వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/అష్టమాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

అష్టమాశ్వాసము

క.

శ్రీదసవనభుగ్భూజాం, భోదసమత్యాగ మధురిపుత్రిపురహరా
భేదసపర్యాచర్యా, హ్లాదసమేతాత్మ యీశ్వరాధిపునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు కాశ్యపి కి ట్లనియె నట్లు దూర్వాసుండు చెప్పిన
విని సత్యతపోమునీంద్రుండు భట్టారకా నారాయణుండు యజ్ఞాదికృత్యంబులం
గాని సులభుండు గాఁ డన నవధరించితివి యజ్ఞాదికృత్యంబులు ధనసామగ్రి లేక
నడప రాదు ధనంబు గలిగెనేనియు లోభంబున సంసారులు తత్కృత్యంబులకు
నూలుకొనరు గావున నల్పప్రయాసంబున సకలవర్ణంబులకు మోక్షంబు గలుగు
మార్గం బానతి మ్మనిన సుముఖుండై.

2


గీ.

అత్రిమునిసంభవుండు మహానుభావ, సర్వసర్వంసహాకాంత జలధిలోన
మునిఁగి పాతాళమున నుండి మున్ను వారి, జోదరునిగూర్చి తాఁ జేసె నొక్క వ్రతము.

3


క.

తద్వ్రతము రహస్యంబు మ, రుద్వ్రాతవినిర్మితంబు రోగభవభయా
పద్వ్రతతిలవిత్రము త్రిజ, గద్వ్రీడావతి పురుషులు గావింపఁదగున్.

4


సీ.

సత్యతపోమునీశ్వరచంద్ర యెట్లన్నఁ జెప్పెద విను మార్గశీర్ష శుద్ధ
దశమీదినంబునఁ దానంబు చేసి యతాత్ముఁడై విహితకృత్యములు దీర్చి
లవణంబు పులుసు తైలంబు వర్జించి హవిష్యంబు భక్షించి వెనుక పాలు
గలచెట్టుపుడుక చక్కనిదిగా నెనిమిదివ్రేళ్ళమానంబున విఱిచి తెచ్చి
దంతములు దోమి వదనహస్తచరణములు, గడుగుకొని వార్చి రవిబింబగతుని విష్ణు
శంఖచక్రగదాంబుజస్వర్ణవసను, మణిమయకిరీటదేదీప్యమానుఁ దలఁచి.

5


క.

ఏ నేకాదశినాఁడు మ, హానియతి నుపోషితుండనై కేశవ ల
క్ష్మీనాయక నీకుఁ బ్రియము, గా నపరతిథిన్ భుజింతుఁ గావుము నన్నున్.

6


మ.

అని ప్రార్థించి సపుష్పతోయముల నర్ఘ్యం బిచ్చి శార్ఙ్గి మనం
బునఁ జింతింపుచుఁ బవ్వళించి రవిదీప్తుల్ సోఁకి నెత్తమ్మి మే

ల్కనుకంటె న్మును లేచి భూతగణరక్షాధారణాపాత్రి ధా
త్రి నమస్తే యని పల్కి పుచ్చుకొని మృత్పిండంబు హస్తంబునన్.

7


క.

జలజభవాండోదరమునఁ గలిగినతీర్థములు తావకము లైనకరం
బులఁ బుట్టినవి దినేశ్వర, త్రిలోకనుత నాకు నిమ్ము తీర్థఫలంబుల్.

8


గీ.

అని మహీభాస్కరులఁ గొనియాడి మృత్స్న, మూఁడుమాఱులు నైజాంగముల నలందు
కొని నదీసలిలంబులఁ గ్రుంకి నిత్య, కృత్యములు దీర్చి యింటికి నేగుదెంచి.

9


వ.

శాతకుంభకుంభరంభాస్తంభదర్పణధవళచామరసురభిమాల్యవితానంబుల నలంకృ
తం బైనమంటపంబున నారాత్రి నారాయణు నారాధించి కేశవాయ నమో యని
పాదంబులు దామోదరాయ నమో యని కటీరంబును నృసింహాయ నమో యని
యూరుయుగంబును శ్రీవత్సధారిణే నమో యని యుదరంబును గౌస్తుభధరాయ
నమో యని కంఠంబును శ్రీపతయే నమో యని వక్షంబును త్రైలోక్యవిజయాయ
నమో యని భుజంబులును సర్వాత్మనే నమో యని శిరంబును రథాంగపాణయే
నమో యని చక్రంబును శంఖాయ నమో యని శంఖంబును బద్మాయ నమో యని
పద్మంబును గంభీరాయ నమో యని గదాదండంబును శార్ఙ్గమూర్తయే నమోయని
యభయహస్తంబును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నజలపూరితంబులు
విమలాంబరపరివృతంబులు గంధపుష్పాక్షతసమన్వితంబులు తిలతామ్రపాత్రస్థగితం
బులు నైనకలశంబులు నాలుగు చతుర్వేదంబులు చతుస్సముద్రంబులుగా భావించి
తత్కలశంబులనడుమ హిరణ్మయంబు గాని రజతమయంబు గాని దారుమయంబు
గాని యొక్కప్రతిమ గావించి వస్త్రావృతం బైనపీఠంబు పెట్టవలయు నట్టిపీఠంబు
దొరక దేని సలిలపూర్ణకుంభంబుం గుదురుపఱచి తదుపరిస్థలంబున సువర్ణంబునం జేసిన
మత్స్యప్రతిమ ప్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి దైత్యాంతకా రసాతలగతం
బైనవేదంబులం బోలె సంసారనిమగ్నుండ నైనన న్నుద్ధరింపు మని ప్రార్థించి జా
గరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబున సముచితక్రియాకలాపంబులు
సలిపి పూర్వదక్షిణపశ్చిమోత్తరకలశంబులు ఋగ్యజుస్సామాధర్వణవేదులకుఁ గ్ర
మంబున నిచ్చి తోయపాత్రస్థితకాంచనమీనంబుం గుటుంబి యైనభూసురాగ్రణికి
సమర్పించి తదనంతరంబున.

10


సీ.

పాయసాన్నంబుల బ్రాహ్మణోత్తముల సంతృప్తులఁ గావించి భృత్యవర్గ
సహితుఁడై మౌనంబు సడలక పారణ చేసినసువ్రతశీలుపుణ్య
ఫలము వచింతు నాబ్రహ్మకల్పము సత్యలోకంబునందున నేకసౌఖ్య
మున నుండి జన్మించు వెనుక వైరాజులలోన జగన్నుతశ్లోక యింక

నైహికఫలంబు వినిపింతు నతిదరిద్రుఁ, డధికసంపదఁ బొందు గొడ్రాలు సుతులఁ
గాంచు నన్నియు నేటికి నెంచఁ బాయు, బ్రహ్మహత్యాదిబహువిధపాతకములు.

11


క.

ఈసువ్రతంబు తత్పర, యై సలిపినఫలమునం గదా మును లయవే
ళాసాగరమగ్నధరిత్రీసతి హరిచేత నుద్ధరింపఁగఁబడియెన్.

12


చ.

అమృతరసోపలబ్ధికి సురాసురవీరులు గూడి పుష్యమా
సమున సముత్పతచ్ఛఫరశైవలకర్కటచక్రనక్రవి
ద్రుమలహరీఘటాగగనరోధిఁ బయోధి మథింప నిందిరా
రమణుఁడు దాల్చె మందరధరాధరభారముఁ గచ్ఛపాకృతిన్.

13


గీ.

అమ్మహాకచ్ఛపేంద్రప్రియంబుగా విశుద్ధమానసుఁడై పుష్యశుద్ధదశమి
నాఁడు పూర్వప్రకారంబున నరుఁడు దా ను, చితవిధులు దీర్చి యేకాదశీదినమున.

14


వ.

స్నానాదికృత్యంబులు జరపి నానావిధపరిష్కారమనోహరం బైనమంటపాంతరం
బున రాత్రి లక్ష్మీకళత్రు నారాధించి కూర్మాయ నమో యని పాదంబులు నారాయ
ణాయ నమో యని కటీరంబును సంకర్షణాయ నమో యని యుదరంబును విశో
కాయ నమో యని యురస్స్థలంబును భవాయ నమో యని కంఠంబును సుబాహవే
నమో యని భుజంబులును విశాఖాయ నమో యని శిరంబును జక్రాయ నమో యని
చక్రంబును శంఖాయ నమో యని శంఖంబును బూజించి తద్దేవతాగ్రభాగంబునం
గలశంబులు పూర్వప్రకారంబున నిలిపి మధ్యకలశోపరిస్థలంబున హైయంగవీనపూర్ణ
తామ్రపాత్రంబున యథాశక్తి భర్మనిర్మితసమందరకూర్మప్రతిమ ప్రతిష్ఠించి షోడశోప
చారంబులు సలిపి జాగరణంబు గావించి మఱునాఁడు సూర్యోదయావసరంబునం
గలశప్రతిమాదానంబులు చేసి వసుమతీసుపర్వులకుఁ బాయసాహారంబులు సదక్షి
ణంబుగా నొసంగి భృత్యవర్గంబును దాను భుజియించిన జననశతత్రయార్జితపాత
కంబులం బాసి యిహలోకంబున బహుసౌఖ్యంబు లనుభవించి విష్ణుసామీప్యం
బున నాబ్రహ్మకల్పంబు వసియించి పిదప మర్త్యభువనంబునం బుట్టి పట్టభద్రుండై.

15


ఉ.

భంగములై నగంబులు గుభాలునఁ ద్రెళ్ళఁ గరళ్ళదాఁటుతో
నింగికిఁ బొంగువారిధి మునింగినభూవలయంబు కన్నెగే
దంగితుద న్వసించినమదప్రదసౌరభనిశ్చలీభవ
ద్భృంగముఁ బోలఁ గొమ్ముకొన నెత్తె మురారి వరాహరూపమై.

16


గీ.

ఆకిరీశ్వరప్రియంబుగాఁ బూర్వవి, ధమున మాఘశుద్ధదశమి నుచిత
కృత్యములు ఘటించి యేకాదశీతిథి, నధికభక్తుఁ డైనయన్నరుండు.

17

వ.

స్నానాదికృత్యంబులు జరపి సమంతతస్స్థాపితముకురకల్పితాపరిమితక్షణదేశం
బైనమంటపప్రదేశంబున నారాత్రి వామదేవు నారాధించి వరాహాయ నమో యని
పాదంబులు వామదేవాయ నమో యని కటీరంబును క్షేత్రజ్ఞాయ నమో యని జఠ
రంబును విశ్వరూపాయ నమో యని యురంబును సర్వజ్ఞాయ నమో యని కంఠం
బును బ్రజానాంపతయే నమో యని శిరంబును బ్రద్యుమ్నాయ నమో యని భుజం
బులు దివ్యాస్త్రాయ నమో యని చక్రంబును నమృతోద్ధాయ నమో యని శంఖం
బును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరి
స్థలంబున సౌవర్ధకాంస్యతామ్రవైణవంబులలోన దొరకినపాత్రంబున సకలసస్య
బీజంబులు నిండించి పెట్టి యథాశక్తి హేమంబునం గల్పించి ధవళవస్త్రయుగళంబు
నం బొదివి దంష్ట్రాసముత్తంభితవిశ్వంభరం బైనవరాహప్రతిమం బ్రతిష్ఠించి షోడ
శోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబునఁ
గలశప్రతిమాదానంబు గావించి తదనంతరంబున విప్రులకుఁ బాయసాహారంబు
సదక్షిణంబుగా నొసంగి భృత్యవర్గసహితుండై భుజించిన భూలోకంబున శాశ్వ
తైశ్వర్యంబు లనుభవించి పిదప వైకుంఠంబున నుండు నిమ్మహావ్రతంబున కొక్క
యితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

18


సీ.

శంసితవ్రతుఁ డైనసంవర్తసంయమీశ్వరునికుమారు లేవురు సమిత్కు
శార్థంబు చని భీకరారణ్యమున నప్పు డట జనియించినహరిణశాబ
ములఁ దల్లిఁ బాసి వాపోవుచుఁ గన్నులు దెఱవనివాని నైదింటిఁ జూచి
కరుణ నొక్కొకపిల్లఁ గరములఁ బట్టుమాత్రమున నామృగకిశోరములు చచ్చు
టయు భయంపడి జనకుని డాసి నిర్ని, మిత్తమున సంభవించిన మృగశిశువధ
పాతకము చెప్పి యిది మీరు పరిహరింప, వలయు నని విన్నవింప సంవర్తమునియు.

19


క.

మాతండ్రి మొదలఁ బాతకి, పాతకి నే నతనికంటె బాలకులారా
పాతకు లైతిరి మీరును, దాతతరముపాతకంబు తప్పక వచ్చెన్.

20


గీ.

అనుచు దుఃఖించి దైవికం బైనపనికి, నింక నేల విచారింప నేణచర్మ
ధారులై మీర లైదువత్సరము లడవిఁ, గ్రుమ్మరుఁడు మీఁదఁ బాపనిర్ముక్తి గలుగు.

21


చ.

అనవుడు నేణచర్మధరులై ఋషిపుత్రకు లేవురున్ వనం
బున నొకయేడుగాలము తపోనియతిన్ వసియింప నంత న
వ్వనవసుధాతలంబునకు వచ్చి కిరాతులు చొప్పు చూపఁగాఁ
బనివడి వీరసేనజనభర్త మృగంబుల వేఁట లాడుచున్.

22

క.

ముందట నొక్కమహీజము, క్రింద హరిణచర్మములు ధరించినమునిరా
ణ్ణందనులం గనుఁగొని మృగ, సందేహంబున నిశాతశరముల నేసెన్.

23


క.

ఏసిన హరిహరి యనుచు గ, తాసువులై కూలుటయు మహాశ్చర్యము సం
త్రాసంబును ముప్పిరిగొన, నాసంయమిసుతులకడకు నరిగి విభుండున్.

24


క.

అసదృశపాపఫలంబున, నసి వోవనిబ్రహ్మహత్య లైదు దగిలె నె
ట్లు సహించువాఁడ మృగయా, వ్యసనము కొఱగామి గాన వచ్చె నటంచున్.

25


సీ.

పోయి చేరువ నున్నపుణ్యాశ్రమస్థలంబున నున్నదేవరాతునకు మ్రొక్కి
తనకు నిష్కారణంబున బ్రహ్మహత్యలు దగులుట చెప్పి గద్గదికతోడ
నేడ్చిన నాసంయమీశ్వరుఁ డూరార్చి రాజన్య మున్ను వారాశిలోన
మునిఁగినభూమికామిని నుద్ధరించినకరణి మహాపాతకంబువలన
శ్రీవధూజాని ని న్నుద్ధరింపఁ గలఁడు, తలఁక నేల వరాహవ్రతంబు సలుపు
మనిన నాతండు చని వరాహవ్రతంబు, సలిపి శుద్ధాత్ముఁడై జగజ్జనులు వొగడ.

26


శా.

దృప్తారాతివరూధినీరుధిరమత్తీభూతభూతస్తుతి
వ్యాప్తానేకరణస్థలీవిజయబాహాగాంధవాహాసియై
సప్తాంభోనిధిమేఖలావలయితక్ష్మామండలం బెల్ల సం
తృప్తిం బొంది దిగంతరాళములఁ గీర్తిస్ఫూర్తి వర్తింపఁగన్.

27


సీ.

ఆనరేంద్రుండు దేహావసానంబున మణిమయం బైనవిమాన మెక్కి
నాకంబునకుఁ బోవఁ బాకశాసనుఁ డర్ఘ్య మీవలె నని యెదు రేగుదేరఁ
గనుఁగొని విష్ణుకింకరులు నివారించి వీరసేనావనిదార యితఁడు
తపమున నీకంటెఁ దక్కువ గానఁ జూడక రమ్ము నావుడు సకలదిగధి
పాలకులదివ్యతేజఃప్రభావమును ని, రాకరించి వివర్జితప్రళయమునకు
సత్యలోకంబునకుఁ జని సౌఖ్యలీల, నిపుడు సైతము నున్నాఁడు ఋషివరేణ్య.

28


మ.

ధర గంపింప మహాసభాభవనరత్నస్తంభసంభూతుఁడై
కరజంబు ల్నులివెట్టి రక్తకణముల్ గారంగ వీక్షించి రౌ
దరసద్రోణికలో యటంచు విబుధవ్రాతంబు వర్ణింప శ్రీ
హరి రక్షోభుజమధ్యమండలము చెండాడెన్ నృసింహాకృతిన్.

29


గీ.

ఆనృసింహునకుఁ బ్రియంబుగా ఫాల్గుణ, శుద్ధదశమినాఁడు సువ్రతుండు
విహితవిధులు పూర్వవిధమునఁ దీర్చి యేకాదశీదినమునఁ గ్రమముతోడ.

30


వ.

స్నానాదికృత్యంబులు జరపి రంగవల్లికాప్రముఖశృంగారకళాసాన్నిధ్యం బైన
మంటపమధ్యంబున రాత్రి మధుకైటభారాతి నారాధించి నారసింహాయ నమో

యని పాదంబులు గోవిందాయ నమో యని యుదరంబును విశ్వభుజాయ నమో
యని కటీరంబును ననిరుద్ధాయ నమో యని యురంబును శితికంఠాయ నమో యని
కంఠంబును పింగకేశాయ నమో యని శిరంబును దైత్యధ్వంసాయ నమో యని
చక్రంబును జలాత్మనే నమో యని శంఖంబును బూజించి తద్దేవతాగ్రభాగంబున
సరత్నసలిలకుంభంబు నిలిపి తదుపరిస్థలంబునఁ దామ్రదారువైణవంబులలోన
దొరకినపీఠంబుమీఁద ధవళవస్త్రయుగళంబునఁ బొదివి యథాశక్తి హిరణ్యనిర్మిత
నరసింహప్రతిమ ప్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱు
నాఁడు సూర్యోదయావసరంబునం గలశప్రతిమాదానంబులు గావించి తదనంత
రంబ వసుధాసుధాంధసులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్య
సమేతుండై భుజియించిన మర్త్యభువనంబున సౌఖ్యంబు లనుభవించి పిదప విష్ణు
లోకంబున నుండు నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద
నాకర్ణింపుము.

31


సీ.

మునికులోత్తంస కింపురుషవర్షంబునఁ బారశవ్యక్షమాపాలకుండు
వత్సరాజు విరోధివర్గంబుచేత రాజ్యము గోలుపోయి భార్యయును దానుఁ
జని వసిష్ఠాశ్రమంబునఁ గొంతకాలంబు వసియింపఁగా నొక్కవాసరమున
నవ్వసిష్ఠుడు నరాధీశ యిచటికి రా నీకు నేమి కారణము చెప్పు
మనిన జనభర్త ముకుళితహస్తుఁడై వి, పక్షులకు నాజిఁ దా నోటుపడిన తెఱఁగు
విన్నవించి మహాత్మ ప్రసన్నబుద్ధి, నొక్కగతి నాకుఁ జెప్పు నా నూఱడించి.

32


మ.

నరసింహవ్రత మాచరించి మను మన్నన్ వత్సభూజాని త
త్పరచిత్తంబున నేగి తద్వ్రతము సల్ప న్మెచ్చి చక్రంబు
హరి యీఁ గైకొని తన్మహాస్త్రమున మత్తారాతిరాజన్యకం
ధరముల్ సంగరసీమలో నఱకి శాంతస్వాంతుఁడై క్రమ్మఱన్.

33


క.

సామ్రాజ్యము పాలించె వి, నమ్రాఖిలకువలయాధినాథకిరీటా
తామ్రమణితరుణదినమణి, కమ్రవిభావికసితాంఘ్రికమలద్వయుఁడై.

34


మ.

తనరూపంబు గ్రమక్రమంబున దళద్బ్రహ్మాండభాండంబు నిం
డినచో భాస్కరుఁ డందెకు న్మొగపుమాణిక్యంబుగా సప్తవా
రినిధానీపరివేష్టితాఖిలధరిత్రీమానము ల్మీఱఁ బె
ట్టినపాదంబున దైత్యభేది బలి మెట్టెన్ వామనాకారుఁడై.

35


గీ.

మనుజుఁ డట్టివామనునికిఁ బ్రియంబుగాఁ, జైత్రశుద్ధదశమి సకలకర్మ
ములు మునుపటిచందమునఁ దీర్చి యేకాద, శీదినమున శుద్ధచిత్తవృత్తి.

36

వ.

స్నానాదికృత్యంబులు జరపి వైభవాభిరామం బైనమంటపసీమంబున రాత్రి ము
కుందు నారాధించి వామనాయ నమో యని పాదంబులు విష్ణవే నమో యని కటీ
రంబును వాసుదేవాయ నమో యని జఠరంబును సంపూర్ణకామాయ నమో యని
యురంబును విశ్వసృజే నమో యని కంఠంబును విశ్వరూపిణే నమో యని శిరంబును
విశ్వజితే నమో యని భుజంబులును శంఖాయ నమో యని శంఖంబును జక్రాయ
నమో యని చక్రంబును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుం
భంబు నిలిపి తదుపరిస్థలంబునం దామ్రదారువైణవంబులలోన దొరకినపీఠంబు
మీఁద యజ్ఞోపవీతకమండలుపాదుకాతపత్రబ్రుసీసమేతం బైన యథాశక్తికాంచనవిని
ర్మితవామనప్రతిమం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి
మఱునాఁడు సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమాదానంబులు చేసి తదనంత
రంబ ధరామరపుంగవులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్య
సహితుండై భుజియించినఁ బుత్రపౌత్రాభివృద్ధి గాంచి నిఖిలసుఖంబు లనుభవించి
బ్రహ్మకల్పపర్యంతంబు వైకుంఠంబున నుండి పిదప మధ్యమలోకంబునఁ జక్రవర్తి
యై పుట్టు నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

37


మ.

యతివంశోత్తమ పూర్వకాలమున హర్యశ్వాహ్వయుం డైనభూ
పతి పుత్రార్థము గానలోఁ దపము సల్ప న్మెచ్చి విప్రాకృతిన్
శతపత్రాక్షుఁడు వచ్చి చైత్రసితపక్షద్వాదశిన్ వామన
వ్రతముం జేయుము నీకుఁ గల్గును గుమారప్రాప్తి రాజాగ్రణీ.

38


గీ.

అనిన వీటికి నేగి హర్యశ్వుఁ డిమ్మ, హావ్రతము చేయ నదితికి నసురవైరి
పోలె నుగ్రాశ్వుఁ డనురాజు పుట్టి చక్ర, వర్తియై తాల్చె వివిధభూవలయభరము.

39


మ.

అనవద్యుండు హరుండు దాఁ గఱప నభ్యాసంబు గావించువే
ళ నిరాయాసత మత్తఖండిఁ దునుకల్ గా దొడ్డరోకంటఁ గొ
ట్టినలీలన్ భయదాజిరంగమునఁ గొట్టెం గండ్రగొడ్డంటివా
త నిలింపారివిదారి హైహయభుజస్తంభావళుల్ రాముఁడై.

40


గీ.

ఆపరశురామునకు హృదయప్రియంబు, గాఁగ వైశాఖశుక్లపక్షమున దశమి
సముచితాచారములు పూర్వసరణి నరుఁడు, చేసి కడునిష్ఠ నేకాదశీదినమున.

41


వ.

స్నానాదికృత్యంబులు సలిపి సారఘనసారసారంగమదపరిమళధారాళం బైన
మంటపాంతరాళంబున రాత్రి శతపత్రనేత్రు నారాధించి జామదగ్న్యాయ నమో
యని పాదంబులు సర్వధారిణే నమో యని యుదరంబును క్షత్రాంతకాయ నమో
యని భుజంబులు మణికంఠాయ నమో యని కంఠంబును శంఖాయ నమో యని

శంఖంబును జక్రాయ నమో యని చక్రంబును బహ్మాండధారిణే నమో యని శిరం
బును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరి
స్థలంబునఁ దామ్రవైణవంబులలోన దొరకినపీఠంబుమీఁద వస్త్రయుగళచ్ఛన్నం
బును దక్షిణహస్తవిన్యస్తపరశ్వధంబును నైనయథాశక్తి హేమనిర్మితజామదగ్నిప్రతి
మం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు
సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమాదానంబును గావించి తదనంతరంబునఁ
సర్వంసహాసుపర్వులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్యులుం
దానును భుజియించినఁ బుత్త్రులం బుణ్యశ్లోకుల ననేకులం బడసి యిహలోక
సౌఖ్యంబు లనుభవించి కడపట నాబ్రహ్మకల్పంబు సత్యలోకంబున నప్సరస్త్రీ
సమూహంబు గొలువ నుండి చక్రవర్తియై జన్మించి ముప్పదెనిమిదివేలుసంవత్సరం
బులు బ్రదికె నిమ్మహావ్రతాచరణంబునకు నొకయితిహాసంబు చెప్పెద నాకర్ణిం
పుము.

42


సీ.

సత్యతపోమునీశ్వర వీరసేనభూపాలవర్యుఁడు పుమపత్యవాంఛ
నతిఘోరతపము చేయఁగ నచ్చటికి యాజ్ఞవల్క్యమహాయోగి వచ్చి రాజ
నీవు తపం బేల గావింపఁ గడఁగితి నావుడుఁ బుత్రసంతానలిప్స
నాచరించెద నన్న హరిహరి భయదాటవిస్థలి నీదురవస్థ పడక
జామదగ్నివ్రతము సల్పి చక్రవర్తి, యైనఘనకీర్తినిధిఁ గను మనిన నీవ్ర
తంబు గావించి కాంచె నిర్దళితఖలుని, బలవదరివీరవనదవానలుని నలుని.

43


చ.

తనశరలాఘవంబు బలదానవజిత్ప్రముఖాఖిలామరుల్
గనుఁగొని మెచ్చి యెల్లకడలం గురియించునభస్తరంగిణీ
కనకసరోజవృష్టి యనఁగాఁ దునిమెన్ సకిరీటరావణా
ననములు దూలి భూతలమునం బడ శ్రీహరి రామభద్రుఁడై.

44


గీ.

ఆదశరథాత్మజునకుఁ బ్రియంబు గాఁగ, సువ్రతుఁడు నిష్ఠతో జ్యేష్ఠశుద్ధదశమి
నాఁడు పూర్వప్రకారమున సకలసముచితవిధులు దీర్చి యేకాదశీదినమున.

45


వ.

స్నానాదికృత్యంబులు జరపి సంస్థాపితబహుప్రదీపమాలికాజనితపుష్పకమణీవ్రీడం
బైనమంటపక్రోడంబున రాత్రి జనార్దను నారాధించి దామోదరాయ నమో యని
పాదంబులు త్రివిక్రమాయ నమో యని కటీరంబును ధృతవిశ్వాయ నమో యని
యుదరంబును సంవత్సరాయ నమో యని యురంబును సంవర్తకాయ నమో
యని కంఠంబును సర్వాస్త్రధారిణే నమోయని భుజంబులు శంఖాయ నమో యని
శంఖంబును జక్రాయ నమో యని చక్రంబును సహస్రశిరసే నమోయని శిరంబును

బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరిస్థలం
బునఁ దామ్రవైణవదారవంబులలోన దొరకినపీఠంబుమీఁద వస్త్రద్వయవేష్టితంబు
లైన యథాశక్తి కనకనిర్మిత రామలక్ష్మణప్రతిమలం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు
సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమా
దానంబు గావించి తదనంతరంబున నుర్వరాసుపర్వులకుఁ బాయసాహారంబు సదక్షి
ణంబుగా నొసంగి భృత్యసంగతుండై భుజియించిన శాశ్వతైశ్వర్యధుర్యుండై పవి
త్రచరిత్రులం బుత్రులం బడసి పిదప నాచతుర్దశమహేంద్రంబు నిసర్గస్వర్గభోగం
బు లనుభవించి మర్త్యంబున జన్మించి సార్వభౌమత్వంబు వహించు నిమ్మహావ్ర
తంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

46


మ.

మును సంతానము గోరి పఙ్క్తిరథరాణ్ముఖ్యుండు నానానిలిం
పనుతుం డైనవసిష్ఠుఁ డీవ్రతము చెప్పన్ భక్తిఁ గావించి స
జ్జనతాధీనుల దుష్టదానవభిదాసంధానులన్ మానులన్
గనియెన్ సూనుల రామచంద్రుఁడు మొదల్గా నల్వురన్ సంయమీ.

47


మ.

ఇనుఁ డాఖండలదిక్కునం బొడముచో నీరెండ గాయంగ వి
చ్చునవాంభోరుహముల్' మదాళికరణిన్ జుంబించె నందన్మరం
దనదీతుందిలకుంజపుంజములలోనం గుంకుమోద్వర్తనం
బున దీపించినగోపికాజనముఖంబుల్ శార్ఙ్గి శ్రీకృష్ణుఁడై.

48


గీ.

అట్టికృష్ణునకుఁ బ్రియంబుగా నాషాఢ, శుద్ధదశమి నాఁడు సుజనవరుఁడు
పూర్వభంగి నియమములు దీర్చి యేకాద, శీదినమునఁ బావనోదకముల.

49


వ.

స్నానాదికృత్యంబులు జరపి యదభ్రవిభ్రమసందర్భం బైనమంటపగర్భంబున
రాత్రి వైకుంఠనాయకు నారాధించి వాసుదేవాయ నమో యని పాదంబులు సం
కర్షణాయ నమో యని కటీరంబును బ్రద్యుమ్నాయ నమో యని జఠరంబును నని
రుద్ధాయనమో యని యుదరంబును జక్రపాణాయే నమో యని భుజంబులు భూ
పతయే నమో యని కంఠంబును పురుషాయ నమో యని శిరంబును శంఖాయ నమో
యని శంఖంబును జక్రాయ నమో యని చక్రంబును బూజించి తద్దేవతాగ్రభాగం
బున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరిస్థలంబునం దామ్రవైణవదారవం
బులలోన దొరకినపీఠంబుమీఁద వస్త్రయుగచ్ఛన్నంబును యథాశక్తి హాటకనిర్మి
తంబును సంకర్షణప్రద్యుమ్నానిరుద్ధసహితంబును నైనవాసుదేవప్రతిమం బ్రతి

ష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయా
వసరంబున సర్వంసహాసురులకుం బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృ
త్యవర్గంబునుం దానును భుజియించిన నపుత్రత్వదారిద్య్రాదిదుఃఖంబులం బాసి
విద్యావిత్తసంపన్నుండై సౌఖ్యంబు లనుభవించి తదనంతరంబున దేహావసానం
బున ముప్పదియాఱుమన్వంతరంబులు విష్ణులోకంబున వసియించి పిదప మర్త్యం
బున సప్తజన్మంబులు జన్మించు నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు
చెప్పెద నాకర్ణింపుము.

50


క.

యదువంశోద్భవుఁ డైనవ, సుదేవజనవల్లభుండు సూనులఁ బడయన్
మదిఁ గోరి చేసెఁ దనభార్య దేవకియుఁ దానుఁ బెక్కువ్రతములు నియతిన్.

51


గీ.

ఇవ్విధంబున వ్రతము లనేకములు స, లిపిన సంతానలాభంబు లేమి నామ
హీశ్వరుఁడు సతి కి ట్లనియె శశికాంత, మణిమయైకాంతశుద్ధాంతమఁదిరమున.

52


సీ.

లోలాక్షి పొదుగుళ్ళలో నున్నసుతుచిన్నిచిన్నినవ్వులు నిరీక్షించువారు
రమణి తనూజాతుఁ డమృతంబ చిలుకఁ బల్కెడుముద్దుపల్కు లాలించువారు
తలిరాకుఁబోఁడి విందులువిందు లనఁ బాఱుతెంచునందనుఁ గౌఁగిలించువారు
బింబోష్ఠి తనయుండు పెడము పెట్టినవేళ నిష్టార్థములు దెచ్చి యిచ్చువారు
రాజబింబనిభాస్య గారాపుఁబట్టిఁ, దిట్టి తిట్టించుకొని ప్రమోదించువారు
శ్రీవధూటీ కళత్రుగఱించి పూర్వ, జన్మమున నేమి తపములు సలిపినారొ.

53


మ.

అని చింతింపుచునుండ నారదుఁడు బ్రహ్మజ్ఞావసంవేది వ
చ్చె నభోవీథి నటజ్జటాకిసలయశ్రేణు ల్విపంచీపికా
దినినాదంబులు భూతిపుష్పరజముల్ దీపింపఁగా వంశవ
ర్ధనసంతానఫలప్రదానకరసంతానంబుచందంబునన్.

54


క.

ఆసమయంబున విభుఁడు య, థాసముచితపూజనములు తాత్పర్యముతోఁ
జేసిన సంతోషించి మ, హాసంయమి సస్మితాననాంభోరుహుఁడై.

55


క.

శాంతివిభూషణ లక్ష్మీ, కాంతుఁడు నీమీఁదఁ గరుణ గలఁడు సతతమున్
సంతానము లేమికి మది, చింతింపకు మేలివార్త చెప్పెద వినుమా.

56


సీ.

నిన్న విశ్వంభర నిర్జరేశ్వరసభాగారంబునకు వచ్చి కంసనరక
మురభోజపాంచాలకురుజరాసంధులు మొద లైనధూర్తుల మోవలేను
రక్షింపుఁ డనుచు నాక్రందింప సంక్రందనాదిదిక్పాలకు లబ్ధిశాయి
కడ కేగి యేతత్ప్రకారంబు విన్నవించిన నారమాభర్త చిత్తగించి

మానవులలోన నొకఁ డెవ్వఁ డైనఁ దాను, సతియు నాషాఢశుక్లపక్షంబునందు
ద్వాదశితిథిని వాసుదేవవ్రతంబు, సలుపు వానికి సుతుఁడనై సంభవించి.

57


క.

భూభారం బడఁచెద మీ, మీభువనంబులకు నిర్గమిఁపుఁడు పౌలో
మీభర్తృముఖ్యసురలా, రా భయములు మాని నిర్భరాహ్లాదమునన్.

58


క.

అని దేవుఁ డానతిచ్చిన, విని వచ్చితి నావ్రతంబు విశ్వంభర నిం
క నొకఁడు గావింపక ము, న్న నీవ కావింపు కలుగు నందనుఁడు నృపా.

59


క.

అని చెప్పి నారదుఁడు పో, యినపిమ్మటఁ దాను సతియు నీవ్రతము జగ
జ్జనసంస్తుత్యముగాఁ జే, సినపుణ్యఫలోదయమునఁ జేసి మునీంద్రా.

60


ఉ.

దానవవాహినీపతు లతర్కితభీతిఁ గలంగ నాకలో
కానకదుందుభిస్వనము లంబరవీథిఁ జెలంగ వేడ్కతో
నానకదుందుభిక్షితివరాగ్రణిపట్టపుదేవి దేవకీ
మానిని గాంచెఁ గృష్ణుని రమాకుచమండలసంచరిష్ణునిన్.

61


చ.

కెరలినతీవ్రహవ్యవహకీలపరంపరవేఁడి సోఁకి పా
దరసములాగునన్ నిజకథారచనల్ చెవిసోఁకి దర్పధూ
ర్ధరపురయామినీచరపురంధ్రులయీలువు లెత్తి పోవఁగాఁ
గరుణ సుసర్వసంఘములఁ గాచె ముకుందుఁడు బుద్ధదేవుఁ డై.

62


గీ.

అట్టిబుద్ధునకుఁ బ్రియంబుగా శ్రావణశుద్ధ, దశమినాఁడు సువ్రతుండు
విహితవిధులు పూర్వవిధమునఁ దీర్చి యే, కాదశీదినమునఁ గ్రమముతోడ.

63


వ.

స్నానాదికృత్యంబులు జరపి విలంబమాననానాసురభిసూనస్మారితనందనోద్యానం
బైన మంటపస్థానంబున రాత్రి గరుడధ్వజు నారాధించి బుద్ధాయ నమో యని
పాదఁబులు శ్రీధరాయ నమో యని కటీరంబును బద్మోద్భవాయ నమో యని జఠ
రంబును సంవత్సరాయ నమో యని యురంబును సుగ్రీవాయ నమో యని కంఠం
బును విశ్వబాహవే నమో యని భుజంబులు శంఖాయ నమో యని శంఖంబును
జక్రాయ నమో యని చక్రంబును బరమాత్మనే నమో యని శిరంబునుం బూజించి
తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరిస్థలంబునఁ దామ్ర
దారవవైణవంబులలోన దొరికినపీఠంబున వస్త్రయుగళచ్ఛన్నం బైనయథాశక్తి
చామీకరనిర్మితబుద్ధప్రతిమం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు
చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమాదానంబు గావించి తద
నంతరంబ సముద్రమేఖలాలేఖులకుం బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి

భృత్యులుం దాను భుజియించినఁ బుత్రపౌత్రాభివృద్ధి గలిగి సామ్రాజ్యసుఖంబు
లనుభవించి శరీరంబు వీడ్కొని పెద్దకాలంబు పరమపదంబున నుండు నిమ్మహా
వ్రతాచరణంబునకు ఫలంబు శుద్ధోదనుండు జనార్దను నందనుంగాఁ బడసె మఱియు
నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

64


క.

నృగుఁ డనుధాత్రీపతి, మృగయార్థము వాహినీసమేతుండై పో
యి గహనభాగంబునఁ జం, పె గవయశార్దూలసింహభేరుండములన్.

65


గీ.

ఇట్లు చంపి చంపి యేకాకియై శర, భంబువెంటఁ బఱచి పఱచి డస్సి
వారువంబు నొక్కవసుమతీరుహమునఁ, గట్టి నీడ నొరగి కన్ను మొగిచె.

66


క.

ఆవేళం బదునాలుగు, వేవురు గొలువంగ వేఁటవెంబడి నొకభి
ల్లావనిపతి వచ్చుచు ని, ద్రావివశత నున్ననృగునిఁ దప్పక చూచెన్.

67


ఉ.

చూచి కిరాతులార బలుసొమ్ములు తెమ్మలు గాఁగ నబ్బె నీ
రాచకుమారు దోఁచుఁడు తురంగమరత్నముఁ బట్టుఁ డన్న న
న్నీచమనస్కు లొక్కొనొకనిం గడవం బఱతెంచి హస్తముల్
చాఁచఁ గడంగుచో నృగురసారమణీశ్వరుమేనిలోపలన్.

68


చ.

ఒకధవళాంగి భామిని సముద్భవమై కరవాలచక్రకా
ర్ముకగదలన్ భుజావలయముల్ గదలన్ మదభిల్లసైన్యమున్
సకలము నేలఁ గూల్చె మణిసానుమహాగుహ వెళ్ళి సింహశా
బకము నఖాంకురాగ్రముల భద్రగజంబుల వ్రచ్చుకైవడిన్.

69


క.

ఈరీతి శబరవీరుల, బారిసమరి మగుడఁ గైటభధ్వంసకమా
యారాజీవాక్షి నిజశ, రీరములోఁ జొచ్చువేళ నృగభూపతియున్.

70


క.

మేలుకొని తత్తరుణి నా, భీలాహవరంగపతితభిల్లభటులఁ దా
నాలోకించి సవిస్మయుఁ, డై లేచి సమీపజవనహరి నెక్కి వడిన్.

71


సీ.

పోయి తపోవనంబున నున్నవామదేవునకుఁ జాగిలి మహామునివరేణ్య
విను కాననమునఁ జల్లనిచెట్టునీడ నిద్రించి మేల్కని విలోకించ నాశ
రీరంబు చొచ్చె నారీరత్న మొకతె నిషాదులఁ బెక్కండ్రఁ జంపి తచ్చ
కోరాక్షి యెవ్వతె కూలినభిల్లు లెవ్వరు చెప్పు నావుడు వామదేవుఁ
డనియెఁ దొలిమేన శూద్రుండవై జనించి, ద్విజులపంపునఁ గావించితివి నృపాల
చంద్ర శ్రావణశుక్లపక్షంబునందు, ద్వాదశీతిథి బుద్ధవ్రతంబు నీవు.

72


గీ.

కాన నీమేన నుత్తమక్షత్రసంభ, వంబు రాజ్యరమావైభవంబు నిచ్చి
నడపినదియు నిషాదుల నఱకినదియు, దృఢము తద్వాదశీపుణ్యతిథియ సుమ్ము.

73

క.

అని చెప్పిన సంతోషం, బున నాన్నగధరణిపాలపుంగవుఁ డరిగెన్
దనపురికి శిఖరమణికే, తునిరుద్ధాదిత్యరథచతుర్గోపురికిన్.

74


ఉ.

తొట్టినరోషవిస్ఫురణతో ధరణిం గలపక్కణస్థలుల్
బట్టబయిళ్ళుగా మెదడు వట్టినపాండుకపాలఖండముల్
గట్టినవెండినాళములకైవడి నంట ఖురాంచలంబుల
న్మట్టె నిషాదమస్తములు మారమణీరమణుండు కల్కియై.

75


గీ.

అట్టికల్కికిఁ బ్రియముగా నధికభక్తి, భాద్రపదమాసమున శుక్లపక్షదశమి
సముచితాచారములు పూర్వసరణిఁ దీర్చి, శిష్టవర్తనుం డేకాదశీదినమున.

76


వ.

స్నానాదికృత్యంబులు జరపి చతుర్ద్వారతోరణవిలోలబాలప్రవాళం బైనమంటప
గోళంబున రాత్రి పీతాంబరు నారాధించి కల్కినే నమో యని పాదంబులు హృషీ
కేశాయ నమో యని కటీరంబును మ్లేచ్ఛధ్వంసాయ నమో యని యూరుయు
గ్మంబును జగన్మూర్తయే నమో యని కంఠంబును ఖడ్గపాణయే నమో యని భుజంబు
లును విశ్వమూర్తయే నమో యని శిరంబునుం బూజించి తద్దేవతాగ్రభాగంబున సర
రత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరిస్థలంబునఁ దామ్రవైణవదారవంబులలోన
దొరకినపీఠంబుమీఁద వస్త్రయుగళచ్ఛన్నం బైనయథాశక్తి జాతరూపకల్పితకల్కి
ప్రతిమ ప్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు
సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమాదానంబు గావించి తదనంతరంబ మేదినీ
దివిజులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్యులుం దానును భుజి
యించిన నరాతుల గెల్చి రాజభోగంబు లనుభవించి దేహావసానంబున విష్ణులో
కంబున నుండు నిమ్మహావ్రతాచరణంబున కొక్కయితిహాసంబు చెప్పెద నాక
ర్ణింపుము.

77


చ.

ప్రవిమలతత్వవాదనధురంధర మున్ను విశాలమేదినీ
ధవుఁడు సమస్తరాజ్యము నితాంతబలోద్ధతులై సగోత్రు లా
హవమున గెల్చి పుచ్చుకొన నాకులత న్నిజరాజధాని కా
శి వెడలి గంధమాదనము చేరి తదగ్రసరస్తటంబునన్.

78


గీ.

భక్తవత్సలు హరిగూర్చి ముక్తికన్య, కాలలామంబుచన్నులకరణిఁ బరిఢ
వించుపరిపక్వఫలముల విఱ్ఱవీఁగు, బదరికారణ్యవాటిఁ దపంబు సలుప.

79


క.

నరనారాయణు లనియెడు, పరమమునులు వచ్చి ధరణిపాలకులాగ్రే
సర వరము వేఁడు మన నా, నరనాథుఁడు వారిఁ జూచి నవ్వుమొగముతోన్.

80

క.

నాదుమనోరథ మాల, క్ష్మీదయితునిచేతఁ గాని మిముబోఁటులచేఁ
గాదు చనుఁడు దూడలతర, మా దంటులు గొఱక ననిన మౌనివతంసుల్.

81


చ.

అకటకటా నృపాల పరిహాసము చేయుట భావ్యమే గణిం
పక మధుకైటభాంతకునిపంపున నీహృదయంబులోనికో
రిక సమకూర్తు మన్న విని శ్రీరమణీపతికిం బ్రియంబుగా
సకలమఖక్రియల్ సలుప సంపద యీవలయుం బ్రసన్నతన్.

82


క.

అనవుడు విశాలనృపుఁ జూ, చి నరుం డి ట్లనియెఁ దపము చేయున్ భువనా
వనకరుఁ డీనారాయణుఁ, డనిశము ననుఁ గూడి బదరికారణ్యమునన్.

83


సీ.

సర్వజ్ఞకాములు ఝష మైనయీతనిఁ గులవృద్ధికాములు కూర్మ మైన
యీతనిఁ గిటి యైనయీతిని ముక్తికాములు పాపహరణకాములు నృసింహుఁ
డైనయీతనిఁ బొట్టి యైనయితనిఁ బరిజ్ఞానకాములు రాముఁ డైనయీత
ని ధనకాములు దాశరథి యైనయీతనిఁ బ్రబలారిజయకాములు బలకృష్ణు
లైనయితనిఁ దనయకాము లఖిల జగద, పూర్వసౌందర్యకాములు బుద్దుఁ డైన
యితని మాయాసుతుం డైనయితని నాధి, పత్యకాములు గొలుతురు పార్థివేంద్ర.

84


గీ.

కానఁ గల్కివ్రతము సల్పు నా నృపాల, కాన్వయోత్తంసుఁడు విశాలుఁ డట్లు చేసి
లీల రాజ్యంబు వడ సెఁ దాలిచె విశాల, నామము బదరికాటవి నాఁటనుండి.

85


ఉ.

అంబుధిగాడ్పు నాభికుహరాగ్రముతమ్మిఁ గదల్పఁగా శరీ
రంబున నంతటం గలయ రాలినపుప్పొడి కప్పుకొన్నపీ
తాంబరమో యనన్ సముచితార్కరుచిం గనుపట్టఁ బవ్వడిం
చెం బరమప్రమోదమున శ్రీరమణీపతి పద్మనాభుఁడై.

86


గీ.

ఆసరోరుహనాభప్రియంబు గాఁగ, నాశ్వయుజశుద్ధదశమి నత్యంతభక్తి
సముచితాచారములు పూర్వసరణిఁ దీర్చి, శిష్టవర్తనుఁ డేకాదశీదినమున.

87


వ.

స్నానాదికృత్యంబులు జరపి దివ్యవిమానసమానప్రకాశం బైనమంటపావకాశం
బున రాత్రి విష్ణుదేవుఁ బూజించి పద్మనాభాయ నమో యని పాదంబులు పద్మ
యోనయే నమో యని కటీరంబును సర్వదేవాయ నమో యని యుదరంబును బుష్క
రాక్షాయ నమో యని యురంబును నవ్యయాయ నమో యని భుజంబులును శం
ఖాయ నమో యని శంఖంబును జక్రాయ నమో యని చక్రంబును ప్రభావాయ
నమో యని శిరంబునుం బూజించి తద్దేవతాగ్రభాగంబున మీనవ్రతంబునకుం

బోలెఁ గలశంబులు నిలిపి మధ్యమకలశంబుమీఁద సహిరణ్యగర్భనాభిబిసరుహం
బైన యథాశక్తి జాంబూనదనిర్మితపద్మనాభప్రతిమం బ్రతిష్ఠించి షోడశోపచారం
బులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయంబునఁ గలశప్రతిమాదా
నంబులు గావించి తదనంతరంబున నిలానిలింపులకుఁ బాయసాహారంబు సదక్షిణం
బుగా నొసంగి భృత్యవర్గసహితుండై భుజియించినఁ గోరినకోర్కులు సిద్ధించు
నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము కృత
యుగంబునఁ దొమ్మిదివర్షంబులలో నొక్కవర్షంబునకుఁ దనపేర భద్రాశ్వవర్ష
నామధేయంబు గల్పించినభద్రాశ్వుండు భద్రాసనంబున భద్రగజగామినీకర
చమరవాలవాతూలకించిచ్చంచలచికురాంచలుఁడై మండలేశ్వరులు గొలువఁ గొలు
వున్నసమయంబున.

88


సీ.

సరిగా జగత్ప్రపంచముతోడ నొకవంకఁ దూనిక వచ్చినదొడ్డకపిలె
ప్రేమ రెట్టింప లోపాముద్రమోముదామరతావి గ్రోలుచుఁ దిరుగుతేఁటి
వానకాలంబుచే వండుపట్టినజలం బెల్లఁ దేర్పఁగఁ జాలుచిల్లగింజ
పరిపూర్ణకుంభగర్భం బనుశుక్తిలో మొనపినకట్టాణిముత్తియంబు
సింధురామాశుగము రోదసీకటాహ, కుహరపాటనపటుకూటకోటికోటి
వింధ్యనగబలిదైత్యత్రివిక్రమాంఘ్రి, ఋషికులాగ్రేసరుఁ డగస్త్యుఁ డేగుదెంచి.

89


శా.

ఆభాస్వత్కులమౌళిమండనముచే నర్ఘ్యాదిపూజల్ దయా
ర్ద్రీభావంబున నంది వైరిజలదశ్రేణీమహామాతరి
శ్వా భద్రాశ్వ పథశ్రమాపనయనేచ్ఛ న్నీనివాసాంతర
క్ష్మాభాగంబున నేడునాళ్ళు నిలువంగాఁ గోరి యేతెంచితిన్.

90


గీ.

అని తదీయానుమతి నుండి మునివరుండు, సవతు లేనూఱుగురుపరిచారికలవి
ధంబున భజింపఁగా నున్నధరణివిభుని, యింతిఁ గాంతిమతీదేవి నెదుటఁ గాంచి.

91


క.

ఒకదినమునఁ జేసినపూ, జకు మెచ్చి యితనికి నిట్టిసామ్రాజ్యము కొం
చక యిచ్చినహరి నెఱుఁగమి, నకటకటా మోసపోయె నఖిలజగంబుల్.

92


మ.

అరరే శౌరి బళీ ధ్రువుం డహహ భద్రాశ్వుండు వహ్వా తలో
దరి ప్రహ్లాదుఁడు మేలు బాపు మహిభర్తల్ విప్రు లౌరా వణి
గ్వరు లాహా కసుగాపు సాధు మదవద్వాతాపిదైతేయసం
హరణప్రౌఢిఁ బ్రసిద్ధుఁ డైనముని మఝ్ఝా యంచు నుద్బాహుఁడై.

93

క.

ఆనందబాష్పములు గనుఁ, గోనల దిగజాఱ నూలుకొనుపులకలతో
మేను గనుపట్ట హాసం, బాననమున మొనపఁ బాత్ర లాడుచు నున్నన్.

94


క.

ఆకలకలంబు విని ధా, త్రీకాంతుఁడు వచ్చి తాను దేవియు వినతుం
డై కుంభజ యీహర్షం, బేకారణమున జనించె నెఱిఁగింపు దయన్.

95


క.

అనవుడు భద్రాశ్వునిఁ బే, ర్కొని భూవర నీవు నీ పురోహితులు వధూ
జనములు నకటకటా నా, మనము దెలియ లేక మూఢమతు లైతిరిగా.

96


సీ.

నావుడు దండప్రణామంబు చేసి భద్రాశ్వుఁ డగస్త్యమహామునీంద్ర
దేవరపలుకులు దెలియ మాకు వశంబె కృపతోడ నానతి యి మ్మటన్న
నరనాథ పూర్వజనమున నీదేవి యీభామ వైనిశనామపట్టణమున
హరిదత్తుఁ డనుపేరఁ బరఁగుకోమటియింటివరవుడు శూద్రాన్వవాయమున జ
నించి దానికి విటుఁడవై నీవు నట్టి, సంజ్ఞ నావైశ్యునకుఁ బరిచర్య చేసి
తిరుగుదువు సెట్టియు మురారిచరణకమల, యుగళనిశ్చలభక్తిసంయుతుఁడు గాన.

97


వ.

ఆశ్వయుజశుద్ధద్వాదశీదివసంబునఁ బద్మనాభవ్రతంబు సలుపుచు విష్ణుదేవాలయం
బునకుం జని మహోత్సవంబు గావించి దాసీదాసు లైనమిమ్మిద్దఱ దీపమాలికలకుం
గావలి పెట్టి మరలి యింటికిం బోవుటయు దీపమాలిక లతిప్రయత్నమునఁ గాచిన
పుణ్యంబునఁ బ్రియవ్రతవసుంధరాధిపతికిం బుట్టి పట్టాభిషిక్తుండ వైతివి నాఁడు
నీకుం బ్రేయసి యైనదాసియు నిక్కాంతిమతియై జనించె భద్రాశ్వనరేశ్వర పర
కీయదీపజ్వాలనఫలంబున నిట్టి సామ్రాజ్యంబు సిద్ధించె నిజద్రవ్యంబు వెచ్చపఱచి
లక్ష్మీపతికి దీపంబులు సమర్పించినవారిభాగ్యంబు చెప్ప నెట్టివారికిని వశంబు
గాదు గావున శ్రీహరిం బ్రశంసించితి బాల్యంబున నందనవనంబునం దపంబు చేసి
వాసుదేవప్రసాదంబున నసాధారణపదంబు వడసెం గావున ధ్రువు నుపశ్లోకించితి
రాక్షసవంశంబున సంభవించి యొండెఱుంగక పుండరీకాక్షుం గొలిచి నిలిచెం
గావునఁ బ్రహ్లాదు వర్ణించితి భర్తకుఁ దాత్పర్యంబునం బరిచర్య నడపి తత్పరో
క్షంబునఁ గౌస్తుభవక్షు నారాధించి మోక్షంబు గనుం గావున వనిత వినుతించితి
నిన్ను సంస్తుతించుతెఱంగు మున్న చెప్పితి వెన్నుండు ప్రసన్నుండుగా జన్మం
బులు నివర్తింప సామర్థ్యంబు గలదు గావున రాజుల విప్రుల వైశ్యులం గొనియాడితి
బ్రాహణశుశ్రూషలు మొదల వదలక వారిముదల నారాయణభక్తియుక్తుం డైన
మాత్రంబున ముక్తివరారోహ వరియించుఁ గావున శూద్రుం బొగడితి మధుమథన
చరణకమలమధుకరాయమానమానసుండనై మెలంగుదు గావున నన్ను బహూక
రించుకొంటి నని వెండియు.

98

గీ.

కృతయుగంబున నొకయేటఁ ద్రేత నాఱు, నెలల ద్వాపరమున నెలఁ గలుగు పుణ్య
ఫలము గలివేళ శ్రీవిష్ణుభక్తు లైన, విమలమతులకు దివసమాత్రమునఁ గలుగు.

99


క.

ఈవిధము నిశ్చయించియు, శ్రీవిష్ణుపదాబ్జభక్తి చేకొనమికి నే
భావంబులోన రోసి క, దా విశ్వము మోస పోయె నంటి నృపాలా.

100


క.

అని చెప్పిన భద్రాశ్వుఁడు, వినిపింపుము సులభ మైనవిష్ణువ్రత మ
న్న నగస్త్యమునీంద్రుఁడు మ, న్నన నానతి యిచ్చెఁ బద్మనాభవ్రతమున్.

101


సీ.

సత్యతపోమునీశ్వర యివ్విధంబునఁ దాఁ బద్మనాభవ్రతంబు చెప్పి
జననాథుఁ జూచి పుష్కరతీర్థమున వసించినకుమారస్వామిఁ గని భజించి
క్రమ్మఱ వత్తు నీకడకు నంచు నగస్త్యఋషికులోత్తంసుఁ డదృశ్యుఁ డైన
భార్యాయుతంబుగా భద్రాశ్వమేదినీపతియు నీపద్మనాభవ్రతంబు
చేసి విష్ణునికరుణావిశేషమున న, నేకసత్పుత్రపౌత్రాభివృద్ధి గాంచి
మఱియు గర్వాంధపరిపంథిమథనపటుభు, జాగ్రపీఠిక భరియించె నబ్ధికాంచి.

102


శా.

అంతం గార్తికశుక్లపక్షమున వింధ్యారాతి యేతెంచె భూ
కాంతుండు మునిసార్వభౌమునకు నర్ఘ్యం బిచ్చి మాణిక్యసౌ
ధాంతస్థాపితభద్రపీఠమున నధ్యాసీనుఁ గావించి శు
ద్ధాంతస్త్రీసహితంబు సవినయుండై మంజువాగ్వైఖరిన్.

103


గీ.

ఆశ్వయుజమాసమున భవదాజ్ఞ నేను, భక్తిఁ జేసితిఁ బద్మనాభవ్రతంబు
తాపసోత్తమ యిఁక నే వ్రతంబు కార్తి, కమునఁ జేయుదు ననవుడుఁ గలశభవుఁడు.

104


శా.

క్ష్మానాధా నయనీకృతేందురవితేజఃపుంజ మంతర్ముఖం
బై నైజోదరగుప్తలోకములు సాంద్రాలోకముల్ చేయ ల
క్ష్మీనారీహృదయేశ్వరుండు శయనించెన్ యోగనిద్రానుసం
ధానానందమునన్ మహాంబునిధిలో నారాయణాకారతన్.

105


గీ.

అట్టినారాయణునకుఁ బ్రియంబు గాఁగఁ, గార్తికంబున శుక్లపక్షమున దశమి
నాఁడు పూర్వప్రకారంబున నరుఁడు సము, చితవిధులు దీర్చి యేకాదశీదినమున.

106


వ.

స్నానాదికృత్యంబులు జరపి సౌభాగ్యలక్ష్మీకర్ణకుండలం బైనమంటపమండలంబున
శౌరి నారాధించి సహస్రశిరసే నమో యని శిరంబును బురుషాయ నమో యని భుజం
బులును విశ్వరూపిణే నమో యని కంఠంబును జ్ఞానాస్త్రాయ నమో యని శంఖ
చక్రంబులను శ్రీవత్సాయ నమో యని యురంబును జగత్ప్రసిష్ణవే నమో యని
యురంబును దివ్యమూర్తయే నమో యని కటీరంబును సహస్రపాదాయ నమో

యని పాదంబులును విలోమప్రకారంబునఁ బాదాదిగా ననులోమప్రకారంబున
నేతన్నామధేయంబులఁ బూజించి నారాయణాయ నమో యని సర్వాంగంబు
లఁ బుష్పాంజలి సమర్పించి తద్దేవతాగ్రభాగంబున మీనవ్రతంబువలెం గలశంబులు
నిలిపి మధ్యమకలశంబుమీఁద యోగనిద్రాముద్రితలోచనం బైన యథాశక్తి కనక
నిర్మితనారాయణప్రతిమం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు
చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబునం గలశప్రతిమాదానంబులు గావించి
ధరణిబృందారకులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్యులుం
దాను భుజించిన నభీష్టఫలంబులు సిద్ధించు నిమ్మహావ్రతపుణ్యంబునఁ గృతార్థత్వం
బునం బొందినవారి వినుము.

107


గీ.

కనియె భరతు శకుంతల గనియెఁ గార్త, వీర్యు హైహయనామపృథ్వీధవుండు
కనియె మాంధాత యువనాశ్వజనవిభుండు, మఱియు రాజులు భాగ్యసంపన్ను లైరి.

108


సీ.

శరధినిమగ్నయై ధరణి గావించి వారిజనాభుచే నుద్ధరింపఁబడిన
కతన నీపండ్రెండువ్రతములు గూడంగ ధరణీవ్రతం బనఁ బరఁగె నీవ్ర
తములకుఁ గనకప్రతిమల దానము చేయ మత్స్యకూర్మాదినామముల మాస
నామంబులు వచించి నానాశ్రుతిపఠనపారంగతుం డైన బ్రాహ్మణునకు
నెంత విత్తంబు దా నిచ్చె నంతియఫల, మర్థవేదికి నిచ్చిన నందు రెట్టి
ఫలము పరతత్త్వ మెఱిఁగినపాంచరాత్ర, కునకు నర్పించిన సహస్రగుణఫలంబు.

109


సీ.

ఆకారసంపద గైకొని కనుపట్టుమోక్షలక్ష్మీకాంతమురువు గురువు
జ్ఞానవాసన వెదచల్లునిర్మలతపఃప్రమదవనీవాటిపరువు గురువు
క్రోధాదిసకలదుర్గుణములఁ బెడఁబాపుపరమశాంతిరసంబుకరువు గురువు
కరము విచిత్రంబుగా శాశ్వతైశ్వర్యగరిమంబు లేతెంచుతెరువు గురువు
దురితమృగశాబకములవాగురువు గురువు, నీపదాంబుజయుగళనిర్నిద్రభక్తి
నతిపరాయణశిష్యకామితఫలప్ర, దానమున మించునవకల్పతరువు గురువు.

110


వ.

కావున నవిద్యోవా సువిద్యోవా గురు రేవ జనార్ధన యనువాక్యంబు గలుగుటం
జేసి గురువులగుణదోషంబు లెంచినఁ బాతకంబు ప్రాపించు సంసారసాగరో
త్తారకుం డైనగురువుం బూజింపక పరిహరించి యితరులఁ జేపట్టుట పేరోడ విడిచి
వదరు వట్టుట యిట్లగుట యెఱింగి మొదల గురువుల సంభావించి తదనుమతం
బునఁ జేసిన దానాదికృత్యఁబులు సఫలంబు లగు నిమ్మహావ్రతంబు వినినఁ జదివిన
నిహపరసౌఖ్యంబులు గలుగు నని దూర్వాసుండు సత్యతపునకుం జెప్పె నని వరా
హదేవుండు చెప్పిన వసుమతి తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

111

ఉ.

ఆఢ్యనిజాభిధాన వివిధాజివినోద్యసుహృద్యశఃపయో
లేఢ్యసిలేలిహాన సరళీకృతసజ్జనచిత్తభాషణా
ప్రౌఢ్యవధాన దిక్తటకరంభితసంతతదానచాతురీ
రూఢ్యసమాన యౌవతగురుస్తనమర్దనహస్తపల్లవా.

112


క.

సుశ్లోక సకలసుకవీం, ద్రశ్లాఘ్య ప్రతాపగుణధురాదోరాలా
నాళ్లధబద్ధజయేభమ, దశ్లక్ష్ణస్థాసకీకృతకురంగమదా.

113


మాలిని.

బహులబలరజోజంబాలితాకాశగంగా
విహృతిసమయమజ్జద్వృత్త్రభిద్దంతిధావ
ళ్యహరణకరణార్థాత్యంతసంరోధశంకా
వహసహజమహోనిర్వాహకీర్తిప్రవాహా.

114

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ దష్టమాశ్వాసము.