వల్లభాయి పటేల్/తండ్రికిఁ దగిన తనయ

ఆ యన్నదమ్ము లిర్వురు నొకరితో నొకరు వైరుధ్యభావముతోఁ బోరాడుచుండువారు, కాని యీ విరుద్ధభావమునకు వెనుక నొక ప్రేమవాహిని ప్రవహించుచునే యుండెను.

తండ్రికిఁ దగిన తనయ

సర్దారుకు 1905 లో నొక కుమారుఁడు గలిగెను. ఆయనపేరు దయాభాయి. ఆయనకూడ శ్రీకృష్ణజన్మస్థానమున కరిగినవాఁడే. ఆయన కుమారుని కంటె విఖ్యాతయైన దాయన కుమార్తె మణిబెన్. (1907) నిజముగా నామె మణివంటిది. ఆమె గాంధీజీని బ్రథమముగా దర్శించినప్పుడు చేతిబంగారు గాజులుతీసి బాపూజీకి సమర్పించినది. అవి స్వీకరించి "స్వరాజ్యము వచ్చువఱకు మఱల నీవు గాజులు ధరించరాదు. దేశ సేవలోనే నిమగ్నురాలవై యుండవలయు"నని గాంధీజీ హితోపదేశముచేసెను. ఆమె దానిని ద్రికరణశుద్ధిగా నంగీకరించినది. నాటినుండి యామె సిరుల నవతలకుఁ ద్రోసినది. భోగాలను వీడినది. ఇంతేగాదు. వివాహమే మానినది. బ్రహ్మచర్య మవలంబించి తదేకదీక్షతో దేశసేవచేయుచున్నది. తండ్రికిఁ దోడుగా నిలచి స్వాతంత్ర్యసమరములో ముందడుగు వేసినది.

మణిబెన్‌లోఁగల యీ దివ్యభావమును, త్యాగమును జూచి, లోకము విస్తుపోవును. ఎక్కడివా యీ పోకడలని యాశ్చర్యపడును. కాని యామె జన్మించిన వంశములోని సేవాభావమును గమనించిన నా యనుమానము పటాపంచలైపోవును. గాంధీజీ యన మణిబెన్‌కు భగవంతుఁడని నమ్మకము. అందుచేతనే యాయన యాశీర్వాదము పొందుటలో, నాయన చెప్పినచొప్పున యక్షరాలఁ బ్రవర్తించుటలో, నామె ప్రసిద్ధురాలు. గాంధిమహాత్ముఁడు, లోకప్రఖ్యాతిఁ గాంచిన రాజకోట సమరముసాగించు రోజులలోఁ గస్తూరిబాతోపా టా యుద్ధములోనికి దుమికిన దీ వీరాంగన. తండ్రికిఁ దాను భక్తిగల కుమార్తెయై సేవచేయుటమాట యట్లుంచి, యాయన కెప్పుడు నండగా నిలచి రాజకీయములలో నెన్నోవిధములఁ దోడ్పడుచుండును మణిబెన్. మహాదేవ్ దేశాయి గాంధీజీకి, హుమాయూన్ కబీరు అబ్దుల్‌కలాం అజాద్‌కు, ఉపాధ్యాయ నెహ్రూకుఁ గార్యదర్శులై వారి ప్రతిభలను ధారవోసి, వారి నాయకుల కీర్తిఖ్యాతులకుఁ బాటుపడినట్లే, సర్దార్ జీకి మణిబెన్ కార్యదర్శినియై తండ్రికిఁ దగినఖ్యాతిఁ దెచ్చినది.

ఆమె యాయనకుఁ గార్యదర్శినియేకాదు. అంగరక్షకురాలుకూడ. అంగరక్షకురాలేకాదు. తనయయై, తల్లియై, సర్దార్ పటేలున సాకుచున్న సేవావ్రతురాలు.

ఆయన యాహారవిహారములలో జాగ్రత్తఁ దీసికొని యాయన యారోగ్యమును గాపాడుటేగాక, దర్శకుల కనుమతి నిచ్చి యాయన కలసటలేకుండ ననుక్షణ మధికజాగ్రత దీసికొనుచుండు దాది.

వేయేల? ఆయన కామె కార్యదర్శిని, అంగరక్షకురాలు, తనయ, సమాలోచనకర్త్రి, సలహాదారు.

ఆమె వర్కింగు కమిటీ సభలకేకాదు, మంత్రాలోచన సభలకుఁగూడ వెళ్లునందురు. తండ్రిని విడచి యామెయుండదు. ఇంతేగాదు, ఆయన పలుకు ప్రతిపలుకు లిఖితరూపమున వ్రాసిపెట్టును. ఆయన కిచ్చు సన్మానపత్రములు దాచలేక యాయనకార్యసిద్ధి కార్థికముగా సహాయముచేయుట సముచితముకాదా యని సలహా లిచ్చుచుండును.

మాతృదేశమునకై పితృసేవకై, స్వసుఖము వీడిన త్యాగమూర్తి. ఇట్టి తనయును గన్న తల్లిదండ్రులు ధన్యులుగదా!

గురువుతో

గాంధీజీ రాజకీయా కాశములో షోడశకళలతో వెలిఁగి నప్పు డాయనచుట్టు ననేక నక్షత్రాలు గుమిగూడి ప్రకాశించినవి. గాంధీయుగములో గణనఁగాంచిన విశిష్టమహాపురుషుఁడు పటేలు.

మహాత్మునిశక్తి, కార్యదక్షత వల్లభాయిలోను, సేవా వినయము రాజేంద్రబాబులోను, మేధ, తత్త్వజ్ఞానము రాజగోపాలాచారిలోను, విరాజిల్లినవని యొక్కవిఖ్యాత పురుషుఁడు వచించినాఁడు. ఇందులో సత్య మధికముగానున్నది. [1] "బహుశః భారతదేశమంతటిలోను వల్లభాయికంటె నెక్కువభక్తుఁడైన సహచరుఁడు వేఱొకఁడులేఁడు. అత డతిశక్తిమంతుడు; తనపనిలో భీష్మప్రతిజ్ఞకలవాఁడు. అయిననుగాంధీజీయెడల స్వయముగను, నాయన యాదర్శము నెడలను, నీతియెడలను, భక్తిగలవాఁడు."

  1. నెహ్రూ ఆత్మకథ, 422 పుట.