ఇంతేగాదు, ఆయన పలుకు ప్రతిపలుకు లిఖితరూపమున వ్రాసిపెట్టును. ఆయన కిచ్చు సన్మానపత్రములు దాచలేక యాయనకార్యసిద్ధి కార్థికముగా సహాయముచేయుట సముచితముకాదా యని సలహా లిచ్చుచుండును.

మాతృదేశమునకై పితృసేవకై, స్వసుఖము వీడిన త్యాగమూర్తి. ఇట్టి తనయును గన్న తల్లిదండ్రులు ధన్యులుగదా!

గురువుతో

గాంధీజీ రాజకీయా కాశములో షోడశకళలతో వెలిఁగి నప్పు డాయనచుట్టు ననేక నక్షత్రాలు గుమిగూడి ప్రకాశించినవి. గాంధీయుగములో గణనఁగాంచిన విశిష్టమహాపురుషుఁడు పటేలు.

మహాత్మునిశక్తి, కార్యదక్షత వల్లభాయిలోను, సేవా వినయము రాజేంద్రబాబులోను, మేధ, తత్త్వజ్ఞానము రాజగోపాలాచారిలోను, విరాజిల్లినవని యొక్కవిఖ్యాత పురుషుఁడు వచించినాఁడు. ఇందులో సత్య మధికముగానున్నది. [1] "బహుశః భారతదేశమంతటిలోను వల్లభాయికంటె నెక్కువభక్తుఁడైన సహచరుఁడు వేఱొకఁడులేఁడు. అత డతిశక్తిమంతుడు; తనపనిలో భీష్మప్రతిజ్ఞకలవాఁడు. అయిననుగాంధీజీయెడల స్వయముగను, నాయన యాదర్శము నెడలను, నీతియెడలను, భక్తిగలవాఁడు." గాంధీజీని గండ్లుమూసికొని యనుసరింతు నన్నాఁడు. అది మహాత్మునియం దాయన భక్తివిశ్వాసములకు నిదర్శనము. అయినను బటేలుకు స్వకీయాభిప్రాయము, యుక్తాయుక్త విచక్షణ లేవని తలఁచరాదు. గాంధిజీ యాజ్ఞ లన్నిటిని శిరసావహించునని తలఁపరాదు. ఎదురుతిరిగిన ఘట్టాలు లేక పోలేదు. భిన్నాభిప్రాయములను వెలిబుచ్చుటయుఁ గలదు. గాంధిజీ పావలాచందాబదులు నూ లీయవలయునని ప్రతిపాదించినప్పు "డిఁకఁదమరు తప్పుకొన్న బాగుగనుండు"నని నిర్ముఖమోటమిగా నన్నాఁడు.

గాంధీజీ యహింసావాది. యుద్ధమునకు వ్యత్రిరేకి. అయినను బటేలు 1944 లో మహాత్ముని యభిప్రాయమునకు భిన్నముగా జాతీయప్రభుత్వ మేర్పాటైన, యుద్ధమునకు సహాయము చేయుదుమని చెప్పెను.

గాంధీజీ యెదుట నరమర లేకుండ సరోజినివలె హాస్యమాడుట కాయన కే గుండెగలదు. పైగా నా హాస్యము నందరకన్న నాబోసినోటి తాతయే యధికముగా నాహ్వానించువాఁడు.

గురువును మించిన శిష్యుఁడు. గాంధీజీ "క్విట్‌ఇండియా" తీర్మానము ప్రతిపాదింపఁ దాను 'క్విట్ ఏషియా' తీర్మానము ప్రతిపాదించిన ప్రఖ్యాతుఁడు పటేలు.

గాంధిజీ యాదర్శమును సూచింపఁ బటేలు సాధన మార్గమును జూపించువాఁడు. నడుముకట్టుకొని కార్యరంగములోఁ గర్మవీరుఁడై విహరించువాఁడు.

గాంధీజీతో నప్పుడప్పుడు స్వాతంత్ర్యసంపాదనలో నభిప్రాయభేదము ప్రకటించినను గాంధీజీని కాంగ్రెసు సంఘము నుండి తప్పుకొమ్మని పలికినను నా గురువునందుండు భక్తివిశ్వాసములను వీడలేదు. పైగా నాయన కార్యక్రమము కాంగ్రెసులోఁ బటిష్ఠముగా నుంచుటకు బ్రతినపూని పనిచేసినవాఁడు పటేలే. సోషలిష్టు, కమ్యూనిష్టులను దుయ్యఁబట్టి మార్క్సిజంకంటె గాంధీయిజమే ఘనమైనదని ప్రకటించిన గురుభక్తిగలవాఁడు.

అటులనే గాంధీజీకూడఁ బటేలును బుత్రసమానునిగాఁ బ్రేమించువాఁడు. ఆయన ఘనత వెల్లడించినదికూడ మహాత్ముఁడే.

ఒక్కమాటలో, వారిరువురను గుఱించి వివరించవలెనన్న గాంధీజీ యాత్మ, పటేలుశరీరము. గురుశిష్యులకుఁగల సంబంధమును స్వయముగా సర్దారుపటే లిట్లు చెప్పుకొన్నాఁడు.

[2] "మన స్వాతంత్ర్యోద్యమమున కంతకు గాంధిమహాత్ముఁడే యేకైకనాయకుఁడని మీవైస్‌చాన్సలర్ చెప్పినమాటలతో నేకీభవించుచున్నాను. ఆయనచేసిన తపస్సువల్లనే మనకీ స్వాతంత్ర్యము సిద్ధించినది. నేనుమాత్ర మాయన యాజ్ఞలను విధేయతతో శిరసావహించిన యొకసామాన్య సైనికుఁడను. గాంధీజీని గ్రుడ్డిగా ననుసరించు ననుచరుఁడని నన్ను గుఱించి యొకప్పు డందఱు తలపోయువారు. కాని గాంధీజీ నమ్మకములతో, నే నేకీభవించినందువల్లనే యాయన యడుగుజాడలలో నడుచుచున్నానని యాయనకును దెలియును, నాకునుదెలియును. చర్చలన్నను వాగ్యుద్ధములన్నను నాకు గిట్టదు. దీర్ఘ చర్చలన్న నాకుఁగంటగింపు. అనేకసంవత్సరములపాటు గాంధీజీ నేను నేకాభిప్రాయులమై యున్నాము. కాని స్వాతంత్ర్యప్రాప్తి విషయములోమాత్రమే మా యభిప్రాయములు భేదించినవి. అప్పటికప్పుడే స్వాతంత్ర్యమును బొందితీరవలయునని నే నభిప్రాయపడితిని. ఎంతో హృదయసంశోధనము చేసికొన్నపిమ్మటఁ గాని, యెంతో విచారించిన పిమ్మటగాని, నేనీ నిర్ణయమునకుఁ రాలేదు దేశవిభజనకుఁగనుక నంగీకరించకపోయిన పక్షములో భారతదేశమంతయు ఛిన్నభిన్నమై సమూలముగా నశించిపోవునని నాకుఁ దోఁచినది........ కాని గాంధీజీ యీ నిర్ణయముతో నేకీభవించలేదు. కాని యీ నిర్ణయము సరియైనదే యని, దోషరహితమైనదని, నామనస్సునకు విశ్వాసము కలిగినట్లయిన నాలాగే వ్యవహరించవలసినదని గాంధీజీ నాకుఁజెప్పెను. తనవారసుఁడుగా గాంధీజీ నిర్ణయించిపోయిన మహాపురుషుని సాహచర్యము నా కుండనే యున్నది. మా నిర్ణయమును గాంధీజీ ప్రతిఘటించలేదు. అయిన నాయన దాని నామోదించలేదు. ఆనాఁడు మే మట్టి నిర్ణయము చేసినందు కీనాఁడుకూడ నే నేమియుఁ బశ్చాత్తాపము పడుట లేదు. కాని మన సహోదరులు కొంతమంది మననుండి వేఱుపడిపోయినందులకుఁ జింతించితిమి.

మహాత్ముని మరణానంతరము ప్రజలకు సర్దారు పటేలు చేసిన యుద్బోధ స్మరింపఁదగినది. దానిలోని కొన్ని భాగాలు.

"ఈరోజు జరిగిన యీ సంఘటనకు మనము విచారమును వెలిబుచ్చవలసినదే కాని క్రోధమును జూపఁగూడదు. క్రోధము వచ్చిన నది మానవులను మఱపించును. ఇంతవఱకును మనము నేర్చుకొన్న మహాత్ముని బోధన లన్నిటిని, విస్మరింపఁజేయును. మహాత్ముని సలహా నాయన జీవితకాలములో, మన మనుసరించలేకపోతిమని చెప్పుకోఁగూడదు. మన భారతదేశ ప్రతిష్ఠకే యది భంగకరము.

మన మింతవరకు నెంతగా బాధపడినప్పటికి మన కిది పరీక్షాసమయమని మఱచిపోఁగూడదు. మనలో మనకు భేదము లేకుండ నైక్యముతో ధైర్యముగా నిలువఁబడవలయును. ఇంత వఱకు భారతదేశముమీఁదనున్న బాధ్యత చాల గొప్పది. మహాత్ముని సహాయమే లేకపోయిన నా బరువుతో మన వీపులు ముక్కలై యుండును. ఆ సాయము మనకు నేటితోఁ బోయినది. మహాత్ముఁడు భౌతికరూపములో మనకు గనపడక పోయినప్పటికి నాయనబోధన లన్నియు మన హృదయములలో నున్నవి. కనుక నాయన మనలోనే యుండును. ఱేపు సాయంత్రము 4 గంటలకు మహాత్మునికి దహనసంస్కారము జరుపఁ బడును. కాని యాయన యాత్మ మనతోనే యెల్లప్పుడు నుండును. మహాత్ముని జీవితకాలములో సిద్ధింపఁ జేసుకోలేని నన్నిటి నింకనుండియైన సిద్ధింపఁ జేసికొనవలయును.

యువకులందఱు తమ విధి నిర్వహణకు సిద్ధపడవలయును. మహాత్మునిచేఁ బ్రారంభమైన కార్యమును సమైక్యముతో సాధించవలయును."

కటకటాలమధ్య

గాంధీజీ దండిసత్యాగ్రహము సాగించినప్పుడు వల్లభాయి యాయనకు ముందుగా సమరమునకు గుజరాతు కిసానుల

  1. నెహ్రూ ఆత్మకథ, 422 పుట.
  2. కాశీ విశ్వవిద్యాలయ ప్రత్యేక స్నాతకోత్సవములో సర్దారుపటేలు 1948 నవంబరు 25 చేసిన ప్రసంగములోని భాగము.