వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/సప్తమాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

సప్తమాశ్వాసము

క.

శ్రీనరకంఠీరవభయ, దాననగహ్వరమహాట్టహాసకఠోర
ధ్వానదళితాష్టదిగ్విజ, యానక యీశ్వర వసుంధరాధిపునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు సర్వంసహకు ని ట్లనియె నట్లు మహాతపోమునీశ్వ
రుండు నందోత్పత్తి చెప్పి ప్రజాపాలుం గనుంగొని నరేంద్రా యింక దిక్కుల
జన్మంబు విను మని వివరింపం దొడంగె నాదిసర్గంబున నైసర్గికమహామహుండు
పితామహుండు తనవినిర్మింపం గలప్రజల కవకాశం బెట్లు దొరకునో యని చిం
తించుచున్న యవసరంబున.

2


క.

అక్కమలజుకర్ణంబులఁ జక్కనికన్యకలు పదురు జనియించిరి లేఁ
జెక్కులడాలు తళుక్కుత, ళుక్కు మనఁగ వాలుఁజూపులు పిసాళింపన్.

3


సీ.

ఆకన్యకలలోన నార్వురు ముఖ్యలై పరఁగఁ బ్రాగ్దక్షిణపశ్చిమోత్త
రోర్ధ్వాధరాఖ్యల నున్ననల్వురు భారతీనాథునకు మ్రొక్కి దేవ మాకు
నిలువ ఠావులు వల్లభులు వలె నని విన్నవించిన శతకోటివిస్తృతంబు
బ్రహ్మాండ మిందులోపల నిచ్చ వచ్చిననెలవుల నిలువుండు నెలఁతలార
మీకుఁ బ్రాణేశ్వరుల వినిర్మింతు ననిన, నట్ల వసియించుటయు సరోజాసనుండు
నధికబాహుప్రతాప దృప్తాసురేంద్ర, హరణశీలుర లోకపాలుర సృజించి.

4


సీ.

పవిపాణి నొకతెకుఁ బ్రాణవల్లభుఁ జేసి పావకు నొకతెకు భర్తఁ జేసి
దిననాథసుతు నొకతెకుఁ బెనిమిటిఁ జేసి మనుజాశి నొకతెకు మగనిఁ జేసి
మకరాకరస్వామి నొకతెకుఁ బతిఁ జేసి వాయువు నొకతెకు వరునిఁ జేసి
యక్షేంద్రు నొకతెకు నధినాయకునిఁ జేసి యీశాను నొకతెకు నీశుఁ జేసి
తాను శేషోరగంబు నూర్ధ్వకు నధరకుఁ, గర్త లైరి వసుంధరాకాంత నాఁడు
మొదలు గాఁ గల్గె నైంద్రిప్రముఖము లైన, నామధేయంబు లష్టదిక్కామినులకు.

5


క.

దశమీదివసంబున నీ, దిశలు వొడమెఁ గానఁ దత్తిథిం గథ విని ద
ధ్యశనము మానవులు భుజిం, ప శాశ్వతబ్రహ్మలోకపదవులు దొరకున్.

6

ఉ.

ఇంక శరీరవాయువు ధనేశ్వరుఁ డైనవిధంబు చెప్పెదం
బంకరుహప్రసూతికిఁ బ్రపంచవినిర్మితివేళ వెళ్ళ నా
తంకవిధాయి తీవ్రసికతల్ వెదచల్లుచు నూర్పుగాడ్పు కూ
లంకషసప్తసాగరజలంబులు తువ్వర గాఁగ రువ్వఁగన్.

7


క.

ఆపవనుం గనుఁగొని భా, షాపతి వారించి నీవు శాంతిపరుఁడవై
రూపంబు దాల్పు మనఁ దా, రాపరివృఢుఁ బోలుమూర్తి గ్రక్కునఁ దాల్చెన్.

8


సీ.

ఈరీతి శాన్తి వహించినపురుషుండు నలువపంపున దేవతలబలంబు
విత్తంబు రక్షించి విత్తేశ్వరాహ్వయంబున నిల్చె నాతండు జనన మైన
ఘస్ర మేకాదశిగాన నాఁడు నరుండు కథ విని వహ్నిపక్వంబు గాని
భక్ష్య మాహారింపఁ బ్రాపించు సకలసంపత్సౌఖ్యములు ప్రజాపాల యింక
నాదిమక్షేత్రమున మనం బైనవిష్ణు, దేవుఁడు ప్రయోజనార్థంబు దేహ మెత్తి
సంచరించుట సరసభాషావిజృంభ, ణమున వినిపింతు సావధానముగ వినుము.

9


వ.

నారాయణాత్మకుం డైనచతుర్ముఖుండు మున్ను తనవినిర్మించినసృష్టి గనుంగొని
యీసృష్టి పాలింప నాక తక్క నన్యులకు వశంబు గాదు గావున నమూర్తత్వంబు
మాని పాలనాసమర్థం బైనమూర్తి వహింతు నని చింతించుకాలంబున మనంబు పరి
గృహీతాపఘనంబై పురోభాగంబున నున్న నన్నిరవధికతేజఃప్రసారం బైనశరీ
రంబులోన నానాభువనంబులు ప్రవేశించిన విరించియు నించుకవడి విచారించి
తా మొదల వాగాదులకు నిచ్చినవరంబు దలంచి నీవు సర్వజ్ఞుండవు సర్వలోకనమ
స్కృతుండవు సర్వలోకకర్తవునై వర్తింపుము భవజ్జఠరంబున ముజ్జగంబులు ప్రవే
శించుటంజేసి పరమతపోధనవిధేయంబు విష్ణునామధేయంబు గలిగె నని పలికి
ప్రకృతిస్థితుం డయ్యె నప్పుడు.

10


గీ.

అప్రమేయుండు విష్ణుండు నాదికాల, బుద్ధి సర్వంబు మానసంబునఁ దలంచి
యోగనిద్రానుభవకేళి నోలలాడె, నింద్రియార్థాస్తరణభుజగేంద్రశయ్య.

11


సీ.

ఆతనినాభిరంధ్రాంతరంబున నొక్కపద్మంబు పుట్టె నాపద్మమునకు
విరివి సప్తసముద్రవేష్టితసర్వసర్వంసహ కర్ణిక రత్నసాను
వారత్నసానువుపై రవికోటిప్రభాభాసురం బైనబ్రహ్మగృహము
గనుపట్టె నేతత్ప్రకారప్రభావంబు గలవిష్ణు దుర్వారకలుషజిష్ణుఁ
గాంచి తద్దేవదివ్యవిగ్రహగతుండు, పరమపురుషుడు నేఁడు నా పనులు సిద్ధిం
బొందె నని సమ్మదంబునఁ బొదలి పొదలి, పలికె ని ట్లని గంభీరభాషణముల.

12

వ.

ఇంద్రనీలతమాలకువలయాంజనాభ కంజనాభ నీవు నిరంతరంబును జ్ఞానవిభేదనా
ర్థంబు ఖడ్గంబును ధర్మభేదనార్థంబు గదాదండంబును ధరియించి కాలచక్రంబు
చక్రంబుగా సవిద్యాజయంబు శంఖంబుగా భూపదంబు పదంబుగా యజ్ఞాంగంబు
ముసలంబుగా భూతమాలిక కంఠమాలికగా సుధాకరమార్తాండమండలంబులు శ్రీవ
త్సకౌస్తుభంబులుగా సమీరణుండు గరుత్మంతుఁడుగా సవరించి నానాభువనగామిని
లక్ష్మీభామిని వరియించి ప్రతియుగంబున వివిధరూపంబుల నవతరించి శిష్టరక్షణం
బంగీకరించి దుష్టరాక్షసుల సంహరించి విహరింపు మనియె నవ్విష్ణునిజన్మదివసంబు
గావున ద్వాదశినాఁడు కథ విని హయ్యంగవీనాహారు లైనవారికి శాశ్వతస్వర్గ
భోగంబులు గలుగు నింక ధర్మంబు జన్మించినవిధంబు వినుము.

13


క.

మును సరసీరుహగర్భుఁడు, తనమదిలో మద్వినిర్మితప్రజ ధర్మం
బున మెలపఁజాలు పురుషుం, డనవద్యుం డొకఁడు వలయు నని చింతింపన్.

14


శా.

ఆకంజాసనుదక్షిణాంగమున నీహారేందుకుందప్రభా
నీకాశుం డవదాతపట్టవసనాన్వీతుం డతిస్థూలము
క్తాకర్ణాభరణుండు పుట్టె నొకఁ డత్యంతక్షమావంతుఁడై
నాకానోకహపుష్పగంధిమకుటన్యస్తాంజలుల్ మీఱఁగన్.

15


శా.

వానిం జూచి పితామహుండు నగుచున్ వత్సా జగజ్జంతుసం
తానంబుల్ భవదీయశాసనమున వర్తింప సత్కీర్తితో
నీనేర్పుల్ గొనియాడ నుండు మని మన్నింపం జతుష్పాదుఁడై
తా నిల్చెన్ సుజనానురంజనముగా ధర్మాభిధానంబునన్.

16


సీ.

ఈరీతి సకలలోకైకనాయకుఁ డైనధర్ముండు నాల్గుపాదములు నిలిపి
కృతయుగంబున సంచరించుఁ ద్రేతాయుగంబున మూఁడుపాదముల్ మోపి నడచు
మెలఁగు రెండంఘ్రుల మెట్టి ద్వాపరయుగంబునఁ గలియుగమున వెనుకఁ ద్రొక్కి
తొక్కి ప్రవర్తించు నొక్కకా లూఁది ప్రజాపాలమానవేశ్వరవతంస
వినుము సచరాచరాంతరంబున వసుంధ, రామరక్షత్రవైశ్యశూద్రాన్వయముల
నామహాత్ముండు భాగంబు లాఱు మూఁడు, రెండు నొకటియునై విహరించుచుండు.

17


క.

ఈకరణి ధర్మపురుషుఁడు లోకత్రయపూర్ణుఁడై నిలుచువేళ నహ
ల్యాకాముకగురుతోడ నిశాకరుఁడు తదేకనిష్ఠఁ జదువుచు నుండన్.

18


క.

ఆగురువు చిగురుఁబోఁడి స, దా గరగరనై మనోజుతరవారిగతిన్
సోగ మెఱుంగుతెఱంగునఁ, దా గేహములోన మెలఁగుఁ దారుణ్యమునన్.

19

క.

ఈగజగామినిఁ గామిని, నేగతి నే సందు గొందు నిఁక నని విధుఁడున్
వేఁగుచు గురుఁ డిలు వెళ్ళిన, చో గానము చేయు నవ్వుఁ జూచిన మ్రొక్కున్.

20


సీ.

నైపుణి లిపిలేఖనం బొనర్పక ఫలకమునఁ దద్రూపలేఖన మొనర్చు
కరపుస్తకావలోకనము సల్పక తదాకారరేఖావలోకనము సల్పు
వ్యాఖ్యానశబ్దంబు లాలకింపక తత్పదాంగదశబ్దంబు లాలకించు
తనలోన శాస్త్రచింతనలు చేయక తన్నితంబసంస్పర్శచింతనలు చేయు
నివ్విధంబున దివసంబు లెన్ని యైనఁ, గడపి వేసరి గీష్పతికన్ను మొఱఁగి
తెగువ నొకనాఁడు పైకొంగు తిగిచి తార, సమ్మతిలుటయు నోలాడె సౌఖ్యజలధి.

21


క.

ముల్లోకంబుల జనములు, రోళ్ళన్ రోకఁడఁ బాడ రోయక మఱియున్
వెల్లవిరి గాఁగఁ దిరిగి న, గళ్ళకు నయగారి మెలఁతుకం గొనిపోయెన్.

22


గీ.

పోయి పెద్దలు చెప్పినబుద్ధి వినక, కిల్బిషం బని మానక కెలనివారు
నగుట యెఱుఁగక రాజు తా నగుటఁ జేసి, దారవలె నవ్విధుఁడు సదా రమింప.

23


గీ.

ధర్ముఁడు వడంకి కడుపాపకర్ముఁ డైన, చెడుగు హిమధామునకు బుద్ధి చెప్పనేని
తప్పుఁ గార్యంబు బ్రహ్మచిత్తంబు మిగుల, నొచ్చు నాకు నదక్షత వచ్చు ననుచు.

24


క.

అరుదెంచి పలికె ని ట్లని, గురువులసతి నెట్టు వేసికొంటివి నీకున్
వరుసా కటకట దోషా, కర యీపాతకము సేయఁగాఁ గాదు సుమీ.

25


సీ.

అఖిలవేదాతీతుఁ డైనశ్రీమ న్మహాదేవుండు నిను శిరసావహింప
ముప్పుత్రిప్పులు లేక ముప్పదిమూఁడుకోటులు సుధాంధసులు నీవలన బ్రతుక
తండ్రి దుగ్ధపయోనిధానంబు నినుఁ దనకన్నులారఁగఁ జూచి మిన్నుముట్ట
పరమధర్మంబు దప్పక చతుర్దశభువనంబులు నీశాసనమున మెలఁగ
రాజవై వేఁడు కడపట నోజ మాలి, తెచ్చుకొంటివి పాయనితిట్టు రట్టు
నకట యిఁక నైన నా చెప్పినట్లు చేసి, దేవతాచార్యునకుఁ దారఁ దిరుగ నిమ్ము.

26


క.

ఈనీదుర్వ్యసనము విని, నానాభువనముల జనులు నయహీనత రా
జానుమతోధర్మ యనం, గా నడుతురు గానఁ దగవు గాదని పలికెన్.

27


క.

ఆపలుకులు విని కామాం, ధోపి న పశ్యతి యనన్ శశాంకుండు దురా
లాపము లాడక పొ మ్మని, కోపాటోపమున వెడలఁగొట్టించుటయున్.

28


క.

ఏగె మణిహంబు మాని మ, హాగహనంబునకు ధర్ముఁ డవమానముతో
వేగమ ధర్మస్యత్వరి, తాగతి యనువచన మివ్విధం బయ్యె ననన్.

29


క.

ఈవిధమున దుష్కర్మము, త్రోవ నడవఁ గడఁగి నలుగురుం జూడఁగఁ దా
రావిటుఁ డటు చేసినపరి, భావంబున ధర్ముఁ డడవిపా లైనతఱిన్.

30

సీ.

ప్రభువు లాశ్రితపక్షపాతంబు విడిచిరి పుణ్యవర్తనములు పొనుగువడియె
ప్రాజ్ఞులు వేదశాస్త్రంబులు మఱచిరి సకలవర్ణములు బెజ్జంబు గలసె
బలవంతు లధముల బాధింపఁ దొడఁగిరి యిల్లాండ్రయీలువు లెత్తిపోయె
సత్యంబు పలుకుట జనులు చాలించిరి చెడియె నుత్తములదాక్షిణ్యగుణము
పాడి దప్పిరి నృపతులు బలసెఁ గొండె, మడఁగెఁ దాలిమి మాత్సర్య మతిశయిల్లెఁ
జెల్లె దయ పాతకంబులు వెల్లివాఱెఁ, గ్రమ్మె దుర్వ్యసనంబులు దిమ్ము రేఁగె.

31


మ.

జగతీనాయక యిట్లు ధర్మము వినాశం బైన దేవాసురుల్
తగవుల్ దప్పి పరస్పరాంగనల నుద్దండంబునం బుచ్చుకో
జగడం బత్యధికంబు గాఁ దొడఁగుటన్ శాంతంబు గావింప రా
క గుముల్ గూడి రణంబు చేసిరి వడంకన్ మూఁడులోకంబులున్.

32


క.

అప్పుడు నారదసంయమి, చెప్పిన విని కళవళంబు చిత్తాబ్జములో
నుప్పతిల నంచతేజీ, నెప్పళమున నెక్కి నలువ నిలువక వచ్చెన్.

33


గీ.

వచ్చి కలహంబు వారించి వారివలన, నిజతనూజుండు ధర్ముండు రజనికరుని
చేఁ దిరస్కృతుఁడై వనసీమమునకుఁ, నరుగుట యెఱిఁగి తత్సురాసురులు గొలువ.

34


వ.

చరాచరశరణ్యుండు హిరణ్యగర్భుండు మహారణ్యంబు చొచ్చి వృషభరూపంబున
విహరించుధర్మపురుషుం జూపి యీపరమపావనుం గొనియాడుం డనిన దేవ
దానవులు మకుటతటఘటితాంజలులై హారనీహారతారాధనధవళాంగ చతుశ్శృంగ
సముత్తుంగద్విమస్త సప్తహస్త సఫలీకృతవేదవాద చతుష్పాద సకలసృతిపురా
ణేతిహాసప్రసిద్ధత్రిబంధబంధమోక్షలక్ష్మీకరారవిందలీలాదర్శక సర్వమార్గప్రదర్శక
పాపతిమిరాపనోదనప్రదీప సమస్తదైవతస్వరూప వాన లేని సస్యంబులకైవడి నీవు.
లేని కారణంబున లోకంబులు చీకాకుపడియె మృగాంకుండు చేసినతప్పు సహించి
మమ్ము నిర్వహింపు మని సన్నుతించినఁ బ్రసన్నుండై ధర్మదృష్టి విలోకించిన వారు
విగతసమ్మోహు లైరి పితామహుండును వత్సా నీవు సంచరించుటంజేసి యిక్కాన
నంబు ధర్మకాననం బనం బరంగు బ్రాహ్మణవదనంబులు సదనంబులుగా నిలిచి నీవు
పూర్వప్రకారము త్రిభువనంబులు శాసింపు మని సన్మానించి యిది మొదలు ధర్మంబు
గడవక నడవుం డని సురాసురుల వీడ్కొలిపి నిజనివాసంబునకు విజయం చేసె
నిట్టిధర్మునిజన్మదినంబు గావునఁ త్రయోదశినాఁడు కథ విని పాయసాహారంబు భుజి
యించిన జనంబులకు ననేకధర్మంబులు సిద్ధించు విశేషించి యీధర్మోత్పత్తి శ్రీ
కాలంబునఁ బఠించినఁ బితరులకుఁ బునరావృత్తిరహితశాశ్వతబ్రహ్మలోకంబు
గలుగు మహీవల్లభ యింక మహాతత్త్వంబు రుద్రుండై పుట్టినవిధంబు వినుము.

35

సీ.

మును ధాత కల్పాంతమున నిద్ర దెలిసి లోకవినిర్మితికి వగ గాన లేక
సంక్షుబ్ధుఁ డైన రజస్తమోగుణము లుద్రేకంబుఁ జూపె నారెంట రక్త
నీలవర్ణుండు త్రినేత్రుండు తేజఃప్రభావధూర్ధరుఁ డొక్కబాలకుండు
జనియించి మ్రోల రోదనము చేసిన రుద్రుఁ డనుపేరు పెట్టి పుత్రా చరాచ
రంబు సృజియింపు మన గాఢాంబుపూర, మధ్యమంబున మునిఁగి నిర్మాణశక్తి
తనకు సిద్ధించుకొఱకునై తపము చేయఁ, బూనె నారాయణునిమనంబున గుఱించి.

36


క.

ఈరీతి రుద్రుఁ డరిగిన సారసగర్భుండు మానసంబునఁ గనియెన్
సారాచారులఁ బుత్రుల, వారివలన జగము సంభవం బైనతఱిన్.

37


సీ.

కమలాసనప్రీతిగా దేవతలు సప్తతంతువు గావింపఁ దపము మాని
వారిపూరంబు వెల్వడి వచ్చి రుద్రుండు యజ్ఞకోలాహలం బాలకించి
నను మీఱి యీభువనంబు లెవ్వండురా సృజియించి మఖము చేయించువాఁడు
కొట్టివైచెద నని కోపించి నిజతనూద్భవ మైనభూతభేతాళయోగి
శాకినీడాకినీపిశాచములు పెక్కు, వేలు లక్షలు కోటులు విండ్లు గదలు
ముసలములు ముద్గరంబులు మొదలుగా న, నేకశస్త్రాస్త్రములు ధరియించి కొలువ.

38


క.

క్రతుశాలఁ జొచ్చె నత్యు, ద్ధతి నోంతత్సద్గుణాన్వితంబుఁ జతుర్విం
శతిహస్తమాత్రమును నై, శితశరములు గురియుధనువు చేతం గొనుచున్.

39


వ.

ఇట్లు సవనవాటంబు పాటపరిం జొచ్చి నిరాఘాటపరాక్రమంబున శక్రముఖ్యాఖిల
నిలింపపరంపర వెంపరలాడి భగునికన్నులు గెలికి పూషార్కునిపండ్లు డుల్ల మొత్తి
యజ్ఞపురుషునిబీజంబులు దునిమిన నతండు మృగరూపంబునఁ గారడవికిం బఱచె
నంత భారతీకాంతుండు రౌద్రసమున్నిద్రు రుద్రుం జేరి సాంత్వనవచనంబుల శాంత
స్వాంతుం గావించి కవుంగిలించి దేవతల విలోకించి మీర లమ్మహానుభావు సంస్తు
తించి కృతార్థులు గండని పలుకుటయు వారు సింధురాంధకజలంధరసప్తతంతు
కంతుకృతాంతసంహరణాదిభూతభవిష్యద్వర్తమాననానావిధజయాంకమాలికలను
వర్ణించిన మెచ్చి వేఁడినవరంబు లిచ్చె నట్టిరుద్రునిజన్మదినంబు గానఁ జతుర్దశి
నాఁడు పశుపతిం బూజించి కథ విని గోధూమాన్నంబు భుజియించినమానవులకు
భోగమోక్షంబులు గలుగు వసుంధరాధ్యక్ష యింకఁ బంచతన్మాత్రలు పితరులై
పుట్టినతెఱంగు వినుము.

40


గీ.

మును చరాచరనిర్మిత్సవనజభవుఁడు, మానసంబునఁ బంచతన్మాత్రలు వెలి
చేసి నిశ్చలయోగవిద్యాసమేతుఁ, డై పరంజ్యోతి భావించునవసరమున.

41


మ.

నయనాశ్చర్యముగా నిజాంగమునఁ దన్మాత్రల్ పిబామ స్తరా
మ యటంచుం బురుషాకృతుల్ మెఱయ జన్మం బైన నాభారతీ

ప్రియుఁడున్ వారల ధూమవర్ణములవారిం దిర్యగూర్ధ్వాస్యులన్
వియదధ్వాభిముఖప్రయాణపరులన్ వీక్షించి లేనవ్వుతోన్.

42


గీ.

ఓతపసులార మీలోన నూర్ధ్వవదను, లైనవారలు నాందిముఖాఖ్య మెలఁగుఁ
డగుఁడు పితృదేవతలు తిర్యగాస్యులైన, వారలు గృహస్థులకుఁ దరువాయి వినుఁడు.

43


వ.

మీమార్గంబు దక్షిణాయనంబు మీదివసం బమావాస్య తద్దివసంబున నుపవసించి
కుశవేధ చేసి కుశతిలోదకతర్పణంబుల మీకు సంతృప్తి గావించుపుణ్యాత్ములకు
వరంబు లిండని చతుర్ముఖుండు నియమించె విశ్వంభరాతలేశ్వరా యింక సోమో
త్పత్తి వినుము.

44


సీ.

నలువమానసపుత్రునకు నత్రిమునికి నందనుఁ డైనసోముండు దక్షసుతల
నిరువదియేడ్వుర వరియించి వారిలోఁ గుసుమసాయకరత్నగోపురాధి
రోహిణి రోహిణి రూపరేఖావిశేషంబున హెచ్చ నచ్చామమీఁది
వలపులు దల కెక్కి కల నైనఁ దమవంకఁ గడకంటఁ జూడమి కడమసతులు
విరహసంతాపభరమున వేఁగి వేఁగి, పుట్టినింటికి నొకనాఁడు పోయి లోచ
నాంబుధారలఁ దండ్రిపాదాంబుజములు, గడిగి పలికిరి కంఠగద్గదికతోడ.

45


చ.

అనవరతంబుఁ గోకతిమిరాంబురుహంబులు పూర్వజన్మవా
సనలఁ దుషారధామకరసంగతికల్మికి నొచ్చుఁ గాని మా
ఘనకుచచక్రముల్ కబరికాతమముల్ వదనారవిందముల్
జనక తుషారధామకరసంగతి లేమికి నొచ్చుఁ జూడుమా.

46


గీ.

ఆలి నొల్లనివాఁడు దా నీలకూర, కుప్పు చాల లే దన్నట్లు తప్పు లేని
తప్పు గొట్టించు మమ్ము సంతతము నేమి, చెప్పుకొందుము నీతోడ సిగ్గుపడక.

47


సీ.

నీహారసలిలంబు నించి కాంచనకలశముల మజ్జన మార్పఁ జనవు లేదు
పచ్చలకూటంబుపైఁ బళ్ళెరంబు పెట్టినవేళ వడ్డింపఁ జనవు లేదు
కప్రంపుఁబలుకుబాగాల నర్పించి నేర్పున నాకు చుట్టి యీఁ జనవు లేదు
పర్యంకతలమునఁ బవ్వళించినఁ జేరి చరణాంబుజము లొత్తఁ జనవులేదు
మాకు నెన్నండు నత్రికుమారు దక్క, నేలుకొన్న గయాళిరోహిణికిఁ దక్క
పాప మెటువంటిదో కాక భాగ్యవంతుఁ, డైనపెనిమిటి గలిగియు లేనిఫలము.

48


క.

అని విన్నపంబు చేసిన, తనయల నూరార్చి వచ్చి దక్షుఁడు తాఁ జె
ప్పినబుద్ధి విననిశశిపైఁ, గినిసి కనుంగొనలు దోరగిల నిర్దయుఁడై.

49


క.

ఖలవృత్తి మత్తనూజల, నొలపక్షము చేసి వరుస లొసఁగక శోకా
కులితలఁగాఁ జేసినచం,చలచిత్తుఁడ చెడు మటంచు శపియించుటయున్.

50

ఉ.

ప్రామిడి కానఁ గించిదపరాధము సైపక యిట్లు దిట్టఁగా
నేమి ఫలంబు గల్గె నశియింపుము నీవు నటంచు సోముఁడున్
మామ నవంధ్యకోపమున మాఱుకు మాఱు శపించి సృష్టిలో
నామవినాశమై వెదకినం బొడగానఁగ రాక పోయినన్.

51


సీ.

గ్రక్కున సప్తపారావారవలయితక్షోణిమండలి వాన గురియ దయ్యె
వాన లేనికతాన వాడి వత్తులవలె సకలసస్యంబులు సమసి పోయె
సకలసస్యంబులు సంక్షయించిననిమిత్తంబున జీవిసంఘంబు నలిగె
జీవిసంఘంబు నొచ్చినకారణంబున సవనకృత్యంబులు చట్టువడియె
సవనకృత్యంబు లడఁగిన నవసి నవసి, వాసవాదిసుపర్వులు వరుగులై జ
గల్లతామూలకందంబు గమలనాభుఁ, డున్నకడ కేగి యాదశ విన్నవింప.

52


గీ.

ఆరమాభర్త నిర్జరులార యిప్పు, డోషధీమూలముల సోముఁ డున్నవాఁడు
గానఁ దడయక మీరు రాక్షసులు దుగ్ధజలనిధానంబు దరువుఁ డోషధులు వైచి.

53


చ.

అని వనమాలి వేల్పులకు నానతి యిచ్చి మృగాంకశేఖరున్
వనరుహసంభవుం దలఁప వారును వచ్చిరి వారుఁ దాను వా
హనముల నెక్కి పోవుచుఁ బ్రియంబునఁ జూచిరి ఫుల్లకేతకీ
వనసురభీకృతత్రిపురవైరిమహారధి దుగ్ధవారిధిన్.

54


క.

కని రాజహంసలు భజిం, ప నున్నమత్పుండరీకమండలములు డా
కొనఁ జక్రవర్తులవిధం, బున నానాద్వీపరక్షఁ బొదలుతదబ్ధిన్.

55


క.

డగ్గఱి జలపానాగత, దిగ్గజకటగళితమదనదీసౌరభస
మ్యగ్గంధవహము తనువుల, మొగ్గచెమట లాఱ విసర ముదితాత్మకులై.

56


సీ.

తేలెడుపవడంపుఁదీఁగెలు వాహినీసతులు దీసిననఖక్షతము లనఁగ
నూరుల విహరించ నురగులమణిఫణంబులు భుజాంగదముల మొగపు లనఁగ
నాడ కాడకు మీఱ నాడెడుజలధరస్తోమంబు బడబాగ్నిధూమ మనఁగ
దాటుమీనంబులు తత్స్థితాసురవీరు లెగురవైచిన శాతహేతు లనఁగ
సంతతంబును బహువిశేషముల మెఱసి, యీసుధాంభోనిధానంబు దృక్కరంభ
మై మనమనంబులకు మోద వహించె, ననుచు నొండొరుతోఁ జెప్పుకొనుచు నిలిచి.

57


శా.

ఆవైకుంఠహరాబ్జజుల్ వనుప హల్లాల్లధ్వనిన్ మందర
గ్రావంబున్ సురదైత్యకోటి వెఱుకంగా నొప్పె రంధ్రంబు నై
జావాసంబుననుండి వాసుకిమహావ్యాళంబు నేత్రర్థమై
రా విస్తారపుఁద్రోవ చేసినగతి బ్రాప్తాతిగంభీరతన్.

58

వ.

ఇట్లు మందరాగం బమందరాగంబునం బెకలించి తెచ్చి కవ్వంబుగా నమర్చి వా
సుకిం దరిత్రాడు చేసి వివిధౌషధివితానంబు సుధాంబునిధానంబున వైచి వైచిత్రి
మెఱయ మఖవత్ప్రముఖనిఖిలాదిత్యులు దైత్యులు వాలంబును శిరంబునుం జుట్టి
పట్టి త్రచ్చి త్రచ్చి దృఢముష్టినిపీడనంబునం గరతలంబులు పొక్కినఁ దొలంగువా
రును జంగసాచినపదంబులు నొప్పిదీఱ నప్పటప్పటికి వీడ్వడ నిడుసమయంబునం
గానక త్రొక్కిన నలుంగువారును సవ్యాపసవ్యభ్రమణరభసంబునం దోడుతోడం
దొరఁగుమందరగండశైలంబులు దాఁకిన లోఁగువారును నేత్రశ్రవోవదనగహ్వర
జిహ్వాలవిషనిశ్వాసవైశ్వానరంబు సెకలు సోఁకిన వేఁగువారును సముల్లోలకల్లోల
హల్లీసకప్రభూతజంఝానిలంబులు చఱచి కొట్టినం గూలువారును నిరంతరమథన
ప్రయాసవశంబున దప్పి పుట్టిన దగదట్టి సోలువారును నైన నుభయపక్షంబులలో
పలఁ గొందఱు ధైర్యంబుకలిమిఁ బ్రాణంబులు పిడికిటం బట్టుకొని వట్టిబిగువున
నిలిచిన విలోకించి కించిద్విహసనంబులు వదనారవిందంబునకు విందులుగా గోవిం
దుండు సంభ్రమంబున.

59


శా.

వాచామాధురి దేవదానవుల నాశ్వాసించుచున్ వచ్చి ధ
ట్టీచామికరచేలమున్ బిగియఁ గట్టెన్ మీఁదికిం ద్రోచె బా
హాచంచన్మణికంకణంబులు గృహీతాహీంద్రపుచ్ఛాననుం
డై చేచేత మథింపఁగాఁ దొడఁగె దుగ్ధాంభోనిధిన్ భూవరా.

60


సీ.

నగఘర్షకండూయనము సౌఖ్యమునఁ గూర్కు పట్టుకూర్మము గుఱుపెట్టె ననఁగ
నద్రిమూలోపలాహతుల భగ్నము లైనచిప్పల ముత్యాలు చెదరె ననఁగ
నచలనిర్మథనజాతాత్యుష్ణమున సుధాంభోనిధానముమేను పొక్కె ననఁగ
క్ష్మాధరోత్తుంగశృంగవిఘట్టనమునఁ జుక్కలు రాలి తెట్టువ గట్టె ననఁగ
ఘుమఘునుధ్వానకోలాహలములు చెలఁగ, గగనవీథికి దుగ్ధశీకరము లెగసె
తఱుచుగా బుద్బుదంబులు దలలు సూపె, నాల్గువంకలఁ గలయ ఫేనములు గ్రమ్మె.

61


క.

ఆసలిలాకరమథనము, చే సోముఁడు పుట్టె నిజరుచిస్థగితాశుం
డై సర్వశాస్త్రమథనము, చే సుజ్ఞానంబుకరణి శ్రీపతియెదుటన్.

62


వ.

ఇట్లు చరాచరప్రపంచంబునకుఁ బ్రాణం బైనసోముండు సంభవించిన సంతోషించి
మధుకైటభారాతియు నీరాకరమథనక్రీడ చాలించి వైకుంఠంబునకుం జనియె నది
మొదలుగా ధూర్జటి జటాజూటంబున సోమకళ ధరించు క్షేత్రజ్ఞుండును జలాత్ము
కుండును నైనసోమునివలనఁ బ్రతిపదాదివాసరాధిదైవతంబులు పదార్వురుదేవమాన
వులు నోషధులు వృక్షంబులు నిరాతంకంబున బ్రదుకు నిట్టిసోమునిజన్మదినంబు

గావునఁ బున్నమనాఁడు కృతోపవాసులై భక్తియుక్తి నర్ఘ్యంబు లిచ్చి యవా
న్నంబు భుజియించినవారికి నత్యంతకాంతి తుష్టి పుష్టి ధనధాన్యసమృద్ధులు సిద్ధిం
చు రాజకులోత్తంస తిథిప్రశంస వినిపించితి నింక రత్నోద్భవులవృత్తాంతంబు
వినుము వారిలోన సుప్రభుండు వర్తమానకృతయుగంబున నీవై జనించి ప్రజాపాల
నామంబు దాల్చెఁ దీప్తతేజుండు వత్సనామంబును సురశ్మి శశికర్ణనామంబును సుద
ర్శనుండు పాంచాలనామంబును సుకాంతి యంగనామంబును సుందరుండు వంగ
నామంబును సుందుండు ముచికుందనామంబును సునాముఁడు సోమదత్తనామం
బును శుభుండు సంవరణనామంబును సుశీలుండు వరదాననామంబును సుము
ఖుండు కేకయనామంబును శంభుండు సేనాపతినామంబును సుకాంతుండు దశరథ
నామంబును సోముఁడు జనకనామంబును వహించిరి కడమపదియేవురు త్రేతా
యుగంబున నవతరించి కర్మభూమికి నాయకులై బహువిధాధ్వరంబులు చేసి నాక
లోకసౌఖ్యం బనుభవింపఁ గల రని చెప్పి బహుమానపూర్వకంబుగా నమ్మహీనాథు
వీడ్కొలిపి యోగమహత్వంబున విష్ణుతత్వంబునం గలసె నిట మహీపాలుఁడగు
ప్రజాపాలుండును మహాతపఃకథితపరమబ్రహ్మవిద్యాశ్రయకథాశ్రవణంబున విర
క్తుండై తపంబు సలుప నరుగుసమయంబున.

63


క.

ముందట నవలోకించె ము, కుందసమీపాభిసారిగోపప్రమదా
నందకరకుంజములు గల, బృందావనమున్ మునీంద్రబృందావనమున్.

64


క.

ఆవనమున ఘోరతపము గావింపుచు నుండి కొంతకాలంబునకుం
గోవిందనామధేయుని, శ్రీవనితావిభుని వినతి చేయఁ దొడంగెన్.

65


క.

గోవింద వేదవేద్య శ, చీవరసోదర నిశాటసేనాసుభట
గ్రీవాకదుష్ణరుధిర, ప్లావితకరచక్రధార భక్తాధారా.

66


క.

శరనిధిమగ్నధరాధూ, ర్ధర శబ్దస్పర్శరూపరసగంధాఖ్యా
విరహిత పరిపూర్ణసుధా, కిరణసహస్రప్రకాశ కితవమృగేశా.

67


సీ.

పన్నగతల్ప నీభక్తులతోఁ బొత్తు మని కాని దుఃఖంబు మఱవరాదు
నిఖిలజగన్నాధ నీచరిత్రంబులు విని కాని మోహంబు విడువరాదు
పుండరీకాక్ష నీపుణ్యతీర్థములకుఁ జని కాని కలుషంబు చదుపరాదు
నిగమాంతసంస్తుత్య నీపదద్వంద్వంబు గని కాని జన్మంబు గడవరాదు
కనకగర్భాదులకు నైన ననుఁ గృతార్థుఁ, జేసి రక్షింపు మని ప్రశంసింప మెచ్చి
తనకుఁ బ్రత్యక్షమైనవిష్ణునిశరీర, మున లయం బయ్యె నరపాలపుంగవుండు.

68

క.

నావుడు వరాహమునకు మ, హీవనరుహపత్రనేత్ర యి ట్లనియె మహా
త్మా వనితలుఁ బురుషులు ని, న్నేవిధమునఁ గొలువ మెత్తు వెఱిఁగింపు దయన్.

69


గీ.

అని పలుక దంభకోలనాయకుఁడు భూమి, కామినీ భావసాధ్యుండఁ గాని మంత్ర
హోమదానాదివిధుల సాధ్యుండఁ గాను, నిక్క మైనను వినిపింతు నొక్కవిధము.

70


వ.

బ్రహ్మచర్యంబు సత్యంబు నసంగ్రహంబు నస్తేయంబు నహింసయు మొదలుగాఁ
గలయవి మానసవాచకవ్రతంబు లేకభుక్తంబు నక్తంబు నుపవాసంబు మొదలుగాఁ
గలయవి కాయికవ్రతంబులు వీనిలోన మానవులు శరీరక్లేశకరవ్రతంబులు సలిపి
రేనియు విధేయుండ నగుదు నేతదర్థంబునకు నితిహాసంబు చెప్పెద మున్ను సన్ను
తాచారధుర్యుం డరుణిమునివర్యుండు పుణ్యనదీతీరంబునఁ దపంబు చేయ నుద్యో
గించి పోవుచుఁ గ్రమక్రమంబున.

71


మ.

బుధవంద్యుం డతఁ డొక్కపావనవనీభూమి న్విలోకించె
ర్నిధికల్లోలఘటావసక్తజలవేణీనీవిక న్నిర్గళ
న్మధుమత్తభ్రమరీమిళత్కమలగంధస్రావికన్ బాహుదం
డధృతారిత్రవిచిత్రసంతరణనానానావిన్ దేవికన్.

72


సీ.

ఈతెఱంగున దేవికాతరంగిణిఁ గనుంగొని తటంబునఁ బనసవకుళ
నారంగపూగపున్నాగాదినానాగపుష్పపూర్ణారణ్యపుణ్యభూమి
సతతంబు నిట్రుపాసములతో నత్యుగ్రతపము గావించుచుఁ దానమాడ
నొకనాఁడు చనుచోట నోరి బాపఁడ పెట్టు పెట్టు మటంచు నాకట్టుకొన్న
పాపకర్మునిఁ గార్ముకబాణపాణిఁ, గ్రూరదృష్టులయెఱజేరుగ్రుడ్లవానిఁ
జెంచు తెరువాటుగాని వీక్షించి తపసి, తల్లడంబున శ్రీహరిఁ దలఁచి నిలిచె.

73


క.

దొంగయు హృదయసరోరుహ, భృంగీకృతశార్ఙ్గధరుని ఋషిఁ గనుఁగొని వి
ల్లుం గోలయు ధర వైచి క, లంగుచు నంజలిమిళల్లలాటస్థలుఁడై.

74


ఉ.

ఓసదయాత్మ సంయమికులోత్తమ పిన్నటనాఁటనుండి నేఁ
జేసినపాపపుంజెడుగుచేఁతలు చెప్పెద నుప్పుగోకకున్
భూసురకోటి నట్టడవిఁ బొట్టలు చించితి బిట్టు గొంతుకల్
గోసితి నల్లపూసకొఱకుం బదివేవురుపుణ్యభామలన్.

75


గీ.

ఇన్ని చేసినఁ గడపట నింటిలోనఁ, ద్రావుడికి లేదు పాపంచె తగిలెఁ గాని
వల్కలములకుఁగాఁ జంప వచ్చి నిన్ను, గనుఁగొని మహాద్భుతంబు శాంతుండ నైతి.

76

శా.

చౌర్యం బింతటనుండి మానితి ననాచారంబు చాలించితిన్
భార్యాపుత్రధనేషనత్రయపరిభ్రాంతిం బెడంబాసితిన్
గార్యాకార్యవిచారతన్ వలనిశంకల్ దక్కి నాకుం దప
శ్చర్యాసిద్ధికి నొక్కమంత్ర ముపదేశం బిచ్చి రక్షింపవే.

77


క.

అనిన మునీంద్రుఁడు వనితా, వనిసురపాతకము సేయువాని నిరీక్షిం
చిన భాషించినఁ గాఁ గా, దని చూడక మాఱుమాట లాడక పోవన్.

78


క.

తొలఁగక దొంగయు మోక్షపుఁ, దలఁపున వెనువెంటఁ బోయి దైవికసలిలం
బులఁ గ్రుంకఁ గ్రుంకు నమ్ముని, నిలిచినచో నిలుచుఁ దోఁడునీడయె పోలెన్.

79


సీ.

ఈగతి మోక్షార్థియై గురువులకు శిష్యునివిధంబునఁ జెంచు దనకు వినయ
పరతంత్రచిత్తుఁడై పంపక పరిచర్య గావింపఁగాఁ గొంత కాలమునకు
నొకవాసరమున దైవికతీర్థ మాడుచో గుటగుట మనుచు నాఁకొన్నక్రోలు
పులి తటంబునఁ బ్రేఁపపొదనుండి మానిపుంగవుమీఁద నుఱికినఁ గంటిఁ గంటి
ననుచు నాబోయ కరశరాసనకఠోర, గుణవిరావప్రతిధ్వని కుదరగుహల
వెడల వెడవెడ నార్చుచుఁ బిడుగుతునుక, వంటి నారాచమున వరదరంట వేయ.

80


క.

ధారుణిఁ బడియెడుపులి భాం, కారధ్వానంబు చేయఁగా వినుచు నమో
నారాయణాయ యని ముని పేరెలుఁగున నుగ్గడించె భీతాత్మకుఁడై.

81


క.

ఘోరతరవ్యాఘ్రంబును, నారాయణమంత్రము వినినకతన నైజా
కారంబు విడిచి పురుష, శరీరంబు ధరించి మునివరేణ్యునితోడన్.

82


క.

స్వామి నారాయణమం, త్రామృతములు తావకాననాబ్జభవము లై
నామీఁద వెల్లివిరియ ని, రామయత మురారిపురికి నరిగెద నన్నన్.

83


ఉ.

ఎవ్వఁడ వీవు నావుడు మునీ తొలుజన్మమునన్ బ్రతాపినై
చివ్వకు వచ్చువైరినృపసింహులదేహములన్ తటాక ముల్
త్రవ్వినదీర్ఘబాహుఁడను రాజను విద్యలు వచ్చు నంచు నేఁ
గ్రొవ్వున విప్రులన్ సరకుగోక తిరస్కరణంబు చేసినన్.

84


క.

కోపించి వారు దుర్వి, ద్యాపాండిత్యమునఁ బ్రల్లదము లాడుదురే
భూపాధమ శార్దూలమ, వై పుట్టు మటంచు నిర్దయత శపియింపన్.

85


క.

ఏటువడి ధర్మ మనుబరి, దాటిన నామనసులోనిదర్పము వెడలన్
మీటి కరాంజలి మణిమయ, కోటీరాగ్రమునఁ బెట్టుకొని యిట్లంటిన్.

86

చ.

తలఁపఁగ వాక్యవైఖరిఁ గథ మ్మన శక్తుఁడు గాఁడు శేషకుం
డలిపతి యైన మి మ్మెదిరి నావలనం బదివేలు తప్పులున్
గలవు ప్రధానవృత్తి ననుకంప వహించి వసుంధరామరు
త్కులమణులార శాపమునకుం గడ యెన్నఁడు నాకుఁ జెప్పుఁడా.

87


సీ.

అని విన్నపంబు చేసిన రాజ కడునాఁకలి గొని షష్టాన్నకాలికుని నొక్క
బ్రాహ్మణశ్రేష్ఠుని భక్షింపఁ జని భిల్లశాతభల్లాహతిఁ జచ్చువేళ
నవ్విప్రుఁ డతిభయవ్యాకులత్వమున నారాయణస్మరణంబు చేయ విన్న
ఫలమున శార్దూలభావంబు వీడ్కొని పురుషుండవై ముక్తిఁ బొందఁగలవు
తథ్య మనిరి భవన్నిమిత్తమున నట్ల, శాపమోక్షంబు గలిగె సాక్షాత్పురాణ
పురుషమూర్తులు గావున ధరణిదైవ, తములసద్భాషణము లమోఘములు సుమ్ము.

88


శా.

ఆకర్ణింపు మునీంద్ర యే నొకరహస్యం బూర్ధ్వబాహుండనై
నీకుం జెప్పెద మేదినీసురవరుల్ నిక్కంబు నిక్కంబు ల
క్ష్మీకాంతప్రతిబింబముల్ జపతపస్సిద్ధుల్ సదా శుద్ధు ల
స్తోకజ్ఞానకళాధురంధరు లనింద్యుల్ వంద్యు లెవ్వారికిన్.

89


వ.

బ్రాహ్మణద్వేషి యైన ననువంటిపాపకర్ముండు సైతము నారాయణమంత్రంబు పర
ముఖంబున విన్నమాత్రంబునఁ బవిత్రుం డయ్యె బ్రాహ్మణభక్తియుక్తులై భక్తిపూ
ర్వకంబుగా నారాయణమంత్రంబు జపియించినపుణ్యులమహిమ యే మని చెప్ప
నని బ్రాహ్మణప్రశంస గావించి నారాయణమంత్రప్రభావంబు వచియించి దీర్ఘబా
హుం డనర్ఘమాణిక్యమయవిమానం బెక్కి స్వర్ఘంటాపథంబునం జనియె మునియు
వనేచరుం గటాక్షించి మహోత్సాహంబున వత్సా భవత్సాహసంబునకు నామీఁది
విశ్వాసంబునకు మెచ్చితి వరంబు వేఁడు మని మన్నింప నన్నిషాదుండు దండ
ప్రణామంబు చేసి తాపసోత్తంస యింతకాలంబునకు సుముఖుండవై నాతోడ
సంభాషించుటకంటె వరంబులు గలవే నన్నుఁ బనిచి పనిగొను మని విన్నవించిన.

90


సీ.

ఓయికిరాతాన్వయోత్తంస పశ్యతోహరత వీడ్కొని తపశ్చరణకాంక్ష
ము న్నొక్కమంత్రంబు నన్నుఁ బ్రార్థించిన నాఁటికి నీతోడ మాటలాడ
నైతి వయోగ్యుండ వని నేఁడు దైవికాపుణ్యజలస్నానమున మదీయ
సందర్శనమున గోవిందనామశ్రవణంబున నతిపావనత వహించి
నిలిచితివి గానఁ దగుదువు నిఖిలకర్మ, ములకుఁ దపమైనఁ జేయుము వలసె నేని
వరము లేమైన వేఁడు నా నరుణిమౌని, మణికి బోయ పునఃప్రణామంబు చేసి.

క.

చతురాననాదిసురసం, తతినతపదపంకజుండు నారాయణుఁ డే
గతిఁ గొలువ సులభుఁ డగు నా, నతి యీవలె నదియ వరము నాకు మునీంద్రా.

92


గీ.

అనిన విని యేవ్రతం బైనఁ దనుగుఱించి, పరమవిశ్వాసమునఁ బట్ట భక్తులకుఁ బ్ర
సన్నుఁ డగుఁ గాన భక్షింప శకట మనృత, మాడ నని పట్టు వ్రతము శ్రీహరిగుఱించి.

93


క.

అని తపసి తత్పుళిందుఁడు, ధన మడుగక మోక్ష మడుగఁ దలఁచిన నీలా
గున మోసపుచ్చి యేగిన వెనుక నియమపరత నాటవికవల్లభుఁడున్.

94


చ.

గురువుల నాత్మఁ గీల్కొలిపి ఘోరతపోనియమానుషక్తుఁడై
తరుపతితచ్ఛదాశనవిధి న్విహరించుచు దైవికాసరి
త్పరిసరపుణ్యకాననవిభాగమునందు బుభుక్షకుక్షిలో
దరికొన జీర్ణపర్ణములు దా నొకనాఁడు దినంగఁ బోయినన్.

95


క.

నక్షత్రపథసరస్వతి, భక్షింపకు శకట మనుచు భాషించిన నా
వృక్షంబు విడిచి వేఱోక, వృక్షమునకుఁ బోవ నట్ల యెఱిఁగించుటయున్.

96


సీ.

ఆభీలవల్లభుం డఖిలంబు శకటంబకా విచారించి హృత్కమలకర్ణి
కాసీనదేశికధ్యానామృతంబు ప్రాణాధారముగ నిరాహారవృత్తి
నతిఘోరతపము చేయంగ దుర్వాసోమునీంద్రుండు వచ్చిన నెదురుకొని స
సంభ్రమస్వాంతుఁడై చాఁగి యే నెటువంటిభాగ్యవంతుండనో పైతృకంబు
పెట్ట సమకట్టువేళకుఁ బిచ్చుకుంటు, మీఁద భాగీరథియుఁ బోలె మీర లేగు
దెంచితిరి గాన వలయు నాతిథ్య మవధ, రింపు నిస్తంద్రకారుణ్య ఋషివరేణ్య.

97


గీ.

అనిన దూర్వాసుఁ డాత్మలో నవశనవ్ర, తప్రయాసంబుచేఁ గృశత్వమునఁ బొంది
యును మహాబ్రహ్మవర్చసయక్తుఁడైన, యితనితపము పరీక్షింతు నే నటంచు.

98


క.

మును తరుజీర్ణపలాశా, శనుఁడవు నిరశనుఁడ విపుడు శబరాన్వయవ
ర్ధన న నీకు శక్యమే వన, మున మా కభీప్సితాన్నముల దొరకింపన్.

99


క.

పేరాఁకలి గొంటిమి కడు, పార భుజించెదము శాలియవగోధూమా
హారములు పెట్టు మనవుడు, నేరీతి ఘటింతు నితనియీప్సిత మనుచున్.

100


క.

తలఁచుతఱిన్ మందాకిని, బలభిత్కరి సొచ్చి పెఱికి వెచినరక్తో
త్పల మనఁగాఁ జిక్కములో, పల నొకమణిపాత్ర మభ్రపథమున వచ్చెన్.

101


ఉ.

ఆనవరత్నపాత్ర శబరాగ్రణి పాణి ధరించి మ్రొక్కి యి
చ్చో నిలుమయ్య నన్ను దయఁ జూచి బుభుక్షకు నోర్చి తత్త్వవి

ద్యానిరతాత్మ సంయమివరా మధురాన్నము లెల్లరామయో
షానగరంబునం బరమసాధ్వులచేఁ గొనివచ్చునంతకున్.

102


క.

అని వినయముతోడఁ దపో, ధనపతి నొడఁబఱచి గురుపదస్మరణము గై
కొని రామయోషనికటం, బున నున్నవనంబు చొచ్చి పోయెడువేళన్.

103


సీ.

అర్పించె నొకకోమలాంగి సంభ్రమమున వచ్చి పువ్వులవంటివంటకంబు
వైచె ఫలంబులవంటిలడ్వాలు మ్రొక్కుచు నొక్కపృథులవక్షోజయుగళ
వడ్డించె నొకవరవర్ణిని కడువేడ్క పడి పరాగమువఁటిపంచదార
వంచె మరందంబువంటికమ్మనినేయి మన్ననతో నొక్కమధురవచన
మఱియు వనదేవతాస్త్రీలు మహీరుహములఁ, బుట్టి పెట్టెడువివిధాన్నములకు నెడము
చూపెఁ గీకటమునిపాత్ర సూక్ష్మ మయ్యు, మహిమ బహువిద్యలకుఁ గవిమనసువోలె.

104


శా.

ఈరీతిన్ గడువేగ వాంఛితఫలం బీడేర ధన్యుఁడ సం
సారాంభోనిధిపారగుండ నని యిచ్చెన్ మెచ్చుచున్ వచ్చి నై
జారణ్యస్థలి నన్నిషాదముని భిక్షాపాత్రముం బెట్టి దే
వా రావయ్య భుజింప నంచు వినతుండై పల్క దుర్వాసుఁడున్.

105


గీ.

మనసులోపల నీతనిమహిమ నిజము, గా నెఱించెద ననుచు నోమౌని నదికి
నడవనోపము చేఁ గమండలువు లేదు, సలిలములు దెమ్ము మాకు నాచమనమునకు.

106


సీ.

అనవుడు శబరసంయమి కొంతతడవు విచారించి గురుపదాబ్జములు డెంద
మున సంస్మరింపుచుఁ బోయి చేరువ నున్న దేవికానది డాసి దేవి కామి
తార్ధదాయిని పాపహారిణి లోకపావని తల్లి నాకు భవజ్జలావ
గాహనంబును దేశికధ్యానమును దక్క నన్యంబు లేదు మహామునీశ్వ
రాగ్రగణ్యుండు దుర్వాసుఁ డరుగుదెంచె, నతిథియై నేఁడు రానోపఁ డలసి తీర్థ
మాడ నావిన్నపము విను మచట విమల, వారి దొరకదు విచ్చేయవలయు ననిన.

107


మ.

క్షమపై నద్భుత మావహిల్ల శశిరేఖాభంగశృంగారయై
సముదాత్తధ్వనిపూర్యమాణసకలాశాభోగయై చక్రవి
భ్రమరోధోనిపతత్పయఃకణికయై పాఱె న్నిషాదేంద్రవ
త్సము వెంట న్వడి దేవికాసురభి సంజాతోన్ముఖత్వంబునన్.

108


వ.

ఇవ్విధంబున సవిధంబునకు వచ్చినదేవికాతరంగిణిఁ గృతస్నానుం డై దూర్వా
సుండు శబరతాపసుండు వడ్డింప నాఁకంట నాకంఠపూరితంబుగా బహువిధాహా
రంబు లారగించి నిజలోచనాంచలంబులం గారుణ్యరసంబు దొలంక నతని వంకఁ
జూచి నీవు గురూపదేశమార్గంబున సత్యం బవలంబించి తపంబు గావించితివి గావున

సత్యతపోనామధేయంబు వహింపుము వేదశాస్త్రపురాణేతిహాసబ్రహ్మవిద్యావిశార
ద్యంబు నీకుం గలుగ వరం బిచ్చితి ననిన సాష్టాంగదండప్రణామంబు లాచరించి
మునీంద్రా కిరాతుండ నైన నేను వేదాదివిద్యలకు నర్హుండ నగుట యెట్లు డెందం
బున నున్నసందేహంబు మాన్పు మని విన్నవించిన.

109


సీ.

అనసూయపట్టి యి ట్లనియె నోయిసుధీనిధాన చెప్పెదఁ బురాతనకిరాత
దేహంబు గాదు నిరాహారతపము సేయఁగ శరీరాంతరం బయ్యె ననిన
ఋషికులేశ్వర నాకు రెండువిగ్రహము లేగతిఁ గల్గె నావుడు నతఁడు సత్య
తపునితో జంతుసంతతికి నధర్మరూపంబును ధర్మరూపంబు నుభయ
రూపమును నైనతనువు లార్యులు వచింపు, దురు వరుస మూడటంచు నందుల నధర్మ
ధర్మభోగానుభూతికిఁ దగినమేను, పారలౌకిక మనియెడుపేరు దాల్చు.

110


క.

విశదముగా విను తేజః, కృశానుసమ యాతనాశరీరంబును భో
గశరీరంబును గై, వల్యశరీరము ననఁగఁ ద్రివిధ మగుఁ దత్తనువుల్.

111


గీ.

నీవు గురుసంస్మరణతపోనియమపరతఁ, జేసి ధర్మంపుమేను దాల్చితివి సుమ్ము
సర్వకాలంబు జీవహింసకునిధాన, మైనతొల్లింటిపాపంపుమేను మాని.

112


సీ.

అటుగాన వేదశాస్త్రాదిసమస్తవిద్యలకు నర్హత్వంబు గలదు నీకు
సంశయింపకు మానసంబున మానవుం డెందాఁక వర్తించు నెనిమిదింట
నందాఁక నతఁడు గర్మానుబంధంబులఁ బొరలు నష్టకవర్గమునను బాసి
త్రిగతుఁడై సంతతస్థిరతఁ బ్రాపించిన నాల్గేనులు వర్తించి యేకమార్గ
నిరతుఁడై కాంచు బ్రహ్మంబు నిక్క మనిన, సంయమీశ్వర యిట్టి సుజ్ఞానమహిమ
యెఱుఁగ నేరనివారికి నెట్లు గలుగు, బహుసుఖైకాస్పదము పరబ్రహ్మపదము.

113


వ.

అనవుడు దూర్వాసుండు సత్యతపు నిరీక్షించి నిర్మలాత్మా యింక నొక్కమర్మం
బాకర్ణింపుము సుజ్ఞానంబునం గాని సత్కర్మంబు జరగదు సత్కర్మంబునం గాని
విజ్ఞానంబు వొడమదు వివేకింప నీరెండు నొండొంటికి సాధనంబులు సత్కరం
బులు బ్రహ్మక్షత్రవైశ్యశూద్రవర్ణంబుల యజనపాలనకృష్యాదివృత్తిశుశ్రూషాభేదం
బులఁ జతుర్విధం బయ్యె బ్రహ్మక్షత్రియవైశ్యులు వేదోక్తప్రకారంబున నిజాచా
రంబుల నడపవలయు వీరికి శూద్రుండు సేవ చేయవలయు నీతెఱంగునఁ గులధర్మం
బు దప్పక బ్రహ్మోపాసకు లైనజనులు మోక్షంబునం బొందుదురు బ్రహ్మం బ
రూపనామధేయం బప్రమేయం బని దురవగాహంబుగా నూహింపకు బ్రహ్మం బనం
గ భక్తరక్షాపరాయణుం డైన నారాయణుండు తద్దేవుండు యజ్ఞాదికృత్యంబుల

వలన సులభుం డగు నని దూర్వాసుండు సత్యతపునకుం జెప్పె నని వరాహదేవుండు
వచియించిన ననంతాకాంత మీఁదటివృత్తాంతం బానతిమ్మని విన్నవించిన.

114


శా.

కల్పాంతస్థిరకీర్తిపూర జగదేకస్తోత్రపాత్రౌచితీ
కల్పానోకహ సప్తసంతతిబహూకారాదినానాగుణా
కల్పానల్పరమావిలాస నరసింగస్వామినిర్నీతసం
కల్పాభిజ్ఞ పరక్షితిక్షపణదీక్షాదక్షకౌక్షేయకా.

115


క.

కర్పూరోజ్జ్వలయశ దో, ర్దర్పాపరపరశురామ తారుణ్యకళా
దర్పక పటుప్రతాపా, హర్పతి హృతరిపుసతీదృగంజనతిమిరా.

116


మత్తకోకిల.

లుబ్ధమన్నెకుమారపల్లవ లోలదృఙ్మకరధ్వజా
లుబ్ధకీకృతవైరిభూవరలోక నిశ్వసితాగ్నిధూ
ర్గబ్ధతాపకులాద్రిశైత్యకరప్రభావ యశోరుచి
స్తబ్ధదుగ్ధరసాబ్ధినందనచంద్రచందనచంద్రనా.

117

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంట నాగయప్రధానతనయ సిఁగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబున సప్తమాశ్వాసము.