వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/పంచమాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

పంచమాశ్వాసము

క.

శ్రీక్షోణిభారతీహరి, ణాక్షీసదృశానురంజనానుభవకళా
దక్షిణనాయక కీర్తి, ప్రక్షాళితవిశ్వ యీశ్వరప్రభునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు ధాత్రి కిట్లనియె నట్లు మేల్కాంచి దుర్జయ
నృపాలుండు కాలోచితకృత్యంబులు దీర్చి సమంచితవైష్ణవరత్నంబుసమీపం
బున సుధాధామమండలంబుదండ భార్గవుండునుం బోలె నున్న గౌరముఖమహా
మునిం గని నమస్కరించి నిలిచినసమయంబున.

2


మ.

మెలఁతల్ భూషణపేటికల్ పరిజనుల్ మేడల్ తురంగేభశా
లలు వప్రంబులు మందిరోపవనముల్ కాసారముల్ కేళిశ
య్యలు పీఠంబులు పాత్రముల్ మొదలుగా నారత్నగర్భంబులో
పల డిందెన్ సకలప్రపంచము పరబ్రహ్మంబునందుం బలెన్.

3


క.

ఆకుహనాతంత్రము ధాత్రీకాంతుఁడు విస్మయము మదిం బొడమఁగ నా
లోకించి మౌని వనుప న, నీకిని గొలువంగఁ జని మణిగ్రహణేచ్ఛన్.

4


గీ.

ఆశ్రమబహిఃప్రదేశంబునందు నిలిచి, బ్రాహ్మణధనంబు గొనుట ధర్మంబు గాదు
మనుజపతులకుఁ దగియెడిమానికంబు, గాన విడుచుట నీతిమార్గంబు గాదు.

5


మ.

అని చింతించి విరోచనాహ్వయు నమాత్యగ్రామణిం జూచి ప
ల్కె నపూర్వం బగురత్న మేపగిదిఁ గల్గెన్ మౌనికిన్ సర్వకా
లనిరాహారత నుండువారలకు నేలా దండుతాణెంబు సే
యునరస్వామికిఁ గాక తద్గ్రహణకృత్యోపాయముల్ సెప్పుమా.

6


గీ.

అనవుడు నతండు కటకట మనుజభర్త, బ్రాహ్మణద్రవ్య మపహరింపంగఁ జూడఁ
దగవు గాదని చెప్పఁ జిత్తంబు నొచ్చు, ననువుగా విన్నవించెద నని తలంచి.

7


సీ.

అదరి కావించెద మన్న నిల్వదు మాయ పెనుమాయ నిన్న గల్పించెఁ గాన
పెనఁగి చేసెద మన్న భేదంబు గొల్పదు పరులబుద్దులకు లోఁబడదు గాన
కనలి చూచెద మన్నఁ గాఁగాదు దండంబు ధరణీసురాన్వయోత్తముఁడు గాన
తవిలి యిచ్చెద మన్న దానంబు నిష్ఫలం బామానికం బమూల్యంబు గాన

నాత్మ నూహింపఁగా నుపాయములలోన, నెప్పటికి సామ ముచితంబు నృపవరేణ్య
మౌనిచిత్తంబు రంజిల్ల మంచిమాట, లాడి మణిఁ దెత్తు ననుఁ బంప నవధరింపు.

8


క.

అని తదనుశాసనంబునఁ జని మునిఁ గని మ్రొక్కి మంత్రి సవినయముగ ని
ట్లనియె నొకపదార్థము వేఁడ నృపాలుఁడు నన్ను మీకడకుఁ బుత్తెంచెన్.

9


గీ.

ఋషికులైకవతంస నిస్పృహుఁడ వైన, ని న్విచారించుకొని మేదినీజనావ
నానుభావధురంధరుం డైనదుర్జ, యుని విచారించి దయతోడ నొసఁగవలయు.

10


క.

అనవుడు మునినాయకుఁ డి, ట్లనియె నృపతి నిన్నుఁ బంపునఁట వినుము విరో
చన పరులకు నది యీవ, చ్చిన నిచ్చెద దాఁచ నేల చెప్పు మటన్నన్.

11


వ.

వశీకృతనయకళాపాండిత్యుం డైనదుర్జయనృపామాత్యుండు హస్తంబులు మొగిచి
మహాత్మా నిన్న మృగయాపరిభ్రమంబున నలసి వచ్చిననన్ను నేకాక్షోహిణిబలంబు
నిలిపి యేపదార్థంబును సంపాదింపరాని యిట్టినట్టడవిలోనం జిట్టమిడిచినమాత్రం
బున విచిత్రంబుగా నానావిధపదార్థంబు లేరత్నంబువలన సంపాదించి రాజోప
చారంబుల నతిథిసత్కారంబు సలిపితిరి తద్దివ్యరత్నంబు కృపసేయవలయు నని
మారాజు దేవరకు విన్నవింపు మని నన్నుం బుత్తెంచె నన్న సన్నంపునవ్వు నివ్వ
టిల్ల గౌరముఖుండు విరోచనుఁ గనుంగొని చతుర్ముఖునిముఖంబున జన్మించిరి
గావున బ్రాహ్మణులకు వేఁడుటయు భుజంబులం బుట్టిరి గావున రాజులకు నిచ్చు
టయు ధర్మంబు మది నిది విచారింపక బ్రాహ్మణుల రాజులు వేఁడుట విపరీతంబు
యథార్థంబు చెప్పెద నదియునుం గాక వైషవం బైనరత్నంబు మాకు వెచ్చపెట్ట
శక్యంబు గాదు నీదు వాక్యంబులు విన రాదు కాదు కూడ దని వాదునకుం జొరక
వచ్చి తడవాయె విచ్చేయు మని సోల్లుంఠంబు లాడిన.

12


గీ.

మంత్రి యిట్లను మీకు నేమములు హోమ, ములు జపంబులుఁ దపములుఁ బొనుఁగుపడక,
నడచు నెవ్వానివలన నన్నరవరుండు, వేఁడ మణి యీక కడపుట వెఱ్ఱితనము.

13


క.

అనవుడు రోషారుణలో, చనుఁడై గౌరముఖమౌనిసత్తముఁడు విరో
చనుఁ జూచి బొమలు నటియిం, ప నిజక్షమ చెదర నదరిపడి యిట్లనియెన్.

14


ఉ.

దుష్టచరిత్రు లైననృపతుల్ ధర యేలుటకంటెఁ గల్గు నే
కష్టము శిష్టలోకము సుఖస్థితి నుండదు గాన నిట్టిష
ష్టాష్టక మెట్టు పుట్టె నకటా వికటాలపితంబు లేటికిన్
భ్రష్ట పొకాలి పొ మ్మనుచుఁ బల్కిన నుల్కినమానసంబునన్.

15


గీ.

మరలి యేతెంచి మంత్రి దా మంచిమాట, లాడినవిధంబు మునికులాధ్యక్షుఁ డాగ్ర
హించి పల్కినచందంబు నేర్పడంగ, విశ్వభూతలభర్తకు విన్నవించి.

16

క.

ఆచిన్తామణి ముని తన, పీఁచ మడఁచుదాఁక నింకఁ బెనులోభముతో
దాఁచుకొనుఁ గాక నాచే, నీచే నిఁక మోసపోవునే నరపాలా.

17


చ.

అనవుడు రోషరూక్షనయనాంతములన్ వెడగెంపు దోఁప నా
ననకమలంబునం బ్రహాసనస్వనముల్ నిగుడంగ దుర్జయా
వనితల నాయకుండు మదవైరివనీదవనీలు నీలునిం
గని మునిచేతిమానికము గైకొని రమ్మని పంపెఁ బంపినన్.

18


శా.

ఆనీలుండు వరూధినీపరివృతుండై పోయి తేజోనిధిన్
మౌనిం గానికి నైనఁ గైకొనక భీమభ్రూకుటీనాట్యరే
ఖానైపుణ్యము ఫాలభూమి మెఱయంగా యజ్ఞశాలాన్తర
స్థానస్థాపితరత్నరాజము హరించం దేరు డిగ్గె న్వడిన్.

19


వ.

ఇవ్విధంబున రథావతరణంబు చేసి డాసినసమయంబున రత్నంబువలన నిర్యత్నం
బున సపత్నభయంకరంబులై ఘనఘనాఘనశంకాఢ్యంకరణఘీంకరణంబులం గల
సాధోరణంబు లైనవారణంబులతోడ సాదికోలాహలవిశేషితహేషితంబులం గల
రౌద్రసముద్రతరంగంబు లైనతురంగంబులతోడ దశదిశాసంధివిఘటనప్రదితరట
నంబులం గలసవిధకృతరథికమనోరథంబు లైనరథంబులతోడ దుర్వారగర్వప్రబో
ధనసాధనంబులం గలసముద్భటార్భటులైన వీరభటులతోడ జలధరాధ్వరధ్వజ
పటంబులు నటింపఁ జామీకరదండచామరంబులు దూల విచిత్రాతపత్రంబులు
మెఱయ జైత్రవాదిత్రంబులు మొరయ సుప్రభసురశ్మిశుభశుభదర్శనసుకాంతి
సుందరసుద్యున్నుసుశీలసుందసుముఖసుకాంతసోమసుమనశ్శంభుదీప్తతేజోనామధే
యులు పదేవురుదొడలు వెడలి కడలి వెల్లివిరిసినతెఱంగునఁ జతురంగబలంబులు
నడవ సంవర్తసమయసమవర్తులచొప్పున నిప్పులు గ్రక్కుదృక్కోణంబుల దుర్జయ
నృపాలుపడవాలు నీలుం గనుంగొనుచు వానిసేనలమీఁదం గవిసిరి తదవసరంబున.

20


క.

అలిగి హరులు హరులు గజం, బులు గజములు రథములు రథములు భటులు భటుల్
బలువిడిఁ దాఁకిన సైన్యం, బుల రెంట వ్వెడలె నాఱుపులు పెడబొబ్బల్.

21


క.

విపులాసంభూతపరా, గపరంపర లెగసి సైనికక్షతజముచే
నసహృతము లయ్యె బాలా, తపములచే నడఁగునంధతమసము వోలెన్.

22


సీ.

కుప్పలుగా నేనుఁగులు మ్రగ్గె దంతశుండాదండకుంభకర్ణములు దునిసి
వాములుగా వారువంబులు వ్రాలెఁ గంధరవాలమధ్యపాదములు ద్రెవ్వి
ప్రోవులుగా రథంబులు ద్రెళ్ళె రథికసారథిపతాకాకూబరములు నలిగి
గుట్టలుగా బంట్లు గూలిరి బాహుమస్తకపార్శ్వభాగవక్షములు మురిసి

యిట్లు దనసర్వసైన్యంబు ఋషిమణిప్ర, భూతచతురంగబలముచేఁ బొలిసిపోవ
మింట నమరులు గొనియాడ నొంటిఁ జిక్కి, నీలుఁడు పరాక్రమక్రీడ నెఱపిపడిన.

23


మ.

నరనాథాగ్రణి సిళ్ళు చూపినమహానాగంబునుం బోలె రో
షరసావేశమునన్ మణిప్రభవరాట్సైన్యంబుపై నెత్తి పో
యి రణక్రీడలు సల్పుచున్ మెఱయుటన్ హేతిప్రహేతిక్షపా
చరవీరుల్ విని పంపి రాత్మబలముతో జామాతకుం దోడుగన్.

24


వ.

ఇవ్విధంబునఁ బంపువడి వడి గలవారువంబులం బూన్చినకాంచనస్యందనంబు
లెక్కి లెక్కింప నొక్కొక్కనివెంట నొక్కొక్కయక్షోహిణిరక్కసులఁ గలిగి
సంఘనవిఘనప్రఘనవిద్యుత్ప్రభాశనిప్రభవిప్రజిత్తిప్రవీరప్రతర్థనాగ్నిదంష్ట్రవాయు
శత్రుభయంకరోన్మత్తాక్షభీమకర్ణసుఘోషాగ్నితేజు లనుపదేవురు హుటాహుటిం
జనుదెంచి భండనంబునఁ బ్రచండపరాక్రమక్రీడ వాలుదుర్జయనృపాలుం గని
మ్రొక్కి దేవా నీవాహవంబునకు వచ్చుట విని మీమామ లైన హేతిప్రహేతులు
పుత్తెంచినం బనివింటిమి మమ్ముం జూడు మని సంరంభంబున రత్నసంభవులమీఁదం
గవిసి పవిశితంబు లైనశిలీముఖంబుల నేసియు మండలాగ్రంబుల వ్రేసియు భిండి
వాలంబుల నొంచియు శూలంబులఁ జించియు సురియలం బొడిచియు ముసలంబుల
నడిచియు భుజావష్టంభంబున విజృంభించిన మరలుమాతంగంబులును దెరలుతురం
గంబులును సురుగురథంబులును దిరుగుపదాతులునై తమసైన్యంబు దైన్యంబు
వహించినం జూచి కించిదరుణలోచనాంచలంబులతోడ నారత్నసంజాతులు
దైతేయనాయకుల మార్కొని సుప్రభుం డైదుశిలీముఖంబుల సంఘనుని సురశ్మి
నాలుగువాలముల విఘనుని శుభుండు రెండుకాండంబులం బ్రఘనుని శుభదర్శ
నుండు పండ్రెండుమార్గణంబుల విద్యుత్ప్రభుని సుకాంతి మూఁడుతూపుల నశని
ప్రభుని సుందరుండు తొమ్మిదిసాయకంబుల విప్రజిత్తిని సుద్యుమ్నుండు పదికంక
పత్రంబులఁ బ్రవీరుని సుశీలుం డాఱుశరంబులఁ బ్రతర్ధనుని సుందుండు పందొమ్మిది
ప్రదరంబుల నగ్నిదంష్ట్రుని సుముఖుండు ముప్పదికోలల వాయుశత్రుని సుకాంతుం
డు పదియాఱుములుకుల భయంకరుని సోముం డొక్కభల్లంబున నున్మత్తాక్షుని
సుమనుం డిరువదియేనాశుగంబుల భీమకరుని శంభుండు పదునాలుగంబకంబుల
సుఘోషుని దీప్తతేజుండు పదునెనిమిదిబాణంబుల నగ్నితేజునిం బిలుకుమార్చి
పేర్చి దిక్కులు వగుల నార్చిన.


లయగ్రాహి.

నిర్జరవరప్రముఖదుర్జయుఁ డనంబరఁగుదుర్జయుఁడు తన్మణిజనుర్జనధనుర్జ్యా
వర్జితనిశాతశరనిర్జితనిశాటులఁ గృపార్జవమునం గనుచుఁ దర్జనలు బాహా

ఖర్జువులు సంగరరమార్జనసముద్యమనధూర్జవములన్ మెఱయ నిర్జడిమకీల
స్ఫూర్జితలలాటశిఖిభర్జితపురత్రితయధూర్జటి యనం గనలి గర్జిలుచు వీఁకన్.

26


సీ.

ముందట బలభేదిముఖ్యదిక్పతివిభాళా యని బహుకాహళములు మొరయ
గంధదంతావళగ్రైవేయఘంటాఘణాత్కారముల నజాండంబు లవియ
కంఖాణతురగరింఖాపుంఖితక్షమాధూళి నభ్రపథంబు దూటుకట్ట
పరభయంకరవీరభటభుజభ్రమితాయుధవ్రాతములు ధళధళ యనంగ
కఠినతరనేమిచక్రసంఘట్టనముల, నురగపరివృఢఫణపరంపరలు చదియఁ
గదియ నడిచి నిశాతాశుగములగములఁ, దెఱపిగని శత్రుసైన్యంబు నఱకువేళ.

27


క.

కనుపట్టె రాహువదనం, బునఁ జిక్కినసూర్యబింబమో యనఁగా న
ల్లనిగరి గలశితసాయక, మునఁ దగిలి విరోధికనకముకుటము మింటన్.

28


గీ.

మెడలు దునిమిన మీఁదికి వెడలురుధిర, ధారల మధాంధపరిపంథివీరభటక
బంధములు నిల్చెఁ చెక్కులు పగలుబిరుదు, బంట్లు పట్టించుకొనుదివ్వెపౌఁజు లనఁగ.

29


క.

కులిశహతిరుధిరజనిత, స్ఫులింగనివహంబుచందమున నెగసెఁ గృపా
ణలతాదళితాహితగజ, ములకుంభంబుల సరక్తముక్తాఫలముల్.

30


చ.

అరిమకుటీవిటంకముల నాయపదండపటుప్రహారచా
తురిఁ గురువిందరత్నములు దూలి ధరం బడు వీరపుంగవుల్
పొరిఁబొరి ప్రక్కలించుకొనిపోవ నభోమణిమండలఁబునం
దొరిఁగెడుదీప్తిఖండములతోఁ దులదూఁగుచు నన్నివంకలన్.

31


క.

అమరత్వమునకుఁ బోవుచుఁ, దమభవబంధంబు లూడఁదన్నుకొనుగతిన్
సమరోర్వి నిమిషమాత్రం, బు మదారాతులకబంధములు దన్నుకొనున్.

32


చ.

వరవరణాభిలాషమున వారిజపత్రవిలోచనల్ పురం
దరపురినుండి శీఘ్రగమనంబున రాఁ గుచఘర్మవారిచే
గరఁగినకుంకుమద్రవము గాఱెడుకైవడిఁ గాఱఁజొచ్చె నం
బరవలమానలూనరిపుమ సపరిస్రవదస్రబిందువుల్.

33


గీ.

కదనధాత్రీతలమున హుంకారగర్భ, మై పడినశత్రుమస్తకం బాడుతనక
ళేబరము చూచి మెచ్చి బళిబళీ యటంచుఁ, గొనియాడువిలసనం బభినయించె.

34


గీ.

గంధదంతావళము రేసి కఠినదంత, కాండమునఁ బొడ్చి యెత్తినఁ గానఁబడియె
సమదశాత్రవమణిమయస్యందనఁబు, కపటకిటికొమ్ముమొన రత్నగర్భవోలె.

35


గీ.

ఒక్కభటుఁ డొక్కవిద్వేషి నుఱికి పొడువఁ, బోటుగంట్లలో వెళ్ళి పొడుచువాని
పైఁ బడియె రక్తములు పోటు పడినవాని, క్రోధరసపూరములు ముంచుకొనియె ననఁగ.

36

క.

దురముం గనుఁగొనియెడుని, ర్జరవరులకు వేయుచామరంబులువలె నం
బరమున నాడె శిలీముఖ, పరిఖండితవిమతకేతుపటపల్లవముల్.

37


వ.

ఇత్తెఱంగున నప్రతిహతప్రతాపదీప్యమానుండై సుప్రతీకసూనుఁడు రణవిహరణంబు
సలుప నిలుపరానికోపంబునం జాపంబులు సాధించి వారించి పంచాననపరాక్ర
ములు సుప్రభప్రముఖు లైనమణిప్రభూతులు పదేవురు మహారథులు సారథుల
నెచ్చరించి మచ్చరించి వచ్చువియచ్చరారాతి మార్కొని పేర్కొనం గల
సుద్యుమ్నవిరోచనాదులఁ బెక్కండ్ర నుక్కడంచి బహువిధవ్యధాదాయకంబు
లైనసాయకంబుల ముంచిన నాగ్రహించి మహీవల్లభుండు తదీయవిగ్రహంబులు
భల్లంబులం జిల్లులువోవ నేసినం బుల్లసిల్లుసమయంబున సమిత్కుశార్థంబు చనిన
గౌరముఖుండు నిజాశ్రమంబులోనిమహాహవకోలాహలంబు నాలోకించి రభసం
బునం బఱతెంచి రణభైరవయోగదండంబులచాడ్పున మస్తిష్కపంకమధ్యంబున
నిలువంబడిన సచక్రదోర్దండంబుల దాశరథి శరధిం గట్టినకట్టవిధంబున రుధిరపూ.
రంబునం జాలుగా గిరికొనఁగూలినగంధగజకబంధంబుల వల్మీకరంధ్రంబుల వెడలు
భుజంగంబులభఁగి నిపతితాశ్వకుక్షిగోళంబులబహుక్షతంబుల వెడలుప్రేవుల
సకాననప్రదేశంబులఁ గలయ రాలినఫలంబులతోడ జంఝాపవనభగ్నాగ్రతాళ
ద్రుమకాండకాండంబులపగిది రథికసారథిచక్రరక్షకమస్తకంబులు చుట్టునుం బడి
యున్న సముత్తుంగశతాంగకూబరంబుల భూతంబులు మాంసఖండంబు లొండొరు
లకు వడ్డింప నాయితంబు చేసిన చట్టువంబులవడువునఁ దొడికినపిడి వదలక మొద
లికిం దెగినబాహుదండంబులం గనుపట్టుఖేటకంబుల వినోదంబునకు బేతాలబాలి
కలు ద్రిప్పుత్రిప్పటంపుబల్లలచందంబునఁ దల్లకెడవై రక్తాపగావర్తంబుల బిర
బిరం దిరుగువిచిత్రాతపత్రంబుల జయరమావివాహోచితరక్తాక్షపాత్రంబులకరణిం
గ్రాలుసామిఖండితసముక్తాఫలమదావళకుంభపాలికల నభస్థలంబునం బిశాచ
కిశోరంబులు విడిచిన గాలిపడగలకైవడి నాడాడ నాడునట్టల భీమాభిరామం బైన
సంగ్రామంబును రత్నసంభవదుస్సహపరాక్రమంబున విజృంభించుదుర్జయుం
గనుంగొని భయవిస్మయంబులు సందడింప మణినిమిత్తంబునఁ బ్రాదుర్భవించిన
యావిపద్దశ నివారించి రక్షింపు మని వనజాక్షుం దలంప నమ్మునిహర్యక్షునకుఁ
జక్షుఃప్రియకరంబై.

38


మ.

ఎదుటన్ సత్కృపతోడ దుర్జయధరాధీశానసేనావనం
బు దహింపం గలచక్రదావశిఖి నుద్బోధింప నేతెంచెఁ ద

ప్పదు నాఁగా వినతాతనూభవచలత్పక్షానిలంబుల్ సమ
స్తదిశాకోణము లాక్రమింపఁ గటిభాస్వత్పీతవాసంబుతోన్.

39


గీ.

ఇట్లు తోఁచి మురారాతి యేమిపనికి, నై తలంచితి వినిపింపు మనిన మౌని
దేవ కారుణ్యమున మముఁ గావు సబలు, దుర్జయనృపాలు దేవతాద్రోహిఁ దునిమి.

40


మహాస్రగ్ధర.

అనుచున్ సాష్టాంగముల్ సంయమి సలుప నుదగ్రాగ్రహవ్యగ్రతన్ వై
చినచక్రం బావిరోధిక్షితిపతి నడఁగించెం బలంబు దహించె
మొనలన్ వేయింటి చుక్కల్ మురిసి ధరణిపై మ్రుగ్గుచందంబుగాఁ గాం
చనగర్భాండప్రపూర్ణజ్వలదనలశిఖాసంఘజంఘాలికంబై.

41


సీ.

అంతటఁ జక్రంబు శాంతమై నిజభుజాగ్రమునఁ జేరిన శౌరి గౌరముఖుని
తోడ ని ట్లనియె నిందు విరోధిసైన్యంబు నిమిషమాత్రంబున సమసెఁ గాన
నీమహారణ్యంబు నైమిషం బనఁబడు నిచ్చోట నే వసియింతు యజ్ఞ
పురుషుఁడనై రత్నమున జనించినయీపదేవురు తరువాతఁ గృతయుగమున
జలధివలయితవిశ్వవిశ్వంభరాత, లేంద్రులై పుట్టఁ గల రని యెఱుఁగఁ జెప్పి
చనియె శిష్యగణంబుఁ దానును దపస్వి, కులమణియు నుండె నాశ్రమస్థలమునందు.

42


క.

ధరణీ యీకరణి నిశా, చరహరచక్రమున సుతుఁడు సమసిన విని శో
కరసార్ణవమున మునుఁగుచు, నిరవద్యుఁడు సుప్రతీకనృపతి వికలుఁడై.

43


గీ.

ఎట్టకేలకు ధైర్యంబు హృదయమునకు, నూలుకొలుపుచు నారాయణుండు రాముఁ
డనఁగ నున్నాఁడు చిత్రకూటాద్రిమీఁద, రామసంజ్ఞను వినుతింతు నామహాత్ము.

44


వ.

అని కృతనిశ్చయుండై శ్రీరామ కారుణ్యరసాబ్ధిసోమ నిశాతశిలీముఖవిఖండితనిశాచ
రయూథ నరనాథ ప్రపన్నార్తిహరణప్రవీణ సురూపధురీణ విజయలక్ష్మీకళానిస్తంద్ర
పురాణకవీంద్ర దేవా నీవ సూక్ష్మాకారంబున సకలతేజంబులకు మహత్తరతేజంబులు
గావింతువు భూతత్త్వంబున నైదుగుణంబులు జలతత్త్వంబున నాలుగుగుణంబులు
రజస్తత్త్వంబున మూఁడుగుణంబులు వాయుతత్త్వంబున రెండుగుణంబులు నభ
స్తత్త్వంబున నొక్కగుణంబును నై నిలుతువు. దుఃఖజరాబడబాగ్నిభయంకరం
బును బహిరభ్యంత రేంద్రియగ్రాహదురవగాహంబును నైనసంసారసాగరంబున
మునుఁగుజంతుసంతానంబులు భవదీయనామంబులు దలంచినఁ దరితెఱంగున దరి
చేర్తువు సచరాచరప్రపంచంబు నీయంద రమించుటం జేసి రామాభిధానంబున
విహరింతువు లోకోపకారార్థంబు మీనకూర్మాద్యవతారంబులు వర్తింతువు సంవర్త
సమయంబున ధగద్ధగితహరిదంతరాళకరాళకీలానలంబవై విజృంభింతువు దేవాది

దేవుఁడవు గావున నిన్ను శరణంబు వేఁడెద నని మస్తకన్యస్తహస్తుండై సంస్తుతిం
చిన సాక్షాత్కరించి పాంచజన్యధరుండు సుప్రతీకవసుధాధ్యక్షుని నిరీక్షించి.

45


సీ.

వర మిత్తు వేఁడుము నరపాలశేఖర నావుడు నతఁడు నానందనులకు
నాకు నీదేహంబునన కూడ వలె నన్న నట్లగా కొసఁగె శ్రీహరి వసుంధ
రాంగనా స్వాయంభువాహ్వయమన్వంతరంబున మొదలియుగంబునఁదు
నేకదేశములోనివృత్తాంత మిది భూరజోంబుధిజలపరమాణుగణము
నైన గణియింపఁగా వచ్చుఁ గాని వినుము, తత్కృతయుగంబులోపలి దైత్యమధన
కృతచరిత్రంబు లన్నియు నెన్నరాదు, వనజభవునకు శతకోటిపత్సరముల.

46


గీ.

అనిన విని కపటకిటితో హరివిచిత్ర, కృత్యములు గౌరముఖుఁడు వీక్షించి పిదప
నేమి గావించె రత్నజు లేమి యైరి, యెవ్వ రమ్మౌని తన్మణి యేడ దనిన.

47


క.

విను విష్ణుమహిమఁ గని ముని, చనియెఁ దదారాధనంబు సలుపఁ బ్రభాసం
బనుసోమతీర్థరాజం, బునకుఁ దపఃఫలదకల్పభూజంబునకున్.

48


క.

చని దైత్యాంతకనామం, బున నచ్చట నున్నవిష్ణుఁ బూజించుచుఁ గ
న్గొనియె నొక నాఁడు ముందట, మనసిజదమనోపమేయు మార్కండేయున్.

49


సీ.

ఇట్లు దూరంబున నీక్షించి యెదురేగి సాష్టాంగ మెఱఁగి నిజాశ్రమంబు
నకుఁ దెచ్చి దర్భాసనంబున నునిచి నానావిధాతిథిపూజనములు నడపి
ముకుళితహస్తుఁడై ముందట నిలిచి మహావ్రత యేమికార్యంబు దలఁచి
యిటకు విచ్చేసితి రెఱింగింపుఁ డనిన నమ్మునివతంసుఁడు గౌరముఖునితోడ
ననియె మీవంటివారిదర్శనమె మాకుఁ, గార్య మింతియ సాందేహికప్రయోజ
నంబు గలిగిన నడుగుము సమ్మతంబు, గాఁగ వచియింతు ననవుడు గౌరముఖుఁడు.

50


క.

పితరులు గల రందురు వే, దతత్వవిదు లైనబుధులు తత్పితరులు వ
ర్ణతతికి సాధారణులో, గతకల్మష మఱియు వేఱె కలరో చెపుమా.

51


సీ.

అనుడు మార్కండేయుఁ డగ్గౌరముఖునితో వినుము విష్ణుఁడు తండ్రి విశ్వమునకు
నాతనివలన బ్రహ్మ జనించె నాబ్రహ్మ ఋషుల నేడ్వుర సృజియించి వారిఁ
గని నన్నుఁ బూజింపుఁ డనిన నాసంయము లాత్మలోపలఁ బరమాత్ముఁ గొలువఁ
గలుషించి వైకారికస్వరూపుఁడు పద్మజన్ముండు మద్వ్యభిచారకారు
లార కాన దురాచారులార కాన, కితవకృత్యంబు లిట్లు చేసితిరి మీరు
బ్రహ్మవిజ్ఞానగర్వంబు పదటిపాలు, గావలయు నంచు ఘోరంబుగా శపించె.

52


గీ.

వార లప్పుడు తనయుల వంశకరులఁ, గని విమానస్థులై నాకమునకుఁ బోయి
తత్సుతులు శ్రాద్ధములు సమంత్రకము గాఁగఁ, దమకుఁ జేయంగ నుండిరి తాపసేంద్ర.

53

వ.

ఇత్తెఱంగున నుత్తము లైనసూనులం బడసి వైమానికత్వంబున నాకంబునకుం జని
సుఖంబున నున్న మఱి మరీచ్యాదు లేడ్వురలో నమూర్తులు మువ్వురు సమూర్తులు
నల్వురు వీరు దేవతలకుం బితరులై తద్దేవతలుం బూజింప యుగశతపర్యన్తంబు
సనాతనలోకంబుల వసియించి వెనుక బ్రహ్మవాదులై జనించి తమపూర్వసాంఖ్య
మతంబునఁ గొంతకాలంబు వర్తించి పునరావృత్తిరహితయోగసిద్ధిం గాంచి యోగ
బలంబున సకలయోగులకు యోగాభివృద్ధి గావింపుదురు గావున వారికి శ్రాద్ధంబులు
చేయవలయు నిది పితృప్రథమసర్గంబు మఱియు ననేకప్రకారంబులఁ బితరులు సప్త
లోకంబుల నిలిచి భూలోకవాసులు భువర్లోకవాసుల భువర్లోకవాసులు మరీ
చ్యాదు లైనసువర్లోకవాసుల సువర్లోకవాసులు కల్పోపవాసిసంజ్ఞు లైనమహాలోక
వాసుల మహాలోకవాసులు సనకాదు లైనజనలోకవాసుల జనలోకవాసులు వై
రాజు లైనతపోలోకవాసుల దపోలోకవాసులు సత్యలోకవాసులఁ బూజింపు
దురు వసుసాధ్యరుద్రాదిత్యాశ్విమరుదృషులు నేతత్కన్యకాసముద్భవులును వశిష్ఠ
బ్రహ్మపితరు లైనయగ్నిష్వాత్తాదులు బ్రహ్మక్షత్రవైశ్యులకు సమత్వంబునం బూజింప
నర్హులు శూద్రజాతికిం బితరులు వేర లేనినిమిత్తంబున శూద్రులు బ్రహ్మక్షత్రియ
వైశ్యానుమతంబున సర్వపితరులం బూజింపుదురు భట్టారకా యెట్టిమహాత్ములకుం
బితృవర్గంబు సమస్తంబును సవిస్తరంబుగా వచియింప నశక్యంబగుటం జేసి సం
క్షేపరూపంబునం జెప్పితి వ్యతీపాతాయనవిషువచంద్రసూర్యగ్రహణసంక్రమణ
దర్శాదిపుణ్యకాలంబుల నక్షత్రగ్రహపీడాసమయంబుల దుస్స్వప్నావలోకనంబు
ల నూతనధాన్యాగమనంబుల విశిష్టద్రవ్యపాత్రలాభంబుల గంగాదిమహాతీర్థంబుల
శక్త్యనుసారంబున శ్రాద్ధకర్మంబు సలుపుట ధర్మంబు శ్రాద్ధకర్మంబు సలుప
విత్తంబు దొరక దేని తిలతర్పణంబు లిచ్చిన శ్రాద్ధఫలంబు సిద్ధించు నత్తిలతర్పణం
బులు దుర్గభంబు లైన ధేనువునకు నేకాహ్నికగ్రాసంబు గొని పెట్టినం జాలు నిఖిలా
భావఁబున వనంబునకుఁ బోయి సూర్యాదిలోకపాలసాక్షిగా నూర్ధ్వబాహుండై
తననిర్ధనత్వంబు పితరులకుం బెద్దయెలుంగున విన్నవించుట సముచితంబు నాకు
నీపైతృకరహస్యంబు చతురాస్యతనూజుం డైనససకానుజుండు తెలిపె నింక
శ్రాద్ధయోగ్యాయోగ్యుల వినుము.

54


సీ.

జ్యేష్ఠసాముఁడు యోగి శిష్యుండు సోదరిసూనుండు త్రిమధువు సోమయాజి
మాతామహుఁడు త్రిసామగుఁడు త్రిణాచికేతుఁడు త్రిసువర్ణుండు దుహితసుతుఁడు
జామాక యతి మేనమామ మాతాపితృభక్తుండు వియ్యంబుభార్యతండ్రి
ఋత్విజుం డతిథి పైతృకకర్మయోగ్యులు శ్యావదంతుఁడు నపుంసకుఁడు కునఖి

దేహరమువాఁడు దొంగ నిందితుఁడు రోగి, సోమవిక్రయి కొండీఁడు గ్రామయాచ
కుండు పరపూర్వపెనిమిటి కూలిచదువు, చెప్పువాఁడును శ్రాద్ధవర్జితులు సుమ్ము.

55


క.

మునివల్లభ యీచందం, బునఁ బైతృకవిధులు సలిపి పురుషోత్తమచిం
తన మది మఱవక మెలఁగెడు, ననవద్యుఁడు గాంచు నైహికాముష్మికముల్.

56


క.

అని మార్కండేయుఁడు చె, ప్పిన విని పండ్రెండుసమలు పితృపూజన చే
సినకతన గౌరవక్త్రుఁడు, తనగతజన్మములు నూఱు దలఁచె ధరిత్రిన్.

57


సీ.

తలఁచినజన్మశతంబున నొక్కజన్మము నీకు వినిపింతు నలువ తొల్లి
పరమతత్త్వజ్ఞానవిరహితులై పోయి సుతులు బోధింపంగ సుగతి పొందుఁ
డని శపించినమరీచ్యాదిమానసపుత్రు లేడ్వురలోపల భృగుఁడు గౌర
ముఖుఁడు తద్భృగువంశమున జనించినవాఁడు గాఁగ మార్కండేయమౌనిపుంగ
వుండు దెలిపినఁ దెలిసి పండ్రెండువత్స, రములు పితరులఁ గర్మకాండముఁఁ బూజ
చేసి గౌరముఖుండు ప్రభాసతీర్థ, వాసు దైత్యారి ని ట్లని ప్రస్తుతించె.

58


సీ.

జలజగర్భునిచదువులచెఱవీడ్కోలు మంథానకుధరధురంధరుఁడు
విషధిమునిఁగినవిశ్వంభరకుఁ దేప సుమనోవిపక్షవక్షోవిదారి
కుంభినీనభములు గొలిచినకొలగోల పార్థివరుధిరతర్పణపరుండు
లంకాధిపతితలలకు గండకత్తెర రేవతీహృదయరాజీవహేళి
త్రిపురవనితలయీలువుతెక్కలీఁడు, ఖురఘరట్టవిఘట్టితక్షోణితలుఁడు
చింతితఫలప్రదాత రక్షించుఁ గాత, న న్ననుచు భక్తి రెట్టింప సన్నుతింప.

59


క.

అత్యంతకరుణతో నా, దిత్యసహస్రోపమానదివ్యప్రభతోఁ
బ్రత్యక్షంబై నిలిచిన, దైత్యాంతకుమేన మునివతంసుఁడు గలసెన్.

60


మ.

అనినన్ భూచపలాక్షి యి ట్లనియె జన్యాగ్రంబునం దన్ను గె
ల్చినదుష్టాత్ముఁడు దుర్జయుండు చనఁ బ్రాచీదిఙ్మహీసీమ ని
ల్చినసుత్రాముఁడు నాక మేలుదనుజుల్ విద్యుత్సువిద్యుత్తులున్
సనకాధిస్తుత యేమి చేసిరి పరిస్పష్టంబుగాఁ జెప్పవే.

61


సీ.

అనిన మాయావరాహము చెప్పఁదొడఁగె సునాసీరుఁ డమరసైన్యములు గొలువ
వారణాశికిఁ దూర్పువంక భారతవర్షమున నుండె నవ్వార్త విని ముదంబు
తోడ విద్యుత్సువిద్యుత్తులు జలరాశిగర్భస్థు లైన రాక్షసులఁ గూడు
కొని హిమాద్రిసమీపమున విడిసిరి వారిపై దండు వెడలంగఁ బాకశాస
నుండు దలఁచిన నాంగీరసుండు వచ్చి, శక్ర విద్యుత్సువిద్యున్నిశాటవరుల
యోగవిద్యాసమర్థుల నోర్వలేవు, వేయిగోమేధమఖములు సేయవేని.

62

క.

అని వాచస్పతి బోధించిన ధేనుసహస్రముల శచీపతి రావిం
చి నియోగించె సరమా, శుని నాగోమేధమఖపశువులం గాయన్.

63


శా.

ఈరీతిన్ వెనువెంట దేవశుని రా నిచ్ఛాగతిం బోయి నీ
హారక్షోణిధరంబుచేరువల మేయన్ గోగణంబున్ సుప
ర్వారాతుల్ గని చెప్ప భార్గవుఁడు కార్యం బాత్మ నూహించి ని
ర్ధారించెన్ బలమర్దనాధ్వరపశుగ్రాహం బవశ్యంబుగాన్.

64


శా.

నిర్ధారించి పులోమజిత్పశువులన్ వేపట్టుఁ డన్నన్ సుర
స్పర్ధు ల్వార్ధులభంగి పొంగెడు మహాసైన్యంబుతో వచ్చి చం
ద్రార్ధోత్తంసునిమామగహ్వరములన్ హంభారవారంభముల్
వర్ధిల్లం బసిఁ బట్టిఁనన్ సమరదుర్వారార్భటుల్ చూపుచున్.

65


క.

వారించిన రాత్రించర, వీరులు మృదువచనరచన వేలుపుఁగుక్కన్
నోరార్చి పాలు వోసిన, వారికి నది పసుల నిచ్చి వచ్చెఁ గడంకన్.

66


సీ.

అరుదెంచి ప్రణమిల్లె నాకుక్క వెనువెంట గోరక్షణార్థము గూఢమార్గ
మునఁ బంపఁ జనిన వేల్పులు నేగుదెంచి మ్రొక్కిరి యింద్రుఁ డప్పుడు సరమఁ జూచి
కటకట పసుల నెక్కడఁ బాఱఁదోలి వచ్చితి చెప్పు మనవుడు శీతనగము
పొంత మేయుచుఁ దప్పిపోయిన ఘోరాటవీభూమి నిందాఁక వెదకి వెదకి
కాన లే నైతి నేనని కల్లలాడ, గూఢచారులు దేవ యీకుక్క వేపి
కడుపు శోధింపు సకలంబు గానవచ్చు, ననిన గోపతి మిగులంగ నాగ్రహించి.

67


క.

ఊళలు వెట్టంగా డా, కాల న్వడిఁ దన్నుటయు భుగాలున నోరం
బాలు వెడల నాసరమయు, జాలి గుడిచి మంచుకొండచక్కికిఁ బోవన్.

68


వ.

పురందరుండును బృందారకవాహినీపరివృతుండై సరమవెంటం జని తుషారగిరి
ప్రాంతకాంతారంబు సొచ్చి మఘవిఘాతహేతువు లైనయాతుధానులం దునిమి
ధేనువులం గొనివచ్చి గోమేధసవనసహస్రంబు సలిపి తత్ప్రభావంబున దుర్వార
బలగర్వంబు పూని మగుడ హిమవంతంబునకు దాడి పెట్టి దానవులం జుట్టుముట్టి
భీమసంగ్రామరంగంబునం గనుపుగొట్టి హతశేషదోషాచరులు విషధిమధ్యంబునం
బడిన విజయలక్ష్మీపరిరంభజృంభణంబున జంభారి నాకపురంబునకుం బోయి హవ్య
వాహనాదిదిక్పతుల వారివారిపురంబుల నిలిపి నిష్కంటకంబుగా రాజ్యంబు చేసె
నీసరమాఖ్యానంబు మానవులు విన్న గోమేధయజ్ఞఫలంబు ప్రాపింతురు వైరుల
చేత రాష్ట్రంబు గోలుపడినభూవల్లభుండు నిర్జననాయకుండుంబోలె వెండియు

నిజమండలంబున సుఖంబున నుండునని చెప్పిన విని రత్నగర్భసంభవు లైనపదేవురు
దొరలు రాజులై పుట్టి యేమి నామంబులు దాల్చిరి యెవ్విధంబున విహరించిరి
త్రేతాయుగంబున జనార్దనుచేత నేభంగి వరము వడసిరి తెలియ నానతి మ్మనిన
వరాహదేవుం డిట్లనియె.

69


మ.

నలినాక్షీ విను రత్నసంభవులలోనన్ సుప్రభుం డబ్ధికిన్
నెలవోలెన్ శ్రుతకీర్తిభూపతికి జన్మించెం బ్రజాపాలుపే
గ లలాటాక్షకిరీటనాకతటినీరంగత్తరంగాభతుం
దిలకీర్తిప్రభ తోడుగాఁ గృతయుగాది న్మోదసంసారియై.

70


శా.

నానాదేశనరేశ్వరుల్ విగతమానగ్రంథులై మ్రొక్కఁగా
దానక్షాత్రగుణంబుల న్వలని మాద్యత్కుంజరస్యందనా
జానేయాశ్వభటుల్ భజింప మృగయేచ్ఛం దత్ప్రజాపాలధా
త్రీనాథుం డొకనాడు కాననమునం గ్రీడించుచున్ ముందరన్.

71


క.

పావనము సుకృతలక్ష్మీ, జీవనము జనార్దనాభిషేకార్హసరో
జీవనము నొక్కరమ్యత, పోవనము న్వెఱఁగుపడుచుఁ బొడ గాంచి మదిన్.

72


ఉ.

ఇందు మహాతపుం డనుఋషీశ్వరుఁ డొక్కఁడు తత్త్వసచ్చిదా
నందముతోడ నుండుట వినంబడుఁ గావున నమ్మహాత్ముఁ జూ
డం దగునంచు డాసి ముకుటంబు పదాబ్జమునందు మోపఁగా
వందన మాచరించి నిలువ న్మునినాథుఁడు సంభ్రమంబునన్.

73


శా.

ఆశీర్వాదము చేసి యేమి కుశలంబా నీకు నిర్దోషముల్
గా శాసింపుదువా దిగంతములు సౌఖ్యంబుల్ భవత్పాలనా
వైశారద్యమునం గదా నడుచు నిర్వక్రంబులై మాకు ధా
త్రీశా నీసరి చెప్ప రాజనుతు లేరీ ధైర్యసంపన్నతన్.

74


చ.

అని కొనియాడుచున్ సముచితాతిథికృత్యము లాచరించి వ
చ్చినపని యేమి నా నృపతి చేతులు మోడ్చి భవార్ణవంబునన్
మునిఁగెడుమానవుల్ వెడలి ముక్తికిఁ బోయెడిత్రోవ యెద్ది చె
ప్ప నవధరింపు నావుడుఁ దపస్వి మహీశ్వరుతోడ నిట్లనున్.

75


సీ.

అర్చనదానహోమాదులు ఫలకంబు లింద్రియనిగ్రహం బినుపచీల
యఖిలభూతదయాపరాయణత్వము లిపికాఁడు వైరాగ్యంబు గాలిచీర
ధైర్యంబు శుద్ధసత్వగుణంబు మ్రోకులు మంచివారలతోడి మైత్రి సరకు
శీలంబు నడిపించుమాలిమి సంచలింపనిమానసం బడి బరువు గాఁగఁ

జేసిన మురారిచరణరాజీవభక్తి, గౌరవం బను పేరోడు గలిగెనేని
ఘోరభవసాగరము దాటి చేరవచ్చు, మోక్ష మనుదీవి మానవాధ్యక్షతిలక.

76


క.

కావున శ్రీహరిపదరా, జీవద్వంద్వంబు సేవ చేసిన జనులే
కైవల్యరాజ్యలక్ష్ముల, తో విహరింపుదురు తప్పదు సుమీ యనినన్.

77


గీ.

అనఘ యేరీతి నారాయణాంఘ్రిపంక, జములు గొలుతురు నావుడు సంయమీశ్వ
రుండు భూపాల విను పురంధ్రులు పురుషులు, శ్రీహరిపదాంబుజములు భజించువిధము.

78


సీ.

అబ్జభవాండమధ్యంబునఁ గలిగినబ్రహ్మాదిసురకదంబములు విష్ణు
వలనఁ బుట్టినవేదములు చాటి చెప్పు నన్నారాయణునిశాసనమునఁ గనక
గర్భుదేహమున నావిర్భవించినపావకాశ్విహైమవతీగజాననాహి
కార్తికేయాహిమకరమాతృదుర్గాదిశాధీశహరిదండహస్తరుద్ర
సోమపితరులు తమలోన మేమ మేమ, దొడ్డవార మటంచు వాదునకుఁ జొచ్చి
రొదలు చేయంగఁ దా నొక్కరుండు పాయ, గిలి విచారించి దహనుండు పలికె నగుచు.

79


వ.

మూఢులార వృథాకలహంబు మాని సకలాధికుండ నేన నన్ను సేవింపుఁడు మద్వి
రహితంబై బ్రహ్మదేహంబు నిలుచుట యెట్టు చూడుం డని వెడలిపోవ నప్పితామహు
దేహంబు కసుగందక పూర్వప్రకారంబున నుండె నప్పుడు ప్రాణాపానస్వరూపం
బు లైననాసత్యులు వాక్స్వరూపం బైనగౌరియు నభస్స్వరూపం బైనవినాయ
కుండును ధాతుస్వరూపంబు లైనభుజంగంబులు నహంకారస్వరూపం బైనకార్తికే
యుండును జక్షుస్వరూపం బైనసూర్యుండును గామక్రోధాదిస్వరూప లైనమాతృ
కలు నైశ్వర్యస్వరూపం బైనదుర్గయు శ్రవణేంద్రియస్వరూపంబు లైనదిక్కులు
వాయుస్వరూపుం డైనకుబేరుండును మనస్స్వరూపుం డైనవిష్ణుండును ధర్మస్వ
రూపుం డైనయముండునుఁ గోపస్వరూపుం డైనరుద్రుండును దన్మాత్రస్వరూపు లైన
పితరులు క్రమక్రమంబున వైశ్వానరునట్లు పలికి వెడలి పోవ నప్పితామహు
దేహంబు షోడశాత్మకుండు నానందమయుం డైనసోముచేత నాప్యాయితంబై కసు
గందక పూర్వప్రకారంబున నుండిన విలోకించి వీతిహోత్రముఖక్షేత్రాధిదేవతలు
నైక్యంబునం బొంది సోమాభిధానుం డైనపరమేశ్వరు నుద్దేశించి దేవా పావక
ప్రాణాపానవాగంబరధాత్వహంకారనయనకామక్రోధలోభమోహమదమాత్సర్య
భూమికైశ్వర్యశ్రవణపవనమనోధర్మరోషతన్మాత్రలు నీవ యట్లగుట యెఱుంగక
దురభిమానంబున మేము లేక నిర్వహింప దని భవదీయదివ్యశరీరంబు విడిచి వెడం
గుల మైతిమి మమ్ము నిర్మించిననీవ విగతస్థానులం జేయక మన్నింపు మని సన్ను

తించిన నమ్మహితుండు మిమ్ము వినోదార్థంబు కల్పించితి నింతియ కృతకృత్యుఁడ
నైననాకు మీవలన నయ్యెడుకార్యం బేమి మీరు విచారింపవలవదు మూర్తామూర్త
రూపంబులు మీకు రెండేసి యిచ్చితి మూర్తరూపంబుల నవతరించి హవ్యవాహ
నాశ్విగౌరిగణపతిప్రభృతినామంబులం దాల్చి వర్తించి కడపట నావిగ్రహంబు
ప్రవేశింపుం డని వరం బిచ్చిన సంతసిల్లిరి నారాయణుమహత్త్వం బిట్టిది వారల
జననంబును వారలభోజ్యంబులు వారలతిథులు వారల నర్చించువిధంబును రహ
స్యంబుగా వక్కాణింతు వినుము.

80


సీ.

పరమాత్ముఁ డణువు నభస్స్వరూపంబు సర్వజ్ఞుండు నైననారాయణుండు
మొదలఁ దా నేకత్వమున వినోదము సల్పుచో భోగకాంక్ష సంక్షోభితాత్ముఁ
డై నిల్వ భగవదాహ్వయమహాసలిలంబు వెడలె నానీరంబు వికృతిఁ బొంద
నాలోలకీలాక రాళానలము సంభవించే నాదహనంబు వికృతిఁ బొంద
వాయువు జనించె నాగంధవహము వికృతిఁ, బొంద గగనంబు పుట్టే నీచందమున జ
లాగ్నిపవనాంతరిక్షంబు లవతరించె, కలయఁబడ నంత ననలంబు గాలి గూడి.

81


గీ.

నీరు శోషింపఁజేయఁగా నింగి విఱిగె, నప్పు డప్పావకసమీరణాంబరములు
నాలుగును గూడి కఠినపిండత వహించె, నట్టిపిండంబు పృథ్వీసమాఖ్యఁ దాల్చె.

82


గీ.

వినుము నరపాల తత్పృథివికి జలాది, యోగకాఠిన్యమున గంధ మొకగుణంబు
కల్గి నాల్గింటిగుణములు కలయ గుణము, లైదు సమకూఱె నదియ బ్రహ్మాండమయ్యె.

83


సీ.

ఆకాండభాండమధ్యంబునఁ బరతత్వమూర్తి విష్ణుఁడు చతుర్ముఖచతుర్భు
జంబులతోడఁ బ్రాజాపత్యరూపంబు ధరియించి సృష్టివిధానమునకు
వగఁ గాన లేక తీవ్రంబుగా రోషింప నారోషమున సహస్రార్చి యైన
భయదానలము పుట్టి బ్రహ్మాండము దహింప నజుఁడు వీక్షించి బ్రహ్మాండ మెల్ల
గాల్ప హవ్యంబు కవ్యంబు దాల్పు మనుచు, నాన తిచ్చినకతమున హవ్యవాహుఁ
డై మహాత్మకనాబుభుక్షాతురత్వ ,మడఁగుచందంబు చెప్పంగ నవధరింపు.

84


వ.

అని విన్నవించినఁ బ్రసన్నుండై జగన్నాటకసూత్రధారుండు హవ్యవాహనా నీవు
యాజకదత్తదక్షిణల సంతృప్తుండవై దేవతలకుఁ దద్భాగంబు లిచ్చుచు దక్షిణాగ్ని
నామంబును సకలస్థలంబుల నాహవనీయంబులు వహించి తదంశంబులు సుపర్వు
లకు సమర్పించుచు నాహవనీయాభిధానంబును వివిధప్రాణిశరీరంబులు గృహంబు
లనం బరంగు నాగృహంబులకుం బతివై గార్హపత్యాహ్వయంబును నిన్ను నుపా
సించువిశ్వనరుల సద్గతిం బొందించుచు వైశ్వానరసంజ్ఞయు బలధనంబులకు ద్రవి
ణం బనుశబ్దంబు చెల్లుట నాద్రవిణం బొసంగుచు ద్రవిణదాఖ్యయుం గలిగి విహ

రించు మని నియోగించె నృపాలా యింక విష్ణునివిభూతికథనప్రసంగవశంబు నం
దెడిమాహాత్మ్యం బెఱింగించెద నాకర్ణింపుము.

85


క.

ఆవహ్ని సవినయంబున, దేవా యీ నాకు నొక్కతిథి తత్తిథిచేఁ
గావించెద సంతృప్తి స, దా విశ్వంబునకు ననిన ధాత సుముఖుఁ డై.

86


సీ.

నానాసుపర్వగంధర్వయక్షులకు వైశ్వానర ప్రతిపదావాప్తి నీవు
చేయుదు గాన నిచ్చితి ప్రతిపన్నామతిథి నీకు నాపుణ్యతిథిఁ బవిత్ర
హవ్యంబుచే నిన్ను యజియింప సంతృప్తిఁ బొందుఁ జరాచరభూతకోటి
యిట్టిపాడ్యమి నెవ్వఁడేని భవత్ప్రీతిగా నిరధ్యవహారుఁ డైన ధేను
దుగ్ధమాత్రాశనుం డైన దొరకు నాకృ, తార్థునకు ముప్పదాఱుమహాయుగములు
నాకసుఖమును వెనుక నర్ణవపరీత, సకలభూచక్రపాలనైహికసుఖంబు.

87


క.

అని పలుకు బ్రహ్మశాసన, మున మెలఁగె హుతాశనుఁడు పురుషులకు వధూ
జనులకుఁ బ్రాతఃకాలం, బున నీ కథ వినిన సుకృతములు సిద్ధించున్.

88


సీ.

భూప ప్రాణాపానములు దస్రులై జనించుట యింక విను ము న్నజుండు గనియె
సుతులఁ దొమ్మండ్రఁ దత్సుతులలోన మరీచి గనియెఁ గశ్యపుని నాకశ్యపప్ర
జాపతి గనియె భాస్క రులఁ బన్నిద్దఱ వారు మాసంబులు వత్సరంబు
దైత్యాంతకుఁడు తదాదిత్యులు పన్నిద్దఱకుఁ బెద్దవాఁడు మార్తాండుఁ డతఁడు
త్వష్టకన్యక సంజ్ఞ నుద్వాహ మయ్యె, నవ్విలాసిని యమయమునాహ్వయములు
గలుగు కొడుకును గూఁతును గనియెఁ గని ని, జేశ్వరునిమేనివెట్ట సహింప లేక.

89


శా.

స్వచ్ఛాయన్ సుముఖిన్ సహస్రకరుఁ గొల్వం బెట్టీ హేలావిహా
రేచ్ఛన్ గోడిగ యై దువాళిఁ జనియెన్ హేషల్ ఘనధ్వానముల్
దుచ్ఛం బాడ శరీరదీప్తివితతుల్ తొల్వానకాలంపుఁజం
చచ్ఛంపాలత నవ్వ నుత్తరకురుక్ష్మామండలీసీమకున్.

90


మ.

నలినాప్తుండును రూపరేఖల సవర్ణన్ సంజ్ఞఁగా నాత్మలో
పల భావించి సదానురక్తి విహరింపం గొన్నిసంవత్సరం
బులకున్ వారికి మందుఁడుం దపతియుం బుట్టంగ నాపిన్నపా
పలమీఁదం బలె సంజ్ఞబిడ్డలయెడం బక్షంబు గావింపమిన్.

91


క.

ఛాయం గనుఁగొని నాయం, బా యిటువలె నీకుఁ బక్షపాతపుఁజేతల్
చేయన్ శిశువులపై ననఁ, గా యముఁ జేడ్చుచు సహస్రకరుతోఁ బలికెన్.

92


శా.

తండ్రీ సారెకు రువ్వు నాగ్రహముమీఁదం గన్నదే గాతిగా
గుండ్రాలం కొని దాయ గాక యిది నాకుం దల్లియే యెన్నఁడున్

వీండ్రం జూచినజాడ నన్ను యమునన్ వీక్షింప దంతంతకుం
బిండ్రం బయ్యెఁ గపిండికోఁత వలదా మీకు న్విచారింపఁగన్.

93


సీ.

అని తనపైఁ గొండియము చెప్ప రోషసవర్ణవివర్ణవిఘూర్ణమాన
లోచనయై జముఁ జూచి పరేతభర్తవు గమ్మటంచు ఘోరంబుగా శ
పింప బిడ్డనిఁ జేరఁ బిలిచి పద్మాప్తుండు వత్స మీఁదట సమవర్తి వై ది
గీశ్వరత్వంబు వహించెద వంచు నాభ్యసించి తత్కాంత సంజ్ఞ గామి
మానసంబున భావించి మండిపడుచు, నోరిదుష్టాత్మ జననిమిహోగ్రకలుష
కృత్యమునిమిత్తమునఁ గ్రూరదృష్టితోడ, సంచరింపుము నీ వని శని శపించి.

94


క.

వంచించి ప్రాణవల్లభ, గొంచక తా నుత్తరకురుకుంభినిఁ బంచా
రించినగోడిగయై వ, ర్తించువిధము యోగదృష్టిఁ దెలిసి కడవఁడై.

95


క.

పుంఖానుపుంఖరింఖా, సంఖాతవసుంధరారజమ్ములు చదలం
బ్రేంఖోళిఁపఁగ సంజ్ఞా, కంఖాణిం జేర నరిగి కామాతురతన్.

96


వ.

పునఃపునఃప్రోథచలనంబునఁ దశనకిరణధాళధళ్యంబులు దశదిశావకాశంబులఁ బ్ర
కాశింప నిశ్వాసంబులు నిగుడ మెడసాచి కూణితదృక్కోణంబులతోడ వదనంబు
గదియించి నస చేసిన బిసరుహాప్తునింగా నెఱిఁగి నిజాంతరంగంబునఁ గౌతుకంబు
దళుకొత్త నత్తఱి నత్తళు వైనతత్తడిమత్తకాశినిం జిత్తజక్రీడావినోదంబునం గూడ
సూర్యవీర్యంబు రెండుప్రకారంబుల సంజ్ఞాగర్భంబునఁ బ్రవేశింప సద్యస్సమయం
బున నర్భకు లిద్ద తావిర్భవించి తండ్రికి సాష్టాంగంబు లెఱంగి తదీయనిర్దేశంబున
నొక్కపుణ్యప్రదేశంబునకుం జని నారాయణాత్మకుం డైనబ్రహ్మ నుద్దేశించి బ్రహ్మణే
బ్రాహ్మణప్రియాయ స్థాణవే మహాస్థాణవే స్థితిస్థాపకాయ పురుషాయ మహాపురుషా
య పురుషోత్తమాయ భూతాయ మహాభూతాయ భూతాధిపతయే సౌమ్యాయ మ
హాసౌమ్యాయ సౌమ్యాధిపతయే దైత్యాయ మహాదైత్యాయ దైత్యాధిపతయే రుద్రా
య మహారుద్రాయ రుద్రాధిపతయే విశ్వాయ మహావిశ్వాయ విశ్వాధిపతయే పక్షి
ణే మహాపక్షిణే పక్షిపతయే ప్రజాపతయే పరమేశ్వరాయ నారాయణాయ
నిష్క్రియాయ నిష్ప్రపంచాయ నిర్గుణాయ నిరపేక్షాయ నిరాశ్రయాయ నిరామ
యాయ నిరాలంబాయ నిరాచారాయ నిరాధారాయ నిరాలోకాయ విష్ణవే
నమో నమో యని బ్రహ్మపాఠస్తోత్రంబు ప్రాతఃకాలంబున జపింప దయాసంపన్నిధి
వెన్నుండు ప్రసన్నుఁడై వారికి యజ్ఞభాగయోగ్యత్వంబును దేవసమానత్వంబును
సమస్తవస్తువేద్యత్వంబును హృద్యరూపత్వంబును గలుగ విదియనాఁడు వరం

బిచ్చె నది మొదలుగా నాశ్వినేయులకు విదియ ప్రియదివసం బయ్యె నట్టివిదియఁ
బిష్టాహారులై సంవత్సరం బొకటి గడపినవారు సౌందర్యాదిగుణంబుల నాశ్వినేయ
సన్నిభులై జనింతురు నరు లీచరిత్రంబు విన్న దోషనిర్ముక్తులు సుపుత్రయుక్తులు నై
సుఖియింతురు ధరిత్రీకళత్ర యింక వాక్కు గౌరియై జన్మించినవిధంబు వినుము.

97


సీ.

మున్ను సృష్టివిధానమునకు నుపాయంబు గానక కోపించి కమలభవుఁడు
తనకోపమున జనించినరుద్రునకు గౌరి పేరికూర్మికుమారిఁ బెండ్లి సేసె
రుద్రుండు గౌరీసరోరుహపత్రాక్షిఁ గూడి వినోదింపఁ గొంతకాల
మునకు నాబ్రహ్మ రుద్రునిఁ జూచి ప్రజలఁ గల్పింపుము నీ వని పెక్కుమాఱు
లాన తిచ్చిన నాకు మహాతపంబు సలుపక ప్రజావినిర్మాణశక్తి చాల
దనుచుఁ గాండజలంబుల మునుఁగ గౌరితనువు నిజదేహమున దాఁచె ధాత మఱియు.

98


క.

మానసములోన నేడ్వురు, సూనుల నిర్మించె నాఋషులు వసుపశురు
ద్రానిమిషముఖ్యబహుసంతా, నంబులఁ గనిరి దక్షతనయలవలనన్.

99


ఉ.

ఆయెడ నొక్కనాఁడు చతురాస్యుఁడు రుద్రవధూటి గౌరి మ
త్కాయములోన దాఁచుకొనఁగాఁ బనిలేదని దక్షుఁ జూచి వ
త్సా యిది బిడ్డ నీ కని సమర్పణ చేసిన నాఁటనుండి దా
క్షాయణి యై వసించెఁ దదగారమునం గడుగారవంబునన్.

100


క.

భూనాథ యిట్లు గౌరి స, దా నయనోత్సవము సేయఁ దనకూఁతులసం
తానము తామరతంపర, యై నెమ్మది నుండ దక్షుఁ డాహ్లాదమునన్.

101


క.

పులకించి చూచి నాతన, యలయీబలఁగంబు చల్లనై వర్ధిలఁగా
వలె నధ్వరంబు చేసెద, నలినాసనునకు సమర్పణముగా ననుచున్.

102


వ.

కృతనిశ్చయుండై మరీచి బ్రహ్మగా నత్రి బ్రాహ్మణాచ్ఛంసిగా నంగిరసుం డాగ్నీ
ధ్రుండుగాఁ బులస్త్యుండు హోతగాఁ బులహుం డుద్గాతగాఁ గ్రతువు ప్రస్తోతగా
బ్రచేతుండు ప్రతిహర్తగా వసిష్ఠుడు బ్రహ్మణ్యుండుగా సనకాదులు సభాసదులు
గా హిరణ్యగర్భుం డధిదైవతంబుగా నిజదౌహితృ లైనరుద్రాదిత్యాంగిరసప్రము
ఖులు బితృవసుగంధర్వగీర్వాణాదులుం బూజ్యులుగా నాజ్యధారాపరంపరాభి
షేకజాజ్వల్యమానపవమానసఖశిఖాముఖచిటచిటధ్వానంబులు మహేంద్రప్రముఖ
బర్హిర్ముఖాహ్వానంబులు భుజగరాజనిభవచోవిలాసభాజనసజ్జనపరస్పరాలాపంబులు
యాజకస్వాహాస్వధాకారకలకలాటోపంబులు బధిరితదిక్కలాపంబులై కొనసాగ
యాగంబు సాగుచుండ హవిర్భాగంబులు యథాశ్రమంబున సమర్పించు

వేళ హేళిసహస్రదుస్సహమహస్సనాథుండును సర్వజగన్నాథుండును సర్వవేద
మయుండును సర్వజ్ఞానాశ్రయుండును సరోరుహభవాండమాలికాహారమనోహర
గౌరీకుచస్పర్శియు ప్రత్యక్షదర్శియు భక్తమరుద్ద్రుండును నైనరుద్రుండు పదివేల
వత్సరంబులు విశ్వనిర్మిమీషమహాతపంబు చేసి కాండసలిలంబు వెడలి.

103


క.

జనసస్యనివహమృగనగ, వనవనధిసమేత మైనవసుమతిఁ గనియున్
మునిపత్యమానదక్షస, వనదేవాహ్వానమంత్రవైఖరి వినియున్.

104


క.

నను మిగిలి జగతిఁ గల్పిం, చినవాఁ డెవ్వఁడు నితాంతచిత్తాహ మికన్
నను మిగిలి యజ్ఞ ఫలముం, గొనియెడువాఁ డెవ్వఁ డనుచుఁ గోపించుటయున్.

105


ఉ.

అశ్మాత్యంతకఠోరమూర్తులు మహాహాలాహలజ్వాలధూ
మ్రశ్మశ్రుల్ భుజదండహిండితకుఠారప్రాసఖడ్గార్గళా
రశ్మివ్రాతముతోడ వెల్వడిరి రుద్రక్ర్రూరగాత్రంబునన్
గూశ్మాండాగ్నివతఃపిశాచగణరక్షోభూతవేతాళముల్.

106


క.

ఈవిధమునఁ దనదేహములో వెలువడి వేలు లక్షలుం గోటులు భూ
తావళులు బహుముఖంబులు సేవింపఁగ దక్షమఖవిజిత్వరబుద్ధిన్.

107


సీ.

ధర్మ మక్షంబు నక్తందివములు చక్రములు సవనంబులు మూడు బరము
స్తృతులు పగ్గంబులు మీమాంస కేతువు పురుషార్థములు నాల్గు పూనుగాఁడి
పవమానములు నేమిరవము వేదములు తేజీలు త్రివృత్తులు చెర్లకోల
పరమవిజ్ఞానసంపద కూబరంబు హిరణ్యగరుండు సారథియు నైన
సకలవిద్యావినిర్మితస్యందనంబు, నందుఁ బ్రణవంబు గుణము గాయత్రి కార్ము
కంబు సప్తస్వరంబులు నంబకములు, గాఁగ రుద్రుండు రథికుఁడై కదలైనంత.

108


క.

నిశ్చేష్టితులై మునులు న, భశ్చరులు న్మొదలుగా సభాజనములు చే
తశ్చాంచల్యమునం గడు, నాశ్చర్యము వడఁగ దక్షయాగములోనన్.

109


గీ.

రథికవర్యునిమూర్హ్యంతరంబు గానఁ, దా నతనిఁ గూడె ననఁగఁ గృశానుఁ డాఱె
సారథిముఖంబు సంభవస్థలము గానఁ, దా మతనిఁ గూడె ననఁగ మంత్రము లడంగె.

110


చ.

అవి గని ఋత్విజుల్ విముఖులై సురలార బలోద్ధతుండు దా
నవుఁ డొకఁ డేగుదెంచె సవనంబున భాగము లాహరింప న
న్న విని చలాచలిన్ విబుధనాథులు దక్షునితోడఁ జెప్పినన్
బవరము చేసి తద్దనుజుఁ బట్టుఁడు నావుడు వారు నుగ్రతన్.

111


చ.

వెడవెడ నేర్చుచున్ దిశలు బీఁటలు వాఱ నదల్చి రుద్రుపై
నడచిన నమ్మహారథుఁడు నవ్వుచు భూతపిశాచకోటిఁ జూ
చుడుఁ జని వేయఁ జొచ్చెఁ దపసుల్ ధరణిం బడి బాతళింపఁగా
ముడుసులు గుండ్లు దుండ్లు శవముల్ పుఱియల్ పఱియల్ ముఖస్థలిన్.

112

క.

ఈచందంబున భూతపి, శాచంబులు వైవ దేవసైన్యంబులు నా
రాచములు ముంప భూతపి, శాచములుం దఱుమ దేవసైన్యము విఱిగెన్.

113


క.

విఱిగినఁ గని మఖశాలకు నుఱికి వసుంధర వడంక నొండొరుఁ గడవం
బఱచుచుఁ బండులు పటపటఁ, గొఱుకుచు నారుద్రసైనికులు ధౌర్త్యమునన్.

114


సీ.

స్ఫ్యంబులు నఱకి యూపంబులు గూల్చి సోమము గ్రోలి కృష్ణాజినములు చించి
మునులభార్యల దోఁచుకొని పురోడాశంబు మెక్కి వేదులు గొఱ చక్కులాడి
హెూమకుండములు నిర్ధూమధామంబులు గావించి పశువుల గావు పట్టి
స్రుక్కులు విఱిచి ఋత్విక్కుల బాధించి సదమదంబుగ సభాసదులఁ దోలి
సవనవాటంబు నుగ్గునూచంబు చేసి, యింద్రు లోపలఁ గాన మేసంది గొంది
నడఁగెనో చూడుఁ డాసోమయాజిగాని, ననుచుఁ బరువులు పెట్టుచో నమరవరులు.

115


క.

ఆహవసన్నాహప్రతి, ఘాహుంకారములు నిగుడఁ గౌక్షేయకరా
ళాహతుల భూతబలసందోహంబులమీఁదఁ గవిసి నొప్పించుటయున్.

116


వ.

రుద్రుండు రౌద్రసమున్నిద్రుండై మరుద్రాజి నాజిం బడలువఱచి మెఱుంగు మెఱ
చినచందంబున నిజస్యందనంబు మెఱయ నెఱయం బరాక్రమించి మించినం గని
భగుండు దిగిధంబులు వెగడుకుడువ నార్చి యెదిర్చి పేర్చిన వానికన్ను కార్చిచ్చు
వంటిశరంబునం బోకార్చి తత్సహోదరుండు భుజదండకుండలీకృతకోదండపరి
వేషుండు పూషుండు ధట్టించి కిట్టిన మిట్టకోలలఁ దొడిగి వానిపండ్లు డుల్ల నేసి బోసిం
జేసి హెచ్చుటయు నొచ్చి వియచ్చరులు విచ్చి భయపలాయమాను లైన మగుడ
వారి నాలంబునకు నూలుకొలిపి కట్టినపచ్చపట్టుదట్టిచెఱఁగులు రింగులువాఱ భుజా
ర్గళచతుష్టయంబున శంఖచక్రగదాశార్ఙ్గంబులు పట్టి వినతపట్టి నెక్కి మార్కొని
జనార్దనుఁడు నారాయణాస్త్రంబు ప్రయోగించినఁ గపర్ది పాశుపతాస్త్రంబు
వఱపె నిట్లు హరిహరముక్తంబు లైనదివ్యశరంబులు పరస్పరజిగీషామర్షంబున వర్ష
సహస్రంబులు సమరంబు సలుపుచు నప్రతిహతప్రభావంబున.

117


సీ.

ధరియించె నొకటి సుదర్శనచక్రంబు కొనియె ముమ్మోములకుంత మొకటి
కాంచనచేలంబు గట్టె నొక్కటి గప్పె నొకటి చాఱలవన్నెమెకముతోలు
కౌస్తుభరత్న మొక్కటి పూనె గాలిమేతలకడియంబును దాల్చె నొకటి
లేలిహానారి దువాళించె నొక్కటి తొడుకుబాబా నెక్కి తోలె నొకటి
మకుట మొక్కటి సవరించె నొకటిజడలు, ముడిచె నొకటి మెఱసె నంబురుహనేత్ర
ముల నొకటి బేసికన్నుల నిలిచె శంఖ, మొకటి పూరించె డమరుగం బొకటి ద్రిప్పె.

118


క.

అపుడు సమీపంబున ను, న్నపంకరుహసంభవుండు నారాయణపా
శుపతాస్త్రంబులు వీక్షించి పెద్దయెలుఁగునఁ బ్రశంస చేయుచుఁ బలికెన్.

119

శా.

ఓహో యీగతిఁ బోరఁగా సకలలోకోపద్రవం బయ్యెఁ జుం
డీ హంకారము మాని పూనుఁ డిఁక శాంతిన్ మీరు మీలోన నే
హింసాపరతంత్రబుద్ధి హరిరుద్రాస్త్రావతంసంబులా
రా హేరాళము వెళ్ళెఁ గాల మని చేర న్వచ్చి ప్రార్థించినన్.

120


సీ.

ఆరుద్రనారాయణాస్త్రద్వయంబు శాంతి వహించుటయు భారతీవరుండు
శంకరాంబురుహలోచనుల నిరీక్షించి హరిహరులార చరాచరప్ర
పంచరక్షణము గావించుఁడు మీ రంచు వచియించి సర్వగీర్వాణులార
క్రతువుల మొదలిభాగము రుద్రయోగ్యం బటంచు వేదములు ఘోషించుఁ గానఁ
దొలుత యజ్ఞాంశ మిచ్చి రుద్రునిపరాక్ర, మంబు కొనియాడి సత్కృపామహిమ గాంచి
బ్రతుకుఁ డనవుడు వారలు పరమభక్తి, యుక్తి దండప్రణామంబు లొసఁగి నిలిచి.

121


రగడ.

రుద్ర జగద్రక్షా దాక్షిణ్య కారుణ్యసుధారసపూర్ణదృగంచల
భద్రగుణైకాశ్రయ మధ్యందినభానుసహస్రసమానతనుప్రభ
ఖట్వాంగకురంగకపాలత్రిశిఖప్రముఖవిభాసిభుజామండల
పట్వాపకలాపగూఢపాత్పరివృఢహారధురంధరకంధర
కంఠేకాల మదావళదనుజాఖర్వగర్వరేఖానిర్వాపక
కుంఠీభూతత్రిపుర ధాతృవైకుంఠాదిసుపర్వస్తుతవిక్రమ
ఫాలాంబకపావకచుంబితరతిపతిభస్మస్థాపకవక్షస్స్థల
బాలసుధాకరకోరకితజటాపటల భగాక్షినిపాటనకరశర
పోషితభక్త చపేటనిపాతితపూషదంద దంతురితరణాంగణ
యోషాయితవామశరీర మహాయోగిహృదయపుష్కరపుష్పందయ
ప్రధ్వస్తాధ్వర బహువిద్యామయరథబద్ధచతుర్వేదతురంగమ
సాధ్వసదాయికఠోరదంష్ట్రికచకచకశోభామ్రేడితాట్టహాస
వెంగలిదక్షునిఁ గూడినకతమున విజ్ఞానము చెడి పశువుల మైతిమి.
గంగాధర వేయేటికి నీభారము మనుపంగా నొచ్చినవారము.
జగదుత్పత్తిస్థితిలయములు నీశాసనమున వర్తిలు సంతతమును
నిగమోక్తప్రథమాంశము గొని మన్నించి యజ్ఞ మీడేరఁగఁ జేయుము.

122


మానిని.

అంచు మహేంద్రముఖామరపుంగవు లంగములం బులకాంకురముల్
ముంచుకొనం గరముల్ నిటలంబుల మోపుచు భక్తిసమున్నతిఁ బ్రా
ర్థించిన వారలదీనత మాన్పఁగ దేవుఁడు చల్లనిచూపుల వీ
క్షించి సుధాపరిషిక్తమృదూక్తివిశేషము దోఁప వచించెఁ గృపన్.

123

సీ.

వాసవప్రముఖదేవతలార ప్రథమాంశమునఁ దృప్తి పొందె నామనము దక్ష
మఖము ధన్యత వహింప ననుగ్రహించితి భగులోచనముఁ బూషుపండ్లు మున్ను
వలె నుఁడఁ జేసితిఁ గలనిలో మత్ప్రతాపంబు గనుంగొని పశువులై చ
రించినమిమ్ముఁ బాలించి విజ్ఞాన మిచ్చితిఁ గాన నేఁ బశుపతి సమాహ్వ
యమున విహరింతు నీదినం బాది గాఁగ, శాంతులై భూతిరుద్రాక్షజటలతోడఁ
బాశుపతదీక్షు ననుఁ గొల్చుభక్తవరులు, మోక్షలక్ష్మీవధూరత్నమునకు వరులు.

124


క.

అని గీర్వాణులతో మ, న్నన నానతి యిచ్చురుద్రునకు వాక్పతి ద
క్షునిసుత గౌరి జగన్మో, హిని గుణవతిఁ బెండ్లి చేసి యి ట్లని పలికెన్.

125


వ.

దేవా యీవామనేత్ర జగజ్జనయిత్రి మత్తకీరవాణి రాణి గా నిజప్రభావసకల
గిరిపరిహాసం బైనకైలాసంబు నివాసంబుగా వాసవప్రభృత్యాదిత్యులు భృత్యు
లుగా నస్మదాదులకుఁ బూజ్యుఁడవై లోకైకసామ్రాజ్యవైభవంబు లనుభవింపు
మని తదనుమతంబున దక్షప్రముఖులు గొలువఁ బ్రాజాపత్యపురంబునకుం జనియె
నిట నిటలాక్షుండు దాక్షాయణిం దోడ్కొని మహాప్రమథగణంబు భజింప రజ
తాచలంబునకు విజయం చేసె నని వరాహదేవుండు చెప్పినఁ గుంభినీరంభోరువు
మీఁదటివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

126


శా.

ఏణీదృఙ్మకరాంక సాల్వనరసింగేంద్రానుకంపాసరి
ద్వేణీవర్ణితకీర్తికల్పక చతుర్వేలాసమావేల్లిత
క్షోణీభారభరాణదక్షిణభుజా కుంభీనసాధ్యక్షగీ
ర్వాణీసంతతగీయమానరణదుర్వారప్రతాపోదయా.

127


క.

నిర్ధ్వస్తసకలకలుష ము, హుర్ధ్వనితవరూధినీమహోగ్రపటహభి
న్నోర్థ్వాండ చక్రవాళబ, హిర్ధ్వాంతపరంపరాసుహృత్కీర్తివిభా.

128


పంచచామరము.

కుఠారశూరవారకంఠకుంఠనైకమర్మక
ర్మఠారిదారి శౌరిభక్తిరక్తియ క్తిఫల్గుణా
శఠారిభూవరాసువాతజాతవేదిగూఢపా
త్కఠారికా కఠోరదోరఖర్వగర్వదూర్వహా.

129

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ బంచమాశ్వాసము.