వల్లభాయి పటేల్/కటకటాలమధ్య

మహాత్ముని సలహా నాయన జీవితకాలములో, మన మనుసరించలేకపోతిమని చెప్పుకోఁగూడదు. మన భారతదేశ ప్రతిష్ఠకే యది భంగకరము.

మన మింతవరకు నెంతగా బాధపడినప్పటికి మన కిది పరీక్షాసమయమని మఱచిపోఁగూడదు. మనలో మనకు భేదము లేకుండ నైక్యముతో ధైర్యముగా నిలువఁబడవలయును. ఇంత వఱకు భారతదేశముమీఁదనున్న బాధ్యత చాల గొప్పది. మహాత్ముని సహాయమే లేకపోయిన నా బరువుతో మన వీపులు ముక్కలై యుండును. ఆ సాయము మనకు నేటితోఁ బోయినది. మహాత్ముఁడు భౌతికరూపములో మనకు గనపడక పోయినప్పటికి నాయనబోధన లన్నియు మన హృదయములలో నున్నవి. కనుక నాయన మనలోనే యుండును. ఱేపు సాయంత్రము 4 గంటలకు మహాత్మునికి దహనసంస్కారము జరుపఁ బడును. కాని యాయన యాత్మ మనతోనే యెల్లప్పుడు నుండును. మహాత్ముని జీవితకాలములో సిద్ధింపఁ జేసుకోలేని నన్నిటి నింకనుండియైన సిద్ధింపఁ జేసికొనవలయును.

యువకులందఱు తమ విధి నిర్వహణకు సిద్ధపడవలయును. మహాత్మునిచేఁ బ్రారంభమైన కార్యమును సమైక్యముతో సాధించవలయును."

కటకటాలమధ్య

గాంధీజీ దండిసత్యాగ్రహము సాగించినప్పుడు వల్లభాయి యాయనకు ముందుగా సమరమునకు గుజరాతు కిసానుల నాయత్తపఱచుచుండెను. 1930 మార్చి 7 వ తేదీ నాయన "రాస" గ్రామము చేరెను.

అక్కడ నాయన యుపన్యాసమునకై ప్రయత్నము చేయబడెను. ఇంతలోనే జిల్లా మేజిస్ట్రేటు ఆర్డ రందఁజేయఁబడెను. అందులో నాయన యెట్టి సభలలోను, సమావేశములలోను బాల్గొనఁగూడదని తెలియఁజేయఁబడెను. ఈస్వాతంత్ర్య యోధుఁ డా పరప్రభుత్వాజ్ఞను బాటించునా? అందుచే నరెష్టు చెయ్యఁబడి మూడుమాసములుఖైదు, నైదువందల రూపాయల జరిమానా విధింపఁబడెను. ఇదియే యాయన ప్రథమకారాగార ప్రవేశము.

జైలులో నాయన బహుబాధలు పడవలసివచ్చెను. 15 పౌనులు తగ్గెను. జూన్ 16 వ తారీఖునఁ గటకటాలనుండి బయటఁబడెను. ఈ సమయములో సత్యాగ్రహము బహుతీవ్రముగా సాగుచుండెను. మోతీలాల్ నెహ్రూ అరెష్టుకాఁబడినప్పు డాయన వల్లభాయిని గాంగ్రెసుకుఁ దాత్కాలిక సభాధ్యక్షుఁడుగా నియమించెను. ఈ సమయములోనే దర్శన యుప్పు కొఠారులపై సత్యాగ్రహులు సాహసోపేతముగా దాడి చేయుచుండిరి. వేలాది స్త్రీ పురుష స్వయంసేవకులు లాఠీ చార్జీలకు గుఱియవుచుఁగూడ నద్భుతమైన శాంతిని బ్రదర్శించు చుండిరి. ఆగష్టు 1 వ తారీఖున లోకమాన్యతిలక్ వార్షికోత్సవము బొంబాయిలో నద్భుతముగా జరుపుట కూరేగింపు సాగెను. వల్లభాయి, మాలవ్య, డాక్టర్ హార్డికర్ మొదలగు ముఖ్యనాయకులు ముందు నడచుచుండిరి. విక్టోరియా టెర్మినస్ సమీపమునకు రాఁగానే యూరేగింపు శాసనవిరుద్ధమైనదని ప్రకటించి యాపుచేసిరి. ఆ సాయంకాలము 4 గంటలనుండి మఱుదినము 8 గంటలవఱకు నా రోడ్డుపైననే వా రుండిరి. ఆ రెండవ నాటి యుదయము వల్లభాయి మొదలగు వారి నరెష్టుచేయించి యితర జనమును బోలీసులు దారుణముగా లాటీచార్జి చేసిరి. వల్లభాయి మొదలగు ప్రముఖులకు మూడేసి మాసములు శిక్ష విధింపఁబడెను.

ఇటు లా సంవత్సరములోఁ బదునొకండు నెలలలో మూడుమాఱు లరెష్టు చేయఁబడినాఁడు.

ఇండియాచట్టము మూడవ రెగ్యులేషను ప్రకారము 1932, 34 సంవత్సరాలలోఁ గారాగారశిక్షల ననుభవించినాఁడు.

1940 నవంబరులో వ్యక్తిసత్యాగ్రహములో నరెష్టు చేయఁబడెను. ఆయనయు కె. యం. మున్షీ ప్రభృతులు యఱ్ఱవాడ జైలులోనే యుండిరి. ఆ జైలులో నవ్వించుచుఁ దన బాల్య జీవితములోని మధురఘట్టములన్నిటిని దెలియఁ జేయుచు నాహార పానీయములలో నందఱ నాలనపాలనలు చేయుచుండు వాఁడని మున్షీ పేర్కొన్నాఁడు.

1941లో మున్షీ జబ్బుపడ్డప్పుడు తల్లి ప్రేమతో నాయనను సాకినాఁడు.

సాధారణలోక మాయనను గర్కశునిగాఁ దలఁచును. కాని సన్నిహితులైన వా రాయనలోఁ గన్నతల్లి ప్రేమ కలదని చెప్పుదురు. "నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణాఖండలశస్త్రతుల్య" మన్న భారతకర్తమాట సర్దారుకుఁ జెల్లుబడియగును. వేయేల? సర్దార్‌జీని గుఱించి, గాంధిజీ మాటలు గమనింపఁదగినవి. "ఈయన నాయందుఁ జూపు ప్రేమ మా తల్లిగారు నా పట్లఁ జూపిన వాత్సల్యమును జ్ఞాపకము చేయుచున్నది. మాతృదేవత కుండు లక్షణము లీయనకున్న ట్లింతకుముందు నే నెఱుఁగను."

1942 ఆగష్టు 9 వ తారీఖున క్విట్ ఇండియా తీర్మాన కారణముగా వర్కింగుకమిటీ మెంబర్లతోపాటు డిటెన్యూగా దీసికొని పోఁబడెను.

ఆ వర్కింగుకమిటీ మెంబరులనుగుఱించి, వారి కార్య కలాపములనుగుఱించి, పట్టాభిగారు చెప్పినమాటలు గమనింపఁ దగినవి.

              "మౌలానా ఆజాద్ ప్రధానపురుషుఁడు.
               వల్లభాయి - యందఱకంటె వివేకము గలవాఁడు.
               జవహర్‌లాలు - చుఱుకైనవాఁడు.
               అసఫ్‌ఆలీ - యాలోచన గలవాఁడు.
               సైయ్యద్ అహమ్మద్ - నెమ్మదియైనవాఁడు.
               పండిత్ పంత్ - నిశితమైనవాఁడు.
               డాక్టర్ ఘోష్ - శాస్త్రదృష్టికలవాఁడు
               శంకరరావ్ దేవ్ - సేవాశీలములు గలవాఁడు.
               కృపలానీ - అధికారముగలవాఁడు.
               నరేంద్రదేవ్ - విద్యాశక్తిగలవాఁడు.
               హరికృష్ణమెహతాబ్ - కళాసంపత్తికలవాఁడు."
               పట్టాభిగారు - ఏమి వ్రాసికొనకపోయినను నన్నియుఁ దెలిసినవాఁడని మన మనవచ్చును.

భారతదేశమునకు వన్నె దెచ్చిన వీరులలో నేయొక రొక చోటఁ జేరినను నద్భుతమైన వెలుఁగు నందీయఁగలరు. అట్టి వీరందరు నొకచోటఁగలసి కాలము గడుపుచుండగా నెంతటి జ్యోతి కాంతు లీనుచుండునో !

అహమ్మద్‌నగరు కోటతలుపులు త్రోసికొని లోపలికిఁ బోఁగానే కుడిప్రక్క గదులలో వరుసగా వీరి కాపురములు - మొదటిగది సర్దార్‌జీది. కారాగృహములో నున్నను బయట నున్నను నాయన ప్రధానస్థాన మాయనకుఁ దప్పదు. రెండవది రాష్ట్రపతి ఆజాదుది. తరువాత ఆసఫ్‌ఆలీది. అనంతరము నెహ్రూపండితునిది. డాక్టర్ సయ్యద్ అహమ్మద్‌జీ యక్కడ నుండఁగా వీరిగదిలోనే యుండువాఁడు. అయిదవగది గోవిందవల్లభపంతుది. ఆఱు శంకర రావ్ దేవు. ఏడవది డాక్టర్ ఘోష్, ఎనిమిది పట్టాభి, తొమ్మిది కృపలానీ, పది ఆచార్య నరేంద్ర దేవు, పదనొకండవది హరికృష్ణ మెహతాబ్ - తరువాత వంటగది.

ఈ గదుల కెదురుగానుండు వరుసలో జైలు అధికారు లుందురు. వర్కింగుకమిటీ సభ్యుల సౌకర్యములు చూచుటకొఱకు యఱ్ఱవాడ జైలునుండి తెచ్చిన 13 మంది ఖైదీలుకూడ నక్కడ నుండిరి.

కోట మొత్తముమీఁద నొక్కటన నొక్కటే వృక్షమున్నది. అది సర్దార్‌జీ గది ముందున్నది. ఆయనతో నేమి పోలికలు పోల్చికొందమనియో, మఱి! లేకపోయిన సర్దార్‌జీ హాస్యమునకు నవ్వుకొనుచు నాయనకుఁ జల్లగాలి విసరుచు నుండుటకొఱకుఁ గాబోలు! ఆ వృద్ధపితను వెన్నంటి కాచి సర్వ సపర్యలు చేయు తనయ లేని లోప మా తరు వీవిధముగాఁ దీర్చు చున్నది గాఁబోలు.

పటేల్‌జీ హాస్యమునకుఁ బేరుపొందినవాఁడు. వట్టి హాస్యమేకాదు. ఆ చక్కలిగింతలోఁ జుఱుకుపోటులుకూడ నుండును.

ఆచార్య కృపలానీకూడ హాస్యరసపు జల్లులు కురిపించునుగాని దానిలో సున్నితము శూన్యము. శూలములవలె నుండును. ఆయన పలుకులు ములుకులు. ఆ పలుకులలో నాయన ప్రత్యేకతఁ బొందినాఁడు.

నెహ్రూజీ తోటమాలిగా నెక్కువ కాలము గడుపుచు నెంతో యానందము పొందుచుండువాఁడు. ఆ రసజ్ఞుఁడై జైలధికారుల నడుగకుండ సొంతసొమ్ముతో రకరకాల పూలవిత్తనములు తెప్పించి కోటయావరణలో సగముభాగము నయనా నందకరముగా, నందనోద్యానవనముగా, మార్చి వేసినాఁడు. మడులు త్రవ్వుట, కుదురులుచేయుట మొదలగు కుతూహలపుఁ బనులన్నియు స్వయముగాఁ బ్రతిరోజు చేయుచుండువాఁడు.

నెహ్రూజీ గ్రంథావలోకనములోను, గ్రంథరచనలోను గాలము గడపిన సంగతి సర్వజనవిదితము.

ఆమహామహుఁడు కారాగృహవాసము చేయకపోయినఁ బ్రపంచమున కమూల్యమైన యా సాహిత్యము నిచ్చుట కవకాశముండునా? మేలుకీళ్లు కలసియుండునుగదా!

పూర్వము తిలక్‌గారుకూడ మాండలే చెఱసాలలో గీతారహస్యమును రచించినాఁడు. మన పట్టాభిగారుకూడ ననేక గ్రంథములు జైలులోనే వ్రాసినాఁడు. అజాద్‌కూడ కురూనుపై గొప్పవ్యాఖ్యానము జైలులోనే వ్రాసినాఁడు.

మన యాంధ్రదేశములోఁగూడ మాలపల్లి మున్నగు మహత్తర గ్రంథాలు కారాగృహములోనే రచింపఁబడినవి. నవ్యసాహిత్య మెంతో కటకటాలనుండియే బయలుదేరినది.

కార్యశూరుఁడని ప్రఖ్యాతిగాంచిన మన పటేలు లోగడ నెప్పుడును బుస్తకము పట్టువాఁడుకాఁడు. కాని యీ పర్యాయము చాల తీవ్రముగా గ్రంథపఠన చేసినాఁడు. సాహిత్యము, వేదాంతము, రాజకీయములు, ఆర్థికశాస్త్రము, వ్యాపారము మొదలగువానికిఁ జెందిన గ్రంథములను 300 వఱకుఁ బఠించెను. వెల్సు, బెర్‌నార్డుషా, టాగూర్, రస్సెల్, కారల్ మార్క్సు, ఏంజిల్ ప్రభృతుల గ్రంథములన్నిటిని గాలించినాఁడు. అన్నిటికంటె నిదొక గొప్ప విశేషము.

ఇట్లే పెక్కు విధములఁ దమ కాలము నానందముగాఁ గ్రంథావలోకనముతో గడపిన మన ప్రముఖులు మూడు సంవత్సరముల యనంతరము 1945 జూన్, 15 వ తేదీన మన మధ్యకు వచ్చిరి.

సర్దార్‌జీ జన్మదినోత్సవములు

సర్దార్‌పటేలు కాడంబరములన్నను నట్టహాసములన్నను గిట్టవు. అందుచే నంతకుముందు బటేలు జన్మదినోత్సవములు చాలవఱకు నిరాడంబరముగానే జరిగినవి. కాని 70, 74 వ జన్మదినోత్సవములుమాత్రము భారతప్రజ తమ 'కర్మవీరుని'యం