బీదల సాదల
పీడలు తొలగగ
ఓ దివ్య కార్మికా!
ఓ భవ్య కర్షకా!


అనే పాటను పాడి నడిచిపోతారు. తల్లి, కొడుకు వీథి గుమ్మంలో నిలబడి పాడుతున్నంత సేపు తన్మయత్వంలో మునిగి వింటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత)

కొడుకు : రెండోతడవ వచ్చిన వాళ్ళ జండాను చూస్తే నాకు భయం వేసింది. కాని మొదటివాళ్ల పాటకన్నా వీళ్ళపాట ఎంతో బాగుంది. నాకు మనస్సుకు నచ్చింది. మొదటివాళ్లంతా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడాను. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోట్లాడటానికి ఏమి పనికి వస్తారమ్మ! నా బోటి కుర్రవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే ఇంటికి పొమ్మనేటట్లు ఉన్నారే! ఆ జండా పట్టుకున్న పిల్లవాడి ముఖం ఎంత కళకళలాడుతూ ఉందమ్మా! నేను పోయి అది పట్టుకో వస్తానంటే ఒప్పుకుంటారా!

తల్లి : నీవెందుకు పట్టుకోవటము?

కొడుకు : ఆ అబ్బాయి ఎందుకు పట్టుకున్నాడో అందుకే.

తల్లి : నాన్న వింటే కోప్పడతారు. ఎవరన్నా ఆ మాటలు వింటారేమో మానేయి.

కొడుకు : (దీనంగా) సరే! వాళ్లెక్కడికి పోతున్నారో! బీదసాదలు అని పాడారు, చేసే సభలో మన కష్టాలు పోయే మార్గం ఏదైనా చెపుతారేమో! అమ్మా! నేను వాళ్ళతో పోయి వినివస్తాను. తల్లి : వద్దు! నాయనా! మళ్ళా నడిచి మైదానం దాక పోయివస్తే అలసిపోవటం వల్ల జ్వరం తిరగబెడుతుంది. బాగా నయమైన తరువాత ఎక్కడ తిరిగినా ఫరవాలేదు.

కొడుకు : అన్నీ తెలిసి కూడా అలా ఆటంకం చేస్తావేమమ్మా! జ్వరం వస్తే వస్తుంది. మళ్లీ వెనక నయమైనట్లే నయమవుతుంది. అక్కడ చెప్పే సంగతులు నాకు తెలియాలంటే ఎట్లా తెలుస్తాయి. పోతానమ్మా.

తల్లి : ఎప్పుడో నాన్న చెపుతారు విందువుగానివి. ఇప్పుడు పోవద్దు! నా మాట విను.

కొడుకు : (మాట్లాడడు).

తల్లి : ఇక్కడనే కుర్చీలో కూర్చుని ఏదైనా చదువుకుంటుండు. అయిదు కాగానే నాన్న వస్తారు., మాట్లాదువుగాని. అక్కడ చెప్పే సంగతులన్నీ నాన్నకు బాగా తెలుసు. చెపితే నేర్చుకుందువుగాని. నేను ఇంకా మడిగట్టుకోవాలి. ఇవాళ ఆరు గంటలకే భోజనం చేసి నాన్న ఎక్కడికో పోవాలట. త్వరగా వంట చేయమని చెప్పిపోయినారు.

కొడుకు : (అలోచిస్తూ వీథి గుమ్మంలో నుంచి లోపలికి వచ్చి పడక కుర్చీలో చతికిల బడతాడు. తల్లి ఇంట్లో పని చూసుకోను పోతుంది).

ఏవిధంగానైనా ఇవాళ అక్కడికి పోవాలిసిందేను. అమ్మా నాన్న మళ్ళీ నన్ను ఇంటికి రానిచ్చినా సరే రానివ్వకపోయినా సరే! వాళ్ళతో నేను మీతో కలిసి ప్రచారం చేస్తాను, నాకు తిండి గుడ్డలు ఇచ్చి మీ చదువు చెపితే చాలని బతిమిలాడితే ఒప్పుకోక పోతారా!

(లేచి నాలుగు దిక్కులూ చూచి నెమ్మదిగా ఇంట్లోనుంచి బయటికి జారతాడు)

మూడవ రంగము

(సాయంత్రం 7.30 గంటల ప్రాంతము. కుర్చీలో కొడుకు లేకపోవటం వల్ల తల్లి వీథి గుమ్మంలో నిలవబడి ఎక్కడికి పోయినాడో అని కనిపెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంతలో కొంతసేపటికి ఒక సైకిలుమీద రొప్పుతూ రోజుతూ ఒక కామ్రేడ్ దిగుతాడు ఆమె ముందు)

కామ్రేడ్ : వీరసూనుని కన్నతల్లికి నమస్కారములు.

తల్లి : (తలవంచుకొని ఉంటుంది. ఒకవిధమైన సిగ్గుతో) కామ్రేడ్ : అమ్మా మీ అబ్బాయి...

తల్లి : (వంచుకున్న తల కొంచెం పైకెత్తి) ఎక్కడున్నాడేమిటి?

కామ్రేడ్ : అక్కడ మైదానంలో జరిగే సభ దగ్గిర ఉన్నాడు. ఇందాకటి నుంచీ ఇప్పుడూ అక్కడ బల్లదగ్గిరే... ఉన్నాడు.

తల్లి : ఇంత పొద్దుపోయినా ఇంకా ఎందుకు రాలేదో!

కామ్రేడ్ : (తల వంచుకుంటాడు)

తల్లి : ఏమన్నా చేశాడా ఏమిటి?

కామ్రేడ్ : ఏమన్నా చేయటమేమిటమ్మా! మహోపకారం చేశాడు. ఏమి ధైర్యం! ఎంత వచో నైపుణ్యం! మాట్లాడటంలో కించిత్తైనా ఒడుదొడుకులు లేవు. బీదసాదల దుర్గతిని చూచి కరిగిపోయిన కోమల హృదయం! బాలహృదయం! ఎంత ఆవేశం! మనమంతా ఒక సంఘంగా చేరాలి. ఆ సంఘానికి బలం చేకూర్చుకోవాలి. బాగా ధనికుల దౌష్ట్యాలను రూపుమాపే ప్రయత్నంలో ఉండాలి. ఎప్పుడు, సమాన ప్రాభవ వైభవాలను సంపాదించుకోవాలనీ, ఉద్బోధించాడు. పేదసాదలను, ధనధాన్యాలు శాశ్వతాలు కావని, మానరక్షణ ప్రాధాన్యమట. జన్మజన్మాంతరాలనుంచీ దీర్ఘ సుషుప్తిలో ఉన్న కూలీనాలీలను, మేల్కొల్పి వారి వారి అంతరాలను విభజిస్తూ స్వతస్సిద్ధముగా లేని ధనికుల ప్రాభవాన్ని నిరసించాడు. జ్ఞానతృష్ట కలుగవలెనని హెచ్చరించాడు. అంతేనా ఇంకా...

తల్లి : ఎక్కడ మాట్లాడాడు?

కామ్రేడ్ : మైదానంలో నమ్మా!

తల్లి : (ఆశ్చర్యంతో) అక్కడికి వచ్చాడా! వాళ్ళ నాన్నకు తెలుస్తుందే?

కామ్రేడ్ : అవును. వచ్చాడు. మతులు మారిపోయేటట్లు మాట్లాడాడు. తరువాత మా అధ్యక్షుడు మహానాయకుని పోకడలున్నాయి కుర్రవాడిలో అన్నాడు కూడాను. అటువంటి పిల్లవాడు (చివర వినకుండా)

తల్లి : ఎవరు మాట్లాడనిచ్చారు?

కామ్రేడ్ : ఉత్సాహపూరితుడై తనంతట తానే మాట్లాడతానని అధ్యక్షుణ్ణి కోరాడు. సభలో ఏమి గందరగోళం చేస్తాడోనని ఆయన భయపడి మొదట్లో వీలు లేదన్నాడట. నేను బాగా మాట్లాడగలను, నాకు కడుపులో ఎన్నో సంగతులు ఉన్నాయి. నేర్చుకున్నాను. ఇవాళ నన్ను తప్పకుండా మాట్లాడనీయాలి అని కాళ్ల వేళ్లా పడి బతిమలాడితే అధ్యక్షుడు అంగీకరించాడు. అంగీకరించినందుకు సభను రసప్రవాహంలో ముంచి తేల్చాడు. కూలీ నాలీల చక్షుగోళాల వెనుక తాండవించే ఆకటి మాటలకు తాను మాడిపోయి వినేవాళ్ళను మాడ్చి వెర్రెత్తి పోయేటట్లుగా ఉర్రూత లూగించాడు. భావనలో ఎంత సాత్వికము! భాషలో ఎంత సౌమ్యత! ఉద్రేకము! అవిచ్ఛిన్న వాగ్ధారణి!

తల్లి : (సంతోషము కప్పి పుచ్చుకుంటూ) జబ్బు పడ్డాడు. అందుకోసం వెళ్ళవద్దురా నాన్నా అంటే నేను ఇంట్లో పని చేసుకుండే సమయం కనిపెట్టి జారాడు. మిమ్మల్ని మైదానంలో చేరుకున్నాడు గామాలి!

కామ్రేడ్ : లేదమ్మా! పరుగెత్తుకుంటూ రొప్పుతూ వచ్చి త్రోవలోనే కలిశాడు మొదట మా నాయకుడి పక్కన నిలవబడి ఆయనకు ఒక నమస్కారం చేసి జండా పట్టుకొని వచ్చే 'సూర్యం' ప్రక్కనే నడవటం మొదలు పెట్టాడు. మా కామ్రేడ్సంతా చిరునవ్వు చిందులాడే అతని ముఖం చూసి ఊరికే నవ్వించేవాళ్ళు. లేత బుగ్గలమీద గులాబి రంగు తరకలు కట్టేవి. నాయకుడు మెడ మీద చెయ్యివేసి, ఎవళ్ళ అబ్బాయివి నాయనా! అంటే 'ఏమండీ!' నన్ను కాసేపు ఆ జండా మోసుకో రానీయరూ అన్నాడట.

తల్లి : (చకితయై) పట్టుకొచ్చాడా ఏమిటి! వాళ్ళ నాన్న ఎక్కడైనా చూచారేమో! చంపేస్తారే!

కామ్రేడ్ : లేదమ్మా! లేదు! వచ్చేటప్పుడు మోసుకొద్దువుగానిలే అన్నాడాయన. కాదండీ ఇప్పుడే మోస్తాను అన్నాడట. దానికి మధ్యలో మార్చటానికి వీలు లేదు వచ్చేటప్పుడు నిన్ను తప్పకుండా పట్టుకు రానిస్తాను అంటే సంతోషించి అట్లాగేనని తల ఊపాడు.

తల్లి : (దృష్టి రోడ్డుమీదకు మార్చి మెడసారించి దూరంగా చూచి) మీటింగ్ ఇంకా అయిపోలేదా? అబ్బాయి ఇంకా రాలేదే!

కామ్రేడ్ : మీటింగ్ అయి చాలా సేపయింది. మీ అబ్బాయి బల్ల... దగ్గిర... ఉన్నాడు.

తల్లి : కారణం ఏమిటో! తెలియదు! కాస్తపోయి పిలిచి వస్తావా బాబు! వాళ్ళ నాన్న వచ్చే వేళ అవుతున్నది.

కామ్రేడ్ : (ముఖం ప్రక్కకు త్రిప్పుకొని దైన్య కంఠస్వరముతో) నేను పోతే మటుకు వస్తాడా అమ్మా! రాలేడు... అక్కడనే ఉన్నాడు. తల్లి : అక్కడ ఏమి జరుగుతుందేమిటి? ఇంతాలస్యానికి.

కామ్రేడ్ : (ఆగుతూ ఆగుతూ) కాంగ్రెస్ పార్టీవారు, మేము కలిసి సభ చేస్తున్నాము. సభను ఒక వృద్ధ జంబుకం అగ్రాసనాధిపత్యం వహిస్తున్నాడు. ఆయన మా సోషలిస్టును కుర్రకుంకలు అనీ, ఎడ్డిమడ్డి మృగాలట 'పేదసాదలు వాళ్ళకు పరిపాలనలో హక్కేమిటి?' వీళ్ళకు ఎలా వస్తుందో చూస్తామన్నాడు. అంటే మాకు కోపం వచ్చి ధిక్కార సూచకంగా మేము ప్రక్కనే ఇంకో సభ చేస్తున్నాము. మీ అబ్బాయి మా సభలోకే వచ్చాడు. వినటానికి వచ్చిన జనంలో చాలామంది మా సభకే వచ్చారు.

తల్లి : తప్పేమున్నది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం.

కామ్రేడ్ : కొంతసేపు సభ జయప్రదంగా సాగింది.

తల్లి : తరువాత?

కామ్రేడ్ : ఇంతలో పోలీసువాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు వెనకనుంచీ లాఠీచార్జి చేశారు. సభంతా చిందరవందర అయిపోయింది. కొంతమంది పరుగెత్తి పారిపోయి తలలు దాచుకున్నారు.

తల్లి : (రోడ్డు మీద ఎలక్ట్రిక్ లైటు వల్ల వచ్చేకాంతిలో అతని దుస్తులు పరీక్ష చేస్తూ) నాయినా! ఆ రక్తం అదేనా?

కామ్రేడ్ : (కంటికి నీరు వస్తుంది) అవును.

తల్లి : మా అబ్బాయి ఏడి మరి?

కామ్రేడ్ : ఆ బల్ల.... దగ్గిరనే.... ఉన్నాడు

తల్లి : దెబ్బలు తగిలినవా..?

కామ్రేడ్ : సభాపతి అతనికి తగలబోయే దెబ్బలన్నిటికీ తన తల అడ్డంపెట్టి శాయశక్తులా రక్షించటానికి ప్రయత్నించాడు.

తల్లి : ఎంత పుణ్యాత్ముడో గదా! ఆయనకు ఎట్లా ఉంది ఇప్పుడు.

కామ్రేడ్ : (కన్నీటి ధార) కళ్ళు మూశాడు. తల్లి : మా అబ్బాయి ఆయన దగ్గిర కూర్చున్నాడా? కామ్రేడ్ : (కొంచెము ఓదార్చుకొని) సభాపతి కళ్ళు మూయగానే ఎక్కడిదో ఒక లాటీదెబ్బ వచ్చి మీ అబ్బాయి కణతకు తగిలింది. అబ్బాయి.... బల్ల దగ్గర...

తల్లి : (తిరిగిపోతూ ఉన్న కళ్లతో) ఆఁ!

కామ్రేడ్ : (ఆమె ముఖం చూడలేక జేబు రుమాలు అడ్డం పెట్టుకొని భోరుమని ఏడుస్తూ) చనిపోయి... నేలమీద..... ఉన్నాడు.

తల్లి : (పెద్ద కేకతో వీథి గుమ్మంలో వెనక్కు పడిపోయింది. బజారులో ఎలక్ట్రిక్ లైట్లన్నీ ఒక్క తడవగా ఆరిపోతాయి. ఆనాటి అమావాస్య చీకట్లో కళ్ళు పొడుచుకొని చూచినా, కనుపించినా కనపడని ఆకాశంలో నవజీవనం వెళ్ళబోస్తూ ప్రకాశవంతంగా మెరుస్తున్నది ఒక తార).

సమాప్తము

అముద్రితం

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.