వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/షష్ఠాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

షష్ఠాశ్వాసము

క.

శ్రీహితనిశాంతపదకట, కాహితహరినీలపుత్రికాకారతృణ
గ్రాహితరళాయమానమ, దాహితభూకాంత యీశ్వరాధిపునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుఁడు భూతధాత్రి కిట్లనియె నట్లు ఖండేందుశేఖరుండు
వెండికొండకు విజయం చేసి కొంతకాలంబు వినోదింప నొక్కనాఁడు గౌరి తన
మనంబున.

2


సీ.

తండ్రి దక్షుండు చిత్తంబున ననుఁ గలకాలంబు రిపుభార్యగాఁ దలంచి
గారవింపక మానునో రమణుండు రుద్రుండును శాత్రవదుహిత గాఁగ
భావించి విశ్వసింపక మానునో నాకుఁ గడవంగ రాని దుందుడుకు పుట్టె
నీరీతిఁ బుట్టినయింటికిఁ జొచ్చినయింటికి నెప్పుడు నెరపరంబు
సేయుకాయంబుతో నుంట సిగ్గు గాదె వేయు నేటికి దేహంబు వేఱ తాల్చి
తపమునఁ బ్రసన్నుఁ గావించి తరుణహిమక, రార్ధమౌళికి నిల్లాల నగుదు ననుచు.

3


చ.

హిమధరణీధరంబునకు నేగి తపం బొనరించి పెద్దకా
లమునకు యోగవహ్నిశిఖలం దనువల్లిక వేల్చి తన్నగేం
ద్రమునకు మేనకాసతికి నందనయై సరిలేనిరూపచా
రిమ కొనసాగఁ దా నుమయుఁ గృష్ణయు నాఁగ ధరించె నామముల్.

4


గీ.

ఆకుమారి పరంజ్యోతి నైననాకు, మ్రోల నేటికిఁ బెట్టిరి ముగ్ధ లనుచు
నగువిధంబునఁ బొదుగుళ్ళనడుమ నగుచు, నుండు మందిరదీపికాజ్యోతిఁ జూచి.

5


క.

అక్కుధరపుత్రి నాకున్, ముక్కంటికి వేఱు లే దనుచుఁ దెలుపుటకున్
మిక్కిలికను దాల్చినగతిఁ, జక్కనిరారేక నెన్నొసల ధరియించెన్.

6


గీ.

అమ్మహాశక్తి రత్నపుబొమ్మరిండఁ బేర్చుఁ బన్నాదుదొంతుల బిసరుహాస
నాండభాండంబు లీరీతి నుండ దొంతి, పేర్తు నని లోకములకుఁ జూపెడువడువున.

7


గీ.

ఆయిగురుటాకుబోఁడి నామాయ నిట్లు, పడుచు లేచుచు మందురు పద్మసంభ
వాదు లని తెల్పు తెఱఁగున హస్తచాతు, రీధురీణతఁ గందుకక్రీడ సలుపు.

8

చ.

అతివిశదప్రభావిలసనాస్పద మైనసదాంగుళీనఖ
ప్రతతి వెలుంగు నాహిమధరాధరపుత్రికిఁ బద్మనేత్రకున్
గతజననంబునం దనకు గాదిలిసోదరి గాన భక్తితో
సతతముఁ గొల్వ దక్షతనుజాతలు తారలు వచ్చెనో యనన్.

9


క.

అంబుజభవాదివిబుధ గ, ణంబులదొడ్డతన మెల్ల నాకు వెనుక త
థ్యం బని చూపె ననంగా, బింబాధర దొడ్డతనము పిఱుఁదునఁ దాల్చెన్.

10


క.

ఆకన్యారత్నంబు ని, రాకారుం డైనశివుని హత్తినతనమా
యాకళచందము దోపఁగ, నాకాశమువంటినడుము నారు వహించెన్.

11


క.

కాఠిన్యము దోరంతరపీఠిం బూర్ణంబు లైనపృథుకుచముల నా
పాఠీననయన దాల్చెఁ, దాఠేవం దండ్రిగుణము దాల్చినభంగిన్.

12


గీ.

ఆసతి ధరించె శక్తిత్రయప్రభావ, భావములతోడ విహరించుపరమశక్తి
నే ననుచుఁ దెల్పుగతి మోవి నీక్షణముల, నెఱులు నరుణిమ ధవళిమ నీలిమయును.

13


క.

ఈరీతి గోత్రకుధరా, గారంబున శైశవంబు గడపి క్రమమునం
దారుణ్యము గైకొని జగ, దారాధ్య మృగేంద్రమధ్య హైమవతి మదిన్.

14


క.

కనకధరాధరచాపుఁడు, తనపతి గావలె నటంచుఁ దలపోసి మహా
వనమునకుఁ జనియె జననీ, జనకులయనుమతిఁ దపంబు సలిపెడుకొఱకున్.

15


సీ.

చని పూగపున్నాగసాలరసాలాదిసాలరమ్యప్రదేశముల నిలిచి
కందక పాటలగంధి గావునఁ దీవ్రతాధురామోఘనిదాఘవేళ
కొంకక క్రొమ్మెఱుఁగుఁబోఁడి గావున జాతనిర్ఘాతజీమూతవేళ
వందక శీతాంశువదన గావున దీర్ఘయామినీఘోరనీహారవేళఁ
దపము గావింప వెడలె వత్సరసహస్ర, ములు మహాదేవుఁ డంత నాభూమిధరకు
మారి గౌరి ననుగ్రహింపంగఁ దలఁచి, తొంటి తనలాంఛనంబులు తొలఁగఁబెట్టి.

16


సీ.

అనవరతస్నానమునఁ జేసి కలయ నంతట వండువట్టినతల వడంక
సారెకు నుష్ణించి నీరు గ్రమ్మైడునేత్రములమీఁద నరసినబొమలు వ్రాలఁ
గడుపెద్దయెముకలు గానంగ వచ్చుఱొమున దొడ్డజన్నిదంబులు చలింప
త్రోళ్ళు వ్రేలాడెడుతుంటిపై బ్రహ్మకమ్ములచింపిదోవతి ముఱికి వలవ
ముసలిబ్రాహ్మణుఁడై వేదములు చదువుచు, నలసి నిలుచుచుఁ దా నడుగడుగునకును
దడఁబడిపడుచుఁ బార్వతి దాయ వచ్చి, యీరెలుంగున దీవించి యిట్టు లనియె.

17


శా.

శ్రీశైలంబున సేతుబంధమునఁ గాంచిం గుంభకోణంబునన్
గాశిన్ మందరఁ గాళహస్తి నిఁక లెక్క ల్వెట్టఁగా నేల నా

నాశైవస్థలులన్ వసించితిమి కాంతా నిన్నుఁ బోలంగ రా
కాశీతాంశునిభాస్యలం గనము లోకఖ్యాతశీలంబునన్.

18


క.

నాపత్ని నిర్నిమిత్తము, గోపించి తొలఁగి పోవఁ గ్రుస్సి మనస్సం
తాపంబుతోడ వెదకుచుఁ, బైపాటున నిన్నుఁ గంటి భాగ్యముకతనన్.

19


సీ.

ఆఁకలి గొన్నాఁడ నశనంబు పెట్టింపు మది నన్ను బ్రాహ్మణమాత్రుఁగా వి
చారింపకుము విను శ్రౌతకర్మమును దక్షత వహించినప్రతిస్పర్ధి విఱుగ
దట్టించి నాల్గువేదములు విభాళించి బ్రహ్మరథం బెక్కి బహువిధాధ్వ
రాగ్రపూజనము పరిగ్రహించినజగజెట్టి యోగ్యుఁడ నిన్ని చెప్ప నేల
నాకు నొకనికిఁ బెట్టు ముల్లోకములకుఁ, దృప్తి గలుగు నటన్న గిరీంద్రకన్య
భూనిలింప ఫలంబులు గాని యిచట, నశనము గడింప రాదు నీయడుగులాన.

20


క.

కాన ఫలాహారముఁ గొనఁంగా నీచిత్తమున వేడ్క గలదేని గృత
స్నానుఁడవై రమ్మన నా, హా నావాంఛితము సఫల మయ్యె నటంచున్.

21


శా.

పట్టెన్ గట్టదరిన్ మహామకర మబ్రహ్మణ్యమై దా ననుం
జట్టల్ దూయక యుండ రమ్ము విడిపించన్ గట్టుకో కీర్తికిన్
బట్టంబున్ సుకృతాత్మురాల భువనప్రఖ్యాతిగా నంచుఁ గూ
వెట్టన్ వించు నమశ్శివాయ యని భూభృత్కన్య వైయాకులిన్.

22


క.

పితృభావన హిమవంతునిఁ బతిభావన శివునిఁ దక్కఁ బరు నంటని నే
నితనిభుజాదండము ప, ట్టి తిగువఁగా నెట్టు లోర్తు డెందము గలఁగెన్.

23


గీ.

అయిన నితనికరస్పర్శనాపయశము, మాన్పుకొనవచ్చుఁ గాని బ్రాహ్మణుఁడు మొసలి
బారిఁ బడి చావఁ గావనిపాతకంబు, మాన్పుకొనరాదు జన్మజన్మములు ననుచు.

24


క.

వలిచనుగుబ్బల నునువ, ల్కలచేలము జాఱ నడుము గడగడ వడఁకన్
గలకంఠశ్రుతి గెలిచిన, యెలుఁగున బ్రాహ్మణున కభయ మిచ్చుచుఁ బఱచెన్.

25


గీ.

పఱచి పార్వతి పరమకృపారసంబు, భయరసంబు మనంబులోపలఁ దొలంక
గంగదరి ద్రొక్కి నిలిచి తత్కపటవిప్రు, పాణి కరపల్లవంబునఁ బట్టి తిగువ.

26


మ.

కులకాంతాకరసంగమంబు మఱియుం గొందాఁక నాకాంక్ష సే
యులలాటాక్షుని సమ్మతిన్ మొసలి నిమ్నోదప్రవాహంబులో
పలికిన్ రాఁ దిగుచున్ మరుత్తటినీసాపత్న్యంబునం బార్వతీ
లలనం గైకొన నీక వల్లభునిఁ గేలం బట్టుచందంబునన్.

27


క.

ఈపగిది మొసలి సలిలము, లోపలికిన్ దిగువఁ దా వెలుపలికిఁ దిగువన్
బాపనిఁ గొంతదడవు మే, నాపుత్రిక తిగిచి తిగిచి నాఁటినవగలన్.

28

చ.

బరవస మైనయీతనివిపద్దశ యేగతి మాన్పుదుం గటా
హరహర యంచుఁ బల్కుటయు నవ్వచనధ్వనికంటె మున్న శం
కరుఁడు నిజాకృతి న్నిలిచె గంధగజేంద్రముతోలు మౌళి పె
న్నురువులజాలు పాపమొలనూలు సితాంగముడాలు మీఱఁగన్.

29


సీ.

ఆవేళ గిరిజ దా నాదిజన్మంబునఁ దొలఁగి యేతెంచుట దలఁచి నాన
నాననాబ్జము వంప నభవుండు నవ్వుటాలకుఁ బల్కెఁ గోకిలాలాప నన్నుఁ
జెట్టపట్టక వృథ సేయకు మన్నఁ బన్నగహార ఘోరకాననములోనఁ
దపము గావించుట ధవునిఁగా నినుఁ గోరి కావున నది వృథ గాదు వినుము
విన్నవించెద నొకమాట నన్నుఁ గన్న, తండ్రి నీహారనగరాజు ధారవోసి
యీనిఖిలలోకవిదితంబుగా ననూన, వైభవంబున వచ్చి వివాహ మగుము.

30


వ.

అని సవినయంబుగా ననునయాలాపంబులు పలికి చిట్టకాలకుఁ జెట్ట వట్టి విడువని
గట్టువిలుకాని నెట్టకేలకు నొడంబఱచి తదనుమతిం బార్వతి పుట్టినింటికిం జనియె
ముక్కంటియు నిజనిశాంతం బైనరజతసానుమంతంబునకు విజయం చేసె నట్లు
పుట్టినింటికిం జని తనకావించినఘోరతపఃప్రభావంబునకు మెచ్చి కృపాసము
ద్రుండు రుద్రుండు ప్రత్యక్షంబై పలికినచందంబు సమందాక్షంబుగా మందమం
దాక్షరంబుల నుమాకాంత హిమవంతునికి విన్నవించి జనక కనకధన్వుండు వెను
కటిజన్మంబున మత్ప్రాణవల్లభుండు గావున నది యెఱింగించితి మీఁదటికర్త
వ్యంబు మీక తెలియు నన్న నన్నందనిం జూచి నిజాంతర్గతంబున నేఁడు నాజీవ
నంబు పావనం బయ్యెఁ బొమ్మంచు మంచుగుబ్బలిరాచవాఁడు పరమానంద బొప్ప
మకరందతుందిలనయనారవిందుండై.

31


క.

ఎల్లజగంబులు నేలిన, హల్లకహితజూటుఁ డల్లుఁ డయ్యెడు నఁట నా
యిల్లు వెలసె లోకంబులఁ, దల్లీ రుద్రాణి యెట్టిధన్యుఁడ నొక్కో.

32


గీ.

పరమపావని విశ్వప్రపంచజనని, వైననినువంటికూఁతును గాన లేరు
గాన నానాసుపర్వులలో నపత్య, వంతు లెవ్వారు నాయీడువారు గారు.

33


మ.

అని గౌరీరమణీశిరోమణికి నాహ్లాదంబుగాఁ బల్కి వే
చని లోకైకపితామహున్ నలువ నాస్థానంబులో నుండఁగాఁ
గని దేవా శశిఖండమౌళికి నుమం గల్యాణి నాకూర్మినం
దన నీ నాత్మఁ దలంచి దేవరకు విజ్ఞాపింప నేతెంచితిన్.

34


క.

వావుడు సంతసమున వా, ణీవిభుఁ డిది మంచితలఁపు నీహారగిరీం
ద్రా వివిధామరసహితుఁడ, నై వచ్చెదఁ బెండ్లి చూడ నాయితపడుమా.

35

క.

అని వీడుకొలుప నబ్జా, సనుశాసనమున నగాగ్రసరుఁ డింటికి వ
చ్చి నిజపురము శృంగారిం, చి నిరాఘాటప్రమోదచిత్తముతోడన్.

36


సీ.

స్వస్తి సమస్తభవ్యగుణసంపన్నుఁ డైనతుషారపర్వతనాయకుండు
స్వస్తి సమస్తదివ్యగుణసంపన్ను లైననిషధవింధ్యమందరసుమేరు
దర్గురగంధమాదనమాల్యవత్పారియాత్రలోకాలోకచిత్రకూట
మలయప్రముఖబాంధవులకు సంప్రీతిఁ బుత్తెంచినశుభలేఖ దేవదేవుఁ
డైన శివునకు మనగౌరి నాదిశక్తి, నిచ్చుచున్నాఁడ మీరలు వచ్చునది వి
వాహమున కంచు లేఖలు వ్రాసి పంప, వారు నాకారములు దాల్చి వచ్చి రపుడు.

37


క.

వేగవతీయమునాగం, గాగోదావరులు మొదలుగాఁ గలనదులున్
సాగరములు భూరుహలతి, కాగుల్మము లవయవములు గైకొని వచ్చెన్.

38


వ.

ఇట్లు వచ్చినచుట్టంబుల యథోచితప్రకారంబుల గారవించి మంచుగుబ్బలి రాచ
వారు తనకు సహాయులై విహరింప బ్రహ్మాండంబు చవికెగా నక్షత్రపథంబు
ముత్యాలమేలుకట్టుగా మేదిని వేదిగా దిగంతశుండాలంబులు పూజెకుండలుగా నవ
ద్వయద్వీపంబులు జాజాలపాళికలుగా జలనిధానంబులు కలశంబులుగా దివా
కరులు దివియలుగా సుధాంశుండు గడియారంబుగా మేఘంబులు వాద్యంబులుగా
వివాహంబు సేయ నాయత్తపడి పెండ్లికొడుకుఁ బిలువం బంచిన మందరం బమంద
రయంబునఁ గైలాసఁబునకుం జని కింకుర్వాణసర్వసుపర్వు శర్వుం శని సాష్టాంగ
దండప్రణామంబు గావించి దేవా వైవాహికముహూర్తం బాసన్నం బయ్యె విచ్చే
యు మని విన్నవించిన నన్నీలకంధరుండు నిజవివాహవృత్తాంతంబు నీరజాసను
వలన మున్న విని సమ్మతించినవాఁడు గావున గమనోన్ముఖుండై.

39


సీ.

రింగులు వాఱ గైరికపుగింటెంపుఁబచ్చడము గటిప్రదేశమునఁ గట్టి
పాటలరుచుల సౌభాగ్యంబు చూపురత్నవిభూషణములు గర్ణములఁ దాల్చి
ధవళతరచ్ఛాయ నవకంబు లైనపచ్చసరాలు విపులవక్షమున వైచి
కపిలజటావల్లికలలోన పెక్కుదోయములక్రొవ్విరులమాల్యములు ముడిచి
ఫాలఫలకాగ్రమున శరత్కాలచంద్ర, కాంతి మించుననంగరక్షాతిలకము
తీర్చి పావనధర్మంబుతేజి నెక్కి, వనరుహభవాదిగీర్వాణవరులు గొలువ.

40


గీ.

రాజరాజసఖుఁడు రాజసంబున శైల, రాజరాజధాని రాజమండ
లావరోధిరత్నహర్మ్యస్థలబహువి, ధానిగుప్తనవనిధానిఁ జొచ్చి.

41


క.

నిక్వాణంబులఁ జరణపృ, దాక్వంగదభూష లడర ధరవల్లభసౌ
ధక్వంగణభాగంబున, శాక్వరపతి డిగ్గి సురలు సాహో యనఁగన్.

42

గీ.

అవసర మెఱింగి యక్షనాయకుఁడు మెలపు, తోడఁ దొడిగింప రత్నపాదుకలు మెట్టి
వజ్రకైదండఁ బట్టి వివాహవేది, కడకు విచ్చేయుచో నంతకంటె మున్న.

43


సీ.

కట్టినచీనాంశుకంబు శంబరవైరిగద్దియగవిసెనఁ గడవనాడ
చెరవినగొజ్జంగివిరులు గాళిందిలోపలిఫేనలవములఁ బరిహసింప
తీర్చినకస్తూరితిలకమ్ము విరిదమ్మి వ్రాలినమత్తాలి గేలి సేయ
వైచినమణిహారవల్లులు మేరుశృంగంబులమీఁదిచుక్కల జయింప
పార్వతీకన్యఁ గైసేసి భారతీర, మాశచీముఖ్యదేవతామానవతులు
తోడుకు కొనితేర శివునకుఁ దుహినధరణి, ధరవరేణ్యుండు విధ్యుక్తి ధారవోసె.

44


ఉ.

హాటకగర్భుఁ డట్టిసమయంబున మంత్రము చెప్పఁ బార్వతీ
పాటలగంధికంధరముపై నిజబాహుల రోమహర్షముల్
మాటికిమాటికి న్మొలవ మంగళసూత్రము గట్టె నాజగ
న్నాటకసూత్రధారుఁడు ఘనధ్వని మ్రోయఁగ దిన్యదుందుభుల్.

45


సీ.

ఉమరోమరాజితో నొరసి కీడ్పడినచందమున భూషాహులు తలలు వంప
దుర్గనేత్రంబులతో మాఱుకొని తిరస్కృత మైనగతిఁ జేతఁ జింక బెదర
చండికనొసలితో జగడించి విఱిగినచాడ్పున శశిరేఖ జడలు దూర
కృష్ణపెన్నెఱులతో నెదిరి వీఁగినవిధంబున గళచ్ఛవి భూతిపూఁత నడఁగ
పొగనెపంబున మాటికి మొగము ద్రిప్పి, వామదేవుండు వామపార్శ్వమున నున్న
నమ్రవదనసరోజ నన్నగతనూజ, నానఁ జూచుచు హోమకృత్యంబు నడపె.

46


క.

ఆడిరి రంభాదులు గొనియాడిరి సారణులు చేరి హాహాహూహూల్
పాడిరి మేలంబులకున్, గూడిరి గీర్వాణకుధరకులములచెలువల్.

47


వ.

ఇత్తెఱంగునఁ గురంగాంకశేఖరుండు సాంగంబుగా సర్వమంగళకళ్యాణం భవ
ధరించి యీదంపతులు చరాచరప్రపంచంబు రక్షింతురు గాక యనుచు దీవించిన
విరించి బహూకరించి సనకసనందనసనత్కుమారాదిమహామునుల సంభావించి
దేవతల మన్నించి హిమవన్నగచక్రవర్తి సన్మానించి వారల వీడ్కొలిపి పార్వతీ
సహితుండై కైలాసంబునకు విజయం చేసె వసుంధరాధీశ్వర యివ్విధంబునఁ
బితామహదక్షతుహినక్షోణిధరంబులవలన గౌరికిం గలిగిన జననత్రయంబు సురా
సురలు నెఱుంగరు నీకు వినిపించితిని హైమవతివివాహంబు తదియనాఁడు గావున
నవ్వాసరంబునఁ గథాశ్రవణపూర్వకంబుగా నుపవాసంబు సలిపిన నుప్పిడి చేసిన
నారీనరులకు మనోరథంబులు సిద్ధించు నింక నాకాశంబు వినాయకుండై జన్మించిన
చందంబు వినుము.

48

సీ.

మున్ను గీర్వాణులు మునులు సుధర్మాసభాసీనులై సచరాచరముగ
శిష్టజనంబులు చేయుకృత్యములు నిర్విఘ్నంబులై చాగురీతి దుష్ట
మతులు గావించుకర్మములు నిర్విఘ్నంబులై నడుచుట మాన్పఁగా నుపాయ
మెద్దియో యంచు నూహించి మహోగ్రకల్మషకరిహరికిఁ గైలాసగిరికి
నరిగి పరమేశ్వరునకు సాష్టాంగదండములు సమర్పించి శంకర పురనిశాచ
రావరోధవధూకంఠహారహరణ, కరణచణబాణ ధూర్తులకార్యమునకు
నంతరాయంబు పుట్టింప నవధరింపు.

49


క.

అంచు నుతియించుటయు శివుఁ, డించుకవడి ఱెప్ప వాల్ప నెఱుఁగక యెదుట
జంచలత లేనితొలకరి, చంచలవలె నున్న శైలసంభవఁ జూచెన్.

50


క.

చూచి విసర్జితపరవీ, క్షాచింతకుఁడై తదీయసౌందర్యసరో
వీచికలలోన మునుఁగుచు, లేచుచు నిజహృదయ మనుగలింపఁగ మఱియున్.

51


సీ.

పలుమాఱు సోమరిచలిగాలిసోఁకునఁ గదలెడునీలాలకములు చూచి
తొలుకారుక్రొమ్మెఱుఁగులవంటిరుచులు ముందట వెదచల్లునేత్రములు చూచి
చిన్నారిపొన్నారిచెమటచిత్తడితోడివికచకపోలపాళికలు చూచి
పచ్చికస్తూరికాపంకంబు దాల్చి క్రిక్కిఱిసినగుబ్బపాలిండ్లు చూచి
కౌను చూడంగ నాత్మ నాకసము దోఁప, వాయుతేజోంబుభూమితత్వములు నాల్గు
మూర్తులు వహించి మింటికి మూర్తిలేమి, యేమి కారణ మనుచు నూహించి నవ్వె.

52


గీ.

శంభుఁ డీచందమున జ్ఞానశక్తియైన నగతనూభవఁ జూచుట నభము సంస్మ
రించుట నగుట మూర్తీభవించు మంచు, నలువ మును పల్కుటయుఁ గారణములు గాఁగ.

53


క.

క్షితిజలతేజోమారుత, పతి తద్గగనము జనించెం బరమేశ్వరసం
స్మితముఖమున సకలగుణా, న్వితమూర్తి వహించి చక్కనికుమారుండై.

54


క.

ఈరీతి నుదయ మైనకు, మారునకు సహస్రకోటిమన్మథసదృశా
కారునకు వలచి సభలో, గౌరీసేవానుయాతఖచరపురంధ్రుల్.

55


క.

నిలిచిరి నివ్వెఱపడి వెల, వెలనై క్రొమ్మొలకచెమట వెడలఁ దదీయో
జ్జ్వలకాంతిచంద్రికలలో, పల హిమకరకాంతరత్నపాంచాలికలై.

56


క.

అతని సదాశివమూర్తి, ప్రతిమానవిలాసు వేడ్క పడి పరమపతి
వ్రతలకు నగ్రేసర పా, ర్వతి సైతము కంటిఱెప్ప వాల్పక చూచెన్.

57


ఉ.

ఆసమయంబున మనసిజారి లలాటతటీనటీభవ
ద్భ్రూసముదగ్రుఁడై తనసుతుం గడకన్నులు జేవురింపఁగా

గాసిలి చూచి వీఁడు సురకాంతల నాసభలోన వెఱ్ఱులం
జేసెఁ దనూవిలాసములచే నని భీషణభాషణార్భటిన్.

58


ఉ.

ఓరి గజాననంబును మహోదరమున్ భుజగోపవీతమున్
వారక తాల్చు మంచు గతవత్సలతన్ శపియింపఁ దద్విధా
కారముతోడ నిల్చె మును కామవికారసమేతలై తనుం
గూరిమిఁ జూచునిర్జరచకోరవిలోచన లెల్ల రోయఁగన్.

59


క.

ఈకరణి శప్తుఁడై వికృ, తాకారము దాల్చి నిలువ నాత్మోద్భవు నా
లోకించియు శాంతుఁడు గా, లేక హరుఁడు చెమట దొరుగ లేచి నటింపన్.

60


ఉ.

ఆసకలాత్ము పెంజెమట నంజనవర్ణులు చక్రశూలచా
పాసిముఖాస్త్రహస్తులు గజాస్యులు పుట్టిరి భూమిభాగసం
త్రాసముగా నభం బొకవినాయకుఁ డైనవిధంబు చూచి తా
నీసున వారితత్వము ననేకవినాయకు లైనలాగునన్.

61


వ.

అప్పుడు కకుప్పటలంబులు పటపటం బగుల మిగుల నుప్పతిల్లుఘీంకారగర్జలచప్పుళ్ళ
తోడ సముద్దండశుండాదండవమధుశీకరంబులు భీకరవర్షంబులై కురియ గండమం
డలగళద్దానధారాప్రవాహంబులు నిర్నిద్రసముద్రంబులై వెల్లివిరియ ధగద్ధగాయ
మానవివిధాయుధంబులు లయసమయవిశదద్వాదశాదిత్యులై బీరెండలు గాయ
జగత్పూర్ణకర్ణతాళవాతూలంబులు సప్తసమీరంబులై విటతాటనంబులు సేయ
ననల్పకల్పాన్తశంక నావహించి విహరించునిఖిలజనప్రయోజనవిటపికుఠారంబుల
హిమకరకరాళమూర్ధసార్ధత్రికోటిరోమకూపఘర్మకణప్రభూతహీరంబుల విలో
కించి కంపించిన ప్రాచీనబర్హిముఖబర్హిర్ముఖులభయంబు నివారించి పరమేశ్వరు
నుద్దేశించి దేవా నీ వాకసంబున వినాయకవ్యాజంబున మూర్తీభవించితి వింక
నిమ్మహానుభావునకు నుత్తమనామధేయంబులు విభుత్వంబును బ్రసాదింపవలయు
నని వినయంబునఁ బ్రార్థించినఁ గాత్యాయనీకాంతుండు శాంతుండై.

62


క.

సకలగజాస్యులు నీసే, వకులై విహరింపఁ బ్రాభవము గనుము వినా
యకదంతావళముఖవి, ఘ్నకరగణేశాదినామకములఁ గుమారా.

63


చ.

అని నిజవక్త్రసంజనితుఁ డైనవినాయకు నాదరించి పా
వనతటినీజలంబులు సువర్ణఘటంబుల నించి దేవతల్
గొని చనుదెంచినం గొలువుకూటములో రవికోటిదీప్తి మిం
చినమణిపీఠిమీఁద నభిషేకము చేసి మృదూక్తి ని ట్లనున్.

64

గీ.

యజ్ఞదేవాదిసకలకార్యముల నిన్ను, మొదలఁ బూజించునిర్మలాత్ములకు ఫలము
గలుగఁజేయుము నినుఁ గొల్వఁ దలఁపు లేని, ఖలులకృత్యంబులకు విఘ్నములు ఘటింపు.

65


క.

అని శంకరుఁ డానతి యి, చ్చినసమయంబునఁ బులోమజిచ్ఛిఖియమరా
ణ్మనుజాసనవరుణానిల, ధనపతిముఖనిఖిలదేవతలు సాంజలులై.

66


క.

కఠినోరగబద్ధమహా, జఠర వినాయక పినాకిసంభవ జగతీ
శఠకార్యవిఘ్నకారక, కుఠారసృణిపాశటంకగుంభితహస్తా.

67


తోదకము.

ఆనతసర్వసురావన విఘ్నే, శాన మనోరథసౌధఘటాసో
పాన గజానన భక్తహృదేకా, లాన సదాళిమిళద్వరదానా.

68


గీ.

అనుచు నుతియించువేల్పుల నాదరించె, ద్విరదవదనుండు తజ్జన్మదినము చవితి
గాన నాఁడు జనంబులు కథ విని తిల, భుక్తము భుజింపఁ గామితఫలము గలుగు.

69


సీ.

పార్థివ విను మింకఁ బంచతన్మాత్రలు పాములై పుట్టుట భారతీక
ళత్రునిమానసపుత్రుఁ డైనమరీచిసుతుఁడు కశ్యపుఁడు దక్షునికుమారి
కద్రూసమాహ్వయకామినిగర్భంబునందుఁ గర్కోటకానంతమత్స్య
పద్మతక్షకమహాపద్మవాసుకిసరీసృపకుళికాపరాజితసుషేణ
శంఖముఖ్యసహస్రభుజంగమములఁ, గనియెఁ దత్సంతతిని గ్రమంబున జనించె
దుర్వికారాకరంబులు సర్వలోక, భీకరంబులు పెక్కుదర్వీకరములు.

70


మ.

అవి లోకంబుల నిండి జంతువుల నుగ్రాపాంగసంభూతహ
వ్యవహజ్వాలల నీఱు సేయు ముఖనిశ్వాసోష్మఁ గూల్చు న్విషం
బు వెలిం గాఱెడుకోఱలం గఱచి చంపుం బాగడల్ విప్పి మ్రిం
గు వధించున్ నృపహస్తనిర్ఘృణఫణాకోటీచపేటంబులన్.

71


క.

ఇప్పగిది నాఁడునాఁటికి, నప్పాములు సంహరింప హతశేషజనుల్
నొప్పివడి పోయి నలువకుఁ, జెప్పిన నతఁ డాగ్రహంబు చిప్పిలుమదితోన్.

72


గీ.

వాసుకిప్రముఖాఖిలవ్యాళవరులఁ, బట్టి తెప్పించి విశ్వప్రపంచ మెల్లఁ
జెల్ల భక్షించితిరి గానఁ జెడుఁడు మీఁద, జననికోపంబుకతమున నని శపించి.

73


క.

స్వామీ విషకలుషాత్ములఁ, గా మమ్ము సృజియించి నీవ కడపట నతిమా
త్రామర్షోపేతుఁడవై, భీమముగా నీగతిని శపింపం దగునే.

74


సీ.

అని విన్నవించిన నహుల వీక్షించి విరించి నే మిమ్ముఁ బుట్టించినాఁడ
ననుచు భక్షించువారా జగజ్జంతుసందోహంబు నిటువంటిదుండగముల
మాని కాలప్రాప్తు లైనవారల నిర్నిమిత్తంబు మిక్కిలి మీకు నెగ్గు
చేయువారలఁ గఱచి వధింపుఁ డన్యులత్రోవఁ బోవకుఁడు గారుడము వచ్చు

మంత్రవిదులకు నౌషధమణిసమేతు, లకు భయంపడి తిరుగుఁడు సకలసురవి
హంగపతులకు దాయాదులై నిలువుఁడు, గాలి నియతాశనంబుగాఁ గ్రోలి మనుఁడు.

75


క.

అకరుణతో మీరు బుభు, క్షుకులై భూలోక మతలకుతలముగాఁ జే
యక పోయి వసింపుఁడు త, ప్పక యిచ్చితి నతలవితలపాతాళంబుల్.

76


చ.

అని పరమేష్ఠి పంప నతలాదిపదంబులకున్ భుజంగముల్
పని వినె వానిసంభవము పంచమి గావున భక్తి నద్దినం
బున లవణామ్లముల్ వెరసి ముట్టక పాముల నాలపాల మ
జ్జన మొనరించుపుణ్యులకు సర్పభయంబులు లేవు భూవరా.

77


వ.

సర్వతత్వంబులకుఁ బరమం బైనపురుషునివలన సత్వాదిగుణాత్మకంబై పరఁగునవ్య
క్తంబు సంభవించె నప్పరమపురుషావ్యక్తంబులవలన నడుమ మహత్తత్వం బవతరించె
మహత్తత్వంబునకు నహంకారసంజ్ఞయుఁ బరమపురుషునకు శివనారాయణాభిధానం
బులు నవ్యక్తంబున కుమారమానామంబులు ప్రవర్తిల్లు నేతద్విధపరమపురుషావ్యక్త
సంయోగంబున నహంకారంబు గుహుండై జన్మించినచందం బింక వినుము బ్రహ్మ
మానసపుత్రు లైనమరీచిప్రముఖులసంతానక్రమంబున సుపర్వగంధర్వయక్షపక్షి
దనుజమనుజప్రభృతిసృష్టి వర్ధిల్ల దుర్ధర్షబలధూర్ధరులు విప్రజిత్తివిచిత్తిభీమాక్షక్రౌం
చాహ్వయంబులు వహించిన రాత్రించరులపరాక్రమంబునకు నిలువలేక చీకాకు
పడిననాకౌకసులం జూచి వాచస్పతి యి ట్లనియె.

78


ఉత్సాహ.

ఇంతవట్టు దేవసేన లెల్ల నేల నీశచీ
కాంతుఁ డొకఁడ బల్లిదుండు గాఁడు గాన నింక స
త్యంతశూరతాసనాథు దండనాథు మీరు ధీ
మంతు లైతిరేని చింత మాని బ్రహ్మ వేడుఁడా.

79


ఉ.

నావుడు వారు మంత్రివచనంబులఁ గార్యము నిశ్చయించి భా
షావరుపాలికిం జని నిశాటవరేణ్యుల బాధ చెప్పి దే
వా వలె మాకు నొక్కదళవాయి ధరాధరవైరికిన్ మహా
దేవచమూకదంబకపతిత్వము దాల్చుట బెట్టు గావునన్.

80


క.

అనవుడు విని వాకృతి యిప్పని నాచేఁ దీర్పఁ గాదు ఫాలాక్షిహుతా
శనకణదగ్ధపురత్రయ, దనుజునిచేఁ గాని దేవతావిభులారా.

81


మహాస్రగ్ధర.

అని వారల్ వెంట రాఁగా నరిగి సకుతుకుఁడై పురోభాగభూమిన్
గనియెన్ నక్షత్రమార్గగ్రహిళశిఖరశృంగాటకస్థాంధకస్ప
ర్ధినిరాఘాటప్రకాశద్విగుణసితిమదేదీప్యమానాత్మరోచి
ర్ధునికల్పీభూతసర్వద్రుమజలధిచతుర్ముద్రి నారాజతాద్రిన్.

82

గీ.

కని విబుధులార యిగ్గిరి గగనధరణీ, మండలంబులు నీలాలమట్లు గాఁగ
నున్నది గదా సదాశివయోగివరుఁడు, చేత నూఁదినపటికంపులాత మనఁగ.

83


క.

ఈకుధరేంద్రము లోకా, లోకపుబల్గడదట్టిలో నికటాద్రుల్
మేకులుగా మెఱయుచు నది, గో కానఁగఁబడియెఁ దెల్లగొల్లెనభంగిన్.

84


గీ.

చూడుఁ డీకొండ బ్రహ్మాండశుక్తిమధ్య, మున జనించినకట్టాణిముత్తియంబు
చందము వహించెఁ గార్తికచంద్రచంద్రి, కామనోహరచాకచక్యంబుతోడ.

85


చ.

సురవరులార యిన్నగముచుట్టున నున్నవి చూడుఁ డాధరా
ధరములు భానుసైంధవపథశ్రమనోదనకారికందరా
న్తరతరువాటముల్ మును ముదంబున నెత్తెడువేళఁ బఙ్క్తికం
ధరుఁడు భుజార్గళంబులఁ గదల్పఁగ రాలినరాలకైవడిన్.

86


సీ.

కనుపట్టె నీశైలమున దక్షకన్యకాధవుఁడు సామాన్యపుఁదపసి వోలె
నొకపిన్నరాచక్కి నుండు నీగిరి నలకాపట్టణమ్ము పక్కణము వోలెఁ
దిరుగు నీవసుమతీధరముమీఁద గణాధిపతి మదావళకలభంబు వోలె
నాదిశాక్వరము విహారంబు సలుపు నీకొండచెంపల గోవుకోడె వోలె
నిన్నగంబునఁ బ్రవహించు సన్నపాటి, నిర్ఝరము వోలె మందాకినీస్రవంతి
గాన నీమెట్టు మోక్షంబు కట్టుమట్టు, కనుఁడు గీర్వాణవరులార కన్నులార.

87


క.

అని వర్ణించుచు నబ్జా, సనుఁడు సుధాంధసులుఁ దాను సపులకకళికా
తనులై తక్కుధరాగ్రం, బునకు నరిగి హరువటారము గనుఁగొనుచున్.

88


సీ.

పెనుబాపపేరు వేసినగట్టువా కుంభిదైత్యావరోధవైధవ్యదాయి
కడవన్నె బంగారుగట్టువిల్తుఁడు భక్తరక్షణక్రీడాపరాయణుండు
చిగురుగైదువజోదు పగదాయ పార్వతీవనితాచకోరపార్వణవిధుండు
చేఁదు భోజనము చేసిన మొక్కలీఁడు దక్షాధ్వరధ్వంసదీక్షాధికారి
కలిమి గలవానికూరిమి చెలిమికాఁడు, నీరనిధివేష్టితోర్వీమహారథుండు
బుడుతవెన్నెలపూమొగ్గ ముడుచువేల్పు, చిరకృపాదృష్టి మనల రక్షించుఁ గాక.

89


వ.

అని నిశ్చలమనస్కులై నమస్కరించుచుఁ జతుర్ముఖప్రముఖబర్హిర్ముఖులు సంతసం
బున సంతతవిహరమాణబహుసహస్రవేదండతుండగండమండలగళద్దానధారాసుర
భితబహిర్ద్వారవితర్దికానిషణ్ణసపరివారకుంభోదరనికుంభంబును శిఖరసముత్తంభితశాత
కుంభకుంభంబును సకలపాతకశ్వసనగ్రసనవ్యసనదండుకుండలిరసనాయమానకేతనం
బును మోక్షలక్ష్మీనికేతనంబును సమంజసకంజరాగసాలభంజికాపుంజపింజరితనిజారం
బు నైనహజారంబు డాయం బోయి తమరాక విని పిలువ నియోగించిన వచ్చి నంది

కేశ్వరుండు దోడుకొని పోవ లోపలిచావడిం గొలువున్న సర్వమంగళానుషంగ
వామోత్సంగు భుజంగాభరణుం గని సాష్టాంగంబు లెఱంగి మస్తకన్యస్తహస్తులై.

90


దండకము.

జయజయ జగదీశ యీశాన కాశాహిపాకాశగంగాభరాకాశశాంకప్ర
కాశప్రతీకాశ నిర్నాశ దృక్కర్ణమార్వీకసౌవర్ణభూభృద్ధనుర్ముక్తబాణారిబా
ణాగ్రజాగ్రచ్ఛిఖావన్ముఖైకాహుతీభావధుర్యత్రిపుర్యాదితేయప్రతీపోద్భటాటోప
చిద్రూప కద్రూతనూజాంగుళీముద్రికాకోణనిద్రాణనారాయణచ్ఛాయదాయాద
కంఠోపకంఠస్థలస్థాయుకక్ష్వేళ కారుణ్యధారాళ మారాళపక్షద్వయీమందమందా
నిలస్పందిమందాకినీకంజకింజల్కసిందూరితేందుప్రభాభాసితాశాంతరాభోగ రక్షా
సముద్యోగ దక్షాధ్వరధ్వంసనప్రక్రియా ధర్మధూర్దండచక్రీకృతాహర్నిశాశేష
విద్యామయా స్యందనారోహవేళాభుజస్తంభసంభావితోంకారశింజిన్యుపేతత్రయీ
మాతృకోదండ సప్తస్వరీకాండ దండాయుధధ్వంసకా గజరజనిచరాంతఃపురీనీల
ధమ్మిలబంధాంధకారాంశుమాలీయథారక్తనేత్రాంత కైలాసవిశ్రాంత నిశ్రేయ
సద్వాఃకవాటీభవద్గూఢపాద్భీరుషడ్గ్రంధనిర్గంధనాకుంచనోడ్యాణజాలంధరప్రఖ్య
బంధత్రయీభస్త్రికాధ్నాతజాజ్వల్యమానానలజ్వాలసంశోధితబ్రహ్మనాడీవినిక్షిప్త
చంద్రార్కసంజ్ఞానిలస్వాంతయోగీశ్వరాయత్త వేదోక్త్యనిర్ధారితాయత్త దేవా
భవనూర్తివిస్ఫూర్తి కీర్తింపఁ గా నేర్తుమే కర్తవున్ భర్తవున్ హర్తవున్ నీవ నీకేల
నిల్చెం ద్రిశూలాకృతిన్ లోకముల్ మూఁడు నీనేత్రముల్ చిత్రభానుత్రయం
బుల్ సముద్రంబు లేడున్ సరిద్రత్నసానుప్రధానాద్రులున్ నీజటావల్లికల్ తల్లి
దండ్రుల్ మృగీనేత్ర ధాత్రీధరగ్రామణీపుత్రియున్ నీవు నీసృష్టికిన్ శిష్టరక్షావి
ధానంబుల్ దుష్టశిక్షావిధానంబులున్ నీకు నైసర్గికంబుల్ గదా భర్గ దుర్గామనో
నాయకా పరమపురుషరూపంబు నీవున్ మహాశక్తిరూపంబు గౌరీవరారోహయున్
బోధరూపంబు నీవున్ సుధారూపమార్యాసరోజాక్షియున్ భూమిలో నైదు నీరం
బులో నాల్గు తేజంబులో మూఁడు వాతంబులో రెండు నభ్రంబులో నొండు నానా
గుణంబుల్ ప్రవర్తిల్లుఁ దత్తద్గుణంబుల్ వివేకించిన న్నీవ సర్వేశ్వరా పాల నా
జ్యంబు రాలం బృహద్భానువు న్నువ్వుల న్నూనెయుం బువ్వులం దావియుం బోలె
విశ్వంబున న్నీవు చైతన్యమై నిల్తు గంగాధరా సౌధజాలంబులన్ రేణుజాలంబు
చందంబుగా రోమరంధ్రంబులన్ బెక్కుబ్రహ్మాండముల్ దాల్తు వైరాజరూపంబు
నన్ మదనమదనదీగ్రీష్మ నీమాళిమీఁదన్ సుధాబిందువుల్ చిందునానందకం
దంబు నీక్షించి సాక్షాత్పరిజ్ఞానముంగా విచారింప లేమిం జుమీ కొంద ఱప్రాజ్ఞతం
జందురుం డందు రామందులన్ దెల్ప నేమందులున్ లేవు భూత్యష్టకానర్గళాసర్గ
సంభూతికిన్ మున్ను తత్వంబు లేనేనులం బాసి భాసిల్లు చె ప్డద్వితీయుండవై

శూన్యభావంబుతోడన్ వినోదించు ని న్నాదినారాయణుం డంచు నబ్జాసనుం
డంచు ఫాలాక్షుఁ డంచున్ భజించున్ బ్రపంచంబు కొంచెంబు మాబుద్ధి నీశుద్ధ
బుద్ధస్వరూపంబు వర్ణింప శక్యంబె వాక్యంబులన్ శంకరా శంక రాత్రించరశ్రేణిచే
మాకుఁ బాటిల్లఁ బాటిల్లఁగాఁ జేయ శక్రుండు శక్తుండు గామిన్ సదా గ్లాని చిత్తం
బులం బూని రక్షోనిశాతక్షురప్రక్షతాంగక్షరద్రక్తపూరంబున న్నాని సేనాని
నానానిలింపావనార్థంబు నిర్మించు మంచున్ భవత్పాదముల్ చేరి ప్రార్థింపుచు
న్నార మన్నం బ్రసన్నాననాంభోజుఁడై.

91


గీ.

పార్వతీవల్లభుండు వాక్ప్రముఖు లైన, పంచదశదేవతలలోన భావి నవత
రింపఁ గలవాని నరసి నిర్మింతు నొకని, దానవజయావధాని సేనాని మీకు.

92


మ.

అని గీర్వాణుల నిర్వహింప సుముఖుండై శక్తి నాత్మాంగవా
సిని సంక్షోభము నొందఁ జేసిన జనించెం గోటీమధ్యందినా
ర్కనిభాభామహీమం గుమారుఁడు సగర్వక్రవ్యభుక్కామినీ
జనవైధవ్యదబాహుదండసహజజ్ఞానాభిధాశక్తితోన్.

93


క.

భూవరతిలక ప్రజాపా, లా విను మన్వంతరముల నాశాంభవదే
హావిర్భూతనిలింపచ, మూవిభునకుఁ బెక్కుజన్మములు గలవు సుమా.

94


సీ.

ఇట్లు సేనానాథు నిచ్చిన శివునిఁ బూజించి వాకృతి సునాశీరముఖ్య
దైవతసహితుఁడై తమతమ తేజోంశములు కుమారవతంసమునకు నొసఁగ
నాశక్తిధరుఁడు నత్యధికతేజోవిశేషమ్మున దీపించి జనక యింక
వాహంబు నొకటి సేవకులఁ గొందఱ నాకుఁ బాలింపవలె నన్న భవుఁడు వాహ
నంబు పవనంబుకంటె మనంబుకంటె మిక్కుటం బైనవడి గలకుక్కుటంబు
భటుల శాఖవిశాఖులఁ జటులబలస, ముద్భటుం డైనపట్టికి ముదలవెట్టి.

95


క.

అనిమిషరథినీపాలన, మునకున్ బట్టంబు గట్టి భూతగ్రహశా
సనకర్తఁ జేసి యీతని, వినుతింపుఁడు మీర లన్న విని యింద్రాదుల్.

96


ఉ.

షణ్ముఖ కుక్కుటధ్వజ కృశానుసముద్భవ మాతృజా తురా
షాణ్ముఖదేవతాసకలసైన్యధురంధర కార్తికేయ వి
ద్విణ్మథనప్రచండభుజవిక్రమసార కుమార తారకా
రాణ్ముకుటప్రసూత మము రాక్షసబాధలఁ బాపి కావుమీ.

97


క.

అని కొనియాడిన సేనా, ని నిలింపుల నాదరించి నిఖిలజగత్పూ
ర్ణనిరంకుశతేజంబునఁ దనుజల ననిలో హతాహతంబుగఁ దోలెన్.

98

వ.

అని మహాతపోమునీశ్వరుండు చెప్పినఁ బ్రజాపాలుండు మహాత్మా శివజ్ఞానశక్తివలనఁ
బ్రాదుర్భవించినకుమారస్వామి నేమి కారణంబున మాతృజకృశానుసముద్భవకార్తి
కేయనామధేయంబుల నాదితేయులు సంస్తుతించిరి తత్కారణంబు తెలియ నాన
తిమ్మనిన మహీశా యిది సేనానికి నాదిమన్వంతరంబునఁ గలిగినజన్మంబు తరువాత
నాతనికి రెండవజన్మంబున మాతృకృశానుకృత్తికాకృత్తివసనకుభృత్తనయలు
సముత్పత్తినిమిత్తంబు లయ్యెదరు దేవత లనాగతజ్ఞులు గానఁ గార్తికేయాదినామ
ధేయంబుల సన్నుతించిరి యీభంగి నహంకారంబు గుహుం డై పుట్టినపరతత్వ
విద్యారహస్యంబు నీకు వినిపించితి నీదృగ్విధగుణగరిష్ఠుం డైనషణ్ముఖుండు షష్టి
నాఁడు దేవసేనాధిపత్యంబు వహించినకతన నవ్వాసరంబునం గథాశ్రవణపూర్వ
కంబుగా ఫలాహారు లైనవారికి ధనధాన్యపుత్రపౌత్రాభివృద్ధులు సిద్ధించు నింక
శారీరజ్యోతి భాస్కరుం డైనవిధంబు వినుము.

99


గీ.

జ్ఞానశక్తికిఁ బరమాత్మునకు విభేద, మించుకయు లేదు సుమ్ము భావించ నాస
నాతనుం డాత్ముఁ డొకనాఁడు జ్ఞానశక్తిఁ, జూచెఁ జూచిన నొకమహాజ్యోతి పుట్టె.

100


క.

నానాదిగంతరంబుల, లో నిండుచుఁ దనకుఁ దాన లోలీభూతం
బై నిలువ నమ్మహాతే, జోనివహము చొచ్చి రఖిలసురవరముఖ్యుల్.

101


సీ.

సుర లివ్విధంబునఁ జొచ్చినకతమున సూర్యాఖ్య మైనతేజోగుణంబు
రవిసంజ్ఞ గలశరీరము వేఱె తాల్చె నారవి నిజకాంతిపరంపరావి
భాసితలోకుఁడై భాస్కరుం డయ్యెఁ బ్రకర్షత్వమునఁ బ్రభాకరుఁ డనంగఁ
బరఁగె సమస్తప్రపంచమునకు నాద్యుఁ డగుట నాదిత్యవిఖ్యాతి గనియె
దివసమునకు దివాహ్వ వర్తిల్లుఁ దద్ది, వాకరణశాలి గాన దివాకరప్ర
శస్తి ధరియించె నతనిభాస్వత్ప్రదీప్త, దీప్తిఁ బుట్టిరి ద్వాదశాదిత్యు లధిప.

102


క.

వారలకు నగ్రగణ్యుం, డై రవి సంవర్తసమయహవ్యవహశిఖా
దారుణకరముల భువనము, లీరేడును వేఁచిపోఁత నెఱిఁగి సభయులై.

103


క.

తద్గర్భంబున నున్న మ, రుద్గణములు వెడలి నీవు రుచిదహనజ్వా
లోద్గిరణంబుల సకలజ, గద్గోళము సంతసింపఁగాఁ జేయకుమా.

104


వ.

దేవ మహానుభావ పురాణచరాచరప్రాణమునివరేణ్యగణ్యగుణగౌరవ గాఢాంధ
కారగంధగజకంఠీరవ కాలచక్రధర జన్మజరాభరభయవినాశకర పద్మినీహృద్య వేదా
న్తవేద్య హరిహరబ్రహ్మస్వరూప సకలలోకైకదీప యాజుషాగమప్రవృత్తికారక సం
సారతారక కాండభాండమండలవిశ్రమావాసకుక్షి కర్మసాక్షి నితాంతసంతాపంబు
చూపక శాంతిం బొంది విభ్రాంతుల మైనమమ్ము రక్షింపు మని బహుప్రకారంబులఁ

బ్రార్థించిన విని సహస్రకరుండు సూక్ష్మాకారంబు వహించి భువనపూజ్యుండై
నిలిచె నట్టిభాస్కరుజన్మదివసంబు గాన సప్తమినాడు కథాకర్ణనంబు మున్నుగా
శాకాహరు లైనవారికి నాయురారోగ్యంబులు గలుగు నింక శరీరాధిదేవత లైన
కామక్రోధాదులు మాతృక లగుట వినుము.

105


గీ.

ఆదిమన్వంతరంబున నవతరించి, వారె బ్రహ్మవరప్రభావమునఁ గువల
యంబు గంపింప సాంపరాయస్థలిని ని, రస్తనానాసురుం డంధకాసురుండు.

106


సీ.

ఇట్లు దానవారాజు హెచ్చిన నొచ్చి వియచ్చరవ్రాతంబు వచ్చి తనకు
విన్నవింప నజుండు మున్ను వానికి శరీరంబున వెడలినరక్తకణము
లెన్ని మేదిని రాలె నన్నియు నంధకాసురులుగా నిచ్చితి వరము నేను
గావున మనచేతఁ జావఁడు పురవధూచికురబంధద్రోహిచేతఁ గాని
కదలిపోదము రండని కలుషకదళి, కాసమదభద్రకరికిఁ గైలాసగిరికిఁ
దత్తఱంబున నేగి నెత్తమున నిలిచి, చఱులఁ బ్రతిశబ్దములు పుట్ట మొఱలు వెట్ట.

107


క.

ఆఘోషము బాహముహు, రాఘాతమదాంధకాంధకాసురచాప
జ్యాఘోషము వినియె జయశ్లాఘాదుర్ధరుఁడు హరుఁడు సమసమయమునన్.

108


మ.

విని గీర్వాణులభీతి మానిషి మనోవీథిన్ విచారించి వీఁ
డు నిరాతంకత నెట్టు వచ్చె నగరాట్పుత్రీజిఘృక్షాప్రయో
జనుఁడై కన్నులఁ గానఁ డంచుఁ గొనమీసల్ దీఁడి తా తార్చెన్ భుజం
బున రక్షోవనితాజనాక్షిజనితాంభోజాలమున్ శూలమున్.

109


క.

రణసన్నాహంబున ఫణ, ఘృణిమండలి మెఱయ వాసుకిన్ ధరియించెన్
మణికాంచిగా రణత్కం, కణములుగాఁ దొడిగెఁ దక్షకధనంజయులన్.

110


క.

ఈవిధమునఁ గట్టాయిత, మై వెలువడి నముచిభిన్ముఖామరవరసే
నావీరభద్రగణదం, తావళవదనులు భజింప నడచినశూలిన్.

111


చ.

కనుఁగొని నీలదానవుఁడు గంధగజాకృతి ఘీంకరించి వ
చ్చిన మృగరాజరూపమునఁ జించె నఖంబులఁ గుంభముల్ ఘనా
ఘనఘనగర్భముక్తకరకల్ వలె మౌక్తికరాజి రాలఁగా
ననిమొన వీరభద్రుఁడు భయంకరకంఠనినాదరౌద్రుఁడై.

112


క.

ఆసమయంబున సంస్తుతి, చేసిరి దేవతలు మెచ్చి శివుఁడు తదానీ
తాసురమత్తగజాజిన, వాసము ధరియించి కృత్తివాసుం డయ్యెన్.

113


సీ.

ఇట్లు రుద్రుండు భద్రేభచర్మంబు ధరించి శూలంబు సారించి కవిసె
నంధకాసురుపై సహస్రాక్షశిఖియమరాక్షసాబ్దిపసమీరణక బేర

ముఖ్యగీర్వాణచమూసమూహములతో సేనాని యెలగోలు చేసి రాత్రి
చరసైన్యములఁ బారి సమరె నాదైత్యులు సురల మార్కొని యేపు చూపుచోట
సరభసంబునఁ గలహభోజనుఁడు నార, దుండు చని విన్నవింప విష్ణుండు వచ్చెఁ
బక్షిపతి నెక్కి పైఁడిదుప్పటిచెఱంగు, దూలఁగా బిట్టు వాగెలఁ దోలుకొనుచు.

114


ఉ.

ఆహరిఁ జూచి వేలుపు లహంకరణంబుల దైత్యసేనతో
నోహరిసాహరం బెనఁగ హుమ్మని వైరుల నుగ్గునూచముల్
గా హరియింతు నే నని చలంబున నంధకుఁ డాగ్రహించి పై
రా హరిణాంకశేఖరుఁ డురస్స్థలి శూలమునం బగిల్చినన్.

115


గీ.

రక్తకణరాజి విశ్వంభరాతలమునఁ, దొరిగె జొటజొట నందుఁ బుట్టిరి నిలింప
వాహిని చలింప జిహ్వాలవక్త్రవివరు, లంధకాసురవరులు సంఖ్యలకు మీఱి.

116


సీ.

వారలఁ గరచక్రధారల వ్రచ్చి వందఱ లాడె హరి పురత్రయవిభేది
మూలాంధకాసురు శూలాగ్రమున గ్రుచ్చి యెత్తె నెత్తిన నెత్తు రేఱులై ర
ణాంగణంబునఁ బాఱె నందు నంధకు లనేకసహస్రములు పుట్టఁ గాంచి మిగుల
నాగ్రహించిన దర్పకారాతిముఖమున నెఱమంట వెడల యోగీశ్వరీస
మాఖ్య గలశక్తియై నిల్చె మఱియు నొక్క, శక్తి నిర్మించె నాత్మలాంఛనకళాను
షక్తిఁ గేవలసాహసవ్యక్తి రాక్ష, సేంద్రభీషణశక్తి మహేశ్వరుండు.

117


వ.

విష్ణుబ్రహ్మకుమారేంద్రదండధరవరాహ స్వాములు తమతమరూపచిహ్నంబులు
దాల్చినశక్తులం గల్పాంతవహ్నికల్పంబులం గల్పించిరి యిప్పగిది నుప్పతిల్లినయో
గీశ్వరీప్రముఖశక్త్యష్టకంబు భుజావష్టంభసంరంభంబున విజృంభించి రుధిరసంభూ
తాంధకసహస్రంబుల సంహరించి వదనగహ్వరంబులు దెఱచి కండలు కటుకు
కటుకునఁ గఱచియు రక్తంబులు గుటుకుగుటుకునం గ్రోలియుఁ గీకసంబులు
పెటుకుపెటుకున విఱిచియుఁ బ్రేవులు పుటుకుపుటుకునం దెంచియు విహరించి
రణక్రీడ చాలించె నీలకంఠుండు నంధాకాసురుం బరిమార్చి పేర్చి విజయంబునఁ
గైలాసంబునకుం జనియె నారాయణుండు వైకుంఠంబున కేగె భారతీవల్లభుండును
సత్యలోకంబున కరిగె హరిహయాదిహరిదీశానులు నాత్మనివాసంబులకుం బోయి
సుఖం బుండిరి మహీమండలేశ్వరి కామంబు యోగీశ్వరి క్రోధంబు మహేశ్వరి
లోభంబు వైష్ణవి మదంబు బ్రాహ్మి మోహంబు కౌమారి మాత్సర్యం బైంద్రి పైశు
వ్యంబు దాండధరి యీర్ష్య వారాహి యీమాతృకలజనం బష్టమీదివసంబు గావున
నాఁడు కథ విని బిల్వాహారు లైనవారికి భోగమోక్షంబులు సిద్ధించు నింక మాయ
దుర్గయై జన్మించినవిధంబు వినుము.

118

క.

విద్వన్నిధి లవణోద, న్వద్వేల్లితభూమివలయనాయకుఁడై సిం
ధుద్వీపాహ్వయుఁడు సగ, ర్వద్వేషులు దలంకఁ బుట్టె వరుణాంశమునన్.

119


శా.

ఆరాజన్యకులైకభూషణము పూర్వాసూయతో జంభదై
త్యారాతిన్ విదళింపఁ జాలుపుమపత్యంబుం గనం గోరి పు
ణ్యారణ్యంబుల మూలపర్ణజలవాతాహారసంశీలతన్
ఘోరం బైనతపంబు చేసె భువనక్షోభంబు సంధిల్లఁగన్.

120


సీ.

అనినఁ బ్రజాపాలమనుజేశ్వరుఁడు మునినాయక యేకారణమునఁ బూర్వ
వైరంబు గలిగె గీర్వాణాధిపతికి సింధుద్వీపధాత్రీవధూవరునకు
నావుడుఁ ద్వష్టృనందనుని వృత్రాఖ్యుని సకలాయుధంబులఁ జావు లేని
వాని వారాన్నిధిఫేనంబుచే సమయించె సుత్రాముఁ డావృత్రరాత్రి
చరవరుండు పుట్టె జగతి సింధుద్వీపుఁ, డనఁగ నది నిమిత్తమున మహేంద్రు
సంగరాంగణమున సంహరింపఁగఁ జాలు, తనయుఁ బడయఁ గోరి తపము చేసె.

121


క.

జనవల్లభ మీఁదటికథ, విను మట్లు తపంబు సలుప వేత్రవతీవా
హిని సూనశరాసనగే, హినివలె సౌందర్యరేఖ నేతెంచుటయున్.

122


క.

కనుఁగొని సింధుద్వీపా, వనినాథుఁడు తనతపంబు వఱుతం గలయన్
మనసిజభీషణసమ్మో, హనబాణపరంపరాభిహతమానసుఁడై.

123


క.

మకరికలు గానఁబడ హం, సకములు మెఱయంగ వేణి జాఱ గళన్మౌ
క్తికకంకణములు మొరయ ని, టకు మెల్లన వచ్చునది కటా దక్కునొకో.

124


మ.

అనుచో డగ్గఱి వార్ధివల్లభునిభార్యన్ నేత్రవత్యాఖ్య నే
నినుఁ గామించితి నాదరింపు కలకంఠీకంఠి కామించినం
జనవుల్ చెల్లఁగ నీక త్రోచుటలు దోసం బండ్రు సుమ్మీ బుధుల్
జననాథోత్తమ యింక నేటికి వృథా శంకింప నామాటకున్.

125


గీ.

అనుచు లావణ్యజలధి కామిని సరోజ, నేత్ర తనకూర్మి గాన రా నిలిచి సరస
తానుకూలవాక్యములలహరి గొలిపె వ, సుంధరాభర్తచిత్తంబు సుడివడంగ.

126


క.

జనవిభుఁడును సూనశరా, సనకేళి మనోరథంబు సఫలముగాఁ జే
య నదియు సద్యోగర్భం, బున మాణిక్యంబువంటిపుత్రునిఁ గనియెన్.

127


క.

రాత్రించరవరుఁ డాతఁడు, వేత్రవతీసుతుఁడు గాన వేత్రుం డనఁగా
ధాత్రీతల మేలెఁ గకు, బ్జైత్రతఁ బ్రాగ్జ్యోతిషాఖ్యపట్టణపతి యై.

128


గీ.

రాజసంబున హస్త్యశ్వరథపదాతి, పాదఘట్టన మేరువుమీఁదఁ బసిఁడి
బూడిదలు రేఁగ నొకనాఁడు దాడి వెట్టి, యుట్టిపడి నాకనగరంబు చుట్టుముట్టి.

129

సీ.

వాసవుఁ గొట్టిన వహ్నిఁ గూడె శచీశ్వరాగ్నుల మోఁదిన యమునికడకు
వచ్చిరి హరిశిఖివైవస్వతుల జయించిన దైత్యుఁ గలిసిరి జిష్ణుకీలి
శమనక్షపాటులఁ జఱచిన వరుణుఁ జేరిరి యింద్రబర్హిఃపరేతపాస్ర
పప్రచేతసుల విభాళించిన సమీరు డాసిరి దేవరాడ్దహనదండి
యాతుపాశిమరుత్తుల గాతిగొనిన, ధనదుఁ జెందిరి కుధరభేద్యనలకాల
రాక్షసాంభోధివరజగత్ప్రాణయక్ష, పాలకుల వెంటఁబట్టిన శూలిఁ గనిరి.

130


ఉ.

దిక్ప్రభు లెల్ల నిట్టిపగిదిన్ భయకంపితగాత్రులై మన
శ్శుక్ప్రతికారచింతకు యశోవతి యుంట యెఱింగి రాహవి
ర్భుక్ప్రతిమానరోషమునఁ బొంగుచు వేత్రనిశాచరుండు వా
ర్ముక్ప్రకరార్భటిన్ బటహముల్ మొరయన్ జనుదేర నత్తఱిన్.

131


క.

ఆశాధినాథులును వా, గీశానునిలోకమునకు నేగి నిజమనః
క్లేశంబు గానఁబడ నా, క్రోశించిరి సలిలనిధులు ఘూర్ణిల్లంగన్.

132


సీ.

ఆదిక్పతులమొఱ లాలించి విష్ణుపాదమునఁ బుట్టినసలిలములలోన
క్షేత్రజ్ఞ మాయ గాయత్రి జపించుచు నుండియుఁ గమలాసనుండు సదయుఁ
డై నిరీక్షించి మాయావినిర్మితులు గారా సురాసురు లంచు నాతఁ దలఁప
నావిర్భవించె శార్ఙ్గాసిగదాశంఖచక్రపాశాంబకచాపహస్త
నిర్మలాంబర మత్తకంఠీరవాధి, రూఢశక్తి జనించి మరుచ్చమూప
రంపరలు చూడఁ బెక్కువర్షములు పోరి, వేత్రనక్తంచరుని మెడ విఱిచివైవ.

133


ఉ.

ఆర్చి బలారిముఖ్యులు నిశాటపతిప్రళయానలంబు చ
ల్లార్చినసింహవాహనకు నాదిమశక్తికి లోకదుర్దశల్
దీర్చినవేదమాతృకకు దేవికి హస్తసరోరుహాంజలుల్
చేర్చిరి ఫాలభాగమునఁ జేయఁ దొడంగె శివుండు సంస్తుతుల్.

134


సీ.

గాయత్రి మూఁడువక్త్రములశూలిని బ్రహ్మమది నుద్భవించినమంత్రశక్తి
దనుజఘ్ని మూఁడుతత్త్వంబుల మొలచినగౌరి వేదంబులఁ గన్నతల్లి
వాణి చంద్రార్కపావకనేత్ర మూఁ డక్షరముల నిల్చినశంకరప్రభూత
శబరి సుధారసస్రావిణి మూఁడులోకంబులు నిండినకమలనిలయ
దేవి స్వాహాస్వధాత్మిక దివ్యభూష, ణాంబరప్రసవాలేపనాభిరామ
భక్తవరద మహామాయ పరమమునివ, రేణ్యసంసేవ్య నిన్ను వర్ణింప వశమె.

135


మ.

అని యీశానుఁడు సంస్తుతించుతఱి దైత్యారాతిపాదోద్భవాం
బునిమగ్నుండు విరించి వెల్వడి బహిర్భూమిం బ్రకాశించుదే

వి నిరీక్షించుచు భావికార్యము మనోవీథిన్ వితర్కించి యి
ట్లనియెన్ బూర్వదిగీశ్వరప్రముఖసర్వామర్త్యవర్గంబుతోన్.

136


సీ.

సురలార జగదధీశ్వరి గాన నీదేవి ననుసరించి హిమాగమునకుఁ బొండు
భవ భవత్కృతమహాస్తవపాఠకులకు నీశక్తియు నీవు నైశ్వర్య మిండు
దుర్గ మీఁదట గర్వదుర్వారుఁడై పుట్టు మహిషాసురునిఁ జంపి మనుపు మిమ్ము
బ్రహ్మ చనిన గాయత్రి నిర్జరపరంపర గొల్వ నీహారధరణిధరము
చేరి మందారసంతానపారిజాత, కల్పహరిచందనావృతాగ్రస్థలంబు
తానకముగా వసించి తద్దైవతముల, నందితులఁ జేసి తాల్చె నందాసమాఖ్య.

137


వ.

ఇట్లు మహామాయచేతఁ జేతఃప్రమోదంబు నొంది పురందరాదిబృందారకులు మంది
రంబులకుం బోయిరి నరేంద్రా నందజన్మదివసంబు నవమిగావున నాఁడు కథ విని
పిష్టాహారు లైనవారికి నభీష్టార్థంబులు సిద్ధించు నని ప్రజాపాలునకు మహాతపోమునీ
శ్వరుండు చెప్పె నని వరాహదేవుడు వినిపించిన వసుంధరాపురంధ్రి తరువాతి
వృత్తాంతం బానతిమ్మని విన్నవించిన.

138


మ.

కృతనారాయణపాదపూజన జనక్షేమక్రియాభోగ భో
గతిరస్కారితపాకశాసన సనక్షత్రక్షపానాయక
ప్రతిబింబశ్రుతిమౌక్తికస్తబకరారాజత్ప్రసన్నాస్య నా
స్యతినైపుణ్యవిరోధిరాజపరిరక్షాదక్షబాహార్గళా.

139


క.

బుధవినుత సాళ్వనరసిం, గధరాధవదండనాథ కాంతాపంచా
యుధ సుమనస్తరుసుమనో, మధురసమధురిమధురీణమంజులఫణితీ.

140


పృథ్వీ.

దయాభరణ లోభిరాట్తనయవారతన్వీవిటా
నయాచరణ గీయమానబిరుదప్రతాపోద్భటా
జయానకమృదంగజర్ఝరహుడుక్కికాఝల్లరీ
భయానకరవార్భటీపటపటద్దశాశాతటా.

141

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబున షష్ఠాశ్వాసము.